రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Friday, April 12, 2024

1421 : రివ్యూ

 

దర్శకత్వం : శివ తుర్లపాటి
తారాగణం : శ్రీనివాస రెడ్డి, అంజలి, సత్య, సత్యం రాజేష్షకలక శంకర్, అలీ, సునీల్, శ్రీకాంత్ అయ్యంగార్, రవిశంకర్, రాహుల్ మాధవ్ తదితరులు
రచన : కోనవెంకట్, భాను; సంగీతం : ప్రవీణ్ లక్కరాజు, ఛాయాగ్రహణం : సుజాతా సిద్ధార్థ
నిర్మాత : ఎంవీవీ సత్యనారాయణ
విడుదల ; ఏప్రిల్ 11, 2024
***
          2014 లో హిట్టయిన 'గీతాంజలి' కి సీక్వెల్ గా 'గీతాంజలి  మళ్ళీ వచ్చింది' తో తిరిగొచ్చింది అంజలి. ఇది కూడా హార్రర్ కామెడీ. దీనికి కోనవెంకట్ రచయిత. శివ తుర్లపాటి కొత్త దర్శకుడు. మరి ఇది కూడా హర్రర్ తో భయపెట్టిందా, బోలెడు మంది కమెడియన్లతో నవ్వించిందా తెలుసుకుందాం...
కథ
సినిమా దర్శకుడుగా శ్రీను (శ్రీనివాస రెడ్డి) వరుసగా మూడు ఫ్లాప్స్ తీసి ఇక ఛాన్సులు రాక యాతన పడుతూంటాడు. ఇలాంటప్పుడు హీరో అవ్వాలనుకుంటున్న ఫ్రెండ్ అయాన్ (కమెడియన్ సత్య) ని బుట్టలో వేసుకుంటాడు. హీరో చేస్తానంటూ డబ్బులు గుంజుతూంటాడు. అయాన్ కి ఈ మోసం తెలియడంతో ఇరకాటంలో పడ్డ శ్రీనుకి ఊటీ నుంచి ఆఫర్ వస్తుంది. విష్ణు (రాహుల్ మాధవ్) అనే ప్రొడ్యూసర్ సినిమా తీద్దాం రమ్మని కాల్ చేస్తాడు. ఊటీలో అంజలి (అంజలి) కాఫీ షాప్ నడుపుతూంటుంది. శ్రీనుకి సినిమా ఆఫరిచ్చిన విష్ణు ఇక్కడ సంగీత్ మహల్ లోనే షూటింగ్ చేయాలని, అంజలినే హీరోయిన్ గా తీసుకోవాలనీ కండిషన్స్ పెడతాడు. ఆ సంగీత్ మహల్ లో ఒక శాస్త్రి (రవిశంకర్), అతడి భార్య(ప్రియా), కూతురూ దెయ్యాలుగా వుంటారు.
        
వీళ్ళు దెయ్యాలెలా అయ్యారు? ఈ దెయ్యాల మహల్లో సినిమా తీయాలన్న విష్ణు ఉద్దేశమేమిటి? అంజలినే హీరోయిన్ గా తీసుకోవాలని ఎందుకు అనుకున్నాడు? ఈ సినిమాలో అయాన్ హీరోగా నటించాడా? పూర్వం అంజలి అక్క గీతాంజలి ఆత్మ ఏమైంది? ఆమె మళ్ళీ తిరిగి వచ్చిందా? అసలీ మొత్తం వ్యవహారమేమిటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలావుంది కథ
హార్రర్ కామెడీలని వదిలిపెట్టడం లేదు. మూడు వారాల క్రితమే ఓం భీమ్ బుష్ అనే హార్రర్ కామెడీ విడుదలైంది. ఇప్పుడు ఇది మరో హార్రర్ కామెడీ. ఇది 2014 లో హిట్టయిన హార్రర్ కామెడీ గీతాంజలి కి సీక్వెల్. దీనికి కూడా కోన వెంకట్ రచయిత. అయితే హార్రర్ కామెడీల్లో హార్రర్ కి భయపడ్డం ఎప్పుడో మానేశారు ప్రేక్షకులు. కేవలం అందులో  కామెడీనే పట్టించుకుంటున్నారు. ఇందులో మొదటిది ఎలాగూ వర్కౌట్ కాలేదు, రెండోది సెకండాఫ్ లో కాసేపు వర్కౌట్ అయింది.
       
అంటే నవ్వించడం కూడా కష్టమైపోతోంది. నవ్వించే కళ కనుమరుగైపోతోంది. మహల్లో దెయ్యాలతో కామెడీకి వాటితో నటించాల్సిన సినిమా షూటింగుకి సంబంధించిన సీన్లు అవి వున్నంత వరకే నవ్విస్తాయి. దర్శకుడుగా శ్రీనివాస రెడ్డి దెయ్యాల్ని జూనియర్ ఆర్టిస్టులుగా నమ్మించి సత్యా
, అంజలీలతో నటింపజేయడం, సత్య చాలా ఫన్నీ సిట్యుయేషన్లు క్రియేట్ చేయడం తెగ నవ్వించే అంశాలే. అలాగే కెమెరామాన్ కిల్లర్ నానిగా సీనియర్ కమెడియన్ సునీల్ దెయ్యాలతో హిలేరియస్ కామెడీ క్రియేట్ చేస్తాడు. దీనికి పదే పదే నవ్వుకోవచ్చు. అతడి స్కిల్స్ అలాటివి. ఈ రెండు ఎపిసోడ్స్ తర్వాత క్లయిమాక్స్ లో, మొదటి భాగంలోని గీతాంజలి ఆత్మ రావడం దగ్గర మాత్రం కథ కుదరక అసంతృప్తిగా ముగింపుకి చేరుకుంటుంది.
       
ఇక ఫస్టాఫ్ చూస్తే శ్రీనివాస రెడ్డి సినిమా చాన్సు ప్రయత్నాలు
, సత్యాని బకరా చేసి వాడుకోవడం, అతడి రచయితలుగా సత్యం రాజేష్, షకలక శంకర్ చేసే  కామెడీ వగైరాలతో చాలా బలహీనంగా సాగుతుంది. ఇంటర్వెల్ ముందు ఊటీ నుంచి ఆఫర్ వచ్చాకే బోరు తొలగి ఆసక్తి పెరుగుతుంది. ఇక మహల్లో దెయ్యాలతో ఇంటర్వెల్ మలుపు కూడా ఫర్వా లేదు. ఇలా మొత్తంగా చూస్తే, హార్రర్ తో భయపెట్టడం పూర్తిగా విఫలమై, కామెడీతో నవ్వించడం సెకండాఫ్ లో రెండు ఎపిసోడ్లలో మాత్రమే సఫలమైందని చెప్పాలి.

నటనలు –సాంకేతికాలు
అంజలి, గీతాంజలి ఆత్మ పాత్రలు రెండిటినీ అంజలి మామూలుగానే నటించేసింది. షరా మామూలుగా ఈ సినిమాలో కూడా ఎమోషన్లు లేకపోవడం వల్ల నటనలు పైపైనే వుంటాయి. దాదాపు ప్ర్తఈ తెలుగు సినిమాలో ఎమోషన్లనేవి కరువైపోతున్నాయి. ఇక కమెడియన్ల శ్రేణి  బారుగానే వుంది - శ్రీనివాస్ రెడ్డి, సత్య, సత్యం రాజేష్షకలక శంకర్, అలీ, సునీల్ తదితరులు. సునీల్, సత్యలకి మాత్రమే  నవ్వించడానికి బాగా కుదిరింది. మిగిలిన వారి స్కిల్స్ వృధా అయ్యాయి. రవిశంకర్, ప్రియా దెయ్యాలుగా వాళ్ళ కథేమిటో కూడర్లేదు. విలన్ గా రాహుల్ మాధవ్ ఫర్వాలేదు.
       
ఛాయాగ్రహణం
, మహల్ సెట్, గ్రాఫిక్స్,ఇతర సాంకేతికాలు రిచ్ గా వున్నాయి గానీ సంగీతం బలహీనంగా వుంది కథా కథనాల్లాగే. కొత్త దర్శకుడు శివ తనదైన ఒక శైలి అంటూ, ముద్ర అంటూ ఏమీ క్రియేట్ చేసుకోకుండా యావరేజీ దర్శకత్వంతో సరిపెట్టేశాడు.
—సికిందర్

 


రచన- దర్శకత్వం : అమిత్ శర్మ
తారాగణం : అజయ్ దేవగణ్,  ప్రియమణి, గజరాజ్ రావ్, రుద్రనీల్ ఘోష్, చైతన్య శర్మ తదితరులు
సంగీతం :  ఏఆర్ రెహమాన్, ఛాయాగ్రహణం : తుషార్ కాంతి రాయ్, ఫ్యోడర్ లియాస్
నిర్మాతలు: బోనీ కపూర్, జీ స్టూడియోస్, అరుణవ్ రాయ్ సేన్‌గుప్తా, ఆకాష్ చావ్లా
విడుదల : ఏప్రిల్ 11, 2024
***

        త రెండు సంవత్సరాల్లో దృశ్యం 2’, షైతాన్ అనే రెండు హిట్స్ తో ముందున్న అజయ్ దేవగణ్ తాజాగా స్పోర్ట్స్ బయోపిక్ తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. సచిన్’, ఎంఎస్ ధోనీ’, 83 వంటి హిందీలో వచ్చిన స్పోర్ట్స్ బయోపిక్స్ లో చివరిది తప్ప మిగిలిన రెండూ సూపర్ హిట్టయ్యాయి. ఈ క్రమంలో మైదాన్ ని దర్శకుడు అమిత్ శర్మ తాజా స్పోర్ట్స్ బయోపిక్ గా అందిస్తూ పోటీలోకి దిగాడు. ఇతను గతంలో బధాయీ హో అనే మీడియం బడ్జెట్ సూపర్ హిట్ అందించిన దర్శకుడు. మైదాన్ లో ప్రియమణి ఒక ముఖ్యపాత్ర పోషించింది. ఇది వర్తమాన కాలపు కథ గాకుండా, దాదాపు 72 సంవత్సరాల నాటి పీరియడ్ కథ అవడంతో బడ్జెట్ బాగానే రూ. 100 కోట్లు వెచ్చించాల్సి వచ్చింది. అయితే దీన్ని హిందీలో మాత్రమే విడుదల చేశారు. ఇంతకీ ఈ స్పోర్ట్స్ బయోపిక్ ప్రత్యేకటేమిటి, ఇది ప్రేక్షకులకి కనెక్ట్ అవుతుందా లేదా, దీనికి హైదరాబాద్ తో వున్న సంబంధమేమిటి మొదలైన ప్రశ్నలకి సమాధానాలు వెతికే ప్రయత్నం చేద్దాం...

కథ 
1952లో కోచ్ ఎస్ఏ రహీమ్ (అజయ్ దేవగణ్) నాయకత్వంలోని ఫుట్ బాల్ జట్టు ఆటలో ఓడిపోవడంతో ఈ కథ మొదలవుతుంది. ఆటగాళ్ళు బూట్లు లేకుండా ఆడినందున గాయపడతారు. రహీమ్ తిరిగి స్వస్థలం హైదరాబాద్ వచ్చేస్తాడు. అతడికి బ్రోకెన్ ఇంగ్లీషు మాట్లాడే భార్య సైరా (ప్రియమణి), ఓ కొడుకు (దివ్యాంశ్ త్రిపాఠీ), ఇద్దరు కూతుళ్ళు (నితాంశీ గోయెల్, ఆయేషా వింధర), తల్లీ (మీనల్ పటేల్) వుంటారు. చైన్ స్మోకర్ అయిన అతను  సిగరెట్లు మానెయ్యమనే భార్య మాటల్ని పెడ చెవిని పెడతాడు.
       
అప్పుడప్పుడే
దేశం స్వాతంత్ర్యం పొందిన సమయంలో, ఏ గుర్తింపూ లేని దేశం  ఫుట్‌బాల్ ఆడడం వల్లే ప్రపంచ గుర్తింపు పొందుతుందని రహీమ్ నమ్ముతాడు. అయితే బెంగాల్ నేతృత్వంలోని ఫుట్‌బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో స్వార్ధ రాజకీయాలు ప్రతిబంధకంగా మారతాయి. ఈ ఫెడరేషన్ దేశం కోసం వేరే జట్టుని నిర్మించడం కంటే బెంగాల్ ఆటగాళ్ళు జట్టులో వుండాలని పట్టుబడుతుంది. రహీమ్ దీన్ని వ్యతిరేకించి హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా పర్యటించి ఔత్సాహిక ఆటగాళ్ళని పోగేస్తాడు. జట్టులో వివిధ రాష్ట్రాలకి చెందిన పీకే బెనర్జీ (చైతన్య శర్మ), చునీ గోస్వామి (అమర్త్యా రే), జర్నైల్ సింగ్ (దవీందర్ గిల్), తులసీదాస్ బలరామ్ (సుశాంత్ వేదాండే), పీటర్ తంగరాజ్ (తేజస్ రవిశంకర్) సహా చాలా మంది వుంటారు. వీళ్ళందరికీ కోచింగ్ ఇచ్చి, మంచి బూట్లు కొనిచ్చి, గట్టి టీంని ఏర్పాటు చేస్తాడు.
        
'మనది పెద్ద దేశం కాదు, మనం ధనవంతులం కాదు. సగం ప్రపంచానికి మన గురించి తెలియదు. ప్రపంచం మొత్తం ఫుట్‌బాల్ ఆడుతోంది కాబట్టి ఫుట్‌బాల్ మనకో గుర్తింపుని  తెచ్చిపెట్టగలదు. అందువల్ల, వచ్చే 10 సంవత్సరాల పాటు ప్రపంచ స్థాయి జట్టుని నిర్మించాలని భారత్ గుర్తుంచుకోవాలి అని ఉద్బోధించి సమరం ప్రారంభిస్తాడు.
       
ఈ సమరంలో ఒలంపిక్స్ సహా విజయాలు సాధిస్తూ
, అంతిమంగా ఆసియా కప్ లో  గోల్డ్ మెడల్ లక్ష్యంగా పెట్టుకుంటే, దురదృష్టం వెంటాడి క్యాన్సర్ బారిన పడతాడు. ఇప్పుడేం చేశాడు? ఎక్కువకాలం బ్రతకడు. మరణించే లోగా దక్షిణ కొరియాతో ఆసియా కప్ గెలిచాడా? క్యాన్సర్ వల్ల ఇప్పుడు తనతో తను కూడా సమరం చేయాల్సి వచ్చిన గడ్డు పరిస్థితి. ఈ పరిస్థితిలో లక్ష్యాన్ని ఎలా సాధించాడన్నది ఉద్విగ్నతకి లోనుజేసే మిగతా కథ.

ఎలావుంది కథ
స్పోర్ట్స్ బయోపిక్ లెజెండరీ ఫుట్ బాల్ కోచ్, మేనేజర్, హైదరాబాద్ వాసి  సయ్యద్ అబ్దుల్ రహీమ్ కథ. కొన్ని మరుగున పడిన మాణిక్యాలుంటాయి. అలా ఎవరికీ  తెలియని కాల గర్భంలో కలిసిపోయిన మాణిక్యాన్ని వెలికి తీసి సినిమా తీశాడు దర్శకుడు అమిత్ శర్మ. రహీమ్ జట్టు  ప్రపంచ వ్యాప్తంగా సంచలనాలు సృష్టించింది. ఒలింపిక్స్ నుంఛీ ఆసియా క్రీడల వరకూ బంగారు పతకాల్ని  సాధించి పెట్టింది. అతడి ఏలికలో 1952 నుంచి 1962 మధ్య కాలాన్ని భారత ఫుట్‌బాల్ చరిత్రలో స్వర్ణ యుగం న్నారు.
          
రహీమ్ చివరి విజయం 1962 లో జకార్తాలో జరిగిన ఆసియా కప్ ఫైనల్స్ లో దక్షిణ కొరియాని ఓడించి స్వర్ణం గెలవడం. 1963 లో క్యాన్సర్ తో కన్నుమూయడంతో అతడి శకం ముగిసింది. ఈ కథ ఫస్టాఫ్ లో అప్పటి దేశంలో ఫుట్‌బాల్ స్థితిని, రహీమ్ మెరికల్లాంటి  ఆటగాళ్ళని సృష్టించిన విధానాన్నీ చూపిస్తుంది. మరో పక్క, సోషలిస్టు అయిన రహీమ్ కి అడుగడుగునా మతం పేర, కుదరకపోతే కులాల పేర, ఇంకా కుదరకపోతే ప్రాంతీయతల పేరా ఫెడరేషన్ కమిటీ సృష్టించే ఆటంకాలుంటాయి. వాళ్ళకి బెంగాల్ ఆటగాళ్ళే కావాలి.
        
కమిటీలోని రాజకీయాల్ని అర్థం చేసుకోవడానికి ఫస్టాఫ్ ని ఉద్దేశించాడు దర్శకుడు.  ఇంకో పక్క కుటుంబ జీవితం గురించి క్లుప్తంగా చెప్పాడు. ఇలా నెమ్మదిగా సాగే ప్రథమార్ధం కొన్నిసార్లు కథ పెద్దగా ముందుకు సాగకపోవడంతో అసహనానికి గురిచేసే మాట మాత్రం  నిజం. అయితే ఈ సినిమా 2019 నుంచీ సుదీర్ఘకాలం నిర్మాణంలో వుందన్న విషయం గుర్తుంచుకోవాలి. గంట సెపే సాగే ఫస్టాఫ్ లో మొదటి ప్రధాన ట్విస్ట్ వచ్చే చివరి 15 నిమిషాల వరకూ ఇంతే. భావోద్వేగాలుండవు. అతడికి క్యాన్సర్ అని బయటపడ్డంతో ఒక ఉలికి పాటునిస్తుంది ఫస్టాఫ్ ముగింపు.
       
ఇక గంటా 45 నిమిషాలూ సాగే
సెకండాఫ్ మొత్తం ఒక యాక్షన్ డ్రామా.  ఫుట్ బాల్ ఆటే క్షణం క్షణం పరుగులెత్తే యాక్షన్ లో వుండే క్రీడ. పెద్ద తెర మీద ఈ యాక్షన్ స్టేడియంలో కూర్చుని ప్రత్యక్ష ఆట చూస్తున్నట్టే వుంటుంది. ఇక భావోద్వేగాలు- గోల్ కొడితే హర్షాతి రేకాలు, ఔట్ అయితే దీన విలాపాలు. పైగా క్యాన్సర్ తో కుంగుతున్న రహీమ్. సినిమాలోని ఈ మ్యాచ్ సన్నివేశాల్ని చూస్తున్నప్పుడు కలిగే భావోద్వేగాలు, థ్రిల్స్ పతాక స్థాయిలో వుంటాయి. టీమ్ ఇండియా గోల్ చేసిన ప్రతిసారీ ప్రేక్షకుల నుంచి చప్పట్లు. ముగింపు చాలాసెంటిమెంటల్ గా వుంటుంది. బరువెక్కిన హృదయాలతో బయటికొస్తారు.

నటనలు – సాంకేతికాలు
ఫస్టాఫ్ లో అజయ్ దేవగణ్ పాత్ర కథని సెటప్ చేసే వంట తయారీ పనిలో వుంటుంది కాబట్టి మెకానికల్ గా కన్పిస్తుంది. ఒకసారి వంట తయారై ఇంటర్వెల్లో వడ్డించడం మొదలెట్టాక కట్టి పడేస్తుంది. అతను సంకల్పబలంతో స్పోర్ట్స్ ఒకదాన్నే వడ్డించడం లేదు- తనని తినేస్తున్న క్యాన్సర్ నీ వడ్డిస్తున్నాడు. ఈ రోజుల్లో క్యాన్సర్ కథలతో సినిమాలొస్తే నవ్వుతారు. కానీ నిజ కథలో క్యాన్సర్ పాత్ర సానుభూతినంతా ప్రోది చేసుకుంటుంది. ఎస్ ఏ రహీమ్ ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కొని వుంటాడా అన్న నిజ జీవితపు ప్రశ్న ఈ బయోపిక్ కి బలమైన హుక్ ని ఏర్పాటు చేస్తుంది. కల్పిత పాత్రయితే ఇదంతా కేర్ చెయ్యం. క్యాన్సర్ తో ఈ నిజ జీవిత పాత్ర ఇప్పుడెలా టీం ని గెలిపించుకుని వుంటాడా అన్న కృత్రిమత్వం లేని బలమైన డ్రమెటిక్ క్వశ్చన్ ఇక్కడ క్రియేటవుతుంది. ఇక్కడే అజయ్ తన నటనతో మార్కులన్నీ స్కోరు చేశాడు. కమిటీలో ప్రత్యర్ధులు, ఫీల్డులో ప్రత్యర్ధులు, శరీరంలో ప్రత్యర్ధి- ఈ త్రిముఖ పోరాటాన్ని సాగించే పాత్రగా శక్తివంచన లేకుండా నటించాడు. రహీమ్ ని మర్చిపోలేని విధంగా ప్రెజెంట్ చేశాడు.
       
భార్య పాత్రలో ప్రియమణి సంఘర్షణ కూడా కట్టి పడేస్తుంది. ఇంటికొచ్చి క్యాన్సర్ తో కూడా అతను సిగరెట్లు కాల్చేస్తూంటే-
యింటికొచ్చి మృత్యువు కోసం నిరీక్షిస్తున్నావా? ఇది నా ఇల్లు- ఇది జీవించడానికి, మరణించడానికి కాదు... నువ్వు కంటున్న కలలకి నువ్వొక్కడివే మూల్యం చెల్లించుకోవడం లేదని గుర్తు పెట్టుకో అంటుంది. కొడుకుని ఇంజనీరు చేయాలన్న తన కలల సంగతి ఏమిటన్న బాధలోంచి. ఈ ఫ్యామిలీ డ్రామా సబ్ ప్లాట్ గా వుంటుంది.
       
స్పోర్ట్స్ జర్నలిస్టుగా
గజరాజ్‌రావు రహీమ్ కి ఎసరుపెట్టే కన్నింగ్ పాత్ర నటించాడు. అతడి దుష్టత్వం చాలా కరుగ్గా వుంటుంది. ఫుట్‌బాల్ ప్లేయర్‌లుగా నటించిన యువ నటులకి ఎక్కువగా మాటల్లేవు. ఆటలతోనే దృష్టి నాకర్షిస్తారు. ఆ జయాపజయాలతో కూడిన భావావేశాల్ని బలంగా ప్రకటిస్తూ. ఈ మొత్తం డ్రామాలో దేశభక్తి కనిపించదు. దేశభక్తి నినాదాలుండవు. స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్ళలో రాజకీయాలకింకా దేశభక్తి ముడిసరుకు కానందువల్లనేమో. నేషనల్స్-యాంటీ నేషనల్స్ సోది ఆ కాలంలో లేనట్టుంది.  అజయ్ దేవ గణ్ రైట్ వింగ్ మద్దతుదారైనా ఈ సినిమాని వేరుగా వుంచాడు.
       
టెక్నికల్ గా అత్యున్నతంగా వుంది. 1950 ల నాటి హైదరాబాద్ ట్యాంకు బండ్ నీ
, పురానా పుల్ నీ బాగానే రీక్రియేట్ చేశారు. ఇతర సెట్స్ కి కళా దర్శకత్వం, నటుల కాస్ట్యూమ్స్ వగైరా 70 ఏళ్ళ నాటి కాలాన్ని ప్రతిబింబిస్తాయి. ఆరుగురు రచయితలు పని చేశారు. రెహమాన్ సంగీతంలో 5 పాటలున్నాయిగానీ మామూలుగా వున్నాయి. ఎక్కువ పాటలు మనోజ్ ముంతసిర్ రాశాడు. మనోజ్ ముంతసిర్ అంటే ఆదిపురుష్ లో యాక్షన్ సినిమా పంచ్ డైలాగులు రాసి అల్లరైన వాడే. 
       
ఫుట్ బాల్ మ్యాచుల యాక్షన్ కొరియోగ్రఫీకి స్పోర్ట్స్ యాక్షన్ డైరెక్టర్ రాబర్ట్ మిల్లర్
, కో ఆర్డినేటర్ దినేష్ నాయర్, యాక్షన్ డైరెక్టర్ ఆర్పీ యాదవ్ పని చేశారు. వీళ్ళ పనితనం అద్భుతంగా వుంది. ఈ స్పోర్ట్స్ బయోపిక్ విభిన్నమైనది. ఎందుకంటే ఇది క్యాన్సర్ ఎలిమెంట్ తో వుంది. క్యాన్సర్ ఎలిమెంట్ లేకపోతే రెగ్యులర్ స్పోర్ట్స్ డ్రామా అయ్యేది.
—సికిందర్


Wednesday, April 10, 2024

1419 : స్పెషల్ ఆర్టికల్

 

          2019 లో ప్రారంభమయిన  విజయ్ దేవరకొండ వరస ఫ్లాపుల పరంపర ఐదవ ఫ్లాపుతో ఫ్యామిలీ స్టార్ దగ్గర ఆగింది. ఇవ్వాళ షడ్రుచుల ఉగాది పచ్చడి ఆరగించి ఆనందించాల్సింది, కెరీర్ లో అతి పెద్ద అట్టర్ ఫ్లాపు గరళాన్ని దిగమింగాల్సి వచ్చింది. తను దర్శకుల్ని, ఆ దర్శకులు మోసుకొచ్చే ఇంతింత లావు బౌండెడ్ స్క్రిప్టుల్నీ దారుణంగా జడ్జ్ చేస్తున్నట్టు దీన్ని బట్టి అర్ధమవుతోంది. ఐదులో ఒకటి రెండు ఫ్లాపైతే అతడి జడ్జిమెంటుని పూర్తిగా శంకించే పరిస్థితి వుండదు. ఐదుకి ఐదూ ఫ్లాపే అయితే రూఢీ అయిపోతుంది కండిషన్. తను ఇప్పటి వరకు బ్యాక్ టు బ్యాక్ హిట్ కొట్టింది లేదు. ఓ హిట్ కొట్టిన వెంటనే ఫ్లాపు పలకరిచరించడం టైమ్ టేబుల్ ప్రకారంగా సాగుతోంది.
        
2016 లో పెళ్ళి చూపులు అనే హిట్ తో గుర్తింపులోకొచ్చిన తను ఆ తర్వాత ద్వారక తో ఫ్లాపయ్యాడు. దాంతో అప్పట్లో అతడ్ని ఒన్ ఫిలిమ్ వండర్ అని కూడా విమర్శించారు. అయితే వెంటనే టాలీవుడ్‌లో సంచలనాత్మక విజయంగా నిలిచిన అర్జున్ రెడ్డి తో బలంగా తిరిగి వచ్చాడు. దీని తర్వాత మళ్ళీ ఇంకో అట్టర్  ఫ్లాప్ ఏ మంత్రం వేశావే తో షాకిచ్చాడు. ఆ తర్వాత మహానటి అనే సూపర్ హిట్ లో నటించినా ఆ నటించింది కేవలం అతిధి పాత్ర. దీని తర్వాత గీత గోవిందం తో హిట్టయి తిరిగి అర్జున్ రెడ్డి దగ్గర ఆగిన స్టార్ డమ్ ని నిలబెట్టుకున్నాడు.  
        
దీని తర్వాత మళ్ళీ నోటా అనే మరో ఫ్లాప్. నోటా ఫ్లాపయ్యాక టాక్సీవాలా హిట్. ఇలా ఒక హిట్ తర్వాత ఒకటీ ఆరా మాత్రమే ఫ్లాప్ ఇస్తూంటే ప్రేక్షకుల అభిమానం  కోల్పోతాడన్నట్టు, ఇక వరుస బెట్టి ఫ్లాపులివ్వడం మొదలెట్టాడు. ఐదు వరస ఫ్లాపులు- డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్, ఖుషీ, ఫ్యామిలీ స్టార్...ఇంతకంటే  ఏం కావాలి ప్రేక్షకులకి. కట్టలు కట్టలుగా ఫ్లాప్ గ్యారంటీ ఇచ్చే పాసిఫ్ హీరో క్యారక్టర్లతో 8 బౌండెడ్ స్క్రిప్టులే తన ఆస్తిగా మిగిలాయి. కమర్షియల్ సినిమా అన్నాక అది ఆడాలంటే యాక్టివ్ హీరో క్యారక్టర్ తప్పనిసరిగా వుండాలని పదుల కోట్లు బడ్జెట్లు పెట్టించే ఈ దర్శకులకే తెలీదు, ఇక హీరో కేం తెలుస్తుంది!
        
ఈ ఉగాది శ్రీ క్రోధి నామ సంవత్సరం. అంటే దీనర్థం క్రోధాన్ని కలిగించేది. ఈ కాలంలో ప్రజలు కోపంతో, ఆవేశంతో వ్యవహరించే అవకాశం వుందని పండితులు చెబుతున్నారు. కాబట్టి ప్రేక్షకులతో ఇలా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత తనకే వుంది. ఐదు బ్యాక్ టు బ్యాక్ దెబ్బలు పడ్డాక ప్రేక్షకుల క్రోధం ఏ రేంజిలో వుంటుందో వూహించుకోవచ్చు.  ఫ్యామిలీ స్టార్ అనేది హీరో నాగచైతన్య నుంచి, నిర్మాత అల్లు అరవింద్ నుంఛీ దర్శకుడు పరశురామ్ హైజాక్ చేసి విజయ్ దేవరకొండ దగ్గరికి, నిర్మాత దిల్ రాజు దగ్గరికీ తీసుకెళ్ళి పోయి తీసిన సినిమా. అప్పట్లో పెద్ద వివాదం కూడా రగుల్కొన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఇలా అట్టర్ ఫ్లాపవడంతో ఇది పోయేటిక్ జస్టిస్ ళా అనిపించి నాగచైతన్య, అల్లు అరవింద్ ఆనందిస్తున్నట్టు తెలుస్తోంది.
        
మొదటి రోజు ఓపెనింగ్స్ దగ్గర్నుంచి తొలి వారాంతం కలెక్షన్స్ ఎందుకో విజయ్ గత సినిమాల రేంజిలో లేవు. ఎంత ఫ్లాపయినా తొలి మూడు రోజులు అతడి సినిమాలకి బలంగానే వసూళ్ళు వుండేవి. ఇప్పుడు బాక్సాఫీసు ట్రాకర్ సాచ్నిక్ ప్రకారం శుక్ర -శని- ఆది వారాల్లో ఇండియా నెట్ రూ. 12.30 కోట్లు మాత్రమే. నాల్గవ రోజు నిన్న సోమవారం ఇండియా నెట్ రూ. 1.30 కోట్లు మాత్రమే! ఏపీ - తెలంగాణాల్లో శుక్రవారం రూ. 5.4 కోట్లు, శనివారం రూ. 2.7 కోట్లు, ఆదివారం రూ. 2.4 కోట్లు, నిన్న సోమవారం రూ. 1.12 కోట్లు -మొత్తం రూ 11.62 కోట్లు మాత్రమే. నిన్నటి కనిష్ట డ్రాప్ తో సినిమా మీద ఆశలు వదులుకున్నారు. రూ. 50 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తే నాల్గో వంతు కూడా వసూలు చేయలేకపోయింది ఫ్యామిలీ స్టార్.
        
తన స్టార్ డమ్ ఇంత అట్టడుక్కి చేరాక విజయ్ కిది ప్రమాద ఘంటికలు మోగుతున్న వేళ... అర్జెంటుగా కొత్త బౌండెడ్ స్క్రిప్టుల్ని కొత్త బాక్సాఫీసు కళ్ళతో చూడాల్సిన అవసరాన్ని నొక్కిజెప్తున్న సందర్భం. చూసే కళ్ళు మారితే వచ్చే  వసూళ్ళు  మారతాయి.
—సికిందర్  


Friday, April 5, 2024

1418 : రివ్యూ


 రచన-దర్శకత్వం : పరశురామ్

తారాగణం: విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్, రోహిణీ హట్టంగడి, జగపతి బాబు, రవిప్రకాశ్, వెన్నెల కిశోర్ తదితరులు  
సంగీతం : గోపీ సుందర్, ఛాయాగ్రహణం : కేయూ మోహనన్,
బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
నిర్మాతలు: దిల్ రాజు, శిరీష్
విడుదల ; ఏప్రిల్ 5, 2024
***
        విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా దిల్ రాజు నిర్మాతగా, పరశురామ్ దర్శకత్వంలో ఫ్యామిలీ స్టార్ ఎక్కువ హైప్ క్రియేట్ చేయకుండానే ఈ రోజు విడుదలైంది. దీనికి తగ్గట్టే బుకింగ్స్ వున్నాయి. స్టార్ సినిమా ఓపెనింగ్స్ కి మల్టీప్లెక్సులకి ముందే చేరుకుంటారు ప్రేక్షకులు. విజయ్ దేవరకొండ సినిమాకి పోటెత్తుతారు. అలాటిది ప్రధాన కూడలి మల్టీప్లెక్స్ లో ఆట ఇంకో పది నిమిషాల్లో పడుతోందనగా బయట ఈ రివ్యూ కర్త, ఇంకో ప్రేక్షకుడు బిక్కుబిక్కుమంటూ వున్నారు. ఆట ప్రారంభమైపోయాక చూస్తే ఓ 50 మంది మాత్రం వున్నారు.  ఇది షాకింగ్ సీన్. మరి సినిమా ఇంకెంత షాకింగ్ గా వుంటుందోనని  చూస్తే, ఫ్యామిలీ స్టార్ స్పార్క్ ఎలా వుందంటే…

కథ

మధ్యతరగతికి చెందిన గోవర్ధన్ (విజయ్ దేవరకొండ) ఇద్దరన్నల కుటుంబ బాధ్యతల్ని మోస్తూ త్యాగశీలిగా వుంటాడు. సివిల్ ఇంజనీరింగ్ చేసిన అతను ఓ చిన్న కంపెనీలో కొద్ది పాటి జీతానికి పని చేస్తూ ఇద్దరన్నలు, వాళ్ళభార్యలు, ఐదుగురు పిల్లలు, ఓ బామ్మ లని పొదుపుగా పోషించుకుంటూ వుంటాడు. పెద్దన్న మద్యం బానిస. తమ్ముడి సహకారంతో సివిల్స్ రాయాల్సిన వాడు తమ్ముడితో ఓ ఫ్లాష్ బ్యాక్ వల్ల ఇగో హర్ట్ అయి మద్యాన్ని ఆశ్రయించాడు. ఆ వైన్ షాపు బిల్లులు తమ్ముడే కడుతూ వుంటాడు. రెండో అన్న ఏదో వ్యాపార ప్రయత్నాల్లో వుంటాడు.
       
ఇలా వుండగా వీళ్ళ పై పోర్షనులో ఇందూ (మృణాల్ ఠాకూర్) అద్దెకి దిగుతుంది. ఈమె సెంట్రల్ యూనివర్సిటీలో చదువుతున్నట్టు చెప్పుకుంటుంది. పోనుపోను ఇద్దరూ దగ్గరవుతారు. అప్పుడు ఇందూ గురించి అసలు విషయం తెలిసి ఫైర్ అవుతాడు గోవర్ధన్. ఆమె మధ్యతరగతి కుటుంబాలపై థీసిస్ రాస్తోంది. తమ కుటుంబం పరువే తీసి రాసినందుకు గొడవ చేసి కొడతాడు. ఆ తర్వాత తన రిచ్ నెస్ ని ఆమెకి చూపించుకోవడానికి ఓ పెద్ద కంపెనీలో జాయినై
, కోటి రూపాయలు అడ్వాన్సు తీసుకుని, ఆ డబ్బంతా ఖర్చు పెట్టేసి రిచ్ మాన్ హోదా పొందుతాడు. కంపెనీలో జాయినవుతాడు. జాయినైతే ఆ కంపెనీ యజమాని (జగపతి బాబు) కూతురే ఇందూ. పైగా కంపెనీ సీఈఓ కూడా!
       
దీంతో దెబ్బతిని పోతాడు. అయినా ఈ కంపెనీలో సంపాదించి సొంత కంపెనీ పెట్టుకుంటానని చాలెంజీ చేస్తాడు. అతడి చాలెంజీ నెరవేరిందా
? ఇందూతో సంఘర్షణ ఎలా తీరింది? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

ఉదయం నుంచే ఈ సినిమా గ్యాంగ్ లీడర్, గీత గోవిందం, అమ్మో ఒకటో తారీఖు కథల్ని కలిపి కొట్టారని ట్వీట్లు రాసాగాయి. ఇందులో కుటుంబం సెటప్ చిరంజీవి గ్యాంగ్ లీడర్ (1991) లో కుటుంబ సెటప్పే. ఒక అన్న కూడా సివిల్స్ రాస్తూంటాడు. అక్కడ చిరంజీవి బామ్మ నిర్మలమ్మ అయితే, ఇక్కడ విజయ్ బామ్మ రోహిణీ హట్టంగడి. ఇక అందులో ప్లానుగా విజయశాంతి అద్దెకి దిగితే, ఇందులో కూడా ప్లానుగా మృణాల్ ఠాకూర్ అద్దెకి దిగింది.
       
సమస్య ఎక్కడ వచ్చిందంటే
, ఇంకా ఈ రోజుల్లో 1991 నాటి కుటుంబాలనే చూపించడం దగ్గర. అందుకని ఫస్టాఫ్ పురాతన సీన్లతో, పురాతన కథలా వుంటుంది. 33 ఏళ్ళ నాటి ఈ కుటుంబానికి సినిమా చూసే నేటి గృహిణులు కూడా కనెక్ట్ కాలేరు యూత్ సంగతలా వుంచి. ఇలాటి వాళ్ళు ఇప్పుడు మన ఇళ్ళల్లో ఎక్కడున్నారమ్మా అనుకుంటారు గృహిణులు. మరిది మీద అలా పడి తినకుండా ఆ తోటి కోడళ్ళయైనా ఉద్యోగాలు చేయకూడదా మనలాగా అనుకుంటారు. ఇక సివిల్ ఇంజనీర్ హీరో చాలీ చాలని సంపాదన చూసి నేటి యూత్ జుట్టు పీక్కునే పరిస్థితి. నేటి సినిమాలు రెండే థీమ్స్ తో పని చేస్తాయి- అయితే ఎకనామిక్స్ లేకపోతే రోమాంటిక్స్. ఇందులో రెండూ లేవు, నేటి కాలపు కథ అయితేగా? ఇలా సినిమాకి మార్కెట్ యాస్పెక్ట్ అంటూ లేకపోయాక, క్రియేటివ్ యాస్పెక్ట్ కూడా ప్రశ్నార్ధకంగా మారింది.  కథతో ఏం చేయాలో అర్ధం గాలేదు దర్శకుడికి. నిర్మాత దిల్ రాజుకి కూడా ఇలా పాత చాదస్తాలతో వుంటేనే ఫ్యామిలీ ప్యాకేజీ సినిమా తీసినట్టు లెక్క ఎంత కాలమైనా.
       
ఫస్టాఫ్ 45 నిమిషాలు పాత కుటుంబ కష్టాలతో విజయ్ దేవరకొండ స్పార్క్ లేని నటన కనిపిస్తుంది. 45 నిమిషాల తర్వాత మృణాల్ ఠాకూర్ వచ్చాక కాస్త హుషారెక్కుతుంది. కానీ ఆ రోమాన్సులో   స్పార్క్ వుండదు- చిరంజీవి
, విజయశాంతిల కెమిస్ట్రీ లాగా. దాంతో వానా వానా వెల్లువాయే బప్పీలహరీ చార్ట్ బస్టర్ పాటలాగా.
       
ఇంతవరకూ ఎలా వున్నా
, కనీసం ఇంటర్వెల్ సీనులో రెచ్చగొట్టిన భావోద్వేగాలకి లాజిక్ లేక దీని ప్రభావం సెకండాఫ్ మీద పూర్తిగా పడింది. మధ్య తరగతి కుటుంబాల మీద థీసిస్ అని మృణాల్ పేర్లతో సహా విజయ్ కుటుంబం గురించి రాయడమేమిటో అర్ధం గాదు. ఓ కంపెనీ కాబోయే సీఈఓ గా ఆమె థీసిస్ ఇంత ఘోరంగా వుంటే, విజయ్ యూనివర్సిటీలో ఆమెని కొట్టి, థీసిస్ ని చింపేయడంలో కూడా లాజిక్ కనిపించదు. నేనిలాగే హీనంగా బ్రతుకుతాను నా గురించి మాత్రం రాయవద్దన్నట్టుంది. దీనికంటే తన కుటుంబంలో ఆమె రాసిన లోపాల మీద చర్చించి మార్పులు తీసుకొచ్చే ఆలోచనలు చేయొచ్చు. శ్యామ్ బెనగళ్ తీసిన క్లాసిక్ సూరజ్ కా సాత్వా ఘోడా లో మెచ్యూర్డ్ నాయకా నాయిక పాత్రల్లాగా.
       
అలా చేయకపోగా
, థీసిస్ రాసి తన కుటుంబాన్నే అవమానించిందని, అందుకని రిచ్ గా మారి చూపిస్తానని ఇగోకి పోయి తప్పటడుగులే వేస్తాడు- పెద్ద కంపెనీలో జాయినై కోటి అడ్వాన్సు తీసుకుని దాంతో కుటుంబాన్ని రిచ్ గా మార్చేసి చూపిస్తాడు. తీరా అదే కంపెనీకి ఆమె సీఈఓ అని తెలిసి- ప్లేటు ఫిరాయించేస్తాడు- ఇప్పుడు ఇదే కంపెనీలో సంపాదించి సొంత కంపెనీ పెడతానని!  ఇది మరీ సిల్లీగా వుంది. ఇప్పుడూ ఇగో అనేది వుంటే, ఆ ఉద్యోగాన్ని తిప్పికొట్టి, ఆ థీసిస్ రాసినందుకు క్షమాపణ చెప్పించి తీరతానని అనాలి. ఆమెతో కాన్ఫ్లిక్ట్ పాయింటుకి రావాలి.  ఇలా ఇంటర్వెల్లో క్యారక్టర్ ఏం చేయాలో స్పష్టత లేకపోవడంతో సెకండాఫ్ పూర్తిగా బెడిస్ కొట్టింది!  ఇంకోటేమిటంటే, దీనికంతటికీ ముందు ఆమె ఎనిమిది లక్షలు సాయం చేసి అతడి అప్పు తీర్చింది. ఆమెతో ఇలాటి ప్రవర్తన! 
       
సెకండాఫ్ ఓ ప్రాజెక్ట్ పేరుతో న్యూయార్క్ కి షిఫ్ట్ అవుతారు. ఈ న్యూయార్క్ లో కథ ఆసాంతం పెద్ద బోరు. ఫస్టాఫ్ కథ నుంచి తెగిపోయిన ఈ కథలో విజయ్ ఏ మాత్రం ఆత్మాభిమానం లేక తన మీద తను జోకు లేసుకుంటూ దయనీయంగా కనిపిస్తాడు. తన మీద జాలిపుట్టేలా చేసుకుంటూ మృణాల్ చేతికింద పని చేస్తూంటాడు. ఆమె అస్సలు కేర్ చేయదు. పూర్తిగా వ్యక్తిత్వం లేని పాసివ్ క్యారక్టర్ గా మారిపోతాడు. కొందరు ఆడవాళ్ళు అతడ్ని మేల్ ప్రాస్టిట్యూట్ అనుకుని హెరాస్ చేస్తూంటే
, మృణాల్ ని పిలిపించుకుని బయటపడతాడు!
       
సెకండాఫ్ పాత్రల్ని ఎలా నడిపించాలో దర్శకుడికి ఏ మాత్రం అర్ధం గాలేదు. ఇందుకే ఎలా పడితే అలా సాగదీసి రెండు గంటలా 45 నిమిషాలు పరీక్ష పెట్టారు! ముగింపు మరీ విడ్డూరం. ఇద్దరి పాత్రల మధ్య సరైన సంఘర్షణ లేక కథలో భావోద్వేగాలు పుట్టలేదు. భావోద్వేగాల్లేక
, పాత్రచిత్రణలు లేక, కామెడీ కూడా సరీగ్గా లేక, సంభాషణా బలం లేక ఫ్లాట్ గా తయారైంది సినిమా. పదుల కోట్లతో తీసిన స్టార్ సినిమా కంటెంట్ చాలా తీసికట్టుగా వుందని ఎందుకు తెలుసుకోలేదన్నది ప్రశ్న. లేక విజయ్- పరశురామ్ గీతగోవిందం తీసిన హిట్ కాంబినేషన్ కాబట్టి, ఎలా వున్నా ప్రేక్షకుల్లోకి వెళ్ళిపోతుందనుకున్నట్టుంది. టీవీ సీరియల్ లా వుందని ప్రేక్షకులు ట్వీట్లు చేశారు.

నటనలు - సాంకేతికాలు

ఫస్టాఫ్ పాత కాలపు పాత్ర కావడంతో, సెకండాఫ్ ఆధునిక పాత్రయినా పాసివ్ పాత్ర కావడంతో విజయ్ పాత్రకి యూత్ అప్పీల్ కొరవడింది. ఫ్యామిలీ స్టార్ గా యూత్ కి ఏం చెప్పాలనుకున్నాడో తెలీదు. కథా కథనాలు తనకి సహకరించలేదు. నటుడిగా ఏ లోపమూ లేదు. లోపమంతా స్పార్క్ లేని పాత్ర అంటగట్టిన దర్శకుడిదే.
       
ఫస్టాఫ్ లో రోమాంటిక్ గా కన్పించే మృణాల్ ఠాకూర్
, సెకండాఫ్ ఎప్పుడు చూసినా సీరియస్ గా ఒకే ఎక్స్ ప్రెషన్ తో వుంటుంది. ఇక జగపతిబాబు కాసేపే కనిపించే పాత్ర. కుటుంబ సభ్యుల్లో రోహిణీ హట్టంగడి బామ్మ పాత్రకి ఎక్కువ సీన్లు వుంటాయి. మిగిలిన పాత్రధారులు  అలంకారంగా వుంటారు. 
       
గోపీ సుందర్ సంగీతమైనా హుషారెక్కించాల్సింది. ఆయన చేసే సెమీ క్లాసికల్ సాంగ్స్ విఫలమవుతున్నాయి. మోహనన్ ఛాయాగ్రహణం
, ఇతర నిర్మాణ విలువలు దిల్ రాజు హోదాని బట్టి వున్నాయి. దర్శకుడు పరశురామ్ మార్కెట్ యాస్పెక్ట్ లేని స్క్రిప్టుకి ఎన్ని అలంకరణలు చేసినా దాని అసలు రంగుని దాచలేక పోయాడు - విజయ్ దేవరకొండ ఉచ్ఛారణ లాగే - సంసయిస్తాడు, భాద్యత, యోగాసానాలు అని పలికినట్టు! 
—సికిందర్ 

Thursday, April 4, 2024

1417 : స్పెషల్ ఆర్టికల్


 

            2024లో ఇండియన్ బాక్సాఫీసు మార్కెట్ 2.46 బిలియన్ డాలర్లు (అంటే రెండు వందల ఐదు బిలియన్ల ఇరవై తొమ్మిది కోట్ల ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు) కి రీచ్ అవుతుందని అంచనా. ఇది 2024 నుంచి 2029 వరకు 4.73 శాతం వార్షిక వృద్ధి రేటు నమోదు చేస్తుంది. 2024లో 38.7 శాతం వినియోగదారుల ప్రవేశంతో 653.20  మిలియన్ల (65.32 కోట్లు) కి వినియోగదారులు పెరిగి, 2029 నాటికి 43.5 శాతాన్ని నమోదు చేస్తూ- మార్కెట్ పరిమాణం 3.10 బిలియన్ డాలర్లు (అంటే రెండు వందల నలభై తొమ్మిది బిలియన్ల  తొమ్మిది వందల డెబ్బై రెండు మిలియన్ల తొమ్మిది వందల వేల రూపాయలు) కి అందుకుంటుందని  అంచనా. ప్రతి వినియోగదారు సగటు ఆదాయం 4.42 డాలర్లు (రూ. 368.82) గా అంచనా వేశారు.
       
2023లో భారతీయ చలనచిత్ర పరిశ్రమ దాదాపు 200 బిలియన్ల రూపాయలు వసూలు చేసింది. ఈ ఆదాయంలో ఎక్కువ భాగం దేశీయ థియేటర్ల నుంచి, డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల నుంఛీ వచ్చింది. 2022 లో  భారతీయ బాక్సాఫీసు సుమారుగా 110 బిలియన్ల రూపాయల్ని ఆర్జించింది. 2023 లో బాక్సాఫీసు కలెక్షన్లు రూ. 12,226 కోట్ల ఆల్ టైమ్ హైకి చేరాయి. ఇది 2022 లో కంటే 15 శాతం పెరుగుదల.
        
జర్మనీకి చెందిన ప్రముఖ స్టాటిస్టా గ్లోబల్ డేటా అండ్ బిజినెస్ ఇంటెలిజెన్స్ ఈ అంచనాలు కట్టింది.  కస్టమర్ ప్రాధాన్యాలు, మార్కెట్ పోకడలు, స్థానిక ప్రత్యేక పరిస్థితులు, అంతర్లీన స్థూల ఆర్థిక కారకాల కలయికతో భారతదేశంలోని బాక్సాఫీసు మార్కెట్ ఇటీవలి సంవత్సరాలలో గణనీయమైన వృద్ధిని సాధిస్తోందని తెలిపింది.
        
కస్టమర్ ప్రాధాన్యాలు :  భారతీయ ప్రేక్షకులకి సినిమా పట్ల బలమైన అనుబంధం వుంది. సినిమాలు దేశ సంస్కృతిలో అంతర్భాగంగా వున్నాయి. హిందీ-భాషా చలన చిత్ర పరిశ్రమ బాలీవుడ్ భారతదేశంలో అతిపెద్ద చలనచిత్ర పరిశ్రమగా, ప్రపంచంలోని అతిపెద్ద సినిమా పరిశ్రమల్లో ఒకటిగా వుంది. భారతీయ ప్రేక్షకులు వాస్తవానికతీతమైన కథల్ని, రంగురంగుల పాటల్ని, నృత్య సన్నివేశాలనీ, భావోద్వేగ కథనాలనూ  ఇష్టపడతారు. సినిమా లు చూసేందుకు ఎంచుకుంటూన్న ఈ ప్రాధాన్యాలు దేశంలో బాక్సాఫీసు  మార్కెట్ వృద్ధికి దోహదపడ్డాయి.
        
మార్కెట్‌లో
పోకడలు :  బాక్సాఫీసు మార్కెట్‌లో కీలకమైన ట్రెండ్‌ (పోకడలు) లలో ఒకటి ప్రాంతీయ సినిమాకి పెరుగుతున్న ప్రజాదరణ. బాలీవుడ్ సినిమాలు మార్కెట్‌లో ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నప్పటికీ తెలుగు, తమిళం, మలయాళం వంటి ప్రాంతీయ భాషల్లో సినిమాలకి డిమాండ్ పెరిగింది. ఈ ధోరణికి  దేశంలో పెరుగుతున్న మధ్యతరగతి కారణమని చెప్పవచ్చు. ఈ మధ్య తరగతి వర్గం మరింత సాపేక్షంగానూ, సాంస్కృతికంగానూ వుండే నిర్దిష్ట కంటెంట్‌ని కోరుతోంది. అదనంగా, స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌ల ఆవిర్భావం కూడా ప్రాంతీయ సినిమా ప్రజాదరణకి దోహదపడింది. ఎందుకంటే ఇది విస్తృత శ్రేణి కంటెంట్ ని ఎక్కువ అనుమతిస్తుంది.
       
బా
క్సాఫీసు మార్కెట్‌లో మరో ట్రెండ్ భారీ బడ్జెట్ బ్లాక్‌బస్టర్‌ల పెరుగుదల. సినిమా  నిర్మాతలు విస్తృతమైన సెట్‌లు, విజువల్ ఎఫెక్ట్స్, భారీ తారాగణంతో  కూడిన అధిక నిర్మాణ విలువలపై ఎక్కువగా పెట్టుబడి పెడుతున్నారు. ఈ సినిమాలు తరచుగా ప్రపంచవ్యాప్తంగా వున్న భారతీయ ప్రవాసులకి ఉపయోగపడుతూ ప్రపంచ ప్రేక్షకుల్ని ఆకర్షించడంలో విజయవంతమయ్యాయి. ఇలాంటి సినిమాల  విజయాలు  దేశంలో బాక్సాఫీస్ మార్కెట్ వృద్ధికి మరింత ఊతమిచ్చాయి.
        
స్థానిక ప్రత్యేక పరిస్థితులు:
 140 కోట్ల కంటే ఎక్కువ జనాభా గల భారతదేశ జనాభా చలనచిత్రాలకి పెద్ద సంఖ్యలో ప్రేక్షకుల్ని  అందిస్తోంది. అదనంగా, దేశం సినిమా హాళ్ళూ మల్టీప్లెక్సుల బలమైన నెట్‌వర్క్ ని కలిగి వుంది. దీంతో ముఖ్యంగా పట్టణ ప్రాంతాలలో ప్రజలు కొత్త సినిమాలని  యాక్సెస్ చేయగలుగుతున్నారు. సరసమైన స్మార్ట్ ఫోన్లు, విస్తృత ఇంటర్నెట్ కనెక్టివిటీ లభ్యతా బాక్సాఫీసు మార్కెట్ వృద్ధికి దోహదపడింది. ఎందుకంటే ఇది డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా సినిమాల ప్రసారాన్నీ, పంపిణీనీ అనుమతిస్తోంది.

అంతర్లీన స్థూల ఆర్థిక కారకాలు:  పెరుగుతున్న దేశపు ఆర్థిక వ్యవస్థ, పెరుగుతున్న పునర్వినియోగపరచదగిన ఆదాయాలూ బాక్సాఫీసు మార్కెట్ వృద్ధిలో ముఖ్య పాత్ర పోషించాయి. వినోదం కోసం ఖర్చు చేయడానికి ఎక్కువ డబ్బు వున్నందున, సినిమా వినోదం పై  పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా వున్నారు. పైగా దేశంలో పెరుగుతున్న పట్టణీకరణ, మారుతున్న జీవనశైలీ సినిమా వీక్షణ సహా ఇతర వినోద  కార్యకలాపాల పట్ల ఎక్కువ డిమాండ్‌కి దారితీసింది.

చివరిగా, సినిమాటిక్ అనుభవాల పట్ల పెరిగిన కస్టమర్ ప్రాధాన్యాలు, ప్రాంతీయ సినిమాల పట్ల ప్రజాదరణ, భారీ-బడ్జెట్ బ్లాక్‌బస్టర్‌ల పెరుగుదల, ప్రేక్షకులకి విస్తృత స్థాయిలో సినిమాల లభ్యతా వంటి స్థానిక ప్రత్యేక పరిస్థితుల వల్ల దేశంలో బాక్సాఫీసు మార్కెట్ వృద్ధిని సాధిస్తోంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత శక్తివంతమైన ఆర్ధిక వ్యవస్థగా తోడ్పడుతోంది.

పోతే, ఇప్పుడు ఐఎండీబీ (ఇంటర్నేషనల్ మూవీ డేటా బేస్) రూపొందించిన 2024 టాలీవుడ్ టాప్ 10 లిస్టు గమనిద్దాం : 

        1. హనుమాన్ : 95.00 కోట్లు, 2. గుంటూరు కారం : 188.80 కోట్లు, 3. టిల్లు స్క్వేర్ : 65.25 కోట్లు, 4. నా సామి రంగ : 37.31 కోట్లు, 5. ఈగల్ : 36. 00 కోట్లు, 6. గామి : 24.00 కోట్లు, 7. ఊరు పేరు భైరవకొన : 22.47 కోట్లు, 8. సైంధవ్ :  18.51 కోట్లు, 9. భీమా : 18.40 కోట్లు,  10. ఓం భీమ్ బుష్ : 15.75 కోట్లు.

***