సెంథిల్ కుమార్ |
కెమెరాతో కథ చెప్పడమంటే కూలివాడి కాయకష్టమే!
అక్కడ గుండెల్ని గుబులెత్తించే
ఉత్కంఠతో సాగిపోతోంది రథం ఛేజ్.. ఎటు చూసినా దిగంతాలకి విస్తరించినట్టున్న ధవళ
కాంతుల ధగధగలతో మైదాన ప్రాంతమది. మంచు మేట వేసినట్టు తెల్లగా తళతళా మెరిసిపోతున్న
తలం మీద జమాయించి గుర్రాలు దౌడు తీస్తూంటే, కనీసం వాటి కాళ్ళు ఆ మంచులో దిగబడవేమిటి?
అదంతా మంచు కాదా? మరేంటి? కంప్యూటర్ సృష్టించిన మాయా?
‘చాలామంది అలాగే అనుకున్నారు..అదే
ప్రకృతి విలాసం. ‘మగధీర’ రధం ఛేజ్ కోసం మేం లొకేషన్ వేటలో గుజరాత్ లో పాక్
సరిహద్దుల్ల దాకా వెళ్ళినప్పుడు, అక్కడి బీఎస్ఎఫ్ అధికారి ఒకాయన ఈ ప్రాంతం గురించి
చెప్పారు. ఇంకో 200 కిలో మీటర్లు ప్రయాణించాక, ఇదిగో ఈ సాల్ట్ ల్యాండ్స్
కన్పించాయి. ఎప్పుడో సముద్రపు నీళ్ళొచ్చి ఇక్కడంతా ఘనీభవించడం వల్ల ఆ ఉప్పంతా ఇలా
గడ్డకట్టుకు పోయిందన్న మాట. ఇట్సే నేచర్స్ వండర్..’ అని కెమెరామాన్ సెంథిల్ కుమార్
చెప్పుకువస్తూంటే అదొక థ్రిల్లింగ్ సెషన్.
థ్రిల్ తో బాటూ కొన్ని కష్టాలూ
ప్యాకేజీగా వస్తాయి. మండే ఎండలు..నీడకి ఒక్క చెట్టు జాడైనా లేని బీడు నేల ..ఐనా విజువల్స్ కి ఓ ఎండుమాను
అత్యవసరమన్పించి దాన్ని తెచ్చి ప్రతిష్ఠించారు. రధం ఛేజ్ కి ఓ పాత మారుతీ వ్యాను
కొనుక్కుని దాన్ని విప్పదీసి ప్లాట్ ఫాం గా మార్చుకున్నారు. దాని మీద కెమెరాలూ అవీ
పెట్టుకుని 15-20 రోజులపాటు ఏకధాటిగా ఒకటే షూటింగ్ చేమటోడ్చుతూ..
సెంథిల్ కుమార్ -2003 లో ‘ఐతే’ సినిమాతో
తెలుగు తెరమీద కన్ను తెరచిన విజువల్ హాలికుడు. తొలిసారిగా తెలుగులో కొన్ని విప్లవాత్మక
మార్పులు ప్రవేశపెట్టిన ఇంద్రజాలికుడు. ‘అశోక్’
తో సూపర్ 35 కెమెరా, ‘త్రీ’ తో బెలూన్ బల్బ్ లైటింగ్, ‘యమదొంగ’ తో దేశంలోనే
పెద్దదైన యమలోకం సెట్ లో చిత్రీకరణ, ‘అరుంధతి’ లో మోషన్ కంట్రోల్ కెమెరా..
‘నిజానికి గ్రాఫిక్స్ వచ్చాక మా పని పెరిగింది.
సెట్ లో బ్లూమ్యాట్ నేపధ్యంలో లేని కదలికల్ని మనోనేత్రం తో చూస్తూ షూట్ చేయాలి..’
అని చెప్పిన సెంథిల్ ‘మన నాలెడ్జి బ్యాంక్
ఎంత విస్తారంగా వుంటే అంత జనరంజకంగా సృజనాత్మకత వెల్లివిరుస్తుంది’ అన్నారు.
‘1960 లలో తెలుగు సినిమాలు దృశ్య
ప్రధానంగా. క్లాసిక్స్ గా ఉండేవి. తర్వాత్తర్వాత వ్యాపారమే ప్రధానమై, డైలాగులతో
స్టేజి డ్రామాలుగా మారిపోయాయి. దాంతో కెమెరా ప్రాధాన్యం తగ్గిపోవడం నాలాంటి
వాళ్లకి బాధాకరమైన విషయం..’ అని విచారం వ్యక్తం చేశారు.
‘ ‘ఐతే ని నేను నవతరపు తొలి రియలిస్టిక్
సినిమాగా చిత్రీకరిస్తే, నాకు గ్లామర్ టేకింగ్ రాదని ఫీల్డు మూడేళ్ళపాటు దూరంగా ఉంచింది ( ‘ఐతే’ కి
ముందు సెంథిల్ 16 ఎం ఎం కెమెరా పట్టుకుని లో బడ్జెట్ ప్రయోగాలు చేయడానికి
చాలామందితో విఫలయత్నాలు చేస్తూ కన్పించేవారు). ఆ సమయంలో ఎస్ ఎస్ రాజమౌళి ‘సై’ కి
అవకాశమిచ్చి ఆదుకోవడంతో, భారీ కమర్షియల్స్ కి కూడా నేను సరిపోతానని రుజువు చేసుకున్నాను’
అని గతాన్ని నెమరేసుకున్నారు.
‘అసలు మా పని కథ వినడంతో మొదలవుతుంది.
కథని నేనెంతో ప్రాణప్రదంగా వింటాను. అప్పుడే అసంకల్పితంగా విజువల్స్ స్ఫురిస్తూంటాయి.
ఫస్ట్ విజువల్ ఈజ్ బెస్ట్ విజువల్ అని
నేను నమ్ముతాను. మళ్ళీ వాటిని తవ్వుకుంటూ కూర్చోను’ అని వివరించారు.
చాలామంది దర్శకులు కెమెరామెన్లతో అస్సలు
షాట్స్ గిరించి చర్చించరు కదా అని అంటే- అది ఆ దర్శకుల అభద్రతాభావమే అన్నారు.
అలాంటి వాళ్ళతో తను పని చేయలేదన్నారు. ‘
‘ఇటీవల విడుదలైన ‘తకిట తకిట’ అనే చిన్న
సినిమాకి గానీ, ఇప్పుడు చేస్తున్న ఇంద్రగంటి మోహన కృష్ణ మరో చిన్న సినిమాకి గానీ
ఇన్వాల్వ్ మెంట్ తోనే చేశాను- చేస్తున్నాను అన్నారు.
రొటీన్ 435 కెమెరాల నుంచీ ప్రస్తుత సూపర్
35 దాకా సాగిన ఈ పదేళ్ళ కెరీర్ లో సెంథిల్ కుమార్ డిజిటల్ కెమెరా వాడలేదు.
మున్ముందు వాడవచ్చు. కెమెరాలన్నీ 35 ఎం ఎం వే. లెన్సుల్నిమార్చడం ద్వారా ఎనమార్ఫిక్
(70 ఎం ఎం) ఫార్మాట్ చేసుకోవచ్చు. అయితే ఇతర కెమెరాల్లో ఆడియో ఫార్మాట్ కి
నెగెటివ్ మీద కొంత చోటు వదిలి చిత్రీకరిస్తారు.
సూపర్ 35 కెమెరాతో మొత్తం ఆ చోటునంతా ఆక్రమించవచ్చు. తర్వాత ప్రాసెసింగ్ లో
కుదించి ఆడియో ఫార్మాట్ వేసుకోవచ్చు. అంతే గాక, ఈ కెమెరా తక్కువ వెలుతురులోనూ,
ఎక్స్ ట్రావైడ్ యాంగిల్ షాట్స్ లోనూ సమర్ధవంతంగా పనిచేస్తుంది.
సెంథిల్ కుమార్ పూర్వీకులు తమిళనాడు
నుంచి వచ్చి సికింద్రాబాద్ లో స్థిరపడ్డారు. పీజీ పూర్తి చేసి సివిల్స్ కి
రాస్తూంటే, ఓ మిత్రుడు తమాషాకి తెచ్చిన దరఖాస్తు ఫాం నింపి పంపిస్తే పుణే ఫిలిం
ఇనిస్టిట్యూట్ లో సీటొచ్చింది!
‘దట్ ఐ బిలీవ్ వాజ్ మై డెస్టినీ..’ అని ఎమోషనల్ గా అని, తన సినిమాటోగ్రఫీని ఎంజాయ్ చేస్తున్న ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు చెప్పారు సెంథిల్.
―సికిందర్
(ఆంధ్రజ్యోతి- ‘సినిమా టెక్’ శీర్షిక, నవంబర్ 2010)
(ఆంధ్రజ్యోతి- ‘సినిమా టెక్’ శీర్షిక, నవంబర్ 2010)