రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Wednesday, May 8, 2019

820 : బాలీవుడ్ సీన్

    బాలీవుడ్ సినిమా బజార్ లో ప్రేక్షకులు ఎటు చూసినా చరిత్రలే చరిత్రలు! చరిత్రలు, జీవిత చరిత్రలు! బాలీవుడ్ బజార్ చరిత్ర పాఠాలకి ఒక లైబ్రరీగా మారిపోయింది. ఎటు చూసినా  హిస్టారికల్స్ తో చరిత్రలు, బయోపిక్స్ తో జీవిత చరిత్రలు! ఈ బజార్ లో జీవిత చరిత్రలతో చరిత్రలు పోటీ పడుతున్నాయి. సినిమాలంటే ఇక ఇవే అన్నట్టు ప్రేక్షకులు చూసి చూసి అలవాటైపోతున్నారు. మసాలా కమర్షియల్స్ ని మర్చిపోయేట్టున్నారు. బయోపిక్స్, హిస్టారికల్స్ ఇవే గాకుండా కల్పిత కథల పీరియడ్ మూవీస్ అంటూ కూడా మధ్యలో సందడి చేస్తున్నాయి. ఇటీవలే ఇలాటి కల్పిత కథతో  పీరియడ్ మూవీగా ‘కళంక్’ విడుదలయ్యింది. 

       
యురీ, కేసరి, మణికర్ణిక, బెటాలియన్ 609, తాష్కెంట్ పేపర్స్ అనే హిస్టారికల్స్ ఇప్పటికే రాగా, ఇక పానిపట్, తఖ్త్, బాట్లాహౌస్, తానాజీ, సర్దార్ ఉద్ధం సింగ్, ఛత్రపతి శివాజీ మహారాజ్, 83 అనే ఎనిమిది హిస్టారికల్స్  ఇంకా రాబోతున్నాయి. 

          ‘పానిపట్’ ని 1761 లో జరిగిన మూడవ పానిపట్టు యుద్ధం ఆధారంగా నిర్మిస్తున్నారు. మరాఠాలకూ, కాబూల్ రాజు అహ్మద్ షాకూ మధ్య జరిగిన హోరాహోరీ యుద్ధాన్ని ఇక మన కళ్ళముందు వెండితెర మీద చక్కగా చూడొచ్చు. ఇందులో సంజయ్ దత్ అహ్మద్ షాగా నటిస్తూంటే, బోనీ కపూర్ కుమారుడు అర్జున్ కపూర్ సదాశివ్ రావ్ బాహుగా నటిస్తున్నాడు. కృతీ సానన్ పార్వతీ బాయిగా నటిస్తోంది. ‘లగాన్’  ఫేమ్ దర్శకుడు ఆశుతోష్ గోవరీకర్ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. డిసెంబర్ 6న ఇది విడుదల కాబోతోంది. దీని టీజర్, పోస్టర్ గత సంవత్సరం మార్చిలోనే విడుదలయ్యాయి.

        ఇక ‘తఖ్త్’ (పీఠం) మొఘల్ సామ్రాజ్య చరిత్ర. నిర్మాత కరణ్ జోహార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా దీన్ని నిర్మిస్తున్నాడు. షాజహాన్ చక్రవర్తి పెద్ద కుమారుడు, ఉపనిషత్తుల్ని పర్షియన్ లోకి అనువాదం చేసిన దారా షిఖోకి, అతడి తమ్ముడు ఔరంగ జేబుకీ మధ్య రాజ్యాధికారం కోసం జరిగిన పోరుని ఈ చారిత్రికం చిత్రిస్తుంది. ఇందులో బాలీవుడ్ సూపర్ స్టార్ రణవీర్ సింగ్ దారా షిఖో గా నటిస్తున్నాడు. ఔరంగ జేబుగా విక్కీ కౌశల్ నటిస్తున్నాడు. వీళ్ళిద్దరి అక్క జహానారా బేగంగా కరీనా కపూర్ నటిస్తోంది. దారా షిఖో భార్య నాదిరా బాను బేగంగా అలియాభట్ నటిస్తోంది. ఇక షాజహాన్ పాత్ర అనిల్ కపూర్ పోషిస్తున్నాడు. అనిల్ కపూర్ కుమార్తె జాహ్నవీ కపూర్ ఔరంగజేబు  రెండో భార్య ఔరంగబాదీ మహల్ గా నటిస్తోంది. భూమీ పడ్నేకర్ వచ్చేసి ఔరంగ జేబు మొదటి భార్య నవాబ్ బాయీగా నటిస్తోంది. ఇలా వైభవోపేతంగా  బాలీవుడ్ తరాతోరణమంతా కొలువుదీరారు. ఇంతకీ దర్శకుడెవరు? ఇంకెవరు కరణ్ జోహారే! ఈ  భారీ హిస్టారికల్ ని చూడాలంటే 2020 వరకూ ఆగాలి. 

          ఇక ‘బాట్లాహౌస్’ నిన్న మొన్నటి చరిత్రే. 2008లో ఢిల్ల్లీలో, బాట్లా హౌస్ లో జరిగిన ఇండియన్ ముజాహిదీన్  ఉగ్రవాదుల ఎన్కౌంటర్ కేసు ఆధారంగా నిర్మిస్తున్నారు. ఇందులో డిసిపి సంజీవ్ కుమార్ యాదవ్ గా జాన్ అబ్రహాం  నటిస్తున్నారు. ఇతర పాత్రల్లో ప్రకాష్ రాజ్, రవి కిషన్, నోరా ఫతేహీలు నటిస్తున్నారు. నిఖిల్ అద్వానీ దర్శకుడు. ఆగస్టు 15న విడుదలకి సిద్ధమవుతోంది.

          ‘తానాజీ -  ది అన్ సంగ్ వారియర్’ అజయ్ దేవగణ్ కి ప్రతిష్టాత్మకం. తానాజీ 17వ శతాబ్దపు మరాఠా సామ్రాజ్య సైనికాధికారి. కోహ్లీ సామాజిక వర్గానికి (కోహ్లీలు తెలుగు ముదిరాజులకి సమానం) చెందిన వాడు. పూర్తి పేరు తానాజీ మలుసారే. ఛత్రపతి శివాజీతో కలిసి ఎన్నో యుద్ధాలు చేశాడు. 1670 ఫిబ్రవరి 4 న సింహగఢ్ యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో మొఘల్ సైనికాధికారి ఉదయ్ భాను రాథోడ్ తో తలపడి మట్టి కరిపించాడు తానాజీ. ఈ చారిత్రక ఘట్టాన్ని తెరకెక్కిస్తున్నారు. ఉదయ్ భాను రాథోడ్ గా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు. దర్శకుడు ఓం రౌత్. ఇతను మారాఠీ దర్శకుడు. జనవరి 2020 లో విడుదలవుతుంది.  

          సూజిత్
సర్కార్ దర్శకత్వంలో ఉద్ధమ్ సింగ్ చరిత్ర ‘సర్దార్ ఉద్ధమ్ సింగ్’ గా వస్తోంది. బ్రిటిష్ పాలనకి వ్యతిరేకంగా గదర్ పార్టీ స్థాపించి పోరాడిన విప్లవకారుడు సర్దార్ ఉద్ధమ్ సింగ్. 1919లో అమృత్సర్ లో పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్ మైకేల్ ఓ డయ్యర్ పాల్పడిన జలియావాలా బాగ్ ఊచకోత దురంతానికి ప్రతీకారంగా,1940 లో లండన్ లో ఉద్ధమ్ సింగ్ అతణ్ణి హతమార్చడమే ఈ చారిత్రికం కథ. విక్కీ కౌశల్ ఉద్ధమ్ సింగ్ గా నటిస్తున్నాడు. ఇది కూడా 2020 లోనే విడుదలవుతుంది. అయితే 1999 లోనే ఈ చరిత్ర రాజ్ బబ్బర్ తో వచ్చింది. 

     ఇక ‘ఛత్రపతి శివాజీ మహారాజ్’ గా రీతేష్ దేశ్ ముఖ్ వస్తున్నాడు. రవి జాదవ్ దీని దర్శకుడు. హైదరాబాద్ కి చెందిన ‘భజరంగీ భాయిజాన్’ ఫేమ్ దర్శకుడు కబీర్ ఖాన్ ‘83’ అనే హిస్టారికల్ తీస్తున్నాడు. 1983లో ఇండియా గెలుచుకున్నవరల్డ్ కప్ క్రికెట్ విజయగాథని తెరకెక్కిస్తున్నాడు. ఇందులో కపిల్ దేవ్ గా రణవీర్ సింగ్ నటిస్తూంటే, సునీల్ గవాస్కర్ గా తాహిర్ రాజ్ భాషిన్ నటిస్తున్నాడు. మోహిందర్ అమర్నాథ్ గా సాఖీబ్ సలీం, కృష్ణమాచారి శ్రీకాంత్ గా జీవా, సయ్యద్ కిర్మానీగా సాహిల్ ఖట్టర్, దిలీప్ వెంగ్ సర్కార్ గా ఆదినాథ్ ఖొఠారే, రోజర్ బిన్నీగా నిశాంత్ దహియా నటిస్తున్నారు. ఏప్రెల్ 2020 లో విడుదలవుతుంది. 

          ఇవీ రాబోతున్న8 హిస్టారికల్స్. కొసమెరుపేమిటంటే ‘మొఘల్ -ది గుల్షన్ కుమార్ స్టోరీ’ అని కన్ఫ్యూజింగ్ టైటిల్ తో ఒకటి వస్తోంది. మొఘలుల కాలంలో ఈ గుల్షన్ కుమార్ ఎవర్రా బాబూ అని జుట్లు పీక్కోవాల్సిందే. అది మొఘలుల కాలం కాదట. గుల్షన్ కుమార్ ఒక మొఘల్ అట. బాలీవుడ్ లో టీ సిరీస్ సంగీత సామ్రాజ్యానికి మొఘల్. అదీ విషయం. చరిత్రలు, జీవిత చరిత్రల సందట్లో దివంగత టీ సిరీస్ బాస్ గుల్షన్ కుమార్ బయోపిక్ కూడా వచ్చేస్తోంది.

Tuesday, May 7, 2019

819 : టిప్స్

(53 – 60)
          53. కథలో హీరో విలన్ మీద ఎవరికీ తెలియకుండా గుప్తంగా వున్న రివెంజిని  ఎప్పుడు వెల్లడించ వచ్చు? ముందుగా - కథ వచ్చేసి రివెంజి గురించే అయితే, అదే హీరో గోల్ అనుకుంటే, ఇది వెల్లడించేందుకు టైము, టార్గెట్ అని రెండుంటాయనుకోవచ్చు. ముందుగా ప్రేక్షకులకే  వెల్లడించాలని టార్గెట్ వుంటే, విలన్ కి వెల్లడించడానికి ఇంకా టైముంటుంది. ఇక్కడ టార్గెట్ అయిన ప్రేక్షకులతో టైము ఎడంగా వుంటుంది. ఈ టైంలో విలన్ కి ఎప్పుడు తెలుస్తుందా అన్న సస్పెన్స్ ని ప్రేక్షకులు అనుభవించేలా కథనం చేసుకోవచ్చు ఆసక్తి వుంటే. ఇక ముందుగా విలన్ కే హీరో రివెంజిని వెల్లడించాలన్న టార్గెట్ వుంటే, అప్పుడు ఆటోమేటిగ్గా ప్రేక్షకులకి సైతం అప్పుడే వెల్లడై, టైం శూన్యమవుతుంది. ఇదంతా హీరోకి కథంతా రివెంజి అన్న ఒకే ఒక్క గోల్ వున్నప్పుడు.

          ఇలాకాక
, ఆ కథ ఇలా వుందనుకుందాం : వూళ్ళో ప్రజల కోరిక మీద ఓ ప్రజాసమస్య తీర్చడానికి హీరో పూనుకున్నాడనుకుందాం. అప్పుడా సమస్య స్వయంగా హీరో అనుభవించింది కాదు కాబట్టి అతడి గోల్ కన్విన్సింగ్ గా ఆన్పించక పోవచ్చు. కన్విన్సింగ్ గా అన్పించాలంటే, ఆ ప్రజల సమస్యకి కారకుడైన విలన్ తో హీరో గతంలో వ్యక్తిగతంగా బాధ ననుభవించి వుండాలి. ఇలా ఇప్పుడు ఊరుని కాపాడడం హీరో ఫిజికల్ గోల్ గా వుంటే, గతంలో విలన్ తో పడ్డ బాధ సైకలాజికల్ గోల్ గా వుంటుంది. మరి ఇలా ఊరుని కాపాడే ఫిజికల్ గోల్ గా నడుస్తున్న ప్రధాన కథలో, గుప్తంగా  వున్న సైకలాజికల్  గోల్ ని ఎప్పుడు వెల్లడించాలి

          సాధారణంగా ఏం జరుగుతుందంటే
, ఫిజికల్ గోల్ కి పూనుకున్న హీరోకి విలన్ ఎదురు పడగానే గజిబిజిగా ఏవో షాట్లు పడతాయి. అప్పుడు గతంలో విలన్ తో హీరోకి ఏదో జరగరాని ఘోరం జరిగిందని మనకర్ధ మవుతుంది. అప్పుడు దీని ప్రభావం కథ మీద, మన మైండ్స్ మీద ఎలా వుంటుంది? కథ ఫోకస్ చెదురుతుంది, ఇక ముందు ముందు హీరోకి చాదస్తంగా ఏదో ఫ్లాష్ బ్యాక్ వేస్తారని మనకి ముందే తెలిసిపోతుంది. ఇలా నాసిరకం కథనం పాలబడకుండా వుండాలంటే ఏం చేయాలి

          అప్పుడు 2016 లో విడుదలైన 
మాగ్నిఫిషెంట్ సెవెన్’  చూడాలి. ఈ కౌబాయ్ మూవీలో ప్రజాకంటకుడుగా వున్న విలన్ని,  ప్రజల తరపున హీరో ఎదుర్కొని, చిట్ట చివరి సీనులో వాణ్ణి  చంపుతున్నపుడు మాత్రమే - అసలు తానెవరో అప్పుడు చెప్పి, తన తల్లినీ, చెల్లెళ్ళనీ విలన్ చంపిన సంగతీ అప్పుడు గుర్తుచేసి, చెడామడా చంపి పగ తీర్చుకుంటాడు!

         
 ఇలా ఫిజికల్ గోల్ పూర్తి చేస్తూ  చిట్ట చివర మాత్రమే హీరో తన సైకలాజికల్ గోల్ ని వెల్లడించడం వలన - మనకి ఒక రహస్యం బయటపడి షాక్, ఒక ట్విస్ట్, ఒక ఫినిషింగ్ టచ్ ఇవన్నీ అనుభవమై- 1) హీరోకి ఇంత కథ వుందా అని అప్పుడు తెలిసి, 2) ఇందుకోసం ఊరుని కాపాడేందుకు పూనుకున్నాడా అన్న భావోద్వేగం పుట్టి, 2) అప్పుడా హీరో చాలా మెచ్యూర్డ్ గా, హుందాగా కనపడి అభిమానం ఇంకింత పెరిగి, 4 ) అతడి  సైకలాజికల్ గోల్ ని  ఫ్లాష్ బ్యాక్ విజువల్స్ వేయకుండా కేవలం నాల్గు డైలాగుల్లో  ఎమోషనల్ గా వెల్లడించే సరికి, ఆ జరిగిన గతం తాలూకు సంఘటనా దృశ్యాల్ని మనకి నచ్చిన రీతిలో మనం వూహించుకునే వీలు ఏర్పడి, 5) హీరో ఫిజికల్ గోల్ ని కన్విన్సింగ్ గా  ఫీలవుతాం

         
1954 లో అకిరా కురసావా సెవెన్ సమురాయ్తీస్తే, 1960 హాలీవుడ్ లో  దాన్ని మాగ్నిఫిషెంట్ సెవెన్గా రీమేక్ చేశారు. తిరిగి 2016 లో డెంజిల్ వాషింగ్టన్ తో డైనమిక్స్ ని ఏ మాత్రం మార్చకుండా ఇలా ఇంకో రీమేక్ చేశారు

          54. ముందుగా
హీరో ఎంట్రీ సీను ఆలోచించి అక్కడ్నించీ కథ ఆలోచిస్తే? దాంతో కథ ఎంతకీ రాకపోవచ్చు. ఓ ఇద్దరు ఇదే అనుభవంతో జుట్లు పీక్కున్నారు. హీరో ఎంట్రీ సీను ఆలోచించింతర్వాత, తర్వాతి సీన్లేమిటా అని ఆలోచిస్తే కథే రావడం లేదు. ఇదేం కొత్త సమస్య కాదు, చాలా పాత సమస్యే. ఇలా ఎందుకు జరుగుతుందంటే, ఎక్కడో చదివిందో చూసిందో ఒక సీను బాగా నచ్చేసి, ఆ సీనుని అద్భుతంగా చూపిస్తూ లేదా హైలైట్ చేస్తూ దాంతో కథ అల్లేద్దామనుకున్నపుడు ఇలాటి సమస్య ఎదురవుతుంది. 

          సినిమా కథ ఆలోచించడమంటే ఎక్కడో నచ్చేసిన దృశ్యాన్ని ఇరికించి తీరాలన్న దురుద్దేశం పెట్టుకుని దాంతో ఆలోచిస్తారా? (తాజాగా రెండు నెలల క్రితం కూడా ఒక నిర్మాతతో ఇదే సమస్య. వూళ్ళో జరిగిన ఒక సంఘటనలో ఒక దృశ్యం ఆయనకి బాగా నచ్చింది. దాన్ని ప్రేమించి, అది పెట్టుకుని కథ కూడా ఆలోచించేసి ఫిక్స్ అయిపోతే, ఇక ఆ కథ లేడికి తోడేలు తల అతికించినట్టు వుంది. ఏం చేయాలి? లేడినైనా చంపాలి, తోడేలు తలైనా నరకాలి. దేనికీ ఆయన ఇష్టపడక లేడి తోడేలుని అలాగే భద్రపర్చుకున్నారు). సినిమా కథని హీరో ఎదుర్కొనే సమస్య (పాయింటు) ఆధారంగా ఆలోచించక పోతే కథ వస్తుందా?


          కథంటే ఎంట్రీ సీను కాదు. కథంటే పాయింట్, లేదా హీరో ఎదుర్కొనే సమస్యే! ముందుగా ఈ పాయింట్ లేదా సమస్య  ఫిక్స్ చేసుకోకుండా ఎంత  ఆలోచించినా వున్నచోటే వుండిపోతారు. ఉదాహరణకి, హీరో హీరోయిన్లు ప్రేమించుకున్నారు. హీరోయిన్ ప్రేమని హీరో పొందాలంటే, ఆమె చెప్పినట్టు వాళ్ళ నాన్న ఎక్కడో దాచిన ఒక వస్తువు కొట్టేసుకుని రావాలి. ఇదే కథ. ఆ వస్తువు కొట్టేసుకుని రావడమే పాయింటు, లేదా హీరో సమస్య.  హీరో, లేదా ఆ కథ హీరోయిన్ ఓరియెంటెడ్ అయితే హీరోయిన్, ఓ సమస్యలో ఎలా ఇరుక్కుని, అందులోంచి ఎలా బయట పడ్డారన్నదే  ప్రపంచంలో ఏ కమర్షియల్ సినిమా కథయినా. 


          కాబట్టి కథ ఆలోచించడం మొదలెట్టాల్సింది హీరో ఎంట్రీ సీను పెట్టుకుని  కాదు, హీరో ఎదుర్కొనే సమస్యతో. ముందు సమస్యేమిటో నిర్ణయించింత్తర్వాతే ఎంట్రీలూ బ్యాంగులూ ఇంకేవైనా.  హీరో ఎవరు (బిగినింగ్) - అతను ఇరుక్కున్న సమస్యేమిటి (మిడిల్)-  ఆ సమస్య లోంచి ఎలా బయట పడ్డాడు (ఎండ్)- ఇలా ఆలోచించడం మొదలిపెడితే తప్ప ఎంత తపస్సు చేసినా, ఊటీ వెళ్లి ఎన్ని సిట్టింగులేసినా జన్మకి కథ రాదు. తపస్సు తుస్సు మనడం, ఊటీ తడిసి మోపెడవడం ఖాయం.


          55. కామెడీ రైటింగ్ కూడా ఇంటలిజెంట్ రైటింగ్ గా మారినప్పుడే  అప్డేటెడ్ మూవీస్ ప్రేక్షకుల మధ్యకి వస్తాయిఅవే సినిమాటిక్ డైలాగులతో, సీన్లతోక్రియేటివిటీ లేని మాసిపోయిన కార్బన్ కాపీ కామెడీలు తీయడం కంటే  - జీవితాల్లో ఉట్టి పడే సహజ హాస్యంతో  ఆరోగ్యకర సినిమాలు తీసే స్థాయికి ఎదగడం ఇప్పటి మార్కెట్ కి అర్జెంటు అవసరం. సమాజంలో చాలా హస్యముంది, పాత్రలున్నాయి- వీటితో ప్రేక్షకులు తమని ఐడెంటిఫై చేసుకున్నంతగా, మూసఫార్ములా కామెడీ- పేరడీలకి కనెక్టయ్యే  పరిస్థితి ఇక లేదని వారం వారం విడుదలయ్యే సినిమాల్ని చూస్తూంటే తెలిసిపోతూనే వుంది. ఇక హార్రర్ కామెడీ, థ్రిల్లర్ కామెడీ, యాక్షన్ కామెడీ, క్రైం కామెడీ, అడల్ట్ కామెడీ...ఇంకేవేవో  కామేడీలంటూ ఇతర జానర్లని కలిపి కృత్రిమంగా తీసేస్తూ, అసలు ప్యూర్ కామెడీనే మర్చిపోయారు. ప్యూర్ కామెడీలకి  ఇటు జంధ్యాల, ఈవీవీ లాంటి వాళ్ళు; అటు హృషికేష్ ముఖర్జీ, ప్రియదర్శన్ లాంటి వాళ్ళూ  ఇప్పుడు లేనే లేరు. అలాగే  సింగీతం శ్రీనివాసరావు టైపు హింస లేని ఫక్తు హాస్యభరిత క్లయిమాక్సులు ఇప్పుడు వర్కౌట్ కావేమో అనుకుంటే, ‘ఈడు గోల్డ్ ఎహెఅనే తాజా  కామెడీలో జానర్ కి విరుద్ధమైన, హింసాత్మక క్లయిమాక్స్ ఏమైనా వర్కౌట్  అయ్యిందా ఆలోచించాలి.

          56. చాలామంది అర్ధం చేసుకోలేని ఒక ప్రాథమిక సూత్రముంది : ఒక సినిమాని ప్రేక్షక సమూహానికి చూపించడమంటే, యుగాలుగా డీఫాల్టుగా వాళ్ళ అంతరంగాల్లో నిబిడీకృతమై వున్న కథని రిసీవ్ చేసుకునే స్పందనలతో అనుసంధాన మవగల్గడమే! కథని పత్రిక కోసం రాసినా, సినిమా కోసం రాసినా ఆయా పాఠకులతో, ప్రేక్షకులతో అదొక సైకలాజికల్ ఎక్సర్ సైజే అవుతుంది మరి. కథలు వాటి మూడంకాల నిర్మాణంలో- అంటే- బిగినింగ్, మిడిల్, ఎండ్ విభాగాలతో- లేదా త్రీయాక్ట్ స్ట్రక్చర్ తో వున్నప్పుడే అదీ ఆ అంకాల్లో లేదా విభాగాల్లో లేదా యాక్స్ట్ లో వేటికవిగా జరిగే బిజినెస్సుల్ని కలిగి వున్నప్పుడే, మనుషుల అంతరంగ స్పందనలతో  మ్యాచ్ అవుతాయి. మ్యాచ్ ఆవనప్పుడు ఆ కథలు ఫెయిలవుతాయి. ఇట్స్ దట్ సింపుల్! 

          57. విభాగాల బిజినెస్ అంటే గుండుగుత్త ట్రీట్ మెంట్ కాదు. స్క్రీన్ ప్లేలో ఆయా అంక విభాగాల్లో జరగాల్సిన కార్యకలాపాల తీరుని బిజినెస్ అంటారు. స్క్రీన్ ప్లే లో మనం చెప్పుకునే బిగినింగ్- మిడిల్- ఎండ్ అనే విభాగాలు మూడూ ఒక్కోటీ ఒక్కో తరహా బిజినెస్ ని కలిగి వుంటాయి. రిలయెన్స్ వాళ్ళ బిజినెస్ రిలయెన్స్ వాళ్ళ బిజినెస్సే, టాటా వాళ్ళ బిజినెస్ టాటా వాళ్ళ బిజినెస్సే. అలాగే బిర్లాల కార్యకలాపాలు బిర్లాలవే. ఒక్కరూ ఇంకో తమ సాటి పోటీదారుల్లాగా తమ వ్యవస్థల్ని నడుపుకోవడానికి ఇష్టపడరు. అలాగే స్క్రీన్ ప్లేలో కూడా బిగినింగ్- మిడిల్- ఎండ్ విభాగాలు మూడింట్లో ఏ ఒక్కటీ ఇంకోదానితో పోలిన బిజినెస్ ని కలిగి వుండదు. స్క్రీన్ ప్లే విభాగాల రచనలో ఈ విలక్షణీయతల్ని గుర్తించకపోతే, ఆ మొత్తం కథ ప్రసారం చేసే తరంగాలని ప్రేక్షకుల అంతరంగ రాడార్ వికర్షించడం మొదలెడుతుంది.

         
58. ఏళ్ల తరబడీ సినిమాల్ని చూస్తూ వస్తూంటే ఒక తత్త్వం బోధపడుతోంది : తీసుకున్న స్టోరీ ఐడియాని లైన్ ఆర్డర్ ఒక మెట్టు పైకి తీసికెళ్ళాలి, ఆ లైన్ ఆర్డర్ ని స్క్రీన్ ప్లే ఇంకో మెట్టు పైకి తీసికెళ్ళాలి, ఆ స్క్రీన్ ప్లేని డైలాగ్ వెర్షన్ మరింకో మెట్టు పైకి లాగాలి, ఆ డైలాగ్ వెర్షన్ ని నటనలు కొండెక్కిస్తే, ఆ నటనల్ని దర్శకత్వం అందలా లెక్కించాలని!

         
ఇదెలా పెరుగుతుందంటే, ఉదాహరణకి ఓ చిన్న పిల్లాడు ఓ చిన్న పిల్ల దగ్గర్నుంచి తియ్యటి చాక్లెట్ లాక్కున్నాడనుకుందాం. అప్పుడు దీనికి ప్రతీకారంగా ఆ పిల్ల ఆ పిల్లాడి డబ్బులన్నీ బరబరా లాగేసుకుంటుంది. దీంతో ఆ పిల్లాడు ఆ పిల్లకి ఎంతో ప్రాణప్రదమైన ఆట బొమ్మని కసబిసా లాగేసుకుంటే, ఆ పిల్ల పిల్లాడి టోపీ ఊడబీక్కుని పారిపోతుంది. వాడు బోడి గుండుతో బ్యారు మంటాడు. మళ్ళీ పిల్ల దగ్గర్నుంచీ ఉంగరం వూడ లాక్కుంటే, ఆ పిల్ల కన్నింగ్ గా, పిల్లాడు పేరెంట్స్ కి చూపించకుండా దాచేసిన సున్నా మార్కుల ప్రోగ్రెస్ రిపోర్టు కొట్టేసుకుని పోతుంది!

          ఇలాగన్న మాట. ఇరువైపులా ఇలా నష్ట తీవ్రత పెరుగుతూ పోవడమే టైం అండ్ టెన్షన్ థియరీ. అసలైన యాక్షన్ - రియాక్షన్ ల ఇంటర్ ప్లే.
   


          59. వేల సంవత్సరాలుగా ఆకట్టుకుంటూ ఇంకా మున్ముందు కూడా ఆకట్టుకోగల సాంప్రదాయ నిర్మాణాన్ని కలిగివుండే కథల నిర్మాణపరమైన నియమ నిబంధనల్ని ఉల్లంఘించి, అవాంట్ గార్డ్ పద్ధతిలో అంటే- కమర్షియలేతర యూరోపియన్ సినిమాల తరహాలో- ఇంకా చెప్పాలంటే మన ఆర్ట్ సినిమాల  టైపులోనే - కథ చెప్పాలనుకుంటే మిమ్మల్ని కాపాడే వారెవరూ వుండరని అంటున్నాడు ఇంటర్నెట్ స్క్రీన్ రైటింగ్ కోర్సు ఎడిటర్ లారెన్స్ కానర్. కనుక సాంప్రదాయబద్ధంగానే ( అంటే బిగినింగ్-మిడిల్-ఎండ్ నియమ నిబంధనల్ని పాటిస్తూ) కథ చెప్పాలనీ, చెబుతూ అందులోనే కొత్తగా, ఆశర్యపర్చే విధంగా కథనం చేసుకోవాలనీ చెబుతున్నాడు. ఇలా చెప్పే వాళ్ళు తెలుగు ఫీల్డులో లేరు, ఇదే సమస్య.

          60. చిత్ర నిర్మాతలు ఘరానా మనుషులు, వాళ్ళది సభ్యప్రపంచం. అయితే నా కళ్ళ ఎదుటనే కళ కోసం పాకులాడిన నిర్మాతలు పోయి, మాది వ్యాపారం, లాభాలు తియ్యటం తప్ప వేరే ఆశయం లేదు అని ఎలుగెత్తి చాటే నిర్మాతలు వచ్చారు. సినిమా రంగంలో చేరి  నాలుగు డబ్బులు చేర్చుకునే సదవకాశం వచ్చిన నాడు కళకు అశ్రుతర్పణం విడిచి, కళాదృష్టీ,  కళా ప్రమేయమూకళా వైఖరిని  విసర్జించటమాలేక ముష్టెత్తుతూ, అప్రయోజకుల జాబితాలోనూ, పిచ్చివాళ్ళ జాబితాలోనూ చేరటమా? సులువుగా తేలే  సమస్య ఎంత మాత్రమూ కాదు - కొడవటిగంటి కుటుంబరావు (1961).

(మరికొన్ని మరోసారి)
సికిందర్  

Monday, May 6, 2019

818 : సందేహాలు - సమాధానాలు


Q:  సికిందర్ గారూ, ‘పాలపిట్ట’ సాహిత్య మాస పత్రికలో ‘విస్మృత సినిమాలు’ శీర్షిక కింద మీరు రాస్తున్న మరుగున పడిన పాత తెలుగు సినిమాల విశ్లేషణలు సూపర్. వాటిలో తెలుసుకోవాల్సినవి ఎన్నో వుంటున్నాయి. అయితే ఆ పత్రిక సరిగ్గా లభ్యం కావడం లేదు. రెగ్యులర్ గా పత్రిక పొందాలంటే ఏం చేయాలంటారు?
దర్శకుడు, టాలీవుడ్ 
            A: థాంక్స్, మీ శ్రద్ధకి. పత్రిక మార్కెట్లో అన్ని చోట్లా దొరకదు. విశాలాంధ్ర, నవోదయ షాపుల్లో దొరుకుతుంది. పత్రికకి చందాదారుల విస్తృత నెట్ వర్క్ వుంది. మూడొందల యాభై చందా కడితే ఏడాది పాటు పత్రిక ఇంటికే వస్తుంది. ఈ చిరునామాకి పంపండి : మేనేజర్, పాలపిట్ట, 16 -11 – 20 / 6 / 1 / 1, 403 విజయసాయి రెసిడెన్సీ, సలీం నగర్, మలక్ పేట, హైదరాబాద్ – 500 036, ఫోన్ : 040 27378430.

          Q:  ‘నువ్వు తోపురా’  రివ్యూలో అది బయోపిక్ గా తీశారని నిర్మాత చెప్పినట్టు మీరు రాశారు. అలా తీయడం వల్ల వచ్చిన తేడా ఏమిటి? రెగ్యులర్ సినిమాలు బయోపిక్ లా తీయకూడదంటారా? వివరించగలరు.
అశోక్, టాలీవుడ్
         
A: బయోపిక్ అంటే ఒకవ్యక్తి జీవిత చరిత్ర. జీవిత చరిత్రలు సినిమాల్లాగా అన్ని హంగులతో సర్వాంగ సుందరంగా వుండవు. జీవితమే కలర్ఫుల్ సినిమాలాగా వుండేడ్వక సతాయిస్తూంటుందెప్పుడూ. నిజ జీవితాల్ని సినిమాగా తీస్తే ఆర్ట్ సినిమా అనే చిప్ప చేతికొస్తుంది. నిజ జీవితాల్ని ఆ వ్యక్తి జీవితం ఎలా సాగిందో అలా నిజ సంఘటనలతో వాస్తవికంగా తీయాల్సిందే తప్ప, లవ్ - యాక్షన్ - కామెడీ - డాన్సులూ అంటూ మసాలా నూరిపోస్తే నవ్విపోతారు. కాకపోతే బయోపిక్స్ విషయంలో ఒకటి చేస్తారు. అది మరీ ఆర్ట్ సినిమాలా తయారవకుండా ఓ సినిమాగా ఆడేందుకు ఒక పని చేస్తారు : ఆ వ్యక్తి  జీవితాన్ని మలుపు తిప్పిన ప్రధాన సమస్య ఒకటి తీసుకుని, దాంతో ఎలా సంఘర్షించాడో / సంఘర్షించిందో, ఫలితంగా ఏం సాధించాడో / సాధించిందో - ఆ జీవితంలో వున్న నిజ సంఘటనలు ఏర్చి కూర్చి - త్రీయాక్ట్ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్లో ఇమిడ్చి, కమర్షియాలిటీ కల్పిస్తారు. అంటే నిజ జీవితాన్ని - బయోపిక్ ని - సినిమాగా ఆడించుకోవాలన్నా దాన్ని ‘సమస్య - సంఘర్షణ – పరిష్కార’ మనే త్రీయాక్ట్ స్ట్రక్చర్ తోనే చూపించాలన్న మాట. ఇలాకాక జీవితంలో జరిగిన అన్ని సంఘటనలూ అనుభవాలూ ఎపిసోడిక్ గా చూపించుకుంటూ పోతే అది సినిమా అవదు, డాక్యుమెంటరీ అవుతుంది. ఇది టీవీకి పనికొస్తుంది, సినిమాకి కాదు. అలాగే త్రీయాక్ట్ స్ట్రక్చర్ లో బయోపిక్ సినిమాకే పనికొస్తుంది, టీవీ ఫిలింగా తీయడానికి కాదు. అయితే త్రీ యాక్ట్ స్ట్రక్చర్ లో సినిమాగా తీసిన బయోపిక్ ని టీవీలో ప్రసారం చేయొచ్చు. ఈటీవీ మార్గదర్శి ప్రోగ్రాంలో అమితాబ్ బచ్చన్ మీద రెండు భాగాల ‘బయోపిక్’ ఈ వ్యాసకర్త రాసినప్పుడు, డాక్యుమెంటరీగానే రాయాల్సి వచ్చింది. కాకపోతే ప్రారంభం ‘కూలీ’ షూటింగ్ సందర్భంగా అమితాబ్ తీవ్రంగా గాయపడిన ఆసక్తికర సంఘటనతో ఎత్తుకున్నాం. ఇదే సినిమా కోసం బయోపిక్ అనుకుంటే,  అమితాబ్ జీవితంలో ఓ ప్రధాన సమస్య తీసుకుని, దాంతో సంఘర్షించిన విధం చూపించాల్సి వుంటుంది. 

      ఇలా సినిమాగా ఆడేందుకు నిజ జీవితాల్నే  త్రీయాక్ట్ స్ట్రక్చర్ లో పెట్టి తీయాల్సి వ స్తున్నప్పుడు, ఇక రెగ్యులర్ గా వచ్చే కమర్షియల్ సినిమాల్లో కల్పిత హీరోయిజాల కథలకి ఇంకెంత త్రీ యాక్ట్ స్ట్రక్చర్ వుండాలి!! ఇది గుర్తించకపోవడం వల్లే ఎవరి ‘యాక్ట్’  ప్రకారం వాళ్ళు స్ట్రక్చర్ లేని సొంత క్రియేటివిటీలతో యాక్టింగులు చేస్తూ దెబ్బతిని పోతున్నారు. ‘నువ్వు తోపురా’ కామన్ మాన్ బయోపిక్ అని నిర్మాత అన్నారంటే ఏదో ఈ బయోపిక్ ల ట్రెండ్ లో బిజినెస్ కోసం అన్నారులే అనుకుంటాం. కానీ నిజంగానే బయోపిక్ లాగే  తీయబోయారు. కల్పిత పాత్రతో బయోపిక్ ఏమిటి, బయోపిక్ అంటే నిజంగా జీవించిన మనిషి కథతో కదా వుండాలి - అన్న హద్దుల్ని కూడా చెరిపేయదల్చుకున్నారు. ఇక భక్తి  సినిమా కూడా ఇలాగే తీస్తారేమో, దేవుళ్ళని చూపించకుండా ‘నువ్వు తోపురా’ హీరో పాత్ర సూరినే దేవుడిగా చూపిస్తూ భక్తి  సినిమా అంటారేమో! రూల్స్ ని ఇలా బ్రేక్ చేస్తారేమో కొంపదీసి. 

          ‘నువ్వు తోపురా’ బయోపిక్ లాగే తీయబోయారని అనడమెందుకంటే, అలా బయోపిక్ లా తీయడంలో కూడా విఫలమైనందుకే. బయోపిక్ లా తీయాలనుకుని వుంటే త్రీ యాక్ట్స్ లో తీసేవాళ్ళు.  తీస్తున్నది సహజ జీవితమని దాన్ని సహజ జీవితంలాగే ఆర్ట్ సినిమాలా తీసేశారు. ఆర్ట్ సినిమా ఎవరు చూస్తారు? ఇటీవలే ఇలాటిదే ఇంకోటి జరిగింది. హీరోయిన్ పాత్రతో బయోపిక్ అంటూ రాసుకొచ్చాడు. తను సృష్టించిన ఆ పాత్ర పేరు ఏదో లత. ఆ లత బయోపిక్ అట. ఫిక్షన్ పాత్రతో బయోపిక్ ఏంట్రా నాయనా అంటే,  వెళ్ళిపోయి దాంతోబాటే మాయమైపోయాడు. ఈ బయోపిచ్చి రాతలతో ఎక్కడికి పోతున్నారంటే – ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ లో జంధ్యాల రాసినట్టు - ఎక్కడికో వెళ్ళిపోతున్నారు...

          Q:  హలో సర్, మీ ఆర్టికల్స్ ఫిలిం మేకర్స్ కాగోరేవారికి చాలా హెల్ప్ చేస్తున్నాయి. అయితే మా నుంచి మీకు కొన్ని రిక్వెస్ట్స్: 1. ఈ మధ్య స్క్రీన్ ప్లే టిప్స్ పెడుతున్నారు కదా, వాటిలో ఒకదాంట్లో ఇప్పుడు సినిమా కథంటే హీరోహీరోయిన్ల కథలే అన్నారు. మిగతా కథల్లేవన్నారు. దీన్ని వివరించగలరు. హీరోహీరోయిన్ల కథల్లో ఇంకా కొత్తగా ఏం చెప్పొచ్చు? ఇతర భాషల్లో ఇవెలా వుంటున్నాయి? వేరే ఫ్యామిలీ కథలు వగైరా ఎలా డీల్ చేస్తున్నారు?  ఆర్టికల్ రాయగలరు. 

          2. ఈ మధ్య వచ్చిన ‘జెర్సీ’ గానీ ‘మజిలీ’  గానీ లోపాలున్నా అవి హిట్టయ్యాయి. వీటి స్క్రీన్ ప్లే సంగతులు రాయగలరు. ఇప్పటికే స్క్రీన్ ప్లే సంగతులు చాలా రాశాం మళ్ళీ ఎందుకంటారు గానీ, ఒక విషయం ఏంటంటే, మీరు కనీసం హిట్టయిన మూవీస్ కైనా స్క్రీన్ ప్లే సంగతులు రాస్తే మాకు చాలా హెల్ప్ అవుతుంది. 

          3. ఇతర భాషల్లో హిట్టవుతున్న సినిమాల విశ్లేషణలు వారం వారం రాస్తే,  మీతో బాటు మేమందరం అప్డేట్ అవుతూంటాం. ఇది చాలా ఇంపార్టెంట్ సర్. మేం క్వాలిటీ సినిమాల గురించి డిస్కషన్స్ పెట్టుకోవాలంటే మీరే మంచి సోర్స్. ఇవన్నీ మీ మీద అభిమానంతో, మీరు మాకు ఒక గురువుగా అనుకుని, స్క్రిప్ట్స్ రైటింగ్ గురించి, మూవీ మేకింగ్ గురించీ, ఇంకా తెలుసుకోవాలని ఇలా మెసేజి పెడుతున్నాం. మీ బ్లాగుని రెగ్యులర్ గా ఫాలో అవుతున్నాం. మీ వల్ల మాకు మంచే జరిగింది సర్, వుయ్ లవ్యూ. 
టాలీవుడ్ నుంచి పేరు రాయలేదు 

      A: మీ పేరు రాయలేదు. ముందుగా ఒక స్పష్టత తెచ్చుకుందాం : ప్రేమ లేఖలు రాయడం మానేయండి, పెడర్ధాలొస్తాయి. ఇక పేర్లు రాయని ప్రశ్నలకి సమాధానాలివ్వడం కష్టమై పక్కకు పెట్టేస్తున్నాం. ఇదేం డాక్టర్ సమరం శీర్షిక కాదు, పేర్లు రాయకపోతే అర్ధం జేసుకోవడానికి. సెల్ఫీల కాలంలో పేర్లు దాయడమేమిటి. పేర్లు వెల్లడిస్తే మిమ్మల్ని పట్టుకుని గాలం వెయ్యం. గాలాలు వేసే గాలి పనులు ఈ బ్లాగు చేయడం లేదు. ఒక్క దర్శకుల ప్రశ్నలకి మాత్రమే పేర్లు దాస్తున్నాం. ఇతరులకి ఈ మినహాయింపు లేదని గమనించగలరు. అలాగే ఈ ‘గురువుగారు’ సంబోధనలు ఆపొచ్చు. మనకెవరూ గురువుల్లేరు, మేమెవ్వరికీ గురువులం కాం. మీలాగే ఎడ్యుకేట్ అవడానికి ప్రయత్నిస్తున్నాం.

          ఇక మొదటి ఐటెంకి సమాధానం - ఇది మా చిన్నప్పుడే విన్నాం, ఎవరన్నారో గుర్తుకు రావడం లేదుగానీ, ఓ సినిమా ప్రముఖుడే సినిమా కథంటే హీరో హీరోయిన్లదే అన్నారు. నిజమే కదా, ప్రేక్షకులు హీరోహేరోయిన్లని చూడ్డానికే సినిమా కొస్తారు. మరి కథ వాళ్ళ మీద లేకపోతే  ఎలా? యూ ట్యూబులో ఏ పాత  సినిమా చూసినా, ఏ జానర్ కథైనా, హీరోహీరోయిన్ల మీదే వుంటుంది. ఇక ఒక హీరో, ఇద్దరు హీరోయిన్లు, లేదా ఇద్దరు హీరోలు, ఒక హీరోయిన్ వుంటే చెప్పాల్సిన పనే లేదు. కమర్షియల్ సినిమాలకి గ్లామర్ కోషేంట్ హీరోహేరోయిన్లే. రానురానూ ఇందులోంచి హీరోయిన్ తప్పిపోయింది. సినిమా కథంటే హీరోకీ విలన్ కీ మధ్య హీరోయిజాల కథగా మారిపోయింది. హీరోయిన్ నామ్ కే వాస్తే మిగిలింది. సెకండాఫ్ లోనైతే పాటల కోసమే వచ్చి పోతూంటుంది. గర్ల్స్ జీవితంలో చాలా  ముందుకెళ్ళి పోతున్నారు. చాలా ఉన్నత స్థానాలకి చేరుకుంటున్నారు. సినిమాల్లో చూద్దామంటే ఆలోచనలో, ప్రవర్తనలో ఏ మాత్రం పరిపక్వత లేని, తాము ఐడెంటిఫై చేసుకోలేని నేలబారు హీరోయిన్ పాత్రలు కన్పిస్తూంటాయి. హీరోయిన్ పాత్రలతో  ఈ ‘కమ్యూనికేషన్ గ్యాప్’ ని భరిస్తూ, హీరోయిజాల మేల్ సెంట్రిక్ సినిమాలు చూడాల్సి వస్తోంది. గర్ల్స్ తమ చదువుల్లో, వృత్తుల్లో వొంటరిగా ఎదుర్కొంటున్న సమస్యలకి సమాధానంగా ఒక్క హీరోయిన్ పాత్రనైనా చూసి సంతృప్తి పడదామంటే సాధ్యమయ్యే పరిస్థితి లేదు. 

          కాబట్టి ఒకప్పుడున్న ఏ సాంప్రదాయాన్ని వదిలేసుకుని ఈ పరిస్థితికి సినిమా లొచ్చాయో తెలుస్తోంది. ఇదిమంచిదే అనుకుంటే ఇలాగే  కొనసాగవచ్చు. లేదంటే మళ్ళీ బయల్దేరిన చోటు నుంచి ప్రారంభం కావొచ్చు. హీరో హీరోయిన్లతో ఏ కథలు చేస్తారన్నది కాదు ముఖ్యం, హీరోయిన్ పాత్రల్ని గర్ల్స్ ఆశయాలకి ఎంత దగ్గరగా తీసికెళ్తారన్నది పాయింటు. దీని మీద ప్రత్యేకంగా ఆర్టికల్ రాయనవసరం లేదు. హీరోతో బాటు హీరోయిన్ కి ప్రాధాన్యమున్న సినిమాలు చాలా వున్నాయి. అవి సెర్చ్ చేసి చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు హిందీలో మూస ఫార్ములాని భూస్థాపితం చేశాక, హీరోయిన్ పాత్రలు ప్రయోజనకరంగా, పవర్ఫుల్ గా, ఆలోచనాత్మకంగా వస్తున్నాయి. 

          2. స్ట్రక్చర్ సంగతులు, ఆ స్ట్రక్చర్ తో స్క్రీన్ ప్లే సంగతులు మేం రాసి రాసి వున్నాక, ఈ పాటికి మీకు ‘శాస్త్రం’ తెలిసిపోయి వుండాలి. అప్పుడు ఈ నాలెడ్జితో మీరు సినిమాలు చూస్తూంటే, ఇంకా స్క్రీన్ ప్లే సంగతులు మీకవసరం లేదు. సినిమాల్ని తెలిసిపోయిన స్ట్రక్చర్ ప్రకారం మీరే విశ్లేషించెయ్య వచ్చు. అందుకని రెగ్యులర్ గా అన్నిటికీ స్క్రీన్ ప్లే సంగతులు రాయడం లేదు, రివ్యూల వరకే రాస్తున్నాం. ఎన్నో సినిమాలకి స్క్రీన్ ప్లే సంగతులు రాశాక, ఇంకా  మీకు స్క్రీన్ ప్లే నాలెడ్జి అబ్బక పోతే స్క్రిప్టు లెలా రాస్తున్నారు. కాబట్టి ఇకపైన అన్ని సినిమాలకి స్క్రీన్ ప్లే సంగతులు ఆశించవద్దు. ఒక్క సినిమాకి స్క్రీన్ ప్లే సంగతులు రాయాలంటే చాలా శ్రమ వుంటుంది. రోజులు పడుతుంది. ఇది రాయాలి, రాయక తప్పదు అన్పించినప్పుడు రాస్తూ వుందాం. 

          3. ఈ బ్లాగుని తెలుగు, హిందీ, అప్పుడప్పుడు హాలీవుడ్ సినిమాలకే పరిమితం చేశాం. ఇతర భాషల్లో హిట్టవుతున్న సినిమాల విశ్లేషణలు కూడా రాయాలంటే అసాధ్యం, ఇక ఇతర పనులు చేయలేం. మీరన్నట్టు రాస్తే మీతోబాటు మేమూ అప్డేట్ అయ్యే మాట నిజమే. ఇవ్వాళ నాలెడ్జి తో బాటు ఆ నాలెడ్జిని అప్డేట్ చేసుకుంటూ వుండడం చాలా అవసరమే. అయితే ఈ అప్డేట్స్ అన్నీ రాస్తూ కూర్చోవడమంటే సాధ్యమయ్యే పని కాదు. అప్పటికీ స్ట్రక్చర్  అప్డేట్స్ అంటూ ఇస్తూనే వున్నాం. ఇతర భాషల సినిమాల్లో పనికొచ్చే ముక్క ఏదైనా వుంటే నోట్ చేసి పెట్టుకుంటాం. సందర్భం వచ్చినప్పుడు ప్రస్తావిస్తాం. అంతేగానీ సినిమాలకి  సినిమాలు విశ్లేషణలు రాసేంత అవసరం లేదు. ఒక్కటి గుర్తు పెట్టుకోండి. ఫ్యాషన్ కోసం నానా సినిమాలన్నీ చూడకండి, ఫ్యాషన్ కోసం డిస్కషన్స్ పెట్టుకోకండి, ఫ్యాషన్ కోసం ఇంకా ఇంకా విశ్లేషణలూ మన్నూమశానం చదవకండి. ఈ యాక్టివిటీస్ కి అంతుండదు. ఇవన్నీ చేస్తూ ఏం చేద్దామని? ఇది వ్యసనంగా మారితే మీరు చేయాల్సిన అసలు పని చేయలేరు. కాబట్టి వీటిని పరిమితం చేసుకుని, వర్క్ లోకి దిగండి. స్క్రిప్టు రాయండి, స్క్రిప్టు రాయండి, స్క్రిప్టు రాయండి, రాయడం గురించి ఆలోచించండి...

          Q:  స్క్రీన్ ప్లే టిప్స్ (పోస్ట్ నెం : 817) లో ‘నువ్వు తోపురా’ గురించి రాసింది చదివాను. ఆ పాత్ర నైతిక ప్రాతిపదిక సరీగ్గా లేదని రాశారు. మరి ఏం చేస్తే బావుండేదంటారు? 
సుదర్శన్, టాలీవుడ్ 
         A:  బ్లాగులో హాలీవుడ్ ‘బేబీ డ్రైవర్’ ఆధునిక స్క్రీన్ ప్లే సంగతులు (802, 803, 805) చదివారా? ఆ బేబీ గాడు కావాలని నేరాలు పూసుకోలేదు. కుట్రలు పన్న లేదు. తల్లి మరణంతో చాలా బాధాకర బాల్యం వెన్నాడుతూంటే, దారి చూపించేవాళ్ళు లేక, కనిపించిన విలన్ దగ్గర అప్పుచేసి, ఆ అప్పు తీర్చడానికి ఆ విలన్ ఆపరేషన్స్ కోసమే కారు డ్రైవర్ గా చేరి బ్యాంకు దోపిడీల్లో సహకరించాల్సి వచ్చింది. ఇలా ఈ అప్పు వరకూ తీర్చేసి బయటపడి, హీరోయిన్ తో మంచి జీవితం గడుపుదామనుకుంటే,  మళ్ళీ ఆ విలన్ ట్రాప్ చేశాడు. బేబీ డ్రైవర్ దోపిడీ జాబ్స్ కి సహకరించి ఎంత విలన్ బాకీ తీర్చేసినా, ఆ దోపిడీ జాబ్స్ లో తనూ భాగస్థుడైనందుకు, చట్టంతో తీర్చుకోవాల్సిన బాకీ మిగిలే వుంది. ఈ బాకీ తీర్చే నైతిక ప్రాతిపదికతోనే మిగతా కథా యానం.

          మంచోడు కుట్రలు పన్నడు. బేబీ డ్రైవర్ కుట్రలు పన్నలేదు. పరిస్థితులవల్ల ఇరుక్కుని విలన్ కుట్రలకి సహకరించాడు. అందులోంచి బయటపడాలని ప్రయత్నించి పోలీసులకి దొరికి శిక్ష అనుభవించాడు. ఇలా కథ ప్రతిపాదిస్తున్న నైతిక విలువల్ని మన్నించాడు. 

         ‘నువ్వు తోపురా’ హీరో కూడా మంచోడే. అమెరికా  వెళ్లి తిరిగి రాలేక ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్ గా కంటిన్యూ అవుదామనుకున్నాడు. ఇంతవరకూ ఓకే. బేబీ డ్రైవర్ కూడా విధిలేక విలన్ కి పడ్డ బాకీ తీర్చడానికి ఇల్లీగల్ పనులు చేశాడు. కానీ మన తోపు ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్ ఆలోచనతో ఆగక, గ్రీన్ కార్డు అనుకున్నాడు, దాని కోసం బోగస్ పెళ్లి అనుకున్నాడు, దీనికి డబ్బుకోసం డ్రగ్స్ దందా అనుకున్నాడు. ఈ కుట్రలన్నీ చేశాడు. ఎక్కడా చట్టానికి దొరక్కుండా తప్పించుకున్నాడు. దీంతో కథ నైతిక ప్రాతిపదిక గతితప్పి పోయింది.

          మరేం చేసి వుండాలి? బేబీ డ్రైవర్ ని మళ్ళీ విలన్ వచ్చి ఇరికించినట్టు, తోపుని డ్రగ్ మాఫియా ఇరికించి వాడుకోవాలి. మంచోడు కుట్రలు చేయకూడదు, కుట్రల్లో ఇరుక్కోవాలి. ఇది అమల్లో వున్న సినిమా కథా రచనా నీతి.
సికిందర్


Saturday, May 4, 2019

817 : టిప్స్


       52. ‘నువ్వు తోపురా’ లో హీరో సుధాకర్ పాత్రకి కల్పించిన నైతిక ప్రాతిపదిక ఏమిటి? అతను ఆవారా, బీటెక్ పూర్తి చెయ్యడు, ఏ పనీ చెయ్యడు, నడుం వంచి పని చేయమంటే సూరి ఎవ్వరికీ వంగడు అని పంచ్ డైలాగు. ప్రేమించిన అమ్మాయి (హీరోయిన్), ఇంట్లో చెల్లెలు - ఓ కప్పు టీ కూడా సొంత డబ్బులతో కొనుక్కోలేని వాడివని అవమానించినా దులుపుకు పోతాడు (తర్వాతెప్పుడో ఫీలవుతాడు). వేళా పాళా లేకుండా ఫ్రెండ్స్ తో మద్యం తాగుతాడు. తాగి వచ్చి ప్రభుత్వోద్యోగిని అయిన చదువుకున్న తల్లితో, చదువుకుంటున్న చెల్లెలితో మిస్ బిహేవ్ చేస్తాడు. అన్నం ప్లేటు తీసి ఎత్తి పడేస్తాడు. ఎందుకిలా చేస్తున్నాడంటే చెప్పిన కారణం చిన్నప్పట్నుంచీ తల్లి తనని పట్టించుకోలేదట. ఆమె ఆఫీసు నుంచి వచ్చి, పాపాయిగా వున్న చెల్లెల్నే  చూసుకుంటూ, వంట పనీ అదీ  చేసుకుంటూ తనని పట్టించుకోలేదట. 

           ఇదీ ఇంతవరకూ ఇంట్లో కథకి నైతిక ప్రాతిపదిక. ఇంత వయసొచ్చాకైనా తల్లిని  అర్ధం జేసుకోకపోవడంలోని సైకలాజికల్ గ్యాప్ తో వుంది. పైగా తల్లి మీద ఆధారపడి బతుకుతూ. ఇది కథలో తల్లితో కాన్ఫ్లిక్ట్ కి (సంఘర్షణకి) సరిపోయిందా అన్నది వేసుకోవాల్సిన ప్రశ్న. సరిపోలేదనే సన్నివేశాలని చూస్తూంటే తెలుస్తుంది. మొన్న ‘సూర్యకాంతం’ లో లాగే పైపైన రాసేసి ఏదో చల్తాహై అన్నట్టు ఇదీ తీసేశారు.  ‘తోపు’ అన్నాక మానసిక ఎదుగుదలకి అడ్డు పడే కారణాలుండకూడదు. తోపు తోపే – వాడి మైండు షార్పే, అదే సమయంలో తుప్పే. ఈ కథ లోనే ఒకచోట సబబైన ఒక  కారణముంది మైండ్ తుప్పు పట్టడానికి. దీన్ని గుర్తించలేదు. 

           చిన్నప్పుడు తల్లి గురించి ఒకడు చెడుగా మాట్లాడతాడు. పొద్దుపోయినా తల్లి ఆఫీసు నుంచి ఇంటికి రావడం లేదంటే ఇంకే నాన్నతో గడుపుతోందో నని. ఈ మాట అనగానే – దీంతో ఇక తల్లి తనని నిర్లక్ష్యం చేస్తున్న కారణం వాడి పసి మనసుకిలా తెలిసొచ్చి, దాంతో తల్లి మీద ఇప్పుడు అనుమానంతో  కూడిన ద్వేషం బలపడుతుందన్న అంచనా వెంటనే మనకి అందుతుంది. కానీ దీన్ని నీరుగారుస్తూ అక్కడికక్కడే మ్యాటర్ సెటిల్ చేసేశారు. వాడు వెంటనే తల్లిని అంత  మాట అన్నవాడిని కొబ్బరి కాయ పెట్టి కొట్టేస్తాడు. ఇంకేముంది- తనని నిర్లక్ష్యం చేస్తున్న తల్లి పట్ల ఈ పాజిటివ్ యాక్షన్ మొత్తం కాన్ఫ్లిక్ట్ నే గల్లంతు చేసేసింది. 

          ఇక్కడ మనం రాసి పెట్టుకోవాల్సిన  స్క్రీన్ ప్లే నీతి  ఏమిటంటే – కాన్ఫ్లిక్ట్ ని బిల్డప్ చేస్తున్నప్పుడు మధ్యలో దాన్ని సెటిల్ చేసేసే పాజిటివ్ టర్నింగు లిచ్చుకోకూడదని! 

          చిన్నప్పుడు విన్న మాటలతో వాడు (రాముడే విన్న మాటలతో సీతని దూరం పెట్టాడు) తల్లిని ద్వేషించి వుంటే, తల్లి ఇంకో నాన్నతో గడిపి రావడమే  తనని నిర్లక్ష్యం చేయడానికి మూలమని విషబీజం నాటుకుని వుంటే,  పెద్దయ్యాక కూడా దీనికి ఎక్స్ పైరీ వుండదు. ఏమో అప్పుడలా తిరిగిండొచ్చు అమ్మ - అని ఇప్పటికీ అనుకోవడానికి వీలుంది. ఒక అనుమానం ‘ముత్యాల ముగ్గు’ ని అంత హిట్ చేసింది. ఈ అనుమాన బీజం కాన్ఫ్లిక్ట్ కి ఆధారమైనప్పుడు, ఆ  నైతిక ప్రాతిపదిక చాలా బలంగా వుంటుంది. మనసులో పెట్టుకున్న అనుమానం ఎప్పుడు బరస్ట్ అయి బయట పెడతాడు - అప్పుడా మదర్ ఏమని జవాబిస్తుంది - అన్న బలమైన ఎమోషనల్ డ్రామా కోసం మనం ఉత్కంఠతో ఎదురు చూడొచ్చు. కథంటే ఇదికదా. వంద రూపాయలిచ్చుకున్న ప్రేక్షకుడు విషయం లేకుండా ఏం చూస్తూ కూర్చుంటాడు (జీఎస్టీ తో కలిపి 112 తీసుకుంటున్నారు, నూట పదహార్లు చేస్తే సరిపోతుంది కళా సేవలకి). 

          స్క్రీన్ ప్లే నీతి -2  :  ప్రేక్షక భక్తుడు  దక్షిణగా  సమర్పించుకున్న నూట పదహార్లు విలువ చేసే కళా  సేవలు కూడా అందించలేనప్పుడు కాళ్ళూ చేతులు ముడుచుక్కూర్చోవాల్సిందే!

          ఇక అమెరికా వెళ్లిపోయేటప్పుడు మదర్ తో ఇంకేదో గొడవ పెట్టుకుని చెప్పకుండానే వెళ్ళిపోతాడు. ఇంకేదో గొడవ కాదు, ఈ అనుమాన బీజమే బద్ధలవ్వాలి. తల్లి మీద అభాండం వేసేసి వెళ్లిపోవాలి. ఆమె కుప్పకూలిపోవాలి. ఇది మనల్ని సినిమా సాంతం ఆందోళన పరుస్తూ వెంటాడాలి - ఇప్పుడెలా పరిష్కారమవుతుందాని. ప్లాంట్ పాయింట్ వన్ అంటే ఇలా వుండాలి కదా? ఇంకేదో లేకి గొడవ పెట్టుకుని వెళ్ళిపోవడం కథకి సంబంధమున్న ప్లాట్ పాయింట్ లా వుందా? ఇందుకే ఇది ప్లాట్ పాయింట్ వన్ కాదని, ఇంకేదో వుంటుందనీ ఇంటర్వెల్ దాకా భరిస్తూ చూడాల్సి వచ్చింది.

***
         సరే, దీన్నలా వుంచుదాం. ఇక అమెరికా వెళ్ళాక  అక్కడ ఏ నైతిక ప్రాతిపదికన కొనసాగాడు? అమెరికా వెళ్లకముందు, హీరోయిన్ తో విడిపోయాడు. ఆమె ఎమ్మెస్ కి యూఎస్ కెళ్ళడం నచ్చలేదు. బీటెక్ పూర్తి చేసి తననీ రమ్మన్నా మొండికేశాడు. అలా విడిపోయాక, అమెరికా వెళ్తాడు. అమెరికా  వెళ్లేందుకు కథకుడు చేసిన కథనం చిన్నప్పుడే తాత దగ్గర డప్పు బాగా వాయించడం నేర్చుకోవడం. ఈ డప్పు కళ ఇప్పుడు అమెరికాలో ప్రోగ్రాం ఇచ్చేందుకు దారి తీస్తుంది. అక్కడికెళ్ళి మిస్ బిహేవ్ చేసి ఆ తెలుగు సంఘం వాళ్లకి దూరమైపోతాడు. చదువూ పూర్తి చేయలేదు, జస్ట్ అమెరికా వచ్చే ముందే తాత చనిపోతే శవయాత్రలో తాత కోసం డప్పు వాయించాడు, అంత సెంటిమెంటల్ డప్పు కళతో అమెరికా  వచ్చిన వాడు దాన్ని కూడా ఉపయోగించుకుని బాగుపడాలనుకోడు. మరేం తోపు?  మరెందుకు అమెరికాకి రావడం? క్యారక్టర్ కి విలువల ఆధారిత మోటివేషన్ ఏది? అమెరికా వెళ్ళడమంటే అమేథీ వెళ్ళడం కాదుకదా? 

          స్క్రీన్ ప్లే సేవల రీత్యా చెప్పాలంటే డప్పు వాయించడానికి అమెరికా వెళ్ళడమంటే ఒక కమర్షియల్ అప్పీలున్న సెటప్ అది. దీని పే ఆఫ్ అలాగే జరిగిపోవాలి. డప్పు వాయించేసి ఆదరగొట్టాలి. ఆ డప్పు చిరిగిపోవాలి తల్లి మీద కసితో! అతడి మైండ్ మీద తల్లియే స్వారీ చేస్తోంది. ఈ భారం ఇంకెప్పుడు దిగిపోతుందో తెలీదు. ఇది పాత్రకి ఎమోషనల్ సెటప్. ఫిజికల్ సెటప్ వచ్చేసి తిరిగి రాలేక అమెరికాలో ఇరుక్కోవడం. 

          కానీ ఇందంతా వుండదు. అమెరికాలో డప్పు ప్రదర్శనే వుండదు (పాపం తాత!). అతడి రొచ్చు ప్రవర్తన నచ్చక అమెరికా తెలుగు సంఘం వాళ్ళు వెళ్ళగొడతారు. మామూలుగా విమాన మెక్కించి తిరుగు టపాలో పంపించేస్తారు. పంపించక పోతే అది కాంట్రాక్టు ఉల్లంఘన. డిమాండ్ చేసి రిటర్న్ జర్నీ సాధించుకోవచ్చు. అలా చేయక, ఏం చెయ్యాలో తోచనట్టు, అమెరికాలో గొప్ప చిక్కులో పడిపోయినట్టు ఫీలవుతాడు. ఫీలయ్యి ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్ గా వుండి పోవడానికి నిర్ణయించుకుంటాడు. పెట్రోల్ బంకులో ఉద్యోగంలో చేరతాడు. ఇందులో కూడా లాజిక్ ఆలోచించకుండా పక్కన బెడదాం. అయితే ఇక్కడ్నించే కథ వీగిపోవడం మొదలెడుతుంది.  ఇప్పటి వరకు ఫస్టాఫ్ అరగంట కథే. ఇక్కడ్నించీ ఇంకో రెండు గంటలు అమెరికాలో కథంతా వుంది. దీని నైతిక ప్రాతిపదికేమిటో చూద్దాం. 

          ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్ గా పెట్రోలు బంకులో వుంటూ శాశ్వత పౌరసత్వం గురించి ఆలోచిస్తాడు. దీనికి గ్రీన్ కార్డు కోసం అక్కడి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని తెలుసుకుని, ఒకమ్మాయితో ఉత్తుత్తి పెళ్లి ఒప్పందం కుదుర్చుకుంటాడు. ఆమె ఏడు వేల డాలర్లు డిమాండ్ చేస్తుంది. అంత డబ్బెలా అని ఆలోచిస్తూంటే ముగ్గురు క్రిమినల్స్ పరిచయమవుతారు. వాళ్ళు త్వరలో పెద్ద డ్రగ్ డీలింగ్ చేయబోతున్నారు. ఆ డ్రగ్స్ కొట్టేసి అమ్ముకోవాలని ప్లానేస్తాడు. ఆ తర్వాత కథంతా దీనిగురించే. 

          దీనికి నైతిక ప్రాతిపదికేమిటి? అతను మొదటి నుంచే క్రిమినల్ అయివుంటే, డ్రగ్స్ దందా కోసం అమెరికా వచ్చి వుంటే, ఆ క్రిమినల్ మనస్తత్వానికి నైతిక ప్రాతిపదిక సరిపోతుంది. అది వాడి  నీతి.  దానికెలాగూ చివర్లో అనుభవించే ముగింపూ వుంటుంది. 

          కానీ మన తోపు క్రిమినల్ కాదు. సరూర్ నగర్లోనూ డబ్బుకోసం అలాటి పన్లు చేయలేదు. అమెరికా వచ్చి క్రిమినల్ ఆలోచన లెలా చేస్తాడు? చట్టం కళ్ళు గప్పి ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్ గా వుంటూ గ్రీన్ కార్డుకి నిచ్చెన లెలా వేస్తాడు? అందుకు చట్టం కళ్లుగప్పి బోగస్ పెళ్లికి ఎలా సాహసిస్తాడు? దీనికి డబ్బుకోసం డ్రగ్ దందాలోకి ఎలా దిగిపోతాడు? ఇవన్నీ చేస్తూ నానా కష్టాలు పడుతున్నాడని చెప్పి ఎలా కన్విన్స్ చేస్తారు?

          అమెరికా వెళ్ళిన వాడి కష్టాలు ఇంత ప్లానింగ్ తో, వాడి నేరస్థ మనస్తత్వంతో చూపిస్తే అవి మనం ఫీలయ్యే కష్టాలవుతాయా? అమాయకుడు అమాయకంగా కష్టాలెదుర్కొంటే వుండే  నైతిక ప్రాతిపదిక క్రిమినల్ చర్యలకి పాల్పడితే వుంటుందా? దాంతో పాత్ర మీద సానుభూతి వస్తుందా? పోనీ ఆ క్రిమినల్ చర్యలతో ఎంటర్ టైన్ చేస్తుందా? దీని తాలూకు కామెడీలు వగైరా ఎంజాయ్ చేస్తామా? ఏం మెసేజ్ ఇస్తున్నాడు యూత్ కి? అమెరికా  వెళ్లి ఇలాటి పనులు చేసి సెటిలవమనా? మొన్నే అమెరికన్ అధికారులు యూనివర్సిటీ ప్రవేశాల పేరుతో వలపన్ని వందలాది తెలుగు విద్యార్ధుల్ని పట్టుకుని హెచ్చరిక పంపారు. ఎందరో  నిపుణులు అమెరికాకి ఎంత జాగ్రత్తగా వెళ్లి, ఎలా మెలగాలో టీవీల్లో మొత్తుకున్నారు. ఇప్పుడు ఈ సినిమా కొచ్చే యూత్ దీన్నెలా తీసుకోవాలి?  దీన్ని వినోదంగా చూసి మిగతా విషయాలు మర్చిపోవాలా? సరే కానీ,  పాత్రపరంగా సినిమాటిక్ గా చూసినా,  నైతిక ప్రాతిపదికనేది యూత్ ని ఒప్పించేదిగా వుందా?

***
          నైతిక ప్రాతిపదిక రోమాన్స్ తో కూడా లేదు. సరూర్ నగర్లో ప్రేమించి దూరం చేసుకున్న  హీరోయిన్ అమెరికాలో కన్పిస్తే ఒక్క క్షణం ఆగి ఆలోచించడు. ఆమె కంటే గ్రీన్ కార్డు, బోగస్ పెళ్లి ఇవే ముఖ్యమనిపిస్తాయి. ఆ బోగస్ అమ్మాయినే పెళ్లి చేసుకుని సెటిల్ అవుతాడు. ఇలా  ‘మోరల్ ప్రెమైజ్’ సరిగా లేని సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయని ‘'The Moral Premise: Harnessing Virtue and Vice for Box Office Successఅని ఒక పుస్తకమంతా రాశాడు  పీహెచ్డీ చేసిన స్టాన్లీ విలియమ్స్.

(మరికొన్ని మరోసారి)
సికిందర్  
.





Friday, May 3, 2019

816 : బాలీవుడ్ అప్డేట్




         
ప్రధాని నరేంద్ర మోడీ బయోపిక్ విడుదలని ఎన్నికల సంఘం ఆపేసిన విషయం తెలిసిందే. దీనికంటే ముందు  ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యా నాథ్ బయోపిక్ గా బరితెగించి తీసిన తీసిన ‘జిల్లా గోరఖ్ పూర్’ పోలీసు కేసు నమోదు కావడంతో విడుదల ఆగిపోయింది. ఇందులో సీఎం యోగీని పిస్టల్ పట్టుకున్న నేతగా యాంటీ హీరోగా చూపిస్తూ పోస్టర్లు విడుదల చేశారు. ఇదిలా వుండగా తాజాగా ఇంకో యోగీ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీని పేరు నకాష్ (శిల్పి). దర్శకుడు జైఘం ఇమాం. యోగీని ప్రియతమ నేతగా చూపిస్తూ శ్లాఘించాడు. సెన్సారు వారు క్లీన్ సర్టిఫికేట్ ఇచ్చేశారు. నిజానికి ఏడాది క్రితమే నిర్మాణం పూర్తయిన దీన్ని ఇంకాలస్యం చేయకుండా విడుదల చేయవచ్చు. కానీ ప్రధాని బయోపిక్ నే ఈసీ ఆపేశాక యోగీ వెండితెర కావ్యాన్ని ఈసీ అనుమతిస్తుందన్న ఆశలేం పెట్టుకోవడం లేదు నిర్మాతలు. అందుకని వచ్చేనెల విడుదల చేస్తున్నారు. 

          ‘నకాష్’ నిజానికి యోగీ ఆదిత్యానాథ్ బయోపిక్ కాదు. ఇందులో ఒక ముఖ్య  పాత్రగా మాత్రమే ఆయన కన్పిస్తాడు. అదెలా అన్నది దర్శకుడు చెప్పడం లేదు. కానీ దీని కథ మాత్రం బయటి కొచ్చేసింది. గత సంవత్సరం సింగపూర్ దక్షిణాసియా చలన చిత్రోత్సవాల్లో అవార్డు  గెలుచుకున్న సందర్భంగా కథ తెలిసిపోయింది. దర్శకుడు జైఘం ఇమాంని  ‘ఎమర్జింగ్ ఫిలిం మేకర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుతో సత్కరించింది కూడా జ్యూరీ. ‘నకాష్’ కథ సెక్యులర్ ఇండియా కథ. మరి సెక్యులర్ ఇండియా కథలో యోగీ పాత్ర  పనేమిటి? యోగీని ఇందులో ఎలా చూపించినా సంఘ్ పరివార్ మాత్రం అల్లరి చేయకుండా ప్రశాంతంగా వుంది.    కథ వచ్చేసి,  వారాణసిలో ఒక ముస్లిం శిల్పి అల్లా రఖా. ఇతను ఆలయాల్లో హిందూ విగ్రహాలని చెక్కుతూంటే ముస్లిం సమాజం వెలి వేస్తుంది. మదరసాలో అతడి పిల్లలకి ప్రవేశం దొరకదు. హిందూ సమాజం కూడా కన్నెర్ర జేస్తుంది. పోలీసులు పట్టుకుని కొడతారు. అల్లారఖా రక్షణలో ఆలయ ట్రస్టుకి చెందిన బంగారం వుంటుంది. దాన్ని అతడి స్నేహితుడు సమద్  దొంగిలిస్తాడు. ఏడాది గడుస్తుంది. అల్లా రఖాని  మతసామరస్యానికి  ప్రతీకగా కీర్తిస్తుంది మీడియా. దీంతో మున్నా అనే హిందూ నేత ఎన్నికల్లో ఓడిపోతాడు. వారణాసిలో ఇరుమతాల వారికీ హీరో అయిపోయిన అల్లా రఖా మీద మున్నాతో బాటు సమద్  కక్ష గడతాడు. నేపధ్యంలో ఏం జరిగిందన్నది మిగతా కథ. 

         ఇందులో సీఎం యోగీగా కుముద్ మిశ్రా నటించాడు. ఈ పాత్రని యోగీతో ఏంతో స్ఫూర్తి పొంది రూపొందించినట్టు  దర్శకుడు వివరించాడు. ప్రేక్షకులు ఈ పాత్రని బాగా  ఎంజాయ్ చేస్తారని కూడా అన్నాడు. సింగపూర్  చలన చిత్రోత్సవాల్లో అవార్డులు సాధించాక కేన్స్ చిత్రోత్సవాలకి కూడా వెళ్ళింది ‘నకాష్’. ఇందుకు గాను కేంద్ర సమాచార ప్రసారాల మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా ఎంపిక చేసి పంపింది. 'నకాష్' నిర్మాతలుగా గోవింద్ గోయల్, పవన్ కుమార్ మిశ్రా, ఆశుతోష్ శర్మ, శ్వేతా తివారీ లున్నారు. సరే, ఇదంతా యోగీ హీరోయిజం గురించి. మరి యాంటీ హీరోయిజం గురించి? 

          ‘జిల్లా గోరఖ్ క్ పూర్’ గత సంవత్సరం ఆగస్టులో పోలీసు కేసు నమోదై విడుదల ఆగిపోయింది. బిజెపి నేతలే కేసు వేసి దీన్ని అడ్డుకున్నారు. యోగీ ఆదిత్యానాథ్ కాస్ట్యూమ్స్ లో వున్న పాత్ర చేతులు వెనుక కట్టుకుని నిలబడితే, ఆ చేతుల్లో పిస్తోలు వుండడం, ఎదురుగా  ఆలయాలూ గోవులూ వుండడం పోస్టర్ల మీద చూసి దుమారం లేపారు బిజెపి నేతలు. యోగీని గోరఖ్ పూర్ మాఫియాగా చూపిస్తున్నారని ధ్వజమెత్తారు. నిర్మాత వినోద్ తివారీ మీద కేసు వేసి సినిమా విడుదలని అడ్డుకున్నారు. 
 నిర్మాత తివారీ స్పందిస్తూ,  పోస్టర్లు చూసి అపార్థం చేసుకున్నారనీ, అయినప్పటికీ సమాజంలో శాంతి సామరస్యతల దృష్ట్యా ‘జిల్లా గోరఖ్ పూర్’  ని బుట్ట దాఖలు చేస్తున్నట్టు ప్రకటించాడు. 

సికిందర్