రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

7, మార్చి 2016, సోమవారం

షార్ట్ రివ్యూ!

కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : ప్రకాష్ ఝా

తారాగణం : ప్రియాంకా చోప్రా, ప్రకాష్ ఝా, మానవ్ కౌల్,        

నినద్ కామత్, కిరణ్ కర్మాకర్, మురళీ శర్మ తదితరులు 

సంగీతం : సలీం మర్చంట్- సులేమాన్ మర్చంట్ఛా, 

ఛాయాగ్రహణం : సచిన్ కృష్ణ్
బ్యానర్ : ప్రకాష్ ఝా ప్రొడక్షన్స్ – ప్లే ఎంటర్ టిన్ మెంట్ని

నిర్మాత : ప్రకాష్ ఝా

విడుదల : 4 మర్చి, 2016

ప్పుడూ సామాజిక సమస్యల మీద దృష్టి పెట్టే బీహారీ బాబు ప్రకాష్ ఝా, వెట్టి చాకిరీ మీద  ‘దాముల్’ తీసి, లింగవివక్ష మీద ‘మృత్యుదండ్’ తీసి, ‘దిల్ క్యా కరే’  అనే బోరు ప్రేమ కథ తీసి, ‘రాహుల్’ అనే బెటర్ సెంటిమెంటల్ తీసి, ‘గంగాజల్’ తో కాన్వాస్ పెంచి, సామాజిక దురాగతాల తీవ్రత ఎంత పెరిగిపోయిందో చూపించుకొస్తున్నాడు...అందులో భాగంగా 1980 లో బీహార్ లోని భాగల్పూర్ లో ముప్ఫై ఒక్కమంది క్రిమినల్స్ కళ్ళల్లో యాసిడ్ పోసి తీవ్ర సంచలనం సృష్టించిన పోలీసుల  దురాగాతంపై 2003 లో ‘గంగాజల్’ ( అంటే ఇక్కడ యాసిడ్ అని వ్యంగం)  అనే సంచలనాత్మకం తీసి దర్శకుడుగా ఇంకో మెట్టు పైకెక్కాడు. మళ్ళీ బీహార్ కిడ్నాప్ మాఫియాలమీద ‘అపహరణ్’, దేశరాజకీయాల మీద ‘రాజనీతి’, రిజర్వేషన్ సమస్య మీద ‘ఆరక్షణ్’, మావోయిస్టు సమస్య మీద ‘చక్రవ్యూహ్’, స్కాముల మీద ‘సత్యాగ్రహ’ మొదలైనవి తీస్తూ తీస్తూ ఇలాటి సోషియో – పొలిటికల్  థ్రిల్లర్స్ జోన్ లో తనది ఏక ఛత్రాధిపత్యమని అనిపించుకుంటున్నాడు. ప్రకాష్ ఝా సినిమా ఎప్పుడొస్తుందా అని ఎదురుచూసేలా చేస్తున్నాడు 64 ఏళ్ల ఈ మాస్టర్ మైండ్.

చేస్తున్నాడు 64 ఏళ్ల ఈ మాస్టర్ మైండ్.

 

          యితే ఈ క్రమంలో ఓ మూడు సినిమాలతో భయపెట్టకా పోలేదు. ‘రాజనీతి’ ని మహాభారతంతో పోలిక పెట్టి డజన్ల సంఖ్యలో క్యారక్టర్లతో  ఏం చెప్పాడో  మనకి అర్ధంగాక పోతే,  మళ్ళీ  ‘ఆరక్షణ్’లో ఎత్తుకున్న రిజర్వేషన్ల సమస్య ఇంటర్వెల్ తర్వాత వదిలేసి, విద్యా సంస్థల కార్పొరేటీకరణ అంటూ ప్లేటు ఫిరాయించడంతో మనకి మతులుపోయాక,  ‘సత్యాగ్రహ’ లో బోలెడు స్కాములు మాత్రమే చూపించి, ఒక్క పరిష్కారమూ  చెప్పలేక విరక్తి కల్గించిన ఝా-  ఈసారి మళ్ళీ ఏ భయానకం చూపిస్తాడోనన్న భయాందోళనలకి గురికావడం సహజం.
          అయితే మాస్టర్ మైండ్ మాస్టర్ మైండే - ఒకటీ అరాసార్లు గతి తప్పుతాడంతే!


ఉరితాళ్ళ ఉద్యమం

   వ్యంగంగా ‘గంగాజల్’ ని యాసిడ్ అనుకున్నట్టే, ‘జై గంగాజల్’ అంటే ఉరితాళ్ళు అనుకోవాలి. ‘గంగాజల్’ లో  పోలీసుల దురాగతమైతే, ‘జై గంగాజల్’ లో ప్రజలతో కుమ్మక్కయిన పోలీసుల ప్రాయశ్చిత్తం. కాస్సేపు ప్రజాస్వామ్య మూలస్థంభాలలో కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయవ్యవస్థ అనే రెండు మూలస్థంభాలు చూసీ చూడనట్టు ఉండిపోతే - ఈ రెండిటినీ చెరబట్టి ప్రజాస్వామ్యాన్ని సర్వ నాశనం చేస్తున్న, కుళ్ళిపోయిన  రాజకీయవ్యవస్థ అనే మూడో మూలస్థంభాన్ని, ప్రక్షాళన చేసేస్తారు పోలీసులూ ప్రజలూ కలిసి! 


          అయితే ఇందుకు ప్రజలు  సిద్ధమే, మరి ఎందరు పోలీసులు ముందుకొస్తారు?
          ఇక్కడే స్పీడ్ బ్రేకులు ఆ సీఐ కి...


          ఆ వూళ్ళో సీఐ గా ఉంటున్న బీఎన్ సింగ్ ( ప్రకాష్ ఝా) కి ఆ ప్రమోషన్ ఎమ్మెల్యే బబ్లూ పాండే తమ్ముడు డబ్లూ పాండే  పెట్టిన భిక్షే. డబ్లూ పాండే (నినద్ కామత్) ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో పెద్ద టెర్రర్. అతడి టెర్రర్ తనాన్ని చూసీ చూడనట్టు వుంటూ, అవసరమైతే తొత్తుగా పనిచేస్తూ బంగళాలూ బంగారాలూ కొనుక్కుని సుఖపడతాడు సర్కిల్ ఇన్స్ పెక్టర్  సింగ్. లఖీసరాయి అనే గ్రామం శివారులో వున్న భూముల మీద ఓ పవర్ ప్లాంట్ కంపెనీ  కన్ను పడుతుంది. దీంతో డబ్లూ పాండే రంగంలోకి దిగిపోయి రైతుల నుంచి భూములు లాక్కోవడం మొదలెడతాడు. రైతులు ప్రతిఘటిస్తారు. ఒక ఐఐటీ టాపర్ -కమ్- పీహెచ్ డీ స్కాలర్ పవన్ (రాహుల్ భట్) అమెరికాలో లక్షల డాలర్లు వచ్చే ఉద్యోగం వదులుకుని సామాజిక కార్యకర్తగా ఇక్కడ ఉంటాడు. ఈ భూదోపిడీకి వ్యతిరేకంగా ఆందోళనలు  చేస్తూంటాడు. సీఐ సింగ్ తనకి ప్రజల్లో చెడ్డ పేరు రాకుండా, అటు డబ్లూ తోనూ చెడకుండా డబుల్ యాక్షన్ చేస్తూ పరిస్థితిని డీల్  చేస్తూంటాడు. 


బబ్లూ పాండే 
      అది ఎన్నికలు దగ్గర పడ్డ కాలం.  ఈ లఖీసరాయి గ్రామం వున్న బంకిపూర్ జిల్లా కొత్త ఎస్పీగా ఆభా మాథుర్ ( ప్రియాంకా చోప్రా ) ని నియమిస్తూ ఉత్తర్వులిస్తాడు హోంమంత్రి చౌదరి (కిరణ్ కర్మాకర్). హోంమంత్రి చౌదరితో అధికార పార్టీ ఎమ్మెల్యే బబ్లూ పాండే (మానవ్ కౌల్) సన్నిహితంగా ఉంటూ పోలీసుల్ని తన గుప్పెట్లో వుంచుకుంటాడు. కొత్త ఎస్పీ ఆభా మాథుర్ చార్జి తీసుకున్న వెంటనే సీఐ  సింగ్ మొహం చూసే వీడొక కేడీ అని కనిపెట్టేస్తుంది. ఇది తెలిసికూడా సింగ్ అలాగే డబుల్ యాక్షన్ చేస్తూంటాడు ఈమెతో కూడా. డబ్లూ గ్యాంగ్ లో ఒక టక్కరి అయిన నపుంసకుడు మున్నా మర్దానీ (మురళీ శర్మ) ఉంటాడు. వీడు కొరియర్ లాగా పనిచేస్తూంటాడు డబ్లూబాబుకి.

          లఖీసరాయి వూళ్ళో డబ్లూబాబు  గ్యాంగ్ ఓ అమ్మాయి మీద కన్నేసి లాక్కుపోతూంటే పోలీసులు నిస్సహాయంగా చూస్తూంటారు. ఎస్పీ ఆభా వచ్చేసి గ్యాంగ్ ని తన్ని అమ్మాయిని కాపాడుకోవడంతో ఈ విషయం అటు డబ్లూబాబు అన్న ఎమ్మెల్యే బబ్లూకీ,  అట్నుంచి  హోంమంత్రికీ తెలిసి ఆమెని మందలిస్తారు. ఎస్పీ ఆభా అహం దెబ్బ తింటుంది. ఇది వాళ్ళిద్దరితో  ప్రచ్ఛన్న యుద్ధానికి బీజం వేస్తుంది. 

డబ్లూ పాండే 
       అటు వూళ్ళో డబ్లూ రైతులకి పంట రుణాలు కూడా అందకుండా  చేస్తూండడంతో కొందరు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు. ఇంకొందరు రైతులు భయంతో వచ్చిన కాడికి భూములు అమ్మేసుకుంటారు. బెదిరింపుల్ని తట్టుకోలేక ఇంకో రైతు కూడా అమ్ముకోవడానికి సిద్ధ పడుతూంటే, అతడి  పంతొమ్మిదేళ్ళ కూతురు సునీత ( వేగా తమోటియా) అడ్డుకుంటుంది. రైతులందరూ అమ్మేసుకున్నారు- మధ్యలో వున్న తమ  రెండెకరాల పొలాన్ని  చచ్చినా అమ్ముకునేది లేదని చెప్పేస్తుంది సునీత.  ఆమె తండ్రిని బ్యాంకు ఋణం కేసులో ఇరికించి వేధిస్తారు. అతను  పొలంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంటాడు. ఈ సంఘటన  సీఐ సింగ్ కి  నిద్ర పట్టకుండా చేస్తుంది. విపరీతమైన అపరాధ భావంతో అంతరాత్మ మేల్కొంటుంది. ఇప్పుడు అతడికి డబ్లూబాబు అనేవాడు నీచాతి నీచుడుగా కన్పిస్తాడు. 

         అటు ఎస్పీ అభాకి పైనుంచి చెడితే, ఇటు సింగ్ కి డబ్లూతో చెడుతుంది. అయినా ఎస్పీ ఆభా సీఐ సింగ్ ని నమ్మక పోవడంతో వాళ్ళిద్దరికీ ఎడం పెరుగుతుంది.

       ఇక పొలం అమ్మని సునీతని డబ్లూ ఎత్తుకుపోయి రేప్ చేసి చంపి వాళ్ళ  పొలంలోనే  చెట్టుకి వేలాడదీస్తాడు. సునీత పదేళ్ళ తమ్ముడు ఈ దృశ్యం చూసి చలిస్తాడు. సీఐ సింగ్ వాణ్ణి చేరదీస్తాడు. వూళ్ళో కొచ్చిన డబ్లూని సింగ్ ఎడాపెడా తన్ని అరెస్ట్ చేయబోతూంటే ఘర్షణ జరిగి, కింద పడ్డ డబ్లూ మెడకి బెల్టు తీసి బిగించేస్తాడు సునీత తమ్ముడు. కసిగా డబ్లూని నేలమీద అలా ఈడ్చుకుపోతాడు. ఊపిరాడక ఛస్తాడు డబ్లూబాబు. వెంటనే పోలీసులూ జనం కలిసి డబ్లూబాబు  అనుచరుల్ని కూడా ఉరితీసేసి, సెంటర్లో చెట్టుకి వేలాడదీసేస్తారు డబ్లూబాబు  శవం సహా. వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారని రిపోర్టు చేస్తారు. 


          బబ్లూ వచ్చి చూసుకుని తన తమ్ముణ్ణి చంపిన సునీత తమ్ముణ్ణి  పట్టుకుని, ఈ సెంటర్లో ఈ చెట్టుకే వురి తీస్తానని శపధం చేస్తాడు. డబ్లూబాబు  అండ్ గ్యాంగ్ ‘ఆత్మహత్యల’ కేసులో ఎస్పీ ఆభా కి ప్రజలెవరూ సహకరించరు. చివరికి ఈ ‘ఆత్మహత్యల’ బాధ్యత సీఐ సింగ్ తనే తీసుకుని- ఇదే న్యాయమంటాడు. ఇంకా ప్రజల సహకారంతో ఇలాటివి జరగాలంటాడు. ఎస్పీకి మండిపోతుంది. ఇద్దరికీ ఇంకా చెడుతుంది. ఇలా వుంటే శత్రువు టార్గెట్ గా సునీత తమ్ముడు ప్రమాదంలో ఉంటాడు...      


          ఇదీ సమస్య.  ఇక ఇక్కడ్నించీ  చట్టం కోసం ఎస్పీ- సీఐలకి మధ్య, అటు సునీత తమ్ముడి కోసం  సీఐ – బబ్లూలకి మధ్యా  సంఘర్షణ ఎలా కొనసాగిందన్న మిగతా కథ కోసం వెండితెరని ఆశ్రయించాల్సిందే.  


ఎలావుంది కథ 

     లోచనాత్మకంగా వుంది. ఆచరణలో సాధ్యంగాక పోయినా ప్రజల మనోభావాలకి ప్రాతినిధ్యం వహిస్తున్నట్టుగా  వుంది. ఇది చాలా ముఖ్య లక్షణం కథకి : ప్రజల / ప్రేక్షకుల మనోభావాలకి ప్రాతినిధ్యం వహించడం. ఇలా జరగడమే న్యాయమన్పించే  పరిస్థితి  రాజకీయ వ్యవస్థ కల్పిస్తున్నదే. పోలీసులతో మమేకమైన మూకస్వామ్యమే ప్రజల బాధలన్నిటికీ పరిష్కారమనే స్పష్టతతో హెచ్చరిక పంపేలా వుంది. పవర్ ప్లాంటూ, ల్యాండ్ మాఫియా, వీటికి  వ్యతిరేకంగా పోరాటాలూ పాత కథే. చాలా సినిమాల్లో చూసి వున్నదే. ఇక్కడ పాయింటు ఇది కాదు, పాయింటు కుళ్ళిన రాజకీయ వ్యవస్థకి మరమ్మత్తు. ఈ వ్యవస్థతో విసిగిన పోలీసులూ ప్రజలూ కలిసి తీసుకునే చర్యకి నేపధ్యం కోసం మాత్రమే భూదోపిడీ అనే రొటీన్ కథ తీసుకున్నారు. ఈ రొటీన్ కథల్లో ఉంటున్న ఎవరూ పట్టించుకోని  చికిత్సకి  ఏర్పాటు చేసిన పాయింటే  కొత్తగా వుంది. ఇందువల్ల ఈ కథ మొత్తం కొత్తగా  మారిపోయింది.  కథలో ‘వురేసుకుని’ మరికొన్ని ‘ఆత్మహత్యలు’ జరుతాయి రాజకీయ నాయకులు బెంబేలెత్తేలా. కాకపోతే ఇక్కడ కొత్త నినాదం- రైతుల ఆత్మహత్యలకి కారకులైన వాళ్ళు కూడా ‘ఆత్మహత్యలు’ చేసుకోవాలన్నదే-  ‘జో జనతా కో లూటేగా ఉస్కా సూసైడ్!’ అని.  ఈ మొత్తం కథ ఒక  పవర్ఫుల్ సోషల్ కామెంట్.


ఎవరెలా చేశారు 


        ఇది ప్రియాంకా చోప్రాతో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా అనుకుంటారందరూ. కానీ ఒక విచిత్ర పరిస్థితి ఎదురవుతుంది- ఇందులో ప్రియాంకా చోప్రా ఎస్పీ పాత్రని, ప్రకాష్ ఝా సీఐ పాత్ర మింగేస్తుంది. ప్రత్యర్ధులతో ప్రత్యక్ష పోరాటం చేస్తూ నానా హింస పడేది, చావుదాకా వెళ్లి వచ్చేదీ   ప్రకాష్ ఝా పాత్రే. ప్రియాంకా చోప్రా పాసివ్- రియాక్టివ్ పాత్రగా వుంటుంది. శాంతి భద్రతల పరిస్థితి తలెత్తినప్పుడే ఆమె రియాక్టివ్ గా చక్కదిద్దడానికి ప్రయత్నించేది, ఈ క్రమంలో పై నాయకులతో పాసివ్ గా ప్రచ్ఛన్న యుద్ధం, ఇంతవరకే. ఆమెకో లక్ష్యమంటూ లేదు. తనకి వ్యతిరేకంగా వున్న ప్రకాష్ ఝా పాత్ర కూడా తనకి లక్ష్యం కాలేదు. అతడి ఉరితాళ్ళ ఆశయంతో తన చట్ట బద్ధమైన సంఘర్షణ అంతలోనే సునీత తమ్ముణ్ణి కాపాడే అతడి సంఘర్షణలో భాగమైపోతుంది.  


          కథలో ప్రకాష్ ఝా కారణంగా  ఓ మేజర్ సంఘటన జరిగినప్పుడల్లా సమాచారమందుకుని రావడమనే రొటీన్ సీన్లు  ఆమెకున్నాయి. ఒక సంఘటన జరుగుతూంటే ఇప్పుడామెకి సమాచారం అందుతుందని, కుయ్ కుయ్ మంటూ కారులో వచ్చేస్తుందని మనం అనుకోగానే ఆమె వచ్చేస్తుంది. ఇలా సెకండరీ క్యారక్టర్ గా ఉండిపోయింది. మరొకటేమిటంటే, ఓవర్ గా మేకప్ చేసుకోవడం. ఒక ఎస్పీగా హుందాతనం ఉట్టిపడే ముఖవర్ఛస్సుతో వుండాల్సింది పోయి  రోమాంటిక్ హీరోయిన్ లా వుంటుంది. ఈ సినిమాలో రోమాన్సు  కూడా లేదు.


          నటనని పాత్రచిత్రణతో కలిపి చూడకుండా సర్టిఫికేట్ ఇచ్చేస్తే పాత్రనే అవమానించిన వాళ్లవుతాం. ఈ దృష్ట్యా ప్రియాంకా చోప్రా తన తిరుగు లేని టాలెంట్ తో ఎంత గొప్పగా నటించినా,  అది తామరాకు మీద నీటి బొట్టల్లే  వుండిపోయింది.


         ఈ సినిమా దర్శకుడు, నిర్మాత, కథకుడు, స్క్రీన్ ప్లే కారకుడు, మాటల రచయితా ప్రకాష్ ఝా తొలిసారిగా నటించాడు. నటింపజేసే దర్శకుడికి రాయడం రాకపోయినా ఫర్వాలేదుగానీ, నటనే రాకపోతే నవ్విపోతారు కాబట్టి, ఝా ఇందులోనూ ఒక ‘డర్టీ హేరీ’ క్లింట్ ఈస్ట్ వుడ్ అన్పించుకున్నాడు. పోలీస్ పాత్రని పరమోన్నత స్థాయికి చేర్చిన  ఈస్ట్ వుడ్ లాగే,  సీఐ సింగ్ నీ దేశంలో అందరు సీఐలకీ ఆదర్శం అన్నట్టుగా నటించి పెట్టాడు. లంచగొండిగా  ఎలా సుఖపడి, అంతరాత్మ మేల్కొని ఎలా సంఘర్షించి, ఎలా పరిణతి చెందాడో క్యారక్టర్ బయోగ్రఫీ అంతా ఒక ట్రాకులో తనకే వుంది. చాలా విచిత్రమైన పాత్ర ఇది. పై అధికారి ఎస్పీ ఆభాతో డిసిప్లిన్డ్ గా వుంటాడు. ఆమె పీకే క్లాసులన్నీ వింటాడు. కానీ ఒక్క మాటా ఎదురు మాటాడడు. సెల్యూట్ కొడతాడు. బయట చేసేది చేస్తూంటాడు. ఆమె సస్పెండ్ చేస్తే సస్పెండ్ అవుతాడు. కస్టడీలోకి  తీసుకుంటే కస్టడీలో వుంటాడు. కానీ ఆమె ఇంటరాగేట్ చేస్తే నోరు విప్పడు. ఆమె మటాడుతూంటే తను నోరు విప్పకూడదన్నది తన డిసిప్లిన్! ఆమెకి పిచ్చెక్కుతుంది. 


          రైతు కూతురు సునీత మరణంతో కథలో లక్ష్యం ఝా పాత్రకే ఏర్పడింది. అక్కడ్నించీ ప్రధాన సంఘర్షణంతా  సునీత తమ్ముణ్ణి కాపాడడం గురించే. ఈ యాక్టివ్ పాత్రలో ఝా ఆద్యంతం తనెవరో తెలియని ప్రేక్షకులని కూడా రెండు గంటలా 38 నిమిషాలూ కట్టిపడేస్తాడు- యాక్షన్ సీన్స్ సహా! 


          ఇక్కడ ప్రశ్న – ప్రియాంకా చోప్రా పాత్రని తగ్గిస్తూ, కొత్తగా నటిస్తున్న  ప్రకాష్ ఝా ఎందుకు తన పాత్రని ప్రధానం చేసుకున్నాడన్నదే. ఈ పాత్రలో ఏ అజయ్ దేవగణ్  నో తీసుకుని వుంటే అదివేరు. అప్పుడు హీరోయిన్ ఓరియెంటెడ్ లుక్ సినిమాలో లేకపోయినా, పెద్ద స్టార్ గా అజయ్ ఉంటాడు కాబట్టి ఈ సినిమా అతడిదే అనుకుని తృప్తి చెందవచ్చు. ఇలా కాకుండా ఝా పెద్ద రిస్కు తీసుకున్నాడు. హీరోయిన్ ఓరియెంటెడ్ జానర్ కి కొత్త నిర్వచనం చెప్పాడు. ఇంతవరకూ ఇలాటిది భారతీయ సినిమాల్లో జరగలేదు- సహాయ పాత్రే ప్రధాన పాత్ర కావడం, దాంతో సినిమా విజయవంతం కావడం. రూల్స్ ని బ్రేక్ చేయడమంటే ఇదేనేమో. కానీ రూల్స్ ని బ్రేక్ చేయాలంటే కూడా అసలంటూ రూల్స్ తెలిసి వుండాలి. ఇది తెలుసేమో  ఝాకి.



చివరికేమిటి 





       ఒక కొత్త కమర్షియల్ ప్యాకేజీగా పవర్ఫుల్  మెసేజితో ఈ సినిమా వచ్చింది. కొత్త కమర్షియల్ ప్యాకేజీ అనడమేమిటంటే, ఇందులో లవ్- రోమాన్సుల్లేవు, పాటల్లేవు, కామెడీ ఆర్టిస్టుల్లేరు, చీప్ డైలాగుల్లేవు, నీచమైన తాగుడు సీన్లు లేవు, సిక్స్ ప్యాక్- హైపర్ యాక్షన్ సీన్స్ లేవు. జీవితం ఎలా వుంటుందో, అందులో ఉద్రిక్తత లెలా వుంటాయో అవే సహజత్వంతో వున్నాయి. కొట్టుకున్నా, కాల్చుకున్నా అంతా రియలిస్టిక్కే- ఒక్క చివర్లో ప్రియాంకా  వైర్ వర్క్ యాక్షన్ సీన్ తప్ప. ఇందులో హైలైట్ అనదగ్గ సీన్లన్నీ యాక్షన్ తో కూడుకున్నవే కావడం గమనార్హం. వీటిలో ఎమోషన్స్ వర్ణనాతీతం. సునీత తమ్ముడు డబ్లూ మెడకి బెల్టు బిగించి లాగే సీను, సీఐ సింగ్ ని మురిక్కాల్వలో పడేసి బబ్లూ చావదన్నే సీను, డబ్లూ అండ్ గ్యాంగ్ శవాల్ని చెట్టుకి వేలాడదీసే సీను, డబ్లూని సింగ్ బజార్లో ఈడ్చి ఈడ్చి తన్నేసీను,  ఎస్పీ ఆభా లాఠీచార్జి జరిపి అమ్మాయిని కాపాడే సీను, సునీతని లారీలో తిప్పుతూ దొరక్కుండా డబ్లూ రేప్ చేస్తూంటే ఆ లారీని పట్టుకోవడం కోసం ఆభా, సింగ్ లు వేదన పడే సీను, సునీత తమ్ముణ్ణి  బబ్లూ పట్టుకుని ఉరి తీయబోయే సీను... ఇలా లాండ్ మార్క్ సీన్స్ ఎన్నో. ఇక ఏ స్థాయి పోలీసుల్ని కూడా యూనిఫామ్స్ లేకుండా జీన్సు షర్టు లేసి ఫ్యాషన్ షో బొమ్మల్లాగా చూపించలేదు. పక్కా ప్రొఫెషనలిజం ఇక్కడ!


          ఒక ఎమోషనల్ ట్రావెల్ ఈ సినిమా  - కరుడుగట్టిన మాస్టర్ మైండ్ ప్రకాష్ ఝా చేతిలో.

 

 

-సికిందర్