రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

8, నవంబర్ 2022, మంగళవారం

1245 : రివ్యూ!


రచన -దర్శకత్వం :  రాకేష్ శశి
తారాగణం : అల్లు శిరీష్, నూ ఇమ్మాన్యుయేల్, వెన్నెల కిషోర్, సునీల్
కథ : ఏలన్, సంగీతం: అనూప్ రూబెన్స్ (పాటలు),అచ్చు రాజమణి (నేపథ్య సంగీతం); ఛాయాగ్రహణం : తన్వీర్ మీర్
బ్యానర్స్ : శ్రీ తిరుమల ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్, GA2 పిక్చర్స్
సమర్పణ: అల్లు అరవింద్
నిర్మాతలు: ధీరజ్ మొగిలినేని, విజయ్ ఎమ్
విడుదల : నవంబర్ 4, 2022

***

        2013లో గౌరవం తో హీరోగా ప్రవేశించిన అల్లు శిరీష్ ఆ తర్వాత నటించిన 4 సినిమాలూ కలిసిరాలేదు. మార్పు లేకుండా రోమాంటిక్ సినిమాలు నటించడం ఒకటైతే, అల్లు అర్జున్ తమ్ముడిగా అభిమానుల్ని సృష్టించుకోక పోవడం రెండో కారణం. అయినా తిరిగి 2019 తర్వాత ఇప్పుడు మరో రోమాంటిక్ నటిస్తూ ఊర్వశివో రాక్షసివో తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. హీరోయిన్ అనూ ఇమ్మాన్యుయేల్ తో కొత్త తరహా యూత్ రోమాన్స్ గా దీన్ని అభివర్ణించాడు దర్శకుడు రాకేష్ శశి. ఇతను 2018 లో చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ తో విజేత అనే సెంటిమెంటల్ తీశాడు. ఇది ఆడకపోయినా నిర్మాత అల్లు అరవింద్ ఇంకో అవకాశమిచ్చారు. దీన్ని దర్శకుడు నిలబెట్టుకున్నాడా? ఈసారి శిరీష్ కి సక్సెస్ దక్కిందా? ఇవి తెలుసుకుందాం...

కథ

మధ్య తరగతికి చెందిన శ్రీకుమార్ (అల్లు శిరీష్) సాఫ్ట్ వేర్ ఇంజనీర్. టైలరింగ్ చేసే తల్లి, ఎలక్ట్రికల్ షాపు నడిపే తండ్రీ వుంటారు. తొందరగా పెళ్ళి చేయాలని తల్లి (ఆమని) ప్రయత్నాల్లో వుంటుంది. కానీ కుమార్ ఆఫీసులో సింధుజ (అనూ ఇమ్మా న్యూయెల్) ని వెంటపడి ప్రేమకి ఒప్పిస్తాడు. ఆమె ప్రోత్సాహంతో ఆమెతో ఒక రాత్రి గడిపాక, పెళ్ళంటే ఇష్టం లేదని, పెళ్ళి లేకుండా కలిసి వుండచ్చని చెప్పేస్తుంది. దీంతో హర్ట్ అయిన కుమార్ ఆత్మహత్యాయత్నం చేస్తాడు. తర్వాత ఆమెతో సహ జీవనానికి ఒప్పుకుని ఇంటికి దగ్గర్లోనే ఆమెతో మకాం పెడతాడు.

ఇప్పుడు తల్లిదండ్రులకి తెలియకుండా సాగిస్తున్న వ్యవహారం ఎలా బయటపడింది? అప్పుడు తల్లిదండ్రులేం చేశారు? తల్లి కోసం కుమార్ సింధుజని పెళ్ళికి ఒప్పించుకోగల్గాడా? పెళ్ళి కంటే పారిస్ లో రెస్టారెంట్ తెరవాలనుకుంటున్న సింధుజ ఏం నిర్ణయం తీసుకుంది? ఇదీ మిగతా కథ. 

ఎలావుంది కథ
  

2018 లో తమిళంలో వచ్చిన ప్యార్ ప్రేమ కాదల్ కి రీమేక్ ఇది. అతను పెళ్ళి అంటాడు, ఆమె పెళ్ళి లేకుండా ప్రేమ అంటుంది. సాధారణంగా ప్రేమించిన హీరోయిన్ తో గడిపి హీరో మోసం చేసే సినిమాలుంటాయి. ఇందులో రివర్స్ చేశారు. సింధుజ తనని ప్రేమిస్తున్న కుమార్ తో ఓ రాత్రి గడిపి ఇక చాలు పొమ్మనే సినిమా ఇది. సెక్స్ ని క్యాజువల్ గా తీసుకోవాలంటుంది. ఆమె అమెరికాలో పెరిగింది కాబట్టి ప్రేమా గీమా తెలియవనే సంజాయిషీ ఇచ్చుకున్నారు. ఐతే అమెరికాలో సెక్స్ ని ఎంజాయ్ చేసిందా అన్న ప్రశ్న వస్తుంది. కుమార్ తో గడిపి సెక్స్ చాలు పొమ్మందంటే ఆమె క్యారెక్టరే సందేహాస్పదమవుతుంది. లోతుగా ఆలోచించకుండా పైపైన రాసేసి, కెమెరా పెట్టి బెడ్రూంలో తీసేస్తే ఇలాగే తయారవుతుంది పాత్ర.

ఇలా అమెరికాలో పెరిగింది కాబట్టి ప్రేమా గీమా తెలియవనే తెలివిలేని వివరణ ఇస్తూనే
, ఆమెకి పారిస్ లో రెస్టారెంట్ తెరవాలన్నది కల కాబట్టి దానికోసం పెళ్ళీ పిల్లలూ సంసారం పక్కన బెట్టినట్టు మళ్ళీ చెప్పారు. ఇలా రెండు కారణాలెలా వుంటాయి. మొదటి కారణాన్ని బైపాస్ చేసి రెండో కారణం మీద నిలబడ్డారు. ప్రాబ్లం ఏమిటంటే ఇది కుమార్ కి తెలియదు. కథలో జరుగుతున్న విషయాలు ప్రధాన పాత్రయిన కథానాయకుడికే తెలియకపోతే కథెలా నడపుతాడు. సినిమా ఏం నిలబెడతాడు.

అంటే కథకుడు కథానాయకుడికి విషయం తెలియకుండా అడ్డు పడుతున్నాడు. తెలిస్తే కథ వేరే అయిపోతుంది. తెలిస్తే ఆమె పారిస్ కల నిజం చేయడానికే పూనుకుంటాడు తప్ప పెళ్ళి కోసం పట్టుబట్టడు. కాబట్టి కథానాయకుడ్ని హీరోయిన్ విషయాలు తెలియకుండా వుంచేశాడు. కథలో కథకుడు తలదూర్చి కథానాయకుడి కథ తను నడపడమంటే కథా నాయకుడ్ని పాసివ్ క్యారక్టర్ గా మార్చడమే. ఇలా కుమార్ పాసివ్ పాత్ర.

సరే
, ఇంత రాడికల్ గా వున్న సింధుజకి ఎదుటి పాత్రగా కుమార్ సకల సుగుణాలతో కన్సర్వేటివ్ గా వుంటేనే కదా కథకి సంవాదం (కాన్ఫ్లిక్ట్) అనేది పుడుతుంది.

అలా హీరో కుమార్ ది అంత దేవదాసు ప్రేమో
, అర్జున్ రెడ్డి ప్రేమో కాదు. అతను మ్యాడ్ లవర్ ఏమీ కాదు. ప్రేమలో మోసపోయి ప్రేక్షకుల సానుభూతి పొందగల్గేంత పాత్ర చిత్రణేమీ లేదు. టైటిల్ ప్రకారం సింధుజ వరకూ రాక్షసిగా బాగానే వుంది. కుమారే అమాయక చక్రవర్తిలా లేడు. సినిమాలో మొదటి నలభై నిమిషాల సేపు ఆమెని ప్రేమలో పడెయ్యడానికి సాఫ్ట్ వేర్ ఆఫీసు అనికూడా లేకుండా చేసే అల్లరి, కామేడీ, పోకిరీతనం ఇవన్నీ అతడ్ని క్లాసిక్ లవర్ గా, తర్వాత సున్నిత మనస్కుడైన ఓ భగ్న ప్రేమికుడిగా మనం ఫీలయ్యే అవకాశాన్ని లేకుండా చేశాయి.

1991 లో కమల్ హాసన్ నటించిన క్లాసిక్ గుణ లో హీరోయిన్ ప్రేమ కోసం పిచ్చివాడై ఆమెని కిడ్నాప్ చేసేదాకా వెళ్ళే భావోద్వేగాలతో భగభగ మండిస్తాడు కమల్. ఇలా కుమార్- సింధుజల మధ్య ఇంటర్వెల్లో కాన్ఫ్లిక్ట్ కి, కుమార్ పాత్రేతర పాత్ర చిత్ర ణతో బలం లేకపోయాక, సెకండాఫ్ లో కుమార్ ఆమెతో సహజీవనానికే ఒప్పుకునే ప్లేటు ఫిరాయింపుతో, పూర్తిగా కాన్ఫ్లిక్టే లేకుండా చేశారు కథకి. హీరో మంచోడు, విలన్ మంచోడైతే ఇక కథేముంటుంది.

ఇలా ఇంటర్వెల్లోని కాన్ఫ్లిక్ట్ కూడా క్యాన్సిలై పోయాక
, సెకెండాఫ్ లో వేరే కాన్ఫ్లిక్ట్ పుట్టించి ఇంకో నష్టం చేసుకున్నారు. ఫస్టాఫ్ ఒరిజినల్ కాన్ఫ్లిక్ట్ క్యాన్సిలై, సెకండాఫ్ డూప్లికేట్ కాన్ఫ్లిక్ట్ రావడం వల్ల స్క్రీన్ ప్లే అనే మధ్యకి ఫ్రాక్చరై, సెకండాఫ్ సిండ్రోమ్ అనే సుడిగుండంలో పడ్డాక, ఇక ఈ సినిమా ఫ్లాపవకుండా కాపాడే నాథుడే లేకుండా పోయాడు.

ఈ ఎత్తుకున్న తాజా కాన్ఫ్లిక్ట్ ఏమిటంటే
, కుమార్ రహస్యంగా సాగిస్తున్న సహజీవనం తల్లిదండ్రులతో ఘర్షణగా మారిపోవడం. ఈ రోమాంటిక్ డ్రామా కాన్ఫ్లిక్ట్ ప్రేక్షకులాశించే విధంగా హీరోహీరోయిన్ల మధ్య కొనసాగాల్సింది పోయి- తల్లిదండ్రుల మీదికి షిఫ్ట్ అయి- జానర్ మర్యాదకీ, ఫీల్ కీ, యూత్ అప్పీల్ కీ, బాక్సాఫీసు అప్పీల్ కీ, మొత్తంగా మార్కెట్ యాస్పెక్ట్ కే దెబ్బ కొట్టేసే దుశ్చర్యగా మారింది. ఒక కథకి ఒకే కాన్ఫ్లిక్ట్ అన్న కామన్ సెన్సు కూడా లేకపోతే ఎలా? ఈమధ్య ఒక మేకర్ తో ఇలాంటిదే సమస్య- సర్దార్ లో లాంటి సమస్య. చెప్తే వినిపించుకోకపోతే ఏం చేస్తాం. కథలో ఒక కాన్ఫ్లిక్ట్ ఏర్పడిందంటే అదెన్నో భావోద్వేగాలతో ముడిపడి వుంటుంది. దాన్ని కొల్లగొట్టి ఇంకో కాన్ఫ్లిక్ట్ తో ఇంకేవో భావోద్వేగాలు సృష్టిస్తామంటే- ఇదేమన్నా పేకాటా? పేకాటాడుకుంటే ఒకే కాన్ఫ్లిక్ట్ కి కట్టుబడి ఆడుకోవాలి.

సెకండాఫ్ లో ఇంటికి దగ్గర్లోనే రహస్యంగా సహజీవనం మకాం పెట్టి
, పేరెంట్స్ ని ఇంట్లోనే వున్నట్టు నటిస్తూ, కిటికీ గుండా రాకపోకలు సాగించే టైపు కామెడీ ఎన్ని సినిమాల్లో చూడలేదు. ఈ కాలం చెల్లిన టెంప్లెట్ కామెడీ- అబద్ధం చెప్పి ఆడుకునే పాత ఆటతో- గత రెండు నెలల్లోనే వికృత టైటిల్ తో కృష్ణ వ్రింద విహారి’, పాత టైటిల్ తో స్వాతిముత్యం వచ్చి ఫ్లాపయ్యాయి.

ఫస్టాఫ్ లో సింధుజని ప్రేమలో పడెయ్యడానికి నలభై నిమిషాలు కామెడీలతో గడిపి ఇంటర్వెల్లో సీరియస్ చేసినట్టు
, తిరిగి సెకండాఫ్ లో దొంగచాటు సహజీవనంతో ఇంకో 40 నిమిషాలు కామెడీలు నడిపి, ముగింపు సీరియస్ చేశారు. దీంతో కొసరు కథతో ఎమోషన్ లేకుండా పోయింది. కథ లేకపోయినా, సహజీవనం పేరుతో అనేక లిప్ లాక్ సీన్లు, ఎరోటిక్ సీన్లు, డబుల్ మీనింగు డైలాగులు - వీటితో ఏమాత్రం నిలబడలేదు సినిమా.

నటనలు - సాంకేతికాలు

ఈసారి నటనాపరంగా, లుక్స్ పరంగా ఇంప్రూవ్ అయ్యాడు హీరో శిరీష్. మంచి కాస్ట్యూమ్స్ తో స్టయిలిష్ లవర్ బాయ్ గా వెండి తెరకి గ్లామర్ తీసుకొచ్చాడు. పాటల్లో మాస్ డాన్సులు, స్టెప్పులు వంటివి లేకుండా చూసుకున్నాడు. ఇక అల్లు శిరీష్ ఇంప్రూవ్ చేసుకోవాల్సింది సినిమాల క్వాలిటీనే. తన క్యారక్టర్స్ కి డెప్త్ తో కూడిన భావోద్వేగాల చిత్రణే. చేసేవి ప్రేమ సినిమాలైనప్పుడు ప్రేమలో బలం చూపించే, కదిలించే  సన్నివేశాలే.

హీరోయిన్ అనూ ఇమ్మాన్యుయేల్ తన మాట నెగ్గించుకునే రాడికల్ పాత్రలో బాగానే వుంది. అయితే తన పుట్టిన రోజు తనకే తెలియకుండా ఎలా చదువుకుంది, ఎలా జాబ్ లో చేరింది? ఇందుకే శిరీష్ ఆమె పుట్టిన రోజు ఆమెకి తెలియజేసే అద్భుతంగా తీసిన  సీనుకి అర్ధం లేకుండా పోయింది. దాంతో ఆమె మారడం కూడా కన్విన్సింగ్ గా లేకుండా పోయింది. శిరీష్ తో లిప్ లాక్స్ కి, మిగతా అడల్ట్ సీన్సుకీ మాత్రం కెమిస్ట్రీ తగ్గకుండా చూసుకుంది.

ఆమె తండ్రి  పాత్రలో పృథ్వీ, అతడి తల్లి పాత్రలో ఆమని కన్పిస్తారు. ఆఫీసులో కొలీగ్ గా వెన్నెల కిషోర్ కామెడీ చేస్తే, మేనమామగా సునీల్ కామెడీ చెయ్యడు. మేనల్లుడికి ప్రేమ సలహాలిస్తాడు.

మళ్ళీ ఈసారి అనూప్ రూబెన్స్ సంగీతంలో హిట్ సాంగ్స్ లేవు. చిత్రీకరణతో మాత్రం పాటలు కనువిందుగా వున్నాయి. 80 నిమిషాలు కామెడీ దృశ్యాలే వుండడంతో అచ్చు రాజమణి నేపథ్య సంగీతం గోలగోలగా వుంది అంత సేపూ. తన్వీర్ మీర్ కెమెరా వర్క్ క్లాస్ గా వుంది. సెట్స్ కి బాగా బడ్జెట్ ధారబోయడంతో విజువల్స్ అంతే రిచ్ గా వచ్చాయి. గత సినిమాలకంటే శిరీష్ కిది ప్రొడక్షన్ పరంగా క్వాలిటీ మూవీ, కంటెంట్ పరంగా కాదు. GA2 పిక్చర్స్ బ్యానర్ కి కథల ఎంపికతో కాన్ఫ్లిక్ట్ వున్నట్టుంది.

—సికిందర్
  

7, నవంబర్ 2022, సోమవారం

1244 : సండే స్పెషల్ రివ్యూ!


     గత్ప్రసిద్ధ బ్రిటిష్ డిటెక్టివ్ పాత్ర షెర్లాక్ హోమ్స్ గురించి తెలియని వారుండరు. షెర్లాక్ హోమ్స్ మీద చాలా సినిమాలొచ్చాయి. షెర్లాక్ హోమ్స్ చెల్లెలితో రాలేదు. షెర్లాక్ హోమ్స్  టీనేజీ చెల్లెలు డిటెక్టివ్ ఎనోలా హోమ్స్ సాహసాలతో సీక్వెల్స్ ప్రారంభమయ్యాయి. 2020 లో ఎనోలా హోమ్స్  విడుదలై విపరీత జనాదరణ పొందాక, దీని సీక్వెల్ గా ఈ నవంబర్ 4 న ఎనోలా హోమ్స్ 2  విడుదలైంది. నెట్ ఫ్లిక్స్ లో హిందీ ఆడియోతో అందుబాటులో వున్న ఈ డిటెక్టివ్ ఫన్ థ్రిల్లర్ ప్రశంసలందుకుంటోంది. డిటెక్టివ్ ఎనోలాగా తిరిగి మిల్లీ బాబీ బ్రౌన్ కాస్త కొంటె తనం, తెగువ గల అదే నటనని ఫన్నీగా కొనసాగించింది. అన్న షెర్లాక్ హోమ్స్ గా హెన్రీ కావిల్ నటించాడు. ఈ సీక్వెల్ కి కూడా హారీ బ్రాడ్ బీర్ దర్శకత్వం వహించాడు. బ్రిటిష్ నటీనటులతో, దర్శకుడితో అమెరికన్ కంపెనీతో బాటు మిల్లీ బాబీ బ్రౌన్ నిర్మాతగా వుంది. ఎనోలా మిల్లీ బాబీ బ్రౌన్ 2004 లో జన్మించిన 18 ఏళ్ళ టీనేజర్.

        నోలా పాత్ర ఎలా పుట్టిందని తెలుసుకుంటే, ఈ షెర్లాక్ హోమ్స్ టీనేజర్ చెల్లెలి పాత్రని సృష్టించింది అమెరికన్ రచయిత్రి నాన్సీ స్ట్రింగర్. యంగ్ అడల్ట్ ఫిక్షన్ కింద ఈ పాత్రని సృష్టించి, ఎనోలా హోమ్స్ మిస్టరీస్ పేరుతో ఏడు నవలలు రాసింది. వీటిలో రెండు సినిమాలుగా వచ్చాయి. ఎనోలా హోమ్స్ 2 19 వ శతాబ్దపు షెర్లాక్ హోమ్స్ కాలంలోనే పీరియెడ్ మూవీగా వుంటుంది. నేర పరిశోధన అంటే మన తెలుగు సినిమాల్లోలాగా ఇన్వెస్టిగేషన్ తోనే బోరు కొట్టించకుండా, ఇన్వెస్టిగేషన్ కి యాక్షన్ ని జోడించుకుని ఫన్ రైడ్ గా వుంటుందిది. ఈ కథ ఇంగ్లాండులో 1888 లో అగ్గిపెట్టెల కర్మాగారంలో జరిగిన మ్యాచ్ గర్ల్స్ స్ట్రయిక్ (అగ్గిపుల్లల కార్మికురాళ్ళ సమ్మె) ఆధారంగా వుంటుంది.

చదువు మానేసి చలో లండన్ కి...

    ఎనోలా హోమ్స్ చదువుకోకుండా తల్లిని వదిలేసి లండన్ పారిపోయి వచ్చి అన్నలాగా డిటెక్టివై, హోమ్స్ వంశం పేరు నిలబెట్టాలనుకుంటుంది. కానీ అన్న షెర్లాక్ హోమ్స్ తన వరల్డ్ ఫేమస్ చిరునామా 221 బి, బేకర్స్ స్ట్రీట్ లో తిరుగులేని డిటెక్టివ్ గా చెలామణి అవుతున్నాడు. అన్నకి తెలియకుండా తను  హోమ్స్ డిటెక్టివ్ ఏజెన్సీ అని ప్రారంభించి కూర్చుంటే, రెండు కారణాలతో కేసులు రావడం లేదు : ఒకటి, సొంత ఐడెంటిటీ లేక అన్న చాటు పిల్లగా బ్రతకాల్సి రావడం; రెండు, అమ్మాయి కావడం. దీంతో ఇక లాభంలేదని మూటా ముల్లె సర్దుకోబోతూంటే, ఓ 14 ఏళ్ళ అమ్మాయి బెస్సీ వచ్చి వరంలా కేసు దానమిస్తుంది.

        బెస్సీ అక్క సారా కనిపించడం లేదని ఫిర్యాదు. ఎనోలా వాళ్ళింటికి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. బెస్సీ, సారా అగ్గిపెట్టెల కర్మాగారంలో కార్మికురాళ్ళు. అక్కడేమైనా క్లూ దొరుకుతుందేమోనని ఎనోలా కార్మికురాలిగా చేరుతుంది. వందల మంది కార్మికురాళ్ళని నోటి పరీక్ష జరిపి లోపలికి పంపిస్తూ వుంటారు. అది టైఫస్ విషజ్వరం పరీక్ష. చాలామంది ఈ విషజ్వరంతో చనిపోతున్నారు. కార్మికురాలిగా లోపలికి వెళ్ళిన ఎనోలా కన్నుగప్పి మేనేజర్ ఆఫీసులోకి దూరి పరిశోధన చేస్తుంది. కొన్ని అగ్గిపుల్లలు దొరుకుతాయి. అవి ఇప్పుడు తయారవుతున్న తెలుపు రంగు బదులు ఎరుపు రంగు అగ్గిపుల్లలు.

        ఎనోలాకి మే అనే కార్మికురాలి మీద అనుమానం వచ్చి ఆమెని అనుసరిస్తుంది.  మధ్యలో బాగా తాగి వస్తున్న షెర్లాక్  హోమ్స్ కనిపిస్తాడు. అతడ్ని ఇంటి దగ్గర దిగబెడుతుంది. అతనొక కేసుని ఛేదించడానికి ఒంటరిగా కష్టపడుతున్నాడని తెలుసుకుంటుంది. తను కూడా తన కేసుతో ఒంటరిగానే కష్టపడుతోంది. ప్రభుత్వాధికారులు పాల్పడుతున్న బ్లాక్ మెయిల్ షెర్లాక్ చూస్తున్న కేసు. అయితే వాళ్ళ ఖాతాల్లోకి డబ్బు ఎక్కడ్నించి వస్తోందో అంతు చిక్కకుండా వుంది.

        తర్వాత మే కోసం వెళ్ళిన ఎనోలా అక్కడ మే ని చంపిన నేరం మీదపడి, పట్టుకోవడానికి వచ్చిన స్కాట్ లాండ్ యార్డ్ పోలీసు అధికార్లని కొట్టి పారిపోతుంది. ఇప్పుడు పోలీసుల నుంచి తప్పించుకుంటూ కేసు ఎలా ఛేదించింది ఎనోలా? అసలు సారా ఏమైంది? కార్మికురాళ్ళు టైఫస్‌తో కాకుండా అగ్గిపుల్లల్లో ఉపయోగించే తెల్లటి భాస్వరం వల్ల చనిపోతున్నారని ఎనోలా కెలా తెలిసింది? ఆర్ధిక మంత్రి లార్డ్ మెక్‌ఇంటైర్ లాభాలు సంపాదించడానికి చౌకగా ఉండే భాస్వరాన్ని ఉపయోగించి అగ్గిపుల్లలు ఉత్పత్తి చేస్తున్నాడని ఎప్పుడు తెలిసింది? తన వెంటపడుతున్న స్కాట్ లాండ్ యార్డ్ అధికారులు కూడా బ్లాక్ మెయిలర్సేనా? కౌంటర్ కేసులో పీకల్లోతు ఇరుక్కున్న చెల్లెల్ని షెర్లాక్ హోమ్స్ ఎలా కాపాడాడు? ఇద్దరూ కలిసి అగ్గిపెట్టెల కర్మాగారం కుంభ కోణాన్ని ఎలా రట్టు చేశారు? ఇవన్నీ రసవత్తరంగా సాగే ఈ విక్టోరియా కాలపు మిగతా కథలో తెలుస్తాయి.

మిల్లీ బాబీ బ్రౌనే హైలైట్

        ఎనోలా హోమ్స్ గా మిల్లీ బాబీ బ్రౌన్ తో చాలా ఫన్ ఇదంతా. టీనేజీ తెగువ, ప్రమాదాల్ని తేలికగా తీసుకునే తత్వం, హాస్యం, చిలిపితనం, కొంటె తనం- తెలిసీ తెలియక ఏం చేస్తోందో అర్ధంగాని సాహసకృత్యాలు- ఇవన్నీ కలర్ఫుల్ క్యారక్టర్ గా మార్చేశాయి. ప్రారంభమే పోలీసులతో ఛేజింగ్, యాక్షన్; హత్యలో ఇరుక్కునే సన్నివేశంలో పోలీసు అధికారుల్ని మోతమోగించి పారిపోయే ధైర్యం - క్లయిమాక్స్ వరకూ ఇదే స్పీడు. ఆమెలో ప్రవహిస్తోంది హోమ్స్ రక్తమే.

        చివరికి జైల్లో ఇక ఉరి వేస్తారనగా ఆమె తల్లి వచ్చేసి, జైలరమ్మతో కలిసి కూతుర్ని విడిపించుకుని పారిపోయే దృశ్యం ఇంకా వినోదం. ముగ్గురు ఆడవాళ్ళు  గుర్రబ్బగ్గీలో పారిపోతూ వెంటాడుతున్న పోలీసుల్ని - ఎస్పీ సహా- బాంబులతో బెంబేలెత్తించి గెలిచే యాక్షన్ ఎపిసోడ్ ఆ కాలంలో స్త్రీ శక్తిని హైలైట్ చేస్తుంది.

        స్త్రీవాదం, పారిశ్రామిక కుట్ర, శ్రామికవర్గ తిరుగుబాటు, ప్రేమ కథ, తల్లి నుంచి జీవిత పాఠాలు, అన్న నుంచి సహకార గుణం వంటి అంశాలతో ఈ రెండు గంటల సినిమా స్పీడుగా సాగుతుంది. ఎనోలా పాత్రకి ఇంకో టెక్నిక్ వాడారు. ఫోర్త్ వాల్ టెక్నిక్. అంటే పాత్ర కెమెరా వైపు తిరిగి ప్రేక్షకులతో మాట్లాడే ప్రక్రియ. దీంతో అడుగడుగునా ప్రేక్షకులు ఆమెతో ఇన్వాల్వ్ అయిపోతారు. ఆ మాట్లాడే రెండు మాటలు చాలా తమాషాగా వుంటాయి. ఆమె హావభావాలు, శరీర భాషా ఫన్నీగా వుంటాయి.

        షెర్లాక్ పాత్రలో హెన్రీ కావిల్ డౌన్ ప్లే చేస్తాడు. ఎనోలా పాత్ర హైలైట్ అవడానికి తను బ్యాక్ గ్రౌండ్ లో వుంటాడు. ఆమె మరీ ప్రమాదంలో పడిపోతే తప్ప ముందుకు రాడు. ఒంటరిగా ఏదైనా సాధించగలననుకునే ఎనోలా, ఒంటరిగా కష్టపడుతున్న అన్న మాటలు వింటుంది. మనుషులు ఒంటరిగా ఏం సాధించలేరని, ఆధారపడడానికి ఒకరుండాలని, షెర్లాక్ చెప్పడంతో ఒప్పుకుంటుంది. 'హోమ్స్ అండ్ హోమ్స్' అని కంబైన్డ్ ఏజెన్సీ ప్రారంభిస్తారు.

        ఇంతకీ షెర్లాక్ తో వుండే అసలు తోడు ఏమయ్యాడు? అతను ముగింపులో ఏదో పనుండి వస్తాడు. తన పేరు డాక్టర్ వాట్సన్ అంటాడు. ఇలా నేర పరిశోధనల్లో షెర్లాక్ వెంట వుండే పాపులర్ పాత్ర డాక్టర్ వాట్సన్ పరిచయమవుతుంది. రెండో సీక్వెల్ వుంటే ఈ పాత్ర  కూడా వుండొచ్చు.

ఇందులో స్ఫూర్తి ఏమిటి?

        హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లో హీరోయిన్ పాత్ర తీరుతెన్నుల్ని ఆద్యంతం కట్టిపడేసేలా చేయడమెలాగో తెలుసుకోవచ్చు. 20 లోపు టీనేజీ హీరోయిన్ పాత్రతో, అదే ఏజీ గ్రూపు హీరోయిన్ తో, కొత్తగా యంగ్ అడల్ట్ ఫిక్షన్ జానర్ ని తెలుగులో ప్రవేశ పెట్టవచ్చని ఆలోచించవచ్చు. కథలో స్త్రీ సమస్య వుంటే దాన్ని శాకినీ ఢాకినీ లోలాగా హీరోయిన్ల పాత్రలు ముట్టుకోకుండా పలాయనం చిత్తగించడం కుదరదని తెలుసుకోవచ్చు. కర్మాగారంలో కార్మికురాళ్ళు ప్రాణాంతక సమస్యతో వుంటే ఎనోలా వూరుకోకుండా సమ్మె చేయించే సామాజిక బాధ్యత తీసుకోవడాన్ని గమనించవచ్చు. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లో ఇతర స్త్రీ పాత్రల చేత సాహసాలు కూడా చూపించి జానర్ ఫీల్ ని పెంచొచ్చు. ప్రేక్షకుల్ని సినిమాలో యాక్టివ్ గా ఇన్వాల్వ్ చేయడానికి ఫోర్త్ వాల్ టెక్నిక్ ని వాడవచ్చని తెలుసుకోవచ్చు.  

—సికిందర్

 

3, నవంబర్ 2022, గురువారం

1243 : సందేహాలు- సమాధానాలు

Q :    ఒక కాంటెస్ట్ కోసం షార్ట్ ఫిల్మ్ చేశాముచూసి ఫీడ్ బ్యాక్ ఇవ్వగలరా? కాంతారా ఇలాంటి థీమ్ తో ఉండడంతో యూట్యూబ్ లో రిలీజ్ చేశాం.
జయసింహా, రచయిత - దర్శకుడు
A :   మీరు పంపిన  షార్ట్ ఫిలిం కొమ్ముకథ కాన్సెప్ట్ బావుంది. కొమ్ము కథ సాంప్రదాయం ప్రకారం కాటమ రాజు వాసరుసులు చనిపోతే పెద్ద కర్మని కొమ్ము కథ తో ప్రారంభిస్తారు. మీ కథలో భాగంగా చనిపోయిన వ్యక్తి వారసుడ్ని కాటమరాజు పూనకం ద్వారా ఆవహిస్తాడని నమ్మకమని వాయిసోవర్ వేస్తూ ప్రారంభించారు.

        కథ చెప్పేసే ఈ వాయిసోవర్ ముందు వేయడం వల్ల కథ తెలిసి పోతోంది. వాయిసోవర్ తర్వాత హీరో రాజు కత్తి తో కాపుకాసే సీను వేశాక, వెంటనే అతడి తండ్రి చనిపోయిన సీను ఫ్లాష్ బ్యాకుగా వేయడం ద్వారా ఏం జరిగిందో కూడా తెలిసి పోతోంది. ఆ తర్వాత రాజు తండ్రి కొండయ్య, సిద్దప్ప అనే విలన్ జీవాల గురించి మాట్లాడుకునే ఫ్లాష్ బ్యాకు సీను వేశారు. ఈ సీనుతోనే ఫ్లాష్ బ్యాకు ప్రారంభించాలి. తండ్రి మరణ దృశ్యంతో కాదు.

        తర్వాత పెద్ద కర్మ ఏర్పాట్లతో ఇంకో ఫ్లాష్ బ్యాక్ వేశారు. మళ్ళీ మిగతా కథలోకి వచ్చారు. రాజు తండ్రి కొండయ్య ఎలా చనిపోయాడో చూపించి - పెద్దకర్మ దగ్గర కొమ్ము కథతో మీరన్నట్టు విలన్ని శిక్షించే కాంతారా టైపు ముగింపు వేశారు.  

        14 నిమిషాల ఈ షార్ట్ ఫిలింలో ముందు వేసిన వాయిసోవర్ తీసేసి, కథ తెలిసిపోయే ఫ్లాష్ బ్యాకులు (తండ్రి మరణ దృశ్యం, పెద్దకర్మ ఏర్పాట్ల దృశ్యం) తీసేసి- మిగిలింది యధాతథంగా వుంచితే సస్పెన్సుతో  వుంటుంది. ఆ పెద్దకర్మ విశిష్టత, పూనకం పూని శిక్షించిన విధానం అర్ధం గాకుండా వుంటాయి. అప్పుడు చివర్లో వాయిసోవర్ వేసి విషయం చెప్తే అర్ధవంతంగా వుంటుంది. వీలైతే దీన్ని ఈ విధంగా ఎడిట్ చేసుకుని చూడండి. ఎఫెక్ట్ మీకే తెలుస్తుంది. ఇకపోతే, చంపిన విధానాన్ని ఇంకా పొడిగించి చూపిస్తే సస్పెన్స్ పెరుగుతుంది.

        ఇక కూడెట్టే ఏ పనీ తప్పు కాదు, కానీ అందులో నిజాయితీ వుండాలి అని కొడుకుతో అంటాడు తండ్రి. అంటే కూటి కోసం హత్యలైనా నిజాయితీగా చేయాలనా? ఉద్దేశం ఇది కాదేమో. నిజాయితీ బదులు నీతి అని వుండాలేమో? చిత్రీకరణతో, తక్కువ మాటలతో నటింపజేసుకోవడాలతో దర్శకత్వం బావుంది.  

Q :   మా అనిల్ నటించిన సినిమా లింక్ పంపిస్తున్నాను. చూసి అనిల్ బాగా చేస్తేనేమీరు రివ్యూ ఇవ్వండి, ఫోటో ఫ్రేమ్ లో పెడతాం.
భమిడిపాటి కిరణ్ కుమార్
A :   ఇవేం మాటలు సార్. తప్పకుండా త్వరలో ఇద్దాం. అనిల్ బాగానే చేస్తాడుగా, అందులో సందేహమెందుకు? తను పైకొచ్చే సినిమాలు చేయాలంతే.

Q :  ఈ మధ్య మీరు స్క్రీన్ ప్లే సంగతులు రాయకుండా రివ్యూలు రాస్తున్నారు. రివ్యూలు మేమెక్కడైనా చదువుకోగలం. దయచేసి స్క్రీన్ ప్లే సంగతులు రాయండి.   
—కెవిపి, అసోషియేట్  
A :   వస్తున్న సినిమాలకి స్క్రీన్ ప్లే సంగతులు రాస్తే నవ్వుతారని రాయడం లేదు. అయినా పాత స్క్రీన్ ప్లే సంగతులు చదివితే కొత్త సినిమాల స్క్రీన్ ప్లే సంగతులు తెలిసిపోతాయి. కాంతారా గాథగా ఎందుకు హిట్టయ్యిందో రాయాలి, రాద్దాం. ఇంకేవైనా కొత్తగా అన్పించే వాటిగురించి రాద్దాం, ఓపిక పట్టండి.

Q :   సర్దార్ సినిమాలో దేశద్రోహం అభియోగం అనేది బలమైన ఎమోషన్ గా అనిపించిది. కానీ వాటర్ బాటిల్ స్కామ్ వలన జరిగే నష్టాలు అనే ఎమోషన్ కలపడం వలన హీరోకు ఉన్న దేశద్రోహం అభియోగం తాలూకు బలమైన ఎమోషన్ వీగిపోయిన ఫీలింగ్ కలిగింది. దీనిపై మీ అభిప్రాయం తెలుపగలరు.
జయసింహా, రచయిత - దర్శకుడు
A :    ఓరి దేవుడా లో శోభనం రాత్రి కిస్ చేయబోతే అతడికి నవ్వొస్తుంది. చిన్నప్నట్నుంచీ  ఫ్రెండ్ గా చూస్తున్న ఆమెని రోమాంటిక్ గా చూడలేని సమస్య అతడిది. దీంతో ఇద్దరికీ భావోద్వేగాలు ఏర్పడక మానవు. ఈ భావోద్వేగాలతో, సమస్యతో మిగతా కథ ఎలావుంటుందా అని ఎదురుచూస్తాం. కానీ దీన్ని వదిలేసి, లేదా మర్చిపోయి, అతను స్కూల్ సీనియర్ తో తిరుగుతున్నాడనే అనుమానాలు ఆమెకి సృష్టించి, గొడవలు పెంచి విడాకులకి దారి తీయించాడు.

        విడాకులకి దారి తీయాల్సింది ఆమెని రోమాంటిక్ గా చూడలేని అతడి మానసిక సమస్యా, లేక దీన్నొదిలేసి కల్పించుకున్న ఇంకో గొడవా? ఒక కథ ఒక భావోద్వేగం చుట్టే వుంటుంది. ఒక భావోద్వేగాన్ని డ్రైవ్ చేశాక రెండోదానికి స్థానముండదు. వుంటే మౌలిక భావోద్వేగమైన మొదటిది వీగిపోతుంది. దాని స్థానంలో వచ్చే రెండోది కూడా నిలబడదు.   

అందుకు మౌలిక భావోద్వేగాన్నే కొనసాగిస్తూ, స్కూల్ సీనియర్ తో అనుమానాలు సృష్టించి- ఇందుకా నీకు నా మీద మనసు కలగడం లేదని ఆమె చేత గొడవ పెట్టిస్తే -రెండో భావోద్వేగం పుట్టే సమస్యే వుండదు. మొదటిదాని కొనసాగింపే కథలో ఈ మలుపుగా వుంటుంది. ఇలా చేయకుండా మౌలిక భావోద్వేగంతో కథని అక్కడే కత్తిరించి, అనుమానాలతో ఇంకో కథ ఆతికించాడు. సాధారణంగా సినిమాల్లో ఫస్టాఫ్ లో ఒక ముక్క, సెకండాఫ్ వేరే ముక్కగా ఇంకో కథ వచ్చేసి సెకండాఫ్ సిండ్రోమ్ అనే సుడిగుండాన్ని సృష్టిస్తూంటాయి. ఇక్కడ ఫస్టాఫ్ లోనే రెండు ముక్కల కింద నరికి చూపించేశాడు, ఏం తొందర వచ్చిందో.

        ఇదే వారం విడుదలైన  సర్దార్ దీ ఇదే సమస్య. మీరన్నట్టు దేశద్రోహ అభియోగం, వాటర్ బాటిల్ స్కామ్ రెండూ వేర్వేరు భావోద్వేగాలు. రెండు వేర్వేరు సినిమాలు తీయాలి.  వాటర్ బాటిల్ స్కామ్ తో సమాజానికి జరిగే హానియనే భావోద్వేగం కలపడంతో, కథలో  దేశద్రోహం అభియోగంతో వున్న మౌలిక భావోద్వేగం వీగిపోయి - అంటే ఎమోషనల్ కంటిన్యూటీ తెగిపోయి - ప్రేక్షకులు ఏకధాటిగా అనుభవించాల్సిన ఫీల్ చెదిరిపోయింది. అయినా సినిమా హిట్టయ్యిందంటే ఇలాటి జోడు భావోద్వేగాల ఫీల్ చెదిరిన సినిమాలు కూడా నాటుగా చూస్తామని ప్రేక్షకులిస్తున్న సందేశం. ఈ మధ్య జనాలకి మనోభావాలు ఎక్కువై పోయాయి.
—సికిందర్

 

1, నవంబర్ 2022, మంగళవారం

1242 : హాలీవుడ్ రివ్యూ!


 

        టీవల సీరియల్ కిల్లర్ సినిమాలు పెరిగిపోయాయి. ఈ థ్రిల్లర్స్ కి ప్రేక్షకులు ఎక్కువ వుంటున్నారని, మంచి వ్యాపార సాధనమనీ కుప్పతెప్పలుగా తీసి మార్కెట్లో వదులుతున్నారు. అయితే సీరియల్ కిల్లింగ్స్ అన్నది ప్రపంచవ్యాప్తంగా ఒక సమస్యగా ఎందుకు మారింది, దీన్నెలా అరికట్టాలి, అసలు దీని మూల కారణాలేమటీ తెలియజెప్పే కోణంలో సినిమాలు రావడం లేదు. సీరియల్ కిల్లింగ్స్ కి బలయ్యేది అమాయకులే. హంతకుడితో ఏ సంబంధంలేని అమాయకులు. అమాయకుల్ని బలితీసుకునే టెర్రరిజం, సీరియల్ కిల్లింగ్స్ రెండూ ఒకటే. కానీ టెర్రరిజానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకునే ప్రభుత్వాలు సీరియల్ కిల్లింగ్స్ మీద దృష్టి పెట్టడం లేదు. 400 మందిని చంపగల సీరియల్ కిల్లర్స్ ఏ టెర్రరిస్టులకీ తక్కువ కాదు. సీరియల్ కిల్లర్స్- టెర్రరిస్టులు ఇద్దరూ మానసిక రోగులే.

    యితే ఇవేమీ చర్చించకుండా ఇంకో సీరియల్ కిల్లర్ సినిమా రోటీనుగా వచ్చేసింది. ది గుడ్ నర్స్ పేరుతో ఈ నెల 21న విడుదలైంది. నెట్ ఫ్లిక్స్ లో తెలుగు ఆడియోతో అందుబాటులో వుంది. దీని దర్శకుడు డెన్మార్క్ కి చెందిన టోబియాస్ లిండ్హామ్. ఇందులో నర్సు అమీగా జెస్సికా చాస్టెయిన్, సీరియల్ కిల్లర్ చార్లీ కొలెన్ గా ఎడ్డీ రెడ్మాయెన్ నటించారు. పోలీస్ డిటెక్టివ్ డానీగా నామ్డో అసాముగా, ఇంకో పోలీస్ డిటెక్టివ్ టిమ్ గా నోవా ఎమరిచ్ టిమ్లా నటించారు. సంగీతం బయోస్ఫేర్, ఛాయాగ్రహణం జోడీ లీ లైప్స్. ఈ అమెరికన్ సీరియల్ కిల్లర్ మూవీ ఎలా వుందో చూద్దాం...

        అమీ పెన్సిల్వేనియాలోని ఒక ఆస్పత్రిలో నర్సు. ఇద్దరు పిల్లలతో సింగిల్ మదర్. అత్యవసరంగా ఆమె గుండె మార్పిడి చికిత్స చేయించుకోక పోతే ప్రాణాపాయం. అయితే ఆమె పని చేసే ఆస్పత్రిలో ఏడాది సర్వీసు పూర్తి కాని పరిస్థితి వల్ల ఆస్పత్రి అందించే ఉచిత బీమా సౌకర్యం ఆమెకి వర్తించదు. ఇంకో మూడు నెలలు గడిస్తే గానీ ఏడాది పూర్తి కాదు. ఇలా ఇబ్బందిపడుతూనే, డ్యూటీలతో వొత్తిడికి లోనవుతూనే నైట్ షిఫ్ట్స్ చేస్తూంటుంది.

కొత్త నర్సు ఎంట్రీ

    ఇప్పుడు చార్లీ కొలెన్ అనే అతను కొత్త నర్సుగా వచ్చి చేరతాడు. అమీ పరిస్థితికి జాలిపడతాడు. ఆస్పత్రిలో మందులు కొట్టేసి ఆమెకిస్తూంటాడు. ఆమె పిల్లలకి దగ్గరవుతాడు. ఆమెకి క్లోజ్  ఫ్రెండ్ అవుతాడు. ఇంతలో ఆస్పత్రిలో ఒక రోగి అవసరం లేని డబుల్ డోస్ ఇన్సులిన్ ఇంజెక్షన్ తో చనిపోతాడు. ఈ ఇంజెక్షన్ ఎవరిచ్చారో అర్ధంగాదు. ఆస్పత్రి యజమాన్యం కంప్లెయింట్ చేస్తుంది. ఇద్దరు పోలీస్ డిటెక్టివులు డానీ, టిమ్ లు వచ్చి దర్యాప్తు చేపడతారు.

        దర్యాప్తు జరుగుతూండగానే మరి కొందరు రోగులు సరికాని ఔషధ మోతాదుల కారణంగా అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోవడం ప్రారంభిస్తారు. డిటెక్టివులు అమీని కఠినంగా ప్రశ్నిస్తారు. కొత్తగా చేరిన చార్లీ నేపథ్యాన్ని ఆరా తీస్తారు. వేరే ఆస్పత్రిలో చార్లీ పనిచేసినప్పుడు ఇలాగే మరణాలు సంభవించాయని, ఆస్పత్రి యాజమాన్యం కంప్లెయింట్ చేయకుండా చార్లీని తొలగించారనీ తెలుసుకుంటారు. చార్లీని ప్రశ్నిస్తే క్లూ ఏమీ దొరకదు. కానీ అమీకి చార్లీమీద అనుమానం బలపడి, అతడ్ని సీరియల్ కిల్లర్ గా నిరూపించేందుకు సాక్ష్యాధారాల సేకరణ మొదలెడుతుంది...

చార్లీ ఎవరు?

    ఈ సీరియల్ కిల్లర్ కథకి నిజ కేసు ఆధారమని సమాచారమిచ్చారు. చార్లీ కొలెన్ అనే నర్సు వివిధ  న్యూజెర్సీ ఆస్పత్రుల్లో 1988-2003 మధ్య 400 మంది రోగుల్ని చంపి పట్టుబడ్డాడు. 2006 లో అతడికి 11 యావజ్జీవ శిక్షలు పడ్డాయి. కానీ ఎందుకు చంపాడో అతను కారణం చెప్పలేదు, పోలీసులు కూడా తెలుసుకోలేక పోయారు. ఈ కేసు తీసుకుని ది గుడ్ నర్స్ నిర్మించారు.

        అయితే సినిమాతో వచ్చిన సమస్యేమిటంటే, అమీ పాత్ర పరంగా ఆమె దృక్కోణంలో కథ సాగుతుంది. అందుకని చార్లీ చేసే హత్యా దృశ్యాలుండవు. మరణాలే చూపిస్తూంటారు. అంటే యాక్షన్ వుండదు. అతడి మీద అమీ సాక్ష్యాధారాలు సేకరించే దృశ్యాలే వుంటాయి. డిటెక్టివుల ఇంటరాగేషన్లు వుంటాయి. సీరియల్ కిల్లర్ గా చార్లీతో యాక్షన్ దృశ్యాలుండవు. ఈ మూవీ యాక్షన్ తో గాకుండా డైలాగులతోనే నడుస్తుంది- రంగస్థల నాటకం లాగా. అందుకని యాక్షన్ తో వుండే థ్రిల్స్, సస్పెన్స్, టెంపో, టెన్షన్, టెర్రర్ వంటివి అనుభవం కావు. క్లయిమాక్సు, ముగింపు కూడా డైలాగులతోనే వుంటాయి. ఈ కథలో కూడా అతనెందుకు చంపాడో చెప్పలేదు. సీరియల్ కిల్లర్ గా అనుమానితుడిగా కన్పిస్తున్నప్పుడు అతడి నేర మనస్తత్వం కూడా మొహంలో కనపడదు.

        గుండె జబ్బుతో వున్న అమీకి మరెవ్వరూ రోగులు హత్యకి గురవకుండా చూసే బాధ్యత, హంతకుడిగా చార్లీని పట్టుకునే కర్తవ్యం కల్పించి ఎంత రెండు గంటల సేపు కథ నడిపినా ఫలితం లేకపోయింది. పైగా లైటింగ్ తో సమస్య వుంది. లో-కీ లైటింగ్ తో దృశ్యాలు షూట్ చేశారు. దీంతో దృశ్యాలు, మొహాలు సరిగ్గా కనిపించని పరిస్థితి. హార్రర్ ఫీలింగ్ ని క్రియేట్ చేయడానికి ఇలా చేసి వుండొచ్చు, కానీ కథలోనే హార్రర్ లేనప్పుడు చిత్రీకరణతో వస్తుందా?

    హాస్పిటల్లో, అమీ ఇంట్లో పూర్తిగా ఇండోర్స్-టు-ఇండోర్స్ గా జరిగే ఈ కథ తగిన వేగం కూడా లేక జడంగా వుంటుంది. యాక్షన్ లేకపోయినా సీరియల్ కిల్లర్ క్యారక్టర్ స్టడీకైనా పనికొస్తుందా ఈ సినిమా అంటే అదేం లేదు. మెడికల్ థ్రిల్లర్ అన్నాక సీరియల్ కిల్లర్ మానసిక లోకం కూడా బయటపెట్టకుండా, అసలు మానసిక వైద్యుల పాత్రే లేకుండా కథ నడిపేశారు. భయంకర నిజజీవిత సీరియల్ కిల్లర్ని చూడాలనుకుంటే, నెట్ ఫ్లిక్స్ లోనే విడుదలైన డాహ్మర్ చూస్తే చాలు.

—సికిందర్

31, అక్టోబర్ 2022, సోమవారం

1241 : కొరియన్ రివ్యూ!

    2000ల ప్రారంభంలో మ్యూజిక్, మూవీస్ సహా దక్షిణ కొరియా వినోద పరిశ్రమ కొంత మాంద్యాన్ని ఎదుర్కొంది. అయితే కాలం గడిచే కొద్దీ ఈ రెండు రంగాలు వాటి సొంత అస్తిత్వాలతో  ప్రపంచ సూపర్ పవర్‌లుగా మారే స్థాయికీ క్రమంగా అభివృద్ధి చెందాయి, ఆర్ధికంగా అపూర్వ విజయాలు సాధిస్తున్నాయి.  ప్రపంచ వ్యాప్తంగా  ప్రేక్షకుల సంఖ్యనూ అపారంగా పెంచుకున్నాయి. మన దేశంలోనైతే చెప్పనవసరం లేదు, ఇక తెలుగులో సరే- ఎన్నో కొరియన్ సినిమాలు తెలుగులో ఫ్రీమేకులు, రీమేకులు చేసేస్తున్నారు. ఇవాళ కొరియన్ సినిమా సాంకేతికంగానూ, సృజనాత్మకంగానూ గుణాత్మకమైన ఆవిష్కరణలు చేస్తూ పురోగమిస్తోంది. శాంసంగ్, ఎల్జీ వంటి టాప్ టెక్నాలజీ బ్రాండ్లని పక్కన పెడితే, దక్షిణ కొరియా అంతర్జాతీయంగా మిలియన్ల కొద్దీ గృహాలకు కె -పాప్ అంటూ మ్యూజిక్ ని, కె- డ్రామాలంటూ సినిమాలనూ అమోఘంగా ఎగుమతి చేస్తోంది.

          కె- డ్రామా అంటే కొరియన్ రోమాంటిక్ డ్రామాలు  ఒక తిరుగులేని బ్రాండ్ గా పాపులరయ్యాయి. కె- డ్రామాలు చూడకపోతే చిన్న చూపుకి గురయ్యే పరిస్థితి దాకా వెళ్ళింది. ఇవి చాలా వరకూ టీనేజీ రోమాన్సులుగానే వుంటాయి. అలాగని అసభ్య అశ్లీల వెకిలి తనాలతో వుండవు. చీప్ కామెడీలతో వుండవు. టీనేజీ సినిమాలని కూడా కొరియన్ సంస్కృతిని, విలువల్నీ ప్రతిబింబిస్తూ టీనేజర్లలో ఉత్తమాభిరుచిని ప్రోత్సహించేలా తీస్తారు. క్లాసిక్ అనే మూవీ చాలా పెద్ద ఉదాహరణ. ఈ కె- డ్రామా జానర్ లో తాజాగా ట్వెంటీయత్ సెంచురీ గర్ల్ విడుదలైంది.

        అక్టోబర్ 21 న నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ గ్లోబల్ ర్యాంకులో 7 వ స్థానం పొందింది. హిందీ ఆడియోతో అందుబాటులో వుంది. ఇందులో కొరియన్ పాత్రల పేర్లు ఇబ్బందికరంగా, ఫాలో అవడానికి తికమకగా వుండొచ్చని తెలుగు పేర్లుగా మార్చాం :సారిక (పాత్ర పేరు నబో-రా, నటి కిమ్ యో-జంగ్), దశ (పాత్ర పేరు యోన్-డు, నటి రోహ్ యూన్-సియో), ఆకార్ (పాత్ర పేరు బేక్ హ్యూన్-జిన్, నటుడు పార్క్ జంగ్-వూ), ఆకాష్ (పాత్ర పేరు పూన్ వూన్-హో, నటుడు బైయోన్ వూ-సియోక్). దీనికి దర్శకురాలు బాంగ్ వూ-రీ.

విషయంలోకి వెళ్తే...

    20వ శతాబ్దం ముగిసే ఒక సంవత్సరం ముందు, 1999లో ఈ ప్రేమ కథ. అథ్లెటిక్స్ లో ఆరితేరిన సారిక అనే 17ళ్ళ స్టూడెంట్ కి దశ అనే క్లాస్ మేట్ వుంటుంది. దశ హార్ట్ సర్జరీ కోసం యూఎస్ వెళ్ళాలి. అయితే తను ఆకార్ అనే స్టూడెంట్ ని తొలి చూపులోనే వలచినందున, ఇంకా అతడి గురించి తెలుసుకోకుండా హార్ట్ సర్జరీకి యూఎస్ వెళ్ళలేనని మొండికేస్తుంది. ఏం ఫర్వాలేదు, తను ఆకార్ గురించి అన్నీ తెలుసుకుంటూ ఈ మెయిల్ చేస్తూంటానని సారిక హామీ ఇవ్వడంతో, నిశ్చింతగా యూఎస్ కెళ్తుంది దశ.

        కాలేజీలో సారిక ఆకార్ ని ను అనుసరించడం మొదలెడుతుంది. ఒక రోజు ఆమె ఆకార్, అతడి క్లాస్ మేట్ ఆకాష్ ఇద్దరూ కాలేజీ బ్రాడ్‌కాస్టింగ్ క్లబ్‌లో చేరబోతున్నారని విని, తనుకూడా దరఖాస్తు చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది. క్లబ్‌  ఆడిషన్స్ లో ఎంపికవుతుంది. ఆకాష్ కూడా ఎంపికవుతాడు, కానీ ఆకార్ అప్లయి చేసుకోలేదని తెలుసుకుని నిరాశ చెందుతుంది.  

        దీంతో సారిక ఆకార్ ని నిశితంగా పరిశీలించడానికి ఆకాష్ కి దగ్గరవడానికి ప్రయత్నిస్తుంది. ఆమె ఆకాష్ తో సన్నిహితంగా మెలగడంలోని ఆంతర్యం గ్రహించిన ఆకార్, తననే ప్రేమిస్తోందని పొరబడి డేటింగ్ ప్రపోజ్  చేస్తాడు. దశ బాయ్ ఫ్రెండ్ తనని డేటింగ్ అడిగేసరికి కంగారు పడిన సారిక కాదు పొమ్మంటుంది. అయితే ఈమె ఆకాష్ తో ప్రేమలో వుందనుకుంటాడు ఆకార్. సారిక కూడా తనకి ఆకాష్ పట్ల ఫీలింగ్స్ పెరుగుతున్నాయని తెలుసుకుంటుంది. ఇది గ్రహించిన ఆకాష్ ఆమెని ప్రేమించడం మొదలెడతాడు.  

        ఇక విజయవంతంగా శస్త్రచికిత్స పూర్తయి గుండెని పదిలంగా పట్టుకుని దిగిన దశ, ఇక్కడి పరిస్థితి చూసి ఢామ్మంటుంది. సారిక తప్పుడు అబ్బాయిని అనుసరించి వివరాలు పంపిందని గ్రహించి మంచాన పడుతుంది. తను ప్రేమించింది ఆకార్ ని కాదు, ఆకాష్ నే.  తను ఆకాష్ ని మొదటిసారి కలిసిన రోజు, అతను ఆకారే అనుకుంది. ఎందుకంటే అతను ఆకార్ పేరుగల  ట్యాగ్‌తో వున్న ఆకార్ జాకెట్‌ ని ధరించాడు!

        వార్నీ, కొంప మునిగిందనుకున్న సారిక, గుండాపరేషన్ దశని పరేషాన్ చేయకూడదని తను ఆకాష్ నే ప్రేమిస్తున్న విషయం దాచి పెడుతుంది. దాచిపెట్టి ప్రాణస్నేహితురాలి పట్ల విశ్వాసంతో ఆకాష్ ని దూరం పెడుతూంటుంది. అయితే ఆకార్ ద్వారా, ఆకాష్ - సారిక ఒకరినొకరు ఇష్టపడుతున్న విషయం దశ తెలుసుకుంటుంది. కళ్ళ నీళ్ళు పెట్టుకుని, తమ స్నేహం కోసం తనే ఆకాష్ మర్చిపోతానని అనేస్తుంది. ఇదీ విషయం.

స్నేహాలు- విశ్వాసాలు

   ప్రేమంటే స్వార్ధమనీ, స్నేహమంటే విశ్వాసమనీ ప్రేమ కంటే స్నేహమే ఉదాత్తమైనదనీ, త్యాగాలకి సిద్ధపడే టీనేజర్ల కథ ఇది. దర్శకురాలు ఇది తన జీవితానుభవమేనని చెప్పుకుంది. దీన్ని టీనేజర్ల ముందుంచింది. అయితే విషాదాంతం చేయకుండా వుండాల్సింది. టీనేజర్లకి  ప్రేమలు-పొరపాట్లు- దిద్దుబాట్లు వుంటాయి. దిద్దుబాటు చూపించి మార్పు తేవాలనుకోవాలేగానీ, మరణమే పరిష్కారమని కాదు. స్నేహంలో ప్రాణత్యాగం మిగిలున్న వ్యక్తికి జీవిత కాల శిక్షయి పోతుంది. టీనేజీ ప్రేమ కథల్ని ట్రాజడీ చేయాల్సిన  అవసరం లేదు.

        ప్రధాన పాత్ర సారికని పోషించిన నటి  కిమ్ యో-జంగ్ నటన చిలిపితనంగా ప్రారంభమై, గంభీరంగా మారుతుంది. సున్నితంగా బాగానే  నటించింది. స్నేహితురాలి బాయ్ ఫ్రెండ్ తనని ప్రఫోజ్ చేయడంతో కంగారు పడి- ఏవేవో తన దురలవాట్లు, చెడ్డ గుణాలూ చెప్పుకుని తప్పించుకునే కామెడీ  సీను బావుంటుంది. నూడుల్స్ అసహ్యంగా తింటానని కూడా తింటూ చూపిస్తుంది.

        స్నేహితురాలి బాయ్ ఫ్రెండ్ వివరాలు కూపీలాగే పనులు కూడా హాస్యంగా  వుంటాయి. తను కనుగొన్న ప్రతిదాన్నీ శ్రద్ధగా ఈ - మెయిల్ చేస్తూంటుంది - అతడి షూ సైజు దగ్గర్నుంచి బెస్ట్ ఫ్రెండ్ ఇంటి చిరునామా వరకూ- కష్టపడి సేకరించి పంపుతుంది. అతను ఒక సినిమా సీడీ కోరితే అది తీసుకొచ్చి ఇస్తే, ఏం సీడీ తెచ్చిందో బయటపడి- ఆ అడల్ట్ సీడీని పైకెత్తి పట్టుకుని అందరికీ కనిపించేలా గోడకుర్చీ వేసుకోమని పనిష్ చేస్తాడు ప్రిన్సిపాల్. ఆమె అలా సీడీ పట్టుకు కూర్చోవడాన్ని బాయ్ ఫ్రెండ్ కూడా చూసేసరికి – నిన్ను నాశనం చేస్తా- అని తిట్టుకుంటుంది. ఇతన్నే తన టెక్వాండో విద్యతో రౌడీల బారి నుంచి కాపాడుతుంది. కానీ తన కాలే విరిగి ప్లాస్టర్ వేయించుకుంటుంది. ఇలాటివన్నీ ఎంటర్టయిన్ చేస్తూ నటించింది.  

        దశ పాత్రలో నటి, ఆకార్, ఆకాష్ పాత్రల్లో నటులూ ప్రతిభ గల వాళ్ళే. దర్శకురాలు అలా నటింపజేసుకుంది. ఈ నల్గురు తప్ప వీళ్ళ మధ్య కథలోకి ఇంకెవ్వరూ రారు. ఈ ఫిల్టరింగ్ ఫ్రెష్ గా వుంటుంది. రెండు గంటల రన్నింగ్ టైమ్ ఉన్నప్పటికీ, కొన్ని కీలక పాత్రల్ని ముందుకు తీసికెళ్ళకుండా వదిలేసింది దర్శకురాలు. పైన చెప్పుకున్నట్టు ముగింపు మాత్రం జనాదరణ పొందక పోవచ్చు. 20వ శతాబ్దం చివర్లో కూడా టీనేజర్ల మనస్తత్వాలు, విలువలతో వాళ్ళ అయోమయం, వాళ్ళ అనాలోచిత నిర్ణయాలూ వుండేవని చెప్పదల్చుకుందేమో. 20వ శతాబ్దపు అమ్మాయి కథ కాబట్టి. 

నిర్మాణ విలువలు - కాలీన స్పృహ

        1999 నాటి నేపథ్య వాతావరణ సృష్టి బాగా జరిగింది. ఆనాటి వీహెచ్ఎస్  టేపులు, పేజర్లు, పబ్లిక్ ఫోన్‌బూత్‌లతో సహా 90ల నాటి సైన్‌ బోర్డులూ దర్శన మిస్తాయి. అప్పటి కంప్యూటర్లు సరే. ఈమెయిల్ ఇంటర్ఫేస్ కూడా. అప్పటి ప్రసిద్ధ కె-పాప్ వీడియోలు, టీవీ  డ్రామాలూ  జ్ఞాపకాలని ళ్ళీ పునరుజ్జీవింపజేస్తాయి. టీనేజీ కథాలోకానికి వాడిన కలర్స్, లొకేషన్స్, సెట్స్ ఎక్కడా రఫ్ గా వుండవు. నేపథ్య సంగీతం సహా ప్రతీదీ నిర్మాణ విలువల పరంగా, టీనేజీ వయస్సంత సౌకుమార్యంతో వుంటాయి. కంటికి, వొంటికి ఆరోగ్యకరంగా.

        హాలీవుడ్ లోనైనా సరే, కొరియాలో నైనా సరే, టీనేజీ రోమాన్సులన్నాక 17 - 19 మధ్య వయస్కులతోనే తీస్తారు. మనలాగా 20-25 ఏళ్ళ ముదురు శాల్తీలతో, ఇంకా గడ్డాలూ మీసాలేసుకున్న బెరడు ఫేసులతో తీయరు. అందుకని వయస్సుకి తగ్గ టీనేజీ ఇన్నోసెన్స్ తో, వాళ్ళకి నప్పే చేష్టలతో అవి సహజంగా వుంటాయి. టీనేజీతో మన జ్ఞాపకాల్లోకి తీసికెళ్తాయి. అందుకే కె- డ్రామాలు అంత పాపులరవుతున్నాయి. మన మేకర్లు టీనేజీలో వాళ్ళు చూసిన జీవితాన్ని పాతికేళ్ళ పోకిరీ రూపాలతో రోమాంటిక్ కామెడీలుగా డ్రామాలుగా తీసి పరమానందం పొందుతారు. ఇంకా మాట్లాడితే మెడిసిన్ చదివే లవర్స్ ని పదహారేళ్ళ టీనేజర్ల మాటలతో, చేష్టలతో చూపించి దురదానందం అనుభవిస్తారు.

—సికిందర్