రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

1, సెప్టెంబర్ 2022, గురువారం

1202 : రైటర్స్ కార్నర్


ది ఇన్పుట్స్ ప్రపంచం.  ఎందుకు ఇన్ పుట్స్ ప్రపంచం? ఇవ్వాళ  ప్రపంచం అందరికీ తెలిసిపోతోంది. ఎలా తెలిసిపోతోంది? అరచేతిలో స్మార్ట్స్ ఫోన్ల ద్వారా కూడా తెలిసిపోతోంది. ఐతే ఏం చేయాలి? సినిమా రచయిత గ్లోబలీకరణ చెందాలి. ఏ సినిమా రచయిత గ్లోబలీకరణ చెందాలి? హాలీవుడ్ నుంచీ టాలీవుడ్ దాకా, ఇంకేమైనా వుంటే మూసీ పక్కన వుండే డెక్కన్ వుడ్ దాకా అందరూ గ్లోబలీకరణ చెందాలి. చెందకపోతే  ఏమవుతుంది? కాలం కంటే,  ప్రేక్షకులకంటే వెనుక బడిపోతాయి స్క్రిప్టులు. తుపాకీ రాముడికైనా ప్రపంచజ్ఞానముంటుంది. వాడి వ్యాఖ్యానాల కంటే అన్యాయంగా కనపడతాయి స్క్రిప్టులు.  అవే మూస కథలు అలాగే రాస్తారు. నాల్గు మూస సినిమాలు చూసి ఒక మూస కథ  అల్లే పాత మేస్త్రీలుగా  మిగిలిపోతారు...
        
మూస ఎందుకు పనికిరాదు? ప్రపంచం మూసుకుని వున్న రోజుల్లో అవతలి విషయాలు తెలిసేవి కావు ప్రేక్షకులకి. అప్పుడా వచ్చే ఫార్ములా కథలు, మూస పాత్రలు, కృత్రిమ చిత్రీకరణలూ వాళ్ళ వినోదానికి సరిపోయేవి. ఇప్పుడు ప్రపంచం తెర్చుకున్నాక ఎన్నో కొత్త కొత్త విషయాలు – వాస్తవంగా ప్రపంచం అబ్బురపరుస్తున్న విధమూ  ఎప్పుటికప్పుడు తెలిసిపోతున్నాయి. వీటి ముందు ప్రపంచంలోకి చూడని ఫార్ములా కథలు, మూస  పాత్రలు, కృత్రిమ చిత్రీకరణలూ వెలవెలబోతున్నాయి. ఇప్పటి సినిమా రచయిత / దర్శకుడు ఇది గ్రహించక, సినిమా అంటే ఇంకా చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున,  వెంకటేష్ సినిమాలే, ఆ కథలే, పాత్రలే అనుకుంటూ వాటి వైపే చూస్తూ, వాటిలోంచే తీస్తూ, తరం మారిన ప్రేక్షకులకి దూరంగా, దయనీయంగా మిగిలిపోతున్నారు. 
       
    సొంత వూహలతో, ఆ వూహల్నికూడా పాత సినిమాలతో ధృవీకరించుకుని, ఇవ్వాళ  తోచిందల్లా స్క్రిప్టులు రాసుకునే కాలం కాదు. బయటి ప్రపంచంలోకి చూస్తేనే గానీ  ఇవ్వాళ్టి ప్రపంచంతో సంబంధం ముండే కాలీన స్క్రిప్టులు రాని అగత్యమేర్పడింది. ఒకప్పుడు హాలీవుడ్ లో క్రిమినల్స్ , గ్యాంగ్ స్టర్స్ సినిమాలు రాయాలంటే అలాటి పాత సినిమాలవైపే చూసి రాసేవారు. ఇక ఇలా పాత సినిమాలని చూసి కాదని, ఇవ్వాళ్టి ప్రపంచపు రియలిస్టిక్ క్రిమినల్, గ్యాంగ్ స్టర్ పాత్రలతో రాయాలని వొత్తిడి వచ్చినప్పుడు, ఆ జానర్ సినిమాల్లో కొత్తదనం ప్రారంభమయింది. 
        
    ఐడియాలు కొత్తగా రావడం లేదని కాదు. వాటికి కొత్త కథనాలే  రావడంలేదు. కొత్త ఐడియాలకే కాదు, ఎలాటి ఐడియాల కైనా కొత్త కథనాలు రావాలంటే ఇప్పుడు ఇన్పుట్స్ చాలా అవసరం. ఇన్పుట్స్ కి ముందుగా చూడాల్సింది ఇవ్వాళ్టి మార్కెట్ యాస్పెక్ట్ నే తప్ప, క్రియేటివ్ యాస్పెక్ట్ ని కాదు. ఫలానా ఈ ఐడియాకి నేటి మార్కెట్ కి తగ్గట్టు ఏఏ అంశాలని దృష్టిలో పెట్టుకోవాలో నిర్ణయించినప్పుడే అలాటి ఇన్పుట్స్ తీసుకోవాలి. సినిమా కథంటే మొదట మార్కెట్టే, ఆ తర్వాతే  క్రియేటివిటీ. 
        
    ఈ ఇన్పుట్స్ తీసుకోవడానికి కమర్షియల్ దృక్పథం వుండాలి. కమర్షియల్ సినిమాలు కాకుండా వాస్తవిక, సమాంతర సినిమాలే రాయాలనుకుంటే కమర్షియల్ ఇన్పుట్స్ తీసుకోకూడదు. ఆ వాస్తవిక దృక్పథంతో అలాటి వార్తల్లోంచో సినిమాల్లోంచో ఇన్పుట్స్  తీసుకోవాలి. ఇవ్వాళ్ళ తెలంగాణాలో  ఔత్సాహిక దర్శకులు విపరీతంగా దూసుకొచ్చేస్తున్నారు.  వీళ్ళు ఒక దగ్గరే ఆగిపోతున్నారు. కానీ అక్కడ ఆగిపోవడానికి తెలంగాణాలో ఇంకా బి.  నరసింగ రావు, గౌతం ఘోష్ సినిమాల కాలం కాదు.  తెలంగాణా ఉద్యమకాలంలోనే ఉద్యమ సినిమా లెవరూ చూడలేదు. తరం మారింది. తెలంగాణాలో కూడా ఈ తరానికి ఎకనమిక్స్, లేదా రోమాంటిక్స్ వుండే ఎంటర్ టైనర్లు కావాలి. 
        
    కానీ తెలంగాణా వైపు నుంచి వచ్చే ఔత్సాహిక దర్శకులు షార్ట్ ఫిలిమ్సో, వరల్డ్ మూవీసో అంటూ మోజు పెంచుకుంటున్నారు. దీనికి కమర్షియల్ సినిమాల ప్రపంచంతో ఏ మాత్రం సంబంధం లేదు. ఈ ఇన్పుట్స్ కమర్షియల్ సినిమాలు తీయడానికి ఏమాత్రం పనికి రావు. టాలీవుడ్ వరల్డ్ మూవీస్ ఉత్పత్తి చెయ్యదు. ప్రధాన స్రవంతి కమర్షియల్ సినిమాలే ఉత్పత్తి చేస్తుంది. తెలంగాణా నుంచి టాప్ డైరెక్టర్లు చాలా మందే వున్నారు. సురేంద్ర రెడ్డి, హరీష్ శంకర్, దశరథ్, వంశీ పైడిపల్లి, సంపత్ నంది, ఎన్. శంకర్, సందీప్ రెడ్డి, సంకల్ప్ రెడ్డి, తరుణ్ భాస్కర్, హను రాఘవపూడి...వీళ్ళంతా వరల్డ్ మూవీస్ చూసి కమర్షియల్ డైరెక్టర్లు కాలేదు. ఇద్దరు ముగ్గురు షార్ట్ ఫిలిమ్స్ తీసి వచ్చారు తప్ప, మిగిలిన వాళ్ళందరూ కమర్షియల్ సినిమాలకి పనిచేసి వచ్చిన వాళ్ళే. తెలంగాణా నుంచి ఇంకో రాబోతున్న వేణు ఊడుగుల కూడా కమర్షియల్ దర్శకుల దగ్గర పనిచేసిన వాడే. ఇప్పుడు తెలంగాణా ఔత్సాహిక దర్శకులకి తాము  కూడా ఇలా  టాప్ దర్శకులవ్వాలనే కలలుంటే,  అవి వరల్డ్ మూవీస్ ఇన్పుట్స్ తో నేరవేరవు. అలాగని తెలంగాణా జీవితపు వాస్తవిక కథా చిత్రాలు తీయాలనుకుంటే వరల్డ్ మూవీస్  అధ్యయనం చేసుకోవచ్చు. కానీ అలాటి తెలంగాణా జీవితపు వాస్తవిక కథా  చిత్రాలకి ఇప్పుడు మార్కెట్ ఎక్కడిది? పైన చెప్పుకున్నట్టు ఎకనమిక్స్ లేదా రోమాంటిక్సే మార్కెట్. ఈ ఔత్సాహిక దర్శకులు టాప్ తెలంగాణా దర్శకుల్లాగా ఎదగాలనుకుంటే అది మంచి ఆలోచనే. అప్పుడేం చేయాలంటే, ఇదే బ్లాగులోనే  కొన్ని వ్యాసాల్లో రాసినట్టు,  వరల్డ్ మూవీస్ కి ధడాలున తలుపులు మూసి పారేసి,  హాలీవుడ్ మూవీస్ మాత్రమే చూసుకోవాలి. ఆ ఇన్పుట్స్  మాత్రమే తీసుకోవాలి. 
        
    ఇక్కడ కూడా తప్పులో కాలేసే వీలుంది. మళ్ళీ హాలీవుడ్ సినిమాలనగానే కొందరు పాత మేధావులకి అదే ‘క్లాసాబ్లాంకా’, అదే ‘రోమన్ హాలిడే’, అదే ‘సౌండ్ ఆఫ్ మ్యూజిక్’ లే తప్ప,  ఇక హాలీవుడ్డే  లేదన్నట్టు వుంటారు. నేటి తెలుగు సినిమాలతో సంబంధం లేని వీళ్ళ రికమెండేషన్ల కి, ఉపన్యాసాలకి దూరంగా వుంటూ, గత ఇరవై ఏళ్లుగా వస్తున్న హాలీవుడ్ సినిమాలని ఇన్పుట్స్ గా తీసుకుంటే ప్రయోజన ముంటుంది.
        
ఎందుకు హాలీవుడ్ ని తీసుకోవాలంటే, అవి కమర్షియల్ సినిమాల త్రీయాక్ట్  స్ట్రక్చర్ లో వుంటాయి. వరల్డ్ మూవీస్ కి,  ఆ మాటకొస్తే ఒకప్పుడు వచ్చిన భారతీయ కళాత్మక సినిమాలకీ స్ట్రక్చర్ అనేది వుండదు. స్ట్రక్చర్ అంటే స్క్రీన్ ప్లేలో బిగినింగ్ - మిడిల్ - ఎండ్ లు. స్ట్రక్చర్  లేకపోవడమంటే మిడిల్ లేకపోవడం. అంతే గాక ప్రధాన పాత్రలు యాక్టివ్ పాత్రలుగా వుండవు, పాసివ్ గా వుంటాయి. ఇంకా చెప్పుకుంటే,  ప్రధాన పాత్ర కథ నడపదు, కథే ప్రధాన పాత్రని నడుపుతుంది. ఇన్ని వరల్డ్ సినిమాలు చూస్తున్న వాళ్ళు ఈ పాటికి ఈ సాంకేతిక తేడాలు గమనించే వుండాలి. మిడిల్ మిస్సయిన సినిమా కమర్షియల్ గా ఆడదు. వరల్డ్ మూవీస్ కీ, కమర్షియల్ సినిమాలకీ సాంకేతికంగా ఈ తేడా తెలిసిన తెలుగు ఔత్సాహిక దర్శకుడు / రచయిత ఛస్తే వరల్డ్ మూవీస్ చూడడు. ఈ వ్యాసకర్త కూడా వాటి జోలికి పోవడం లేదు.

        తెలంగాణా ఔత్సాహిక దర్శకుల ఇన్పుట్స్ విశేషాలు చెప్పుకున్నాక, అసలు ఇన్పుట్స్  అంటే ఏమిటి? సినిమాలేనా? ఇంకా ఏమైనా వున్నాయా? ఇది ఈ కింద చూద్దాం...

        న్పుట్స్ పట్ల ఆసక్తి లేకపోతే ఏం జరగవచ్చో చూద్దాం... ఒక ఐడియా తడుతుంది. ఆ ఐడియాలో ఒక హీరో వుంటాడు. అతను చేసిన ఒక పని వల్ల ఇంకెక్కడో  వున్న తనకు తెలీని హీరోయిన్ జీవితం దెబ్బతింటుంది. ఇది హీరో తెలుసుకుని ఎలా చక్కదిద్దాడు..? అన్నప్రశ్న దగ్గర ఆగిపోయింది ఐడియా. దీన్నేం చేయాలా అని నల్గుర్నీ అడగడం ప్రారంభిస్తాడు సదరు కథకుడు. ఆ నల్గురూ తనలాంటి వాళ్ళే. వాళ్ళ దగ్గరా సమాధానం వుండదు. బాగా చర్చించుకుంటారు. అసలు హీరో చేసిన అంత దారుణమైన పనేమిటనేది కథకుడికి కూడా తెలీదు. హీరోయిన్ జీవితం దెబ్బతిందంటే ఏం జరిగిందో కూడా తెలీదు. ఇదే కాస్త చెప్పి పుణ్యం కట్టుకోమంటాడు. అది తెలిస్తే హీరోయిన్ జీవితాన్ని చక్కదిద్దే మార్గం తెలుస్తుంది. ఇలాకాదని ఇలాటి కథలతో ఏమేం సినిమాలు చూశామా అని వాళ్ళందరూ ఆలోచనలో పడతారు. ఫలానా ఫలానా  సినిమాలు చూడమంటూ కథకుడికి సలహా ఇస్తారు. కథకుడు ఎన్నో సినిమాలు చూస్తాడు. ఎక్కడా తను అనుకుంటున్న ఐడియా కనెక్ట్ అవదు. అంటే తన కొచ్చిన ఐడియాతో సినిమాలే రాలేదంటే తన ఐడియా ఎంత గొప్పదోనని ఆత్మవిశ్వాసం పెరిగిపోతుంది. ఎక్కడో వున్న హీరో ఇంకెక్కడో వున్న హీరోయిన్ జీవితాన్ని తెలియకుండా పాడుచేశాడు... ఎంత మంచి బంపర్ ఐడియా! కానీ మళ్ళీ అదే చిక్కు ప్రశ్న... ఎలా పాడు చేశాడు హీరోయిన్ జీవితాన్నీ? 
           
ర్లేరా, అసలా హీరో  ఏం చేస్తూంటాడో చెప్పిచావు – అంటారు స్నేహితులు. ఇది కూడా ఇప్పుడాలోచించి చావాలంటాడు కథకుడు. అన్నీ మేమే ఆలోచించి చావాలంటే ఎలారా అని చచ్చిపోతూంటారు స్నేహితులు. భీకరంగా మేధోమధనం జరుగుతుంది. మధ్య మధ్యలో గర్ల్ ఫ్రెండ్స్ తోకూడా అంతర్మధనం జరుగుతూంటుంది. ఏరా, మా జీవితాల్నేపాడు చేసే ఐడియాలు కావాల్రా మీకూ - అని గొడవలు కూడా జరుగుతూంటాయి వాళ్ళతో. 
        
    ఇదే గనుక ఇన్పుట్స్ వుంటే ఎలా వుంటుంది? ఎక్కడో వున్న హీరో వల్ల ఇంకెక్కడో వున్న హీరోయిన్ జీవితం పాడయ్యిందా? హీరో ఏం చేసివుంటాడు? అప్పుడు ఒకానొక దేశంలో ఒక వెడ్డింగ్ యాప్ వల్ల కొందరి పెళ్ళిళ్ళు పెటాకులైన వార్తా విశేషాలు గుర్తుకొస్తాయి. దాన్ని తనకొచ్చిన ఐడియాకి వాడుకుంటాడు  కథకుడు. అంటే హీరో అలాటి యాప్ ని డెవలప్ చేశాడు. దాన్ని హీరోయిన్ వాడుకుని పెళ్లి చేసుకోబోయి ఘోరంగా పరువు పోగొట్టుకుంది.  కానీ ఆ యాప్ అసలు  హీరో విడుదల చేయలేదు. అదింకా ప్రయోగ  దశలోనే వుంది. హీరో ఫ్రెండ్ వుంటాడు. అతడికి హీరోయిన్ తో చెడింది. కనుక ఆమె పెళ్లి చెడగొట్టాలని ఫ్రెండ్ దగ్గర ప్రయోగ దశలో వున్న యాప్ కొట్టేసి ఆమెకి పంపాడు... ఇలా కథని విస్తరించుకుంటూ పోగలడు కథకుడు తనదగ్గర ఇన్పుట్స్ వుంటే.  

    ఏ రంగంలో వున్నా కథకుడన్నాక అతడిలో జర్నలిస్టు అంశ, జిజ్ఞాస తప్పకుండా  వుంటాయి. తనలో జర్నలిస్టు పనిచెయ్యని కథకుడు కథకుడు కాదు. జర్నలిస్టులు వేరు, మనం వేరనీ, మనకి వివిధ ప్రపంచ విషయాలతో సంబంధం లేదనీ, మన కథకి మనం డ్రామా వరకూ ఆలోచించుకుంటే సరిపోతుందనుకుంటే ఆ కథకుడు డొల్లగా తయారవుతాడు. లోపలేమీ లేదు, కాబట్టి బయటికేమీ తీయలేడు. డ్రామా అంటే ఏమిటి? అది జడప్రాయం కాదు. టెంప్లెట్ కాదు. అది కూడా ఎప్పటికప్పుడు మారుతున్న ప్రపంచ విషయాలని తనలోకి తీసుకుంటుంది. తనని తాను సంస్కరించుకుంటుంది. తమకి ఉద్యోగాలివ్వలేదని నిరుద్యోగులు కాపేసి నాయకుణ్ణి చంపాలనుకోవడం మూస డ్రామా, లేదా టెంప్లెట్. నాయకుడే అనూహ్యంగా ఆ కాపేసిన నిరుద్యోగుల మీద కాల్పులు జరిపి చంపడం సీన్ రివర్సల్, చలనంలో వున్న యాక్షన్ – డ్రామా. యాక్షన్ కూడా టెంప్లెట్ లో బందీ అవదు. అది జడప్రాయం కాదు. ఫారిన్లో హీరో బర్త్ డే జరుపుకోవడం, వూళ్ళో తాత భోజనాలు పెట్టడం మూస. అన్ని వయసుల వాళ్ళూ సినిమాలు చూస్తున్న కాలంనాటి ఫార్ములా. కొన్ని వయసుల వాళ్ళే సినిమాలు చూస్తున్ననేటి డైనమిక్స్ కాదు. 

దర్శకుడు 90 - కథకుడు10
        కాలీన స్పృహ వుండని కథకుల గురించి ఒక కొటేషన్ వుంది : వీళ్ళు తమ పధ్నాల్గవ యేట తెలిసిన జ్ఞానంతో అక్కడే  వుండిపోతారని. తెలుగులో వచ్చే ప్రేమ సినిమాలు చూస్తే  ఈ అపరిపక్వతే  కన్పిస్తుంది. ప్రపంచ విషయాల పట్ల,ఇన్పుట్స్ పట్లా ఆసక్తి లేకపోవడం. ఇలాటి కథకులకి సినిమా కథ రాయాలన్న ఆసక్తి ఎప్పుడు పుడుతుందంటే, సినిమాల మీద మోజు పెంచుకున్న తర్వాతే. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, విజయశాంతిలు  నటించిన ఎన్నో సినిమాలు చూసేశాం కదా, ఇక మనకి కూడా సినిమాలు తీయాలన్న కోరిక పుట్టేసింది, ఇక మనమే కథకులై పోవచ్చని వచ్చేస్తూంటారు. 
        
     కానీ ఏ మనిషిలోనూ ఎకాఎకీన కథకుడు పుట్టడు. ఎప్పటి నుంచో ఒక జర్నలిస్టు అంశ తనలో వుండే వుంటుంది. జర్నలిస్టు అంశే ప్రాచీన కాలంలో రాయించడం మొదలెట్టించింది. మొట్ట మొదట చరిత్రలు రాయించింది. అంటే శోధనతో రచన చేయడం మొదలైంది. శోధన అంటే జర్నలిజమే. ఆ రాసిన చరిత్రల్ని శోధించి  నాటకాలు రాశారు. నాటకాల నుంచి కావ్యాలూ, ఇతర సాహిత్య  ప్రక్రియలూ వెలువరించడం మొదలెట్టారు. ఇలా ఒకదాన్ని శోధిస్తూ  ఇంకొకటి కళా ప్రక్రియలు అవతరించాయి. నాటక కళని శోధించే సినిమాకళ వచ్చింది. 
        
    కనుక  దేన్నీ ఊహల్లోంచి సృష్టించ లేరు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఊహించి ఏదీ సృష్టించడం సాధ్యం కాదు. శాస్త్రాలన్నీ పదార్థ ఫలితాలే. పదార్థముంటేనే శాస్త్రం. ప్రాచీనకాలంలో రాజులనే పదార్ధముంది కాబట్టే వాళ్ళని గమనించి చరిత్రలు. చరిత్రలనే పదార్థముంది కాబట్టే అవి చూసి నాటకాలు. నాటకాలనే పదార్ధముంది కాబట్టే ఇవి చూసి ఇతర కావ్యాలూ కథలూ కాకరకాయలూ, అన్ని కళలూ! నాట్యాలనే పదార్థాలున్నాయి కాబట్టే వాటిని చూసి భరతముని నాట్య శాస్త్రమూ.  సినిమాలనే పదార్థాలున్నాయి కాబట్టే వాటిని చూసి స్క్రీన్ ప్లే శాస్త్రమూ.  విశ్వముంది కాబట్టే దాన్ని చూసి ఖగోళ శాస్త్రమూ. యాపిల్ కింద పడింది కాబట్టే దాన్ని చూసి గురుత్వాకర్షణ సిద్ధాంతమూ. పదార్థాలే ముందు, శాస్త్రాలు తర్వాత. వీటన్నిటి చోదక శక్తి మళ్ళీ శోధించే జర్నలిస్టు అంశే. 
        
    కాబట్టి సినిమాల మీద ఓ పొద్దుటే కోడెగిత్తలా పుట్టిన మోజుతో కథకులై  పోవడానికి సినిమాలనే పదార్థముంది ఓకే, మరి జర్నలిస్టు అంశ ఏదీ? పదార్థాన్ని (సినిమాల్ని) చూసి మోజైతే బాగానే రేగింది, మరి ఇప్పటికప్పుడు జీవితాల్నీ ప్రపంచాన్నీ శోధించాలంటే జర్నలిస్టు అంశ ఎలా పొడుచుకు వస్తుందీ? ఇంకా సినిమాల్ని ఏమని శోధిస్తావ్? ఆల్రెడీ నాటకాల్ని శోధించి బిగినింగ్ - మిడిల్ - ఎండ్ లతో ఓ సినిమా కళని స్థాపించారు. ఇంకా నువ్వేం స్థాపిస్తావ్? ఆల్రెడీ తెలుగు సినిమాల యాక్షన్ కి ఒక టెంప్లెట్, లవ్ కి ఇంకో టెంప్లెట్ వున్నాయి. వాటిలో నువ్వేం విషయం వేస్తావ్? వేసిన విషయమే వేస్తూ పోతావా? ఇందుకా మళ్ళీ  నువ్వు పుట్టి పెరిగిందీ?
        
   టాప్ దర్శకులు కూడా కొద్ది కాలంలోనే హతాశులవడానికి కారణం జర్నలిస్టు అంశ లోపించడమే. ఒక ఫ్యాక్షన్ టెంప్లెట్ పట్టుకునో, ఒక యాక్షన్ కామెడీ టెంప్లెట్ పట్టుకునో నాల్గు సినిమాలు తీసేసరికి వాళ్ళ పనై పోయింది. కానీ హిచ్ కాక్ చెప్పినట్టు,  సినిమా అంటే 90 శాతం రాత, 10 శాతమే తీత. ఇదిప్పుడు తారుమారైంది. 90 శాతం తీత, 10 శాతం రాతగా మారిపోయింది తలరాత. కాబట్టి ఓ పొద్దుటే సినిమాలు తీసేద్దామని వచ్చే నేటి దర్శకులు కమ్ రచయితల్లో  90 శాతం దర్శకుడవ్వాలనే కోరికే తప్ప, ముందు కథకుడయ్యేందుకు జర్నలిస్టు అంశ అసలే వుండదు, ఆసక్తి కూడా 10 శాతం మాత్రమే. కనుకే 90 శాతం ఫ్లాపులు.
        
    ఒక సీనియర్ దర్శకుడు పదిహేనేళ్ళ క్రితమెప్పుడో ఈ వ్యాసకర్తతో చెప్పారు :  చదవాలండీ, చదువుతూనే వుండాలి. ఏదని కాదు, వీలైనన్నివిషయాల మీద చదువుతూనే వుండాలి. దర్శకత్వమనేది శారీరకమే, మనం మానసికంగా స్ట్రాంగ్ గా వుండాలంటే చదవాలి... అని. 
        
    ఈ చదువు కొరవడితే ఇన్పుట్స్ వుండవు. ఇన్పుట్స్ లేకపోతే  అవుట్ పుట్ వుండదు. ఇప్పుడున్న  ట్రెండ్ ప్రకారం తెలుగులో దర్శకుడే కథకుడు, కథకుడే దర్శకుడనే ఫ్రెంచి ఓటర్ (auteur) విధానం అమల్లో వుంది. ఇది వరల్డ్ మూవీస్ కి యూరప్ దేశాల్లో పుట్టిన విధానం. హాలీవుడ్ లో 1920 ల నుంచే స్క్రీన్ రైటర్స్ అని విడిగా వుంటూ వస్తు న్నారు. వాళ్ళందించే కథలతోనే, స్క్రిప్టులతోనే దర్శకులు సినిమాలు తీస్తూంటారు. అరుదుగా క్వెంటిన్ టరాంటినో, కోయెన్ బ్రదర్స్, రియాన్ జాన్సన్ లాంటి తామే రాసుకుని తామే తీసే ‘ఓటర్స్’ వుంటారు. వీళ్ళు కూడా మామూలుగా వుండరు. వీళ్ళల్లో 90 శాతం కథకుడుంటే, 10 శాతమే దర్శకుడుంటాడు. అందుకే పల్ప్ ఫిక్షన్, బ్లడ్ సింపుల్, బ్రిక్ లాంటి వీళ్ళు తీసిన కమర్షియల్ అద్భుతాలొచ్చాయి, యూనివర్సిటీల్లో బోధనాంశాలయ్యాయి. పల్ప్ ఫిక్షన్ తో టరాంటినో ఆధునిక గ్యాంగ్ స్టర్ కథ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ లో అపూర్వ క్రియేటివిటీ ప్రదర్శించాడు. కోయెన్ బ్రదర్స్ 25 – 27 మధ్య వయస్కులుగా వుండగానే తొలి సినిమా బ్లడ్ సింపుల్ తో ఆశ్చర్యపర్చారు. ఫ్రెంచి జానరైన ఫిలిం నోయర్ ని 1930 లనుంచీ హాలీవుడ్ తన వ్యాపార తరహాకి అనుకూలంగా మార్చుకుని, హాలీ వుడ్ లో దాన్ని కూడా ఒక జానర్ గా కలుపుకున్నాక,  కాలానుగుణంగా కలర్ సినిమాలతో నియో నోయర్ గా మార్చుకుని,  ఇప్పటికీ తీస్తూనే వుంది. ఫ్రెంచి నుంచి తెచ్చుకున్న ఫిలిం నోయర్ కథలకోసం అమెరికాలోనే  డెషెల్ హెమెట్ రాసిన హార్డ్ కోర్ డిటెక్టివ్ నవలల్నే తీసుకున్నారు. తెలుగులో జానపద సినిమాలు ఎలా వచ్చేవో అంత విరివిగా  హాలీవుడ్  నోయర్ సినిమాలు వచ్చాయి, వస్తూనే వున్నాయి. 1980 లలో కోయెన్ బ్రదర్స్ వచ్చేటప్పటికి, వాళ్ళు వచ్చిన నోయర్ సినిమాలనే చూసి బ్లడ్ సింపుల్ తీయలేదు. వాళ్ళల్లో జర్నలిస్టు అంశ మేల్కొంది. అసలు డెషెల్ హెమెట్ ఏం ప్రతిపాదించాడబ్బా  అని హెమెట్ నవలలు చదవడం ప్రారంభించారు. అప్పుడు మాత్రమే ఆ జానర్ కి దగ్గరగా వెళ్లి అనుభవించగల్గి,  బ్లడ్ సింపుల్ తీసి రికార్డు సాధించారు.
        
    2005 లో రియాన్ జాన్సన్ బ్రిక్ తీసినప్పుడు కూడా హెమెట్ సాహిత్యాన్ని అధ్యయ నం చేశాడు. అతడికి ఫిలిం నోయర్, నియో నోయర్ లాగా అడల్ట్ కథతో, పెద్ద నటులతో తీసే ఉద్దేశం లేదు. అడల్ట్ ప్రపంచంగా వుంటూ వస్తున్న నోయర్ జానర్ని,  కాలేజీ టీనేజీ నోయర్ గా మార్చేసి సంచలనం సృష్టించాడు. ‘ఓటర్’ బాధ్యతల్ని నిర్వహించుకోవడం ఇలా వుంటుంది అధ్యయనాలతో కలుపుకుని.     
    
100 శాతం ఓటర్సేనా?
        అయితే తెలుగులో ఈ తరం దర్శక రచయితల్ని పూర్తిగా ఓటర్స్ అనలేం. యూరోపియన్ సినిమా ఫీల్డులో ఓటర్ అంటే రచన నుంచీ పోస్ట్ ప్రొడక్షన్ దాకా అన్నిశాఖలూ తనవే అన్నట్టు  ముద్రవేసుకునే దర్శకులని ఓటర్స్ అంటారు. సినిమాలో ఏ శాఖ పనితనం చూసినా ఆ దర్శకుడి ప్రత్యేక శైలియే కన్పిస్తుంది. యూరప్ లో జీన్ లక్ గోడార్డ్, ఇంగ్మార్ బెర్గ్ మన్, ఫ్రాంకోయిస్ ట్రూఫాట్ లాంటి గొప్ప దర్శకులు నిజమైన ఓటర్స్ అన్పించుకున్నారు. తెలుగులో చూస్తే, వంశీ సినిమాల అణువణువులో అన్నీ శాఖల్లో ఆయన శైలియే కొట్టొచ్చినట్టు కన్పిస్తుంది. నటీనటుల నటనల దగ్గర్నుంచీ భావోద్వేగాలు, సంభాషణలు, ఛాయాగ్రహణం, సంగీతం, కళా దర్శకత్వం, పోరాటాలూ సమస్తం ఆయన శైలిలోకి మారిపోయి కన్పిస్తాయి. క్వెంటిన్ టరాంటినో, కోయెన్ బ్రదర్స్, రియాన్ జాన్సన్ లు ఓటర్స్ గా ఇదే సాధించారు. ఇది సాధించాలంటే ముందు జర్నలిస్టు అంశతో, శోధనతో పూర్తి 90 శాతం కథకులవగల్గాలి. అవుతారా? అవడానికి మనస్కరించదు. 
        
    యూరప్ యూనియన్ చిన్న చిన్న దేశాల్లో అక్కడి కొద్దికొద్ది జనాభాకి,  చిన్న చిన్న బడ్జెట్లతో ‘ఓటర్స్’  తీసే పర్సనల్ సినిమాలు నప్పుతాయి. ‘ఓటర్స్’ తీసే సినిమాలు ఎంత వరల్డ్ మూవీస్ అని ఇప్పుడు ఫ్యాషన్ గా చెప్పుకుంటున్నా అవి ఆర్ట్ సినిమాలే. జర్మన్ ఎక్స్ ప్రెషనిస్టు కళ వాటికి  మూలం. ఈ సినిమాలు అక్కడి జీవితాల గురించి వుంటాయి, వినోదం గురించి వుండవు. కాబట్టి వాటి నేటివ్ జీవితాలతో అవి మిగతా ప్రపంచంలో ఆడవు. భారత దేశంలో కూడా,  కాశ్మీరు నుంచీ కన్యాకుమారీ దాకా కాదుకదా,  అబిడ్స్ నుంచి  అమీర్ పేట వరకూ కూడా ఎక్కడా ఆడినట్టు మనం చూడలేదు.  హాలీవుడ్ సినిమాలే మన గల్లీల్లో కూడా ఆడతాయి. 
        
    ఈ సినిమాల్లో కథనం హాలీవుడ్ లాగా సంఘటనలతో సాగదు, డైలాగులతో నిదానంగా సాగుతుంది. హాలీవుడ్ లాగా యాక్టివ్ పాత్రలు ఎప్పుడో గానీ వుండవు. భావాలు హాలీవుడ్ లాగా డైలాగులతో పలకరు, ముఖభావాల మీద ఫోకస్ చేసి పలకని మాటలు అర్ధం జేసుకోమంటారు. హలీవుడ్ లాగా కథకి స్ట్రక్చర్ వుండదు. పర్సనల్ సినిమాలు కాబట్టి. ‘ఓటర్’ గారి ఫీలింగ్సే సినిమాలుగా వుంటాయి. ఈ వరల్డ్ మూవీస్ పైన స్క్రీన్ ప్లే పుస్తకాలుండవు. స్ట్రక్చర్ అనేది వుంటే కదా? స్క్రీన్ ప్లే పుస్తకాలన్నీ హాలీవుడ్ సినిమాల గురించే వుంటాయి. 
        
    మరి ఇంతా చేసి యూరప్ అంతటా అక్కడి  వరల్డ్ మూవీస్ ఆడేదెంతా అంటే,  అక్కడ 80 శాతం మార్కెట్ ని హాలీవుడ్ సినిమాలే రాజ్యమేలుతున్నాయి. అందుకని హాలీవుడ్ సినిమాలు విశాల ప్రాతిపదికన ప్రపంచవ్యాప్తంగా ఆడాలి కాబట్టి,  అక్కడి స్టూడియోలు నిర్మాణ బాధ్యతల్ని ఒక్క ‘ఓటర్’ చేతిలో  పెట్టేయవు. ఒక దర్శకుడు, కథ ఇచ్చిన స్క్రీన్ ప్లే రచయిత, మరికొందరు  డెవలప్ మెంట్  రచయితలూ, స్టూడియో ఎగ్జిక్యూటివ్ లూ, మార్కెట్ నిపుణులూ మొత్తం కలిసి మహా ‘హుండీ’ యాగం నిర్వహిస్తారు. హుండీ ముఖ్యం. ఏ వొక  ‘ఓటర్’ కపాల మోక్షమో కాదు.
        
    అదృష్టవశాత్తూ తెలుగు సినిమాలు  ఒక చిన్న తెలంగాణా ప్రాంతం, ఇంకో ఒక చిన్న కోస్తాంధ్ర ప్రాంతం, మరింకో  చిన్న రాయల సీమ ప్రాంతమని విడివిడిగా,  చిన్న చిన్న ఏరియాలుగా విడిపోయి లేవు. అలా వుంటే యూరప్ లో చిన్న చిన్న ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్ దేశాల నేటివ్ జీవితాల వరల్డ్ మూవీస్ లాగే  ‘ఓటర్’  సినిమాలే వర్కౌట్ అవచ్చు. అలాలేదు. సినిమాల విషయంలో తెలుగు ప్రజలందరిదీ ఒకే అభిరుచి. అది కమర్షియల్ అభిరుచి. మరి హాలీవుడ్ అంత కాకపోయినా, హాలీవుడ్ లాగే వ్యాపారాత్మకంగా అన్ని ప్రాంతాల తొమ్మిది పది కోట్లమంది  తెలుగు ప్రేక్షకులకి కమర్షియల్ సినిమాలు అందించాలంటే, ఇప్పుడు కొనసాగుతున్న ‘ఓటర్’ సాంప్రదాయంలో, ఆ దర్శకుడు ఏ స్థాయి సినిమా కథకుడై  వుండాలి?

ఇన్పుట్స్  ఎక్కడ? 
        కేవలం సినిమాలు చూస్తూ సినిమా కథకులు కాలేరు. అందునా వరల్డ్ మూవీస్ చూసి కమర్షియల్ కథకులు కాలేరు. నాటకాలు చూసినా ఆ చూసే ప్రత్యక్ష డ్రామా వల్ల కమర్షియల్ రచన రాణించే అవకాశముంది. కమర్షియల్ సినిమాలు తీయాలనుకుంటే పక్కా కమర్షియల్ సినిమాలే చూడాలి. కళాత్మక సినిమాలకంటే, వరల్డ్ మూవీస్ కంటే కమర్షియల్ సినిమాలు తీయడమే కష్టం. కమర్షియల్ సినిమాలతో పండిత పామరులందనీ వినోదపర్చాల్సి వుంటుంది. కమర్షియల్ సినిమాలు చూస్తే డేటా బ్యాంక్ కి ఉపయోగపడాలి. కొన్ని స్క్రీన్ ప్లే పుస్తకాలూ, కొన్ని డౌన్ లోడ్ చేసుకున్న సినిమాలూ ఇవి మాత్రమే లైబ్రరీ అన్పించుకోవు. బ్యాకప్ గా డేటా బ్యాంక్ వుండాలి. డేటా బ్యాంక్ వుండాలంటే చదవడానికి కొంత టైము కేటాయించుకోవాలి. ఇక్కడే వస్తోంది సమస్య. అసలేమీ చదవరని ఒక సీనియర్ రచయిత విసుక్కున్నారు. అసలు ఇంగ్లీషు పరిజ్ఞానమే వుండదని ఒక సినిమా విమర్శకుడు విమర్శించారు. ఈ రెండూ సీరియస్ సమస్యలే ఇన్పుట్స్ కి. ఈ వ్యాసకర్త ఒక డిస్కషన్లో ఓ దర్శకుడుకి చెప్పిన కామెడీ సీక్వెన్సుని,  అక్కడున్న ఇంకో కథకుడు వేరేచోట తీసికెళ్ళి అమ్మేశాడు. ఆ  పెద్ద సినిమాలో ఆ సీక్వెన్స్ హిట్టయ్యింది. వేరే ఆఫీసులో ఈ వ్యాసకర్తే  రాస్తున్న సీన్లని అక్కడున్న కథకుడు కాపీ చేసుకుని పై అంతస్తులోనే వున్న వేరే ఆఫీసులో ప్రతిరోజూ చేరవేస్తూంటే ఒకరోజు పట్టుకున్నారు. ఇన్పుట్స్ లేకపోవడం వల్లే ఇలాటివి చేసే ఖర్మ పడుతుంది. వీళ్ళని చూస్తే నవ్వొస్తుంది – అడిగితే మనమే కావాల్సినన్ని ఇన్పుట్స్ ఇస్తాంగా? పని చేస్తున్న సినిమాలకే  ద్రోహం చేయడమెందుకు?  ఒకసారి ద్రోహి ఇంకెప్పటికీ అచ్చోసిన ద్రోహియే. 
         
    ఇప్పటికిప్పుడు కథకుల్లో జర్నలిస్టు అంశ పుట్టుకు రావాలంటే రాదు. అది దాదాపు పుట్టుకతోనే వుంటుంది. కాకపోతే కనీసం ఇప్పుడు ఆపద్ధర్మంగా జిజ్ఞాస అయినా పెంచుకుంటే కొంతలో కొంత బెటర్. శోధన అనేది నిత్య కార్యక్రమం అవ్వాలి. నీరవ్ మోడీ పారిపోయిన రోజు చానెల్లో ఒక క్యాబ్ వాలా బాధ వెళ్ళబోసుకున్నాడు. తన క్యాబ్ ఈఎంఐకి ఒక్క రూపాయి తక్కువ కట్టినందుకు  సీజ్ చేస్తామని బ్యాంకు వాళ్ళు నోటీసులిచ్చారని లబలబ లాడేడు. దీనికి నవ్వూ రావొచ్చు, కోపంతో తిట్టుకోనూ వచ్చు. ఇది సాధారణ ఓటర్లు చేసే పని. కానీ సినిమాలు తీసే ‘ఓటర్’ ఏం చేయాలి? ఓట్లేసే ఓటర్లలాగా తనుకూడా నవ్వుకునో తిట్టుకునో వదిలెయ్యాలా? అలా చేస్తే అతడికి సినిమాల గురించి మాట్లాడే అర్హత వుండదు.  వెంటనే నోట్ చేసుకుని డేటా బ్యాంకులో పెట్టుకోవాలి. తను స్వార్ధంతో వుండాలి. చూసే, వినే, చదివే ప్రతీదీ, రాసే – తీసే సినిమాల దృష్టితోనే వుండాలి. ఇది మనకి పనికొస్తుందా అని పరిశీలించి,  పనికొస్తుందనిపిస్తే డేటా బ్యాంకుకి పంపాలి. న్యూస్ పేపర్ విధిగా చదవాల్సి వుంటుంది. ఏదో పైపైన చదివేస్తే కాదు. అండర్ లైన్లు చేసే దృష్టితో పెన్ను పట్టుకుని చదవాలి. లైట్ రీడింగ్ మెటీరియల్ లాగా కొన్ని వార్తలు మాత్రమే చదివితే కాదు. ఎడిట్ పేజీ వ్యాసాలూ కూడా చదివితే వివిధ అంశాలపైన అభిప్రాయాలు తెలుస్తాయి. అలాగే పత్రికల్లో కథలూ ఇతర ఆర్టికల్సూ తప్పవు. ఇవన్నీ డేటా బ్యాంకు అవుతాయి. డేటా బ్యాంకు వున్న కథకుడు మంచి ఆస్తిపరుడు. 
        
    ఇదంతా ఒకెత్తు అయితే డిజిటల్ ప్లాట్ ఫాం ఒకెత్తు. ఇవ్వాళ వచ్చిన ఒక కథ ఐడియాకి సంబంధించి ఏది తెలుసుకోవాలన్నా ఇంటర్నెట్ ని మించిన వనరు లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఎందరో జర్నలిస్టులు, రచయితలూ అహర్నిశలూ పనిచేస్తూ వెబ్ సైట్స్ ద్వారా అందిస్తున్న సమాచారం మనకి ఉత్తపుణ్యాన లభిస్తోంది. లేని అంశమంటూ లేదు. రోమాన్స్ ఎలాటి పోకడలు పోతోందో, బ్రేకప్స్ ఎన్ని విధాలుగా జరుగుతున్నాయో ప్రతీదీ అప్డేట్ అవుతూ వుంటాయి. లవర్స్ ఇంకెలాటి కొత్తకొత్త సమస్యలెదుర్కొంటున్నారో, వాటికి పూజాబేడీ లాంటి వాళ్ళు చెప్పే పరిష్కారాలేమిటో చదువుకుంటే,  మూస ప్రేమ డ్రామాలకి ఎలా తెరదించవచ్చో తెలుస్తుంది. 
        
    డేటాబ్యాంక్ సృష్టించుకోవడానికి యాప్స్ వున్నాయి. క్లిపిక్స్, పాకెట్ మొదలైనవి. వివిధ వెబ్ సైట్లలో కావాల్సిన ఆర్టికల్స్ ని అప్పటికప్పుడు క్లిప్ చేసి ఈ యాప్ లో సేవ్ చేసుకుంటే అరచేతిలో ఇన్పుట్స్ వున్నట్టే. టాపిక్స్ వారీగా వీటి బాక్సుల్లో సేవ్ చేసుకోవచ్చు. ఇవేకాక లోర్ ఫోర్జ్ అనే రైటర్ రిసోర్సెస్ యాప్ వుంది. ఇందులో చాలా జనరేటర్లు వుంటాయి. ముఖ్యంగా ప్లాట్, మోటివ్, కాన్ ఫ్లిక్ట్ జనరేటర్లు, క్యారక్టర్ టైప్స్, ఇన్ స్పిరేషన్, ఐడియా జనరేటర్లు మొదలైనవి. 
       
    రాయలేక పోవడానికి  కారణమొక్కటే, చదవకపోవడం. కొత్తగా రాయలేకపోవడానికి కారణమొక్కటే, చదవకపోవడం. చూసిన సినిమాలే చూసి ఆ పాత మూసే రాయడానికి కారణమొక్కటే, చదవకపోవడం. చదివితే మెదడుకి బాగా ఎక్కుతుంది. అదిక వూరుకోదు. ప్రాసెస్ చేసుకుంటూ వుంటుంది. ఎప్పుడో ఎక్కడో అవసరమొచ్చి ఆలోచిస్తూంటే,  అది యాప్ లో సేవ్ చేశావ్ చూసుకో ఫో అని గుర్తుచేస్తుంది. మనం యాప్ ని క్లిక్ చేస్తాం. ఇంతే, చాలా సింపుల్. ఈ మాత్రం దానికి రూమ్మేట్స్ తో, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ తో గరీబోళ్ళలాగా చొక్కాలు చించుకోవాలా? చుట్టూ ప్రపంచాన్ని, తీసే సినిమాల కోసం సమాచార కక్కుర్తితో చూడని కథకుడికి,  తన మనసులో గరీబీ హటావో ఎప్పుడుంటుంది?.

సికిందర్


31, ఆగస్టు 2022, బుధవారం

1201 : స్పెషల్ ఆర్టికల్

 

సెప్టెంబర్ 9 న విడుదల కానున్న రణబీర్ కపూర్ బ్రహ్మాస్త్ర: శివ - పార్ట్ వన్ కూడా బాయ్ కాట్ బారిన పడింది. ఈ మధ్య విడుదలవుతున్న ఏ హిందీ సినిమానీ  వదలడం లేదు కొత్తగా పుట్టుకొచ్చిన బాయ్ కాట్ బృందాలు. ఇదంతా పథకం ప్రకారం జరుగుతోందనొచ్చు. సెక్యులర్ బాలీవుడ్ ని దెబ్బ తీయాలని. ఆ మాట కొస్తే ఏ సినిమా రంగమైనా సెక్యులర్ గానే వుంటుంది. లేకపోతే ఏనాటిదో షోలేలో ముస్లిం పాత్రని ఉదారవాదిగా చూపించారని ఇప్పుడెందుకు బాయ్ కాట్ అవుతుంది. ఈ బహిష్కరణ పిలుపులకి బాలీవుడ్ నోరెత్తకుండా మౌనంగా వుంటోంది. నోరెత్తితే వాళ్ళ సినిమాలు బాయ్ కాట్ లిస్టులో చేరిపోతున్నాయి. తాప్సీ, అనురాగ్ కశ్యప్ నోరెత్తారని వాళ్ళ దొబారా సినిమా బాయ్ కాట్ అయిపోయింది. లాల్ సింగ్ చద్దా బావుందని హృతిక్ రోషన్ అనేసరికి అతడి రానున్న విక్రమ్ వేద బాయ్ కాట్ అయిపోయింది.

       బాయ్ కాట్ ట్రెండ్ కి మౌనంగా వుండరాదని అర్జున్ కపూర్ నోరెత్తాడని అతడి రాబోయే కుత్తే బాయ్ కాట్ గండంలో పడింది. తాజాగా సునీల్ శెట్టి నోరు విప్పాడు. ఈయన కూడా కాచుకోవాలి. రాబోయే షారుఖ్ కాన్ పఠాన్ కూడా బాయ్ కాట్ అయింది. కారణం ఇతడి కొడుకు డ్రగ్ స్మగ్లర్ అని. కానీ ఆ కేసులో కొడుకుని ఇరికించారని తేలిపోయినా అబద్ధాలతో బాయ్ కాట్ అయిపోతోంది. బాయ్ కాట్ కి వ్యతిరేకంగా వున్నాడని ఆఖరికి మోడీ భక్తుడు అక్షయ్ కుమార్ రక్షాబంధన్ కి కూడా బాయ్ కాట్ వేటు పడింది. ఇక అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా సంగతి సరే!

ఇప్పుడు విడుదలకి సిద్ధమైన అత్యంత ఖరీదైన బ్రహ్మాస్త్ర వంతు వచ్చింది. ఇందులో హీరోయిన్ ఆలియా భట్ నటించిన డార్లింగ్స్ ఇటీవలే విడుదలయ్యింది. ఈ సందర్భంగా నేను నచ్చకపోతే నా సినిమా చూడకండి అనేసింది. దీంతో ఆమె నటించిన బ్రహ్మాస్త్ర బాయ్ కాట్ అయిపోయింది. ఈమెతో బాటు హీరో రణబీర్ కపూర్, దర్శకుడు అయాన్ కపూర్ పాత నేరాలు కూడా బాయ్ కాట్ కి కారణమయ్యాయి.  

ప్రతీ స్టార్ మీదా కన్నేసి, వాళ్ళ గతాన్ని తవ్వి తీసి బాయ్ కాట్ కి ఆయుధంలా వాడుకుంటున్నారు. అమీర్ ఖాన్ 2015 లో తన భార్య ఈ దేశంలో అభద్రత ఫీలవుతోందని చెప్పిన మాట పట్టుకుని ఇప్పుడు  లాల్ సింగ్ చద్దా ని బాయ్ కాట్ చేశారు. ఆ భార్య హిందువే. అలాగే పీకే లో హిందూ దేవుళ్ళని అవమానించాడని కూడా బాయ్ కాట్ చేశారు. పీకే నిర్మాత, దర్శకుడు, రచయిత హిందువులే.

ఇప్పుడు రణబీర్ కపూర్ పాత నేరం : తను బీఫ్ తింటానని ఏనాడో ఒక మాట చెప్పడం. దీంతో బ్రహ్మాస్త్ర బాయ్ కాట్ అయిపోయింది. రణబీర్ కపూర్ గురించి ఒక బ్లాగర్ పోస్ట్ చేసిన పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో సదరు బ్లాగర్, రణబీర్ కపూర్ లంచ్ చేస్తూంటారు. అప్పుడు రణబీర్ కపూర్ ఐయాం ఏ బిగ్ బీఫ్ గై (నేను పెద్ద బీఫ్ గాణ్ణి) అన్నాడు.

దీన్ని పట్టుకుని బాయ్ కాట్ బ్రహ్మాస్త్ర ట్రోలింగ్ మొదలెట్టారు. రణబీర్ కపూర్ బీఫ్ ఖాతా హై. యే  బ్రహ్మాస్త్ర కా హీరో హై. బాయ్ కాట్ బ్రహ్మాస్త్ర (రణబీర్ కపూర్ బీఫ్ తింటాడు. ఇతను బ్రహ్మాస్త్ర హీరో. బాయ్ కాట్ బ్రహ్మాస్త్ర) అని ట్రెండ్ అవుతోంది.  

అయాన్ ముఖర్జీ పాత నేరం : 2019 లో ఇంస్టాగ్రాంలో ఒక పోస్ట్. డ్రాగన్ బ్రహ్మాస్త్రంగా మారింది, రణబీర్ కపూర్ పాత్ర పొడవాటి శిరోజాలతో రూమీ (సూఫీ కవి జలాలుద్దీన్ రూమీ) లాగా వుంటుంది, శివుడు కాదు అని రాశాడు!

రూమీ! మొదట అతను రూమీ. పొడవాటి జుట్టుతో రూమీ. ఈ గెటప్ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ టెస్ట్ నుంచి వచ్చింది. ప్రేమనేది మీకూ మీతో ప్రతిదానికీ మధ్య వారధిలాంటిదని అన్నాడు రూమీ. ఈ ఫీలింగునే ఆధారంగా చేసుకుని రణబీర్ కపూర్ పాత్రని తీర్చిదిద్దాం. కానీ ఆ తర్వాత కొత్త ప్రేరణ, కొత్త ఆలోచనలు వచ్చాయి... డ్రాగన్ ని బ్రహ్మాస్త్రంగా మార్చి రణబీర్ పాత్రకి అందించాం. రణబీర్ గెటప్ మార్చాం. దాంతో రూమీ శివుడు అయ్యాడు అని ఇంస్టాలో పోస్ట్ చేశాడు ముఖర్జీ. నేరకపోయి ఇరుక్కోవడమంటే ఇదే!

ఆమె తను నచ్చకపోతే తన  సినిమా చూడకండి అంటుంది, ఆయన బీఫ్ తింటానంటాడు, ఈయన డ్రాగన్ ని బ్రహ్మాస్త్రంగా మార్చి, రూమీని శివుడు చేశానంటాడు!

ఇన్ని నేరాలు చేశాక ఇక సినిమా వుంటుందా? ఒక నెటిజన్ ట్విట్టర్ లో గొడ్డు మాంసం వ్యక్తిని బహిష్కరించాలన్నాడు. మరికొందరు సినిమాని బహిష్కరించడం సబబు కాదని వాదిస్తూ మద్దతుగా ట్వీట్ చేశారు. అతనేం తింటాడో అతనిష్టం - అన్నారు. కనీసం మన చరిత్రపై సినిమా తీయడానికి ఏదో ఒకటి చేస్తున్నాడు కదా అని ఇంకో నెటిజన్  అయాన్ ముఖర్జీని ఓదార్చాడు.

ఇంకో నెటిజన్ ఇలా ట్వీట్ చేశాడు- బ్రిటిష్ పౌరురాలు అలియా భట్ హిందూ వ్యతిరేక, భారతదేశ వ్యతిరేక వ్యక్తుల కుటుంబం నుంచి వచ్చింది. తండ్రి మహేష్ భట్ బాహాటంగా హిందూ వ్యతిరేకి. 26/11 టెర్రర్ దాడి ఆరెస్సెస్ కుట్ర అని అతను పేర్కొన్నాడు. అతడి సోదరుడు రాహుల్ భట్ కి ఈ టెర్రర్ దాడి నిందితుల్లో ఒకడైన డేవిడ్ హెడ్లీతో సంబంధాలున్నాయి

పాత నేరాలకి క్షమాపణలు చెప్పినా వదలడం లేదు. అమీర్ ఖాన్ క్షమాపణ చెప్పినా వదల్లేదు. ఇప్పుడు విజయ్ దేవరకొండనీ వదలడం లేదు. శుభమా అని పానిండియాలో పాదం మోపుతూ విజయ్ తనకి సంబంధం లేని బాయ్ కాట్ ట్రెండ్ లో తలదూర్చి ఎడాపెడా కామెంట్లు చేశాడు. తనూ బాయ్ కాట్ అయిపోయాడు.

దీంతో ముంబాయిలో ఒక థియేటర్ ఓనర్ విజయ్ మీద విరుచుకుపడ్డాడు. విజయ్ వల్ల లైగర్ షోలకి థియేటర్ ఖాళీగా వుంటోందని. వెంటనే విజయ్ ముంబాయి వెళ్ళి ఓనర్ కి పాదాభివందనం చేసి మరీ క్షమాపణలు చెప్పాడు. కానీ అసలతను అలాటి సినిమాలో నటించినందుకు ప్రేక్షకులకి క్షమాపణలు చెప్పాలి. లైగర్ బాయ్ కాట్ అయినా, కాక పోయినా ఫ్లాపయ్యేదే.

ఈ బాయ్ కాట్ మేనియా ఇంకెంత కాలం సాగుతుందో తెలీదు. దీన్ని ఎదుర్కొంటూ కనీసం హీరోల ఫ్యాన్స్ కూడా రంగంలోకి దిగడం లేదు. ప్రస్తుతం బాలీవుడ్ జీవులు నోరు విప్పకుండా తమ పని తాము చేసుకుపోవడమే మంచిదేమో. అలాగే ఏవో చేసి అవి పాతనేరాలుగా రికార్డు అవకుండా చూసుకోవడం మంచిది.
***

 


30, ఆగస్టు 2022, మంగళవారం

1200 : స్పెషల్ ఆర్టికల్

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బీ ఐ) ఇటీవల రీసెర్చి నివేదిక వెల్లడించింది. 2023 నాటి కల్లా దేశంలో మల్టీప్లెక్సులు మూతబడతాయని! దేశవ్యాప్తంగా మల్టీప్లెక్సులు విస్తరించించి వ్యాపారాలు చేసుకుంటున్న కార్పొరేట్ కంపెనీల గుండెల్లో రాయి పడే వార్త ఇది. ఇప్పటికే కోవిడ్ సమయం నుంచి ప్రారంభమయిన నష్టాల నుంచి కోలుకోవడం లేదు. కోవిడ్ సమసిపోయినా ప్రేక్షకులు థియేటర్లకి రావడం లేదు. స్టార్ సినిమాలకి నెమ్మదిగా రావడం ప్రారంభించినా చిన్న, మధ్య తరహా సినిమాలకి పూర్తిగా మొహం చాటేశారు. హిందీలో స్టార్ సినిమాలనైతే ప్రేక్షకులు అసలు పట్టించుకోవడం లేదు. ఇక పానిండియా సినిమాలంటూ సౌత్ నుంచి వస్తున్న కొన్ని సినిమాలనే కరుణిస్తున్నారు. అది కూడా బావుంటేనే. రాధేశ్యామ్’, లైగర్ వంటి బాగాలేని పానిండియాల్ని ఇంటికి పంపించేశారు- అంటే ఓటీటీకి.

        ది చాలనట్టు ప్రతీ హిందీ సినిమాకీ ఏదో వంక పెట్టుకుని సోషల్ మీడియాలో బాయ్ కాట్ ట్రెండ్ నడిపిస్తున్నాయి కొన్ని శక్తులు. దీని దెబ్బకి లాల్ సింగ్ చద్దా కూడా చిత్తయిపోయింది. ఇప్పుడు సెప్టెంబర్ 9 న విడుదలవుతున్న బ్రహ్మాస్త్ర ని కూడా బాయ్ కాట్ చేస్తూ బయల్దేరింది ట్రోల్ ఆర్మీ. వీళ్ళు ఎక్కడిదాకా పోయారంటే, ఎప్పుడో 47 ఏళ్ళనాటి షోలే ని కూడా బాయ్ కాట్ చేస్తూ నిన్నటి నుంచి ట్రోలింగ్ మొదలెట్టారు!

ఇలా సినిమాలకి కోవిడ్, ట్రోలింగ్ సమస్యలతో బాటు, రెట్టింపయిన టికెట్ల ధరలు ప్రేక్షకుల్ని వెనక్కి పంపేస్తున్నాయి.

ఇంతేకాదు, దేశవ్యాప్తంగా 22 అతి పెద్ద మాల్స్ ని మూసేయడానికి నిర్ణయం తీసుకుంటున్నారు. కోవిడ్ సమయం నుంచి జనం షాపింగ్ కి మాల్స్ కి వెళ్ళడం లేదు. మాల్స్ లో వుండే వివిధ వ్యాపారాలు తీవ్ర నష్టాల్లో వున్నాయి. ఈ పరిస్థితి హైదరాబాద్ లోనూ వుంది. మాల్స్ లోనే మల్టీప్లెక్సులు వుంటాయి. మల్టీప్లెక్సులకి జనం రావడం లేదు. తప్పీజారి వస్తే క్షవరం తప్పడంలేదు. మొన్న తెలుగు 'లైగర్' చూసిన ఉత్తమ ప్రేక్షకుడు 800 వదిలించారని లబోదిబో మన్నాడు. టికెట్టు 400 + తినుబండారాలు 400 !

మల్టీప్లెక్సుల నిర్వహణా వ్యయం పెరిగిపోవడం వల్ల తినుబండరాల ధరలు రెట్టింపు చేయక తప్పలేదని పీవీఆర్ మల్టీప్లెక్స్ గ్రూప్ ఛైర్మన్ సెలవిచ్చాడు. కాబట్టి తినుబండరాలు కూడా సమస్యల లిస్టులో చేరాయన్నమాట.

ఇదంతా కాదు, అసలు సమస్య వేరే వుంది. ఇందుకే గుండెల్లో రాళ్ళు పడుతున్నాయి మల్టీప్లెక్స్ కంపెనీలకి. ఎస్బీఐ రిపోర్టు ఏమంటోందంటే, ఒకప్పుడు మల్టీప్లెక్సులు వచ్చేసి వీసీఆర్/వీసీపీ/వీసీడీల పరిశ్రమ ఎలా మూతబడిందో, అలా ఇప్పుడు ఓటీటీ వచ్చేసి మల్టీప్లెక్సుల రంగాన్ని మూత పెట్టేస్తుందని. అదీ 2023 కల్లా! ఓవర్-ది-టాప్ లేదా ఓటీటీ  మార్కెట్ 2023 నాటికి రూ. 11,944 కోట్లకి  చేరుకుంటుందని ఎస్బీఐ అంచనా వేసింది. ఇది 2018 లో రూ. 2,590 కోట్లు మాత్రమే వుంది.

1980లలో విజృంభించిన వీసీఆర్/వీసీపీ/వీసీడీల పరిశ్రమ 2000 కల్లా కాలగర్భంలో కలిసిపోయింది. 2000 ప్రారంభం నుంచి మెట్రో నగరాల్లో/పట్టణ ప్రాంతాల్లో మల్టీప్లెక్సులు విపరీతంగా పెరిగాయిఓటీటీ రంగం ఇప్పటికే వినోద పరిశ్రమ నుంచి 7-9 శాతం రెవెన్యూని లాగేసుకుంది. ఇది వృద్ధి చెందుతూ పోతోంది. ఓటీటీ రంగంలో అన్ని  భాషల్లో 40 ఓటీటీ కంపెనీలు కంటెంట్ ని అందిస్తూ వుండడంతో ప్రేక్షకులు ఇటు మొగ్గు  చూపుతున్నారు.

ప్రస్తుతం ఓటీటీ కంపెనీలకి 45 కోట్ల మంది చందా దారులున్నారు. ఈ బలమైన వృద్ధికి సరసమైన హై-స్పీడ్ మొబైల్ ఇంటర్నెట్ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య రెట్టింపు కావడండిజిటల్ చెల్లింపులని స్వీకరించడం వల్ల, ఇది 2023 చివరి కల్లా 50 కోట్లకి పెరిగే అవకాశముంది. మన దేశంలో గ్లోబల్ కంపెనీల చందాదారుల సంఖ్య చూస్తే డిస్నీ హాట్ స్టార్ 14 కోట్లు, అమెజాన్ ప్రైమ్ వీడియో 6 కోట్లు, నెట్ ఫ్లిక్స్ 4 కోట్లు, జీ 5 3.7 కోట్లు, సోనీలివ్ 2.5 కోట్లు వుంది. ఈ కంపెనీలు అమెరికాలో కంటే 70-90 శాతం చౌకగా  ప్లాన్స్ ని అందిస్తున్నాయి.

50 శాతం కంటే ఎక్కువ మంది ప్రజలు నెలకి 5 గంటల కంటే ఎక్కువ సమయం ఓటీటీ ని ఉపయోగిస్తున్నందున, ఓటీటీ పెరుగుదల థియేటర్ల ఆదాయాలని తినేస్తోంది. ఇంకా చెప్పాలంటేసినిమాల కంటే స్ట్రీమింగ్ సిరీస్‌లు రూపొందించుకోవడం లాభదాయకమని ప్రధాన స్టూడియోలు గ్రహిస్తున్నాయి. దీనికి తమ సొంత  స్ట్రీమింగ్ ప్లాట్‌ ఫామ్స్ ని ఏర్పాటు చేసుకోవాలని భావిస్తున్నాయి.  స్మార్ట్ టీవీలు, క్రోమ్‌కాస్ట్ వంటి టెక్నాలజీలు థియేటర్ల మీద ఎక్కువ ప్రభావం చూపిస్తున్నాయి. కాలం ముందుకు వెళుతున్నప్పుడు విద్యఆరోగ్యంఫిట్నెస్ రంగాల్లో ఓటీటీ వేదికలు విస్తరణనీ, భవిష్యత్తునీ మరింత సుస్థిరం చేసుకుంటాయని భావిస్తున్నారు. దీనికి తగ్గట్టు ప్రేక్షకులు కూడా ఓటీటీని వినోద మాధ్యమంగా మాత్రమే చూడడం లేదు. ఇన్ఫోటైన్మెంట్ (సమాచారం + వినోదం) మాధ్యమంగానూ చూస్తున్నారు.

దెబ్బకి దెబ్బ!

ఇదంతా అలా వుంచితే, రెండు పెద్ద మల్టీప్లెక్స్ గ్రూపులు పీవీఆర్, ఇనాక్స్ లు సినిమా వ్యాపారాన్ని పునర్నిర్వచించడానికి విలీనమవుతున్నాయి. ఓటీటీని బీట్ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఇది చిన్న స్క్రీన్‌కి వ్యతిరేకంగా పెద్ద స్క్రీన్ బలమైన పోరాటమని అభివర్ణించుకుంటున్నాయి. ఓటీటీ కంపెనీలు నిజంగా పెద్దవనీ, వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద చెక్కు బుక్కులు వున్నాయనీ, కోట్లకి కోట్లు గుమ్మరించి సినిమాలు కొంటున్నారనీ, దీన్ని తట్టుకునేందుకు మల్టీప్లెక్స్ రంగాన్ని మరింత ఆధునీకరించి- ప్రేక్షకులు సినిమా చూసే అనుభవాన్ని ద్విగుణీకృతం చేయాలని వ్యూహాలు పన్నుతున్నాయి.

తమ రెండు గ్రూపులు కలిసి రావడం ద్వారాతమ  మార్కెట్‌ కి ఇంటి వెలుపల వినోదానికి  అత్యంత ముఖ్యమైన రూపమైన ఎగ్జిబిషన్ రంగాన్ని మరింత అభివృద్ధి చేయడం ద్వారా, తాము  మరింత బలపడతామని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇది నిర్మాతలు తమ సినిమాల  విడుదలల్ని ప్లాన్ చేసే విధానంపై ఖచ్చితంగా ప్రభావం చూపుతుందని నమ్ముతున్నాయి. తమది బ్లాక్ బస్టర్ విలీనమని బల్లగుద్ది చెప్తున్నాయి.

ఈ రెండు గ్రూపులు ఏకమైతే దేశంలో దాదాపు 60 శాతం మల్టీప్లెక్స్ స్క్రీన్లు వీటి చేతిలో వుంటాయి. దేశంలో దాదాపు 3000 మల్టీప్లెక్స్ స్క్రీన్‌లు వున్నాయని పరిశ్రమ వర్గాలు అంచనాలు సూచిస్తున్నాయి. పీవీఆర్ ప్రస్తుతం 73 నగరాల్లో 181 ప్రాపర్టీలలో 871 స్క్రీన్స్ ని నిర్వహిస్తోంది. ఐనాక్స్ 72 నగరాల్లోని 160 ప్రాపర్టీలలో 675 స్క్రీన్స్ ని  నిర్వహిస్తోందివిలీనం తర్వాత ఈ సంయుక్త సంస్థ 109 నగరాల్లోని 341 ప్రాపర్టీలలో 1,546 స్క్రీన్స్ ని  నిర్వహిస్తున్న దేశంలోనే అతి పెద్ద మూవీ ఎగ్జిబిషన్ కంపెనీగా అవతరిస్తుంది.

ఇంతే కాదు, విస్తరణ ప్రణాళికలు కూడా వున్నాయి. పీవీఆర్ - ఐనాక్స్ విలీన సంస్థ రెండవ, మూడవ శ్రేణి నగరాల్లో విస్తరణపై బలమైన దృష్టితో, సంవత్సరానికి 200 స్క్రీన్స్ ని  జోడించడాన్ని పరిశీలిస్తోంది. ప్రకటిత లక్ష్యం రాబోయే ఏడు సంవత్సరాలు కొనసాగుతుంది. దీనికి కనీసం రూ. ₹4000 కోట్ల పెట్టుబడి అవసరం. ఇలా ఓటీటీతో బిగ్ ఫైట్ కి కండలు పొంగిస్తోంది గ్రూపు. ఒకవైపు 2023 కల్లా మల్టీప్లెక్సులు ఖల్లాస్ అని రిపోర్టు, మరో వైపు బిగ్ ఫైట్ కి కసరత్తు. చూడాలి ఎమౌతుందో. ఈ ఫైట్ లో ప్రేక్షకులు ఎటువైపు వుండాలని తేల్చుకుంటారో జవాబు దొరకని ప్రశ్న!

***

 

          

29, ఆగస్టు 2022, సోమవారం

1199 : బాలీవుడ్ ఆర్టికల్

ప్పుడు బాలీవుడ్ లో అందరి కళ్ళూ బ్రహ్మాస్త్ర : పార్ట్ వన్- శివ మీదే వున్నాయి. లాక్ డౌన్ తర్వాత ప్రేక్షకులు థియేటర్లకి రాకపోవడంతో వరస ఫ్లాపులెదుర్కొన్న బాలీవుడ్ ఇప్పుడైనా ప్రేక్షకుల దర్శన భాగ్యం కలగక పోతుందా అన్న ఆశతో వుంది. పైగా సౌత్ సినిమాల తాకిడికి విలవిల లాడుతున్న బాలీవుడ్ కి తగిన సమాధానం చెప్పగల అస్త్రంగా  బ్రహ్మాస్త్ర కన్పిస్తోంది. నాల్గేళ్ళుగా నిర్మాణంలో వుండి సెప్టెంబర్ 9 న విడుదలకి సిద్ధమవుతోంది. హిందీ తెలుగు తమిళ మలయాళ కన్నడ భాషల్లో బ్రహ్మాండమైన విడుదలకి సన్నాహాలు చేస్తున్నారు. హీరో రణబీర్ కపూర్ ప్రోమో కార్యక్రమాలు చేపట్టి వివిధ రాష్ట్రాలు పర్యటిస్తున్నాడు. రూ. 350 కోట్ల భారీ బడ్జెట్ తో బాలీవుడ్ నుంచి ఇప్పటివరకు వచ్చిన అత్యంత ఖరీదైన మెగా మూవీ ఇది. స్పిరిచ్యువల్ ఫాంటసీ -అడ్వెంచర్ థ్రిల్లర్ గా వున్న ఈ క్లాస్- మాస్ కమర్షియల్  ప్రేక్షకుల్ని తప్పకుండా థియేటర్ల బాట పట్టిస్తుందని నమ్ముతున్నారు.

        హిందీ నిర్మాతలు సింగిల్ స్క్రీన్ థియేటర్లని నిర్లక్ష్యం చేసి మల్టీప్లెక్స్ ప్రేక్షకుల కోసం సినిమాలు తీయడంతో, సింగిల్ స్క్రీన్ మార్కెట్ ని కూడా సౌత్ సినిమాలు వశపర్చుకున్నాయి. ఇప్పుడు బ్రహ్మాస్త్ర సింగిల్ స్క్రీన్ సినిమా లక్షణాలతో కూడా వుంది గనుక ఈ సెగ్మెంట్ లో కూడా వ్యాపారం చేసుకుంటుందని లెక్కలు కడుతున్నారు.

షోమాన్ రాజ్ కపూర్ మనవడు రణబీర్ కపూర్ నటించిన గత 8 సినిమాల్లో రెండే హిట్టయ్యాయి. ఇప్పుడు బ్రహ్మాస్త్ర లో హీరోయిన్ అలియా భట్ తో జత కట్టి వస్తున్నాడు. ఇంకా భారీ తారాగణముంది- అమితాబ్ బచ్చన్, నాగార్జున, అతిధి పాత్రలో షారూఖ్ ఖాన్ మొదలైన స్టార్లు.

బ్రహ్మాస్త్ర కథని లీకు వీరుల కోసమేం దాచిపెట్టలేదు. నిర్మాతలే కథని కూడా ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే ఇక స్టార్ల పేరు చెప్పుకుని ప్రమోషన్లు నిర్వహిస్తే  ప్రేక్షకులు నమ్మే స్థితిలో లేరు. స్టార్ సినిమా కదాని పోతే గత వారం లైగర్ కూడా జాడించి తన్నింది ప్రేక్షకుల్ని. అందుకని విషయం (కథ) చెప్పేస్తూ ప్రమోషన్లు చేస్తున్నారు. విషయం చెప్పాలంటే విషయంలో విషయం వుండాలి. విషయం లేకపోతే విషయం చెప్పే ధైర్యం చేయలేరు. అందుకని ప్రేక్షకులకిదో భరోసా నిస్తుంది. ఈ పద్ధతే బెటర్.

బ్రహ్మాస్త్ర కథలో రణబీర్ కపూర్ కి పంచభూతాల్లో ఒకటైన అగ్నితో వింత సంబంధముంటుంది. దాంతో బ్రహ్మాస్త్రాన్ని మేల్కొల్ప గల శక్తిని కలిగి వుంటాడు. ఈ అతీత శక్తి, విశ్వాన్ని నాశనం నాశనం చేయగలదని, సృష్టిని నాశనం చేయగలదని, జీవులని అంతమొందించ గలదనీ తెలుసు కుంటాడు. మరోవైపు,  దుష్ట శక్తుల రాణి జునూన్ కూడా బ్రహ్మాస్త్రాన్ని సొంతం చేసుకోవాలనే పట్టుదలతో వుంటుంది. బ్రహ్మాస్త్రం కోసం వీళ్ళిద్దరి పోరాటమే ఈ మూవీ. ఇది పురాణ, దైవిక ఘటనల ఆథ్యాత్మిక థ్రిల్లర్ గా వుంటుంది. ప్రస్తుతం నార్త్ లో వున్న మతాభిమానపు భక్తి వాతావరణంలో కార్తికేయ 2 లాగే ఇది కూడా హిట్టవుతుందని నమ్ముతున్నారు.

దర్శకుడు అయాన్ ముఖర్జీ పదేళ్ళ కల ఈ ప్రతిష్టాత్మక మూవీ. దీని తెర వెనుక కథనాన్ని వివరించే వీడియోని  అలియా భట్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియోలో దర్శకుడు అయాన్ ముఖర్జీ  సిమ్లాలో రైటింగ్ వర్క్ చేపట్టిన 2011 నుంచీ దాంతో సాగిన పదేళ్ళ ప్రయాణం గురించి చెప్పుకొస్తాడు. అతడి మొదటి సినిమా  వేక్ అప్ సిద్ (2009) అప్పుడప్పుడే విడుదలై, రెండవ మూవీ యే జవానీ హై దీవానీ (2013) కోసం పని చేస్తున్న విషయాన్ని వెల్లడించాడు. ఎల్లప్పుడూ సిమ్లా  పర్వతాల్లో చాలా శక్తిని, బలమైన ఆధ్యాత్మికతనీ పొందుతాననీ చెప్పాడు. హిమాలయాల శక్తి నుంచే తనకి బ్రహ్మాస్త్రం కథకి ఐడియా పుట్టిందని నమ్ముతున్నట్టు వీడియోలో చెప్పాడు.

బ్రహ్మాస్త్ర  మూడు భాగాల కథగా ప్లాన్ చేశారు. అంటే మూడు సినిమాలు. ప్రస్తుతం మొదటి భాగం విడుదలవుతోంది. మొదటి భాగం ప్రధానంగా శివగా రణబీర్ కథతో వుంటుంది. భారతీయ ప్రేక్షకుల కోసం బ్రహ్మాస్త్ర తో ఓ అద్భుత ప్రపంచాన్ని సృష్టించడం, భారతీయ చలనచిత్ర పరిశ్రమ నుంచి ఇంతవరకూ రాని కంప్యూటర్ మాయా జగత్తుని సృష్టించడం అయాన్ చేపట్టిన బాధ్యత. అత్యంత ఆధునిక సాంకేతిక విలువలతో పురాతన భారతీయ మూలాలు - సంస్కృతి, ఆధ్యాత్మికతలని లోతుగా చూపించే విజువల్ వండర్ గా హామీ ఇస్తున్నాడు.

తన జీవితంలో 10 సంవత్సరాలు ఈ మూవీ  కోసం వెచ్చించానని, ప్రారంభంలో బ్రహ్మాస్త్ర అనేది ఒక హాస్యాస్పదమైన ఆలోచనగా వుండేదనీ, క్రమంగా దీని మీద ఆత్మ విశ్వాసం బలపడిందనీ, చెప్పుకొచ్చాడు. చేయాలనుకున్నది ఎలా చేయాలో రోడ్‌మ్యాప్ లేదు, విజువల్ ఎఫెక్ట్స్ వ్యయాన్ని నియంత్రించే ప్రణాళికల్లేవు, ఈ సవాళ్ళని ఎలాగైనా అధిగమించగలిగితే, సినిమా అనుకున్నట్టు సరిగ్గా వస్తే, నిజంగా ఇది మార్గదర్శక సంచలనాత్మక చలన చిత్రమవుతుందనీ, దేశం గర్వించదగ్గ కానుక అవుతుందనీ చెప్పుకొచ్చాడు.

దీన్ని  కరణ్ జోహార్, అపూర్వా మెహతా, నమిత్ మల్హోత్రా, అయాన్ ముఖర్జీ కలిసి నిర్మించారు. ఇదీ విషయం. ఇప్పుడు దీనికి ప్రేక్షకులే మాత్రం తరలి వస్తారన్నది ప్రశ్న. ఈ ప్రశ్న వుండగా బాలీవుడ్ సినిమాల కడుపు కొట్టే ట్రెండ్ ఒకటి ఇటీవల నడుస్తోంది. ప్రతీ పెద్ద హిందీ సినిమానీ  ఏదో వంకపెట్టుకుని సోషల్ మీడియాలో బాయ్ కాట్ ట్రెండ్ నడిపిస్తున్నారు. దీని కారణంగా కూడా ప్రేక్షకులు రావడానికి వెనుకాడ వచ్చు. ఈ బాయ్ కాట్ పోకిరీల ఆటకట్టించే చర్యలు తీసుకుంటేగానీ సినిమాల పరిస్థితి మెరుగు పడదు. హీరో యిన్ ఆలియా భట్ ఏదో అన్నదని బాయ్ కాట్ బ్రహ్మాస్త్ర అని కొత్త రాగ మెత్తుకున్నారు మానసిక రోగులు.

***