రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

22, జులై 2016, శుక్రవారం

రివ్యూ :






రచన- దర్శకత్వం : పా. రంజిత్ 

తారాగణం : రజనీకాంత్, రాధికా ఆప్టే, ధన్సిక, రిత్విక, దినేష్ రవి, కళయరాసన్, జాన్ విజయ్, విన్ స్టన్ చావో, రోస్యమ్ నోర్ తదితరులు 
సంగీతం : సంతోష్ నారాయణ్, ఛాయాగ్రహణం : జి. మురళి 
విడుదల : 22 జులై, 2016 
***
        సూపర్ స్టార్ రజనీకాంత్ తో మారుతున్న ప్రేక్షకాభిరుచిని అర్ధంజేసుకోవడంలో దర్శకులు విఫలమవుతున్నట్టు సూచనలు కన్పిస్తున్నాయి. రజనీతో రొటీన్ మాస్ కమర్షియల్స్ తీయడానికి ఇంకా ఏమీ మిగల్లేదనే, మెగా దర్శకుడు శంకర్ రజనీతో  ‘రోబో’ అనే సైన్స్ ఫిక్షన్ తీసి ప్రేక్షకుల్ని ఓ కొత్త వూహా ప్రపంచంలోకి తీసికెళ్ళాడు. తిరిగి ప్రస్తుతం తనే తీస్తున్న ‘రోబో- 2’ అనే మరో సైన్స్ ఫిక్షన్ తో ఇంకో కొత్త ఊహా ప్రపంచాన్ని పరిచయం చేయబోతున్నాడు. కానీ ‘రోబో’ అనే సైన్స్ ఫిక్షన్ లో రజనీని ప్రేక్షకులు మరమనిషి గా అంగీకరించారు కదాని, మనంకూడా ఇంకో అడుగు ముందుకేస్తున్నట్టు భ్రమించి, మరమనిషి నుంచి అసలే ప్రాణంలేని త్రీడీ గ్రాఫిక్స్ రూపానికి దించి,  రజనీ కుమార్తె ఐశ్వర్య ‘విక్రమ సింహా’ తో ప్రేక్షకుల్ని అపరిమితంగా  పరిహాసమాడింది. వెంటనే ‘లింగా’ తో అందుకుని, కె ఎస్ రవికుమార్ పాత మూస రజనీ కాంత్ నే మళ్ళీ చూపించి ప్రేక్షకాభిమానుల్ని అనుచితంగా హతాశుల్ని చేశాడు. ఇప్పుడు రియలిస్టిక్ సినిమాల రంజిత్ వచ్చేసి రజనీతో ఏం చేసుకోవాలో అర్ధంగాక ఏమేమో చేసి –ఆఖరికి ప్రేక్షకులు నవ్వుకునే స్థితికి సూపర్ స్టార్  సినిమాని దిగజార్చాడు. 


       ఇంగిత జ్ఞానాన్ని ప్రదర్శించి  ఐశ్వర్య దర్శకుడు రంజిత్ ని ప్రశ్న అడిగింది- మీ స్క్రిప్టులో ఎంటర్ టైన్ మెంట్ అనేది లేదు కదా కాస్త ఉండేట్టు చూడమని. దీనికి రంజిత్- ఇందులో ఎంటర్ టైన్ మెంట్ కుదరదనడం సహజంగానే అతడి నాన్-కమర్షియల్ మైండ్ సెట్ కి మచ్చుతునక. ఇప్పటి రజనీకాంత్ యిప్పటి అమితాబ్ బచ్చన్ కాదని తెలుసుకోకపోవడమే అతడితో వచ్చిన చిక్కు.  తమ రజనీకాంత్ ఎప్పటికీ ఆల్ రౌండరే అని నిద్రలో లేపి అడిగినా సాక్ష్యం చెప్తారు అభిమానులు. 


      ‘కబాలీ’ అనే బ్రహ్మండమైన పవర్ఫుల్ ఇగోయిస్టిక్ టైటిల్, దీనికి తగ్గట్టు విపరీతమైన క్రేజ్ సృష్టించిన ట్రైలర్స్, రెండు పరాజయాల తర్వాత ఈసారి రజనీ చాలా జాగ్రత్త తీసుకుంటారన్న అతిపెద్ద భరోసా, పైగా మొట్ట మొదటిసారిగా ఒరిజినల్ రూపంతో రజనీకాంత్ దర్శనం, దేశవ్యాప్తంగా గొప్ప పండగవాతావరణం...ఇదీ నేపధ్యబలం. దీంతో వెయ్యేనుగుల బలం వచ్చినట్టు ఫీలయ్యి థియేటర్లోకి అడుగుపెడితే...


తెర మీద కన్పించే కథ     
      మ
లేషియాలో కబలీశ్వరన్ అలియాస్ కబాలి (రజనీకాంత్) పాతికేళ్ళు జైలు శిక్ష అనుభవించి విడుదలవుతాడు. మలేషియాలో తరాలుగా జీవిస్తున్న తమిళ బడుగు జీవుల సమస్యలు తీర్చే మాఫియా డాన్ అతను.  జైలు నుంచి వచ్చాక తన పాత శత్రువు టోనీ (విన్ స్టన్ చావో) చేస్తున్న దందాల్ని బంద్ చేయించే ప్రయత్నాలు మొదలెడతాడు. అతణ్ణి చంపడానికి టోనీ అనుచరులు దాడులు ప్రారంభిస్తారు. తన పాత  అనుచరుల పిల్లలు కూడా ఈ మార్గం పట్టకూడదని వాళ్ళకి చదువు చెప్పించే స్కూలు నడుపు తున్న కబాలీ  ఆ స్టూడెంట్స్ అడిగితే  తన గతం చెప్పుకొస్తాడు. 


        ఆ రోజుల్లో సీతారామరాజు ( నాజర్) తమిళుల పెద్ద దిక్కుగా ఉంటాడు. అతను హత్యకి గురవడంతో వారసత్వం కబాలీకి లభిస్తుంది. దీంతో ద్వేషం పెంచుకున్న మరో అనుచరుడు టోనీ తో కుమ్మక్కయి కబాలీని అడ్డు తొలగించే ప్రయత్నంలో గర్భవతి అయిన కబాలీ భార్య కుందనవల్లి (రాధికా ఆప్టే)  మీద దాడి  చేస్తాడు. అతణ్ణి కబాలీ చంపేసి జైలు కెళ్తాడు.

        ఇలాటి గతమున్న తను ఇప్పుడు వృద్ధాప్యంలో భార్య జ్ఞాపకాలతో బాధగా గడుపుతూంటాడు. ఇప్పుడు యోగి (ధన్సిక) అనే అమ్మాయిని కబాలీని చంపేందుకు నియమిస్తాడు టోనీ. తీరా చూస్తే  ఈమె తన కూతురే అని తెలుస్తుంది కబాలీకి. అంతలో భార్య కూడా బతికే వుందని తెలుస్తుంది...


        పాతికేళ్ళ క్రితం టోనీవల్ల తన కుటుంబానికి జరిగిన అన్యాయానికి పగ తీర్చుకోవడమే ఇక ఇక్కడ్నించీ కబాలీ కథ. 


ఎలావుంది కథ
       
సారి రజనీ జాగ్రత్త పడతారన్న భరోసాకాస్తా అవిరైపోయేలా వుంది కథ. రజనీ ఇందులో ‘బాషా’ ని చూశారా, ‘నాయకుడు’ ని చూశారా, లేక ఏకంగా ‘గాడ్ ఫాదర్’ నే చూశారా? ఈ కథలో తను ప్రజల కోసం పోరాడారా, కుటుంబం గురించి పగదీర్చుకున్నారా? ఈ కథలో తను డానా, ఫ్యామిలీ మ్యానా? రజనీ సార్ తన ఒల్డేజి పాత్రలో బాధపడే దిలీప్ కుమార్ ని చూశారా, మండిపడే అమితాబ్ బచ్చన్ ని చూశారా? చాలా కన్ఫ్యూజన్. కథలో కొత్త దనం లేదు. ఉన్న కథలో హేతుబద్ధత లేదు. కథ దేని గురించన్న స్పష్టత లేదు సరే, నేటివిటీ- కమర్షియాలిటీలు కూడా కరువయ్యాయి. కథలో వున్న ఫ్యామిలీ డ్రామాకి తగిన భావోద్వేగాలు కూడా కరువే. కథ ఎప్పుడూ పాత్ర ద్వారానే వ్యక్తమవుతుంది. నిజ జీవితంలో ఎలా వుండే రజనీని అలాగే వుంచి పాత్రకి సిద్ధం చేయడం ఓ కొత్త ప్రయోగమే, కానీ పాత్రని సీరియస్ పాత్రగా మల్చడమే పొరపాటయి పోయింది. దీంతో చాలా  విషయాల్లో  కమర్షియాలిటీ లేకుండా పోయింది. రజనీ కాంత్ సీరియస్ గా వుండడమంటే ప్రపంచమంతా కూమ్ రివర్ లో కొట్టుకు పోయినట్టే. పాతికేళ్ళ క్రితం ‘చనిపోయిన’ భార్య బిడ్డల గురించే ఇంకా బాధపడే పాత్రా- ఆ పాత్రకి తగ్గట్టు పంచ్ డైలాగుల్లేని, సహజ రజనీ మార్కు హాస్యం లేని, ఏ మ్యానరిజమ్సూ లేని, హుషారు లేని, కసి లేని, ఖుషీ లేని – దుర్భిక్ష పరిస్థితి ఏర్పడిన వాతావరణం. 

ఎవరెలా చేశారు
       
జనీది అంత  ఈలలూ చప్పట్లు పడే పాత్ర కాదని ఈ పాటికే అర్ధమైపోయి వుంటుంది. పోనీ ఫ్లాష్ బ్యాక్ లో యంగ్ రజనీ పాత్రయినా ఎంటర్ టైన్ చెయ్యదు. అసలా యంగ్ గ్ రజనీ కంటే ఓల్డ్ రజనీయే చాలా బెటర్. ఓల్డ్ రజనీ కూడా ఒక్క క్లయిమాక్స్ లో విలన్ తో చెప్పే నాల్గు డైలాగులే పవర్ఫుల్ గా వున్నాయి. ఇంకెక్కడా రజనీకి డైలాగులే సరీగ్గా లేవు. ఇది వాస్తవిక కథాచిత్రమన్నట్టు మాటలు రాశాడు దర్శకుడు. కమర్షియల్ డైలాగ్ రైటింగ్ అనేది ఏ  పాత్రకీ లేదు. 

        స్టీవెన్ స్పీల్ బెర్గ్ తీసిన ‘షిండ్లర్స్  లిస్ట్’ వుంది. ఇందులో  హీరో లియాం నీసన్ ఒక హోటల్ రూమ్ లో ఒపెనవుతాడు. ముఖం కనపడదు. వస్తువులు కనబడుతూంటాయి. ఖరీదైన వాచీ ధరిస్తాడు. షర్ట్ కఫ్ లింక్స్ పెట్టుకుంటాడు. కోటు కి నాజీ పార్టీ గుర్తుగల పిన్ పెట్టుకుంటాడు. టేబుల్ సొరుగు లోంచి గుప్పెడు కరెన్సీ నోట్లు తీస్తాడు. నైట్ క్లబ్ లోకి ఎంటర్ అవుతాడు...ఇలాగే వుంటుంది జైల్లో రజనీకాంత్ ఎంట్రీ సీను కూడా. ఇది సరిపోలేదు, ఇంకా హైప్ వుండాల్సింది. రజనీకాంత్ తాను పాత్ర వయసుకి తగ్గట్టు గంభీరంగా నటిస్తున్నాననుకున్నారే గానీ, నిజానికి అది కుటుంబ ట్రాజడీ బాధ బరువు కింద కమర్షియాలిటీని ఖూనీ చేస్తున్నా ననుకోలేదు. 

        ఇక రాధిక ఆప్టే, ధన్సిక లు నటించారు గానీ, అవి రియలిస్టిక్ పాత్రలు. విలన్స్ లో కిషోర్, చైనీస్ నటుడు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరెవరో చిల్లరమల్లర తమిళ కొత్త ముఖాలుగా వున్నారు. రజనీ డాన్సుల్లేవు. వయసుకి తగ్గట్టు తుపాకీ కాల్పులతో యాక్షన్ సీన్స్ వున్నాయి. మ్యూజికల గానూ బలహీనంగా వుంది సినిమా. 


చివరికేమిటి
        సూపర్ స్టార్ రజనీ కాంత్ తో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు రెండు సినిమాల కొత్త దర్శకుడు రంజిత్. ఒల్డేజి రజనీని వెండితెర మీద చూపించడమంటే ఆయన్ని వేగంగా అటు నడిపించడానికీ, లేదా హడావిడిగా ఇటు అడుగులేయించడానికీ మించి విజువలైజేషన్ కన్పించదు  దర్శకుడిలో. రకరకాల సూట్స్ ధరిపంజేయడంలో కనబర్చిన  శ్రద్ధ, ఆ స్టయిలిష్ నెస్ కి తగ్గట్టు మాటల తూటాలు విసిరే ఫన్నీ కోణాన్ని పట్టుకోలేక్పోయాడు. 

        పాతికేళ్ళ తర్వాతా భార్యా బిడ్డలు పోయారన్న విచారంతో వుండే పాత్రగా చిత్రించడం పూర్తిగా-సైకలాజికల్ గా-  అవగాహనా రాహిత్యం. అసలు పాతికేళ్ళ క్రితం జరిగిన దాడిలో గర్భవతైన భార్య  పోవడమనే ఆలోచన పాత్రకి కల్పించడమే అర్ధరహితం.  బహిరంగంగా జరిగిన దాడిలో దాడి  చేసిన వాణ్ణి తాను చంపేస్తే,  పోలీసులు తనని అరెస్టు చేసి పట్టుకెళ్తే, భార్య ఏమయ్యిందో తెలుసుకోడా? చనిపోతే పోలీసులు ఆ సంగతి చెప్పి అంతక్రియలకి అనుమతించారా? చనిపోకుండా ఆస్పత్రిలో ప్రసవిస్తే బిడ్డ పుట్టిన విషయం కూడా చెప్పరా పోలీసులు? భర్త జైలు కెళ్లాడని బతికున్న భార్యకి కూడా తెలీదా పాతికేళ్ళూ? హేతుబద్ధత లేని ఈ ఫ్లాష్ బ్యాక్ మీద పునాది కట్టి మొత్తం కథ నడిపాడు దర్శకుడు. 


        రజనీకాంత్ జైల్లోంచి వచ్చిన పదినిమిషా వరకూ వుండే ఆసక్తి  ఆతర్వాత కథా కథనాల్లో కన్పించక పోవడం, ఇంటర్వెల్  దగ్గర భార్య ఫలానా వూళ్ళో  జీవిస్తోందని తెలిశాక, ఆ తర్వాతి సీన్లో డైరెక్టుగా ఆమెతో కలిపెయ్యకుండా, సెకండాఫ్ లో ఆమెకోసం కావాలని రజనీకాంత్ ని ఊరూరా తిప్పడం (‘బ్రహ్మోత్సవం’  లో మహేష్ బాబు ఏడుతరాల బంధువుల కోసం తిరిగే సీన్లు జ్ఞప్తికి తెస్తూ),  ఆ భార్య కలవగానే- శత్రువుల దాడితో క్లయిమాక్స్ కి వెళ్ళిపోవడం...ఇదంతా విషయలేమిని పట్టి చూపుతుంది. 


        ప్రజల కోసం కబాలీ ఏం చేశాడన్నది ఎక్కడా కన్పించదు. కుటుంబం కోసం పరితపించేవాడు కబాలీ అని బిల్డప్ తో పేరు పెట్టుకుని తిరగనవసరం లేదు. అది కాబూలీవాలా తిరిగి నట్టు వుంటుంది. జైల్లోంచి వచ్చాక అక్కడి ప్రజల కోసం పాటుబడుతూ (ఔటర్ ఎమోషన్), లోలోపల కుటుంబం కోసం బాధపడుతోంటే (ఇన్నర్ ఎమోషన్) - అప్పుడది సమగ్ర పాత్రవుతుంది. ఔటర్ ఎమోషన్ తో ప్రజలకోసం ప్రత్యర్ధుల్ని చీల్చి చెండాడే ప్రచండుడిగా చెలరేగుతోంటే కబాలీ మామూలుగా వుండడు- అడ్వాన్సు బుకింగ్స్ ని దాటి మళ్ళీ వారం కూడా గర్జిస్తూనే వుంటాడు- ఇంకా ఇంకా కలెక్షన్స్ కావాలని!!



-సికిందర్