రచన, దర్శకత్వం: ఆర్.
చంద్రు
తారాగణం: సుధీర్‌బాబు, నందిత, చైతన్య
కృష్ణ, పోసాని కృష్ణమురళి, గిరిబాబు,
పవిత్ర, రఘుబాబు, సప్తగిరి
తదితరులు
సంగీతం: హరి, కూర్పు: రమేష్
కొల్లూరి, ఛాయాగ్రహణం: కె.ఎస్.
చంద్రశేఖర్
బ్యానర్: రామలక్ష్మి
సినీ క్రియేషన్స్,
నిర్మాతలు: శిరీష-శ్రీధర్
విడుదల : జూన్ 19, 2015
*
All drama is conflict; without conflict there is no
character; without character there is no action; without action there is no
story. And without story there is no screenplay
—Syd Field
ట్రెండ్ సెట్టింగ్ ప్రేమకథ లొస్తాయన్న ఆశ
ప్రేక్షకుల కెలాగూ లేదు, కనీసం ట్రెండ్ లో వున్న ప్రేమకథలైనా చూడాలని ఆశపడడ్డం
కూడా అత్యాశే అయిపోతే నష్టం ప్రేక్షకులకి కాదు- అలాటి తెలుగు ప్రేమ సినిమాలకే!
ప్రేమ సినిమాలకి థియేటర్లు ఓపెనింగ్స్ కూడా లేక వెలవెలబోతూ, రోమాంటిక్ థ్రిల్లర్లూ, హార్రర్ కామెడీలూ వస్తే
హౌస్ ఫుల్సూ నడుస్తున్న ప్రస్తుత ట్రెండ్ లో ఇంకా
పసలేని ప్రేమ సినిమాలు – అందునా కనీసం రోమాంటిక్ కామెడీ కూడా కాని విషాద
ప్రేమకథలకి మార్కెట్ ఉంటుందా?
ఎందుకు
ప్రేమసినిమాలు అట్టర్ ఫ్లాపవుతున్నాయి? వీటిని చూసే నేటి యువప్రేక్షకులు ప్రేమల విషయంలో చాలా ముందున్నారు. సినిమాల్లో
చూపిస్తున్న ప్రేమల్లాగా మడిగట్టుకు లేరు. వాళ్ళ దృష్టిలో సినిమాల్లో
చూపిస్తున్నది తమ తరం సమస్యలతో కూడిన ప్రేమలు కావు, వెనకటి తరం మూస ఫార్ములా ప్రేమల
దగ్గరే సినిమాలు ఆగిపోయాయి. స్టార్ సినిమాలు ఎంత పాత మూసగా వున్నా ఉన్మాదంతో
ఊగిపోయి హిట్ చేయగలరు గానీ, అదే మూసగా ప్రేమ సినిమాలోస్తే భరించే స్థితిలో లేరు
నేటి యువ ప్రేక్షకులు. ప్రేమ సినిమాల విషయానికొచ్చేసరికి వాటిని తమతో పర్సనల్ గా
పోల్చి చూసుకుంటున్నారు. తమ psyche తో కనెక్ట్ కాని పాత మూస ప్రేమలన్నిటినీ
తిప్పికొడుతున్నారు. ఇలా టార్గెట్ ఆడియెన్స్ తో కనెక్ట్ కోల్పోయామని కూడా
తెలుసుకోకుండా దర్శకులు పనిగట్టుకుని కాలం తీరిన ప్రేమల్నే, ఇంకా చెప్పాలంటే ఈ
సినిమాలో చూపించి నట్టుగా కాలం కాటేసిన విషాదంతపు ప్రేమల్ని సైతం తీసుకుంటూ
పోతున్నారు. వాళ్ళ మార్కెట్ స్పృహకి హేట్సాఫ్ చెప్పాల్సిందే. ఈ మధ్యే ‘వారధి’ అనే
వొక విషాద ప్రేమ సినిమా ఫలితాలు ఎలావున్నాయో చూశాక, మళ్ళీ ఇంకో ట్రాజిక్ లవ్
స్టోరీతో ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’
అంటూ వచ్చేసింది. కొసమెరుపేమిటంటే, ఇలాటి ప్రేమ కథతో ఇది కృష్ణమ్మ పరువే తీసింది!
తాను ఏం చెప్తున్నాడో తనకే తెలీకుండా ఈ ప్రేమకి కృష్ణమ్మ పరువు తీసే ముగింపునే ఇచ్చాడన్నమాట
ఈ దర్శకుడు!
ఇది దశాబ్దాలు గడుస్తున్నా
కొలిక్కి రాని కృష్ణ అనే ప్రేమికుడి బాధామయ ప్రేమగాధ. ‘గాథ’ అని అనడమెందుకంటే, ఇది
‘కథ’ కాదు కాబట్టి. ‘కథ’కీ- ‘గాథ’ కీ తేడాల గురించీ, గాథలు సినిమాలకి ఎందుకు
పనికిరావో మర్మం గురించీ, గత కొన్ని ఇలాటి సినిమాల రివ్యూల్లోనే చెప్పుకున్నాం. మళ్ళీ తర్వాత చెప్పుకుందాం.
ప్రస్తుతం ఈ గాథే మిటో చూద్దాం!
రాధాకృష్ణులు వీళ్ళు!
వూళ్ళో చదువుకంటే పశువులు తోలుకోవడమే
బెటర్ అనుకునే కృష్ణ (సుధీర్ బాబు) అనే పిల్లాడికి
ఏడో క్లాసు తప్పినా స్ట్రెంత్ లేదని ఎనిమిదో క్లాసులో పడేస్తే కొత్తగా
వచ్చి జాయి నవుతుంది రాధ ( నందిత) అనే పిల్ల. ఈమెని చూసి వెంటనే ఎట్రాక్ట్
అయిపోయి, ఈమె మెప్పుకోసం బాగా చదువుకుంటూ ప్రతిగా ఆమె ప్రేమని ఆశిస్తాడు, కానీ తానుగా చెప్పుకోలేడు.
ఆ స్కూల్లో ప్రేమ ఇంటర్మీడియేట్ కి చేరినా ఇదే పరిస్థితి. అప్పుడొక ప్రేమలేఖ
రాస్తే ఆమె తల్లి ( ప్రగతి) చేతిలోపడి ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్తుంది.
ప్రిన్సిపాల్ ( పోసాని) కృష్ణనీ, రాధనీ విడివిడిగా విచారిస్తాడు. రాధ తనకి
చనిపోయిన తండ్రి ప్రేమ తప్ప మరో ప్రేమ తెలీదనీ, తనకు తల్లే సర్వస్వమనీ చెప్పేస్తుంది ప్రిన్సిపాల్ కి. ఇది విన్న కృష్ణ
డీలా పడిపోతాడు.
ఎంసెట్ పాసయి ఇంజనీరింగ్ లో చేరతాడు. ఆ
నగరంలోనే వేరే కాలేజీలో బీకాం చదువుతున్న రాధ మళ్ళీ తారస పడుతుంది. అతణ్ణి ఫ్రెండ్
లాగానే చూస్తుంది. ఇంజనీరింగ్ పాసయి జాబ్ లో కూడా చేరాక కృష్ణకి అమెరికా వెళ్ళే
అవకాశం వస్తుంది. అప్పుడు వూళ్ళో రాధని ని కలవడానికి వెళ్తే, ఆమె తల్లి చెప్తుంది : భర్త పెన్షన్ మీద ఆధారపడి
కుటుంబాన్ని నెట్టుకొస్తున్న తను రాధ మీదే ఆశలన్నీ పెట్టుకున్నాననీ, పెళ్లి పేరుతో
ఆమెని తననుంచి విడదీస్తే చిన్నకూతురుతో బాటు ఆత్మహత్య చేసుకుంటాననీ బెదిరిస్తుంది.
చేసేది లేక అమెరికా వెళ్ళిపోతాడు కృష్ణ.
చాలా ఏళ్ళు గడిచిపోయాక, వూళ్ళో అప్పట్లో
కృష్ణతో కలిసి స్కూల్లో చదువుకుని మానే సిన
కొందరు డ్రాపౌట్స్ తమ పూర్వ విద్యార్థుల్ని కలుసుకోవాలని ఒక కార్యక్రమం పెట్టుకుంటారు.
అప్పుడు కృష్ణ అమెరికా నుంచి వస్తాడు. ఈ సారైనా రాధని పొందగలనా, ఎక్కడుందామె, పెళ్లయిపోయిందా-
అన్న సందేహాలతో.
తీరా వచ్చి ఆమెని వెతుక్కుంటూ వెళ్లి చూస్తే, కాలు
పోగొట్టుకుని వికలాంగురాలిలా వుంటుంది. ( spoiler alert ఇక్కడ అప్రస్తుతం, ఈ తరహా గాథ ముగింపు వెల్లడించకుండా
స్క్రీన్ ప్లే సంగతులు చెప్పుకోవడం సాధ్యం కాదు కాబట్టి)
ఇదీ విషయం. ఈ ఏకపక్ష ప్రేమలో ఎవరెలా చేశారో ఈ కింద చూద్దాం.
సాత్విక విషాదాలు!
హీరోగా సుధీర్ బాబు పూర్తిగా రాముడు
మంచి బాలుడు లాంటి పాసివ్ పాత్ర పోషించడంతో, అందుకు తగ్గట్టుగానే సాత్వికంగానే
వుంది నటన. ‘మోసగాళ్ళకు మోసగాడు’ కంటే నటనలో బాగానే ఇంప్రూవ్ అయ్యాడు. కానీ తన
ప్రతిభని బయట పెట్టుకోవాలంటే ఇలాంటి బాక్సాఫీసు వ్యతిరేక పాసివ్ పాత్రలు పోషించడం
కాదు. ముందు వచ్చే ఆఫర్స్ లో పాసివ్ పాత్రలుంటే వాటిని పసిగట్టి తిప్పికొట్టే
నైపుణ్యం సంపాదించుకోవాలి. ప్రేమకథల్లో నటించాలనుకుంటే అవి ట్రెండీగా ఉండేట్టు
చూసుకోవాలి. కనీసం గత దశాబ్దంన్నర కాలంగా
వెండితెర మీద ఏ తెలుగు హీరో కూడా పాత్రపరంగా భోరుమని ఏడ్చే సన్నివేశాలతో ఇబ్బంది
పెట్టలేదు. అలాటిది తను ఎందుకు ఏడుస్తున్నాడో తెలీకుండా ఒక సన్నివేశంలో కుళ్ళి-
కుళ్ళి- కుళ్ళి- కరువుదీరా ఏడ్వడం వల్ల
ప్రయోజనమేమిటో తెలుసుకోవాలి. ఈరోజుల్లో తను శోక రసంలో కూడా మేటి అన్పించుకుంటే
వొరిగేదేమిటి?
సుధీర్ బాబుదే పాసివ్/ సాత్విక పాత్ర అనుకుంటే, హీరోయిన్ నందితది మరీ విషాదంతో
కూడిన పాసివ్ పాత్ర! పెద్ద పెద్ద
కళ్ళేసుకుని చూడ్డం తప్ప ఈమె చేసిందేమీ లేదు. మాటలు కూడా అప్పుడప్పుడు మాత్రమే. ఈమె
నుంచి ప్రేక్షకులాశించే రోమాంటిక్ ఎలిమెంట్ ఏ కోశానా కన్పించకుండా చాలా చాలా జాగ్రత్త
తీసుకున్నాడు కన్నడ నేటివిటీ దర్శకుడు!
పాటలు ఎక్కువైపోయాయి. ఛాయాగ్రహణం
లో పెద్దగా ప్రత్యేకత లేదు. సినిమా నిడివి కూడా ఎక్కువే.
స్క్రీన్ ప్లే సంగతులు
రెండు లోపాలు ఈ ప్రేమ సినిమాని బలహీన పర్చాయి- మొదటిది ట్రెండ్ లో లేని ప్రేమ, రెండోది ఆ ప్రేమని కూడా ఒక కథలా గాక గాథగా చెప్పడం!
తెలుగు సినిమాలకి పాసివ్ పాత్రలు, ఎండ్ సస్పెన్స్ కథనాలు మాత్రమే శాపాలనుకున్నాం- ఇప్పుడు కథలు గాక గాథ లు చెప్పడంతో ఇంకో శాపం కూడా తెచ్చి పెట్టుకుంటున్నారు!
ఎప్పుడో పూర్వకాలంలో బాగా ప్రూవైన
ఈ బాపతు ‘ప్రేమ త్రెడ్’ ఇప్పుడూ వర్కౌట్ అవుతుందనుకున్నారో ఏమో, ఇప్పటి ట్రెండ్ ని
పట్టించుకోలేదు. ఈ త్రెడ్ కూడా ఓ గాథ లాగా
వుందని కూడా గమనించినట్టు లేదు. ‘గాథ’ అనేది ఒక స్టేట్ మెంట్ మాత్రమే. నేనిలా
అనుకుంటే నాకిలా జరిగి ఇలా ముగిసింది - అని విధికి తలవంచిన పాత్ర పరాజితుడిగా
చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇలాకాక ‘కథ’ అనేది ఆర్గ్యుమెంట్ ని ప్రతిపాదిస్తుంది. నేనకున్న
లక్ష్యాన్ని ఫలానా ఈఈ శక్తులతో ఈ విధంగా సంఘర్షించి సాధించుకున్నాను- అని
పాత్ర విజేతగా ప్రకటిస్తుంది.
‘కథ’ అనే దాంట్లో విధి అనే ఎలిమెంట్
తో పనుండదు. హీరో ఏదో అనుకుంటూంటే దైవం
కల్పించికుని ఇంకేదో చేసి- - తానొకటి తలిస్తే దైవమొకటి తలచును - అన్నట్టు అమాంతం పిడుగు పడి చావడంతో ముగియదు.
గాథ ల్లోనే ఇలాటి మౌఢ్యాలుంటాయి. ఇలాకాక కథల్లో ప్రత్యక్షంగా అడ్డు పడే ప్రత్యర్ధులతో భౌతికంగానో మానసికంగానో పోరాడి సాధించుకోవడమే
వుంటుంది.
“ స్క్రీన్ ప్లే
ద్వారా ఒక విషయం చెప్పదల్చుకుంటే కథ (story) గానో, గాథ (tale) గానో ఏదో ఒకరకంగా చెప్పవచ్చని ఇదివరకు ఒక సినిమా రివ్యూలో
చెప్పుకున్నాం. కాకపోతే గాథగా చెప్తే సినిమాకి పనికి రాదు. సినిమాకి కథే వుండాలి.
ఎందుకంటే కథలో ఆర్గ్యుమెంట్ వుంటుంది. దాంతో సంఘర్షణ పుడుతుంది. గాథలో స్టేట్
మెంట్ మాత్రమే వుంటుంది. దీంతో సంఘర్షణ పుట్టదు. సంఘర్షణ లేని
స్క్రీన్ ప్లే చప్పగా వుంటుంది. గాథలు చదువుకోవడానికి నీతి కథలుగా బావుంటాయి. కానీ
దృశ్యపరంగా చూసేందుకు కథలు మాత్రమే బావుంటాయి.
కథలో ఒక సమస్య ఏర్పాటై, దాంతో మొదలయ్యే
సంఘర్షణ తప్పొప్పుల – లేదా న్యాయాన్యాయాల ఆర్గ్యుమెంట్ కి దారి తీసి, చిట్ట చివర ఓ జడ్జ్
మెంట్ నిస్తుంది. గాథ లో సమస్య వున్నా దాంతో సంఘర్షించక, ఆర్గ్యుమెంట్
ఎత్తుకోక, జడ్జ్ మెంట్ ఇవ్వక- కేవలం ఈ ఫలానా సమస్య వల్ల మాకిలా జరిగి, చివరికి మేమిలా తయారయ్యా మయ్యోచ్ అనేసి స్టేట్ మెంట్ ఇవతల పారేసి తన
దారిన తను దులుపుకుని వెళ్ళిపోతుంది”
ఇదీ మణిరత్నం తీసిన ‘ఓకే
బంగారం’ స్క్రీన్ ప్లేసంగతుల్లో
చెప్పుకున్న విషయం. ఇలా సరీగ్గా ‘ఓకే బంగారం’ లాంటి గాథ చట్రంలోనే ‘కృష్ణమ్మ
కలిపింది ఇద్దరినీ’ కూడా ఇరుక్కుంది. ఈ రివ్యూ మొట్టమొదట్లో పైన పేర్కొన్న సిడ్
ఫీల్డ్ కొటేషన్ ప్రకారం చూస్తే, దీన్నొక
స్క్రీన్ ప్లే అనుకోవడం ఎలా అనేదే ప్రశ్న! గాథ తో మణిరత్నం ఆల్రెడీ చేసిన తప్పునే
మళ్ళీ చేయాలా!
సుదీర్ఘమైన ఫ్లాష్ బ్యాక్ తో ఈ
గాథ చెప్పుకొచ్చారు. పూర్వ విద్యార్ధుల సమావేశ ప్రతిపాదన, దాంతో అమెరికా నుంచి
హీరో తరలివస్తూ రాధగురించి జ్ఞాపకాల్లో వెళ్ళడమనే దృశ్యాలతో ఈ ‘గాథ’ ని ఎత్తుకున్నారు.
దాన్నక్కడ ఆపి - ఫ్లాష్ బ్యాక్ ప్రారంభించారు. ఈ ఫ్లాష్ బ్యాక్ అన్ని
పరిమితుల్నీఅతిక్రమించి క్లైమాక్స్ దాకా సాగింది. ఎత్తుకున్న గాథ( అమెరికానుంచి
వస్తున్న హీరోకి హీరోయిన్ తో ఏం జరుగుతుందన్న ప్రధాన గాథ) క్లయిమాక్స్ దాకా ఆగిపోయింది. ఫ్లాష్ బ్యాక్ ఎప్పుడూ ప్రధాన గాథ అవదు. ప్రధాన గాథకి సందర్భవశాత్తూ అవసరమైన సమాచారాన్ని
అందించే వనరు మాత్రమే ఫ్లాష్ బ్యాక్ అని ఇదివరకు చెప్పుకున్నాం.
అయితే ఇంత సుదీర్ఘ మైన ఫ్లాష్
బ్యాక్ ఓ ‘కథ’ లో ఉపయోగపడినట్టుగా ఏ ‘గాథ’లోనూ
ఉపయోగపడదు. కథల్లో 3-1-2 అనే నాన్ లీనియర్ పద్ధతిలో ఉపయోగపడుతుంది.
అంటే ఎండ్- బిగినింగ్- మిడిల్ అన్న వరసలో. చిరంజీవినటించిన ‘ఖైదీ’ సుదీర్ఘ ఫ్లాష్
బ్యాక్ కథనమే వుంటుంది. అది క్లైమాక్స్ తో ప్రారంభమై, అసలేం జరిగిందో చెప్పడానికి
బిగినింగ్ ని ఎత్తుకుని, మిడిల్ లో ఆ బిగినింగ్ తాలూకు సంఘర్షణ సృష్టించుకుని,
తిరిగి క్లయిమాక్స్ కొచ్చి, ఆ సంఘర్షణని
పరిష్కరించుకుంటుంది. ఇది ‘కథ’ కాబట్టి ఫ్లాష్ బ్యాక్ లో సమస్య- సంఘర్షణ వుంటాయి.
ఫ్లాష్ బ్యాక్ ముగిశాక పరిష్కారం వుంటుంది.
ఇదే ఫ్లాష్ బ్యాక్ ‘గాథ’ లో వుంటే
అది కేవలం సమాచారాన్ని అందించే వనరుగా మాత్రమే పనిచేస్తుంది తప్ప, ఓ సమస్యా దానితో సంఘర్షణా ఆసక్తికర
కథనం వుండదు. ఈ సినిమాలో చూపినట్టు కేవలం అనుభవాల పేర్పు మాత్రంగానే వుంటుంది.
ఎన్ని అనుభవాలని చూస్తాం!
అందుకని ఈ సుదీర్ఘమైన ఫ్లాష్ బ్యాక్ అంతా
అసలు కొసరు ‘గాథ’ కి కేవలం ఉపోద్ఘతంలాగా ఉండిపోయింది. కనుక కథల్లో పనికొచ్చినట్టుగా ఫ్లాష్ బ్యాక్ ( నాన్ లీనియర్
) కథనం గాథల్లో పనికి రాదనీ అర్ధం
జేసుకోవాలి.
ఉంటే ప్రేక్షకుల ఆసక్తి ప్రధాన
గాథ మీదే ఉండొచ్చు తప్ప ఫ్లాష్ బ్యాక్ మీద కాదు. ప్రధాన గాథ ని ఎంత ఎక్కువ సేపు
ఆపితే అంత ఆసక్తి ఆవిరైపోతుంది.
ఇలావుండగా, ఇది గాథ అవడంతో దీనికో
స్ట్రక్చర్ కూడా లేకుండా పోయింది. స్ట్రక్చర్ సమస్య వున్నప్పుడు, దాంతో సంఘర్షణ
వున్నప్పుడూ మాత్రమే వుంటుంది. పైన
చెప్పుకున్నట్టు ఇక్కడ ఫ్లాష్ బ్యాక్ ప్రధాన గాథ కి అవసరమైన సమాచారాన్ని అందించే వనరు మాత్రమే కావడం వల్ల, సహజంగానే ఇందులో సంఘర్షణ అనేది కూడా లేకుండా పోయింది. గాథల్లో ఫ్లాష్ బ్యాక్ పెడితే దాంట్లో ఎప్పుడూ సంఘర్షణ అనేది వుండదు, ఇది
గుర్తు పెట్టుకోవాలి. ‘సమస్య ( బిగినింగ్) – సంఘర్షణ (మిడిల్) – పరిష్కారం
(ఎండ్)’ అనే త్రిలోకాలు కథలకి మాత్రమే దఖలు పడిన కథాంగాలు. గాథల్లో, వాటి
ఫ్లాష్ బ్యాకుల్లో సెర్చి లైట్ వేసి గాలించినా ఇవి కన్పించవు.
కనుక ఈ విధంగానే కేవలం హీరో వివిధ
దశల ప్రేమ సమాచారాన్ని మాత్రమే ఇస్తూ
క్లయిమాక్స్ దాకా సాగింది ఫ్లాష్ బ్యాక్! ఒక గాథని చెప్పడానికి ఇన్నేసి గంటల సమాచారం అవసరమా!
సమాచారమే ( ఫ్లాష్ బ్యాకే) ఇంత తినేస్తే ఇక మొదట్లో ఎత్తుకున్న ప్రధాన గాథ కి ఏం సమయం
మిగులుతుంది?
ఈ సినిమాలో ప్రధాన గాథ ఎలా మిగిలిందంటే, రాథని చూడ్డానికి
అమెరికానుంచి వచ్చిన వాడు, చివర్లో ఎప్పుడో చూశాడు- కలుసుకుని సుఖాంతం - పోనీ దుఃఖాంతం
చేసుకున్నాడు! అమెరికానుంచి రావడానికీ, చివర్లో ఎప్పుడో కలుసుకోవడానికీ మధ్య అంతా తన ఫ్లాష్ బ్యాక్
వేసుకుని కాలక్షేపం చేశాడు. ఈ ఫ్లాష్ బ్యాక్ లో దమ్ములేదు, పిసరంత మిగిలిన ప్రథాన
గాథ లోనూ దమ్ములేనట్టే.
ఈ గాథలో కూడా సమస్య పుట్టడానికి
తావిచ్చిన ఘట్టాలు లేకపోలేదు, అవి రెండున్నాయి- ఫస్టాఫ్ లో ఒకటి, సెకండాఫ్ లో
ఇంకోటి. ఫస్టాఫ్ లో హీరో ప్రేమ లేఖతో ప్రిన్సిపాల్ సీన్లో హీరోయిన్ తనకి హీరో మీద ప్రేమ
లేదన్నట్టు పరోక్షంగా చెప్పినప్పుడు హీరోకి సమస్య పుట్టినట్టే. అయితే ఇది గాథ గాబట్టి, సరేలెమ్మని ఈ సమస్య తాలూకు బాధని దిగమింగుకుని
వెళ్ళిపోయాడు. ఇదే కథ అయ్యుంటే ఈ సమస్యని సాధించడానికి పాటుపడేవాడు. సంఘర్షణ
మొదలయ్యేది.
దీనితర్వాత సెకండాఫ్ లో- హీరోయిన్
తల్లి- నా కూతురితో పెళ్ళన్నావంటే ఉరేసుకు చస్తానని బెదిరించినప్పుడూ హీరో చక్కగా
‘గాథ’ లక్షణాలకి న్యాయం చేస్తూ సరేలెమ్మని ఈ సారి అమెరికాకే వెళ్ళిపోయాడు. ఇదే కథ
అయ్యుంటే, ఆ తల్లికీ ఆమె చిన్న కూతురి భవిష్యత్తుకీ తగిన హామీ ఇచ్చి ఒప్పించుకునే
వాడు!
పలాయనం చిత్తగించేదే గాథ ల్లో
కన్పించే పాసివ్ పాత్ర. గాథల్లో పాసివ్ పాత్రలు అతి పెద్ద ఫాటలిస్టులు. సమస్య
వస్తే అది తలరాత అన్నట్టుగా, పరిష్కారం విధి చేతుల్లో పెట్టేసి ఊరుకుంటాయి. వీటికి
దైవిక పరిష్కారాలు లభిస్తూంటాయి.
దైవిక పరిష్కారాలు - ఫాటలిజం -
కమర్షియల్ సినిమా హంగు కాదు, అది గాథల్ని చక్కగా చెప్పే ఆర్ట్ సినిమా ఎండింగ్
కావొచ్చు.
పాత్రోచితానుచితాలు
ఇలాటి గాథల్లో
పాత్రచిత్రణల గురించి చెప్పుకోవడానికి ఏమీ వుండదు. ఎందుకంటే, ఇవి గాథల్లో వుండే
లక్షణాలతోనే తుచా తప్పకుండా ప్రవర్తిస్తాయి.
కథల్లో ఇలాటి పాసివ్ పాత్రలుంటే చెప్పుకోవడానికి చాలావుంటుంది. కనుక ఈ గాథలో గాథ
లక్షణాల్ని ప్రస్ఫుటం జేస్తూ, హీరో
ఎప్పుడూ పాసివ్ గానే, కార్య విహీనుడిగానే ఉంటాడు. ప్రేమకోసం కుళ్ళి కుళ్ళి
ఏడుస్తాడు గానీ, కాలుకదిపి ఓ చిన్న ప్రయత్నం చెయ్యడు. తను చదువుకుని, పెద్ద
ఉద్యోగంలో చేరడానికి కాసేపు ఉపాధ్యాయులు కారణమనీ, మరికాసేపు అబ్దుల్ కలాం ఆజాద్
అనీ, ఇంకాస్సేపు హీరోయిన్ స్ఫూర్తి నిచ్చిందనీ, ఆ పూర్వ విద్యార్థుల మీటింగ్ లో
ఒకే ఉపన్యాసంలో పరస్పర విరుద్ధంగా కూడా మాట్లాడతాడు.
హీరోయిన్ కీ తుచా తప్పకుండా ఓ
దృక్పథం లేదు. కాసేపు సీఏ చదువుతానని చెప్పి, బీకాం లో చేరుతుంది, మళ్ళీ సీఏ
చేస్తున్నానని అంటుంది. పైగా వయసుకి మించిన హూందా తనంతో వుంటుంది. ఆత్మరక్షణ కోసం
ప్రకృతి స్త్రీకి ఓ సహజాతాన్ని ( ఇన్ స్టింక్ట్) ఏర్పాటుచేసింది. దాంతో తనతో
మెలుగుతున్న ఓ మగాడు ఏంటో ఇట్టే పసిగట్టేయగలదు. అప్పడా మగాణ్ణి బట్టి జాగ్రత్తపడాలో, ప్రొసీడవచ్చో చర్య
తీసుకోగలదు. కానీ ఇక్కడ ఏళ్ల తరబడీ తనతోపాటు చదువుతూ సన్నిహితంగా మెలుగుతున్న,
ప్రేమని వెల్లడించలేని అర్భకుణ్ణి చదవలేని ఆడతనం- పోనీ జడత్వం ఈమెది! పెద్దపెద్ద కళ్ళేసుకుని
చూడ్డం తప్ప ఆ కళ్ళయినా చెప్పే భాషేమీ వుండదు. తండ్రి ప్రేమ తప్ప మరో ప్రేమే తెలియదట, తల్లే సర్వస్వ మట. మరి ఈ సినిమాలో ఎందుకున్నట్టు.
సినిమాల్లో హీరోయిన్ వుండేది ఇందుకేనా?
చివరికి తల్లి యాక్సిడెంట్ లో
చనిపోయి, అదే యాక్సిడెంట్లో తను కాలూ పోగొట్టుకుని
( దర్శకుడి ఈజీ సొల్యూషన్ –ఈ దైవిక ఘటన! ) కడు దయనీయంగా దర్శన మిచ్చింది
వచ్చిన హీరోకి!
అక్కడి కృష్ణా నదిలో బండ రాయిమీద
ఏది రాస్తే అదే జరుగుతుందని అక్కడి వాళ్ళ నమ్మకమని ముందెప్పుడో చెప్పిస్తాడు
దర్శకుడు. అప్పుడు ఆ బండ రాయిమీద ఆమెకి తెలియకుండా ఐ లవ్యూ అని రాస్తాడు హీరో.
చిట్టచివర్లో ఆ వూరొచ్చినప్పుడు ఆమెకూడా రాసిన అక్షరాలూ చూస్తాడు హీరో. ఇంకేముంది...లవ్
సక్సెస్, అక్కడ ఏం రాస్తే అది నిజమౌతుందన్న మాట నిజమవుతోందని మనం
సంతోషిస్తూండగానే- అవిటిదానిగా హీరోయిన్ దర్శనం!
వావ్, కృష్ణమ్మ ఇంత ఘోరంగా
కలిపిందా!
―సికిందర్