రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Saturday, August 15, 2015

సాంకేతికం- కెమెరా


సినిమా కోసం టెక్నాలజీయా, లేక టెక్నాలజీ
కోసం సినిమానా? ఇదీ ఇప్పుడేసుకోవాల్సిన ప్రశ్న!

టెక్నాలజీ కోసమే సినిమాలు తీస్తూపోతే చూసుకోవడానికి ఫ్లాపులే మిగలొచ్చు.
మాట్ డామన్ నటించిన  హాలీవుడ్ మెగా మూవీ ‘బోర్న్ సుప్రమసీ’ లో విజువల్ అప్రోచ్ ఎలాంటిదంటే ఆ యాక్షన్ హంగామాలో ఒక్క గ్రాఫిక్స్ ముక్క కన్పిస్తే ఒట్టు. పోరాటాల్లో వైర్ వర్క్, డూప్ నెట్స్ వంటి మెకానిజాలు  కూడా మచ్చుకి కానరావు.
సగటున 1.9 సెకన్ల నిడివి వుండే ఆ సూక్ష్మాతి సూక్ష్మ షాట్స్ తో రాకెట్ వేగంతో దూసుకెళ్ళే దృశ్యాలే ఈ సినిమాకి ప్రాణం. ఉద్దేశపూర్వకంగా డాక్యుమెంటరీ ఫీల్ కోసం ఒకే ఒక్క హేండ్ హెల్డ్ కెమెరాతో దీని చిత్రీకరణ అనన్య సామాన్యం.

       కలరిస్టుకి కాలూ చెయ్యీ ఆడని ఆ మైక్రో షాట్స్ కి చేసిన డీఐ డల్ గానూ, కంటికి చలవ చేసేదిగానూ ఉంటే, ఇక డీటీఎస్ కత్తి మీద సాము. ఎందుకంటే, కాంతి వేగం కంటే శబ్ద వేగం తక్కువ కాబట్టి. దీన్ని కూడా పట్టుబట్టి సాధించారంటే, సినిమాకోసం టెక్నాలజీ కాక మరేమనుకోవాలి?

          ఇదే ప్రముఖ ఛాయాగ్రాహకుడు టి.  సురేంద్ర రెడ్డి ని బాగా ఆకర్షించింది. హాలీవుడ్ షాట్స్ చూపించి అలా తీయమని తనని ఒత్తిడి చేసే దర్శకులు లేకపోలేదు. ఈ కాపీ కౌపీనానికి దూరంగా ‘బోర్న్ సుప్రమసీ’ చూస్తూంటే ఆయనకో ఆలోచన మెరిసింది. దాన్ని అమల్లో పెట్టేశారు. అది ‘నీ ఇల్లదే‘ అనే కన్నడ సినిమా. అందులో కొత్తగా ఆయన చేసిన ప్రయోగం మల్టిపుల్ ఫార్మాట్ లో చిత్రీకరణ. సాధారణ ఎనలాగ్ కెమెరాతో బాటు, ఒక 4కే ( అంటే నాలుగు వేల రిజల్యూషన్ గలది), మరొక 2 కే డిజిటల్ కెమెరాలు రెండూ, ఇంకో సాధారణ వీడియో కెమెరా ఒకటీ - కలిపి ఉపయోగించి ఈ సినిమా షూట్ చేశారు. 

       గతంలో ‘ఆ నల్గురు’లో మల్టిపుల్ ఫ్లాష్ బ్యాకులకి ఒకే ఫార్మాట్ లో (ఎనలాగ్)  గ్రేడింగ్స్ మార్చి తేడా కనబర్చారు సురేంద్ర రెడ్డి.  ఈ కన్నడ సినిమాలో సన్నివేశాల డిమాండ్ ని బట్టి మల్టిపుల్ ఫార్మాట్ కి వెళ్ళారు. పై హాలీవుడ్ సినిమాలో అది స్టడీకామే అయినా, సీన్లు డిమాండ్ చేస్తున్న సెన్సాఫ్ అర్జెన్సీ దృష్ట్యా దాన్నెలా వాడుకున్నారో, అలా పరస్పర నాల్గు విభిన్న ఫార్మాట్స్ తో ఈ కన్నడ సినిమా చేశారాయన.

          ‘ఇప్పుడొస్తున్నవి చికెన్ ఫ్రై సినిమాలు’ అని ఆయన అధిక్షేపణ. ‘మనం అన్నం తింటున్నప్పుడు కాస్త పప్పు, కూర, సాంబారు, పచ్చడి, అప్పడం, పెరుగూ.. ఇలా ఎప్పుడేది కావాలో పెట్టుకుంటూ తింటాం. ఎప్పుడో గానీ చికెన్ ఫ్రై తినం. చికెన్ ఫ్రయ్యే రోజూ తింటే ఎలా వుంటుంది? అలాగే ఉంటున్నాయి ఇప్పుడొస్తున్న సినిమాలు. బిల్డప్పుల కోసం సినిమాని టెక్నాలజీతో నింపేస్తున్నారు. కథని కథలా చూపించడం లేదు’ అని బాధపడ్డారు.

           పైన చెప్పుకున్న హాలీవుడ్ సినిమాలో హీరో న్యూ ఢిల్లీ వచ్చి రోడ్డు పక్క మినరల్ వాటర్ కొంటాడు. అది హిమాలయన్ నేచురల్ మినరల్ వాటర్ అనే స్టార్ హోటళ్ళలో సంపన్నులు తాగే ఖరీదైన నీరు. దాన్ని రోడ్డు పక్క ఎక్కడా అమ్మరు. అలాగే ఇంకోచోట, హీరో ఒకణ్ణి హరీ మన్పిస్తూంటే, ఆ బ్యాక్ గ్రౌండ్ లో ఓ మూలన షూటింగ్ ఎక్విప్ మెంట్ అలాగే పెట్టేసి కన్పిస్తుంది. మన సినిమాల్లో టెక్నాజీ భయపెడితే, హాలీవుడ్ సినిమాల్లో ఇలాటి ‘అదనపు హంగులు’ నవ్విస్తాయన్న మాట!  ఈ హైపర్ యాక్టివ్ టెక్నాలజీ యుగంలో మరి సురేంద్ర రెడ్డి ముద్రని ఎలా గుర్తు పట్టాలి? పది రకాల బొమ్మల్లో ఆయన బొమ్మ ఎలా ప్రత్యేకం? అంటే...’ఫేస్ మౌల్దింగ్ నా స్పెషాలిటీ’ అని ప్రకటించారు. పాత్రని విశ్లేషించుకుని, అది మనసులో ముద్రించుకునేలా క్లోజప్స్ వేయడమే తన ప్రత్యేకత అన్నారు. ‘ఆ నలుగురు’ లో రాజేంద్ర ప్రసాద్ కి ఇలాంటి క్లోజప్సే ఉంటాయన్నారు.

         మూడు దశాబ్దాలుగా ఈ రంగంలో కొనసాగుతూ నలభై సినిమాలు పూర్తి చేసిన తను, ప్రస్తుతం  సునీల్ శెట్టితో ‘రూట్స్’ అనే హిందీ సినిమాకి ఛాయాగ్రహణం సమకూరుస్తున్నారు. మణిశంకర్ తీసిన ‘డిసెంబర్ 16’, ‘రుద్రాక్ష’, ‘టాంగో చార్లీ’  అనే హిందీ సినిమాలకి కూడా ఛా యాగ్రహణం అందించిన అదృష్టాన్ని సంపాదించుకున్నారు. మణిశంకర్ లా సినిమాని ఎగ్జిక్యూట్ చేసే దర్శకులు తెలుగులో లేరని అభిప్రాయపడ్డారు. దీనిక్కారణం, తెలుగులో దర్శకులే రచయితలుగా మారడంతో రచయితల తోడ్పాటు కోల్పోవడమే నని అన్నారు. ఫలితంగా రచయితలుగా మారిన దర్శకులూ, దర్శకులుగా మారిన  రచయితలూ సినిమాలు తీయడంలో విఫలమవుతున్నా రన్నారు.

          పోతే, తను ఆసియాలోనే మొదటి సారిగా,  ప్రపంచంలో మూడోదిగా, తెలుగులో ‘టాస్’ అనే సినిమాని వైపర్ కెమెరాతో డిజిటల్ లో తీశానన్నారు.

          ఇక డీఐ విషయానికొస్తే, మనమింకా ఇందులో పరిపూర్ణత సాధించలేదన్నారు. ‘కెమెరాతో ఓ దృశ్యాన్ని తీస్తే, దగ్గరగా వున్న కొండ ముదురు రంగులో, దాని వెనకున్న కొండ కొంత రంగు తగ్గీ, అలాగే ఆ వెనక వుండే కొండ పూర్తిగా రంగు తగ్గిపోయీ కన్పిస్తాయి. అప్పుడే వాటి మధ్య దూరాలున్నట్టు డెప్త్ కన్పిస్తుంది. ఇదే దృశ్యాన్ని డీఐ చేసినప్పుడు  దూరాలు అదృశ్య మైపోతున్నాయి. డీఐ చేశాక దృశ్యం మరింత అద్భుతంగా కన్పించే మాట నిజమే, కానీ అందులో డెప్త్ మాత్రం వుండడం లేదు. ఈ సమస్యని రజనీకాంత్ నటించిన ‘శివాజీ’ లో కొంతవరకూ అధిగమించగలిగా’ రన్నారు సురేంద్ర రెడ్డి.

     17వ ఏటనే నెల్లూరు నుంచి మద్రాసు వెళ్లి అంచెలంచెలుగా కెమెరామాన్ గా ఎదిగిన తను, రీమేక్స్ కి ఎక్కువగా పని చేయలేదన్నారు. ఒక సినిమాని రిమేక్ కి తీసుకున్నప్పుడు నిర్మాతా రచయితా తప్ప, దర్శకుడూ కెమెరామాన్ దాన్ని చూడకుండా వుంటే, సొంత క్రియేటివిటీ ని చూపించుకునే అవకాశం ఉంటుందన్నారు తంబిరెడ్డి సురేంద్ర రెడ్డి.


సికిందర్
( ఆంధ్రజ్యోతి- నవంబర్ 2010, 'సినిమా టెక్' శీర్షిక’)

Thursday, August 13, 2015

రైటర్స్ కార్నర్క్లిఫ్ డార్ఫ్ మాన్ - హాలీవుడ్ హిట్  ‘వారియర్’  స్క్రీన్ ప్లే రచయిత...ఈ మూవీ హిందీలో ‘బ్రదర్స్’ గా అధికారిక రీమేక్ గా ఆగస్టు 14 న విడుదలవుతోంది. ఈ రిమేక్ తో క్లిఫ్ కి రచనాపరంగా ఏ సంబంధం లేకపోయినా, ‘వారియర్’ రచయితగా ఆయన క్రిస్ నిటెల్ కిచ్చిన ఇంటర్వ్యూని ఈ సందర్భంగా ప్రచురిస్తున్నాం..
‘వారియర్’ తో మీ అనుభవం చెప్పండి?
          ‘వారియర్’ 2011 లో విడుదలయ్యింది. మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ ప్రపంచాన్ని ఫ్యామిలీ డ్రామాతో మిక్స్ చేసి చూపించాం. ఈ స్క్రిప్టు పని పూర్తయి షూటింగ్ కూడా పూర్తయ్యాకా విడుదల తేదీ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను. ఈ లోగా రైటర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా సమ్మె కారణంగా నా మరో స్క్రిప్ట్ అమ్ముడుపోక ఆర్ధిక ఇబ్బందుల్లో పడ్డాను. నా సేవింగ్స్ అన్నీ ఖర్చయిపోయాయి. కారూ ఇల్లూ కూడా పోయి పూర్తిగా దివాళా తీశాను. ఇంకో ఆరు నెలలకి గానీ ‘వారియర్’  విడుదల కాలేదు. అది విడుదలయ్యాక తిరిగి నా ఆర్ధిక పరిస్థితి మెరుగు పడింది.
మీరు రాసిన మొట్టమొదటి కథ?
          నవల. అప్పుడు నాకు పదకొండేళ్ళు. పెన్నుతో కాగితాల మీద రాసుకుని ఆ 50 పేజీలనీ ఫైల్ చేసి పెట్టుకున్నాను. అది తర్వాత చెదలు పట్టిపోయింది.
మీ కళాతృష్ణకి ఎలాటి సినిమాలు, లేదా కథలు మీకు స్ఫూర్తి నిచ్చేవి?
          మొదట్నించీ గ్రీకు పురాణాలంటే ఇష్టం. ఇప్పటికీ వాటికి ప్రభావితుణ్ణి అవుతూనే వుంటాను. ఆ తర్వాత క్లాసిక్ లిటరేచర్ వైపు, క్లాసిక్ సినిమాలవైపూ ఆసక్తి పెరిగింది. నా జీవితంలో నేనేం కావాలో నిర్ణయించుకోవడానికి ఒకే ఒక్క సినిమా చూశాక తెలిసి వచ్చింది. ఆ సినిమా ‘బ్లడ్ సింపుల్’. ఈ సినిమా చూశాక ఇలా రాస్తే సినిమా ఫీల్డులో అగ్ర స్థానానికి చేరుకోవడం సాధ్యమేనని అన్పించింది. ‘ఫౌంటెన్ హెడ్’ నవల చదివినప్పుడు కూడా నాకిలాటి ఫీలింగే కలిగింది.
ఒక అనామక రచయిత తన స్క్రిప్టు  వెలుగు చూడాలంటే ఏం చేయాలంటారు?
       ఇలా చెప్తే సిల్లీగా ఉండొచ్చు- కానీ ఏదైనా బ్రహ్మాండమైన స్క్రిప్టు  రాస్తే అది తప్పకుండా వెలుగు చూస్తుంది. ఎలా వెలుగు చూస్తుందో వివరించలేను గానీ, వెలుగు మాత్రం చూస్తుంది. ఐతే ముందుగా తను ఏ బ్రాండో తెలుసుకోవాలి. ఆ బ్రాండ్ తో తను రాసిన దానికి దగ్గరగా వుండే అలాటి రచయితల్నిగానీ, దర్శకుల్ని గానీ, నిర్మాతల్ని గానీ ఫాలో అవుతూ వుండాలి.  వీళ్ళకి దగ్గరయ్యే  మార్గాలని అన్వేషించాలి. నేటి డిజిటల్ యుగంలో ఇదేం కష్టం కాదు. నేను స్ట్రగుల్ చేస్తున్న కాలంలో ప్రీమియర్ షోలలో చొరబడి సినీ ప్రముఖుల్ని పలకరించే అవకాశం తీసుకునే వాణ్ణి. రైటర్ గా ఇతరులకంటే తనెలా ప్రత్యేకమైన వాడో, ఏ నిర్మాతయినా తన స్క్రిప్టుని ఎందుకు ఓకే చేయాలో చెప్పగలిగి వుండాలి. వాణిజ్య రంగంలో యూ ఎస్ పీ(యూనిక్ సెల్లింగ్ పాయింట్) అని వస్తువులకి వాటిదైన ప్రత్యేకత ఒకటి వుంటుంది. అలాటి యూ ఎస్ పీ తన కేమిటో రైటర్ తెలుసుకోవాలి. అది తనదైన ఒక వాయిస్ అవుతుంది - లేదా శైలి అయి వుంటుంది. సొంత వాయిస్. మరొకరికి అనుకరణ కానిది.
ఏ జీవితానుభవాలు మీ పాత్రలపై ప్రభావం చూపుతాయి?
         
ప్రతీ అనుభవం కూడా. ప్రతీ వ్యక్తితో అనుభవం కూడా. ఒక్కక్షణం అలా కలిసి వెళ్ళిపోయినా సరే, అది కూడా పనికొచ్చే అనుభవమే. నా కుటుంబ సభ్యులతో, మిత్రులతో, బయట ఇతరులతో అన్నీ పనికొచ్చే అనుభవాలే. నేను రాస్తున్నప్పుడు ఏదీ నాకు వ్యర్ధ పదార్ధం కాదు. బహిరంగ ప్రదేశాల్లో కూర్చుని ఇతరులు అనుకునే మాటల్ని వింటాను. అవి ఆసక్తి కరంగా వుంటే రికార్డు చేసుకుంటాను. లేదా నోట్ చేసుకుంటాను. సహజంగా దొర్లే జనం భాష ఇంటలెక్చువల్ గా ఏమీ వుండదు గానీ, ఆ మాటలు లోతుగా ఎక్కడో తాకుతాయి. నేనేం విన్నా, చదివినా నేను రాస్తున్న పాత్రలకి ఎలా అన్వయించాలా అని ఆలోచిస్తాను.
మీ క్యారక్టర్ డెవలప్ మెంట్ ప్రాసెస్ ని వివరించండి?
         
నేనెప్పుడు రాయడానికి కూర్చున్నా దేవుడు నాకు మార్గం చూపించాలని ప్రార్ధిస్తాను. నా అనుభవాల భాండాగారంలో కెళ్ళి క్యారక్టర్స్ ని చూపించమని అడుగుతాను.
క్యారక్టర్  బయోగ్రఫీలు రాసుకుంటారా?
         
రాయను, క్రియేట్ చేసుకుంటాను.
మీరు క్రియేట్ చేసే క్యారక్టర్ లతో మీరు ఎమోషనల్ గా ఎంతవరకు ఇన్వాల్వ్ అవుతారు?
          ప్రాసెస్ లో ఇది చాలా కఠినాతి కఠినమైన పని. టార్చర్ కూడా. నేను రాస్తున్నంత కాలమూ ఎన్ని క్యారక్టర్స్ వుంటే వాటన్నిటి  ప్రపంచాల్లో జీవిస్తూ ఉండాల్సిందే.

గొప్ప క్యారక్టర్ ని సృష్టించాలంటే దేన్ని  ప్రాతిపదికగా తీసుకోవాలంటారు?
          జీవితానుభవాన్ని. మనుషుల అసంకల్పిత చర్యల్ని. ఆహారపు టలవాట్లని. ఫిజికల్ బిజినెస్ చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మనమెప్పుడూ చేసే పనుల ద్వారా మన మనసేమిటో బయట పెట్టేస్తూంటాం. ఈ డైకాటమీ- ఆలోచనకీ  చేతకూ మధ్యన వుండే సంబంధాన్ని పరిశీ లిస్తూంటాను- దాన్ని ఎక్స్ ప్లాయిట్ చేస్తాను. నేను సృష్టించిన ఒక స్త్రీ పాత్ర ఆందోళనకి గురయినప్పుడు బొటన వేలుని గట్టిగా పట్టుకుని మెలి తిప్పడమనే డైకాటమీని రాశాను.

రాసే ముందు అవుట్ లైన్ వేసుకుంటారా?
          కొన్నిసార్లు వేస్తూంటాను. కానీ అది నా కిష్టముండదు. అయితే కొన్ని రకాల కథలకి అవుట్ లైన్ అవసరమే.

స్ట్రక్చర్ గురించి మీ అభిప్రాయం?
          అది టెక్నికల్. కొంతవరకూ తప్పనిసరిగా అవసరమే. ఐతే దాన్ని ఎగేసే మార్గాలు ఎప్పుడూ వుంటాయి. నా మైండ్ లో కథకి ఓ బిగినింగ్, మిడిల్, ఎండ్ లేమిటో ముద్రపడి పోయాక, ఆకథని నేనెలాగైనా చెప్పగలను. అది వర్కౌట్ అయితే అది చెప్పడానికి నేనేంచుకున్న స్ట్రక్చర్ ప్రధానమే కాదు. ఇందుకే నేను నవలల్ని నేనెక్కువ ఇష్టపడతాను. అవి స్ట్రక్చర్ లో ఇరుక్కుని వుండవు.

మీరు అభిమానించే సినిమాలు ఏ  స్ట్రక్చర్స్ లో ఉన్నాయంటారు? 


          దేనికవే ..అయితే ’గుడ్ ఫెల్లాస్’  స్ట్రక్చర్ ని నేనిష్ట పడతాను. థర్డ్ యాక్ట్ ప్రారంభం దగ్గర  లేదా, సెకండ్ యాక్ట్ ముగింపు దగ్గర్నుంచి ఆ సినిమా ప్రారంభమవుతుంది. అక్కడ్నించీ బయల్దిరిన చోటుకి తిరిగి వస్తుంది. అక్కడి నించీ ఎండ్ వరకూ కంటిన్యూ అవుతుంది. ఎన్నిరకాల స్ట్రక్చర్స్ వున్నా నేను బాగాలవ్ చేసేది  ‘పల్ప్ ఫిక్షన్’  స్ట్రక్చర్ని. అది చాలా బ్రిలియెంట్ స్ట్రక్చర్.

మీ క్యారక్టర్ లు ఎప్పుడైనా వాటి గురించి అవి మాట్లాడుకోవడం జరుగుతుందా?
          అవి తమలో తాము మాట్లాడుకుంటాయి- లేకపోతే వాటికి నేను అన్యాయం చేసినట్టే.
మీకు డైలాగులు ఈజీ గా వచ్చేస్తాయా- లేక బాగా కష్ట పెడతాయా?
          ఏ డైలాగూ అంత ఈజీగా రాదు. బాధాకరమైన ప్రాసెస్ అది.

పాత్రలు వివరణలు ఇచ్చుకోవడాన్ని మీరెలా నివారిస్తారు?
          నివారించలేం. పోలీసులాగా నిఘా పెట్టగలం. పాత్ర ఇచ్చిన ఓ వివరణకి నేను మళ్ళీ మళ్ళీ వెనక్కెళ్ళి చదువుకుంటూ ఆ వివరణ అవసరమా అని ఆలోచిస్తాను. అవసరమే అనుకుంటే, అది మాటల్లో కాకుండా విజువల్ గా - సింబాలిక్ గా చెప్పొచ్చా అని కూడా ఆలోచిస్తాను.

మీ డైలీ రైటింగ్ రొటీన్ గురించి చెప్పండి?
          వ్యాయామం చాలా చేస్తాను. వాటిలో బాక్సింగ్, యోగా వుంటాయి. జిమ్, రన్నింగ్ వుంటాయి.  అప్పుడు విడుదలయ్యే ఎండార్ఫిన్ బాడీకీ  మైండ్ కీ  చాలా హెల్ప్ చేస్తుంది. రాసేటప్పుడు ఫోన్ ని స్విచాఫ్ చేసి వేరే రూమ్ లో పెట్టేస్తాను.

స్క్రీన్ రైటర్ల గురించి వుండే అపోహ లేమిటో చెప్పగలరా?
          ఈ వృత్తిని ఇతరులు ఫన్ అనుకుంటారేమో- నిజమే, చాలా ఫన్. రాసిన సినిమాని తెర కెక్కితే దాన్ని చూసుకోవడం ఫన్నే కదా? దాన్ని మించిన ఫన్ ఏముంటుంది. కానీ అదే చూస్తున్న సినిమాని ముందుగా కాగితాల మీదికి ఎక్కించడానికి వుంటుందే- అది నావరకూ ఒక నరకం.

మీ కెరీర్ లో బాగా హైలైటయిన అంశం ఏమిటి?
          ఏమీ లేదు. హైలైట్స్ గురించి ఆలోచించను..నాకో ఫిలాసఫీ వుంది. కోరుకున్న గమ్యానికి ఎప్పుడూ చేరుకుంటూ ఉండాలే గాని చేరుకోకూడదని. చేరుకున్నామంటే ఇక అక్కడ చేయడాని కేమీ వుండదు. అక్కడ్నించి బయల్దేరి  వెనక్కి రావడమే.      

మీ రీ - రైటింగ్ ప్రాసెస్ ని వివరిస్తారా?
          అదెప్పుడూ వుండే ప్రాసెస్సే. స్క్రిప్టు ఏ కొద్ది అమ్ముడుపోవాలన్నా అది చాలా  అవసరం. చాలా  సింపుల్ గా నేను దీన్ని డీల్ చేస్తాను. నేను రాస్తున్న సీన్లలో ఒకదాన్ని బాగా ఇష్టపడి పదేపదే రీరైట్ చేసి మెరుగు పరుస్తున్నా ననుకోండి- అప్పుడు ఓ వైపు నుంచి నా మైండ్ చెప్తూనే వుంటుంది- ఫస్ట్ కట్ చేయాల్సింది ఆ సీన్నే అని. సీన్లమీద మమకారాలే అలాటివి. ఆ మమకారాలు లాజిక్ ని చంపేస్తాయి. ఇలా నన్ను నేను ఎడిట్ చేసుకునే సౌమనస్యం నాకుంటే- అప్పుడు ఆ స్క్రిప్ట్ గురించి ఏ స్టూడియో నుంచో, ఏ ప్రొడ్యూసర్ నుంచో బెటర్ మెంట్ నోట్స్ నాకందితే, నేను బాధపడే ప్రసక్తే వుండదు.


***

.

Tuesday, August 11, 2015

సాంకేతికం- కెమెరా

సెంథిల్ కుమార్


కెమెరాతో కథ చెప్పడమంటే కూలివాడి కాయకష్టమే!

అక్కడ గుండెల్ని గుబులెత్తించే ఉత్కంఠతో సాగిపోతోంది రథం ఛేజ్.. ఎటు చూసినా దిగంతాలకి విస్తరించినట్టున్న ధవళ కాంతుల ధగధగలతో మైదాన ప్రాంతమది. మంచు మేట వేసినట్టు తెల్లగా తళతళా మెరిసిపోతున్న తలం మీద జమాయించి గుర్రాలు దౌడు తీస్తూంటే, కనీసం వాటి కాళ్ళు ఆ మంచులో దిగబడవేమిటి? అదంతా మంచు కాదా? మరేంటి? కంప్యూటర్ సృష్టించిన మాయా?

          ‘చాలామంది అలాగే అనుకున్నారు..అదే ప్రకృతి విలాసం. ‘మగధీర’ రధం ఛేజ్ కోసం మేం లొకేషన్ వేటలో గుజరాత్ లో పాక్ సరిహద్దుల్ల దాకా వెళ్ళినప్పుడు, అక్కడి బీఎస్ఎఫ్ అధికారి ఒకాయన ఈ ప్రాంతం గురించి చెప్పారు. ఇంకో 200 కిలో మీటర్లు ప్రయాణించాక, ఇదిగో ఈ సాల్ట్ ల్యాండ్స్ కన్పించాయి. ఎప్పుడో సముద్రపు నీళ్ళొచ్చి ఇక్కడంతా ఘనీభవించడం వల్ల ఆ ఉప్పంతా ఇలా గడ్డకట్టుకు పోయిందన్న మాట. ఇట్సే నేచర్స్ వండర్..’ అని కెమెరామాన్ సెంథిల్ కుమార్  చెప్పుకువస్తూంటే అదొక థ్రిల్లింగ్ సెషన్.

          థ్రిల్ తో బాటూ కొన్ని కష్టాలూ ప్యాకేజీగా వస్తాయి. మండే ఎండలు..నీడకి ఒక్క చెట్టు  జాడైనా లేని బీడు నేల ..ఐనా విజువల్స్ కి ఓ ఎండుమాను అత్యవసరమన్పించి దాన్ని తెచ్చి ప్రతిష్ఠించారు. రధం ఛేజ్ కి ఓ పాత మారుతీ వ్యాను కొనుక్కుని దాన్ని విప్పదీసి ప్లాట్ ఫాం గా మార్చుకున్నారు. దాని మీద కెమెరాలూ అవీ పెట్టుకుని 15-20 రోజులపాటు ఏకధాటిగా ఒకటే షూటింగ్ చేమటోడ్చుతూ..

          సెంథిల్ కుమార్ -2003 లో ‘ఐతే’ సినిమాతో తెలుగు తెరమీద కన్ను తెరచిన విజువల్  హాలికుడు. తొలిసారిగా తెలుగులో కొన్ని విప్లవాత్మక  మార్పులు ప్రవేశపెట్టిన ఇంద్రజాలికుడు. ‘అశోక్’ తో సూపర్ 35 కెమెరా, ‘త్రీ’ తో బెలూన్ బల్బ్ లైటింగ్, ‘యమదొంగ’ తో దేశంలోనే పెద్దదైన యమలోకం సెట్ లో చిత్రీకరణ, ‘అరుంధతి’ లో మోషన్ కంట్రోల్ కెమెరా..

          ‘నిజానికి గ్రాఫిక్స్ వచ్చాక మా పని పెరిగింది. సెట్ లో బ్లూమ్యాట్ నేపధ్యంలో లేని కదలికల్ని మనోనేత్రం తో చూస్తూ షూట్ చేయాలి..’ అని చెప్పిన సెంథిల్ ‘మన నాలెడ్జి  బ్యాంక్ ఎంత విస్తారంగా వుంటే అంత జనరంజకంగా సృజనాత్మకత వెల్లివిరుస్తుంది’ అన్నారు.          ‘1960 లలో తెలుగు సినిమాలు దృశ్య ప్రధానంగా. క్లాసిక్స్ గా ఉండేవి. తర్వాత్తర్వాత వ్యాపారమే ప్రధానమై, డైలాగులతో స్టేజి డ్రామాలుగా మారిపోయాయి. దాంతో కెమెరా ప్రాధాన్యం తగ్గిపోవడం నాలాంటి వాళ్లకి బాధాకరమైన విషయం..’ అని విచారం వ్యక్తం చేశారు.

          ‘ ‘ఐతే ని నేను నవతరపు తొలి రియలిస్టిక్ సినిమాగా చిత్రీకరిస్తే, నాకు గ్లామర్ టేకింగ్ రాదని  ఫీల్డు మూడేళ్ళపాటు దూరంగా ఉంచింది ( ‘ఐతే’ కి ముందు సెంథిల్ 16 ఎం ఎం కెమెరా పట్టుకుని లో బడ్జెట్ ప్రయోగాలు చేయడానికి చాలామందితో విఫలయత్నాలు చేస్తూ కన్పించేవారు). ఆ సమయంలో ఎస్ ఎస్ రాజమౌళి ‘సై’ కి అవకాశమిచ్చి ఆదుకోవడంతో, భారీ కమర్షియల్స్ కి కూడా నేను సరిపోతానని రుజువు చేసుకున్నాను’ అని గతాన్ని నెమరేసుకున్నారు.

            ‘అసలు మా పని కథ వినడంతో మొదలవుతుంది. కథని నేనెంతో ప్రాణప్రదంగా వింటాను. అప్పుడే అసంకల్పితంగా విజువల్స్ స్ఫురిస్తూంటాయి. ఫస్ట్  విజువల్ ఈజ్ బెస్ట్ విజువల్ అని నేను నమ్ముతాను. మళ్ళీ వాటిని తవ్వుకుంటూ కూర్చోను’ అని వివరించారు.

          చాలామంది దర్శకులు కెమెరామెన్లతో అస్సలు షాట్స్ గిరించి చర్చించరు కదా అని అంటే- అది ఆ దర్శకుల అభద్రతాభావమే అన్నారు. అలాంటి వాళ్ళతో తను పని చేయలేదన్నారు. ‘

          ‘ఇటీవల విడుదలైన ‘తకిట తకిట’ అనే చిన్న సినిమాకి గానీ, ఇప్పుడు చేస్తున్న ఇంద్రగంటి మోహన కృష్ణ మరో చిన్న సినిమాకి గానీ ఇన్వాల్వ్ మెంట్ తోనే చేశాను- చేస్తున్నాను అన్నారు.

          రొటీన్ 435 కెమెరాల నుంచీ ప్రస్తుత సూపర్ 35 దాకా సాగిన ఈ పదేళ్ళ కెరీర్ లో సెంథిల్ కుమార్ డిజిటల్ కెమెరా వాడలేదు. మున్ముందు వాడవచ్చు. కెమెరాలన్నీ 35 ఎం ఎం వే. లెన్సుల్నిమార్చడం ద్వారా ఎనమార్ఫిక్ (70 ఎం ఎం) ఫార్మాట్ చేసుకోవచ్చు. అయితే ఇతర కెమెరాల్లో ఆడియో ఫార్మాట్ కి నెగెటివ్ మీద కొంత చోటు వదిలి చిత్రీకరిస్తారు.  సూపర్ 35 కెమెరాతో మొత్తం ఆ చోటునంతా ఆక్రమించవచ్చు. తర్వాత ప్రాసెసింగ్ లో కుదించి ఆడియో ఫార్మాట్ వేసుకోవచ్చు. అంతే గాక, ఈ కెమెరా తక్కువ వెలుతురులోనూ, ఎక్స్ ట్రావైడ్ యాంగిల్ షాట్స్ లోనూ సమర్ధవంతంగా పనిచేస్తుంది.

          సెంథిల్ కుమార్ పూర్వీకులు తమిళనాడు నుంచి వచ్చి సికింద్రాబాద్ లో స్థిరపడ్డారు. పీజీ పూర్తి చేసి సివిల్స్ కి రాస్తూంటే, ఓ మిత్రుడు తమాషాకి తెచ్చిన దరఖాస్తు ఫాం నింపి పంపిస్తే పుణే ఫిలిం ఇనిస్టిట్యూట్ లో సీటొచ్చింది!

          ‘దట్ ఐ బిలీవ్ వాజ్ మై డెస్టినీ..’ అని ఎమోషనల్ గా అని, తన సినిమాటోగ్రఫీని ఎంజాయ్ చేస్తున్న ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు చెప్పారు సెంథిల్.


సికిందర్
(ఆంధ్రజ్యోతి- ‘సినిమా టెక్’ శీర్షిక, నవంబర్ 2010)


Friday, August 7, 2015

క్రియేటివిటీకే మార్కులు!
రచన, దర్శకత్వం: కొరటాల శివ
తారాగణం : మహేష్ బాబు, శృతీ హాసన్‌, జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, సంపత్‌ రాజ్‌, ముఖేష్‌ రిషి, హరీష్‌ ఉత్తమన్‌, రాహుల్‌ రవీంద్రన్‌, అలీ, వెన్నెల కిషోర్‌, సుకన్య తదితరులు
సంగీతం: దేవిశ్రీప్రసాద్‌,  ఛాయాగ్రహణం: మధి
బ్యానర్‌: మైత్రి మూవీ మేకర్స్‌, మహేష్‌బాబు ప్రొడక్షన్స్‌;  నిర్మాతలు: నవీన్‌ ఎర్నేని, వై. రవి శంకర్‌, మోహన్‌ (సివిఎం)
విడుదల :  ఆగస్టు 7, 2015
*
రెండు వరస పరాజయాల తర్వాత మహేష్ బాబు కూడదీసుకుని, తన కెరీర్ లో
ఇంతవరకూ లేని ఒక సామాజిక కథకి - అదీ ఊరిని దత్తత తీసుకోవడమనే హీరోయిజం ఎలివేటయ్యే పాయింటు కి బాగా ఇంప్రెస్ అయి నటించిన ఈ ‘శ్రీమంతుడు’
సెమీ- కమర్షియల్ సినిమా. కమర్షియల్ అంశాలకంటే కూడా సీరియస్ కథకే ఎక్కువ ప్రాముఖ్యమిచ్చిన ప్రయోగం మహేష్ బాబు ఇమేజితో.
తెలుగు సినిమాలు మారాలీ అని ప్రేక్షకులే కోరుకోనప్పుడు
మారిన పంథాలో వాళ్ళ ముంగిట వాలిపోవడం అందరు హీరోలూ చేయలేని పని.
కనుక ముందుగా ఈ ప్రయత్నం చేసిన మహేష్ బాబుని అభినందించి
ఈ సినిమా తీరు తెన్నుల్లోకి వెళదాం..

శ్రీమంతుడి సమస్య
          క పెద్ద పారిశ్రామికవేత్త రవికాంత్ ( జగపతి బాబు) తన ఏకైక వారసుడైన చదువు పూర్తి  చేసిన కొడుకు హర్ష అలియాస్ హర్షవర్ధన్ ( మహేష్ బాబు) ని కంపెనీ బాధ్యతలు స్వీకరించాల్సిందిగా కోరతాడు. అందుకు హర్ష నిరాకరిస్తాడు. తండ్రి చేసిన వృత్తే కొడుకూ  చేయాలని లేదనీ, ఆ మాటకొస్తే మీ నాన్న వ్యవసాయం చేస్తే దాన్ని మీరు కొనసాగించకుండా వచ్చేసి వ్యాపారం చేస్తున్నారనీ  లాజిక్ తీస్తాడు. మరేం చేస్తావంటే, ఇంకేమీ తెలీదని చెప్తాడు. రవికాంత్ వదిలేస్తాడు. కొడుకు తనకే కాదు, ఇంట్లో కూడా ఎవరికీ అర్ధం కాడని అతడి నమ్మకం.

          ఇక హర్ష తన ధోరణిలో, హోదాలో బతికేస్తూంటాడు. భిక్షాటన చేస్తున్న ముసలవ్వకి నోట్ల కట్ట తీసిచ్చేస్తాడు. కంపెనీలో ఒక ఉద్యోగి (సూర్య) కూతురి పెళ్లి వుంటే ఇరవై లక్షలకి చెక్కు రాసిచ్చేస్తాడు. తన ప్రపంచం ఇంతవరకే. ఈ నగరంలో సహృదయుడు అన్పించుకుంటూ మిగతా లోకాన్ని పట్టించుకోక పోవడం. అలాగని కుటుంబాన్ని పట్టించుకోవడం మానడు. కంపెనీకి సంబంధించిన ఒక టెండర్ వ్యవహారంలో కేంద్ర మంత్రి వెంకట రత్నం పోటీ కొచ్చి, తన తండ్రిని బెదిరిస్తున్నాడని తెలుసుకుని, ఆ వెంకటరత్నానికి వార్నింగ్ కూడా ఇస్తాడు.

          ఇలాంటప్పుడు ఒక రోజు ముగ్గు లేస్తున్న చారుశీల( శృతీ హాసన్) ని చూసి ప్రేమలో పడతాడు. ఆమెని ఫాలో అవుతూంటాడు. తన కంపెనీలోనే పనిచేసే అప్పారావ్ ( వెన్నెల కిషోర్) మరదలు ఈమె అని తెలుస్తుంది. ఎంబీఏ తర్వాత రూరల్ మేనేజ్ మెంట్ కోర్సు చేస్తూంటుందీమే. ఇది వింతగా అన్పించి అడిగితే, గ్రామీణాభివృద్ధి పట్ల తన ఆసక్తి గురిచి చెప్తుంది. తను కూడా అదే కోర్సులో చేరిపోతాడు. ఆమెకి మరింత దగ్గరవుతాడు.

          ఒక రోజు అతనెవరో ఆమెకి తెలుస్తుంది. దాంతో గుడ్ బై చెప్పేస్తుంది. వేల కోట్లు సంపాదించిన అతడి తండ్రి సొంత ఊరు దేవర కోటని పట్టించుకోక పోవడం పై నిరసన వ్యక్తం చేస్తుంది. సొంత వూరేదో అదెలా వుందో తెలియని హర్షని హేళన చేస్తుంది. తనదీ అదే ఊరనీ, కానీ తన వూర్ని తాను మర్చిపోలేననీ ఎమోషనల్ అవుతుంది.

          దీంతో తీవ్రాలోచనలో పడ్డ హర్ష ఇక జీవితంలో తానేం చేయాలో తెలుసుకుంటాడు. జాలీ ట్రిప్ కి వెళ్తున్నట్టు తండ్రికి చెప్పేసి దేవరకోట  బయల్దేరతాడు. అక్కడి పరిస్థితులు చూసి చలిస్తాడు. శ్రీకాకుళం జిల్లాలో ఆ గ్రామమే కాదు, మొత్తం జిల్లా అంతా కేంద్రమంత్రి వెంకటరత్నం, అతడి తమ్ముడు శశి ( సంపత్ రాజ్) ల గుప్పెట్లో వుంటుంది. ప్రజలు అలమటిస్తూంటారు. ఉండలేక వలసపోతూంటారు. వూరి పెద్ద దిక్కు నారాయణ రావు (రాజేంద్ర ప్రసాద్) కి ఎటూ పాలుపోదు.

          ఇదంతా చూసి ఒక నిర్ణయం తీసుకుంటాడు హర్ష. ఈ ఊరిని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని ప్రకటిస్తాడు.

          ఇదీ ఇక్కడి దాకా కథ- ఇలా ఊరిని దత్తత తీసుకున్న హర్షకి వెంకటరత్నం- శశి సోదర ద్వయం నుంచి ఎలాంటి ఇబ్బందులు వచ్చాయి, వాటినెలా ఎదుర్కొన్నాడూ అన్నది మిగతా కథ.

          'మా ఊరు నాకు చాలా ఇచ్చింది.. ఎంతో కొంత తిరిగిచ్చేయాలి.. లేకపోతే లావైపోతాను' అన్న హీరోయిన్ మాట ఈ కథకి ఆధారం. 2003 లో ప్రముఖ రచయిత శివరామన్ కారంత్ రాసిన కథ ఆధారంగా శివ రాజ్ కుమార్ నటించిన ‘చిగురిద కణసు’ అనే కన్నడ సినిమా హీరో యాక్సిడెంటల్ గా తన ఇంటి పేరులో వూరి పేరు చూసుకుని, తన మూలాలు వెతుక్కునే సహజ కథగా తెరకెక్కింది. 2004 లో షారుఖ్ ఖాన్ నటించిన ‘స్వదేశ్’ - ఇద్దరు ఎన్నారై లు- పిల్లలమర్రి అరవింద, రవి కూచిమంచిలు ఇండియాకి తిరిగి వచ్చి ఆదివాసీల  వ్యవసాయానికి తోడ్పడే పెడల్ పవర్ జనరేటర్ ని రూపొందించిన నిజ కథ ఆథారంగా అంతే సహజత్వంతో తెరకెక్కింది. కొరటాల శివ తీసిన ప్రస్తుత ‘శ్రీమంతుడు’ అలాటి వాస్తవికతలకి సాహసించలేక, అలాగని పూర్తి కమర్షియల్ పంథానూ అనుసరించ లేకా - పాత్రచిత్రణ సహా రెండిటి మధ్య ఊగిసలాడిందని చెప్పొచ్చు.

ఎవరెలా చేశారు 
    మహేష్ బాబు తప్ప ఇంకెవరూ చేయడానికి ఏమీ లేకుండా చాలా జాగ్రత్త తీసుకున్నట్టు కన్పిస్తోంది. కమర్షియల్ మసాలా సినిమాల్లో హీరో ఒక్కడే కథ మీదేసుకుని నడిపించినా చెల్లిపోతుంది. ఒక ఉదాత్త కథ చెప్తున్నప్పుడు ఇతర పాత్రలన్నిటినీ మృగ్యం చేసి హీరోకే కథనంతటినీ ఆపాదించి  తీయడం కథకి అన్యాయం చేయడమే అవుతుంది. ఈ సినిమాలో ఎన్నో ఇతర పాత్ర లున్నాయి. వాటిని ఎందరో కొత్తా పాతా ప్రూవ్ చేసుకున్న పాపులర్ నటీనటులు నటించారు. కానీ ఎవరికీ ప్రాధాన్యత నివ్వలేదు- జగపతి బాబుతో సహా.

          ఈ సినిమా సెకండాఫ్ లో కొన్ని బరువైన సన్నివేశాలు చూస్తూంటే ‘పండంటి కాపురం ‘ గుర్తొస్తుంది. అందులో హీరోగా కృష్ణ  తనే నిర్మిస్తూ నటించినా, ఇతర పాత్రల్లో ఇంకెందరో హేమా హీమీలు నటించారు. వాటన్నిటి ప్రాధాన్యతల సమాహారమే ఆ ఉమ్మడి కుటుంబపు అర్ధవంతమైన కథయ్యింది. కానీ ప్రస్తుత సినిమాలో ఏకంగా ఒక వూరి కథే చెప్తున్నప్పుడు, ఆ వూళ్ళో సైతం పాత్రలకి ప్రాధాన్యం లేకుండా పోయింది. ఊరంటే హీరో ఒక్కడే ఐడెంటిటీ ఉన్న ప్రాణి గా, మిగతా వూరి జనం ఊరూపేరూ లేని అనామకులన్నట్టు చిత్రణ సాగింది.

          మహేష్ బాబు చూడడానికీ, నటించడానికీ బావున్నాడు. ఫైట్లకీ, పాటలకీ చాలా బావున్నాడు. బావుండని దెప్పుడు? ‘నేనొక్కడినే’, ‘ఆగడు’ అనే గత రెండు అపజయాల్లోనూ  ఫెంటాస్టిక్ గా వున్నాడు. కానీ నటిస్తున్న పాత్ర ఎలా వుందో వదిలేసి మనం అందచందాలు పొగుడుకుంటే, నటనా చాతుర్యాలు మాట్లాడుకుంటే అసలు పాయింట్ మిస్సవుతాం. ఎన్టీఆర్ నటించిన ‘టైగర్’ విడుదలైన సందర్భంగా దాని రచయిత వక్కంతం వంశీ తెలుగు సినిమాల తీరుతెన్నుల్ని ఒక్క మాటతో తేల్చేశారు- తెలుగు సినిమాల్లో కథలు పైపైన చెప్పేస్తున్నారని (అందుకే ఫ్లాప్ అవుతున్నాయన్న అర్ధం ధ్వనించేలా).  ఇందులో ఏ సందేహమూ లేదు. ప్రస్తుత ఉదాత్త కథలోనూ ఇదే జరిగింది. హీరో పాత్ర డెప్త్ లోకి వెళ్ళకుండా పైపైన సింగారించి నడిపించేశారు. ఉదాత్త కథలో ఉదాత్త హీరో పాత్ర చిత్రణకి విరుద్ధంగా.

          ఎవరైనా కాస్త ఆలోచిస్తే ఈ ఉదాత్త పాత్ర లోపాలు ఒకటొకటిగా తెలుస్తాయి. ఉదాత్త పాత్ర-దాని కథ పామరుల కంటికి మాత్రమే అందంగా కనిపిస్తే చాలదు, ఆ అందంతో  బాటు ఆలోచనాపరులకి కూడా అర్ధవంతంగానూ వుండాలి. లేకపోతే  అర్ధమే లేదు. ఆలోచనాపరులు సినిమాలు చూడరు కనుక వాళ్ళకోసం తీయడం లేదనుకుంటే అది వేరు.

          ఉదాహరణకి - టైటిల్ కి తగ్గట్టు ఈ ఉదాత్త పాత్ర నిజంగానే శ్రీమంతుడేనా? శ్రీమంతుడు అతడి తండ్రి. పైసాపైసా కూడా బెట్టి పాతికవేల కోట్ల రూపాయల మహా పారిశ్రామిక సామ్రాజ్యానికి అధిపతి అయి, ఎందరికో ఉపాధి కల్పిస్తున్న తండ్రి అసలు శ్రీమంతుడు. ఆ శ్రీమంతుడి కుటుంబంలో పెట్టి పుట్టిన వాడుగా హీరో కన్పిస్తాడు, అంతే. పైగా కంపెనీ బాధ్యతలు చేపట్టడానికి నిరాకరించి ఇంకేదో చేస్తానంటాడు. ఏం చేస్తాడో చదువు పూర్తి చేసిన తనకే స్పష్టత లేదంటాడు. ఈ కథలో అతనెక్కడా స్వయంగా రూపాయి సంపాదించినట్టు చూపించలేదు.

          అయినా తండ్రితో విభేదించి ఆ తండ్రి సంపదని అనుభవిస్తూ దానాలు చేస్తూంటాడు. అతను జారీ చేసే చెక్కులకి ఆ తండ్రే  డబ్బు కట్టాలి. స్వగ్రామానికి వెళ్ళీ వెళ్ళగానే అక్కడ ఎనిమిది లక్షలకి చెక్కు రాసిచ్చేస్తాడు. అలాగని ఇతను కొంటె పాత్రేం కాదు, తండ్రితో ఆడుకోవడం లేదు. చాలా డిగ్నిఫైడ్ గా కన్పిస్తాడు. మింగుడు పడని  ఈ వైరుధ్యంతోనే ఆద్యంతమూ పాత్రచిత్రణ కొనసాగుతుంది.

          ఇక గ్రామం దత్తత తీసుకునే సంగతి. స్వయంగా రూపాయి ఆర్జించని వాడు గ్రామాన్ని దత్తత తీసుకుంటాడు. అక్కడ రోడ్లు వేయించడానికీ, నీటి పారుదల పథకాలకీ కోట్ల రూపాయలు ఖర్చయి వుంటుంది. నిస్సందేహంగా ఆ డబ్బు తండ్రిదే. జాలీ ట్రిప్ కని  వెళ్ళిన కొడుకు ఇలా కోట్లాది రూపాయలకి  తనకి టెండర్ పెడుతోంటే ఆ తండ్రి ఏం చేస్తున్నాడో చూపించలేదు. అంత ఖర్చు చేస్తున్న కొడుకు ఎక్కడ ఉన్నాడో క్లయిమాక్స్ లో విలన్ చెప్తేనే తండ్రికి తెలుస్తుంది. మరి చెల్లింపులు ఎలా చేశాడో చూపించలేదు.

          జీవితంలో రూపాయి ఆర్జించని వాడు, తండ్రి సంపదని అనుభవిస్తున్న వాడు, ఆ తండ్రితో విభేదించి వెళ్ళిన వాడు ( దీంతో సోకాల్డ్ శ్రీమంతుడి లేబుల్ ని  కూడా త్యజించినట్టే) - గ్రామాన్ని దత్తత తీసుకుని ఆ తండ్రి చేతే ఖర్చు పెట్టిస్తున్న అర్ధంలో కథ వుంటే, అది హీరోయిజమున్న గొప్ప పాత్రగా- ఉదాత్త పాత్రగా ఎలా అనుకుని మహేష్ బాబు నటనని ఎంజాయ్ చేయాలో దర్శకుడే చెప్పాలి.

                                                               ***
        వైరుధ్యాలతో ఇలా అసహజంగా తోచే ఈ పాత్ర చిత్రణకి కారణం ఒకటే అయ్యుంటుంది. కథా ప్రారంభంలో హీరో పాత్ర పనీపాటా లేకుండా తిరుగుతూ వుండే మూస ధోరణిని ఎప్పుడూ తెలుగు సినిమాలు అనుసరించడం గమనిస్తూనే వున్నాం. ఈ రొటీన్ మూస ఫార్ములా ధోరణి మిస్సవకూడదని మహేష్ బాబు పాత్రకి తప్పనిసరి చేసి జోడించినట్టుంది. కనుక ఇలా పాత్ర ఏదైనా, ఎలాంటిదైనా, క్లాస్ అయినా, ఉదాత్తమైనదైనా ముందు ‘ప్రేక్షకులు ఆదరిస్తారని భావించుకునే’  పర్మనెంట్ క్యారక్టరైజేషన్ గా ఘనతవహించిన తెలుగు సినిమా స్క్రీన్ ప్లే నిఘంటువులో బంగారు అక్షరాలతో లిఖించుకున్నలాంటి - ‘లక్ష్యం లేకుండా హీరో తిరగడం’ అనే ముక్క తెచ్చి ఇక్కడా అతికించేసి ఓ ఫార్మాలిటీ పూర్తి చేశాం అనుకున్నట్టుంది!

          ఇందుకే ఏకైక వారసుడిగా-ఒక క్లాస్ హీరోగా-  తన బంగారం లాంటి కుటుంబ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్ళాల్సిన బాధ్యతని విస్మరించి, తండ్రి తదనంతరం ఈ వ్యాపార సామ్రాజ్యమూ, దీని మీద ఆధారపడ్డ వేలాదిమంది ఉద్యోగులూ ఏమైపోయినా సరే, ఏవో స్పష్టత లేని కారణాలు చెప్పి, తండ్రిని అలా వ్యతిరేకించాడు. తన ఉద్యోగుల భవిష్యత్తుని గాలికి వదిలేసినవాడు ఇంకేవో ఆదర్శాలతో ఉదాత్తంగా, క్లాసీ గా కన్పించడం మింగుడు పడని  వైరుధ్యమే.

          కానీ..కానీ...పైకి కన్పించే మాట తీరు ( ఆలోచనా తీరు కాదు) చేత తీరు- తో ఇంత డిగ్నిఫైడ్ గా కన్పించే హీరో పాత్రని-  తండ్రితో బాటు ఆల్రెడీ కంపెనీ బాధ్యతలు నిర్వహిస్తున్నట్టు చూపిస్తే కథకి వచ్చే నష్టమేమీ కన్పించడం లేదు. పైగా వ్యక్తిత్వం వుంటుంది.

          ఇంకా కథతో బాటు పాత్రా సరైన అర్ధంలో ఉదాత్త గుణాల్ని పుణికి పుచ్చుకునే అవకాశముంది. కొడుకు ఆవారా కాదు. తండ్రి చైర్మన్ అయితే కొడుకు ఎండీ. అలా టైటిల్ కి న్యాయం చేస్తూ కొడుకు శ్రీమంతుడు. సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటూ కంపెనీని పురోగతి బాట పట్టిస్తున్నాడు. వ్యక్తిగతంగా అతను నెగెటివ్ అర్ధంలో శ్రీమంతుడు. అతడికి ఇక్కడి డబ్బు ప్రపంచమే  తెలుసు. ఇంకోటి లెక్క చెయ్యడు. లిస్టింగ్ అయిన కంపెనీలకుండే కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీ ఎస్ ఆర్) ని కూడా తుంగలోతొక్కి కేవలం స్వార్ధం తో తన ఎదుగుదల మాత్రమే  చూసుకునే మల్టీ మిలియనీర్ అతను.

          అలాటి అతను  హీరోయిన్ తో ప్రేమలో పడ్డాడు. ఈ తండ్రీ కొడుకుల బయోడేటా తెలుసుకున్న ఆమె- సొంత ఊరే తెలియని హీరోనీ, తెలిసీ  ఊరుని పట్టించుకోని తండ్రినీ తూలనాడేసరికి- హీరో కళ్ళు తెరిచాడు ( క్యారక్టర్ గ్రోత్). అంతర్మధనంలో పడ్డాడు. మనిషిగా మారాలనుకున్నాడు. డబ్బుని త్యజించాడు, కంపెనీకి రాజీనామా ఇచ్చాడు (త్యాగ గుణం). సొంతూరు బాటపట్టాడు. అక్కడి పరిస్థితుల్ని చూసి గ్రామాన్ని దత్తత తీసుకుని  ‘సీ ఎస్ ఆర్’ ని అమలుచేయడం మొదలెట్టాడు..ఒక ఉన్నతమైన వ్యక్తిగా ఎదిగాడు..పాజిటివ్ అర్ధంలో శ్రీమంతుడి గా మారాడు!....ఇలా పాత్రచిత్రణ జరిగివుంటే వచ్చే నష్టమేమిటి?

          సినిమాలో చూపించిన ప్రకారం- హీరోయిన్ మాటతో అతను ఏ త్యాగమూ చేయకుండా స్వగ్రామానికి వెళ్ళిపోయాడు. ఇందులో ఎమోషన్ ఏముంది? సింపతీ ఏముంది? పైగా కాదనుకున్న తండ్రి సొత్తుతో ఊరుని బాగు చేస్తూ గొప్ప గొప్ప డైలాగులు చెప్తే గొప్పోడని ఎలా అనుకోవాలి? క్యారక్టర్ గ్రోత్ కన్పించాలంటే తన కాళ్ళ మీద ఎదగాలి కదా?

          ఇక ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రిని బెదిరించడంతో  చాలా ఇబ్బంది పెట్టేస్తుంది హీరో పాత్ర చిత్రణ. కేంద్ర మంత్రి దగ్గర ఎవరి పేరు చెప్పుకుని అపాయింట్ మెంట్ సంపాదించుకున్నాడంటే, తను వ్యతిరేకించిన తండ్రి పేరు చెప్పుకునే. లేకపోతే బిల్డప్ లేదు. తనకు ఏ సొంత వ్యక్తిత్వం వుండాలని తండ్రికి దూరమయ్యాడో, ఆ తండ్రి పరపతే ఇక్కడ అవసరపడింది తప్ప, తనకంటూ వేరే బిల్డప్ లేదు.

          ఈ సీను చూస్తూంటే, ‘రేసుగుర్రం’ లో ఇదే ముఖేష్ ఋషి పాత్రని అల్లు అర్జున్ పాత్ర వెళ్లి బెదిరించే దృశ్యం మెదులుతుంది- ఆ సీనులో కూడా ముఖేష్ రుషి పాత్రముందు  అల్లు అర్జున్ ది ఊరూపేరూ లేని బచ్చా పాత్రే అప్పటికి. పనిమాలా బెదిరించి ఆ తర్వాత తననీ, తన కుటుంబాన్నీ సర్వనాశనం చేసుకున్నట్టే ఆతర్వాత కథ సాగింది.

          ‘శివ’ లో నాగార్జున పాత్ర, మాఫియా పాత్ర రఘువరన్ పాత్రకి యాంటీగా ఎదిగాడంటే, ఆ బిల్డప్ అంతా ముందునుంచీ తోటి కాలేజీ  విద్యార్ధుల బ్యాకింగ్ తో స్క్రిప్టులో వర్కౌట్ చేశారు. ఏ బ్యాకింగూ, సొంత హోదా లేకుండా బచ్చా పాత్రలు వెళ్లి మహా మహా విలన్లని బెదిరించడం చాలా ఇబ్బంది పెట్టేస్తుంది. ఇలా చూపించి అభిమాన సూపర్ స్టార్స్ కి చప్పట్లు కొట్టమంటే ఎలా?

***
      సినిమా విడుదలయ్యాక ఒక ఇంటర్వ్యూలో దర్శకుడే చెప్పినట్టు - గ్రామాన్ని దత్తత తీసుకుంటానని ఒక మల్టీ మిలియనీర్ అన్న మాటలే ఈ కథకి ఆధారం. నిజమేకదా, దత్తత మల్టీమిలియనీర్లే తీసుకోగలరు- ఏమీ ఆర్జించని వాడు ఎలా దత్తత తీసుకుంటాడు. కాబట్టి ఈ క్యారక్టర్ డీ కోడింగ్ బట్టి తేలుతోందేమంటే, ఎలా పుట్టిన పాత్రని అలా సాగనివ్వలేదు. జోక్యం చేసుకుని అలవాటైన మూస మాస్ హీరో స్కీములో పాత్ర ప్రారంభాన్ని ఎత్తుకున్నారు. దీంతో వచ్చింది మొత్తం సమస్య. హీరోలకి అల్లరి పాత్రలే తప్ప, సీరియస్ ఉదాత్త పాత్రల్ని సృష్టించడం ఏనాడో మర్చిపోయినప్పుడు ఇలాగే జరగవచ్చు అలవాటు కొద్దీ.   
       ఇక నివసిస్తున్న నగరంలో హీరో పౌరసంబంధాల సంగతి వదిలేద్దాం- అవి చూపించకున్నా నష్టం లేదు. కానీ కథ ప్రారంభమయ్యాక తన  సొంతూరెళ్ళి నప్పుడు,  ఆ వూళ్ళో ‘లగాన్’ లో లాగా, ‘షోలే’ లో లాగా ఇతర పాత్రలు ఎదగకుండా ఉంటాయా? ఈ రెండు సినిమాల్లో ఆ సహాయ పాత్రల్ని మర్చిపోగలమా- సహాయ పాత్రలతో కలుపుకుని ఉదాత్త కథలవి!

          ప్రస్తుత సినిమాలో  హీరో నగరంలోలాంటి స్టయిలిష్ నెస్ నే మెయింటెయిన్ చేస్తూ, సొంతూరి ప్రజలతో మమేకం కాడు. హీరోయిన్ తండ్రి కాబట్టి రాజేంద్ర ప్రసాద్ పాత్ర- అతడి కుటుంబ సభ్యులే తప్ప- ఊళ్ళో ఇంకో పాత్ర కి దగ్గర కాడు. వాళ్ళ కష్ట సుఖాల్లో పాలుపంచుకోడు, వాళ్ళ అన్నం తిని,వాళ్ళ పంచలో పడుకోడు. అలాంటప్పుడు హీరో పాత్ర నిష్కృతి ఎలా చేసుకుంటున్నట్టు? తండ్రి పాపానికి తను నిష్కృతి చేసుకుందామని కదా వచ్చింది? అన్నిటికీ నేనున్నానన్న భరోసా నివ్వడు. ఒక పాట  బ్యాక్ డ్రాప్ లో గుండుగుత్తగా వూరి డెవలప్ మెంటేదో చేసేసి ఊరుకుంటాడు. వూరి మొదట్లో వలస పోయే వాళ్ళని లేక్కేసే శివాజీ రాజా పాత్ర, పక్కనే టైర్ షాపు ముస్లిం పాత్ర, ఎకరం భూమిలో కూరగాయలు పండించే సురేఖావాణి పాత్ర...ఇలా కొన్నైనా పాత్రల్ని హీరోకి ఎటాచ్ చేసి- వాటినీ ఎలివేట్ చేసివుంటే, అప్పుడు అదొక ఊరులా సజీవంగా కన్పించేది!

***

          ఏ కల్తీ లేని కమిట్ మెంట్ వున్న పాత్ర శృతీ హాసన్ అంటించిన చారుశీల పాత్రే. సొంతూరికి వచ్చినప్పుడు అక్కడ హీరోని చూసి, తనతో లైను కలపడానికే ఇక్కడ మకాం వేసి తన తండ్రికి మస్కా కొడుతున్నాడని మరింత కాన్ ఫ్లిక్ట్ సృష్టిస్తుంది- దురదృష్టమేమిటంటే ఈ కాన్ ఫ్లిక్ట్ ని, డైనమిక్స్ కి అవకాశాముండే  బీట్స్ నీ హీరో ఉపేక్షిస్తాడు. హీరో ఒకలాంటి పాసివ్ పాత్ర. హీరో అశక్తత వల్లే హీరోయిన్ పాత్ర సోదిలోకి లేకుండా పోయింది. మెరుగు పడిన శృతీ హాసన్ నటన వృధా పోయింది.

          టెక్నికల్ గా సినిమా అన్ని విభాగాల్లో క్వాలిటీని సంతరించుకుంది. మరోసారి తమిళ ఛాయాగ్రాహకుడు మధీ తన పనితనం ఉన్నతంగా చూపించాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం మరీ క్యాచీగా లేకున్నా- ( ‘జల్సా’, ‘గబ్బర్ సింగ్’ లలాంటి క్యాచీ ట్యూన్స్ ఆయన్నుంచి ఇంకెప్పు డొస్తాయో)  ఓ రెండు పాటలు ఫర్వాలేదు. కోటగిరి వెంకటేశ్వర రావు ఎడిటింగ్ కే ఇంకా చాలా పనుంది. గంటా ఇర్రవై నిమిషాల కథలేని ఫస్టాఫ్ నిడివినీ, గంటా ఇరవై మూడు నిమిషాల యమ సీరియస్ గా నడిచే సెకండాఫ్ నిడివినీ తగ్గించాల్సిన పని చాలా వుంది. క్లయిమాక్స్ లో పాటకి ముందు ఫైట్, పాట  తర్వాత వెంటనే ఫైట్, మెయిన్ స్టోరీ ముగిశాక మళ్ళీ లాస్ట్  ఫైట్- ఇలా పదిహేను నిమిషాల్లో మూడుసార్లు భారీ ఎత్తున ఫైట్స్ తల బొప్పి కట్టిస్తాయి. దీనికి మాత్రం ఎడిటింగ్ లో ఏమీ చేయలేరు. స్క్రీన్ ప్లే నే అలా వుంది.

స్క్రీన్ ప్లే సంగతులు 
        చాలా వరకూ స్క్రీన్ ప్లే సంగతులు పైన పాత్రచిత్రణా విశ్లేషణలో వచ్చేశాయి. పాత్రచిత్రణ అలా వుండడం వల్ల స్క్రీన్ ప్లే కి వచ్చిన ఇబ్బంది- మందకొడిగా నడవడం, డైనమిక్స్ లోపించడం, ఎంటర్ టైన్మెంట్ పూర్తిగా లోపించి కథ యమసీరియస్ గా - ఆర్ట్ సినిమాలా నడవడం!

          బిగినింగ్ ముగియడానికి గంటకి పైగా పడుతుంది. బిగినింగ్ విభాగం గోల్ మనతో దోబూచు లాడుతూ ఈ గంట సేపు కన్ఫ్యూజన్ గా వుంటుంది. ఈ కన్ఫ్యూజన్ అసహనానికి దారితీస్తుంది. కారణం విలన్ ట్రాక్స్ ని కూడా అప్పుడే ఓపెన్  చేయడం, మళ్ళీ సమాంతరంగా గ్రామ సమస్యలు కూడా చూపించడం. హీరోకి బిగినింగ్ విభాగం గోల్ ని  చివర్న హీరోయిన్ తో ఏర్పాటు చేస్తున్నప్పుడు, మధ్యలో ఈ గ్రామం- విలన్లూ అంటూ వేరేవేరే సీన్లు వేయడం చూసే ప్రేక్షకుల మెదడుకి అనవసర శ్రమ కల్గించడమే.

          ఎంత సేపటికీ ఈ కథ ఎక్కడ మలుపు తిరుగుతుందబ్బా అని పట్టి పట్టి చూస్తూంటే- హీరో వెళ్లి కేంద్ర మంత్రిని బెదిరిస్తూంటే- ఇదిగో ఇక్కడ మలుపు తిరిగి హీరోకి గోల్ ఏర్పడుతుందోచ్ అని సంబర పడుతున్నంతలోనే- ఇది కాకుండా పోయి- మళ్ళీ మామూలు ధోరణిలోకి వచ్చేస్తుంది కథనం. మళ్ళీ ఓ పెళ్ళిలో కేంద్ర మంత్రి కొడుకు హీరో మీద ఎటాక్ చేస్తున్నప్పుడు-  ఇదిగో ఇక్కడ కథ ప్రారంభమవుతుందోచ్ అన్పించి- మళ్ళీ ఇది కూడా కాకుండా పోతుంది.

          ఎక్కువ స్ట్రెస్ విలన్స్ మీదే ఉండడంతో ఈ కథ విలన్స్  వర్సెస్ హీరో అన్పించేట్టుగా మిస్ లీడ్ చేస్తుంది. తీరా సాగి సాగి గంట తర్వాత హీరోయిన్ ఎదురు తిరగడంతో, హీరోకి సొంతూరి గురించి ఆలోచన రావడంతో, వార్నీ ఇంతా సతాయించి ఇదా కథ అన్పిస్తుంది!

          ఈ బిగినింగ్ గోల్ కి కథనాన్ని చేర్చాలంటే  ఆ విలన్లూ- గ్రామం ట్రాకులు తీసేయాలి నిజానికి. ‘షోలే’ లో విలన్ నీ, కథా స్థలం రాంపూర్ గ్రామాన్నీ ముందే చూపించే పొరపాటు చేయలేదు. చేతిలో వున్న పాచికల్ని ఎప్పుడు ప్రయోగించాలో అప్పుడు ప్రయోగిస్తేనే కథలో సస్పెన్స్, ఆ సస్పెన్స్ వీడి చేంజ్ ఓవర్స్ కన్పిస్తూ ఎప్పటికప్పుడు ఆస్వాదించడానికి తాజాగా, మజాగా వుంటుంది కథనం.

          బిగినింగ్ ముగించడానికి కథనంలో దేన్నయితే గోల్ గా పెట్టుకున్నామో,  ఆ అంశానికి సంబంధించిన దృశ్యమాలిక ఉండడమే ఉత్తమ కథనం. ఈ కథలో హీరోకి ప్రత్యర్ధి పాత్రలు కేంద్ర మంత్రీ అతడి తమ్ముడి పాత్రలూ కానే కాదు- అలా అనుకుంటే పొరపాటే. కానీ ఇలాగే సాగింది మొత్తం కథనం. మౌలికంగా సమస్య సృష్టించింది విలన్లు కాదు. సొంతూరి గురించి ఒక్క మాటతో ( సమస్యతో) కథ ప్రారంబించిన హీరోయిన్ పాత్ర మటుమాయమై పోయింది. ఆ ఒక్క మాటతోనే హీరోకి ఆమె సమస్య సృష్టించింది. సమస్య సృష్టించిన ఈమె పాత్రే హీరోకి ప్రత్యర్ధి పాత్రవుతుందే తప్ప వేరే విలన్లు కాదు. హీరోకి ప్రత్యర్ధిగా హీరోయిన్ సృష్టించిన సమస్యకి, విలన్ల విలనిజం ఒక బై ప్రొడక్టు మాత్రమే.

          ఈ కథలో హీరోకి ప్రధానంగా ఏర్పాటయ్యింది విలన్లతో ఫిజికల్ గోల్ కాదు, హీరోయిన్ చెప్పిన మాటలతో ఎమోషనల్ గోల్. ఈ ఎమోషనల్ గోల్ కి బై ప్రొడక్టు ఫిజికల్ గోల్. హీరోకి ప్రత్యర్ధిగా హీరోయినే ఎలిమెంటరీ- విలన్లు సెకండరీ. ‘జేమ్స్ బాండ్ - నేను కాదు నా పెళ్ళాం’ లో హీరోయిన్ తల్లి మాటే ఎమోషనల్ గోల్ అయినట్టు, వేరే ఫిజికల్ గోల్ లేకపోయినా విలన్లతో దాన్నే ప్రధానం చేసినట్టూ ఇక్కడా పొరపాటు జరిగింది.

          సరే, బిగినింగ్ లో హీరోయిన్ మాట వరకూ కథనం గోల్ కి చేరే దాకా విలన్లూ- గ్రామమూ ట్రాకులు తీసేస్తే నీటుగా వుండి-టు ది పాయింటుగా సూటిగా వుండేది కథనం. బిగినింగ్ విభాగంలో పాత్రల పరిచయం, కథా నేపధ్య సృష్టి, సమస్యకి దారితేసే పరిస్థితుల కల్పన, సమస్య ఏర్పాటూ  అన్న నాలుగు స్క్రిప్టింగ్ టూల్స్ తో కూడిన సూత్రప్రాయమైన స్ట్రక్చర్  ‘శివ’ తో సహా గుర్తుండి  పోయే సినిమాల్లో ఎందుకు అమలవుతోందంటే-  ఇలాటి కన్ఫ్యూజన్ నీ, బోరునీ, బిగినింగ్ విభాగం చాంతాడంతా సాగి సహన పరీక్ష పెట్టడాన్నీ బేషరతుగా నివారించడానికే. అప్రధాన విషయాలతో న్యూస్ ప్రింటూ స్క్రీన్ టైమూ వృధా చేయకూడదుగా? పాత్రల పరిచయమంటే సినిమా అంతా వుండే అన్ని పాత్రల పరిచయమూ కాదు, కేవలం ఈ విభాగంలో సమస్యకి దారితీసే పాత్రల పరిచయమే.

          ఈ లెక్కన ఇక్కడ హీరోకి హీరోయిన్ తో ఐడియాలజికల్ గా మేధోపరమైన ఎమోషనల్ గోల్ ( సమస్య) ఏర్పాటవుతోంది గనుక- దీనికి దారితీసే పాత్రలు మాత్రమే బిగినింగ్ లో వుంటే సరిపోతుంది.

          ఇక, ఈ గోల్ దగ్గర దీని నిర్మాణం చూద్దాం. ఇది కథకి మొదటి మూల స్థంభం. ఈ మూలస్తంభంలో సమస్య, ఆ సమస్యలో ఎమోషన్, మళ్ళీ ఆ సమస్యలో పరిణామాల హెచ్చరిక లేదా వాటిపట్ల ఆందోళనా  ఎస్టాబ్లిష్ అవ్వాలి. అప్పుడే ఈ మూల స్థంభం మొత్తం కథకీ ఆయువు పట్టుగా వుండి ప్రేక్షకుల్ని ముందుకి లాక్కెళుతుంది.

          సినిమాలో బిగినింగ్ విభాగాన్ని ఎట్టకేలకు ముగిస్తూ - హీరోయిన్ అనే మాటలతో ఈ మొదటి మూలస్థంభం ఏర్పాటు చేసినప్పుడు హీరోకి సమస్య ఏర్పాటయింది. కానీ ఈ సమస్యలో ఎమోషన్ లేదు. ఎందుకంటే అతను 1. ఏ త్యాగమూ చేయలేదు.  2. దేన్నీ పణంగా (stakes) పెట్టలేదు. అతడి ప్రేమ మాత్రమే రిస్కులో పడింది. ఇది సెకండరీ, ఈ భగ్న ప్రేమలోంచి  ఎమోషన్ పుట్టే అవకాశం లేదు, ఎందుకంటే ఇది ప్రేమకథా చిత్రం కాదు. అంతకంటే పెద్ద కాన్వాస్ పై వాళ్ళిద్దరి మధ్యా ideological differences గురించిన కథ.

          కనుక  ఎమోషన్ పుట్టడానికి పైన చెప్పిన 1, 2 పాయింట్లే కారణమౌతాయి. ఇవి జరగడానికి  పాత్ర ఆ క్రమంలో ఎదగలేదు. (అతను రూపాయికి ఠికానా లేని సామాన్యుడు అయ్యుంటే ఎదుగుదల ప్రశ్నేరాదు. కానీ వేలకోట్ల ఆస్తికి వారసుడతను, అర్ధం లేకుండా ఎదుగుదల, హోదా వదులుకున్నాడు- ఇది ఆ తర్వాత పాత్రకీ కథకీ ఏమాత్రం ఉపయోగపడలేదు- కేవలం మాస్ క్యారక్టర్ని ఈ రూపంలో చూపించి ప్రేక్షకుల్ని సంతృప్తి పరుద్దామన్న రాంగ్ డైరెక్షన్లో అత్యుత్సాహం తప్ప).

          అతను కంపెనీకి బాధ్యుడిగా ఉండుంటే, ఆ దర్జా అంతా  నెగెటివ్ గా అనుభవిస్తూంటే- అప్పుడు హీరోయిన్ మాటలతో కళ్ళు తెర్చి, అవన్నీ తుంగలో తొక్కేసి ఒక కామన్ మాన్ గా ముందుకెళ్ళి పోవడంలో ఎమోషన్ (త్యాగం) వుండేది, ఫైర్ వుండేది, క్యారక్టర్ ఆర్క్ లేచేది, నెగెటివ్ గా లీడ్ చేస్తున్న లైఫ్ పాజిటివ్ కి వచ్చి క్యారక్టర్ గ్రోత్ కన్పించేది, ఆ ఫైర్ వల్ల కథ టైం అండ్ టెన్షన్ గ్రాఫ్ కూడా అమాంతం పైకి లేచేది!

          ఇంకో రూల్ : మూలస్థంబం విజువల్ యాక్షన్ తో వుండాలి. అప్పుడే ప్రభావశీలంగా రిజిస్టర్ అవుతుంది. హీరో కంపెనీ కి రాజీనామా చేసేసి, ఎందరు ఆపుతున్నా ఆగకుండా వెళ్లి పోవడమనే ఘట్టం వుంటే ఆ విజువల్ యాక్షన్ పాత్రనీ, కథనీ చాలా ఉద్విగ్నంగా మార్చేది -( What is character but the determination of incident? And what is incident but the illumination of character?- Henry James).

          ఇక పరిణామాల గురించి ఆడియెన్స్ కి ఆందోళన రేపి ఇన్వాల్వ్ చేయడానికి- అతను ఏ త్యాగమూ చేసి పోవడం లేదు- కనీసం ఇంట్లోంచి అతన్నెవరూ వెళ్ళ గొట్ట లేదు. అయ్యో అబ్బాయి అన్నీ వదిలేసుకుని వెళ్లి పోతున్నాడే - ఇప్పుడే మవుతాడో ఏమోనన్న ఆందోళన రేపాలంటే, ఆ గోల్ లోనే ఆ ఎమోషన్ వుండాలి. ఆ ఎమోషన్ త్యాగం వల్లే ఏర్పడుతుంది.

           ఫ్లాట్ క్యారక్టర్స్ తో అన్నీ ఫ్లాట్ గానే తయారవుతాయి.

***

మిడిల్ గోల్ మతలబు
   బిగినింగ్ లో  ఏర్పాటయిన గోల్ పక్వానికి రావాలంటే మిడిల్ లో కూడా గోల్ వుండాలి. సొంతూరుని చూడాలన్న గోల్ తో బయల్దేరిన హీరో అక్కడ పరిస్థితులు చూసి వూరికేదో చేయాలన్న గోల్ పెట్టుకుని దాని సాధనకి సంఘర్షించాలి. మిడిల్ విభాగం బిజినెస్ అంటేనే గోల్ కోసం సంఘర్షణ. ఇలాటి గోల్ వల్ల మిడిల్ విభాగం ముగింపులో కథకి రెండో మూలస్థంభం ఏర్పాటవుతుంది. దీంట్లో ఎమోషన్ వుంటుంది, పవర్ వుంటుంది, యాక్షన్ వుంటుంది.

          ఐతే...ఐతే...మొదటి మూలస్థంభంలో సమస్య, ఆ సమస్యలో ఎమోషన్, మళ్ళీ ఆ సమస్యలో పరిణామాల హెచ్చరిక లేదా వాటిపట్ల ఆందోళనా - ఈ మూడిట్లో ఏ ఒక్కటి లోపించినా రెండో మూలస్థంభం మూగబోతుంది. అందుకే అంటారు బిగినింగ్ ముగింపులో సమస్య ఏర్పాటు బలంగా లేకపోతే ఆటోమాటిగ్గా క్లయిమాక్స్ కూడా బలహీనంగా తేలిపోతుందని ( యథా మూలస్థంభం-1 - తథా మూలస్థంభం -2).

          కాబట్టి రెండో మూలస్థంభం తర్వాత ప్రారంభమయ్యే క్లయిమాక్స్ బలంగా రావాలంటే రెండో మూలస్థంభాన్ని రిపేరు చేయాలి. రెండో మూలస్థంభాన్ని రిపేరు చేయాలంటే, వెనక్కెళ్ళి మొదటి మూలస్థంభాన్ని మరమ్మత్తు చేయాలి. మూలస్థంభాలు రెండూ సమాన బలంతో లేకపోతే  కథా సంవిధానమనే భవనం కుప్ప కూలిపోతుంది.

          అసలు ఈ రెండో మూలస్థంబమే  వుండని సినిమాలుంటాయి. రెండో మూలం స్థంభంలేకపోయినా, వుండీ బలం లేకపోయినా, ఆ మిడిల్ విభాగంతో విభాగంతో బాటు, తర్వాత వచ్చే ఎండ్ విభాగమూ బాగా నస పెడతాయి. ఇలా రెండో మూలస్థంభం లేని సినిమాల్లో ప్రస్తుత సినిమా కూడా ఒకటి.

          బిగినింగ్ ముగింపులో హీరోయిన్ తో సమస్య మొదలయ్యాక, హీరో స్వగ్రామానికి బయల్దేరి వెళ్తున్నప్పుడు మిడిల్ విభాగంలో పడింది కథ. ఇప్పుడు దారిలో వేరే మనుషుల మీద కేంద్రమంత్రి కొడుకు తన అనుచరులతో కలిసి దాడి చేస్తూ కన్పిస్తాడు. హీరో జోక్యం చేసుకుని వాళ్ళని చిత్తు చేస్తాడు. ఇదే ఇంటర్వెల్ సీను. ఈ సీను అవసరమే. కానీ ఇదెప్పుడు బాగా వర్కౌట్ అవుతుంది? పైన చెప్పుకున్నట్టు బిగినింగ్ విభాగంలో అప్రస్తుత విలన్ల ట్రాకు పూర్తిగా తీసేసినప్పుడే. తీసేసి ఇక్కడ్నించీ విలన్ల ఎంట్రీ ఇస్తే ఇంటర్వెల్ సీను రాణిస్తుంది.

          అదెలాగంటే, హీరోయిన్ మాటలతో తన మూలాలు వెతుక్కుంటూ మిడిల్ విభాగమనే సంఘర్షణాయుత లోకంలో అడుగుపెడుతున్న హీరోకి, ఇక్కడ మాత్రమే మొదటిసారిగా విలన్ ఎదురవడమనే డైనమిక్ వల్ల, మిడిల్ విభాగానికి ఓ ఎత్తుగడ ఏర్పడి ఫ్రెష్ నెస్ వస్తుంది. అదును  చూసుకుని కథలోకి కొత్త పాత్ర ప్రవేశించడంతో ప్రేక్షకులు గబుక్కున తేరుకుని చూసేలా చేస్తుంది. కథనంలో కొత్త నీరు ప్రవహించినట్టుండి హాయిగా అన్పిస్తుంది.

          లేకపోతే  బిగినింగ్ విభాగంలో చూపించేసిన అదే విలన్లతో మిడిల్ విభాగం ప్రారంభిస్తే, అదే పాతనీరు ప్రవహించినట్టుంటుంది తప్ప, కథనంలో ( స్క్రీన్ ప్లేలో)  ఛేంజ్ ఓవర్ కన్పించదు. ప్రేక్షకులు ఎలర్ట్ అయి చూడడాని కేమీ వుండదు. తినడానికి కూర్చుంటే అస్తమానం ఇడ్లీయే పెడుతోంటే బోరు కొట్టొచ్చు, తినలేక పోవచ్చు కూడా. ఇడ్లీ తర్వాత ఒక వడ పడేస్తే ప్రాణం లేచొచ్చి ఆవురావురంటూ తీనేస్తారు, మళ్ళీ ఓ పూరీ పడేస్తే అదీ స్వాహా చేస్తారు, మార్చి మార్చి ఏమేం పడేసినా మాంచి యాక్టివ్ నెస్ తో సర్వం సఫా చేస్తారు.

          స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ అంటే ఇలా కొత్త కొత్త వడ్డనలతో ప్రేక్షకుల్ని ఎప్పుడూ యాక్టివ్ గా ఉంచే మెకానిజమే. ఇందుకే బిగినింగ్ విభాగం లో ఏర్పాటయ్యే సమస్య తాలూకు పాత్రలనే చూపించ మన్నారు పండితులు.  ‘శివ’ లో ఎట్టి పరిస్థితిలో బిగినింగ్ విభాగంలో అప్పుడే అవసరం లేని విలన్ పాత్ర రఘువరన్ ని చూపించలేదు. మిడిల్ డైనమిక్స్ లోనే అతను వచ్చి కథనంలో కొత్త నీరు ప్రవహింప జేస్తాడు. ‘షోలే’  లో కూడా గబ్బర్ సింగ్ ని మొదటి నుంచీ వేరే ట్రాకులో చూపించుకుంటూ రాలేదు. అతణ్ణి దాచి పెట్టి,  హీరోలు ఆ గ్రామంలో మకాం వేశాకే, అదును చూసుకుని అతను ఎంట్రీ ఇచ్చే వాతావరణం సృష్టించారు.

          ఈ సరయిన సమయంలో, సరయిన అవసరం తీర్చడానికి పాత్ర ఎంట్రీ  ఇచ్చే ముందస్తు వాతావరణాన్ని సృష్టించాడాన్నే సాహిత్యంలో నాందీ ప్రస్తావన అంటారు. అసలు కథనమంటేనే తర్వాతేం జరుగుతుందన్న సస్పెన్స్, థ్రిల్ల్, టెంపోలతో ఎప్పటికప్పుడు కొత్త నీరు ప్రవహింప జేయడం. పుష్కరాలు ప్రవహించే నదులకే వస్తాయే తప్ప నిల్వ నీరు కుంటలకి రావు. స్క్రీన్ ప్లే ఒక కుంట లా వుండకూడదు. ముందే చూపించేసిన అదే పాతనీరు కథంతా ప్రవహిస్తూంటే చూడ్డానికి కొత్తదనమేం ఉండక పోగా బోరు కొడుతుంది. స్క్రీన్ ప్లే అంటే రకరకాల పాచికలని గుప్పెట్లో పట్టుకుని, ప్రేక్షకుల్ని రంజింపజేసేందుకు  సమయానుకూలంగా వాడుకునే రూట్ మ్యాపు తెలిపే స్ట్రక్చరే. గుప్పెట్లో  ఏమీ పెట్టుకోకుండా ఎడాపెడా అన్నీ చూపించేస్తే అది స్ట్రక్చరే  అనిపించుకోదు, కేవలం చేస్తున్న పనిమీద అవగాహన లేనితనమే.  
          దర్శకుడి చేతిలో మంచి క్రియేటివిటీ వుంది, దీంతో పోటీ పడుతూ స్ట్రక్చర్ కూడా వుండాల్సింది.

***
       సామాజిక స్పృహగల ఉదాత్త కథలు కథల నిచ్చెన మెట్లలో మూడో స్థానంలో వుంటాయి. మొదటి స్థానం లో స్పిరిచ్యువల్ కథలుంటాయి ( స్టార్ వార్స్ , జై సంతోషి మా, అన్నమయ్య), రెండో స్థానం లో యూనివర్సల్ కథలుంటాయి ( గ్లాడియేటర్, భజరంగీ భాయిజాన్, అల్లూరి సీతారామరాజు), మూడో స్థానంలో సామాజిక సృహగల కథలుంటాయి ( రెయిన్ మాన్, శివ, ఆ రక్షణ్), అట్టడుగు నాల్గో స్థానం లో వ్యక్తిగత కథలుంటాయి ( ఆర్డినరీ పీపుల్, ఖైదీ, సత్య).  

          ఏ స్థాయి కథనైనా ఉదాత్తంగా చెప్పాలనుకున్నప్పుడు, దానికి ఇంకో కోటింగ్ కూడా వేస్తే గొప్ప కథై పోతుంది. ఆ కోటింగ్ కాన్షస్- సబ్ కాన్షస్ మైండ్ ల ఇంటర్ ప్లే తో కూడిన కథనమే ( టైటానిక్, జాస్, జురాసిక్ పార్క్, పీకే, హమ్ దిల్ దే చుకే సనమ్, భజరంగీ భాయిజాన్, శివ, ఒక్కడు, మరో చరిత్ర..). ఇదేం కొత్త ప్రయోగాలు చేసి చేతులు కాల్చుకునే వ్యవహారమేం కాదు. అసలు మన ప్రమేయం లేకుండా మన మైండే యాదృచ్ఛికంగా చేసుకుపోయే పని ఇది. తీరా చూసుకుంటే అందులో కాన్షస్- సబ్ కాన్షస్ మైండ్ ల ఇంటర్ ప్లే స్పష్టంగా కన్పిస్తుంది. కాకపొతే మన మైండ్ ఈ పని చేస్తోందన్న సృహ వుంటే మంచిది- స్పృహతో ఈ పని చేయడం ఇంకా మంచి ఫలితాల్నిస్తుంది.

          వెండితెర మీద కన్పించే హీరో అంటే ఎవరు? మనలో వుండే ఇగో ప్రతిరూపమే హీరో . స్ట్రక్చర్ లో  బిగినింగ్ విభాగం అంటే ఏమిటి? మనలోని కాన్షస్ మైండ్ కి దర్పణమే. మిడిల్- ఎండ్ విభాగా లేమిటి? మనలోని సబ్ కాన్షస్ మైండ్ కి నిలువుటద్దాలు.

          మన  మైండ్ ఎలా పనిచేస్తుంది? నిత్యం మన మైండ్ సంఘర్షిస్తూ వుంటుంది. కారణం? రెండు మైండ్లకీ మధ్యన కాపలా వుండే ఇగో. బాహ్యేంద్రియాల ద్వారా కాన్షస్ మైండ్ అందుకున్న సమాచారం సబ్ కాన్షస్  లోకి వెళ్ళాలంటే అక్కడ కాపలా వుండే ఇగో పర్మిషన్ ఇవ్వాలి. ఇగోకి సబ్ కాన్షస్ (అంటే అంతరాత్మ) అంటే చచ్చే భయం. అందులోకి తొంగి చూసేందుకు అస్సలు ఒప్పుకోదు. అందులో ఒప్పుకునే ప్రసక్తే లేని చాలా నగ్నసత్యాలు, శాశ్వత సత్యాలు- అన్నీ నీతిని బోధించేవే వుంటాయి. పైగా తను చేసిన తప్పుల రికార్డు కూడా వుంటుంది.

          అప్పుడు దాని మెడ బట్టి సబ్ కాన్షస్ లోకి నెట్టేస్తే ఏమవుతుంది?  అది లబలబ లాడి అందులోనే చచ్చినట్టూ మునకలేస్తూ, అక్కడి నిజాల యూనివర్సల్ కోర్టు నుంచీ పారిపోలేకా, సంఘర్షించీ సంఘర్షించీ, భయపడ్డ అక్కడి నెగెటివ్ ఫీలింగ్స్ ని చంపేసుకుని- కావాల్సిన పాఠాలన్నీ నేర్చుకుని- మెచ్యూర్డ్ ఇగో గా పునీతమై ఒడ్డున పడుతుంది.

          హీరోని ఇగోకి ప్రతిరూపంగా పెట్టుకుని, ఆ ఇగోని-  మేచ్యూర్డ్ ఇగో గా మార్చేందుకు ప్రయత్నించేదే గొప్ప కథ.

          కాన్షస్ మైండ్ ( బిగినింగ్ విభాగం) లో తిరుగు లేకుండా మజా చేస్తున్న- బతికేస్తున్న-  హీరో పాత్రని మెడ బట్టుకుని అమాంతం సబ్ కాన్షస్ మైండ్ ( మిడిల్- ఎండ్ విభాగాలు) లోకి నెట్టడమే అందరు కథకులూ చేసే పని. కాకపోతే సృహతో చేయాలి.

          వెండితెర మీద ఆవిష్కృత మయ్యేది మన మానసిక ప్రపంచమే. మన మానసిక ప్రపంచంలో సబ్ కాన్షస్ వచ్చి కాన్షస్ మైండ్ లోకి జొరబడదు. రెండూ విడివిడి ప్రపంచాలు. ఇది ప్రకృతి నియమం. అసలు వెండితెరమీద సినిమా అనే దృశ్యమాధ్యమం కథ ద్వారా  మనకి చేసేది సైకో థెరఫీ. ఇందుకు బలమైన ఉదాహరణలు - ‘బ్యాక్ టు ది ఫ్యూచర్’, దీని అనుసరణ ‘ఆదిత్య- 369’. మన జానపద కథలు- కాశీ మజిలీ, పేదరాశి పెద్దమ్మ కథలన్నీ ఇదే చట్రంలో సైకో థెరఫీ చేసేవే. కథంటేనే సైకో థెరఫీ. కథంటే మైండ్. అన్నిట్లోనూ కన్పించేది  మైండ్. ఈ విశ్వమే మైండ్.

          ఏ సూత్రాల్నీ ఎవరూ కనిపెట్టి ఇలాగే వుండాలని శాసించడం లేదు. మైండ్ లోంచి జరిగిన రకరకాల సృష్టుల్ని చూసి- ఇందులో ఫలానా ఈ ఈ సూత్రాలుంటే ఇలా తయారవుతాయని చెప్పారంతే. భరతముని నాట్య శాస్త్రమైనా ఇంతే.  స్క్రీన్ ప్లే సూత్రాలూ ఇంతే. ప్రకృతి ప్రసాదించినవి.

           ఇందుకే ఈ దృష్ట్యా  చూసినా- తదుపరి మిడిల్ విభాగంలో రావాల్సిన విషయాలు తొందరపడి బిగినింగ్ విభాగంలోకి రాకూడదనేది. వస్తే మన మైండ్ దాని ప్రకృతి రీత్యా ఇబ్బంది పడుతుంది.

          ప్రస్తుత సినిమానే ఉదాహరణగా తీసుకుంటే- పైన ఇందాక చెప్పుకున్నట్టు- విలన్ల ట్రాకు, గ్రామ సమస్యల ట్రాకూ రెండూ తర్వాత వచ్చే మిడిల్ విభాగంలో ( అంటే సబ్ కాన్షస్ లో) కి దూకి  హీరో సంఘర్షించబోయే అంశాలు. వాటిని బిగినింగ్ లో( కాన్షస్ మైండ్) లో తెచ్చి ఎలా కలుపుతారు? బిగినింగ్ విభాగం, కాన్షస్ మైండ్ ల బిజినెస్సే వేరు.

***
   ఇంటర్వెల్ ఘట్టం గొప్ప కాన్సెప్ట్ నిజానికి. దానికి హీరో అమాంతం సబ్ కాన్షస్ లోకి దూకాడన్న సెన్స్ జతపడి వుంటే ఆ ఊపే వేరు. స్క్రీన్ ప్లే సూత్రాలు చెప్తున్న ఈ స్టోరీ మైండ్ ప్రకారం,  ఏర్పాటయిన స్ట్రక్చర్ లో ఈ సీన్ని ఎలా సృష్టించాలో అది దర్శకుడి క్రియేటివిటీ. అలా చేసివుంటే జతపడిన ఆ కోటింగ్ తో - We want more, we want more, dil mange more!  అని అల్లరల్లరి చేసివుండే వాళ్ళు ప్రేక్షకులు.

          ఇంటర్వెల్ తర్వాత సెకండాఫ్  ఓపెనింగ్ కూడా మళ్ళీ అదే పాతనీరు ప్రవహించింది. హీరో గ్రామంలోకి ప్రవేశిస్తున్న దృశ్యాలు. విలన్లతో చూపించినట్టే ఈ గ్రామ దృశ్యాల్నీ, అక్కడి సమస్యల్నీ ఆల్రెడీ బిగినింగ్ విభాగంలో సమాంతరంగా చూపించుకొచ్చేసి - కథనానికి హాని చేశారు. ఈ గ్రామం అనేది మిడిల్ విభాగంలో హీరో తన గోల్ కోసం అడుగుపెట్టే  సబ్ కాన్షస్ వరల్డ్. ఇందుకే ఈ గ్రామ దృశ్యాలు, అక్కడి సమస్యలూ చూపించడానికి బిగినింగ్ లో ( కాన్షస్ వరల్డ్ ) లో అనుమతి వుండకూడదు.

          ఫ్రెష్ గా గ్రామాన్ని సెకండాఫ్ ఓపెనింగ్ లో చూపించడం మొదలెడితే అది కొత్త నీరు ప్రవహించడం అవుతుంది. ఇదేమిటా అని ప్రేక్షకులు ఎలర్ట్ అయి కొత్త సంగతులు చూడ్డానికి సిద్ధమవుతారు. హీరో పాయింటాఫ్ వ్యూలో గ్రామంలో పరిస్థితులు ఇప్పుడే ఒకటొకటే రివీల్ అవుతూంటే కథలో ఈ కొత్తదనాకి థ్రిల్లవుతారు.

          ఈ విభాగంలో హీరో పరిస్థితులు తెలుసుకుని బాగానే రియాక్ట్ అయ్యాడు. గ్రామాన్ని దత్తత తీసుకుంటానని ప్రకటించాడు. ఈ దత్తత తీసుకుని చేపట్టిన కార్యక్రమాల్ని ఒక్క పాటలో చూపించేసి ముగించేశారు. కానీ మిడిల్ విభాగానికి సంబంధించి ఈ సబ్  కాన్షస్ వరల్డ్ లో హీరో జర్నీ ఎలా వుంటుందో పైన చెప్పుకున్న గొప్ప సినిమాలనదగిన  టైటానిక్, జాస్, జురాసిక్ పార్క్, పీకే, హమ్ దిల్ దే చుకే సనమ్, భజరంగీ భాయిజాన్, శివ, ఒక్కడు, మరో చరిత్ర.. లని చూస్తే అర్ధమౌతుంది. సమస్యలో పడ్డ హీరో ఆ సమస్యని సాధించడానికి ఏమేం చేస్తూంటాడు, ఏమేం ఎదుర్కొంటూంటాడు, ఆ క్రమంలో ఏమేం తెలుసుకుంటూంటాడు ఇత్యాదివన్నీ ఒక సిలబస్ లా వుంటాయి. ఈ మొత్తం విభాగంలో ప్రత్యర్ధితో సంఘర్షిస్తూనే ఇవన్నీ చేస్తూంటాడు.

          కానీ ఇక్కడ హీరోకి విలన్లని ఎదుర్కోవడమే పనిగా పెట్టారు. హీరో సమస్యకి మూలమైన, అతను ఒక మనిషిగా మారడానికి కారణమైన హీరోయిన్ సంగతే  వదిలేశారు. ఈ కథలో హీరోకి ప్రేమతో కూడా ముడిపడివున్న హీరోయినే ప్రత్యర్ధి తప్ప, విలన్లు కాదని ఇదివరకే చెప్పుకున్నాం. మరి ఆ హీరోయిన్ పెట్టిన పజిల్ ని హీరో ఎలా సాధించాడు? గ్రామాన్ని దత్తత తీసుకుని డెవలప్ చేయడం తోనేనా? యితే అది ఒక్క పాటతోనే పూర్తయిపోయింది. అక్కడితో కథ ఎండ్.

          ఇంకా హీరో ఆ వూళ్ళో ఏం చేస్తున్నాడు? సమస్య ఎక్కడ వచ్చిందంటే,  హీరో తన సమస్యకి ఫలానా ఇది సాధించి పరిష్కరించాలని భావించక పోవడంవల్లే. అతడికి గోల్ లేకపోవడం వల్లే. గుండు గుత్తగా గ్రామాన్ని డెవలప్ చేయడం గోల్ కానే కాదు. అదే గోల్ అయితే అదెప్పుడో ముగిసిపోయింది. పైగా గోల్ గా గుండుగుత్త వ్యవహారం ఎత్తుకోవడం సమంజసమైన కథల్లో జరగదు.

           ‘స్వదేశ్’  లో షారుఖ్ ఖాన్ పాత్రకి అక్కడి ప్రజలకో  హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలన్న గోల్ వుంటుంది. కన్నడ సినిమా ‘చిగురిడ కణసు’ లో  శివరాజ్ కుమార్ పాత్ర కి కూడా హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టే గోల్ గా వుంటుంది.

          ప్రస్తుత సినిమాలో ఇలాటి ప్రత్యేకమైన గోల్ కాకుండా గుండుగుత్త డెవలప్ మెంట్ పెట్టి అది ముగించేశారు. ఆ డెవలప్ మెంట్ ఉన్నప్పటికీ, ఊరిని పీడిస్తున్న ఒక జటిల సమస్యని ఆ డెవలప్ మెంట్ నుంచి వేరు చేసి చూసి- దాన్ని ప్రత్యేక గోల్ గా పెట్టుకుని వుంటే- అటువంటి  ప్రాజెక్టుకోసం హీరో కృషి చేస్తోంటే,  అప్పుడు ఈ మిడిల్ విభాగం దారిలో పడేది.

          హీరోయిన్ స్ఫూర్తితోనే రూరల్ డెవలప్ కోర్సు చేసిన హీరో ఈ గ్రామానికి (సూపర్ స్టార్ ఇమేజికి వన్నె తెచ్చే)- అనితర సాధ్యమైన ఇన్నోవేటివ్ ప్రాజెక్టేదో అందించే ప్రయత్నం చేస్తే- (అది నేటి ప్రభుత్వాలకి స్ఫూర్తిదాయకంగా వుంటే ఇంకా మంచిది) అప్పుడది మనసులోనే హీరోయిన్ కి తను ఇచ్చుకునే  నివాళిగా ఉండొచ్చు ( తనని మనిషిగా మార్చిన ఆమెకి తనేం ఇచ్చాడు గనుక).  అప్పుడా గోల్ కి ఇలా ఎమోషన్ కూడా తోడవుతుంది. ఇలాటి సజీవ గోల్ తో రెండో మూలస్థంభం ఏర్పడితే కథకి ఒక రూపు వస్తుంది. మొదటి మూలస్థంభం దగ్గర హీరో సమకట్టిన ప్రయాణానికి, ఈ పరిష్కారమార్గంతో సార్ధకత చేకూరుతుంది. రెండు మూలస్తంభాలూ బ్యాలెన్స్ అవుతాయి.

          ఇప్పుడు ఈ గోల్ ని చెడగొట్టేందుకు ఎలాగూ విలన్లూ వున్నారు. వాళ్ళతో పోరాటమూ వుంటుంది. అలా అలా సుఖాంత తీరాలకి చేరుకుంటుంది కథ...

          సినిమాలో ఈ గోల్ లేకపోబట్టే రెండో మూలస్థంభం  లేకుండా పోయింది. విలన్ల లిక్కర్ వ్యాపారాన్ని హీరో అడ్డుకుంటే, వాళ్ళు జరిపే దాడి తో మొదలవుతుంది క్లయిమాక్స్. విలన్ల సమస్యతో పరస్పర దాడులూ ప్రతిదాడుల ఎపిసోడ్లతో కథనుంచి వేర్పడి ముగింపుకి సాగిపోతుంది కథ. ఈ ముగింపు కూడా సాగతీత ముగింపే. మొదటి మూలస్థంభం బలంగా లేకపోవడం వల్ల, రెండో మూలస్థంభం అసలే లేకపోవడం వల్లా ఈ పరిస్థితి.

***

          సినిమా సాంతం పూర్తి సీరియస్ మూడ్ లో నడిపించారు. సెకండాఫ్ లో మరీ ఎక్కువ. పాత్రలన్నీ ఆర్ట్ సినిమాలోలా విషాదాలు  పులుముకుని వుంటాయి. రిలీఫ్ కోసం కాస్తయినా ఎంటర్ టెయిన్ చేయవు.  మహేష్ బాబు అంత సీరియాస్ గా, అంతర్ముఖీనుడు గా  ఎందుకుండాలో అర్ధం గాదు. ఈ సినిమా ఇలా ఉండనవసరం లేదు. ఎంటర్ టెయిన్ మెంట్ అనే షుగర్ కోటింగ్ తో సీరియస్ విషయాన్ని కూడా సులభంగా చెప్పవచ్చు. శోక రసంతో కూడిన  'ముత్యాల ముగ్గు'  కథని అద్భుత రసంతో ఫన్నీగా చూపించలేదా? స్వదేశ్’  ఇదే సాధించింది. చాలా ఫన్నీ. ఫన్ లోనే బాధ. పైగా అది సమకాలీన గ్రామీణ జీవితాన్ని చిత్రించింది.

          ప్రస్తుత సినిమా అలాకాదు- కాలీన స్పృహ కి చాలా దూరం లో వుంది. పాత సినిమాల్లో చూసేసిన గ్రామాల పరిస్థితీ, అక్కడ ప్రెసిడెంట్లో లేక మునసబులో చేసే అరాచకాల పర్వం లాంటిదే కన్పిస్తుండిక్కడ. పాత సినిమాల్లోంచి దిగుమతి చేసుకున్న ఫార్ములా గ్రామ కథే ఇది. ‘స్వదేశ్’, ‘చిగురిద కణసు’  లు మన కళ్ళముందున్న సమకాలీన జీవితాలకి రాజీపడని వాస్తవిక చిత్రణలు. సినిమాల్లోంచి సినిమాని దింపడమే టాలీవుడ్ విద్యగా కొనసాగినంతకాలం, చలన శీలమైన మన జీవితాల్ని ఎప్పటికప్పుడు మన సినిమాల్లో చూసుకోలేం!        

సికిందర్