రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Showing posts sorted by date for query ఐడియా. Sort by relevance Show all posts
Showing posts sorted by date for query ఐడియా. Sort by relevance Show all posts

Friday, August 21, 2026

1439 : స్క్రీన్ ప్లే రివ్యూ!

 

 

రచన, దర్శకత్వం: మురళీ కిషోర్ అబ్బూరి
తారాగణం : అక్కినేని అఖిల్
, భాగ్యశ్రీ బోర్సే, ఈశ్వరీ బాయి, ప్రమోద్ పంజు, సునీల్, శివాజీ, బ్రహ్మాజీ, రాంకీ తదితరులు
సంగీతం: ఎస్.ఎస్.తమన్, ఛాయాగ్రహణం : లియోన్ బ్రిట్లో, కూర్పు : నవీన్ నూలి
బ్యానర్స్: మనం ఎంటర్టైన్మెంట్స్
, సితార ఎంటర్టైన్మెంట్స్     
నిర్మాతలు: నాగార్జున అక్కినేని
, సూర్యదేవర నాగవంశీ
విడుదల : జులై
10, 2026

***

      రెండేళ్ళ వయస్సు ప్రశ్న కాలేదు, 32 ఏళ్ళ వయస్సూ వృధా కాలేదు. ఈ రెండిటి మధ్య ముప్పయ్యేళ్ళ కాలం పరీక్ష కాలేదు, కొత్త జన్మకి తయారీ. అఖిల్ అక్కినేని కి రెండేళ్ళ వయస్సులో 1995 లో ప్రధాన పాత్రలో నటించిన ‘సిసింద్రీ’ అనే తొలి సూపర్ హిట్ తర్వాత, మళ్ళీ 32 ఏళ్ళ వయస్సులో 2026 లో ‘లెనిన్’ అనే రెండో సూపర్ హిట్ కాకుండా ఓ హిట్ గా మాత్రం  దక్కింది. 2014 లో హిట్టయిన తన రెండో మూవీ  ‘మనం’ సోలో హీరోగా నటించింది కాదు. ‘మనం’ తర్వాత సోలోగా చేసిన 5 సినిమాలూ ఫ్లాపయ్యాయి. చివరికిప్పుడు ‘లెనిన్’ తో ‘సిసింద్రీ’ పక్కన సక్సెస్ తో నిల్చున్నాడు. ఈ సక్సెస్ చెప్పుకోదగ్గది కాదు. ఎందుకంటే బడ్జెట్ మీద కేవలం 10 కోట్లు బాక్సాఫీసు సంపాదించగల్గి బయటపడింది. నాన్ థియేట్రికల్ బిజినెస్ 30 కోట్లు చేస్తూ. మొత్తం కలిపి 100 కోట్లకి చేరుకోలేకపోయింది. ఇంతేనా దీని పూర్తి సామర్ధ్యమంటే, కాదనే చెప్పాలి. ఒక్క బాక్సాఫీసు వసూళ్లే కనీసం 100 కోట్లు రాబట్టే సామర్ధ్యమున్న కంటెంట్, సరైన నిర్వహణ లేక, తొలి రోజునుంచే మిశ్రమ స్పందనలతో సతమతమైంది. దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరి కి తను చేసిందే కరెక్ట్ అన్పించవచ్చు. కానీ ఇంకా కరెక్టుగా చేసి కంటెంట్ పూర్తి సామర్ధ్యాన్ని ఎలా వినియోగించుకుని వుండొచ్చో, ఈ కింది స్క్రీన్ ప్లే రివ్యూలో తెలుసుకుందాం...

1. కథ సంగతి

    చిత్తూరు జిల్లా రామాపురంలో ఊరి పెద్దగా జయంతమ్మ (ఈశ్వరీ రావు) వుంటుంది. ఇక్కడ ప్రతీ ఏటా భారతం మిట్ట జాతర జరుగుతూంటుంది. ఈ జాతరలో ధర్మరాజుగా  ఎవర్ని  నిలబెట్టాలిజాతరని  ఎవరు నిర్వహించాలి ఈమే నిర్ణయిస్తూంటుంది. ఈమెకి  కొడుకు వసంత్ (ప్రమోద్ పంజు)పెంపుడుకొడుకు లెనిన్ (అఖిల్ అక్కినేని) వుంటారు. ఈమె మరిది యతిరాజు (శివాజీ) అక్రమ సంతానమని దూరంపెడుతూ జాతరలో ధర్మరాజు పాత్ర ఇవ్వదు. ఈ పాత్ర ఎలాగైనా దక్కించుకోవాలని యతిరాజు ప్రయత్నిస్తూంటాడు. ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే రాఘవరెడ్డి వుంటాడు. ఇతడికి జయంతమ్మ కుటుంబమంటే పడదు. జాతరలో లెనిన్ తన కటౌట్‌ని తీసి పారేశాడని పగ పెంచుకుని వుంటాడు.

వూళ్ళో  నీలకంఠం (రాంకీ) అనే అతడికి ఇద్దరు కూతుళ్ళు వైదేహీ, భారతి (భాగ్యశ్రీ) వుంటారు. భారతిని లెనిన్ ప్రేమిస్తాడు. మద్రాసులో చదువుకుని డాక్టరై వచ్చిన వసంత్ కి  పెద్దకూతురు వైదేహీనిచ్చి పెళ్ళి చేయాలనుకుంటాడు నీలకంఠం. కానీ ఆమె ప్రేమించిన వాడితో పారిపోతుంది. దీంతో చిన్న కూతురు భారతిని చేసుకొమ్మని వసంత్ ని ప్రాధేయ పడతాడు నీలకంఠం. వసంత్ ఒప్పుకుంటాడు. కానీ పెళ్ళి  సమయంలో భారతి తను లెనిన్ ని ప్రేమిస్తున్నానని  చెప్పడంతో వసంత్ తీసికెళ్ళి ఆమెని లెనిన్ చేతుల్లో పెడతాడు. అదే సమయంలో శత్రువులు వసంత్ మీద దాడి చేస్తారు. వసంత్ ని కాపాడుతూ లెనిన్ ఎదురు తిరుగుతాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాల ఫలితంగా జైలు కెళ్ళి పోతాడు.

ఇప్పుడు జైలు నుంచి తిరిగొచ్చిన లెనిన్, శత్రువుల మీద పగదీర్చుకోవడం మిగతా కథ.

2. కాన్సెప్ట్ ఏమిటి?

    ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా భారతం మిట్టలో, మహాభారత యజ్ఞం లేదా వీధి నాటకోత్సవాలు 18 రోజుల పాటు వైభవంగా జరుగుతాయి. ద్రౌపది గౌరవార్ధం జాతరలాగా జరుపుకునే ఈ ఉత్సవాల్లో ద్రౌపదీ సమేత ధర్మరాజు తదితర పాండవుల్ని కొలుస్తూకురుక్షేత్ర సంగ్రామ ఘట్టాలుదుర్యోధన వధ వంటి దృశ్యాలతో జాతరని పవిత్రంగా నిర్వహిస్తారు.

దీన్ని బ్యాక్ డ్రాప్ గా తీసుకుని ‘లెనిన్’ లో ఆధునిక కురుక్షేత్ర సంగ్రామం చూపాలనుకున్నారు. అయితే ఈ కాన్సెప్ట్ లేదా ఐడియా తట్టినప్పుడు, కురుక్షేత్ర సంగ్రామాన్ని ఎన్ని పాత్రలతో, ఏ విధంగా చెప్పాలన్న పరిశీలన చేసుకున్నట్టు లేదు. ఎందుకంటే ఎక్కువ పాత్రలతో కురుక్షేత్ర సంగ్రామం ఆధారంగా ఆధునిక కురుక్షేత్ర సంగ్రామంగా సినిమా తీసినప్పుడు వర్కౌట్ కాలేదు. మనకి గుర్తున్నంత వరకు తీసింది ఒక్కసారే అయినా (లెనిన్ తో రెండో సారి కావచ్చు), కథగా అర్ధంగాక అది గందరగోళాన్ని సృష్టించింది.

ఆ గందరగోళం 2010 లో  హిందీలో ప్రకాష్ ఝా ఆధునిక కురుక్షేత్రమంటూ తీసిన ‘రాజనీతి’ తో జరిగింది. ఏడుగురు స్టార్స్ ని భారతంలోని వివిధ పాత్రల్లో చూపిస్తూ, ఇంకెందరో నటులతో కలిపి  రాజనీతిఅనే రాజకీయ మల్టీ స్టారర్ డ్రామాని కురుక్షేత్రం ఆధారంగా తీస్తే - ఎవరు ఏ పాత్ర పోషిస్తున్నారో జ్ఞాపకం పెట్టుకోలేక, ప్రత్యర్ధుల మధ్య బలాబలాల సమీకరణకి స్పష్టత లేక, అంతా గందరగోళంగా  తయారయ్యింది. హీరోలతో బాటు విడివిడి విలన్లూ ఎక్కువైపోయారు.

సినిమాకి విలన్లు ఎక్కువైపోతే ఆధునిక పురాణాల పేరుతో తీసేవే కాదు, మామూలు యాక్షన్ థ్రిల్లర్లు కూడా బాక్సాఫీసులో గాయపడి బావురుమంటాయి. 2019 లో సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన సాహోలో జాకీ ష్రాఫ్, నీల్ నితిన్ ముఖేష్, చంకీ పాండే, అరుణ్ విజయ్, మందిరా బేడీ, మహేష్ మంజ్రేకర్, లాల్ ...ఇలా విలన్లంతా అధిక జనాభాగా చేరిపోయి- వెండి తెర మీద జనాభా నియంత్రణ శాసించే బాక్సాఫీసుకి కోపం తెప్పించారు.

పురాణాన్ని పురాణం లాగే తీస్తే, వాటిలో వుండే తెలిసిన మొత్తం అన్ని పురాణ పాత్రలతో అవి అలరిస్తాయి. 2025 లో నెట్ ఫ్లిక్స్ లో ప్రారంభమైన కురుక్షేత్ర: ది గ్రేట్ వార్ ఆఫ్ మహాభారతపౌరాణికం ఇలాటిదే కాబట్టి సక్సెస్ అయింది. 2013 లో అమాన్ ఖాన్ దర్శకత్వంలో మొత్తం అన్ని పాత్రలతో మహాభారత్పౌరాణిక యానిమేషన్ తీస్తే కూడా హిట్టయ్యింది.

2/a మరి కమర్షియల్ సినిమాకేం చేయాలి?
    మనం చెప్పడం కాదుగానీ, చేసి చూపించారు గొప్ప దర్శకులు-  1981లో దర్శకుడు శ్యాం బెనెగల్, శశి కపూర్ ని కర్ణుడి పాత్రలో, రాజ్ బబ్బర్ ని యుధిష్ఠిరుడి పాత్రలో, అమ్రిష్ పురిని కృష్ణుడి పాత్రలో చూపిస్తూ-  మూడు పాత్రలతో రెండు కార్పొరేట్ వ్యాపార కుటుంబాల మధ్య వైరాన్ని మహాభారతం చేసి చూపించారు. దీనికి పేరొచ్చింది.

అలాగే 2006 లో దర్శకుడు మధుర్ భండార్కర్ కూడా, కేకే మీనన్, రాజ్ బబ్బర్, బిపాషా బసు లతో తీసిన కార్పొరేట్కథ రెండు కార్పొరేట్ కంపెనీల మధ్య మూడు పాత్రలతో మహాభారతంగానే హిట్టయ్యింది.

ఇంకా ముందు 1978 లో, బాపు దర్శకత్వంలో  కృష్ణంరాజు, చిరంజీవి, ప్రసాద్ బాబు, గుడిపాటి శ్రీనివాసరావు, మురళీ మోహన్ లతో తీసిన మనవూరి పాండవులుమహాభారతానికి ఆధునిక కథనమే. ఇందులో హీరోలు ఐదుగురు, విలన్ ఒక్కడే – రావుగోపాలరావు!

ఇక 1990లో ‘ద్వాపర యుగమున  చరితను నడిపిన దాయాదుల కథ మహాభారతం’ అని  టైటిల్ సాంగేసి, తర్వాత ఎదురెదురు రెండు భవనాల్ని చూపిస్తూ- ‘ఎన్ని యుగాలు గడిచినా ఈ కుటుంబాల మధ్య కురుక్షేత్రం మాత్రం చల్లారడం లేదు. ఈ అడ్డు గోడలు ఎప్పుడు తొలగుతాయో, అనాదిగా వస్తున్న  అన్నదమ్ముల  కలహాలతో విడిపొయి అడ్డు గోడ  కట్టుకున్న ఓకే కుటుంబం కథ ఇది- ఎదురెదురుగా వున్న దాయాదుల మాత్సర్యం’  అంటూ  వాయిసోవర్ కూడా వేసి, విషయ పరిచయం చేసేశారు కోడి రామకృష్ణ-  బాలకృష్ణ, విజయ శాంతి లతో తీసిన ‘ముద్దుల మేనల్లుడు’ లో! ఇందులో బాలకృష్ణ, నాజర్ ఇద్దరి పాత్రల మధ్యే పోరు- ఒకరు హీరో, మరొకరు విలన్.



    హీరోలు ఒక్కరున్నా, ఐదుగురున్నా విలన్ ఒక్కడే ఎందుకుండాలి? ఎందుకంటే వెండితెర మీద కదలాడేది ప్రేక్షకుల మానసిక ప్రపంచపు చిత్రణే  కాబట్టి. ఆ మానసిక ప్రపంచంలో కాన్షస్ మైండ్- వచ్చేసి సబ్ కాన్షస్ మైండ్ ఠో సంఘర్షిస్తుంది కాబట్టి. అందులో కాన్షస్ మైండ్ హీరోయితే, సబ్ కాన్షస్ మైండ్ విలన్ అవుతాడు  కాబట్టి. ఇలా మనిషికి  సబ్ కాన్షస్ మైండ్ ఒక్కటే వుంటుంది కాబట్టి, దానికి గుర్తుగా విలన్ ఒక్కడే వుంటాడు కాబట్టీ!!

అందుకని ఒక కథకి హీరో ఒకరున్నా, ఎందరున్నా విలన్ ఒక్కడే వుంటాడు. ఎక్కువ మంది విలన్లు వుంటే అది కథ అవదు. ఎందుకంటే అప్పుడు కథ మీద ఫోకస్ చెదిరిపోవడమే గాక, భావోద్వేగ శక్తి కూడా వీగిపోతుంది. కాబట్టి విలన్ ఒక్కడే వుంటాడు. ఒకవేళ ఎక్కువ మంది విలన్లు వుంటే, వాళ్ళందరికీ కలిపి ప్రాతినిధ్యం వహించే మెయిన్ విలన్ ఒక్కడే వుంటాడు.

ప్రఖ్యాత రచయిత్రి జేన్ అస్టెన్ నవలల్లో ఏకకాలంలో హీరోయిన్ ఇద్దరితో ప్రేమలో పడదు. ముందు ఒకరి మీదే  ఫీలింగ్స్ బాగా పెంచుకుంటుంది. అతడి అసలు వ్యక్తిత్వం బయటపడ్డాక ఫీలింగ్స్ ని ఆపేస్తుంది. అప్పుడు రెండో అతడికి హృదయాన్ని విప్పుతుంది.  ఈ రెండు సందర్భాల్లోనూ  హీరోయిన్ ఒక సమయంలో ఒకే  సబ్ కాన్షస్ మైండ్ తో ఇంటర్ ప్లేలో వుంటోందని గమనించాలి. అందుకని ఆవిడ నవలలు చిరస్థాయిగా నిలిచి పోయాయి.

2/b ‘లెనిన్’ లో జరిగిందేమిటి?

    లెనిన్ అనే హీరోకి ఎందరో విలన్లతో సంఘర్షణని సృష్టిస్తూ కురుక్షేత్రం కథ చూపాలనుకున్నారు. చివరికి వసంత్ పాత్రని మెయిన్ విలన్ గా చేస్తూ, మిగతా అందర్నీ అతడి ఛత్రం కిందికి తెచ్చారు బాగానే వుంది గానీ, అప్పటికి ఆ విలన్లందరూ వాళ్ళ వాళ్ళ సొంత లక్ష్యాలతో పని చేస్తున్నారు. ఇలా విలన్లందరూ మెయిన్ విలన్ ఛత్రం కిందికి రావాలంటే, మొదట్నుంచీ వాళ్ళందరూ మెయిన్ విలన్ తో ఒకే మహా కుట్రలో భాగస్వాములై, ఉమ్మడి లక్ష్యం కోసం కలిసి  పనిచేస్తూ వుండాలి. అప్పుడు వాళ్ళంతా కలిసి ఒకే సబ్ కాన్షస్ మైండ్ పరిధిలో  కొస్తారు. ‘లెనిన్’ లో ఇది కూడా జరగలేదు. ఈ విధంగా కురుక్షేత్రం సంగ్రామాన్ని బ్యాక్ డ్రాప్ గా తీసుకున్నాక,  దాంతో సినిమా అనుమతించే  ఎదురెదురు పాత్రల పరిమితిని అతిక్రమించడంతో, మొత్తం కథ పూర్తి సామర్ధ్యానికి రీచ్ కాలేక పోయింది.

ఇలా కాన్సెప్ట్ లేదా స్టోరీ ఐడియా గరిష్ట సామర్ధ్య వినియోగం విఫలమయ్యాక, తీసుకున్న ఐడియాకి  స్ట్రక్చర్ కూడా మిస్సవడంతో, దాని సామర్ధ్యం 50% దగ్గర స్థంభించి పోయింది. ఇదెలాగో కింద చూద్దాం...

3. ఐడియా దగ్గరే జాతకం!

    ఒక స్టోరీ ఐడియా దగ్గరే దాంతో సినిమా జాతకం ఏమిటో  తెలిసిపోతుంది. ఆ ఐడియాలో స్ట్రక్చర్ వుందో లేదో చూసుకుంటే చాలు. ఐడియాలో స్ట్రక్చర్ ఏమిటి? మహావృక్షంగా ఎదిగే విత్తనంలో కూడా స్ట్రక్చర్ వుంటుంది. ఆ విత్తనం స్ట్రక్చర్ ప్రకారమే మహావృక్షం గా నిలబడుతుంది. అలాగే స్క్రీన్ ప్లే అనే మహా సౌధం స్ట్రక్చర్ ఐడియా నుంచే మొదలవుతుంది. ఐడియాలో స్ట్రక్చర్ వుంటే స్క్రీన్ ప్లేకీ స్ట్రక్చర్ వుంటుంది, లేకపోతే లేదు.

ఐడియాలో స్ట్రక్చర్ ని ఎలా చూడాలి? ఐడియాని మూడు వాక్యాలుగా లాగ్ లైన్ రాసుకుని చూడాలి. ఉదాహరణకి- హీరో హీరోయిన్ని ప్రేమిస్తే, హీరోయిన్ని పొందాలనుకున్న ఒక డాక్టర్ హీరోని కురూపిని చేస్తే, దీనికి ప్రతీకారంగా ఆ డాక్టర్నీ అతడి అనుచరుల్నీ కురూపుల్ని చేస్తాడు హీరో’. ఇదీ శంకర్ తీసిన ‘ఐ’ స్టోరీ ఐడియా స్ట్రక్చర్.

1. హీరో హీరోయిన్ని ప్రేమిస్తాడు (బిగినింగ్), 2. దాంతో హీరోయిన్ని పొందాలనుకున్న ఒక డాక్టర్ హీరోని కురూపిని చేస్తాడు (మిడిల్), 3. దీనికి ప్రతీకారంగా డాక్టర్నీ అతడి అనుచరుల్నీ కురూపుల్ని చేస్తాడు హీరో (ఎండ్). ఇలా మూడు పరస్పరాధార విభాగాలుగా త్రీయాక్ట్స్ స్ట్రక్చర్ లో వుంది ఐడియా.

‘లెనిన్’ లో చూద్దాం : లెనిన్ భారతిని ప్రేమిస్తే, డాక్టర్ వసంత్ కూడా భారతిని ప్రేమించి, ఆమెని పెళ్ళాడాలంటే ఆమె ఇంటికి తానొక్కడే అల్లుడుగా వుండాలని, ఆమె అక్క వైదేహీని చంపించేస్తాడు (బిగినింగ్).  కానీ లెనిన్ ని ప్రేమించిన భారతి డాక్టర్ వసత్ తో పెళ్ళికి తిరస్కరించడంతో, ఆమెని లెనిన్ కే ఇచ్చి, ఆమె మీద పగపెంచుకుని చంపేస్తాడు (మిడిల్). ఇది లెనిన్ తెలుసుకుని వసంత ని చంపేస్తాడు (ఎండ్).

ఈ స్టోరీ ఐడియా చూస్తే ఇది వసంత్ కథలా వుంది తప్ప లెనిన్ కథలా లేదు. ‘ఐ’ లో లాగా హీరోతో మూడు వాక్యాల లాగ్ లైన్ గా కూడా  కుదరడం లేదు. గివ్ యువర్ హీరో ఏ క్లీన్ లైన్ ఆఫ్ యాక్షన్ అన్నాడు బిల్లీ వైల్డర్. ఇక్కడ లైనాఫ్ యాక్షన్ కన్ఫ్యూజింగ్ గా కన్పిస్తోంది. ఈ లైన్ లో లెనిన్ కి మిడిల్ లో  చాలా విషయాలు తెలియడం లేదు. ఎండ్ లోనే వసంత్ నమ్మక ద్రోహం తెలిసి తిరగబడ్డాడు. అందువల్ల స్ట్రక్చర్ చెదిరిపోయిన లాగ్ లైన్లో ఒకటి కాదు, రెండు తప్పులు జరిగాయి : హీరో పాసివ్ డమ్మీ క్యారక్టర్ అవడం, స్క్రీన్ ప్లే మిడిల్ మటాష్  అవడం. ఇలా ఎండ్ (క్లయిమాక్స్)  విభాగం వరకూ హీరోకి అసలు విషయం తెలియలేదంటే ఆ కథ మిడిల్ మటాషే అవుతుంది.

కాబట్టి ముందు ఐడియా స్ట్రక్చర్ లోకి వచ్చేట్టు మూడు వాక్యాల్లో లాగ్ లైన్ ని కుదించి మెరుగులు దిద్దాలి. అప్పుడు లెనిన్ పూర్తి విషయాలు తెలిసి సంఘర్షించే యాక్టివ్ (డాషింగ్) క్యారక్టర్ అవుతాడు.

పైగా పై లాగ్ లైన్ లో జరిగిన ఇంకో విషయమేమిటంటే, ప్లాట్ పాయింట్ వన్ మిస్సవడం. ఎలా మిస్సయ్యింది? ఎందుకు మిస్సయ్యింది? మిస్సయి ఎక్కడ తేలింది? ఇవి తెలుసుకోవడానికి సెకండాఫ్ కథలోకి వెళ్దాం ...

4. ఇదిగో ప్లాట్ పాయింట్ వన్!

    ఈ కథ మొదట్నుంచీ లెనిన్ ఒక కుర్రాడికి ఫ్లాష్ బ్యాకుగా చెప్తూంటాడు. సెకండాఫ్ లో యతిరాజులు తన విలనీ తనే కుక్కకి చెప్పుకుని ఒక విలన్ గా రివీలవుతాడు. ఆ తర్వాత వసంత్, యతిరాజులు, ఎమ్మెల్యే వ్ రాఘవరెడ్డి, దామోదరం, ఇంకొకరు – తనతో వీళ్ళందరి దుష్టత్వాలు బయటపెట్టి తన కోసం పని చేసేలా బ్లాక్ మెయిల్ చేస్తాడు. వాళ్ళందరూ వసంత్ తో చేయి కలుపుతారు. వసంత్ ఫ్లాష్ బ్యాక్ చెప్పుకుని,వైదేహీని ఆమె బాయ్  ఫ్రెండ్ తో కలిపి హత్య చేయించింది తానేనని చెప్పడంతో, అసలు విలన్ గా తను బయటపడి కథని మలుపు తిప్పుతాడు.

ఇది ట్విస్టు కాదు. ట్విస్టు అంటే పజిల్. చిక్కుముడి. చిక్కుముడి విప్పడం గురించి కథ వుంటుంది. ఇక్కడ వసంత్ ఏ చిక్కుముడీ వేయలేదు, తన గుట్టు తను చెప్పుకుని మెయిన్ విలన్ గా రివీలయ్యాడు. కనుక కథని మలుపు తిప్పాడు.

సెకండాఫ్ లో ఈ మలుపే ఫస్టాఫ్ లో దాచిపెట్టిన  ప్లాట్ పాయింట్ వన్. దారితప్పి వచ్చి ఇక్కడ రివీలయ్యింది. నిజానికి ఫస్టాఫ్ లో వైదీహీ- ఆమె బాయ్ ఫ్రెండ్ ల హత్యలు జరిగినప్పుడే ప్లాట్ పాయింట్ వన్ ఏర్పడింది. కానీ ఆ సంఘటన పూర్వాపరాలు అప్పుడు చెప్పకుండా, ఇప్పుడు సెకండాఫ్ లో వసంత్ చేత చెప్పించారు. దీంతో ఫస్టాఫ్ లో ప్లాట్ పాయింట్ వన్ వచ్చిన సంగతి తెలియ లేదు.

ఇప్పుడు వసంత్  ఫ్లాష్ బ్యాక్ చెప్తున్నప్పుడు వెనక్కి వెళ్ళి, ఫస్టాఫ్ లో వసంత్ తల్లి జయంతి వసంత్ పెళ్ళి గురించి చెబుతూ- జయంతికి ఒక్కడే కొడుకు, అలాగే నీలకంఠం (వైదేహీ తండ్రి) కి ఒక్కడే అల్లుడు వుండాలని చెప్పిన సీనే ప్లాట్ పాయింట్ వన్ అన్నమాట. దాన్ని పూర్తిగా చూపించకుండా ఆపి, సెకండాఫ్ లో వసంత్ చెప్పే ఫ్లాష్ బ్యాక్ తో పూర్తి సీను వేశారు. దీంతో మేలు జరిగిందా, నష్టం జరిగిందా చూద్దాం...

5. డమ్మీ హీరో, మిడిల్ మటాష్, ఎమోషన్ లాస్

    ఫస్టాఫ్ లో భారతం మిట్ట ఉత్సవాల సందర్భంగా లెనిన్ చిన్నప్పుడు ఎలా జయంతికి పెంపుడు కొడుకుగా చేరాడో చూపించాక, కొన్నేళ్ళు కథ ముందుకెళ్ళి  - ఎదిగిన లెనిన్ గా జైలు నుంచి విడుదలై ఊళ్ళోకి వస్తాడు. జైలుకెందు కెళ్ళాడు, ఏం జరిగిందీ అన్నవి చెప్పడానికి ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది.

భారతం మిట్ట ఉత్సవాలతో ప్రారంభమయ్యే ఈ ఫ్లాష్ బ్యాక్ లో ఉత్సవాల నిర్వాహకుడుగా వుంటాడు లెనిన్. అదే ఉత్సవాల్లో భారతిని  చూసి ప్రేమిస్తాడు. ఆమె కూడా ప్రేమిస్తుంది. మరో పక్క యతిరాజులు,  దామోదరం, ఎమ్మెల్యే రాఘవరెడ్డి తదితర విలన్లు పరిచయమవుతారు. ఇంతలో మద్రాసులో డాక్టరీ పూర్తి చేసిన జయంతి కొడుకు వసంత్ వచ్చేసి హాస్పిటల్ ప్రారంభిస్తాడు.

మరో పక్క నీలకంఠంకి వైదేహీ, భారతీ అనే ఇద్దరు కూతుళ్ళు వుంటారు. వైదేహీ బాయ్ ఫ్రెండ్ తో ప్రేమలో వుంటుంది. ఈ విషయం తెలీక నీలకంఠం వసంత్ తో సంబంధం ఖాయం చేసుకుంటాడు. దీంతో బాయ్ ఫ్రెండ్ తో పారిపోతున్న వైదేహీ బాయ్ ఫ్రెండ్ తో సహా హత్యకి గురవుతుంది.

ఇక్కడ ఈ హత్యలకి జయంతి సంతోషిస్తున్నట్టు, తనకి ఒక్కడే కొడుకు వున్నట్టు, నీలకంఠంకి ఒక్కడే అల్లుడు వుండాలంటుంది.  వైదేహీ ప్రేమించిన వాడితో పారిపోయింద నుకుంటున్న నీలకంఠం, అదే మూహూర్తానికి చిన్న కూతురు భారతిని చేసుకొమ్మని వసంత్ ని వేడుకుంటాడు. వసంత్ ఒప్పుకుంటాడు. కానీ పెళ్ళి సమయంలో తను లెనిన్ ని ప్రేమించానని భారతీ అడ్డం తిరుగుతుంది. దీంతో చేసేది లేక వసంత్ భారతిని  తీసికెళ్ళి లెనిన్ కి అప్పజెప్తాడు. అప్పుడు శత్రువుల దాడిలో  గాయపడతాడు. లెనిన్ ఆ శత్రువుల్ని ఎదుర్కొంటాడు.

ఈ ఫస్టాఫ్ కథలో ఎక్కడా ప్లాట్ పాయింట్ వన్ వచ్చినట్టు కనపడదు. వైదేహీ ఆమె బాయ్ ఫ్రెండ్ ల హత్యలకి జయంతి సంతోషించడం దగ్గర, ఈ హత్యలతో ఆమెకి సంబంధమున్నట్టు చూపించలేదు. సెకండాఫ్ లోనే వసంత్ ఫ్లాష్ బ్యాకులో వసంత్ వొత్తిడితో జయంతియే ఈ హత్యలు చేయించినట్టు బయటపడుతుంది.  అంటే నిజానికి ఫస్టాఫ్ లో ప్లాట్ పాయింట్ వన్ ఏర్పడింది! కానీ ఆ సంఘటన పూర్తి వివరాల్ని అక్కడ దాచి పెట్టి, సెకండాఫ్ లో కథని వసంత్ మలుపు తిప్పడానికి వాడుకున్నారు. అంటే స్ట్రక్చర్ చెదిరిపోయి ముఖ్యంగా లెనిన్ పాత్ర గల్లంతై పోయింది.

5/a దీంతో ఏం జరిగింది?

    ప్లాట్ పాయింట్ వన్ ని ప్రేక్షకులకి, ప్రధాన పాత్రకి కనపడకుండా దాచిపెడితే 1. కథ బలహీన పడి మిస్టరీ/ క్రైం థ్రిల్లర్ ఫీల్ ఏర్పడుతుంది. ఉదాహరణకి : ఒక హత్య లేదా నేరం జరిగితే, అది ఎవరు చేశారు, ఎందుకు చేశారనే అసలు సంఘటన (ప్లాట్ పాయింట్ వన్) బయటపడకుండా దాచినప్పుడు, కథ బలహీన మిస్టరీ/ క్రైం థ్రిల్లర్ గా మారుతుంది. దీనికి విరుగుడు ఏమిటంటే, ప్రేక్షకులకీ ప్రధాన పాత్రకూ ఇద్దరికీ దాచిపెట్టకుండా, ప్రేక్షకులకి చూపించి, ప్రధాన పాత్రకి దాచడం వల్ల - ప్రధాన పాత్ర ఎప్పుడు తెలుసుకుంటాడన్న సస్పెన్స్ ప్రేక్షకులకి ఏర్పడి కథ సవ్యంగా సాగుతుంది. అయితే ఇంటర్వెల్ కల్లా ప్రధాన పాత్ర తెలుసుకోవాలి. లేకపోతే  డమ్మీ క్యారక్టరై పోతాడు. ‘లెనిన్’ లో వైదేహీ ఆమె బాయ్ ఫ్రెండ్ ల హత్యల్ని ప్రేక్షకులకీ, హీరోకీ ఇద్దరికీ తెలియకుండా దాచిపెట్టారు.

2. ప్లాట్ పాయింట్ వన్ సాధారణంగా 20-30 నిమిషాల మధ్య రావాలి. మరీ ఎక్కువగా లాగితే బిగినింగే బారుగా సాగి, కథ ప్రారంభంకాక, ప్రేక్షకులకి అర్థంకాక బోరు కొట్టేస్తుంది.

3. ప్రధాన పాత్ర గోల్ ఏమిటో స్పష్టంకాక, అసలు కథలో ఎందుకున్నాడో అర్ధంగాక, ప్రేక్షకులు కథతో ఎమోషనల్‌గా కనెక్ట్ కాలేరు. హీరో దిశ లేని పాత్రలా కన్పిస్తాడు.

4. ఇంటర్వెల్ పై  భారం పెరుగుతుంది.  ఫస్టాఫ్ ప్లాట్ పాయింట్ వన్ దగ్గర  చెప్పాల్సిన సమాచారాన్ని దాచిపెడితే, అది మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లేకీ దారి తీస్తుంది. చాలా సినిమాల్లో ప్లాట్ పాయింట్ వన్ ని దాచి పెట్టకుండా, అసలు ఫస్టాఫ్ లో దాని ఊసే లేకుండా, సెకండాఫ్ క్లయిమాక్స్ ముందు ప్లాట్ పాయింట్ టూ రావాల్సిన సమయంలో, ఆ ప్లాట్ పాయింట్ వన్ ని తెచ్చి పెడతారు. అంటే ఇంతసేపూ బిగినింగే ముగియకుండా జీడి పాకంలా సాగి, మిడిల్ విభాగాన్ని తినేస్తుందన్న మాట. అందుకే మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే.

‘లెనిన్’ లో ఫస్టాఫ్ లో ప్లాట్ పాయింట్ వన్ ని దాచి పెట్టి, సెకండాఫ్ మధ్యలో వసంత్ చేత చెప్పించి రివీల్ చేసినా ఇక్కడ కూడా ప్లాట్ పాయింట్ వన్ వచ్చినట్టు కాదు. ఎందుకంటే, ఈ సన్నివేశంలో ప్రధాన పాత్ర  లెనిన్ లేడు. లెనిన్ కి ప్లాట్ పాయింట్ వన్ అనేది  తర్వాత క్లయిమాక్స్ ముందు, ప్లాట్ పాయింట్ టూ స్థానంలో ఏర్పడింది. అప్పుడే అతను వసంత్  విలన్ అని తెలుసుకుని పగదీర్చుకోవాలని గోల్ పెట్టుకున్నాడు. ఇలా స్ట్రక్చర్ గజిబిజిగా మారిపోవడంతో,  దిశా దిక్కూ లేని లెనిన్ పాత్రతో ఎమోషనల్ కనెక్ట్ లేకుండా పోయింది. క్రియేటివిటీకి (పాత్ర చిత్రణకి) సంబంధించిన ఈ సూక్ష్మాంశాలు చెబితే అర్ధం జేసుకుని మార్చుకుంటారా?  అస్సలు అర్ధం జేసుకోరు, మార్చుకోరు, సందేహమే లేదు! స్ట్రక్చరూ వద్దు, క్రియేటివిటీ చెప్పొద్దూ అంటే ఎలా?

6. పాత్రచిత్రణల సంగతి!

    లెనిన్ ఫస్టాఫ్ లో ఏం చేస్తున్నాడో, ఎందుకున్నాడో అతడికే తెలీదు. వైదేహీనీ ఆమె బాయ్ ఫ్రెండ్ నీ చంపేశారన్న సంగతీ అతడికి తెలీదు. పురాణ నేపథ్యపు కథలో కమ్యూనిస్టు లెనిన్ పేరెందుకు పెట్టుకున్నాడో తెలీదు. రష్యన్లు ఈ సినిమా చూస్తె జుట్టు పీక్కుంటారేమో. సెకండాఫ్ లో తను పెళ్ళి చేసుకున్న భారతిని కూడా వసంత్ చంపేశాడనీ తెలీదు. ఈ తెలియడం కూడా ప్లాట్ పాయింట్ టూ లో వసంత్ రికార్డు చేసిన టేపు ద్వారా తెలియజేసేవరకూ తెలియదు. అసలు లెనిన్ కేమీ తెలీదు. అతను జైలు కెందుకెళ్ళాడో ఇంటర్వెల్లో కూడా చెప్పలేదు. వసంత్ సెకండాఫ్ లో తన కుట్ర రివీల్ చేసి ప్రధాన విలన్ గా ఎస్టాబ్లిష్ అయ్యాడన్న సంగతీ తెలీదు. మిగతా విలన్ల గురించి అసలే తెలీదు. ఇన్ని విషయాలు తెలియని హీరో హీరో ఎలా అవుతాడు?

ప్రధానంగా ఈ కథ ట్రాజిక్ ప్రేమ కథయిన్నప్పుడు, భారతీతో బలమైన రిలేషన్ షిప్ తో కూడిన ఎమోషనల్ త్రెడ్ కూడా సృష్టించుకోలేదు. అసలెందుకు ప్రేమించాడో తెలీదు. లెనిన్, భారతిల బంధంలో ప్రేక్షకుల్ని కట్టిపడేసేంత ఎమోషనల్ వెయిట్ లేదు. పాటలు కథనానికి వేగనిరోధకాల్లా మారాయే తప్ప, వాళ్ళిద్దరి  మధ్య కెమిస్ట్రీని బలపరచలేకపోయాయి. ప్రేమలో అసలెందుకు పడ్డారో కదిలించే కారణముంటే, ఆ కారణం వెంటాడుతూ చివరికి ప్రేమ ట్రాజడీగా మారినప్పుడు అలజడి రేపే అవకాశ ముంటుంది.

ఒక బలమైన విషాదాంత ప్రేమకథ (ట్రాజిక్ లవ్ స్టోరీ ) కేవలం బాధ వల్ల మాత్రమే గొప్పది కాదు- అన్నీ సవ్యంగా జరిగితే ఎంత బాగుండేదన్న ఆశకూ, తప్పించుకోలేని చేదు నిజానికీ మధ్య వుండే సంఘర్షణ వల్లే గుండెల్ని పిండేస్తుంది. విషాదం అనేది అనుకోకుండా జరిగే ప్రమాదంలా వుంటే చెల్లుబాటు కాదు కూడా. ఆ విషాదం మొదట్లోనే చీకటి నీడలా కనిపిస్తూ కథ ముందుకు సాగేకొద్దీ పెద్దదవ్వాలి.  విధి, సమాజం లేదా ప్రేమికుల బలహీనతలు వాళ్ళని  విడదీస్తాయని ప్రేక్షకులకి లోలోపల తెలిసినా, ఎలాగైనా సుఖాంతమైతే చాలు- అని చివరి క్షణం వరకూ పరితపించేలా చీకటి నీడతో కథనం సాగాలి. ప్రేమికుల మధ్య బంధం సాధారణ ఆకర్షణగా కాకుండా, వాళ్ళా ఆత్మల్ని తాకేంత గాఢంగా వుంటూ, ఒకరి జీవితానికి మరొకరు లేకపోతే శూన్యమే అన్నంతగా ఆ ప్రేమ రూపుదిద్దుకోవాలి. ఇవన్నీ జరగాలంటే ఈ కథలో ఫీల్ లేని పాటల్ని సవరించి, కథని తినేస్తున్న విలన్ల సంఖ్యా తగ్గించి- ప్రేమ కథ మీద ఫోకస్ పెరిగేలా చేసుకోవాలి. విలన్ క్రూరత్వానికి ఎదురుగా ప్రేమ పవిత్రతని నిలబెట్టే కథనంతో గెలుపెవరిదన్న ప్రశ్నకి వీలయ్యే స్పేస్ ప్రధానంగా వుంటేనే ఇది ‘ఎపిక్ లవ్ స్టోరీ’ అనడానికి వీలవుతుంది.

6/b ఏది దేనికి నేపధ్యం?

    ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ లో తిరునాళ్ళు జరుగుతున్నప్పుడు అక్కడికి దగ్గరలోనే రామ్ అభిమాన స్టార్ ఉపేంద్ర సినిమా షూటింగ్ జరుగుతూంటుంది. కానీ రామ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేని  వూళ్ళో జరుగుతున్న తిరునాళ్ళకి ఆహ్వానించేందుకు ఆమె ఇంటికెళ్తాడు. తనకెంతో ముఖ్యమైన  అభిమాన స్టార్ షూటింగ్ కి ఆహ్వానించాలి గానీతిరుణాళ్ళేమిటి?

ఇలాగే, ‘లెనిన్’ లో 18 రోజుల భారతం మిట్ట ఉత్సవాల మధ్య పెళ్ళి ముహూర్తాలేమిటి? హత్యలేమిటి? వసంత్ హాస్పిటల్ ప్రారంభోత్సవం ఏమిటి? ఉత్సవాలు జరిపిస్తున్న కుటుంబం పెళ్ళిళ్ళూ హాస్పిటళ్ళూ పెట్టుకోవడం విచిత్రంకాక ఏమిటి? ఇలా ఉత్సవాల బ్యాక్ డ్రాప్ తో సంబంధం లేకుండా ఈ సినిమా కథ సాంతం జరుగుతుంది.

నీలకంఠం పెద్ద కూతురి పెళ్లి పెట్టుకుంటే ఆమె ఒకడితో లేచిపోవడం, అదే పెళ్ళి చిన్న కూతురికి  చేయబోతూంటే ఆమె లెనిన్ ని ప్రేమించానని అడ్డం తిరగడం చూస్తే- నీల కంఠం అసలు కూతుళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకోలేని అసమర్ధ తండ్రి పాత్రగా మిగిలాడు.

విలన్లు తమ కుట్రల్ని, పథకాల్ని వేరొక పాత్రకి  సుదీర్ఘ డైలాగుల  రూపంలో వివరించడం ద్వారానే కథని  ముందుకు తీసుకెళ్తారు. స్క్రీన్ ప్లే లో సహజత్వం లోపించిందనడానికి ఇది ఒక ఉదాహరణ. వీళ్ళ ఒక్కొక్క కుట్రని లేనినే తెలుసుకుని బయట పెట్టడం పాత్రకీ కథకీ బలాన్నిస్తుంది.

వసంత్ కథని మలుపు తిప్పుతున్నాననుకుంటూ తన కుట్రల్ని ఇతర పాత్రలకీ, లెనిన్ కీ తనే చెప్తున్నాడు. మరి చెబితే తప్ప తెలియని లెనిన్ ఈ కథలో ఏం చేస్తున్నట్టు? ఏమీ చేయడం లేదు- మరొకరు చెబితే తప్ప తెలియని పాసివ్ రియాక్టివ్  క్యారక్టర్ లా యాక్షన్లోకి దిగుతున్నాడు. అంటే డాషింగ్ హీరో (యాక్టివ్ పాత్ర) కాకుండా డమ్మీ హీరో (పాసివ్, పాసివ్ రియాక్టివ్ పాత్ర) గా తనని సరిపెట్టుకున్నాడు.

విలన్ వసంత్ కి భారతిని చంపేంత పగకీ  బలమైన కారణం కనిపించదు. అతడి విపరీత ప్రవర్తనకి, అంత పగతో రగిలిపోవడానికీ  బలమైన కారణాన్ని చూపించక పోవడంతో అతడి పరంగా కూడా ఎమోషన్ వర్కౌట్ కాలేదు. కథలో కీలక ఘట్టాలు సంఘటనలతో కాకుండా డైలాగులతో చెప్పడంతో ఈ పరిస్థితి. లెనిన్- భారతీలు ఒక సంఘటనలో ప్రేమలో ఎలా పడలేదో, భారతి అలా వసంత్ తో పెళ్ళిని కాదనడం సంఘటనతో జరగలేదు. ఆమె ఈ పెళ్ళి చేసుకోను, లెనిన్ ని ప్రేమించానని అన్నప్పుడు, ఉడుకురక్తం గల వసంత్, పథకం ప్రకారం భారతిని పెళ్ళి చేసుకోవడానికి ఆమె అక్కనే చంపించిన విలన్ వసంత్, తీవ్రంగా రియాక్ట్ అయి వుంటే- దాంతో ఆమె లాగి చెంప మీద కొట్టి వుంటే- అనుకోని ఆ  సంఘటన వసంత్ ని పగబట్టిన రాక్షసుడిగా మార్చిందనడం లాజికల్ గా వుంటుంది. ‘మరో చరిత్ర’ లో సరిత, విలన్ మిస్ బిహేవ్ చేసినందుకు అతడి చెంప చెళ్ళుమనిపిస్తేనేగా అది మనసులో పెట్టుకుని చివర్లో చంపి పగదీర్చుకున్నాడు? సంఘటన జరక్కుండా పగలూ ప్రతీకారాలూ విజువల్ మీడియాకి వర్కౌట్ కావు.

చివరికేమిటి?


    ‘లెనిన్’ హిట్టే గానీ, పూర్తి హిట్ కాదు. దీని కంటెంట్ పరంగా పూర్తి సామర్ధ్యాన్ని పిండి వెండి తెర మీద పిండార బోసినట్టు ప్రదర్శించలేదు. ఇంతవరకూ ఎవరూ చేయని విధంగా ప్లాట్ పాయింట్ వన్ ని దాచిపెట్టడంతో కథ, పాత్రలు చెదిరి స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ కి అందకుండా పోయింది. మహాభారత పోలికలు, ద్రౌపది జాతర నేపథ్యం వంటి విభిన్న అంశాలు వున్నాకూడా వాటిని ప్రేమకథకి  సపోర్టుగా వాడుకోలేదు. చివరికి కథ సాధారణ, తీవ్ర హింసతో కూడిన పాతకాలపు పగ-ప్రతీకారాల డ్రామాగా మిగిలిపోయింది.

మణిరత్నం రజనీకాంత్, మమ్ముట్టి లతో  ‘దళపతి’ ని తీసినప్పుడు అందులో మహాభారతంలోని అన్ని పాత్రల్నీ కూడేసి తీయకుండా, సింపుల్ గా కర్ణుడు , దుర్యోధనుడుల మధ్య వున్న స్నేహం ఆధారంగా తీశారు. ఈ సింప్లీసిటీ బదులుగా కురుక్షేత్రాన్ని అడ్డుపెట్టుకుని ఎంతో చెప్పాలనుకున్న ‘లెనిన్’ కాన్సెప్ట్ సరైన రీసెర్చి లేకుండా, ఐడియా దగ్గర్నుంచీ ప్లానింగ్ వరకూ ఒడిదుడుకుల ప్రయాణంగా మారింది. ‘సిసింద్రీ’ లో రెండేళ్ళ  అఖిల్ విలన్లని ముప్పుతిప్పలు పెట్టి మట్టి కరిపించిన చరిత్రతో పోలిస్తే, ‘లెనిన్’ లో మాస్ యాక్షన్ హీరోగా ప్రూవయ్యాడుగానీ, క్యారక్టర్ గా సిసింద్రీని బీట్ చేయలేక పోయాడు.

-సికిందర్  

 

Wednesday, July 15, 2026

1429 : రైటర్స్ స్పెషల్



కాజ్ అండ్ ఎఫెక్ట్ కథనాన్ని తప్పించుకోలేరు!

    ప్పట్లో ఒక ఇంటర్వ్యూలో ‘తని ఒరువన్’ దర్శకుడు మోహన్ రాజా, చాలా యాక్షన్ థ్రిల్లర్స్ లో విలన్ తో హీరో ఎందుకు పోరాడుతున్నాడనే దానికి ఒక ఫ్లాష్ బ్యాక్ వేస్తారనీకానీ తని ఒరువన్లో దుష్ట శక్తుల్ని ఓడించడం హీరో బాధ్యతగా చూపించాననీ, దానధర్మాలు చేయడానికి ఎలా కారణాలు అవసరం లేదో, అలా ఇది కూడా అంతేననీ  చెప్పాడు (ఇది సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో రాం చరణ్ తో ‘ధృవ’ గా తెలుగులో రీమేకైంది). ఇందుకే నేమో కథలో ప్లాట్ పాయింట్ వన్ తో ఏం చేసుకోవాలో ఎటూ తేల్చుకోలేకపోయిన హీరో (జయం రవి), దాన్నలా వుంచేసి, మిడిల్లోకి ఎంటరవాలని ట్రై చేస్తాడు. కానీ ఒక టోల్ గేట్ దగ్గర దొరికిపోతాడు. స్క్రీన్ ప్లే కి అనవసరంగా ఈ ప్లాట్ పాయింట్ వన్ ని కనిపెట్టిందెవరా అన్నదే  ఆ హీరో  పాత్ర  బాధ కావచ్చు. దీంతో లేనిపోని చావొచ్చింది. ఈ మిడిల్లో అసలు తన సమస్య ఏమిటో, ఎవరితో పోరాడాలో ఇంకా స్పష్టత రాదు. ఇలాటి కథనం ఇంకే సినిమాలోనూ చూసి వుండం బహుశా. తను పోరాడాల్సిన శత్రువెవరో తెలీక, చీకట్లో రాయి విసిరి చూద్దామా అన్నట్టు- ఎవరో  చెల్లదురై అనే మైన్స్ మాఫియా మీద నిఘా పెట్టాలనుకుంటాడు. పట్ట పగలు వెంబడిస్తాడు. ఇంకేదో చేస్తాడు, ఇంకేదో చేస్తాడు, చేసుకుంటూ పోతూనే వుంటాడు...కాజ్ లేకుండా ఎఫక్ట్ ని వెతుక్కుంటూ!

లా అలా విలువైన మిడిల్ కథ ప్రారంభమే కాక సాగిపోతూంటే, మరి కొన్ని ఘోరాలు చూశాక, అప్పుడు తన శత్రువెవరో తెలిసినట్టూ, ఇక ఆ శత్రువు జీవితంలో రానున్న ఒక తేదీని మర్చిపోలేని రోజుగా చేస్తాననీ  ప్రతిజ్ఞ చేస్తాడు సదరు హీరో!

ఇక్కడ ఒక సందేహం రావచ్చు:  హీరోకి తన శత్రువెవరో నిర్ణయమై, గోల్ ఏర్పడింది ఇక్కడే గనుక, ఇదే ప్లాట్ పాయింట్ వన్ ఎందుకు కాకూడదూ అని.

2. ఎందుకంటే...
1. ఎప్పుడైనా బిగినింగ్ లో ఒక సెటప్ (కాజ్) ఏర్పాటు చేశాక, దాన్ని పే ఆఫ్ (ఎఫెక్ట్)  చేస్తున్నప్పుడే ప్లాట్ పాయింట్ వన్ ఏర్పడి పోతుంది. 2. శివలో నాగార్జున జేడీ అగడాల్ని చూసీ చూసీ (సెటప్/కాజ్)ఇక తిరగబడి అతణ్ణి కొట్టేశాక (పే- ఆఫ్/ ఎఫెక్ట్) ప్లాట్ పాయింట్ వన్ వచ్చి, గోల్ ఏర్పడి పోతుంది. 3. 24లో గడియారమున్న తెరచుకోని పెట్టెని రకరకాల పనిముట్లుగా అటు విసిరి ఇటు విసరీ వాడుకున్నాక (సెటప్/కాజ్ ), దాని తాళం చెవి దొరికి తెరవడంతో (పే-ఆఫ్/ఎఫెక్ట్) ప్లాట్ పాయింట్ వన్ వచ్చిచిన్న సూర్యకి గోల్ ఏర్పడుతుంది.

4. ఇలాగే తని ఒరువన్లో కూడా రాత్రి పూట నువ్వు ఒంటరిగా ఎక్కడికి వెళ్తున్నావని అప్పుడప్పుడు కొలీగ్స్ అడగడం (సెటప్/కాజ్ )ఒక తప్పనిసరి పరిస్థితిలో హీరో వాళ్ళని తన గదికి తీసికెళ్ళి తన రీసెర్చి ప్రపంచాన్ని చూపడం ( పే- ఆఫ్/ఎఫెక్ట్  ) తో, అక్కడే ప్లాట్ పాయింట్ వన్ ఏర్పడిపోయింది. కానీ ఇది తెలుసుకోక పోవడంవల్ల గోల్ ఏర్పడక, స్ట్రక్చర్ చెదిరిపోయింది.  5. సినిమాల్లో ప్లాట్ పాయింట్ వన్ ఎక్కడుందో గుర్తించాలంటే బిగినింగ్ లో సెటప్ ని ఫాలో అవుతూంటే చాలు, అది పే- ఆఫ్ అయ్యే సీనే ప్లాట్ పాయింట్ వన్ అవుతుంది. ఇలా  కాజ్ అండ్ ఎఫక్ట్ సూత్రం పని చేయకుండా ఏ కథా పనిచెయ్యదు!

స్క్రీన్ ప్లేలో ప్లాట్ పాయింట్ వన్ ని స్థాపించడానికి  బిగినింగ్ విభాగం లోనే కాజ్ అండ్ ఎఫెక్ట్ ప్రక్రియ మొదలవుతుంది. ఇక్కడ పునాది పడకుండా, మిడిల్ లో ఇంకెక్కడో ప్లాట్ పాయింట్ వన్ వేసినా, దాంతో కథ నడపాలన్నా కుదరదు!

3. బలాబలాల పోరు!
కాజ్ అండ్ ఎఫెక్ట్ (కార్యకారణ సంబంధం) తోనే మన ఆలోచన, మాట, చేత, జీవితం అన్నీ నడుస్తున్నాయి. మొత్తం సృష్టే దీని ఆధారంగా నడుస్తోంది. కాబట్టి హీరో కారణం లేకుండా పోరాడలేడు. దాన ధర్మాలు చేయడానికీ కారణం వుంటుంది- దానం పుచ్చుకుంటున్న వ్యక్తి  బావుండాలన్నకారణం కావచ్చు. అలాగే తని ఒరువన్లో  హీరో పోరాటానికి కారణం వుండే వుంటుంది. చుట్టూ జరుగుతున్న నేరాలు చూసి (కాజ్) తను పోలీసాఫీసర్ అవ్వాలనుకున్నానని (ఎఫెక్ట్) హీరోగా నటించిన జయం రవియే  స్వయంగా చెప్పుకున్నాడు. జీవితంలో ఇంతే కదా, మరి సినిమాలో ఎందుకు కాదనుకున్నారు?

అయితే సర్వసాధారణంగా కథల్లో కాజ్ ని ఎంత బలంగా సృష్టిస్తారో, ఎఫెక్ట్ నీ అంతే  బలంగా సృష్టిస్తారు. ఇలా రెండు వ్యతిరేక శక్తుల మధ్య యాక్షన్ –రియక్షన్ల ఇంటర్ ప్లే సాగుతూ వుంటుంది. కానీ నిజంగా ఇలాగే జరుగుతుందా? జరుగుతుంది, కానీ ఇంకోలా కూడా జరుగుతుంది.  ఎంతో బలంగా అమెరికా ప్రయోగించిన (కాజ్) మిస్సైల్స్ ని, అవి ఇరాన్ మీద పడి పేలక ముందే (ఎఫెక్ట్), ఇరాన్ తన మిస్సైల్స్ తో పడగొట్టుకుంటూ పోవడాన్ని నేటి పశ్చిమాసియా యుద్ద దృశ్యాల్లో  చూస్తున్నాం. అంటే ఏమిటర్ధం? కాజ్ మనం కోరుకున్న  ఎఫెక్ట్ ని చూపాలనేం లేదు, తగిన పవర్ లేక ఫెయిలవ్వొచ్చు. బ్రహ్మాండంగా ప్రారంభించిన సినిమా విడుదలై ఫ్లాప్ అయినట్టు.

అంటే కాజ్ ఎంత బలంగా వున్నా, ఎఫెక్ట్ దాని బలం మీద ఆధారపడి వుండదు ఒక్కోసారి. ఇతర శక్తులకున్న కాజ్ ఎదుటి శక్తి ఎఫెక్ట్ ని నిర్వీర్యం  చేయవచ్చు. అలాగే ఒక బలహీన కాజ్, బ్రహ్మాండంగా ఎఫెక్ట్ చూపించ వచ్చు. ఇలాటివి కామెడీ సినిమాల్లో కనిపిస్తూంటాయి. సీరియస్ యాక్షన్లో కూడా చూపించ వచ్చు.

4. కాన్సెప్ట్ తో అప్రమత్తత!
అలాగే  సినిమాలో చెప్పాలనుకున్న ముఖ్య విషయానికి  బలహీన వాదనని (కథనాన్ని) జోడిస్తే, చెప్పాలనుకున్న ముఖ్య విషయం మొత్తం ప్రభావం తగ్గిపోతుంది. ఇలాటి ఫ్లాపులు ఎన్నో చూశాం. కాబట్టి కథకి ఒక ఐడియా అనుకున్నా, కాన్సెప్ట్ అనుకున్నా, దాన్ని కాజ్ గానే  పరిగణించాలి. అప్పుడే స్క్రిప్టు మీద తగిన ఎఫెక్ట్ కోసం పని చేయగలుగుతాం. ఐడియాని లేదా కాన్సెప్ట్ ని కాజ్ గా పరిగణించక పోతే, ఎఫెక్ట్ మాయమై కాజ్ తేలిపోతుంది. కాబట్టి చెప్పాలనుకున్న విషయమో, ఇవ్వాలనుకున్న మేసేజో దాన్ని కాజ్ అనుకుని  ఫిక్స్ అయిపోతే, ఆటోమేటిగ్గా దాని ఎఫెక్ట్స్ కోసం ఇంగిత జ్ఞానంతో పనిచేసే టూల్ గా మారిపోతుంది మెదడు, కథ చేస్తూంటే.

కొండని తవ్వి ఎలుకని పట్టుకోవడం కూడా ఫెయిలైన కాజ్ అండ్ ఎఫెక్ట్ బాపతే. ప్రభుత్వ పథకాల కోసం భారీ సన్నాహాలు చేస్తారు (కాజ్), దానికి గట్టి వాగ్దానాలు, అపార ప్రయత్నాలూ చేస్తారు. చివరికి ఎఫెక్ట్ దగ్గరి కొచ్చేసరికి చేతులెత్తేసి దండం పెడతారు. రాజకీయాల్లో జరిగే సంగతే.

5. కాజ్ కి రెండు జోన్లు!
కథల్లో కాజ్ రెండు జోన్స్ లోంచి పుడుతుంది : వ్యవస్థ లోంచి, పౌరజీవితం లోంచి. వ్యవస్థ లోంచి కాజ్  పుట్టాలంటే వ్యక్తిగత అన్యాయమో నష్టమో జరిగి వుండనవసరం లేదు. ఆ అధికారి, లేదా ఉద్యోగి ఉద్యోగ ధర్మమే కాజ్ అవుతుంది. దాంతో చర్య తీసుకుంటారు (ఎఫెక్ట్). అదే పౌర జీవితంలో అయితే, వ్యక్తిగతంగా అన్యాయం జరక్కుండా (కాజ్) అన్యాయాల్ని ఎదుర్కోలేరు (ఎఫెక్ట్). ఒక ఆటో డ్రైవర్ అన్యాయాల్ని ఎదుర్కొవాలంటే (ఎఫెక్ట్) వ్యక్తిగతంగా అతడికి అన్యాయం జరిగి వుండాలి (కాజ్).

 ‘శివలో పౌర జీవితంలో వుండే స్టూడెంట్ నాగార్జున, తన సన్నిహితురాలు అమలతో జేడీ మిస్ బిహేవ్ చేసినందుకే (కాజ్) జేడీని కొట్టి, మాఫియా ప్రపంచంలో ప్రకంపనలు సృష్టిస్తాడు (ఎఫెక్ట్). ఇక్కడ కాజ్అతడి పౌర జీవితంలో జరిగిన వ్యక్తిగత నష్టమే.

డెత్ విష్’  అనే ప్రసిద్ధ సినిమాలో, పౌర జీవితంలో వుండే బిజినెస్ మాన్ అయిన ఛార్లెస్ బ్రాన్సన్, దోపిడీ దొంగలు తన భార్యని చంపి, పెళ్ళయిన కూతుర్ని రేప్ చేసిన అన్యాయంతో వ్యవస్థతో విసిగి(కాజ్), ఇలా మరొకరికి జరక్కూడదని, రాత్రిపూట తనే నగరంలో దొంగల్ని ట్రాప్ చేసి చంపుతూంటాడు(ఎఫెక్ట్). ఇక్కడ కూడా కాజ్’  పౌర జీవితంలో జరిగిన వ్యక్తిగత నష్టమే.

 ‘బొబ్బిలిపులిలో వ్యవస్థలో భాగంగా సైనికుడైన ఎన్టీఆర్ సొంతవూరికి వచ్చి, పెళ్ళి కుదుర్చుకుని పోతూ విలన్ల దురాగతాలు చూసి, తన డ్యూటీ (కాజ్) సరిహద్దుల్లో కాదనీ, ఇక్కడే ననీ డిసైడ్ అయిపోయి, సంఘవిద్రోహుల మీద సమరభేరి మోగిస్తాడు (ఎఫెక్ట్). ఇక్కడ కాజ్సైనికుడుగా వ్యవస్థలో భాగంగా డ్యూటీ పట్ల వుండే స్పృహే. వ్యక్తిగత నష్టం జరిగి వుండాల్సిన అవసరం లేదు.

సరైనోడులో సైనికుడిగా తన డ్యూటీ (కాజ్) సరిహద్దుల్లో కాదనీ, దేశం లోపలే దుష్టుల  పని పట్టడమేనని వచ్చేసి వివాదాలు సెటిల్ చేస్తూంటాడు అల్లు అర్జున్ (ఎఫెక్ట్). ఇక్కడ కూడా కాజ్వ్యవస్థలో భాగంగా డ్యూటీ పట్ల స్పృహే గానీ వ్యక్తిగతం కాదు.  అయితే ఇది బలహీన కాజ్. ఎందుకంటే, ఇలా ఫీలవడానికి పేపర్స్ లో వార్తలేవో చదివి వుంటాడేమో తప్ప, ఇదమిత్థంగా ఓ ప్రత్యక్ష సంఘటనంటూ కళ్ళతో చూసిన వాడు కాదు. అందుకే ఇది బలహీన కాజ్. దీని ఎఫెక్టు కూడా అంతే  బలహీనంగా వుంటుంది- కథ వేరే పాయింటు మీదికి వెళ్ళిపోతూ. బొబ్బిలిపులిలో  ఇలాకాకుండా, ఎన్టీఆర్ సంఘవిద్రోహుల కరాళనృత్యం కళ్ళారా చూస్తాడు గనుకే, అది బలమైన కాజ్ అయింది. దాని ఎఫెక్ట్ కూడా ఆద్యంతం అంతే బలంగా వుంది.

6. ఎఫెక్ట్ యూటర్న్ తీసుకుంటుంది!
ఇక వ్యవస్థలో భాగమైన పాత్రలు వ్యక్తిగత నష్టా లెదుర్కొనే కథలు కూడా వున్నాయి. ఈ పాత్రలు ఉదాత్తంగా వ్యక్తిగత నష్టాన్ని ఓర్చుకుని పదవీ బాధ్యతలకే ప్రాణమిస్తాయి. ఉదాహరణకి కొండవీటి సింహంలో పోలీస్ అధికారి అయిన ఎన్టీఆర్ కొడుకుని విలన్ కిడ్నాప్ చేసి బేరం పెడితే లొంగడు. అలాగే అంకుశంలో సీఎంని కాపాడే ఇన్స్ పెక్టర్  పాత్రలో రాజశేఖర్ భార్యని విలన్లు చంపేస్తే, సీఎంని రక్షించడానికే పోరాడతాడు రాజశేఖర్!

ఇలాటి పాత్ర లు చాలా సానుభూతిని పొంది బలంగా కనెక్ట్ అవుతాయి.ఇక్కడేం జరుగుతుందంటే, ఎవరో తన మీద ప్రయోగించిన కాజ్ కి రెస్పాండ్ అవక, అంతకంటే ఉదాత్త ఆశయంతో, డ్యూటీని ప్రధానంగా తీసుకుని, యూటర్న్ తీసుకుని ఎఫెక్ట్ ని ఛానలైజ్ చేస్తారు.

7. ఇది గొలుసుకట్టు కథనమే!
సినిమా కథకి అసలు ప్రాణం కాజ్ అండ్ ఎఫెక్ట్ (కారణంఫలితం) కథనమే. కథలో జరిగే ప్రతి సంఘటనకూ ఒక కారణం వుండాలి. ఆ కారణం వల్ల వచ్చే ఫలితమే తరువాతి సన్నివేశాన్ని ముందుకు నడపాలి. ఇలా సంఘటనలు ఒకదానికొకటి గొలుసులా అనుసంధానమైతే ప్రేక్షకులు కథలో పూర్తిగా లీనమవుతారు. ఈ గొలుసుకట్టు కథనం ఇలా సాగుతుంది- కారణం పరిణామం కొత్త కారణం కొత్త పరిణామం.  ఉదాహరణకి : హీరో ఒక నిర్ణయం తీసుకుంటాడు. ఆ నిర్ణయం వల్ల ఒక సమస్య వస్తుంది. ఆ సమస్యని పరిష్కరించడానికి ఇంకో  నిర్ణయం తీసుకుంటాడు.ఆ నిర్ణయం ఇంకింత పెద్ద సమస్యని  సృష్టిస్తుంది. చివరికి ఆ సంఘటనలన్నీకలిసి  క్లయిమాక్స్‌కి దారి తీస్తాయి.

కాజ్ అండ్ ఎఫెక్ట్ ని ఆధారంగా చేసుకుని కథనం చేస్తే- సీన్లు రాస్తే- కథ ఎక్కడా బలహీనపడే సమస్యే వుండదు. చాలా రివ్యూల్లో  చూస్తూనే వుంటారు. సెకండాఫ్ లో కొంత సేపు డల్ అయిందనీ, లాగ్ వుందనీ, తర్వాత పుంజుకుందనీ రాస్తూంటారు. అంటే ఇక్కడ కథనంలో కాజ్ అండ్ ఎఫెక్ట్ ని మర్చిపోయి కథకుడు ఇంకా ఇంటర్వెల్ మూడ్ లో పడుకున్నాడేమో తెలీదు. తర్వాతెప్పుడో నిద్రలేచి, పొయ్యి వెలిగించి, వంటకం మొదలెడతాడు.

 ఇందుకే ప్రతీ సీనూ తర్వాతి సీనుకి కారణం (కాజ్) కావాలి. బలమైన కథనం ఇలా వుంటుంది :  హీరో విలన్‌ని  అవమానిస్తాడు (కాజ్), విలన్ హీరో కుటుంబం మీద  దాడి చేస్తాడు (ఎఫెక్ట్), హీరో ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు (కాజ్),  ప్రతీకారం ప్రయత్నం విఫలమవుతుంది (ఎఫెక్ట్),  హీరో తన వ్యూహాన్ని మార్చుకుంటాడు (కాజ్). ఇక్కడ ఒక్క సీన్ కూడా యాదృచ్ఛికంగా జరగడం లేదని గమనించాలి.

8. హాలీవుడ్ టెక్నిక్!
మంచి కథనం కోసం హాలీవుడ్ రచయితలు ఒకపని చేస్తారు. ప్రతీ సీను తర్వాత  ‘అందుకే...’, లేదా ‘కానీ...’ అనుకుని రెండో సీను రాస్తారు. అంటే ఒక సీను రాశాక  ‘అందుకే’ (Therefore)’ లేదా ‘కానీ (But)’-అనుకుని  దీన్ని బట్టి తర్వాతి సీను రాస్తారు. 
ఉదాహరణ: హీరో ఉద్యోగం కోల్పోయాడు. ‘అందుకే’  కొత్త వ్యాపారం మొదలుపెట్టాడు. ‘కానీ’ విలన్ అడ్డుపడ్డాడు. ‘అందుకే’ హీరో మరో మార్గం వెతికాడు...ఇలా సాగితే కథనం తెగకుండా సాఫీగా ముందుకు వెళుతుంది.

తెలుగు సినిమాల్లో కనిపించే బలమైన కాజ్ అండ్ ఎఫెక్ట్ ఉదాహరణలు మరికొన్ని : ‘శివ’- కాలేజీలో ర్యాగింగ్ కి హీరో ఎదురు తిరగడం, దాంతో గ్యాంగ్‌తో ఘర్షణ జరగడం, దీంతో రాజకీయ నాయకులు జోక్యం చేసుకోవడం, దీంతో హీరో వ్యక్తిగత యుద్ధం...ఇలా  ప్రతీ  సంఘటన ముందున్న సంఘటన నుంచే పుడుతుంది.

‘రంగస్థలం’ : గ్రామంలో అన్యాయం, హీరో అన్న తిరుగుబాటు, అన్న హత్య, హీరో ప్రతీకారం, గ్రామ విముక్తి అన్నీ కాజ్ అండ్ ఎఫెక్ట్  గొలుసులోనే సాగుతున్నాయి.

 ‘జెర్సీ’ : కొడుకు కోరిక, తండ్రి మళ్ళీ  క్రికెట్‌లోకి రావడం, వయస్సు వల్ల కష్టాలు, విజయాలు, అపజయాలు; ఒక భావోద్వేగ ముగింపు. ప్రతి సంఘటనా పాత్ర నిర్ణయాల నుంచే వస్తోందిక్కడ.

ఈగ : నిర్దయుడైన పారిశ్రామికవేత్త సుదీప్, సమంతని సొంతం చేసుకోవడానికి నానిని హత్య చేస్తాడు (కాజ్).  నాని ఈగగా పునర్జన్మ ఎత్తి, సినిమా మిగిలిన భాగమంతా పకడ్బందీగా ప్రతీకారం తీర్చుకోవడానికి కుట్రలు పన్నుతాడు (ఎఫెక్ట్). దీనివల్ల సుదీప్‌కి  భయాందోళనలు, ఆర్థిక పతనం, శారీరక హానీ వంటి పరిణామాలు ఎదురవుతాయి.

కాజ్ అండ్ ఎఫెక్ట్  లేని కథ ఎలా వుంటుంది? చాలా సినిమాల్లో ఇలా జరుగుతుంది : చేతిలో వున్న కథకి కాజ్ అండ్ ఎఫెక్ట్ తో కథనం చేసుకోవాలని తెలీక, ఒక్కసారిగా ఓ పాట, కారణం లేకుండా ఒక ఫైట్, అకస్మాత్తుగా కొత్త విలన్ ఎంట్రీ, ఎక్కడి నుంచో ఒక ట్విస్ట్, చివర్లో హడావిడిగా ముగించేసి చేతులు దులుపుకోవడం.

9. ఐదు ప్రశ్నలు!
గొప్ప స్క్రీన్‌ప్లే రచయితలు పాటించే నియమం : ప్రతీ సీను రాసిన తర్వాత  ఈ ఐదు ప్రశ్నలు వేసుకుంటారు : ఈ సీన్ ఎందుకు జరిగింది? దీనికి కారణం ఏమిటి? దీని వల్ల తర్వాత ఏం  జరుగుతుంది? హీరో నిర్ణయం ఏమిటి? ఆ నిర్ణయం కొత్త సమస్యని సృష్టిస్తోందా? ఈ ఐదు ప్రశ్నలకి  సమాధానం వుంటే కథనం బలంగా వుంటుంది.

కాజ్ అండ్ ఎఫెక్ట్ అనేది కేవలం స్క్రీన్‌ రైటింగ్ టెక్నిక్ కాదు, కథకి  వెన్నెముక. సినిమాల్లో  ప్రేక్షకుల్ని మొదటి సీను నుంచి క్లయిమాక్స్ వరకూ కట్టిపడేసే శక్తి ఇదే. పాత్రల నిర్ణయాలు సంఘటనల్ని సృష్టించాలి; సంఘటనలు కొత్త నిర్ణయాల్ని తీసుకునేలా  చేయాలి. అప్పుడు మాత్రమే కథ సహజంగా, ఉత్కంఠగా, భావోద్వేగభరితంగా ఎదుగుతుంది. బలమైన కథలన్నీ ఈ కాజ్ అండ్ ఎఫెక్ట్ సూత్రంపైనే నిర్మాణమవుతాయి.

కాజ్ అండ్ ఎఫెక్ట్ సూత్రం యాక్షన్ కథల కోసమే కాదు- కామెడీ, రోమాన్స్, ఫ్యామిలీ, డివోషనల్, హార్రర్- ఇలా అన్ని జానర్ కథలకీ వర్తిస్తుంది. డివోషనల్ కి- పాత ‘పాండురంగ మహాత్మ్యం’ చూస్తే తెలుస్తుంది. రోమాంటిక్ కామెడీకి  ‘అహ నా పెళ్ళంట’ చూడొచ్చు.

స్క్రిప్టులో నిర్ణయమైనదే బాక్సాఫీసులో నిర్ణయమవుతుంది. కథనంలో ఏదో కాజ్ అనుకుని, దాని ఎఫెక్ట్ దద్దరిల్లాలని డిస్కషన్స్ పెట్టుకుంటే, బాక్సాఫీసు దద్దరిల్లదు. కారణం, ఏదో ఒక కాజ్ వుంటే చాలనుకోవడం. స్క్రిప్టులో కాజ్ కూడా బలంగా, లాజికల్ గా వుండాలి. స్క్రిప్టులో లేనిది స్క్రీన్ మీద రాదు. బాక్సాఫీసులో భాంగ్రా వేయదు.

-సికిందర్