రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Friday, September 2, 2022

1203 : బర్త్ డే స్పెషల్


        నేటితో 54 ఏళ్ళు పూర్తి చేసుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండు పడవల ప్రయాణం సాగిస్తున్నారు. సినిమాలు, రాజకీయాలు. సినిమాల్లో హిట్ ఫ్లాపుల్లాగే రాజకీయాల్లో జయాప జయాలెదుర్కొన్నారు. స్థాపించిన జనసేన పార్టీ గత ఎన్నికల్లో ఎంత ప్రభావం చూపిందో తెలిసిందే. అయినా రాజకీయాల నుంచి తప్పుకోలేదు. సినిమాలు ఫ్లాపయినా సినిమాల నుంచి తప్పుకోలేదు. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో 1996 లో 28 ఏళ్ళ లేత కుర్రాడిగా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి తో ప్రారంభించిన సినిమా జీవితం, నేటికి 26 ఏళ్ళు పూర్తి చేసుకోగా, 2008 లో 40 ఏళ్ళ వయసులో ప్రారంభించిన రాజకీయ జీవితం, 14 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ 14 ఏళ్ళుగా ఎవరేమనుకున్నా అక్కడ సినిమాలు - ఇక్కడ రాజకీయాలు అన్నట్టు రెండు పడవల ప్రయాణం కొనసాగిస్తున్నారు.

        ఇంతా చేసి పవన్ కళ్యాణ్ నటించింది 27 సినిమాలే. గోకులంలో సీత, సుస్వాగతం, తొలి ప్రేమ, తమ్ముడు, బద్రి, ఖుషి, జల్సా, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది, వకీల్ సాబ్, భీమ్లా నాయక్ వాటిలో ప్రధానమైనవి. ఇప్పుడు తాజా అప్డేట్ ఏమిటంటే పవన్ నటించిన ఈ బ్లాక్ బస్టర్స్ ని ఇప్పుడు రీరిలీజ్ చేసినా థియేటర్లు పగిలిపోతాయి. దీనికుదాహరణ సెప్టెంబర్ 2 న పుట్టిన రోజుని పురస్కరించుకుని నిర్మాతలు ఆగస్టు 31 న తమ్ముడు ని రీరిలీజ్ చేశారు. ఈ ప్రకటన చేసిన కాస్సేపటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో మల్టీప్లెక్సులకి,  సింగిల్ స్క్రీన్ థియేటర్లకి ప్రేక్షకులు తండోపతండాలుగా తరలివచ్చారు. వెంటనే థియేటర్ల ముందు హౌస్ ఫుల్ బోర్డులు దర్శన మిచ్చాయి. థియేటర్లు క్రిక్కిరిసిపోయి, బొమ్మపడేసరికి తెరమీద ఆనాటి యువ పవన్ ని చూసి ఒకటే కేరింతలు, పూనకాలు, డాన్సులు.   

తర్వాత సెప్టెంబర్ 1 న  నిర్మాతలు జల్సా ని రీరిలీజ్ చేస్తే, దీన్నీ విరగదీశారు. జల్సా ని ఏకంగా ప్రపంచవ్యాప్తంగా 501 షోలు వేశారు. అన్నీ హౌస్ ఫుల్స్. దీనికీ కేరింతలు, పూనకాలు, డాన్సులు. ప్రేక్షకులనుంచి ఇంత స్పందన రావడం చూసి సినిమా, రాజకీయ విశ్లేషకులే తెల్లబోయారు. పవర్ స్టార్ కి దీటుగా ఆడియన్స్ కూడా పవర్ చూపించారు. మరి ఎన్నికల్లో ఈ పవర్ ఏమైపోతుందో తెలీదు. ఓట్లు అనేసరికి ఎక్కడుంటారో జనం తెలీదు. మొన్న ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో ప్రియాంకా గాంధీ ర్యాలీలకి ఎక్కడికెళ్ళినా వీధులు పట్టనంత జనం బ్రహ్మరథం  పట్టారు. అమ్మలక్కలు హారతులు పట్టారు. తీరా ఎన్నికల్లో వేసింది 2 శాతం ఓట్లే!  

పవన్ నటుడు మాత్రమే కాదు. రైటర్, సింగర్, స్టంట్ కో ఆర్డినేటర్, ప్రొడ్యూసర్ కూడా. వీటన్నిటితో బాటు పొలిటీషియన్ కూడా. 2008 లో అన్నయ్య చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపిస్తే, పవన్ పార్టీ యువ విభాగం యువరాజ్యం ఏర్పాటు చేస్తూ రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ప్రజారాజ్యం పార్టీ సభ్యుడిగా వున్నప్పుడు ఎలాంటి పదవులు చేపట్టలేదు, ఎన్నికల్లో పోటీ చేయనూ లేదు. అయితే 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం ఎన్నికల్లో విఫలమైన దరిమిలా  2011లో చిరంజీవి పార్టీని  కాంగ్రెస్‌లో విలీనం చేశారు. దీంతో పైకి చెప్పుకోలేని అసంతృప్తితో వుండిపోయారు పవన్.

ఇక 2014లో తనే జనసేన పార్టీ పేరుతో కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. ఈ సందర్భంగా ఆయన ప్రచురించిన పుస్తకం ఇజమ్  కూడా జనసేన పార్టీ ఐడియాలజీయే. రెండు తెలుగు రాష్ట్రాల్నిప్రభావితం చేస్తున్న సమస్యలపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ తో సమావేశమై మద్దతుని  ప్రకటించారు. 2014 లో ఎన్నికల్లో పోటీకి పార్టీని దింపకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల్లో తెలుగుదేశం - బిజెపి కూటమికి  ఉత్సాహంగా ప్రచారం చేశారు. కాంగ్రెస్ హటావో, దేశ్ బచావో నినాదాలిచ్చారు. 2017 లో సినిమా కమిట్మెంట్లు పూర్తి చేసిన తర్వాత పూర్తి స్థాయి రాజకీయ జీవితాన్ని ప్రారంభించాలనేది తన ఉద్దేశమని ప్రకటించారు.

ఆయన రాజకీయ జీవితం సెకండ్ ఇన్నింగ్స్ లో ప్రధానంగా ఉద్దానం కిడ్నీ వ్యాధి ఉదంతాన్ని లేవనెత్తి వార్తల్లో కొచ్చారు. 2019 ఎన్నికలకి సిద్ధమవుతూ ప్రజల్లోకి విస్తృతంగా దూసుకెళ్ళి సమస్యలు విన్నారు, ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. ఆందోళనలు చేశారు. ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా డిమాండ్ వాటిలో ఒకటి. 2019 ఎన్నికల్లో ఆవిష్కరించిన మ్యానిఫెస్టోలో అన్ని వర్గాల ప్రజల జీవితాల్నీ  మెరుగుపరిచేందుకు అనేక పథకాలు ప్రకటించారు. ఇలా విజయ పంథాలో పార్టీని తీసికెళ్తూ, లభిస్తున్న అశేష ప్రజాదరణతో ఎన్నికల్లో 140 స్థానాల్లో అభ్యర్ధుల్ని పోటీకి దింపితే, తనూ రెండు స్థానాల్లో పోటీ చేస్తే, తనతో బాటూ అందరూ ఓడిపోయారు ఒకే ఒక్క రాజోలు అభ్యర్ధి తప్ప. వై ఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్, టీడీపీని కూడా చిత్తుగా ఓడించి అధికారంలో కొచ్చేసింది.

అయినా పార్టీ ఎత్తేసి వెళ్ళిపోలేదు పవన్. అంత ఘోర పరాభవాన్ని చవి చూసినా, ఎవరేమనుకుంటారన్న పట్టింపు కూడా లేకుండా పార్టీని నడుపుతూనే వున్నారు. ప్రజాందోళనలు చేపడుతూనే వున్నారు. ఇంతటి పట్టుదల అటు తమిళనాడులో రాజనీకాంత్ కీ లేదు, కమలహాసన్ కీ లేదు. విజయ్ కాంత్ కి అసలే లేదు. దేశంలో రాజకీయ పార్టీ నడుపుతున్న ఏకైక సినిమా స్టార్ గా పవన్ కళ్యాణే వున్నారు.

పవర్ స్టార్ అని పిలవకండి, పవర్ లేదని చెప్తూ ఇక వచ్చే 2024 ఎన్నికలకీ పొత్తుల్లేకుండా పోటీ చేసేందుకు పార్టీ శ్రేణుల్ని సన్నద్ధం చేస్తున్నారు. ఇప్పుడు పుట్టినరోజు సందర్భంగా తను నటిస్తున్న హరి హర వీరమల్లు ఫస్ట్ గ్లింప్స్ ని అభిమానులకి గిఫ్ట్ గా విడుదల చేస్తున్నారు. 17 వ శతాబ్దపు మొఘల్ -కుతుబ్ షాహీల కాలం నాటి బందిపోటు అయిన వీర మల్లు, మొఘలుల నుంచి కోహినూర్ వజ్రాన్ని తస్కరించే కథతో ఇది తెరకెక్కుతోంది. క్రిష్ దీని దర్శకుడు. ఏఎం రత్నం నిర్మాత. నిధీ అగర్వాల్, అర్జున్ రాంపాల్, నర్గీస్ ఫక్రీ ఇతర తారాగణం. ఇది 2023 మార్చిలో విడుదలవుతుంది.

ఇది సరే, పీరియడ్ సినిమాలు రాజకీయాలకి పని చెయ్యవు, ఇప్పటి కళ్ళ ముందున్న పీడనల మాటేమిటి? 2024 ఎన్నికలకి ఆయన సినిమా ఆయుధమేమిటి? ఎన్టీఆర్ లాగా ప్రజా సమస్యలతో ఓ బొబ్బిలి పులి లాంటి సంచలన సినిమాని దింపుతారా? 1983 లో ఎన్టీఆర్ అధికారంలోకి రావడానికి గతంలో నటించిన పౌరాణికాలతో బాటు, 1982 లో నటించిన బొబ్బిలిపులి కీలక పాత్ర పోషించాయి. దాదాసాహెబ్ ఫాల్కే భారతీయ సినిమాని ప్రారంభించినప్పుడు, ఆయన వాస్తవికతని, మాయాజాలాన్నీ తన భావజాలానికి అనుకూలంగా మార్చుకున్నాడు. వాస్తవికతని  పేదరికంతో, బ్రిటీష్ వలస వాదాన్ని పురాణాలతో భర్తీ చేశాడు. అది దేశానికొక ఎజెండాని నిర్దేశించింది. ఎన్టీఆర్ పౌరాణిక పాత్రల్ని చిత్రీకరించడంలో ఇంకో ముందడుగేశారు. ఒక పౌరాణికం తీయడం వెనుక రాజకీయ ఉద్దేశం వుండేది. ఎన్టీఆర్ రాజకీయాలకి అతీతంగా పౌరాణిక సినిమాల్ని తీసి వుంటే అవి ఫక్తు ఆధ్యాత్మిక సినిమాలుగానే మిగిలిపోయేవి.

పవన్ కళ్యాణ్ నిర్మొహమాటంగా ఓట్ల కోసమే సినిమాలన్నట్టు సినిమాలు తీయకపోతే 2024 కోసం కష్టపడుతున్న ఈ అయిదేళ్ళూ కూడా  వృధా అవుతాయి. మీడియా చేతిలో లేని తనకి సినిమాలే ప్రచారాస్త్రాలు. మూస రాజకీయాల మత్తులో వున్న ఓటర్లని కొత్త రాజకీయ చైతన్యం వైపు నడిపించినప్పుడే పవర్ స్టార్ అని పిలవకండి, పవర్ లేదని మళ్ళీ చెప్పుకునే అగత్యం తప్పుతుంది.

***