Q : ఒక కాంటెస్ట్ కోసం షార్ట్ ఫిల్మ్ చేశాము. చూసి ఫీడ్ బ్యాక్ ఇవ్వగలరా? ‘కాంతారా’ ఇలాంటి థీమ్ తో ఉండడంతో యూట్యూబ్ లో రిలీజ్ చేశాం.
—జయసింహా,
రచయిత - దర్శకుడు
A :
మీరు పంపిన షార్ట్ ఫిలిం ‘కొమ్ముకథ’ కాన్సెప్ట్ బావుంది. కొమ్ము కథ సాంప్రదాయం ప్రకారం కాటమ రాజు వాసరుసులు చనిపోతే
పెద్ద కర్మని కొమ్ము కథ తో ప్రారంభిస్తారు. మీ కథలో భాగంగా చనిపోయిన వ్యక్తి వారసుడ్ని
కాటమరాజు పూనకం ద్వారా ఆవహిస్తాడని నమ్మకమని వాయిసోవర్ వేస్తూ ప్రారంభించారు.
కథ చెప్పేసే ఈ వాయిసోవర్ ముందు వేయడం
వల్ల కథ తెలిసి పోతోంది. వాయిసోవర్ తర్వాత హీరో రాజు కత్తి తో కాపుకాసే సీను వేశాక, వెంటనే అతడి తండ్రి చనిపోయిన సీను ఫ్లాష్ బ్యాకుగా వేయడం ద్వారా ఏం జరిగిందో
కూడా తెలిసి పోతోంది. ఆ తర్వాత రాజు తండ్రి కొండయ్య, సిద్దప్ప
అనే విలన్ జీవాల గురించి మాట్లాడుకునే ఫ్లాష్ బ్యాకు సీను వేశారు. ఈ సీనుతోనే ఫ్లాష్
బ్యాకు ప్రారంభించాలి. తండ్రి మరణ దృశ్యంతో కాదు.
తర్వాత పెద్ద కర్మ ఏర్పాట్లతో ఇంకో ఫ్లాష్
బ్యాక్ వేశారు. మళ్ళీ మిగతా కథలోకి వచ్చారు. రాజు తండ్రి కొండయ్య ఎలా చనిపోయాడో చూపించి
- పెద్దకర్మ దగ్గర కొమ్ము కథతో మీరన్నట్టు విలన్ని శిక్షించే ‘కాంతారా’ టైపు ముగింపు వేశారు.
14 నిమిషాల ఈ షార్ట్ ఫిలింలో ముందు వేసిన
వాయిసోవర్ తీసేసి, కథ తెలిసిపోయే ఫ్లాష్ బ్యాకులు (తండ్రి మరణ
దృశ్యం, పెద్దకర్మ ఏర్పాట్ల దృశ్యం) తీసేసి- మిగిలింది యధాతథంగా
వుంచితే సస్పెన్సుతో వుంటుంది. ఆ పెద్దకర్మ
విశిష్టత, పూనకం పూని శిక్షించిన విధానం అర్ధం గాకుండా వుంటాయి.
అప్పుడు చివర్లో వాయిసోవర్ వేసి విషయం చెప్తే అర్ధవంతంగా వుంటుంది. వీలైతే దీన్ని ఈ
విధంగా ఎడిట్ చేసుకుని చూడండి. ఎఫెక్ట్ మీకే తెలుస్తుంది. ఇకపోతే, చంపిన విధానాన్ని ఇంకా పొడిగించి చూపిస్తే సస్పెన్స్ పెరుగుతుంది.
ఇక ‘కూడెట్టే ఏ
పనీ తప్పు కాదు, కానీ అందులో నిజాయితీ వుండాలి’ అని కొడుకుతో అంటాడు తండ్రి. అంటే కూటి కోసం హత్యలైనా నిజాయితీగా చేయాలనా? ఉద్దేశం ఇది కాదేమో. నిజాయితీ బదులు నీతి అని వుండాలేమో? చిత్రీకరణతో, తక్కువ మాటలతో నటింపజేసుకోవడాలతో దర్శకత్వం
బావుంది.
Q : మా అనిల్ నటించిన సినిమా లింక్
పంపిస్తున్నాను. చూసి అనిల్ బాగా
చేస్తేనే, మీరు రివ్యూ ఇవ్వండి, ఫోటో
ఫ్రేమ్ లో పెడతాం.
—భమిడిపాటి
కిరణ్ కుమార్
A : ఇవేం
మాటలు
సార్. తప్పకుండా త్వరలో ఇద్దాం. అనిల్ బాగానే చేస్తాడుగా, అందులో
సందేహమెందుకు? తను పైకొచ్చే సినిమాలు చేయాలంతే.
Q : ఈ మధ్య మీరు స్క్రీన్ ప్లే సంగతులు రాయకుండా రివ్యూలు
రాస్తున్నారు. రివ్యూలు మేమెక్కడైనా చదువుకోగలం. దయచేసి స్క్రీన్ ప్లే సంగతులు రాయండి.
—కెవిపి, అసోషియేట్
A : వస్తున్న సినిమాలకి స్క్రీన్
ప్లే సంగతులు రాస్తే నవ్వుతారని రాయడం లేదు. అయినా పాత స్క్రీన్ ప్లే సంగతులు చదివితే
కొత్త సినిమాల స్క్రీన్ ప్లే సంగతులు తెలిసిపోతాయి. ‘కాంతారా’ గాథగా ఎందుకు హిట్టయ్యిందో రాయాలి, రాద్దాం. ఇంకేవైనా కొత్తగా అన్పించే వాటిగురించి రాద్దాం, ఓపిక పట్టండి.
Q : ‘సర్దార్’
సినిమాలో దేశద్రోహం అభియోగం
అనేది బలమైన
ఎమోషన్ గా అనిపించిది. కానీ వాటర్ బాటిల్ స్కామ్ వలన జరిగే నష్టాలు అనే ఎమోషన్
కలపడం వలన హీరోకు ఉన్న దేశద్రోహం
అభియోగం తాలూకు బలమైన ఎమోషన్ వీగిపోయిన ఫీలింగ్ కలిగింది. దీనిపై మీ అభిప్రాయం తెలుపగలరు.
—జయసింహా, రచయిత - దర్శకుడు
A : ‘ఓరి
దేవుడా’ లో శోభనం రాత్రి కిస్ చేయబోతే అతడికి నవ్వొస్తుంది.
చిన్నప్నట్నుంచీ ఫ్రెండ్ గా చూస్తున్న
ఆమెని రోమాంటిక్ గా చూడలేని సమస్య అతడిది. దీంతో ఇద్దరికీ భావోద్వేగాలు ఏర్పడక మానవు.
ఈ భావోద్వేగాలతో, సమస్యతో మిగతా కథ ఎలావుంటుందా అని
ఎదురుచూస్తాం. కానీ దీన్ని వదిలేసి, లేదా మర్చిపోయి, అతను స్కూల్ సీనియర్ తో తిరుగుతున్నాడనే అనుమానాలు ఆమెకి సృష్టించి, గొడవలు పెంచి విడాకులకి దారి తీయించాడు.
విడాకులకి దారి తీయాల్సింది ఆమెని రోమాంటిక్
గా చూడలేని అతడి మానసిక సమస్యా, లేక దీన్నొదిలేసి కల్పించుకున్న
ఇంకో గొడవా? ఒక కథ ఒక భావోద్వేగం చుట్టే వుంటుంది. ఒక భావోద్వేగాన్ని
డ్రైవ్ చేశాక రెండోదానికి స్థానముండదు. వుంటే మౌలిక భావోద్వేగమైన మొదటిది వీగిపోతుంది.
దాని స్థానంలో వచ్చే రెండోది కూడా నిలబడదు.
అందుకు
మౌలిక భావోద్వేగాన్నే కొనసాగిస్తూ, స్కూల్ సీనియర్ తో అనుమానాలు
సృష్టించి- ఇందుకా నీకు నా మీద మనసు కలగడం లేదని ఆమె చేత గొడవ పెట్టిస్తే -రెండో భావోద్వేగం
పుట్టే సమస్యే వుండదు. మొదటిదాని కొనసాగింపే కథలో ఈ మలుపుగా వుంటుంది. ఇలా చేయకుండా
మౌలిక భావోద్వేగంతో కథని అక్కడే కత్తిరించి, అనుమానాలతో ఇంకో
కథ ఆతికించాడు. సాధారణంగా సినిమాల్లో ఫస్టాఫ్ లో ఒక ముక్క, సెకండాఫ్
వేరే ముక్కగా ఇంకో కథ వచ్చేసి సెకండాఫ్ సిండ్రోమ్ అనే సుడిగుండాన్ని సృష్టిస్తూంటాయి.
ఇక్కడ ఫస్టాఫ్ లోనే రెండు ముక్కల కింద నరికి చూపించేశాడు, ఏం
తొందర వచ్చిందో.
ఇదే వారం విడుదలైన ‘సర్దార్’ దీ ఇదే సమస్య. మీరన్నట్టు దేశద్రోహ అభియోగం, వాటర్ బాటిల్
స్కామ్ రెండూ వేర్వేరు భావోద్వేగాలు. రెండు వేర్వేరు సినిమాలు తీయాలి. వాటర్ బాటిల్ స్కామ్
తో సమాజానికి జరిగే హానియనే భావోద్వేగం కలపడంతో, కథలో
దేశద్రోహం అభియోగంతో వున్న మౌలిక భావోద్వేగం వీగిపోయి
- అంటే ఎమోషనల్ కంటిన్యూటీ తెగిపోయి - ప్రేక్షకులు ఏకధాటిగా అనుభవించాల్సిన ‘ఫీల్’ చెదిరిపోయింది. అయినా సినిమా హిట్టయ్యిందంటే ఇలాటి జోడు భావోద్వేగాల ఫీల్
చెదిరిన సినిమాలు కూడా నాటుగా చూస్తామని ప్రేక్షకులిస్తున్న సందేశం. ఈ మధ్య జనాలకి
మనోభావాలు ఎక్కువై పోయాయి.
—సికిందర్
—సికిందర్