85. తెలుగులో క్రౌడ్ ఫండింగ్ తో తీసినవే రెండు. ఇవి ఏమయ్యాయో
తెలిసిందే. కమర్షియల్ సినిమాలకి భిన్నంగా ఏదో ప్రయోగాలు చేద్దామనుకుని, క్రౌడ్ ఫండింగ్ తో ఏం తీసినా,
ఏ సొంత క్రియేటివ్ కోర్కెలు తీర్చుకున్నా, మళ్ళీ వాటిని విడుదల చేయాల్సింది వ్యాపారులే. ఎన్నో కమర్షియల్
సినిమాల విడుదలలకే దిక్కులేదు, కమర్షియలేతర సమాంతర సినిమాల
మొహం ఏ వ్యాపారి చూస్తాడు. వచ్చిన చిక్కేమిటంటే, వస్తున్న
కొత్త తరం బిజినెస్ సైడే చూడరు. కమర్షియల్ సినిమాల్ని విమర్శిస్తూ వాటికంటే
మెరుగైన తమ టాలెంటేదో చూపించాలనుకుంటారు. అమాంతం వెళ్లి వరల్డ్ సినిమాల మోజుతో
ఇండీ మూవీస్ తీసి పడేస్తారు. అవి కమర్షియల్ మూవీస్ లాగే వుంటాయి. మైండ్ మీద స్టార్
సినిమాల ప్రభావం స్వారీ చేస్తూంటే ఇంతే. ఏ బడ్జెట్ కథ ఆలోచించాలన్నా, ఏ జానర్ కథ ఆలోచించాలన్నా
తాము చూసిన స్టార్ సినిమాల్లో నటనలు, డైలాగులు, కామెడీలు, మ్యానరిజమ్స్, పాటలు, ఫైట్లు,
టేకింగ్, ఎడిటింగ్, బిజిఎం, కలర్ థీమ్స్...ఇవే మెదుల్తూంటాయి. ఇక యాభై కోట్ల స్టార్
సినిమాని కోటి రూపాయల ఫుట్ పాత్ సినిమాలా తీసి పడెయ్యడం.
86. సబ్ టైటిల్స్ తో
వున్న సినిమాల్ని చూస్తూంటే ఎంత బాగా డైలాగులు రాస్తున్నారో అర్ధమవుతుంది. నటుడు పది
మాటల్లో చెప్పే డైలాగు, సబ్ టైటిల్స్ లో ఒకే లైనుగా వచ్చేస్తుంది. డైలాగ్ రైటర్ రాసిన
పెద్ద డైలాగుని సబ్ టైటిల్స్ రైటర్ ఒక్క లైనులో చెప్పేస్తున్నప్పుడు, డైలాగ్ రైటర్
దేనికి? పేరాలకి పేరాలు డైలాగులు రాసి లెంత్ పెంచెయ్యడం, దాంతో షూటింగులో, డబ్బింగులో
ఖర్చు పెంచెయ్యడం...
87. అసలు సౌండ్ ని
మ్యూట్ చేసి సినిమాల్ని చూస్తే డైలాగులు ఎక్కడెక్కడ
అవసరం లేదో తెలిసిపోతుంది. సౌండ్ లేక పోయినా సన్నివేశంలో ఏం జరుగుతోందో అర్ధమైపోతూంటే డైలాగుల అవసరమే లేదు.
88. స్క్రీన్ ప్లేలో కథ ఎప్పుడైనా ప్లాట్ పాయింట్ వన్ లో
పుడుతుందని తెలిసిందే. దీనికి ముందు బిగినింగ్ విభాగంలో వుండేదంతా కథ కాదనీ, ప్లాట్ పాయింట్ వన్ లో పుట్టబోయేది మాత్రమే కథ
అనీ, అంతవరకూ బిగినింగ్ విభాగంలో చూపించేదంతా ఆ పుట్టబోయే
కథకి కేవలం ఉపోద్ఘాతమేననీ కూడా తెలిసిందే. ఇదంతా మళ్ళీ ఎందుకు గుర్తు చేసుకోవడమంటే,
ఏమాత్రం ఏమరుపాటుగా వున్నా ఉపోద్ఘాతం వచ్చేసి కథని కలుషితం చేసేసే
ప్రమాదముంటుంది గనుక.
89. ఎన్ని
లొకేషన్స్ లో తీశామని కాదు పబ్లిసిటీ, కంటెంట్ ఏమిటన్నది డిమాండ్. ఐదు లొకేషన్స్ లో, ఆరుగురు
ఆర్టిస్టులతో, డెబ్బై లక్షలతో కంటెంట్ ఆధారిత కమర్షియల్ ని పాతిక
రోజుల్లో తీసి కూడా కమ్మగా కోటి రూపాయలు జేబులో వేసుకుని నిద్రపోవచ్చు. కంటెంట్
ఏమిటన్నది, అది కాగితం మీద ఎలా వున్నదీ బాక్సాఫీసు చేసే
తనిఖీ. తేడాగా వుందా చించి అవతల పారేస్తుంది.
90. చాలా కామన్ సెన్స్ – ఐడియాని ప్లాన్ చేసుకోకపోతే సినిమా ఫ్లాపే. ఈ
బేసిక్స్ ని ఎవ్వరూ ఛాలెంజి చేయలేరు. ఐడియాని ప్లాన్ చేసుకోక పోతే సినిమా అట్టర్
ఫ్లాపే. ఇంకో మాటే లేదు. క్రియేటివ్ స్కూల్లోంచి స్ట్రక్చర్
స్కూల్లోకి వచ్చినప్పుడే హిట్ ఫ్లాపులు అర్ధమవుతాయి. అంతవరకూ చీకట్లో బాణాలేయడమే.
సొంత వైద్యంలాంటి క్రియేటివ్ స్కూళ్ళే సినిమాల్ని
చూడలేకుండా చేస్తున్నాయి. క్రియేటివ్ స్కూలు గుండు గుత్త ధోరణిలో వుంటుంది.
స్ట్రక్చర్ స్కూల్లో స్టెప్ బై స్టెప్ అప్రోచ్ వుంటుంది. ముందు ఐడియా మూల్యాంకన
వుంటుంది. ఈ ఐడియాకి మార్కెట్ యాస్పెక్ట్ వుందా? ఇందులో యూత్
అప్పీల్ ననుసరించి రోమాంటిక్స్ లేదా ఎకనమిక్స్, లేదా రెండూ
ప్లే అవుతున్నాయా? ఇప్పటి యూత్ కి సినిమాల మార్కెట్
యాస్పెక్ట్ ఇదే. ‘హుషారు’ లో ఎకనమిక్స్
చక్కగా ప్లే అయింది. జేబునిండా డబ్బు, చేతినిండా అమ్మాయీ,
వీటికోసం పాట్లు - ఇవే తెర మీద చూడాలని కోరుకుంటారు ఈ కాలం కుర్రకారు. తర్వాత ఐడియాకి స్ట్రక్చర్ వుందా? ఇది పనికొచ్చే
కథేనా, లేక పనికిరాని గాథా? ఇందులో
ప్లాట్ పాయింట్ వన్ కి యూత్ అప్పీల్ వుందా? ...ఇలా స్టెప్ బై
స్టెప్ బేరీజు వేసినప్పుడు ఐడియా దశలోనే సినిమా భవితవ్యం తేలిపోతుంది. సినిమా
మొత్తం తీసి, విడుదల చేసి, అది
ఫ్లాపయ్యాక గానీ తీసింది ఫ్లాప్ కథ అని తెలియకపోవడం అంతా ఏదో సామెత చెప్పినట్టు
వుంటుంది.
―సికిందర్