రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Wednesday, January 1, 2025

1326 : మూవీ నోట్స్


 

మానసిక సంఘర్షణతో కూడిన డ్రామాలు, మాసిక సంఘర్షణతో కూడిన థ్రిల్లర్లు  రెండూ వేర్వేరు జానర్లు. వీటిలో మొదటి దానిలా రెండోది తీస్తే బెడిసి కొడుతుంది. ఒక సమస్యతో తేల్చుకోలేని మానసిక సంఘర్షణగా మొదటిది వుంటే, ఒక సమస్యతో విపరీతంగా ప్రవర్తించడంగా రెండోది వుంటుంది. ఇదీ డ్రామాకీ, థ్రిల్లర్ కీ వున్న తేడా. దర్శకురాలు డాక్టర్ గోగినేని హరిత తీసుకున్నది థ్రిల్లర్ జానర్. అంటే సైకలాజికల్ థ్రిల్లర్. ప్రమాదకరమైన ష్కీజోప్రీనియా అనే మనో వ్యాధి గురించి థ్రిల్లర్. ఈ వ్యాధితో రోగి అఘాయిత్యాలకి పాల్పడొచ్చు. దీనికి చికిత్స లేదు. ఈ జానర్ సస్పెన్సునీ, థ్రిల్స్ నీ, హార్రర్ నీ డిమాండ్ చేస్తుంది. ఈ మూడూ లేకుండా, పోనీ ఒక డ్రామాగా మానసిక సంఘర్షణ కూడా లేకుండా, ‘ఫియర్అనే మూవీ తీస్తే ఇది ఏ కోవకి చెందుతుంది? ఏ కోవకీ చెందని  వ్యర్ధ ప్రయత్నంగా తేలుతుంది. 
     
థ చూస్తే- సింధూ, ఇందూ (రెండు పాత్రలూ వేదిక పోషించింది) అనే కవల పిల్లలు. బాల్యంలో అనుభవమైన ఓ రెండు సంఘటనల కారణంగా సింధూలో ఓ మానసిక రుగ్మత పెరిగిపోతుంది. ఆ రుగ్మత కారణంగా భయభ్రాంతులకి లోనవుతూ వుంటుంది. ఎప్పుడూ ఓ అపరిచిత వ్యక్తి తనని వెంటాడుతున్నట్టు భ్రమిస్తూంటుంది. చిన్నప్పుడు  స్కూల్‌లో సంపత్ (అరవింద్ కృష్ణ) అనే తోటి విద్యార్థికి  క్లోజ్ అవుతుంది. ఇది సింధూ సోదరి ఇందూకి నచ్చదు. అతడికి దూరంగా వుంచాలని ప్రయత్నిస్తూంటుంది. ఇక సంపత్ కనపడకుండా పోయాడని తీవ్ర మానసిక రుగ్మతకి లోనవడంతో మానసిక చికిత్సాలయంలో చేర్పిస్తారు తల్లిదండ్రులు. ఆ మనోవ్యాధిని ష్కీజోప్రీనియాగా నిర్ధారిస్తాడు సైకియాట్రిస్టు (అనీష్ కురువిల్లా). అప్పట్నించీ 13 ఏళ్ళూ ఆమె ఆ చికిత్సాలయంలోనే వుండి పోతుంది. ఇదీ కథ. 
       
ఈ కథలో చిన్నప్పటి ఆ రెండు అనుభవాలేమిటంటే
, అన్నం తినకపోతే ఆమె తల్లి బూచాడు వస్తాడని భయపెడుతుంది. ఆ బూచాడి భయం ఆమెకి దెయ్యంలా పట్టుకుంటుంది. రెండో అనుభవం, సంపత్ గురించి సోదరితో తలెత్తిన టెన్షన్ కారణంగా కోపం వచ్చి ఆమెని నెట్టేస్తే కిందపడి గాయపడింది. దాంతో భయపడిపోయింది. ఈ భయం కూడా కలిసి ఆమె ష్కీజోప్రీనిక్ గా మారిందన్న మాట!
       
బూచాడొస్తాడని భయపెడితే జీవితాంతం ఆ భయంతో బ్రతకడం మనమెక్కడా చూడం.
షోలేలో గబ్బర్ సింగ్ తన గురించి ఇలా చెప్పుకుంటాడు- పిల్లలు నిద్రపోకపోతే తల్లులు నిద్రపో, లేకపోతే గబ్బర్ వస్తాడని భయపెడ్తారని. ఈ లెక్కన ఆ భయపడ్డ పిల్లలందరూ ష్కీజోప్రీనిక్కులవ్వాలి! చిన్నప్పుడు ఇలా భయపెట్టడం యుగాలుగా సాగుతోంది. ఇది ప్రమాదకరమైతే ఎప్పుడో ఆపేసే వాళ్ళు తల్లులనే జీవులు. 
       
తన వల్ల సోదరి గాయపడిన సంఘటన కూడా మనోవ్యాది పుట్టడానికి సరిపోని  కారణమే. ఇలాటి బలహీన కారణాలున్నప్పుడు సంఘర్షణ కూడా బలహీనంగానే వుంటుంది. ఆమె సంఘర్షణ తనని ఎవరో వెంటాడుతున్నాడనే. మరో వైపు సంపత్ కావాలని గొడవ చెయ్యడం. ఆ సంపత్ లేడు
, రాడు, అది నీ భ్రమ అంటూ వుంటాడు సైకియాట్రిస్టు. 
   
ఈ సైకలాజికల్ థ్రిల్లర్‌ కి  డైనమిక్ కథా ప్రపంచం వుండాలి. ఇదే ఇక్కడ మిస్సయ్యింది.  కథనంలో ఎక్కడా సస్పెన్స్, థ్రిల్, టెన్షన్, ఫియర్, పోనీ యాక్షన్ కూడా లేదు. కథ నేలబారుగా ఫ్లాట్ గా సాగుతూంటుంది. ప్లాట్ పాయింట్స్ అనేవి కనిపించవు. కథ సైకలాజికల్ థ్రిల్లర్‌ అయితే, పాత్ర సైకలాజికల్ డ్రామాలో లాగా పాసివ్ గా వుంది. ఎలా మొదలైన పాత్ర అలాగే, అదే వేదనతో కథని ముగిస్తుంది. 
       
ష్కీజోప్రీనియాతో హాలీవుడ్ నుంచి వచ్చిన సైకలాజికల్ థ్రిల్లర్లున్నాయి. వాటిని గమనించి ఈ సినిమా తీసినట్టు లేదు దర్శకురాలు.  కథలో విషయం లేకపోగా
, ఈ కథని మూడు టైమ్ లైన్లలో చెప్పడం ఇంకో సమస్య. హీరోయిన్ చిన్నప్పటి టైమ్ లైను, పెద్దయ్యాక రెండు టైమ్ లైన్లు. పెద్దయ్యాక ఈ రెండు టైమ్ లైన్లలో ఏది ఫ్లాష్ బ్యాక్, ఏది ప్రెజెంట్ అర్ధం కాని కన్ఫ్యూజన్ కూడా!
       
మొదటి సినిమా అనేది ఎన్నో ఏళ్ళు ప్రయత్నాలు చేస్తే నిర్మాతలతో దక్కే ఒక ఛాన్సు. చాలా రిస్కుతో కూడిన ఛాన్సు. దాంతో అన్నీతామే చేయగలమనుకుని అప్పుడే కథ- మాటలు- స్క్రీన్ ప్లేలు అన్నీ రాసేసే మేధావులమనుకుంటే- ఫలితం కూడా ఎలా వుంటుందంటే- మళ్ళీ ఇంకో ఛాన్సు కోసం జీవితాంతం ప్రయత్నిస్తూనే వుండాలి! మొదటి ఛాన్సు మేధావితనాన్ని కోరుకోదు
, అనుభవజ్ఞుల తోడ్పాటుని కోరుకుంటుంది.
—సికిందర్