రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Sunday, March 28, 2021

1032 : సందేహాలు - సమాధానాలు

Q : కథ సులభంగా రాసే పద్ధతేమైనా వుంటే వివరిస్తారా? ఎంత ట్రై చేసినా నేననుకున్న కథ రావడం లేదు.
శంభూ కుమార్ అనే మారు పేరుతో అసోసియేట్ పంపిన ప్రశ్న

A : సులభంగా కథ రాసే పద్ధతుంది. అయితే పాత్రతో ఆలోచిస్తే కథ రాదు. సంఘటనతో ఆలోచిస్తే వస్తుంది. ఈ టాపిక్ కదిపితే చాలా చెప్పుకు రావాలి. సంఘటనతో కథ ఎలా వస్తుందో చెప్పి వూరుకుంటే మీ కేమీ సరిపోదు. వెనక్కి వెళ్ళాలి. ఐడియా నుంచీ ఎత్తుకోవాలి. ఆ నియమాలకి మీ మనసు ఒప్పుకోవాలి. 99% ఇది జరగదని ఖచ్చితంగా చెప్పొచ్చు. 99% నియమాలా పాడా, నేనే ఒక నియమం అన్న నినాదమే వుంటుంది. అలాగే తీసే సినిమాలు కూడా ఏం తక్కువ తినకుండా, మేమే మీ నినాదానికి మించిన మంచి మంచి ఫ్లాపులం - అని వారానికి నాలుగేసి చెప్తాయి. అయినా సరే, చేపట్టిన నినాదమే ప్రధానం.

        నియమాల్ని కనిపెట్టిన వాడెవడో గానీ ముందు వాణ్ణి ఫ్లాప్ చేయాలి. విచిత్రమేమిటంటే, ఈ నియమాలనేవి హిట్టయిన సినిమాల్లోంచే వచ్చాయి. అయినా హిట్టయిన సినిమాల్నే ఒప్పుకోని అట్టర్ ఫ్లాపు నృత్య కేళీ కలాప నినాదాలన్న మాట. అంతిమంగా చిల్లు జేబులతో భామా కలాపం. తెల్లవారితే గురువారం సాయిబాబా పూజా కాదు, పరాజయ గండం. ఈ నియమాలూ, నేనే ఒక నియమం అన్న నినాదమూ - వీటి మధ్య ఈ సంఘర్షణా ఓ పక్క వుండగానే, 1% ఎక్కడ్నించో తొంగి చూసి, కథ రాసే సులభ పద్ధతి కోసం నియమాలు అడగడం. 1% కోసమే నియమాలనేది తెలిసిందే కాబట్టి, ఆ 1% కోసం ఈ బ్లాగు.
***

        ఎంత ట్రై చేసినా కథ రావడం లేదంటే, సరీగ్గా ట్రై చేయడం లేదనే అర్ధం. సరీగ్గా ట్రై చేసేందుకు ముందు మనస్సు ఒప్పుకోవాలి. ఒప్పుకోదు. కొందరు ఈజీగా వుంటుందని పాత్రని డిసైడ్ చేసుకుంటామంటారు. వెళ్ళి ఏమేమో ఆలోచిస్తారు. రెండు నెలల తర్వాత సరైన పాత్ర తట్టడం లేదంటారు. పాత్రకి ఏ కథ తీసుకోవాలో నిర్ణయానికి రాలేక పోతున్నామంటారు. ముందు సంఘటన ఆలోచించమని కొన్ని సంఘటనలు చెప్తే అస్సలు రుచించదు. నియమాలు రుచించవుగా. మళ్ళీ ఇంకేదో పాత్ర ఆలోచిస్తామని వెళ్ళి మళ్ళీ పాత్రే ఆలోచించడం మొదలెడతారు. చూసేవాళ్ళకి కథ మీద నెలల తరబడి బాగా కష్టపడుతున్నాడని అన్పిస్తుంది. ఎలా ఆలోచించి కష్టపడుతున్నాడో కనిపించదు.

        వార్తా విలేఖరి ఎవరి మీద ఏం రాయాలా అని ఆలోచిస్తూ కూర్చోడు. ఏం సంఘటనలు జరుగుతున్నాయో చూస్తాడు. మంత్రి ప్రెస్ మీట్ పెడితే అది సంఘటనే. ఆ సంఘటన గురించి వార్త రాస్తాడు. అంతే గానీ మంత్రిని ఆలోచించుకుని, మంత్రి మీద రాద్దామంటే ఏం రాస్తాడు. అక్షరమాల చూస్తూ కూర్చోవడమే. పాత్రతో కథ ఆలోచించడమంటే కూడా అక్షరమాల చూస్తూ కూర్చోవడమే. పాలుపోక అ ఆలు నేర్చుకుంటూ కూర్చోవడమే. రెండు నెలల తర్వాత తమిళ అక్షర మాల వేసుకుని మళ్ళీ అదే పని. 

        అక్షరాలతో కథ రాసే ట్రాప్ లో ఎలా పడతారంటే, ముందు పాత్ర అనుకుంటారు. ఆ పాత్రతో అక్షరాలు పట్టుకుని రాస్తూ పోతూంటారు. రాస్తూ రాస్తూ వుంటే ఎక్కడో ఏదో తగలక పోతుందాని అక్షర సేద్యం చేస్తూంటారు. పేజీలకి పేజీలు అక్షర భాండాగారం సృష్టిస్తారు. పాత్ర అనుకుంటే అక్షర భాండాగారమే మిగుల్తుంది. కథ వుండదు. పాత్ర అనుకుని దానికో సంఘటన అనుకున్నా సంఘటన రాదు, ముందు సంఘటన మెదిల్తేనే దాంతో పాత్ర వస్తుంది. ప్రెస్ మీట్ లేకపోతే అక్కడ మంత్రి లేడు. న్యూస్ లేదు.

        పాత్రకి సంఘటనతో ఏం సంబంధం? సినిమా కథంటేనే సంఘటన ప్రధానమైనది గనుక. ఒక్కడు లో మహేష్ బాబు, కర్నూలులో ప్రకాష్ రాజ్ బారి నుంచి భూమికని కాపాడి తీసుకొచ్చే సంఘటనే లేకపోతే మహేష్ బాబు పాత్ర లేదు. ఆ సంఘటన సృష్టించిన పరిణామాల్ని ఎదుర్కొనే పాత్ర ట్రావెల్ లేదు. అంటే  ఒక్కడు కథ లేదు. అలాగే శివ లో నాగార్జున సైకిలు చెయినుతో జేడీని కొట్టే సంఘటనే లేకపోతే నాగార్జున పాత్ర లేదు. ఆ సంఘటన సృష్టించిన పరిణామాల్ని ఎదుర్కొనే పాత్ర ట్రావెల్ లేదు. అంటే శివ కథ లేదు. 
 
        సంఘటన పాత్రని సృష్టిస్తుంది. కనుక సంఘటనల్ని చూడాలి. ఈ సంఘటన ప్లాట్ పాయింట్ వన్ మలుపే. దీన్నే కాన్ఫ్లిక్ట్ అంటారు. హాలీవుడ్ నిర్మాతలు ముందు కాన్ఫ్లిక్ట్ అడుగుతారు. ఇక్కడే కథ పుట్టి పాత్ర దాన్ని నడిపిస్తుంది గనుక. సంఘటనే జరగకపోతే, అందులోంచి కథే పుట్టక పోతే, పాత్రకి ఏ కథ పెట్టి నడిపిస్తారు. అందుకని వొట్టి పాత్రతో కథ ఆలోచించకుండా, సంఘటనతో కూడిన పాత్రతో కథ ఆలోచించాలనేది.

***
        ఇప్పుడుంది అసలు సంగతి. ఇందులోకి వెళ్ళామంటే పారిపోవాలన్పిస్తుంది. మనసు అస్సలు ఒప్పుకోదు. సంఘటన అంటేనే ఐడియా. ఐడియా అంటేనే నియమాలు. నియమాలంటేనే ఎక్కడా ఆనవాళ్ళు మిగలకుండా మనసు పుంజాలు తెంపుకుని పారిపోవడం. నో ప్రాబ్లం, మిగిలింది 1% అనుకున్నాం కాబట్టి వాళ్ళ గురించే మాట్లాడుకుందాం. 135 కోట్ల జనాభాలో మల్టీ మిలియనీర్స్ 3 శాతమే. చేరువలో వున్న 1% మంచి శాతమేనని ఆనందిద్దాం. స్ట్రక్చర్ మల్టీమిలియనీర్స్ గౌరవప్రదమైన 1 శాతమని తేలారు.    

సంఘటనంటే ఐడియానే అనుకున్నాం కాబట్టి, ఆ తట్టిన సంఘటన మీద వర్క్ చేసేప్పుడు స్ట్రక్చరాశ్యులు కూడా మనసుకి అడుగడుగునా కళ్ళెం వేసుకుంచుకోవాలి. ఐడియాని స్టడీ చేస్తున్నప్పుడు దాని మీదే వుండాలి. అప్పుడే లైనార్డర్ ఆలోచనలతో లైనార్డర్ మీదికి జంప్ చేయకూడదు. ఐడియా స్టడీలో భాగంగా మార్కెట్ యాస్పెక్ట్ + ఆర్గ్యుమెంట్ + స్ట్రక్చర్ = ఐడియా అనే సమీకరణని సాధించడానికి మనసు అంగీకరింఛాలి.     

ఇది చేస్తున్నప్పుడు కూడా లైనార్డర్ ఆలోచనలతో లైనార్డర్ మీదికి జంప్ చేయకూడదు. ఐడియాకీ లైనార్డర్ కీ మధ్య మరోటుంది. అది సినాప్సిస్. అలా స్టడీ చేసిన ఐడియాతో, మూల కథ కేర్పడ్డ చట్రంలో, కథా విస్తరణ చేస్తూ స్ట్రక్చర్ విభాగాలతో కూడిన సుస్పష్టమైన సినాప్సిస్ రాసేందుకు మనసు రాజీ పడాలి. ఇది చేస్తున్నప్పుడు కూడా లైనార్డర్ ఆలోచనలతో లైనార్డర్ మీదికి లాంగ్ జంప్ చేయకూడదు.   
      
        అప్పుడా తయారైన సినాప్సిస్ తో దృశ్యాల వారీగా, ఆయా స్ట్రక్చర్ విభాగాలు సూచించే బిజినెస్సులతో, లైనార్డర్ తయారు చేసుకుంనేందుకు మనసు సెటిల్ అవ్వాలి. ఇది చేస్తున్నప్పుడు కూడా ట్రీట్మెంట్ ఆలోచనలతో  ట్రీట్మెంట్ మీదికి హై జంప్ చేయకూడదు. ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడూ, డైలాగ్ వెర్షన్ ఆలోచనలతో డైలాగ్ వెర్షన్లోకి లాగిపెట్టి స్కూబా డైవింగ్ చేయకూడదు. ఇలా ఎక్కడికక్కడ మనస్సుని కట్టేసుకునే శక్తిని సముపార్జించుకోవాలి మొదట. శక్తి చాలా ఆత్మవిశ్వాసాన్నిస్తుంది. ఈ ప్లానింగ్ తో స్క్రిప్టు రాస్తే దానికదే కథ పకడ్బందీగా వస్తుంది.

Q : వచ్చిన ఐడియాని కథ రూపంలో రాసి, రాసినవి, రాసేవి అన్నీ అద్భుతాలే అనే భ్రమలో బ్రతికే నాకు మీబ్లాగు ఒక కనువిప్పు. అయితే రాసిన కథలో నిర్మాణాత్మక విలువలు ఉంటే దర్శకత్వం చేయడం కన్నా ఉత్తమ మార్గం లేదు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అన్నారు. కథ కరెక్ట్ డెవలప్మెంట్ చేసి ఎవరికి చెప్పుకోవాలి అనే రచయిత దర్శకత్వం చేయాలంటే ఏం చేయాలి?
మణి కుమార్

A :  గత వారం మీ ప్రశ్నకి సమాధానంగా, మీరు రైటర్ అవాలనుకుని స్క్రీన్ ప్లే పుస్తకాలు కొనుక్కున్నానన్నప్పుడు, రైటర్ అవాలనుకుంటే ముందు స్క్రీన్ ప్లే నేర్చుకోవడం మీదే దృష్టి పెట్టమన్నాం. మళ్ళీ కథల గురించే కాక, దర్శకత్వం గురించీ కూడా ప్రశ్నపంపారు. మీరు దేన్నయితే నేర్చుకోవాలనుకున్నారో దాని మీద దృష్టి పెట్టకుండా దాంతో వచ్చే ఫలితాల మీద దృష్టి పెడితే ఎన్నటికీ నేర్చుకోవాల్సింది నేర్చుకోలేరు.

(మిగిలిన ప్రశ్నలు వచ్చే ఆదివారం)

సికిందర్  

 

Saturday, March 27, 2021

1031 : స్క్రీ. టిప్స్


       1967 లో సాక్షిఅనే తొలి కళాత్మక ప్రయత్నం చేసినప్పుడే బాపుగారి నేపధ్యం చిత్ర లేఖనం. అలా చిత్రకారుడు చలన చిత్ర కారుడైనప్పుడు ఆ సృజనాత్మకతకి వయస్సే మీదపడదేమో? ‘ముత్యాల ముగ్గుతీసి నలభై ఆరేళ్ళు కావొస్తున్నా ముదిమితనం అంటనే లేదు. మళ్ళీ ఒక్కసారి ఆన్ లైన్లో చూస్తే, ఏ విభాగంలో ఇది నేటి కాలానికి వెనుకబడింది? కథా కథనాలా? మాటలా? సంగీత  సాహిత్యాలా? నటనలా? చిత్రీకరణలా? ఏదీ కాలదోషం పట్టని అసమాన సృజనలే. అసలే మేకప్పూ లేని నటీ నటులతో వాస్తవిక కథాచిత్రాల నడక నడుస్తూనే, కమర్షియల్ గా సూపర్ సక్సెస్ కావడం దీనికే చెల్లింది.

        ఇంకో దశాబ్ద కాలంలో ఆర్టు సినిమాల చెలామణి చరమాంకం కొస్తుందనగా,  బాపు భవిష్యద్దర్శనం చేసినట్టు అప్పుడే (1975లో) ఈ ముందుకాలపు కమర్షియలార్టునిచ్చారు. ఉత్తరాదిన ఆర్టు సినిమాల ఉద్యమం ముగిశాక, వాటి స్థానాన్ని భర్తీ చేస్తూ ఆతర్వాత బాలీవుడ్ లో క్రాసోవర్ సినిమాల పేరుతో వచ్చినవన్నీ, నేటికీ వస్తున్నవీ, ముత్యాలముగ్గుటైపు కమర్షియలార్టు సినిమాలే.

        ముత్యాలముగ్గుఅనగానే రావుగోపాలరావు మెదలడం సహజం. కానీ ముత్యాలముగ్గుఅంటే కేవలం రావుగోపాలరావు క్లాసిక్ విలనీ మాత్రమే కాదు, బహు సుందరమైన కుటుంబ గాథ కూడా. ఒక శోకనాశన జానకీ వృత్తాంతం. ఆధునిక రామాయణం. ఉత్తర రామాయణం. విడిపోయిన తల్లిదండ్రుల కోసం పిల్లల గేమ్ ప్లాన్!

        శ్రీధర్, సంగీతలు భార్యాభర్తలు. బాధితురాలు భార్యే. బాధకుడు డబ్బుకోసం ఏమైనా చేసే కాంట్రాక్టర్ రావుగోపాలరావు. అప్పుడా తమ తల్లి అవస్థ చూడలేక కవలలిద్దరూ సదరు కాంట్రాక్టరు దురాగతాన్ని నిరూపించి, పునీతురాలిగా తిరిగి తల్లిని కన్నతండ్రితో కలిపి సుఖాంతం చేసే వృత్తాంతమే.

1. ఏదో ఒకటి ఎంచుకో
     సినిమా కథని ఆసక్తిగా మొదలెట్టాలంటే రెండు మార్గాలున్నాయంటాడు సిడ్ ఫీల్డ్. ఏదైనా ఒక సంఘటనతో యాక్షన్ దృశ్యాల్ని చూపడం, లేదా పాత్ర ద్వారా కథని వివరిస్తూ పోవడం. బాపుగారు తన మూడంకాల స్క్రీన్  ప్లేకి ఈ రెండో విధానాన్నే ఎంచుకున్నారు. శ్రీధర్ పాత్ర ద్వారా జమీందారు అయిన తండ్రి కాంతారావుని, ఆయన అక్కగార్ని, ముక్కామలని, అతడి మోడరన్ కూతుర్ని, అక్కడి ఉద్యోగి అల్లు రామలింగయ్యని, శ్రీధర్ స్నేహితుడ్నీ చకచకా పరిచయం చేసేసి- ఆ స్నేహితుడి చెల్లెలి పెళ్ళికి శ్రీధర్ ని పంపించేసి, ఆ పెళ్ళికూతురి రూపంలో సంగీతాని చూపిస్తారు.

        ప్రారంభంలోనే చాలా ఆసక్తి రేపే ఘట్టం. హీరోయిన్ పెళ్ళవుతోంటే హీరో రావడం! ...ఇలాంటి ప్రారంభంతోనే ఆ మధ్య కాలం వరకూ అదేపనిగా చాలా సినిమా లొచ్చాయి. ఇప్పుడు కూడా కొంచెం మార్పుతో తెల్లవారితే గురువారం వచ్చింది. ఇది ముత్యాలముగ్గుపెట్టిన భిక్షే. ఈ ప్రారంభ ఘట్టంలోనే సంగీత పెళ్లి చెడిపోయి, శ్రీధర్ ఆపద్ధర్మంగా ఆమెనే చేసుకోవాల్సిరావడంతో, టైమ్ అండ్ టెన్షన్ గ్రాఫ్ అమాంతం పెరిగి, కథకి గట్టి ముడి పడిపోతుంది ఆదిలోనే. ఇదంతా కేవలం ఎనిమిది సీన్లలోపే జరిగిపోతుంది.

        రిచర్డ్ గెర్ నటించిన విజయవంతమైన సినిమా అన్ ఫెయిత్ ఫుల్’ (2002) లో ఐదవ సీనుకల్లా కథ ముడి పడిపోతుంది. ఇలాటి క్లుప్తీ కరించిన కథనాలే అసలు సిసలు సినిమా కథనాలవుతాయి. ముత్యాలముగ్గుఈ సెక్షన్ లో అపూర్వంగా నిలబడుతుంది. దర్శకుడు బాపూ- ఈ కథా, సంభాషణలూ రాసిన రచయిత రమణా, ముత్యాలముగ్గుని భావి తరాలకి రిఫరెన్స్ గైడ్ లా అందించారు . ఏ కథైనా సరదాగా మొదలై, సంక్షుభితంగా మారి, తిరిగి శాంతి సామరస్యాలు స్థాపించే మూడంకాల నిర్మాణంలోనే  వుంటుంది. ఆనందంగా సాగుతున్న శ్రీధర్-సంగీతల వైవాహిక జీవితంలోకి రావుగోపాల రావుని ప్రవేశపెట్టి సంక్షుభితం చేస్తారు బాపు. కడుపుతో వున్న సంగీత శీలమ్మీద నిందపడి వీధి పాలవుతుంది.

2. రస భంగం మానుకో!

          ఫస్టాఫ్ లో ఇలా విడదీయడం సులభమే. సెకండాఫ్ లో కథనానికి ఔచిత్య భంగం కలక్కుండా తిరిగి కలపడమే పెద్ద సమస్య. అంటే ఫస్టాఫ్ ఏ రస ప్రధానంగా సాగిందో సెకండాఫ్ అదే రస ప్రధానంగా సాగాలి. ఇప్పుడు ఈ చౌరాస్తా నుంచీ కథ ఎటువైపు వెళ్ళాలి? పిల్లలు పుట్టి రావడానికి ఇంకా చాలా టైముంది. సంగీత మీద పడ్డ నింద తొలగించేందుకు కథకి ఉపయోగపడే సాధనాలు వాళ్ళే.  వాళ్ళు దూకాల్సిన కార్య క్షేత్రంలోకి ముందుగానే ఇంకో పాత్రని పంపి కథ నడిపించడం కోరి (సెకండాఫ్) గండాన్ని తెచ్చుకోవడమే.

     పోనీ శ్రీధర్-సంగీతల ఎడబాటు తాలుకూ బాధల్ని వాళ్లిద్దరి మీదా  చిత్రీకరిస్తూ కాలక్షేపం చేద్దామా అంటే అదీ సుడిగుండంలో పడేస్తుంది. పైగా  రసభంగం కల్గిస్తూ శోక రసాన్ని ఉత్పత్తి చేస్తుంది. మరి పిల్లలు పుట్టి వచ్చేవరకూ కథ ఎలా నడపాలి? మొదట్నించీ చూస్తే  ఈ కథ అద్భుత రస ప్రధానంగానే నడుస్తూ వచ్చింది. ఈ అద్భుత రసాన్నే ఇక ముందూ కొనసాగించాల్సి వుంటుంది. అప్పుడే కథకి ఏకసూత్రత చేకూరుతుంది.  అందుకని ఈ అద్భుతరస స్రవంతికి  ఒక సాధనంగా ఉంటూ వస్తున్న  రావుగోపాలరావు అండ్ గ్యాంగు ని పోస్ట్ మార్టం చేసే పని చేపట్టారు సిద్ధహస్తులైన బాపూ-రమణలు దిగ్విజయంగా!

        ఇదీ సరైన సెకండాఫ్ కథనానికి మార్గం! ఇదే సూత్రం! ఏ రసప్రధానంగా కథ ప్రారంభమై దాని ఆలంబనగా కొనసాగుతోందో, అదే రస స్రవంతిని పట్టుకుని ఇంటర్వెల్ చౌరస్తా నుంచీ దారితప్పకుండా సాగి పోవడమే దిశ-దశ-సమస్తం కూడా! ఇలా రంగ్ దే లో వుందా?

3. ఆత్మిక దాహం తెలుసుకో

   సరేఎవరీ రావుగోపాలరావు అండ్ గ్యాంగులో దొంగలుఓ అమాయకురాలి కాపురాన్ని చెడగొట్టిన రావుగోపాలరావుముక్కామలఅల్లురామలింగయ్యనూతన్ ప్రసాద్ లు- అనే ఈ దుష్ట చతుష్టయం బతుకుల్లో చీకటి కోణాలేమిటి?...అనే సెకండ్ ట్రాక్ ఓపెన్ చేసివాళ్లకి వాళ్ళు వెన్నుపోట్లు పొడుచుకునే ఆత్మవినాశక చర్యలతో టైం అండ్ టెన్షన్ థియరీకి న్యాయం చేస్తూ అమాంతం కథనంలో టెంపో- దాంతోబాటు కొత్త సస్పెన్సూ సృష్టించేశారు!

        చేసిన పాపం చావదనే కదాసృష్టిలో ప్రతిదీ బూమరాంగ్ అవుతుంది. మంచి చేస్తే మంచీచెడు చేస్తే చెడూ చుట్టూ తిరిగి తిరిగి మనకే వచ్చి ఠపీమని తగుల్తుంది. ఈ దుష్ట చతుష్టయం ధనదాహంతో సంగీతని వనవాసం పట్టించినప్పుడుసృష్టి చూస్తూ ఊరుకోదుగా. సృష్టెప్పుడూ హెచ్చు తగ్గుల్ని సమతూకం చేసే దిశగానే కదుల్తూంటుంది. సంగీతకి ఆ స్థాయిలో అన్యాయం చేసి హెచ్చిపోయిన కీచకుల అదృష్టాల్ని ఛిన్నాభిన్నం చేసిఆ నష్టపరిహారం సంగీతకి ఇప్పించడం సృష్టి ధర్మం కదా?

మొన్నెవరో అడిగారు. మీరు కొన్ని కథల్ని పురాణాల ఆధారంగా ఎలా వివరిస్తున్నారని. కళారంగంలో వుండాలంటే ఆస్తికత్వంతో, నాస్తికత్వంతో అన్నిటితో ఎంతో కొంత వుండాలిగా. కళలు పోరాటాల నుంచి ఎంత పుట్టాయో, స్పిరిచ్యువాలిటీ నుంచీ అంతే పుట్టాయి. స్పిరిచ్యువాలిటీ నుంచీ వచ్చేవి ఆత్మిక దాహాన్ని తీరుస్తాయి. ఈ కథలో ఈ ఫిలాసఫీ ఎంచక్కా ఇమిడిపోయి, సంగీత పాత్ర పట్ల ప్రేక్షకులకి ఎనలేని సానుభూతేర్పడుతుంది.

4. కాస్త శాస్త్రం చూడు

    ఇలా సాగుతూండగాసంగీతకి పుట్టిన కవలలు తల్లిదండ్రుల్ని కలిపే అధ్యాయం మొదలౌతుంది. వీళ్ళ చేత ఈ పని ఎలా చేయించాలి?  ఇది మిలియన్ రీళ్ల ప్రశ్న! ఎవరికీకథని ఉదాత్తంగా చెప్పాలని సమకట్టిన వాళ్ళకే. ఇందుకు ముందుగా శాస్త్రం తెలియాలి.

     కృతయుగంలో మనుషులు సత్వర ఫలితాలు పొందేందుకు ధ్యానం చేసే వాళ్లట. త్రేతాయుగంలో యాగాలు చేశారనిద్వాపరయుగంలో అర్చనద్వారా పొందారనీఇక కలియుగంలో జ్ఞాన శూన్యులైన అల్పులు అధైర్య పడకుండా సంకీర్తన ద్వారా సత్వర ఫలితాలు పొందవచ్చనీ  సూత మహర్షి చెప్పాడు. అల్పులైన పిల్లల చేత బాపుగారు ఈ పనే చేయించారు!

        రామాలయంలో ఒకర్నీ, రావుగోపాలరావు ఇంట మరొకర్నీ పడేసి, సంకీర్తనలతో మస్కాలు కొట్టిస్తూ స్వకార్యం పూర్తి చేయించారు. అక్కకేమో ఆంజనేయుడితో ఫాంటసీ, తమ్ముడికేమో కోతితో ప్రాక్టికాలిటీ! తత్ఫలితంగా రావుగోపాలరావు చాప కిందికి నీళ్ళొచ్చేయడం!

5. ఎలా ముగిస్తావ్

       ఇప్పుడు ఈ మజిలీకి చేరిన కథని ఎలా ముగించడంమళ్ళీ శాస్త్రమే! సృష్టికర్త ఈ సృష్టిని ఎలా ఉపసంహరిస్తాడుబ్రహ్మ పురాణం ఏం చెప్తోందిత్రివిధాలుగా సృష్టి ఉపసంహారం జరగవచ్చంది. నైమిత్తికంప్రాకృతికంఆత్మీంద్రికం...మొదటిదాంతో పంచభూతాలు ఒకదాన్నొకటి మింగేసుకుని ఆకాశం శూన్యమైపోతుంది. రెండోదాంతో ప్రకృతి పరమాత్మలో కలిసిపోతుంది. మూడో ప్రక్రియలో మానవాళి మోక్షమార్గం ద్వారా జరుగుతుంది.

  సినిమాలో ఆల్రెడీ వెన్నుపోట్లతో తెగ కలహించుకుంటున్న దుష్ట చతుష్టయం కీచులాటలన్నిటినీ,  ఇక పతాక స్థాయికి చేర్చి, పంచ మహాభూతాల్లా ఒకర్నొకరు మింగేసుకునే నైమిత్తిక ముగింపునే ఇచ్చారు చాలా టెర్రిఫిక్ చిత్రీకరణతో! అప్పుడంతా  ఆకాశం శూన్యమైపోయినట్టు శ్మశాన నిశ్శబ్దం! తిరిగి తాజాగా సృష్టి మొదలైనట్టూ...శ్రీధర్-సంగీతల కాపురం.

***

        డైరెట్రూపైనేదో మర్డర్ జరిగినట్టు లేదూ ఆకాశంలోసూర్యుడు నెత్తురు గడ్డలా లేడూమాసిపోయిన మూస పాత్రలుడైలాగులుయాక్టింగులూ మర్డరై పోయిన దృశ్య మయ్యా ఇదీ. డైరెట్రు అన్నాక కాస్తంత కళా పోసనుండాలయ్యా. ఉత్తినే కాపీకొట్టి కాలరెగరేస్తే డైరెట్రుకీదిగిపోయిన బ్యాట్రీకీ తేడా ఏటుంటది?’

        ‘ముత్యాలముగ్గు’ లో రావు గోపాలరావు ఫేమస్ విలనీ రీమిక్స్ అయిందని పై డైలాగు చూసి వాటి కోసం ఎవరైనా మార్కెట్లో పరుగులు దీస్తే, అంతకన్నా  కర్సయిపోవడం’ వుండదు! అది యాభైలో సగం పన్నెండున్నర’ బాపతు అమాయకత్వమవుతుంది. పై నివేదన నేటి అభిరుచిగల ప్రేక్షకుడి/ప్రేక్షకురాలి ఆవేదనే కావొచ్చు. ముత్యాలముగ్గు’ ని చూసిన కళ్ళతో నేటి సినిమాల్ని చూడలేకపోతున్న రోదనే కావొచ్చు. వాస్తవమెప్పుడూ కఠినం గానే వుంటుంది. ముత్యాలముగ్గు’ దీన్ని గుర్తు చేస్తూనే వుంటుంది.

సికిందర్


Thursday, March 25, 2021

1030 : టిప్స్

        చిన్న సినిమాకి దానిదైన సొంత జీవితం ప్రత్యేకంగా వుంటుంది. పెద్ద సినిమాల ఛాయల్ని దగ్గరికి కూడా రానివ్వదు. పెద్ద సినిమాలన్నీ ఒకే పోతలో పోసినట్టున్నా చెల్లిపోవచ్చు. చిన్న సినిమాలకి ఏ కథకా కథగా యూనిక్ క్రియేషన్ వుంటుంది. ఇదే వాటిని నిలబెడుతుంది. అదే సమయంలో చిన్న సినిమా ఒళ్ళు దగ్గర పెట్టుకుని స్ట్రక్చర్ ని పాటిస్తే కథా కథనాలే కాదు, ప్రధాన పాత్ర ననుసరించి ఇతర పాత్రలు, పాత్ర చిత్రణలు, వాటి ప్రయాణాలు, చెప్పాలనుకున్న పాయింటూ సమస్తం ప్రభావ శీలంగా అర్ధవంతంగా వస్తాయి.         

స్ట్రక్చర్ వల్ల కాన్సెప్ట్ దానికదే లోతుపాతుల్లోకి వెళ్ళిపోతుంది. స్ట్రక్చరే పట్టని స్క్రిప్టుతో చిన్న సినిమా చెత్త బుట్ట దాఖలవుతుంది. బుట్ట దాఖలయ్యే సినిమాలే మెట్ట వ్యవసాయం చేస్తున్నాయి. చినుకు పడదు, చిల్లులు మాత్రం పడుతూంటాయి నిర్మాత జేబుకి. 

        రామ్ సింగ్ చార్లీ స్ట్రక్చర్ లో వున్న అర్ధవంతమైన కథ, కథనమూ. కథనంలో దృశ్యాల అల్లిక చాలా సార్లు మెస్మరైజ్ చేస్తుంది. ఉదాహరణకి వూరికెళ్ళి పోయిన హీరోయిన్ పాత్ర కజ్రీ అక్కడెవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నట్టు కన్పిస్తుంది. తీరా ఇటు ఓపెన్ చేస్తే భర్త పాత్ర రామ్ సింగ్ తోనే మాట్లాడుతున్నట్టు దృశ్యం థ్రిల్ చేస్తుంది. ఇంకో దృశ్యంలో బార్ దగ్గర ఒకడు అదే పనిగా వెక్కిరిస్తూంటే, పొట్టి లిల్లీపుట్ చూసి చూసి లాగిపెట్టి లెంపకాయ కొడతాడు. లెంపకాయ తిన్నవాడు పరమ కోపంగా చూస్తాడు. అంతే, దృశ్యం కట్ అయిపోతుంది. తర్వాతి దృశ్యంలో రామ్ సింగ్ ఇంటికి పరుగెత్తు కొచ్చి డబ్బులన్నీ తీసుకుని పరిగెడతాడు. 

        ఈ దృశ్యమేంటో కూడా అర్ధం గాకుండానే ఇదీ కట్ అయిపోతుంది. దీని తర్వాతి దృశ్యంలో  గాయపడిన లిల్లీపుట్ హాస్పిటల్లో పడి వుంటాడు. అక్కడికి డబ్బుతో వచ్చేస్తాడు రామ్ సింగ్. ఇలా మొదటి దృశ్యంతో సస్పెన్స్ క్రియేట్ చేసి, రెండో దృశ్యంతోనూ సస్పెన్స్ క్రియేట్ చేసి, రెండిటి అర్ధాలూ మూడో సీన్లో స్పష్టం చేస్తాడు దర్శకుడు. ఇదీ దృశ్య మాలిక అంటే. రొటీన్ మెలోడ్రామాని తొలగించే ఈ మ్యాటరాఫ్ ఫ్యాక్ట్ కథనపు టెక్నిక్ వల్ల కథ చెడకుండా సినిమా నిడివి, షూటింగ్ సమయం, బడ్జెట్ ఎంతో ఆదా అయ్యాయి. దీన్ని గుర్తించి తెలుగులో ఎవరైనా పాటిస్తారా? సందేహమే. ఇలా కథని బట్టి దానిదైన యూనిక్- పర్సనలైజుడు డైనమిక్స్ తో కథనం చిన్న సినిమాకే సాధ్యమవుతుందని గమనించాల్సి వుంటుంది.

సికిందర్ 

 

Tuesday, March 23, 2021

1030 : బాక్సాఫీసు


      త శుక్రవారం విడుదలైన నాల్గు సినిమాల పరిస్థితి అత్యంత దయనీయంగా వుంది. దేనికీ సరైన ప్రేక్షకులు లేరు. ఎంత అట్టహాసంగా పబ్లిసిటీ  చేసినా ప్రేక్షకులు స్పందించలేదు. ముఖ్యంగా మంచు విష్ణు -కాజల్ అగర్వాల్ లు నటించిన బిగ్ బడ్జెట్ మోసగాళ్ళు భారీ షాక్ ఇచ్చింది. ఈ ఇద్దరు స్టార్స్ ని ప్రేక్షకులు అస్సలు పట్టించుకోలేదు. ఇక మరో క్రేజ్ వున్న హీరో కార్తికేయ చావు కబురు చల్లగా ని కార్తికేయ కోసం కూడా థియేటర్లకి వెళ్లలేదు యూత్. పోతే సాయికుమార్ కుమారుడు ఆది నటించిన  శశి సంగతి కూడా ఇంతే. చివరగా మరో మెగా వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన పవన్ తేజ్ ఈ కథలో పాత్రలు కల్పితం  కనిపించకుండా గల్లంతయింది.

        నాల్గు సినిమాలకి దర్శకులు కొత్త వాళ్ళే. మోసగాళ్ళు కైతే అమెరికన్ దర్శకుడు! మోసగాళ్ళు శుక్ర శని ఆదివారం మూడు రోజులూ ఓవర్సీస్ కలుపుకుని అతి కష్టంగా కోటీ 32 లక్షలు వసూలు చేయగల్గింది. దీని బడ్జెట్ 50 కోట్లు! దీని ప్రీ రిలీజ్ బిజినెస్ 30 కోట్లు అని అంటున్నారు. బయ్యర్లకి భారీ నష్టం. నిర్మాతకి 20 కోట్లయినా  థియేటర్ కలెక్షన్లు రావాలి. ఇది అసాధ్యం.


        చావుకబురు చల్లగా బడ్జెట్ 9  కోట్లు. వసూళ్లు ఓవర్సీస్ కలుపుకుని 3 కోట్లు. భారీ నష్టం. శశి బడ్జెట్ 6 కోట్లు. వసూళ్ళు 34 లక్షలు. ఇక ఈ కథలో పాత్రలు కల్పితం అంకెలు లేవు. మోసగాళ్ళు’, చావుకబురు చల్లగా’, శశి  ఈ మూడూ 11 నుంచి 21 శాతం మాత్రమే ఆక్యుపెన్సీతో ప్రదర్శనలకి నోచుకున్నాయి.


        ఓటీటీల్లో విభిన్న కంటెంట్ ని ఎంజాయ్ చేస్తున్న ప్రేక్షకులు, తెలుగు సినిమాల కంటెంట్ గురించి తెలిసిందే కాబట్టి తప్పించుకు తిరుగుతున్నారని అర్ధం జేసుకోవాలి. జాతిరత్నాలు ని తప్పించుకోలేక పోతున్నారు. రెండో వారం కూడా ఓవర్సెస్ సహా స్ట్రాంగ్ రెస్పాన్స్ ఇస్తున్నారు.


***