రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Friday, December 3, 2021

1101 : స్క్రీన్ ప్లే సంగతులు

 

      బోయపాటి అఖండ లో పూర్వ కథ పెద్దగా లేకపోవడం వల్ల సినిమా ప్రారంభంలోనే  ఆ పన్నెండు నిమిషాల పూర్వ కథ ఒకేసారి చెప్పేశారు. దీంతో కథంతా లీనియర్ నేరేషన్లో వుంది. ఇద్దరు బాలకృష్ణల పుట్టుక, దాని పరిణామాలకి సంబంధించి పూర్వ కథ ఎక్కువ లేకపోవడం వల్ల లీనియర్ నేరేషన్లోకి కథ వచ్చేసింది. ఇలా గాకుండా ఒకవేళ పూర్వ కథ అరగంట పాటు వుంటే ఏం చేయాలి? చాలా సినిమాల్లో చూపిస్తున్నట్టు, ఇంటర్వెల్ తర్వాత రొటీన్ గా సెకండాఫ్ అరగంట పాటు ఫ్లాష్ బ్యాక్ వేసేసి ఇంకా నాన్ లీనియర్ కథే చెప్పాలా? ఈ యమ స్పీడు యుగంలో కూడా? నాన్ లీనియర్ కథ చెప్పడమంటే కథని ఓ చోట ఆపేసి, వెనక్కి వెళ్ళి తీరిగ్గా పూర్వ కథని  ఫ్లాష్ బ్యాకుగా చెప్పుకుంటూ కూర్చోవడమే. ఈ యమ స్పీడు యుగంలో ముందు కెళ్తున్న కథని ఆపవచ్చా? కథ సాగుతూనే వుండాలి, పూర్వ కథ సమాంతరంగా చోటు చేసుకుంటూ వుండాలి. మొత్తం కలిపి లీనియర్ నేరేషన్ లా ఉరకలేస్తూ పరిశుభ్రంగా కన్పించాలి. ఈ యమ స్పీడు యుగంలో సోషల్ మీడియా ప్రేక్షకుడికి / ప్రేక్షకురాలికి తప్పించుకునే వంక దొరక్కూడదు. మొబైల్ నొక్కుకుంటూ కూర్చునే అవకాశమివ్వకూడదు. ఇది మార్కెట్ యాస్పెక్ట్.  మార్కెట్ యాస్పెక్ట్ ని బట్టి జాగ్రత్తగా చేసే క్రియేటివ్ యాస్పెక్ట్. ఇదే  షాంగ్ చీ- అండ్ ది లెజెండ్ ఆఫ్ ది టెన్ రింగ్స్ లో వాడిన ఫ్లాష్ బ్యాక్ టెక్నిక్...

        షాంగ్ చీ లో ఓ అరగంట పాటు వుండే పూర్వకథ లో మొదటి పది నిమిషాలు తీసుకుని సినిమా ప్రారంభించారు. పది నిమిషాలకి హీరో చిన్నప్పటి పూర్వ కథని  ఓ నాటకీయ ఘట్టంలో కావాలని ఆపేసి, పెద్దయ్యాక ఇప్పటి కథ చెప్పడం ప్రారంభించారు. మిగిలిన పూర్వ కథని చిన్న చిన్న ఫ్లాష్ బ్యాకులుగా, కథలో ఉత్ప్రేరకాలుగా పనిచేసే ట్రిగ్గర్ పాయింట్ల దగ్గర, ప్రయోగించుకుంటూ పోయారు.

        దీని రచయిత డేవిడ్ కాలహాం చైనీస్ అమెరికన్. ఇతను ఎక్స్ పెండబుల్స్ 1, 2, గాడ్జిలా, మోర్టల్ కంబాట్, వండర్ వుమన్- 1984 వంటి 9 సినిమాలకి రాశాడు. షాంగ్ చీ కొత్తగా పరిచయమవుతున్న అమెరికన్ సూపర్ హీరో కథ. సిరీస్ గా వచ్చే కొత్త సూపర్ హీరో అన్నాక పుట్టు పూర్వోత్తరాలు పరిచయం చేసి కథలోకి దింపాలి. షాంగ్ చీ విషయానికొస్తే ఇతడి తల్లిదండ్రు లెవరు, వాళ్ళెలా కలుసుకున్నారు, వాళ్ళ కలయిక తండ్రి జీవితంతో బాటు, షాంగ్ చీ జీవితాన్నీ నాటకీయంగా ఎలా మార్చిందిమొదలైన కథాసరిత్సాగరం చెప్పుకుంటూ కూర్చుంటే అరగంట సినిమా కావాలి.

        అందుకని సాగుతున్న కథలో చిన్నచిన్న భాగాలుగా చేసి పూర్వ కథ చెప్పారు. సినిమా ప్రారంభం మొదటి పది నిమిషాల్లో  హీరో తండ్రి, తన వశమైన టెన్ రింగ్స్ తో ఎలా రాజ్యాల్ని జయిస్తున్నాడో, ఒక శత్రు దాడిలో దారి తప్పి టాలో అనే గ్రామంలో కెలా వచ్చాడో, అక్కడ తల్లితో ఎలా ప్రేమలో పడి పెళ్ళి చేసుకున్నాడో చూపించి కట్ చేసి, ఇదంతా తల్లి ఐదేళ్ళ కొడుక్కి చెప్తున్నట్టు చూపించి, అతడి మెళ్ళో లాకెట్ వేయడంతో ముగించారు.

2. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిందేమిటంటే, ఈ పది నిమిషాల్లో తండ్రి పాత్రని ఎస్టాబ్లిష్ చేయడానికి ఎక్కువ భాగం కేటాయించి, చిన్నప్పటి హీరోని లాకెట్ మెళ్ళో వేసుకునే ఒకే సీనులో చూపించి ముగించారు. ఎందుకని? ఎందుకంటే, కమర్షియల్ సినిమాకి హీరోని/స్టార్ ని  వీలైననత త్వరగా తెర మీదికి తీసుకు వచ్చే అర్జెన్సీని మార్కెట్ యాస్పెక్ట్ డిమాండ్ చేస్తుంది గనుక. ఈ అర్జెన్సీ గురించి బ్లాగులో కొన్నిసార్లు చెప్పుకున్నాం కూడా.

        కమర్షియల్ సినిమా స్క్రీన్ స్పేస్ అనేది హీరోకి /స్టార్ కి మాత్రమే చెందిన కథా ప్రాంగణం. ఇందులోకి చిన్నప్పటి కథలతో ఏ బాక్సాఫీసు అప్పీలూ వుండని బాల నటులు చొరబడడానికి వీల్లేదు. ప్రేక్షకులకి హీరోని /స్టార్ ని వెంటనే తెరమీద చూడాలని వుంటుంది. వాళ్ళ చిన్నప్పటి రూపాలైన ఎవరో బాల నటుల్ని చూస్తూ కూర్చోవడం కాదు. మన సినిమాల్లో ఇలాగే చూపిస్తున్నారింకా. పోనీ బాల నటులున్నారని బాలలేమైనా సినిమాలకి క్యూలు కడుతున్నారా? ఇదేమీ లేదు, కథకుల చాదస్తమే. సినిమా మొదలెడితే చాలు ఓ అరగంట పాటు బాల నటులతో హీరోల/స్టార్ల పాత్రల చిన్నప్పటి కథలు చూపిస్తే గానీ తృప్తి  తీరని పాత కాలం పద్ధతే వుంది. ఇది ఆ కాలంలో ఈ ప్రేక్షకులతో చెల్లింది, ఇప్పుడు కాదు. ఇప్పుడు ప్రేక్షకులు వేరు. వాళ్ళ క్రేజ్ వేరు, డిమాండ్లు వేరు హీరోలతో/స్టార్లతో.  ఇప్పుడిలా చేస్తే హీరోల/స్టార్ల విలువైన స్క్రీన్ స్పేసే కాదు, బాలనటులతో తీయడానికయ్యే స్టోరీ పార్టు బడ్జెట్ కూడా ఘోరమైన వేస్టు.

        అందుకని షాంగ్ చీ ప్రారంభ పూర్వ కథలో చిన్నప్పటి హీరోతో (బాల నటుడితో) ఒకే సీను వేసి- కట్ చేసి వెంటనే, కథలో ప్రస్తుత కాలంలో షాంగ్ చీ సూపర్ మాన్ హీరోని చూపించేశారు!

        ఇంకోటేమిటంటే, మొత్తం పూర్వ కథంతా ఒకే ఫ్లాష్ బ్యాకుగా వేసి వుంటే, సూపర్ మాన్ తెరమీదికి ఎంట్రీ ఇవ్వడానికి అరగంట పట్టేది! ఇది చాలా నాన్సెన్స్ గా వుండేది.

        పై పూర్వ కథా ఖండికలో తండ్రి పార్టు ఎక్కువ చూపించారని చెప్పుకున్నాం. ఆ తండ్రి హీరోకి ప్రత్యర్ది కాబోతాడు కాబట్టి ఆ బ్యాక్ గ్రౌండ్ అవసరం. ఇదంతా తల్లి క్యారక్టర్ చెప్పుకొస్తున్నట్టు వాయిసోవర్ ట్రాన్సిషన్ లైవ్ డైలాగుగా మారి, సీను చూస్తే తల్లి క్యారక్టర్ తండ్రి గురించి ఇదంతా ఐదేళ్ళ కొడుక్కి  చెప్తున్నట్టు ఓపెనవుతుంది. వెంటనే ఆమె అతడి మెళ్ళో లాకెట్ కట్టడంతో పూర్వ కథ కట్ అయిపోయి - అలారం మోతకి శాన్ ఫ్రాన్సిస్కోలో మన సూపర్ మాన్ హీరోగారు నిద్రలేచే సీను తో కన్పించిపోతారు పండగ చేసుకోమని!

3. ఇక్కడ్నుంచి మున్ముందు కథతో బాటు, నిమిషం -3 నిమిషాల వ్యవధితో చిన్న చిన్న ఫ్లాష్ బ్యాకులు, మిగతా పూర్వ కథకి సంబంధించి అడపాదడపా వస్తూంటాయి. కథాంశంలో చాలా నైపుణ్యంగా అల్లిన ఫ్లాష్ బ్యాకులివి. నడుస్తున్న కథలో ఆయా ఆనంద విషాదాల ఘట్టాల ప్రేరణతో (ట్రిగ్గర్ పాయింట్స్ తో), భావోద్వేగాల్ని ఇనుమడింపజేస్తూ వస్తూంటాయీ సంబంధిత ఫ్లాష్ బ్యాక్స్. ఇలా అంచెలంచెలుగా పూర్వ కథ తెలుస్తూ వుంటుంది.   

        హీరో తల్లి మరణించిందని మనకి తెలుస్తూంటుంది. కానీ ఎలా ఎప్పుడు మరణించిందనేది మిస్టరీగా అనిపిస్తూ వుంటుంది. ఇలా కథలో మిస్టరీ ఎలిమెంట్ కూడా సాగుతూ వుంటుంది. ఈ మిస్టరీ వీడాలంటే నడుస్తున్న కథ ఎప్పుడు డిమాండ్ చేస్తే అప్పుడా ఫ్లాష్ బ్యాక్ తో వీడుతుంది. దానికోసం మనం వెయిట్ చేయాలి. ఇది స్క్రీన్ ప్లేలో ఎండ్ విభాగం (యాక్ట్ త్రీ) లోగానీ రాదు.

        ఇక్కడ హీరో హీరోయిన్ తో చెప్తాడు -టాలో గ్రామానికి తండ్రి చేరుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని : ఇప్పుడు తనేం చేయాలో తనకి తెలుసని. ఏం తెలుసు? ఎలా తెలుసు? ఈ ట్రిగ్గర్ పాయింటు తో పెల్లుబికి వస్తుంది ఫ్లాష్ బ్యాక్ - తల్లి చనిపోయిన నేపథ్యంలో, ఏడేళ్ళ హీరోని గ్యాంబ్లింగ్ డెన్ కి తీసుకుపోతాడు తండ్రి. అక్కడ కొడుకు కళ్ళ ముందే ఒకడ్ని కాల్చి చంపి, భయపడిపోయిన కొడుకుతో అంటాడు - మీ అమ్మ చావుకు పగదీర్చుకునేందుకు నాతో వుంటావా - అని.  

        ఇదే హీరో జీవితాన్ని తండ్రి పాడు చేసిన ఘట్టం. ఫ్లాష్ బ్యాక్ లోంచి బయటికి వచ్చి, హీరోయిన్ తో అంటాడు - తన 14 ఏళ్ళ వయస్సులో తండ్రి చెప్పినట్టు చేసి కిల్లింగ్ మెషీన్ ని అయ్యాననీ, తల్లి మరణానికి అతనే కారకుడనీ, తన జీవితాన్ని కూడా నాశనం చేశాడనీ, ఇప్పుడు గ్రామాన్ని నాశనం చేయడానికే  వచ్చేశాడనీ, ఇక ఫైనల్ గా అంతు చూసేస్తాననీ అంటాడు.

        తల్లి ఎలా చనిపోయిందో పూర్వ కథంతా ఒకేసారి చెప్పేయ్యొచ్చు. కిల్లర్ గ్యాంగ్ ఇంటికొచ్చి తల్లిని చంపడం, కొడుకు దాక్కుని చూడడం, తండ్రి వచ్చి తల్లి పక్కన కూర్చుని ఏడుస్తున్న కొడుకుని తీసుకుని డెన్ కెళ్ళి, ఒకడ్ని చంపి, పగదీర్చువడానికి నాతో వుంటావా అనడం వగైరా...

        ఇలా చేయలేదు. ప్రధాన కథలో సస్పెన్స్ లేదు. ఈ యాక్షన్ స్టోరీ ఏం జరుగుతుందో తెలిసి పోతూంటుంది. అందుకని, తల్లి మరణానికి సంబంధించిన ఈ పూర్వ కథా ఖండికని కథకి తురుపు ముక్కలా వాడేందుకు అట్టి పెట్టుకున్నారు. తల్లి ఏమైంది, ఎలా చనిపోయిందన్న సస్పెన్స్ - మిస్టరీ ఎలిమెంట్ ని పోషిస్తూ. దీంతో ప్రధాన కథని నిలబెట్టడానికి పూర్వకథ తాలూకు ఫ్లాష్ బ్యాక్స్ ని వ్యూహాత్మకంగా ప్రయోగించినట్టయ్యింది. పూర్వ కథని ఇలా వాడకపోతే ప్రధాన కథ ఏమయ్యేదో వూహించాల్సిందే. ఇదీ మార్కెట్ యాస్పెక్ట్ కి తగ్గ క్రియేటివ్ యాస్పెక్ట్.

        'అఖండ' సెకండాఫ్ ఏం జరుగుతుందో తెలిసి పోతున్నప్పుడు, ఇలా  కాపాడే మిస్టరీ ఎలిమెంటేమీ లేకుండా పోయింది. ప్రారంభంలో చూపించిన పన్నెండు నిమిషాల పూర్వ కథలో ఏదో మెలిక పెట్టి వుండాల్సింది. ఆ మిస్టరీ ఎలిమెంట్ ప్రధాన కథకి అంతర్వాహినిగా వుంటూ కాపాడేది. క్రిందటి సంవత్సరం ఒకటి జరిగింది. ఇప్పుడు దాన్ని 'షాంగ్ చీ' ఉదాహరణ బలపర్చేలా వుంది. ఒక బిగ్ మూవీ స్టోరీ ఇలాగే సస్పెన్స్ లేకుండా ఫ్లాట్ యాక్షన్ కథలా వుంది. దాంట్లో కొడుకుని తండ్రి చెడగొట్టిన పూర్వకథని ఇంటర్వెల్ తర్వాత ఒకే ఫ్లాష్ బ్యాకుగా ఓపెన్ చేసెయ్యకుండా, క్లయిమాక్స్ లో చేస్తే మిస్టరీ ఎలిమెంట్ వుంటుందని చెప్తే వినలేదు. ఇప్పుడు 'షాంగ్ చీ' లో ఇదే వుంది.

—సికిందర్