రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

28, డిసెంబర్ 2015, సోమవారం

స్క్రీన్ ప్లే సంగతులు!




థ్రిల్లర్ కథ పక్కాగా స్పీడుని డిమాండ్ చేస్తుందనేది తెల్సిందే. ఆ స్పీడు రెండు రకాలు : ఛేజింగ్ దృశ్యాల స్పీడు, కథలో ఏర్పాటయ్యే సమస్యతో ఏర్పడే స్పీడు. మొదటిది పైపైన భౌతికంగా కన్పించేది, కంటికి బాగానే వుంటుందిగానీ మనసుకి పట్టదు. రెండోది అంతర్లీనంగా మానసికంగా వేధించేది, కంటికీ మనస్సుకీ రెంటికీ బావుంటుంది. మందకొడి కథనం చేసి, దానికి నాలుగు ఛేజింగ్ దృశ్యాలు షూట్ చేసి జోడిస్తే అది స్పీడు అన్పించుకోదు. స్పీడుగా కదలాల్సిన అసలు కథ ముసలమ్మలా పడుకుంటే ఆవిడ పని ఛేజింగ్ దృశ్యాలు చేసుకుపోవు. కథ అనే ముసలమ్మ కూడా లేచి పరుగుదీస్తేనే ఆవిడ వెంట ఛేజింగ్ దృశ్యాలకి అందం చందం వస్తుంది. అప్పుడు మాత్రమే ఛేజింగ్ దృశ్యాలు నిజమైన థ్రిల్లింగ్ గానూ, స్పీడుగానూ అన్పిస్తాయి. ఆదివారం పేపర్లో ఒక వాక్యం కంటపడింది...Life does not follows the path of our desires and strategies, but our intentions and beliefs..( Vinitha Dawra Nangia The Times of India) అని. ఇంతేకదా?  ఏవో మన కోరికలూ వ్యూహాలూ చూపించే  దారిపట్టుకుని  జీవితం ఎప్పుడూ  ప్రయాణించదు.  ఆ కోరికల వెనుక, వ్యూహాల వెనుకా  వున్న ఉద్దేశాల్నీ, విశ్వాసాల్నీ మాత్రమే పట్టించుకుని జీవితం ముందుకెళ్తుంది. కోరికకి, వ్యూహాలకీ తగ్గ ఉద్దేశం, విశ్వాసం ఉంటేనే ఎవరైనా జీవితంలో ఏదైనా సాధించగల్గుతారు. ఉద్దేశం సరిగా లేకపోతే  ఎన్ని పథకాలేసినా హంతకుడు కూడా హత్య చేయలేడు. ఇప్పుడు ఈ  హత్య చేయడం అంత అవసరమా అనుకుంటాడు సోమరిగా. ఇలాగే కథలో  కూడా ఓ హీరో  కోరికల వెనుకా, వాటిని సాధించుకోవడానికి పన్నే వ్యూహాల వెనుకా ఉద్దేశం, విశ్వాసం బలహీనంగా వుంటే కథనం కూడా బలహీనమై స్పీడు తగ్గిపోతుంది...ఈ లోపాన్ని ఏంచేసీ  ఛేజింగ్ దృశ్యాలతో పూడ్చలేరు.

‘భలే మంచిరోజు’ సమస్యంతా సమస్య ఏర్పాటులోనే వుంది. ఎప్పుడైతే బిగినింగ్ ని ముగిస్తూ కథకి హీరో పరిష్కరించాల్సిన సమస్యని ఏర్పాటు చేస్తారో, అది లాజికల్ గా లేకపోతే చాలా దెబ్బ అని చాలాసార్లు చెప్పుకున్నాం. ఈ సినిమా కథకి ఈ దెబ్బే తగిలింది.  అంతమాత్రాన సినిమా దెబ్బతినిపోయిందని అనడం లేదు. థ్రిల్లర్ కి ఉండాల్సిన స్పీడుని కోల్పోయిందని మాత్రమే చెప్పడం.  ఈ స్పీడు గనుక వుండి వుంటే, ముచ్చట్లు చెప్పుకుంటున్నట్టు గాక,  ఒక నిజమైన థ్రిల్లర్ సినిమా చూస్తున్నట్టుండేది. 

        దేవుడు ఏంతో ఆలోచించి, సృష్టి జరిగాక కొన్ని లక్షల సంవత్సరాల టైము తీసుకుని గానీ, ఆచితూచి  మనిషినే వాడిని జాగ్రత్తగా పుట్టించి ఈ భూమ్మీద వదల్లేదు. అంత  ఆలోచించి గానీ హీరో పాత్రని సృష్టించి వదలకపోతే వాడు కథనంతా చెడగొడతాడు- అఫ్ కోర్స్,  ఒకనాటికి మనిషి పర్యావరణాన్ని  చెడగొడతాడని దేవుడు కూడా ఊహించి ఉండడు, అది వేరే విషయం. దేవుడు చేసిన పొరపాటు మనం చేయకూడదుగా? దేవుణ్ణి ఫాలో అయితే  సినిమాలు చెడిపోతాయి. పారిస్ సమావేశాలు పెట్టుకోవాల్సి వస్తుంది. 

ఈ థ్రిల్లర్ ఒక రోజులో జరిగే కథ అన్నారు గానీ  ఆ లక్షణాలు కూడా కనబర్చాల్సింది. ఒకరోజు కాదు, ఉదయం  ప్రారంభమయ్యే సంఘటనలు చీకటి పడేలోగా సాయంత్రానికల్లా  ముగిసిపోవడాన్ని  క్లయిమాక్స్ చూసి తెలుసుకోవచ్చు. అంటే కొన్ని గంటలు మాత్రమే జరిగే కథ అన్న మాట. కథలకి స్టోరీ లిమిట్ అనే లాక్ వుంటుంది. అది రెండు  రకాలు : ఆప్షన్ లాక్, టైం లాక్. ఆప్షన్ లాక్ వ్యవధి రోజుల్లో, నెలల్లో, సంవత్సరాల్లో ఎంతయినా ఉండొచ్చు. ఇక్కడ హీరో సమస్యని సాధించడానికి కాలంతో సంబంధం లేకుండా, ఒక ఆప్షన్ కాకపోతే ఇంకో ఆప్షన్ ని ప్రయత్నిస్తూ పోతూంటాడు. ఇలాటి కథలతోనే అత్యధిక శాతం సినిమాలుంటాయి. ఒకరోజు లోపు, లేదా కొన్ని గంటల్లో ముగిసిపోయే కథల స్టోరీ లిమిట్ టైం లాక్ కిందికొస్తుంది. దీంట్లో  పాత్రకి కాలాన్ని దృష్టిలో పెట్టుకుంటూ, కొన్ని గంటలు, లేదా ఆ రోజు వరకూ మాత్రమే గోల్ ని సాధించి తీరాల్సిన  అత్యవసర పరిస్థితి వుంటుంది. ఆ కాలగమనాన్ని- గడిచిపోతున్న కాలాన్ని- సూచిస్తూ ( టైమర్ తో) కథ పరుగులెత్తుతుంది.  

        ప్రస్తుత థ్రిల్లర్ స్టోరీ లిమిట్ ‘టైం లాక్’ తోనే వుంది, కానీ దీని నిర్వహణా దెబ్బ తింది. దీని ప్రభావం స్పీడు మీద పడింది. ఈ స్పీడుని పెంచాలంటే మొదటి మూల స్థంభం  ( ప్లాట్ పాయింట్-1) ని మరమ్మత్తు చేయాలి. అంటే  సమస్య ఏర్పాటులో తగినంత బలాన్ని చేకూర్చాలి. ఏ  కథలోనైనా కథనంలో ఏర్పడే లోపాలన్నిటికీ మూలాలు మొదటి మూల స్థంభంలోనే వుంటాయి. కథ ఇక్కడ్నించే పుడుతుంది గనుక. గంగకి గంగోత్రి ఎలాగో, కథకి మొదటి మూలస్థంభం అలా.

        కొత్త దర్శకుడి నుంచి ఇవన్నీ ఇప్పుడే ఆశించకూడదు నిజమే. శ్రీరామ్ ఆదిత్య  కేవలం కొన్ని షార్ట్  ఫిలిమ్స్ తీసిన అనుభవంతో నిర్మాతల్నీ, హీరోనీ ఒప్పించి, తనదైన విజువల్ స్టయిల్ తో, సహజ పాత్రలూ సహజ చిత్రణ లతో, ఈ థ్రిల్లర్ తీసి హిట్ చేసుకున్నాడు. మిగతా కొత్త దర్శకుల్లాగా మూస కథల, సొంత శైలి లేని మూస తీతల ఊబిలో పడకుండా తనదైన స్టాంప్ తో ప్రత్యేకంగా నిల్చాడు. దీన్ని నిలబెట్టుకుంటాడో లేదో తర్వాత సంగతి. ఐతే తను దర్శకుడే అయినా ప్రేక్షకుడు కూడా. సామాన్య ప్రేక్షకులతో బాటు, చాలా మంది సమీక్షకులూ  ఈ సినిమా  స్లో నేరేషన్ అనడాన్ని చూస్తున్నాం.  ఇది ప్రేక్షకుడిగా దర్శకుడికి కూడా అనుభవ మయ్యే వుండాలి. ఇక్కడ మామూలుగా నైతే ప్రేక్షకుల్నీ, కొందరు సమీక్షకుల్నీ పరిగణన లోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రతీ సినిమాకీ వీళ్ళకి స్పీడు మీదే దృష్టి పడుతుంది. స్పీడు లేకపోతే ఒక్క నిమిషం బతకలేరన్నట్టు. ఇది చాలా విచిత్రమైన మానసిక స్థితి. ఓ సమీక్షకుడు  ‘బాజీరావు మస్తానీ’ నీ, ‘బాహుబలి’ తో పోలిక పెట్టి , స్పీడు లేదనీ- కామెడీ  లేదనీ, బీభత్సమైన పోరాటాల్లేవనీ అనేశాడు. ఇంకో అతను ‘బాజీరావు మస్తానీ’ ప్రేమకథ అని కూడా తెలుసుకోకుండా  ‘రుద్రమ దేవి’ తో పోల్చి వృధా అనేశాడు.  

        పరిస్థితి ఎలా తయారయ్యిందంటే,  కథ తో సంబంధం లేకుండా అన్ని కథలూ ఒకే స్పీడుతో పరిగెత్తాలి, కథని బట్టి దాని ఫీల్ ని నిలబెడుతూ  నడక ఉండరాదు. ఉంటే అది సినిమా కాదు. ఒక రిధమ్ తో, సంగీతపు ఝరిలా నడిచే ‘గాడ్ ఫాదర్’ లాంటి మహా చిత్రరాజమైనా, తెలుగుకి అంతర్జాతీయ కథ పరిచయం చేసిన ‘కంచె’ అయినా, ఏం చెప్పామో తెలియకుండా, రెండు గంటల్లో టపటప లాడించేసి, మెదడు తక్కువ కామెడీతో పకపకా నవ్వించేసి  ప్రేక్షకుల్నీ, రివ్యూ రైటర్లనీ  బయటికి తోసి పారెయ్యాలి. ఇంకో కొత్త బ్యాచీని మెడపట్టి లోపలికి  లాగాలి. ఆ పూటకల్లా చూసిన ఆ సినిమాని  ఆ బ్యాచీలన్నీ మర్చిపోవాలి. జ్ఞాపకాల్లో వుండకూడదు, ఆలోచింపజేయకూడదు, వెంటాడ కూడదు. ఇంతే వీళ్ళ దృష్టిలో సినిమా అంటే! 

        ఒకసారి ఈ పోస్ట్ కి సైడ్ బార్ లో బ్రెజిలియన్ దర్శకుడి కామెంట్ ని చూస్తే- ‘ఈరోజుల్లో ప్రేక్షకులు ఎమోషనల్ కథలు కోరుకోవడం లేదు, వాటికి ఎలా స్పందించాలో వాళ్లకి తెలియకపోవడం వల్ల’ – అన్నది అసలు సంగతి! ఇలావున్నాకా ఇక మంచి సినిమాలేం చూస్తారు. ఎక్కడో బ్రెజిల్ లోనే ఈ పరిస్థితి వుంటే, అటూ ఇటూ  తెలుగు రాష్ట్రాల్లో ఆరితే రిపోయి ఇంకా ఘోరంగా వుంటుంది కదా? వుంది కూడా!

        ఐతే థ్రిల్లర్ కి  ఎవరూ చెప్పక్కర్లేకుండా స్పీడు అనేది డీ ఫాల్ట్ గా ప్రోగ్రాం అయి వుంటుంది. దాన్ని ఆప్టిమైజ్ చేయలేం. చేస్తే దాన్ని కాంప్రమైజ్ చేయడమే అవుతుంది. స్పీడు కాంప్రమైజ్ అయినప్పుడు, ఈ సినిమాలో చూపించినట్టు, హీరోయిన్ ఫోటో మందికి చూపిస్తూ చార్మినార్ దగ్గర తారట్లాడుతూ ఆమె కోసం వెతుక్కున్నట్టు, స్పీడు తగ్గిపోయి వుంటుంది. పాత సినిమాల్లో చూపించినట్టు  ఈ సీనేమిటి? సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తే నిమిషం లో ఆమె ఎవరో హీరోకి  తెలిసిపోదా?     

        కాబట్టి థ్రిల్లర్స్ విషయంలో – ఈ  సినిమాతో సహా- స్పీడు స్వాముల సణుగుల్ని అర్ధం జేసుకోవచ్చు. అది న్యాయబద్ధమైనదే. తెలుగు సినిమాకి ఇంకో టెంప్లెట్ కూడా తగిలించారు ప్రేక్షకులూ, కొందరు సమీక్షకులూ  కలిసి. మాటాడితే ఇందులో కామెడీ తగ్గిందనో, అసలు లేదనో అంటారు. ప్రస్తుత సినిమా విషయంలోనూ ఇందులో కామెడీ లేదంటూ ఒక సమీక్ష రాశారు,  తనూ సగటు ప్రేక్షకుడే కదా. అంటే, కథని బట్టి కాకుండా ఏ సినిమాకైనా స్పీడుండాలి, కామెడీ కూడా వుండి తీరాలన్న మాట- అది రామాయణమైనా, మహా భారతమైనా సరే!

***

        కసారి ఈ కథలోకి తొంగి చూద్దాం...ఖరీదైన బెంజి కార్ల షోరూమ్ లో కార్లని డెలివరీ చేసే ఉద్యోగంలో వున్న రామ్ ( సుధీర్ బాబు) ఓసారి  డెలివరీ డ్యూటీలో వున్నప్పుడు బెంజి కారు డ్రైవ్ చేస్తున్న అతణ్ణి చూసి డబ్బున్న వాడనుకుని ప్రేమిస్తుంది మాయ ( ధన్యా బాలకృష్ణ). తీరా అతను ధనవంతుడు కాదని తెలుసుకుని గుడ్ బై కొట్టేసి వేరే పెళ్లి చేసుకోబోతూంటుంది. దీంతో మండిపోయిన రామ్, ఆమెకి బుద్ధి చెప్పివద్దామని ఫ్రెండ్ ఆది ( ప్రవీణ్) ని తీసుకుని  బయల్దేరతాడు. బయల్దేరిన ఆ కారు వెళ్లి ఇంకో కారుకి డాష్ ఇస్తుంది. ఆ కార్లోంచి పెళ్లి కూతురి బట్టల్లో వున్న సీత (వామిఖా గబ్బి) దిగి పారిపోతుంది. ఆ కారులోనే ఆమెని కిడ్నాప్ చేసి పట్టుకుపోతున్న గ్యాంగ్- రామ్ నీ,  ఆదినీ పట్టుకుపోతారు. 

        గ్యాంగ్ లీడర్  శక్తి ( సాయి కుమార్) ఆదిని బంధించి, వెళ్లి సీతని వెతికి పట్టుకు రమ్మని రామ్ ని బ్లాక్ మెయిల్ చేస్తాడు. ఓల్డ్ సిటీలో ఒక పాత సినిమా హాల్లో బ్లాక్ అండ్ వైట్ సినిమా లేసుకు చూస్తూ గడిపే  శక్తి- మ్యాట్నీ టైం కల్లా సీత తన దగ్గరుండక పోతే ఆది చచ్చిపోతాడని బెదిరిస్తాడు. 
రామ్ కి ఇద్దరు క్రిమినల్స్ యూసుఫ్- ఆల్బర్ట్ (వేణు- శ్రీరాం) లు  తగుల్తారు. సీత కూడా ఓ చోట తగుల్తుంది. ఈ క్రిమినల్స్ సాయంతో సీతని పట్టుకుని, శక్తి దగ్గరికి తీసుకొస్తూంటే ఇంకో గ్యాంగ్ కిడ్నాప్ చేస్తుంది.. ఇలా రామ్ కి అనేక చిక్కులెదురవుతూంటాయి. ఆదినే గాక, ఆ ఆదిని ప్రేమిస్తున్న చెల్లెలూ, తల్లిదండ్రులూ కూడా ఈ చిక్కుల్లో ఇరుక్కుంటారు.. ఈ చిక్కుముళ్ళన్నీ  రామ్ ఎలా విప్పాడన్నది మిగతా కథ.

***
    బిగినింగ్ విభాగం రామ్  కారుని కిడ్నాపర్స్ కారుకి గుద్దడంతో ముగుస్తుంది. ఇక్కడే సమస్యతో  మొదటి మూలస్థంభం ఏర్పాటయ్యింది. గుద్దిన కార్లోంచి పెళ్లి కూతురు సీత బయటపడి పరుగు లంకించుకుంటుంది. ఇది మంచి  డైనమిక్స్ వున్న సెటప్. ఇలా మొదటి మలుపనేది వెర్బల్ గా  ఉండకుండా, యాక్షన్ లో వుంటే దాని ఇంపాక్టే వేరు. ఆ భావముద్ర సినిమా సాంతం వెన్నాడుతుంది. కథలో బాగా ఇన్వాల్వ్ చేస్తుంది.  ‘శివ’ లో శివ సైకిల్ చెయిన్ లాగి  జేడీ మీద తిరగబడే శీను అనే మొదటి మూలస్థంభం ఇందుకే చరిత్రలో నిల్చిపోయింది. 

        రామ్ కార్లో ఇంటి నుంచి బయల్దేరే ముందు- ఇంకోచోట సీత పెళ్లి ఏర్పాట్లు జరుగుతూంటాయి. సీత ఈ కథలో హీరోయిన్. ఒక హీరోయిన్ కి వేరే అతనితో పెళ్లి ఏర్పాట్లు జరగడమూ, అది తప్పి పోవడమూ అనే కథా ప్రారంభం ‘ముత్యాల ముగ్గు’ లోంచి అందుకుని రిపీట్ అవుతూవున్నదే. ఈ ఎత్తుగడలో పెప్ లేదు. కానీ ఆమెని కిడ్నాప్ చేసి తీసుకుపోతూంటే, హీరో కారు డాష్ ఇవ్వడమన్నది మంచి కెమిస్ట్రీ. మోసం చేసిన హీరోయిన్ని తన్ని వద్దామని బయల్దేరిన హీరోకి,  పెళ్లి కూతురిలా  ఇంకో హీరోయిన్ తగిలింది. వెంటనే ఆడియెన్స్ కిక్కడ కావలసినంత రొమాంటి అప్పీల్. 

        ఈ మొదటి మూల స్థంభం దగ్గరే ఆడియెన్స్ కి అంతకి ముందటి సెటప్ భంగపడిన అసంతృప్తి కూడా ఏర్పడింది. మోసం చేసిన హీరోయిన్ని తన్ని వద్దామని హీరో బయల్దేర డం ఆడియెన్స్ కి ఆసక్తి రేపే సెటప్. అలా వెళ్లి గనుక  తంతూంటే ఆ సెటప్ పే ఆఫ్ అయి సంతృప్తి చెందే వాళ్ళు. కానీ మధ్యలో యాక్సిడెంట్ జరగడంతో, ఆ సెటప్ పే- ఆఫ్ కాలేదు. దీని అసంతృప్తి అనుకోకుండా  హీరోకి తగిలిన ఇంకో హీరోయిన్ తో రోమాంటిక్ అప్పీల్ తో తీరింది ఆడియెన్స్ కి. ఈ రోమాన్స్ ని కూడా వాయిదా వేస్తూ విలన్తో చిక్కుల్లో పడ్డాడు హీరో. విలన్ కోసమే మళ్ళీ హీరోయి
న్ కోసం వేటలో పడి  తిరిగి రోమాంటిక్ అప్పీల్ కి తెరతీశాడు. 

        ఈ డైనమిక్స్ బాగానే వున్నాయి. అయితే ఇక్కడ హీరోకి తలెత్తిన సమస్యేమిటి?  మొదటి హీరోయిన్ ని తన్నలేకపోయాడు. ఇప్పుడది క్యాన్సిల్ అయిపోయింది. విలన్ పెట్టిన  గడువుకల్లా హీరోయిన్ని పట్టుకురాకపోతే, బందీగా పెట్టుకున్న ఫ్రెండ్ ని చంపేస్తాడు విలన్. ఇదీ సమస్య. 

        ఈ సమస్యలో, అంటే
మొదటి మూల స్థంభంలో - హీరోకి ఏర్పడిన గోల్ లో- ఉండాల్సిన ఎలిమెంట్స్ -  1. కోరిక,  2. పణం, 3. పరిణామాల హెచ్చరిక, 4. ఎమోషన్ ఉన్నాయా? 

       
1. కోరిక- ఫ్రెండ్ ని సజీవంగా విడిపించుకోవాలని కోరిక పుట్టింది. 2. పణం : ఆ ఫ్రెండ్ ప్రాణాలే గాక, ఆ ఫ్రెండ్ తో తన చెల్లెలి ప్రేమనీ పణంగా పెట్టాడు. 3. దీని పరిణామాల హెచ్చరిక : హీరోయిన్ని తెచ్చి విలన్ కి అప్పజెప్పేస్తాడా ఏమిటీ? అప్పజెప్పేస్తే అప్పుడేమౌతుంది? అప్పజెప్పకపోతే ఏమౌతుంది? 4. ఎమోషన్ :  వీటన్నిటి వల్లా ఏస్థాయి ఎమోషన్ పుట్టింది? 

        ఇక్కడే వచ్చింది సమస్య. కోరిక బాగానే వుంది, పణంగా బాగానే ఒడ్డాడు, పరిణామాల హెచ్చరికా బాగానే వుంది- ఈ మూడింటినీ పురస్కరించుకుని మోటివేట్ అయ్యేందుకు పుట్టాల్సిన ఎమోషన్ కి ఒకటి అడ్డు పడుతోంది. ఏమిటది?

        వెనక్కి వెళ్దాం...మొదటి మూలస్థంభం దగ్గర కార్లు గుద్దుకున్నప్పుడు, జరిగిందేమిటో, అసలు జరగాల్సిందేమిటో  చూద్దాం. హీరో కారు గుద్దగానే వీండ్ షీల్డ్  పగిలి ఎదుటి  కారు డోర్ తెరుచుకుని  హీరోయిన్ దిగుతుంది. ఆమె చెక్కుచెదరదు, చుక్క రక్తం రాలదు. పెళ్లి బట్టల్లో, వొంటి నిండా బంగారంతో ఫోటో దిగడాని కన్నట్టు దిగి చూస్తుంది  ( కిడ్నాపర్స్ ముందా బంగారం లాక్కోకుండా ఆమెని తిప్పుతూంటారా? పట్టుచీర కూడా లాగేసుకోవాలి అసలుకి). 

       
ఆమె అటూ ఇటూ చూసి జంపై పోతుంది. అప్పుడు తీరుబడిగా కిడ్నాపర్స్ దిగుతారు. వీళ్ళూ చెక్కు చెదరక దుక్కల్లా వుంటారు. అప్పుడు వీళ్ళేం  చేయాలి? వెంటనే పారిపోతున్న హీరోయిన్ వెంట పడాలి. ఆమె కిడ్నాప్ విలువ పదికోట్లు! ఆమెనలా వదిలేసి హీరోనీ,  ఫ్రెండ్ నీ బాస్ దగ్గరికి లాక్కెళ్తారు. హీరోవల్లే తమ కిడ్నాప్ విఫలమయ్యిందనీ, కాబట్టి ఆ హీరోయిన్ని పట్టుకొచ్చే బాధ్యత హీరోదేననీ బాస్ తీర్పు చెప్పి ఫ్రండ్ ని బంధిస్తాడు. కళ్ళముందు పది కోట్లు అలా ఎగిరిపోతూంటే ఆమెని పట్టుకోకుండా, తీరుబడిగా కారుదిగి హీరోని పట్టుకోవడమేమిటి, బాస్ కూడా వాళ్ళని చంపి పారెయ్యక, హీరోని బాధ్యుణ్ణి చేయడమేమిటి? 

        కనుక విలన్ వైపునుంచీ ప్రాబ్లం సెటప్ ఇంత బలహీనంగా వుంది. ఇతను వీక్ విలన్. వీడి తొండి బిజినెస్ కి అక్కడే నాల్గు తన్ని హీరో వెళ్లిపోవచ్చు ఫ్రెండ్ తో కలిసి. కానీ హీరో పాత్రని దాని మానాన దాన్ని వదిలెయ్యక, తన చేతిలోకి తీసుకున్నాడు దర్శకుడు.  దాంతో ఈ సంఘటనలో జరిగిన లోపం దర్శకుడికి  తెలుసు. కనుక ఆ కీలుబొమ్మ హీరో పాత్రని కూడా  సరీగ్గా నడపలేక పోయాడు. హీరో మోటివేట్ అవ్వాలంటే పుట్టిన ఎమోషన్ సహేతుకంగా వుండాలి. సహేతుకంగా లేనప్పుడు మోటివేట్ అవలేడు (
Life does not follows the path of our desires and strategies, but our intentions and beliefs...)

       
కనుక విలన్ ని ప్రశ్నించలేని తన నిస్సహాయత వల్ల 1.  కోరిక లో మోటివేషన్ లేదు,  2. ఒడ్డిన పణం పట్లా విచారం లేదు, 3. పరిణామాల  హెచ్చరిక పట్లా సీరియెస్ నెస్ లేదు... తను చేస్తున్న దాంట్లో  అడుగడుగునా హీరోకి ( దర్శకుడికి)  ఈ లాజిక్ అడ్డు తగుల్తోంది...కాబట్టి గోల్ లోంచి పుట్టాల్సిన ఆ స్పీడు, ఆ థ్రిల్, ఆ పెప్ అన్నీ మందగించాయి. బీజం బలహీనంగా వుంటే మొక్క (కథ)  కూడా బలహీనంగా మొలకెత్తుతుంది కదా ...

                                               ***

ప్పుడైతే హీరోకి ఎమోషనల్ గా స్పీడు తగ్గిందో, పెట్టిన గడువు పట్లా అర్జెన్సీ కూడా అంత అవసరం లేకుండా పోయింది.  మ్యాట్నీ సమయానికల్లా హీరోయిన్ని తేవాలన్నాడు విలన్. ఈ డెడ్ లైన్ ని ట్రాక్ చేస్తూ నడపాల్సిన టైం లాక్ స్టోరీ లిమిట్ కథనం సాధారణ కథలాగే అయిపోయింది. మ్యాట్నీ అంటే కొన్ని గంటలే వుంది. నిమిషాలు లెక్కబెడుతూ హీరో పరుగెత్తాల్సిన అవసరం ఎందుకు ఏర్పడలేదంటే, విలన్ పెట్టిన ఆ కండిషనే చైల్డిష్ గా అన్పిస్తోంది హీరోకి (దర్శకుడికి). ఆ పిచ్చి దద్దమ్మని నాల్గు పీకి పారిపోకుండా ఎందుకు భరిస్తున్నాన్రా అన్న ఫీలింగ్ వేధిస్తోంటేనే ఇంకేం చేస్తాడు. కాబట్టి డెడ్ లైనూ పట్టకుండా మన్నుతిన్న పాము చేశాడు కథనాన్ని. ఒక రోజులో జరిగే కథ కొన్ని యుగాలకి సాగలాగినట్టు గా ఇందుకే అయింది. సైకాలజీని పక్కన పెట్టి పాత్రచిత్రణ లు చేయలేం. బాహ్య చలనాలన్నీ పాత్ర మైండ్ లోంచే పుడతాయి.
***
సాలా సినిమాలకి లాజిక్ అవసరం లేకపోవచ్చు గానీ, థ్రిల్లర్స్ కీ, సస్పెన్సూ మిస్టరీ లకీ  లాజిక్ లోంచే కథలు పుడతాయి. ఆ లాజిక్ నీ, కార్యకారణ సంబంధాన్నీ(  కాజ్ అండ్ ఎఫెక్ట్ నీ ) విశ్లేషించుకుంటూనే ముందుకు సాగుతాడు హీరో. ఈ తర్జనభర్జనల్లోంచే ఏదో పాయింటు పట్టుకుని పరిష్కార మార్గాన్ని కనుగొంటాడు. అతను  సూక్ష్మగ్రాహి అయి ఉంటాడు. మామూలు మసాలా సినిమా పాత్ర అయివుండడు. కుశాగ్రబుద్ధిగలవాడై ఉంటాడు. క్షణం క్షణం ప్రేక్షకుల రోమాలు నిక్క బొడుచుకునేలా చేస్తాడు. ఈ జానర్స్  క్యారక్టర్లే వేరు, కథనాలే వేరు. వీటి మీద సబ్జెక్టు చదవకుండా సినిమాలు చేస్తే ప్రొఫెషనల్ గా వుండవు.

—సికిందర్





















27, డిసెంబర్ 2015, ఆదివారం

చరిత్రకి స్క్రీనీకరణ!








 దర్శకత్వం : స్టీవెన్ స్పీల్ బెర్గ్ 

తారాగణం : లియాం నీసన్, బెన్ కింగ్స్ లే, రాల్ఫ్ ఫిన్నెస్, కరోలిన్ గూడాల్, జోనాథన్ సాగాల్, ఎంబెత్ డేవిట్జ్  తదితరులు
కథ : థామస్ కెనెల్లీస్క్రీన్ ప్లే : స్టీవెన్ జిలియన్సంగీతం : జాన్ విలియమ్స్, ఛాయాగ్రహణం : జానస్ కామిన్ స్కీ , కూర్పు : మైకేల్ కాన్ 
బ్యానర్ : యాంబ్లిన్  ఎంటర్ టైన్ మెంట్ , నిర్మాతలు : స్టీవెన్ స్పీల్ బెర్గ్, గెరాల్డ్ మోలెన్, బ్రాంకో లస్టిగ్ 
విడుదల : నవంబర్ 30, 1993 

              మహోజ్వల చిత్రరాజాలు చరిత్ర పుటల్ని ఓసారి తిరగేస్తాయి. ప్రజలకి తెలియని, తెలిసినా మర్చిపోయిన కఠోర సత్యాల్ని మరొక్క సారి గుర్తుకు తెస్తాయి. ప్రపంచానికి అద్దం  పట్టడం మహోజ్వ చిత్ర రాజం నిర్వర్తించే మహా కార్యమైతే,  దానికి పట్టం గట్టడం మిగతా సభ్య ప్రపంచపు కర్తవ్యం. పట్టం గట్టడమే ఏమిటి,  అవార్డుల పంటలతో సమాదరిచకుండా మానవాళి కూడా నిద్రపోదు. నిద్రపోనివ్వని నిజాల చిత్రణకి అంతటి విలువ వుంటుంది. ఆ విలువని చాటిన ఒక అపురూప కళాఖండమే  హాలీవుడ్ విజువల్ మాంత్రికుడైన స్టీవెన్ స్పెల్ బెర్గ్ సృష్టి  ‘షిండ్లర్స్ లిస్ట్’.

           షిండ్లర్స్ లిస్ట్ అనగానే హిట్లర్ పాలనలో శవాల గడ్డగా మారిన నాటి జర్మనీ చటుక్కున మనో ఫలకాల మీద మెరుస్తుంది. ఒడలు జలదరించేట్టుగా హిట్లర్ సాగించిన దురాగతాలు ఒకటొకటిగా కళ్ళ ముందు కదలాడతాయి. ఈ దారుణ మారణ హోమాన్ని  చరిత్రలోంచి తవ్వి తీసి చలన చిత్రంగా నిర్మించాలన్న కోరిక స్టీవెన్ స్పీల్ బెర్గ్ కి బలపడింది. కానీ ఈ కలని నిజం చేసుకోవడానికి పదేళ్ళూ పట్టింది. అయినా ఇది ప్రపంచ వెండి  తెరలకి ఎక్కేటప్పటికి ప్రేక్షకులు దీని తీవ్రతకి దిగ్భ్రాంతి చెందారు. ఇంకిలాటి చరిత్ర అస్సలు పునరావృతం కాకూడదని ఎలుగెత్తి చాటారు. ప్రేక్షకుల్ని ఇంతలా కదిలించిన ఈ దృశ్య  బీభత్సంలో అసలేముందో తెలుసుకుంటే...

       తెలుసుకునే ముందు,  ఒకసారి హిట్లర్ ఈ దుష్కృత్యాలకి ఎప్పుడు, ఎందుకు, ఎలా పాల్పడ్డాడో తెలుసుకుందాం...1933 లో హిట్లర్ అధికారం లోకొచ్చి రెండో ప్రపంచ యుద్ధ సన్నాహాలు ప్రారంభించాడు. అతను యూదు మతస్థుల్నీ, జిప్సీలనీ (బంజారా జాతి), స్వలింగ సంపర్కుల్నీ, వికలాంగులనీ అపరిశుద్ధులుగా ప్రకటించాడు. వీళ్ళందర్నీ కట్టగట్టి జర్మనీ నుంచీ తద్వారా, మొత్తం మిగతా ప్రపంచాన్నుంచీ సమూలం గా తుడిచిపెట్టేయాలనీ  తీర్మానించాడు. 1935  లో న్యూరెంబర్గ్ చట్టాన్ని తీసుకొచ్చాడు. దీని ప్రకారం యూదు తండ్రికి పుట్టిన సంతానం మాత్రమే  యూదులవుతారని గాకుండా, వారికి ముగ్గురు క్రైస్తవులైన  తాతలుండి, తర్వాత తండ్రులు మతం మారినా యూదులవుతారని నిర్ణయించాడు. ఒక్క ఆర్యన్ జాతి వాళ్ళు  మాత్రమే పరిశుద్ధులనీ, కనుక మిగతా యూదులందర్నీ తుదముట్టించేందుకు  వీలుగా ఈ చట్టాన్ని తెచ్చాడు.

          దీంతో 1938 లో
  నేషనల్ సోషలిస్ట్ జర్మన్ వర్కర్స్ ( అంటే నాజీలు) యూదులకి చెందిన వ్యాపార కేంద్రాలని ధ్వంసం  చేయడం ప్రారంభించారు. యూదు జాతి అంతానికి ఇదే నాంది అన్నట్టుగా ఈ విధ్వంసాలతో ఒక  హెచ్చరిక పంపారు.

          1939 లో పోలాండ్ మీద జర్మనీ దాడి చేసేటప్పటికే జర్మనీ ఆక్రమణలో ఉన్న ప్రాంతాలన్నీ యూదుల సంహారంతో అట్టుడికి పోతున్నాయి. ఇక పోలాండ్ లోనూ యూదులని వాళ్ళ ఇళ్ళల్లోంచి బయటికి లాగి మురికి వాడల్లోకి
, వాళ్ళని చంపేందుకు ఏర్పాటు చేసిన  కాన్సంట్రేషన్ క్యాంపులనే నరక కూపాల్లోకీ తండోప తండాలుగా తరలించి కుక్కారు. ఇళ్ళల్లోంచి బయటికి లాగినప్పుడు వాళ్ళని యూదులుగా గుర్తు పట్టేందుకు చేతులకి పట్టీలు కట్టారు. క్రాకోవ్ అనేది అలాటి ఒక మురికివాడ. ఇక్కడ ఇరవై వేలమందిని పశువుల్లా కుక్కారు. వాళ్ళతో కూలి పనులు చేయించుకోసాగారు. అప్పుడప్పుడు మొబైల్ యూనిట్లు వచ్చి వాళ్ళల్లో కొందర్ని సరదాగా చంపేసి  వెళ్ళిపోసాగాయి.

1941 లో ఫైనల్ సొల్యూషన్ ని అమలుపర్చారు. అంటే  మొత్తం యూదుల్నీ, జిప్సీలనీ  భారీ ఎత్తున పోగేసి హతమార్చడమన్న మాట.  మానవ చరిత్రలో అత్యంత చీకటి అధ్యాయమది. ఇంతకంటే అమానుష కృత్యాలు మానవ చరిత్రలో ఎక్కడా కన్పించవుయూదుల్ని డెత్ క్యామ్పులకీ, గ్యాస్ ఛాంబర్లకీ తీసికెళ్ళి  అమానుషంగా చంపడం మొదలెట్టారు. ఆ మృత కళేబరాల్ని పెద్ద పెద్ద పొయ్యిల్లో వేసి బూడిద చేశారు. ఆ నల్లని పొగ మేఘాలు సమీప పట్టణాలని  కమ్మేసేవి, చితాభస్మాలు ధూళి మేఘాల్లా ఎగిరి వచ్చి మీద పడేవి.

          క్రాకోవ్ లో దుర్మతుల ఈ మానవసంహారం కొనసాగుతున్న నేపధ్యంలోఆస్కార్ షిండ్లర్ అనే  అతను  తెరపైకొచ్చాడుఇతను యుద్ధ పనుల కాంట్రాక్టర్, పైగా స్త్రీ లోలుడు. ఇతను తన ఫ్యాక్టరీ లో పనిచేస్తున్న 1100 వందల మంది యూదుల ప్రాణాల్ని కాపాడాడు. ఆ యూదులు మేము షిండ్లర్ యూదులంఅని గర్వంగా, ఒక లైసెన్సు లాగా  చెప్పుకునేంతగా వాళ్ల బానిస జీవితాలకి తోడ్పడ్డాడు. హిట్లర్ కొనసాగించిన యూదుల మారణ హోమంలో లక్షల మంది యూదులు ప్రాణాలు కోల్పోయారు. అలాటి వాళ్ళని ఓ 11 వందలమందిని షిండ్లర్  కాపాడితే అదేమంత గొప్ప విషయంగా కన్పించక పోవచ్చు.  కానీ యూదు జాతికి అంటూ మిగిలిన ఆ 11 వందల మందే తర్వాతి కాలంలో ఆరు వేలమంది సంతానాన్ని  కనీ జాతిని వృద్ధి చేసుకున్నారు. దీనికి కారకుడైన  షిండ్లర్,   11 వందల మందిని  ప్రాణాలతో సజీవంగా ఉంచడానికి తన ప్రాణాలని సైతం అడ్డేయడమే గాకుండా, తన సర్వస్వమూ ధారపోశాడు. సంపదనంతా  ఖర్చు పెట్టేశాడు.

         1983 లో థామస్ కెల్లీ అనే ఆస్ట్రేలియన్ రచయిత షిండ్లర్స్ ఆర్క్అనే నవల రాశాడు. నాటి మారణహోమానికి ప్రత్యక్ష సాక్షులైన యూదుల కథనాలు ఆధారంగా ఆ నవల రాశాడు. అది స్పీల్ బెర్గ్ దృష్టిని ఆకర్షించింది. అప్పుడే దాన్ని చలన చిత్రంగా నిర్మిం చాలని నిర్ణయించుకున్నాడు.

          ఇక్కడ విశేష మేమిటంటే,  స్పీల్ బెర్గ్ కూడా యూదు జాతీయుడే. 1947 లో అమెరికాలో పుట్టి పెరిగాడు గానీ తన మూలాల్ని మర్చిపోయాడు. ఆ నవల తన అస్తిత్వాన్ని
, చేపట్టాల్సిన మహాత్కార్యాన్నీ గుర్తు చేసింది. అయితే 1993 లో గానీ ఇది సాధ్యం కాలేదు.

షిండ్లర్స్ స్టోరీ

క్లోజప్ లో రెండుచేతులు  ఒక కొవ్వొత్తిని వెలిగించడాన్ని చూపుతూ సినిమా ప్రారంభమవుతుంది. మతాచారం ప్రకారం సబ్బాత్ ( విశ్రాంతి సమయం) నాడు వెలిగించే కొవ్వొత్తిని సబ్బాత్ కొవ్వొత్తి అంటారు. ఈ ప్రారంభ దృశ్యం సినిమాలో వున్న కొద్ది పాటి కలర్ సీన్లలో ఒకటి. ఆ కొవ్వొత్తి ఆరిపోయి సన్నటి పొగ కెరటం దూసుకు పోతుంది. డిజాల్వ్ అయి ఆ పొగ కెరటం తర్వాతి సీనుకి మారుతుంది. అక్కడ రైలింజను పొగలో సూపర్ ఇంపోజ్  అవుతుంది. ఇది తెలుపు- నలుపు దృశ్యం. అది క్రాకోవ్ రైల్వే స్టేషన్. ప్లాట్ ఫాం మీద ఒక ఫోల్దింగ్ టేబుల్ దగ్గర ఒక యూదు కుటుంబం తమ వివారాలు నమోదు చేయించుకుంటారు. ఆ ఒక్క టేబుల్ మరిన్ని టేబుళ్లు గా, అసంఖ్యాకమైన టేబుళ్లు గా మారిపోతాయి..ఆ ఒక్క యూదు కుటుంబం అనేక యూదు కుటుంబాలుగా, అసంఖ్యాక యూదు కుటుంబాలుగా దృశ్యం కడతాయి..అంటే భారీ ఎత్తున యూదు కుటుంబాల్ని ఇక్కడి మురికి వాడల్లో కుక్కడానికి నాజీలు తరలిస్తున్నారన్న మాట.

          ఒక హోటల్ రూమ్ లో ఆస్కార్ షిండ్లర్ ఓపెనవుతాడు. అతడి ముఖం కనపడదు. వస్తువులు కనబడుతూంటాయి. ఖరీదైన వాచీ ధరిస్తాడు. షర్ట్ కఫ్ లింక్స్ పెట్టుకుంటాడు. కోటు కి నాజీ పార్టీ గుర్తుగల పిన్ పెట్టుకుంటాడు. టేబుల్ సొరుగు లోంచి గుప్పెడు కరెన్సీ నోట్లు తీస్తాడు. నైట్ క్లబ్ లోకి ఎంటర్ అవుతాడు. అక్కడ ఒక టేబుల్ దగ్గర కూర్చుని వున్న నాజీ ఉన్నతాధికారిని చూసి
, అతడి దగ్గరికి ఖరీదైన డ్రింకూ, ఫుడ్డూ పంపిస్తాడు. అధికారుల్ని మంచి చేసుకుని లంచాలతో మేపి యుద్ధ పనుల కాంట్రాక్టుల్ని కొట్టేయడం షిండ్లర్ నిత్య కార్యక్రమం. చూస్తూండగానే ఈ సీను గుంపుగా చేరిన  నాజీ అధికార్లకి షిండ్లర్ బ్రహ్మాండమైన పార్టీ నిచ్చే మాస్టర్  సీనుగా మారిపోతుంది. వాళ్లతో ఫోటోలు కూడా దిగుతాడు.

తర్వాత షిండ్లర్  యూదుల క్యాంపుకి వెళ్తాడు. అంతులేని బారులు తీరి  నించున్న ఆ యూదుల్ని చూసుకుంటూ అక్కడున్న తన ఎక్కౌంటెంట్ ఐజాక్ స్టెన్ ని కలుసుకుంటాడు. తను పెట్టబోతున్న ఎనామిల్ వంట సామగ్రి ఫ్యాక్టరీకి పెట్టుబడిదార్లుగా కొందరు యూదులు కావాలని అంటాడు. ఆ ఫ్యాక్టరీని ఐజాకే నడిపేందుకు ఆఫరిస్తాడు. యూదులు వ్యాపారాలు చేయడానికి వీల్లేదు గాబట్టి వాళ్ళు తమ శ్రమని పెట్టుబడిగా పెట్టాలి. వాళ్లకి ఉత్పత్తుల రూపం లో తను  చెల్లింపులు చేస్తాడు.అక్కడ్నించీ ఒక చర్చికి వెళ్తాడు. అక్కడ యూదు స్మగ్లర్లు స్మగ్లింగ్ కార్యాకలాపాలు సాగిస్తూంటారు. పాడ్లాక్ అనే స్మగ్లర్ దగ్గరికి వెళ్లి,  రానున్న రోజుల్లో తనకి విలాసవంతమైన వస్తుఫులు సరఫరా చేయాలనీ కోరతాడు.
  మార్చి 20, 1941 అని అక్షరాలూ పడతాయి. సమూహం గా యూదుల్ని మురికి వాడల్లోకి తీసుకుపోతున్న దృశ్యం. షిండ్లర్ తన ఖరీదైన ఫ్లాట్ కొస్తాడు. ఆ ఫ్లాట్ యూదు కుటుంబానిది. ఆ యూదు కుటుంబాన్ని అవతలి దృశంలో  నాజీలు మురికి వాడ  వైపుకు నడిపిస్తూంటారు.

         
ఇక షిండ్లర్, ఎక్కౌంటెంట్  ఇజాక్ సహాయంతో ఎనామిల్ ఫ్యాక్టరీ పెడతాడు. అక్కడి యూదు కార్మికులకి  ఎస్సెన్షియల్స్అనే గుర్తిపుని నాజీల నుంచి సాధిస్తాడు. అంటే వాళ్ళని ఇక డెత్ క్యాంపు లకి తరలించడం నుంచి మినహాయింపు లభించిందన్న  మాట.  ఈ అవకాశంతో వీలైనంత ఎక్కువ మంది యూదుల్ని తీసుకొచ్చి ఫ్యాక్టరీ ని నింపేస్తాడు ఐజాక్.
          ఒక చోట లేబర్ క్యాంప్ నిర్మాణం ప్రారంభమవుతుంది. నాజీ కర్కోటకుడు అమోన్ గోలియెత్ ఆ పనులు చూస్తూంటాడు. దీని నిర్మాణం పూర్తయ్యాక క్రాకోవ్ మురికి వాడల్లో కుక్కిన యూదుల్ని ఇక్కడికి తరలించి చంపుతారన్న మాట. ఈ దృశ్యాన్ని షిండ్లర్ తన గర్ల్ ఫ్రెండ్ తో దూరం నుంచి చూస్తూంటాడు. యూదుల సమూహం తో నడుస్తున్న ఒక చిన్న పాపని చూసి గర్ల్ ఫ్రెండ్ కన్నీళ్లు పెట్టుకుంటుంది. షిండ్లర్  అమోన్ దగ్గరికి వచ్చి- తన ఫ్యాక్టరీలో యూదు కార్మికుల కోసం ఒక సబ్ క్యాంపు  నిర్మించుకోవడానికి ఒప్పిస్తాడు.


         షిండ్లర్ కి యూదు కార్మికులని ఉపయోగించుకుని ఫ్యాక్టరీ  ద్వారా బాగా డబ్బు గడించాలన్నదే ఆశయం. ఏం చేసినా ఈ దృష్టితోనే చేస్తూంటాడు. అయితే ఇందాక యూదు సమూహంతో నడుస్తున్న చిన్నపాప  దృశ్యం అతడికి ఎక్కడో కలుక్కు మన్పిస్తూనే వుంటుంది.
        రెజీనా అనే మరొక చిన్న పాప షిండ్లర్ దగ్గరికి వచ్చి,  తన తల్లి దండ్రుల్ని ఫ్యాక్టరీ లో చేర్చుకొమ్మనీ, లేకపోతే  వాళ్ళని కూడా నాజీలు పట్టుకు పోతారనీ ఏడుస్తుంది. ఆమెని కోప్పడి వెళ్ళ  గొట్టేస్తాడు. అడ్డంగా యూదుల్ని కాపాడేందుకు తను  ఫ్యాక్టరీ పెట్టాడా ఏమిటీ అని ఐజాక్ మీద అరుస్తాడు. మళ్ళీ  శాంతించి ఆలోచిస్తాడు. తన బంగారపు వాచీని ఐజాక్ కి ఇచ్చేసి, ఆ పాప తల్లిదండ్రుల్ని తీసుకు రమ్మంటాడు. ఇక్కడ్నించీ షిండ్లర్ యూదుల్ని కాపాడడం పైనే  దృష్టి పెడతాడు. తన దగ్గరున్న డబ్బుతో బాటు ఖరీదైన వస్తువులూ ఖర్చులకి ఐజాక్ కి ఇచ్చేస్తూ,  వీలైనంత మంది యూదు బాధితుల్ని ఫ్యాక్టరీకి కి తరలించ మంటాడు.


       కొంత కాలం గడుస్తుంది. శాడిస్ట్ అమోస్ పదివేల మంది యూదుల్ని ఊచకోత కోస్తాడు.  షిండ్లర్ తన యూదు వర్కర్లకి  ప్రమాదాన్ని శంకిస్తాడు. ఫ్యాక్టరీ లోనే కాక బయట వున్న యూదుల్నీ కాపాడేందుకు ఇక  నడుం కడతాడు. ఒక లిస్టు తయారు చేస్తాడు. అమోస్ దగ్గరికి వెళ్లి యూదుల్ని తనకి అమ్మాలని కోరతాడు. అమోస్ దగ్గరున్న యూదు పని మనిషి హెలెన్ ని కూడా తనకి అమ్మేసేందుకు ఒప్పిస్తాడు. వీళ్ళందరూ చెకెస్లోవేకియాలో వున్న తన ఫ్యాక్టరీలో పనిచేసిందుకు అవసరమని నమ్మిస్తాడు. రెండు రైళ్లల్లో  యూదుల్ని చెకెస్లోవేకియాకి తరలిస్తున్నప్పుడు, ఒక చోట స్త్రీలున్న రైలుని  దారి మళ్ళించి నాజీలు మళ్ళీ షిండ్లర్ కి బేరం పె డతారు. వాళ్ళని మళ్ళీ కొనుక్కుంటాడు షిండ్లర్.  వాళ్ళందర్నీ  చెకెస్లోవేకియాలో తన ఫ్యాక్టరీ కి తరలిస్తాడు. ఇక యుద్ధం ముగిసే దాకా వాళ్ళు అక్కడే క్షేమంగా వుంటారు.
          యుద్ధం ముగిశాక,  మీకిక స్వేచ్చ లభించింది పొమ్మని  ప్రకటిస్తాడు షిండ్లర్.  అయితే యుద్ధ  నేరస్తుడిగా తను పట్టుబడే అవకాశం ఉన్నందున  ఈ అర్ధరాత్రి పారిపోతాననీ అంటాడు. విషణ్ణ వదనాలతో వాళ్ళందరూ ఒక బంగారపుటుంగరాన్ని అతడికి బహూకరిస్తారు. దాని మీద – ‘ఎవరైతే ఒక్క ప్రాణాన్ని కాపాతారో వారు మొత్తం ప్రపంచాన్ని కాపాడినట్టే’  అన్న  అక్షరాలు  చెక్కి వుంటాయి. షిండ్లర్  బాగా ఏడ్చేస్తాడు. తను ఇంకా ఎక్కువ మందిని రక్షించి వుండాల్సిందని విపరీతంగా బాధ పడతాడు. ఆ తర్వాత  భార్యని తీసుకుని  పారిపోతాడు. 


       మర్నాటి ఉదయంయూదుల దగ్గరికి రష్యన్ సైనికుడు  వచ్చి- మీరందరూ ఇక స్వేచ్చా జీవులని ప్రకటిస్తాడు. యూదులందరూ కోలాహలంగా సమీప పట్టణానికి తరలి పోతూంటారు. ఈ సీను డిజాల్వ్  అయి యూదులందరూ ఒక సమాధి దగ్గర నివాళులర్పిస్తూ వుంటారు. ఆ సమాధి అఖండ మానవతా వాది ఆస్కార్ షిండ్లర్ దే!
 నటనలు అమోఘం 

‘షిండ్లర్స్ లిస్ట్’  సమయంలో స్టీవెన్ స్పీల్ బెర్గ్
     హృదయాల్ని కెలికేసే ఈ మానవ చరిత్రలోని ఒక చీకటి అధ్యాయం ఇంకే దేశపు నియంతా ఇలాటి దారుణానికి పాల్పడకూడదన్న అంతర్లీన  సందేశం తో వుంటుంది. ఒక యూదు జాతీయుడుగా స్పీల్ బెర్గ్  విజన్  ని ఇది అపూర్వ స్థాయికి తీసుకు వెళ్ళింది. ముఖ్యంగా ఇందులో నటీనటుల నుంచి రాబట్టుకున్న నటనలు ప్రత్యేకమైనవి. ప్రధాన పాత్ర షిండ్లర్ ని పోషించిన నటుడు లియాం నీసన్ అయితే నిజజీవిత షిండ్లర్ ని ఆవాహన చేసుకున్నట్టే నటిస్తేఎక్కౌంటెంట్ గా నటించిన బెన్ కింగ్స్ లే చాలా నిగ్రహం తో కూడుకున్న నటనని కనబరుస్తాడు. ఈయన మరెవరో కాదుసర్ రిచర్డ్ అటెన్ బరో తీసిన ఆజరామరమైన గాంధీ’ లో మహాత్మా గాంధీ పాత్ర పోషించి జేజేలందుకున్న మేటి నటుడు. ఇక నాజీ అమోన్ గా శాడిస్టు పాత్రలో రాల్ఫ్ ఫిన్నెస్షిండ్లర్  భార్యగా ఎమిలీ గూడాల్ తదితరులు ఆయా సన్నివేశాల్ని రక్తికట్టిస్తారు.
         స్పీల్ బెర్గ్  ఈ చీకటి చరిత్రకి  చిత్రణ తెలుపు నలుపులో వుంటేనే ప్రభావ శీలంగా ఉంటుందని భావించి, అదికూడా డాక్యుమెంటరీ విధానంలో చిత్రీ కరించాడు. నలభై శాతం సినిమాని హేండ్ హెల్డ్ కెమేరాతో చిత్రీ కరించాడు ఛాయా గ్రహకుడు జానస్ కామిన్ స్కీ.  క్రాకోవ్ లోని నిజ లొకేషన్ లలోనే   73 రోజుల్లో షూటింగ్ పూర్తి చేశారు. జాన్ విలియమ్స్ సంగీతం ఈ క్లాసిక్ కి మరో ఎస్సెట్ అనవచ్చు. స్పెల్ బెర్గ్ ఈ సినిమా కి కమర్షియల్  గా అంత  సక్సెస్ ఉండదని భావించి, బడ్జెట్ ని బాగా కుదించి కేవలం 22 మిలియన్ డాలర్లతో నిర్మిస్తే, విడుదలయ్యాక  ఇది కళ్ళు చెదిరే విధంగా ప్రపంచవ్యాప్తంగా 321 మిలియన్ డాలర్లు వసూలు చేసింది!
         ఐతే ఇంత  లాభం గడించినా స్పీల్ బెర్గ్ ఒక్క డాలర్  కూడా పారితోషికంగా తీసుకోలేదు. అలా తీసుకోవడం ఆ నెత్తుటి డబ్బు తీసుకోవడమేనని తిరస్కరించి, ఒక ఫౌండేషన్ కి విరాళంగా ఇచ్చాడు.
        స్పీల్ బెర్గ్ షూటింగ్ పూర్తి చేశాక విఖ్యాత సంగీత దర్శకుడు జాన్ విలియమ్స్ కి చూపిస్తే  ఆయన కదిలిపోయి మాట రాక బయటికి వెళ్ళిపోయాడు. చాలా సేపటికి తిరిగివచ్చి, ఈ మహోజ్వల  సృష్టికి  తన కంటే ఉత్తమమైన సంగీత దర్శకుణ్ణి  ఎంపిక చేసుకోవాల్సిందిగా  కోరాడు. వాళ్ళందరూ చనిపోయారని స్పీల్ బెర్గ్ చెప్పాడు.


అవార్డుల సంరంభం!        
         క 1993 ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో పెద్ద రికార్డుల్నే సృష్టించింది షిండ్లర్స్ లిస్ట్.  ఆస్కార్ ఉత్తమ చలన చిత్రం ఆవార్డు మాత్రమే గాక, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ స్క్రీన్ ప్లే, ఉత్తమ సంగీతం, ఉత్తమ ఎడిటింగ్, ఉత్తమ ఛాయాగ్రణం, ఉత్తమ కళా దర్శకత్వంలకీ  పురస్కారాలు అందుకుంది.  ఉత్తమ నటుడుగా లియాం నీసన్ కి నామినేషన్ మాత్రం దక్కింది.   

-సికిందర్





26, డిసెంబర్ 2015, శనివారం

తారుమారు!!




దర్శకత్వం : జి. శ్రీనివాస రెడ్డి

తారాగణం : అల్లరి నరేష్, మోహన్ బాబు, పూర్ణ, మీనా, రమ్యకృష్ణ, వరుణ్ సందేశ్, అలీ, జీవా, కృష్ణ భగవాన్, రఘుబాబు, రాజా రవీంద్ర, సురేఖా వాని తదితరులు 
సంగీతం : కోటి, రఘు కుంచె, అచ్చు , ఛాయాగ్రహణం : బాలమురుగన్
బ్యానర్ : 24 ఫ్రేమ్స్ ఫిలిం ఫ్యాక్టరీ
నిర్మాత : విష్ణు మంచు
విడుదల : 25 డిసెంబర్, 2015
***
        కుటుంబ కథా చిత్రాల పేరుతో ఇవ్వాళ్ళ వస్తున్న సినిమాలు అయితే రాక్షస కుటుంబాల కథలుగా, కాకపోతే 1990 లనాటి పాత వాసన కథలుగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇటీవలే లోఫర్, సౌఖ్యం వంటి నరుక్కునే రాక్షస కుటుంబాల ‘ఫ్యామిలీ సినిమా’లు మళ్ళీ మళ్ళీ  ప్రేక్షకులు చూశాక, ఈసారి ‘మామ మంచు- అల్లుడు కంచు’ పేరుతో  1990 ల నాటి ‘ఫ్యామిలీ కామెడీ’ని వడ్డించేందుకు సిద్ధమయ్యారు దర్శకుడు జి. శ్రీనివాస రెడ్డి. ఇందుకు మోహన్ బాబు- అల్లరి నరేష్ లతోబాటు,  నాటి హీరోయిన్లు మీనా- రమ్యకృష్ణ లతో కలర్ ఫుల్ గా  కాంబినేషన్లు సెట్ చేసుకున్నారు. అయితే ఎంత కలర్ ఫుల్ గా సినిమా తీర్చిదిద్దారన్న కుతూహలం ఈ సినిమాకిచ్చిన పబ్లిసిటీతో ప్రేక్షకులకి ఏర్పడుతుంది. అలాటి  కుతూహలాన్ని శ్రీనివాస రెడ్డి ఎలా తీర్చారు, అసలు తీర్చాలా లేదా తెలుసుకోవాలని మనకి వుంటుంది. ఆ ప్రయత్నం చేద్దాం...

స్టోరీ @ 1990
        బిజినెస్ మాన్ భక్తవత్సలం నాయుడు (మోహన్ బాబు) కి ఇద్దరు భార్యలు. ఒక భార్య సూర్య కాంతం (మీనా) భర్తని  ‘బాయ్యా’ (బావయ్యా కి షార్ట్ ఫాం) అని ప్రేమగా పిలుస్తూ కూకట్ పల్లిలో వుంటుంది. ఇంకోభార్య ప్రియంవద ( రమ్యకృష్ణ) భర్తకి కడుపునిండా తిండి పెడుతూ జూబ్లీ హిల్స్ లో వుంటుంది. ఆమెకి శృతీ నాయుడు ( పూర్ణ) అనే కూతురుంటుంది, ఈమెకి గౌతమ్ నాయుడు ( వరుణ్ సందేశ్) అనే కొడుకుంటాడు. ఇలా ఇద్దరు భార్యల్నీ సపరేట్ గా వుంచి వాళ్లకి తెలీకుండా సీక్రెట్ గా మెయింటెయిన్ చేస్తూంటాడు భక్తవత్సలం. ఖర్మకాలి ఓనాడు ఆ శృతీ- ఈ గౌతమ్ లు లవ్ లో పడతారు. భక్తవత్సలం కొంపలంటుకుంటాయి. పిక్చర్లోకి బాలరాజు ( నరేష్) ఎంటరవుతాడు. భక్తవత్సలం ఇచ్చిన ప్లాను పట్టుకుని శృతి దృష్టిని  గౌతమ్ మీంచి మళ్ళించడానికి పూనుకుంటాడు. ఖర్మకాలి శృతితో తనే లవ్ లో పడతాడు. మళ్ళీ భక్తవత్సలం కొంపలంటుకుంటాయి. స్నేహితుడు ఇస్మాయిల్ (అలీ) ఎంటరవుతాడు. ఇక ఇటు భార్యనీ, అటు భార్యనీ, ఇటు కూతుర్నీ అటు కొడుకునీ కన్ఫ్యూజ్ చేసి పరిస్థితిని చక్కబెట్టేందుకు రంగంలోకి దూకుతారు. మధ్యలో తన కూతురు ప్రేమిస్తున్న బాలరాజుని అవుట్ చేసేందుకు భక్తవత్సలం ఎత్తుగడలతో... భక్తవత్సలంని తిప్పికొట్టేందుకు అతడి  ఫ్యామిలీ సీక్రెట్స్ తెలిసిపోతాయి బాలరాజుకి. ఇక తను ఆడుకోవడం మొదలెడతాడు..

        అసలు భక్తవత్సలం ఎందుకు ఇద్దర్నీ పెళ్ళిచేసుకున్నాడు, ఆ నిజమేమిటి, అది తెలుసుకున్న బాలరాజు భక్తవ్సలం ఫ్యామిలీ సమస్యనీ, తన లవ్ సమస్యనీ ఎలా తీర్చుకున్నాడు,  చివరికి భార్యలతో భక్తవత్సలంకి సుఖాంతమయిందా, దుఖాంతమయిందా తెలుసుకోవాలంటే ఈ ఫ్యామిలీ కామెడీ- డ్రామా పూర్తిగా చూడాల్సిందే- 1990 స్టయిల్లో. 

ఎవరెలా చేశారు
       
నిజానికి మోహన్ బాబు దారి తప్పి ఈ సినిమాలో నటించారు గానీ, లేకపోతే ఇప్పటికీ  చెక్కుచెదరని ఫిజిక్ తో, యాక్టింగ్ లో టైమింగ్ తో, డైలాగ్ డెలివరీతో వేరే పవర్ఫుల్ సినిమా ఏదైనా చేసివుంటే 181 వ సినిమా ధన్యమయ్యేది. ప్రస్తుత సినిమాలో ప్రధాన కథ తనదే, అల్లరి నరేష్ ది కాదు. అల్లరి నరేష్ ది తోడ్పడే పాత్ర మాత్రమే. ఇది బాగా మైనస్ అయింది యూత్ అప్పీల్ కి. పూర్తిగా మోహన్ బాబు సినిమానే అన్నట్టు తయారవడంతో యువ ప్రేక్షకులు ఫస్టాఫ్ లోనే, కొందరు ఇంటర్వెల్లోనే వెళ్ళిపోతున్న దృశ్యాలు మనం చూస్తాం. అల్లరి నరేష్ మెయిన్ రోల్ దక్కే కథలో మోహన్ బాబు సపోర్టింగ్ రోల్ వేయాల్సిన లెక్కలు తారుమారయ్యాయి. దీంతో మోహన్ బాబు ఈ పాత్రలో ఎంత బాగా చేసినా, నవ్వించినా  బూడిదలో పోసిన పన్నీరే  అయింది. నరేష్ సంగతి చెప్పక్కర్లేదు. తను ఎప్పటినుంచో ప్లాన్ చేసుకుంటున్న 50 వ సినిమా కూడా ప్లస్ కాని పరిస్థితి.

        హీరోయిన్ పూర్ణ ఎంతసేపూ చిరునవ్వుతో చూడ్డం తప్ప ఇంకేమీ చేయదు. సీనియర్ హీరోయిన్ లిద్దరూ వాళ్ళ టాలెంట్ బాగానే చూపించుకున్నా,  ఇదీ మోహన్ బాబు పాత్రకి లాగే యూత్ అప్పీల్ కి నప్పలేదు. హీరోకి కత్తి లాంటి ఇద్దరు యువ హీరోయిన్లు, సీనియర్ హీరోకి ఒక సీనియర్ హీరోయినూ వుండి రక్తి కట్టించాల్సిన కామెడీ  ఇది. అంటే అల్లరి నరేష్ కే ఇద్దరు భార్యలుండాల్సిన ట్రెండీ కామెడీ, కాంబినేషన్లు తారుమారై కాలం చెల్లిన రూపాన్ని సంతరించుకుంది.
        అలీకి సినిమా ఆసాంతమూ చిక్కుల్ని పరిష్కరించే పాత్రదక్కింది. పాత్రకి ఆడపిచ్చి అతి గా మారింది. ఇతరపాత్రల్లో మిగిలిన నటీనటులు- వరుణ్ సందేశ్ సహా సోసోగా నటించేశారు.

        టెక్నికల్ గా, సంగీత సాహిత్యాల పరంగా చెప్పుకోవడానికేమీ లేదు.

చివరికేమిటి?
        ర్శకుడు ఈ సినిమాతో ప్రేక్షకుల కుతూహలం తీరుస్తున్నాననుకుంటూ నీరుగార్చాడు. ఉత్త డైలాగుల మోతతో సినిమా అంతా కామెడీగా నడుపుదామనుకోవడంలో కూడా వెనకబాటు తనమే కనిపిస్తోంది. టేకింగ్ కూడా పాత సినిమా శైలిలో వుంది. ఆఫ్ కోర్స్, ఈ డైలాగుల మోతతోనే కొన్ని చోట్ల బాగా నవ్వొచ్చేట్టు  సీన్లు తీసిన మాట నిజమే. ఇలాగైనా వీలైనన్ని చోట్లా సీన్లు స్టాండప్ కామెడీగా తీసివుండాల్సింది. ఇక మోహన్ బాబు పాత్ర రెండు పెళ్ళిళ్ళు చేసుకోవాల్సిన అగత్యం గురించి తెలిపే ఫ్లాష్ బ్యాక్ విషయంలో కూడా అలసత్వమే కనబరచాడు దర్శకుడు. మోహన్ బాబు- మీనా- రమ్య కృష్ణలు ఆనాడు నటించిన ‘అల్లరిమోగుడు’ దృశ్యాల్లోంచే క్లిప్పింగ్స్ తీసి ఫ్లాష్ బ్యాక్ గా వేశారు. ముందు పెళ్లి చేసుకున్న భార్యగా మీనా పాత్ర వుండగా, రెండో పెళ్లి ఆమెకి తెలీకుండా రమ్యకృష్ణ పాత్రని ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందో చెప్పిన  కారణాన్ని  ‘ జీవిత చక్రం’ లోంచి ఎత్తేశారు. నందమూరి తారకరామారావు నటించిన ‘జీవిత చక్రం’ లో కమల (శారద) జబ్బుతో మరణం ఖాయమైపోయిన స్థితిలో చివరి కోరిక కోరుతుంది. రాజా (ఎన్టీఆర్) చేత తాళి కట్టించుకుని తృప్తిగా కన్ను మూయాలని. రాజా ఆమె కోరిక తీరుస్తాడు. ఆ తర్వాతే కథ అడ్డం తిరుగుతుంది- కమల బతికి బాగుపడుతుంది! కలవర పడిపోతుంది. చివరి కోరిక తీర్చుకుని చచ్చి ఈ లోకం లోంచి వెళ్ళిపోవాల్సిన తనే,  ఇలా సుశీల (వాణిశ్రీ) కి కి అడ్డు అయ్యిందేమిటి? రాజాకీ ఏమీ తోచని స్థితి! ఇదీ ట్విస్టు.

ఈ ట్విస్టే పెట్టి  ఫ్లాష్ బ్యాక్ చెప్పారు దర్శకుడు శ్రీనివాస రెడ్డి. ఆనాడు దర్శకుడు, గొప్ప కథా రచయిత సిఎస్ రావు పెట్టిన ఈ ట్విస్టు గొప్ప సంచలనమైతే ...ఈనాడు..???


-సికిందర్