రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Monday, January 30, 2023

1297 : రివ్యూ!


 రచన -దర్శకత్వం : శరవణన్

తారాగణం : త్రిష, అనస్వర రాజన్, అబ్దుమాలికోవ్ తదితరులు
కథ :  ఏకే మురుగదాస్, సంగీతం : సి సత్య, ఛాయాగ్రహణం : కెఎ శక్తివేల్
బ్యానర్ : లైకా ప్రొడక్షన్స్
నిర్మాత : అల్లిరాజా సుభాస్కరన్
విడుదల : జనవరి 28, 2023 (నెట్ ఫ్లిక్స్)
        స్టార్ హీరోయిన్ త్రిష సినిమాల్లో 20 ఏళ్ళు పూర్తి చేసుకుంది. కొంత కాలంగా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తోంది. యాక్షన్, సస్పెన్స్ పాత్రలు పోషిస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తోంది. ఇటీవల పొన్నియిన్ సెల్వన్ లో కీలక పాత్ర కూడా పోషించింది. తాజాగా ఆమె నటించిన తమిళ యాక్షన్ థ్రిల్లర్ రాంగి ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది. తెలుగు ఆడియోతో కూడా వున్న రాంగి తెలుగులో 'రిపోర్టర్' పేరుతో స్ట్రీమింగ్ అవుతోంది. దీనికి ప్రముఖ దర్శకుడు మురుగదాస్ కథ అందించాడు. శరవణన్ దర్శకత్వం వహించాడు. ప్రముఖ లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. ఇది టెర్రరిజం అంశంతో ఒక సున్నిత ప్రేమ కథ. నాణ్యత కోరుకునే ప్రేక్షకుల కోసం ఈ సినిమా ఎలా వుంటుందో చూద్దాం...

కథ

రుద్ర శివంగి (త్రిష) వెబ్ పత్రికలో పని చేసే రిపోర్టర్. అన్నావదినెలకి ఆమె సింహస్వప్నం. బయట కూడా అలాగే వుంటుంది. అన్న కూడా జర్నలిస్టే. అయితే జర్నలిజం తన తండ్రితోబాటే చచ్చిపోయిందని నమ్ముతుంది. ఈ రోజుల్లో రాజకీయ నాయకుల మధ్య గొడవలే తప్ప ప్రజా సమస్యల్ని రిపోర్టు చేసే వాళ్ళు లేరని కోపంతో వుంటుంది. ఒక రోజు ఆమె 16 ఏళ్ళ మేనకోడలు సుస్మిత (అనస్వర రాజన్) పేరు మీద నకిలీ ఫేస్ బుక్ ఖాతా ట్యునీషియాలోని ఉగ్రవాద సంస్థలో పనిచేస్తున్న ఆలీమ్ (అబ్దుమాలికోవ్) అనే కుర్రవాడితో కొనసాగుతోందని తెలుసుకుంటుంది. తనతో చాటింగ్ చేస్తోంది సుస్మితే అని నమ్మిన 17 ఏళ్ళ ఆలీమ్ ఆమెతో ప్రేమలో పడ్డాడు కూడా.
        
ఈ ఖాతాతో శివంగి తను చాటింగ్ చేస్తూ లొకేషన్ అడిగితే, అవతల ట్యూనీషియాలో మారణాయుధంతో కాపేసి వున్న ఆలీమ్, తానున్న లొకేషన్ పిక్ తీసి పోస్ట్ చేస్తాడు. పది నిమిషాల తర్వాత అటుగా వస్తున్న రెండు కార్లని పేల్చేస్తాడు. ఆ కార్లలో వున్నది ఇద్దరు అమెరికన్ నిపుణులు. వాళ్ళు లిబియాలో చమురు బావుల త్రవ్వకాల కోసం వచ్చారు. ఈ దాడితో ఎఫ్బీఐ అధికారులు రంగంలోకి దిగి శివంగిని ట్రేస్ చేసి వచ్చేసి పట్టుకుంటారు.
        
ఇప్పుడు శివంగి, సుస్మితల ద్వారా ఆలీమ్ ని పట్టుకోవాలనుకుంటున్న ఎఫ్బీఐ పథకంతో శివంగి రిస్కు తీసుకుని, సుస్మితని కూడా ఇందులోకి లాగి సహకరించిందా లేదా, ఆలీమ్ కి వ్యతిరేకంగా తను ఇలా చేయడానికి మనస్కరించిందా, వాళ్ళ దేశంలో ఆలీమ్ చేస్తున్న అగ్రరాజ్య వ్యతిరేక పోరాటానికి తను ఎమోషనల్ గా ఎలా కనెక్ట్ అయిందీ- చివరికేం చేసిందీ అన్నది మిగతా కథ.

ఎలావుంది కథ

మురుగ దాస్ ఒక అద్భుతమైన కథ ఇచ్చాడని చెప్పొచ్చు. లిబియా రాజకీయ పరిస్థితిని, అగ్రరాజ్యం చేతిలో ప్రజా సమస్యల్నీ నేపథ్యంగా చేసుకుని ఉత్తమ కథ అందించాడు. లిబియాలో కొత్త సోషలిస్టు రాజ్యాన్ని స్థాపించిన కల్నల్ గడాఫీ తమ దేశంలో చమురు అగ్రరాజ్యానికి అమ్మేది లేదన్నాడు. దీంతో కాలక్రమంలో అగ్రరాజ్యం ప్రజలతో తిరుగుబాటు జరిపించి, ప్రజల చేతే గడాఫీని చంపించింది. సాయుధ దళాలు ఎందరో ప్రజల్ని చంపి వాళ్ళ పిల్లల్ని ఎత్తుకుపోయారు. ఆ పిల్లలు టెర్రరిస్టులయ్యారు. ఆ టెర్రరిస్టుల్లో ఒకడు ఆలీమ్. అతను అగ్రరాజ్యం మీద కత్తి గట్టాడు. మా దేశంలో చమురు లేకపోతే మా నాయకుడికి, మాకూ మరణం వుండేది కాదు కదా- అన్న ఆక్రోశంతో పని చేస్తూంటాడు. ఫేస్ బుక్ తో సుస్మితతో  ప్రేమలో పడడంతో అతను అమెరికా ఉచ్చులో పడ్డం ఈ కథ.
        
ఈ కథలో రిపోర్టర్ శివంగి మోరల్ డైలమా తీవ్ర అపరాధ భావానికి లోనుజేస్తుంది. ఆలీమ్ తో తను చాటింగ్ చేసి వుండకపోతే అతను బతికి వుండేవాడు కదా అన్న ఆవేదనతో ఆమె చివరి ఏడ్పు వెండి తెరని పట్టి వూపేస్తుంది. కథ చాలా సింపుల్ గా వుంటూనే చాలా బలంగా వుంటుంది. చాటింగ్ తో సాగే ప్రేమ కథ కూడా క్లాస్ గా వుంటుంది. ఒక టెర్రరిజపు ప్రేమకథని సున్నితంగా చెప్పిన విధానమే ఈ సినిమా యూఎస్పీ.

నటనలు- సాంకేతికాలు

త్రిష టాప్ యాక్షన్. సమయస్ఫూర్తి గల రిపోర్టర్ పాత్రని సింపుల్ గా పోషించింది. ఆమె లేని సీను దాదాపు వుండదు. చివరి సీను మాత్రం ఆమెకి సిగ్నేచర్ సీను. పైకి ఎంత ఆవేశముంటుందో అంత నింపాదిగా, నిదానంగా కరెక్టు పని చేస్తుంది. టెర్రరిస్టుని పట్టివ్వాల్సిన విషమ పరిస్థితి నెదుర్కోవడం ఆమె పాత్రకి రియల్ సంఘర్షణ. మేనకోడల్ని తీసుకుని అమెరికా అధికారుల వెంట లిబియా వెళ్ళాల్సి రావడం ఆమె సంఘర్షణకి పరాకాష్ట. అన్నిటా ప్రభావశీలంగా నటించింది.
        
మేనకోడలి పాత్రలో అనస్వర రాజన్ ది విచిత్ర పరిస్థితి. తన పేర ఫేక్ ఎఫ్బీ ఖాతా వున్నట్టూ, దాంతో కనెక్టయి టెర్రరిస్టు తనతో ప్రేమలో పడ్డట్టూ ఆమెకి తెలియదు. జరుగుతున్నదంతా ఏంటో, ఎందుకు తను లిబియా పోతోందో అస్సలు తెలియదు. ఈ అయోమయ అమాయకత్వాన్ని బాగా అర్ధం జేసుకుని పోషించింది.
        
ఇక ఆలీమ్ గా రష్యన్ నటుడు అబ్దుమాలికోవ్ టెర్రరిస్టు-కమ్- టీనేజి లవర్ పాత్రని, తన విషాదకర గతాన్నీ, ఆల్రెడీ ప్రతిభగల నటుడు కాబట్టి వాటితో కథని నిలబెట్టాడు. తన సీమాంతర ప్రేమ కోసం తల్లడిల్లడం, ప్రేమిస్తున్న అమ్మాయిని చివరి క్షణాల్లో చూడడం వంటి ఉద్విగ్నభరిత సన్నివేశాలు అతడ్ని గుర్తుంచుకునేలా చేస్తాయి.
        
లైకా ప్రొడక్షన్స్ మేకింగ్ ఉన్నత స్థాయిలో వుంది. అయితే సినిమా సైలెంట్ గా సాగుతూంటుంది. ఎక్కడోగానీ నేపథ్య సంగీతం రాదు. ఇది చాలా హాయిగొల్పే క్రియేటివిటీ. పొదుపైన సంగీతంతో సత్య సినిమాకి జీవం పోశాడనే అనాలి. అలాగే శక్తివేల్ కెమెరా విజువల్స్ ఉన్నతంగా వున్నాయి. యాక్షన్ సీన్స్, టెర్రరిస్టు కార్యకలాపాలు ఉన్నత ప్రమాణాలతో వున్నాయి. ఒక్క మాటలో ఇది శరవణన్ దర్శకత్వంలో ఇంటర్నేషనల్  బ్రాండ్ మూవీ అనాలి.
—సికిందర్

 

Sunday, January 29, 2023

1296 : సండే స్పెషల్ రివ్యూ!


        
నవరి 26 గణతంత్ర దినోత్సవ ఆనందోత్సాహాల మధ్య గాంధీ విషాదాన్ని వైరల్ చేస్తూ, దర్శకుడు రాజ్ కుమార్ సంతోషీ 'గాంధీ గాడ్సే - ఏక్ యుద్ధ్' విడుదల చేశాడు. పని గట్టుకుని ఇదే రోజు విడుదల చేయడంలో తనకున్న ఏదో కమిట్ మెంట్ ని సినిమాతో కూడా చూపలేకపోయాడు. ఆయన చూపిందేమిటో, మనం చూసిందేమిటో మహాత్ముడికే తెలియాలి. ఇందులో గాంధీగా దీపక్ అంతానీ, గాడ్సేగా చిన్మయ్ మాండ్లేకర్ నటించారు. ఛాయాగ్రహణం రిషీ పంజాబీ, సంగీతం ఏఆర్ రెహ్మాన్ సమకూర్చారు. నిర్మాత మనీలా సంతోషీ. నిడివి 110 నిమిషాలు. ఈ సినిమాతో సంతోషీ భావజాల మేంటో తెలుసుకుందాం...

కథ
        దేశ విభజన, దాంతో మతకల్లోలాలు, హిందువుల హత్యలూ ఇవన్నీ చూసిన నాథూరాం గాడ్సే దీనికి కారణం గాంధీయేనని నిర్ణయించుకుంటాడు. 1948 జనవరి 30 న  గాంధీ మీద కాల్పులు జరుపుతాడు. గాంధీ బ్రతుకుతాడు. ఇక కాంగ్రెస్‌తో తన సంబంధాలని తెంచుకుని, గ్రామాల్ని స్వావలంబన దిశగా ప్రేరేపించడానికి గ్రామ స్వరాజ్ ఉద్యమాన్ని ప్రారంభిస్తాడు. ఇంతలో సమాజం గాడ్సే పాల్పడ్డ చర్యని సమర్ధిస్తూ, గాంధీకి వ్యతిరేకంగా ప్రజల మనోభావాల్ని మల్చేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తుంది. గాంధీ జోక్యం చేసుకుని అరెస్టయి పోతాడు. గాడ్సే వున్న జైల్లోనే గాంధీ బందీ అవుతాడు. దీంతో ముఖాముఖీ అయిన ఇద్దరి మధ్యా భావజాలాల సంఘర్షణ ప్రారంభమవుతుంది. ఈ సంఘర్షణ ఏ ముగింపుకి చేరిందన్నది కథ.  

ఎలావుంది కథ

ఇది అస్ఘర్ వజహత్ రాసిన Godse@Gandhi.com అనే హిందీ నాటకానికి దర్శకుడు రాజ్ కుమార్ సంతోషీ చిత్రానువాదం. నాటకం పీడీఎఫ్ నెట్ లో వుంది. పుస్తకం అమెజాన్ లో వుంది. నాటకం మొదటి సీనులో ఆసుపత్రిలో కోలుకుంటున్న గాంధీ దగ్గరికి నెహ్రూ వచ్చినప్పుడు, గాడ్సే వివరాలు తెలుసుకుని, గాడ్సేని కలవాలనుకుంటున్నట్టు చెప్తాడు గాంధీ. నెహ్రూ కంగారుపడి, అతను మిమ్మల్ని చంపాలనుకున్నాడు అంటాడు. అందుకే కలవాలనుకుంటున్నాను అంటాడు గాంధీ. ఇది వింటే దేశం మొత్తం ఆందోళన చెందుతుంది అంటాడు నెహ్రూ. మనిషి దేవుడి ఉత్కృష్ట సృష్టి. వాళ్ళు అర్ధం జేసుకోవడానికి సమయం పడుతుంది, నేను వెళ్తాను  అని కచ్చితంగా చెప్పేస్తాడు గాంధీ.
        
కానీ దర్శకుడు రాజ్ కుమార్ సంతోషీ నాటకంలో పై సీనులోని చివరి మాటల ప్రాధాన్యాన్ని గుర్తించి, దీనితో సినిమా కథ నడిపించకుండా నాటకాన్నే అనుసరించడంతో, అసలేం చెప్పాలనుకుంటున్నాడో అర్ధంగాని పదార్ధంగా తయారైంది సినిమా. గాంధీ -గాడ్సే భావజాలాల యుద్ధంగా సినిమా తీశాడు. ఈ యుద్ధం ఎలా ముగిసిందనేది మాత్రం చెప్పడంలో విఫలమయ్యాడు.

దృక్కోణాల దిశ

రెండు భిన్న దృక్కోణాలని చిత్రిస్తున్నప్పుడు తన దృక్కోణం కూడా స్పష్టం చేసే దిశగా దృక్కోణాలు సాగాలి. కథంటే తప్పొప్పుల జడ్జి మెంట్ అయినప్పుడు సారాన్ని జడ్జిమెంట్లోకి మళ్ళించి ముగించాలి. గాంధీ ఒప్పా, గాడ్సే ఒప్పా అనేది అతివాదులతో ఎన్నటికీ తెగని చర్చ. అసలు గాడ్సేకి భావజాలమేంటి? అతను టెన్త్ ఫెయిలై చదువు మానేశాడు. మహాత్మా గాంధీ మునిమనవడు, ప్రముఖ రచయిత తుషార్ గాంధీ రాసినట్టుగా, గాడ్సే చదువు సంధ్యల్లేని వాడు. ఆవేశపరుడు. పరుషంగా మాట్లాడతాడు. గాడ్సే కోర్టులో ఇచ్చిన వ్రాతపూర్వక వాంగ్మూలాన్ని మాయం చేశారని, దాంతో గాడ్సే వాదం ప్రపంచానికి తెలియకుండా పోయిందనీ. ఉరి తీసే ముందు నేరస్థుడికి కూడా చివరి కోరిక తీరుస్తారని, ఆ చివరి కోరిక తీర్చడానికే గాడ్సే వాంగ్మూలాన్ని బయట పెడుతున్నాననీ సంతోషీ చెప్పుకున్నాడు.
        
కానీ తుషార్ గాంధీ అది కచ్చితంగా గాడ్సే రాసిన వాంగ్మూలం కాదని రాశాడు. అతడికో భాషగానీ, శైలిగానీ లేవనీ; చెత్తగా, దుర్భాషలాడుతూ, బెదిరింపుగా రాస్తాడనీ,పత్రం చాలా తెలివిగా ఉదారవాద మనస్సుల్ని కూడా ప్రభావితం చేయడానికి గాడ్సే గురువు వినాయక్ దామోదర్ సావర్కర్ రూపొందించాడనీ, హిప్నటైజ్ చేసేలా రాసే సంపూర్ణ పాండిత్యం అతడికుందనీ తుషార్ రాశాడు.
        
ఇక గాడ్సే ధైర్యం కూడా ఎలా వుందో చూస్తే, గాంధీని చంపడానికి ముందు చేసిన హత్యాప్రయత్నంలో అతను స్వయంగా చంపడానికి వెళ్ళ లేదు. అయిదుగురు సభ్యులతో పథకం వేసి, తను దూరంగా వుండి చూస్తూ, గాడ్గే అనే సభ్యుడ్ని చంపడానికి పంపాడు. గాడ్గే విఫలమై పోలీసులకి దొరికిపోయాడు. గాడ్సే పారిపోయాడు. ఫైనల్ గా గాడ్సే గాంధీని చంపినప్పుడు లొంగిపోలేదు. పారిపోతూంటే పోలీసులు పట్టుకున్నారు. భావజాలానికి నిలబడ్డ వాడైతే పారిపోడు, లొంగిపోయి సమర్ధించుకుంటాడు. కాబట్టి అతడి భావజాలమంటూ సినిమా తీయడంలో అర్ధమేముంది. అసలతడి భావజాలమేమిటి? ఈ సినిమాలో నెహ్రూ పాత్ర అంటాడు, నాధూరామ్ గాడ్సేగా మారడానికి ఎవరికైనా కేవలం ఒక రోజు మాత్రమే పడుతుంది, కానీ గాంధీగా మారడానికి మొత్తం జీవిత కాలం పడుతుంది అని. ఏమిటి గాడ్సే జీవితం? ఏమిటి అతడి భావజాలం?
        
గాడ్సే భావజాలమంటూ ప్రచారం చేస్తూ గాంధీని ఎండగడుతున్న నడుస్తున్న చరిత్రకి ప్రభావితమవుతున్న ప్రజలకి ఇప్పటికైనా గాంధీ అర్ధమయ్యేలా సినిమా తీయాల్సింది. నాటకం పై సీనులో- మనిషి దేవుడి ఉత్కృష్ట సృష్టి. వాళ్ళు అర్ధం జేసుకోవడానికి సమయం పడుతుంది, నేను వెళ్తాను అని గాంధీ అన్నట్టు-  ప్రజలు అర్ధం జేసుకోవడానికి ఇంకెంత సమయం పట్టాలి? ఈ పాయింటుని కాన్సెప్టుగా చేసుకుని కథ నడిపిడి వుంటే ప్రజలకి గాంధీ అర్ధమయ్యే అవకాశం ఇప్పటికైనా లభించేది. ఒక హంతకుడు కరెక్ట్ కాదని హతుడి పక్షాన మాట్లాడాల్సి రావడం ప్రపంచంలో ఎక్కడా జరగదు.

పసలేని వాదం

గాంధీ గాడ్సే ని జైల్లో కలుసుకున్నాక వాదోపవాదాలు చూస్తే- సినిమా అంతటా గాడ్సే అవే నాలుగు  విషయాలు రిపీట్ చేస్తూంటాడు -హిందూ, హిందుత్వ, అఖండ భారత్, పాకిస్తాన్‌ కి 55 కోట్లు ఇవ్వడం అంటూ. గాంధీ గాడ్సేని దేశం గురించి తన అభిప్రాయం చెప్పమంటాడు. జైలు గోడకున్న 'అఖండ భారత్' మ్యాప్‌ ని గాడ్సే చూపిస్తాడు. ప్రజల విశ్వాసాన్ని పొందకుండా దేశాన్ని ఏర్పాటు చేయలేమని గాంధీ అంటాడు. నువ్వింకా ఈ దేశంలోని చాలా ప్రాంతాల్ని చూడను కూడా చూడలేదని అంటాడు. తుమ్ బినా దేఖే, బినా జానే ప్యార్ కర్తే హో?’ (నువ్వు దేన్నయినా చూడకుండానే, తెలుసుకోకుండానే ప్రేమిస్తావా?) అని ప్రశ్నిస్తాడు.
        
నువ్వు  హిందుస్థాన్‌ ని అల్పంగా చూపిస్తున్నావ్. హిందూ మతాన్ని అల్పమైనదిగా చేస్తున్నావ్. నువ్వు బ్రిటిష్ వారిపై రాయి కూడా వేయకుండా నన్ను చంపడానికొచ్చావ్ అని గుర్తు చేస్తాడు గాంధీ. దీనికి గాడ్సే దగ్గర సమాధానముండదు.
        
గాడ్సే భావజాలం హిందుస్థాన్నీ, హిందూ మతాన్నీ బలహీనపరిచిందనీ, దేశాన్ని శతాబ్దాలుగా నిర్వచించిన సమ్మిళిత సంస్కృతీ భావనకి హాని చేసిందనీ గాంధీ అన్నప్పుడు- నడుస్తున్న చరిత్రని గుర్తు చేస్తుంది.
        
తను ముస్లింల సంతుష్టీకరణకి పాల్పడినట్టు అభియోగాలు మోపినప్పుడు, తను పరిరక్షించడానికి పాటుబడ్డ విభిన్న సంస్కృతుల భారతాన్ని కూడా అర్థం చేసుకోవడానికి దేశవ్యాప్తంగా పర్యటించమని గాడ్సే ని కోరతాడు గాంధీ.
         
ధైర్యం లేకపోవడాన్ని కప్పిపుచ్చడానికి అహింసా వాదాన్ని రుద్దవద్దని గాడ్సే అంటాడు. మీ సత్యాగ్రహ నిరసనలు ఎమోషనల్ బ్లాక్ మెయిల్ తో కూడిన మానసిక హింసేనని తిప్పికొడతాడు.
        
హిందువుల్ని ద్వేషించి, ముస్లిములని ప్రేమిస్తున్నందుకు అఖండ భారత్ విభజనకి గాంధీయే కారణమని - పసలేని అరిగిపోయిన వాదన తప్ప గాంధీకి వ్యతిరేకంగా మరే వాదననీ సంతోషీ నిలబెట్టలేకపోయాడు.      
        
వాస్తవానికి గాడ్సే దృక్కోణంలో ఈ కథ చెప్పాడు. గాడ్సే తనని తాను వివరించుకోవడానికి, తన సిద్ధాంతాల్ని ప్రదర్శించుకోవడానికి -హిందుత్వాన్ని రక్షించడమనే వంకతో హత్యని సమర్థించుకునే ప్రయత్నం చేసే చిత్రణ ఇది.      
        
ప్రారంభంలో గాడ్సే ఇమేజీని జాతీయవాద దేశభక్తుడి స్థాయిలో చూపించడానికి, గాంధీని హిందూ వ్యతిరేక వ్యక్తిగా పెంచి చూపడం చేస్తాడు. నేను గర్వించే జాతీయవాది చేసే పని మాత్రమే చేస్తున్నాను. మీరు హిందువులకి, హిందూ మతానికీ వ్యతిరేకం. దేశానికి స్వాతంత్ర్యం వైపు దిశానిర్దేశం చేసినందుకు నేను మీకు ఎల్లప్పుడూ కృతజ్ఞుడిని. కానీ మీరు ముస్లింల పక్షం వహించడం క్షమించరానిది. అందుకే  మీరు చనిపోవాలి అని వాదిస్తాడు గాడ్సే. ఇంతకంటే కాన్వాస్ లేదు గాడ్సే వాదానికి.
        
నాటకంలో చూస్తే ని గాడ్సేని నిర్లక్ష్యంగా, బాధ్యతారహితంగా వుండే వ్యక్తిగా చూపించారు. ఇది సినిమాలో చేర్చకపోవడం వల్ల గాడ్సే పాత్రకి మరింత వెయిట్ వచ్చినట్టయింది.
        
చివరికేమిటంటే, ఏమీ తేల్చకుండా ముగుస్తుంది. జైల్లో గాంధీ మీద ఇంకో హత్యా ప్రయత్నం జరగడం, దాన్నుంచి గాడ్సే గాంధీని కాపాడ్డం జరిగి, ఇక మీరే అర్ధం జేసుకోండనీ చేతులెత్తేస్తాడు సంతోషీ!
        
గాంధీని చదివితే, గాంధీ గాడ్సేని కలవడానికి జైలు కెళ్తాడా అనిపిస్తుంది. తన మీద హత్యా ప్రయత్నం జరిగినప్పుడల్లా (5 సార్లు) వాళ్ళు పిల్లలు, ఈ ముసలాడిని ఎప్పటికైనా అర్ధం జేసుకుంటారు అనేవాడు క్షమా గుణంతో గాంధీ. ఇప్పుడు దర్శకుడు రాజ్ కుమార్ సంతోషీ, రచయిత అస్ఘర్ వజహత్ ప్రభృతులు గాంధీ దగ్గరికి వెళ్ళి అడిగితే, గాడ్సే దగ్గరికి నేనెందుకు వస్తాను, వాణ్ని క్షమించాను ఫో! అనే అంటాడు. గాంధీని వీళ్ళు కూడా అర్ధం జేసుకోలేదు.

సికిందర్

Friday, January 27, 2023

1295 : స్పెషల్ న్యూస్!


 

సంక్రాంతికి వాల్తేరు వీరయ్య’, వీరసింహా రెడ్డి వసూళ్ళ తుఫాను బాలీవుడ్ వర్గాల్ని విస్మయపర్చి- ఇలాటి వరద తామెప్పుడు చూస్తామాని అసూయ చెందిన వెంటనే పఠాన్ ఆ కరువు తీర్చేసింది. థియేటర్లు క్రిక్కిరిసిపోయాయి. మూతబడ్డ థియేటర్లు తెర్చుకుని కళకళలాడాయి. రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 215 కోట్లు కలెక్షన్లు వచ్చిపడ్డాయి. దేశవ్యాప్తంగా మొదటి రోజు 55 కోట్లు, రెండో రోజు 69 కోట్లు (గోదీ మీడియా టైమ్స్ నౌ ప్రకారం) కలిపి 124 కోట్లతో అన్ని రికార్డుల్ని చెరిపేసి మెగా బ్లాక్‌బస్టర్ గా ఘన విజయాన్ని చాటింది.

వాల్తేరు వీరయ్య అయినా, వీరసింహా రెడ్డి అయినా, పఠాన్ అయినా ఒకటే గుర్తు చేస్తున్నాయి - సినిమా ఆత్మ మల్టీప్లెక్సులతోనే లేదనీ , అల్పాదాయ వర్గాల సింగిల్ స్క్రీన్ థియేటర్లతోనూ వుందనీ. రెండూ కలిస్తేనే సినిమాలకి మనుగడనీ. రెండూ కలిసేలా  సినిమాలు తీస్తేనే భవిష్యత్తు. గత రెండేళ్ళుగా బాలీవుడ్ చాలా కష్టాల్లో కూరుకుపోయిందనేది తెలిసిందే. చాలా పెద్ద బ్యానర్ సినిమాలకి  ప్రేక్షకులు లేకపోవడంతో షోలు కూడా క్యాన్సిల్ అయ్యాయి. అదే సమయంలో అనేక థియేటర్లకి తాళాలు కూడా పడ్డాయి. కానీ షారుఖ్ ఖాన్ పఠాన్ ఈ మూతపడిన థియేటర్లకి అనూహ్యంగా వ్యాపారం తెచ్చిపెట్టింది. 
     
పఠాన్ విడుదలతో ఉత్తరాదిలోని 25 సింగిల్ స్క్రీన్ థియేటర్లు తిరిగి తెర్చుకున్నాయి. రాజస్థాన్ లో 7, మధ్యప్రదేశ్ లో 3, గోవాలో 1, ముంబయిలో 1, ఛత్తీస్ ఘర్ లో 1, ఉత్తరాఖండ్ లో 1... వీటన్నిటినీ తలదన్నేలా కరుడుగట్టిన మత రాష్ట్రం ఉత్తరప్రదేశ్ లో ఏకంగా 11 సింగిల్ స్క్రీన్ థియేటర్ల తలుపులు బార్లా తెర్చుకున్నాయి. మాకు అచ్చే దిన్ (మంచి రోజులు) వచ్చాయని  సింగిల్ స్క్రీన్ ఎగ్జిబిటర్లు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ఈ సంబరాలు ఎన్నాళ్ళు? ఇలాటి సినిమాలు రెగ్యులర్ గా వస్తూండాలిగా. అమీర్ ఖాన్ చూస్తే ఎవరికీ పట్టని లాల్ సింగ్ చద్దా అని గడ్డం సవరించుకుంటూ క్లాస్ సినిమా తీస్తాడు. అక్షయ్ కుమార్ చూస్తే కాషాయ జెండా ఎగరేస్తూ ఎజెండా సినిమాలు తీస్తాడు.
    
మంచి కంటెంట్ లేకపోవడంతో చాలా థియేటర్లు చాలా కాలం క్రితం మూబడ్డాయనీ, పఠాన్ సింగిల్ స్క్రీన్ సినిమాల ప్రేక్షకుల్ని తిరిగి థియేటర్లకి రప్పించే పెద్ద ఎంటర్‌టైనర్ కావడంతో థియేటర్లు తిరిగి తెరచుకున్నాయనీ ఉత్తరప్రదేశ్ కి చెందిన  ఒక ఎగ్జిబిటర్ అభిప్రాయపడ్డాడు. ఇదే కోవలో మాస్ ఎంటర్ టైనర్లు మార్చిలో అజయ్ దేవగణ్ భోలా’, ఏప్రెల్ లో సల్మాన్ ఖాన్ - వెంకటేష్ ల కిసీ కా భాయ్ -కిసీ కి జాన్ రాబోతున్నాయనీ సంతోషాన్ని వ్యక్తం చేశాడు.
        
ఇవి కేవలం మల్టీప్లెక్స్ ప్రేక్షకులకు మాత్రమే కాకుండా ఎక్కువ మంది ప్రేక్షకులకి సంబంధించిన సినిమాలు. సింగిల్ స్క్రీన్స్ కి సహాయం చేస్తాయి. మొత్తం బాక్సాఫీసు  వసూళ్ళకి దోహదపడతాయి అని ఇంకో ఎగ్జిబిటర్ ఆశాభావం వ్యక్తం చేశాడు. సర్కస్, లాల్ సింగ్ చద్దా, రక్షా బంధన్, షంషేరా ఇవేవీ సింగిల్ స్క్రీన్ సినిమాలు కావన్నాడు.
        
గణాంకాల ప్రకారం 15-20 శాతం సింగిల్ స్క్రీన్ థియేటర్లు గత రెండేళ్ళలో మూతపడ్డాయి. దేశంలో సింగిల్ స్క్రీన్‌ల సంఖ్య 2018-19 లో సుమారు 8,500 నుంచి  2022 లో సుమారు 6,200కి పడిపోయాయి. సింగిల్ స్క్రీన్‌లు సగటున మొత్తం దేశపు బాక్సాఫీసు వ్యాపారానికి 35 శాతం దోహదం చేస్తాయి.  మిగిలిన 65 శాతం మల్టీప్లెక్సుల  నుంచి వస్తున్నాయి. 

ఇక ట్రెండ్ మారుతుందా?
   పఠాన్ తో బాలీవుడ్‌లో మరింత మంది నిర్మాతలు యాక్షన్ చిత్రాల్ని  రూపొందించడానికి ప్రేరణ పొందుతారనీ, పఠాన్ చాలా కాలం తర్వాత మంచి వసూళ్ళు రాబడుతున్న తొలి యాక్షన్ సినిమా అనీ, దీంతో ఖాయిలాపడిన బాలీవుడ్ కి ముందుకి వెళ్ళే మార్గం తెలిసిందనీ, ఇక బాలీవుడ్ నుంచి మరిన్ని యూనివర్సల్, మరిన్ని యాక్షన్, ఫ్రాంచైజీ సినిమాలు వస్తాయనీ తాము ఆశిస్తున్నామనీ, ఇది సింగిల్ స్క్రీన్స్ కి బాగా తోడ్పడుతుందనీ ఇంకో ఎగ్జిబిటర్ వివరించాడు.
        
పఠాన్ తో థియేటర్లు కిటకిటలాడుతున్నాయి. ఉదయం 6 గంటలకి, అర్ధరాత్రి 12 గంటలకి కూడా షోలు వేస్తున్నారు. సినిమా చూసి జనాలు డ్యాన్సులు చేయడం, ఈలలు వేయడం చివరి సారిగా ఎప్పుడు జరిగిందో గుర్తు లేదు. వీటి వీడియోలు తీసి వైరల్ చేస్తున్నారు. థియేటర్ల లోపల ఈ పూనకాలు వాల్తేరు వీరయ్య’, వీర సింహారెడ్డి ల విషయంలోనూ చూశాం. దక్షిణం నుంచి ఉత్తరం వైపుకి పూనకాలు రీలోడింగ్ అవుతోంది. దేశ నాడిని పట్టుకుంటున్న చిరంజీవి, బాలకృష్ణ, షారుఖ్ ఖాన్- ఈ సీనియర్లు లేకపోతే సినిమాలు ఓటీటీల్లో ఇళ్ళలోనే మగ్గుతాయన్నట్టుంది పరిస్థితి.
        
సింగిల్ స్క్రీన్ థియేతర్లంటే విద్యార్ధులు, వ్యాపారులు, రైతులు, కార్మికులు, బస్తీ ఆవారాలు, మస్తీ నిశాచరులు, ఇంకా ఎందరో అథోజగత్ సహోదరులుతో కూడిన అల్పాదాయ వర్గాలు. వీళ్ళకి చౌకలో సినిమాలని అందించేది సింగిల్ స్క్రీన్ థియేటర్లు. కానీ వీళ్ళకి దూరంగా మల్టీప్లెక్సుల కోసం మల్టీప్లెక్స్ సినిమాలు తీస్తే కలెక్షన్స్ లో 35 శాతం కోత పెట్టుకుంటున్నట్టే వుంది పద్ధతి.

ఆర్ధికమే కాదు, సామాజికం కూడా
అయితే పఠాన్ ఆర్ధికంగా బాలీవుడ్ కి ప్రాణం పోయడమే కాదు, దేశ సామాజిక ముఖచిత్రాన్ని కూడా చూపిస్తోంది. అటు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కొనసాగిస్తూండగానే, ఇటు షారుఖ్ ఖాన్ దేశం కలిసే వుందని చూపించేశాడు. పఠాన్ విడుదలకి ముందు బాయ్ కాట్ పిలుపులతో, టీవీ చానెళ్ల డిబేట్స్ లో దుష్ప్రచారాలతో, అసాధారణమైన అడ్వాన్స్ బుకింగ్‌ల నివేదికలు ఒఠ్ఠి పీఆర్ స్టంట్‌లు తప్ప మరేమీ కాదన్న బుకాయింపులతో, సాధ్యమైనంత వరకూ దేశాన్ని విభజించి వుంచాలన్న ప్రయత్నాలతో అట్టుడికింది. పదివేల పోస్టర్లు చించేశారు. కనబడితే షారుఖ్ ని నిలువునా తగులబెట్టేస్తామన్నారు. పఠాన్ ని కొట్టేవాళ్ళు బాలీవుడ్ లో తమ వాళ్ళ పొట్టలే కొడుతున్నామని తెలుసుకునే పరిస్థితుల్లో లేరు. బాబాలు, సాధ్వీలు రామనామ జపం మానేసి పఠాన్ ని జపించడం మొదలెట్టారు. మంత్రులు, ముఖ్యమంత్రులు, హోమ్ మంత్రులు కూడా రచ్చ చేశారు. ఒక ముఖ్యమంత్రి పత్రికా సమావేశంలో షారుఖ్ ఎవరు?’ అన్నాడు.
        
విడుదల తర్వాత- షారుఖ్  నుంచి అర్ధరాత్రి ఫోన్ రాగానే జీహుజూర్ అయిపోయాడు ముఖ్యమంత్రి. విడుదలకి ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చాడు. అడ్వాన్స్ బుక్కింగులు దేశవిదేశాల్లో పోటెత్తాయి. విడుదల రోజు బాయ్ కాట్ బ్యాచులు థియేటర్ల ముందు చిందు లేశాయి. పాట్నాలో చిందులేసి వేసి లాభంలేదని, పఠాన్ సినిమా చూసి చప్పట్లు కొట్టారు. సినిమా పాటలో సెన్సారైన ఆ బికినీ అలాగే వున్నా చప్పట్లు కొట్టారు. బయటికొచ్చి ఆ వీడియో కూడా వైరల్ చేసుకున్నారు పాపం ఒకప్పటి షారుఖ్ అభిమానులు!
        
ఇవన్నీతీసి ప్రేక్షకులు పక్కన పెట్టారు. భయపడకుండా థియేటర్లలో నిండి పోయారు. బాలీవుడ్ ని బతికిస్తూ దేశం కలిసే వుందని నిరూపించారు. ఈలలూ చప్పట్లతో, డాన్సులూ పూనకాలతో చూపించారు. సోషల్ మీడియాలో ట్వీట్లతో, కామెంట్లతో, థియేటర్ల ముందు పబ్లిక్ టాక్ లతో ఆనందాన్ని పంచుకుంటున్నారు. ఒక సినిమా దేశం ఎలా ఒకటిగా వుందో ఇలా విప్పి చూపిస్తూంటే, విభజన వాదులు గప్ చుప్ అయిపోయారు. అటు రాహుల్- ఇటు షారుఖ్ దీన్ని అద్వితీయంగా సాధించి చూపెట్టారు.

సికిందర్

Thursday, January 26, 2023

1294 : రివ్యూ!


 

దర్శకత్వం : మహేష్ సూరపనేని
తారాగణం : సుధీర్ బాబు, శ్రీకాంత్, భరత్ నివాస్, మౌనికా రెడ్డి, చిత్రా శుక్లా, మంజుల ఘట్టమనేని, మైమ్ గోపి, కబీర్ దుహన్ సింగ్, సంజయ్ స్వరూప్ తదితరులు
కథ, కథనం : బాబీ- సంజయ్, సంగీతం : జిబ్రాన్, ఛాయాగ్రహణం : అరుళ్ విన్సెంట్
బ్యానర్ : భవ్య క్రియేషన్ ప్రొడక్షన్
నిర్మాత : వి ఆనంద ప్రసాద్
విడుదల : జనవరి 26, 2023
***

        నైట్రో స్టార్ సుధీర్ బాబు సరైన సినిమాలు నటించడం లేదనుకుంటే నటించే కొత్త సినిమాలు కూడా సరైన విధంగా ఎంపిక చేసుకోవడం లేదు. తేడా ఎక్కడుందో సీరియస్ గా పరిశీలించుకోకపోతే ఎంపికలు ఎదురు తిరుగుతూనే వుంటాయి. అలాటి మరో ఎంపిక హంట్. ఏదో భాషలో హిట్టయ్యిందంటే ఆ హీరో చేసే సినిమాలు అలాగే వుంటాయి. సుధీర్ బాబు అభిమానులు హంట్ ఎంపికని జీర్ణించుకోలేరు. వికారం కల్గించే క్యారక్టర్ తో మూడాఫ్ అయిపోయి బయటికొస్తారు. హంట్ విషయంలో తను చేసిన ఖరీదైన పొరపాటు ఇక ముందు చేయకుండా జాగ్రత్త పడితే బావుంటుంది.

    కొత్త దర్శకుడు మహేష్ సూరపనేని వెళ్ళి వెళ్ళి ఇలాటి రీమేక్ తో తన కెరీర్ ని ప్రారంభించాలనుకోవడం కూడా అవగాహనా రాహిత్యానికి నిదర్శనం. దీనికి చేకూర్చిన కళాత్మక విలువలేమిటో చూద్దాం...

కథ

పోలీస్ కమీషనర్ మోహన్ భార్గవ (శ్రీకాంత్), ఏసీపీ అర్జున్ ప్రసాద్ (సుధీర్ బాబు), మరో ఏసీపీ ఆర్యన్ దేవ్ (భరత్ నివాస్) ముగ్గురూ ప్రాణ స్నేహితులు. ఆర్యన్ దేవ్ అర్జున్ ప్రసాద్ తో కలిసి ముంబాయిలో ఒక టెర్రర్ ఆపరేషన్లో ప్రదర్శించిన ధైర్యసాహసాలకి గ్యాలంట్రీ అవార్డు వస్తుంది. ఆ అవార్డు తీసుకుంటున్నప్పుడు ఒక షార్ప్ షూటర్ కాల్చి చంపుతాడు. దీంతో డిజిపి మోహన్ భార్గవ నేతృత్వంలో అర్జున్ ప్రసాద్ కి ఈ హత్య కేసు అప్పగిస్తాడు. అర్జున్ ప్రసాద్ కేసు దర్యాప్తు చేసి హంతకుడెవరో మోహన్ భార్గవకి చెప్పబోతూ యాక్సిడెంట్ కి గురై జ్ఞాపక శక్తి కోల్పోతాడు. కేసు గురించి ఏదీ గుర్తుండదు. హంతకుడు కూడా గుర్తుండడు. దీంతో మళ్ళీ కేసు పరిశోధించాల్సి వస్తుంది. ఇప్పుడు తిరిగి చేస్తున్న పరిశోధనలో ఏఏ విషయాలు బయటపడ్డాయి? తనకి గుర్తు లేని ఆ రహస్యమేమిటి? అప్పుడు షాకింగ్ గా ఆ హంతకుడెరు? ... అన్నవి మిగతా కథలో తెలుస్తాయి.

ఎలావుంది కథ

సైకలాజికల్ థ్రిల్లర్ జానర్ కథ. కథలో దర్యాప్తు అధికారి జ్ఞాపక శక్తి కోల్పోవడం, మళ్ళీ కేసు దర్యాప్తు చేయాల్సి రావడం వంటి  రెండు పాయింట్లు కొత్తగా వున్నాయి. అయితే దీనికి చేసిన కథనం సినిమాకి పనికిరాని ఎండ్ సస్పెన్స్ కథనమైంది. అలాగే ఎండ్ వరకూ కథ లేని కథనాన్ని లాగి లాగి రివీల్ చేసిన హంతకుడి పాత్రని తెలుగు ప్రేక్షకులు, ముఖ్యంగా సుధీర్ బాబు ఫ్యాన్స్ జీర్ణించుకునే స్థితిలో వుండరు. అంత వికారం కల్గించే పాత్ర. యాంటీ హీరో పాత్రలు తెలుగులో సక్సెస్ కావని కాదు, ఇలావుంటే కావు.
        
పాత్ర విషయమిలా వుంటే. ఇక కథనం కథేమిటో తెలియకుండా దర్యాప్తు పేరుతో ఉపోద్ఘాతం సాగుతూ వుంటుంది. ఎండ్ సస్పెన్స్ కథాలక్షణమిదే. దర్యాప్తు దర్యాప్తు దర్యాప్తు-ఫస్టాఫ్ దర్యాప్తు- సెకండాఫూ ఇంకా దర్యాప్తు కొనసాగి సాగి, మొనాటనీతో విసిగించి, చివరి పదినిమిషాల్లో హంతకుడెవరో తేలుస్తాడు. ఇప్పుడు గానీ అసలు కథేమిటో, హత్యకి కారణమేంటో తెలియదు. ఇది తెలుసుకోవడానికి సినిమా చివరివరకూ వేచి వేచి వుండాలి. ఇలా ఎండ్ సస్పెన్స్ కథనంతో  సినిమాలు పదేపదే బెడిసికొడుతున్నాయని ఎప్పటికీ గ్రహించకపోతే ఎవరేం చేస్తారు.
        
ఎండ్ సస్పెన్స్ తో సినిమాలకి ఇంకో ప్రమాదమేమిటంటే, చివరి దాకా దాచిన పెట్టిన సస్పెన్సు ని సినిమా చూసిన ప్రేక్షకుడు బయటికొచ్చి, ఒరే హంతకుడు వాడేరా అని చెప్పేస్తే నెక్స్ట్ షో ప్రేక్షకులు చూడ్డానికేమీ వుండదు. ఎండ్ సస్పెన్స్ సినిమాల షెల్ఫ్ లైఫ్ ఫస్ట్ డే ఫస్ట్ షో వరకే. ఇలా వుంది ముంబాయి పోలీస్ (2013) మలయాళం రీమేక్ వ్యవహారం.

నటనలు –సాంకేతికాలు

నైట్రో స్టార్ సుధీర్ బాబు పోలీస్ క్యారక్టర్ లో చూడ్డానికి పర్ఫెక్టుగా వున్నాడు. మాస్ పోలీస్ ఓవరాక్షన్ లేకుండా, అలాటి డైలాగుల్లేకుండా నీటుగా పాత్ర పోషణ చేశాడు. ఫోరెన్సిక్ సైన్స్ కోణంలో కూడా దర్యాప్తు చేపట్టాడు. అయితే బుల్లెట్ పై తొడుగు క్యాట్రిడ్జ్ ద్వారా అదే తుపాకీయో తెలియదు. క్యాట్రిడ్జ్ లోపలినుంచి బయటికి దూసుకుపోయే బుల్లెట్ మీద గన్ బ్యారెల్ గ్రూవ్స్ వల్ల స్ట్రయేషన్స్ ఏర్పడతాయి. ఈ స్ట్రయేషన్స్ ఆధారంగా గన్ ని ఐడెంటి ఫై చేస్తారు.
        
జ్ఞాపక శక్తి కోల్పోయిన పాత్రలో నటన స్ట్రగుల్ లేకుండా సాదాసీదాగా వుంది. తను మినీ గజినీ లాంటి వాడు. ఆ సంఘర్షణ, భావోద్వేగాలు మాత్రం లేవు. యాక్షన్ సీన్స్ బాగా చేశాడు. హీరోయిన్ లేకపోవడం లోటుగా లేదు. దీన్ని అర్ధం జేసుకుంటారు ప్రేక్షకులు. కానీ పాత్రలో వికారాన్ని మాత్రం భరించలేరు.
        
పోలీస్ కమీషనర్ గా శ్రీకాంత్ డీసెంట్ గా నటించాడు. ముగ్గురు పోలీసు మిత్రుల బాండింగ్ కూడా బావుంది. బాగా వుండాల్సింది తమ ముగ్గురితో కథనమే. మరో ఏసీపీగా భరత్ నివాస్ కూడా బాగా నటించాడు. సుధీర్ బాబు దర్యాప్తు టీములో మౌనికా రెడ్డి రెబల్ క్యారెక్టర్. మంజుల ఘట్టమనేని సైకియాట్రిస్టు పాత్రవేస్తే, చిత్రా శుక్లా భరత్ నివాస్ గర్ల్ ఫ్రెండ్ పాత్ర వేసింది.
        
భవ్య క్రియేషన్స్ ప్రొడక్షన్ కి బాగానే ఖర్చు పెట్టారు. జిబ్రాన్ మాత్రం సంగీతం నిర్వహించడానికి బద్ధకించినట్టు వుంది. సినిమా చూస్తూంటే ఎవరికైనా బద్ధకంతో ఆవలింతలే వస్తాయి. ఈ సినిమాకి రేటింగ్ 1.5, అంటే చిరంజీవి మాటల్లో 1.5 మిలియన్ డాలర్లు.
—సికిందర్