రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

25, మే 2015, సోమవారం

మూసగాళ్ళకు మరో పాఠం!



రచన, దర్శకత్వం: బోస్‌ నెల్లూరి
తారాగణం: సుధీర్‌ బాబు, నందిని రాయ్‌, జయప్రకాష్‌రెడ్డి, అభిమన్యు సింగ్‌, పంకజ్‌ కేసరి, ప్రవీణ్‌, చంద్రమోహన్‌, సప్తగిరి, ఫిష్‌ వెంకట్‌, దువ్వాసి మోహన్‌ తదితరులు
మాటలు: ప్రసాద్‌ వర్మ  సంగీతం: మణికాంత్‌ ఖాద్రి   ఛాయాగ్రహణం: యు. సాయిప్రకాష్‌బ్యానర్‌: లక్ష్మీ నరసింహా ఎంటర్‌టైన్‌మెంట్స్‌   నిర్మాత: చక్రి చిగురుపాటి
విడుదల : మే 22, 2015
*
          కొత్త కొత్త హీరోలు, మూడు నాల్గు సినిమాల వయస్సు గల వర్ధమాన హీరోలూ కొత్త దర్శకుల్ని నమ్ముకుని బాగా దగా పడుతున్నారు. అసలు కొత్త దర్శకుల సినిమాలంటేనే  చూడ్డానికి భయపడాల్సిన  పరిస్థితులేర్పడ్డాయి. సినిమా మాధ్యమం గురించి, ప్రేక్షకాభిరుచి గురించీ  కనీసావగాహన లేకుండా సినిమాలు తీసేయడం కొత్త దర్శకుల దినచర్య అయింది. ఏ యేటికా యేడు వందేసి మంది ఇలాటి కొత్త దర్శకులు వచ్చేసి  చాలా బెడదగా తయారవుతున్నారు సినిమా రంగానికి, బయ్యర్లకీ, ప్రేక్షకులకీ.  తీసే ఒక్క సినిమాతో కాలగర్భంలో కలిసిపోయే ఈ దర్శకులు అసలు దర్శకులు కాకపోతే వచ్చే నష్టమేమిటి? కొత్త నిర్మాతలకి సభ్యత్వం ఇచ్చేముందు తగిన కౌన్సెలింగ్ ఇవ్వాలని నిర్మాతల మండలి అనుకున్నట్టు- అలాటి ఓ వడపోత కార్యక్రమం కొత్తగా దర్శకులయ్యే వాళ్లకి లేకపోడంతో ఇష్టారాజ్యంగా సాగిపోతోంది దందా!

          ప్రస్తుత సినిమా ‘మోసగాళ్ళకు మోసగాడు’ తీసిన కొత్త దర్శకుడిదీ ఇదే దారి. నేను సైతం ఫ్లాపుల కాష్ఠానికి సినిమా వొక్కటి ఆహుతిచ్చాను.. అనేసి సగర్వంగా ప్రకటించుకోవడానికే ఈ బృహత్కార్యానికి సమకట్టి నట్టుంది. మొదటి సినిమా ‘డీకే బోస్’ విడుదలైతే కాలేదు గానీ, పేరున్న హీరోతో ఈ రెండో సినిమా దక్కింది. ఇదయినా విడుదల కాని మొదటి సినిమా నుంచి నేర్చుకున్న పాఠంలా ఉండాల్సింది అదీ కాలేదు.

          హీరో సుధీర్ బాబు తాను పాపులర్ హీరోగా ఎస్టాబ్లిష్ అవ్వాలని ఆశించే ముందు ఇలాటి పాసివ్ హీరో పాత్రల పట్ల అప్రమత్తత ప్రదర్శించడం మంచిది. ఏం హీరోయిజం వుందని ఈ ‘హీరో’ పాత్రకి అంగీకరించాడో తనకే తెలియాలి. తనకి తెల్సింది శిక్షణ పొందిన నటనే అయితే అది మాత్రమే చాలదు- తన నటనా వృత్తిలో భాగమే అయిన పాత్ర చిత్రణని  కూడా కాస్త పట్టించుకోవాలి. కానీ దురదృష్టమే మిటంటే, ఏ ఫిలిం ఇనిస్టిట్యూట్ కూడా నటులు పాసివ్  పాత్రల్ని ఎలా ఏరిపారేసి యాక్టివ్ పాత్రల్ని ఎంపిక చేసుకోవాలో నేర్పే పాపాన పోవడం లేదు.  ఇదంతా  స్క్రీన్ ప్లే సబ్జెక్టులో భాగంగా బోధించే విషయంగా మాత్రమే చూస్తున్నాయి విచారకరంగా. ఇందుకే  ఎడాపెడా చిన్న సినిమాలూ భారీ బడ్జట్ సినిమాలూ పాసివ్ పాత్రల్ని పోగేసుకుని అట్టర్ ఫ్లాపై చతికిలబడుతున్నాయి. దర్శకులకి పాసివ్- యాక్టివ్ పాత్రల గురించేమీ తెలీదని చెప్పడానికి సందేహించనక్కర్లేదు. ఇలాటి వ్యాసాల్లో గత  పదేళ్ళుగా వందల సార్లు రాసినా వాళ్ళ దారి వాళ్ళదే.  హీరోయిజానికి అశాస్త్రీయంగా తమ తమ సొంత నమ్మకాలూ అభిప్రాయాలూ ఆపాదించుకుని తెచ్చి, పనికిరాని పాసివ్ పాత్రల్ని హీరోలకి అంటగడు తున్నారు శుభ్రంగా. ఇలా ‘మోసగాళ్ళకి మోసగాడు’ అన్పించుకుందామని అంచనా వేసుకున్న సుధీర్ బాబుకి కూడా ఈ ‘మోసమే’ జరిగిపోయింది నిలువెల్లా! సిడ్ ఫీల్డ్ మాటల్లో చెప్పాలంటే, ఈ సినిమా కథలో
 తన క్యారెక్టర్ simply disappears off the page! ఇంత దారుణమన్న మాట.

          తెలుగు సినిమా చరిత్రని ఓ మలుపుతిప్పిన ట్రెండ్ సెట్టర్, హీరో కృష్ణ మానసిక పుత్రిక ‘మోసగాళ్ళకు మోసగాడు’ టైటిల్ ని వాడుకుని, సినిమా తీసి ఇంత అపహాస్యం చేసే అర్హత ఏకోశానా ఈ కొత్త దర్శకుడికి లేదనేది మాత్రం నిర్వివాదాంశం.

          ఇంతకీ ఇదే జాతి సినిమా? కామిక్ థ్రిల్లరా? యాక్షన్ కామెడీయా? పోనీ ఉత్త కామెడీయా? అదికూడా ట్రెండ్ లో వున్న కామెడీయా? యూత్ అప్పీల్  వున్న కామెడీయా? లేకపోతే పురాతన ప్రేక్షకులు చూసేసి దాటేసిన కాలం చెల్లిన కామెడీయా? కథలోంచి పుట్టిన  కామెడీయా? కథని అనాధలా వదిలేసి జోకర్లా వంకర్లు పోయిన సంబంధం లేని కామెడియా?

          సినిమా చిట్ట చివర్న- దర్శకుడు తన పేర్న ఓ సూక్తి వేసుకున్నాడు. ఈ సూక్తి ఈ సినిమా కథ (?) లో ఒక చోట ఓ పాత్రతో అన్పించిందే- 
చెడు చేసేవాడు ఆలోచించాలి, మంచి చేసేవాడు చేసుకుంటూపోవాలి- అని!  కానీ దర్శకుడు ఈ రెండూ చెయ్యక శుభ్రంగా మధ్యేమార్గంగా పలాయనవాదం పఠించాడు ‘కథ’ తో. ఆ ‘కథ’ ఏమిటో ఇప్పుడు చూద్దాం...

ఇంకా పాత మూస ఫార్ములే!
      రొటీన్ గా హీరో ఓ అనాధ. మోసాలు చేసి బతికే చలాకీ. హీరోయిన్ ప్రభుత్వ గ్రంధాలయంలో ఏడున్నర వేల జీతగత్తె అయిన ఖరీదైన డ్రెస్సులు వేసే సగటు లైబ్రేరియన్. ఈమెని రోడ్డు మీద చూసింది లగాయతు ప్రేమంటూ వెంటపడతాడు. ఎలాగూ హీరోయిన్ పెళ్లి చేసుకోవాలని వేరేగా మ్యారేజి బ్యూరోతో కాంటాక్టు లో వుంది. హీరో వెంటపడి వేధిస్తూంటే తప్పించుకునే ప్రయత్నాలు చేస్తూంటుంది. అతడి వృత్తేమితో తెలిసి ఆ వృత్తి మానేస్తే పెళ్లి చేసుకుంటా నంటుంది. అలాగేనని మాటిచ్చి ప్లేటు ఫిరాయిస్తాడు.
          షరా మామూలుగా స్మగ్లర్లతో దందా చేస్తూనే ఉంటాడు. ఈసారి దందా ఏమిటంటే, ఎక్కడో అయోధ్యలో దుండగులు కాజేసిన 12 వ శతాబ్దపు సీతారాముల విగ్రహాల్ని దుబాయ్ కి స్మగుల్ చేసి అక్కడ రుద్రా ( అభిమన్యూ సింగ్) అనే బడా స్మగ్లర్ కి అప్పగించాలి. ఆ విగ్రహాల్ని పాతిక కోట్లకి అమ్మేసిన రుద్రా వాటి స్మగ్లింగ్ కి హైదరాబాద్ లోని కౌషిక్ ( జయప్రకాష్ రెడ్డి) అనే మరో స్మగ్లర్ కి ఆఫర్ ఇస్తాడు. కౌషిక్ మన హీరోకి ఈ పని అప్పజెప్తాడు. హీరో ఆ విగ్రహాల్లో ఒకటి కాజేసి మోసం చేస్తాడు. హీరో ఉద్దేశ మేమిటి? రెండో విగ్రహం కూడా ఎలా సంపాదించాడు? ఈ విగ్రహాలని ఏం చేశాడు? తన మాస్టారి స్కూలు అన్యాక్రాంతం అవకుండా ఎలా కాపాడాడు? హీరోయిన్ ప్రేమని ఎలా గెల్చుకున్నాడు వంటి పరమ రొటీన్ చొప్పదంటు  ప్రశ్నలకే మళ్ళీ సమాధానాలకోసం ఈ సినిమా మిగతా భాగం మొత్తాన్నీ చూసే ధైర్యం కూడగట్టుకోవాలి.

ఎవరెలా చేశారు?
         ఇలాటి అమెచ్యూరిష్ సినిమాలో  ఎవరెలా చేశారో చెప్పుకోవడాని కేముంటుంది? ఎందుకు చెప్పుకోవాలి?  సుధీర్ బాబు డైలాగ్ డెలివరీలో ఇంప్రూవ్ అయ్యాడు, నటనలో ఈజ్ కనబర్చాడు, స్టెప్పులు బాగావేసి,  ఫైట్లు అదరగొట్టాడు..అంటూ రొటీన్ గా పడికట్టు పదాలో, టెంప్లెట్లో వాడేసి పాత్రికేయ ధర్మం అయ్యిందన్పించు కోవడ మెందుకు?  ఈ పడికట్టు పదాలూ, టెంప్లెట్లూ అనేవి ఎప్పుడు? అసలంటూ పాత్ర బావున్నప్పుడు. పాత్రే ఆకట్టుకోనప్పుడు- కథలో కరివేపాకు పాత్ర అయిపోయి నప్పుడు,  ఆ హీరోగారి  ప్రతిభా పాటవాల గురించి రాతలెందుకు? 

          ఈ బుల్లి సినిమాలో హీరోయిన్ దీ ఇదేదో భారీ ఫార్ములా సినిమా అయినట్టూ  ప్రేమలకీ, పాటలకీ మాత్రమే  పరిమితమై పోయిన మరో కృతక పాత్ర. టాలెంటెడ్ నటులు జయప్రకాష్ రెడ్డి, దువ్వాసి మోహన్ లు కూడా మాత్రం ఏం చేయగలరు- కామెడీ పేరుతో దర్శకుడి చ్చిన అర్ధంపర్ధంలేని సెకండ్ గ్రేడ్ లౌడ్ కామెడీతో,  ప్రేక్షకుల నరాలమీద సుత్తి మోతలు ప్రసాదించడం తప్ప? పరమ క్రూరుడుగా ఎంట్రీ ఇచ్చిన విలన్ పాత్ర అభిమన్యు సింగ్ కి మాత్రం దర్శకుడి చేతిలో ఏం మిగులుతుంది- డమ్మీ క్యారక్టర్ గా మారిపోవడం తప్ప? మొదట్నుంచీ కథే మిటన్నది దర్శకుడికే తేలనప్పుడు,  క్లయిమాక్సులు ఎలా ఉంటాయో ఈ మధ్య చూస్తున్నదే- తానుగా కథ ముగించలేని హీరోని మాయం చేసేసి, కమెడియన్లతో వేరే ఎపిసోడు నడిపేసి  ముగించడమే. ఈ కమెడియన్లు ఫిష్ వెంకట్, సప్తగిరి లు అయ్యారు. సినిమా అనేది నిరక్షరాస్యుల కోసం నిరక్షరాస్యులు తీసే వినోద సాధనమని ఎవరో మేధావి ఇందుకే అని వుంటాడు. 

          పాటలతో సహా సాంకేతికంగా ఎందులోనూ ఈ సినిమాలో క్వాలిటీ ఉండనవసరం లేదు- ఎందుకంటే అసలే ఇది నాటు కామెడీ! అన్నిటినీ చదును చేసేస్తుంది. 

స్క్రీన్ ప్లే సంగతులు?
         స్క్రీన్ ప్లే సంగతులా? అంటే ఏమిటి? మనల్ని రెండు గంటలు కూర్చోబెట్టి కనీసం మర్యాద కోసమైనా కాస్త విజ్ఞత కనబర్చని కథా కథనాలతో, చిత్రణా చిత్రీకరణలతో భరించలేని సహన పరీక్ష పెట్టే  సినిమాలకి కూడా స్క్రీన్ ప్లే సంగతులు చెప్పుకోవాలా? స్క్రీన్ ప్లే అనేది వుంటే సంగతులేమైనా  చెప్పుకోవచ్చు. కథే లేనప్పుడు స్క్రీన్ ప్లే ఎక్కడిది? All drama is conflict; without conflict there is no character;  without character there is no action; without action there is no story. And without story there is no screenplay!- అని స్పష్టంగా విడమర్చి కామన్ సెన్స్ చెప్పాడు సిడ్ ఫీల్డ్ ! ఇది తెలుగు సినిమాలకి వర్తించదా? తెలుగులో శాస్త్రీయ గ్రంధాలు లేకపోవడం వల్ల ఆడింది ఆటగా సాగుతోంది పరిస్థితి. తెలుగులో శాస్త్రీయ గ్రంధాలుండి, తెలివైన ప్రేక్షకులు ఇలాటి సినిమాలకి చిర్రెత్తి వాటిని ఎత్తి చూపి ప్రశ్నించినప్పుడు తెలుగు సినిమాల్ని వొళ్ళు దగ్గర పెట్టుకుని తీసే అవకాశముంటుంది. విమర్శకులు ప్రశ్నిస్తే అది కంఠ శోషే. గ్రంథాలతో ప్రేక్షకులు తిరగబడితేనే ఇలాటి దందాలు బంద్ అవుతాయి. ఇలాటి సినిమాలు తీసి పోగొట్టుకునే డబ్బుతో పది కుటుంబాలకి శాశ్వత ఆర్ధిక క స్వాతంత్ర్యం కల్పించవచ్చు నిజానికి.

          ఈ సినిమా ‘స్వామిరారా’ వంటి కల్ట్ ఫిలిం కి సీక్వెల్ అని ప్రచారం ఒకటీ. సీక్వెల్ అంటే కొనసాగింపు కథ అని అర్ధం. మళ్ళీ కొత్తగా అదే విగ్రహాల చోరీ కథ నెత్తుకుంటే సీక్వెల్ ఎలా అవుతుంది. అయోధ్యలో విగ్రహాల చోరీ అంటూ ఎంత కల్పిత ‘కథ’ చెప్పినా దాన్ని చాలా ప్రమాదకర ధోరణిగానే పరిగణించాలి సృజనాత్మక స్వేచ్ఛాపరంగా. దర్శకుడు తలపోసినట్టు వూర మాస్ కామెడీ కాబోదు. అయోధ్యకి ముడిపెట్టి ఇలాంటిదేం జరిగినా అది మొత్తం దేశానికే తీవ్ర శాంతి భద్రతల సమస్యవుతుందని దర్శకుడు గమనించాలి, సృజనాత్మ స్వేచ్ఛ వుందని చెప్పేసి ఎక్కడ్నించి పడితే అక్కడ్నించి కథల్ని ఎత్తుకోవడం కాదు.

          ఆ విగ్రహాలు హైదరాబాద్ లాంటి సున్నిత ప్రాంతానికే తరలించడం దర్శకుడి ఇంకో అనాలోచితమైన చర్య. హీరో ఇక్కడే ఉంటున్నాడు గాబట్టి విగ్రహాలూ ఇక్కడికే రావాలన్నట్టుంది కథనం. హీరో ఏం చేస్తున్నాడు ఇక్కడ? అయోధ్యలో అంత సంచలన నేరం జరిగితే ఇక్కడ మోసగాళ్ళకు  అంత మోసగాడే అనుకుంటున్నా హీరోకి ఆ సంగతి తెలియకుండానే ఉంటుందా? మరి అతనెందుకు ఫస్టాఫ్  అంతా విసుగెత్తించే ప్రేమకథతో కాలక్షేపం చేశాడు? 

          ఒక బిల్డప్ తో అయోధ్యలో విగ్రహాల అపహరణ జరుగుతుంది. దీనితర్వాత కథేమిటో అర్ధంగాకుండా కొసరు ప్రేమకథే ఇంటర్వెల్ దాకా సాగుతుంది. ఈ రోజుల్లో సినిమా ప్రేమకథలు ఎవరు చూస్తారు. షార్ట్ ఫిలిమ్స్ ప్రేమకథలు ఇంతకన్నా వాస్తవికంగా- కాలీన స్పృహతో యూత్ ఫుల్ గా ఉంటున్నాయి. ఎస్టాబ్లిష్ చేసిన విగ్రహాల పాయింటుతో థ్రిల్లర్ కథా కమామీషు ప్రధాన కథ కావాలి ఈ సినిమాకి నిజానికి. ‘స్వామిరారా’ లో విగ్రహ స్మగ్లింగే ప్రధాన థ్రిల్లర్ కథ. అందులోంచి పుట్టి రేఖామాత్రంగా వుండీ లేనట్టు సాగేదే – సబ్ టెక్స్ట్ గా పరోక్షంగా సాగేదే ప్రేమ కథ. కానీ ఇక్కడ దర్శకుడు ప్రధాన కథని బహుశా డీల్ చేయలేక వదిలేసి- పలాయనవాదంతో పనికిరాని ప్రేమకథతో, ఇంకేదో ఛోటా విలన్ల (జయప్రకాష్ రెడ్డి- దువ్వాసి మోహన్) గోల కామెడీ తో కాలక్షేపం చేశాడు. ఏమాత్రం మార్కెట్ స్పృహ వున్నా, ఇవ్వాళ్ళ మార్కెట్ కేం కావాలో భిన్నంగా, పోటీతత్వంతో ఆలోచించి ఈ సినిమా తీసేవాడు. 

          పోనీ సెకండాఫ్ లో నైనా ప్రధాన కథని థ్రిల్లింగ్ గా చెప్తాడేమోనని చూస్తే,  అక్కడా షరా మామూలు శ్రీను వైట్ల ఫార్ములాయే శిరోధార్యమైంది ఈ కొత్త దర్శకుడికి తన దగ్గర సొంత విషయమే లేనట్టు! 

          దుబాయ్ విలన్లూ, హైదరాబాద్ విలన్లూ సహా హీరో హీరోయిన్లూ ఒకే ఇంట్లో చేరి వూర కామెడీ చేసుకోవడం మళ్ళీ మళ్ళీ చూడాలిక్కడ. ఆఖరికి విలన్లు ఆ విగ్రహాల్ని అందుకోవడానికి ఇంకేదో రహస్య ప్రదేశమే దొరకనట్టు- రెండు కోట్లు ఖర్చు పెట్టి చిల్లర విలన్ ( ఫిష్ వెంకట్) పెళ్లి శుభాకార్యమంటూ పెళ్లి కూతురితో కలిపి అశ్లీల కామెడీ సృష్టించి ఆ సందట్లో ఎవరికీ తెలీకుండా పనులు చక్కబెట్టుకుంటారట! సినిమా లాజిక్ కైనా ఓ లాకింగ్ సిస్టం వుంటుంది- దాన్నికూడా విరిచిపారేస్తే ఇలాగే తయారవుతుంది.
          పసలేని ప్రేమకథని అంత విరగబడి నడిపిన హీరో, అసలు కథ వచ్చేసరికి కన్పించడు. ఎవరెవరో విలన్లు, కమెడియన్లూ ‘కథ’ ని వదిలేసి ఇంకేవో గోలలు  సృష్టించుకుంటూ పోతూంటారు. హీరో జస్ట్-
disappears off the page!


          ఇంతోటి హీరోకి ఓ ఫ్లాష్ బ్యాక్ కూడా! తెలుగు రాష్ట్రాల్లో మగపుట్టుక పుట్టిన పాపానికి దిక్కులేని అనాధలుగా మిగిలిపోక తప్పదన్నట్టుగా, తెలుగు సినిమాల్లో కుప్ప తెప్పలుగా చూపించు కొస్తున్న అనాధ హీరో పాత్ర ఈసారి ఇక్కడ, చిన్నప్పుడు మేస్టారి పర్సు కొట్టేసి లారీ కింద పడితే, అదే మాస్టారు కాపాడాడు కాబట్టి, ఈ సత్తెకాలపు మాస్టారి అనాధ పిల్లల స్కూల్ని కార్పొరేట్ స్కూలోళ్ళు హైజాక్ చేయకుండా, ఆర్ధిక సాయం చేయడానికే మనవాడు ‘మోసగాడుగా’ గా మారాడట! ఏనాటి కథలివి- ఈనాటి సత్తెకాలపు కొత్త దర్శకులు తీరికూర్చుని చెబుతున్నారు? 

          ఈ సినిమాకి స్క్రీన్ ప్లే లేదు, ఎందుకంటే- స్క్రీన్ ప్లే కి కనీసం ఓ హీరో వుండి- అతడి పరంగా కథ సాగి- అతడి క్యారక్టర్ ఆర్క్ ని సృష్టిస్తూ- టైం అండ్ టెన్షన్ థియరీకి న్యాయం చేయాలి. పురాణ కథ తీసుకున్నా, అణ్వాయుధాల కథ తీసుకున్నా కన్పించేది ఈ బేసిక్సే. కానీ దర్శకుడి ఆలోచన ఎక్కడా పెరగదు. మొదలెట్టింది లగాయత్తూ  చివరిదాకా అదే నేలబారు లెవెల్లో ఆలోచన వుండి పోతుంది. టెన్షన్- థ్రిల్- కాన్ఫ్లిక్ట్ లనేవి సినిమాకి అతి ముఖ్యమన్న అవగాహన ఏకోశానా కన్పించదు. ప్రధాన కథలోంచి ఫైట్ ని సృష్టించలేక కొసరు కథలో చిల్లర గ్యాంగ్ ని మళ్ళీ రప్పించి, సెకండాఫ్ లో ఎంత స్టయిలిష్ గా యాక్షన్ సీను సృష్టించినా, అది మృతదేహానికి అలంకరణ చేసిన చందాన్నే మిగిలిపోయింది.

—సికిందర్