రచన- దర్శకత్వం : కార్తీక్ సుబ్బరాజ్
తారాగణం : విక్రమ్, ధృవ్ విక్రమ్,
సిమ్రాన్, సనంత్, బాబీ సింహా, వెట్టాయ్ ముత్తుకుమార్, ఆడుకాలం నరేన్ తదితరులు
సంగీతం : సంతోష్ నారాయణ్, ఛాయాగ్రహణం : శ్రేయాస్ కృష్ణ
బ్యానర్ : సెవెన్ స్క్రీన్ స్టూడియో
నిర్మాత
: ఎస్ ఎస్ లలిత్ కుమార్
విడుదల : 10 ఫిబ్రవరి 2022 (అమెజాన్ ప్రైమ్)
***
రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...
టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!
11, ఫిబ్రవరి 2022, శుక్రవారం
1128 : రివ్యూ!
చియాన్ విక్రమ్
2019 లో ‘మిస్టర్ కేకే’, ‘ఆదిత్య వర్మ’ ల తర్వాత
మూడేళ్ళు విరామం తీసుకుని ‘మహాన్’ తో
వచ్చాడు. ‘ఆదిత్య వర్మ’ (అర్జున్
రెడ్డి) లో కొడుకు ధృవ్ విక్రమ్ ని హీరోగా పరిచయం చేస్తూ తను కూడా నటించాడు. ఇది
ఫ్లాపయ్యాక తిరిగి ఇప్పుడు కొడుకుతో ‘మహాన్’ నటించాడు. తండ్రీ కొడుకుల కాంబినేషన్ ఫ్యాన్స్ కి హుషారు పుట్టించింది.
దీనికి కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం కూడా ఆకర్షణ తీసుకు వచ్చింది. 8 సినిమాల దర్శకుడు
కార్తీక్ సుబ్బరాజ్, 2021 లో ‘జగమే
తందిరం’ తీసి ఫ్లాపయ్యాడు. ‘జగమే
తందిరం’, దీనికి ముందు ‘జిగర్తాండా’ లలాగే ‘మహాన్’ తో కూడా
ఇప్పుడు గ్యాంగ్ స్టర్ మూవీనే ప్రయత్నించాడు.
ఇందులో హీరోయిన్
లేకపోవడం ఒక ప్రత్యేకత. కొడుక్కి హీరోయిన్ లేకపోతే ఫ్యాన్స్ ఎలా ఫీలవుతారనే
ఆలోచనకి దూరంగా, తండ్రీ కొడుకుల సెటిల్ మెంట్ కథని
హీరోయిన్ తో డిస్టర్బ్ చేయకూడదన్న ఉద్దేశంతో నాన్ హీరోయిన్ మూవీగానే ఫ్యాన్స్ మీద
ప్రయోగించాడు విక్రమ్. అలాగే ఈ గ్యాంగ్ స్టర్ మూవీతో ఫ్యాన్స్ కి థియేటర్ అనుభవాన్ని కూడా దూరం చేస్తూ ఓటీటీ
విడుదలకి సిద్ధపడ్డాడు. ఫ్యాన్స్ తో కోరి ఇన్ని రిస్కులు తీసుకున్న విక్రమ్- ధృవ్- సుబ్బరాజ్ త్రయం
చివరికి సాధించిందేమిటి? ఏమైనా చెప్పుకోదగ్గ ఘనత సాధించారా? లేక చతికిలబడి మావల్ల కాదన్నారా? ఈ అమూల్య విషయాలు
తెలుసుకుందాం...
1968
లో గాంధీ మహాన్ (విక్రమ్) చిన్నపిల్లాడు. తండ్రి మోహన్ దాస్ (ఆడుకాలం
నరేన్) స్వాతంత్ర్య పోరాటం చేసిన వాడు, తాత కూడా స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న గాంధీ భక్తుడు. అందుకని
కొడుక్కి గాంధీ మహాన్ అని పేరు పెట్టుకుని గాంధీ ఆదర్శాలతో పెంచే ప్రయత్నం
చేస్తాడు మోహన్ దాస్. కానీ కొడుకు సారాబట్టీ నడిపే వాడి కొడుకుతో స్నేహం చేసి, జూదం మద్యం అలవాటు చేసుకుంటాడు. మద్య నిషేధ పోరాటం చేస్తున్న మోహన్ దాస్
దృష్టికి ఇది వచ్చి కొడుకుని కొడతాడు. ఇక అలాటి పనులు చెయ్యనని మాటిస్తాడు కొడుకు
గాంధీ మహాన్.
అలా నలభై ఏళ్ళ వయాసొచ్చేదాకా గాంధేయ
మార్గంలో వున్న గాంధీ మహాన్ అలియాస్ మహాన్, లెక్చరర్ గా
వుంటాడు. నాచి (అంటే తమిళంలో నిప్పు- నటి సిమ్రాన్) ని పెళ్ళి చేసుకుని కొడుకుతో
వుంటాడు. అయితే తనకి గాంధీ పేరుండడం వల్ల ఆదర్శాలతో గాంధీ భారాన్ని ఇక మోయలేక
పోతాడు. 41 వ పుట్టిన్రోజుకి ఏమైనా సరే ఆదర్శాల్ని తెంపి పారేసి ఎంజాయ్ చేయాలని
బార్ కెళ్ళి తాగేస్తాడు, పేకాట ఆడేస్తాడు. తీరా చూస్తే ఆ
బార్ కమ్ పేకాట డెన్ ఓనర్ చిన్నప్పుడు సారాబట్టీ ఓనర్ కొడుకు సత్యమే (బాబీ సింహా).
తన ఫ్రెండే.
భర్త బార్ కెళ్ళి తాగాడని
తెలుసుకున్న నాచి, కొడుకుని తీసుకుని గుడ్ బై కొట్టేసి
తండ్రి దగ్గరి కెళ్ళిపోతుంది. ఇక రాదు. మహాన్ సత్యంతో చేయి కలిపి ఇక మద్యం
సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు. గ్యాంబ్లింగ్ కేసినో ప్రారంభిస్తాడు. సత్యం కొడుకు
రాకేష్ (సనంత్), ని సొంత కొడుకులా చూసుకుంటాడు. బాగా డబ్బు
సంపాదించి ఎక్కడో పెరుగుతున్న సొంత కొడుకు దాదా భాయ్ నౌరోజీ (ధృవ్ విక్రమ్) కి ఆ
డబ్బంతా ఇవ్వాలని నిర్ణయించుకుంటాడు. కానీ కొడుకు దాదాభాయ్ నౌరోజీ అలియాస్ దాదా, పోలీస్ అధికారిగా వచ్చి మద్యం సిండికేట్ పనిబట్టడం మొదలెడతాడు. దీంతో
తండ్రీ కొడుకుల మధ్య ఘర్షణ మొదలైపోతుంది. ఒకానొక క్లిష్ట సమయంలో తను సొంత కొడుకు దాదా
వైపుండాలా, లేక పెంపుడు కొడుకు రాకేష్ వైపు వుండాలా
తేల్చుకోలేక పోతాడు మహాన్. ఏ నిర్ణయం తీసుకున్నా తీవ్ర పరిణామాలే పొంచి వుంటాయి.
ఇలా మహాన్ ఏ నిర్ణయం తీసుకుంటే ఏం జరిగిందన్నది మిగతా కథ.
తప్పు చేయడానిక్కూడా స్వాతంత్ర్యం
లేకపోతే అది స్వాతంత్ర్యమే కాదన్న మహాత్మా గాంధీ వాక్కు ఆధారంగా సిద్ధం చేసుకున్న
కథ. వాక్కు ఎటో పోయింది, కథ ఎటో పోయింది. మధ్య మనం ఎటూ
కాకుండా ఆలోచిస్తూ. వాక్కు సంగతెలా వున్నా, ఈ రెండు గంటలా 48
నిమిషాల అతి భారమైన నిడివిలో మనం దేవులాడుకునేది కనీసం గాంధీయిజమైనా ఎక్కడైనా
వుందాని.
తండ్రి గాంధీయిజాన్ని తుంగలో తొక్కి
లిక్కర్ గ్యాంగ్ స్టర్ అయ్యాడు. తల్లీ తాతా కలిసి గాంధీ ఆదర్శాలతోనే పెంచిన కొడుకూ
పోలీసాఫీసర్ గా అడ్డగోలు ఎన్ కౌంటర్లు చేసే స్తూ హింసావాదిగా తేలాడు. ఇక తండ్రీ
కొడుకుల మధ్య ఆదర్శాల సంఘర్షణైనా ఎక్కడుంది. ఇద్దరి ఆదర్శాలొకటే. హింసతో ఇద్దరూ
దారితప్పిన వాళ్ళే. ఇలాటి కథకి గాంధీయిజపు పూత ఎందుకు.
ఇద్దరూ దారి తప్పిన వాళ్ళయినప్పుడు
కనీసం గాంధీయిజం కోసం తపించే తల్లి పాత్రయినా తండ్రీ కొడుకుల్ని దారికి తెచ్చే కేటలిస్ట్
పాత్రగా వుండుంటే ఆ గాంధీయిజమంతా కథకి ఓ కేంద్ర స్థానం వహిస్తూ కాన్సెప్ట్ క్యారీ అయ్యేది. ఇది కూడా జరగలేదు.
తల్లి పాత్రకి ప్రాధాన్యమే లేదు. చివరికి తేలేదేమంటే, ఇగోలతో
శత్రువులు గా మారిన తండ్రీ కొడుకుల మధ్య సెంటిమెంటల్ సెటిల్మెంటే. దీనికి కూడా పగదీర్చుకునే ముగింపే. చెడుని
నిర్మూలించడానికి ఆయుధాలు చేపడితే జరిగేది రెండు దుష్ట శక్తుల మధ్య యుద్ధమే- అన్న
గాంధీ సూక్తి లాగా తేలింది కథ. ఈ సూక్తి ప్రకారమైతే ఇద్దరూ
చావాలి. ఇది కూడా జరగలేదు.
తప్పు చేయడానిక్కూడా స్వాతంత్ర్యం
లేకపోతే అది స్వాతంత్ర్యమే కాదన్న కొటేషన్ తండ్రి పాత్రకే వర్తిస్తుంది. తండ్రే
చెప్తాడీ మాట చివరికి. అయితే ఇందులోంచి కూడా నేర్చుకున్నదేమీ లేదు, మార్చుకున్నదేమీ లేదు. పరిపూర్ణతని సాధించలేదు కథ.
ఇక మద్య నిషేధం సంగతి. 1968 పూర్వ
కథలో మద్య నిషేధమంటే కన్విన్సింగ్ గానే గానే వుంటుంది ఆ కాలాన్ని బట్టి. ఇప్పుడు ఈ
కాలంలో మధ్య నిషేధ మేమిటి? మద్యమనేది స్టూడెంట్స్
దగ్గర్నుంచీ ఎందరికో తాగి పారేసే వేల కోట్ల రూపాయల ప్రభుత్వాదాయ వనరుగా, నిత్యావసర వస్తువుగా మారేకా? గృహిణుల కాడ్నించీ
అందరూ కామన్ గా తీసుకుంటున్నాక? ఒక వీడియో అనుకోకుండా
చూడడమైంది. ప్రఖ్యాత హిందీ గీత రచయిత ఆనంద్ బక్షీ విదేశంలో ఇండియన్స్ కిచ్చిన
ప్రోగ్రాంలో ఒక గ్లాసులో మద్యం, నోట్లో సిగరెట్ పెట్టుకుని
పాటలు పాడుతూ కన్పించాడు. ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. లేడీస్ కూడా కామన్ గా
తీసుకున్నారు. ఇది 1980 ల నాటి సంగతి.
ఇది మద్య నిషేధపు కథ కాక, మాదక ద్రవ్యాల నిషేధ కథైవుంటే సరిపోయేది. కానీ ఇలా ఇటు మద్యానికి కాకుండా, అటు గాంధీకీ కాకుండా పోయింది కథ.
చియాన్ విక్రమ్ మహాన్ గా ఎలాటి ఓవరాక్షన్ లేకుండా రియలిస్టిక్
నటన కనబర్చాడు. సరదాగా ప్రారంభమై సీరియస్ గా మారి, యమ సీరియస్ గా సాగే పాత్ర పరిణామ క్రమాన్ని బాగా రికార్డు చేశాడు. అతడికి
పదే పదే వేర్వేరు నైతిక ప్రశ్నలు- వాటి తాలూకు సంఘర్షణలూ ఎదురవుతూంటాయి. తనకీ
కొడుక్కీ మధ్య, తనకీ పెంపుడు కొడుక్కీ మధ్య, తనకీ స్నేహితుడు సత్యం కీ మధ్య, తనకీ భార్యకీ మధ్య, చివరికి తనకీ ఇంకో చిన్ననాటి స్నేహితుడే మంత్రికీ మధ్య ...ఒకదాని తర్వాతొకటి
ఈ నాల్గు డోలాయమాన స్థితుల మధ్య
వూగిసలాటే ఈ పాత్రకి. ఇవన్నీ బాగా పోషించాడు బాధాతప్త హృదయం గల పాత్రగా.
కొడుకు పాత్రలో ధృవ్ విక్రమ్ కూడా
పకడ్బందీ పాత్రపోషణ, డైలాగ్ డెలివరీ చేశాడు. అయితే ఈ పోలీసు
పాత్ర ఎన్ కౌంటర్లతో హింసకి పాల్పడే పాత్ర కావడంతో- తల్లీ తాతల గాంధేయవాద పెంపకం
అర్ధం లేకుండా పోయింది. ఎంతసేపూ తండ్రి గ్యాంగునీ, తండ్రి
పెంచుకున్న కొడుకునీ చంపుతూ, పగ సాధించేందుకు తండ్రిని వేటాడుతూ
వుండే అర్ధం లేని పాత్ర చిత్రణొకటి పంటి కింద రాయిలా వుంటుంది. ఎంత పోలీసైనా
అహింసకి కట్టుబడి తండ్రిని మార్చే కాంట్రాస్ట్ పాత్రగా వుంటే - తండ్రీ కొడుకుల హింస- అహింసల పోరాటంగా కథకి
స్పష్టత వచ్చేది. గాంధీయిజం ప్లే అయ్యేది.
మెంటల్ కొడుకు పాత్రకి 1825-1917 మధ్య కాలపు పార్శీ మతానికి చెందిన విద్యావేత్త, మేధావి, పత్తి వ్యాపారి, తొలితరం రాజకీయ, సామాజిక నాయకుడైన, మహనీయుడైన దాదాభాయ్
నౌరోజీ పేరెందుకో అర్ధంగాదు!
తల్లి
పాత్రలో సిమ్రాన్ కన్పించేది కాసేపే. ఈ పాత్ర చిత్రణ కూడా కుదర్లేదు. భర్త ఒకసారి
తాగాడని కొడుకుని తీసుకుని నీకూ నాకూ రామ్ రామ్ అనేసి వెళ్ళిపోవడం కన్విన్సింగ్ గా
వుండదు. నలభై ఏళ్ళూ ఓపిక బట్టుకుని, తను పుట్టిన ఘన కార్యానికి నలభై ఒకటో పుట్టిన్రోజున ఏదో కాస్త తాగితే సంసారం
వదిలేసి వెళ్ళి పోవడమేనా? ఈమె ఇలా వెళ్ళిపోయిందన్న కసితోనే కావచ్చు- అతను ఏకంగా మద్యం సామ్రాజ్యమే ఏర్పాటు చేసుకుని కూర్చున్నాడు!
స్నేహితుడు సత్యంగా బాబీ సింహా పాత్ర
చిత్రణ మాత్రం కుదిరింది. బాగానే నటించాడు. ఇంకో స్నేహితుడు మంత్రి జ్ఞానోదయం
పాత్రలో వెట్టాయ్ ముత్తుకుమార్ ఫైనల్ విలన్ గా వుంటాడు. బలహీన విలన్.
సంతోష్ నారాయణ్ సంగీతంలో ఏడు పాటలున్నాయి.
ఏడూ బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే థీమ్ సాంగ్సే. ఈ సాంగ్స్ మారుతున్న కథాకాలంతో శైలి
మార్చుకుంటూ సాగుతూంటాయి. ఈ డార్క్ మూవీకి శ్రేయాస్ కృష్ణ ఛాయాగ్రహణం ఎఫెక్ట్స్ వరకూ
బావుంది గానీ, కెమెరా కథా కథనాల్లో పాలు పంచుకోలేదు. దీన్ని కథ
అనకూడదు, గాథ అనాలి. గాథ అయినప్పుడు కెమెరాతో గాథ చెప్పలేదు.
కలంతో చెప్పుకుంటూ పోయారు. దీంతో యాక్షన్ తక్కువ, డైలాగులు ఎక్కువగా- డైలాగ్స్ సీన్సే సోది చెప్తున్నట్టు సాగుతూంటాయి సుదీర్ఘంగా.
ఇది కథకాదు, గాథ.
ఇందులో ఒక ప్రథాన కాన్ఫ్లిక్ట్ చుట్టూ కథనముండదు. పైన చెప్పుకున్నట్టు తండ్రికి ఇతరులతో
చిన్న చిన్న కాన్ఫ్లిక్ట్స్ వచ్చి పోతూ వుంటాయి. పాత్ర పాసివ్ గానూ వుంటుంది, యాక్టివ్ గానూ మారుతూంటుంది. ఫస్టాఫ్ అంతా ఒక టెంప్లెట్. 1968 నుంచీ తండ్రి
జీవీతం ఎలా మారుతూ వచ్చిందో చెప్పే డాక్యుమెంటరీ టెంప్లెట్. ఈ ఫస్టాఫ్ లో ప్రత్యర్ధి
పాత్ర వుండదు. తండ్రి లిక్కర్ మాఫియాగా ఎలా ఎదిగాడో చెప్పే ఏకపక్ష కథనమే వుంటుంది గంటా
20 నిమిషాలూ. ‘పుష్ప’ లో స్మగ్లర్ గా ఎలా
ఎదిగాడో టెంప్లెట్ లో చెప్పినట్టుగా. ఇప్పుడు ఇంటర్వెల్ సీన్లో కొడుకు వస్తే గానీ ప్రత్యర్ధి
ఏర్పాటు కాడు. ఫలితంగా ఈ ఫస్టాఫ్ అంతా విషయం లేక బోరు కొట్టే అవకాశముంటుంది.
పోనీ ఇంటర్వెల్ తర్వాతైనా వెంటనే కొడుకుతో
కాన్ఫ్లిక్ట్ కూడా ప్రారంభం కాదు. ఫస్టాఫ్ లో తండ్రి చిన్నప్పట్నుంచీ ఎలా సీన్లు చూపించారో, మళ్ళీ ఇప్పుడు కొడుకు చిన్నప్పట్నుంచీ తల్లి దగ్గర ఎలా పెరిగి పోలీసాఫీసర్
అయ్యాడో- ట్రైనింగు సహా స్పూన్ ఫీడింగ్ చేసే ఫ్లాష్ బ్యాక్ సీన్లు. ఇంకో ఇరవై నిమిషాలు
తీసుకుని ఇది పూర్తయితే గానీ, ఫస్ట్ యాక్ట్ పూర్తయి సెకెండ్ యాక్ట్
లో పడదు గాథ. అంటే ఇంటర్వెల్ మీదుగా గంటా 40 నిమిషాల వరకూ కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవకుండా, ఫస్ట్ యాక్టే సాగుతుందన్న మాట దీని దుంప తెగ!
ఇక కొడుకు సహా పైన చెప్పుకున్న వివిధ
పాత్రలతో వివిధ కాన్ఫ్లిక్ట్స్ వచ్చిపోతూంటాయి తండ్రికి. ఒక్కో కాన్ఫ్లిక్ట్ ఒకే బారెడు పదీ పదిహేను నిమిషాల సేపూ సాగే డైలాగ్స్ సీన్లు. ఇలా సెకండ్ యాక్ట్ నుంచీ థర్డ్
యాక్ట్ ఎండ్ వరకూ కేవలం ఐదారు సీన్లుంటాయి - ఆస్కార్ విన్నర్ స్క్రీన్ ప్లే ‘దేర్ విల్ బి బ్లడ్’ లోలాగా. కానీ ‘దేర్ విల్ బి బ్లడ్’ గాథ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ ని చూసి అర్ధం జేసుకుని ‘మహాన్’ ని తీసివుంటే, కార్తీక్ సుబ్బరాజ్ గ్రేట్ మూవీని ఇచ్చి
వుండేవాడు. సినిమాలో మంచి విషయముంది. దీన్ని సోదిలా చెప్పడంతో ఓ గ్లాసు మందు కొట్టినట్టూ, లేదా ఓ గాంధీతో క్లాసు పీకించుకున్నట్టూ
కాకుండా పోయింది!
—సికిందర్
10, ఫిబ్రవరి 2022, గురువారం
9, ఫిబ్రవరి 2022, బుధవారం
మళ్ళీ చదవొచ్చు!
“మానవ స్వభావం గురించి మనకు తెలిసిందల్లా ఒక్కటే, ఆ స్వభావం మార్పుకి లోనవుతుందని. మానవ స్వభావంలో మార్పు మాత్రమే వూహించి చెప్పగల లక్షణం. విఫలమయ్యే వ్యవస్థలు ఎదుగుదల, పురోభివృద్ధిలపై ఆధారపడక మానవ స్వభావం శాశ్వతమని నమ్మినందు వల్ల విఫలమవుతాయి.”
―ఆస్కార్ వైల్డ్
పై కొటేషన్ తో క్యారెక్టర్ గ్రోత్ అధ్యాయం ప్రారంభిస్తాడు లాజోస్ ఏగ్రీ. ఈ పుస్తకం నాటకాల గురించి రాసినా సినిమాలకి కూడా ఉపయోగపడుతుందని గత వ్యాసంలో చెప్పుకున్నాం. అయితే నాటకాలంటే ఇప్పుడు సినిమా వాళ్లకి పడదు. అదేదో లో - కేటగిరీ యాక్టివిటీ అనుకుంటారు. ఆఫ్టరాల్ నాటకాలేమిటి, నాటకాలకంటే సినిమాలు గొప్పని, మేం సినిమా వాళ్ళం చాలా గొప్పోళ్ళమని స్టయిల్ స్టేట్ మెంట్లు ఇచ్చేస్తూంటారు. సినిమాలు పుట్టిందే నాటక కళ లోంచి. ఈ విషయం తెలీక బ్రేక్ డాన్సులు. ఇదిప్పుడు ఎందుకు చెప్పుకోవాల్సివస్తోందంటే, ఈ పుస్తకంలో అనేక నాటకాల్లోంచి తీసుకున్న ఉదాహరణలున్నాయి. ఇవి చూసి ఛీ యాక్ థూ అనుకుంటారేమోనని...
వాంతి చేసుకున్నా విషయం మారదు. అందుకని విషయం లోకెళ్దాం.
ఏగ్రీ ఇలా అంటాడు – “మీరు ఏ మాధ్యమం కోసం రాసినా, మీ పాత్రలు మీకు క్షుణ్ణంగా తెలిసి వుండాలి. ఈ రోజు వున్న విధంగానే కాదు, కొన్నేళ్ళ తర్వాత కూడా మీ పాత్రలెలా వుంటాయో మీకు తెలిసి వుండాలి. మానవ జాతి సహా ప్రకృతిలో ప్రతీదీ మార్పుకు లోనవుతుంది. పదేళ్ళ క్రితం ధైర్యశాలిగా వున్న వ్యక్తి ఈ రోజు పిరికిపందగా వుండొచ్చు. కారణాలనేకం. వయస్సు, ఆరోగ్యం, ఆర్ధిక పరిస్థితి వగైరా.
“మీకు తెలిసిన వ్యక్తెవరో ఇన్నేళ్ళలో అస్సలు మార్పుకు లోనవలేదని మీకన్పిస్తూండవచ్చు. కానీ అలాటి వ్యక్తెవరూ వుండే అవకాశంలేదు. మనిషి తన రాజకీయ, మత విశ్వాసాలని చెక్కు చెదరకుండా ఏళ్ల తరబడీ కాపాడుకుంటూ రావొచ్చు. కానీ సూక్ష్మ పరిశీలనలో వాటిపట్ల అతడి నిబద్ధత బలంగానో బలహీనంగానో మారడాన్ని గమనించ గలం. రాళ్ళు రప్పలు కూడా మార్పుకు లోనవుతాయి. వాటి క్రమానుగత విచ్ఛిన్నం అగోచరంగా వున్నప్పటికీ. సూర్యుడు, సౌర వ్యవస్థ, విశ్వం సైతం. దేశాలు పుడతాయి, కౌమారంలోకి ప్రవేశిస్తాయి, యౌవనాన్ని సంతరించుకుంటాయి, వృద్ధాప్యంలోకి అడుగెడతాయి, మరణిస్తాయి. హింసాత్మకంగానో, నైమిత్తికంగానో.
“మరి ఈ సమస్త పరిణామ తాటస్థ్యంలో మనిషొక్కడే మారకుండా ఎలా వుంటాడు? ఎలా వుంటాడంటే బ్యాడ్ రైటింగ్ వల్ల వుంటాడు. పాత్రలు ప్రకృతి సూత్రాల్నిధిక్కరించే సామ్రాజ్యం ఒకే ఒక్కటి వుంటుంది - అది బ్యాడ్ రైటింగ్ సామ్రాజ్యం. కథానికలో, నవల్లో, నాటకంలో మొదట్లో ఎలా వున్న పాత్ర ముగింపులో అలాగే వుందంటే ఆ కథానిక, నవల, నాటకం చాలా బ్యాడ్ అన్నమాట ( ‘రణరంగం’ లో ఎలా మొదలైన హీరో అలాగే (అ) శుభం వేసుకోడాన్నిగమనించాం - వ్యాసకర్త).
ఇక ఈ అధ్యాయంలో అక్కడక్కడా కొన్ని ముఖ్యమైన అంశాల్ని టిప్స్ గా మార్చుకుని చూద్దాం...
1. కాన్ఫ్లిక్ట్ తోనే పాత్రేమిటో బయటపడుతుంది. కాన్ఫ్లిక్ట్ పాత్ర తీసుకున్ననిర్ణయం ఫలితంగా పుడుతుంది. నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వస్తుందంటే, కథకి ఏర్పాటు చేసిన పాయింటు కారణంగా తీసుకోవాల్సి వస్తుంది. పాత్ర నిర్ణయం తప్పకుండా ఎదుటి పాత్ర ఇంకో నిర్ణయం తీసుకోవడానికి ప్రేరేపిస్తుంది. ఈ ఎదుటి పాత్ర ప్రత్యర్ధి పాత్ర. ఇలా ఒకరి నిర్ణయం ఇంకొకరి ప్రతి నిర్ణయానికి దారితీస్తూ కథ ముందుకు నడుస్తుంది. ఈ పరంపర కథకి తీసుకున్న పాయింటుని ప్రూవ్ చేసే అంతిమ మజిలీ దాకా సాగుతుంది.
2. ఏ గొప్ప నాటకాలని చూసినా, కాన్ఫ్లిక్ట్ వల్ల పాత్రలకి సంభవించే నిరంతర మార్పు, అభివృద్ధి గమనించవచ్చు. షేక్స్ పియర్ ‘మర్చంట్ ఆఫ్ వెనిస్’, మోలియర్ ‘టర్టఫ్’ మొదలైనవి. ‘ఒథెల్లో’ ప్రేమతో ప్రారంభమవుతుంది, అసూయ, హత్య, ఆత్మహత్యలతో ముగుస్తుంది. ‘హెడ్డా గబ్లర్’ ఇగోతో ప్రారంభమవుతుంది, ఆత్మహత్యతో ముగుస్తుంది. ‘మాక్బెత్’ ఆశయంతో మొదలై హత్యతో ముగుస్తుంది. ‘ఎక్స్ కర్సన్’ కలల్నినిజం చేసుకోవడానికి మొదలై, నిజాలు తెలుసుకోవడంతో ముగుస్తుంది. ‘హామ్లెట్’ అనుమానంతో మొదలై హత్యతో ముగుస్తుంది. ‘కెరీర్’ నిరాశతో మొదలై విజయంతో ముగుస్తుంది. ‘డెడ్ ఎండ్’ పేదరికంతో మొదలై నేరంతో ముగుస్తుంది...
3. బలహీన పాత్ర ఉద్దేశించిన కాన్ఫ్లిక్ట్ ని కొనసాగించలేదు. పోటీల్లేక పోతే ఆటల్లేవు, కాన్ఫ్లిక్ట్ లేకపోతే కథ లేదు. కౌంటర్ పాయింటు లేకపోతే సమతుల్యం లేదు. బలహీన పాత్రతో మొదలుపెడితో కాన్ఫ్లిక్ట్ తో బలమైన పాత్రగా మార్చాలి. బలమైన పాత్రని కాన్ఫ్లిక్ట్ తో బలహీనపడ్డ పాత్రగా మార్చవచ్చు. ఐతే బలహీనపడ్డప్పటికీ ఆ అవమానాన్ని భరించగల్గే స్టామినాతో పాత్ర వుండాలి.
4. ఒక ఉదాహరణ : ఓనీల్ రాసిన ‘మౌర్నింగ్ బికమ్స్ ఎలెక్ట్రా’ నాటకం (1947 లో హాలీవుడ్ మూవీగా వచ్చింది). ఇందులో కథానాయకుడు బ్రాంట్ కీ, కథానాయిక లెవీనియాకీ మధ్య సన్నివేశం. బ్రాంట్ పనిమనిషికీ, సంపన్నుడైన మానన్ అనే అతడికీ పుట్టిన అక్రమసంతానం. కులం చెడ్డ వాడు. తల్లి తననెక్కడో దూరంగా తీసికెళ్ళి పెంచింది. ఇప్పుడతను తిరిగొచ్చేశాడు మారుపేరు పెట్టుకుని. తల్లితోబాటు తనూ పొందిన అవమానాలకి ప్రతీకారం తీర్చుకోవడానికి. ఇప్పుడతను కెప్టెన్. లెవీనియా తల్లితో సంబంధం పెట్టుకుని, ఇది కప్పి పుచ్చడానికి లెవీనియాతో కూడా సంబంధం పెట్టుకున్నాడు. ఐతే బ్రాంట్ తో జాగ్రత్త అని లెవీనియా ఇంట్లో పనివాడు ఆమెని హెచ్చరించాడు.
―ఆస్కార్ వైల్డ్
పై కొటేషన్ తో క్యారెక్టర్ గ్రోత్ అధ్యాయం ప్రారంభిస్తాడు లాజోస్ ఏగ్రీ. ఈ పుస్తకం నాటకాల గురించి రాసినా సినిమాలకి కూడా ఉపయోగపడుతుందని గత వ్యాసంలో చెప్పుకున్నాం. అయితే నాటకాలంటే ఇప్పుడు సినిమా వాళ్లకి పడదు. అదేదో లో - కేటగిరీ యాక్టివిటీ అనుకుంటారు. ఆఫ్టరాల్ నాటకాలేమిటి, నాటకాలకంటే సినిమాలు గొప్పని, మేం సినిమా వాళ్ళం చాలా గొప్పోళ్ళమని స్టయిల్ స్టేట్ మెంట్లు ఇచ్చేస్తూంటారు. సినిమాలు పుట్టిందే నాటక కళ లోంచి. ఈ విషయం తెలీక బ్రేక్ డాన్సులు. ఇదిప్పుడు ఎందుకు చెప్పుకోవాల్సివస్తోందంటే, ఈ పుస్తకంలో అనేక నాటకాల్లోంచి తీసుకున్న ఉదాహరణలున్నాయి. ఇవి చూసి ఛీ యాక్ థూ అనుకుంటారేమోనని...
వాంతి చేసుకున్నా విషయం మారదు. అందుకని విషయం లోకెళ్దాం.
ఏగ్రీ ఇలా అంటాడు – “మీరు ఏ మాధ్యమం కోసం రాసినా, మీ పాత్రలు మీకు క్షుణ్ణంగా తెలిసి వుండాలి. ఈ రోజు వున్న విధంగానే కాదు, కొన్నేళ్ళ తర్వాత కూడా మీ పాత్రలెలా వుంటాయో మీకు తెలిసి వుండాలి. మానవ జాతి సహా ప్రకృతిలో ప్రతీదీ మార్పుకు లోనవుతుంది. పదేళ్ళ క్రితం ధైర్యశాలిగా వున్న వ్యక్తి ఈ రోజు పిరికిపందగా వుండొచ్చు. కారణాలనేకం. వయస్సు, ఆరోగ్యం, ఆర్ధిక పరిస్థితి వగైరా.
“మీకు తెలిసిన వ్యక్తెవరో ఇన్నేళ్ళలో అస్సలు మార్పుకు లోనవలేదని మీకన్పిస్తూండవచ్చు. కానీ అలాటి వ్యక్తెవరూ వుండే అవకాశంలేదు. మనిషి తన రాజకీయ, మత విశ్వాసాలని చెక్కు చెదరకుండా ఏళ్ల తరబడీ కాపాడుకుంటూ రావొచ్చు. కానీ సూక్ష్మ పరిశీలనలో వాటిపట్ల అతడి నిబద్ధత బలంగానో బలహీనంగానో మారడాన్ని గమనించ గలం. రాళ్ళు రప్పలు కూడా మార్పుకు లోనవుతాయి. వాటి క్రమానుగత విచ్ఛిన్నం అగోచరంగా వున్నప్పటికీ. సూర్యుడు, సౌర వ్యవస్థ, విశ్వం సైతం. దేశాలు పుడతాయి, కౌమారంలోకి ప్రవేశిస్తాయి, యౌవనాన్ని సంతరించుకుంటాయి, వృద్ధాప్యంలోకి అడుగెడతాయి, మరణిస్తాయి. హింసాత్మకంగానో, నైమిత్తికంగానో.
“మరి ఈ సమస్త పరిణామ తాటస్థ్యంలో మనిషొక్కడే మారకుండా ఎలా వుంటాడు? ఎలా వుంటాడంటే బ్యాడ్ రైటింగ్ వల్ల వుంటాడు. పాత్రలు ప్రకృతి సూత్రాల్నిధిక్కరించే సామ్రాజ్యం ఒకే ఒక్కటి వుంటుంది - అది బ్యాడ్ రైటింగ్ సామ్రాజ్యం. కథానికలో, నవల్లో, నాటకంలో మొదట్లో ఎలా వున్న పాత్ర ముగింపులో అలాగే వుందంటే ఆ కథానిక, నవల, నాటకం చాలా బ్యాడ్ అన్నమాట ( ‘రణరంగం’ లో ఎలా మొదలైన హీరో అలాగే (అ) శుభం వేసుకోడాన్నిగమనించాం - వ్యాసకర్త).
ఇక ఈ అధ్యాయంలో అక్కడక్కడా కొన్ని ముఖ్యమైన అంశాల్ని టిప్స్ గా మార్చుకుని చూద్దాం...
1. కాన్ఫ్లిక్ట్ తోనే పాత్రేమిటో బయటపడుతుంది. కాన్ఫ్లిక్ట్ పాత్ర తీసుకున్ననిర్ణయం ఫలితంగా పుడుతుంది. నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వస్తుందంటే, కథకి ఏర్పాటు చేసిన పాయింటు కారణంగా తీసుకోవాల్సి వస్తుంది. పాత్ర నిర్ణయం తప్పకుండా ఎదుటి పాత్ర ఇంకో నిర్ణయం తీసుకోవడానికి ప్రేరేపిస్తుంది. ఈ ఎదుటి పాత్ర ప్రత్యర్ధి పాత్ర. ఇలా ఒకరి నిర్ణయం ఇంకొకరి ప్రతి నిర్ణయానికి దారితీస్తూ కథ ముందుకు నడుస్తుంది. ఈ పరంపర కథకి తీసుకున్న పాయింటుని ప్రూవ్ చేసే అంతిమ మజిలీ దాకా సాగుతుంది.
2. ఏ గొప్ప నాటకాలని చూసినా, కాన్ఫ్లిక్ట్ వల్ల పాత్రలకి సంభవించే నిరంతర మార్పు, అభివృద్ధి గమనించవచ్చు. షేక్స్ పియర్ ‘మర్చంట్ ఆఫ్ వెనిస్’, మోలియర్ ‘టర్టఫ్’ మొదలైనవి. ‘ఒథెల్లో’ ప్రేమతో ప్రారంభమవుతుంది, అసూయ, హత్య, ఆత్మహత్యలతో ముగుస్తుంది. ‘హెడ్డా గబ్లర్’ ఇగోతో ప్రారంభమవుతుంది, ఆత్మహత్యతో ముగుస్తుంది. ‘మాక్బెత్’ ఆశయంతో మొదలై హత్యతో ముగుస్తుంది. ‘ఎక్స్ కర్సన్’ కలల్నినిజం చేసుకోవడానికి మొదలై, నిజాలు తెలుసుకోవడంతో ముగుస్తుంది. ‘హామ్లెట్’ అనుమానంతో మొదలై హత్యతో ముగుస్తుంది. ‘కెరీర్’ నిరాశతో మొదలై విజయంతో ముగుస్తుంది. ‘డెడ్ ఎండ్’ పేదరికంతో మొదలై నేరంతో ముగుస్తుంది...
3. బలహీన పాత్ర ఉద్దేశించిన కాన్ఫ్లిక్ట్ ని కొనసాగించలేదు. పోటీల్లేక పోతే ఆటల్లేవు, కాన్ఫ్లిక్ట్ లేకపోతే కథ లేదు. కౌంటర్ పాయింటు లేకపోతే సమతుల్యం లేదు. బలహీన పాత్రతో మొదలుపెడితో కాన్ఫ్లిక్ట్ తో బలమైన పాత్రగా మార్చాలి. బలమైన పాత్రని కాన్ఫ్లిక్ట్ తో బలహీనపడ్డ పాత్రగా మార్చవచ్చు. ఐతే బలహీనపడ్డప్పటికీ ఆ అవమానాన్ని భరించగల్గే స్టామినాతో పాత్ర వుండాలి.
4. ఒక ఉదాహరణ : ఓనీల్ రాసిన ‘మౌర్నింగ్ బికమ్స్ ఎలెక్ట్రా’ నాటకం (1947 లో హాలీవుడ్ మూవీగా వచ్చింది). ఇందులో కథానాయకుడు బ్రాంట్ కీ, కథానాయిక లెవీనియాకీ మధ్య సన్నివేశం. బ్రాంట్ పనిమనిషికీ, సంపన్నుడైన మానన్ అనే అతడికీ పుట్టిన అక్రమసంతానం. కులం చెడ్డ వాడు. తల్లి తననెక్కడో దూరంగా తీసికెళ్ళి పెంచింది. ఇప్పుడతను తిరిగొచ్చేశాడు మారుపేరు పెట్టుకుని. తల్లితోబాటు తనూ పొందిన అవమానాలకి ప్రతీకారం తీర్చుకోవడానికి. ఇప్పుడతను కెప్టెన్. లెవీనియా తల్లితో సంబంధం పెట్టుకుని, ఇది కప్పి పుచ్చడానికి లెవీనియాతో కూడా సంబంధం పెట్టుకున్నాడు. ఐతే బ్రాంట్ తో జాగ్రత్త అని లెవీనియా ఇంట్లో పనివాడు ఆమెని హెచ్చరించాడు.
అతను అర్ధంగాక వెనకడుగేస్తే, ఈ అవకాశం తీసుకునామె పని వాడిచ్చిన సలహా మేరకు బ్రాంట్ ని వెక్కిరింపుగా, అసహ్యంగా చూస్తుంది.
బ్రాంట్ స్థాణువైపోయి అంటాడు : “ఏంటది? (అని అరిచి, తన తల్లిని అవమానపరు స్తున్నట్టున్న ఆమె వెక్కిరింపుకి రెచ్చి పోతూ అంటాడు) : జాగ్రత్త! నువ్వు ఆడదానివని కూడా చూడను...నేనుండగా ఏ మానన్ గాడి వల్లా మా అమ్మకి అవమానం జరగనివ్వను-”
లెవీనియా ఇప్పుడు తనకి నిజం తెలిసిపోయిందన్న షాక్ తో అంటుంది : “ఐతే నిజమేనన్న మాట... నువ్వామె కొడుకువే నన్న మాట...”
బ్రాంట్ అతికష్టంగా కంట్రోలు చేసుకుంటూ : “ఐతే ఏంటట? గర్వంగావుంది నాకు! నాకు అవమానకరంగా వుందల్లా నా వొంట్లో ఆ మానన్ గాడి రక్తం ప్రవహించడమే. అందుకే నువ్వు నేను ముట్టుకోబోతే సహించలేక పోయావ్ కదూ, అంతేనా?”
అంటే ఇక్కడ పాత్రకి బలహీనపడే, కుంగుబాటుకి లోనయ్యే వాస్తవ పరిస్థితి ఎదురైనప్పటికీ, పాత్ర గిల్టీ ఫీలవకుండా ఎదురుతిరిగి బలం నిరూపించుకుంటోంది (తెలుగు సినిమాల్లో తప్పకుండా వుండే మన అభిమాన, ప్రీతిపాత్రమైన పాసివ్ పాత్రయితే - “లతా! ఇంత మాటన్నావా? సర్లే...ఔన్లే... కానీయ్...నాకిలా రాసిపెట్టుంది...” అని కన్నీళ్లు పెట్టుకుంటూ వెళ్ళిపోతాడు, తెగ మందు కొడతాడు. సినిమా విడుదలయ్యాక బయ్యర్లచేత హాహాకారాలు పెట్టిస్తాడు - వ్యాసకర్త).
బ్రాంట్, లెవీనియాల సంవాదం చూస్తే, వీళ్ళు కాన్ఫ్లిక్ట్ ని రక్తి కట్టిస్తూ కథని బలంగా ముందుకు తీసికెళ్ళిపోతారని నమ్మకం కలుగుతుంది.
5. ఇర్విన్ షా నాటకం ‘బరీ ది డెడ్’ (1936) లో, అమరుడైన సైనికుడి భార్య మార్తా అంటుంది : “ ఇల్లన్నాక పిల్లలుండాలి. అది పరిశుభ్రమైన అందమైన ఇల్లుగా వుండాలి. నాకెందుకు పిల్లలుండకూడదు? వాళ్ళకి లేరా? క్యాలెండర్లో పేజీ చింపిన ప్రతీసారీ వాళ్ళెవరూ తల్లడిల్లిపోరే? ఎంచక్కా ముచ్చటైన అంబులెన్సుల్లో అద్భుతమైన హాస్పిటల్స్ కెళ్ళి మెత్తటి పరుపుల మీద అందమైన పిల్లల్ని కంటున్నారే? వాళ్ళల్లో దేవుడు అంతగా ఇష్టపడుతున్నదేంటో అంతలా పిల్లల్నిచ్చేస్తున్నాడు?”
వెబ్ స్టర్ (ఒక సైనికుడు) : “వాళ్ళు మెకానిక్కుల్ని పెళ్లి చేసుకోలేదు”
మార్తా అంటుంది : “ కాదు! వాళ్ళు పద్డెనిమిదిన్నర డాలర్లతో లేరు. నువ్వున్నావ్. ఇరవై డాలర్ల పెన్షన్ కి యుద్ధంలో నీ చావుని ఆఫర్ చేస్తున్నావ్. ఆ పెన్షన్ తీసుకుని నేను పొద్దంతా బ్రెడ్ కోసం క్యూలో నించుంటా. బటర్ రుచెలా వుంటుందో మర్చేపోయా. నా బూట్లలో వాన నీళ్ళు చీకాకు పెడుతున్నాతడుస్తూ గంటల కొద్దీ ఓ ఇంత మటన్ ముక్క కోసం లైన్లో నిలబడతా. రాత్రెప్పుడో ఇంటికి పోతా. ఎవ్వరూ వుండి చావరు మాట్లాడ్డానికి. బొద్దింకని చూస్తూ అలా కూర్చుంటా గుడ్డి వెల్తుర్లో. గరవ్నమెంటోళ్లు కరెంటు పొదుపు చెయ్యాలిటగా? నాకివన్నీ అంటగట్టి నువ్వెళ్ళిపోతావ్. నాకు మాట్లాడే మనిషి లేకుండా చేసే యుద్ధం నాకెందుకు. నీ ప్రాణాలు పోగొట్టే యుద్ధం నీకెందుకు...”
ఇర్విన్ షా నాటకం ‘బరీ ది డెడ్’ లో దృశ్యం. |
వెబ్ స్టర్ అంటాడు : ‘అందుకే నేనిప్పుడు మనసు మార్చుకున్నా మార్తా”
మార్తా అంటుంది : “ఇప్పుడా? దేనికిప్పుడు? ఓనెల, ఓ ఏడాది, ఓ పదేళ్ళ క్రితం ఎందుక్కాలేదు? అప్పుడెందుకు మనసు మార్చుకుని నో అనలేదు వాళ్ళతో? ఇప్పుడు చావొచ్చాకానా? నీ జీతమెంత? వారానికి పద్దెనిమిదన్నర డాలర్లా? ఈ చిల్లర కోసం నో అన్లేక, చావు ఎదుట నించున్నాక నో అంటావా పిచ్చి వాడా!”
వెబ్ స్టర్ : “అప్పుడు నాకు తట్టలేదు -”
మార్తా : “నువ్వంతే! ముంచుకొచ్చేదాకా రాయిలా కూర్చుంటావ్. ఆల్ రైట్, ఇప్పుడు నో అను. నో అనే టైమొచ్చింది. మీ పద్డెనిమిదిన్నర డాలర్ల బెగ్గర్స్ అందరికీ చెప్పు! వాళ్ళ పెళ్ళాల కోసం, పిల్లలకోసం నో అనమను! నో అనమను! చెప్పు వాళ్ళకి, చెప్పూ!!” కేకేసి పడిపోతుంది.
ఈ పాత్రలు కూడా పోరాడే శక్తితో కదం తొక్కుతున్నాయి. ఏం చేసినా ఎదుటి వాళ్ళు తమతో తలపడేలా చేస్తాయి. గొప్ప నాటకాలు వేటిలో చూసినా, పాత్రలు తమ మధ్య వున్న సమస్యతో ఓడేదాకానో గెలిచేదాకానో చెలరేగుతూనే వుంటాయి. చెహోవ్ రాసిన పాత్రలు కూడా పాసివ్ గా వున్నా శక్తిమంతంగా వుంటాయి. ఆ పాత్రల్లో పోగుబడిన దుర్భర పరిస్థితుల ప్రాబల్యం వాటిని చెక్కుచెదరనీయవు (మన పాసివ్ మేకర్లకి పాసివ్ గా ఎంత ఏడ్పిస్తే అంత తెలుగు తుత్తి. ఈ తెలుగు తుత్తి రిలీజుకి తీరిపోతుంది. ముప్ఫై నలభై కోట్లు నేలపాలై బయ్యర్లు రాళ్ళుచ్చుకు వస్తూంటే ఇంకో సినిమాలో చూసుకుందామని వేడికోళ్ళు. ఆ ఇంకో సినిమా మళ్ళీ యాక్టివా, పాసివా మేకర్లకీ తెలీదు, బయ్యర్లకీ తెలీదు. మళ్లీ రాళ్ళూ వేడికోళ్ళూ. ఎక్కడో హాలీవుడ్ లో మూడు ఆస్కార్ల రచయిత విలియం గోల్డ్ మాన్ అననే అన్నాడు -సినిమా వాళ్లకి ఏమీ తెలిసి చావదని -వ్యాసకర్త).
6. న్యూయార్క్ టైమ్స్ లో ఈ ఆర్టికల్ వచ్చింది...500 హత్యల్ని అధ్యయనం చేస్తే, ఆ హత్యల వెనుక కారణాలు ఆశ్చర్య పర్చాయని మెట్రో పాలిటన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ పేర్కొంది... ఒక భర్త డిన్నర్ లేటు చేసిందని భార్యని కొట్టి చంపాడు. ఒక ఫ్రెండ్ పాతిక సెంట్ల తగాదాలో ఫ్రెండ్ ని చంపేశాడు. శాండ్ విచ్ దగ్గర మాటామాటా పెరిగి, రెస్టారెంట్ ఓనర్ కస్టమర్ ని కాల్చి చంపాడు. తాగుడు మానమని చెప్పిన తల్లిని ఒకడు పొడిచి చంపాడు. బాక్స్ లో ఎవరు ముందు కాయిన్ వేసి పియానో వాయించాలన్నదగ్గర గొంతు పిసికి ఒకడ్ని చంపేశాడింకొకడు.
వీళ్ళంతా పిచ్చివాళ్ళా? స్వల్ప కారణానికే ప్రాణాలు తీసేంత హంతకులుగా ఎలా మారిపోయారు?
(ఇంకా వుంది)
―సికిందర్
8, ఫిబ్రవరి 2022, మంగళవారం
1127 : రివ్యూ!
రచన, దర్శకత్వం:
తు.పా. శరవణన్
తారాగణం : విశాల్, డింపుల్
హయతీ, రవీనా రాజ్, తులసి, యోగిబాబు, మారిముత్తు, బాబూరాజ్, ఇలంగో
కుమారవేల్ తదితరులు
సంగీతం: యువన్ శంకర్ రాజా ఛాయాగ్రహణం : కావిన్
రాజ్
నిర్మాత: విశాల్
విడుదల : ఫిబ్రవరి 4, 2022
***
తెలుగులో ఓ మోస్తరు మాస్ ఫాలోయింగ్ వున్న తమిళ
స్టార్ విశాల్ గత సంవత్సరం నటించిన ‘చక్ర’, ‘ఎనిమీ’ తలుగులో
విడుదలయ్యాయి. ఏమంత ఆదరణ పొందలేదు. తిరిగి ఈ సంవత్సరం తాజాగా ఈవారం ‘సామాన్యుడు’ (తమిళంలో ‘వీరమే
వాగాయి సోదుమ్’ ) తో ప్రేక్షకుల
ముందుకొచ్చాడు. వరసగా యాక్షన్ సినిమాలే చేస్తూ వస్తున్న విశాల్ ఇంకో యాక్షన్
మూవీతో వచ్చాడు. ఈసారి యాంగ్రీ యంగ్ మాన్ పాత్ర పోషిస్తూ. శరవణన్ అనే కొత్త
దర్శకుడు పరిచయమవుతూ. విజయవాడకి చెందిన తెలుగు అమ్మాయి డింపుల్ హయతీ హీరోయిన్. ఈమె
తెలుగులో ‘గల్ఫ్’, యురేకా’, ‘దేవీ2’ లలో
నటించింది. హిందీలో ఒక మూవీలో నటించాక తిరిగి తెలుగులో ‘ఖిలాడీ’ లో
నటిస్తోంది. అయితే ఇప్పుడు విశాల్- శరవణన్- డింపుల్ ల కాంబినేషన్ లో ‘సామాన్యుడు’ ఎలా
వుంది? అసామాన్యంగా వుందా? ప్రేక్షకుల సహనానికి అసందర్భంగా వుందా? ఈ విషయాలు
తెలుసుకుందాం...
పోరస్ ( విశాల్) ఓ మధ్య తరగతి యువకుడు. అతడికి పోలీస్ ఇన్స్
పెక్టర్ అవ్వాలని ఆశయం. తండ్రి(మారిముత్తు) పోలీసే. తల్లి (తులసి), చెల్లెలు
ద్వారకా (రవీనా రవి) వుంటారు. ద్వారక కాలేజీకి వెళ్తూ వుంటుంది. పోరస్ తన చుట్టూ
జరిగే అన్యాయాల్ని సహించలేక పోతాడు. ఈ క్రమంలో హద్దు మీరిప్రవర్తిస్తూంటాడు. ఇలా
చేస్తే రేపు పోలీసు ఉద్యోగం రావడం కష్టమని తండ్రి వారిస్తూంటాడు. ఇలావుండగా
ద్వారకాని ఒకడు టీజ్ చేస్తూంటే పోరస్ వాణ్ని కొడతాడు. ఈ నేపథ్యంలో ఓ కెమికల్
ఫ్యాక్టరీ వల్ల జనం పడే ఇబ్బందుల గురించి పోరాటం చేస్తూంటాడు ఒక సామాజిక కార్యకర్త
(ఇలాంగో కుమరవేల్). ఇది ఆ ఫ్యాక్టరీ యజమాని నీలకంఠం(బాబూరాజ్) కి కోపం
తెప్పిస్తుంది. దీంతో ఆ సామాజిక కార్యకర్తని హత్య చేస్తాడు నీలకంఠం. ఇది కళ్ళారా
చూసిన ద్వారకా కూడా హత్యకి గురవుతుంది. దీంతో చెల్లెలి హంతకుల్ని పట్టుకోవడానికి ఒక
సామాన్యుడుగా పోరస్ ఎలా ప్రయత్నించాడన్నది మిగతా కథ.
మధ్య తరగతి ప్రజలు తమ క్షేమం తాము చూసుకుని, చుట్టూ
జరిగే వాటికి స్పందించక పోతే, వారూ అలాటి పరిస్థితుల్లో
చిక్కుకుంటారనీ, అప్పుడు కాపాడే వాళ్ళెవరూ వుండరనీ
ఈ కథ ద్వారా చెప్ప దల్చాడు దర్శకుడు. కాన్సెప్ట్ బాగానే వున్నా దానికి కథా
రూపమివ్వడంలో విఫల విన్యాసాలు చేశాడు. ఇది వరకు సినిమాల్లో వచ్చిన పాత రొటీన్ మూస
కథా కథనాలు, సన్నివేశాలు ఏర్చి కూర్చి
తీర్చి దిద్దాడు. కుర్చీల్లో ప్రేక్షకులు కుర్చీల్లోనే పడుకునేట్టు. మలయాళం నుంచి, తమిళం నుంచీ కొత్త టాలెంట్స్ కొత్తదనం తీసుకు రావడాన్ని చూసే వాళ్ళం. ఈ
మధ్య వరసగా కొత్త టాలెంట్స్ పాత చింతకాయ లేరుకుని వస్తున్నారు. చెల్లెలి హంతకులపై
పగ దీర్చుకునే లాంటి పాత చింతకాయ రివెంజీ డ్రామా సినిమాలు ఇంకా చూపిస్తూ గర్వకారణంగా
ఫీలవుతున్నారు.
మధ్య తరగతి ప్రజలు తమ క్షేమం
తాము చూసుకుని, చుట్టూ జరిగే వాటికి స్పందించక పోతే, వారూ అలాటి పరిస్థితుల్లో చిక్కుకుంటారనీ, అప్పుడు
కాపాడే వాళ్ళెవరూ వుండరనీ - అనే కాన్సెప్టు తీసుకున్న
కొత్త దర్శకుడికి దీని విలువ తెలియలేదు. దేశంలో ఏం జరిగినా మిడిల్ క్లాస్ మౌనంగా
వుంటున్న సందర్భాలు చూస్తున్నాం. మార్టిన్ నిమోలర్ రాసిన ప్రసిద్ధ జర్మన్ కవితని
గుర్తుకు తెచ్చే కాన్సెప్ట్...
First they
came for the socialists, and I did not speak out—because I was not a socialist.
Then they came
for the trade unionists, and I did not speak out— because I was not a trade
unionist.
Then they came
for the Jews, and I did not speak out—because I was not a Jew.
Then they came
for me—and there was no one left to speak for me.
‘And Then There
Were None’ అనే అగథా క్రిస్టీ నవల ఒకటి. ఈ రెంటినీ జ్ఞప్తికి
తెచ్చే కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు దాన్ని ఆమేరకు నడిపించకుండా పాత రొటీన్ పగా ప్రతీకారాల కథగా
చేసేశాడు. కాన్సెప్ట్ ఒకటైతే కథ ఇంకొకటి. చుట్టూ జరిగే వాటికి సైలెంట్ గా వుండమనే తండ్రి, మాట
వినని కొడుకు, తీరా తన కూతురే హత్యకి గురైతే కొడుకు పగదీర్చుకోవడం-
ఈ చావకబారు కథనంతో కాన్సెప్టు మాయమైపోయింది. దీనికి విశాల్ నటించడమే గాక నిర్మించడం
కూడా!
నిర్మాతగా, హీరోగా
ఈ సినిమా ద్వారా విశాల్ అందించించిన కొత్తదనమేమీ లేదు. పాత్రలో విషయం లేకపోగా
నటనలో జీవం లేదు. ఎమోషన్స్ లేవు. యాంగ్రీ యంగ్ మాన్ గా యాక్షన్ లోకి దిగడానికి
కథలో తగిన విషయం లేదు. నటన, ఫైట్స్
కృత్రిమంగానే వుంటాయి. హీరోయిన్ డింపుల్ హయతీ కూడా ఈ సినిమా ఎందుకు నటించిందో
అర్ధం గాదు. ఆమె రోమాన్స్ సీన్లు చాలా చీప్ గా వున్నాయి. ఇక యోగిబాబు కామెడీ
ఎక్కడా పేలలేదు.
ఇంటర్వెల్ కి
ముందు పది నిమిషాలు తప్ప ఫస్టాఫ్ భరించడం చాలా కష్టం. కొత్త
దర్శకుడికి సీన్లు తీయడం కూడా రాలేదు. బి, సి, గ్రేడ్
సినిమా చూస్తున్నట్టు వుంటుంది. సెకండాఫ్ లో విశాల్ చెల్లెలి హత్యని ఛేదించే
ట్రాక్ ఒక్కటే బావున్నా అది అవసరానికి మించి సాగతీతగా వుంటుంది. యువన్ శంకర్ రాజా
సంగీతంలో ఒకే పాట వుంది. ‘మత్తెక్కించే కళ్ళే…’ అనే
ఈ మాంటేజ్ సాంగ్ కాస్త పర్వాలేదనిపిస్తుంది. కెవిన్ ఛాయాగ్రహణం కూడా ఫర్వా లేదు.
మొత్తానికి విశాల్ కెరీర్ లో ఇంత దారుణమైన సినిమా రాలేదు. వరసగా ఇలాటి యాక్షన్
సినిమాలతో ఫ్లాపులు సాధించడమే ధ్యేయంగా పెట్టుకున్నట్టు వుంది.
—సికిందర్
6, ఫిబ్రవరి 2022, ఆదివారం
5, ఫిబ్రవరి 2022, శనివారం
1126 : రివ్యూ
రచన - దర్శకత్వం: సుధీర్ రాజు
తారాగణం : శ్రీకాంత్, డింపుల్ చోపడే, నటాషా
దోషి, చంద్రమోహన్, సుధ, హేమ, మురళీ శర్మ, పృథ్వీ, పోసాని కృష్ణ మురళి, బిత్తిరి సత్తి, సుడిగాలి
సుధీర్, సత్యం రాజేష్, తాగుబోతు
రమేష్ తదితరులు
మాటలు: విక్రమ్ రాజ్,
స్వామి మండేలా, సంగీతం: సునీల్ కశ్యప్, ఛాయాగ్రహణం : బుజ్జి
నిర్మాతలు: ఏ.ఎస్.కిషోర్, కొలన్ వెంకటేష్
***
1991 నుంచీ 120 కి పైగా సినిమాలు నటించి ఫ్యామిలీ సినిమాల హీరోగా పేరు తెచ్చుకున్న
శ్రీకాంత్ 2022 లో హీరోగా రీ ఎంట్రీ ఇస్తూ ప్రయోగం చేశారు. పాత ఫ్యామిలీ సినిమాల హీరో
అయిన తను, ఈ మధ్య విలన్ పాత్రలేస్తూ ‘అఖండ’లో కూడా కన్పించారు. ఇప్పుడు పాత ఫ్యామిలీ సినిమా హీరోగా పాత టైటిల్ ‘కోతల రాయుడు’ తో, పాత ఫ్యామిలీ సినిమా
నటిస్తూ, కొత్త ప్రేక్షకుల మీద పాత ప్రయోగం చేశారు. ఈ ప్రయోగం చేసిన కొత్త దర్శకుడు, నిర్మాతలు బహుశా పాత
కాలం లోంచి వచ్చారు. అందరూ పాత కాలం లొంచే వస్తారు, కానీ పాతగానే వుండిపోరు. శ్రీకాంత్ సహా దర్శకుడు
నిర్మాతలూ పాతగానే వుంటూ పాతదనంతో మక్కువ తీర్చుకున్నారు. ఈ మక్కువ ఎలా వుందో చూద్దాం...
కథ
ఓ ట్రావెల్ కంపెనీలో మేనేజర్ గా పని చేసే అజయ్ (శ్రీకాంత్) విలాసవంతమైన జీవితం గడుపుతూంటాడు. కోతలు కొస్తూ డబ్బు సంపాదిస్తూ, విచ్చల విడిగా ఖర్చు పెట్టేస్తూంటాడు. ఇలాటి వాడు బాగా డబ్బున్న ధనలక్ష్మి(నటాషా దోషి) ని ప్రేమిస్తాడు. పెళ్ళి చేసుకోవాలనుకుంటాడు. నిశ్చితార్ధం కూడా జరుగుతుంది. ఇంతలో నిశ్చితార్ధం క్యాన్సిల్ అవుతుంది. ఇక సంధ్య (డింపుల్) అనే ఇంకో అమ్మాయిని ని ప్రేమిస్తాడు. కానీ అసలు ధనలక్ష్మితో నిశ్చితార్ధం ఎందుకు క్యాన్సిల్ అయ్యింది? మరి సంధ్యని పెళ్ళి చేసుకున్నాడా? ఈ క్రమంలో ఎదురైన అనుభవాలేమిటి? సమస్యలేమిటి? ఇదీ మిగతా కథ.
ఓ ట్రావెల్ కంపెనీలో మేనేజర్ గా పని చేసే అజయ్ (శ్రీకాంత్) విలాసవంతమైన జీవితం గడుపుతూంటాడు. కోతలు కొస్తూ డబ్బు సంపాదిస్తూ, విచ్చల విడిగా ఖర్చు పెట్టేస్తూంటాడు. ఇలాటి వాడు బాగా డబ్బున్న ధనలక్ష్మి(నటాషా దోషి) ని ప్రేమిస్తాడు. పెళ్ళి చేసుకోవాలనుకుంటాడు. నిశ్చితార్ధం కూడా జరుగుతుంది. ఇంతలో నిశ్చితార్ధం క్యాన్సిల్ అవుతుంది. ఇక సంధ్య (డింపుల్) అనే ఇంకో అమ్మాయిని ని ప్రేమిస్తాడు. కానీ అసలు ధనలక్ష్మితో నిశ్చితార్ధం ఎందుకు క్యాన్సిల్ అయ్యింది? మరి సంధ్యని పెళ్ళి చేసుకున్నాడా? ఈ క్రమంలో ఎదురైన అనుభవాలేమిటి? సమస్యలేమిటి? ఇదీ మిగతా కథ.
ఇది కథయితేగా ఎలావుందో చెప్పుకోవడానికి.
కోతల రాయుడు పని కోతల రాయుడు పాత్ర చేయకుండా, కథకుడే కోతల రాయుడైతే
ఎలా వుంటుందనడానికి శాంపిల్ ఈ సినిమా కథ. కథకుడు కథ వదిలేసి చాలా కోతలు కోశాడు. కథతో
సంబంధంలేని కామెడీలు చేశాడు. డ్రామాలు చేశాడు. అసలు ధన లక్ష్మితో నిశ్చితార్ధం ఎందుకు
క్యాన్సిల్ అయిందో, ఈ సమస్యేంటో, పరిష్కారమేంటో
చెప్పకుండా, ఏవేవో కోతలు సొరకాయల్లా తెగ కోస్తూ ఇదే కథ అనుకున్నాడు.
పాతకాలంలో ఇలా వున్నాయా కథలు? పాత కాలపు కథకుడికి మతి మరుపు కూడా
వున్నట్టుంది. కథలెలా వుంటాయో మర్చిపోయి, తలా తోకాలేని కథ పట్టుకుని, కోతల రాయుడులా తెలివైన కొత్త ప్రేక్షకుల మధ్యకి వచ్చాడు.
ఫ్యామిలీ సినిమాల హీరోగా శ్రీకాంత్ మరోసారి
వెండి తెరమీద ఈ సినిమాతో ప్రకాశించాడు. ఈ ప్రకాశం వేషం, స్టయిలింగ్, నటనల వరకే. పాత్ర గురించీ, పాత్రకున్న కథ గురించీ చెప్పుకోకూడదు.
ఇలా పాత శ్రీకాంత్ ని గుర్తుకు తెచ్చినప్పుడు, గుర్తుండే విషయంతో
కూడా రావాలని ఎందుకు గుర్తుపెట్టుకో లేదో మరి. ఎలాపడితే అలా సినిమాలు ఒప్పుకుని నిర్మాతలు
నష్టపోవడానికి కారకుడు కాకూడదని జాగ్రత్తలు తీసుకునే తను, ఈసారి ఎలా మోసపోయాడో తెలీదు. ఇలా హీరోగా ప్రయోగాలు
చేసేకన్నా విలన్ గా స్థిరపడితే మేలు.
హీరోయిన్లు నటాషా, డింపుల్ లు గ్లామర్ ని బాగానే ఆరబోశారు. ముక్కలు ముక్కలుగా వున్న కథని
గ్లామర్ తో కవర్ చేయడానికి శ్రమిస్తున్నట్టు
కసరత్తులన్నీ చేశారు. ఎన్ని కసరత్తులు చేసినా ఫలితం లేకుండాపోయింది. 30 ఇయర్స్ ఇండస్ట్రీ
పృథ్వీ, హేమ కలిసి
ఒక కామెడీ ఎపిసోడ్ వేసుకున్నారు. కథతో సంబంధం లేకుండా జబర్దస్తీగా
ఒక కామెడీ షో. పోసాని, మురళి శర్మలు కథ లేని సినిమాకి విషయంలేని పాత్రలు. ఇంకా చాలా మంది నటీనటులూ
వాళ్ళ పాత్రలూ వున్నాయి నిండైన కుటుంబ సినిమా అన్పించుకోవడానికి.
కొత్త దర్శకుడు సుధీర్ రాజుకి కథాకథనాలూ దర్శకత్వమూ ఏదీ సాధ్యం కాలేదు. సినిమా
పేరుతో ప్రేక్షకుల నెత్తిన ఓ తమాషాని రుద్ది చేతులు దులుపుకున్నాడు. పూర్తిగా లేని
కథ, కథతో సంబంధంలేని, లాజిక్ లేని సీన్లు, పాత్రలు, కామెడీలూ ... ఇలా ప్రతి నిమిషమూ ప్రేక్షకుల్ని
ముళ్ళ మీద కూర్చోబెట్టి ఆనందం తీర్చుకున్నాడు. దీని పాటల చిత్రీకరణ కోసం సిక్కిం కూడా వెళ్ళాడు. సునీల్
కశ్యప్ తో
పాటలు మాత్రం సరిగ్గానే చేయించుకున్నాడు. కెమెరామాన్ బుజ్జి నుంచి కూడా టాలెంట్ ని
పిండుకున్నాడు. పిండడానికి తనదగ్గరే ఏమీ లేకుండా పోయింది.
—సికిందర్
28, జనవరి 2022, శుక్రవారం
1125 : రివ్యూ!
తారాగణం : కీర్తీ సురేష్, ఆది పినిశెట్టి, జగపతి బాబు, రాహుల్ రామకృష్ణ తదితరులు
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్, ఛాయాగ్రహణం :చిరంతాన్ దాస్
బ్యానర్ : వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్
నిర్మాత: సుధీర్ చంద్ర పదిరి
విడుదల : జనవరి 28, 2022
***
“You’ve got to ask
yourself one question: ‘Do I feel lucky?’ Well, do ya, punk?”
—Clint Eastwood in ‘Dirty Harry’
“No,
sir. Its fucky.”
తెలుగు
వాడైన నగేష్ కుకునూర్ 1998 లో కొత్తగా వచ్చి, ఉండీ
లేని టాలెంట్ తో ’హైదరాబాద్ బ్లూస్’
తీసి ఫేమస్ అయిపోయాడు. అప్పట్నుంచీ వరుసగా హిందీ, ఇంగ్లీష్
భాషల్లో 15 సమాంతర సినిమాలు తీసి రెండు జాతీయ అవార్డులూ, 7
అంతర్జాతీయ అవార్డులూ సాధించాడు. ఇంత పేరు ప్రఖ్యాతులు గడించాక, తెలుగులో తన మొదటి సినిమా తీయాలన్పించి కీర్తీ సురేష్ తో ‘గుడ్ లక్ సఖీ’ తీశాడు. దీన్ని ప్రప్రథమంగా ‘స్పోర్ట్స్ రోమెడీ’ (స్పోర్ట్స్ + రోమాన్స్ +
కామెడీ) జానర్ లో తీస్తున్నానని చెప్పి అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఎందుకో ఇతర
భాషల్లో విడుదల చేయకుండా, తెలుగు ప్రేక్షకులకే ప్రత్యేకం
చేసి వారి పాదాల ముందుంచాడు. మరి ఈ సినిమా చూస్తూంటే పాదాలు కుదురుగా వుంటాయా, మధ్యలో లేచి పరిగెడతాయా?
కీర్తీ
సురేష్ నటించిన ‘మిస్ ఇండియా’ చూసి స్క్రిప్టులు
కాస్త చూసి సెలెక్టు చేసుకోవమ్మా అని ట్విట్టర్ లో ప్రేక్షకులు ఆల్రెడీ ఆర్తనాదాలు
చేసి వున్నారు. మళ్ళీ ఆమె అదే పని చేసింది. కుకునూర్ కి స్టోరీ నేరేషన్ రాదు.
స్క్రిప్టులిచ్చి చదువుకోమంటాడు. అలా కుకునూర్ నుంచి మంచి బరువైన బౌండెడ్
స్క్రిప్టు అందుకుంది కీర్తీ సురేష్. అది చదివింది. అందులో లిఖించిన సువర్ణాక్షర కథ
ఇలా వుంది...
అది రాయల సీమలోని ఒక
గ్రామం. అక్కడో లంబాడీ తండా. ఆ తండాలో సఖి (కీర్తీ సురేష్) అనే లంబాడీ యువతి. ఈమె దురదృష్ట
జాతకురాలని అందరి నమ్మకం. ఈమె ఎదురొస్తే కీడే జరుగుతుందని చిన్న చూపు. ఈ కారణంగా ఈమెకి
పెళ్ళి కూడా కుదరదు. ఈ బ్యాడ్ లక్ సఖీకి గోలీలన్నా, గురి
చూసి కొట్టాలన్నా బలే ఉత్సాహం. ఇలాటి ఈమెకి గోలి రాజు (ఆది పినిశెట్టి) అనే నాటక
నటుడితో స్నేహం. సూరి (రాహుల్ రామకృష్ణ) అనే
ఇంకో దోస్తు కూడా వుంటాడు గానీ, ఇతనంటే పడదు.
ఇలా వుండగా,
ఒక రిటైర్డ్ కల్నల్ (జగపతి బాబు) గ్రామాని కొస్తాడు. షూటింగ్ గేమ్స్ లో కొందర్ని తయారు చేయాలని
ఆశయం పెట్టుకుని వస్తాడు. తయారు చేసి నేషనల్ గేమ్స్ కి పంపాలని లక్ష్యం. ఈ కల్నల్
కి సఖిని తీసికెళ్ళి పరిచయం చేస్తాడు రాజు. గురి చూసి కొట్టే ఆమె టాలెంట్ చూసి ట్రైనింగులో
చేర్చుకుంటాడు కల్నల్. తీరా ఆ ట్రైనింగ్ తో గేమ్స్ పంపాలనుకుంటే ఆమె దృష్టి షూటింగ్ మీద వుండదు. అపార్ధంజేసుకుని విడిపోయిన గోలిరాజు మీద
వుంటుంది. మరోవైపు ఆమెని ప్రేమిస్తూ సూరి వుంటాడు. ఇలా గాడి తప్పిన ఈమెని లక్ష్యం
వైపుకి కల్నల్ ఎలా నడిపించాడన్నది మిగతా కథ.
ముందే చెప్పుకున్నట్టు ఇది ప్రప్రథమ
స్పోర్ట్స్ రోమెడీ దర్శకుడి పరిభాషలో. పూర్వ మెప్పుడో పేపర్లో ఒక వార్త చదివాడు.
ఒక గ్రామీణ యువతికి ఆటల్లో వున్న ఆసక్తి గురించి. ఐతే స్పోర్ట్స్ కథని ఒక గ్రామీణ యువతి ప్రధాన పాత్రగా తీద్దామని ఈ కథ
రాశాడు. దీనికి ప్రేమని, కామెడీనీ జోడిస్తే స్పోర్ట్స్ రోమెడీ ఐపోతుందని బౌండెడ్
స్క్రిప్టు తయారు చేసి కీర్తీ సురేష్ కరకమలాలలో వుంచాడు. ఆమె ఆ స్క్రిప్టుని
షోమాన్ రాజ్ కపూర్ ఎంత పవిత్రంగా భావించి స్క్రిప్టులు చదివేవాడో, అంత భక్తి శ్రద్దలతో చదివింది కుకునూర్ ఇంటర్నేషనల్ ఫేమస్ కాబట్టి.
అందుకని ఇది ‘మిస్ ఇండియా’ ని మించిన
మాగ్నమ్ ఓపస్ అవుతుందని తప్పకుండా భావించడంలో ఆశ్చర్య పోవాల్సిందేమీ లేదు. హీరోయిన్లని
తెలివిలేని గ్లామర్ డాల్స్ గా, కరివేపాకు పాత్రలుగా
సినిమాల్లో చూపిస్తారని విమర్శిస్తారు గానీ, ఎడ్యుకేటెడ్
హీరోయిన్లు చదివి ఓకే చేసే స్క్రిప్టులు
అంతకన్నా ఘోరంగా వుంటాయని తెలుసుకోవడం మంచిది. కీర్తీ సురేష్ సువర్ణాక్షరాలతో కుకునూర్
అందించిన సింగిల్ స్టార్ రేటింగ్ స్క్రిప్టు ని భక్తి శ్రద్దలతో కళ్ళకద్దుకుంది.
కుకునూర్ కి స్టోరీ నేరేషన్ రాదు, కీర్తీకి స్క్రిప్టు రీడింగ్ రాదు. ఇంకేం కావాలి ఇద్దరి జోడీ కలవడానికి? ఇద్దరూ కలిస్తే అది రాంబో కాంబో. గన్ పట్టుకుని కీర్తీ, పెన్ పట్టుకుని కుకునూర్ రాంబో కాంబో. ఈ స్పోర్ట్స్
రోమేడీలో స్పోర్ట్స్ లేదు, రోమాన్స్ లేదు, కామెడీ లేదు. కీర్తిని ప్రత్యేకంగా లంబాడీ పాత్రలో చూపించడంలో
ఉద్దేశమేమిటో తెలీదు. వూరికే అలా చూపిస్తే ముందు పబ్లిసిటీ వస్తుంనదనుకున్నట్టుంది. ఈ సినిమా చూస్తూంటే ఎవరికైనా కామన్ సెన్సు దొలుస్తూ వుంటుంది-
తండాలో మూఢనమ్మకాల బాధితురాలైన బ్యాడ్ లక్ సఖి, వాటి మీద
తిరుగుబాటు చేయడం ఈ కథవుతుంది కదాని...
తండా అందాల బాలగా కీర్తీ సురేష్
అలనాటి పల్లెటూరి ఆడే పాడే హీరోయిన్లని గుర్తుకు తెస్తుంది. కాకపోతే విజయ నిర్మల
లా అట్లతద్ది పాట పాడలేదు ఉయ్యాలెక్కి. జమునలా కట్టె తుపాకెత్తుకుని... అని కూడా
పాడలేదు. కుకునూర్ ఆ సినిమాలు చూసివుండడు. కానీ తెలుగు నేలతో తన సంబంధాలు తెగిపోయి
దశాబ్దాలు గడిచాక, ఇప్పుడు కూడా తెలుగు నేల అదే తను చూసిన నేలలాగే
వుంటుందని ఫీలైపోయి సఖిని ఆహార్యం సహా అలా ఆడించాడు. పాత్రకి క్రీడలో, ప్రేమలో, కామెడీలో ఎక్కడా ఫీల్ లేదు. నటన కూడా
పేలవం.
జగపతి బాబు పాజిటివ్ పాత్రలో బాగానే
కనిపిస్తాడు. కానీ ఎందుకని క్రీడా కారుల్ని తయారు
చేయాలనుకుంటాడో తెలియదు. నాటక నటుడి పాత్రలో ఆది పెనిశెట్టికి ఈ సినిమా వృధా. డిటో
రాహుల్ రామకృష్ణ.
ఇక దేవీశ్రీ ప్రసాద్ సంగీతం గురించి
అసలు పట్టించుకోలేదు. కథ విని ఇంతకంటే అవసరం లేదనుకున్నాడేమో, పాటలు ఏదో సర్దేశాడు. కెమెరా వర్క్ సహా ప్రొడక్షన్ విలువలు మాత్రం టాప్
హీరోయిన్ కాబట్టేమో బావుండేట్టు చూసుకున్నారు.
‘గుడ్ లక్ సఖీ’ అని టైటిల్ పెట్టేంత గుడ్ లక్కేమీ లేదు కుకునూర్
ప్రయత్నంలో. బేసిగ్గా కథ ఎలా చేసుకోవాలో
కూడా తెలియలేదు. ఈ కథని కీ శే హృషీకేశ్ ముఖర్జీతో కొలాబరేట్ అయి
తీద్దామనుకున్నాట్ట. ఆ పని చేసినా బావుండేది. హృషికేశ్ చేతిలో కడుపుబ్బా నవ్వించే
స్పోర్ట్స్ కామెడీ అయ్యేది. ఆయన నవ్వించడం మొదలెడితే ఇంకెలాటి నాన్సెన్స్
పెట్టుకోడు. బ్యాడ్ లక్ తెస్తుందని వూరంతా అనుకునే హీరోయిన్ లక్కీ ఛార్మ్ గా ఎలా
మారుతుందో కథ చెప్పకుండా- స్పోర్ట్స్,
రోమాన్స్, కామెడీలతో ఏం చెప్పాడో కుకునూర్ అర్ధం గాదు. స్పోర్ట్స్
కీ, రోమాన్స్ కీ అసలు కనెక్షనే లేదు. ప్రారంభ దృశ్యాలే కథ
క్వాలిటీని చెప్పేస్తాయి. మనకి తెలియకుండా పాదాలు అప్పట్నించే ఎలాగో అన్పిస్తూంటాయి.
ఏమిటా అని చూసుకుంటే పరారీకి తయారీ చేసుకుంటున్నాయన్న మాట. పరారైతే రివ్యూ ఎలా? అందుకని చివరి దాకా పాదాల్ని గట్టిగా పట్టుకుని కూర్చోవడం. సినిమాలు ఇలా
తీసి, టికెట్ల ధరలు పెంచేస్తే చిన్న సినిమాలు బతకవని గొడవ
చేయడంలో అర్ధముందా? రెండు మూడొందలు పెట్టి ఇలాటి
సినిమాలెవరైనా చూస్తారా?
ఇంకా అవే టెంప్లెట్ స్పోర్ట్స్
సినిమాలేమిటి? తండాలో మూఢనమ్మకాల బాధితురాలైన సఖి, గన్ షూటింగ్ ట్రైనింగుతో కలిసొచ్చిన అవకాశాన్నంది పుచ్చుకుని, ట్రైనింగ్ పూర్తవగానే గన్ తో జంపై- మూఢ నమ్మకాలనే మూర్ఖత్వం మీదా, మూఢ నమ్మకాలతో తనకి పెళ్ళవకుండా చేస్తున్న మూర్ఖుల మీదా తిరుగుబాటు ఫన్
డ్రామా క్రియేట్ చేయకుండా?
గ్రామీణ పేద యువతులు స్పోర్ట్స్ కెళ్ళాలంటే చాలా సమస్యలుంటాయి. కట్టడి, అణిచివేత, వివక్షా వగైరా. స్పోర్ట్స్ లో నారీ విజయమనే అరిగిపోయిన పాత ఫార్ములా తర్వాత - ముందు బ్యాక్ గ్రౌండ్ లో క్లీనప్ చేయాల్సిన అడ్డుపడే సామాజిక చెత్త చాలా వుంది. సమాజాన్ని చదివి, సమాజంలోంచి కథలు తీసి సమాంతర సినిమాలు తీస్తూ ప్రశంసలు పొందుతున్న నగేష్ కుకునూర్ తీయాల్సిన సినిమా మాత్రం కాదిది.
గ్రామీణ పేద యువతులు స్పోర్ట్స్ కెళ్ళాలంటే చాలా సమస్యలుంటాయి. కట్టడి, అణిచివేత, వివక్షా వగైరా. స్పోర్ట్స్ లో నారీ విజయమనే అరిగిపోయిన పాత ఫార్ములా తర్వాత - ముందు బ్యాక్ గ్రౌండ్ లో క్లీనప్ చేయాల్సిన అడ్డుపడే సామాజిక చెత్త చాలా వుంది. సమాజాన్ని చదివి, సమాజంలోంచి కథలు తీసి సమాంతర సినిమాలు తీస్తూ ప్రశంసలు పొందుతున్న నగేష్ కుకునూర్ తీయాల్సిన సినిమా మాత్రం కాదిది.
—సికిందర్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)