రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Wednesday, December 17, 2014

స్క్రీన్ ప్లే సంగతులు!


 స్ట్రక్చర్ ఎందుకు అవసరం?


 ఎందుకంటే..
* మన బామ్మలు కూడా మనకి కథ చెప్పే విధం  ఒక స్ట్రక్చర్ లోనే వుంటుండేది గనుక 

  * శతాబ్దాలుగా స్ట్రక్చర్ అనేది ప్రపంచంలో ఏ దేశంలోనై నా ఒకే పోలికతో  వుంటుంది గనుక  
    * ఆదిమ కాలం నుంచీ కథలు చెప్పుకోవడం స్ట్రక్చర్ ప్రకారమే జరిగింది గనుక
       * కథా నాయకుడు కథలో ఎప్పుడు ప్రవేశించాలి, కథ ఎప్పుడు మలుపు తిరగాలి, ఎక్కడ ముగింపు  నివ్వాలి అన్నవి, మౌఖికంగా కథలు చెప్పుకునే లిపిలేని కాలం నుంచీ సెట్ అయి వుంది గనుక
    * శాస్త్రజ్ఞుల ప్రకారం మనిషి మెదడు  కథ చెప్పే తీరుకి, దాన్ని రిసీవ్ చేసుకునే పద్దతికీ మార్పు లేకుండా అనువంశికంగా ట్యూన్ అయి వుంది గనుక!

స్ట్రక్చర్ అంటే..
* అనువంశికంగా సబ్ కాన్షస్ మైండ్ లో రూపుదిద్దుకున్న శాశ్వత నిర్మాణం
* క్రియేటివిటీ అంటే..
* ఆ నిర్మాణం మీద కాన్షస్ మైండ్ కి నచ్చేట్టు సొంతంగా కథనానికి చెక్కుకునే శిల్పం
* స్ట్రక్చర్  సార్వజనీనం, క్రియేటివిటీ వ్యక్తిగత అభిరుచి
* కథా నిర్మాణం (స్ట్రక్చర్)  ఎక్కడైనా ఒకేలా వుంటుంది, ఆ కథ చెప్పే తీరు ( క్రియేటివిటీ) కథకుడు కథకుడికీ మారుతుంది
* అందుకే స్ట్రక్చర్ కి రూల్స్ ఏర్పడ్డాయి, క్రియేటివిటీకి సాధ్యం కాదు
* ఈ తేడా తెలీక  స్క్రీన్ ప్లే కి రూల్స్ ఏమిటోయ్ అని అడ్డం తిరుగుతుంటారు
* వాళ్ళ ఉద్దేశంలో క్రియేటివిటీ కి రూల్స్ ఏమిటని!
* అవును- నిజంగానే క్రియేటివిటీకి రూల్స్ లేవు
* అందుకే నా కథ నా ఇష్టం అన్నట్టుగా రాసుకుంటారు
* ప్రకృతి ప్రకారం ప్రేక్షకుల మైండ్ రిసీవ్ చేసుకునేది స్ట్రక్చర్ పరంగానే తప్ప, క్రియేటివిటీ పరంగా కాదని తెలుసుకోక-
* స్ట్రక్చర్ కీ, క్రియేటివిటీ కీ తేడా తెలీక...
* స్ట్రక్చర్ ని విస్మరించి క్రియేటివ్ గానే స్క్రిప్టు రాసుకోవడం వల్ల-
* పునాదుల్లేని భవనానికి నగిషీలు చెక్కుకున్నట్టు వుంటోంది
* స్ట్రక్చర్ లేక ఎంత క్రియేటివిటీని  రంగరించినా..
* సినిమా కథల్ని ప్రేక్షకుల మెదళ్ళు రిసీవ్ చేసుకునే పద్ధతిలో రిసీవ్ చేసుకో లేకపోతున్నాయి.
* అప్పుడవి అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి
ఇందుకే స్ట్రక్చర్ అవసరం!
* స్ట్రక్చర్ అనే వాస్తవాన్ని గుర్తించడం అవసరం
* సినిమా ఆఫీసుకి వాస్తు ఎలాగో, కథకి స్ట్రక్చర్ అలా
* ఆఫీసుకి వాస్తు చూసుకుని, ఆ ఆఫీసు పెట్టడానికి మూలకారణమైన కథకి వాస్తు (స్ట్రక్చర్) ఉందా లేదా ఆలోచించక పోవడం అవివేకం
ఇంతకీ స్ట్రక్చర్ ఎలా వుంటుంది?
*ఇది నేర్చుకుందాం
* స్ట్రక్చర్  అనే త్రీ యాక్ట్స్ విభాగాల్లో అసలేమేం జరుగుతాయో వివరంగా తెలుసుకుందాం
* ఇందుకు సింపుల్ గా ‘శివ’ అనే సినిమాని తీసుకుని చెప్పుకుందాం 

రేపటి నుంచి..
*


Tuesday, December 16, 2014

ఐటెం ట్రెండ్

ఐటెం సాంగ్స్ తో వన్స్ మోర్ చరిత్ర!
     ఎంటర్ టైన్ మెంట్ అంటే హాట్ హాట్ కంటెంట్ గా అర్ధం మారిపోయాక టాప్ హీరోయిన్లు తమ వంతూ ఆ కాష్టంలోకి ఆజ్యంపోస్తూ, వాంప్స్ మాదిరిగా ఐటెం సాంగ్స్ తో రసిక ప్రేక్షకుల్ని రంజింప జేస్తున్నారు. బికినీ వేసినప్పుడు లేని బింకం ఐటెమప్పుడు ఎందుకట అనీ తలావొక కెవ్వు పాటెత్తుకుని ఆడిపాడేస్తున్నారు. `60 లలోనే  హిందీ హీరోయిన్ బికినీ వేసినప్పుడు తెలుగు హీరోయిన్ నిండు చీరలోనే ఉండిపోయింది. ఆ చీర తగ్గుతూ తగ్గుతూ పొట్టి నిక్కరు దాకా  వచ్చింది. అదికూడా చాలక బికినీ తో వొళ్ళు కప్పుకోవడం ప్రారంభించింది. ఇప్పుడు బికినీల్లోనే  చాలా కాన్ఫిడెంట్ గా ఫీలవుతోంది. ఇక ఐటెం సాంగ్స్  తో మేజువాణీ కూడా మొదలెట్టేసి, నేటి సినిమా హీరోయిన్ తలచుకుంటే ఏ శిఖరాలకి చేరుకోగలదో నిరూపిస్తోంది.
          నిర్మాతలకి కమర్షియల్ హిట్ కావాలి, టాప్ హీరోయిన్లకి తక్షణ రొక్కం  కావాలి. ఈ రెండే ఐటమ్స్ సాంగ్స్ పుట్టుకకి కారణం. టాప్ హీరో పక్కన క్రేజీ హీరోయిన్ తో ఓ ఐటెం సాంగ్ పెడితే వాణిజ్య విలువలు బాగా పెరుగుతాయనే ఆశ నిర్మాతలకి, రెండ్రోజుల్లో ఇరవై నుంచీ 75 లక్షలవరకూ ఒక్క ఐటెం సాంగ్ తోనే గడించ వచ్చన్న ఆశయం హీరోయిన్లకీ ఏర్పడి ఐటెం సాంగ్స్ పుడుతున్నాయి. ఇక ఈ సాంగ్స్ కి అట్టహాసంగా కోటి- కోటిన్నర ఖర్చుపెట్టి వేసే భారీ సెట్టింగులతో కళాదర్శకులకీ, వాళ్ళ  పరివారానికీ పుష్కలంగా ఆర్జనకూడా! కాస్ట్యూమర్లని కూడా మర్చిపోవద్దు!
         
మగధీర   తో ప్రారంభమైన సోషియో ఫాంటసీ సినిమాల ఒరవడిలో అకస్మాత్తుగా భారీ సెట్టింగులు వేసే ట్రెండ్ ఒకటి ప్రారభమై, హైదరాబాద్ చుట్టూ రియల్ ఎస్టేట్ కట్టడాలతో పోటీ పడుతూ ఆ  సినిమా సెట్స్ కూడా వెలిశాయి. ఆ సినిమాలు అంతరించి పోయాయి. కానీ అలాటి సెట్స్ వేసే ట్రెండ్ ఇప్పుడు ఐటెం సాంగ్స్ తో మళ్ళీ మొదలైంది. కాకపోతే అవుట్ డోర్ లో కాదు. ఇలా ఒక పెద్ద స్టార్ సినిమాలో ఐటెం సాంగ్ కే హీరోయిన్ పారితోషికాలూ సెట్ నిర్మాణాలతో కలుపుకుని  రెండు కోట్లకి పైనే   ఖర్చు పెడుతున్నారు. తాజాగా కరెంట్ తీగలో సన్నీ లియోన్ ఐటెం పాటకి వేసిన సెట్ ఖర్చే కోటిన్నర రూపాయలు. ( ఛార్మీ వంటి చిన్న తార తో ఓ తమిళ సినిమాకి తీసిన ఐటెం పాటకి కోటి రూపాయల సెట్ వేశారు!
  దేశం లో ఐటెం పాటకి కళ్ళు తిరిగే మొత్తం అక్షరాలా ఆరుకోట్ల రూపాయలు హిందీలో వచ్చిన బాస్కోసం ఖర్చు పెట్టారు. అక్షయ్ కుమార్ సోనాక్షి సిన్హా లు నటించిన ఈ సినిమాలో పార్టీ ఆల్ నైట్ అనే ఐటెం పాటలో అక్షయ్ , సోనాక్షి, ప్రభుదేవా, యోయో హనీసింగ్ ఇంకా ఆరువందల మంది విదేశీ మోడళ్ళు కన్పిస్తారు!)     ఐతే ఇటీవల మహేష్ బాబు, ఎన్టీఆర్ వంటి పెద్ద స్టార్ల సినిమాలు అట్టర్ ఫ్లాప్ అవడంతో ఐటమ్స్ సాంగ్స్ సంగతి దేవుడెరుగు- బడ్జెట్ లో భారీగా కోత పెట్టుకుని కొత్త సినిమాల నిర్మాణాలకి పూనుకుంటున్నారు. 

        ఎన్టీఆర్ ఆదేశాలతో పూరీ జగనాథ్ దర్శకత్వం వహిస్తున్న టెంపర్సినిమాకి ఇదే అమలవుతోంది. స్టార్లు, స్టార్ దర్శకులు చెరో పదీ పన్నెండేసి కోట్లు పారితోషికాలు తీసుకుంటూ తమకు  అట్టర్ ఫ్లాప్ సినిమాలు అంటగడుతున్నారని ఇటీవల బయ్యర్లు తిరుగుబాటు చేయడంతో, మొదటగా కళ్ళు తెర్చింది ఎన్టీఆరే. ఇది తనకి రభస నేర్పిన పాఠం. మహేష్ బాబు కూడా ఈ సంవత్సరం నేనొక్కడినేతర్వాత ఆగడుకూడా అట్టర్ ఫ్లాప్ అవడంతో ఆగడునిర్మాతలకి ఆరు కోట్లు వెనక్కి ఇచ్చేసినా- ఆయన భవిష్యత్ ప్రణాళికేమిటో  తెలీదు. ఎన్టీఆర్ మాత్రం పూరీ దర్శకత్వంలో నటిస్తున్న టెంపర్కి పారితోషికం తీసుకోకుండా నైజాం హక్కులు పొందితే,  పూరీ కూడా అదే దారిలో సీడెడ్ హక్కులు రాయించుకున్నారు. ఇది సరయిన పద్దతి! తమ పనితనం చూసి ఆయా ఏరియాల్లో ప్రేక్షకులిచ్చేదే సరైన ప్రతిఫలం!
          ఇంతేగాక టెంపర్ నిర్మాణ వ్యయం  కూడా బాగా తగ్గేట్టు ప్లాన్ చేశారు. దీంతో సీన్స్ కీ, పాటలకీ విదేశాలకి వెళ్ళడంలేదు. ఐటెం సాంగ్ తప్పడం లేదు, కాకపోతే ముందు అనుకున్న శృతీ హాసన్ ని కాదని, కెనడా మోడల్ నోరా ఫతేహీ ని తీసుకున్నారు. జంక్షన్ లో..అంటూ మహేష్ బాబుతో శృతీ హాసన్ ఆగడులో నాలుగు నిమిషాలు కనపడే ఐటెం సాంగ్ కి అక్షరాలా యాభై లక్షల రూపాయలు సొంతం చేసుకుంది! నా పేరు సిల్కు..అంటూ  అల్లుడు శీనులో మరో ఐటెం సాంగ్ లో బెల్లంకొండ శ్రీనివాస్ తో స్టేప్పే సిన టాప్ హీరోయిన్ తమన్నా కయితే 75లక్షలు ముట్టాయి!

         ఐటెం సాంగ్స్ వ్యయం తగ్గించడానికి పూరీ అనుసరిస్తున్న ఫార్ములా ఫారిన్ మోడళ్ళని ప్రవేశపెట్టడం. మన టాప్ హీరోయిన్లు, లేకపోతే  బాలీవుడ్ హీరోయిన్లు గా సాగుతున్న ఐటెం సాంగ్ ల ట్రెండ్ అంతర్జాతీయ మోడళ్ళతో ఇంకో మలుపు తిరిగింది. బ్రెజిల్ కి చెందిన మోడల్ గాబ్రిలా బెర్టెంట్ ని దేవుడు చేసిన మనుషులులో ఐటెం సాంగ్ కోసం తీసుకొచ్చిన పూరీ, మళ్ళీ ఇప్పుడు టెంపర్ కోసం నోరా ఫతేహీ ని పట్టుకొచ్చారు. మధ్యలో దిల్ రాజు ఎవడులో రాం చరణ్ తో ఐటెం సాంగ్ కోసం స్కార్లెట్ విల్సన్ ని దిగుమతి చేశారు.
          మన దేశపు సినిమాలకి మాత్రమే పరిమితమైన ఈ ఐటెం సాంగ్స్ అనే మసాలా దినుసుని   
ది అఫీషియల్ డిక్షనరీ ఆఫ్ అన్ అఫీషియల్ ఇంగ్లిష్ఇలా నిర్వచిస్తోంది...కథతో సంబంధంలేకుండా, అందమైన డాన్సర్లతో ఆడిపాడించి, కమర్షియల్ గా ఆకర్షించేందుకు వినియోగించే ఒక హంగు అని...సెన్సార్ బోర్డు కూడా జోక్యం చేసుకుని, ఐటెం సాంగ్ వుండే సినిమాలకి సర్టిఫికేట్ ఇవ్వాలని నిర్ణయించింది. ఇది వేడి వేడి చర్చకు దారితీసింది. అలా అనుకుంటే ఇక  యూసర్టిఫికేట్ సినామాలే వుండవు. పాతరోజుల్లో ప్రతి భాషలోనూ కుటుంబ కథా చిత్రాల్లో, మన సినిమాల్లో విజయలలిత,  జ్యోతిలక్ష్మి పాటల్లాగా - ఏదోవొక వాంప్ సాంగ్  వుండేది. వాటికి  సర్టిఫికేట్ ఇచ్చిన దాఖలా లేదు. ఇంతే కాదు,  ఇప్పుడు ఐటెం సాంగ్స్ ని ఛానెళ్ళలో కూడా ప్రదర్శించ కూడదని సెన్సార్ బోర్డు ఉత్తర్వులు వెలువడ్డాయి.  అసలు ఐటెం సాంగ్ నిర్వచనాన్నే సెన్సార్ బోర్డు ఇంతవరకూ స్పష్టంగా ఇవ్వలేదు. అలాంటప్పుడు ఏది నాటీ సాంగ్ అవుతుంది, ఏది ఐటెం సాంగ్ అవుతుందో ఎలా చెప్పగలదని ప్రశ్నిస్తున్న వారూ వున్నారు. ఈ గొడవలు మనకెందుకు, ఐటెం సాంగ్ లేకపోతే  సినిమా ఏమైనా ఫ్లాప్ అవుతుందా అని ఆలోచిస్తున్న నిర్మాతలూ  వున్నారు.  

          ఒకప్పటి వాంప్ పాత్ర నేటి ఐటెం గర్ల్ అయ్యింది. ఇంత వరకూ ఫర్వాలేదు. ఐతే ఒక టాప్ హీరోయిన్ వున్న సినిమాలో ఇంకో టాప్ హీరోయిన్ అతిధి పాత్ర వేయడానికే
నోచెప్పేస్తున్న  దృష్టాంతాలు చూస్తున్న రోజుల్లో, ఏమాత్రం సంకోచించకుండా  ఐటెం గర్ల్ రూపంలో దిగుమతి అవడానికి ఎస్చెప్పేస్తోంది. తను వచ్చేసి ఐటెం గర్ల్ రూపంలో వాంప్ ఆర్టిస్టు వృత్తిని లాక్కోవడం అలా వుంచుదాం, అసలు ఆ పాత్రకి తను దిగజారుతున్నానని కూడా భావించడం లేదు.  ప్రత్యేకంగా జ్యోతి లక్ష్మిలు, డిస్కో శాంతిలు, అభినయశ్రీలు ఇప్పుడు అక్కర్లేదు- తమన్నా,శృతీ హసన్, శ్రియ, ఛార్మీలు వచ్చేసి ఆపని కానిచ్చేస్తున్నారు. ఎంతటి టాప్ హీరోయిన్ అయినా ఆ స్థానంలో ఎన్నాళ్ళు వుంటుందో గ్యారంటీ లేదు. దీపముండగానే ఇల్లు చక్క బెట్టుకోవాలనే తాపత్రయం లోంచే ఇలాటి బుద్ధులు పుడుతున్నాయని, ఇప్పుడు సినిమాలు తీయకుండా ఈ తమాషా చూస్తున్న ఓ సీనియర్ నిర్మాత అన్నారు. ఐటెం సాంగ్స్ కి పెడుతున్న డబ్బులతో ఒక చిన్న బడ్జెట్ సినిమా తీయొచ్చని ఆయన అభిప్రాయం. సరీగ్గా  ఈయన అభిప్రాయాన్నే పైన మనం చెప్పుకున్న హిందీ సినిమా ఐటెం సాంగ్ విషయంలో ఇంకాస్త ఘాటుగా వెలిబుచ్చాయి బాలీవుడ్ వర్గాలు. ఐటెం పాట పేరుతో ఆరుకోట్ల రూపాయలు తగిలెయ్యడాన్ని తీవ్రంగా నిరసించారు. చిన్న నిర్మాతలు, కొత్త కొత్త  దర్శకులు ఎందరో పెట్టుబడులకి మొహం వాచి  వుంటే, ఒక ఐటెం పాటకి ఆరుకోట్లు తగిలెయ్యడం బాధ్యతారాహిత్యమని తీవ్రంగా విమర్శించారు. 

          కొందరు హీరోయిన్లు ఐటెం పాటలు ఒప్పుకోవడానికి వాళ్ళ పరిస్థితి కారణమౌతోంది- హీరోయిన్ గా అవకాశాలు సన్నగిల్లడం! దీన్ని అర్ధం జేసుకోవచ్చు. నమిత
, ఆశాసైనీ, ఫర్జానా, సమీరా రెడ్డి, పార్వతీ మెల్టన్, కిమ్ శర్మ, కౌశ, రీమా సేన్, హంసా నందిని, మాళవిక, రంభ, స్వాతీ వర్మ .....ఇలా అవకాశాలు తగ్గిన హీరోయిన్లు ఐటెం సాంగ్స్ కి ఒప్పుకుంటున్నారు. అయితే ఎదుగుతున్న నటి అంజలి కూడా సూర్య నటించిన యముడులో ఐటెం సాంగ్ కి ఒప్పుకోవడాన్ని ఎలా అర్ధం జేసుకోవాలో అంతుబట్టదు. ఇక ఛార్మి విషయం చెప్పక్కర్లేదు. ప్రియమణి అయితే షారుఖ్ ఖాన్ నటించిన హిందీ చెన్నై ఎక్స్ ప్రెస్లో వన్ టూ త్రీఅనే ఐటెం పాటేసుకుంది. శ్రియ కూడా వెళ్లి సంజయ్ దత్ నటించిన జిల్లా ఘజియా బాద్లో మై ఛమియా నంబర్ వన్ హూ, మై ఛమియా ఐటెం బాంబ్ హూ..అని నేరుగా ఐటెం బాంబునని డిక్లేర్ చేసుకుంది!

     వీళ్ళందరి సుడిగాలిలో కేవలం ఐటెం గర్ల్ గానే వచ్చి కొన్నాళ్ళు ఊపిన ముమైత్ ఖాన్ అమాంతం తెరమరు గయ్యింది. అభినయశ్రీ గురించి చెప్పక్కర్లేదు. ఇలాటి వృత్తి ఐటెం డాన్సర్లు సినిమాల్లో ఇంకో పాత్ర కూడా పోషించే వాళ్ళు. విలన్ పక్కన ఉంపుడు గత్తెలుగా వుండడం. ఇది అనాదిగా వస్తున్నదే. విజయలలిత, జ్యోతి లక్ష్మి, రాజసులోచన, జయమాలిని, హలం, సుభాషిని, అనూరాధ, జయశ్రీ, పాకీజా, రమ్యశ్రీ, కుయిలి, ఆల్ఫోన్సా, షకీలా, డిస్కో శాంతి, సిల్క్ స్మిత..వీళ్ళంతా ఒకప్పుడు ఈ శాఖని ఏలుకున్నారు. కాకపోతే వీళ్ళని వాంప్స్ అనేవాళ్ళు. వీళ్ళ పాటల్ని క్లబ్ సాంగ్స్ అనేవాళ్ళు, ఆ క్లబ్ సాంగ్స్ లో కేబరే డాన్సర్స్ అన్పించుకునే వాళ్ళు. లేదా ద్వందార్ధాలు బాగా దట్టించి –‘సూదిలో దారం సందులో బేరంలాంటి ఫోక్ సాంగ్స్ వేసుకునే వాళ్ళు. ఇలాటి వాటికి తిరుగులేని ఐటెం సింగర్గా ఎస్టాబ్లిష్ అయింది ది గ్రేట్ ఎల్లారీశ్వరియే! ఇప్పుడు అలాటి ఐటెం సింగర్స్ ఎవరో చెప్పగలమా?

          ఐతే హిందీలో టాప్ హీరోయిన్ వైజయంతీ మాలా, షకీలా లాంటి ప్రముఖ హీరోయిన్లు కూడా ఐటెం గర్ల్గా అనేక సార్లు కన్పించినవారే. దీనికి సాహసించడానికి  మన హీరోయిన్లకి ముక్కుతూ మూల్గుతూ ఐదు దశాబ్దాలకి పైగా పట్టింది. 1954 లోనే  మొట్ట మొదటిసారిగా దేశీయ సినిమాల్లో ఐటెం గర్ల్గా వెలసిన తార షకీలా. ఈమె గురుదత్, షమ్మీ కపూర్ ల వంటి  అగ్ర హీరోల  సరసన హీరోయిన్ గా నటించిన గ్లామర్ తార. అలాంటిది  ఆర్ పార్లో బాబూజీ ధీరే చల్నా-ప్యార్ మే జరా సంభల్నా’ ( చూసి అడుగెయ్యి బాబూ, ప్రేమలో జాగ్రత్త) 

           ఇక 1957 లో ఆశాఅనే సినిమాలో ఈనా  మీనా డీకాఅని నేటికీ మోగే ఐటెం సాంగ్తో మళ్ళీ టాప్ హీరోయిన్ వైజయంతీ మాలా దుమ్మురేపింది. తిరిగి  మధుమతిలో చడ్ గయో పాపీ బిచువా  (పాపిష్టి తేలు ఎక్కేసింది),  ఇంకా మళ్ళీ సాధన  లో కహోజీ తుం క్యా క్యా ఖరీదోగే’ (చెప్పవయ్యా ఏమేం కొంటావ్) లాంటి డబుల్ మీనింగులతో హృదయాల్ని మీటింది’. ఇలా పది  పన్నెండు వరకూ ఇవ్వాళ మనం చెప్పుకునే ఐటెం సాంగ్స్ తో  చెలరేగింది- అంత పాపులర్ హీరోయిన్ గా ఉంటూ కూడా!

షకీలా
        1965 లో అంతస్తులులో రేలంగి, రమణా రెడ్డి కమేడియన్లని వెంటేసుకుని వీధిలో చుట్టూ జనం మధ్య భానుమతి పాడే దులపరో బుల్లోడో దుమ్ము దులపరో బుల్లోడోపాట అందులో సాంతం ఈవ్ టీజర్లమీద ఎంత విసుర్లు ఉన్నప్పటికీ, ఐటెం సాంగ్ కాక మరేమిటి? ఇక హిందీలో మాధురీ దీక్షిత్ అయితే తేజాబ్లో ఏక్  దో తీన్పాటతో దేశమంతా మార్మోగించింది. తిరిగి ఖల్నాయక్లో చాలా వివాదాస్పదమైన పాట- పార్లమెంట్ లోనూ గొడవకి దారితీసిన ఐటెం సాంగ్ -చోళీ కే పీఛే క్యాహైగురించి తెలిసిందే.

          కాకపోతే అప్పట్లో డిమాండ్లు లేవు. ఆశ్చర్యకరమైన పారితోషికాలు ఐటెం సాంగ్స్ లో కన్పించే హీరోయిన్లకి లేవు. అలాగే ఎక్స్ పోజ్ చేసే కాస్ట్యూమ్స్ కూడా వాళ్ళు ధరించలేదు. మూలాన్ని తీసుకుని దాని షోకుల్ని మార్చేస్తే అది ఇప్పటి ఐటెం సాంగ్ అయింది - తను ఇప్పటి ఐటెం గర్ల్ అయింది, అంతే.  మూలాలున్నంత కాలం అవి  పునరావృతమవుతూనే 
వైజయంతీ మాలా 

వుంటాయి వివిధ రూపాల్లో. 1930 లలోనే వున్న రాజనర్తకే తర్వాత
కాలంలో క్లబ్ డాన్సర్ అయినట్టు, `50 లలో కవ్వించే స్పెషల్ సాంగ్స్ నటించిన హీరోయినే నేటి ఐటెం గర్ల్ అయ్యింది. దీనిపట్ల ఎవరికీ  అభ్యంతరం ఉండనవసరం లేదు. కమర్షియల్ సినిమాకి ఏ హద్దులూ వుండవు. నిజజీవితంలో అసాధ్యమైన వాటిని చూపించి రంజింప జేయడమే వాటి విధి. నేటి సినిమాల్లో ఒక అర్ధవంతమైన పాత్రంటూ లేక, నామమాత్రంగా మిగిలిన హీరోయిన్- ఎంత టాప్ హీరోయిన్ అయినా, నటిగా నిరూపించుకోవడానికి ఇంకేమీ లేక,  చేయకూడని విన్యాసాలు చేస్తూ ఇలాగే  దారితప్పి తిరుగుతుంటుంది..ఎవరేమంటారు?

సికిందర్ 
(డిసెంబర్ 2014 ‘ఈవారం’)
         
         
         

         Monday, December 15, 2014

కెమెరా!

అదొక యజ్ఞమే!
ఛాయాగ్రాహకుడు సి. రాం ప్రసాద్
రోసారి కెమెరామాన్ అదృశ్య దృశ్యాల దార్శనికు డవుతున్నాడు. పౌరాణిక, జానపద సినిమాల్ని ఇప్పటి  ప్రేక్షకులు మిస్సవ్వచ్చు గాక, ఆ కాలంలో అవి ప్రవేశపెట్టిన ‘ట్రిక్ ఫోటోగ్రఫీ’ అనే మాయాజాలం నుంచి మాత్రం ఇప్పటి కెమెరామాన్ తప్పించుకోలేక పోతున్నాడు. ఏదైతే మనలో అంతర్భాగంగా ఉంటుందో, అది వెన్నాడుతూంటుంది. దృశ్య రూపాలు మారినంత మాత్రాన శాస్త్రం అంతరించిపోయిందని కాదు. శాస్త్రం శాశ్వతం. దానాధారం జేసుకుని ఒకప్పుడు ట్రిక్ ఫోటోగ్రఫీ వుండొచ్చు, ఇంకోప్పుడు రూపం మార్చుకుని సీజీ గ్రాఫిక్స్ ఉండొచ్చు!
    రాత్రి వేళ రైలు ప్రయాణిస్తూ వుంటుంది. పైన చంద్రుడు ప్రకాశిస్తూ ఉంటాడు. ఆ చంద్రుడికి మబ్బులు అడ్దొస్తూ వుంటాయి. వాటి నీడ కింద పడుతూంటుంది. రైలు కదులుతూంటే, ఆ నీడ తన వాలు చూసుకుంటూ, మబ్బు తొలగ్గానే తనూ తప్పుకుంటూ ఉంటుంది..ఈ వెన్నెల దోబూచులాటలో నాయకా నాయికలు రైలు చివర ‘ఎల్’ షేపు ట్రాలీ మీద యుగళ గీత మొకటి పాడుకుంటూ మైమరచి పోతూంటారు. ఇదంతా చూస్తూ మనమూ మనసు పారేసుకోకుండా ఉండం.
   నిజంగా జరిగిందేమిటంటే, అక్కడ అంత పొడవు రాయలసీమ వెళ్ళే రైలే లేదు. చుట్టూ ఎలాటి పరిసరాలూ లేవు. పైన చంద్రుడూ వెన్నెలా మబ్బులసలే లేవు. ఓ ట్రాలీ, దానిమీద హీరో హీరోయిన్లు, మబ్బు తాలూకు ఓ నీడా - ఇవే మాత్రమే వున్నాయి!
    ఇవి- ఈ మూడూ మాత్రమే నిజం, మిగతావన్నీ అబద్ధం! ఈ అబద్దాల్ని గ్రాఫిక్స్ ఆర్టిస్టు నిజాలుగా భ్రమింపజేసి దృశ్యాన్ని రక్తి కట్టించాడన్న మాట!
   ఓస్ ఇంతేనా, ఆ మూడూ తప్ప మిగతాదంతా గ్రాఫిక్సేనా! మరైతే కెమెరామాన్ చేసిందేమిటి, ఇక అతడికి సినిమాలతో పనేమిటి- అన్న సందేశాలూ రావచ్చు. అతణ్ణి ఆత్మరక్షణ లోనూ పడెయ్య వచ్చు. అయితే దీనికి తిరుగులేని సమాధానముంది సుప్రసిద్ధ సినిమాటోగ్రాఫర్ సి. రాం ప్రసాద్ దగ్గర. అనేక సూపర్ హిట్ చిత్రాల అగ్రస్థాయి ఛాయాగ్రాహకుడైన ఈయన, పైన వివరించిన సందర్భంలో, రామోజీ ఫిలిం సిటీలో సెట్లో ఓ యజ్ఞమే చేసి కృత్రిమ నీడని అంత సహజంగా సృష్టించారు.  తన లైటింగ్ పరిజ్ఞానంతో అలాటి కృత్రిమ నీడని సృష్టిస్తూ, ట్రాలీ మీద హీరో హీరో హీరోయిన్లైన సునీల్- సలోనీల నృత్య విన్యాసాలని కెమెరాలో పొదివి పట్టుకుంటూ, అక్కడలేని విశేషాల్ని క్యాలిక్యుటివ్ గా ఊహిస్తూ, ఉన్న నిజాలతో వాటిని సమన్వయం చేసుకుంటూ, ఎనిమిది రోజుల పాటూ శ్రమిస్తే గానీ, ‘మర్యాదరామన్న’ లో ఆ డ్యూయెట్ కి ఆతర్వాత జోడించాల్సిన అంతటి గ్రాఫిక్స్ ఇన్పుట్ రాలేదు!
    “గ్రాఫిక్స్ అనేది ఒక సపోర్టింగ్ ఆర్టు” –అన్నారాయన, “అయితే దృశ్యంలో గ్రాఫిక్స్ హైలైట్ కానప్పుడే ఆ దృశ్యానికి రాణింపు వస్తుంది. ఈ సినిమా చివర్లో  వంతెన సీను గ్రాఫిక్స్ సృష్టి అంటే నేనే నమ్మలేకపోయా. అదీ నిజమైన గ్రాఫిక్స్ అంటే. ప్రేక్షకులు తాము చూస్తున్నది నకిలీ అని ఇట్టే కనుక్కో గలుగుతున్నారు. అయినా వాళ్ళ ఎంజాయ్ మెంటుకి అదేమీ అడ్డు రావడం లేదు., బాగా ఎంజాయ్ చేస్తున్నారు..” అని వివరించారు.
    ఇప్పుడిప్పుడే రవితేజ నటిస్తున్న ‘మిరపకాయ్’ షూటింగు జర్మనీలో ముగించుకొచ్చిన రాం ప్రసాద్,  ఈ హాస్యకథా  చిత్రానికి దానికుండే  ఫీల్ తోనే చిత్రీకరణ జరిపామన్నారు. ప్రత్యేకంగా ఎలాటి హై-ఎండ్ టెక్నాలజీనీ వాడలేదన్నారు. తెలుగు సినిమాలు స్టైలిష్ గా ఎందుకు ఉండడడం లేదని అడిగితే-  బాలీవుడ్ సినిమాల టార్గెట్ ప్రేక్షకులు వేరన్నారు. మన సినిమాలకి పారితోషికాలకి పోను మేకింగ్ కి మిగిలేది బొటాబొటీ అనీ, కాబట్టి ‘విత్తం కొద్దీ వైభవ’ మనీ కొటేషన్ చెప్పారు.
   మరి ఎవరైనా దర్శకులు హాలీవుడ్ షాట్స్ ని చూపించి, వాటిని కాపీ కొట్టమంటే కొట్టారా లేదా ఫ్రాంక్ గా చెప్పమంటే – కాపీకోసం కాదుగానీ, ఫీల్ కోసం రిఫరెన్స్ కోసం వాటిని చూపిస్తారనీ, తమ భావాల్ని తెలియజేసేందుకు టూల్స్ గా వాటి నుపయోగిస్తారనీ చెప్పుకొచ్చారు. 
    ‘అతనొక్కడే’ కి  నంది అవార్డు నందుకున్న రాం ప్రసాద్  1984 నుంచే రంగంలో వున్నారు. అప్పట్లో మద్రాసులో డిఎఫ్ టి చేస్తూ,  ప్రసిద్ధ కెమెరామాన్ వీఎస్సార్ స్వామికి సహాయకుడిగా చేరారు. 1993 లో పద్మాలయా వారి ఒక సినిమాకి ఛాయాగ్రాహకులయ్యారు. అప్పటినుంచీ ఇప్పటి దాకా 60 సినిమాలు పూర్తి చేశారు. 90శాతం దర్శకుల తొలి సినిమాలకి తనే  ఛాయాగ్రాహకుడు.
    లైటింగ్ కి అతివృష్టి అశోక్ మెహతా అయితే, అనావృష్టి సంతోష్ శివన్.  ఈ ఇద్దరూ రాం ప్రసాద్ అభిమాన సినిమాటోగ్రాఫర్లే. ఇంకా నాటి మార్కస్ బార్ట్లే, రెహ్మాన్, వీకే మూర్తీ లాంటి ప్రసిద్ధ ఛాయాగ్రహకులు నేడు లేకపోవడం బాధాకరమని అంటూ,  భగవంతుడు ఇప్పుడు తమలాంటి కెమెరా మెన్లకి ఇంత టెక్నాలజీతో ఎక్విప్ మెంట్ నిస్తున్నందుకు సంతోషంగా వుండన్నారాయన. 
    సరే, మరి మీ హాబీ లేమిటి? – అని ప్రశ్న వేయడమే తడవుగా లోపలి నుంచీ ఒక హెలికాప్టర్ ని ఎత్తుకొచ్చారు. దాన్ని ఎగరేయడం తన హాబీయని చెప్పారు గర్వంగా. ప్యూర్ మెటల్ తో తళ తళా మెరిసిపోతూ, గూఢచార గ్యాడ్జెట్ లా వుందది. ఖరీదు మూడు లక్షల రూపాయలట. మూడేళ్ళుగా ప్రాక్టీసు చేస్తున్నారట. ఏం ప్రాక్టీసు? ఎప్పటికైనా దీనికి మినియేచర్ కెమెరా అమర్చి ఏరియల్ షాట్స్ తీయాలని! ఏం ఐ -2, హారీ పోటర్ -7 లాంటి హాలీవుడ్ సినిమాల్లో ఇలాటి షాట్సే తీశారని వివరించారు.
   ఇంకా డీటెయిల్స్? ప్రస్తుతానికింతే! ఇంకో ఇంటర్వ్యూ వరకూ సస్పెన్స్- అంటూ దాన్ని పాపాయిలా ఆప్యాయంగా ఎత్తుకుని వెళ్ళిపోయారు. అన్నట్టు హీరో కృష్ణ మేకప్ మాన్ మాధవరావు పెద్ద కుమారుడే రాం ప్రసాద్.
సికిందర్
(నవంబర్ 2010 ‘ఆంధ్రజ్యోతి’ కోసం)

కళ!

పాత్రలకి కూడా జీవంపోసే వాతావరణ సృష్టి!
కళా దర్శకుడు ఎస్. రవిందర్ రెడ్డి 
మొత్తానికి తెలుగు సినిమా కళా దర్శకత్వానికి మహర్దశ పట్టింది. ఒక బిగ్ స్టార్ తో సినిమా అనుకోగానే తక్షణం కళా దర్శకత్వానికి పెద్ద పీట వేసేసి భారీ బడ్జెట్ల తో  మెగా సెట్స్ నిర్మించడం  పరిపాటైంది. ఏమంటే మన సినిమాలెవరికీ తీసిపోవని ఇతరులకి చూపించడమే  దీని ముఖ్యోద్దేశమని కొందరంటున్నారు. ఇది కరెక్టేనా? తెలుగు సినిమాల్ని తెలుగేతరులే చూడనప్పుడు ఇలా మీసాలు మెలెయ్యడం సబబేనా? కనీసం ఇంకో భాషలో అనువాదాలకైనా నోచుకకోని మన సినిమాల్ని చూసి ‘శభాష్ టెల్గూమాన్’ అని ఎవరనాలి?

‘మగధీర’ ఫేమ్ కళాదర్శకుడు ఎస్.రవిందర్( రవీందర్ కాదు) రెడ్డి అభిప్రాయంలో కళా దర్శకత్వానికి ఇప్పుడింత మంచి రోజులు రావడానికి స్టార్ల మధ్య పోటీయే కారణం. వాళ్లకి ఇతర భాషల మీద కూడా ఆసక్తి వుండదు. అంటే ఆ మెగా సెట్స్ ని స్థానికంగానే ప్రదర్శించుకుని సంతృ ప్తిపడుతున్నారని అనుకోవాలి. ఏమైనా ఈ పరిణామాలతో కళా దర్శకులు, వాళ్ళ టీములు, కార్మికులూ అంతా హ్యాపీ. హైదరాబాద్ పరిసరాల్లో ఇప్పుడు రియల్ ఎస్టేట్ పడిపోయి, మెగా సెట్స్ లేస్తున్నాయి జోరుగా.. ఇదే రాజధాని అభివృద్ధి: ఏకంగా ఒక వర్చువల్ ప్రపంచాన్నే సృష్టించుకోవడం!

 ‘సరయూ ది డిజైన్’  స్టూడియో అధినేత రవిందర్  ‘ఐతే’ తో మొదలై,  ‘మగధీర’ చెయ్యి పట్టుకుని ‘గోల్కొండ హైస్కూల్’ కొచ్చారు. మధ్యలో మరో 14 ప్రసిద్ధ సినిమాలున్నాయి. ముడి ఫిలిం కి డిజిటల్ ప్రత్యాన్మాయం వచ్చేసి నిర్మాణ వ్యయం తగ్గిపోతున్నట్టే, సెట్స్ పరంగా కూడా అలాటి ఖర్చు తగ్గించే ఆవిష్కరణ లేమైనా  జరుగుతున్నాయా అని అంటే, లేదన్నారు. సెట్స్ కయ్యే వ్యయం దర్శకుడు, నిర్మాతల నిర్ణయాలపై ఆధారపడుతుందన్నారు.  కొంత భాగం సెట్ వేసి, మిగతా భాగాన్ని  గ్రాఫిక్స్ తో సృష్టించుకునే విధానంలో కూడా ఖర్చేం తగ్గదనీ, పైగా ఆ రెండిటికి నిర్దుష్టమైన మ్యాచింగ్ కూడా కష్టమనీ చెప్పారు రవిందర్. ‘మగధీర’ లో కొంతవరకూ ఇలాటి మ్యాచింగ్ ని సాధించామన్నారు. 

    డీఐ విషయానికొస్తే, దీనిపట్ల అవగాహన వున్న కెమెరామాన్ కి సెట్ కి వేసిన ఒక రంగు, డీఐ తర్వాత ఫలానా ఈ విధంగా కన్పిస్తుందని ముందు జాగ్రత్తలు చెప్పడం వల్ల, డీఐ తో కళా దర్శకుడి కళ వన్నె తగ్గే ప్రసక్తి లేదన్నారు. సెట్స్ మీద లైటింగ్ ని తను దగ్గరుండి చూసుకుంటా నన్నారు. అలాగే సౌండ్ గురించి కూడా పట్టించుకుంటా నన్నారు. అదెలా అనడిగితే-

    “హీరోయిన్ పరిగెడుతున్నప్పుడు కాలికి డబ్బా తగిలి పడిపోవచ్చు, చేతికి గ్లాసు తగిలి పగలొచ్చు, బయట పావురాల గుంపు ఒక్క పెట్టున ఎగిరిపోవచ్చు...సీన్ ని నేనిలా ఊహించి,  ఆ డబ్బా, ఆ గ్లాసు, ఆ పావురాల గుంపు నీ ఏర్పాటు చేశాననుకోండి, సంగీత దర్శకుడికి ఆయా శబ్దాలు వేసి జీవం పోసే అవకాశం వుంటుంది. దృశ్యం బాగా రక్తి కడుతుంది..” అని వివరించు కొచ్చారు. 

          వేరీవెల్, పోతే పోరాట దృశ్యాలకి ఆయుధాలు మీ కళా దర్శకులే తయారు చేస్తున్నప్పుడు, అది ఫైట్ మాస్టర్ల సృష్టిగా మా బోటి వాళ్ళం అనుకుంటున్నాం కదా..అంటే, ఫైట్ మాస్టర్లు ఏదీ సృష్టించరన్నారు. వాళ్లదంతా విధ్వంసమే నని జోకేస్తూ, ఇప్పుడు తాజాగా ‘రాజన్న’ కి తయారుచేసిన వేట కత్తు ల్లోంచి ఒకదాన్ని తీసి చూడమని చేతిలో పెట్టారు. మెత్తటి మెటీరియల్ తో తయారు చేసిన ఆ కత్తితో గాయలయ్యే ప్రసక్తే లేదు. ఇదే ఫైట్ మాస్టర్ తయారు చేస్తే కసిక్కున  దిగబడుతుందేమో...
     ఇక ఫైట్ మాస్టర్ల గురించి ఇంకో విషయం చెబుతూ, హీరో పిడికిలితో కొడితే అమాంతం గోడ పడిపోయేట్టు కట్టివ్వాలంటారు ఫైట్ మాస్టర్లు. అలా కాకుండా ముందు గోడ పగుళ్లిచ్చి, కొన్ని పెచ్చు లూడుతూంటే, అది ఫియర్ సైకోసిస్ ని సృష్టించి ప్రేక్షకులకి గాభార పెడుతుందని సైన్స్ వివరించారు రవీందర్.
    స్వేచ్ఛ విషయానికొస్తే, తనవరకూ పూర్తి స్వేచ్చతో పనిచేసే అవకాశం లభిస్తోందన్నారు. సినిమాకి వెన్నెముక లాంటిది కళా దర్శకత్వమని, అది పాత్రల మనస్తత్వాల్ని,  వ్యక్తిత్వాల్ని, స్థితిగతుల్నీ వెల్లడి చేసే ఒక వాతావరణ సృష్టి అనంటూ, ఒక ఆపిల్ పండు పెట్టాలన్నా ప్రొడక్షన్ బాయ్ పరుగెత్తి మార్కెట్లో దొరికిందల్లా పట్టు కొచ్చేస్తే కుదరదున్నారు. ముందు బ్యాక్ స్టోరీ ని వర్కౌట్ చేసి ప్రాపర్టీస్ ని సూచిస్తానన్నారు. కళా దర్శకత్వం కథని డామినేట్ చేయకూడదనీ, కథ వింటున్నప్పుడే దర్శకుడి ఊహా లోకపు ఫీల్ ని పసిగడతాననీ చెప్పుకొచ్చారు. ఈ మధ్య ఇద్దరు దర్శకులు కథ చెప్పననడంతో ఆ సినిమాల్ని వదులుకున్నా నన్నారు.

       ప్రేక్షకులు సినిమా బాగా లేదనడానికి కళాదర్శకత్వం కూడా కారణ మౌతుందన్నారు. కొన్ని రకాల రంగులు, వస్తు సంచయం అన్ కాన్షష్ గా వాళ్ళని చీకాకు పెట్టి ఉండొచ్చు. కనుక వస్తువుల ఎంపికలో, వాటి అమరికల, రంగుల విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలని చెప్పారు.
    “కాలేజీ నుంచి వచ్చిన హీరోయిన్ ఇంట్లో అటో చెప్పూ ఇటో చెప్పూ విసిరేసుకుంటూ వస్తే అవి ఎక్కడెక్కడ పడాలి, బ్యాగు కూడా విసిరేస్తే అది పడేందుకు ఓ సోఫా ఉంటే, అదెక్కడ వుండాలి...వాచీ తీసేస్తే దాన్ని టేబుల్ మీద ఎక్కడ పడెయ్యాలీ...” అని తన ధోరణిలో చెప్పుకు పోతూంటే- 
    “చూస్తూంటే మీరే దర్శకత్వం వహించేసేట్టున్నారు, ఇక దర్శకులేం చెయ్యాలి?” అని  అడ్డు తగిలితే- “టాలెంట్ వుంది కదా అని డామినేట్ చెయ్యను. అన్ని శాఖల వారితో ట్యూన్ అవుతాను. కొందరికి తక్కువ టాలెంట్ ఉండొచ్చు. అలాంటప్పుడు అంతకు నన్ను తగ్గించుకుని పని చేస్తాను” –అన్నారు. 

   నెల్లూరుకి చెందిన రవిందర్ 1993 లో హైదరాబాద్ జేఎన్టీయూ లో ఫైనార్ట్స్ చేసి,  న్యూఢిల్లీ  ఐఐటీ లో మాస్టర్స్ ఇన్ డిజైన్ పూర్తి చేశారు. కొంతకాలం ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేసి, ‘అమృతం’  సీరియల్ కొచ్చారు. 2003 లో గుణ్ణం గంగరాజు తీసిన ‘ఐతే’ కి కళా దర్శకులయ్యారు. 
     “ ‘ఐతే’ లో అపోలో హాస్పిటల్ వెనుక మీరు వేసిన టీ స్టాల్ సెట్ మిస్టీరియస్ నేచర్ ని ఇప్పటికీ మరువ లేకున్నాం,  అంత రియలిస్టిక్ గా ఎలా క్రియేట్ చేయగలిగారు?” అనడిగితే, బహుశా పారితోషికం లేని పరిస్థితుల్లో పని చయడం వల్ల ఆ సహజత్వం వచ్చిందని చమత్కరించారు (సినిమా విడుదలయ్యాక పాతిక వేలు లభించాయట!)

    తర్వాత ‘ఛత్రపతి’, ‘విక్రమార్కుడు’, ‘సై’, ‘ఒక్క మగాడు’, ‘అనుకోకుండా ఒక రోజు’, ‘అమ్మ చెప్పింది’, ‘అష్టాచెమ్మ’, ‘మార్నింగ్ రాగ’, ‘నేను మీకు తెలుసా’, ‘మగధీర’...ఇలా ఆయన ఖాతాలో సినిమాలు జమ పడ్డాయి.
    ‘మగధీర’ ఒక చరిత్ర. అందులో రాజభవనాలు, రథం, ఊబి, హెలీకాప్టర్, కాస్ట్యూమ్స్ వంటి అద్భుత సృష్టులు రవీందర్ చేతుల మీదుగా జరిగాక, చెప్పుకోవాల్సిన మరో విశిష్టత ‘మర్యాదరామన్న’ లోని రైల్ కంపార్ట్ మెంట్, ట్రాలీసెట్లు, నది మీద కలప వంతెన యదార్థ నిర్మాణం (గత ఇంటర్వ్యూల్లో ‘మర్యాదరామన్న’ గ్రాఫిక్స్ నిపుణులు కణల్ కణ్ణన్, కెమెరా మాన్ సి. రాం ప్రసద్ లు ఆ వంతెనని పూర్తిగా గ్రాఫిక్స్ సృష్టిగా పేర్కొనడాన్ని రవీందర్ దృష్టికి తెస్తే, దీనికి ఆయన ఫీలై,  అది తను వేసిన సెట్ -నిజ కట్టడం- అని ఫోటోలు చూపించారు).

    పోతే, ‘మర్యాదరామన్న’ కోసం వేసిన ఇంటి సెట్ ఇప్పుడు రికార్డులు సృష్టిస్తోంది...ఇప్పటికీ ఇందులో వివిధ సినిమాల షూటింగులు జరిగిపోతున్నాయి. పూర్తిగా ప్లై వుడ్ తో నిర్మించిన ఈ సెట్ కి నాల్గేళ్ళ గ్యారంటీ వుంది. దీని పటిష్టత కోసం ప్లైవుడ్ మీద వేసిన కోటింగ్ లో రసాయనాల మిశ్రమం రవిందర్ సొంత డిస్కవరీయే. ఇప్పుడు దీనికే ఆయన పేటెంట్ హక్కులు పొందారు. ఈ ఇంటర్వ్యూ ఇస్తున్నవారమే స్విట్జర్లాండ్ నుంచి పత్రాలందాయని వాటిని చూపించారు. ఈ విషయం ముందుగా  ఇలా ‘ఆంధ్రజ్యోతి’ కే వెల్లడిస్తున్నాననీ, తర్వాత నిర్మాతల సమక్షంలో ప్రెస్ ప్రెస్ మీట్ పెట్టి అధికారికంగా ప్రకటిస్తామనీ చెప్పారు. కాబట్టి ఈ కెమికల్ కాంబినేషన్ ని ప్రపంచంలో ఎవరు వాడాలన్నా ముందుగా రవీందర్ కి రాయల్టీ చెల్లించాల్సి వుంటుంది. ఇలా ఒక కళా దర్శకుడికి పేటెంట్ హక్కులు దక్కడం దేశంలోనే మొదటిసారి!
      ప్రస్తుతం ‘శ్రీ రామరాజ్యం’ కి రామోజీ ఫిలిం సిటీలో రాజప్రాసాదాల సెట్, అల్వాల్ లో అడవి సెట్, ‘రాజన్న’ కి జూబ్లీహిల్స్ లో 1946 నాటి తెలంగాణా గ్రామం సెట్ వేసి, ఇంకా ‘మిస్టర్ పర్ఫెక్ట్’, ‘ఈగ’ సినిమాలకి పనిచేస్తున్న రవిందర్ ఎలాటి అవార్డులకీ సన్మానాలకీ  దూరం!

సికిందర్  
(ఫిబ్రవరి 2011 ,ఆంధ్రజ్యోతి’ కోసం)