రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

15, ఆగస్టు 2022, సోమవారం

1191 : రైటర్స్ కార్నర్


        అద్వైతా కాలా సూపర్ హిట్ విద్యా బాలన్ కహానీ రచయిత్రి. దీనికి ముందు రణబీర్ కపూర్- ప్రియాంకా చోప్రా నటించిన అంజానా అంజానీ రచయిత్రి. మౌలికంగా నవలా రచయిత్రి అయిన తను చిక్ లిట్ జానర్లో రాసిన ఆల్మోస్ట్ సింగిల్’, ఆల్మోస్ట్ దేర్ అనే రెండు నవలలు బాలీవుడ్ కి బాట వేశాయి. వీటిలో మొదటి నవల లక్ష కాపీలు అమ్ముడుబోయింది. తర్వాత వెబ్ సిరీస్ రాస్తూ బిజీ అయిన తను వివిధ పత్రికల్లో కాలమిస్టు కూడా. రాయడం గురించి, కొత్త రచయితలకి సలహాల గురించీ అద్వైత ఇచ్చిన ఇంటర్వ్యూ ఈ క్రింద...

మీరు ఏ సినిమా రాయడాన్ని బాగా ఎంజాయ్ చేశారు? రాసే ప్రక్రియలో మీరు దేన్ని  బాగా ఇష్టపడ్డారు?
కహానీ రాయడం నాకు మరిచిపోలేని అనుభవం. అది నా జీవితంలో ఒక నిర్ణీత కాలంలోకి తీసికెళ్ళింది. స్వీయానుభవంలోంచి రాసే ప్రక్రియని నేనెక్కువ ఇష్టపడతాను.

కహానీ కి అవకాశం ఎలా వచ్చింది?
దర్శకుడు సుజోయ్ ఘోష్ కహానీ ఐడియాతో నన్ను కలిసి రాయమన్నారు. కోల్‌కతా  నగర నేపథ్యంలో సాగే ఈ కథ నేనక్కడ 1999 లో గడిపిన రోజుల్ని గుర్తుకు తెచ్చింది. అప్పట్లో కోల్‌కతా నాకు చాలా కొత్త. తెలియని నగరంలో నాది ఒంటరి జీవితం. అంత భద్రత ఫీలయ్యేదాన్ని కాదు. అక్కడి భాష  తెలీదు. బోలెడంత పేదరికం. కానీ అక్కడి మనుషులు శాంత స్వభావులు. ఈ జీవితాన్నే ఒడిసి పట్టుకుని కథలోకి తెచ్చాను. హీరోయిన్ విద్యాబాలన్ పాత్రకి కి కోల్‌కతాతో నా ఈ అనుభవసారాన్నే జోడించాను. ఈ ఉత్సాహభరి, పరుగులు దీసే, సంక్లిష్ట నగరంలో పురుష ప్రపంచానికి చేరువ కావాలనుకునే యువతి అనిశ్చిత స్థితిని పాత్రకి కల్పించాను. స్క్రీన్‌ప్లేలో ఈ సూక్ష్మ కారకాల మధ్య ఇంటర్ ప్లేని తీసుకురావడం నాకు చాలా నచ్చింది.

దీన్ని 2009 లో రాయడం మొదలెట్టాను. 2010 ఫిబ్రవరి కల్లా 185 పేజీల స్క్రిప్టు పూర్తయ్యింది. రీసెర్చికి మలై కృష్ణ ధార్ రాసిన ఓపెన్ సీక్రెట్స్ :  ఇండియన్ ఇంటెలిజెన్స్ అన్ వీల్డ్’, వీకే సింగ్ రాసిన ఇండియాస్ ఎక్స్ టర్నల్ ఇంటెలిజెన్స్ :  సీక్రెట్స్ ఆఫ్  రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్ పుస్తకాలు నాకు తోడ్పడ్డాయి.  

మీ కహానీ లోని విద్యాబాలన్ పాత్రలో అద్వైతా కాలా పాలెంత?సినిమా కథా వస్తువులకి స్ఫూర్తినిచ్చే నిజ జీవిత ప్రతిధ్వని గురించి చెప్పండి.
నాటక రచయిత టెనెస్సీ విలియమ్స్ వంటి నేను మెచ్చుకునే  రచయితలు కూడా వాళ్ళ రచనల్లో వ్యక్తిగత జీవితాల్ని, పోరాటాల్నీ ప్రతిబింబిస్తారు. కహానీ కి పరాయి వ్యక్తి దృక్కోణం వుండాలన్న స్పష్టత నాకుంది - కోల్‌కతాకి కొత్తగా వచ్చిన వ్యక్తి దృష్టిలాగా విద్యాబాలన్ పాత్ర అనుభవం పొందాలని భావించాను. నేను యుఎస్‌లో చదువుకున్న తర్వాత కోల్‌కతాకి  మారాను. హోటల్ కిచెన్‌లలో పనిచేశాను. ఈ నగరంలో నా అనుభవాలకి చాలా ఆశ్చర్య చకితురాలినయ్యాను. ఇది ఎప్పుడో ఒక సంవత్సరం క్రితం ఇదే హోటల్‌లో పనిచేసిన నా బాయ్ ఫ్రెండ్ అడుగుజాడల్లో ప్రయాణించడం లాగా వుండేది. అతనిక్కడ గడిపిన కాలాన్ని పునర్జీవించాను. అతను సందర్శించిన ప్రదేశాలకి వెళ్ళాను. సాధ్యమైనంత వరకు అతడి సాన్నిహిత్యాన్ని ఫీలయ్యాను. ఈ ఎమోషనల్ ప్రయాణమే విద్య కోసం చెక్కిన  పాత్రలో వ్యక్తమవుతుంది.

విశాల్ భరద్వాజ్ ఓంకార’, షేక్స్ పియర్ ఒథెల్లో లేదా సోనమ్ కపూర్ నటించిన ఐషా ఆధారం జేన్ ఆస్టెన్ ఎమ్మా వంటి నవలలు/నాటకాలు గతంలో చలనచిత్రాలుగా వెలువడ్డాయి. రచయిత్రిగా మీరు ఈ ట్రెండ్‌ని పునర్నిర్వచించారు- స్క్రిప్ట్ రైటర్ నుంచి నవలా రచయిత్రిగా రివర్స్ మార్గాన్ని అనుసరించారు. కహానీ ఇప్పుడు మిమ్మల్ని నవలగా మార్చేలా చేసింది. ఈ పద్ధతి మెరుగ్గా వుందా?
లేదు, నేను నిజంగా దేనినీ పునర్నిర్వచించాలనే ఆలోచన చేయలేదు. నేనొక నవలా రచయిత్రిని, ఇదే నాకు సౌకర్యంగా వుంటుంది. ఈ సినిమా నవల అవుతుందని నాకు చాలా ముందుగానే తెలుసు, కాబట్టి కహానీ నవలని ఇంటీరియర్ మోనోలాగ్ (స్వగతం) వంటి సాహిత్య పరికరాలని అన్వేషించే నవలగా రాశాను.

మీ కోసం మీరు రాసుకుంటారా, లేక ప్రేక్షకుల కోసం రాస్తారా?
రాయడం నాకు చాలా పర్సనల్. అందుకే రాసే ప్రతిసారీ నేను ఏదీ చదవకుండా, ప్రివ్యూలు చూడకుండా, లేదా ప్రీమియర్స్ కెళ్ళకుండా గదిలో ఒంటరిగా వుంటాను. వొంటరిగా నేను రాయడం మొదలు పెట్టినప్పుడు ప్రేక్షకుల గురించి ఆలోచించను. అలా చేస్తే రాయలేను.

ఓటీటీ ప్లాట్ ఫామ్స్ పెరుగుదల రచయితలకి కొత్త పని అవకాశాలను సృష్టిస్తోందా? ఇది వారి కెరీర్‌ని ఎలా ప్రభావితం చేస్తోంది?
చాలా కాలం తర్వాత మొదటిసారిగా ఇప్పుడు కంటెంట్‌ పై కొంత శ్రద్ధ పెడుతున్నారు. ఓటీటీ విస్ఫోటనం కారణంగా స్టారే కంటెంట్ అన్న ట్రెండ్ నుంచి కంటెంటే స్టార్ ధోరణకి మారుతున్నాం. స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ వారు పచ్చ జండా వూపే కంటెంట్, వారు చెప్పాలనుకుంటున్న కథల నాణ్యత, స్టోరీ డెవలప్‌మెంట్‌పై వారు పెట్టే శ్రద్ధ తక్కువేం కావు. ఒక ఉదాహరణతో పరిస్థితిని వివరిస్తాను. ఇల్లీగల్ సీజన్ 2 కోసం స్క్రీన్‌ప్లే రాయడానికి నాకు దాదాపు ఒక సంవత్సరం పట్టింది. ఈ ప్రక్రియలో వూట్ ఓటీటీ  టీమ్‌తో కలిసి పని చేశాను. మొత్తం ఆ టీమంతా కలిసి రాయడం పట్ల చూపిన ఆ స్థాయి నిబద్ధత నేనెప్పుడూ చూడలేదు.

ఇప్పుడు రైటర్స్ వాయిస్ వినిపిస్తున్నారు. ఆర్థిక ప్రయోజనాల పరంగా సృజనాత్మక వ్యక్తులకు ఇది గొప్ప సమయం కాబట్టి యువ రచయితలు ఇటు వైపు రావడానికి సిద్ధపడుతున్నారు. మొత్తం పని విధానమే  మారిపోయింది. పేరు పొందిన రచయితలతో ప్రాజెక్టులపై పని చేయడానికి, క్రెడిట్స్ పొందడానికీ జూనియర్ రచయితలకి ఇప్పుడు మంచి అవకాశం.

యువ రచయితలు కెరీర్ ప్రారంభంలో ఎలా కొనసాగాలంటారు?
సాంకేతిక అభివృద్ది  భౌతిక అడ్డంకుల్ని తొలగించి పని పరిధిని విస్తృతం చేసింది. నేను ఇప్పుడు ఆన్‌లైన్‌లో వ్యక్తులతో కలిసి పని చేస్తున్నాను. మేము జూమ్ లో ఇంటరాక్ట్ అవుతాం, కంటెంట్ డెవలప్మెంట్ కి వాట్సాప్ లో చాట్ చేస్తున్నాం. యువ రచయితలు ముందుగా తమ స్క్రిప్ట్స్ ని రిజిస్టర్ చేసుకోమని నేను సలహా ఇస్తాను. ఐడియాలని రిజిస్టర్ చేసుకోవడం సాధ్యం కాదు, స్క్రిప్ట్స్ నే రిజిస్టర్ చేసుకోవాలి. ఎవరికైనా కంటెంట్ చెప్పే సందర్భంలో, ఆ వ్యక్తి చేత న్యాయవాది తయారు చేసిన నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ పై సంతకం చేయించుకోవాలి.
అన్ని పెద్ద నిర్మాణ సంస్థలు మెటీరియల్‌ని సమీక్షించడానికి కంటెంట్ టీమ్స్ ని ఏర్పాటు చేసుకున్నాయి. అయినప్పటికీ, స్క్రీన్ రైటింగ్ ఇప్పటికీ ఒడిదుడుకుల వృత్తిగానే  వున్నందున, యువ రచయితలు జాగ్రత్త వహించాలని నేను కోరుతున్నాను. కొన్నిసార్లు పని విపరీతంగా వుంటుంది, కొన్నిసార్లు పనికోసం ఎదురు చూడాల్సి వస్తుంది. అందుకే నేనెప్పుడూ అనుబంధంగా వేరే జాబ్ చూసుకోవాలని చెబుతూంటాను - కహానీ రాసిన  తర్వాత కూడా నేను హోటల్ ఆపరేషన్స్ లో పని చేశాను కాబట్టి నేనూ మినహాయింపు కాదు.

వర్ధమాన  రచయితలు వారి స్క్రిప్ట్స్ ని, కంటెంట్ నీ ప్రకటించుకునే మార్గాలేమిటి?
యువ రచయితలకి  ప్రాతినిధ్యం వహించడానికి సిద్ధంగా వున్న ఏజెంట్లు వున్నారు. నేను నా కోసం చాలా పిచింగ్ చేసే ఏజెంట్ ద్వారానే పని చేస్తున్నాను. ఇది సత్ఫలితాల్నిచ్చింది. ఈ రోజుల్లో నిర్మాణ సంస్థలు నవలల్ని కూడా తీసుకుంటున్నాయి కాబట్టి రచయితలు నవలలు కూడా వ్రాయవచ్చు. అది  మంచి నవలైతే, సిరీస్‌గా మార్చడానికి నాలాంటి వారిని సంప్రదిస్తారు. ఔత్సాహిక రచయితలకి నెట్వర్కింగ్ చాలా అవసరం. ఏ నిర్మాణ సంస్థ ఏ కంటెంట్ ని తీసుకుంటోందో, ఏ షో ప్రారంభిస్తోందో తెలుసుకుంటూ వుండడం కూడా అవసరం. చాలా ఓటీటీల్లో వరదలా వస్తున్న షోలు ఈ నిర్మాణ సంస్థలే చేపడుతూంటాయి. ఇదంతా చేసే ముందు కంటెంట్ ని రిజిస్టర్ చేసుకోమంటాను. ఎవరికైనా స్క్రిప్టు పంపిస్తే, ఈ మెయిల్ చేస్తే అది రికార్డుగా వుంటుంది.

స్క్రిప్ట్ రైటింగ్ లో సామాన్య  ప్రక్రియేమిటో చెప్తారా? నిర్మాణ సంస్థలకి స్క్రిప్టుని పిచ్ చేయడానికున్న ప్రాథమిక దశలు ఏమిటి?
ముందు లాగ్ లైన్ ని పిచింగ్ చేయాలి. దీని పైనే నిర్ణయాలు జరుగుతూంటాయి. సామాన్యంగా జరిగే రచనా ప్రక్రియ కొస్తే, ముందుగా లాగ్ లైన్ ప్లాన్ చేసుకోవాలి. లాగ్ లైన్ అంటే ఏక వాక్యంలో కథా సారాంశం. దీని ఆధారంగా సినాప్సిస్ వస్తుంది. ఇది పేజీనుంచి 10 పజీలుండొచ్చు. దీంట్లోంచి ప్రధాన పాత్ర, ప్రత్యర్ధి పాత్ర, ఇతర ముఖ్య పాత్రలు ఆలోచించాలి. వీటితో కథా ప్రపంచం, లొకేషన్స్, సీన్స్ మొదలైనవన్నీ వస్తాయి. దీన్ని పిచింగ్ చేసే ముందు రిజిస్టర్ చేసుకోవాలి. అప్పుడు నిర్మాణ సంస్థకి పరిచయం చేసుకుంటూ ఈమెయిల్ పంపాలి. కంటెంట్, జానర్, టైటిల్ తెలియజేయాలి. నిర్మాణ సంస్థ కోరితే తప్ప ఇంకే మెటీరీయల్ పంపకూడదు.

ఔత్సాహిక స్క్రిప్టు రచయితకి  ఏదైనా నిర్దిష్ట విద్యార్హత అవసరమంటారా?
స్క్రిప్టు  రచయితకుండే వెసులుబాటు ఏమిటంటే ఏ నిర్దిష్ట డిగ్రీ అవసరం లేదు. రచయితలే కథకులుగా పుడతారు. నిజానికి మనమందరం కథకులమే. దాన్ని వ్యక్తపరిచే నేర్పు వుండకపోవచ్చు. ఈ నైపుణ్యాలని  మెరుగు పరుచుకోవడానికి సృజనాత్మక రచనా కోర్సులు చేయవచ్చు. కానీ నేర్చుకోవడానికి ఉత్తమ మార్గం వాస్తవానికి క్రాఫ్టుని సాధన చేయడమే. ఇతర రచయితలతో కలిసి పనిచేయడం ఇంకో మార్గం. నేను స్వయంగా నేర్చుకున్నాను. రచయితలు సినిమాలు చూడడమే గాక, పుస్తకాలు, స్క్రీన్‌ప్లేలు చదవాలి.
—ఏజెన్సీస్