Q : నాకు కామెడీ
వెబ్ సిరీస్ దర్శకత్వం అవకాశం వచ్చింది. ఇందుకు నేను కామెడీ షుగర్ కోటింగ్ నిస్తూ క్యాంప్
బెల్ ‘హీరోస్ జర్నీ’ ఫాలో అవచ్చా? క్యాంప్ బెల్ స్ట్రక్చర్ యూట్యూబ్ లో వుంది.
వెబ్ సిరీస్ పది ఎపిసోడ్లు వుంటుంది. నిడివి ఐదు నుంచి 10 నిమిషాలు. ప్రతీ ఎపిసోడ్
ముగింపులో ఒక ట్విస్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. అది తర్వాతి ఎపిసోడ్ కి లీడ్
అవుతుంది. ఇలా చివరి ఎపిసోడ్ లో హీరో గోల్ సాధించే వరకూ ట్విస్టులుంటాయి. ఇలా వెబ్
సిరీస్ సీరియల్ కథ ఎపిసోడిక్ విరామాలతో వుంటే ప్రేక్షకులు ఆదరిస్తారా?
―హరీష్, అసిస్టెంట్ డైరెక్టర్
A : కంగ్రాట్స్, ఇలా ముందుకు వెళ్తున్నందుకు. ఐతే వెబ్ సిరీస్ రచన సినిమా రచన ఒకటి కాదు. జోసెఫ్ క్యాంప్ బెల్ స్ట్రక్చర్ అనేది సినిమాల వరకే. అది కూడా ఒకప్పటి సినిమాలకే. గత 30 ఏళ్లుగా హాలీవుడ్ సిడ్ ఫీల్డ్ ని అనుసరిస్తోంది. పురాణాల ఆధారంగా క్యాంప్ బెల్ స్ట్రక్చర్ లో 10 ప్లాట్ పాయింట్స్ వుంటాయి. దీని వల్ల కథ భారంగా, నిదానంగా సాగుతుంది. ఒకప్పటి కళాఖండాలకిది సరిపోయింది. సిడ్ ఫీల్ట్ ఈ ప్లాట్ పాయింట్స్ ని ఐదుకి కుదించి (మూడు ప్లాట్ పాయింట్స్, రెండు పించ్ పాయింట్లు) వేగం పెంచాడు. సిడ్ ఫీల్డ్ ని అనుసరిస్తూ వచ్చిన జేమ్స్ కెమెరాన్ ఇటీవల ‘అలీటా’ కి, క్యాంప్ బెల్ ‘హీరోస్ జర్నీ’ స్ట్రక్చర్ అనుసరిస్తే ఏమైందో తెలిసిందే. ఈ బ్లాగులోనే వివరించాం.
―హరీష్, అసిస్టెంట్ డైరెక్టర్
A : కంగ్రాట్స్, ఇలా ముందుకు వెళ్తున్నందుకు. ఐతే వెబ్ సిరీస్ రచన సినిమా రచన ఒకటి కాదు. జోసెఫ్ క్యాంప్ బెల్ స్ట్రక్చర్ అనేది సినిమాల వరకే. అది కూడా ఒకప్పటి సినిమాలకే. గత 30 ఏళ్లుగా హాలీవుడ్ సిడ్ ఫీల్డ్ ని అనుసరిస్తోంది. పురాణాల ఆధారంగా క్యాంప్ బెల్ స్ట్రక్చర్ లో 10 ప్లాట్ పాయింట్స్ వుంటాయి. దీని వల్ల కథ భారంగా, నిదానంగా సాగుతుంది. ఒకప్పటి కళాఖండాలకిది సరిపోయింది. సిడ్ ఫీల్ట్ ఈ ప్లాట్ పాయింట్స్ ని ఐదుకి కుదించి (మూడు ప్లాట్ పాయింట్స్, రెండు పించ్ పాయింట్లు) వేగం పెంచాడు. సిడ్ ఫీల్డ్ ని అనుసరిస్తూ వచ్చిన జేమ్స్ కెమెరాన్ ఇటీవల ‘అలీటా’ కి, క్యాంప్ బెల్ ‘హీరోస్ జర్నీ’ స్ట్రక్చర్ అనుసరిస్తే ఏమైందో తెలిసిందే. ఈ బ్లాగులోనే వివరించాం.
అలాగని వెబ్ సిరీస్ కి సిడ్ ఫీల్డ్ పారడైం పనికొస్తుందని కాదు. సినిమాకి పనికొచ్చేదేదీ వెబ్ సిరీస్ కి పనికి రాదు. సినిమా కథ బిగినింగ్, మిడిల్, ఎండ్ విభాగాలతో కూడిన త్రీ యాక్ట్స్ లో వుంటుంది. దీన్ని పది ఎపిసోడ్ల వెబ్ సిరీక్ కి వర్తింపజేస్తే, బిగినింగ్ ఓ రెండు ఎపిసోడ్లు, మిడిల్ ఓ ఆరు ఎపిసోడ్లు, ఎండ్ ఓ రెండు ఎపిసోడ్లుగా చేసుకోవాల్సి వస్తుంది. అంటే మొదటి రెండు ఎపిసోడ్లూ బిగినింగ్ బిజినెస్ అయిన పాత్రల పరిచయం, సమస్యకి దారి తీసే పరిస్థితుల కల్పనా చేసి, ముగింపులో ప్లాట్ పాయింట్ వన్ కి తెచ్చి గోల్ ని ఏర్పాటు చేయాలన్న మాట. దీని తర్వాత మిడిల్ ఆరు ఎపిసోడ్స్ లో ఆ గోల్ కోసం సంఘర్షణ చూపించుకొస్తూ, మిడిల్ ఆరవ ఎపిసోడ్ ముగింపులో ప్లాట్ పాయింట్ టూ ఏర్పాటు చేయాలన్న మాట. అప్పుడు చివరి రెండు ఎండ్ ఎపిసోడ్స్ లో వెబ్ సిరీస్ కి ముగింపు నిచ్చుకోవాల్సి వస్తుంది. ఇదంతా సిల్లీగా వుంటుంది.
అంటే
మొదటి రెండు వారాలు పాత్రల పరిచయం,
సమస్యకి దారితీసే పరిస్థితులే చూపిస్తూ కూర్చోవాలి. గోల్ ఏర్పాటు అంటే కథా
ప్రారంభమే కాబట్టి, కథేమిటో రెండో వారంలో గానీ చెప్పలేం. అప్పటి వరకూ
ప్రేక్షకులుంటారా? అలాగే చివరి రెండు వారాలు ముగింపు చూపిస్తూ కూర్చోవాలి. వెబ్ సిరీస్ కి రెండు వారాల పాటు ముగింపు అంటే,
రెండు భాగాల ఎన్టీఆర్ బయోపిక్ లాంటిదే. ఇక మధ్యలో మిడిల్ ఆరు వారాలూ గోల్ కోసం
సంఘర్షణ చూపిస్తూ కూర్చోవడమే. ఒకే గోల్ ని వారాల పాటు చూపిస్తూ కూర్చుంటే బోరు కొట్టక
మానదు. ఎప్పుడో రెండో వారంలో ప్లాట్ పాయింట్ వన్ దగ్గర ఏర్పాటు చేసిన గోల్ ని, ఐదో
వారం కల్లా ప్రేక్షకులు మర్చిపోవచ్చు కూడా. ఆ మిడిల్ సంఘర్షణ చూస్తూ, ఇంతకీ దేని
కోసమబ్బా ఈ సంఘర్షణా అని బుర్ర గోక్కోవాల్సిందే. ఆ పై వారం కట్ చేసి పారేసి, పక్క వెబ్
సిరీస్ కి జంపై పోవడమే. వెబ్ సిరీస్ బిజినెస్ కూడా టీఆర్పీ బిజినెస్సే నని
మరువకూడదు.
గతవారమే ఒక దర్శకుడితో వెబ్ సిరీస్ ప్రస్తావన వచ్చినప్పుడు, స్మార్ట్ ఫోన్ కుర్రాడు వెబ్ సిరీస్ ఎపిసోడ్స్ ని ఐదు నిమిషాలకి మించి చూడడని తేల్చేశారు. స్మార్ట్ ఫోన్ లో ఏదైనా చకచకా అయిపోవాలి, ఎక్కువసేపు చూసే ఏకాగ్రత వుండదన్నారు. టీవీ సీరియల్స్ ప్రేక్షకులు వేరు, వెబ్ సిరీస్ చూసే ప్రేక్షకులు వేరన్నారు. ఇరవై నిమిషాలు - అరగంట నిడివి వెబ్ సిరీస్ ఎపిసోడ్స్ చూడడం కష్టమన్నారు.
ఇదొక అభిప్రాయం. అయితే ఇప్పుడు తీస్తున్న వెబ్ సిరీస్ అరగంట నిడివిగలవే. ఈ నిడివి కారణంగా సహజంగానే వీటి కథన వేగం తక్కువ. మీది పది నిమిషాలలోపే అన్నారు కాబట్టి కథన వేగం ఎక్కువ. మంచి వ్యూస్ స్కోర్ చేయవచ్చు. ఐతే దీని స్ట్రక్చర్ ఎట్లా? పైన చెప్పుకున్నట్టు వారాలకి వారాలు త్రీయాక్ట్స్ లో చూపిస్తూ ప్రేక్షకుల్ని కోల్పోవాలా?
దీనికి PCR మెథడ్ అని వుంది. మీరు స్ట్రక్చర్ స్కూలే కాబట్టి మీకిది నచ్చవచ్చు. వెబ్ సిరీస్ స్ట్రక్చర్ కి PCR మెథడ్ లో ఆలోచించండి. ప్రొఫెసర్ జే మొరార్టీ దీన్ని1970 లలో టీవీ లో కామెడీ సిరీస్ రాస్తున్నప్పుడు రూపొందించాడు. ఈ మెథడ్ లో నేరుగా మొదటి ఎపిసోడ్ ని ప్లాట్ పాయింట్ వన్ తో ప్రారంభించడమే.
ప్లాట్ పాయింట్ వన్ తోనే ప్రారంభం. అంటే నేరుగా సమస్య చూపించేయడం. పాత్రల పరిచయాలు, సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పనా వంటి ఉపోద్ఘాతాలుండవు. పాత్రని నేరుగా సమస్యలో పెట్టి, ఆ పాత్ర లేమిటో వాళ్ళ మాటల్లోనే ఇక్కడే చెప్పేయాలి. హీరో అలసి సొలసి ఆర్ధరాత్రి తూలుతూ ఫ్లాట్ కొచ్చాడనుకుందాం. డోర్ తీసుకుని లోపలికెళ్తే లోపల ఎవడో పడుకుని వుంటాడు. వీడెవడో తెలీదు, ఎలా లోపలి కొచ్చాడో తెలీదు. ఇదీ సమస్య. వెంటనే సమస్యలోకి వెళ్ళిపోవడం. ప్లాట్ పాయింట్ వన్ ని తెచ్చి పడెయ్యడం. . PCR లో P, అంటే Problem వెంటనే ఎస్టాబ్లిష్ అవడం.
ఇప్పుడు ఇద్దరి మధ్య మాటల యుద్ధం. వచ్చిన వాడు ఎవరనేది చెప్పడు. ఈ ఫ్లాట్ తనదేనంటాడు...ఇలా ప్రాబ్లం పెద్దదై పోతుంది. ఇది PCR లో C, అంటే Complication.
చివరికి ఈ మొదటి ఎపిసోడ్ లో హీరోకి ఈ ప్రాబ్లంకి ఒక పరిష్కారం దొరుకుతుంది. దీన్నిగోల్ అనొచ్చు. ఆ పరిష్కారమార్గంతో వచ్చిన వాణ్ణి చిత్తు చేసే గోల్ తో పైచేయి సాధిస్తాడు. PCR లో ఇది R, అంటే Resolution. ఇప్పుడు PCR = Problem + Complication + Resolution, దట్సాల్.
మరి ఎపిసోడ్ చివర ట్విస్ట్? ఆ వచ్చిన వాడు చిత్తవడం ట్విస్టు అవదు. ఆ చిత్తయ్యాక, అంటే Resolution పూర్తయ్యాక, రివర్స్ లో ఇంకోటి జరిగి ఇంకో ప్రాబ్లం అక్కడే పుట్టడమే ట్విస్టు. రెండో ఎపిసోడ్ కి మీరన్నట్టు లీడ్. సినిమాలో హీరో చంపేస్తే విలన్ చచ్చిపోవడం ఎండ్. కానీ చచ్చిన వాడు లేచి కూర్చుంటే ట్విస్ట్. వెబ్ సిరీస్ లో చచ్చిందనుకున్న ప్రాబ్లం లేచి కూర్చుంటుంది.
ఈ ట్విస్టు ఎపిసోడ్ ముగింపు. హీరో ప్రాబ్లం సాల్వ్ చేశాననుకుంటే అది కాస్తా ఇంకో ప్రాబ్లంగా తిరగబెట్టడం ట్విస్ట్. ఈ ట్విస్టు తర్వాతి ఎపిసోడ్ కి ప్రారంభం. అంటే P. దీంతో C, దీనికి R. ఈ R కి మళ్ళీ ట్విస్టుతో ఎపిసోడ్ ఎండ్. మళ్ళీ తర్వాతి ఎపిసోడ్ కి ఈ ట్విస్టు P... ఇలా రిపీటవుతూనే వుంటుంది చైన్ రియాక్షన్ లా చివరి ఎపిసోడ్ వరకూ.
PCR తో లాభాలేమిటంటే, మొదటి ఎపిసోడ్ లోనే కథేమిటో తెలిసిపోతుంది. ఇక ప్రేక్షకులు పారిపోరు. అంతే కాదు, ప్రాబ్లం ఏమిటో, గోల్ ఏమిటో కూడా తెలిసిపోతాయి. ఇక ప్రతీ ఎపిసోడ్ కి ఒక కొత్త ప్రాబ్లం, ఆ ప్రాబ్లంతో ఫ్రెష్ గా కొత్త గోల్... ప్రాబ్లం మారుతూంటే గోల్ ఫ్రెషప్ అవుతూనే వుంటుంది ప్రతీ ఎపిసోడ్ కీ. త్రీ యాక్ట్ లోలాగా ఒకే గోల్ ని చివరి దాకా ఈడ్చుకుపోవడనే సమస్య వుండదు. ఇక ప్రేక్షకులు మర్చిపోయే సమస్యా వుండదు. ‘టీఆర్పీ’ ని కోల్పోయే ప్రమాదమూ వుండదు. మొదటి ఎపిసోడ్ లో చూపించే గోల్ మాస్టర్ గోల్ అవుతుంది. అంటే వచ్చిన వాణ్ణి ఫ్లాట్ లోంచి వెళ్ళ గొట్టడం మాస్టర్ గోల్. ఈ మాస్టర్ గోల్ కి తర్వాతి ఎనిమిది ఎపిసోడ్స్ లో పుట్టే ఒక్కో ప్రాబ్లం ని సాల్వ్ చేసేందుకు అక్కడికక్కడే పుట్టేవి మినీ గోల్స్. చివరి ఎపిసోడ్ లో మాత్రం మాస్టర్ గోల్ కే రిజల్ట్ చెప్పాలి. హీరో వాణ్ణి ఫ్లాట్ లోంచి వెళ్ళగొట్టాడా లేదా?
సినిమా కథకే ఒకే సమస్య, దాన్ని సాధించే ఒకే గోల్, ఆ గోల్ కి, లేదా సమస్యకి ఒకే ముగింపూ వుంటాయి. పైన చెప్పుకున్న ఎపిసోడిక్ కథనాలతో గోల్స్ మారిపోతూంటే అది సినిమాలా వుండదు. విడివిడి సమస్యలు చూపిస్తున్న డాక్యుమెంటరీలా వుంటుంది. ఇందుకే టైగర్ హరిశ్చంద్ర, ఆటోనగర్ సూర్య లాంటివి ఇలాటి కథనాలు చేసి ఫ్లాపయ్యాయి. విచిత్రమేమిటంటే క్యాంప్ బెల్ ని చదువుకుని ‘ప్రస్థానం’ తీసిన దర్శకుడు దేవకట్టా, ‘ఆటోనగర్ సూర్య’కి సినిమా మాధ్యమానికి వ్యతిరేకమైన ఎపిసోడిక్ కథనం చేయడం!
చివర్న మీరడిగింది - ఎపిసోడిక్ విరామాలతో వుంటే ప్రేక్షకులు ఆదరిస్తారా? – అంటే ఎపిసోడిక్ విరామాలెక్కడున్నాయి? ప్రతీ ఎపిసోడ్ ముగింపూ ఇంకో ఎపిసోడ్ కి ప్రారంభమే కదా?
ఇక ఒక్కో ఎపిసోడ్ క్లిక్ అవాలంటే చివర ట్విస్టు అవసరమే. ఐతే ప్రతీ ఎపిసోడుకిచ్చే ట్విస్టు, వెనక ఎపిసోడ్ కి మించిన స్థాయిలో వుండాలి. పది ఎపిసోడ్లుంటే పది మెట్లు ఒక్కో తీవ్రతతో ఎక్కుతూ పైపైకి పోతూండాలి ట్విస్టులు - ఒకదాన్ని మించొకటి. అప్పుడే వెబ్ సిరీస్ నిలబడుతుంది. ఈ ట్విస్టుల్ని క్లిఫ్ హేంగర్ మూమెంట్స్ అంటారు. ఈ మూమెంట్స్ ని ఎప్పుడూ సాగదీయకూడదు. సాగదీస్తే వీగిపోతుంది. సడెన్ జర్క్ ఇచ్చి ముగించెయ్యాలి.
క్లిఫ్ హేంగర్ మూమెంట్స్ కథల్లో, నవలల్లో ఎక్కువుంటాయి. ముగింపు ట్విస్టులకి మాస్టర్ రైటర్ ఓ హెన్రీ కథలు చదువుకోవచ్చు. వాటిలోంచి మీ ఎపిసోడ్స్ కి భిన్నమైన ఐడియాలు రావచ్చు. అలాగే కొన్ని నవలల్లోంచి తీసిన 12 రకాల ట్విస్టులున్నాయి. ఈ లింక్ క్లిక్ చేసి స్టడీ చేయండి. ఏదీ చదవకుండా, చూడకుండా సొంత ఆలోచనలతో కథలు ఎప్పుడూ రాయకూడదు. ఎందరెందరో పోటీ పడుతున్న మీడియాలో నిలదొక్కుకోవాలన్నా, ముందుండాలన్నా చేస్తున్న కథలకి అవసరమైన రీసెర్చి చేసి కొత్తకొత్త ఆలోచనలు చేయాల్సిందే. ఇకపోతే, పదినిమిషాల లోపు వెబ్ సిరీస్ ఎపిసోడ్ శాంపిల్ వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇక మీ ఎపిసోడ్స్ కథ గురించి ఇక్కడ చర్చిండం బాగోదు. ఫోన్ చేయండి. స్ట్రక్చర్ గురించి చాలావరకూ మీకు ఫోన్లోనే వివరించాం మెసెంజర్ లో మీ ప్రశ్న చూసి. అయినా నల్గురికీ ఉపయోగపడుతుందని బ్లాగులో రాయమంటే రాశాం.
―సికిందర్