రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Monday, February 23, 2015

క్యానన్ బ్లాస్టర్స్ ...



పేల్చేస్తారు క్యానన్ బ్లాస్టర్లు!
మోహన్ –కృష్ణ
నవరి 13, 1999 సంక్రాంతికి  తెలుగు తెర మీద  ఒక ఉద్విగ్నభరిత దృశ్యావిష్కరణ జరిగింది : ఒక్క పెట్టున టాటా సుమోలు పేలిపోయి పైకి లేచిపోవడం! సౌజన్యం : మోహన్- కృష్ణ ఫ్రం చెన్నై. ఆ సినిమా : సమరసింహా రెడ్డి.

     నాటి నుంచీ నేటి వరకూ ఏ సినిమాలో ఏ వాహనం పేలిపోయి ఎగిరి పడ్డా ఆ దృశ్య సృష్టికర్తలు వీళ్లిద్దరే. క్యానన్ బ్లాస్టర్స్ అంటారు వీళ్ళని. మొత్తం దేశంలో వీళ్ళిద్దరూ కాక మరొక్కరే  ఇలాటి టెక్నీషియన్ బాలీవుడ్ లో వున్నారు. మోహన్ కుమార్ తమిళియన్ అయితే, కృష్ణా రాథోడ్ గుజరాతీ. ఇరవై ఏళ్లుగా ఫీల్డులో వుంటున్నారు. చెన్నై  కేంద్రంగా పనిచేస్తున్న ఈ జంట బ్లాస్టర్స్ నిరంతర సంచారులు. చెన్నై, హైదరాబాద్, బెంగుళూరు, ముంబాయి ల చుట్టూ తిరుగుతూ, ఆయా  భాషా చిత్రాలకి సేవలందిస్తూ, ఎప్పుడు ఏ సమయంలో ఎక్కడుంటారో తెలీనంత  బిజీగా గడుపుతూంటారు.

    క్యానన్ బ్లాస్టింగ్ – యాక్షన్ దృశ్యాల్ని ఎనర్జెటిక్ గా మార్చేసిన సరికొత్త యాక్షన్ స్పెషల్ ఎఫెక్ట్స్ ఆవిష్కరణ. ఇదింకో ముందడుగు కూడా వేసింది. ఆగి వున్న వాహనాన్ని పేల్చేసి ఆకాశమార్గం పట్టించడం దగ్గర్నుంచీ, ఇప్పుడు ఏకంగా నడుస్తున్న వాహనాన్నే బ్లాస్ట్ చేసి ఊర్ధ్వ ముఖయానం గావించే దశకి చేరుకుంది. మొదటి దాంట్లో అంతగా రిస్కు లేదంటారుకృష్ణ. రెండోది మాత్రం ప్రాణాలతో చెలగాటమే. కారణం, ఇందులో ఆ వాహన డ్రైవర్ (స్పెషల్ వర్కర్ లేదా జంపర్ అంటారు) ప్రాణాలకు తెగించి ఉంటాడు.

       అసలీ క్యానన్ బ్లాస్టింగ్ అంటే ఏమిటి- ఇది మన దేశానికి ఎలా వచ్చిందీ అంటే, బాలీవుడ్ నుంచీ సత్తూ పటేల్ అనే యాక్షన్ డైరెక్టర్ లండన్ వెళ్లి ఈ టెక్నిక్ నేర్చుకుని వస్తే, ఆయన దగ్గర తర్ఫీదు పొందారు మోహన్- కృష్ణ లు. వీళ్ళు ఒక  విషయాన్ని పొరపాటు లేకుండా రాయాలని మరీ మరీ కోరారు..ముంబాయిలో ఒక పాత్రికేయుడు ఇలాగే తమని ఇంటర్వ్యూ చేసినప్పుడు, ఈ క్యానన్ బ్లాస్టింగ్ ప్రక్రియని దేశానికి పరిచయం చేసిన ఘనత తామిద్దరిదే నని రాసేశారట!  ఇది చాలా తప్పనీ, తాము కేవలం ఇంజనీర్ల వంటి ఫైట్ మాస్టర్ల కింద పనిచేసే మేస్త్రీల వంటి వాళ్ళమేననీ స్పష్టం చేశారు మోహన్ – కృష్ణ లు. పేలుడు దృశ్యాల కొరియోగ్రఫీ అంతా ఫైట్ మాస్ట ర్లదే ననీ, సిలిండర్లతో వాహనాన్ని ఎంత ఎత్తుకి పేల్చాలి, ఆ వాహనం ఏ కోణంలో ఎక్కడ ఎగిరి పడాలి, కెమెరాలు ఏ  దూరాలలో ఎలా ఉంచాలి,  మొదలైన క్యాలిక్యులేషన్స్ అన్నీ ఫైట్ మాస్టర్లే నిర్దేశిస్తారనీ చెప్పుకొచ్చారు.  

        ఇక్కడొకటి గమనించాల్సింది వుంది. క్యానన్ బ్లాస్టింగ్ లో నిజానికి బ్లాస్టింగేమీ జరగదు. కేవలం అధిక ఒత్తిడితో నైట్రోజన్ వాయువుని పంపి,  పిస్టన్స్ పనిచేసేట్టూ చేయడమే ఇక్కడ జరిగే అసలు మెకానిజం. ఈ పిస్టన్సే  సదరు వాహనాలని పైకెగరేస్తాయన్నమాట. అలా ఎగిరిన క్షణంలో,  టైమింగ్ తో వేరే టెక్నీషియన్స్ వాటి కింద పెట్రోల్ బాంబులు పేల్చేస్తారు. అదన్న మాట.

       ఎక్కడ వాహనాలని పేల్చాలో అక్కడ గోతులు తీసి నైట్రోజన్ సిలిండర్స్ ని  పాతిపెడతారు. వాటి  తీగెల్ని భూమి లోపలి నుంచి లాగి స్విచ్ బోర్డుకి అమర్చుకుంటారు. వాహనాల్లో ఇంజన్లు, ఇతర ముఖ్యమైన విడి భాగాలూ తీసేసి డొల్లగా తయారు చేస్తారు. చేతి కింద టీములో నల్గురైదుగురు వెల్డర్స్ మాత్రమే వుంటారు. ఇంతకి  మించి ఇంకెవరూ వుండరు. ‘ఇరవై శాతం పని, 80 శతం ఆలోచనగా మా వర్క్ వుంటుంది’ అన్నారు కృష్ణ.

      ఇక నడిచే వాహనాన్ని పేల్చే  విషయానికొస్తే, చాలా రిస్కు తీసుకుని కష్ట పడతామన్నారు కృష్ణ. నిజానికి పేలే సమయంలో ఆ వాహనం నడుస్తూ వుండదు. అలా పేల్చడం సాధ్యం కాదు కూడా. సిలిండర్స్ ని ఎక్కడైతే పాతిపెట్టారో,  ఆ చోటు మీది కొచ్చి వాహనం ఒక్క క్షణం ఆగాల్సిందే. ఆ రెప్పపాటు కాలంలోనే ఒకేసారి సిలిండర్స్ నీ, పెట్రోల్ బాంబుల్నీ పేల్చేస్తారు. అప్పుడు పెద్ద విస్ఫోటనం తో ఆ వాహనం పైకెగిరి కింద పడుతుంది. ఆ వాహనం నడుపుతున్న స్పెషల్ వర్కర్ లేదా జంపర్ కి నిలువెల్లా ఎటువంటి తాకిడి కైనా తట్టుకునే మందంతో ప్యాడింగ్ చేస్తారు. కనుక అతను సేఫ్ గా వుంటాడు. ఈ స్పెషల్ వర్కర్స్ లేదా జంపర్స్  కూడా దేశంలో ఇద్దరే,  అది కూడా బాలీవుడ్ లోనే వున్నారు. వీళ్ళే మన తెలుగు సినిమాలకి వచ్చి పని చేసి పోతూంటారు.

       సమరసింహా రెడ్డి, ఆది, చెన్నకేశవ రెడ్డి, అతనొక్కడే, సైనికుడు, ...ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జంట క్యానన్ బ్లాస్టర్లు పని చేసిన తెలుగు సినిమాలు 150 వరకూ వుంటాయి. మొత్తం అన్ని భాషలూ కలిపి 300 పైనే వుంటాయి. తెలుగులో ప్రస్తుతం ఎన్టీఆర్ ‘ఊసరవెల్లి’ కి పని చేస్తున్నారు. చెన్నైలో యూనియన్ వుంది వీళ్ళకి. కానీ  హైదరాబాద్ లో తెలుగు ఫీల్డుకి సంబంధించి ఈ శాఖకి ఎలాటి గుర్తింపూ, యూనియన్ కూడా లేవన్నారు. ఫైట్ మాస్టర్లు తమ యూనియన్ లో వీళ్ళని కలుపుకోరు. ఇక్కడ యాక్షన్ స్పెషల్ ఎఫెక్ట్స్  టెక్నీషియన్ గా  చెన్నై నుంచి వచ్చి స్థిరపడ్డ  సాదిరెడ్డి రామారావు శిష్యులే మిగతా టెక్నీషియన్లందరూ.  వీళ్ళంతా 40 మంది వరకూ వుంటారు. యూనియన్ గా  ఏర్పడేందుకు వీళ్ళెవరూ సహకరించడం లేదు. రేపెప్పుడైనా వీళ్ళల్లో ఎవరైనా ఏదో ప్రమాదం చేసి పారిపోతే, వీళ్ళని ప్రోత్సహిస్తున్న నిర్మాతలు ఏం చేస్తారన్న ప్రశ్న వస్తోంది.  ఇంతేకాదు , ఎలాటి  గుర్తింపు కార్డులు కూడా లేకపోవడంతో వీళ్ళకి పోలీసులతో సమస్యలు కూడా వస్తున్నాయి.

      కాలం మారుతున్నా, తరతరాలుగా సినిమా క్రాఫ్ట్స్ ఇరవై నాలుగే అని పరిశ్రమ పెద్దలు గిరిగీసుకుని వుండడం విడ్డూరమే!  



సికిందర్
(2011 జూన్, ‘ఆంధ్రజ్యోతి’ కోసం)