రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Thursday, December 21, 2017

569 : రైటర్స్ కార్నర్


(మూడో మెట్టు)
        రాసేముందు విజువలైజ్ చేసుకోవడం  నేర్చుకోవాలి. చాలామంది సినిమా రచయితలు  అయోమయంలో రాయడం ప్రారంభిస్తారు. ఎసైన్ మెంట్ మీద పనిచేస్తున్నప్పుడు మీ  చేతిలో కథంతా వుంటుంది. అందులోని ప్రధాన మలుపుల్ని, సన్నివేశాల్ని ముందుగా విజువలైజ్ చేసుకోవాలి. గుడ్డిగా రాసుకుపోతే మీకు జరిగే మేలేమీ వుండదు. సినాప్సిస్ లో విషయమంతా మీకు అర్ధమై వుండొచ్చు. కానీ రాయడానికి కూర్చున్నప్పుడు మీరు విజువల్సు గా ఆ విషయాన్ని పేపర్ మీద పెట్టాల్సుంటుంది. ఏదో బుల్లెట్ పాయింట్ డాక్యుమెంట్ లాగా రాసేస్తే కాదు. సీన్ 1 : బీచ్ పార్టీ నుంచి ఒకమ్మాయి ఒకబ్బాయి జారుకున్నారు. బట్టలు తీసేసి సముద్రంలోకి దూకారు. అమ్మాయి ఈత కొడుతూ ముందు కెళ్తోంటే,   అబ్బాయి నీటి లోపలినుంచి ఏదో తగిలి స్పృహ కోల్పోయాడు.... అని రాస్తే  అది సినిమా సినిమా స్క్రిప్టు రాయడం అవదు.  

         
సీనుని మీరు మీ మెదడులో దర్శించాలి.  అక్కడి వాతావరణ నేపధ్యం, అందులోని విశేషాలు, దాని ఫీల్ రిజిస్టర్ చేయగల్గాలి.  కనుక ఆలోచించుకుంటూ వాకింగ్ కెళ్లండి. జాగింగ్ చేయండి. బైక్ ఎక్కి బుర్రున సాగిపోండి. ఎలా ఎలా తిరిగితే మీ మెదడు సీను గురించి ఒక దారి ఏర్పర్చుకుంటుందో  అలా అలా తిరిగెయ్యండి. ఈ తిరగడం ఎక్కువచేసి,  ఏటెటో వెళ్ళిపోయి, ఏదేదో ఎంజాయ్ చేసి, అలసటతో వచ్చి పడుకునే ప్రమాదముంది. మీరు సీను గురించే తిరుగుతారు, వచ్చి సీనే రాస్తారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. దారిలో ఎవర్నీ కలవకండి, ఎవరితోనూ కబుర్లేసుకోకండి. అప్పుడు తప్పకుండా సీనుకో విజువలైజేషన్ వస్తుంది. దాంతో కూర్చుని రాయండి. ఇలా చేయకపోతే మీ మొదటి పేజీతోనే సమస్యలో పడిపోతారు. రాయడం లోకి మెదడుని  సంలీనం చేయడానికి మెదడు  కండరాల్ని ఇలా వార్మ్ అప్ చేసుకోవడం చాలా  అవసరం. అప్పుడే రైటర్స్ బ్లాక్ అనే భూతం మిమ్మల్ని పట్టి పల్లార్చదు. 

         
ఇక ఈ మూడు నెలలూ మినీ డెడ్ లైన్స్ ని మర్చిపోండి. మూడు నెలల్లో మొదటి డ్రాఫ్టు పూర్తి  చేయాలనీ కఠోర స్వీయ క్రమ శిక్షణతో ఒక  ఫైనల్ డెడ్ లైన్ అంటూ పెట్టుకున్నాక, ఇక దాని లోపల మినీ డెడ్ లైన్లు ఏవీ పెట్టుకోకండి. అంటే రోజుకిన్ని సీన్లు, లేదా వారానికిన్ని పేజీలూ అనే రూలు పెట్టుకోకండి. ఫైనల్ డెడ్  లైన్ చాలు  మిమ్మల్ని కంట్రోల్  చేసుకోవడానికి. అప్పుడు మీరు రోజుకు రెండు పేజీలే రాయవచ్చు, ఒక్కోసారి పది పేజీలూ రాసేయ్యొచ్చు. మినీ డెడ్  లైన్లు మిమ్మల్ని కంగారు పెట్టడమే కాదు, గిల్టీ కూడా ఫీలయ్యేలా చేస్తాయి. స్వీయ కఠోర క్రమ శిక్షణ అవసరమే గానీ,  అదే పనిగా కాదు. దాంతో మీరు పని రాక్షసులుగా మారిపోతే మీ ఆరోగ్యం చెడి అసలుకే ఎసరొస్తుంది. మీ మెదడు ఎంత శక్తివంతమైనదో,  అంత అద్భుతాలు చేసే ఒక అపురూప పరికరం.  డెడ్ లైన్స్ ఎలా చేరుకోవాలో దానికి బాగా తెలుసు.

కెన్ మియమోటో
(నాల్గో మెట్టు రేపు)

(టాలీవుడ్ టేక్ – ఎక్కువగా ఎలా వుంటుందంటే, మంచం మీద పొర్లాడుతూ, సిగరెట్లు పీల్చి పారేస్తూ సీను కోసం జుట్టు పీక్కుంటూంటారు. దృశ్యాత్మకంగా ఆలోచించేది వుండదు, సంభాషణాత్మకంగానే అలోచిస్తూంటారు. విజువలైజేషన్ వుంటే కదా డైలాగులు వచ్చేది. కాబట్టి రివర్స్ ప్రాసెస్ తో  మనసుని క్షోభ పెట్టుకుంటారు. తమనేదో డైలాగుల కింగ్ కావాలని జనం కోరుకుంటున్నట్టూ, సీనంటే డైలాగులే అన్నట్టూ  వుంటుంది రాసే విధానం. దీనికి కూడా గది, మంచం, లేదా కుర్చీ అనేది పెద్ద ప్రతిబంధకం. ఈ వ్యాసకర్త బైక్ వేసుకుని సిటీ వెలుపల హైవే  మీది కెళ్ళిపోయి వస్తాడు. వచ్చేసరికి చేతి వేళ్ళు జిల పుడుతూంటాయి,  కీబోర్డుతో  సరస సల్లాపం కోసం –సి.)