రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Monday, August 3, 2020

964 : రివ్యూ


దర్శకత్వం : అనూ మీనన్
తారాగణం: విద్యాబాలన్, సాన్యా మల్హోత్రా, అమిత్ సాద్, జిష్షూ సేన్ గుప్తా తదితరులు
సంగీతం: సచిన్ -జిగర్, ఛాయాగ్రహణం: కీకో నకహరా
బ్యానర్ : సోనీ పిక్చర్స్ నెట్వర్క్ ఇండియా, విక్రం మల్హోత్రా
విడుదల : అమెజాన్

***
ణిత మేధావి, మానవ కంప్యూటర్, లెజెండ్ శకుంతలా దేవి బయోపిక్ గా నిర్మించిన ‘శకుంతలా దేవి’ పూర్తిగా విద్యాబాలన్ వన్ వుమన్ వండర్ఫుల్ షో. వచ్చిందంటే బాలన్ ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ నే మోసుకొస్తుంది. శకుంతలా దేవియే స్వయంగా గణితంతో జగమెరిగిన ఎంటర్ టైనర్ అయినప్పుడు, బోరుకొట్టే గణితానికి హుషారు తెప్పించే  గ్లామర్ తీసుకొచ్చినప్పుడు, సర్కస్ లో రింగ్ మాస్టర్ లా వేదికల మీద గణితంతో వినోదం పంచినప్పుడు, బాలన్ కి పండగే అయిపోతుంది ఫన్ చేయడానికి. బరువైన జీవిత గాథలతో యమ బోరుగా, సీరియస్ గా వుండే బయోపిక్స్ జానర్ కి, శకుంతలా దేవి పుణ్యమాని కమర్షియల్ సినిమా రెక్కలొచ్చాయి. ఆమె జీవితం ఒక కమర్షియల్ సినిమా. విద్యాబాలన్ డైలాగు చెప్పినట్టు - చెట్టుకీ మనిషికీ తేడా వుంది. చెట్టుకి వేళ్ళుంటాయి, మనిషికి కాళ్ళుంటాయి. వేళ్ళు నేలలో పాతుకుని అక్కడే వుండి పోతాయి, కాళ్ళు ప్రపంచమంతా చుట్టేస్తాయి. శకుంతలా దేవి బయోపిక్ వేళ్ళు లాంటిది కాదు, కాళ్ళు వంటిది. పరుగులు తీసే పాదాలతో గ్లోబల్ లేడీగా ఆమె బయోపిక్ ఒక వరల్డ్ టూరు. టోటల్ ప్రపంచం బ్రహ్మరధం పట్టిన సెలెబ్రేషన్.

        సెలెబ్రేషన్ని ఈ తరం ప్రేక్షకుల ముందుకు డైనమిక్ గా తీసుకువచ్చింది కొత్త దర్శకురాలు అనూ మీనన్, రచయిత్రులు నయనికా మహ్తానీ, ఇషితా మోయిత్రాలతో కూడిన ఫిమేల్ టీం. ఇలాటి ఫిమేల్ టీములు బాలీవుడ్ లో చూసి టాలీవుడ్ లో ఏర్పడ్డం ఎప్పటికి జరుగుతుందో తెలీదు. ఈ బయోపిక్ ఫిమేల్ టీము ఇగోలు తెచ్చుకుని మేల్ ఆలోచనలతో ఫేక్ మేకింగ్ చేయకుండా, ఆద్యంతం కోమలమైన స్త్రీ సుగుణాలు ప్రతిఫలించేలా శకుంతలా దేవికి నీరాజనాలు పట్టారు. 

కథ
    ప్రపంచ ప్రఖ్యాత గణిత మేధావి శకుంతలా దేవి (విద్యాబాలన్) మీద ఆమె కుమార్తె అనుపమ (సాన్యా మల్హోత్రా) పదేళ్ళ పాటు జైలుకి పంపే క్రిమినల్ కేసు వేయడంతో ప్రారంభ మవుతుంది బయోపిక్. అనుపమ జ్ఞాపకాల్లో ఫ్లాష్ బ్యాకుల్లో వస్తూంటుంది శకుంతలా దేవి గత జీవితం...1930 లలో కర్ణాటకలో ఐదేళ్ళ శంకుంతల స్కూలు కెళ్లకుండానే లెక్కల్లో అసాధారణ ప్రతిభ కనబరుస్తుంది. ఎలాటి గణిత సమస్యనైనా సెకన్లలో సాల్వ్ చేసేస్తూంటుంది. ఆ వయసులోనే ఆమె గణితావధాని. ఎనిమిదేసి అంకెలున్న సంఖ్యని, ఇంకో ఎనిమిదేసి అంకెలున్న సంఖ్యతో హెచ్చ వేసి, ఎంత వస్తుందో చెప్పమని బోర్డు మీద రాస్తే, రెండు క్షణాలు ఓ లుక్కేసి చట్టుక్కున చెప్పేసి ఆశ్చర్యంలో ముంచేస్తూంటుంది. క్యూబ్ మూలాలైతే  కంప్యూటర్ కంటే వేగంగా లెక్కించి ఠకీల్మని చెప్పేస్తూంటుంది. లెక్కలు ఆమె ఎడం చేతి వాటం అయిపోతాయి. 


        ఇదంతా గమనించి సంపాదన లేని పేద బ్రాహ్మణుడైన ఆమె తండ్రి (ప్రకాష్ బెలవాడీ) ఆమెని స్కూళ్ళకి తిప్పి ప్రదర్శన లిప్పిస్తూ డబ్బులు సంపాదిస్తూంటాడు. స్కూల్లో చేరి చదువుకోవాలన్న ఆమె కోరిక మాత్రం నెరవేర్చడు. తండ్రి ముందు తల్లి (ఇస్పితా చక్రవర్తి) నోరు విప్పలేని నిస్సహాయురాలు. తల్లిదండ్రు లిద్దరూ ఇలా వుండేసరికి విసిగిపోయిన శకుంతల, ‘సంపాదిస్తున్నది నేనైనప్పుడు నాన్న కాదు నేను తండ్రిని’ అని తిరుగుబాటు ప్రకటిస్తుంది ఐదేళ్లప్పుడే. తను సంపాదిస్తున్నా ఆ డబ్బుతో వైద్యం చేయించక పోవడంతో వికలాంగు రాలైన అక్క చనిపోతుంది. దీంతో తల్లిదండ్రుల పైన ఇంకా అసహ్యం పెంచుకుంటుంది. ఇక జీవితంలో క్షమించనని తల్లికి చెప్పేస్తుంది. నీలా నేను తయారుకానని తల్లిని ద్వేషిస్తుంది. భూమి గుండ్రంగా వుందమ్మా, నీ కూతురితో నీకూ నాలాటి పరిస్థితే వస్తుందని తల్లి అంటుంది.

        శకుంతల యుక్త వయస్కురాలయ్యే టప్పటికి ఆమె పేరు దేశంలో మార్మోగిపోతుంది. ఇక నగరాల్లో ప్రదర్శనలివ్వడం మొదలెడుతుంది. తన కంప్యూటర్ కంటే వేగవంతమైన మెదడుతో గణిత మేధావులు సైతం అవాక్కయ్యేలా చేస్తూంటుంది. 1955 కల్లా లండన్ నుంచి ఆహ్వానం వస్తుంది. అక్కడ ఆమె గణితావధానం అంతర్జాతీయ మవుతుంది. ఇక ఆమెని  మానవ కంప్యూటర్ గా కీర్తించడం మొదలెడతారు. ప్రపంచ మంతా ప్రదర్శన లిస్తుంది. దేశవిదేశాల్లో అపార ధనరాసులు, ఆస్తులు గడిస్తుంది. స్కూలుకే వెళ్ళని తను ఇంగ్లీషు మాట్లాడేస్తుంది. ఆమె మెదడు శాస్త్రవేత్తలకి కూడా అంతు చిక్కని రహస్యమై పోతుంది.  

     ఒక కలకత్తాకి చెందిన ఐఎఎస్ అధికారి పరితోష్ బెనర్జీ (జిష్షూ సేన్ గుప్తా) ని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. కానీ కూతురు పుట్టగానే భర్త కప్పజెప్పి ప్రపంచ యాత్రకి వెళ్ళిపోతుంది. గణితం లేకుండా తను వుండలేదు. తనని విడిచి అంకెలు వుండలేవు. పైగా బానిస లాంటి తన తల్లికి తానేమిటో నిరూపించాలన్న కసి, తల్లిలా తను ఐపోకూడదన్న పట్టుదలా ఇంకోవైపు. తల్లి ప్రేమ కరువైన కూతుర్ని గుర్తించి లండన్ కి తెచ్చుకుంటుంది. కానీ స్కూల్లో వేయకుండా తనవెంటే దేశాలు తిప్పుతుంది. అక్కడ్నించీ తల్లీ కూతుళ్ళ మధ్య సంబంధ బాంధవ్యాలు సంక్షుభితమవడం మొదలెడతాయి. ఇరవయ్యేళ్ళూ సుఖ శాంతులుండవు. తన తల్లితో తనేం చేసిందో అదే తన కూతురూ తనకూ చేయడం భూమి గుండ్రంగా వుందన్న తల్లి వాక్కుని గుర్తుచేస్తుంది. 

        చివరికి తల్లిని జైలుకి పంపే క్రిమినల్ కేసు వేసే పరిస్థితి కూతురి కెందు కొచ్చింది? కూతురి సర్వం లాక్కుని రోడ్డున పడేసే పని తల్లి ఎందుకు చేసింది? ఎందుకీ శత్రుత్వాలు?  కూతురు కూడా తల్లి అయిందిప్పుడు. భావికాలంలో ఈ కూతురికి పుట్టిన కూతురూ తల్లితో ఇలాగే చేస్తుందా? ఈ చక్రభ్రమణం ఆగేదెలా? ఇదెలా పరిష్కరమయింది? అసలు సమస్య ఎక్కడుంది? ఇదీ మిగతా కథ.

నటనలు- సాంకేతికాలు
      ముందే చెప్పినట్టు ఇది విద్యాబాలన్ వన్ వుమన్ వండర్ఫుల్ షో. గ్రేట్ షో. ‘బ్రిటన్ కి రాణి ఎవరైనా, ప్రపంచానికి రాణి ఈ హిందుస్తానీ’ అని పాటేసుకుని ప్రపంచాన్ని చుట్టేస్తూ శకుంతలా దేవికంటే ఎక్కువ ఎంజాయ్ చేసింది. తనలా హాస్యం నటించే నటీమణులు లేరు. ఎప్పుడూ నవ్వుతూ, నవ్వించేస్తూ, గర్వం లేకుండా ఎవరితోనైనా కలిసిపోతూ, యూనివర్సల్ సిటిజన్ లా మెరిసిపోతూ ఫెంటాస్టిక్ గా నటించడం ఒకెత్తు. ఈ షుగర్ కోటింగ్ పొర తీసి లోపల చూస్తే - కూతురితో, భర్తతో ఏర్పడ్డ పరిణామాల తాలూకు విషాదచ్ఛాయల వికృతి దొలిచేస్తూంటే పడే వేదన. ఈ రెండిటిని కమ్మేస్తూ వృత్తిగతంగా అనితరసాధ్యమైన సింప్లిసిటీని ప్రదర్శించడం, తానొక ప్రఖ్యాతురాలన్న అహం లేని తనంతో ప్రవర్తించడం, మేథమేటిక్స్ తో మెజీషియన్ లా ప్రదర్శనలివ్వడంలో వయసు మీద పడ్డా అదే స్పోర్టివ్ నెస్ తో వుండడం- ఈ మూడంచెల అత్యంత సంకీర్ణ నిజ జీవిత పాత్రలో విద్యాబాలన్ నిలువెత్తు శకుంతలా దేవియే అన్పించుకోవడం ఆమెకే సాధ్యమవుతుంది. 


        ఓటమెరుగని ఇంత రోమాంచితమైన గణితావధాన ప్రస్తానంలో రెండే రెండు సార్లు ఆమె తొట్రుపాటు పడే సీన్లు ఇంకే సస్పెన్స్ - ఎమోషనల్ సినిమాలోనూ మనల్ని గాభరా పెట్టలేదు బహుశా. ఆమె ప్రస్థానంలో ఢక్కా మొక్కీ లుంటాయని అస్సలూహించకుండా షోని ఎంజాయ్ చేస్తున్న మన మీద రెండు సీన్లు బాంబుల్లా ప్రయోగిస్తుంది దర్శకురాలు.        


      ఒకటి: అంకెలు తప్పు చెప్పి, కంప్యూటర్ అడిగిన ప్రశ్నలోనే తప్పుందని ఆమె దబాయించడం. ఓటమి ఒప్పుకోకుండా దబాయిస్తూంటే మనకి కోపం కూడా వస్తుంది. ఓటమి పాలైనందుకు ఈమె పనై పోయిందని ప్రదర్శనలో వున్న ప్రేక్షకుల్లాగే మనకూ చులకన భావమేర్పడుతుంది. చాలా డిస్టర్బింగ్ ఘట్టం (వాస్తవంగా ఇది బిబిసి షో). ఆమెని కూడా డిస్టర్బ్ చేసే ఈ సంఘటన తర్వాత కంప్యూటర్ అడిగిన ప్రశ్నలోనే తప్పుందని తేలడంతో సుఖాంతమవుతుంది. 

        ఇంతకి మించిన సీను రెండోది: ఇలాటిదే ఇంకో షోలో నిజంగా విఫలమవుతుంది. నిండు సభలో గణితం లెక్కిస్తున్న క్షణాల్లో, హఠాత్తుగా కూతురితో పడిన ఘర్షణ గుర్తుకొచ్చి మెదడు అదుపు తప్పిపోతుంది. షాక్ అవుతాం. ఇలా ఈ సమయంలో కూతురు గుర్తొస్తుందని అస్సలనుకోం. చూసి చూసి తురుపు ముక్కల్లా ఈ రెండు సీన్లని గురి చూసి  ప్రయోగించింది దర్శకురాలు. ఈ రెండు సీన్లు బాలన్ ప్రతిభని నిరూపిస్తాయి.      
   
       నటనకి ఇంకో బలం ఆమె సంభాషణలు. ఇలాటి స్ఫూర్తి మంతమైన క్లుప్త సంభాషణలు గత కొన్నేళ్ళ కాలంలో ఏ నటులూ నోచుకోలేదు - ‘మనసు చెప్పింది విని, హృదయం విప్పి మాట్లాడే ఆడదంటే ఎంత భయమో’, ‘ప్రపంచంలో రెండే ప్రశ్నలుంటాయి: నాకు డబ్బొస్తుందా? నాకు ప్రేమ లభిస్తుందా?’, నువ్వు అందరు అమ్మల్లాగా నార్మల్ గా ఎందుకుండవని కూతురు నిలదీసినప్పుడు- ‘అమేజింగ్ గా నేనుండే అవకాశం నాకున్నప్పుడు నార్మల్ గా ఎందుకుండాలి?’, ‘నీ కళ్ళల్లో మెరుపు కంటే ఎక్కువ కాదు ఎంత డబ్బైనా’, ‘నువ్వు నా మ్యాథ్స్ నుంచి నన్నుదూరం చేశావ్’, ‘మ్యాథ్స్ తెలిసిన రెండు జడలమ్మాయిని చూస్తే మొహం ఇలా పెడతారు’, ‘నేనెప్పుడూ ఓడిపోను, రిమెంబర్ దట్’...ఇలా వందకి పైగా ఇన్నోవేటివ్ డైలాగులు సన్నివేశాల్లో కలిసిపోయి ప్రవహిస్తూంటాయి. 

        విద్యాబాలన్ తర్వాత కూతురి పాత్రలో సాన్యా మల్హోత్రా. పుట్టింది మొదలు తల్లితో సంఘర్షణ తోనే గడిచిపోయే పాత్ర. జుట్టు పీక్కున్నా అర్ధంగాని తల్లిని చూసి, ‘నువ్వొక అర్ధం గాని ప్రహేళిక’ అనేసినప్పుడు ప్రదర్శించే వేదన పవర్ఫుల్. ఇంకోచోట తన బ్రతుకు దుర్భరం చేస్తూంటే తట్టుకోలేక, ‘అమ్మా, నీకు అలసట రాదా?’ అన్నప్పటి నిస్సహాయత  సాన్యాలోని నటిని పట్టిస్తుంది. ‘చిన్నప్పుడు ఇతరుల ఇళ్ళల్లోకి తొంగి చూసేదాన్ని...నాకు నాదంటూ ఒకిల్లు ఏర్పాటు చేసుకోవాలనుంది’ అన్నప్పటి పసితనం ఆమె లోని నటికి ఇంకో పార్శ్వం. 

    మూడో కీలక పాత్ర భర్తగా జిష్షూ సేన్ గుప్తా ఈ బయోపిక్ కి ఇంకో బలం. ఐఏఎస్ ఆఫీసర్ గా హూందా అయిన నటన. భార్య నుంచి కూతుర్ని రక్షించడం కోసం పడే పాట్లే అతడి పాత్ర. తను చెట్టు లాంటి వాడు. వేళ్ళు నేలలోనే పాతుకుని వుంటాయి. చెట్టు నీడలోనే  కూతురు పెరగాలి, బంజారాలా తిరిగే భార్య వెంట కాదు. కూతుర్ని దేశాలు తిప్పేస్తూంటే, ‘అది నీ కూతురు, సూట్ కేసు కాదు’ అంటాడు. ఊళ్ళు తిరిగే బంజారా అయిన ఆమెతో విధి లేక రాజీ పడతాడు - ‘నువ్వు నీలాగా వుంటేనే మనం మనలాగా వుంటాం కదూ?’ అని విరక్తిగా అనేసి. పెళ్లి పేరు మార్చి సారీ అని పెట్టాలంటాడు. మదర్ వయ్యాక నీ బ్రెయిన్ పోయిందంటాడు. కన్నంత మాత్రానా తల్లివి కాలేవంటాడు. పిల్లలకి తల్లిదండ్రుల మీద హక్కులుంటాయి గానీ తల్లి దండ్రులకి పిల్లల మీద హక్కులుండవంటాడు. అతడెన్ని చెప్పినా ఉల్లాసరకమైన ఆమె దృష్టిలో అతను మాత్రం ‘ఐఏఎస్ -  సర్కారీ సూపర్ హీరో’ నే.      
  
        లండన్ దృశ్యాల్లో బ్రిటిష్ నటీనటులతో బంపర్ లుక్ వచ్చింది. 1950 లనాటి లండన్ నేపథ్య దృశ్యాలు, ఆ తర్వాత 1990 లనాటి దృశ్యాలూ ఆయా కాలాలకి తగ్గట్టు  నిర్దుష్టంగా వున్నాయి. అలాగే బెంగళూరు దృశ్యాలు కూడా. కీకో నకహరా ఛాయాగ్రహణం అతి పెద్ద ఆకర్షణ. కోమలమైన కలర్స్ తో, లైటింగ్స్ తో ఫిమేల్ కాన్సెప్ట్ మూడ్ కి అద్దం పట్టేలా వుంది. ఉయ్యాల్లో సాన్యా కూతురున్నప్పటి దృశ్యపు చిత్రీకరణ ఆర్ట్ డైరెక్షన్ తో కూడా కలుపుకుని ఒక అద్భుతం. బడ్జెట్ ధారబోస్తే స్వర్గాల్నే చూపించొచ్చు. 

        సెట్ ప్రాపర్టీస్ విషయంగా చాలా రీసెర్చి చేసినట్టు కనబడుతూనే వుంటుంది. పాతకాలపు భవనాలు, కంప్యూటర్లు, మోబైళ్ళు, బళ్ళూ, కాస్ట్యూమ్సూ వగైరా. సచిన్ - జిగర్ సంగీతం సన్నగా కురిసే వర్షాకాలపు తుంపర లాంటిది. తల్లీ కూతుళ్ళ మీద సరదా సాంగ్ - ‘తుజే ఖైద్ కర్లూ మై’ ప్లెజంట్ కంపోజిషన్. దర్శకురాలు అనూ మీనన్ ప్రొఫెషనల్ దర్శకత్వం ఈ బయోపిక్ తో ఒక లెసన్ లా వుండొచ్చు.

కథాకథనాలు
    తెలుగులో ‘మనం’ తర్వాత ఇంకో ఇన్నోవేట్ చేసిన ట్రెండీ ఫ్యామిలీ డ్రామా ఇది. ‘మనం’ లాగే ఇంకో సంక్లిష్ట మోడరన్ స్క్రీన్ ప్లే. ఫిమేల్ టీం విజయం. రైటింగ్ ని బట్టే మేకింగ్ వస్తుంది. ఫ్యామిలీ డ్రామాని ఈతరం ప్రేక్షకుల కోసం రాసినప్పుడు తీసిందీ అంతే ట్రెండీగా  వస్తుంది. ముఖ్యంగా శకుంతలా దేవి జీవితాన్ని ఈతరం కెరీర్ మైండెడ్ ప్రేక్షకుల ముందుంచాల్సిన అవసరముంది. పాత తరం ప్రేక్షకులు కాదు. ఈ తరం ప్రేక్షకులకి ఆమె గణితావధానం వరకూ ఓకే, బాగానే కనెక్ట్ అవుతారు. స్ఫూర్తి పొందుతారు. ఫ్యామిలీ డ్రామా ఎందుకు? ఎందుకంటే, కెరీర్స్ వెల్లువలో కొట్టుకుపోయే యువతరం ఆమె జీవితంలోంచి నేర్చుకోకపోతే తీవ్రంగా నష్టపోతారని. కుటుంబ జీవితంలో సక్సెస్ సాధించనిది బయట సాధించే ఇంకే సక్సెస్ కూడా సక్సెస్ అన్పించుకోదని పర్సనాలిటీ నిపుణులంటారు.


        శకుంతలా దేవి జీవితాన్ని పూర్తిగా చూపించలేదనే ఫిర్యాదు వుంది. నిజమే, ఆమె రచయత్రి కూడా. సంఘ సేవిక కూడా. రచయిత్రిగా గణితం మీదే గాకుండా జ్యోతిషం మీద, వంటల మీద, హోమో సెక్సువాలిటీ మీదా పుస్తకాలు రాసింది. ఆఖరికి ‘పర్ఫెక్ట్ మర్డర్’ అన్న మిస్టరీ నవల కూడా రాసింది! బయోపిక్ అనగానే జీవితమంతా చూపించాలని లేదు. జీవితంలో ఒక కోణాన్ని తీసుకుని చూపించవచ్చు. ‘గాంధీ మై ఫాదర్’ లో గాంధీకి పెద్ద కుమారుడితో గల దుష్ప్రవర్తనని చూపించారు. గాంధీ చేసిన స్వాతంత్ర్య పోరాటం చూపించ లేదంటే ఎలా? 

        శకుంతలా దేవి కుటుంబ జీవితం ఎవరికీ తెలీదు. దర్శకురాలు ఆమె కుమార్తెని  కలిశాకే తెలిసింది. ఆ కుమార్తె అనుపమా బెనర్జీ జ్ఞాపకాల్లోంచి కనుగొన్నదే ఈ బయోపిక్. అందుకని ఈ బయోపిక్ ని కుటుంబ జీవితమనే కోణానికే పరిమితం చేశారు. ఈ కథనాన్ని మల్టీపుల్ ఫ్లాష్ బ్యాకుల్లో చూపించారు. కూతురి పాత్ర నటించిన సాన్యా దృక్కోణంలోనే సీన్లు వస్తూంటాయి. పోను పోనూ కొన్ని చోట్ల ఏది ఫ్లాష్ బ్యాక్, ఏది కాదన్న కన్ఫ్యూజన్ కూడా ఏర్పడుతుంది. దీన్ని నివారించి వుండాల్సింది. 

        అయితే పెద్ద లోపం ఏమమిటంటే, తల్లి కథ ఆమె చిన్నప్పట్నుంచీ చెప్పుకొచ్చే కూతురికి - తల్లి ఎలా కష్టపడి పైకొచ్చిందో ఇంత తెలిసినప్పుడు, ఆమెతో తగువు పడ్డంలో అర్ధం కన్పించదు. చిట్టచివరికి తనే ఒక మాట అని తల్లి కళ్ళు తెరిపిస్తుంది - నువ్వు అమ్మనే చూశావ్, అమ్మలో ఆడదాన్ని చూడలేదని. తనుకూడా తన తల్లిలో ఆడదాన్నే చూసి వుంటే ఇంత జరిగేది కాదుగా?         


        ప్రాబ్లం పిల్లల్లోనే వుంది. సంతానంతో తల్లిదండ్రుల దుష్ప్రవర్తనని, నిర్లక్ష్యాన్నీ జడ్జి చేయలేమంటాడు స్పిరిచ్యువల్ గురు స్వామి సుఖబోధానంద. వాళ్ళేం చేసినా వాళ్ళని స్వీకరించాల్సిందే నంటాడు జన్మ నిచ్చినందుకు.

        కూతురు జడ్జి చేసి బొక్క బోర్లా పడింది. కొన్నాళ్ళు తనని స్కూల్లో వేయకుండా తన వెంట దేశాలు తిప్పిందని ద్వేషం పెంచుకుంది. తల్లి చేస్తున్నది మూర్ఖత్వమని మనమూ జడ్జి చేసేస్తాం. చిట్టచివరికి కూతురు వేసిన కేసు గురించి కలిశాక, తల్లి ఇచ్చిన ఆల్బం చూసుకున్న కూతురి పరిస్థితేంటి? ఆ చిన్నప్పుడు వివిధ దేశాధ్యక్ష్యులతో, ప్రధానులతో దిగిన ఫోటోలు ఎన్ని జన్మలెత్తితే తను చూసుకోగలదు? ప్రపంచానికి చూపెట్టుకోగలదు? కాబట్టి డోంట్ జడ్జ్ యువర్ పేరెంట్స్ అన్నది నీతి. అలాగే ఇంట్లో సక్సెస్ లేకుండా ఇల్లెక్కి కూసేదీ సక్సెస్ కాదని ఇంకో నీతి. డబుల్ బ్యారెల్ మోరల్ అన్నమాట.

సికిందర్

(ఈ బయోపిక్ గురించి నాలుగైదు ఫోన్లు వచ్చాయి. కరోనా కాలంలో ఈ నాల్గు నెలలుగా కనపడకుండా ఫోన్లలో మాట్లాడుకోవడం, కనపడకుండా దాక్కుని ఇలా రాసుకోవడం, 1918 తర్వాత మనకే లభించిన సువర్ణావకాశం. చైనా వాడిచ్చిన ఫోటో ఆల్బం. ఈ బయోపిక్ లో కాన్ఫ్లిక్ట్ సరిగా లేదని ఫిర్యాదు. కూతురు కేసేయడంతో ప్రారంభించిన కాన్ఫ్లిక్ట్ మళ్ళీ చివర్లోనే చూపించి నిమిషంలో తేల్చేశారని  విశ్లేషణ చేశారు. కథల్ని ఇలా అర్ధం జేసుకుంటే ఎలా? కేసేయడం కాన్ఫ్లిక్ట్ అని ఎవరన్నారు? కేసుకి దారి తీసిన తల్లీ కూతుళ్ళ మధ్య ఏం జరిగిందన్నదే కాన్ఫ్లిక్ట్. కేసేయడం కాన్ఫ్లిక్ట్ కాదు. అది ప్లాట్ పాయింట్ టూ దగ్గర వచ్చే థర్డ్ యాక్ట్ మలుపు. మల్టీపుల్ ఫ్లాష్ బ్యాక్స్ ని లీనియర్ గా చూస్తే అర్ధమవుతుంది. ప్రారంభంలో చూపించిన కేసేయడమే కాన్ఫ్లిక్ట్ అయితే, ఇంటర్వల్ కల్లా ఫ్లాష్ బ్యాక్స్ ముగించి, కేసేసిన కాన్ఫ్లిక్ట్ తో సెకండాఫ్ వుండేది. ఈ బయోపిక్ లో సీన్లతో వున్న డైనమిక్స్, ప్రతీ సీన్లో కట్టి పడేసే డైలాగ్స్, పాత్ర చిత్రణలు మొదలైన వాటిలోంచి నేర్చుకోవడానికి బోలెడుంది. కానీ స్క్రీన్ ప్లే సంగతులు రాయాలంటే సమయం చిక్కడం లేదు, అదీ సమస్య)


Friday, July 31, 2020

963 : రివ్యూ!


దర్శకత్వం వెంకటేష్ మహా
తారాగణం: సత్యదేవ్, నరేష్, సుహాస్, హరి చందన, రూప తది తరులు
సంగీతం: బిజిబల్, ఛాయాగ్రహణం: అప్పు ప్రభాకర్
బ్యానర్: ఆర్కా మీడియా
నిర్మాతలు: విజయ ప్రవీణ పరుచూరి, శోభు యార్ల గడ్డ, ప్రదాస్ దేవినేని
విడుదల: నెట్ ఫ్లిక్స్

***
        త్యదేవ్ హీరోగా కేరాఫ్ కంచరపాలెం దర్శకుడు మలయాళ రీమేక్ ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ నెట్ ఫ్లిక్స్ లో విడుదలయ్యింది. ప్రముఖ సంస్థ ఆర్కే మీడియా నిర్మించింది. ఇటీవలే సత్య దేవ్ నటించిన థ్రిల్లర్ ‘47 డేస్’ విడుదలైన విషయం తెలిసిందే. సత్యదేవ్ వెరైటీ పాత్రల్ని ఎంచుకుని తనకి సూటయ్యే జానర్ రియలిస్టిక్ సినిమాలు నటిస్తూ పోతున్నాడు. ‘మనవూరి రామాయణం’ లో ఆటో డ్రైవర్ పాత్రతో, ‘ఘాజీ’ లో మెరైనర్ పాత్రతో మంచి గుర్తింపు పొందాడు. ఇప్పుడు మలయాళ రీమేక్ తో సాధారణ విలేజి ఫోటోగ్రాఫర్ గా ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ పాత్ర తనకి ప్లస్ అయిందా, ఏ మేరకు అయింది - అలాగే కంచరపాలెం దర్శకుడు వెంకటేష్ మహా ఈసారి రీమేక్ తో ఏ మేరకు మెప్పించాడు ఓసారి చూద్దాం...

కథ
      మహేష్ (సత్యదేవ్) అరకులో చిన్నపాటి స్టూడియో నడుపుకునే ఫోటోగ్రాఫర్. వృద్ధుడైన తండ్రి మనోహర్ రావు (రాఘవన్) వుంటాడు. తండ్రి నుంచే ఫోటోగ్రఫీ నేర్చుకుని ఈ వృత్తిలోకి వచ్చాడు. వీళ్ళకి సన్నిహితుడైన ఎముకల నాటు వైద్యుడు బాబ్జీ (నరేష్) వుంటాడు. హైస్కూలు అప్పట్నించీ మహేష్ ప్రేమిస్తున్న స్వాతి (హరిచందన) వుంటుంది. వూళ్ళో ఏ సమస్యలు లేకుండా హాయిగా గడిచిపోతున్న మహేష్ జీవితంలో వూహించని సంఘటన జరుగుతుంది. రోడ్డు మీద ఎవరో కొట్టుకుంటూంటే మహేష్ అడ్డుకోబోతాడు. అడ్డొచ్చిన మహేష్ ని జోగినాథ్ అనే పక్క వూరి వెల్డర్ విపరీతంగా కొడతాడు. అతడి బలం ముందు మహేష్ బలం ఏమాత్రం చాలదు. అందరి ముందూ దెబ్బలు తిన్నందుకు అవమానం ఫీలవుతాడు. ఎలాగైనా ఇక జోగినాథ్ ని కొట్టి పగదీర్చుకోవాలని నిశ్చయించుకుంటాడు. అంతవరకూ కాళ్ళకి చెప్పులు వేసుకోనని పంతం బూనుతాడు. 

        మరి మహేష్ పగ తీరిందా? అంత బలం ఎలా వచ్చింది? జోగినాథ్ దొరికాడా? ఈలోగా స్వాతి ఏమైంది? జ్యోతి (రూప) తో మహేష్ ప్రేమ ఎలా మొదలయ్యింది? ఇవన్నీ తెలియాలంటే మిగతా సినిమా చూడాలి. 

నటనలు- సాంకేతికాలు
      సత్యదేవ్ పాత్ర యాంగ్రీ యంగ్ మాన్ రెగ్యులర్ కమర్షియల్ పాత్ర కాదు. నిజ జీవితంలో కనిపించే సహజ పాత్ర. కాబట్టి ఆ బాపతు హీరోయిజాలూ, రివెంజి డైలాగులూ, యాక్షన్ సీన్లూ లేకుండా తాజాగా కన్పిస్తుంది. అవమానం పొందే ముందు నల్గురితో అతడి సాధారణ జీవిత దృశ్యాలు, అవమానం పొందాక పగదీర్చుకునే లోపు ఎదురయ్యే అసలు జీవిత దృశ్యాలూ  పాత్రని అర్ధంజేసుకుని శాంతంగా, ప్రభావశీలంగా నటించాడు. అరకు నేటివిటీలో కలిసిపోతూ రాణించాడు. కాకపోతే మలయాళ ఒరిజినల్ ప్రకారం పాత్ర కిచ్చిన ముగింపుతో విషయ రాహిత్యంగా కన్పిస్తాడు. తన పాత్రని, నటనని, గోల్ నీ ఫాలో అవుతున్న ప్రేక్షకులు తప్పకుండా విలన్ని కొట్టి పైచేయి సాధిస్తాడనే అనుకుంటారు. ముగింపు తెలిసిపోతూనే వుంటుంది. కమర్షియల్ సినిమా ముగింపు. కానీ తనది కమర్షియల్ పాత్ర కాదు. అలాటి నటన కూడా లేదు. కానప్పుడు ప్రేక్షకులు వూహించని రియలిస్టిక్ ముగింపే నివ్వాలి. తనని కొట్టిన వాణ్ని బలం పెంచుకుని కొట్టడం తెలుస్తున్న, పేలవమైన కమర్షియల్ ముగింపు. దీన్ని రివర్స్ చేసి తను మెచ్యూర్ అయిన పాత్రగా ఎదిగినట్టు చూపలేక పోయాడు. మెచ్యూరిటీ పరంగా ఎక్కడున్న వాడు అక్కడే వుండి పోతూ, ఇవ్వాల్సిన పాజిటివ్ మెసేజ్ ఇవ్వలేక  పోయాడు. 


        ఇతర పాత్రల్లో నరేష్ సహా అందరూ (చాలా మంది కొత్త వాళ్ళు) అరకు మనుషుల్లాగే కన్పిస్తారు. హీరోయిన్లు హరి చందన, రూప సినిమాకి రూరల్ రోమాంటిక్ విలువని చేకూరుస్తారు. బ్యాడ్ క్యారక్టర్ జోగినాథ్ గా నటించిన రవీంద్ర విజయ్, హీరో తండ్రి పాత్రలో రాఘవన్ పర నటులైనా నేటివిటీలో కలిసిపోయారు. 

        బిజిబల్ సంగీతంలో రెండు పాటలు మాంటేజీల్లో వస్తాయి. అప్పు ప్రభాకర్ కెమెరా వర్క్, రవితేజ ఎడిటింగ్ చెప్పుకోదగ్గవి. 

కథాకథనాలు
  2016 లో విడుదలైన మలయాళ ‘మహేషింటే ప్రతీగారం’ రీమేక్ కథ ఇది. దీనికి కంచరపాలెం తీసిన దర్శకుడు వెంకటషే నేటివ్ ఫీల్ కి సరైన న్యాయం చేయగలడు. మలయాళ వాసన లేకుండా అచ్చమైన తెలుగు కథలా తీశాడు. కథనంలో గానీ, దృశ్యాల చిత్రీకరణలో గానీ రెగ్యులర్ తెలుగు సినిమాలకి అలవాటు పడిన- దర్శకుడి అహం బయటపడే - ఎలాటి కమర్షియల్, టెక్నికల్ కాలుష్యాలు జొరబడకుండా జాగ్రత్త పడ్డాడు. ఇలాటి సినిమాకి అగ్రనిర్మాతలు చేయూత నివ్వడం ఒకెత్తు. వాస్తవిక దృక్పథం పెల్లుబికే  కథలతో బ్రతికే ఆరోగ్యకరమైన ఇలాటి చిన్న సినిమాలకి అగ్రనిర్మాతల వల్లే బలం లభిస్తుంది. 


        మలయాళ సినిమాలంటే తేలికపాటి సంఘర్షణలతో కూడిన లైటర్ వీన్ సినిమాలు. తెలుగు ప్రేక్షకులు ఏళ్లకేళ్ళు పిచ్చి పిచ్చి లైటర్ వీన్ ప్రేమ సినిమాలకి అలవాటు పడ్డారుగానీ, ఇలాటి తేలికపాటి కాన్ఫ్లిక్ట్ వుండే మలయాళ మార్కు మంత్రాలకి కాదు. కాన్ ఫ్లిక్ట్ వుంటుంది, కానీ ఆ కాన్ఫ్లిక్ట్ తోనే కథ వుండదు. కథ పాత్రకి చెందిన ఇతర జీవిత కోణాల్ని సృశిస్తూ పోతూ, చిట్ట చివరికి ఎదుటి పాత్రతో అమీ తుమీకి దిగి కాన్ఫ్లిక్ట్ తేల్చు కుంటుంది. ప్రస్తుత కథ కూడా ఇదే బాపతు. 

        తనని కొట్టిన వాణ్ని కొట్టాలి సత్య దేవ్. ఇంత చిన్న కాన్ఫ్లిక్ట్. ఈ చిన్న కాన్ఫ్లిక్ట్ ని పట్టుకుని కథ నడిపితే సిల్లీగా వుంటుంది. అందుకని కొట్టిన వాడు దుబాయ్ వెళ్లి పోతాడు. చేసేది లేక వాడు  వచ్చాకే కొడదామని ఇతర వ్యాపకాల్లో పడిపోతాడు సత్యదేవ్. ఆ ఇతర వ్యాపకాలు ఇద్దరు భామలతో ప్రేమలు, వాటి అతీగతీ, ఫోటోగ్రఫీలో తండ్రి నుంచి ఇంకాస్త జ్ఞానం, కుంగ్ ఫూ నేర్చుకోవడం, ఇతర కార్యక్రమాలు వగైరా వగైరా. ఇక కొట్టిన వాడు దుబాయి నుంచి రాగానే వాణ్ని కుంగ్ ఫూతో పబ్లిగ్గా కొట్టి పడేసి, పోయిన పరువు రాబట్టుకుంటాడు. 

        ఈ కథ పాయింటు 2001 లో వచ్చిన హాలీవుడ్ హిట్, టిమ్ అలెన్ నటించిన ‘జో సమ్ బడీ’ లో కూడా వుంది. టిమ్ ని కూతురు ముందు ఒక బలవంతుడు అన్యాయంగా కొడతాడు. టిమ్ కి గొప్ప అవమాన మైపోతుంది. అదే కూతురి ముందు వాణ్ని కొట్టి ప్రూవ్ చేసుకోవాలని సిద్ధమై పోతాడు. ఇందుకు కరాటే, కుంగ్ ఫూ వంటి వన్నీ నేర్చుకుంటాడు. వీడేంట్రా అని నవ్వుతున్నా పట్టించుకోడు. చివరికి పుష్టిగా, బలంగా తయారై కూతురి స్కూలు ముందు ఈవెంట్ పెట్టి వాణ్ని రమ్మంటాడు. కానీ వాడికంటే బలవంతుడుగా మారిన తను కొట్టడు. కొట్టి పైచేయి సాధిస్తే అది కథ ఎందుకవుతుంది? ఇది స్పోర్ట్స్ కథ కాదు కదా? అందుకని కొట్టడానికంటే మించిన మెసేజ్ ఒకటుంది. ఆ మెసేజి వల్ల తను మెచ్యూర్డ్ వ్యక్తిగా ఎదగగల అవకాశం....ఇగోని  మెచ్యూర్డ్ ఇగో మార్చే ముగింపే కదా మంచి కథా లక్షణం. మలయాళంలో, తెలుగు రీమేక్ లో ప్లాట్ క్లయిమాక్స్ ని ప్లాట్ క్లయిమాక్స్ గానే ముగించారు. ‘జో సమ్ బడీ’ లో ప్లాట్ క్లయిమాక్స్ గాకుండా, చక్కటి స్టోరీ క్లయిమాక్స్ చేశారు...

-సికిందర్


Wednesday, July 29, 2020

962 : రివ్యూ!


దర్శకత్వం: పన్నాగాభరణ
తారాగణం: డానిష్ సేట్, సాల్ యూసుఫ్, దిశా మదన్, సింధూ శ్రీనివాస మూర్తి, మైకేల్ మధు, మహంతేష్, రంగాయణ రఘు తదితరులు
రచన: పన్నాగాభరణ, అవినాష్ బలెక్కల, సంగీతం: వాసుకీ వైభవ్, ఛాయాగ్రహణం: కార్తీక్ పళని
బ్యానర్: పిఆర్ కె ప్రొడక్షన్స్, నిర్మాత: అశ్వనీ పునీత్ రాజ్ కుమార్, గురుదత్ తల్వార్
విడుదల: అమెజాన్ ప్రైమ్

***
       
రో కన్నడ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. కన్నడలో తొలి రెండు ఓటీటీ విడుదలలు చేసిన  నిర్మాణ సంస్థగా పిఆర్ కె ప్రొడక్షన్స్ నిలిచింది. ఈ నెలలోనే ‘లా’ తర్వాత ఇప్పుడు ‘ఫ్రెంచ్ బిర్యానీ’ అందించింది. ప్రముఖ కన్నడ దర్శకుడు టిఎస్ నాగాభరణ కుమారుడు పన్నాగభరణ ‘ఫ్రెంచ్ బిర్యానీ’ దర్శకుడు. ప్రముఖ బెంగళూరు స్టాండప్ కమెడియన్లు డానిష్ సేట్, సాల్ యూసుఫ్ లు టైటిల్ పాత్రలు. టిక్ టాక్ స్టార్ దిశా మదన్ హీరోయిన్. రొటీన్ టెంప్లెట్ కథనే నేపథ్య ప్రాధాన్యంతో సరికొత్త స్టయిలిష్ కామిక్ థ్రిల్లర్ గా ఎలా మార్చారో చూద్దాం...

కథ
     బెంగళూరులో సి - కంపెనీ ముసలి డాన్ ఛార్లెస్ అలియాస్ పౌడర్ ఛార్లెస్ (మైకేల్ మధు) కొడుక్కి ఓ మాట చెప్పి చచ్చిపోతాడు. సైమన్ అనేవాడు వచ్చి సులేమాన్ కి సరుకు అందిస్తాడని. కొత్త డాన్ గా బాధ్యతలు తీసుకున్న కొడుకు మసల్ మణి (మహంతేష్) కన్ఫ్యూజ్ అయిపోతాడు. సైమన్ అనే వాడు వచ్చి సులేమాన్ కి సరుకు అందిస్తాడా, లేక సులేమాన్ అనేవాడు వచ్చి సైమన్ కి సరుకు అందిస్తాడా తికమక పడి  డ్రైవర్ సులేమాన్ ని ఏర్ పోర్టుకి పంపిస్తాడు. అక్కడ సైమన్ ని సామాన్ గా పలుకుతూ ఫ్లయిట్ దిగిన వాళ్ళని అడుక్కుంటూ వుంటాడు సులేమాన్. చివరికి ఫ్రాన్స్ నుంచి వచ్చిన ఫ్రెంచి సైమన్ (సాల్ యూసుఫ్) ని చూసి ఇతనే అనుకుని క్యాబ్ ఎక్కించుకుని తీసికెళ్ళి పోతాడు. 

         దారిలో ఒక సంఘటన జరిగి అస్ఘర్ అలీ (డానిష్ సేట్) ఆటో ఎక్కేస్తాడు సైమన్. ఆటో యాక్సిడెంట్ అవుతుంది. బ్యాగు దొంగ కొట్టేస్తాడు. సెల్ ఫోన్ ఆవు మింగేస్తుంది. మెడికల్ కాన్ఫరెన్స్ కి వెళ్ళలేక, హోటల్ కీ వెళ్ళలేక, ఫ్రెంచి ఎంబసీ వాళ్ళూ రానియ్యక, రోడ్డున పడితే, సరుకుతో వున్న బ్యాగు కోసం మసల్ మణి గ్యాంగ్ ఒక వైపు, ఇన్స్ పెక్టర్ మహదేవ్ (రంగాయణ రఘు) ఇంకోవైపు వెంటాడుతూంటే, దేశం కాని దేశంలో కంగారెత్తి  పోతాడు సైమన్. నానా పాట్లు పడి అతణ్ణి కాపాడుతున్న అస్ఘర్ కి ఇంటి దగ్గర సమస్యలుంటాయి. ఇక వీళ్ళిద్దరి సమస్యలు ఎలా తీరాయన్నది మిగతా కథ. 

నటనలు – సాంకేతికాలు
    కర్ణాటక మాజీ మంత్రి అజీజ్ సేట్ మనవడు డానిష్ సేట్ తో బాటు, సాల్ యూసుఫ్ బెంగుళూరు స్టాండప్ కమెడియన్లుగా కలిసి వెండి తెర మీద కన్పించడం అభిమానులకి పండగే అయింది. ఈ కామిక్ థ్రిల్లర్ ని తమ తమ పర్ఫెక్ట్ కామిక్ సెన్స్ తో నిలబెట్టారు. వెకిలి కామెడీ బారిన పడకుండా ఈ స్టయిలిష్ మల్టీ కల్చరల్, కాస్మోపాలిటన్ కామెడీని కాపాడారు. కాకపోతే ఆటో డ్రైవర్ గా సేట్ పలికే ఉర్దూ డైలాగులు అనేక చోట్ల బూతులు దొర్లుతాయి. ఫ్రెంచి దేశస్థుడుగా యూసుఫ్ కామెడీ పాత్ర కాకపోయినా అతడి కష్టాలు కామెడీగా వుంటాయి. ఇద్దరూ కలిసి ఈ బెంగళూరు కామెడీకి ఒక స్టార్ ఎట్రాక్షన్ ని  తీసుకొచ్చారు. 

        ఆటో డ్రైవర్ అస్ఘర్ చెల్లెలు రహీలా గా సుధా శ్రీనివాస మూర్తి నటించింది. ఈమెకిది తొలి అవకాశం. ఈమె భర్త పురుషోత్తంగా నాగభూషణ నటించాడు. ఇతడి ‘పంపులో నీళ్ళు లేక’ పిల్లలు పుట్టక పోతే భార్యకే విడాకులిస్తానని గొడవ పెట్టుకునే పాత్ర. ‘పంపులో నీళ్ళు లేకపోయినా’ ఆడవాళ్ళకి పిల్లలు పుట్టాలంటాడు. పిల్లల్ని పుట్టిస్తున్న వాళ్ళని చూస్తే అసూయ. పిల్లల్ని పుట్టిస్తున్న వాళ్ళని దేశం నుంచి వెళ్ళ గొట్టాలంటాడు. ఇదంతా సబ్ ప్లాట్ కథ
, పాత్ర.  

      ఇంకో ప్రముఖ పాత్ర మసల్ మణి తమిళ డాన్ పాత్ర. ఈ పాత్రలో మహంతేష్ కామిక్ విలనీతో  బాగా ఎంటర్ టైన్ చేస్తాడు. తను కొలంబియా డ్రగ్ లార్డ్ పాబ్లో ఎస్కోబార్ లా ఫీలై పోతూంటాడు. పాబ్లో లాగానే పోలీస్ ఫైరింగ్ లో చస్తాడు. ఇలా అని బ్రేకింగ్ న్యూస్ ఇస్తాడు ఇన్స్ పెక్టర్ మహదేవ్. నిజానికి గ్యాంగ్ వార్ లో చచ్చిపోతే తను చంపినట్టు న్యూస్ ఇచ్చుకుంటాడు. ఇన్స్ పెక్టర్ మహదేవ్ గా రంగాయణ రఘు ది హిలేరియస్ నటన. తను బ్లాక్స్ ని పట్టుకుని ఎడాపెడా కొడతానన్నప్పుడు, సైమన్ పాత్రలో సాల్ యూసుఫ్, నువ్వు రేసిస్ట్ కామెంట్స్ చేస్తున్నావంటాడు. దీంతో రేసిస్టు అంటే రేసింగ్ అనుకుని, తను ఎన్నెన్ని రేసులు గెలిచాడో చెప్పుకుపోతూ ఫూలిష్ సీను క్రియేట్ చేస్తాడు రంగాయణ.  

        టీవీ రిపోర్టర్ మాలినిగా దిశా మదన్ నాల్గయిదు సీన్లలో కన్పించే హీరోయిన్. చివర్లో ఆటోడ్రైవర్ అస్ఘర్ తో లవ్ ఓకే అయిపోయే ఫక్తు పాత ఫార్ములా పాత్ర. టిక్ టాక్ స్టార్ గా పాపులర్ అయిన తను సినిమా హీరోయిన్ గా కొనసాగే మెటీరియల్ అంతా వుంది. 

        సాంకేతిక విలువలు బావున్నాయి. కెమెరా వర్క్, కలర్స్, లైటింగ్ లతో కూడిన విజువల్స్, బెంగళూరు లొకేషన్స్, ట్రెండీ కాస్ట్యూమ్స్, యాక్షన్, ఛేజ్ సీన్లు పకడ్బందీగా వున్నాయి. వాసుకీ వైభవ్ సంగీతం గత ‘లా’ లోలాగా కాకుండా మాంచి పెప్ తో వుంది. ‘అతిధి దేవోభవ’ ర్యాప్ సాంగ్, దాని చిత్రీకరణ హైలైట్. 

కథాకథనాలు
      పాత రొటీన్ టెంప్లెట్ కథే. ఒకరనుకుని ఇంకొకర్ని టార్గెట్ చేసే మిస్టేకెన్ ఐడెంటిటీ బాపతు కథ. ఒక బ్యాగు కోసం కొన్ని గ్రూపులు ప్రయత్నించే అరిగి పోయిన కథ. ఈ కథకి స్క్రీన్ ప్లే లేదు. అంటే హీరో పాత్ర అస్ఘర్ అనుకుంటే అతడికి గోల్ లేదు, కథ అతడి మీద వుండదు, అతను ముగించడు. క్లయిమాక్స్ లో అతను వుండడు. మరి కథ ఎవరి మీద వుంటుందంటే, ఎవరి మీదా వుండదు. అందరూ తోచిన విధంగా కథ నడుపుతూంటారు. కనుక హీరోలేని అర్ధంపర్ధం లేని క్లయిమాక్స్ తయారయ్యింది. ఫన్నీ క్యారక్టర్స్ తో ఫన్నీ సీన్స్ నడపడమే దర్శకుడు కథ అనుకున్న కథ. 

        దీన్ని బెంగళూరు బ్యాక్ డ్రాప్ లో నడపడమే, అదీ బెంగళూరు జనజీవితాన్ని రియలిస్టిక్ గా భాగం చేయడమే, ఈ మైండ్ లెస్ మూవీ వీక్షణాసక్తి పెరిగేలా చేసింది. వివిధ పాత్రలు నగరంలోంచి వూడి పడ్డట్టు వుంటాయి. అవి వాటి వాటి భాష, యాస మాట్లాడే స్తాయి. ఆటో డ్రైవర్ ‘హీరో’ చాలా వరకూ కన్నడ యాసలో ఉర్దూయే మాట్లాడతాడు. అతడింట్లో సీన్లు ఉర్దూలోనే వుంటాయి. ఫ్రెంచి సైమన్ బ్రోకెన్ ఇంగ్లీషులో, ఫ్రెంచిలో మాట్లాడతాడు. యంగ్ డాన్ కన్నడింగ్లీషు మాట్లాడతాడు. కన్నడ మాట్లాడే పాత్రలు కన్నడ మాట్లాడతాయి. ఇలా కన్నడ, ఉర్దూ, ఇంగ్లీషు, ఫ్రెంచి భాషలతో బెంగళూరు భిన్న సంస్కృతుల కాస్మోపాలిటన్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తారు. భాషలు ప్రేక్షకు లెవరికో అర్ధం కావేమో ననే సంశయాలు పెట్టుకోలేదు. ఫ్రీ స్టయిల్ రైటింగ్, మేకింగ్ చేశారు. కాలం లో ఎక్కడో ఇరుక్కున్న సినిమా సంకెళ్ళని తెంచి పారేశారు. ఇప్పుడు కావాల్సిన న్యూ ఏజ్ సినిమాగా ఎస్టాబ్లిష్ చేశారు. 

        భిన్న సంస్కృతుల్ని ప్రదర్శించే ‘అతిధి దేవోభవ’ ర్యాప్ సాంగ్ తో బెంగళూరు నగర జీవితమంతా నగరవాసులు ఐడెంటిఫై చేసుకునేలా కళ్ళ ముందుంచారు. దృశ్యపరమైన అసభ్యత లేకపోయినా, డైలాగుల్లో ధారాళంగా బూతులు ప్రవహిస్తాయి. ఒక పాటే fuck-ruddin అనే పల్లవితో వుంది. ఇక సెల్ ఫోన్ మింగేసిన ఆవుతో గోమాత సీను, ఆవు కడుపులోంచి సెల్ ఫోన్ తీస్తానని ఎదురుగా మటన్ షాపు వాడు ఆఫరివ్వడం, చచ్చిన ముసలి డాన్ శవయాత్రలో శవాన్ని మోటార్ సైకిల్ ఎక్కించి తిప్పడం, ఆ పాడె మోస్తున్న అస్ఘర్ పాడె వదిలేస్తే మోటార్ సైకిల్ సహా శవం కింద పడడం... జనాభా సమస్యపై జోకులు, రేసిస్టు కామెంట్లతో కామెడీ... ఇలా చుట్టూ వున్న ప్రపంచంలో ఏం జరుగుతోందో వాటినీ వాడేశారు.

        రచన, దర్శకత్వం అన్నవి కొత్త పుంతలు తొక్కాయి. ఈ రెండూ కాలాన్ని దాటి వుండక పోతే ఈ పాత రొటీన్ కామిక్  థ్రిల్లర్ వృధా అయ్యేది.  

-సికిందర్


Monday, July 27, 2020

961 : రివ్యూ!



దర్శకత్వం: ముఖేష్ ఛబ్రా
తారాగణం: సుశాంత్ సింగ్ రాజ్పుత్, సంజనా సంఘీ, సాహిల్ వేద, శాశ్వతా ఛటర్జీ, స్వస్తికా ముఖర్జీ తదితరులు

రచన: శశాంక్ ఖైతాన్, సుప్రోతిం సేన్ గుప్తా
సంగీతం: ఏఆర్ రెహ్మాన్, ఛాయాగ్రహణం: సత్యజిత్ పాండే
బ్యానర్: ఫాక్స్ స్టార్ స్టూడియోస్
విడుదల: డిస్నీ ప్లస్ హాట్ స్టార్

***
       
త్మహత్య చేసుకుని సంచలనం సృష్టించిన సుశాంత్ సింగ్ రాజ్పుత్ చివరి విడుదల ‘దిల్ బేచారా’ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో సందడి చేస్తోంది. ఇది కూడా అతడి మరణాన్ని చూపించేదే. అనుకున్న సమయానికి ఈ సినిమా విడుదలై వుంటే దాని ప్రభావంతో మనసు మార్చుకుని ఇవ్వాళ అందరి మధ్య సజీవంగా వుండే వాడేమో. ఈ సినిమాకి దర్శకత్వం వహించిన కొత్త దర్శకుడు ‘మీటూ’ వివాదంలో ఇరుక్కోవడంతో నిర్మాణం ఆలస్యమై అనుకున్న నవంబర్ 2019 కల్లా విడుదల కాకపోవడం ఒక బ్యాడ్ లక్. 

       
అంతరిక్షం సుశాంత్ అభిమాన సబ్జెక్టు. నలభై లక్షలు పెట్టి కొన్న టెలిస్కోప్ తో నక్షత్ర లోకాలని వీక్షిస్తూ వుండేవాడు. 2016 లో ఆత్మ హత్య చేసుకున్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్ధి రోహిత్ వేముల కూడా అంతరిక్ష అభిమానియే. ఖగోళ శాస్త్రవేత్త కార్ల్ సాగన్ లాగా సైన్స్ ఫిక్షన్ పుస్తకాలు రాయాలనుకున్నట్టు సూసైడ్ నోట్ లో రాసుకున్నాడు. నక్షత్ర లోకాలకి పయనించాలని వుందని కూడా రాసుకున్నాడు. సుశాంత్ నీ, రోహిత్ నీ నక్షత్ర లోకాలే సూదంటు రాయిలా ఆకర్షించి తీసికెళ్ళి పోయాయేమో. ఇక ‘దిల్ బేచారా’ కి ఆధారమైన పాపులర్ నవల పేరులో కూడా ‘స్టార్స్’ వుండడం (‘ది ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్’) ఇంకో ఐరనీ.

        ‘దిల్ బేచారా’ లో అంతరిక్షం గురించిన ప్రస్తావన కూడా వుంది. ఆత్మహత్యకి వ్యతిరేకంగా సంభాషణ కూడా వుంది. మరణాన్ని అదుపు చేసే మంత్రం కూడా వుంది. అతడికి సరదాగా సిగరెట్ నోట్లో పెట్టుకునే అలవాటు వుంటుంది. దాన్ని ముట్టించి స్మోక్ చెయ్యడు. సిగరెట్ అంటే క్యాన్సర్. క్యాన్సర్ అంటే మరణం. ‘మారణాయుధాన్ని మన పెదాల మధ్య వుంచుకున్నా, మనల్ని చంపే శక్తిని మాత్రం దానికివ్వకూడదు’ అంటాడు. ‘జననం ఎప్పుడు, మరణం ఎప్పుడు మనం నిర్ణయించలేం, ఎలా జీవించాలో నిర్ణయించుకో గలం’, ‘మరణించాక దాంతో బాటే జీవించాలన్న ఆశ కూడా చచ్చిపోతుంది’, ‘పాట పూర్తిగా ఎందుకు లేదు? ఎందుకంటే జీవితమే పూర్తిగా వుండదు కాబట్టి’, ‘కాలుతున్న సిగరెట్ లో చంపే శక్తి వుంటుంది, దాన్నుంచి నేనా శక్తిని లాక్కున్నా’, ‘నా అంతిమ సంస్కారాల్లో నేనూ పాల్గొనాలనుకుంటున్నా’, ‘నేను గొప్ప గొప్ప కలలు గంటాను, వాటిని తీర్చుకోవాలన్న కోరిక మాత్రం కలగదు’, ‘స్ట్రాంగ్ గా వుండాలని నేననుకోవడంలేదు, నార్మల్ గా వుండాలనుకుంటున్నా’, ‘సూసైడ్ ఇల్లీగల్, కనుక బతకాలి తప్పదు’... ఇలా జీవితం గురించి ఇన్ని సత్యాలు తెలుసుకున్న సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడం విచారకరం. 

సగం పాడిన పాట
     జీవన్మరణాలు, సంఘర్షణ, అస్తిత్వ సంక్షోభం వంటి అంశాలని తాకుతుంది ‘దిల్ బేచారా’. ప్రాణాంతక వ్యాధితో యువజంట, వాళ్ళ యంగ్ రోమాన్స్, ఎడబాటు ఈ కథ. జంషెడ్ పూర్ నేపధ్యంలో వుంటుంది. అక్కడ కిజీ బసు (సంజనా సంఘీ) థైరాయిడ్ క్యాన్సర్ బాధితురాలు. భుజాన ఆక్సిజన్ సిలండర్ తో వుంటుంది. తల్లిదండ్రులు (శాశ్వతా ఛటర్జీ, స్వస్తికా ముఖర్జీ) అండగా వుంటారు. మరణం కోసం ఎదురు చూస్తూ గడపడం తప్ప రోజంతా చేసే పనుండదు. అయితే బాధని మరిపించుకోవడానికి ఎక్కువ బయట తిరుగుతూ వుంటుంది. ఒక సింగర్ ని అభిమానిస్తూ వుంటుంది. అతను పాడిన పాట సగమే వుండడం ఆమెకి సస్పెన్స్ ని క్రియేట్ చేస్తూంటుంది. ఆ పాట అతను పూర్తిగా ఎందుకు పాడలేదు? ఆపేసిన దగ్గర్నుంచి పాట ఎలా వుంటుంది? అతనేమయ్యాడు? ఇవి తెలుసుకోవాలని ప్రయత్నిస్తూ వుంటుంది. 

        ఊళ్లోనే ఒక షార్ట్ మూవీస్ మేకర్, ఇమ్మాన్యుయేల్ రాజ్ కుమార్ జూనియర్ అలియాస్ మానీ (సుశాంత్) వుంటాడు. ఇతను రజనీకాంత్ అభిమాని. రజనీకాంత్ ని అనుకరిస్తూ షార్ట్ మూవీ తీస్తూంటాడు. ఇంకో క్యాన్సర్ బాదితుడైన మిత్రుడు జేపీ (సాహిల్ వేద్) సహకరిస్తూ వుంటాడు. ఒక రోజు కిజీని చూసి ప్రేమలో పడిపోతాడు మానీ. వెంటపడుతున్న అతణ్ణి కిజీ వారిస్తూంటుంది. కానీ క్రమంగా తనూ ప్రేమలో పడిపోతుంది. అతను బోన్ క్యాన్సర్ బాధితుడు. 

        ఇద్దరూ పరస్పరం అర్ధం జేసుకుని ప్రేమని కొనసాగిస్తూంటారు. ఆమె తల్లిదండ్రుల ఆమోదం కూడా పొందుతారు. ఆమె అసంపూర్ణంగా వున్న పాట గురించే కాదు, ఆ సింగర్ ని కూడా కలుసుకోవా లనుకుంటోందని కూడా తెలుసుకుని, ఆమె కోరిక తీర్చడానికి పూనుకుంటాడు మానీ. ఆ సింగర్ అభిమన్యు వీర్ (సైఫలీ ఖాన్). అతను పారిస్ లో వున్నట్టు తెలుస్తుంది. అతడ్ని కలుసుకోవడానికి పారిస్ చేరుకుంటారు కిజీ, ఆమె తల్లి, మానీ. 

        అక్కడేం జరిగింది? ఆ తర్వాత ఇద్దరి ప్రేమా ఏమైంది? ఇద్దరి వ్యాధులు ఏమయ్యాయి? మరణాన్ని ఆహ్వానించారా? అతను షార్ట్ మూవీ పూర్తి చేయగలిగాడా? ఆమెకి పాట పూర్తిగా తెలిసిందా? ఆ పాటని ఎవరు పూర్తి చేశారు?...ఇదీ మిగతా కథ. 

ఎలా వుంది కథ
     ముందుగా చెప్పుకున్నట్టు ఇది బెస్ట్ సెల్లర్ ‘ది ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్’ నవలాధారం. ఇదే టైటిల్ తో హాలీవుడ్ సినిమా కూడా వచ్చింది. హాలీవుడ్ సినిమా పూర్తిగా నవలని అనుసరించి వుంది. ‘దిల్ బేచారా’ లో మార్పులు చేశారు. ముఖ్యంగా హీరోయిన్ గోల్ విషయంలో చేసిన మార్పు కనెక్ట్ కాలేదు. ఆమె సగం పాట గురించి సింగర్ ని కలుసుకోవాలన్న గోల్ తో వుంటుంది. ఇదేమీ ఆమె జీవితంలాంటి పాట కాదు కనెక్ట్ కావడానికి. నవల్లో కథ ప్రకారం అందులోని హీరోయిన్ ఒక నవల చదువుతుంది. అది తన లాంటి క్యాన్సర్ తో వున్న హీరోయిన్ కథే. ఆ నవల చివరి వాక్యాలు సగమే వుండి ముగింపు తెలియదు. దీంతో ముగింపు తెలుసుకోవడానికి అజ్ఞాతంలో వున్న రచయిత అన్వేషణలో వుంటుంది. ఇలా మరణం ముంగిట వున్న హీరోయిన్ జీవితానికి కనెక్ట్ అయ్యే పాయింటుగా ఇది వుంటుంది.


        ‘దిల్ బేచారా’ డైలాగులు కాన్సెప్టుకి తగ్గట్టుగా బాగానే వున్నాయి. కానీ కథా కథనాలు కాన్సెప్ట్ కి తగ్గ ఫీల్ ని కల్గించవు. ఫీల్ కల్గించేది చనిపోయిన వ్యక్తిగా సుశాంతే గానీ పాత్ర  కాదు. పాత్ర కంటే, సూసైడ్ చేసుకున్న సుశాంతే కన్పిస్తూంటే, బోలెడు సానుభూతీ కన్నీళ్ళతో ప్రతిస్పందించి సినిమా బావుందంటున్నారు ప్రేక్షకులు. సుశాంత్ కి వీడ్కోలు చెబుతున్న సినిమాగా ఇంతకంటే కథని విశ్లేషించడం భావ్యం కాదు. 

ఇద్దరూ ఇద్దరే
    నటుడుగా ఇంత టాలెంట్ వున్న సుశాంత్, జీవించడంలో ఆ టాలెంట్ చూపక పోవడం అతి పెద్ద విషాదం. టాలెంట్ ని ఓడించగల శక్తి ఈ ప్రపంచంలో ఏదీ లేదని తెలుసుకోలేక పోయాడు. స్మైల్ అతడి చిరకాల ఎస్సెట్. ఆ స్మైల్ కే సీన్లు షైన్ అవుతాయి. డైలాగ్ డెలివరీ అసామాన్యం. మరణాన్ని తేలికగా తీసుకునే పాత్రగా కొన్ని ఫన్నీ సీన్స్ క్రియేట్ చేశాడు. సైలెంట్ హ్యూమర్ ఇంకో ప్లస్. ఇన్ని పాజిటివ్స్ వున్న తను నెగెటివ్ నిర్ణయం తీసుకోవడమే పాజిటీవిటీకి గొడ్డలి పెట్టు. అతడి నిష్క్రమణ పాజిటీవిటీకే పెద్ద లోటు. 

        హీరోయిన్ సంజనా క్యాన్సర్ పాత్రకి సరీగ్గా సూటయ్యింది. ఆధునిక క్యాన్సర్ పాత్ర. కొద్ది కొద్ది మాటలు, వడివడి నడక, గెటప్, కాస్ట్యూమ్స్ ఇవన్నీ సైకలాజికల్ గా అలౌకిక భావతరంగాల్ని తట్టిలేపుతాయి. బెస్ట్ నటి. సాంకేతికాలు థీమ్ ని ప్రదర్శిస్తాయి. కొన్ని చోట్ల వెలసిన జీవితాల్లాగే వెలసిన రంగులుంటాయి. తొమ్మిది వుండీ లేనట్టుండే పాటలతో రెహ్మాన్ సంగీతం ఒక స్మూత్ ట్రావెల్. 

        క్యాస్టింగ్ డైరెక్టర్ నుంచి సినిమా దర్శకుడుగా మారిన ముఖేష్ ఛబ్రా హాలీవుడ్ ఒరిజినల్ జానర్ ని కూడా మార్చి తీశాడు. నవల గానీ, హాలీవుడ్ సినిమా గానీ కమింగ్ ఆఫ్ ఏజ్ జానర్ కి చెందినవి. పదహారేళ్ళ హీరోయిన్, పదిహేడేళ్ళ హీరో ఇద్దరి క్యాన్సర్ కథ. వినూత్నంగా ఇంత లేత టీనేజీ హీరోహీరోయిన్ పాత్రలతో క్యాన్సర్ కథ కాబట్టే మార్కెట్ యాస్పెక్ట్ తో నవల, సినిమా అంత పాపులర్ అయ్యాయి.

సికిందర్







!

Saturday, July 25, 2020

960 : రివ్యూ!



దర్శకత్వం: రామ్ గోపాల్ వర్మ
సంగీతం : డీఎస్ఆర్, ఛాయాగ్రహణం: జోషి
బ్యానర్: ఆర్జీవీ
వరల్డ్ థియేటర్
విడుదల: జులై 25, 2020

***
        వివాదాలతో, దాడులతో, ట్రైలర్ లీకులతో హైప్ సృష్టించిన ఆర్జీవీ ‘పవర్ స్టార్’ శనివారం ఆర్జీవీ వరల్డ్ థియేటర్ సైట్ లో విడుదలయ్యింది. టికెట్టు ధర 150 రూపాయలు. నిడివి 37 నిమిషాలు. నటీనటులు కొందరు నిజ వ్యక్తుల్ని పోలిన నటులు. వాళ్ళ పేర్లు స్పెల్లింగులు మార్చారు. టైటిల్ పాత్ర పవన్ కళ్యాణ్ ప్రవన్ కళ్యాణ్ అయ్యాడు. పవన్ కళ్యాణ్ పోలికలతో వున్న ఇతను పవన్ బాడీ లాంగ్వేజీని బాగానే అనుకరించాడు. ఇతను తప్ప ఈ వెబ్ మూవీలో ఆసక్తి కల్గించేదేమీ లేదు. 

       చెప్పుకోవడానికి ఇది పేరడీ కాదు, డాక్యూడ్రామా కాదు, అసలు సినిమా కూడా కాదు. ఓ ఆరేడు ఒకదాని కొకటి సంబంధం లేని సీన్లు జోడించి ముగించారు. ఈ ఒక్కో సీన్లో ఒకొక్క ప్రవన్ కళ్యాణ్ సన్నిహితుడు వచ్చి ఓదార్చి వెళ్ళడం వుంటుంది. ఓదార్చి తిట్లు తిని వెళ్ళడం కూడా వుంటుంది. 

        ప్రవన్ కళ్యాణ్ ఎన్నికలు ఓడిపోయిన రాత్రి మొదలవుతుంది ఈ వెబ్ మూవీ. ప్రవన్ కళ్యాణ్ మన సేన పార్టీ ఒకటే స్థానం గెలుస్తుంది. తను పోటీ చేసిన రెండు స్థానాలూ ఓడిపోతాడు. ఈ పరాభవంతో వున్న అతడి దగ్గరికి పెద్దన్న మెగాస్టార్ వచ్చి మందలిస్తాడు. డైరెక్టర్ త్రివిక్రమ్ వచ్చి సంజాయిషీ ఇచ్చుకుంటాడు. నిర్మాత బండ్ల గణేష్ వచ్చి కొత్త సినిమా ఆఫర్ ఇస్తాడు. జర్నలిస్టు కత్తి మహేష్ వచ్చి ఇంటర్వ్యూ తీసుకుంటాడు. రష్యన్ భార్య వస్తుంది. చివరికి చిన్నన్న నాగబాబు పోన్లో పలకరిస్తాడు. చివరి సీను మాజీ సీఎం చంద్రబాబు నాయుడుతో వుంటుంది. ఆఖరికి ఆర్జీవి వచ్చి హితోపదేశం చేయడం వుంటుంది.

        ప్రవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఎంత అమాయకుడో, అతడి చుట్టూ చేరి కొందరు ఎలా దెబ్బతీశారో అన్నదే చెప్పాలనుకున్నాడు ఆర్జీవి. ఇంతకి మించి పవన్ ని అవమానించడం ఎక్కడా చేయలేదు. సానుభూతి చూపించడం మాత్రమే చేశాడు. ఈ సానుభూతికి పరాకాష్ట చివర్లో ఆర్జీవి హితబోధ.

        ‘గడ్డి తింటావా’ అన్న పాటలో వున్న సెటైర్ మిగతా మూవీలో లేదు. డైలాగుల్లో పంచ్ తప్ప సెటైర్ లేదు. కెమెరాతో గిమ్మిక్కులు చేయకుండా స్టడీ షాట్లు తీశారు. ఒక ఫాం హౌస్ లో వారం రోజుల్లో షూటింగ్ ముగించారు. అతి లో బడ్జెట్ లో తీసిన ఈ వెబ్ మూవీ క్వాలిటీ గురించి చెప్పుకోవాల్సింది లేదు. విషయం గురించి అసలే లేదు. ప్రవన్ కళ్యాణ్ మీద సానుభూతి ఏమో గానీ, వర్మ మీద జాలిపడేలా వుంది. 

-సికిందర్

Tuesday, July 21, 2020

959 : రివ్యూ



రచన, దర్శకత్వం : అన్వితా దత్తా
తారాగణం: తృప్తీ దిమ్రీ, అవినాష్ తివారీ, పావలీ దామ్, రాహుల్ బోస్, పరమబ్రత ఛటర్జీ
సంగీతం: అమిత్ త్రివేదీ, ఛాయాగ్రహణం: సిద్ధార్థ్ దివాన్
బ్యానర్: క్లీన్ స్లేట్ ఫిలిమ్స్
నిర్మాతలు: అనూష్కా శర్మ, కర్ణేష్ శర్మ
విడుదల: నెట్ ఫ్లిక్స్


      ‘ఎన్ హెచ్ -10’, ‘పరీ’ వంటి సినిమాలు, ‘పాతాళ్ లోక్’ వంటి వెబ్ సిరీస్ నిర్మించిన బాలీవుడ్ స్టార్ అనూష్కా శర్మ, తాజాగా ‘బుల్బుల్’ అనే సూపర్ నేచురల్ హార్రర్ తో ఓటీటీ ప్రవేశం చేసింది. నెట్ ఫ్లిక్స్ విడుదల చేసింది. రచయిత్రి అన్వితా దత్ దర్శకురాలిగా పరిచయమైంది. 19 వ శతాబ్దపు నేపథ్యంతో ‘డ్రాక్యులా’ ని తలపించే ఫీల్ తో, సంజయ్ లీలా భన్సాలీ లాంటి దృశ్య వైభవంతో, పిశాచ కథని కవితాత్మకంగా తెరకెక్కించింది. ‘పోస్టర్ బాయ్స్’, ‘లైలా మజ్నూ’ అనే రెండు సినిమాల హీరోయిన్ తృప్తీ ధిమ్రీ టైటిల్ పాత్ర నటించింది. రాహుల్ బోస్ ద్విపాత్రాభినయం చేశాడు. అమిత్ త్రివేదీ సంగీతం చేశాడు. ఇలా ఓ జమీందారీ కుటుంబంలో అంతఃపురపు కుట్రల్ని వెల్లడించే ఈ కథేమిటో ఒకసారి చూద్దాం... 

కథ
     1880 లో బెంగాల్లో ఐదేళ్ళ బుల్బుల్  కి పెళ్ళవుతుంది. తన తోటి బాలుడు సత్యతో పెళ్లి చేస్తున్నారని అనుకుంటే, సత్య అన్న ఇంద్రనీల్ (రాహుల్ బోస్) తో పెళ్లయి పోతుంది. ఐదేళ్ళ బుల్బుల్ ని పెళ్ళిచేసుకున్న పెద్ద జమీందారు ఠాకూర్ ఇంద్రనీల్ కి తనలాగే వున్న కవల సోదరుడు మహేంద్ర (రాహుల్ బోస్) వుంటాడు. ఇతడికి మతిస్థిమితం వుండదు. ఇంకో ఏడేళ్ళ తమ్ముడు, బుల్బుల్ తో కలిసి ఆడుకున్న సత్య వుంటాడు. ఇరవై ఏళ్ళు గడిచిపోతాయి. ఇప్పుడు లండన్లో చదువు పూర్తి చేసుకున్న సత్య (అవినాష్ తివారీ) తిరిగొస్తాడు. వచ్చేసరికి చాలా మార్పులు జరిగివుంటాయి. పెద్దన్న ఇంద్రనీల్ ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు, చిన్నన్న చనిపోయాడు. చిన్న వదిన బినోదిని (పావలీ దామ్) వితంతువుగా శిరోముండనం చేయించుకుని తెల్ల చీరలో వుంది. పెద్దన్న భార్య బుల్బుల్ (తృప్తీ ధిమ్రీ) దొరసానిలా జమీందారీ బాధ్యతలు చేపట్టింది.  

        బుల్బుల్ కి చిన్నప్పుడు సత్యతో పెళ్లి కాలేదన్న బాధ వుంటుంది. సత్య ఆమెని వదినలాగే చూస్తూంటాడు. అయితే చుట్టు పక్కల ఒక పిశాచి సంచరిస్తోందనీ, అది మనుషుల్ని చంపేస్తోందనీ అందరూ అంటూంటే వింటాడు. చిన్నన్న మహేంద్రని కూడా పిశాచి చంపేసిందని అంటారు. ఇలా వుండగా ఇప్పుడు అడవిలో వేట కెళ్తే తన కళ్ళ ముందే పోలీసు కొత్వాల్ శవవుతాడు. దీంతో ఈ చావుల రహస్యం తెలుసుకోవాలని నిశ్చయించుకుంటాడు సత్య.

        ఈ చావులు ఎందుకు జరుగుతున్నాయి? నిజంగా పిశాచి చంపుతోందా? ఎందుకు చంపుతోంది? చిన్నన్నని పిశాచియే చంపిందా? పెద్దన్న ఎక్కడికెళ్ళి పోయాడు? ఈ మొత్తం పరిణామాల్లో డాక్టర్ సుదీప్ (పరమబ్రత ఛటర్జీ) పాత్రేమిటి? ఇదీ మిగతా కథ.

నటనలు- సాంకేతికాలు
     నటిగా తృప్తీ ధిమ్రీ హైలైట్ అయిన సినిమా ఇది. తియ్యగా నవ్వుతూ, ఇంకా తియ్య తియ్యగా మాట్లాడుతూ, స్నేహభావంతో మెలగుతూ, హవేలీ బాధ్యతలు చూసుకునే యువ జమీందారిణీగా ఒక చెరగని ముద్ర వేస్తుంది. అంతఃపుర రహస్యాలుంటాయి. అవి బాధైనా, మరోటైనా భరించే జమీందారిణీ హూందాతనంతో వుండే పాత్రగా అర్ధంజేసుకుని ఒదిగిపోయింది. చిన్న వయసులో (26 ఏళ్ళు), రెండు సినిమాల అనుభవంతో, ఈ బరువైన క్లిష్ట పాత్ర పోషించే అవకాశం రావడం ఆమెకి గొప్ప.  

        రాహుల్ బోస్ అన్నదమ్ముల ద్విపాత్రాభినయం చేశాడు. గృహ హింస వెలగబెట్టే మగ రాయుళ్ళ పాత్రలు. ఒకటి మతి చెడిన తమ్ముడి పాత్ర. చాలా శాంతంగా, తక్కువ  మాట్లాడే పాత్రలు. చేపట్టేవి క్రూరమైన చర్యలు. అనుభవించేది దారుణమైన శిక్షలు. ఈ డార్క్ షేడ్ పాత్రల్లో రాహుల్ బోస్ ఒకలాటి మత్తైన వాతావరాణాన్ని క్రియేట్ చేస్తాడు నటనతో.  

        వితంతువు బినోదినిగా పావలీ దామ్, ఆ నాటి వితంతువుల జీవితాలకి అద్దం పడుతుంది. డాక్టర్ సుదీప్ గా పరమబ్రత ఛటర్జీ ఇంకో ఫర్వాలేదనిపించే నటన. ఇక హీరోగా అవినాష్ త్రివేదీ లోకల్ షెర్లాక్ హోమ్స్ గా ఆసక్తి కల్గిస్తాడు. ఇంగ్లీషు ప్రభావంతో అతడి లుక్స్, మాటలు ప్రత్యేకంగా వుంటాయి. 

        నటీనటులందరూ 1880 -1900 నాటి మనుషుల పోకడలతో, ముఖ్యంగా నాటి బెంగాలీ నేటివిటీతో, భాషతో, దృశ్యపరమైన సౌందర్యాన్నిపరిపుష్టం చేశారు. హవేలీ వైభవం, వర్ణ చిత్రాలు, పట్టు పరదాలు, వస్త్రా లంకరణ, వస్తు సామగ్రి, గుడ్డి నూనె దీపాల నుంచీ కాలక్రమంలో విద్యుత్ దీపాల కాంతులూ, గుర్రబ్బగ్గీలూ, ఇవన్నీ క్లాసిక్ వాతావరణాన్ని సృష్టిస్తూ ఆ కాలం లోకి లాక్కెళతాయి. 

        రిచ్ కలర్స్, లైటింగ్ స్కీమ్, పిశాచి దాడి చేసేప్పుడు దృశ్యాలకి వాడిన కాషాయ కలర్స్ హార్రర్ ని కూడా ఒక దృశ్య కావ్యంలా మారుస్తాయి. కాషాయం ఎందుకంటే పిశాచి కాళికా దేవీ అని నమ్ముతారు అక్కడి ప్రజలు. పిశాచి వయొలెంట్ జస్టిస్ కి పాల్పడుతోంది. మేల్ వయొలెన్స్ కి వయొలెంట్ జస్టిస్సే సమాధానం అన్నట్టు వుంటుంది. 

        లైటింగ్ ఎఫెక్ట్స్ గురించి కూడా చెప్పుకోవాలి. సత్యజిత్ రే తీసిన ‘దేవి’ పోస్టర్ కి ప్రభావితుడై ఈ లైటింగ్ ఎఫెక్ట్స్ సృష్టించానన్నాడు కెమెరా మాన్ సిద్ధార్థ్ దివాన్. అమిత్ త్రివేదీ సంగీతం స్వరాలు సుతిమెత్తగా పలుకుతాయి. ఎడిటింగ్ కొంతవరకు కథకి ఉత్తేజం తీసుకొచ్చేలా వుంది. ఎడిటింగ్ కి కథ తోడ్పడకపోతే ఎడిటింగ్ కూడా బోరే కొడుతుంది. కొన్ని చోట్ల ఎడిటర్ రామేశ్వర్ భగత్, ఏ షాట్ ముందు వేసి ఏ షాట్ వెనుక వేస్తే కిక్ వుంటుందో తెలుసుకునే ప్రయత్నం చేశాడు. 

        దర్శకురాలిగా తొలి ప్రయత్నంతో ఇంత విజువల్ అద్భుతాన్ని సృష్టించింది అన్వితా దత్తా. ఇంత దర్శకత్వం ఏ దర్శకులూ చేయరు బహుశా. సంజయ్ లీలా భన్సాలీ సినిమాలకి బీభత్స సూపర్ నేచురల్ వెర్షన్ ని సృష్టించి పెట్టినట్టుంది తను. 

కథాకథనాలు
    19 వ శతాబ్దం, ఇంకా ఆ పూర్వపు కాలాల హార్రర్ కథల్ని గోథిక్ హార్రర్ జానర్ అంటారు. ‘ఫ్రాంకెస్టీన్’, ‘డ్రాక్యులా’ వంటి ప్రసిద్ధ నవలలు వచ్చాయి. ఇవొక ఫాంటసికల్ వాతవరణ నేపథ్యంతో వుంటాయి. ‘బుల్బుల్’ కథ ఈ కోవకే చెందింది. ఈ కథ రబీంద్ర నాథ్ టాగూర్ నవలిక ప్రభావంతో రాశానంది దర్శకురాలు. 1901 లో టాగూర్ రాసిన ‘నష్టనిర్’ (చెదిరిన గూడు) నవలిక లోని పాత్రల్ని హార్రర్ లోకి మార్చి తీశానంది. గృహ హింస ఆనాడు ఎంతుందో ఈనాడూ అంతే వుందంది. నవలికలో వున్న పాత్రలు టాగూర్ నిజ జీవితంలో అన్న దమ్ముల పాత్రలే. బినోదిని పేరుతో పాత్రకూడా నవలికలో వుంది. ఈ నవలిక ఆధారంగా సత్యజిత్ రే ‘చారులత’ తీశారు. 


        దర్శకురాలు అన్విత గీత రచయిత్రిగా బాలీవుడ్ పాటలు రాసింది. మాటల రచయిత్రిగా దోస్తానా, కంబఖ్త్ ఇష్క్, స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్, క్వీన్ వంటి 27 సినిమాలకి రాసింది. ఈ రెండు వృత్తులూ ఓకే. కథా రచయిత్రిగా వచ్చేసరికి విఫలమైంది. దర్శకురాలిగా ఎంతో అద్భుతం చేసింది. లేని కథని అద్భుతంగా తీసినంత మాత్రాన ఫలితాలు అద్భుతంగా వుండవు. అద్భుతమైన పాత్రల్ని తీర్చిదిద్దింది. వాటికి కథే లేదు. ఐతే తనేం కథ చేస్తోందో అది మాత్రం తెలుసని చెప్పింది. రెగ్యులర్ గా తీసే ఎవరు చేశారు? -  అనే మర్డర్ ఇన్వెస్టిగేషన్ గాక, ఎలా చేశారు?- అన్న యాక్షన్ కే పరిమితం చేసినట్టు చెప్పింది. ఇదెంతో రిలీఫ్ నిచ్చే మాట. మర్డర్ ఇన్వెస్టిగేషన్, హంతకుణ్ణి పట్టుకోవడాలు వగైరా ఇంకా ఎవరిక్కావాలి? హంతకుడు ఎలా హత్య చేశాడు, ఎందుకు చేశాడనే ఆసక్తి చుట్టూ కథ వుంటే చాలు. పట్టుకుంటే ఎంత, పట్టుకోకపోతే ఎంత - నేటి శిక్షలు పడే ప్రహసనాలూ కాలయాపనలూ చూస్తున్నాక.

        అయితే తను తెలుసుకోని దేమిటంటే, సినిమాని అడ్డంగా కుప్ప కూల్చే ఎండ్ సస్పెన్స్ అనే మాయదారి జాతికి చెందిన కథ ఇదని. దీంతో ఈ గంటన్నర సినిమా కూడా వృధా అయిపోయింది. గంటన్నరలో గంటా 10 నిమిషాల వరకూ కథ అంతుబట్టక, అసలు కథే అర్ధం గాక, పట్టపగలు కూడా నిద్ర ముంచుకొచ్చే పరిస్థితి. ఆ తర్వాతి ఇరవై నిమిషాల్లోనే ఫ్లాష్ బ్యాకుల వల్ల కథ తెలిసి ముగింపు కొస్తుంది. బుల్బుల్ కి అసలేం జరిగిందో ఈ ఇరవై నిమిషాల్లోనే తెలిసి -తెలిశాక ఇంకేం జరుగుతుందో తెలిసిపోయి- చప్పగా ముగుస్తుంది. 

        మరి ఫస్టాఫ్ అంతా ఏముంది? బుల్బుల్ చిన్నతనంలో పెళ్లి, తర్వాత ఇరవై ఏళ్ళు టైం లాప్స్ తో సత్య ఇంటికి రావడం, అన్నలేమయ్యారో ఆ ఫ్లాష్ బ్యాకులు అసంపూర్ణంగా తెలుసుకోవడం, చావుల దర్యాప్తు చేయడం, ఇదంతా జరుగుతున్నప్పుడు ప్రధాన పాత్ర బుల్బుల్ జమీందారిణీగా ఏమీ చెయ్యకుండా నవ్వులు చిందిస్తూ వుండడం, ఎంతకీ కథనం ముందుకు కదలక పోవడం, విషయం తెలియక పోవడం, ఇంతే. మూసి పెట్టిన విషయం తో ఎండ్ సస్పెన్స్ పెట్టే సహన పరీక్ష ఇలా వుంటుందని ఈ సినిమాతో వెయ్యో సారి రుజువైంది. 

        అనుమానిత పాత్ర లేకపోవడం ఈ ఎండ్ సస్పెన్స్ లో కూడా ఒక లోపం. బుల్బుల్ ని అనుమానిత పాత్రగా ఎస్టాబ్లిష్ చేసివుంటే కథలో చాలా సమస్యలు తీరేవి. మాటలు కవితాత్మకంగా రాసినట్టు, కథకూడా కవిత రాసినట్టు రాయడం వల్ల వచ్చిన సమస్య ఇది. గృహ హింస తాలూకు రెండు దృశ్యాలు వయొలెంట్ గా వుంటే సరిపోలేదు. ఆ గాభరా, సస్పెన్స్ మిగతా కథలో కూడా వుండాలి. కథేమిటో ఓపెనై పాత్ర సమస్యేమిటో తెలియాలి. సమస్యేమిటంటే- అటు బుల్బుల్, ఇటు సత్య ఏదీ ప్రధాన పాత్ర కాకుండా పోయాయి. టాగూర్ నవలిక, దాంతో సత్యజిత్ సినిమా సామాజికాలు కాబట్టి సరిపోయాయి. వాటిని హార్రర్ గా మార్చాలంటే అసలు  స్క్రీన్ ప్లే అనేది స్ట్రక్చర్ లో వుండడం అవసరం.  

        ఈ కథలో మోస్ట్ టెర్రిఫిక్ డైలాగు, బుల్బుల్ తో బినోదిని ‘చుప్ రహెనా’ (సైలెంట్ గా  వుండిపో) అనడం. అలాగని కథ కూడా సైలెంట్ గా వుండిపోతే ఎలా?  

సికిందర్