రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Sunday, June 18, 2017

రివ్యూ!



రచన -నిర్మాణం - దర్శకత్వం:  పట్టాభి ఆర్‌. చిలుకూరి   
తారాగణం:  పూజా దోషి, హరీష్కల్యాణ్, సాయిరోనక్, సంధ్యా జనక్, షర్మిల,  మోహన్రామన్, సుదర్శన్ తదితరులు
సంగీతం:  ప్రసన్-ప్రవీణ్- శ్యామ్ , కెమెరా:  శేఖర్వి. జోసెఫ్ , బ్యానర్ :   అనగనగా ఫిలిం కంపెనీ 
విడుదల : జూన్ 16, 2017
***
          
         కొత్త హీరో హీరోయిన్లతో కొత్త కొత్త దర్శకుల ప్రేమ సినిమాలు ప్రతీ వారం విధిగా విడుదలవుతున్నాయి. మొన్నటి దాకా నాల్గు ఆటలు పడే ప్రేమ సినిమాలు సింగిల్ స్క్రీన్ థియేటర్ లలో సైతం నేడు రెండు ఆటలకి పడిపోయాయి. ఈ రెండాటలకి కూడా ముగ్గురు నల్గురు చొప్పున ప్రేక్షకులు వుంటున్నారు. ఇంకెందుకు ఈ ప్రేమ సినిమాలు తీస్తున్నట్టు? ఈ కొత్త దర్శకుల, నిర్మాతల హిడెన్ ఎజెండా ఏమైనా వుందా? వుంటే మంచిదే. ఇంకో రకంగా లాభ పడుతున్నారనుకోవచ్చు-  థియేటర్ల క్యాంటీనుల  పార్కింగుల ఆదాయాలకి గండి కొట్టి. లేకపోతే  మాత్రం ప్రేమ సినిమాల కుటీర పరిశ్రమ ఎత్తేసి, ఇంకో రకం సినిమాలతో స్టార్ట్ అప్స్ ప్రారంభించుకోవాల్సిన అవసరం లేదా? దేశాన్ని- పోనీ రెండు రాష్ట్రాల్ని  ఎటు తీసికెళ్దా మనుకుంటున్నారు సాంస్కృతికంగా?

        ఈ వారం ఇలాటి కొత్త దర్శకుల జాబితాలో చేరుతూ,  నిర్మాత కూడా తానే అయి పట్టాభి ఆర్. చిలుకూరి  మరో ప్రేమ సినిమాతో వచ్చారు. దీనికి కేటీఆర్, రాం చరణ్ లతో ప్రమోట్ కూడా చేయించుకున్నారు. తీరా థియేటర్లలో చూస్తే పైన చెప్పుకున్న పరిస్థితే వుంది. కేటీఆర్, రాం చరణ్ లు పరిస్థితిని  ఏమీ మార్చలేక పోయారు. తమ పరిస్థితే ప్రశ్నార్ధకమైంది.  ఇలా వచ్చిన మరో ప్రేమ సినిమా ‘కాదలి’,  కొత్త హీరో హీరోయిన్లతో మరో ముక్కోణ ప్రేమ కథ. ముందు కథెలా వుందో చూద్దాం...

కథ 
      బాంధవి (పూజా దోషి) ఒక ఫిజియో థెరఫిస్టు. తల్లి దండ్రులకి తన సంపాదనే దిక్కుగా వుంటుంది. ఎన్నో పెళ్ళిచూపులకి కూర్చుంటుంది. వస్తామన్న వాళ్ళు రారు. కుటుంబం మీద వున్న అప్పులు చూసి వెనుకాడతారు. తనకసలు పెళ్లవుతుందా అన్న బెంగ పట్టుకుంటుంది. బామ్మ ఒక సలహా ఇస్తుంది. ఈ పెళ్లి చూపుల కంటే బయటే  ఎవరో ఒకర్ని నచ్చిన వాణ్ణి చూసి చేసుకోమంటుంది. బాంధవి ఫ్రెండ్ కూడా దీనికి సపోర్టు చేస్తుంది.

          ఫ్రెండ్ తో కలిసి బాంధవి రెస్టారెంట్ కి వెళ్తుంది. అక్కడున్న కార్తీక్ (హరీష్ కల్యాణ్) చూడగానే నచ్చుతాడు. మాట కలిపి స్నేహం చేసి ప్రేమించడం కూడా చేస్తుంది.  కార్తీక్ ఎప్పుడే వృత్తి చేస్తూంటాడో తెలీదు. పైగా కోపం వచ్చినా,  సంతోష మేసినా ఇంట్లోంచి వెళ్ళిపోతాడు. అలా ఇంట్లోంచి వెళ్ళిపోయి కనపడకుండా పోయిన కార్తీక్ గురించి వర్రీ అవుతూంటే, క్రాంతి (సాయి రోనక్) అనే ఇంకో యూత్ తారస పడతాడు. 

          ఇతడి మీద ఇష్టం పెంచుకుని తిరుగుతుంది. ఇతడికి సవతి తల్లి కారణంగా కోపమెక్కువ. ఎప్పుడెవర్ని కొడతాడో తెలీదు. కోపం తగ్గించుకోమని సలహా ఇస్తే వెళ్లి ధ్యాన శాలలో చేరతాడు. ఇంతలో కార్తీక్ తిరిగి వస్తాడు. బాంధవి తికమకలో పడిపోతుంది. ఇప్పుడు తనని ప్రేమిస్తున్న ఇద్దర్లో ఎవర్ని చేసుకోవాలి?  అదెలా చెప్పాలి?
          ఇదీ కథ. 

ఎలావుంది కథ 
       దీన్ని ‘అమీ తుమీ’ లాగా పక్కా రోమాంటిక్ కామెడీ చేసి సొమ్ములు చేసుకుందా మనుకోలేదు. రోమాంటిక్ డ్రామా చేశారు. కొత్త వాళ్ళతో రోమాంటిక్ డ్రామాలు చూసే ఓపిక ఎప్పుడో పోయింది. వీణ సినిమాలు పోయి, గిటార్ సినిమాలు రావాల్సిన కాలం నడుస్తోంది. కాలానుగుణంగా  ‘అమీతుమీ’ గిటార్ వాయించింది. తెలుగులో రోమాంటిక్ కామెడీలు తీయలేకపోతున్నారు. చేయి వంకర్లు పోయి సగం నుంచి  రోమాంటిక్ డ్రామాలుగా మారిపోయి అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి.  తెలుగు రోమాంటిక్ డ్రామాలు అవే రెండు రకాలు : ప్రేమిస్తున్నానని చెప్పలేక గింజుకు చావడం, ఇద్దర్లో ఎవర్ని చేసుకోవాలో తెలీక తన్నుకు చావడం. ప్రేమికుల సందేహాలు తీర్చే పూజా బేడీ ఒక్క మాటలో తేల్చి పారేస్తుంది ఇలాటి సమస్యల్ని. కానీ రెండు గంటల నసగా తీస్తే తప్ప తనివితీరడం లేదు కొత్త దర్శకులకి.  

          ‘కాదలి’ (అంటే ఏమిటో?)  ముక్కోణ జాతికి చెందింది. ఇద్దర్లో ఎవర్ని చేసుకోవాలన్న ధర్మ సందేహం. ఈ పాత్ర విరివిగా వస్తున్న తెలుగు ప్రేమ డ్రామాలు చూడడం లేదు కాబోలు, చూస్తే మాత్రం సెంటిమెంటు ప్రకారం  మొదట దగ్గరైన వాడ్నే చేసుకోవాలని చప్పున గుర్తించేది. 

          కథ కొన్ని వందల సినిమాల పాతదే. కొత్త ప్రతిపాదన లేమీ లేవు. పాతని పాతలాగే పరిరక్షిస్తూ టెంప్లెట్ ప్రేమ డ్రామాకి  పూర్తి న్యాయం చేశారు.

ఎవరెలా చేశారు 
     ఇది హీరోయిన్ కథ. కానీ హీరోయిన్ ఎంపిక మాత్రం ఎంపికలా లేదు. ఎత్తైన హీరోల మధ్య ఆమె చంకలదాకా కూడా రావడం లేదు. పైగా సన్నం. మేడ్ ఫర్ ఈచ్ అదర్ కి ఫర్లాంగు దూరం. లాంగ్ షాట్ పెడితే  అంతేసి ఎత్తుగా హీరోలే కన్పిస్తారు తప్ప ఆమె కన్పించదు. ఆమెని కింద వెతుక్కోవాలి. ఇలా పెట్టి షాట్స్ తీయకూడదని కూడా దర్శకుడు అనుకోలేదు. ప్రేమ కథకి ఇదేం సెలెక్షనో అర్ధం కాదు. ఆమె రికమెండేషన్ మీద వస్తే విధిలేక పెట్టుకున్నట్టుంది. అయితే కొత్త హీరోయిన్ పూజా దోషికి నటించగల టాలెంట్ వుంది. ఆమెది లవ్లీ ఫేస్. నవ్వినప్పుడు క్లోజప్ లో సొట్ట బుగ్గలతో ప్రీతీ జింటాని గుర్తుకు తెస్తుంది. అయితే నస పెట్టే పాత్ర కావడంతో ఆమె పాజిటివ్ వైబ్రేషన్స్ అన్నీ కాసేపటికి వికర్షించడం మొదలెడతాయి. 

          ఫస్ట్ హీరో
హరీష్కల్యాణ్, సెకండ్ హీరో సాయి రోనక్ లు ప్రదర్శించడానికి పాత్రలకి ప్రత్యేకత లేం లేవు. రొటీన్ లవర్ బాయ్స్. హరీష్ పాత్ర మధ్య తరగతి పాత్రయితే, సాయి పాత్ర ఉన్నత తరగతి పాత్ర. ఆరడుగుల ఈ ఇద్దరూ తమ చంకల దాకా రాని అమ్మాయి గురించి కొట్టుకోవడం విచిత్రంగా వుంటుంది. ఇక వీళ్ళ తల్లి దండ్రుల పాత్ర ధారులు కూడా కొత్త వాళ్ళే. 

          కెమెరా వర్క్ ఓ మాదిరిగా వున్నా, హీరోయిన్ మీద చిత్రీకరించిన పాటలు రెండు బావున్నాయి. ఈ లో-  బడ్జెట్ కి ప్రొడక్షన్ డిజైన్ పరంగా సృజనాత్మకంగా అలోచించ కపోవడంతో, పెద్ద సినిమాల విజువల్స్ పేదవాడు తీసినట్టు వున్నాయి.

 చివరికేమిటి 
      ఫీలింగ్స్ తో పని వుండని  ‘అహ నా పెళ్ళంట’, ‘అమీ తుమీ’ లాంటి పక్కా రోమాంటిక్ కామెడీల్లో  నవ్వించడమే ప్రధానం కాబట్టి  లాజిక్ లు ఎగేసినా చెల్లుతుంది. ఫీలింగ్స్ తోనే పండే రోమాంటిక్ డ్రామాల్లో లాజిక్ లు, లాజికల్ గా  వుండే పాత్రల జీవితాలూ లేకపోతే ఒప్పించడం కష్టం. ఈ రోమాంటిక్ డ్రామాలో కథ హీరోయిన్ దైనప్పుడు ఆమె పాత్రని సహేతుకంగా ఎక్కడా ఎస్టాబ్లిష్ చేయలేదు. ఆమె కుటుంబ పరిస్థితుల నేపధ్యంలో ఆమె పెళ్లి నిర్ణయాలు తీసుకోజాలదు. కుటుంబం అప్పులపాలై,  తండ్రికి సంపాదనా లేక, కుటుంబానికి తన సంపాదనే దిక్కయినప్పుడు- పెళ్లి గురించి ఆలోచిస్తే, కుటుంబాన్ని ఎవరు చూస్తారు? తండ్రి కూడా ఏం పెట్టి పెళ్లి చేద్దామని అన్నేసి సంబంధాలు చూస్తున్నాడు? కాబట్టి ఎంత కాదన్నా హీరోయిన్ ‘అంతులేని కథ’ సిట్యుయేషన్ లో ఉన్నట్టే.  తన జీవితం తను చూసుకుని వెళ్లి పోతానంటే అది వేరు. కానీ కథా నాయికకి బావుండదు. బాంధవి అన్నాక కుదరదు.

          కూతురి సంపాదన తల్లి కూడా తింటూ అన్నం తింటున్న తండ్రిని దుయ్యబట్టడం ఇంకో అర్ధం లేని దృశ్యం. చచ్చిన పాములాంటి తండ్రిని ఇంకా ఎందుకు చంపుతున్నారంటే, తద్వారా కూతురు ఆయనకి అన్నం తినిపించే సెంటి మెంటు పండుతుందని!  ఈ పే ఆఫ్ కోసం సెటప్ ని హేళన చేశారు.

          హీరోయిన్ పాత్రతో దర్శకుడు ఏం చేయాలనుకున్నాడో స్పష్టత లేదు. పెళ్లి చేయాలంటే ఆర్ధిక సమస్యలున్నట్టు చూపించారు. మరో వైపు ఆమె పెళ్లి చేసుకుంటే కుటుంబానికి దిక్కేమిటో  చెప్పడం లేదు. ఆమె కథానాయికే అయితే ఈ పరిస్థితుల్లో పెళ్ళే చేసుకోనంటుంది. కుటుంబం కోసమో, అప్పులు తీర్చడం కోసమో కష్టపడుతుంది. ఎప్పటిదాకో మనకి తెలీదు, దైవాధీనం!  బాలచందర్ ‘అంతులేని కథ’, మహాశ్వేతా దేవి నవల ఆధారంగా తీసిన హిందీ ‘తపస్య’ కి కోదండ రామిరెడ్డి చేసిన రీమేక్ ‘సంధ్య’ లాంటి సినిమాలు దర్శకుడు చూశారో లేదో తెలీదు. 

          బామ్మ తన బాధలోంచి చెప్పి వుండొచ్చు- ఇదంతా కాదు, బయట ఎవర్నో చూసుకుని చేసుకోమని.  కానీ హీరోయిన్ అన్నాక అలా చేస్తుందా? అలా చేస్తే, మళ్ళీ బ్యాక్ టు పెవేలియనే అవుతుంది. బయట ప్రేమించే వాడు ఈమె వెనక ఏముందో చూస్తే మళ్ళీ మొదటికేగా? కుటుంబ పరిస్థితి దాచి పెట్టి  అబ్బాయిల్ని ట్రాప్ చేయడానికి హీరోయిన్ బయల్దేరడ మేమిటి. అసలు పెళ్లి ఖర్చులకి కూడా డబ్బులున్నట్టు లేదు. ఇలా బకరాల్ని పట్టే హీరోయిన్ పాత్ర కామేడీకి బావుండొచ్చు. 

          బామ్మ  మాట పట్టుకుని ఫ్రెండ్ తో బయల్దేరిన హీరోయిన్, రెస్టారెంట్ కెళ్తుంది. అక్కడ ఒకతన్ని చూసి ఆగిపోయి గుసగుస లాడుకుంటారు ఇద్దరూ. బావున్నాడు వెళ్లి మాట కలుపు- అని ఏదో చెప్పి ముందుకు తోస్తుంది ఫ్రెండ్. హీరోయిన్ ఆ ముక్కూ మొహం తెలీని హీరోని పెళ్లి కొడుకుగా గా ఫిక్స్ చేసుకుని వెళ్లి పరిచయం చేసుకుంటుంది. ఇక్కడ ఆమె పాత్ర పూర్తిగా పడిపోయింది. ఇదెలా వుందంటే బజారు కెళ్ళి ఎవడు కన్పిస్తే వాణ్ణి మొగుడిగా షాపింగ్ చేసుకుని వద్దామన్నట్టుంది. 

          ఇలా బేస్ సరీగ్గా వుండని పాత్రలు, సన్నివేశాలే సినిమా నిండా. ఈ హీరో కన్పించకుండా పోతే ఫోన్ చేయవచ్చు కదా?  అసలలా కోపమొచ్చినా, సంతోష మేసినా వూరొదిలి వెళ్ళిపోయే వాడు తన కెందుకు? అంత ప్రేమిస్తే రెండో హీరోని చూడగానే మళ్ళీ ఇతన్ని ఆశ పెట్టడం ఎందుకు, కోపిష్టి అయిన ఇతన్ని వదిలెయ్యక? మళ్ళీ మొదటి హీరో రాగానే ఇద్దరితో  ఇరకాటంలో పడ్డ మెందుకు? అసలు బలాదూరు తిరిగే మొదటి హీరోది ఎలాటి ప్రేమ? మళ్ళీ చెప్పకుండా వారణాసి చెక్కేస్తే ఇంకెందుకా  దేశదిమ్మరి?  ఇతనే కావాలనుకుంటే ఇంటర్వెల్లో రెండో హీరోకి చెప్పేస్తే తీరిపోతుందిగా సమస్య. సెకండాఫ్ కి లేని కథని సాగదీయడం ఎందుకు - కేవలం ఈ మాట చెప్పడానికి? 

          లైటర్ వీన్  ప్రేమ సినిమాలు సకాలంలో పాయింటుకి రావు. వస్తే అప్పుడే కథ ముగిసిపోతుందని తెల్సు. అందుకే క్లయిమాక్స్ దాకా పాయింటుకి రాక సాగదీస్తారు. క్లయిమాక్స్ దగ్గర పాయింటు కొచ్చి, ఐదు నిముషాలు సంఘర్షణ పెట్టి తీర్చేసి,  ముగించేస్తారు. అంటే మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే అన్నమాట. కథ ఉంటేగా మిడిల్ ఉండడానికి. కథ క్లయిమాక్స్ లో ఐదు నిమిషాలే వుంటుంది. అప్పటిదాకా నడిచేది స్క్రీన్ ప్లేలో బిగినింగ్ విభాగమే. అందుకే మలుపులేమీ కన్పించవు. బిగినింగ్ విభాగాన్ని సాగదీస్తున్నంత సేపు కథలో మలుపులు రావు. కథనంలో డైనమిక్స్ వుండవు. ఏవో సీన్లు భర్తీ అవుతూంటాయి. కథ ప్రారంభం కాలేదు కాబట్టి సీన్లలో వేగం వుండదు. ఇందుకే ఈ ప్రేమ సినిమాలు భరించలేక పోతున్నారు ప్రేక్షకులు. 

          కథలో ఎలా వుండాలో తెలీని హీరోయిన్ పాత్రకి, పార్కింగ్ ఎక్కడ చేయాలో కూడా తెలీదులా వుంది. అదేమిటో తను పని చేసే హాస్పిటల్ గేటు బయట, రోడ్డు మీద టూవీలర్ పార్క్ చేసి వెళ్తూంటుంది లోపలికి. ఒకసారి కాదు, ఎప్పుడు హాస్పిటల్ కొచ్చినా ఇంతే. లోపల అంత పెద్ద ప్రాంగణంలో పార్కింగే లేదా అని  మనం సస్పెన్స్ తో చస్తుంటాం. పైగా ఆమె స్టాఫ్ కూడా. అప్పుడు  సెకండాఫ్ లో హీరో  రయ్యిన బుల్లెట్ మీద దూసుకొచ్చి, లోపలికి దూరిపోయి  పార్కింగ్ లో ఠకీల్మని పెడతాడు బండిని!  లోపల పార్కింగ్ వుందన్న మాట! మన హీరోయిన్ గారే బయట వేలాడుతోంది- కథలో లాగా! 

          ముక్కోణ ప్రేమల్లో త్యాగం చేసే పాత్రని ఉన్నతంగా చూపించడం, కథనంలో సస్పెన్స్ పోషించడం ఈ రెండే ప్రధానంగా చూసుకోవాల్సిన అంశాలని ఎన్నో అర్ధవంతమైన సినిమాలు చెప్తున్నాయి.

- సికిందర్
http://www.cinemabazaar.in