రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

25, జనవరి 2023, బుధవారం

1293 : రివ్యూ!


 

దర్శకత్వం : సిద్ధార్థ్ ఆనంద్
తారాగణం : షారుఖ్ ఖాన్, దీపికా పడుకొనే, జాన్ అబ్రహాం, డింపుల్ కపాడియా, షాజీ చౌదరి, ఆశుతోష్ రాణా తదితరులు
కథ :  సిద్ధార్థ్ ఆనంద్, స్క్రీన్ ప్లే : శ్రీధర్ రాఘవన్, మాటలు : అబ్బాస్ టైర్ వాలా  
సంగీతం- పాటలు : విశాల్ -శేఖర్, నేపథ్య సంగీతం : సంచిత్ బల్హారా-అంకిత్ బల్హారా, ఛాయాగ్రహణం : సత్ చిత్ పౌలోస్
బ్యానర్ : యశ్ రాజ్ ఫిల్మ్స్
నిర్మాత : ఆదిత్యా చోప్రా
విడుదల : జనవరి 25, 2023
***

        సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ప్రసిద్ధ నిర్మాత ఆదిత్యా చోప్రా అందిస్తున్న పఠాన్ గత సంవత్సరపు బాలీవుడ్ భారీ పరాజయాల రికార్డుని సరిదిద్ది కొత్త ప్రారంభాన్ని స్థాపిస్తుందని ఆశిస్తున్నారు. యశ్ రాజ్ సినిమాల  వైఫల్యాల పరంపరని ఈ యాక్షన్ సినిమా బ్రేక్ చేస్తుందని భావిస్తున్నారు. మూడు వరుస ఫ్లాపులతో గత నాల్గేళ్ళుగా పెద్దతెర మీద కన్పించకుండా పోయిన షారుఖ్ ఖాన్ పునరాగమనం అతడి భవిష్యత్తుని కూడా నిర్ణయిస్తుంది. 2019లో యశ్ రాజ్ ఫిలిమ్స్ కి హృతిక్ రోషన్- టైగర్ ష్రాఫ్ లతో వార్ అనే సూపర్ హిట్ మూవీ అందించిన దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ భుజాల మీద  ఇప్పుడు ఫ్లాపుల్లో వున్న యశ్ రాజ్ ఫిలిమ్స్ నీ, షారుఖ్ ఖాన్ నీ ఒడ్డున పడేయాల్సిన బాధ్యత వుంది. ఇదే గనుక జరిగితే రియల్ పఠాన్ సిద్ధార్థ్ ఆనంద్ అవుతాడు. ఇది జరిగిందా లేదా చూద్దాం...

కథ

2019 లో ఆర్టికల్ 370 ని రద్దు చేయడంతో రెచ్చిపోయిన పాకిస్తాన్ జనరల్ ఖదీర్ (మనీష్ వాధ్వా) ప్రతీకారం తీర్చుకోవాలని ఉగ్రవాది జిమ్ (జాన్ అబ్రహాం) ని ఉసిగొల్పుతాడు. జిమ్ ఇండియామీద పగబట్టిన మాజీ ఇండియన్ రా ఏజెంట్. ఈ సమయంలో రా లోనే పనిచేసే నందిని (డింపుల్ కపాడియా), ఫ్రాన్స్ లో తేలిన పాకిస్తానీ ఐఎస్ఐ ఏజెంట్ డాక్టర్ రుబీనా (దీపికా పడుకొనే) సీసీ టీవీ వీడియో చూసి ఎలర్ట్ అవుతుంది. దీంతో ఒకప్పుడు అత్యుత్తమ రా ఏజెంట్‌లలో ఒకడైన పఠాన్ (షారుఖ్ ఖాన్) కి ఆపరేషన్ అప్పజెప్తుంది. ఈ క్రమంలో రష్యాలో భద్రపర్చిన రక్త బీజ్ అనే మశూచి ద్రావణాన్ని తస్కరించి దాంతో ఇండియాని ధ్వంసం చేయడానికి జిమ్, రుబీనాలు పథకం పన్నారని తెలుసుకున్న పఠాన్, ఈ కుట్రని ఎలా తిప్పికొట్టాడన్నది మిగతా కథ.

ఎలావుంది కథ

హై కాన్సెప్ట్ స్పై (గూఢచారి) అడ్వెంచర్ కథ. హాలీవుడ్ హై కాన్సెప్ట్ సినిమాల్లో ఎలాగైతే సింపుల్ కథ, దాంతో హెవీ యాక్షన్ వుంటాయో ఆ తరహా మేకింగ్. హిట్టయిన బ్రహ్మాస్త్ర స్పిరిచ్యువల్ థ్రిల్లర్ కూడా ఇదే తరహా మేకింగ్. స్పై సినిమాలు రెండు విధాలుగా వుంటాయి : జాన్ లీ కార్ టైపులో రియలిస్టిక్ గా, జేమ్స్ బాండ్ టైపులో ఫాంటసికల్ గా. పఠాన్ ఫాంటసీ టైపు. ఈ సింపుల్ కథలో మూడే ప్రధాన పాత్రలు- పఠాన్, రుబీనా, జిమ్ ల మధ్య రక్త బీజ్ కోసం హోరా హోరీ.
        
ఈ హోరాహోరీలో చివరంటా వూహించని మలుపులు. హాలీవుడ్ భాషలో చెప్పాలంటే మలుపులతో పది నిమిషాలకో వామ్మో (బ్యాంగ్). ఒక్కో వామ్మోతో- కొత్త మలుపుతో- సింపుల్ కథ ఒక్కో లెవెల్ పైకెళ్తూ వుంటుంది. ఒక్కో వామ్మోతో ఒక్కో భావోద్వేగం- దేశభక్తి, యాక్షన్, హాస్యం, థ్రిల్, కన్నీళ్ళూ, ఉద్రేకం, భయం, స్నేహం, రోమాన్స్, సస్పెన్స్  ప్లే అవుతూ వుంటాయి. ఎంటర్టయినర్ పేరుతో అడ్డుతగిలే ఇతర కమర్షియల్ మసాలాలుండవు. రెండే పాటలుంటాయి.
          
ప్రాంతాలు మాత్రం హైపర్ యాక్షన్ సీన్స్ తో నిండిపోయి చాలా వుంటాయి- దుబాయి, ఆఫ్ఘనిస్తాన్, టర్కీ, ఆఫ్రికా, ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్, మాస్కో, మలోర్కా, కాడిజ్, సైబీరియా మొదలైనవి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో తరహా హైపర్ యాక్షన్. రోడ్ల మీద, భవనాల్లో, పర్వతాల్లో, మంచు పర్వతాల్లో, ట్రైను మీద, ఆకాశంలో హెలీకాప్టర్ల మీద, ఘనీభవించిన సరస్సులో –ప్రతీ ఛోటా విలన్ జిమ్ పాత్ర నటించిన జాన్ అబ్రహాం షారూఖ్ ఖాన్ని ముప్పుతిప్పలు పెడతాడు.        
        
చిత్ర విచిత్ర తుపాకులు, క్షిపణులు, బాంబులు. ఈ యాక్షన్లో లాజిక్ మాత్రం అడగవద్దు. వివిధ వాహనాలు, ఆయుధాలు రెడీగా వుంటాయి. జాన్ కి ఏది దొరుకుతుందో, పక్కన రెడీగా పెట్టి షారుఖ్ కీ అదే దొరుకుతుంది. ఇక వాటితో ఛేజింగ్స్, కొట్టుకోవడం, కాల్చుకోవడం. మధ్యలో టైగర్ జిందా హై లో స్పై గా నటించిన సల్మాన్ ఖాన్ వచ్చేసి షారుఖ్ ని కాపాడతాడు. షారుఖ్, దీపికా, జాన్ అబ్రహాంల స్పీడ్ యాక్షన్ సీన్లు, ఫైట్లు కళ్ళు తిప్పుకోనివ్వవు.
          
దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ యాక్షన్ కథ చాలా సరళంగా వున్నా మూలంలో మూస కథే. ఒక ఫార్ములా కోసం స్పై కథలు పాతవే. దీనికి శ్రీధర్ రాఘవన్ స్క్రీన్‌ప్లే మాత్రం బోరు కొట్టించే సన్నివేశాలు లేకుండా నిత్య చలనంలో వుంచాడు. మాస్ రైటర్ అబ్బాస్ టైర్ వాలా ఈసారి సింపుల్ డైలాగులు, హుషారైన డైలాగులు, కొన్ని చోట్ల కదిలించే డైలాగులు రాశాడు. అదే పనిగా అక్షయ్ కుమార్ కాపీరైటు చేసుకున్న దేశభక్తి మోత మోగించే, జింగోయిజం జోలికి పోలేదు. ఇది భక్తులకి పనికొచ్చే ఎజెండా మూవీకాదు. భక్తులు రెచ్చిపోయిన ఆ బికినీ మాత్రం సినిమాలో అలాగే వుంది.

సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం క్వాలిటీతో వుంది. 250 కోట్ల బడ్జెట్ తో క్వాలిటీని పై స్థాయిలో వుంచుతూ కథనం, దానికి తగ్గ మేకింగ్ చేశాడు. సెకండాఫ్‌లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంటేజస్ డిసీజ్‌లో నందిని పాత్ర నటించిన డింపుల్ కపాడియా   ఆత్మత్యాగం చేసుకునే ఎమోషనల్ సీక్వెన్స్ ని మామూలు ప్రేక్షకుడు ఏడ్చేలా తీశాడు.

నటనలు- సాంకేతికాలు

పఠాన్ రఫ్- మాస్ లుక్ పాత్రలో షారుఖ్ ఖాన్ పైసా వసూల్ ఎంట్రీ ఇస్తాడు ప్రారంభంలోనే. హెవీ యాక్షన్ కి తగ్గ షేపులో డాషింగ్ గా వుంటాడు. ఆ వయసుకి సాధ్యంకాని పోరాట విన్యాసాలు చేశాడు. కొన్ని చోట్ల మాస్ లుక్, కొన్ని చోట్ల క్లాస్ లుక్ తో ఎంటర్ టైన్ చేస్తాడు. మాస్ లుక్ సిల్వస్టర్ స్టాలోన్ రాంబో లా వుంటుంది. ఎమోషనల్ సీన్స్ లో కూడా ప్రస్తుతానికి తను టాప్ అన్పించుకున్నాడు.
        
హాట్ హాట్ గా దీపికా పడుకొనే బేషరమ్ రంగ్ పాటతో బికినీల్లో ఎంట్రీ ఇస్తుంది. ఆమె ప్రతీ సీనులో ఎక్స్ ఫోజ్ చేస్తూనే వుంటుంది. ఆమె పాత్రకి షేడ్స్ వున్నాయి. ఇంటర్వెల్లో బయటపడే ఆమె ఒక షేడ్ షాకిస్తుంది. కథనంలో ఆమె పాత్ర కీలకమైనది. యాక్షన్ సీన్స్ లో చాలా కూల్ గా వుంటుంది. షారుఖ్ కి, జాన్ అబ్రహాంకీ వున్నట్టే తనకీ ఓ బాధాకర ఫ్లాష్ బ్యాక్ వుంటుంది. ఇవన్నీ మూస ఫార్ములా ఫ్లాష్ బ్యాకులు- క్లుప్తంగా వుంటాయి.
        
ఇక హీరో జాన్ అబ్రహాం భయంకర, ఫన్నీ, కామిక్, డాషింగ్ విలన్ పాత్ర వేయడం ఒక హైలైట్, బలం. ఎప్పుడేం చేస్తాడో వూహకందని ఎత్తుగడలతో చివరిదాకా ఏడ్పిస్తాడు. డింపుల్ కపాడియా, అశుతోష్ రాణా (రాచీఫ్), ప్రకాష్ బెలవాడి (సైంటిస్ట్) నటనలు సింపుల్ గా వుంటూనే సన్నివేశాల్ని ప్రభావితం చేస్తాయి. షారుఖ్- సల్మాన్ల ట్రైను మీద వాళ్ళ మధ్య బాండింగ్, యాక్షన్ సీను, దాని ముగింపూ చాలా హైరేంజిలో వుంటాయి.
        
విశాల్- శేఖర్ సంగీతంలో 'బేషరమ్ రంగ్’,  'ఝూమే జో పఠాన్' రెండు పాటలున్నాయి. సంచిత్ బల్హారా- అంకిత్ బల్హారా బ్యాక్‌గ్రౌండ్ స్కోరు స్పై థ్రిల్లర్ కి సరిపోలే బాణీలతో గుర్తుండి పోతుంది. సత్ చిత్ పౌలోస్ కెమెరా విదేశీ లొకేషన్స్ ని సమున్నతంగా కళ్ళముందుంచుతుంది. 19 మంది విదేశీ యాక్షన్ డైరెక్టర్లు సమకూర్చిన యాక్షన్ సీన్లు అంతర్జాతీయ స్థాయిలో వున్నాయి. వీఎఫ్ఎక్స్ కూడా ప్రపంచ ప్రమాణాలకి సరిపోలుతుంది. 
        
మొత్తం మీద ఒక హిట్ కోసం ఎదురుచూస్తున్న షారుఖ్ కి, ఆదిత్యా చోప్రాకీ వూహించని హిట్టిచ్చినట్టే దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్. షారుఖ్ పునరాగమనాన్ని సమతులాహారం చేసిన అతడికి రియల్ పఠాన్ టైటిల్ ఇవ్వాలి. పఠాన్ తో ఉత్తరాది టౌన్లలో మూతబడ్డ సింగిల్ స్క్రీన్ థియేటర్లు తెర్చుకోవడం ఒక శుభపరిణామం. నేడు చాలా ఉత్తరాది నగరాల్లో, పట్టణాల్లో అదనంగా అర్ధరాత్రి షోలు బుక్కయ్యాయి. మన దేశం నుంచి 100 దేశాల్లో విడుదలైన తొలి మూవీ ఇదే.
 — సికిందర్

24, జనవరి 2023, మంగళవారం

1292 : స్పెషల్ న్యూస్!

          హాత్మా గాంధీ హంతకుడిగా నాథూరామ్ గాడ్సే పేరు తెలియని వారు లేరు. 1948 జనవరి 30 న పట్టపగలు నమస్కారం పెట్టి గాంధీ ఛాతీలోకి మూడు బుల్లెట్లు పేల్చాడు గాడ్సే. 1949 లో గాడ్సేకి మరణశిక్ష విధించింది కోర్టు. అయితే దేశ విభజనలో గాంధీ పాత్రని ప్రశ్నిస్తూ గాడ్సేని దేశభక్తుడిగా చూసే ఒక వర్గం వుంది. కానీ గాంధీజీ హత్య దశాబ్దాల క్రమబద్ధమైన బ్రెయిన్ వాష్‌కి పరాకాష్ట అనీ, గాంధీజీ కొన్ని శక్తుల కంట్లో  నలుసుగా మారారనీ, కాలక్రమేణా ఈ ఆగ్రహం ఒక ఫోబియాగా మారిందనీ, 1934 సంవత్సరం నుంచి 14 సంవత్సరాల కాలంలో గాంధీజీని హతమార్చేందుకు దాదాపు ఆరు సందర్భాలలో ప్రయత్నాలు జరిగాయనీ, ఎంకెగాంధీ.ఆర్గ్ వెబ్సైట్  పేర్కొంటోంది.

        1948 జనవరి 30 న గాడ్సే చేసిన చివరి ప్రయత్నం ఫలించింది. మిగిలిన ఐదు ప్రయత్నాలు 1934లో; జూలై, సెప్టెంబరు 1944 లో; సెప్టెంబర్ 1946 లో; 20 జనవరి 1948లో జరిగాయి. గాడ్సే మునుపటి రెండు ప్రయత్నాల్లో పాల్గొన్నాడు. 1934, 1944, 1946లో విఫలయత్నాలు జరిగినప్పుడు దేశ విభజనకి సంబంధించిన ప్రతిపాదన గానీ, పాకిస్థాన్‌ కి 55 కోట్ల నిధులు విడుదల చేసే అంశంగానీ అసలు ఉనికిలో లేవు. లేనప్పుడు ఈ కారణాలు చెప్పి గాడ్సే ని సమర్ధించే వర్గం వాదన నిలబడదనీ, గాంధీజీని అంతమొందించే కుట్ర చాలా ముందుగానే జరిగిందనీ వెబ్సైట్ పేర్కొంటోంది.
        
అసలు ఒక హత్యని సమర్ధించడ మేమిటని మౌలిక ప్రశ్న. ఈ ప్రశ్న రాజ్ కుమార్ సంతోషీకి కూడా వేశారు. గాంధీ హత్యని తీసుకుని గత యాభై ఏళ్ళుగా సినిమాలు తీస్తూనే వున్నారు కమల హాసన్ సహా. చివరికిప్పుడు సీనియర్ దర్శకుడు రాజ్ కుమార్ సంతోషీ కూడా తీశాడు. 2001 లో ది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్ అనే గొప్ప సినిమా తీశాడు అజయ్ దేవగణ్ తో. ఆయన గోదీ మీడియా లాగా గోదీ దర్శకుడు కాదు. కాశ్మీర్ ఫైల్స్ లాంటి ఎజెండా సినిమాలు తీయడు. కనుక జనవరి 26 న సంతోషీ తీసిన గాంధీ గాడ్సే -ఏక్ యుధ్ విడుదలవుతూంటే గాడ్సే సమర్ధకులు హడావిడి చేయడంలేదు. షారుఖ్ ఖాన్ సినిమాలు చూసి అతడ్ని సూపర్ స్టార్ చేసిన వాళ్ళు పఠాన్ ని బ్యాన్ చేసుకుంటూ తిరుగడంలో బిజీగా వున్నారు.
        
అయితే ఒక విషాదాన్ని జనవరి 26 న రిపబ్లిక్ డే నాడు ప్రదర్శించడమే సంతోషీ నిజాయితీని ప్రశ్నిస్తోంది. దీనికెక్కడా తగిన పబ్లిసిటీ జరగడం లేదనేది గమనించాలి. ఇది దేశవ్యాప్తంగా విడుదల కావడంలేదు. కొన్ని చోట్ల మాత్రమే పరిమితంగా విడుదలవుతోంది.  ఒక పక్క 25న పఠాన్ విడుదలవుతూంటే 26 న సంతోషీ సినిమా ఎవరు చూస్తారని ప్రశ్నించే వాళ్ళూ వున్నారు.
        
ఇది కాల్పనిక చరిత్ర. ఈ కథ మహాత్మా గాంధీ వున్న కల్పిత ప్రపంచం చుట్టూ తిరుగుతుంది. గాంధీ తనపై జరిగిన దాడి నుంచి బయటపడి, తర్వాత జైలులో నాథూరామ్ గాడ్సేని కలుస్తాడు. వాళ్ళిద్దరి మధ్య సంభాషణ తీవ్ర చర్చకి దారి తీస్తుంది.  భావజాలాల ఆ వాగ్యుద్ధంలో ఎవరు నెగ్గారనేది కథ. గాడ్సే ఏమని వాదిస్తాడో తెలిసిందే, గాంధీ ఏం చెప్తాడనేది రాజ్ కుమార్ సంతోషి లోని రచయిత చెప్తాడు. 
        
దర్శకుడు రాజ్‌కుమార్ సంతోషి చారిత్రాత్మక సంఘటనల్ని ట్రేస్ చేస్తూ ఇద్దరి భావజాలాల వ్యత్యాసాన్ని చిత్రీకరించాడు. ప్రెస్ మీట్ లో నాథూరామ్ గాడ్సేని కీర్తించేందుకు ఈ సినిమా చేస్తున్న ప్రయత్నమా అని సంతోషిని ప్రశ్నించారు.  గాడ్సే కోర్టులో వాంగ్మూలం ఇచ్చాడనీ, దాన్ని  ప్రజలకి తెలియకుండా దాచిపెట్టారనీ, తను భావిస్తున్నట్టూ, గాడ్సేకి జరిగిన అన్యాయాన్ని బయట పెట్టేందుకు తానెందుకు భయపడాలనీ సంతోషీ చెప్పాడు.
        
హంతకుడిని సమర్థించడం నైతికంగా సరైనదేనా అని అడిగినప్పుడు- గాడ్సే వైఖరిని సమర్థించడం సరైనదేననీ, ఒక వ్యక్తిని ఉరితీసే ముందు అతని ఆఖరి కోరిక తీరుస్తామనీ, గాడ్సే ఆఖరి కోరిక తన వాయిస్ ప్రజలకి చేరువ కావాలన్నదేననీ, అది మేము ప్రజలకి వినిపిస్తే తప్పేమిటనీ తన పాయింటుని వివరించాడు సంతోషీ.
        
ఇందులో మహాత్మా గాంధీగా దీపక్ అంతానీ నటిస్తే, గాడ్సేగా చిన్మయ్ మండ్లేకర్ నటించాడు. అయితే గాడ్సేని బతికించి వుంచడానికి ఇలా సినిమాలు తీస్తూ  గాంధీని పదేపదే చంపుతున్నారు. రాజ్ కుమార్ సంతోషీ అసలేం చేశాడనేది రిపబ్లిక్ డే నాడు తెలుస్తుంది.

సికిందర్
 

23, జనవరి 2023, సోమవారం

1291 : స్పెషల్ న్యూస్!


 

  సంక్రాంతికి వాల్తేరు వీరయ్య’, వీర సింహారెడ్డి రెండూ సృష్టించిన సంచలనం బాలీవుడ్ ని తాకి ఆశ్చర్యపరుస్తోంది. పోటా పోటీగా షోలమీద షోలు హౌస్ పుల్స్ తో ప్రేక్షకులు కిటకిటలాడిన దృశ్యం మనకు కొత్తేం కాదుగానీ బాలీవుడ్ లో కొత్తగా ఆలోచింపజేస్తోంది. హిందీ రాష్ట్రాల్లో ఏ పండుగకీ విడుదలయ్యే సినిమాలు ఇంత ధూంధాంగా ఆడవు. దసరా, దీపావళి, ఈద్ -ఈ మూడు పండుగలు బాలీవుడ్ కి ముఖ్యమైతే అప్పుడు విడుదల చేసే స్టార్ సినిమాలు మామూలుగానే ఆడతాయి. మనలాగా పళ్ళు తోముకోకుండా తెల్లవారగానే షోల మీద షోలు వేసి బాక్సాఫీసులు నింపుకోవడం వుండదు. దీనికి కారణం బాలీవుడ్ స్టార్స్ కి ఫ్యాన్స్ లేకపోవడం. వుంటే కొద్దిపాటి సైజులో వుంటారు. చిరంజీవికి, బాలకృష్ణకీ ఆ స్థాయిలో ఫ్యాన్స్ లేకపోతే ఆ రెండు సినిమాలకి నిర్విరామంగా బాక్సాఫీసులు బద్దలవుతూ వుండేవి కావు.

        దే సమయంలో తమిళనాడులో కూడా అజిత్, విజయ్ సినిమాలకి బాక్సాఫీసులు బద్ధలవడం చూసి బాలీవుడ్ ఉలిక్కిపడుతోంది. ఇలా మన బాక్సాఫీసులు ఎప్పుడు బద్దలవుతాయని తలలు పట్టుకుంటున్నారు. చివరికి తేల్చిందేమిటంటే, సౌత్ లో స్క్రీన్స్ (థియేటర్లు) ఎక్కువ వుండడం వల్ల సౌత్ సినిమాలు సక్సెస్ అవుతున్నాయని. కానీ స్టార్స్ కి పోటెత్తే ఫ్యాన్సే లేకపోతే ఎన్ని స్క్రీన్స్ వుండీ ఏం లాభం. దేశంలో అన్ని నగరాల్లో కంటే ముంబాయిలోనే  స్క్రీన్స్ ఎక్కువున్నాయి మరి.

సౌత్ స్క్రీన్లే ఎక్కువ!
        సందర్భం వచ్చింది కాబట్టి అసలు దేశంలో స్క్రీన్స్ గణాంకాలేమిటని చూస్తే- బ్యూరో ఆఫ్ ఔట్‌రీచ్ అండ్ కమ్యూనికేషన్ డేటా ప్రకారం, దేశవ్యాప్తంగా దాదాపు 8,700 స్క్రీన్‌లలో 31.52 లక్షల సీట్లు వున్నాయి. ఇందులో ఐదు దక్షిణాది రాష్ట్రాల్లో 18.16 లక్షల సీటింగ్ కెపాసిటీతో దాదాపు 4,150 స్క్రీన్లు వున్నాయి. అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ వంటి రాష్ట్రాలు స్క్రీన్ల పరంగా దాదాపు 47.78 శాతం, సీటింగ్ కెపాసిటీ పరంగా 57.61 శాతం వాటా కలిగి వున్నాయి.
        
తెలుగు మాట్లాడే ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల్లో 1,700 కంటే ఎక్కువ స్క్రీన్లు వుంటే,  తమిళనాడులో 1,000 కంటే ఎక్కువ వున్నాయి. కర్ణాటకలో 800కి పైగా స్క్రీన్‌లు వుండగా, కేరళలో దాదాపు 600 స్క్రీన్‌లు వున్నాయి. దక్షిణ దేశం కాకుండా, మహారాష్ట్రలో 1,000 కంటే ఎక్కువ స్క్రీన్‌లు వున్నాయి. గుజరాత్‌లో 730 కంటే ఎక్కువ స్క్రీన్‌లు వున్నాయి. మిగిలిన దేశంలో దేశంలోని మొత్తం స్క్రీన్‌లలో దాదాపు 33 శాతం వున్నాయి. నగరాల్లో చూస్తే చెన్నైలో 230 స్క్రీన్‌లు వుంటే, హైదరాబాద్‌లో 200 స్క్రీన్ లు వున్నాయి. అత్యధిక స్క్రీన్లున్న నగరం ముంబాయి. ఇక్కడ 259 మల్టీపెక్స్ స్క్రీన్లు, 65 సింగిల్ స్క్రీన్ థియేటర్లు వున్నాయి.
        
ఐనాక్స్ లీజర్ ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్‌ల ప్రకారం, 2019లో దేశంలో  మిలియన్ జనాభాకు తొమ్మిది స్క్రీన్‌లున్నాయి. అమెరికా, కెనడాల్లో ప్రతి మిలియన్ జనాభాకు 125 స్క్రీన్ లున్నాయి. అయితే ఈ రెండు దేశాలకంటే మన దేశంలోనే ఎక్కువ సినిమాలు నిర్మిస్తారు. కానీ జనాభా పరంగా చూసినా, సినిమాల పరంగా చూసినా స్క్రీన్లు చాలా తక్కువ. థియేటర్ల పరంగా చూస్తే దక్షిణ దేశంలోనే దాదాపు 50 శాతం థియేటర్లున్నాయి. ప్రేక్షకులు తగ్గిపోతేనే ఉత్తరాదిలో థియేటర్ల సంఖ్య పడిపోయింది.

మాస్ ని మర్చిపోయారు
        బాలీవుడ్ ఏం చేసిందంటే, మాస్ మీడియా అయిన సినిమాని క్లాస్ మీడియాగా మార్చేసింది. దీంతో మాస్ సినిమాలు లేక ఉత్తరాది రాష్ట్రాల్లో బి, సి సెంటర్ల ప్రేక్షకులతో బాటు థియేటర్లు అదృశ్యమైపోయాయి. అమితాబ్ బచ్చన్ సూపర్ స్టార్ గా వెలుగుతున్న కాలంలో ఆయన నటించిన క్లాస్ సినిమాలు తక్కువ, మాస్ సినిమాలు ఎక్కువ. దీంతో వూరూరా సినిమాలు ఆడేవి. అమితాబ్ తో బాటు అనిల్ కపూర్, మిథున్ చక్రవర్తి, సన్నీ డియోల్, జాకీ ష్రాఫ్, సునీల్ శెట్టి, గోవిందా వీళ్ళంతా మాస్ స్టార్లు. వీళ్ళ సినిమాలు విరివిగా వచ్చేవి. తర్వాతి తరం స్టార్లు రెండేళ్ళ కొకటి, మూడేళ్ళకొకటి సినిమాలు తీస్తే ప్రేక్షకులెక్కడుంటారు, థియేటర్లెక్కడుంటాయి. ఆ రోజుల్లో ప్రేక్షకులనుద్దేశించి ఆబాలగోపాలం అనేవాళ్ళు. అంటే పిల్లల నుంచి వృద్ధులవరకూ అందర్నీ అలరించే సినిమాలు. ఇప్పుడు హిందీ సినిమాలకి ఆబాలం లేదు, గోపాలం లేదు, ఏ సెంటర్స్ లో యువమేళం తప్ప.
        
దక్షిణ సినిమాలు వాటి డీఎన్ఏ ని వదులుకోవు. మాస్ మసాలా వుండాల్సిందే. అందుకే దేశంలోనే ఎక్కువ థియేటర్లలో అవి బతుకుతున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో బి,సి సెంటర్లలలో వ్యాపారాలు మూగబోయి పంపిణీ దారులు ఆందోళన చేసిన సన్నివేశం కూడా వుంది. సౌత్ సినిమాలు సౌత్ వరకే సరిపెట్టుకోవడం లేదు. పానిండియా అనే పదం సృష్టించుకుని జాతీయ మార్కెట్ ని ఆక్రమిస్తున్నాయి. ప్రతీ సౌత్ సినిమాకి రూ. 1,000 కోట్ల బాక్సాఫీసు మార్కెట్ వుందని నమ్ముతున్నారు సౌత్ నిర్మాతలు. బాహుబలి రెండు భాగాలు, పోన్నియన్ సెల్వన్, విక్రమ్, ట్రిపులార్, పుష్ప మొదటి భాగం, కేజీఎఫ్ రెండుభాగాలు, కాంతారా ...ఆఖరికి కార్తికేయ 2 ఈ విషయాన్ని రుజువు చేశాయి.
        
బాలీవుడ్ దాని మార్కెట్ ని ఎలా విస్తరించుకోవాలో ఆలోచిస్తున్నట్టు లేదు. పరిశీలకులు ఒక మాట చెప్తున్నారు- హిందీ దంగల్‌ కి అత్యధిక కలెక్షన్లు దాదాపు రూ. 375 కోట్లు రాడానికి, దేశంలో దాదాపు సగం ఎగ్జిబిషన్ స్క్రీన్‌లున్న దక్షిణ మార్కెట్టే కారణమని. సౌత్ సినిమాలు సాఫీగా ఉత్తరాదికి మారినట్టు బాలీవుడ్ సినిమాలు సౌత్ మార్కెట్ లో చొచ్చుకెళ్ళే ప్రణాళికలు తయారు చేసుకోవాలి.

స్టార్లే తప్ప ఫ్యాన్స్ లేరు
        అన్నిటికన్నా ముఖ్య సమస్య ఏమిటంటే స్టార్ల కొరత. బాక్సాఫీసుని శాసించగల స్టార్లు, సూపర్ స్టార్లు ఇక లేరు. ఉన్న ఖాన్ ల ప్రభ తగ్గింది అక్షయ్ కుమార్ తోబాటు. హృతిక్ రోషన్ ఎప్పుడు నటిస్తాడో తెలీదు. సంజయ్ దత్, అజయ్ దేవగణ్ లు సరిపోరు. సరికొత్త తరంలో రణబీర్ కపూర్, టైగర్ ష్రాఫ్, వరుణ్ ధావన్, షాహిద్ కపూర్, ఆయుష్మాన్ ఖురానా బాక్సాఫీసు బాద్షాలయ్యే పరిస్థితి లేదు.
        
అరవై దాటినా బాక్సాఫీసుని హైజాక్ చేసే చిరంజీవి, బాలకృష్ణ, రజనీకాంత్ ల వంటి ఆల్ రౌండర్లు హిందీలో లేకపోవడం బాలీవుడ్ భవిష్యత్తుకి ప్రమాద సంకేతం. పుష్ప తో హిందీ ప్రేక్షకుల్ని టోకున తన ఖాతాలో వేసుకుని విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సృష్టించుకున్న అల్లు అర్జున్ లాంటి యంగ్ మాస్ స్టార్స్ ని బాలీవుడ్ సృష్టించుకోక పోతే మనుగడ కష్టమే. బాహుబలితో ప్రభాస్, కేజీఎఫ్ తో యశ్, ట్రిపులార్ తో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హిందీలో మాస్ స్టార్స్ గా బలమైన ఫ్యాన్ బేస్ ని సృష్టించుకున్నారు. విజయ్ దేవరకొండ లైగర్ విడుదల కాకముందే ప్రమోషన్స్ కి క్రియేట్ చేసిన మాస్ మేనియా ఇంతా అంతా కాదు. ఒక మాల్ లో పట్టనంతమంది అభిమానులు దూరతీరాలనుంచి తరలి వచ్చారు.
        
ఏ హిందీ స్టార్ కీ ఇంత ఫ్యాన్ బేస్ లేదు. బి, సి సెంటర్లు కలిస్తేనే ఇంత ఫ్యాన్ బేస్ వస్తుంది. హిందీ సినిమాలకి దూరమైన బీసీ సెంటర్లని బాలీవుడ్ జోడో యాత్రతో ఏకం చేస్తున్నారు సౌత్ స్టార్స్. పుష్ప లో అల్లు అర్జున్ వైరల్ డైలాగు వుంది- తగ్గేదే లే అని. తెలుగు కంటే ఇది హిందీ వెర్షన్లో మంచి కిక్ ఇచ్చేలా వుంది- నహీ ఝుకేగా సాలా అని! ఇది హిందీ రాష్ట్రాల్లో పిల్లల నోటికి కూడా పట్టేసింది. అల్లు అర్జున్ ని అనుకరిస్తూ వీడియోలు వైరల్ చేశారు. ఇది కదా సినిమాలంటే, స్టార్లంటే అర్ధం!
        
బాలీవుడ్ ఫ్లాష్ బ్యాక్ లోకెళ్ళి తిరిగి ఒకనాటి స్టార్స్ నీ, వాళ్ళ మాస్ సినిమాల్నీ, ఫ్యాన్స్ నీ సృష్టించుకోవాలని గ్రహించకపోతే -వాల్తేరు వీరయ్య’, వీరసింహా రెడ్డి ల వంటి సంచలనాల విజయ రహస్యాలు ఆశ్చర్యపరుస్తూనే వుంటాయి.
—సికిందర్

22, జనవరి 2023, ఆదివారం

1290 : సండే స్పెషల్ రివ్యూ!


         95 ఆస్కార్ అవార్డ్సు పోటీల్లో ఉత్తమ అంతర్జాతీయ చలనచిత్రం విభాగంలో షార్ట్ లిస్ట్ అయిన 15 సినిమాల్లో కొరియన్ మూవీ డిసిషన్ టు లీవ్ ఒకటి. 92 దేశాలు పంపిన చలన చిత్రాల్లో మన దేశపు చెల్లో షో కూడా షార్ట్ లిస్ట్ అయిన విషయం తెలిసిందే. షార్ట్ లిస్టయిన 15 సినిమాల్లోంచి ఫైనల్ నామినీలుగా 5 సినిమాల్ని ఎల్లుండి అంటే జనవరి 24 న ప్రకటిస్తారు. గెలుపు గుర్రాన్ని మార్చి 12న జరిగే అవార్డుల ప్రదానోత్సవంలో ప్రకటిస్తారు.

డెసిషన్ టు లీవ్ ప్రసిద్ధ కొరియన్ దర్శకుడు పార్క్ చాన్ వూక్ తీసిన మాస్టర్ పీస్ అంటున్నారు. 2022 కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో అతను ఉత్తమ దర్శకుడుగా ఎంపికయ్యాడు. మొత్తం 11 సినిమాలకి దర్శకత్వం వహించిన పార్క్ చాన్ వూక్ వివిధ ఫిలిం ఫెస్టివల్స్ లో 43 అవార్డులు పొందాడు. ప్రస్తుతం డెసిషన్ టు బ్రేకప్ అనే మూవీ మీద పనిచేస్తున్న పార్క్, డెసిషన్ టు లీవ్ ని మర్డర్ మిస్టరీ రోమాన్స్ గా తీశాడు. దీని విశేషాలు తెలుసుకుందాం...

హత్యా పరిశోధన ప్రేమ పరిశోధన అయింది...

    దక్షిణ కొరియాలోని బుసాన్ లో రిటైర్డ్ ఇమ్మిగ్రేషన్ అధికారి అనుమానాస్పదంగా ఎత్తైన కొండ మీద నుంచి జారిపడి చనిపోయిన కేసు నమోదవుతుంది. చైనీయురాలైన అతడి పడుచు భార్య సూరేని అనుమానిస్తాడు డిటెక్టివ్ హేజున్. భర్త మరణించిన బాధ ఆమెలో కనిపించదు, పైగా ఆమె చేతుల మీద, కాళ్ళ మీదా గాయాలుంటాయి. అడిగితే తన గురించి చెప్తుంది. తను భర్త జారిపడి మరణించిన కొండని క్లెయిమ్ చేయడానికి చైనా నుంచి వచ్చింది. ఆ కొండ తన తాతది. అతను మంచూరియా స్వాతంత్ర్య పోరాట వీరుడు. తల్లి చనిపోతూ ఈ విషయం చెప్తే తను వచ్చింది. తీవ్ర అనారోగ్యంతో వున్న తల్లి ఏదైనా మందు ఇచ్చి తనని పరలోకాలకి పంపేయమని అడిగితే, ఆ మందు ఇచ్చి ప్రశాంతంగా పరలోకాలకి పంపేసింది.
        
ఇప్పుడు భర్త మరణానికి సంబంధించి సాక్ష్యాధారాలు ఆమెకి వ్యతిరేకంగా వుంటాయి. డిటెక్టివ్ హేజున్, అసిస్టెంట్ సువాన్ తో కలిసి ఆమె మీద నిఘా పెడతాడు. ఆ నిఘాలో ఆమెని గమనిస్తూ ప్రేమలో పడతాడు భార్య వున్న హేజున్. ఆమె ఒక హత్య కాదు, తాజాగా ఇంకో రెండు హత్యలు చేసినా అతడి ప్రేమ చావదు. అతడికి దగ్గరై అతడి దగ్గరున్న సాక్ష్యాధారాల్ని తొలగించడం ప్రారంభిస్తుంది. ఇక అసలే నిద్ర లేమి పేషంట్ అయిన అతడి పిచ్చి ప్రేమతో హాత్యకేసు ప్రేమ కేసుగా మారిపోయి ఏ మలుపులు తిరిగిందన్నది మిగతా కథ.

సింపుల్ కథ -సంక్లిష్ట కథనం 
    దర్శకుడు పార్క్ అమెరికన్ ఫిలిం నోయర్ జానర్ సినిమాలతో స్ఫూర్తి పొంది ఈ కథ చేశాడనేది స్పష్టంగా వుంటుంది. ఒక డిటెక్టివ్- ఒక మర్డర్- మధ్యలో వాంప్ క్యారక్టర్. కాకపోతే వాంప్ క్యారక్టర్ మీద డిటెక్టివ్ ప్రేమని రగిలించాడు. అయితే డిటెక్టివ్ కి ఈ ప్రేమ రగలడానికీ, ప్రేమలో అంత పిచ్చి వాడవడానికీ తగిన బలమైన కారణం కనిపించదు (తెలుగు ’18 పేజెస్ లో నిఖిల్ ప్రేమలా). ఆమెలో ఏం ఆకర్షించిందో తెలియదు. ఈ లోపం వల్ల మొత్తం కథంతా, ఆర్భాటమంతా సిల్లీగా అన్పిస్తుంది. పైగా ఈ కథని 2 గంటల 20 నిమిషాలు సాగదీయడం అసహనానికి గురి చేస్తుంది.
        
కారణం లేని డిటెక్టివ్ ప్రేమతో ఉద్వేగభరిత చిత్రణ చేశాడు. సూటిగా వున్న విషయాన్ని వీలయినంత సాగదీసి, దాని స్థితి స్థాపకతని పరీక్షించి చూడాలనుకున్నట్టు అన్పిస్తాడు దర్శకుడు. దీనికి స్థలకాలాల ఐక్యతతో ఆడుకుంటాడు. గతాన్ని వర్తమానంతో బ్లర్ చేస్తాడు. విషయాన్ని కొండని తవ్వుతున్నట్టు తవ్వి ఎన్నెన్నో అంశాలతో, కథా గమనానికి అంతరాయం కలిగిస్తాడు. మ్యాజిక్ చేస్తున్నట్టు ఫ్లాష్‌బ్యాకులతో, ఫాంటసీలతో తికమక పెట్టేస్తాడు.
        
ఆమె చేసే కొత్త హత్యలకి ప్రేమోన్మాదియైన డిటెక్టివ్ తనే క్లూస్ ని మాయం చేసే లాంటి కథకవసరమైన మలుపులు కొన్నే వుంటాయి. ప్రేమ గోలే ఎక్కువుంటుంది. ప్రేమలో అతడి అంతులేని ఊహల మత్తులో ప్రమాదకర చర్యలకి పాల్పడేలాంటి థ్రిల్లింగ్ ఘట్టాలుండవు. ప్రేమకి కారణం లేకపోవడం వల్ల మొత్తం కథ అర్ధరహితంగా కన్పిస్తుంది. సినిమా ఫస్టాఫ్ మర్డర్ మిస్టరీలా, సెకండాఫ్ లవ్ స్టోరీలా వుంటుంది. అయితే భాషా సమస్యల కారణంగా కూడా సినిమాని ఫాలో అవడం కష్టంగా వుంటుంది. సబ్ టైటిల్స్ వేసినా, ప్రతీ సూక్ష్మ అంశాన్నీ వివరించకపోతే అసలే సంక్లిష్టంగా వున్న కథ పూర్తిగా అర్ధంగాని పరిస్థితి. వీకీపీడియాలో కథ చదువుకుని సినిమా చూస్తే ఓహో ఇదా విషయమని కొన్ని సూక్ష్మాంశాలు అర్ధమ వుతాయి. సూక్ష్మం, సంక్లిష్టం, సంకీర్ణం ఇవన్నీ అవసరం లేదు దీనికి.

అసలు స్వరూపం ఇదీ...
    పొరవిప్పి చూస్తే ఈ కథ అసలు స్వరూపం తెలుస్తుంది. ఈ అసలు స్వరూపంతోనే ఆస్కార్ కి షార్ట్ లిస్ట్ అయినట్టు తెలుస్తుంది. 2019 లో దక్షిణ కొరియా పారసైట్ ఆస్కార్ అవార్డుకి ఈ స్వరూపమే కారణం. డెసిషన్ టు లీవ్ కి పారసైట్ తో ఈ సారూప్యముంది. పారసైట్ లాగే డెసిషన్ టు లీవ్ శ్రామిక- పెట్టుబడిదారీ వర్గ విభజనని చిత్రిస్తుంది. ఆమె చైనా నుంచి వచ్చి వుంటున్న అక్రమ వలసదారు. కొరియన్ విముక్తి పోరాట వీరుడి వారసురాలిగా కొండని స్వాధీనం చేసుకోవడానికి వచ్చిన హత్య కేసు నిందితురాలు, నిమ్నురాలు. అతను కొరియన్ సమాజపు కులీనుడు. వీళ్ళిద్దరి ప్రేమని అంగీకరించదు వర్గ సోపానక్రమపు కొరియన్ సమాజం. అందుకని అనార్కలి కథ ఎలా ముగిసిందో అలా ముగుస్తుంది ఈ కథ. ముగింపు గుండెని పిండేసినట్టు వుంటుంది ఈ సలీం తో. వర్గ తారతమ్యాలు సరే గానీ పునాదిలేని ప్రేమ పురాణంతోనే వచ్చింది సమస్య.
        
ఒకప్పుడు బ్లాక్ అండ్ వైట్ లో అమెరికన్ ఫిలిం నోయర్ సినిమాలు కూడా ధనిక- పేద విభజనతో కూడిన క్రైమ్ సినిమాలే. వాటిలో తప్పనిసరిగా కొన్ని నియమిత పాత్రలు, చిత్రీకరణ ఎలిమెంట్లు వుంటాయి. వీటితో అతి కళాత్మకతకి పోయి సంక్లిష్టం చేయకుండా సూటిగా, తేటగా విషయం చెప్పేవాళ్ళు. ఇలా కాకుండా డెసిషన్ టు లీవ్ నోయర్ ని అతి చేసిన కళాప్రదర్శన అయింది. ఆసక్తి వున్న వాళ్ళకి సబ్ టైటిల్స్ తో ఇది ముబి ఓటీటీలో వుంది.   

—సికిందర్