రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Friday, July 7, 2017

రివ్యూ!



రచన- ర్శత్వం: శివ నిర్వాణ

తారాగణం: నాని, నివేదా థామస్, ఆది పినిశెట్టి, మురళీశర్మ, పృథ్వి, తనికెళ్ళ భరణి 

స్క్రీన్ప్లే, మాటలు: కోన వెంకట్, సంగీతం: గోపీ సుందర్, ఛాయాగ్రహణం :  కార్తీక్ఘట్టమనేని

బ్యానర్ : డి.వి.వి. ఎంటర్టైన్మెంట్స్‌ 
నిర్మాత‌: దానయ్య డి.వి.వి
విడుదల : జులై 7, 2017
***
      ‘
జ్నూ’ అనే ముక్కోణ ప్రేమ కథతో చేదు అనుభవమైన తర్వాత నాని, మళ్ళీ ‘నిన్ను కోరి’  ముక్కోణం తోనే సిద్ధమయ్యాడు. కొత్త దర్శకుడు శివ నిర్వాణ ఈ తొలి ప్రయత్నానికి ప్రేమ కథే క్షేమదాయకమని అందరు కొత్త దర్శకులకి లాగే  అనుకున్నాడు. సింగిల్ విండో స్కీములతో షైనింగ్ తగ్గిన కోన వెంకట్ కి సింగిల్ గా ఈ ప్రేమ కథ రాసే అవకాశం లభించింది. నిర్మాత డివివి దానయ్యకి వీళ్ళందరితో ఒక పండగ  వాతావరణం కన్పించింది. ఇప్పుడిది ప్రేక్షకులకి ఎంత పండగయ్యిందో ఓ సారి చూద్దాం.

కథ 
    వైజాగ్ లోఉమ (నాని) గణాంకశాస్త్రంలో  పిహెచ్ డీ చేస్తూంటాడు. సరదాగా వూర డాన్సులు చేస్తూంటాడు. డాన్సు నేర్చుకోవాలనే పల్లవి (నివేదా థామస్) పరిచయమవుతుంది. ఒక వెంట పడుతున్న ‘విజయవాడ  మనోహర్’ లాంటి వాడి పీడా ఆమెకి వదిలించే క్రమంలో ఆమెకి ధైర్యమంటే ఏమిటో నేర్పుతాడు. ఇది నచ్చి ప్రేమిస్తున్నానంటుంది. సెలవులకి  హాస్టల్ ఖాళీ చేయాల్సి వచ్చి ఉమా పల్లవి వాళ్ళ పోర్షన్ లో దిగుతాడు. ఇక్కడ పల్లవి తల్లి దండ్రులు ఆమెకి పెళ్లి చేసేయాలని నిర్ణయిస్తారు. అదే సమయంలో ఉమకి ఢిల్లీలో పీ హెచ్ డీ  చేసే అవకాశం వచ్చి వెళ్ళిపోతాడు. అరుణ్ (ఆది) తో పల్లవి పెళ్ళయి పోతుంది. ఇది తెలిసి  ఉమా దిగులు పెట్టుకుంటాడు. ఇష్టం లేని పెళ్లి చేసుకున్న పల్లవి ఎంత దుఃఖ పడుతోందో నని. అరుణ్ తో పల్లవి అమెరికాలో సెటిలవుతుంది. అక్కడే ఉమా వున్నాడని తెలుసుకుని వెళ్లి కలుస్తుంది. తను సంతోషం గానే వున్నానంటుంది. నమ్మకపోతే పది రోజులు  తనతో వుండి చూడమంటుంది. సంతోషంగా లేవని తేలితే తనతో వచ్చేయాలని అంటాడు. సంతోషంగా వున్నానన్పిస్తే నువ్వు మారాలంటుంది. సరే నంటాడు. 

          ఇదీ విషయం. ఈ ఒప్పందంతో ఉమా పల్లవి ఇంట్లోకి ప్రవేశించాక  ఏం  జరిగిందన్నది మిగతా కథ. 

ఎలావుంది కథ 
      రొటీన్ గా ముక్కోణమే అయినా, ఇందులో హీరో హీరోయిన్లు చేసుకునే  ఒప్పందంతో  కొత్తగా అన్పించి ఆసక్తి రేపుతుంది. కానీ  ఈ ఒప్పందం ప్రకారం కథ  నడవక తద్విరుద్ధంగా ఎటెటో వెళ్ళడంతో-  మళ్ళీ అదే మూడు పాత్రల  మధ్య ప్రేమ కోసం  ప్రాకులాటల కొచ్చి తేలుతుంది. ఎప్పట్లాగే కేవలం ‘మనసులకి సంబంధించిన’ అదే మూస  ప్రేమ కథ ఇది. నేటి పోటీ యుగంలో  ప్రేమల్లో- పెళ్ళయ్యాకా యువత ఎదుర్కొంటున్న కొత్త సమాజికార్ధిక సమస్యల జోలికి ఇకనైనా పోదల్చుకోని రొటీన్ ఇది. ఈ కథకి ముగింపుని కూడా అభ్యుదయంగా చూపలేని రాజీ ధోరణితో వుంది. ఈ అన్ని కారణాల వల్ల ఇది కథా లక్షణాలతో కాకుండా,  గాథకి సరిపోయే లక్షణాలతో వుంది. 

ఎవరెలా చేశారు 
      ‘నేను లోకల్’ నాని  కాకుండా ఇక్కడ ‘నేను నాన్ లోకల్’ నానీ కన్పిస్తాడు. నేచురల్ స్టార్ గా ‘నేను లోకల్’ లో లాగా అన్నేచురల్ కాకుండా నేచురల్ పాత్రనే  నటించినా,  పాత్ర నటించడానికి కథలో అన్నీ బలహీన కారణాలే వున్నాయి. అందుకని  ఇది ఏమీ చేయని పాసివ్ పాత్రగానే వుండిపోయింది. పాసివ్ పాత్ర అంటే ఏమిటో ఇంకా అర్ధంగాక పోవడంవల్ల మళ్ళీ మళ్ళీ ఇవే పోషిస్తున్నారు హీరోలు. వాళ్లకి ప్రణామాలు. ఇందులో చివర్లో నాని మాస్టర్ స్ట్రోకు డైలాగు- జీవితం మనకెన్నో ఛాన్సులిస్తుంది, దానికి మనం ఒక్క ఛాన్సు ఇద్దాం – అనే దాన్ని యాక్టివ్ పాత్రలకి అన్వయించి ఒక్క ఛాన్స్ ఇస్తే, ఇలాటి సినిమాలని నాని ఎక్కడికో తీసికెళ్ళి పోగలడు. పాత్ర చిత్రణ చూడక నాని మ్యానరిజమ్స్ ని, డైలాగ్స్ నీ చూసి ఎంజాయ్ చేసే ప్రేక్షకులకి ఇది కనువిందు. 

          ఈ సినిమా సల్మాన్ - ఐశ్వర్య- అజయ్ ల ‘హమ్ దిల్ దే చుకే సనమ్’ సంజయ్ లీలా భన్సాలీ అపూర్వ కానుకకి  నకలు అని తెలిసిపోతుందని  పాత్రలచేతే ఈ సినిమాని ప్రస్తావన చేశారు. అయితే నానీ సల్మాన్ ఖాన్, ఆదీ అజయ్ దేవగణ్ లు సంజయ్ లీలా గ్రిప్ లోంచి తప్పించుకుని, కేవలం నివేదా ఐశ్వర్యా రాయ్ మాత్రమే భన్సాలీకి చిక్కి చక్కగా నటించింది. ఆమె పాత్ర సంఘర్షణాత్మకం. పాత్రకి మూలాల్లేవనేది తర్వాతి సంగతి. మూలాల్ని నమ్మిస్తూ నటించింది. 

          ఆది పినిశెట్టి ముగింపుకి ముందు వరకూ ఈ సినిమాలో ఎందుకున్నాడూ అన్నట్టుంటాడు. అలా ఉండేందుకు చివర్లో ఎండ్ సస్పెన్స్ విప్పుతాడు. కానీ హీరో హీరోయిన్లు చేసుకున్న ఒప్పందం ప్రకారమే కథ నడిచి వుంటే, వాళ్ళతో ఇంటరెస్టింగ్ గేమ్ ఆడుకునే అవకాశముండేది. అప్పుడు వాళ్ళ మధ్య  ఎందుకున్నాడో బలహీన కారణాలు చెప్పుకునే అవస్థ తప్పేది.

          సహాయ పాత్రలు మురళీశర్మ, పృథ్వీలు సున్నిత హాస్యంతో నవ్విస్తే, తనికెళ్ళ భరణి క్లాసులు పీకే పాత్రలో కూడా నవ్విస్తారు. కోన వెంకట్ పెద్దగా కథా లక్షణాలు పట్టించుకోకుండా గాథ రాసేసి, స్క్రీన్ ప్లే చేసి- (గాథకి స్క్రీన్ ప్లే ఏముంటుంది), తన బ్రాండ్ మాటలు కాకుండా సెన్సిబుల్ డైలాగులు, కామెడీ రాశారు.  గోపీ సుందర్ సంగీతంలో ‘అడిగా అడిగా’ ఒక్కటే క్యాచీగా కుదిరింది. పాటల ప్లేస్ మెంట్ ఇంకా కుదరాలి. చివరి పాట నాని ఇంకా పూర్తి చెయ్యని ఎక్స్ ప్రెషన్ మీద అకస్మాత్తుగా ప్రారంభమైపోతుంది. కార్తీక్ ఘట్టమనేని ఛాయాగ్రహణం చాలా ఉన్నత ప్రమాణాలతో వుంది. అయితే ఇలాటి కమర్షియల్ కథలకి కెమెరా వర్క్ దృష్టి నాకర్షించే మూవ్ మెంట్స్ తోనే  వుంటుంది తప్ప, కథగా ఏం చెప్పదు. నాని హీరోయిన్ ఇంటికి వెళ్ళినప్పుడు తలుపు తీసే  హీరోయిన్, ఆ తర్వాత ఆమె వెనుక వచ్చే భర్తల ట్రాకింగ్ షాట్  ఎందుకో అర్ధం కాదు. ట్రాకింగ్ షాట్  ఆ వచ్చిన నానీ మీద వుండి, తలుపు తీసిన వాళ్ళ మీద స్టాటిక్ షాట్  వుంటే, వాళ్ళ ఎక్స్ ప్రెషన్స్ హైలైట్ అయి, ప్రేక్షకుల్ని కథలోకి లాక్కెళ్తుంది కదా?

          కొత్త దర్శకుడు శివ నిర్వాణ కొత్త కథతో రాకపోయినా, ఉన్న కథని ఇంకా ఉన్నతంగా తీర్చి దిద్దే అవకాశముంది. కానీ సేఫ్ గేమ్ ఆడేందుకే సిద్దపడ్డంతో ఓ మోస్తరు ప్రయత్నంగా మాత్రమే మిగిలింది. 


చివరికేమిటి 
       ‘హమ్  దిల్ దే చుకే  సనమ్’ లో ఐశ్వర్య సల్మాన్ ని ప్రేమించి అజయ్ ని పెళ్లి చేసుకుని బాధ పడుతూంటుంది. ఇది గమనించిన అజయ్ ఆమెని సల్మాన్ తో కలిపేసే ప్రయత్నాలు ప్రారంభిస్తాడు. ఈ కథలో అజయ్ - ఐశ్వర్యలకి శోభనం కాదు. కాబట్టి ఐశ్వర్య ఇప్పుడు సల్మాన్ ని  చేసుకుంటే భారత ప్రేక్షకుల మనోభావాలు దెబ్బతినిపోవు (సినిమాలకి ఈ మనోభావాలొకటి స్వేచ్ఛ లేకుండా చేస్తున్నాయి). ‘నిన్ను కోరి’ లో ఏడాది కాపురం చేసిన హీరోయిన్ కేంద్రంగా విషయం మార్చారు. ఈ మార్చడం వల్ల ముగింపులో మళ్ళీ ఇండియన్ సెంటి మెంట్లే అడ్డు పడి- పాత్రలు రాజీపడి, యథాపూర్వ స్థితినే స్థాపించి హతోస్మి అన్పించాయి.  అంటే పెళ్ళయిన హీరోయిన్ పెళ్ళయిన హీరోయిన్ లాగే వుండిపోయింది, ఆమెని ప్రేమించిన హీరో తిరుగు ముఖం పట్టాడు.

          పైన చెప్పుకున్న హిందీని ‘ఏడాది కాపురం తర్వాత’ గా మార్చడంతో, అలాగే హీరో హీరోయిన్ల ఒప్పందం మేరకు కథ నడపకపోవడంతో ఏదో సినిమా  చూశాం, నవ్వుకుని ఎంజాయ్ చేశాం అన్నట్టు తయారయ్యింది. 


          ప్రతీదీ బలహీన కారణాలని ఆధారం చేసుకునే నడిపారు. ఫస్టాఫ్ కొంత మేర వైజాగ్ లో ఫ్లాష్ బ్యాక్ రూపం లో నడుస్తుంది. ఇందులో హీరో హీరోయిన్ల  పరిచయాలు ప్రేమలూ వుంటాయి. ఈ క్రమంలో హీరోయిన్ కి ఓ సంఘటనలో ధైర్యాన్ని నేర్పుతాడు హీరో. ఈ సంఘటనకి హీరో క్రియేట్ చేసే నేపధ్య దృశ్యానికి లాజిక్ వుండదు. బెడిసి కొడితే హీరోయిన్ ముందు తనే ఫ్లాప్ అవుతాడు. అయితే ఇలా ధైర్యం నేర్చుకున్న హీరోయిన్ తన జీవితంలో నిర్ణయం తీసుకునే ప్రతీ చోటా పిరికిపంద గానే తలొంచుతూంటుంది. ఇంట్లో వేరే పెళ్లి చేస్తూంటే హీరోని ప్రేమిస్తున్నానని కూడా చెప్పుకోలేదు. చెప్పి, హీరో చదువు పూర్తయ్యే వరకూ టైం అడిగే ప్రయత్నం చేయవచ్చు. హీరోకూడా ముందుకొచ్చి చెప్పవచ్చు. ఇదేమీ చెయ్యరు. వేరే పెళ్ళయి పోతుంది.  ఇంత  బలహీన పునాది మీద ఇక్కడ్నించీ విషయం నడపడంతో ముగింపు కూడా హీరోయిన్ బేలతనంతోనే ముగుస్తుంది. 


          అసలు హీరోహీరోయిన్ల ఒప్పందంతో ఇంటర్వెల్ నుంచీ ప్రారంభమయ్యే కథ ప్రేమ గోలగా ఎందుకు మారుతుంది? భర్తతో కాపురం చేస్తూ ఆమె సంతోషంగా వుంటే చూసి తను మారేట్టు, లేకపోతే ఆమె తనతో వచ్చేసేట్టు ఒప్పందం చేసుకున్నాక -నీ సుఖమే నే కోరుకున్నా టైపు హీరో- ప్రేమ గోల గోక్కోవడమేమిటి?


          కాబట్టి ఈ నానీ రోమాంటిక్స్ ని అలా పైపైన చూసేసి వచ్చేస్తే సరిపోతుంది. ఫ్లాష్ బ్యాక్ వైజాగ్ లో తీసి మిగిలిదంతా యూఎస్ లో అందమైన లొకేషన్స్ లో కనువిందుగా తీశారు.  డబ్బు ఖర్చు పెట్టడంలో నిర్మాత దానయ్య తన బాధ్యతని  తాను ధారాళంగా నిర్వర్తించారు.



-సికిందర్
cinemabazar.in