రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Wednesday, September 20, 2017

518 : స్పెషల్ ఆర్టికల్



         
      స్టార్ మూవీస్ ఎలా రాయాలి, ఎలా తీయాలి అన్న టాపిక్ కి సంబంధించి హాలీవుడ్ నుంచితెలుసుకోవడానికి చాలా సమాచారముంది. కొత్తవాళ్ళు ఇది తెలుసుకుని కథలల్లు కోవడం, దర్శకత్వాలు ప్రయత్నించడం చేయకపోవడం మంచిది. దీనికంటే ముందు  చిన్నసినిమాలపై శ్రద్ధ పెట్టి రాసుకోవడమో, తీసుకోవడమో చేయడమే మంచిది. అప్పుడు కూడా ఒక చిన్నసినిమాతో వచ్చిన అవకాశం అప్పుడే స్టార్ సినిమాలకి సోపానమను కోకపోతే ఇంకా మంచిది. ఏడాదికి 60, 70  చిన్న సినిమాలు తీసే కొత్త వాళ్ళు దాదాపు అందరూ అట్టర్ ఫ్లాప్ అవుతున్నప్పుడు,  చిన్న సినిమా అవకాశం వెంటనే స్టార్ సినిమాలకి సర్టిఫి  కేట్ అనుకోవడం అవివేకం. ఒకవేళ ఒకటీ అరా చిన్న సినిమాలతో హిట్టయినా వెంటనే స్టార్ మూవీ కథ పట్టుకుని స్టార్ల చుట్టూ తిరగడం టైం వేస్టు వ్యవహారం. అలా రెండు మూడేళ్ళు ప్రయత్నించి మళ్ళీ చిన్న బడ్జెట్ సినిమాలు తీసుకుంటున్న వాళ్లేవున్నారు.  వృధా చేసుకున్న రెండు మూడేళ్ళ కాలంలో రెండు మూడు చిన్న సినిమాలు తీసుకుంటూ మార్కెట్ లో లైవ్ గా వుండవచ్చు.  ఒకప్పుడు వారపత్రికల్లో సీరియల్స్ రాసిన రచయితలు  ఏకకాలంలో రెండు మూడు పత్రికలకి రాసేవాళ్ళు. తమ పేరు నిత్యం సర్క్యులేషన్ లో వుండేట్టు చూసుకోవడానికి అలా చేసేవాళ్ళు. పేరు జనం నోళ్ళల్లో నానడం ముఖ్యం. ఒక చిన్న సినిమాతో సక్సెస్ అయి పెద్ద సినిమాల వెంటబడి రెండు మూడేళ్ళు కన్పించకుండా పోతే ప్రేక్షకులు మర్చిపోతారు. ఫ్లాపయిన కొత్త దర్శకుడు కన్పించకుండా పోతాడు, సక్సెస్ అయిన కొత్త దర్శకుడూ కన్పించకుండా పోతాడు - తేడా ఏముంది?  


          స్టార్ మూవీస్ తో పది మందికే అవకాశాలుంటాయి. అవి దాదాపు  రెగ్యులర్ టాప్ దర్శకులకే వుంటాయి. కింది స్థాయిలో 90 శాతం అవకాశాలుంటాయి. స్టార్ సినిమాలు పది విడుదలైతే చిన్న సినిమాలు 90 విడుదలవుతాయి. అవకాశాలెక్కువ వుండే 90 మీద దృష్టి పెట్టి క్వాలిటీ సినిమాలు తీసుకుంటూ సర్క్యులేషన్ లో వుండే అవకాశాన్ని ఎందుకు కాలదన్నుకోవాలి?  స్టార్ మూవీస్ కి పోటీలెక్కువ. స్మాల్ మూవీస్ కి పోటీయే లేదు దాదాపు అన్ని స్మాల్ మూవీస్ అట్టర్ ఫ్లాపవుతున్నాక. ఇక్కడ కాస్త క్వాలిటీతో తీసిన వాడు సులభంగా కింగ్ అయిపోతాడు. కింగ్ చిన్న సినిమాలతో కొన్నాళ్ళు నలిగితే గానీ స్టార్ మూవీస్ తీసే సూపర్ కింగ్ కాలేడు. వూహించుకున్నత సులభం కాదు, ఒక సినిమా అనుభవంతో స్టార్ మూవీస్  తీయగలమనుకోవడం



         
ఇక కొత్తగా స్క్రీన్ ప్లే నేర్చుకునే రైటర్స్ సంగతి. వీళ్ళు కూడా  కథంటే మహేష్ బాబు, ఎన్టీఆర్ లెవెల్ కథే అనుకుని - నీటి పిట్టలు తటాకంలో  డింకీలు కొట్టడాన్ని మించిపోయి స్కూబా డైవింగులు కొడుతున్నారు. నేల మీద పడి గాయాలు చేసుకుంటున్నారు. అందరి దృష్టీ స్టార్స్ మీదే. బిగ్ స్టార్స్ కాకపోతే నాని, శర్వానంద్, నిఖిల్, సందీప్ కిషన్, రాజ్ తరుణ్, ఇప్పుడు దేవరకొండ విజయ్ లాంటి జ్యూనియర్ స్టార్స్ కి తక్కువ కాకుండా కథలు రాయాలనుకోవడం.  అసలు రైటర్స్  స్టార్స్ కి కథలివ్వడం జరుగుతోందావాళ్ళు దర్శకుల దర్బారుల్లో  ఆస్థాన కవులవుతున్నాక? ఇది ఆలోచించాలికథలిచ్చే రైటర్స్ అనే జాతి ఎప్పుడో అంతరించిపోయింది. కథలు దర్శకులే ఇచ్చుకుంటారు. కాబట్టి స్క్రీన్ ప్లే నేర్చుకునే రైటర్స్ తమ కథలు తెరకెక్కాలనుకుంటే, తాము దర్శకులు కూడా కాగలిగితేనేబీటెక్ చేశాక శాపో శాపమో చేసుకుంటేనే జాబ్ అన్నట్టు, స్థాయి రైటర్స్ కథలివ్వాలన్నా దర్శకులుగా మారాల్సిందే

         
కాబట్టి ఒక గోల్ లేకుండా స్క్రీప్లేలూ గట్రా నేర్చుకోవద్దు. రైటింగ్ నేర్చుకునే వాళ్ళు ఇవ్వాళ మూడు రకాలు. దర్శకుడు కాగోరి రైటింగ్ నేర్చుకునే వాళ్ళు; దర్శకుల దగ్గర, సీనియర్ రైటర్స్ దగ్గర చేరడానికి నేర్చుకునేవాళ్ళు, కేవలం డైలాగ్ రైటర్స్ గా కొనసాగాలనుకుని నేర్చుకునే వాళ్ళు. మూడూ కూడా చిన్న సినిమాలతో మొదలెట్టుకోవాల్సిందే. అప్పుడే స్టార్ డైరెక్టర్ దగ్గర, స్టార్ రైటర్ దగ్గర చేరిపోవడం అస్సలు కుదరదు. ఇలా తిరిగి టైం వేస్ట్ చేసుకుంటున్న వాళ్ళు చాలా
మంది
వున్నారు. స్క్రీన్ ప్లే నేర్చుకుంటూ ఒక చిన్న స్క్రిప్టు రాయలేని వాళ్ళు స్టార్ మూవీస్ డైనమిక్స్ ని ఏం అర్ధం జేసుకుంటారు. స్టార్ మూవీస్ చూసేసి వూహించుకున్నంత సులభం కాదు  రాయడం - అవి టెంప్లెట్ మూవీస్ అయినా సరే. కాబట్టి ముందు కలలు గనడం మానెయ్యాలి. కలలు గంటూ ఫీల్డుకి రావొచ్చు. వచ్చాక కలలుండవు, వాస్తవాలు అర్ధంజేసుకోవాలి.

         
నేపధ్యంలో స్టార్ మూవీస్ రాయడమెలా అనే వ్యాసం అవసరమా అన్పించింది. అనవసరంగా కొత్త వాళ్లకి పెద్ద ఆశలు  కల్పించి చెడగొట్టినట్టవుతుందనే ఉద్దేశంతో శీర్షిక ప్రకటించి రెండు మూడు నెలలవుతున్నా వ్యాసం రాయలేదు. అనాలోచితంగా శీర్షిక  ప్రకటించడం పొరపాటే. పోనీ కొత్తవాళ్లకి కాకపోయినా ఇతరులకి ఉపయోగపడవచ్చులే అనుకున్నా- ఇతరులెవరు? 1. టాప్ దర్శకులు, రచయితలు, 2. మీడియం దర్శకులు, రచయితలు, 3. చిన్న చిన్న దర్శకులు, రచయితలు

         
పై  మూడు బ్రాకెట్స్ లో మొదటి రెండు బ్రాకెట్లలో వుంటున్న  వాళ్లకి తెలుసుకునేంత తీరికా ఓపికా లేక డీఫాల్టు మెకానిజంతో సాగిపోతూంటారు కాబట్టి అవసరం లేదు. మూడో  బ్రాకెట్లో వుండే  వాళ్ళకి స్టార్స్ తో అవకాశాలే రావు కాబట్టి తెలుసుకోవడం శుద్ధ దండగ. మరి ఎవరికోసం వ్యాసం

         
కాలక్షేపంకోసం. ఇంతకి మించి దీనికే  ప్రాధాన్యమూ లేదు. దృష్టితోనే చూడాలి. కొత్త వాళ్ళు సరదాగా చదివేసి అవతల పడెయ్యాలేగానీ ఇదే అవకాశమనుకుని స్టార్ మూవీస్ మీద పడిపోవద్దు. కొత్త వాళ్ళు కొందరు మరీమరీ అడుగుతూంటేనే తప్పక వ్యాసం రాయాల్సి వచ్చింది. షరతులు వర్తిస్తాయ్. పైదంతా చదువుకుని  ముందు చిన్న సినిమాలకి కట్టుబడి వుంటేనే వ్యాసం చదవాలి.

(వ్యాసం శనివారం
-
సికిందర్











Sunday, September 17, 2017

517 : నాటి సినిమా!



       1969 మహాత్మా గాంధీ శత జయంతి సంవత్సరం.
          ఉపన్యాసాల టపాసులు విరివిగా పేల్చుకున్న దేశం.
          ఆ టపటపలు , ఢమఢమలు సద్దుమణిగిన తర్వాత ఎప్పటిలా తిరిగి రొటీన్ రాజకీయ వేషాలు - రేపిన గాంధీజీ  ఆశయాల ఆశలు, చేసిన గాంధీజీ  మరో ప్రపంచపు బాసలూ హుళక్కి అయి, నేటికి దిగ్విజయంగా 40 ఏళ్ళు. గాంధీ మహాత్ముడు చనిపోయింది 1948 లో కాదు.
          రాజకీయం మారకుండా రాజ్యం మారదు. రామరాజ్యం రాదు. దీన్ని సినిమా దృశ్యమానం చేసినప్పుడు, ఒక ‘మరోప్రపంచం’  వెలుస్తుంది. గాంధీజీ కలలుగన్న మరో ప్రపంచాన్ని చూపిస్తుంది. గాంధీయిజాన్ని రాజకీయం సొమ్ము చేసుకుందే గానీ, సినిమాలు కాదు. ఒక దశలో వెండితెర మీద గాంధీ పాత్ర అలా కన్పించి ఓ సందేశమిస్తే ఘోల్లున నవ్వడం నేర్చుకున్నారు ప్రేక్షకులు. అదే ప్రేక్షకులు పూర్తి స్థాయి గాంధీ జీవితాన్ని ఆటెన్  బరో చూపిస్తే కళ్ళకద్దుకున్నారు భక్తిభావంతో. వాళ్లకి గాంధీజీ నిండు జీవితమే రీలు పడాలి, ఓ సందేశం తో సరిపెడితే కాదు. ఇందుకే అక్కినేని, ఆదుర్తిలు చేతులు కాల్చుకున్నారు ‘మరోప్రపంచం’ తీసి. 

          రాజకీయమేకాదు, 1970 ల నాటికి గాంధీయిజం పట్ల కూడా ప్రేక్షకులకి ఆసక్తి సన్నగిల్లిందనడానికి ఈ సినిమా పరాజయ గాథే  నిదర్శనం. 

         జాతిపిత నూరవ జయంతిని పురస్కరించుకుని ఆయన స్వాప్నిక సందేశంతో 1970 లో ‘మరో ప్రపంచం’ అనే ఆఫ్ బీట్ సినిమాని అక్కినేని, సావిత్రి, జమున, గుమ్మడి లాంటి పాపులర్ తారలతో నిర్మించి, ‘అసంతృప్తితో, అశాంతితో, అదేమిటో అర్ధం కాని ఆవేదనతో, అనుక్షణం మధనపడే విద్యార్ధులందరికీ’ ఏంతో ఆప్యాయంగా అందిస్తే, ఆ విద్యార్థులే  పట్టించుకోలేదు. లక్ష్యిత ప్రేక్షకులే లెక్కచేయనప్పుడు అసలు ప్రీ పొడక్షనే వృధా అన్పిస్తుంది. 

          ఇది ఆనాటి స్టూడెంట్స్ బ్యాడ్ లక్కే. స్టూడెంట్స్ అన్నాక ఫ్యూచరిస్టిక్ సినిమాలు కూడా చూసి మేధస్సు పెంచుకోవాలి. ఇప్పుడు 40 సంవత్సరాల తర్వాత ఈ సినిమా చూస్తే, ఇది కాలజ్ఞానం కూడా చెబుతూ, నాస్టర్ డామిజాన్ని ప్రదర్శించడాన్ని తెలిసి, నిటారుగా నిక్క బొడుచుకుంటాయ్ మన వెంట్రుకలు! 

          దటీజ్ ఆదుర్తి సుబ్బారావ్!
        సాహిత్యానికి కొడవటిగంటి కుటుంబ రావెలాగో, సినిమాలకి ఆదుర్తి సుబ్బారావలాగ. తెలుగుదనం, దానికి అభ్యుదయం, వీటిని అరటి పండు  వొలిచి చేతిలో పెట్టినంత లొట్ట లేసుకునేంత స్పష్టత, సరళత్వం... ఇద్దరూ కూడబలుక్కుని పంపకాలు జరుపుకున్నట్టు కన్పిస్తారు  ఒకరి సినిమాలూ ఇంకొకరి సాహిత్యమూ చూస్తే.

          మూగమనసులు, మంచిమనసులు, తేనెమనసులు, సుమంగళి, ఇద్దరు మిత్రులు, డాక్టర్ చక్రవవర్తీ ...లాంటి ఎన్నెన్నో చక్కరకేళులతో ఆదుర్తి సుమధుర సంగీతాల చిత్రావళి.  జానర్ సెట్టర్ కూడా తను. మూగమనసులు లాంటి పునర్జన్మల సినిమాలు ఎప్పుడు ఎవరు తీసినా బాక్సాఫీసుకి మాలిమి కావడం ఆయనేసిన  బాటే. 1968-75 మధ్య ఏడేళ్ళ కాలంలో మిలన్, జీత్,  ఇన్సాఫ్, రఖ్ వాలా, మస్తానా లాంటి పది వరకూ హిందీలో బిగ్ స్టార్స్ తో సూపర్ హిట్స్ కూడా ఇచ్చిన షాన్ దార్ దర్శకుడాయన. జీవితంలో ఎక్కడా ఆయన పరేషాన్ గా కన్పించలేదు. 

          ‘మరోప్రపంచం’ కి  ముందు 1967 లో ‘సుడిగుండాలు’ తో మొదటిసారి దిగ్విజయంగా చేతులు కాల్చుకోవడం అయింది. అయితే 1965 లో ‘తేనెమనసులు’ తో కృష్ణ సహా అందరూ కొత్త వాళ్ళతో చేసిన మొట్ట మొదటి ప్రయోగం సూపర్ హిట్టయింది. ఐతే  1970 లో సూపర్ తారలతో ‘మరోప్రపంచం’  పరాజయం తర్వాత ఆదుర్తి ప్రయోగాల ఆర్తి  పరిసమాప్తి అయింది. ఇందులో గాంధీజీ ప్రవచిత మరోప్రపంచం రాలేదు సరికదా, డబ్బెట్టి కొందామన్నా బియ్యపు గింజ జాడ లేకపోయేసరికి,  విసిగిన ముసలవ్వ పాత్రలో జమున అంటుంది చివరికి – ‘ప్రళయం ఎప్పుడొస్తుంది నాయనా?’ అని. గ్రేట్ సెటైర్. ఇప్పుడు  అదే ప్రళయం గురించిన ‘2012 యుగాంతం’ సినిమానే తెగ ఆడిస్తున్నారు తమకిక భవిష్యత్తు లేదని డిసైడ్ అయిపోయిన ప్రజలు!

      ఇంకా ఇందులో నూరవ గాంధీజీ పుట్టిన రోజుకి అట్టహాసంగా సభలు జరుపుకుంటూ, ఇలా రెచ్చ గొడతారు నాయకులు –‘ మేం గాంధీ పేరు తగిలించుకుని ఆయన రుణం తీర్చుకుంటున్నాం. నా పేరు ఉగ్ర నరసింహ గాంధీ, మరి మీరో? మీరెలా తీర్చుకుంటారు గాంధీ గారి రుణం? ఈ హైదరాబాద్ – సికిందరాబాద్ జంట నగరాల్ని ఒక్కటి చేసి గాంధీ బాద్ గా మార్చాలని ఉద్యమించండి! పోరాడి మీ ప్రాణాలను త్యాగం చేయండి ప్రజలారా!’ ...ఇలా దేశవ్యాప్తంగా నాయకుల ప్రసంగాల తర్వాత ఒక షాట్ వేస్తాడు దర్శకుడు. అది ఆకాశంలో కావుకావుమనే కాకుల గోల. 

          అప్పుడు పేటలో కుటుంబాల్ని చూపిస్తాడు. అప్పటికే అరడజనేసి మంది పిల్లల మంద వున్నా, ఇంకా దారిద్ర్య ఆహ్వాన కేంద్రాలుగా పడగ్గదుల్ని చేసుకుని కులికే మూర్ఖ శిఖామణుల్ని చూపిస్తాడు. మరోపక్క పేదరికంలో వొళ్ళమ్ముకున్న  పాపానికి పుట్టుకొచ్చే అక్రమ సంతతి శ్రేణుల్నీ చూపిస్తాడు. ఈ పిల్ల జాతి మొత్తాన్నీ ఓ రాత్రి దొంగ లెత్తుకుపోతారు. 

     ఈ కేసుల దర్యాప్తుకి ఐజీ (గుమ్మడి వెంకటేశ్వరరావు ) రంగంలోకి దిగుతాడు. ఇంకా లోతైన దర్యాప్తుకి ఢిల్లీ నుంచి సీఐడీ  రవీంద్రనాథ్ (అక్కినేని నాగేశ్వరరావు)  దిగుతాడు. రకరకాల మారువేషాలతో ఇతను చేస్తున్న దర్యాప్తు వివరాల్ని రహస్యంగా ఫోటోలు తీసి ఓ పత్రిక్కి పంపుతూంటుంది  ఐజీ కూతురు సంధ్య (సలీమా). వాటిని  ప్రచురిస్తూ ఐజీకీ, సీఐడీ కీ షాకిస్తూంటాడు ఎడిటర్ - కం - పబ్లిషర్ (విజయ్ చందర్).
 
            వెళ్లి వెళ్లి దర్యాప్తు  ఓ రహస్య స్థావరానికి చేరుతుంది. అక్కడుంటారు వందలమంది మాయమైపోయిన పిల్లలు. వీళ్ళు ఇక్కడేం చేస్తున్నారు? సకల సౌకర్యాలతో మరో ప్రపంచాన్ని  అనుభవిస్తున్నారు. చిరిగిన విస్తరి మెతుకులతో, అతుకుల బొంత బతుకులతో, పేదల కోసం ధనికులు కట్టిన మహా మంచి ప్రపంచం (శ్రీశ్రీ పాట) కి సుదూరంగా మెరుగైన జీవన ప్రమాణాలతో, పాపాలు శాపాలు లేని సుఖవంతమైన రామరాజ్యాన్ని నిర్మించుకుంటున్నారక్కడ. దీని వెనుక సంధ్య, ఎడిటర్,  పెద్ద గాంధీ (మాడా) తోబాటు మరో ముగ్గురున్నారు. వీళ్ళ దూరదృష్టికి ప్రభావితుడై తన పిల్లల్ని కూడా వీళ్ళ పరం జే స్తాడు రవీంద్ర నాథ్. కానీ ఈ మారు ప్రపంచాన్ని మామూలు  ప్రపంచంలోని రాజ్యాంగం, చట్టాలూ ఒప్పుకోవు. అందుకని రవీంద్రనాథ్  సహా అందరూ దోషులుగా నిలబడతారు.

          కాలం కంటే ముందు తీసి, సామాజికాంశాల మీద ముందస్తు కామెంట్స్ చేసిన ఈ ప్రయోగం నాటి ప్రేక్షకుల ఆలోచనా స్థాయికి మించిపోయింది  కావొచ్చు. పైగా గాంధీయిజం తెలియాలంటే,  ఆ యిజం పుట్టిన కాలమాన పరిస్థితుల అనుభవం లేకా కావొచ్చు. సినిమాల్లో ప్రేక్షకుల ఆసక్తికి ముందుగా తెర మీద పాత్రలు పడే స్ట్రగుల్  కన్పించాలి. తమ కళ్ళముందు ప్రత్యక్షంగా వున్న సమస్యలతో స్ట్రగుల్ చూపించి, ఆ పైన  పరిష్కార మార్గంగా ఏ ఊహా జగత్తుని  సృష్టించి చూపించినా దాన్ని ఆశ్వాదించగల మూడ్ లోకి నిఖార్సుగా వెళ్ళిపోగలరు ప్రేక్షకులు. ‘మరో ప్రపంచం’ లో ఈ  మొదటిదే  మిస్సయి, కేవలం బాలల  కాల్పనిక జగత్తే తెరకెక్కడంతో ప్రేక్షకుల తల దిమ్మెక్కి వుంటుంది. కథా పరంగా ఆఫ్ బీట్ పిక్చర్లు అరుదుగా స్ట్రక్చర్ లో వుంటాయి. పైగా తక్కువ మందిని ఆకర్షిస్తాయి.  

       ఇందులో అపహరణకి గురయిన పిల్లలు బెగ్గింగ్ గ్యాంగ్ పాలబడి ‘స్లమ్  డాగ్ మిలియనీర్’  పద్ధతిలో కళ్ళ పీకివేత  ప్రమాదాన్ని ఎదుర్కొంటారు. ఇప్పుడు కొన్ని హాస్టల్స్ మెస్సుల్లో కన్పిస్తున్న  స్టూడెంట్స్ కుల వివక్షావస్థని కూడా ఈ సినిమాలో చూస్తాం. ముందు జరిగేది పేపర్లో వచ్చేసే ‘అంతిమ పోరాటం’  తరహా సీనిక్ ఆర్డర్ ని కూడా అప్పుడే చూస్తాం. పిల్లల్ని పరాయి దేశాలకి తరలించి అక్కడ్నించి  మన మీదికే  విరోధులుగా ప్రయోగిస్తారేమో - అన్న ఒక పాత్ర అనే మాటతో... నేటి జిహదిస్టులు కళ్ళకి కడతారు. ఓ మాట అందిందే తడవు, అది పట్టుకుని ఫ్లాష్ బ్యాకుల్లో  కెళ్ళిపోయి తనివిదీరా సావిత్రి వేసే జంధ్యాల బ్రాండ్ ‘సుత్తి’ ని కూడా అప్పట్లోనే ఇందులో చూడొచ్చు. పారిపోతున్న దొంగనుకుని ‘పెద్ద గాంధీ’ లాంటి ప్రయోజకుణ్ణి జనం పట్టుకుని చితకబాది,  చంపేసే అమానుష దృశ్యాలెన్నో ఇప్పుడు మనం చూస్తున్నాం. అలాగే  “ఉపన్యాసాలలో తప్ప ఆంతరంగిక సంభాషణల్లో దేశం, ప్రజలూ  అన్న మాటలు ఒక్కసారైనా అనే నాయకుడు ఒక్కడైనా వున్నాడేమో గుండెల మీద చేయి వేసుకుని చెప్పమనండి”  అన్న అక్కినేని డైలాగు ఇప్పటి రాజకీయాల్లో చూస్తున్నదే. ఇలా వీలైనన్ని అంశాల మీద భవిష్య వాణి ఆనాడే ప్రకటించేసిందీ ఆదుర్తి సృష్టి. 

          సావిత్రి, జమునలవి కీలక పాత్రలేం  కావు. సినిమా టికెట్లు తెగెందుకే వాళ్ళిద్దరూ వున్నారన్పిస్తుంది. అక్కినేని, గుమ్మడిలే రథ సారధులు. మోదుకూరి జాన్స మాటలు రాసిన ఈ వాస్తవిక కథా చిత్రంలో శ్ర్రీశ్రీ రాసిన ఒక మాత్రమే వుంది - ‘ఇదిగో ఇదిగో ప్రపంచం’ అనే పాటకి కేవీ మహదేవన్ స్వరకల్పన. అత్యధిక శాతం దృశ్యాలకి నేపధ్య సంగీతమే వుండదు. తెలుపు – నలుపులో నిర్మించిన ఈ నంది అవార్డు పొందిన చలనచిత్రానికి  కేఎస్ రామకృష్ణారావు ఛాయాగ్రహణం.

          అనేక కమర్షియల్ సినిమాలు తీసిన ఆదుర్తిలో ఒక కోణాన్ని మాత్రమే చూశాం. సమాజం పట్ల బాధ్యత కూడా ఫీలైన దర్శకుడిగా ఇంకో కోణాన్ని ఈ కళాత్మకంలో కళ్ళారా  చూడొచ్చు.


-సికిందర్
(నవంబర్ 29, 2009 – ‘సాక్షి’)