రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

2, డిసెంబర్ 2022, శుక్రవారం

1255 : రివ్యూ!

 

రచన- దర్శకత్వం : శైలేష్ కొలను
తారాగణం : అడివి శేష్, మీనాక్షీ చౌదరి, కోమలీ ప్రసాద్, రావు రమేష్, శ్రీకాంత్ అయ్యంగార్,  తనికెళ్ళ భరణి, పోసాని కృష్ణ మురళి, మాగంటి శ్రీనాథ్ తదితరులు
సంగీతం ; ఎంఎం శ్రీలేఖ, సురేష్ బొబ్బిలి, జాన్ స్టీవార్ట్ ఏడూరి:  ఛాయాగ్రహణం : ఎస్ మణికందన్  
బ్యానర్ : వాల్ పోస్టర్ సినిమా
నిర్మాతలు : తిపిరినేని ప్రశాంతి, నాని
విడుదల : డిసెంబర్ 2,2022
***

        2020 లో శైలేష్ కొలను విశ్వక్ సేన్ నటించిన హిట్ కి సీక్వెల్ గా విడుదలైన హిట్ 2 లో హీరో మారి అడివి శేష్ నటించాడు. హిట్ సిరీస్ లో మొత్తం ఆరుగురు హీరోలతో ఆరు సినిమాలు తీయాలని ప్రణాళికట. ఈ రెండో ఇన్ స్టాల్ మెంట్ కి కూడా తిపిరినేని ప్రశాంతి, నాని నిర్మాతలు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ గా తీయాలని సమకట్టిన ఈ సిరీస్ లో హిట్ కి హిందీ రీమేకుగా రాజ్ కుమార్ రావ్ తో తీసిన హిట్-ది ఫస్ట్ కేస్ ఫ్లాపయ్యాక, దర్శకుడు హిట్ 2 తెలుగు సీక్వెల్ తీశాడు. హోమిసైడ్ ఇంటర్వెన్షన్ టీమ్ (హిట్) చేపట్టే నేర దర్యాప్తు కథ ఈసారి ఎలా వుందో చూద్దాం...

కథ

కృష్ణ దేవ్ అలియాస్ కేడీ (అడివి శేష్) వైజాగ్ హిట్ టీంలో ఎస్పీగా వుంటాడు. దీనికి బాస్ గా డిజిపి నాగేశ్వర రావు (రావు రమేష్), మెంబర్లుగా హర్ష (కోమలీ ప్రసాద్), అభిలాష్ (మాగంటి శ్రీనాథ్) వుంటారు. ఆర్య( మీనాక్షీ చౌదరి) అనే అమ్మాయితో కేడీ సహజీవన సంబంధంలో వుంటాడు. ఆర్య ఏమీ చేయకుండా ఇంటి పట్టున వుంటుంది. ఒక రోజు ఒక హత్య కేసు రిపోర్టవుతుంది, కేడీ వెళ్ళిచూస్తే కాళ్ళు, చేతులు, మొండెం, తల  వేరు చేసిన అమ్మాయి శవం పడుంటుంది. తల ఆధారంగా హతురాలెవరని దర్యాప్తు చేస్తూంటే, తల ఒక్కటే ఆమెదనీ, మిగిలిన శరీర భాగాలు వేరే ముగ్గురమ్మాయిలవనీ బయట పడుతుంది. దీంతో సీరియల్ కిల్లింగ్స్ కోణంలో దర్యాప్తు మొదలెడతాడు. ఇప్పుడు ఎవరీ సీరియల్ కిల్లర్-  నల్గురమ్మాయిల్ని ఎందుకు చంపాడు - ఈ అమ్మాయిలెవరు- కేడీ ఈ కేసుని ఎలా ఛేదించి సీరియల్ కిల్లర్ ని పట్టుకున్నాడూ అన్నది మిగతా కథ.

ఎలా వుంది కథ

రొటీన్ కథే. రొటీన్ ప్రేమ సినిమాలెలా వస్తున్నాయో, అలా రొటీన్ గా టెంప్లెట్ లో వస్తున్న క్రైమ్ సినిమాల్లో ఇదొకటి. రొటీన్ గా అదే ఎండ్ సస్పెన్స్ కథ. ఎండ్ సస్పెన్స్ సినిమా కథ అంటేనే కత్తి మీద సాములాంటిది. చివరి వరకూ హంతకుడ్ని చూపించకుండా, ఎంత సేపూ వాడి కోసం హీరో చేసే దర్యాప్తుతో వన్ వే గా సాగే కథని రక్తి కట్టించడం చాలా కష్టం. అంటే హీరోకీ, హంతకుడికీ మధ్య ఎలుకా పిల్లీ చెలగాటంగా, ఒక గేమ్ గా ఇలాటి కథలు వుండవు. అంటే, వెండి తెర కోరుకునే సీన్ టు సీన్ సస్పెన్సు తో  ఇవి వుండవు. పైగా చిట్ట చివర్లో హంతకుడ్ని రివీల్ చేసినప్పుడు, వాడు చెప్పే ఏ కారణమూ కథని ఇంకో లెవల్ కి తీసికెళ్ళక తేలిపోవడమే జరుగుతోందింత కాలమూ  ఇలాటి సినిమాలతో. ఇందులో హిట్ 2 కూడా ఒకటి.

కథ ఎంత రొటీనో కథనమూ అంత సాధారణంగా వుంది- సస్పెన్సు, ఎత్తు పల్లాలు, స్ట్రగుల్, థ్రిల్, టెన్షన్ వంటి ఎలిమెంట్స్ లేకుండా. చివర్లో హంతకుడెవరనే దానికి దగ్గరయ్యే కొద్దీ పది నిమిషాలు సస్పెన్సు కన్పిస్తుంది. తీరా హంతకుడ్ని పట్టుకుంటే –అతను రాంగ్ ఛాయిస్. పర్సనాలిటీ లేని, హైటూ లేని  ఆర్టిస్టుని రివీల్ చేసి ఇంకో తప్పిదం చేశారు. పైగా  అతను చిన్నప్పుడు కుటుంబంలో జరిగిన సంఘటనలు తను సైకోగా మారడానికి కారణమని రొటీన్ విషయమే వెల్లడించేసరికి, ముగింపు వీగిపోయింది. ఈ ఘట్టాన్ని దర్శకుడు తురుపు ముక్కగా ప్లాన్ చేసుకుని, షాకింగ్ గా వుండేట్టు వాడుకుని వుండాలి, అది జరగలేదు.  

ఇక ముందు ఒకే అమ్మాయి శరీర భాగాలని చెప్పి, తర్వాత కాదు నల్గురమ్మాయిల శరీర భాగాలనీ చెప్పడంతో షాక్ వేల్యూ కూడా కరిగిపోయింది. శవాన్ని చూడగానే ఒకమ్మాయి కాదు, నల్గురమ్మాయిల శరీరభాగాలని ఇన్వెస్టిగేటర్ అయిన హీరో అక్కడే చెప్పేసి వుంటే- ఆ సన్నివేశం బ్లాస్ట్ అయి భావోద్వేగాలతో వెంటాడే ఆపరేటివ్ ఇమేజిగా వుండేది. ఆ ఇమేజితో అతను నిద్రపోలేడు. చీటికీ మాటికీ హీరోయిన్ తో రోమాన్సు చేయలేడు. ఆ ఇమేజి వెంటాడుతూంటే  హంతకుడి కోసం బర్నింగ్ ఎమోషన్ తో ఇన్వెస్టిగేట్ చేయాలి.

పాత్ర పరంగా  కూడా ఈ బర్నింగ్ ఎమోషన్ లేకపోవడం ఇంకో లోపం. హీరోని కేసుల్ని తేలిగ్గా తీసుకునే రకంగా, హంతకుల్ని సీరియస్ గా తీసుకోకుండా ఆడుతూ పాడుతూ పట్టేసుకుంటాడనీ పరిచయం చేశారు. అంటే హత్యకి గురయ్యే వాళ్ళ పట్ల కూడా అతడికి ఫీలింగ్స్ వుండవు. అలాగే నల్గురమ్మాయిల శరీర భాగాలు చూసి కూడా చలించడు. బాధితుల పట్ల ఏ స్పందనా లేకుండా ఎవరి కోసం, ఎందుకోసం పనిచేస్తున్నాడో తెలీదు.

హిట్ లో అనాధ శరణాలయం బ్యాక్ డ్రాప్. ఇందులో స్త్రీ సంక్షేమ సంఘం నేపథ్యం. హిట్ లో ఇన్వెస్టిగేషన్ పేరుతో తెలివితేటల వాడకం అధికం కావడంతో గజిబిజిగా తయారయ్యింది. ఏదో హడావిడీ జరుగుతూ వుంటుంది- ఆ హడావిడిని విశ్లేషిస్తే లాజుక్కులే వుండవు. ప్రతీదానికీ ఫోరెన్సిక్ సైన్స్ ని లాగడం. ఈ సారి ఫోరెన్సిక్ సైన్స్ ఓవరాక్షన్ లేదు, నామ మాత్రంగా వుంది. అయితే లాజిక్కులు వుండవు. ఉదాహరణకి హంతకుడు నల్గురమ్మాయిల శరీర భాగాల్ని హోటల్ గదికి ఎలా తెచ్చి పేర్చి పోయాడనే దానికి వివరణ వుండదు.

ఈ హిట్ టీంని  పోలీసు శాఖ గర్వించదగ్గ అత్యుత్తమ విభాగంగా కథలో హైలైట్ చేయకుండా- మళ్ళీ హిట్ లోలాగే అవినీతి అధికారుల్ని చూపించి విలువలేకుండా చేశారు. ఇంటర్వెల్ సీనుతో ఇంపాక్ట్ ఏమీ లేదు. ఎందుకంటే ఇలాటి సినిమాల్లో మొదట అమాయకుణ్ణి హంతకుడుగా చూపించడం రొటీనే.

హిట్ 2 ని పెద్దగా ఆలోచించకుండా, తెర మీద జరుగుతున్న హడావిడికి పైపైన థ్రిల్ ఫీలై చూసేస్తే ఇది హిట్టే అని చెప్పొచ్చు.

నటనలు- సాంకేతికాలు

 క్షణం’, ఎవరు లాంటి పకడ్బందీ సస్పెన్స్ థ్రిల్లర్స్ లో నటించిన అడివి శేష్- ఈ సారి స్క్రిప్టులో ఇన్వాల్వ్ కాలేదేమో, తన పాత్ర చిత్రణ దగ్గర్నుంచీ కథాకథనాల వరకూ ఉదాశీనంగా వుండిపోయినట్టు ఫలితం చెప్తోంది. అయినా హిట్టే, హిట్ హిట్టు కాకపోతే ఎలా? అవతల నల్గురమ్మాయిలు ముక్కలైవుంటే, ఎప్పుడు పడితే అప్పుడు సహజీ వనం చేస్తున్న అమ్మాయితో సరసం, సంగీతం, ప్రెగ్నెన్సీ వగైరా ఎంజాయ్ చేసే పోలీసు పాత్రలో అడివి శేష్ భేష్ అనాలి. ఇంకా పెళ్ళి గురించి కాబోయే అత్తగారితో కామెడీ. ఇక యాక్షన్ సీన్స్ చూస్తే విలనే (హంతకుడు) చివరివరకూ కనిపించకపోతే ఏముంటాయి. పూర్తిగా యాక్షన్ రహిత ఇన్వెస్టిగేషన్ కథ కావడంతో ఆ ఇన్వెస్టిగేషన్ లో ఎవిడెన్సుల ఎసెస్మెంట్ ఎవరు ఫాలో అవగలరు. అడివి శేష్ ప్రేక్షకుల్లో తనకున్న ఫాలోయింగ్ తో ఈ సినిమా గట్టెక్క వచ్చు.

హీరోయిన్ మీనాక్షీ చౌదరిని పైన చెప్పుకున్న అవసరాల కోసమే, సంసార పక్షంగా  ఇంటి పట్టున వుండే చదువుకున్న అమ్మాయి పాత్ర. స్త్రీసంక్షేమ సంఘంలో ఆడవాళ్ళు చేసే స్వయంకృషి, పనీ పాటలు ఆమెకి పట్టవు. టీం మెంబర్ గా కోమలీ ప్రసాద్ కి హీరోయిన్ కంటే ఎక్కువ పాత్ర వుంది. ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఇక అవినీతి పరుడైన టీం బాస్ గా రావురమేష్ యాక్టివ్ పాత్ర కాడు. కూర్చుని హీరోకి వ్యతిరేకంగా చక్రం తిప్పే శకుని పాత్ర. దర్శకుడు సృష్టించిన హోమిసైడ్ ఇంటర్వెన్షన్ టీం ని ఒక ఆదర్శ సంస్థగా ప్రేక్షకులు అభిమానించే ఇమేజిని క్రియేట్ చేయాలను కోకపోవడం చాలా విచారించాల్సిన విషయం. దర్శకుడు తన టీంని తనే అవమానించుకుంటున్నాడు –అప్పుడు హిట్, ఇప్పుడు హిట్ 2, ఇంకా రాబోయే సీక్వెల్స్ లో కూడా ఇదే ఆశించాలేమో.

ఇక హిట్ 3 కి హింట్స్ ఇస్తూ ముగింపులో నేచురల్ స్టార్ నానీ ఎంట్రీ. సినిమాలో ఎక్కడా ఈలలు వెయ్యని ప్రేక్షకులు ముగింపులో మాత్రం నానిని చూసి దద్దరిల్లేలా ఈలలు వేయడం బావుంది. ఈ రివ్యూ రాసినవాడికి ఇప్పుడు హుషారొచ్చింది!

—సికిందర్

1254 : రివ్యూ!

రచన - దర్శకత్వం : ప్రదీప్ రంగనాథన్
తారాగణం : ప్రదీప్ రంగనాథన్, సత్యరాజ్, యోగి బాబు, ఇవానా, రాధికా శరత్‌కుమార్, రవీనా తదితరులు
సంగీతం: యువన్ శంకర్ రాజా, ఛాయాగ్రహణం : దినేష్ పురుషోత్తమన్
బ్యానర్ : ఎజిఎస్ ఎంటర్ టైన్మెంట్
నిర్మాతలు : కల్పతి అఘోరం, కల్పతి గణేష్, కల్పతి సురేష్
తెలుగు పంపిణీ : దిల్ రాజు
విడుదల : నవంబర్ 25, 2022
***
        వంబర్ లో విడుదలై తమిళంలో హిట్టయిన లవ్ టుడే తెలుగులో ప్రముఖ నిర్మాత దిల్ రాజు విడుదల చేశారు. తమిళంలో కోమలి అనే హిట్ తీసిన దర్శకుడు ప్రదీప్ రంగ నాథన్ రెండో ప్రయత్నమిది. ఇందులో తనే హీరోగా నటించాడు. 5 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన లవ్ టుడే రోమాంటిక్ కామెడీ తమిళంలో 70 కోట్లు వసూలు చేసిందని చెప్తున్నారు. అంత కొత్తదనం ఇందులో ఏముంది? నేటి ప్రేమల గురించి ఏమిటి కొత్తగా చెప్పారు? ఈ విషయాలు పరిశీలిద్దాం...

కథ

ప్రదీప్ (ప్రదీప్ రంగనాథన్) కాగ్నిజెంట్‌లో డెవలపర్ గా జాబ్ చేస్తూంటాడు. తల్లి సరస్వతి (రాధిక), అక్క దివ్య (రవీనా రవి) లతో కలిసి వుంటాడు. దివ్యకి 8 నెలల క్రితం డాక్టర్ యోగి (యోగి బాబు) తో నిశ్చితార్థం జరిగింది. ఇంకో నాల్గు రోజుల్లో పెళ్ళి వుంది. ఇలా వుండగా, ప్రదీప్ తన కొలీగ్ నిఖిత (ఇవానా) ని గాఢంగా ప్రేమిస్తూంటాడు. ఆమె కూడా అంతే గాఢంగా ప్రేమిస్తుంది. ఇక పెళ్ళి చేసుకుందామని ప్రదీప్ వెళ్ళి ఆమె తండ్రి (సత్యరాజ్) ని కలుస్తాడు. ఆ తండ్రి ఉద్యోగం, కులం, ఆస్తీ అంతస్తులు ఇవేమీ అడగడు. కేవలం ఇద్దరూ ఫోన్లు మార్చుకుని ఒక రోజు గడిపితే, అప్పటికీ పెళ్ళికి ఓకే అనుకుంటే తనకూ ఓకే అని చెప్పేస్తాడు. ప్రదీప్ ఫోను నిఖిత కిచ్చి, నిఖిత ఫోను ప్రదీప్ కిచ్చేస్తాడు.

ఈ విచిత్ర కండిషనుతో ఇరుకున పడ్డ ఇద్దరూ ఎలాటి అనుభవా లెదుర్కొన్నారు? ఒకరి ఫోను ఇంకొకరి దగ్గరుంటే ఏఏ రహస్యాలు బయటపడ్డాయి? ఏఏ గొడవలు జరిగాయి? ఇవి తట్టుకుని ప్రేమని నిలబెట్టుకున్నారా? పెళ్ళికి అర్హత సంపాదించుకున్నారా? మధ్యలో ప్రదీప్ అక్క పెళ్ళి గొడవలేమిటి? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

ప్రేమించి పెళ్ళి చేసుకున్నంత మాత్రాన ఆ ప్రేమ నిలబడుతుందని గ్యారంటీ లేదు. ముందే పరీక్ష పెడితే ఏ విషయం తేలిపోతుంది. సినిమాలు కులాలో అంతస్తులో కలవక పెద్దలు అడ్డుకునే కథలతోనే వచ్చాయి. ఈ పాత ఫార్ములా కాకుండా, నేటి కాలపు ప్రేమలకి కీలెరిగి వాతపెట్టే ఆధునిక దృక్పథపు తండ్రి పాత్రతో కొత్త కథ చెప్పాడు దర్శకుడు.

దీనికి కమల్ హాసన్ - సరితలతో కె. బాలచందర్ తీసిన మరోచరిత్ర తో పోల్చ వచ్చు. 1980 లలోనే బాలచందర్ ముందు కాలపు ప్రేమల్ని నిర్వచించాడు. ఇందులో ఇద్దరి తల్లిదండ్రులు ప్రేమికులిద్దరూ ఓ ఏడాదిపాటు కలుసుకోకుండా దూరంగా వుంటే- అప్పుడా తర్వాత కూడా ఇంతే బలంగా పరస్పరం ప్రేమ ఫీలైతే - పెళ్ళి చేస్తామని పరీక్ష పెడతారు. అప్పట్లో బాల చందర్ తీసిన ఈ తెలుగు స్ట్రెయిట్ మూవీ పెద్ద సంచలనం. తిరిగి ఏక్ దూజే కే లియే గా కమల్ హాసన్ తోనే హిందీలో తీస్తే అదీ సంచలనం. ఇందులో ఒక ఏడాది పాటు కమ్యూనికేషన్ లేని దూరాలైతే, లవ్ టుడే లో ఒక రోజు పాటు కమ్యూనికేషన్ తో దూరాలు.

ఈ కథని కొత్త రకంగా వుండే సీన్లతో కొత్త కొత్తగానే చెప్పాడు. ఎక్కడా పాత మూస కన్పించదు. ప్రేమికుల ఒకరి సెల్ ఇంకొకరి దగ్గరుంటే దాచి పెట్టిన ఏ ఏ విషయాలు బయట పడతాయి, ఎవరెవరు కాల్స్ చేస్తే ఏఏ సంబంధాలు రట్టవుతాయి, సోషల్ మీడియా యాప్స్ ఇంకేం సంక్షోభాలు సృష్టిస్తాయి - వీటికెలా రియాక్ట్ అవుతారు, కొట్టుకుంటారు, అసలు ప్రేమల మీదే నమ్మకమెలా పోతుందీ- ప్రేమలు ఒక బూటకమనీ తెలుసుకునేందుకు మోబైల్స్ ని మించిన మీడియం ఏముందీ వగైరా నవ్విస్తూ ఏడ్పిస్తూ, తీపి చేదుల మిశ్రమంలా చేసి చెప్పాడు. సెల్ ఫోన్స్ ఎంత సామాజిక సేవ చేస్తాయో ఆవిష్కరించాడు. ఇక ప్రేమ పెళ్ళిళ్ళని ఓకే చేయాలంటే  సెల్ ఫోన్లు మార్చి చూడడమే.

అయితే సినిమా స్లోగా నడవడాన్ని భరించాలి. ఫస్టాఫ్ కామెడీ చేసి, సెకండాఫ్ ఎమోషన్లతో బరువు పెంచాడు. ఈ బరువు యూత్ ఆడియెన్స్ కి బోరు కొట్టకుండా కథలో గాఢంగా ఇన్వాల్వ్ చేశాడు. ఇలాటివి యూత్ ఎవరికైనా ఎదురు కాగల పరిస్థితులే. వీటన్నిటితో రెండున్నర గంటలదాకా నిడివి సాగుతుంది. అయితే కేవలం ఇద్దరి ప్రేమికుల కథగా చెప్తే బలం వుండదని- కమెడియన్ యోగిబాబు డాక్టర్ క్యారక్టర్ తో, హీరో అక్క పెళ్ళి గొడవల గురించిన కామిక్ సబ్ ప్లాట్ ని సృష్టించాడు. అయితే యోగిబాబు కామెడీ అంతగా ఏమీ నవ్వించదు. హీరో హీరోయిన్లతో చివరి పదిహేను నిమిషాలు ముగింపు  దృశ్యాలు హైలైట్ గానే  వుంటాయి. తను తీసిన షార్ట్ ఫిలింనే ఈ  సినిమాగా తీశాడు దర్శకుడు.

నటనలు- సాంకేతికాలు  

హీరోగా నటించిన దర్శకుడు ప్రదీప్ అతి సామాన్యుడిగా కన్పించే పాత్రలో గమ్మత్తైన బాడీ లాంగ్వేజ్ తోనే నవ్వొచ్చేలా వుంటాడు. ఫస్టాఫ్ కామెడీగా నటిస్తూ సెకండాఫ్ లో సీరియస్ గా మారిన పాత్రతో, తన కారణంగా హర్ట్ అయిన హీరోయిన్ తో- ఎమోషనల్ గా మారే దృశ్యాల్లో బలహీన నటన కనబరుస్తాడు. దర్శకుడుగా మాత్రం ఫర్వాలేదన్పించుకుంటాడు. హీరోయిన్ ఇవానా క్యారక్టర్ బలమైనదే అయినా తను బలమైన నటి కాదు. సెకండాఫ్ లో ఏడ్పు సీన్లకి బాగా కష్టపడాల్సి వచ్చింది. హీరో తల్లిగా రాధికది స్వల్ప పాత్ర. అయితే ఫన్నీగా వుండే పాత్ర. డాక్టర్  గా యోగిబాబుకి అంతగా కామెడీ లేదు. హీరోయిన్ తండ్రిగా సత్యరాజ్ మరో మారు ప్రిన్స్ లో లాగా కథని డ్రైవ్ చేసే పూర్తి స్థాయి బలమైన పాత్ర- హాస్యంతో కూడిన నటన.

యువన్ శంకర్ రాజా సంగీతం గురించి చెప్పాలంటే అవి పాటల్లా లేవు, మాటల్లా వున్నాయి. రొటీన్ పాటల నుంచి ఇదొక రిలీఫ్. ఇక కామెడీ సినిమాకి నేపథ్య సంగీతం ఏముంటుంది. దినేష్ పురుషోత్తమన్ ఛాయాగ్రహణం తక్కువ బడ్జెట్ తో తీసిన సాధారణ లొకేషన్స్ లో రిచ్ గానే అన్పించేట్టు వుంది.

ఎప్పుడూ అవే టెంప్లెట్స్ తో- అంటే, అయితే అపార్ధాలతో విడిపోవడం, లేకపోతే ప్రేమిస్తున్న విషయం  పైకి చెప్పలేక లోలోన ఏడుస్తూ వుండడం అనే రెండే ప్రేమ డ్రామాలతో రొటీన్ గా వస్తున్న ప్రేమ సినిమాల మధ్య లవ్ టుడే కొత్త మేకర్స్ కి కనువిప్పు. చేతిలో వుండే టెక్నాలజీతోనే రిలేషన్ షిప్స్ లోపలి స్వరూపాల్ని బయట పెట్టి ఆలోచింప జేస్తూ, ఇంతకి ముందు రాని కోణంలో ఈ కాలపు ప్రేమ సినిమా లవ్ టుడే’.         

సినిమా ప్రారంభంలో, చిన్నప్పుడు హీరో మామిడి పండు రసం పీల్చి, టెంక పాతి పెట్టే దృశ్యం వుంటుంది. విత్తనం నాటాకా దాని సమయం అది తీసుకుని వృక్షమై ఫలాల్నిస్తుంది. ఓపిక పట్టాలి. ప్రేమలో కూడా ఇంతే. ప్రేమలో పడ్డాక నమ్మకం కోల్పోకుండా నిలబెట్టుకున్నప్పుడే దాని ఫలాల్ని పరిపూర్ణంగా అనుభవించొచ్చని దర్శకుడు చెప్పే నీతి.

—సికిందర్

 

 

 

 

1, డిసెంబర్ 2022, గురువారం

1253 : రివ్యూ!


రచన -దర్శకత్వం : ఏఆర్ మోహన్
తారాగణం : అల్లరి నరేష్, ఆనంది, వెన్నెల కిషోర్, ప్రవీణ్, సంపత్ రాజ్, శ్రీ తేజ్, రఘుబాబు తదితరులు
సంగీతం: శ్రీచరణ్ పాకా, ఛాయాగ్రహణం : రాంరెడ్డి
బ్యానర్స్ : జీ స్టూడియోస్, హాస్య మూవీస్ 
నిర్మాణం : జీ స్టూడియోస్, రాజేష్ దండా
విడుదల ; నవంబర్ 25, 2022
***

        హీరోగా అల్లరి నరేష్ కామెడీ సినిమాలతో ఓ వెలుగు వెలిగాక ఆ వైభవం తగ్గి, హీరోల సరసన సహాయ పాత్రలేశాడు. అలా కొనసాగుతూండగా నాంది అనే సీరియస్ సామాజికంలో హీరోగా నటించే అవకాశం లభిస్తే దాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. పోలీసులతో సామాన్యుడి పోరాటం నాంది హిట్ తర్వాత, అదే మార్గంలో కొనసాగాలన్నట్టు ఇప్పుడు ఇట్లు మారేడు మిల్లి ప్రజానీకం అనే మరో సీరియస్ సామాజికంలో నటించాడు. ఇందులో గిరిజనుల సమస్యల్ని చేపట్టాడు. ఇలా సెమీ రియలిస్టిక్ సినిమాలవైపు దారి మళ్ళించుకుని నటిస్తున్న అల్లరి నరేష్ సినిమా అంటే కొత్త అసక్తితో థియేటర్ల వైపు అడుగులేస్తున్నారు ప్రేక్షకులు. ఇలా సెకెండ్ ఇన్నింగ్స్ తో తిరిగి డిమాండ్ వున్న హీరోల మార్కెట్లో ఎస్టాబ్లిష్ అవుతున్న నరేష్ ఈ రెండో ప్రయత్నంతో రాణించాడా? ఈ ప్రయత్నంలో కొత్త దర్శకుడు ఏఆర్ మోహన్ ఎంతవరకు సహకరించాడు? ఇవి తెలుసుకుందాం...

కథ

శ్రీపాద శ్రీనివాస్ (నరేష్) ప్రభుత్వ స్కూల్లో తెలుగు టీచర్. అందరికీ సహాయపడాలనుకుం
టాడు. తెలుగు టీచర్ అయినందుకు పెళ్ళి సంబంధాలు రాక జోకులకి టార్గెట్ అవుతాడు. అదే స్కూల్లో పరమేశ్వర్ (వెన్నెల కిషోర్) డబుల్ ఎమ్మే ఇంగ్లీషు టీచర్. ఇతడి డిగ్రీలు కూడా పెళ్ళికి పనికి రాక ఈసురోమని జీవిస్తూంటాడు. ఇద్దరికీ ఏజెన్సీ ఏరియా మారేడుమిల్లి ఉప ఎన్నిక డ్యూటీ పడుతుంది. అక్కడ గిరిజన ప్రాంతాల్లో మూడు శాతమే నమోదవుతున్న ఓటింగ్ ని 100 శాతానికి పెంచే బాధ్యత మీద పడుతుంది. అక్కడికి బయల్దేరి వెళ్తారు.

వీఆర్వో బాబు (ప్రవీణ్) వెంటవుడి అడవిలో కాలి నడకన తీసుకుపోతాడు. చుట్టు పక్కల 12 గిరిజన గ్రామాలుంటాయి. ఆ గ్రామాలకి ఓ పెద్ద వుంటాడు. కండా (శ్రీతేజ్) అనే అనుచరుడు వుంటాడు. ఆ పెద్దతో బాటు గిరిజనులు శ్రీనివాస్ బృందం ప్రవేశాన్ని వ్యతిరేకిస్తారు. ఓట్లు వేసేది లేదు పొమ్మంటారు. 30 ఏళ్ళుగా మొర పెట్టుకుంటున్నా రోడ్లు వెయ్యరు, స్కూళ్ళు పెట్టరు, ఆస్పత్రులు తెరవరు- అనారోగ్యంతో ఆస్పత్రి కెళ్ళేందుకు నది దాటాలంటే వంతెన కట్టరు- అందుకని ఓట్లు వెయ్యం పొమ్మంటారు.

శ్రీనివాస్ ఒక అత్యవసర పరిస్థితిలో వాళ్ళని ఆదుకోవడంతో కరిగి, అతడి మాట వింటారు. ఓట్లు వేయడానికి ముందుకొస్తారు. 100 శాతం ఓట్లు నమోదవుతాయి. అయితే శ్రీనివాస్ బృందం డ్యూటీ ముగించుకుని బ్యాలెట్ బాక్సులతో విజయవంతంగా తిరిగి వెళ్తూంటే, కండా కిడ్నాప్ చేస్తాడు. దీంతో ప్రభుత్వంలో కలకలం రేగుతుంది. ఆ ప్రాంతానికి పరుగులు తీస్తారు.

కండా ఎందుకు కిడ్నాప్ చేశాడు? ఇప్పుడు శ్రీనివాస్ ఏం చేశాడు? గిరిజనుల సమస్యలు తీర్చడానికి వ్యవస్థతో ఎలా పోరాడాడు? అతడికి లచ్మి (ఆనంది) ఎలా సహకరించింది? కలెక్టర్ అర్జున్ త్రివేది (సంపత్ రాజ్) ఎలాటి చర్యలు తీసుకున్నాడు? మధ్యవర్తిగా వెళ్ళిన మార్కెట్ కమిటీ సెక్రెటరీ కోటేశ్వరరావు (రఘుబాబు) ఏమయ్యాడు? చివరికి శ్రీనివాస్ ఆశయం నెరవేరిందా? ఇవి తెలుసుకోవాలంటే సెకండాఫ్ చూడాలి.

ఎలావుంది కథ

గిరిజనుల ఇవే సమస్యల గురించి ఎన్నో సినిమాలొచ్చాయి. అయితే ఇందులో ఎన్నికల సిబ్బంది కిడ్నాప్ ద్వారా సమస్యల్ని పరిష్కరించుకోవాలనే ఎత్తుగడ కొత్తది. ఓట్లు వేశాం కాబట్టి మా సమస్యల్ని ఇప్పుడే పరిష్కరిస్తే బ్యాలెట్ బాక్సులిస్తామని మెలిక పెట్టడం ద్వారా కొత్త డ్రామాకి తెర తీయడం బావుంది. అయితే సమస్య ఎక్కడొచ్చిందంటే దీని కథా నిర్వహణ కలిసిరాలేదు. దీంతోబాటు ముగింపు హాస్యాస్పదంగా మారింది.

ఒక కలెక్టర్ గిరిజనులకి తన అధికార పరిధిలో లేని వందల కోట్ల రూపాయల బ్రిడ్జిని తనే శాంక్షన్ చేసి సంతకం పెట్టి ఎలా ఇస్తాడు. ముఖ్యమంత్రి మంజూరు చేస్తేనే చెల్లుతుందని టీచర్ శ్రీనివాస్ కి తెలియదా? కలెక్టర్ రాసిచ్చిన కాగితం తీసుకుని విజయోత్సాహం జరుపుకోవడమేమిటి? సినిమా కోసం సినిమాటిక్ గా తీశారని ప్రేక్షకులు సర్దుకుపోవాలా? రాజకీయ వర్గాలు, ప్రభుత్వాలు గిరిజనుల్ని మభ్యపెడుతున్నాయని ఆరోపిస్తూనే - ఈ సినిమాని కూడా గిరిజనుల్ని మభ్యపెట్టేలా తీశారేమో? రాజకీయం-ప్రభుత్వం-సినిమా ఒక తానులోని ముక్కలనుకోవాలా?

ఉథృతంగా పారుతున్న నదిలో సురక్షితంగా శ్రీనివాస్ చేసే ప్రసవ ఏర్పాట్ల సీను, గిరిజనుల కుల దైవాలైన పశువులు కలెక్టర్ ని, పోలీసుల్నీ అడవిలో కుమ్మే యాక్షన్ సీను, తీవ్రంగా గాయపడ్డ కలెక్టర్ని గిరిజనులు నది దాటించే సీనులో అనుభవపూర్వకంగా అతడికి తెలిసివచ్చే గిరిజనుల కష్టాలు - ఈ మూడు భావోద్వేగాలకి గురిచేసే ఘట్టాలు తప్ప మిగతా సినిమాలో వుండాల్సిన విషయం, కూర్చోబెట్టే కథా కథనాలు కనిపించవు.

ఇంటర్వెల్లో రొటీన్ గా అన్పించే కిడ్నాప్, సెకండాఫ్ ప్రారంభంలో ఆ కిడ్నాప్ లో వున్న రహస్యంతో ఆసక్తి పెంచుతుంది. దీంతోనే శ్రీనివాస్ సెకండాఫ్ కథ నడుపుతాడు. అయితే వ్యవస్థతో ప్రత్యక్షంగా పోరాడకుండా, తను కిడ్నాపైన బందీగా వుండిపోయి- గిరిజనులకి ఐడియాలిచ్చి వాళ్ళు పోరాడేలా చేయడంతో- శ్రీనివాస్ గా నటించిన నరేష్ కి పని లేకుండా పోయింది. గిరిజనులు పోరాడుతూంటే, తను అప్పుడప్పుడు ఓ ఏడెనిమిది సీన్లలో మాత్రమే కనిపిస్తాడు! దీంతో హీరో లేని కథగా సెకండాఫ్ బెడిసి కొట్టింది. నరేష్ పోషించింది పాసివ్ క్యారక్టరైపోయింది.

ఫస్టాఫ్ లో ఇంటర్వెల్ ముందు పోలింగ్ సీను వరకూ వెన్నెల కిషోర్-ప్రవీణ్ ల కామెడీ సీన్లు కథ సీరియెస్ నెస్ ని దెబ్బతీస్తూ ఫస్టాఫ్ ని బలహీనం చేస్తాయి. మళ్ళీ సెకండాఫ్ లో రఘుబాబు గుండెపోటు కామెడీ ఘోరంగా వుంటుంది. ఫస్టాఫ్ లో లచ్మి పాత్ర ఆనందికి నరేష్ ప్రపోజ్ చేయడం, ఆమె కాదనడం జరిగాక, మళ్ళీ ఆ లవ్ ట్రాక్ జోలికి పోకుండా అసంపూర్ణంగా అక్కడితో వదిలేశారు.

సెకెండాఫ్ లో గిరిజనులతో నరేష్ పన్నే వ్యూహాలు కూడా ఈ రియలిస్టిక్ కథలో లాజిక్ లేని మూస ఫార్ములా ధోరణితో వుంటాయి. 248 ఓట్లు పోలైన బ్యాలెట్ బాక్సుల కోసం ఏకంగా మిలిటరీ దిగడం ఇల్లాజికల్. చివరికి వ్యూహకర్తగా ఏమీ చేయలేని పరిస్థితిలో నరేష్ పడితే, ప్రభుత్వంలో అనుకోకుండా చోటు చేసుకునే ఒక పరిణామమే నరేష్ ని గట్టెక్కిస్తుంది తప్ప- నరేష్ గొప్పతనమేమీ లేనట్టుగా పాత్ర చిత్రణ చేసేశారు.

ఇలా గిరిజన సమస్యలతో బాటు కథలో సమస్యలు చాలా వున్నాయి. ముందు చేతిలో కథగా రాసుకున్న కాగితాలే ఇలా వుంటే, గిరిజనుల తలరాతలేం మారుస్తాడు కొత్త దర్శకుడు.

నటనలు- సాంకేతికాలు

అందరూ బాగా నటించారు. నరేష్ కూడా కమర్షియల్ గిమ్మిక్కులు కాకుండా రియలిస్టిక్ పాత్రలో ఒదిగిపోయి నటించాడు. కామెడీ జోలికి పోలేదు. సీరియస్ పాత్రలు కూడా నటించగలడని రెండోసారి ప్రూవ్ చేసుకున్నాడు. అయితే సెకండాఫ్ లో తెరమరుగై ఓ ఏడెనిమిది సీన్లలో మాత్రం కన్పించి సరిపెట్టేయడం రియలిస్టిక్ సినిమాకైనా వర్కౌట్ అయ్యేది కాదు. క్లయిమాక్స్ లో యాక్షన్లోకి దిగి ప్రేక్షకుల్ని కాస్త సంతృప్తి పరుస్తాడు, అంతే.

హీరోయిన్ ఆనందిది వ్యక్తిత్వమున్న పాత్రేగానీ కథలో అంతగా పనిలేక బ్యాక్ గ్రౌండ్ లో కన్పించే పాత్రగా వుండిపోయింది. విలన్ గా కలెక్టర్ పాత్ర నటించిన సంపత్ రాజ్ నటన ఫర్వాలేదుగానీ, రాష్ట్రపతి అవార్డు పొందిన కలెక్టర్ గా గిరిజనుల్ని అంతలా హింసిస్తాడా అన్నది ప్రశ్న. మిగిలిన పాత్రల్లో అందరూ మంచి నటులే.

సీనియర్ రచయిత అబ్బూరి రవి సంభాషణలు బలంగా వుండాల్సిన చోట బలంగా, ఆలోచనాత్మకంగా వున్నాయి. వీటికి తగ్గ కథా కథనాలే కొత్త దర్శకుడి కలం నుంచి జాలువారలేదు. శ్రీచరణ్ పాకాసంగీతంలో సిట్యుయేషనల్ సాంగ్స్ వున్నాయి. రాంరెడ్డి ఛాయాగ్రహణంలో అటవీ దృశ్యాలు అద్భుతంగా వున్నాయి. పశువులు కుమ్మే సీను చిత్రీకరణ హైలైట్.

మొత్తం మీద అల్లరి నరేష్ నటించిన రెండో సామాజికం ఇంటలిజెంట్ గా వుండేట్టు చూసుకోవాల్సింది. ఈసారికి ఎన్నో లోపాలతో, వర్కౌట్ కాని ముగింపుతో ప్రేక్షకులు సరిపెట్టుకోవాలి.

—సికిందర్ 

30, నవంబర్ 2022, బుధవారం

1252 : స్క్రీన్ ప్లే సంగతులు-2


        క కథా నడక నియమాలకి విరుద్ధంగా, ఫస్టాఫ్ లో ముగియాల్సిన బిగినింగ్ విభాగమింకా సెకండాఫ్ లో కంటిన్యూ అవుతూ, కూతుర్ని హాస్పిటల్ కి తీసికెళ్తారు నీలం, గోపి. వెంట అల్లావుద్దీన్ వుంటాడు. హాస్పిటల్లో తిరగబడి బీభత్సం సృష్టిస్తుంది కూతురు. అల్లావుద్దీన్ ఆమె బ్రాస్లెట్ ఏమిటాని ముట్టుకోబోయి ఎగిరి అవతల పడతాడు. డాక్టర్ వచ్చి గట్టిగా తిడతాడు. ఇక పీర్ బాబాకే చూపించాలని చెప్పకుండా హాస్పిటల్నుంచీ కూతుర్ని తీసికెళ్ళి పోతారు. ఇప్పుడు హవేలీలో పీర్ బాబా ఎంటర్ అవుతాడు. ఒక రోగికి ట్రీట్ మెంట్ చేస్తాడు. నీలం చెప్పింది విని- క్షుద్ర పూజ చేయాలనీ, కూతురితో రక్త సంబంధమున్న ఇద్దరు మగాళ్ళు కావాలనీ అంటాడు. నీలం ఇరుకున పడుతుంది.    
 
        క పీర్ బాబా ఇంటికొచ్చి కూతుర్ని పరీక్షిస్తాడు. అప్పుడు మంచం పక్కన మసూదాబీ అని రాసి వుండడం చూసి, ఎదురు సందులో పాత ఇంటివైపు చూస్తాడు. ఇలా ఇప్పుడు సెకెండాఫ్ 15 వ నిమిషంలో బిగినింగ్ ముగిసి ప్లాట్ పాయింట్ వన్ ఏర్పడి, గోల్ తో కథ – అంటే మిడిల్ ప్రారంభమవుతుంది! ఇది బలహీన ప్లాట్ పాయింట్ వన్ అనాలి. అంటే బిగినింగ్ విభాగం స్థానభ్రంశం చెంది, సెకండాఫ్ నాక్రమిస్తూ 15 వ నిమి

1. విజువల్ కాన్ఫ్లిక్ట్ మిస్
పై ప్లాట్ పాయింట్ వన్ లో విజువల్ కాన్ఫ్లిక్ట్ లేకపోవడంతో బలహీన ప్లాట్ పాయింట్ వన్ అయింది. అంటే ఇప్పుడైనా మసూదాబీ దెయ్యం ప్రత్యక్షమై తిరగబడలేదు. దెయ్యాలకి మంత్రగాళ్ళని మించిన ప్రత్యర్ధులు లేరు. పీర్ బాబా వచ్చి జోక్యం చేసుకుంటూ వుంటే ఇక ముందుకొచ్చి మీద పడకుండా వుండదు. మీదపడి వుంటే ఇప్పుడైనా ఇంటర్వెల్లో మిస్సయిన ప్రత్యక్ష కాన్ఫ్లిక్ట్ పుట్టేది. బలమైన ప్లాట్ పాయింట్ వన్ గా వుండేది విజువల్ నేరేషన్ తో.

కానీ కథకుడు బలహీనంగా వర్బల్ నేరేషన్నే ఎంచుకున్నాడు. ఇక్కడ పీర్ బాబా లాజిక్ కూడా అర్ధంగాదు. మసూదాబీ అని రాసి వున్నంత మాత్రాన అది దెయ్యమేనని ఎందుకు అనుమానించాలి? నీలంని అడగాలి. ఆ అక్షరాలెలా వచ్చాయో నీలం కూడా చెప్పలేక పోతే, మసూదాబీ ఎవరోకూడా తెలీదంటే, అప్పుడు కూడా అనుమానం రాకూడదు. మసూదాబీ కూతురి ఫ్రెండ్ కావొచ్చు. కూతురే ఆ పేరు రాసుకుని వుండొచ్చు. ఆ కూతుర్నుంచి కూడా విషయం రాబట్టడానికి ప్రయత్నించాలి.

కానీ ఆ పేరు చూడగానే పీర్ బాబా అక్కడే కూర్చుని అనుమానంగా తలతిప్పి కిటికీలోంచి పాడుబడ్డ ఇంటి వైపు ఎలా చూస్తాడు? అక్కడో పాడుబడ్డ ఇల్లుందని ముందే తెలుసా? తెలియక పోతే అక్షరాల మీంచి నేరుగా ఫోకస్ తీసికెళ్ళి ఇంటి మీద ఎలా వేస్తాడు? త్వరత్వరగా జరిగిపోవాలని కదా వెర్బల్ నేరేషన్ని కూడా ఇలా డీలా చేశాడు కథకుడు.

ఇక్కడ కూతురికి రిలీఫ్ కోసం సరదాగా మాట్లాడతాడు పీర్ బాబా. నాజియా హసన్ ఫేమస్ సింగర్ పేరు పెట్టుకున్నావా అని. దీనికి నీలం కల్పించుకుని ఔనని చెప్తుంది. దీంతో టాపిక్ కట్ అవుతుంది. ఇలా ప్రేక్షకులకే మర్ధమవుతుంది? నాజియా హసన్ పాపులర్ పాకిస్తానీ పాప్  సింగర్. 1980 లో హిందీ ఖుర్బానీ లో ఆమె పాడిన ఆప్ జైసా కోయీ మేరే జిందగీమే ఆయే, తో బాత్ బన్ జాయే అప్పట్లో సెన్సేషనల్ హిట్. ఉత్తమ గాయనిగా ఫిలింఫేర్ అవార్డు తీసుకుంది. ఈ పాటని సంగీత దర్శకుడు బిద్ధూ లండన్లో రికార్డు చేశాడు. అప్పుడు నాజియా వయస్సు 15 యేళ్ళు. 2000 లో క్యాన్సర్ తో మరణించింది. కథకుడు తను ఫీలైన ఆనందం తనొక్కడే ఫీలై రాసుకుంటూ పోతే ఎలా? ఇప్పటి ప్రేక్షకులకి తెలిసేలా వివరంగా రాసి ఫీలింగులు పంచుకోవాలిగా? బ్యాక్ గ్రౌండ్ లో ఆ సాంగ్ ప్లే చేయొచ్చుగా? 

ఇక అసలు దెయ్యం తన పేరు రాయడమే అసమంజసమని గత వ్యాసంలో చెప్పుకున్నాం. అలా రాశాక ఇప్పుడొచ్చి పీర్ బాబాని ఎదుర్కొక పోవడం దెయ్యం చేస్తున్న ఇంకో తప్పు. ఇక్కడ పీర్ బాబా కూతురి రూపంలో వున్న మసూదాబీ దెయ్యంతో దాడికి గురై వుంటే ఇప్పుడైనా -విజువల్ కాన్ఫ్లిక్ట్ తో కథ మొదలై అర్ధవంతంగా వుండేది.

ఇంకోటేమిటంటే, దెయ్యానికి విరుగుడుగా ప్రయోగ సాధనాలు కూడా సీను కొకటి చొప్పున చూపించడం కన్ఫ్యూజన్ ని సృష్టిస్తోంది. హాస్పిటల్లో బ్రాస్లెట్ ని ముట్టుకోబోయి అల్లావుద్దీన్ ఎగిరవతల పడ్డాక- ఆ బ్రాస్లెట్ ని తీసి పారేస్తే దెయ్యం కూడా వదిలిపోతుంది. సింపుల్. పాడుబడ్డ ఇంటి ముందు దొరికిన ఆ బ్రాస్లెట్ కూతురు ధరించడం వల్లే అందులో వున్న మసూదా దెయ్యం పూనినట్టు తర్వాత ఓపెనవుతుంది. అలాంటప్పుడు దాన్ని తీసి పారేస్తే దెయ్యం గియ్యం వదిలి పోతాయి. సెకండాఫ్ లో తర్వాత బ్రాస్లెట్ రహస్యం తెలిశాక కూడా, దాన్ని తీయొద్దు- సమయం వచ్చినప్పుడు తీద్దామంటాడు బాబా. ఎందుకు? కథ నడవడం కోసమా?

ఇక క్షుద్ర పూజలు చేయాలనీ, కూతురితో రక్త సంబంధమున్న ఇద్దరు మగాళ్ళు కావాలనీ ఇంకో ప్రయోగ సాధనం చెప్తాడు. ఎందుకు? వాళ్ళని అడ్డంగా బలి ఇవ్వడానికా? తర్వాత ఈ పూజలేమవుతాయో- దీని గురించి వుండదు.

తర్వాత నీలం, గోపీలకి ఒక చాదర్ ఇచ్చి, మసూదాబీ కంకాళం మీద కప్పమంటాడు. చివరికిదే జరుగుతుంది, విజయవంత మవుతుంది. మహేష్ భట్ తీసిన రాజ్ లో- దహన సంస్కారాలు జరగని ఆత్మకి దహన సంస్కారాలు జరపడమే మార్గమని మంత్రగాడు తేల్చి, పాతి పెట్టిన శవం మీద పెట్రోలు పోసి నిప్పంటించేసి హార్రర్ కథ ముగించినట్టే ఇది కూడా!

ఈ చాదర్ అప్పట్లో మీర్ తాజ్ కి ఇంకో పీర్ బాబా ఇచ్చాడు (ఇది సినిమా ప్రారంభంలో పూర్వ కథలో చూపిస్తారు). మీర్ తాజ్ చాదర్ తో మసూదా ఆత్మని నిర్వీర్యం చేసే ముందే చనిపోయాడు. అలాంటప్పుడు విరుగుడుగా ఆ చాదర్ ఒక్కటే కథలో వుంటే కన్ఫ్యూజన్ వుండదు. దీంతో కూడా ఆగకుండా సెకండాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ చెప్పే క్యారక్టర్ గోపీకి మసూదాబీ వాడిన కత్తి ఇస్తుంది. ఇది మళ్ళీ ఇంకో కన్ఫ్యూజుడు సాధనం! కథకుడు ఏం చెప్పాలనుకున్నాడో తనే కన్ఫ్యూజన్లో వున్నట్టుంది.

2. ఇప్పుడు మిడిల్ బిజినెస్!

పీర్ బాబా మంచం పక్కన మసూదా పేరు చూడడంతో ప్లాట్ పాయింట్ వన్ తో మిడిల్ ప్రారంభమయ్యాక- ఆ ఇంటి దగ్గరికెళ్ళి చూసి వస్తాడు. ఇలా మిడిల్ విభాగం బిజినెస్ ప్రారంభమవుతుంది. మిడిల్ బిజినెస్ - అంటే ప్రత్యర్ధి పాత్రతో సంఘర్షణ- ప్రతీకాత్మకంగా ఇగో సబ్ కాన్షస్ మైండ్ లోకి ఎంటరై- సమస్య సాధనకి యాక్షన్ రియాక్షన్ల ఇంటర్ ప్లేకి అంకురార్పణ చేయడం. ఎప్పుడో ఫస్టాఫ్ లో ప్రారంభమవాల్సిన ఈ మిడిల్ బిజినెస్ దారితప్పి వచ్చి ఇక్కడ ప్రారంభమవుతోంది. ఇందుకే ఫస్టాఫ్ లో ఏమీలేని లేదని ఫీలవుతున్నారు ప్రేక్షకులు.

లాయర్ దగ్గర ఇంటి వివరాలు సేకరిస్తాడు గోపీ. ఆ ఇల్లు మీర్ తాజ్ కీ, అతడి తమ్ముడికీ మధ్య కోర్టు వివాదంలో వుందని బాబాకి చెప్తాడు. మసూదాబీ ఫోటో కూడా ఇస్తాడు. ఇక మధ్య మధ్యలో దెయ్యం పూనిన కూతురు ఎటాక్ కూడా చేస్తూంటుంది. కత్తి తీసుకుని గోపీని పొడిచేస్తుంది. దీంతో అసలే భయస్థుడైన గోపీ ఇక నీలంకి గుడ్ బై చెప్పేసి పోతాడు. గోపీని ఆఫీసులో కొలీగ్ మొదట్నుంచీ మందలిస్తూంటాడు. వాళ్ళు నీకేమవుతారని వాళ్ళ కోసం రిస్కు తీసుకుంటున్నావని.

ఎప్పుడైనా మిడిల్ సంఘర్షణలో అస్మదీయులు దూరమవడమనే మలుపు కథలో బాధాకర పరిస్థితిని సృష్టిస్తుంది. తర్వాతేంటి- అన్న సస్పెన్సుతో. ఇప్పుడు నీలం ఏం చేస్తుంది ఒంటరిగా? ఒక మాంటేజ్ సాంగ్ వేసి- అటు తల్లీ కూతుళ్ళ పరిస్థితి, ఇటు వాళ్ళని గమనిస్తున్న గోపీ గిల్టీ ఫీలింగ్ -వీటితో సాంగ్ పూర్తయ్యాక మనసు మార్చుకుని వచ్చేస్తాడు. అడ్డుకున్న కొలీగ్ కి గాంధీ సూక్తి చెప్తాడు.  

వచ్చేసి, నీలం భర్త అబ్దుల్ ని కలిసి కూతుర్ని కాపాడుకోవడానికి రమ్మంటాడు ( రక్త సంబంధమున్న ఇద్దరు మగాళ్ళు కావాలి). అబ్దుల్ గోపీని అవమానించి, డబ్బిస్తేనే  వస్తానని వెళ్ళ గొడతాడు. గోపీ బాబా ఆదేశంతో చిత్తూరు జిల్లా గ్రామాని కెళ్తాడు. అక్కడ ఒక కన్ను పోయిన నర్గీస్ వుంటుంది. ఈమె మీర్ తాజ్ తమ్ముడి కూతురు. ఈమెనడిగి మసూదా గురించి తెలుసుకుంటాడు.
        
ఈ ఫ్లాష్ బ్యాక్ లో చెరకు పండించే, గుర్రాలమ్మే మీర్ తాజ్ అన్నదమ్ముల ఉమ్మడి కుటుంబం. ఈ కుటుంబంలో చిన్న తమ్ముడు బాగా చదువుకుని పెద్ద ఉద్యోగంలో చేరి ఉద్ధరిస్తాడనుకుంటే, మసూదాబీ అనే ఆమెని పెళ్ళాడి తీసుకొస్తాడు. హైదరాబాద్ కి చెందిన మసూదా బురఖాలో వుంటుంది. ఆమె ఎవ్వరికీ నచ్చదు. మీర్ తాజ్ పెద్ద తమ్ముడితో సరసాలాడుతుంది. మందలిస్తే తమ్ముడు వూరుకోడు. ఇంతలో వూళ్ళో మాయ రోగాలొచ్చి చచ్చి పోతూంటారు జనం. మసూదాబీ చేతబడి చేస్తూంటుంది. దీంతో కుటుంబం ఎదురు తిరిగితే, చాలా మందిని చంపేసి పారిపోతుంది. ఆమెని హైదారాబాద్ వచ్చి పట్టుకుంటాడు మీర్ తాజ్. ఆమె వుంటున్న భవనంలోనే చెట్టుకి కట్టేసి అనుచరుల సాయంతో దారుణంగా పొడిచి చంపేస్తాడు.  

ఒంటి కన్నునర్గీస్ ఈ ఫ్లాష్ బ్యాక్ చెప్పి, ఒక గుహలో చాదర్ వుంటుంది, తీసికెళ్ళ మంటుంది. మసూదాబీ వాడిన కత్తి కూడా ఇస్తుంది. ఇలా బాబా దగ్గరికి తిరిగొస్తాడు గోపీ. బాబా నీలం, గోపీలకి చాదర్ ఇచ్చి, వెళ్ళి ఆ వూళ్ళో మసూదా సమాధి తవ్వి, ఆమె ఎముకల మీద చాదర్ కప్పేయ మంటాడు. దీంతో మిడిల్ విభాగం పూర్తయి, ప్లాట్ పాయింట్ 2 వస్తుంది.

3. కొసరు మిడిల్ తో ఎసరు  

పై మిడిల్ 50 నిమిషాలుంటుంది. అయితే ఇందులో ఫ్లాష్ బ్యాక్ 17 నిమిషాలుంటుంది. ఫ్లాష్ బ్యాక్ మిడిల్ కిందికి రాదు. లీనియర్ గా చూస్తే ఇది బిగినింగే. నాన్ లీనియర్ లో ఈ బిగినింగ్ మిడిల్ మధ్యలో వచ్చింది. కనుక ఫ్లాష్ బ్యాక్ తీసేస్తే మిడిల్ కి మిగిలింది 33 నిమిషాలే. రెండు గంటల 40 నిమిషాల సినిమాలో మిడిల్ 33 నిమిషాలే వుందంటే ఎంత కథా బలంతో వున్నట్టు. మనబుర్రలో సబ్ కాన్షస్ మైండ్ 90 శాతానికి పైగా వుంటే, దీని నమూనా అయిన మిడిల్ 13 శాతమే తేలుతోంది ఈ స్క్రీన్ ప్లేలో! 90 శాతం సబ్ కాన్షస్ మైండ్ వున్న వాళ్ళం 13 శాతం కథనెలా చూస్తామబ్బా!

స్ట్రక్చర్ స్కూలు కాకుండా క్రియేటివ్ స్కూలుకి చెందిన కథకులు స్క్రీన్ ప్లే మొత్తంలో వున్నది కథే అనుకుంటారు. ఇక్కడొచ్చింది చిక్కు. క్రియేటివ్ స్కూలుకి శతకోటి దండాలు పెట్టాలి. బిగినింగ్ 25% మిడిల్ 50% ఎండ్ 25% వుంటే మైండుకి సినిమా పడుతుంది.

        ఈ మిడిల్లో మసూదాబీ ఎందుకు చేతబడి చేస్తోందో చెప్పలేదు. ఇదొక లూప్ హోల్. ఫ్లాష్ బ్యాక్ లో హార్రర్ సీన్లు బాగావేశారు. కానీ లాజిక్ వుండాలి. వూళ్ళో చేతబడి చేసి అంత మందిని చంపాల్సిన అవసరం ఏమొచ్చిందామెకి.

4. ఎండ్ కి సాగతీత

ఇక బాబా సలహాతో చాదర్ కప్పడానికి నీలం, గోపీ వెళ్ళడంతో క్లయిమాక్స్ (ఎండ్) ప్రారంభమవుతుంది. బాబా తను చెప్పిన క్షుద్ర పూజ చేస్తానని వేరే చోట వుంటాడు. చాదర్ వున్నాక క్షుద్ర పూజ దేనికి? చెప్పిన రక్త సంబంధమున్న ఇద్దరు మగాళ్ళు లేకుండా క్షుద్ర పూజలేల! అది క్షుద్ర పూజలా వుండదు. నమాజ్ చదువుతున్నట్టు వుంటుంది.

పీర్ బాబా పాత్ర చూస్తే అతను అనవసరంగా వున్నాడనిపిస్తుంది. దెయ్యానికి విరుగుడుగా వేరే బాబా ఇచ్చిన చాదర్ వుండనే వుంది. ఇక పీర్ బాబాతో పనే లేదు.  ప్రాణాలు పోతున్నంత పనీ జరిగి, చచ్చీ చెడీ దెయ్యంతో పొరాడి నీలం, గోపీ తామే చాదర్ కప్పేసి కథ ముగించేస్తారు. పీర్ బాబా చేసిందేమీ లేదు. చాదర్ వేరే బాబా ఇచ్చాడని ఇగో ఫీలయ్యాడేమో, దాన్ని కప్పడానికి రాలేకపోయాడు. లేకపోతే సినిమా రూల్స్ ప్రకారం చాదర్ కప్పే యాక్షన్లో తనే పాల్గొని ప్రేక్షకుల్ని సంతృప్తి పర్చే వాడు.

ఈ చాదర్ కప్పే ఎపిసోడ్ చాలా సాగదీయడంతో హార్రర్ ఎఫెక్ట్ మాయమై సహన పరీక్ష పెడుతుంది. 35 నిమిషాల క్లయిమాక్స్ భరించడం కష్టమే. సుఖాంతమయ్యాక, మసూదాబీ మళ్ళీ వచ్చినట్టు సీక్వెల్ కోసమన్నట్టుగా ముగించారు. మూఢ నమ్మకాల చేతబడి దీంతో పూర్తి కాలేదేమో.

కొత్త దర్శకుడు సాయికిరణ్ కి మంచి విజువల్ సెన్స్, టెక్నికల్ బ్రిలియెన్స్ వున్నాయి. స్క్రిప్టు మీద పట్టు అంతగా లేదు. సెకండాఫ్ లో బిగినింగ్-మిడిల్- ఎండ్ మూడూ చూపించే పని ఇక ముందు చేయకుండా, మిడిల్ ని ఫస్టాఫ్ నుంచే చూపించుకొస్తే బావుంటుంది.

—సికిందర్