రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Tuesday, June 20, 2023

1347 : మినీ కాన్ఫ్లిక్ట్ సంగతులు


థియేటర్లు వుండాలా,మూతబడాలా? ప్రేక్షకులు థియేటర్లకి కి రావాలా, ఓటీటీలకి అంకితమైపోవాలా? మేకర్లు థియేటర్ సినిమాలు తీయాలా, వెబ్ సిరీస్ - మూవీస్ తో సరిపెట్టుకోవాలా? మేకర్లు మూవీ మేకర్లుగా కొనసాగాలా, మూవీ కిల్లర్స్ గా అవతార మెత్తాలా? వంద సినిమాల కాలం పోయి 250 సినిమాలు తీస్తున్నప్పుడు, విజయాల శాతం అదే 8% వుండాలా, పెరగాలా? ఈ ప్రశ్నలు వేసుకోవాలా, ప్రశ్నల్ని తొక్కేసి అవే స్క్రిప్టులు అలాగే రాసుకుంటూ పోవాలా? ఏం చేయాలి? ఇవన్నీ కాదు, సినిమాల పట్ల చాలా సిన్సియర్ గానే వున్నా, మార్పు కోసం ఇంకేం చేయాలో అర్ధంగావడం లేదా?


అంటే రాయాలనుకుంటున్న కథలో ప్లాట్ పాయింట్ వన్ ఆలస్యమవుతోందా?  ఎక్కువ సినిమాల్లో వస్తున్నట్టు ఫస్టాఫ్ కామెడీ, సెకండాఫ్ కథ అనే శ్రమ లేని మూస పద్ధతే తప్పడం లేదనుకుంటున్నారా? ప్రతీ క్షణం విలువైనదిగా కొలిచే సోషల్ మీడియా కాలంలో కూడా, ప్లాట్ పాయింట్ వన్ ని ఆలస్యం చేసి ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించక తప్పడం లేదా? లేదా ప్లాట్ పాయింట్ వన్ నిర్ధారిత కాలావధి పట్ల సిన్సియర్ గా వుంటూనే కథ చేస్తూంటే, సెటప్ కి సంబంధించి వివిధ కారణాల వల్ల నిడివి  చేయి దాటిపోతోందా? ఇలాంటప్పుడు ఏం చేయ వచ్చో గత ఆర్టికల్లో తెలుసుకున్నాం (కథలేని ఫస్టాఫ్ లో కథ ఎలా?’- ఆర్టికల్ 1312, మార్చి 14.20 23). ప్లాట్ పాయింట్ వన్ కాలావధిని అరగంట దాటి ముప్పావుగంట, గంట, ఆపైన ఇంటర్వెల్ వరకూ సాగదీయడమంటే అప్పటి వరకూ కథ ప్రారంభించకపోవడమే. అంటే ప్రేక్షకుల టైము, నిర్మాతల బడ్జెట్ వృధా చేయడమే.

హిందీ సినిమాల్లో కొత్తగా రాయగల, తీయగల టాలెంట్  అంతా వెబ్ సిరీస్ కి తరలిపోవడంతో బాలీవుడ్ లో సృజనాత్మక క్షామం ఏర్పడింది. ఏం రాస్తున్నారో, ఏం తీస్తున్నారో ఎవరికీ తెలియడం లేదు. మార్చి వరకూ విడుదలైన 24 చిన్నా పెద్ద సినిమాల్లో ఏదీ హిట్ కాలేదు పఠాన్ తప్ప. దీంతో మల్టీప్లెక్సులు, సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూత పడే పరిస్థితి ఏర్పడింది. తెలుగులో ఈ పరిస్థితి రాదనుకోవడం పొరపాటు. కేరళలో ఈ పరిస్థితితో సినిమాల ప్రదర్శనలకే వ్యతిరేకంగా వున్నారు ఎగ్జిబిటర్లు.
                                   
ఒకవైపు స్వదేశీ ఓటీటీలతో బాటు, గ్లోబల్ ఓటీటీ దిగ్గజాలైన కంపెనీలు అగ్రశ్రేణి కంటెంట్‌ ని ఉత్పత్తి చేయడంలో, కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచడంలో భారీగా పెట్టుబడులు పెట్టడం ద్వారా ఎక్కువ మార్కెట్ వాటా కోసం తీవ్రంగా పోటీ పడుతున్న వేళ-టాలీవుడ్ లో అగ్రశ్రేణి కంటెంట్ అన్న మాటే మరచి, ప్రేక్షకుల్ని పెంచుకోవడం గురించి, అట్టర్ ఫ్లాపు సినిమాలతో థియేటర్లు మూతబడకుండా చూడడం గురించీ, ఎలాటి సర్వేలూ అధ్యయనాలూ బాదరాబందీ లేకుండా, కాలం వెళ్ళబుచ్చగలననుకోవడం తీవ్ర పొరపాటే అవుతుంది.

మాస్టర్ క్రియేటర్లు

అహింస అనే ఫ్లాప్ సినిమా తీసిన దర్శకుడు తేజతో తను నటిస్తున్న సినిమాకి బాలీవుడ్ రచయితల సహకారం తీసుకోవాలని రానా నిర్ణయం తీసుకునే పరిస్థితి ఇందుకే వచ్చింది. తెలంగాణా సినిమా అంటూ తెలంగాణా దర్శకులు తీస్తున్న సినిమాలు తెలంగాణానే  వెక్కిరిస్తున్నాయి. మెయిన్ స్ట్రీమ్ తెలుగు సినిమాలు వదిలించుకున్న యూత్ సినిమాల ఫార్ములాల్నే తిరిగి తెలంగాణా సినిమాల్లోకి దించేసి సంబరపడే పరిస్థితి.

ఈ పరిస్థితుల మధ్య 
కామన్ సెన్స్  స్క్రిప్టు తయారీపై దృష్టి పెట్టి తీవ్ర కృషి చేయకపోతే, స్క్రిప్టుల సామర్ధ్యానికి కొత్త మార్గాలు అన్వేషించకపోతే, తెలుగు రాష్ట్రాల్లో కూడా థియేటర్లు మూతబడే కాలం ఎంతో దూరంలో లేదు. స్క్రిప్టు ఆరోగ్యం = థియేటర్ల ఆరోగ్యం. అయితే  ఎంత త్రీ యాక్ట్స్ స్ట్రక్చర్లో పద్ధతిగా కథ చేసినా దానికి ఈ రోజుల్లో గ్యారంటీ లేదనేది కూడా వాస్తవం.

ప్లాట్ పాయింట్ వన్ వరకూ ఫస్ట్ యాక్ట్, ఆ ఫస్ట్ యాక్ట్ లో  లొడబిడ మంటూ కొన్ని పాత్రలూ, రణగొణ ధ్వనులు చేస్తూ కొంత కామెడీ, ఓ రెండు పాటలూ అయ్యాక,  అప్పుడు ప్లాట్ పాయింట్ ఘట్టం వేసి, ఎదుటి పాత్రతో సంఘర్షణ ప్రారంభిస్తూ హీరోకో గోల్ పెట్టి, సెకండ్ యాక్ట్ ప్రారంభించడమూ; సెకండ్ యాక్ట్ లో హీరోకి ఎదుటి పాత్రతో గోల్ తాలూకు సంఘర్షణ సాగదీసి సాగదీసి, ప్లాట్ పాయింట్ టూ తో సెకండ్ యాక్ట్ ని ముగించడం; ఆ ప్లాట్ పాయింట్ టూ దగ్గర్నుంచీ క్లయిమాక్స్ తంతుతో థర్డ్ యాక్ట్ ముగించి, హీరో గోల్ సక్సెస్ చేయడమూ- వంటి ఒకే పోతలో పోసిన ఒకే సాంప్రదాయ నమూనా కథలు ఇంకెన్నాళ్ళూ వర్కౌట్ కావని గుర్తించాలి.


త్రీయాక్ట్స్ స్ట్రక్చర్ అంటే ఓ మూడు అరలు పెట్టుకుని, ఏ అరకి సంబందించిన సీన్లు ఆ అరలో వడియాల పిండి పడేసినట్టు పడేస్తూ చేతులు దులుపుకోవడం ఇకపైన చెల్లక పోవచ్చు. ప్రేక్షకులు అరచేతిలో రకరకాల గ్లోబల్ సినిమాలు చూస్తున్నారు. చూడడమే కాదు, వాటిని సోషల్ మీడియాలో విశ్లేషిస్తున్నారు. వాళ్ళకిప్పుడు ఏదో మేత పడేసే పరిస్థితుల్లేవు, తాము వెచ్చిస్తున్న సమయానికి తగిన మేధ పడేసే చేతులు కావాలి. క్రియేటివిటీ అంటే వున్న త్రీయాక్ట్స్ స్ట్రక్చర్లో సీన్ల ఓపెనింగులు, రన్నింగులు, ముగింపులులో తేడా గల రాత, తీత చూపించడం ఇంకెంత మాత్రం కాదు. ఇప్పుడు క్రియేటివిటీ అంటే అసలు త్రీయాక్ట్స్ స్ట్రక్చర్ తోనే క్రియేటివిటీకి పాల్పడడం. స్ట్రక్చర్లో సవరణలు తీసుకు రావడం. కాబట్టి ముందసలు ఎవరి క్రియేటివిటీ యేంటో స్ట్రక్చర్ తో చేసి చూపించగలిగితే అప్పుడు వాళ్ళని మాస్టర్ క్రియేటర్లుగా ఒప్పుకోవచ్చు.

యూట్యూబ్ షార్ట్స్

ఫస్ట్ యాక్ట్ ని అరగంట పరిమితికి మించి ఇంటర్వెల్ వరకూ సాగదీయాల్సి వస్తే- థియేటర్లు మూతబడకుండా కాపాడే 12 స్క్రీన్ ప్లే టిప్స్ గురించి ఆర్టికల్ 1312 లో తెలుసుకున్నాం. అంతదాకా ఎందుకు, అసలు 30 నిమిషాల పరిమితి తీసుకోవడం కూడా సోషల్ మీడియాల కాలంలో, యూట్యూబ్ షార్ట్స్ కి నవతరం అలవాటు పడిన కొత్త సన్నివేశంలో- ఫస్ట్ యాక్ట్ నే సెల్యూలాయిడ్ షార్ట్స్ గా ఎందుకు మార్చేయ కూడదు? సెల్యూలాయిడ్ వచ్చేసి సృజనాత్మకంగా సోషల్ మీడియాతో యుద్ధానికి దిగకపోతే ఇక సెల్ ఫోన్లే మిగిలి, థియేటర్లు మూతబడతాయి.

స్టార్లు థియేటర్లని నిలబెడతారనేది ఒట్టి మాట. ప్రేక్షకులు థియేటర్లకి రావాలంటే మామూలు హీరోల సినిమాలు సరిపోవడం లేదు. ఓ మోస్తరు స్టార్ సినిమాలు కూడా చాలడం లేదు. బిగ్ స్టార్ సినిమాలుంటేనే ప్రేక్షకులు థియేటర్లకి కదులుతున్నారు. చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి’, నాని నటించిన దసరా’- ఈ మూడు సినిమాలకే ఈ ఆరునెలల్లో ప్రేక్షకులు పోటెత్తారు. ఇవ్వాళ ప్రభాస్ తో ఆదిపురుష్ కలుపుకుంటే నాలుగు.

ఇక ఎంతో బావుందని టాక్ వస్తేనే చిన్న హీరోల సినిమాలకి వస్తున్నారు. సాయిధరం తేజ్ విరూపాక్ష’, సుహాస్ రైటర్ పద్మభూషణ్’, ప్రియదర్శి బలగంసినిమాలకి అలా థియేటర్లు నిండాయి. కానీ గోపీచంద్, అల్లరి నరేష్, నాగశౌర్య, విశ్వక్ సేన్, సంతోష్ శోభన్, కిరణ్ అబ్బవరం తదితర  హీరోల కొత్త సినిమాలకైతే జనమే లేరు. ఇలాటి సినిమాలే ఎక్కువున్నాయి. దీంతో గరిష్ట కాలం థియేటర్లు బోసి పోయి వుంటున్నాయి. ఇక థియేటర్ల లోపల పార్కింగులు, పాన్ షాపులు, తినుబండారాల స్టాల్సు మనుగడ సంగతి చెప్పక్కర్లేదు.

దేశం మొత్తం మీద ఏప్రెల్‌లో థియేటర్లలో ఆక్యుపెన్సీ కేవలం 16-19 శాతం వుందని, జూన్‌లో దాదాపు 20-25 శాతం మధ్య వుండొచ్చనీ విశ్లేషకులు భావిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా థియేటర్ల పరిస్థితి ఇలాగే వుంది కానీ మీడియాలో వార్తలు రావడం లేదు. థియేటర్ల పరిస్థితి బాగు పడాలంటే, ఎక్కువ సంఖ్యలో విడుదలై థియేటర్లకి ఫీడింగ్ నిస్తున్న చిన్న హీరోల సినిమాల క్వాలిటీ పెరగాల్సిందే.

ఎలా పెరుగుతుంది? ముందు కాగితం మీద పెరగాలి. అంటే హై క్వాలిటీ పాలీక్రోమ్ కొరియన్ పేపర్లు కొనుక్కుని వాటి మీద గుండ్రటి అక్షరాలు తీర్చి దిద్ది రాయడం కాదు. పైన 30 నిమిషాల ఫస్ట్ యాక్ట్ లోనే యూట్యూబ్ షార్ట్స్ లాగా ఎందుకు క్రియేట్ చేయకూడదనుకున్నాం. అంటే ప్రేక్షకులు కథ ప్రారంభమవడానికి అరగంట వరకూ కూడా ఓపిక పట్టకుండా, ఆ అరగంటలో ఇంకో బిజినెస్ ప్రారంభించి దృష్టి మరల్చడం. అంటే కథ ప్రారంభించడానికి ముందు ఇంకో కథని ఫస్ట్ యాక్ట్ లోనే సర్దడం. అలా అరగంట ఫస్ట్ యాక్ట్ ని కూడా విషయం తో టైట్ గా వుంచడం. ఇదెలా?

మినీ కాన్ఫ్లిక్ట్

జాగ్రత్తగా గమనిస్తే త్రీయాక్ట్స్ స్ట్రక్చర్ ఫస్ట్ యాక్ట్ లో హీరో పాసివ్ గానే వుంటాడు. తర్వాత సెకండ్ యాక్ట్, థర్డ్ యాక్టులలో యాక్షన్లో వుండే సరికి హీరో యాక్టివ్ క్యారక్టర్ గా వున్నాడని తృప్తి పడతాం. దీన్నే మొత్తం సినిమాకీ వర్తింపజేసి, ఈ సినిమాలో హీరో యాక్టివ్ క్యారక్టరనేసి సర్టిఫికేట్ ఇచ్చేస్తాం. కానీ అతను ఫస్ట్ యాక్ట్ లో పాసివ్ గానే వుంటాడు. కథేమిటో తెలియకపోతే యాక్టివ్ గా ఎలా మారగలడు? ప్లాట్ పాయింట్ వన్ దగ్గర మాత్రమే కాన్ఫ్లిక్ట్ తో కథేమిటో తెలిసి ఆ కథలో పుట్టిన సమస్యని సాధించడానికి ఒక గోల్ ని ఏర్పర్చుకుని సంఘర్షణ ప్రారంభిస్తాడు.  ఈ కాన్ఫ్లిక్ట్ తో  యాక్టివ్ క్యారక్టర్ గా మారతాడు.

ఫస్ట్ యాక్ట్ బిజినెస్ అయిన కథా నేపత్యథ్యపు ర్పాటు, పాత్రల పరిచయం, సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన, సమస్య ఏర్పాటు ( కాన్ఫ్లిక్ట్- ప్లాట్ పాయింట్ వన్) ఇదంతా ప్రారంభం కాబోయే కథకి ఉపోద్ఘాతమే కాబట్టి హీరో పాసివ్ గా లేదా న్యూట్రల్ గా వుంటాడు. ఈ ఉపోద్ఘాతం ఎంత నిడివి పెరిగితే అంతసేపు న్యూట్రల్ గానే వుంటాడు ఏమీ చేయకుండా. మనం ఫస్ట్ యాక్ట్ అరగంట నిడివి గురించే మాట్లాడుకుందాం. ఈ అరగంట నిడివి కూడా హీరో న్యూట్రల్ గా వుంటూ బోరు కొట్టించకుండా వుండాలంటే, లేదా ప్రేక్షకుల సమయం తినేయకుండా వుండాలంటే ఏం చేయాలి? 

మినీ కాన్ఫ్లిక్ట్ ని సృష్టించాలి. ప్లాట్ పాయింట్ వన్ తో వచ్చే కాన్ఫ్లిక్ట్ కంటే ముందు మినీ కాన్ఫ్లిక్ట్ ని సృష్టిస్తే హీరో ఫస్ట్ యాక్ట్ అంతా పాసివ్ కాకుండా, న్యూట్రల్ గాకుండా యాక్టివ్ గా వుంటాడు. ప్లాట్ పాయింట్ వన్ మెయిన్ కాన్ఫ్లిక్ట్ తో ఇంకా బలమైన యాక్టివ్ క్యారక్టర్ గా మారతాడు. ఇలా సినిమా మొత్తం అన్ని యాక్ట్స్ లో హీరో యాక్టివ్ గా ఆకట్టుకుంటాడు.

మినీ కాన్ఫ్లిక్ట్ ఎలా? ఫస్ట్ యాక్ట్ లో మినీ కాన్ఫ్లిక్ట్ లో కూడా హీరోకి సాధించాల్సిన సమస్య వుంటుంది, గోల్ వుంటుంది, ఆటంకాలుంటాయు, సంఘర్షణా వుంటుంది. మినీ కాన్ఫ్లిక్ట్ ప్రధాన కథకి సంబంధించి వుండొచ్చు, వుండకపోవచ్చు. కానీ ప్రేక్షకులకి సినిమా ప్రారంభమైన వెంటనే ఎంగేజ్ చేసినట్టు వుంటుంది.

ఉదాహరణకి- యశోద లోలాంటి హాస్పిటల్ వుందనుకుందాం. అక్కడ విలన్ డాక్టర్లు రోగుల మీద ఏవో ప్రమాదకర ప్రయోగాలు చేస్తున్నారనుకుందాం. ఈ రోగుల్ని కాపా  డాలంటే హీరో డాక్టర్ల కుట్ర రట్టు చేయాలి. అంటే ఆ హీరో ఆ హాస్పిటల్లో జాబ్ చేస్తూండాలి. ఇదంతా రెగ్యులర్ గా వుండే ఫస్ట్ యాక్ట్. ఇలా అరగంటకి హీరో కుట్ర రట్టు చేసి ప్లాట్ పాయింట్ వన్ ని సృష్టిస్తాడు. ఈ అరగంట సేపూ న్యూట్రల్ గానే వుంటాడు.

ఇలాకాకుండా, హీరో వేరే చోట వేరే పని చేసుకుంటూ వుంటాడనుకుందాం. అప్పుడు మదర్ కి గుండె నొప్పి వస్తుంది. తీసుకుని హాస్పిటల్ కి పరిగెడతాడు. హాస్పిటల్లో ట్రీట్ మెంట్ ఇప్పించి వచ్చి పోతూ వుంటాడు. మదర్ కి సీరియస్ గానే వుంటుంది. వుంటుందా, పోతుందా అన్న సస్పెన్స్, సంఘర్షణ, బతికించుకోవాలన్న గోల్ హీరోకి వుంతాయి. ఇలా ప్రారంభం నుంచే సినిమా ఆసక్తిని పెంచుతుంది.

ఈ ఫస్ట్ యాక్ట్ మొదటి అరగంట ఏదో ఒక సమయంలో, మెయిన్ కాన్ఫ్లిక్ట్ కి సంబంధించిన క్లూలు వేసుకుంటూ పోవచ్చు. అక్కడి రోగులతో డాక్టర్ల వ్యవహారం హీరోకి అనుమానాలు రేకెత్తించ వచ్చు. ఇంతలో మదర్ కి విజయవంతంగా సర్జరీ పూర్తవుతుంది. తీసుకుని బయల్దేరుతూంటే, అకస్మాత్తుగా రోగుల కుటుంబాల ఏడ్పులు వినిపిస్తాయి. ఏమిటా అని చూస్తే, హాస్పిటల్లో జరుగుతున్న మరణాలు మీడియాకి  అందితే మన ఉద్యోగాలు గల్లంతంటూ నర్సుల మాటలు విన్పిస్తాయి. అంతే, హీరో మదర్ ని వదిలేసి పూర్తయిన మినీ కాన్ఫ్లిక్ట్ లోంచి మెయిన్ కాన్ఫ్లిక్ట్ లోకి ఒక్క దూకు దూకి, దుష్ట డాక్టర్ల పీకలు పుచ్చుకుంటాడు. ఫస్ట్ యాక్ట్ పూర్తయి హీరోకి అసలు సమస్యతో సంఘర్షణగా కథ ప్రారంభమై పోతుంది. ఈ మోడల్ ని ఏ జానర్ కథకైనా దానికి సంబంధించిన మినీ కాన్ఫ్లిక్ట్ ని  మెయిన్ కాన్ఫ్లిక్ట్ తో నుసంధానించ వచ్చు. ప్రయత్నించి చూడండి, ప్రయోజనం మీకే తెలుస్తుంది కథకి ముందు కథతో.

—సికిందర్ 

 


Monday, June 19, 2023

    జెండాకి మనోభావా లుండవు
కాశ్మీరు కేరళ అబద్ధపు సినిమాలకి వాళ్ళ  మనోభావాలు గాయపడ్డాయి
ఆదిపురుష్ అక్రమాలకి వీళ్ళ మనోభావాలు గాయపడ్డాయి
సౌత్ లో ఏమోగానీ నార్త్ లో భరించలేకపోతున్నారు
నా మతం
, నీ మతం- నా కులం, నీ కులం అని వుండదెక్కడా
సీతమ్మని గొంతుకోసి చంపినట్టు చూపిస్తే అందరి మనోభావాలూ గాయపడతాయి
బూటకపు లవ్ జిహాద్ లాభాల కోసం గడ్డం సాయెబు రావణాసురుడొచ్చాడు
వాడు వెల్డింగ్ చేస్తాడు. పంక్చర్లు వేస్తున్నట్టు చూపిస్తే ఇంకా బాగా అర్ధమయ్యేదిగా
ఎజెండాకి మతం లేదు
, పురాణాల్ని కూడా వదలరు
అప్పుడు వాళ్ళ మనోభావాలు గాయపడితే ఆనందించారు
ఇప్పుడు తమ వంతు వస్తే మౌనం వహించారు
ఫాస్టర్ నీమెల్లర్ కవిత్వపు జాడలేనా ఇవీ...
ఇస్లామోఫోబియాకి ఇక ఓట్లు పడవని వాళ్ళ సర్వేలే చెప్తూంటే
ఇంకా ఎజెండా పూనకాలేమిటి!
హిట్లర్ హిట్లర్ అవడానికి ఇలాటి సినిమాలేగా తీయించాడు

—సికిందర్

 (పదేళ్ళ బ్లాగు చరిత్రలో ఏ పోస్టుకీ రానన్ని వ్యూస్ (4500) పై పోస్టుకి రెండు గంటల్లో రావడం రికార్డు. దేశ విదేశ పాఠకులకి ధన్యవాదాలు. విషయంపై ఇంత వేదనతో స్పందించినందుకు. ఫేస్బుక్ పోస్టుకి 12 వ్యూసే వచ్చాయి షరా మామూలుగా. మొదట్నుంచీ ఫేస్బుక్ మన ప్రాంగణం కాదు, ధన్యవాదాలు)

Friday, June 16, 2023

1346 : రివ్యూ!

దర్శకత్వం : ఓం రౌత్ 
తారాగణం : ప్రభాస్, కృతీ సానన్, సైఫ్ అలీ ఖాన్, సన్నీ సింగ్, దేవదత్తా నాగే తదితరులు కథ : వాల్మీకి రామాయణం, రచన : ఓం రౌత్, మనోజ్ ముంతషీర్; సంగీతం -పాటలు : అజయ్-అతుల్, సచేత్ -పరంపర; నేపథ్య సంగీతం : సంచిత్ బల్హారా,అంకిత్ బల్హారా; ఛాయాగ్రహణం : కార్తీక్ పళని, కళా దర్శకత్వం : సాగర్ మాలీ, పోరాటాలు : రమజాన్ బులూత్, ప్రద్యుమ్న కుమార్ స్వైన్

బ్యానర్స్ : టీ -సిరీస్ ఫిల్మ్స్ , యూవీ క్రియేషన్స్
నిర్మాతలు : భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, ఓంరౌత్
విడుదల : 16 జూన్ 2023
 ***
      బాహుబలి పానిండియా ఘన విజయం తర్వాత, సాహో’, రాధేశ్యామ్ అనే రెండు పానిండియాలూ పరాజయాల పాలయ్యాక, రెబల్ స్టార్ ప్రభాస్ ఆదిపురుష్ పౌరాణికంతో రామాయణం నటిస్తూ, ఓ పెద్ద సినిమా కోసం కళ్ళు కాయలు జేసుకున్న అఖిల భారత  ప్రేక్షకుల ముందు కొచ్చాడు. మిగతా ప్రపంచ ప్రేక్షకుల ముందుకూ వచ్చాడు. తన్హాజీ దర్శకుడు ఓంరౌత్ రామాయణం మీద ఒక జపాన్ యానిమేషన్ నుంచి స్ఫూర్తి పొంది భారీ బడ్జెట్ తో రూపొందించిన ఆదిపురుష్ టైటిల్ కి తన భాష్యం చెప్పాడు : ఆదిపురుష్ ని తొలి పురుషుడనే అర్ధంలో తీసుకో కూడదనీ, ఉత్తమ పురుషుడుగా చూడాలనీ స్పష్టం చేశాడు. మరి ఉత్తమ పురుషుడుగా రాముడిని ఎంత ఉత్తమంగా దృశ్యమానం చేశాడు? ఉత్తమ పురుషుడి లక్షణాలు రాముడిలో ఏమైనా హైలైట్ అయ్యాయా? తన విజన్ ఏమిటి? దాని ఒరిజినాలిటీ ఏమిటి? ఇవి తెలుసుకుందాం...

కథ

రాఘవుడు (ప్రభాస్), జానకి (కృతీ సానన్), లక్ష్మణుడు (సన్నీ సింగ్) ల వనవాసంతో కథ మొదలవుతుంది. దీనికి ముందు దశరధుడితో కైకేయి కోరిక, ఆ కోరిక మేరకు రాజ్యాన్ని భరతుడికి అప్పగించి రాఘవ నిష్క్రమించే నేపథ్యం యానిమేషన్లో క్లుప్తంగా వస్తుంది. ఇలా ముగ్గురూ వనవాసంలో వుండగా, లంకేష్ (సైఫలీ ఖాన్) తనకి మరణం లేకుండా బ్రహ్మ నుంచి వరాలు పొందుతాడు. ఇదిలా వుండగా, అటుగా పోతున్న శూర్ఫణఖ రాఘవని చూసి మోజు పడుతుంది. తను వివాహితుడ్నని చెప్తాడు రాఘవ. శూర్పణఖ లంక కెళ్ళిపోయి రాఘవతో తన కోరిక గురించి అన్న లంకేష్ కి చెప్తుంది. జానకి అందచందాల గురించి కూడా వర్ణించి చెప్పడంతో, లంకేష్ లో దుష్టత్వం మేల్కొంటుంది. మాయలేడిని ప్రయోగించి, సాధువు వేషంలో వచ్చి జానకిని అపహరించుకు పోతాడు.  
   
దీంతో ఖిన్నుడైన రాఘవుడేం చేశాడు
? జానకీ విముక్తి కోసం అతను అనుసరించిన మార్గాలేమిటి? ఆ ప్రయత్నంలో సుగ్రీవుడు, హనుమంతుడు తదితర వానర సైన్యం ఎలా తోడ్పడ్డారు? మరణం లేకుండా బ్రహ్మ నుంచి వరాలు పొందిన లంకేష్ ఎలా రాఘవుడి చేతిలో అంతమయ్యాడు? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

అందరికీ తెలిసిన కథే. కాకపోతే నవతరం ప్రేక్షకుల్ని దృష్టిలో పెట్టుకుని ధారాళంగా సృజనాత్మక స్వేచ్ఛకి పాల్పడ్డాడు దర్శకుడు. ముఖ్యంగా వనవాసం, మాయలేడి, జానకీ అపహరణం, వాలి -సుగ్రీవ సంగ్రామం, హనుమంతుడి సాయం, రామ సేతు నిర్మాణం, సంజీవనీ పర్వతం, లంకేష్ తో యుద్ధం- ఇలా ఓ పది ప్రధాన ఘట్టాల్ని తీసుకుని తేలికగా అర్ధమయ్యేట్టు రామాయణం చెప్పుకెళ్ళాడు. భారతం కంటే రామాయణం తేలికైనదే. తెలుగులో బాపు- రమణలు తీసిన సంపూర్ణ రామాయణం చూస్తే ఇక రామాయణ గ్రంథాలు చదవనవసరం లేదు.
   
ఐతే దర్శకుడు ఓం రౌత్ 1990ల నాటి జపనీస్ యానిమేషన్ రామాయణం చూసిన ప్రేరణతో ఆధునిక టెక్నాలజీ రామాయణం తీయాలనుకున్నాడు. ఇలా తీస్తున్నప్పుడు ఇందులో ఆధునిక టెక్నాలజీ ఎక్కువైపోయి రామాయణ భక్తి భావం తగ్గింది. తగ్గడం కాదు
, పూర్తిగా తుడిచి పెట్టుకు పోయింది.
   
అసలు పేర్ల మార్పు దగ్గరే మాస్ అప్పీల్ గాలిలో కలిసింది. రాఘవ
, జానకి పేర్లు సినిమాటిక్ గా వాడకంలో ఎప్పుడూ లేవు. రాముడు, సీత అంటేనే ప్రేక్షకుల ప్రాణాలు లేచొస్తాయి. సినిమాలో పాత్రలు ఈ పేర్లు పలుకుతూంటే వుండే వైబ్రేషన్స్, రెస్పాన్స్ రాఘవ, జానకిలతో వుండవు. సీత పేరు కూడా కలిపి జై సియారాం అనే పిలుపుని రాజకీయాల కోసం జై శ్రీరాంగా మార్చేసి పాపులర్ చేసినప్పుడు -ఎందుకో దర్శకుడు రాముడు పేరు వినపడకుండా చేశాడు.
   
అయితే సైఫలీఖాన్ రావణ పాత్రతో ఎజెండాని టచ్ చేశాడు. వూహాజనిత లవ్ జిహాద్ నింద ప్రతిఫలించేందుకు
, రావణుడి పాత్రలో సైఫలీ ఖాన్ అనే సాయెబుని తీసుకుని, ముస్లిం రాజు గెటప్ ఇచ్చి- పద్మావత్ లో అల్లావుద్దీన్ ఖిల్జీని సంజయ్ లీలా భన్సాలీ చూపించినంత కిరాతకుడిగా (ఖిల్జీ కిరాతకుడు కాదనేది వేరే సంగతి) చూపించి ఎజెండాని చాటాడు. పవిత్ర పురాణాలని కూడా రాజకీయాలకి ఉపయోగించుకోక తప్పదేమో. ఇక ఈ పాత్రకి కూడా రావణుడు అంటే వుండే గాంభీర్యాన్ని, మాస్ అప్పీల్ నీ  లంకేష్ అనే పేరుతో తగ్గించేశాడు.
    
ఎంత టెక్నాలజీని జోడించినా పురాణం భక్తి పారవశ్యం కలిగించకపోతే అది విఫలమైనట్టే. నవతరంలో కూడా మత స్పృహ, దైవ భక్తి పెరిగిపోయిన ఈ రోజుల్లో కేవలం టెక్నికల్ హంగామా చేసి డ్రైగా రామాయణం తీసి హిట్ కొడతామనుకుంటే పొరపాటే. దీనికంటే వంద రెట్లు ఎక్కువ (కృష్ణ) భక్తితో నార్త్ లో కూడా సూపర్ హిట్టయ్యింది నిఖిల్ నటించిన కార్తికేయ2 అనే తెలుగు స్పిరిచ్యువల్ థ్రిల్లర్. రౌత్ సినిమాలో రాఘవ ప్రేక్షకుల చేత జై శ్రీరామ్ అన్పించుకోనట్టే, హనుమంతుడు కూడా జై బజరంగ్ బలీ అన్పించుకోలేదు. ఇక మనం జానకిని చూసి- మము బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లీ - అని వేడుకోవాల్సిందే దోసిట్లో కాస్తంత భక్తి రస ధార కోసం.
    
ప్రపంచ పురాణాల్ని పరిశోధించి సినిమాల కోసం ఇంత లావు పుస్తకం రాసిన జోసెఫ్ క్యాంప్ బెల్- అసలు పురాణ పురుషుడి పాత్ర ప్రయాణం అదొక స్పిరిచ్యువల్ జర్నీ అంటాడు. ఈ స్పిరిచ్యువల్ జర్నీలో 12 మజిలీలుంటాయి. రామాయణంలో కూడా ఈ 12 మజిలీలుంటాయి. ఒక్కో మజిలీ ఒక్కో అధ్యాత్మిక లక్ష్యాన్ని సాధిస్తూ సాగుతుంది. చివరి మజిలీ మోక్షం పొందడం. అప్పుడే కథ పాఠకులతో/ప్రేక్షకులతో స్పిరిచ్యువల్ గా కనెక్ట్ అయి ఎనలేని భక్తి పారవశ్యాలకి లోనుజేస్తుంది.
   
ఈ పుస్తకం ముందు పెట్టుకునే జార్జి లూకాస్
స్టార్ వార్స్ అనే సైన్స్ ఫిక్షన్ హిట్ సినిమాలు తీస్తూ పోయాడు. హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమాలు ఉత్త టెక్నాలజీ హంగామా సినిమాలు కావు- టెక్నాలజీ మాటున కథా కథనాలు, పాత్ర చిత్రణలూ ప్రేక్షకుల ఆత్మిక దాహాన్ని తీర్చే స్పిరిచ్యువల్ జర్నీలుగా వుంటాయి.
   
ఇవేవీ లేకుండా రామాయణంలో పది ఘట్టాలు తీసుకుని
, టెక్నికల్ హంగామా చేస్తే నవతరం పానిండియా అయిపోతుందా అనేది ఆలోచించాల్సిన విషయం.

నటనలు- సాంకేతికాలు

ప్రభాస్ కిలాటిది మళ్ళీ రాని అవకాశం. ఈ అవకాశంతో క్షత్రియ పాత్రకి తన నటనతో కొత్త అధ్యాయం రాసుకోవడానికి చాలా కృషి చేశాడు. డైలాగ్ డెలివరీలో చాలా శ్రద్ధ తీసుకున్నాడు. అయితే తను కన్పిస్తే ఎక్కడా ప్రేక్షకులు ఈలలు వేయకపోవడం గమనించాల్సిన విషయం. అదే హనుమంతుడు కన్పిస్తూంటే ఈలలతో హోరెత్తించారు. అంటే బజరంగ్ బలీకి రాముడి కంటే పాపులారిటీ పెరిగినట్టా?
        
రాఘవ కాక రాముడుగా ఫీలైవుంటే ప్రభాస్ ఇంకా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చేవాడేమో. కానీ పాత్ర చిత్రణలోనే మర్యాద పురుషోత్తముడి ఏ లక్షణాన్ని మెయింటెయిన్ చేయాలో దర్శకుడికి స్పష్టత లేదు. సాత్వికంగా చూపిస్తూనే రౌద్రంగా చూపిస్తాడు. రాముడు రౌద్రంగా వుంటాడా? అతను స్థితప్రజ్ఞుడు, ఉదాత్తంగా వుంటాడు ఏ పరిస్థితుల్లో నైనా. శత్రువుతో చలించకుండా ఉదాత్త చిత్తంతో బాణాలేస్తూంటే వచ్చే దైవత్వం, మసాలా హీరోలాగా మారిపోతే వస్తుందా? ఆద్యంతం ఒకే ఉదాత్త గుణంతో నడుచుకుని వుంటే ప్రభాస్ పాత్రని పూజనీయం చేసేవాడు.
       
ఇంకోటేమిటంటే
, పక్క పాత్రలు పూజిస్తే, భక్తి భావంతో పాడితే ప్రభాస్ రాముడి పాత్ర ప్రేక్షకుల మెదళ్ళలో బలంగా నాటుకుపోయే అవకాశముంటుంది. సంపూర్ణ రామాయణం లో రా
మయ తండ్రీ! ఓ రామయ తండ్రీ! అని బృందగానం చేస్తేనే కదా రాముడి పాత్ర పైకి లేచింది. ఆఖరికి అల్లూరి సీతారామ రాజు లో కూడా ఇలాటి కీర్తి గానాలే. 150 కోట్లు తీసుకుంటున్న స్టార్ ని చూపిస్తూ పైకి లేపకపోతే ఎలా? ఇది లేక  పోవడంతో హనుమంతుడ్ని పైకి లేపాల్సి వచ్చింది ప్రేక్షకులు.
       
పాత్ర చిత్రణ ఎలా వున్నా
, పోరాటాల్లో ప్రభాస్ శభాష్ అన్పించుకున్నాడు దర్శకుడు టార్గెట్ చేసిన నవతరం ప్రేక్షకులతో. ఇక జానకిగా కంటే సీతగా వుండుంటే కీర్తీ సానన్ ప్రేక్షకులకి ఇంకా దగ్గరయ్యేది. సాధ్యమైనంత సౌకుమార్యంగా, సున్నితంగా కన్పిస్తూ గౌరవం పొందే ప్రయత్నం చేసింది గానీ, లంకలో శోక రసమనేది తగిన పాళ్ళలో పాత్రకే లేకుండా పోయింది. హనుమంతుడి పాత్రలో దేవదత్తా నాగే భంగిమల్లో రాముడిపట్ల వుండే అణకువ, మెలో డ్రామా లేక పాత్ర నిలబడలేదు. రాముడితో హనుమంతుడి కుండే బాండింగ్ అదొక ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు. ఇలాటి ఎమోషనల్ కనెక్ట్ కూడా కట్ అయింది నవతరం పౌరాణికంలో.
       
ఇక లంకాదహనం దృశ్యంలో చేసే అల్లరిని కూడా కట్ చేశాడు దర్శకుడు. అశోక వనంలో జానకిని తల్లిలా ఫీలవడం కూడా చేయకుండా తోక కత్తిరించాడు దర్శకుడు. ఫీల్
, మెలో డ్రామా, భావోద్వేగాలు, సెంటిమెంట్లు వంటి మానవ సహజ లక్షణాలకి వీలైనంత దూరంగా వుంచాడు ఆదిపురుష్ ని. లక్ష్మణుడ్ని శేషు అని పిలిచాడు దర్శకుడు. ఇలా పాత్రల పాపులరైన పేర్లు పక్కన పెట్టేయడం ఏదో కొత్తదనమనుకున్నాడు. శేషుగా సన్నీ సింగ్ సరిగా రిజిస్టర్ కాడు సినిమాలో.
       
ఇక లంకేష్ గా (ఏ లంకేష్
, గౌరీ లంకేషా?) సైఫలీ ఖాన్ అతి క్రూరత్వం హైలైట్. చివరికి జానకితో లవ్ జిహాద్ కుదరక రాఘవ బ్రహ్మాస్త్రానికి మట్టికరిచే సన్నివేశంలో కూడా ఓకే. రావణుడి గా అతను పాడే శివోహం వీణ పాటలో జీవించాడు ఎమోషనల్ గా.
       
సినిమాలో భక్తిని రగిలించే ఒక పాటే వుంది బ్యాక్ గ్రౌండ్ సాంగ్ - రాం సీతా రాం (హిందీలో- రాం సియా రాం)
. రాఘవ - జానకిలతో వచ్చే రెండు పాటలు పూర్తిగా లేవు. పాటల పరంగా, నేపథ్య సంగీత పరంగా ఫర్వాలేదన్పించుకుంటుంది.  
        ఛాయాగ్రహణం, గ్రాఫిక్స్, వీఎఫెక్స్, కాస్ట్యూమ్స్, సెట్స్ మొదలైన సాంకేతికాలు అద్భుతమే. టెక్నికల్ గా ఉన్నత ప్రమాణాలే. పోరాటాలూ ఉన్నతమే. ఎంతకీ ముగియని క్లయిమాక్స్ పోరాటాన్ని ఎడిటర్ తగ్గించాల్సింది. ఓం రౌత్ దర్శకత్వం గ్రాఫిక్స్ తోనే ఎక్కువుంది.

చివరికేమిటి

నీటుగా ప్రారంభమై ఫస్టాఫ్ అంతా స్క్రీన్ ప్లే పరంగా సజావుగా సాగుతుంది. జానకీ అపహరణంతో  ప్రధాన మలుపుని ఇంటర్వెల్ దాకా తీసికెళ్ళకుండా 40 వ నిమిషంలో సరిపెట్టి కథలో కొచ్చేస్తాడు. ఇంటర్వెల్లో లంకకి వారధి పూర్తయ్యే దృశ్యంతో కొనసాగి, సెకండాఫ్ లో క్రమంగా లంకలో రాఘవ వానర సైన్యంలో లంకేష్ తో తలపడే ఘట్టాని కొస్తాడు. సినిమా నిడివి మూడు గంటలున్నా, ఓ పది ఘట్టాలతో తక్కువ టాకీ సీన్లు, ఎక్కువ యాక్షన్ సీన్లుగా వుండే ఈ స్క్రీన్ ప్లే కథనంలో, పాత్ర చిత్రణల్లో ఏమాత్రం జీవం లేకపోవడం ప్రత్యేకత. ఈ రామాయణాన్ని కథా పరంగా ఫీలయ్యే మాటే వుండదు.
       
ఈ పౌరాణికం ఎలా వుంటుందంటే
, రోమన్ సామ్రాజ్యంపై వచ్చిన హాలీవుడ్ సినిమాలకి రామాయణాన్ని అతికించినట్టు వుంటుంది. లేదా గ్లాడియేటర్, ఎక్సడస్, 300, ట్రాయ్ వంటి హాలీవుడ్ హిస్టారికల్స్ లో వుండే అవే పాత్రలు, వాటి ఆహార్యాలు, భవనాలు, లొకేషన్స్, లేజర్ ఆయుధాలు, వికృత సముద్ర జీవులు, వాయు జీవులు, రాక్షసులు, యుద్ధాలు మొదలైనవి కాపీ చేసి ఓ ఇండియన్ సైన్స్ ఫిక్షన్ తీసినట్టు వుంటుంది. దృశ్యాలు కూడా కంటికింపుగా లేక, బ్యాక్ గ్రౌండ్ డార్క్ షేడ్స్ తో వుంటాయి ఇబ్బంది కల్గిస్తూ.  పురాణాలతో నవతరం ప్రేక్షకుల అభిరుచి ఇలా వుంటుందంటే వాళ్ళకో నమస్కారం పెట్టాల్సిందే. రామాయణ పాత్రలు ఇలాగే వుంటాయని కూడా నమ్మేస్తారేమో! ఫేక్ న్యూస్ సినిమాలు కూడా ఇస్తాయని చెప్పడం దర్శకుడు రౌత్ ఉద్దేశమేమో!
—సికిందర్

Tuesday, June 13, 2023

1345 : రివ్యూ!

 
దర్శకత్వం : అలీ అబ్బాస్ జాఫర్
తారాగణం : షాహిద్ కపూర్, రోణిత్ రాయ్, సంజయ్ కపూర్, డయానా పెంటీ తదితరులు రచన : ఆదిత్య బసు, సిద్ధార్థ్-గరిమ; ఛాయాగ్రహణం : మార్సిన్ లాస్కావిక్, సంగీతం- పాటలు : బాద్షా, అనుజ్ గర్గ్; నేపథ్య సంగీతం : జూలియస్ ప్యాకియం
బ్యానర్స్ : జియో స్టూడియోస్, AAZ ఫిల్మ్స్, ఆఫ్‌సైడ్ ఎంటర్‌టైన్‌మెంట్, Sradvn ప్రొడక్షన్
నిర్మాతలు : జ్యోతి దేశ్‌పాండే, సునీర్ ఖేతర్‌పాల్, గౌరవ్ బోస్, హిమాన్షు కిషన్ మెహ్రా, అలీ అబ్బాస్ జాఫర్, సుశీల్ చౌదరి
విడుదల : జూన్ 9, 2023
***

            జెర్సీ (తెలుగులో జెర్సీ’, 2019), కబీర్ సింగ్ (తెలుగులో అర్జున్ రెడ్డి’, 2021) లలో నటించిన బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్, యాక్షన్ థ్రిల్లర్ బ్లడీ డాడీ తో ప్రేక్షకుల ముందు కొచ్చాడు. పెద్ద తెర మీద కాకుండా దీన్ని జియో సినిమా ఓటీటీలో ఉచితంగా అందిస్తోంది. ఉచితం కాబట్టి ఖర్చు దండగన్నట్టు ఇతర భాషల్లో డబ్బింగ్ చేయకుండా, కేవలం హిందీలో అందించింది. దీనికి అలీ అబ్బాస్ జాఫర్ దర్శకుడు. సల్మాన్ ఖాన్ తో సుల్తాన్’, టైగర్ జిందా హై’, భారత్ వంటి హిట్స్ అందించిన జాఫర్, షాహిద్ కపూర్ తో ఈ థ్రిల్లర్ ఎలా తీశాడో తెలుసుకుందాం...

కథ

ఢిల్లీలో సుమైర్ ఆజాద్ (షాహిద్ కపూర్) నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారి.  ఓ తెల్లారి పొద్దున్నే తన అసిస్టెంట్ జగ్గీ(జీషాన్ ఖాద్రి) తో కలిసి ఢిల్లీలో డ్రగ్స్ దందాని విచ్ఛిన్నం చేసి, 50 కోట్ల డ్రగ్స్ వున్న బ్యాగుని పట్టుకుంటాడు. ఢిల్లీ సమీపంలోని గురుగ్రామ్ లో సికిందర్ చౌదరి (రోణిత్ రాయ్) ఎమరాల్డ్ అట్లాంటిస్ అనే సెవెన్ స్టార్ హోటల్ ని- ఆ హోటల్లో డ్రగ్స్  రాకెట్ నీ నడుపుతూంటాడు. సుమైర్ పట్టుకున్న డ్రగ్స్ సికిందర్ చౌదరికి చెందిందే. దీంతో అతను సుమైర్ కొడుకు అధర్వ్ (సర్తాజ్ కక్కర్) ని కిడ్నాప్ చేసి డ్రగ్స్ వున్న బ్యాగుని డిమాండ్ చేస్తాడు. సుమైర్ కి డాక్టర్ అయిన భార్య తో విడాకులై వుంటాయి. కొడుకు కిడ్నాప్ అయ్యేసరికి సుమైర్ డ్రగ్స్ ని సికిందర్ చౌదరికి ఇచ్చేయడానికి బయల్దేరతాడు.
       
హోటల్ కే వచ్చిన ఇంకో నార్కోటిక్స్ ఉద్యోగిని అదితీ రావత్ (డయానా పేంటీ) సుమైర్ డ్రగ్స్ బ్యాగుతో రావడాన్ని చూసిఆ బ్యాగుని కొట్టేసి పై అధికారి సమీర్ సింగ్ (రాజీవ్ ఖండేల్వాల్) ని పిలుస్తుంది. ఇద్దరూ సుమైర్ మీద కన్నేసి వుంచుతారు. బ్యాగు పోగొట్టుకున్నట్టు తెలుసుకున్న సుమైర్ ఇరకాటంలో పడతాడు. ఇంకోవైపు ఆ డ్రగ్స్ కోసం హమీద్ షేక్ (సంజయ్ కపూర్) అనే ఇంకో స్మగ్లర్ వచ్చి సికిందర్ చౌదరి గొంతు మీద కూర్చుంటాడు.
        
డ్రగ్స్ వున్న బ్యాగుని పోగొట్టుకున్న సుమైర్ మైదా పిండి ప్యాకెట్స్ తీసికెళ్ళి సికిందర్ చౌదరికి అంట గట్టడంతో అది బయటపడి మొత్తం అభాసవుతుంది- ఇక సుమైర్ ని పట్టుకోవడానికి సికిందర్ చౌదరి గ్యాంగ్స్ వెంట పడతారు. మరోవైపు సమీర్, అదితీలు వెంటబడతారు. ఈ రెండు గ్రూపులకి దొరక్కుండా, స్టార్ హోటల్లోనే ఎక్కడో బందీగా వున్న కొడుకుని ఎన్సీబీ అధికారి సుమైర్ ఆజాద్ ఎలా విడిపించుకున్నాడన్నది మిగతా కథ.

ఎలావుంది కథ

రొటీన్ యాక్షన్ కథే. అయితే ఇది 2011 లో ఫ్రెంచి భాషలో (స్లీప్ లెస్ నైట్) ఒరిజినల్ గా నిర్మాణం జరుపుకుంది. తర్వాత హాలీవుడ్ లో రీమేకయింది. ఈ రెండూ బాక్సాఫీసుకి బలం చేకూర్చలేదు. కానీ 2015 లో కమల్ హాసన్ తమిళంలో తూంగవనం గా రీమేక్ చేస్తే 50 కోట్ల బాక్సాఫీసుతో లాభాలు తెచ్చి పెట్టింది. దీన్ని తెలుగులో చీకటి రాజ్యం’’ గా డబ్ చేశారు. ఇప్పుడు హిందీలో బ్లడీ డాడీ గా రీమేకయింది.
       
చీకటి రాజ్యం చూసి వుంటే బ్లడీ డాడీ వెలవెలబోతూ వుంటుంది. కేవలం ఒక రాత్రి నైట్ క్లబ్ లో జరిగే యాక్షన్ కథని కమల్ హాసన్ తన స్టార్ పవర్ తో, సహజ కామెడీతో ఎక్కడికో....తీసికెళ్ళిపోయారు. ఇది షాహిద్ కపూర్ విషయంలో లోపించింది- స్టార్ పవరూ లేదు, కామెడీ లేదు. కమల్ హాసన్ స్క్రిప్టు తయారు చేసుకుని, రాజేష్ సెల్వ దర్శకత్వంలో వేగంగా పరుగెత్తే టైం పాస్ గ్యారంటీ  థ్రిల్లర్ గా సొంత బ్యానర్ పై తీస్తే, హిందీలో అలీ అబ్బాస్ జాఫర్ స్లో గా సాగే డార్క్ థీమ్ థ్రిల్లర్ గా, ఫన్ కి దూరంగా వుంచేశాడు.
       
కమల్ హాసన్ కి కొడుకు కోసం ఫిజికల్ యాక్షన్
మాజీ భార్య కారణంగా ఎమోషనల్ యాక్షన్ - ఈ రెండిటి మధ్య నలిగే పాత్రగా రక్తి కట్టిస్తే, షాహిద్ కపూర్ కి ఈ రెండు షేడ్స్ లేక ఉపరితలంలోనే వుండిపోయాడు. కమల్ హాసన్ థ్రిల్లర్ కలర్ఫుల్ గా వుండడానికి పాపులర్ స్టార్స్ నటించడం ఇంకో కారణం. కమల్ కి యాంటీగా నార్కోటిక్స్ ఉద్యోగినిగా స్టార్ హీరోయిన్ త్రిష నటించడం, ఆమెతో కమల్ చేసే ఫైట్ ఒక ఎట్రాక్షన్ కావడం కలిసొచ్చాయి.  హిందీలో ఎవరికీ తెలియని డయానా పేంటీతో ఈ మ్యాజిక్ వర్కౌట్ కాలేదు. కమల్ సినిమాలో విలన్ గా ప్రకాష్ రాజ్ బలం వుంటే, హిందీలో రోణిత్ రాయ్ అనే పెద్దగా పేరు లేని పాత ఆర్టిస్టుతో విలన్ పాత్ర మామూలుగా వుంది. ఇంకో విలన్ గా ఒకప్పటి హీరో సంజయ్ కపూర్ ది ఓవరాక్షన్.
       
ఈ కథని కోవిడ్ -2 మహమ్మారి ముగిసిన సమయంలో స్థాపించారు. కోవిడ్-1
, 2 లతో ఎంతో మంది చనిపోయి, మరెంతో మంది ఉపాధి కోల్పోయి నేరాల వైపు మళ్ళారని చెబుతూ కథ ప్రారంభించారు. నేరాల వైపు ఏ సామాన్యులు మళ్ళారో చూపించకుండా, డ్రగ్ స్మగ్లర్స్ అనే ప్రొఫెషనల్స్ తో కథ ప్రారంభిస్తే- ఆ డ్రగ్ స్మగ్లర్స్ కొత్తగా నేరాలకి పాల్పడేదేముంటుంది - అది వాళ్ళ నిత్య కార్యక్రమమే.
       
ఇక కోవిడ్ జాగ్రత్తలంటూ ప్రారంభ దృశ్యాల్లో మాస్కూలు వేసుకుని తిరగడం చూపించి
, ఆ తర్వాత మర్చిపోయాడు దర్శకుడు. ఈ మాత్రం దానికి కోవిడ్ బిల్డప్ ఎందుకో అర్థంగాదు. ఆ హోటల్లో దాగుడు మూతలప్పుడు మాస్కు లేసుకుని వుంటే, ఎవరు ఎవరో తెలియక కన్ఫ్యూజన్ తో చాలా కామెడీగా యాక్షన్ వుండేది.

నటనలు -సాంకేతికాలు

ఈ సినిమాకి హీరోగా షాహిద్ కపూర్ గ్లామర్ లుక్ తో వుండి వుంటే బావుండేది. క్రిమినల్ గ్యాంగ్స్ లో ఒకడుగా తానూ రఫ్ లుక్ తోనే  గ్యాంగ్ స్టర్ లా వుంటే- అసలు ఎన్సీబీ అధికారిగా ఉద్యోగంలో వుంటాడా. అల్లరైపోయిన ముంబాయి ఎన్సీబీ అధికారి సమీర్ వాంఖడే క్లీన్ షేవ్ తో ఎంత అఫీషియల్ గా వుండేవాడని. ఆఫీసర్ కి, గ్యాంగ్ స్టర్ కీ తేడా లేకపోతే అదేం సినిమా అనుకోవాలి?
        
ఎన్సీబీ ఉద్యోగినిగా వేసిన డయానా పేంటీ ఫార్ములా సినిమా పాత్రే. పై అధికారి పక్కన కరివే పాకు పాత్ర. వెబ్ సిరీస్ లో స్త్రీ పాత్రలు- హీరోయిన్ పాత్రలూ ఎంత శక్తిమంతంగా వుంటున్నాయో గుర్తిస్తున్నట్టు లేదు సినిమా దర్శకులు.
       
రిచ్ విలన్ గా రోణిత్ రాయ్
, అతడి పక్క వాద్యంగా సంజయ్ కపూర్ పాత విలన్లుగా వుంటారు. సాంకేతికంగా ఉన్నతంగా తీర్చి దిద్దాడు దర్శకుడు. ప్రారంభంలో ఔట్ డోర్ యాక్షన్ సీన్స్ బావున్నాయి. అయితే ఈ మేకింగ్ క్వాలిటీ అంతా పాపులర్ నటీనటులతో వుండుంటే సినిమా పై లెవెల్లో వుండేది. ఇంకోటేమిటంటే, ఎప్పుడో 2011 నాటి కాలపు ఫ్రెంచి థ్రిల్లర్ ని ఇప్పుడు రీమేక్ చేయడం విజ్ఞత అన్పించుకోదు. ఫ్రెంచి థ్రిల్లర్ ఫ్రెష్ గా వున్నప్పుడు, అప్పుడప్పుడే 2015 లో  కమల్ హాసన్ రీమేక్ చేయడం వేరే విషయం.

—సికిందర్