రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

21, మార్చి 2023, మంగళవారం

1313 : సందేహాలు- సమాధానాలు

 

Q : నా కథకు ఓపెనింగ్ సీను పలు విధాలుగా వస్తోంది. దేన్ని తీసుకోవాలో అర్ధంగావడం లేదు. సినిమాకు ఓపెనింగ్ సీను ఇంపార్టెంట్ అంటారు కదా? అసలు ఓపెనింగ్ సీను దేని గురించి వుండాలి? దాన్ని ఎలా రాయాలి?
కె. వెంకటేష్, అసోసియేట్

A : కథ అనేది కథా నాయకుడు/నాయిక పాత్ర గురించే వుంటుంది కాబట్టి ఓపెనింగ్ సీను ఈ పాత్ర మీద వుంటే  వెంటనే కథ మీద ఇంట్రెస్టు పుడుతుంది. ఓపెనింగ్ యాక్టివ్ గా వుంటుంది. పాత్ర మీద గాక కథ మీద ఓపెనింగ్ సీను వుంటే పాసివ్ గా వుండి ఇంట్రెస్టు పుట్టించదు. ఉదాహరణకి ‘అమిగోస్’ ఓపెనింగ్ సీను ఒక కళ్యాణ్ రామ్ పాత్రని ఇంకో కళ్యాణ్ రామ్ పాత్ర షూట్ చేసి చంపడం గురించి వుంటుంది. ఇది కథ మీద ఓపెనింగ్ సీను. దీంట్లో ఏం ఇంట్రెస్టు పుట్టింది? పైగా ముగింపు తెలిసిపోయింది.

        
విలన్ మీద ఓపెనింగ్ సీను వున్నా అదీ కథ గురించే వుంటుంది. కథ అనేది హీరో పుట్టిస్తే పుడుతుంది. హీరో పుట్టించకుండా కథ వుండదు. హీరో లేకుండా కథ వుండదు. హీరోతోటే కథ. సినిమా సాంతం జరిగేవి హీరో పుట్టించే కథకి పరిణామాలే. హీరో కథ పుట్టించడమంటే హీరో కళ్యాణ్ రామ్, విలన్ కళ్యాణ్ రామ్ ని కాల్చి చంపడం కాదు. అది హీరో పుట్టించిన కథకి ఓ పరిణామం మాత్రమే. పరిణామం అంటే తోక. కథ అనే తల చూపించకుండా తోక ఎలా చూపిస్తారు. పిల్లిని ఫోటో తీయమంటే తలని క్లిక్ చేయకుండా తోకని క్లిక్ చేసి చూపించరు కదా?

‘ఓషన్స్ ఎలెవన్’ (2001) ఓపెనింగ్ సీను హీరో జార్జి క్లూనీ పుట్టించే కథతో వుంటుంది. ఇందులో క్లూనీ జైలు నుంచి విడుదలై వెళ్ళి వెళ్ళి చేసే మొదటి పని కాసినోలో దూరడం. అప్పుడే జైలు నుంచి విడుదలై అప్పుడే కాసినో దోపిడీకి పథకం వేసేస్తున్నాడు. ఒకటి కాదు, మూడు కాసినోల దోపిడీ. ఇది కథ పుట్టించడం కాకపోతే ఏమిటి? కథ పుట్టిస్తూ వెంటనే ఓపెనింగ్ సీను పట్ల ఇంట్రెస్టు రేకెత్తించడం గాకపోతే ఏమిటి? జైలు నుంచి తను కొత్తగా సంపాదించిన స్వేచ్ఛకి తనే హాని కల్గించుకునే విధంగా మరొక నేరానికి పాల్పడడం పాత్ర తెగింపుని తెలియజేస్తోంది. ఇలా పాత్ర స్వభావం కూడా వ్యక్తమవుతోంది

ఇదీ సినిమాలో వున్న ఓపెనింగ్ సీను. కానీ స్క్రిప్టులో వున్న ఓపెనింగ్ సీను వేరే.  స్క్రిప్టులో ఓపెనింగ్ సీనుని రచయిత టెడ్ గ్రిఫిన్ ఈ కింది విధంగా రాశాడు :

GUARD

(calling down hall)

49-J! Open!

The cell door slides open…

Inside the cell: Danny and another INMATE don’t budge; they sit haunched on opposing cots, a small table between them, squaring off over poker hands.

GUARD

Let’s go! Eighteen months ain’t enough for you?

Danny raises a hand to silence him.

DANNY

One card.

The Inmate eyes Danny warily, then deals the top card…

The queen of diamonds. Danny smiles — all business, no gloating — and spreads his hand out.

INMATE

You caught the straight inside.

DANNY

It’s my lucky day.

He stands, straightens his prison jumper, collects the playing cards…

DANNY

So long, Eskimo.

INMATE

So long, kid. Go hang yourself.

Danny steps out to meet the Guard…

DANNY

Thanks for waiting.

        ఈ సీను జార్జి క్లూనీ పాత్ర స్వభావాన్ని వెల్లడిస్తోంది. అతను జైలు గదిలో పేకాడుతున్నాడు. గార్డు వచ్చి నువ్వు విడుదలయ్యావ్, రా బైటికి అన్నా కూడా క్లూనీ పేకాట వదలడం లేదు. ఎవరైనా విడుదలయ్యావ్ అంటే అన్నీ పక్కనబెట్టి బైటికి వురుకుతారు. క్లూనీ పేకాటే ప్రధానంగా వున్నాడంటే జీవితంలో ఫోకస్ అంతా గ్యాంబ్లింగ్ మీదే వుందన్న మాట! ఈ దోపిడీ దొంగ క్యారక్టర్ ఫోకస్ ని, దాంతో దోపిడీల్లో అతనెంత నిష్ణాతుడై వుంటాడో అన్న విషయాన్నీ తెలియజేస్తోందీ ఓపెనింగ్ సీను. కానీ ఇది కథ పుట్టిస్తోందా? లేదు.
        
షో- డోంట్ టెల్ అని సినిమా లాంగ్వేజీ కదా? ఏ విషయాన్నైనా చేతల ద్వారా చూపించాలని, మాటలతో చెప్పడం కాదని అర్ధం. ఇలా మాటలతో చెప్పకుండా క్లూనీ పాత్ర ఎలాటిదో జైల్నుంచి విడుదలయ్యే స్వేచ్ఛని పణంగా పెట్టి ఆడుతున్న పేకాట అనే చేతల ద్వారానే బాగా చూపించాడు రచయిత.
        
అయితే ఈ ఓపెనింగ్ సీనుని తొలగించాడు దర్శకుడు స్టీవెన్ సోడర్ బెర్గ్. ఎందుకు? దీని తర్వాత స్క్రిప్టులో పైన పేర్కొన్న జైలు నుంచి విడుదలై వెంటనే దోపిడీ పథకంతో కా సినో బాట పట్టే సీనూ ఒకటే. ఎలా? ఇప్పుడూ జైలు విముక్తితో లభించిన స్వేచ్చని పణంగా బెట్టి కెరీర్ పట్ల ఫోకస్ తో కాసినో బాటే పట్టాడు. ఈ రెండో సీనుకి కూడా షో- డోంట్ టెల్ స్క్రిప్టింగ్ టూలే వాడినా ఇది రిపీటీషన్. పాత్ర గురించి ఓపెనింగ్ సీనులో చెప్పిన విషయాన్నే మళ్ళీ మళ్ళీ చెప్పే పునరుక్తి. పైగా రచయిత రాసిన ఓపెనింగ్ సీన్లో జైలు గదిలో కథ పుట్టడం లేదు. రెండో సీన్లో జైలునుంచి బయటికొచ్చాకే కథ పుడుతోంది. ఇలా కథ పుట్టిస్తూ క్లూనీ కాసినో నుంచి ఇంకో సిటీకీ, ఆ తర్వాత ఇంకో సిటీకీ తిరుగుతూ అనుచరుల్ని కూడేస్తూంటాడు.
        
అందుకని ఓపెనింగ్ గా రాసిన స్క్రిప్టులో మొదటి సీను సినిమాలో వుండదు. రెండో సీనే ఓపెనింగ్ సీనుగా సినిమాలో వుంటుంది. ఇప్పుడు ఓపెనింగ్ సీనంటే ఏమిటో అర్ధమై వుండొచ్చు. షో డోంట్ టెల్ అంటే ఒకసారే చూపించాలి ఏదైనా. రచయిత గ్రిఫిన్ దీనికి ముందు మూడు సినిమాలు రాసిన వాడే. అయినా ఈ పొరపాటు చేశాడు.
        
ఓపెనింగ్ ఇంకో విధంగా వుండొచ్చు : పాత్ర పరిచయంతో. సిల్వెస్టర్ స్టాలోన్ నటించిన ఫస్ట్ బ్లడ్ (1982) ఓపెనింగ్ సీను స్టాలోన్ కథ పుట్టిస్తూ గాక, పాత్రగా పరిచయమవడంతో వుంటుంది. ఈ పరిచయమయ్యే స్టాలోన్ జాన్ రాంబో పాత్ర, రెండో సీన్లో కథకి బీజం వేసి, మూడో సీను కల్లా కథ పుట్టించేస్తాడు.
        
రాంబో వియత్నాం యుద్ధంలో పాల్గొన్న పదేళ్ళ తర్వాత మిత్రుడైన సహ కమాండర్ ని వెతుక్కుంటూ వచ్చే దృశ్యం టైటిల్స్ తో ప్రారంభమవుతుంది. సరదాగా నడుచుకుంటూ ఆ గ్రామంలో కొచ్చి, బట్టలు ఆరేస్తున్న మిత్రుడి తల్లిని అడుగుతాడు. కొడుకు కొన్ని నెలలక్రితం క్యాన్సర్ తో మరణించాడని చెప్తుందామె. యుద్ధంలో విడుదల చేసిన ఒక రసాయన వాయువు వల్ల క్యాన్సర్ బారిన పడ్డాడని అంటుంది. సరదాగా మాట్లాడుతున్న స్టాలోన్ విషాదంలో మునిగి పోతాడు. చేసేది లేక ఆమె చేతిలో ఫోటో పెట్టి వెనుదిరుగుతాడు.
        

ఈ ఓపెనింగ్ సీనులో పాత్ర స్వభావంతో బాటు, ఎదురైన బాధాకర అనుభవంతో స్టాలోన్ పాత్ర పరిచయమవుతుంది. రెండో సీన్లో నడుచుకుంటూ పోతున్న స్టాలోన్ ని పోలీసు అధికారి ఆపి అనుమానించడం, వేధించడం, అతడి దగ్గర కత్తి దొరకడంతో అరెస్టు చేయడం జరుగుతాయి. మిత్రుడ్ని కోల్పోయిన బాధతో వున్న స్టాలోన్ ని ఇంకేదో అనుమానించి పోలీసు అధికారి ఆ విధంగా ప్రవర్తించడం మనకి సానుభూతి కల్గిస్తుంది. మూడో సీన్లో పోలీస్ స్టేషన్లో చిత్ర హింసలు పెట్టడంతో స్టాలోన్ ఎదురుతిరిగి పోలీసులందర్నీ కొట్టి పారిపోతూ కథ పుట్టించేస్తాడు.

        

అంటే ఇక్కడ పాత్రని పరిచయం చేసే ఓపెనింగ్ సీను ఆ వెంటనే సమస్యలో ఇరుక్కున్న స్టాలోన్ కథ పుట్టించడానికి తగిన సానుభూతి అనే ఎమోషనల్ కంటెంట్ ని సరఫరా చేయడానికి తోడ్పడింది. మధ్యలో ఇంకే సీను వేసి పొడిగించినా ఓపెనింగ్ సీనుకి అర్ధముండదు.

        

ఫస్ట్ బ్లడ్ అనుసరణగా 1983 లో చిరంజీవితో ఖైదీ వచ్చినప్పుడు అందులో ఓపెనింగ్ సీను ఫస్ట్ బ్లడ్ రెండో సీనుతో వుంటుంది. చిరంజీవి వంతెన మీంచి నడుచుకుంటూ వచ్చి ఆగుతాడు. కుడివైపు కొండపల్లి, ఎడమవైపు కోటిపల్లి బోర్డు లుంటాయి. కొండపల్లి వైపు చూస్తూంటే కంట్లో నీరు తిరుగుతుంది. దీంతో ఏదో బాధాకర కథ వుందన్న అర్ధం స్ఫురిస్తుంది. ఎమోషనల్ కంటెంట్ ఇంతే వుంటుంది దాచి పెట్టిన విషయంతో. ఫస్ట్ బ్లడ్ లో విషయం చెప్పి ఎమోషనల్ కంటెంట్ ఇచ్చాడు. ఖైదీ లో కంటనీరుతో మేనేజ్ చేశారు. ఇలాటి క్రియేటివ్ పంథాలుంటాయి. స్టాలోన్ కి మిత్రుడుండడం వల్ల ఆ ఓపెనింగ్ వచ్చింది. చిరంజీవికి ఇంకేదో ఫ్లాష్ బ్యాక్ వుండడం వల్ల ఆ హింట్ తో ఈ ఓపెనింగ్ వచ్చింది.

చెప్పేదేమిటంటే ఓఎనింగ్ సీన్లు పాత్ర కథ పుట్టించడంతో, లేదా పాత్రని పరిచయం చేస్తూ వున్నప్పుడు ఓపెనింగ్ సీనుతోనే సినిమా ఇంట్రెస్టు పుట్టిస్తుంది. మీ కథని బట్టి ఈ సమాచారాన్ని ఉపయోగించుకోండి. ఉగాది శుభాకాంక్షలు.

Q : స్క్రిప్టుకి రీరైటింగ్ పని ఎప్పుడు చేపట్టాలి? నేను ట్రీట్ మెంట్ ని రీరైటింగ్ చేస్తున్నాను. ఇప్పటికీ మూడు సార్లు చేశాను. దీనికి లిమిట్ ఏమైనా వుందా? ఫైనల్ గా స్క్రిప్టు పూర్తి అయిందని ఎలా తెలుస్తుంది?
—ఏ ఎన్ ఎస్
, అసోసియేట్

A : కథ అంతిమ రూపం డైలాగ్ వెర్షన్ కి దిద్దుబాటు చేస్తూంటేనే వస్తుంది. ట్రీట్ మెంట్ ని ఎంత దిద్దినా అది కథకి అంతిమ రూపం కాదు. ట్రీట్ మెంట్ కేవలం డైలాగ్ వెర్షన్ కిచ్చే సమాచార పత్రం మాత్రమే. ఆ సమాచారంతో డైలాగ్ వెర్షన్ రాస్తున్నప్పుడు జరిగే మార్పు చేర్పులకే విలువ వుంటుంది. వన్ లైన్ ఆర్డర్ వున్నట్టు ట్రీట్ మెంట్ వుండదు. ట్రీట్ మెంట్ లో మార్పు చేర్పులు జరుగుతాయి కాబట్టి. అలాగే ట్రీట్ మెంట్లో వున్నట్టే డైలాగ్ వెర్షన్లో సీన్లు వుండవు. ఒక్కోసారి ట్రీట్ మెంట్లో రెండు సీన్లు కలిపి ఒక డైలాగుతో ఒకే సీనుగా మారిపోవచ్చు. అంతిమంగా తెర మీద పాత్రలు ఏం మాట్లాడతాయో ఆ డైలాగ్ వెర్షన్ నే దిద్దుకుంటూ వుండాలి. ట్రీట్ మెంట్ ని ఎంత దిద్దినా లాభముండదు. సమయం వృధా. మీకు ఉగాది శుభాకాంక్షలు.
సికిందర్