తారాగణం : అల్లరి నరేష్, ఈషా, శ్రీనివాస్ అవసరాల,
సంపూర్ణేష్ బాబు, తనికెళ్ల భరణి, రావు రమేష్, చంద్రమోహన్, పోసాని కృష్ణమురళి, శుభలేఖ సుధాకర్, సప్తగిరి, సాయాజీ షిండే
కెమెరా: పి.జి. విందా,
సంగీతం : కళ్యాణి కోడూరి, ఎడిటింగ్: ధర్మేంద్ర కాకరాల
బ్యానర్ : ఈవీవీ సినిమా
నిర్మాత: రాజేష్ ఈదర
విడుదల : 20, పిబ్రవరి 2015, సెన్సార్
U/A
***
అల్లరి నరేష్ అల్లరి అంతా నానాటికీ అల్లరై
పోతోంది. నవ్వుమీద తనకు తాను జీవితకాల నిషేధమేదో విధించుకున్నట్టు, నవ్వించగల డైరెక్టర్లని పక్కన పెట్టేసి, రెగ్యులర్ దర్శకుల్నీ, వాళ్ళలోనూ క్లాస్
టచ్ గల సీరియస్ దర్శకుల్నీ ఏరికోరి మరీ,
వెరైటీ పేరుతో ప్రోత్సహిస్తూ, తను కొవ్వొత్తిలా కరిగిపోతూ చాలా త్యాగం
చేసుకుంటున్నాడు సొంత కెరీర్ని. వరుసగా పదకొండో సినిమా కూడా సక్సెస్ కాకుండా
చూసుకోవడానికి కంకణం కట్టుకున్నట్టు - కుండపోత కామెడీకి నిండుకుండ లాంటి దివంగత తండ్రి
ఈవీవీ సత్యనారాయణ సొంత బ్యానర్ ‘ఈవీవీ సినిమా’ ద్వారా శుభమా అంటూ నిర్మించిన ఈ
తొలి సినిమానూ త్యాగాల బాట పట్టించడమే కామెడీ యేమో! ‘అంతా నీ కోసం అందుకే ఈ
వేషం చీకటిలో ఏదో కన్నాను’- అని
ఎన్టీఆర్ ‘బందిపోటు’ లో పాటలాగా, వేషభాషలు మార్చి, ‘అంతా మీకోసం అందుకే ఈ
క్లాస్ వేషం పనికొస్తాను పెట్టుకోండిక క్లాస్ హీరోగా’ – అంటూ ప్రమోట్
చేసుకోవడానికి పనికొచ్చే సినిమా తీసినట్టయ్యింది చివరికి –ఇదింకా కామెడీ!
దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి, ఈసారి
అల్లరి నరేష్ లాంటి ఏకైక టాప్ మాస్ కామెడీ హీరోతో నైనా తను తీసే కథా కథనాల
స్థాయిని పై లెవెల్ కి తీసుకుపోతాడేమో అని మనం ఆశగా ఎదురుచూడ్డం కూడా, కామెడీ
అయిపోవడం డబుల్ ఐరనీ ఇక్కడ.
తను సున్నిత హాస్యం పలికించే కోవకి
చెందిన దర్శకుడైనప్పుడు- దానికి కమిటై వుండాల్సింది. హిందీలో ‘రంగీలా’, ‘ఎస్
బాస్’, ‘దౌడ్’ ఫేమ్ రచయిత సంజయ్ చెల్ దర్శకుడుగా మారి, ఏకంగా సంజయ్ దత్ లాంటి హీమాన్ తో ‘ఖూబ్ సూరత్’
(1999) లాంటి సున్నిత హాస్య భరిత చలనచిత్రాన్ని ఎలా విజయవంతంగా తీయగాలిగాడో తెలుసుకోగలిగితే-
ఈ జానర్ నిర్వచనం తెలుస్తుంది. న్యూయార్క్ లో స్క్రీన్ ప్లే కోర్సు చేసిన
ఇంద్రగంటికి తానిప్పుడు తలపోసిన సినిమా కథ జానరేమిటో తెలిసే వుంటే- ఇదిలా ఎందుకు
ఎటూ కాని కిచిడీ అయ్యిందో ఆలోచించాల్సిన అవసరముంది.
జానర్ జడ్జిమెంటులో స్పష్టత
కొరవడ్డం ఈ ‘బందిపోటు’ కి పడ్డ ఓ అన్యాయపు శిక్ష!
బందిపోటా- బురిడీ మాస్టరా?
దొరల వేషంలో వుండే
దొంగల్ని దెబ్బతీయడమే వృత్తి గా పెట్టుకున్న విశ్వ( అల్లరి నరేష్) ఒకసారి
అలా కొందర్ని బకరాల్ని చేస్తూ జాహ్నవి
(ఈషా) అనే అమ్మాయి కెమెరాకి చిక్కుతాడు.
ఆమె బ్లాక్ మెయిల్ చేస్తుంది. ఓ ముగ్గుర్ని బకరా గాళ్ళని చేసి ఆటాడుకోవాలని అంటుంది.
ఈ ముగ్గురూ మకరందరావు ( తనికెళ్ళ భరణి), శేషగిరి (రావు రమేష్), భలే బాబు (పోసాని
కృష్ణ మురళి) లు తన తండ్రిని మోసం చేసిన పెద్దమనుషులు. వీళ్ళ ఫైనాన్స్ కంపెనీలో
పని చేసిన తన తండ్రి సత్యనారాయణ ( శుభలేఖ
సుధాకర్) వీళ్ళు ప్రజల్ని మోసం చేస్తున్న తీరుకి
తిరగబడితే, కుట్ర చేసి జైలుకి పంపారనీ; దీంతో తన తల్లి గుండె పోటుతో చనిపోయిందనీ;
పదేళ్ళు శిక్ష అనుభవించి పక్షపాతంతో తండ్రి విడుదలై వచ్చాడనీ; ఇప్పుడా ఘరానా పెద్దమనుషుల
మీద ప్రతీకారం తీర్చుకోవాలనీ అంటుందామె.
విశ్వ ఒప్పుకుని ఒక్కొక్కర్నీ ఒక్కో
విధంగా బకరాలు చేయడం మొదలెడతాడు. ముగ్గుర్నీ
బకారాల్ని చేశాక్ జాహ్నవి మెప్పునీ ప్రేమనూ పొందుతాడు. ఇదీ కథ!
ఎవరెలా చేశారు
నరేష్ కిదో కష్టమైన పాత్రేం కాదు. కాస్ట్యూమ్స్ తో, బాడీ లాంగ్వేజ్ తో క్లాస్
గా కన్పిస్తూ అదికూడా పాత్రలో తగిన డెప్త్, ఎమోషన్ లేకపోవడంతో తక్కువ శ్రమతో నటించి
సరిపుచ్చుకున్నాడు. ఇదే తన మార్కు వూర కామెడీ అయ్యుంటే చాలా పనుండేది తన టాలెంట్
తో. ప్రేక్షకులు తననుంచి ఆశించేది వూర కామెడీనే. బాపు తీసిన ‘సుందర కాండ’ తో, కె.
విశ్వనాథ్ తీసిన ‘శుభప్రదం’ తో ఏం
జరిగాయి? ఇప్పుడూ అంతకి మించి ఏమీ జరగదు. స్కూల్స్ పరంగా తూర్పు పడమరల్లాంటి
ఇంద్రగంటీ నరేష్ ల కాంబినేషన్ సహజంగానే అతకలేదు. ఇమేజి మేకోవర్ అంటే క్యారక్టర్ మేకోవర్ అని కూడా
అర్ధం జేసుకోక పోవడం వల్ల ఇద్దరూ అభాసు అయ్యారు. క్యారక్టర్ మేకోవర్ అవసరాన్ని
గుర్తించి వుంటే, క్లాస్ ఇమేజి మేకోవర్ కి సూటయ్యే క్లాస్ కామెడీయైనా ప్రేక్షకులకి
మహాద్భాగ్యంగా దక్కేది. క్యారక్టర్ మేకోవర్ ని కూడా గుర్తించి వుంటే, కథ కూడా కిచిడీ
జానర్ తో కాకుండా, సజాతి జానర్లతో ఏక సూత్రతతో సూటిగా హృదయాల్ని తాకేది. దీని
గురించి వివరంగా కింది పేరాల్లో తర్వాత చూద్దాం.
హీరోయిన్ ఈషాకి పెద్దగా పాత్రే లేదు. కానీ ఆమె ఎంట్రీలో
‘బందిపోటి’ అని పెద్ద బిల్డప్పిస్తూ లెటర్స్ వేసి ప్రేక్షకులకి ఆ పాత్ర పట్ల ఎక్స్
పెక్టేషన్స్ పెంచేసి, ఆనక ఉస్సూరన్పించడమే జరిగింది. తన దృష్టిలో హీరో ఏదో ఒక ‘అద్భుతం’
చేయగానే, కొత్త కాస్ట్యూమ్స్ పట్టుకుని
పాటకోసం రెడీగా వుండడమే ఈమె ‘బందిపోటీ’ తనపు డ్యూటీ అయ్యింది.
దర్శకుడు, నటుడు శ్రీనివాస్ అవసరాల
తనికెళ్ళ అనుచరుడిగా ఉత్తుత్తి తెగ బిజీ పాత్రలో ఏదో జరిగిపోతోందన్నట్టు హడావిడి
చేస్తాడు.
తనికెళ్ళ భరణి, రావు రమేష్, పోసాని
త్రయం ఎంతకీ ఎదగని తమ పాసివ్ పాత్రల్ని చూసుకుని విచారిస్తున్నట్టుగా, ఒకే ఎక్స్
ప్రెషన్స్ ని రిపీట్ చేస్తూ పోయారు. పాత్రల
లోతుపాతుల్ని బట్టే అభినయాలు కదా? హీరో అంత దెబ్బ తీసినా ఏమీ చేయకుండా ఏదో
చేసేద్దామని పదేపదే ఆవేశపడే అవే దృశ్యాలతో అవే ఎక్స్ ప్రెషన్స్ కాక ఏం వస్తాయి?
సాయాజీ షిండే పరిస్థితీ ఇంతే. కమెడియన్ సప్తగిరి కూడా ఛానెల్లో కూర్చుని అవే
డైలాగుల్ని వల్లెవేయడం.
సంపూర్ణేష్ బాబు ఎందుకున్నాడో అర్ధం
గాదు.
హీరోకి నేస్తం గా ఉంటూ ఏ పనీ
చెయ్యకుండా, హీరో చేసే వాటికి బ్యాక్ గ్రౌండ్ లో ఉంటూ తనలో తానూ కిచకిచ నవ్వుకుంటూ
ఉంటాడు. ట్రైన్ కూపే సీనులో హీరో పోసానీని బకరా చేస్తున్నప్పుడైతే, అటక మీద కూర్చుని చూస్తూ ఈ నవ్వుల్నీ
నవ్వుకోలేక మరీ దయనీయ స్థితికి జారిపోయాడు
సంపూర్ణేష్. పాపం దర్శకుడు విధించిన శిక్ష! పాపులర్ నటుల్ని కథలో ఇన్వాల్వ్ చేసి
కథనీ, తద్వారా వాళ్ళ నటనలతో సినిమానీ ఎలా
ఎలివేట్ చేసుకోవచ్చో తెలియకపోవడం వల్ల ఇలా జరిగింది బహుశా.
టెక్నికల్ గా విందా కెమెరా వర్క్
నీటుగా వుంది. కల్యాణీ కోడూరి పాటలకంటే కూడా నేపధ్య సంగీతమే బావుంది. ఎడిటర్
ధర్మేంద్ర కాకరాల అనవసరంగా సాగిన సెకండాఫ్ లో ఎన్నికల ప్రహసనానికి సాధ్యమైనంత కోత పెట్టి వుంటే బావుండేది.
స్క్రీన్ ప్లే సంగతులు
ఓపెనింగ్ లో పాత తరం ప్రసిద్ధ క్రైం/డిటెక్టివ్
నవలా రచయితలైన రేమండ్ చాండ్లర్, ఎడ్గార్ వాలెస్
ల పేర్లు వేసి వాళ్లకి అంకిత మిచ్చాడు దర్శకుడు ఈ సినిమాని. దీంతో ఆ రచయితల స్థాయి
కథని చూడ బోతున్నామన్న ఉత్కంఠ రేగుతుంది మనకి. దర్శకుడి ఉత్తమాభిరుచిపట్ల గౌరవం
పెరుగుతుంది. ప్రారంభంలో ఒక సీనుతో హీరో డబ్బున్న దగాకోరుల్ని ఎలా బకరాలుగా
చేస్తాడో చూపించేసి, ఆతర్వాత చప్పున పాయింట్ ఎస్టాబ్లిష్ చేసేస్తాడు దర్శకుడు. అంటే స్క్రీన్ ప్లే పరంగా ఇరవై
నిమిషాల్లోపే మిడిల్ విభాగంలో పడుతుందన్న మాట కథ. ఇది చాలా రిలీఫ్
మనకి! ఐతే అంతే చిక్కూ ఎదర వుంది ఈ కథని ఎంజాయ్ చేయడానికి. ఒక చోట రేమండ్ చాండ్లర్
అంటాడు- There is no trap so deadly as the trap you set
for yourself - అని. మనకి మనం బిగించుకునే ఉచ్చు కంటే
ప్రమాద కరమైన ఉచ్చు మరేదీ లేదని చాండ్లర్ భావం. ఆయన సౌజన్యంతో దర్శకుడు ఈ పనే
చేసుకున్నాడు చేతులార.
అక్కడ ఎస్టాబ్లిష్ చేసే పాయింట్ ఏమిటంటే, హీరోయిన్ వచ్చేసి, హీరో
సాయం కోరుతూ బ్లాక్ మెయిల్ చేస్తుంది- తన తండ్రిని మోసం చేసిన ముగ్గుర్నీ
బకారాలుగా చేసి ఆడుకోవాలని. హీరో ఒప్పుకుంటాడు. ఎందుకు ఒప్పుకుంటాడు? బ్లాక్
మెయిల్ కి భయపడా? తనలాంటి ఘరానా బురిడీ మాస్టర్ కి ఒక అమెచ్యూరిష్ పిల్ల చేసే
బ్లాక్ మెయిల్ చేష్ట ఓ లెక్కా? కాకపోవచ్చు. ఐతే ఒక కారణం తో ఈ ‘ప్రాజెక్టు’ (!) ఒప్పుకుంటున్నా నంటాడు. ఆ కారణాన్ని సినిమా చివరి వరకూ రివీల్ చేయడు. ఇదొక అనవసర సస్పెన్స్. ఇంతా చేసి
ఈ సస్పెన్స్ ఏమిటంటే, తన కుటుంబమూ అటు హీరోయిన్ నాన్న లాగే ఆ మోసగాళ్ళ కుట్ర కి బలయ్యిందని,
అందుకే తనూ ఆమెలాగే ఫీలయ్యి ఈ ‘ప్రాజెక్టు’ (!) చేపట్టానని చివరికి జస్టిఫై చేసుకుంటాడు. అంటే
పదేళ్ళు దాటిపోయినా హీరోయిన్ వచ్చి చెప్పే దాకా తన కుటుంబానికి జరిగిన అన్యాయం తనకే గుర్తుకి రాలేదన్నమాట.
కనుక ఈ జస్టిఫికేషనూ, సస్పెన్సూ కూడా పే-ఆఫ్ కాకుండా తేలిపోయాయి. ఆ హీరోయిన్ కూడా
జరిగిన మోసానికి తల్లి చనిపోయి, తండ్రి జైలు పాలయ్యీ పదేళ్ళు గడిచాక తీరిగ్గా ఇప్పుడే కళ్ళు
తెర్చినట్టుంది!
పాయింటుని ఎస్టాబ్లిష్ చేసే ఇలాటి
కీలక ఘట్టంలో భలే ఆషామాషీ పాత్రలివి. ‘టెంపర్’ విజయాన్ని పురస్కరించుకుని రచయిత వక్కంతం
వంశీ ఒక సరైన మాట చెప్పాడు : కథలు పైపైన చెప్పేస్తున్నారు, అది పనికి రాదనీ.
పనికొస్తుందని ఇంద్రగంటి నిరూపించ దల్చుకున్నాడు. కనుక పాయింట్ ఎస్టాబ్లిష్ మెంట్
ఇంత పలచన. ఇప్పటి ప్రేక్షకులు పైపైన సినిమాలు చూసేయడానికి అలవాటు పడ్డారేమో గానీ,
సినిమాల్ని మాత్రం ఒళ్ళు దగ్గర పెట్టుకోకుండా ఎంత లైటర్ వీన్ కామెడీ అయినా పైపైన
తీసేసి ఆ ప్రేక్షకుల్నే మెప్పించడం సాధ్యమవుతుందా?
ఇంకా వుంది. జరిగిన మోసానికి
హీరోయిన్ లాగే స్వీయానుభవంతో హీరో కూడా ఫీలయ్యినప్పుడు, ఆమె బ్లాక్ మెయిల్ బిల్డప్
అంతా అప్రస్తుతమై పోయిందిగా? హీరోయిన్ కి ఆ ట్రాకే అనవసరంగా? హీరో బందిపోటు అయితే,
బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నంతో హీరోయిన్
‘బందిపోటి’ అని పన్ గా లెటర్స్ వేయడం మిస్ లీడింగే కదా? ఇది రెండో లోపం.
ఇక మూడో లోపం : ఇది సినిమా.
డిటెక్టివ్ నవల కాదు. హీరోయిన్ సమస్య తనదిగా
భావించి హీరో చేపట్టాలంటే ముందు కొంత టైం అండ్ స్పేస్ కావాలి. హీరోయిన్ తో
పరిచయం, ఆమెతో ప్రేమ, ఎమోషనల్ బాండింగ్- ఆ తర్వాతే ఆమె సమస్య తెలిసి రియాక్ట్
అవడం. ‘ఊసరవెల్లి’ లో సెకెండ్ హీరోయిన్
తమన్నా సమస్య తీసుకుని పోరాడ్డానికి
ఎన్టీఆర్ కి ఆమెతో అసలు ఇలాటి బాండింగ్ లేకపోయింది. అందుకే ఆ సినిమా ఫలితం అలా
వచ్చింది. తాజాగా ‘టెంపర్’ లో కూడా సెకెండ్ హీరోయిన్ మధురిమ
సమస్యకి రియాక్టై పోరాడుతాడు ఎన్టీఆర్. ఇక్కడ ప్రేమిస్తున్న మెయిన్ హీరోయిన్ కాజల్
కాబట్టి, ఆమె అల్టిమేటం ఇవ్వడంతో ఆమె కోసమే- అంటే తన లవ్ ఇంటరెస్ట్ కోసం - మధురిమ సమస్యేమిటో చూస్తాడు. తీరా చూస్తే, ఈ సమస్య తన
నిర్లక్ష్యం వల్లే ఉత్పన్నమయ్యింది. దీంతో ఆడియెన్స్ కి ఈ పాయింట్ ఎస్టాబ్లిష్
మెంట్, తద్వారా ఎన్టీఆర్ చేసే పోరాటం బలంగా
కనెక్ట్ అయ్యాయి. ప్రస్తుత సినిమా కథలో హీరో హీరోయిన్ల మధ్య ముందుగా ఎలాటి బలీయమైన
అనుబంధం లేదు. ఇందుకే ఆడియెన్స్ కనెక్ట్ ఆమడదూరంలో ఉండిపోయింది.
నిజమే, ‘బందిపోటు’ దర్శకుడు అభిమానించే రేమండ్
చాండ్లర్ ఏ నవల్లోనైనా ఆడపాత్ర వుందంటే, ఆమె డిటెక్టివ్ ఫిలిప్ మార్లో తో ఎలాటి పూర్వ పరిచయం లేకుండానే వచ్చి తన సమస్య చెప్పుకుని సాయం కోరుతుంది. అది
డిటెక్టివ్ కథ కాబట్టి సమస్య సెటప్ అలాగే వుంటుంది. ఆ జానర్ నియమాల ప్రకారం
వాళ్ళిద్దరి మధ్య డిటెక్టివ్- క్లయంట్ సంబంధమే ఉండాలి తప్ప మరో ప్రేమ సంబంధం డెవలప్
కాకూడదు కాబట్టి అలాటి కల్పన వుంటుంది. ఆ డిటెక్టివ్ కూడా క్లయంట్ మీద ప్రేమ
పుట్టో, లేదా తన వ్యక్తిగత సమస్య కూడా అలాగే ఉండో కేసు తీసుకోడు. కేవలం తన
ప్రొఫెషనల్ బాధ్యత అనే చట్రం లో ఫీజు మాట్లాడుకుని పూనుకుంటాడు. ఈ సెటప్ ని సినిమాలో క్రియేట్ చేస్తే ఎలా ఉంటుందంటే,
‘బందిపోటు’ సినిమాలో లాగా అర్ధవిహీనంగా వుంటుంది. డిటెక్టివ్ కథ కాకపోతే,
సినిమాల్లో హీరోయిన్ కోసం హీరో వూరికే పరోపకారి పాపన్న పాత్ర పోషించడు. నిన్ను
ప్రేమిస్తాను, చెయ్- అని ఆమె అంటే కుప్పిగంతులేసుకుంటూ చేసుకుంటూ పోతాడు. దటీజ్
సినిమాటిక్ క్రియేషన్.
నాల్గవది : సమస్యలో వున్న సరుకు.
ఒక ఫైనాన్స్ కంపెనీ మోసం చేయడం. ఇది దృశ్య మాధ్యమమైన సినిమాకి ఎంత మాత్రమూ చాలని
సమస్య. చాలా కురచ కాన్వాస్. గతంలో కృషి బ్యాంకు ఉదంతం దరిమిలా అలాటి మోసం
పాయింటుగా పెట్టుకుని అనేక స్క్రిప్టులు వచ్చి పడ్డాయి. అవేవీ తెరకెక్కలేదు.
కారణం, సినిమాకి చాలని అత్తెసరు సరుకు కావడం. సబ్ ప్లాట్ గా పనికొస్తుందేమో.
ఐదవది : జానర్ మిస్ మ్యాచ్. ఇప్పుడు
అమెరికన్ పాపులర్ సాహిత్యంలో యూత్ ని దృష్టిలో పెట్టుకుని, రియలిస్టిక్ ఫిక్షన్
అనే కొత్త జానర్ పరిచయమౌతోంది. ఇందులో మిల్స్ అండ్ బూన్స్ టైపు సాఫ్ట్ రోమాన్స్ కి
తావుండదు. తియ్యటి కలల ప్రపంచంలో స్వైర విహారం వుండదు. అలాటి చాప్టర్లు చొరబడితే
పబ్లిషర్ ఆ వర్క్ ని తిరస్కరిస్తాడు. జానర్ స్పష్టత కి అక్కడ సాహిత్యంలోనే కాదు,
సినిమాల్లోనూ కట్టుబడి వుంటారు. కానీ మనం మాత్రం నవరసాల పోషణ అనే శాస్త్రాన్ని
ప్రపంచానికి ఇచ్చికూడా-వాటిని
పట్టించుకోకుండా సొంత పైత్యాల్ని రుద్దుతూంటాం.
దర్శకుడు ఎస్టాబ్లిష్ చేసిన పాయింటు
ఫైనాన్స్ కంపెనీ చేసిన మోసం, దానికి బలైన
హీరోయిన్ తండ్రి జీవితం. ఈ పాయింటులో హాస్యరసం లేదు, కరుణ రసముంది. కరుణ రసం
సీరియస్ యాక్షన్ ( అద్భుత, వీర లేదా రౌద్ర రసాల) కథనాన్ని కోరుతుంది. కరుణ రసానికి హస్యరసపు కథనం అభాసు
అవుతుంది. అద్భుత రసం (అడ్వెంచర్/థ్రిల్లర్) తో హాస్యరసం (కామెడీ) పండుతుంది. కనుక
ఇక్కడ నేపధ్యంలో తల్లిదండ్రులతో విషాదకర పాయింటు వున్న హీరోయిన్, కామెడీగా విలన్లని ఆటలు పట్టించి వినోదించాలనుకోవడమే,
దానికి హీరో వంత పాడడమే రసాల మిస్ మ్యాచ్
అయిపోయింది- బత్తాయి రసంలో కుంకుడు రసం పోసినట్టు.
బాపు తీసిన ‘ముత్యాలముగ్గు’ పాయింటులో
కరుణ-శోక రసాలున్నాయి. చాలా రిస్కీ
అటెంప్ట్. శ్రీధర్- సంగీత ల వైవాహిక జీవితంలో రావు గోపాల రావు రూపంలో విలన్ విషపు
చుక్కలు చిమ్మి విడదీసే కరుణ- శోక రసాల ఉత్పత్తి. దీనికి తగుమాత్రం షుగర్ కోటింగ్
వేయకపోతే వినోదభరితం చేయడం కష్టం. అందుకని ఈ చేదు మాత్రని ఇంటర్వెల్ కి జరిపేసి, ప్రథమార్ధమంతా అన్ని పాత్రల ఆనందమయ జీవితాలతో,
అద్భుత రస ప్రధానంగా హాస్య రసపు ఆధరువుతో ఓలలాడించారు. అప్పుడు విశ్రాంతి ఘట్టంలో ఆ
శోక- కరుణ రసాలతో లాకులు బార్లా తెరిచేశారు. మళ్ళీ ఈ రసాల ఉప్పెనలో ఎత్తుకున్న
అసలు కథనం కొట్టుకు పోకుండా, ద్వితీయార్ధంలో తిరిగి దాని అద్భుత – హాస్య రసాల
ట్రాకులో యధాతధంగా ఆ కథనాన్ని పెట్టేశారు. ఎలా పెట్టారనేది ఈ సినిమా చూసి
తెలుసుకోవచ్చు. ఇదిక్కడ అప్రస్తుతం. ఇక్కడ దృష్టికి తెస్తున్న దేమిటంటే, ఇలా
కాకుండా ‘బందిపోటు’ కథా నేపధ్యంలో వున్న
కరుణ రసాన్ని మొదటే ఓపెన్ చేసేశారు! దీంతో కథనం కామెడీ – థ్రిల్లర్ ల మధ్య ఎటూ
సర్దుబాటు కాలేక ఇలాటి మెయిన్ స్ట్రీమ్ సినిమాలో ఉండాల్సిన పంచ్, పెప్, కిక్కూ
సర్వం మటాషై పోయాయి.
కేవలం బిగినింగ్ లో ఎస్టాబ్లిష్
చేసిన ఓ పాయింటు పట్టుకుని ఇంత పోస్ట్ మార్టం అవసరమా అంటే, తప్పకుండా అవసరం. ఎందుకంటే,
అనారోగ్యమంతా ఇక్కడే వుంది గనుక. చాండ్లర్ చెప్పిన ఉచ్చులో ఇక్కడే ఇరుక్కోవడం
జరిగింది గనుక. పాయింటు కథకి పునాది వేస్తుంది. ఈ పునాది ఎఫెక్టు మొత్తం కథా సౌధం
మీదా పడుతుంది. ఎప్పుడైతే కథ బిగినింగ్ విభాగపు చివర్న ఎస్టాబ్లిష్ చేసే పాయింటు, లేదా సమస్య బలంగా ఉండదో, అప్పుడా కథ నడక కూడా అంతే
నత్త నడక నడవడంతో బాటు, ఎండ్ విభాగం- అంటే, క్లైమాక్స్ కూడా బలహీనంగా తేలి పోతుంది. బలహీన
పాయింటు ఎస్టాబ్లిష్ మెంట్ = బలహీన ముగింపు! ఇదొక జగమెరిగిన రూలు. సినిమా కథని
మొదటే స్ట్రక్చర్ లో పెట్టి ఆలోచించడం ఎంత అవసరమో, దాని పాయింటు అనే బీజం
విఛ్ఛిత్తి జరిగినప్పుడు అదెలాగెలా శాఖోప శాఖలుగా విస్తరించగలదో ముందే చూసుకోవడం అంతే అవసరం. ఈ కథలో పాయింటు
విఛ్ఛిత్తి జరిగినప్పుడు దీని శాఖలు ఇలా విస్తరించాయ్-
1. అర్ధం లేని హీరో గోల్ గా..
2. అర్ధంలేని హీరోయిన్ బ్లాక్ మెయిల్ గా..
3. సినిమాటిక్ కాని హీరో- హీరోయిన్ల మధ్య
ప్రపోజల్ గా..
4. సినిమా కథకి చాలని ఫైనాన్స్ కంపెనీ మోసంగా..
5. కరుణ- అద్భుత- హాస్య రసాలు- జానర్ మిస్
మ్యాచింగ్ గా..
ఇలా ఈ చీడ పట్టిన శాఖలతో కథావృక్షం వోరిగిపోయింది.
**
సెటప్స్ అండ్ పే- ఆఫ్స్
ఈ స్క్రీన్ ప్లే పొడవునా కొట్టొచ్చే ఇంకో ధోరణి ఏమిటంటే, ఆసక్తి రేపుతూ
వివిధ అంశాల్ని సెటప్ చేయడం, తీరా
వాటిని పే- ఆఫ్ చేసే సమయం వచ్చేసరికి అవి
చెల్లని చెక్కులై పోవడం. ‘బందిపోటి’ బిల్డప్ తో హీరోయిన్ ఏమైందో, హీరో ’ప్రాజెక్టు’
(!) ఒప్పుకోవడానికి కారణం చెప్తానని ఎలా చివరికి జస్టిఫై చేశాడో పైన చూశాం. ఇంకా
‘బందిపోటు’ అనే టైటిల్ సెటప్ కీ, అలాటి బందిపోటే కాని హీరో పాత్రతో పే-ఆఫ్ కూడా
ఇంతే. ఇంటర్వెల్లో రావు రమేష్ ఆకాశంలో చూడకూడని దేదో చూశాడని హడావిడి చేసి,
ఆడియెన్స్ ని టెన్షన్ పెట్టేసి తీరా అదేమిటో చూపించకుండా విశ్రాంతి కార్డు వేయడం సెటప్స్
అండ్ పే- ఆఫ్స్ నిర్వాకానికి పరాకాష్ఠ! ఏమిటో అర్ధం కాని ఇంటర్వెల్ తో మన
మతులుపోవడమే.
ఇంటర్వెల్ అయ్యాక అదేమిటో
చూపించినప్పుడు – హీరో ప్లే చేసిన పాత మూసఫార్ములా ట్రిక్కుగా తేలి, పే-ఆఫ్
అవుటాఫ్ క్వశ్చన్ అయింది. తనికెళ్ళ గోతిలో చితగ్గొట్టినట్టు చూపించిన టేప్ రికార్డర్,
తర్వాత సప్తగిరి తీసి చూసినప్పుడు చెక్కు చెదరకుండా వుంటుంది. హీరోయిన్ ఇంట్లో దండ
వేసిన ఆమె తల్లి ఫోటో చూపిస్తారు. ఆవిడ (పదేళ్ళ క్రితమే) పైలోకాలకి చేరుకుందని
తెలిసిపోతున్నా, ‘ఆవిడిప్పుడు లేదు!’ అని హీరోయిన్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది!
చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే
బద్ధ శత్రువులైన రావు రమేష్ – తనికెళ్ళ భరణి ఒకటై తమని దెబ్బ తీసిన హీరోని చంపెయ్యాలని
నిర్ణయించుకుంటారు. తీరా హీరో ఇంకో తమ శత్రువు పోసానీని బకరా చేస్తూంటే చంపడం
మానేసి చూసి ఆనందిస్తూంటారు. హీరోకి ఎక్కడా ఆటంకాలు ఏర్పడని వన్ వే పోకడతో కథనమే
పాసివ్ అయ్యింది, అదలా ఉంచుదాం. కానీ మొదటి ఇద్దరు విలన్లతోనే హీరోకి ఇలా dead – lock లేదా mexican stand-off సిట్యుయేషన్ ఏర్పడినప్పుడు, కనీసం దీన్నయినా ఎక్సైటింగ్ గా క్లైమాక్స్ కి తీసి కెళ్ళడం
లో విఫలమయ్యాడు దర్శకుడు. ఇలాటి వెన్నో.
అల్లరి నరేష్ ఇమేజి మేకోవర్ సరే, కానీ
పాత్రకి ఆ మేకోవర్ లేక విలన్లని బురిడీ కొట్టించడానికి పాల్పడిన ట్రిక్కులు అన్నీ
చాలాచాలా సినిమాల్లో వచ్చేసిన పాత మూసఫార్ములా బాపతు వ్యవహరాలేగా? ఇక ఇమేజి మేకోవర్
దేనికి?
తన బ్రాండ్ వూర కామెడీతో మూస క్యారక్టర్లే
ది బెస్ట్ అని అల్లరి నరేష్ తెలుసుకుంటే మంచిదేమో. బెటర్ లక్ నెక్స్ట్ టైమ్!
―సికిందర్