రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Tuesday, July 4, 2017

డార్క్ మూవీస్ స్క్రీన్ ప్లే సంగతులు -4




    సినిమాల్ని కేవలం వినోదించడానికే ‘చూస్తాం’, కాబట్టి ‘చదవం’. సినిమాల్ని కేవలం ‘చూస్తున్నప్పుడు’  చాలా ఆణిముత్యాలు చేజారిపోతాయి. సినిమాల్లోని మంచో చెడో పూర్తిగా అనుభవం కాకుండా అరకొర ఫేక్  ‘వినోదం’ తో సంతృప్తి పడిపోతాం. సినిమాల్ని ‘చదువుతూ చూసినప్పుడు’ చాలా ఆణిముత్యాలు దొరుకుతాయి మంచో చెడో. అవి పూర్తి ఆనందాన్నిస్తాయి. మంచికి  ఎలాగూ ఆనందమే, చెడుకి  లోపం పట్టుకున్నామన్నఆనందం. మంచి కనిపిస్తే మనసుకి ఆనందం, చెడు కన్పిస్తే బుద్ధికి ఆనందం. అప్పుడే పరిపూర్ణ ఆనందం. బుద్ధిని ఇంట్లో వదిలి వచ్చి మనసుతో సినిమాలు చూస్తూంటే, ఇంటి  దగ్గరున్న బుద్ధి-  ఒరేయ్ మధ్యాహ్నం నువ్వు కేబుల్ వాడికి డబ్బులు కడతానన్నావ్, ఎక్కడి కెళ్లావ్ రా?... ఒరేయ్ బైక్ వాషింగ్ చేయించడం ఎగ్గొట్టి సినిమా కేసు కెళ్తావా?... ఒరేయ్ వీధి కుక్కలు వెంటాడితే ఈ నైట్ కూడా బైక్ స్పీడు లాగించి చావకు రొరేయ్  ....అని రకరకాల స్క్రోలింగ్స్ ఇస్తూ సినిమాని సరీగ్గా చూడనివ్వదు. అదే బుద్ధిని కూడా సినిమాకి లాక్కొస్తే అది మనసుతో బాటు కూర్చుని బుద్ధిగా సినిమా ఒకటే చూస్తుంది. అప్పుడు పరిపూర్ణ ఆనందం అనుభవం లోకొస్తుంది. ఈ క్షణంలో జీవించు అనే కదా సూక్తి?  జీవించడమంటే మెదడూ మనసూ ఒకటి చేసుకుని అనుభవాల్ని ద్విగుణీకృతం చేసుకోవడమే.      
   
          
సినిమాని చదవడమంటే ఏమిటి? ఉదాహరణకి క్రిందటి వ్యాసంలో చెప్పుకున్న ‘బ్లడ్ సింపుల్’ ఆరవ సీను పెంపుడు కుక్క ఇంట్లోకి రావడంతో ప్రారంభమవుతుంది, హీరోయిన్ ఇంట్లోంచి వెళ్లిపోవడంతో ముగుస్తుంది. ఈ ప్రారంభ ముగింపులు ఎంత అర్ధాన్నిస్తున్నాయి! విశ్వాసం గల కుక్క ఇంట్లోకొస్తూంటే, విశ్వాసం లేని భార్య (హీరోయిన్) ఇంట్లోంచి ప్రియుడితో వెళ్ళిపోతోంది... ఎంత కదిలించే, పోయెటిక్  ప్రారంభ ముగింపులు! ఇదెప్పుడు అర్ధమవుతుంది? వెండి తెర మీద దీన్ని  చూడడమే గాక, చదివి నప్పుడు కూడా. 

          అలాగే ఇదే సీనులో హీరోయిన్ రివాల్వర్ కోసం చాలా హేండ్ బ్యాగులు వెతుకుతుంది. ఎందుకు అన్ని బ్యాగులు వెతకాలి. ఓ రెండు బ్యాగులు, ఆ తర్వాత పెట్టెలు, సొరుగులూ వెతికినట్టు చూపించ వచ్చుగా? అలా చూపిస్తే అది సినిమా జ్ఞానం అన్పించుకుంటుందా? సినిమా జ్ఞానం లెక్కలు వేరే వుంటాయి.  ఏది చూపించినా అది పాత్రకో కథనానికో ఉపయోగపడాలి. ఒక సీను మూల సూత్రమేమిటి? పాత్ర గురించి సమాచార మివ్వడమో, లేదా కథని ముందుకి నడిపించడమో కదా? లేదూ ఈ రెండూ చేయడం కూడా కదా? అప్పుడు ఈ సీనులో హీరోయిన్ క్యారక్టర్ గురించి చెప్పాల్సింది ఏదైనా మిగిలుంటే అది చెప్పడానికే ప్రాధాన్యమిచ్చారు ఇక్కడ కోయెన్ బ్రదర్స్.

          బోలెడు హేండ్ బ్యాగులు పడేసి, అవే వెతుకుతున్నట్టు చూపిస్తే, అన్నేసి బ్యాగుల్ని చూస్తున్న మనకి, ఆమె బాహ్య చర్యలకి ( వివాహేతర సంబంధం పెట్టుకోవడం), లోపలి మనస్తత్వం తెలుస్తోంది. సైకలాజికల్ గా ఈ హేండ్ బ్యాగుల అబ్సెషన్ ని బట్టే  తను ఇంటిపట్టున వుండే మనిషి కాదని చెప్పకనే చెప్తోంది...

          ఇది ముందే చూపించకుండా ఇప్పుడెందుకు చూపిస్తున్నారు దర్శకులు? అసలు మూడో సీనులో మోటెల్ లో ప్రియుడితో ఈమె ఫలానా ఈ రకమని చూపించేశాక, ఇంకా ఈమె అంతరంగాన్ని ఫిజికల్ గా ఎస్టాబ్లిష్ చేయడం అవసరమా? చేస్తేనే ఈమె పాల్పడుతున్న చర్యల్ని పక్కాగా నమ్మగలం. మానసిక స్థితే  భౌతిక స్థితికి సర్టిఫికేట్ ఇస్తుంది. ఇక ఇదిప్పుడే ఎందుకు వెల్లడి చేయాలంటే,  ఇప్పుడు ఫైనల్ గా ఇల్లు వదిలి వెళ్ళిపోతోంది గనుక. ఇల్లువదిలే ఘట్టంలోనే స్వాభావికంగా ఆమె ఎలాటి మనిషో వెల్లడించడం సీనుకి చైతన్యం తెచ్చే డైనమిక్స్.

          2000 లో జేమ్స్ మొనాకో ‘హౌ టు రీడ్ ఏ ఫిలిం’ అని గొప్ప గ్రంథం రాశాడు. దీని పీడీఎఫ్ ఫ్రీ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. సినిమాల్ని చదివే (స్క్రిప్టులు కాదు, స్క్రీన్ మీద) పధ్ధతి తెలుస్తుంది.
***

ఆర్డర్ లో సీన్ 7 లోకి వెళ్తే, రే బార్ కెళ్ళి జీతం డబ్బులు అడిగి మార్టీ ని రెచ్చ గొట్టడం.
      ఈ సీను ప్రారంభం  స్క్రిప్టు కీ, చిత్రీకరణకీ తేడా వుంది. స్క్రిప్టులో రే నేరుగా బార్ లోకి వచ్చి బార్ టెండర్ మారీస్ ని కలిసినట్టు  రాశారు. చిత్రీకరణలో మారీస్ ఫ్రెండ్ దెబ్రాతో మళ్ళీ అదే అగ్నిపర్వతాల  గురించి మాట్లాడుతూంటే, రే వస్తాడు. చిత్రీకరణలో చేసిన ఈ మార్పు మంచి డైనమిక్సే. బద్ధలవబోయే అగ్నిపర్వతంలా వున్న మార్టీ దగ్గరకి రిస్కు చేసి రే వచ్చిన అర్ధంలో వుంది. వెనక సీనులో బార్ కి వెళ్లనని  ఎబ్బీ కి చెప్పాడు. బార్ కే  వచ్చాడు. ఇప్పుడు మారీస్ తో మాట్లడుతోంటే,  బ్యాక్ గ్రౌండ్ లో ఒక లోగో కన్పిస్తూంటుంది. అది మార్టీ హంటర్ షూ లోగో. అంటే బూటు కాలితో కిక్ ఇవ్వబోతున్నాడా  మార్టీ ఇప్పుడు రేకి ? ఇలా ఒక ప్రశ్న రేకెత్తిస్తూ సీను ప్రారంభిస్తున్నారు కోయెన్ బ్రదర్స్. 

          కొంత సంభాషణ జరిగాక, మార్టీ వున్నాడా-  అని మారీస్ ని అడుగుతాడు.  లేడు - నిన్నకూడా లేడు , వెనక ఆఫీసులో అసలే లేడు - అని చెప్పేస్తూంటాడు మారీస్. రే థాంక్స్ చెప్పి వెళ్లిపోతూంటే,  ఎందుకు థాంక్స్? అంటాడు మారీస్ అర్ధంగాక. తను చెప్పిందాంట్లోనే సమాధానం వుందని తెలీదు- వెనక ఆఫీసులో అసలే లేడంటే ఏమనుకోవాలి? 

          ఇప్పుడు బార్ బ్యాక్ సైడ్ ఓపెన్ చేస్తే, తెరచి వున్న బ్యాక్  ఆఫీసు ‘డోర్ ఫ్రేం’ బ్యాక్ డ్రాప్ లో కూర్చుని మార్టీ, ఆఫ్ స్క్రీన్ లో తదేకంగా దేన్నో చూస్తూంటాడని రాశారు. ఇక్కడ ‘డోర్ ఫ్రేం’ అనే నోయర్ ఎలిమెంట్ ని వాడారు. డోర్ ఫ్రేం నేపధ్యంలో పాత్రని చూపించడమంటే పాత్ర బందీ అయినట్టు చెప్పడం. 

          అతను అటు ఏం చూస్తున్నాడో అతడి పాయింటాఫ్ వ్యూలో ఓపెన్ అవుతుందని రాశారు- అటు దూరంగా భగభగ మండుతున్న ఫర్నేస్ లో ఇద్దరు మనుషులు గార్బేజ్ ని వేస్తూంటారు. ఇది మార్టీ గుండె మంటకి ప్రతీక కాదు, అగ్నిపర్వతానికి సింబాలిజం కూడా కాదు. ఎందుకంటే ఆ ఫర్నేస్ లో గార్బేజ్ (చెత్త)  వేసి కాల్చేస్తున్నారు.  మనం ఒకటి అనుకుంటే చాలా నేర్పుగా పాత్రకి అవసరమైన, కథకి అవసరమైన కొత్త డెవలప్ మెంట్ ని దృష్టికి తెస్తున్నారు కోయెన్ బ్రదర్స్. అవును, ఇప్పుడు ఇది చెప్పడమే అవసరం. ఎటూ తేల్చుకోలేక అస్థిమితంగా వున్నట్టు గతంలో చూపించిన మార్టీని ఇప్పుడు ఒక కొలిక్కి తెస్తున్నారు ఇంకా నాన్చకుండా. మన తెలుగు ప్రేమ సినిమాల్లో మనసులో మాట చెప్పలేక హీరోనో, హీరోయినో సినిమా చివరిదాకా ప్రేక్షకుల్ని ఏడ్పించినట్టు గాక- మార్టీ సమస్యని కొలిక్కి తెచ్చి, కథ ముందుకు సాగడానికి ఈ సీనులో ఏర్పాటు చేశారు కోయెన్ బ్రదర్స్. 

        అతను డిసైడ్  అయిపోయాడు. మనసులోని చెత్తంతా ఊడ్చేసి కొలిమిలో కాల్చేస్తున్నాడు!  భార్యతో  ఇక రాంరాం. అదీ అర్ధం! 

          ఈ క్యారక్టర్ మన్నుతిన్న పాములా పడి లేదు. కథ ముందుకు సాగడానికి క్యారక్టర్ డెవలప్ మెంట్ (ఆర్క్) ని కనబరుస్తోంది. మనసులో చెత్త కాల్చేస్తున్నాక ఇప్పుడేమిటి? –అని తదుపరి విషయాన్ని కదుపుతోంది. మనసుంటే ఒక్క సీనులో చెప్పకనే చాలా విషయాలు చెప్పవచ్చు. బోరు కొట్టించకుండా కథ ముందుకు వెళ్తోందనే ఆశాభావాన్ని కల్పించవచ్చు. భార్య గురించి మార్టీ ఫైనల్ వెర్షన్ ఇప్పుడతని మాటల్లోనే తెలుసుకోవచ్చు...

          ఇప్పుడు మార్టీ వెనక డోర్ లోంచి రే వస్తూంటాడని రాశారు. ఆ వస్తున్నప్పుడు అతణ్ణి చూపించడం నడుం వరకే చూపించారు. ఆ డోర్ ఫ్రేం లోనే మార్టీ తో సీను ఓపెన్ చేశాక, ఇప్పుడు అదే  డోర్ ఫ్రేం లోంచి రే వస్తున్నట్టు రాశారు. ఇద్దరూ ఒక చక్రబంధంలో ఇరుక్కుంటున్న మనుషులే నన్నమాట. అదెలా? - అన్న ప్రశ్నతో సస్పెన్స్ ని రేకెత్తిస్తున్నారు ఈ తరహా రైటింగ్ తో,  చిత్రీకరణతో. 

          వస్తూనే - మార్టీ? - అంటాడు రే. మోటెల్ లో ఎబ్బీతో వున్నప్పుడు మార్టీ ఫోన్ చేసినప్పుడే అతడికి తెలిసిపోయిందని తెలిసీ రే ఇలా రావడం, పైగా ఎబ్బీని తన ఇంటికి తీసికెళ్ళి పోయే తీవ్ర నిర్ణయం తీసుకునీ రావడం, అదీ జీతం డబ్బుల కోసం – చాలా సిగ్గులేని తనం. ఇలాగే వుంటాయి  నోయర్ పాత్రలు. తాము చేస్తున్నవి నార్మల్ అనుకుంటాయి. 

          మార్టీ ముందుకొచ్చి-  ఓకే,  ఏంటి? – అంటాడు రే. ఏంటి ఏంటి? – అంటాడు  మార్టీ. పీకేశావా నన్ను? కక్ష తీర్చుకుంటున్నావా?- అని రే అంటే, నిజంగా నీతో మాట్లాడాలని లేదు నాకు- అంటాడు మార్టీ. ఓకే, నువ్వు నన్ను పీకేయ్యకపోతే నేనే పని మానుకుని వెళ్లి పోతానంటాడు రే. ఫైన్, నీకు నచ్చింది చెయ్, బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నావ్ ?- అని కవ్విస్తాడు మార్టీ.  టెన్షన్ గా చూసి, క్షణం తర్వాత రే - ఇలా మాట్లాడ్డం నాకు నచ్చదు- అంటాడు. అయితే దేని కొచ్చావిక్కడికి? –మార్టీ  ప్రశ్న. 

          ఏమాత్రం రాజీపడే ఉద్దేశంలేక- నాకు నువ్వు రెండు వారాల జీతం బాకీ- అనేస్తాడు రే. మార్టీ తలవిదిల్చి- నో, ఆమె చాలా కాస్ట్లీ గుంట...అనుకుని, ఫైనల్ గా రే వైపు చూసి- నేను రీఫండ్ ఇస్తా, అదింకెవర్ని పిండుకుంటోందో చెప్పు- అంటాడు.

          వ్యాపారిలా మారిపోయాడు మార్టీ లాభ నష్టాలు చూసుకుంటూ. ఇప్పుడంతే,  భార్యాభర్తల సంబంధం తెంచుకున్నాక!   భార్య తన షోకులతో ఆర్ధికంగా తనకి చాలా భారమై వుంటుంది. భరించాడు. ఇప్పుడామె ప్రియుణ్ణి  చూసుకుంటే,  ఆ ప్రియుడికి తను జీతం డబ్బులిస్తే,
ఆమెకిచ్చినట్టే. ఇంకా ఆమె మీద వేస్ట్ ఎందుకు చేసుకుంటాడు? అందుకే ఎగ్గొడతాడు. ఇదీ వరస! 

       ఐతే ఒక ఆఫర్ ఇచ్చాడు - నా భార్యని వాడుకుంటున్నందుకు, జీతం రూపంలో నువ్వు వదులుకున్న నీ డబ్బుని నీకు రీఫండ్ ఇస్తా- అదింకెవర్ని పిండుకుంటోందో నువ్వు చెబితే!- అని.   

          ఇవన్నీ కసికొద్దీ అంటున్న మాటలే- పనిలోపనిగా ఎబ్బీ మీద  రే కి  అనుమానాలు రేకెత్తించడం కూడా జెలసీతో!

          నాకా డబ్బుకావాలి, నువ్వింకేదైనా  చెబితే మంచిదే- అంటాడు రే పట్టువదలకుండా. ఎవరనుకుంటున్నావ్ నువ్వు- మ్యారేజ్  కౌన్సెలర్ వా?- అని తిప్పికొడతాడు  మార్టీ. ఈ మాటకి వచ్చీ రాని  స్మైల్ ఇస్తాడు రే. 

          ఇప్పుడు మార్టీలో కోపం పెరుగుతూ-  దేనికి నవ్వుతావ్? ఫన్నీ గైలా కన్పిస్తున్నానా? యెదవలా  కన్పిస్తున్నానా? నో నో నో నో- ఫన్నీగా వున్నది నేను కాదు, ఫన్నీగా వున్నది నీ లవర్. నేను మీ ఇద్దరి మీద నిఘా పెట్టించాను చూడూ అదీ ఫన్నీ. ఎందుకంటే నువ్వు కాకపోతే అదింకొకడితో పడుకునేదే,  కాబట్టీ అదీ ఫన్నీ. నీకింకా చాలా ఫన్నీగా ఎప్పుడన్పిస్తుందంటే, ఏంటీ రే నువ్వు మాట్లాడుతున్నదీ... ఫన్నీగా నేనేం  చేశాననీ? అని అమాయకంగా అది మొహం పెట్టి అంటుంది చూడూ, అప్పుడూ! – అని కసికసిగా అనేస్తాడు. 

          ఈ డైలాగులతో ఇక్కడ మనమనుకుంటున్న కథ, పాత్రలు చాలా వూహించని మలుపులు తిరగడం ఆశ్చర్యమేస్తుంది...
      ఇప్పుడు- ఇప్పుడు- అసలు డ్రామా ఎస్టాబ్లిష్ అవుతోంది. కచ్చితంగా ఎవరేమిటో తేలిపోతోంది. ఎవగింపు కలిగే పాత్ర సానుభూతిని మూట గట్టుకుంటూ, సానుభూతి పొందిన పాత్ర ఏవగింపుని సంపాదించుకుంటోంది...హీరోయిన్ ని నెగెటివ్ గా చూపించడం కమర్షియల్ సినిమా లక్షణం కాదని చెబుతోందీ సీను. చెడ్డది- చెడ్డది- చెడ్డదీ - అనుకుంటున్న హీరోయిన్ పాత్ర గుడ్ అయిపోతోంది, గుడ్ -గుడ్ -గుడ్ -అనుకుంటున్న భర్త పాత్ర చెడ్డదిగా బయటపడుతోంది...

          ఇదీ నిజమైన డ్రామా అంటే. కేవలం ఒక డైలాగు, ఒక నిగూఢార్ధం, ఒక ఎలిమెంట్ మొదలైనవి చాలా మ్యాజిక్కులు చేస్తూ కథని రక్తి కట్టిస్తున్నాయి. 

          ఇప్పుడు మార్టీ వెళ్లగక్కుకుంటున్న అక్కస్సుతో మనకేమైనా సానుభూతి కలుగుతోందా? అస్సలు లేదు. ఫూలిష్ గా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే,  రెండవ సీన్లో వర్షంలో కారులో పోతున్నప్పుడు- మా ఆయన మూడీగా అదోలా వుంటాడు- అని రే తో అంది ఎబ్బీ. అదీ డబ్బున్న మార్టీ ని వదిలేసి, సామాన్యుడైనా సరే రే ని చూసుకోవడానికి ఆమెకి గల కారణం! 

          మార్టీ ఏమో అది నా డబ్బుని ఎంజాయ్ చేసి హేండ్ ఇచ్చిందను కుంటున్నాడు. ఆమెకి డబ్బే ముఖ్యమనుకుంటే మార్టీ డబ్బునే  ఎంజాయ్ చేస్తూ మార్టీతోనే వుండేది. డబ్బుకన్నా మానసిక తృప్తే ముఖ్యమనుకుంది గనుక, అది మూడీ మార్టీతో లభించక హేండ్ బ్యాగుల అబ్సెషన్ మొదలై,  బయట షికార్లు కొట్టింది. ఇంట్లో సుఖమంటే బయట షికార్లు ఎందుకు తిరుగుతుంది. కాబట్టి ఆమె హేండ్ బ్యాగుల అబ్సెషన్ కి అసలు కా మేమిటో ఇప్పుడు బయట పడ్డాక- సానుభూతి ఆమెకి లభిస్తుంది. డబ్బులేని వాడు రే అయినా సరే అతడితో వెళ్ళిపోయింది...దీనికంతటికీ బాధ్యుడైన మార్టీ మంచి వాడనే పేరుని కోల్పోయాడు.

          మార్టీ అక్కస్సుతో,  రే చేస్తున్నది తప్పనిపించదు ఈ డైలాగుల తర్వాత. ఇలా మంచి వాళ్ళెవరు- చెడు ఎవరు - బలాబలాల సమీకరణ ఫైనల్ గా ఈ సీనుతో పూర్తయింది. భార్యతో వుండే అర్హత మార్టీకి లేదు, రేకే వుందని లాజికల్ గా సమర్ధిస్తూ. 

          ఇక ఫైనల్ గా తేల్చి చెప్తున్నప్పుడు మార్టీ అగ్నిపర్వతం బద్దలైనట్టే బరస్ట్ అవుతాడు. మాట్లాడకుండా వెళ్ళిపోతాడు రే. మళ్ళీ ఇటు వస్తే షూట్ చేస్తానంటాడు మార్టీ. ఇదంతా ప్రేలాపనే అన్పిస్తుంది మనకి.

          ఈ సీనుతో కథలో టెన్షన్ తీవ్రత కూడా పెరిగింది. అంటే టైం అండ్ టెన్షన్ థియరీ అమలవుతోంది. స్క్రీన్ టైం గడిచేకొద్దీ అంతకంతకూ కథలో టెన్షన్ పెరుగుతూ పోవడం టైం అండ్ టెన్షన్ గ్రాఫ్ ని ఏర్పరుస్తుంది. సీను సీనుకీ టెన్షన్ ఎంతెంత పెరుగుతోందో ఈ గ్రాఫ్ ద్వారా మానిటర్ చేయడం  ముఖ్యం!

- సికిందర్  
http://www.cinemabazaar.in/