రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Tuesday, January 29, 2019

732 : రివ్యూ

దర్శకత్వం : అభిజిత్ పన్సే
నవాజుద్దీన్ సిద్ధిఖీ, అమృతారావ్ తదితరులు
స్క్రీన్ ప్లే : అభిజిత్ పన్సే, రచన : అరవింద్ జగ్తాప్, మాటలు : మనోజ్ యాదవ్
సంగీతం : రోహన్ రోహన్, సందీప్ శిరోద్కర్, ఛాయాగ్రహణం : సుదీప్ ఛటర్జీ
బ్యానర్స్ : వయాకాం మోషన్ పిక్చర్స్, రాయిటర్స్ ఎంటర్ టైన్మెంట్, కార్నివాల్ మోషన్ పిక్చర్స్
విడుదల : జనవరి 25, 2019
***
          సారి శివసేన పార్టీ దివంగత అధ్యక్షుడు బాలా సాహెబ్ ఠాకరే బయోపిక్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. దీంతో బాటే ఝాన్సీ లక్ష్మీ బాయి ‘మణికర్ణిక’ కూడా ప్రేక్షకుల్ని పలకరించింది. ఇద్దరి భావజాలాలు వేర్వేరు. ఆమెది ప్రధాన స్రవంతి భావజాలం, ఈయనది సమాంతర అతివాద భావజాలం. జాతీయంగా ప్రధాన స్రవంతి భావజాలాన్ని పక్కన బెడితే, ఈ ఎన్నికల సమయంలో అతివాద భావజాలాన్ని ప్రాంతీయంగా ఉపయోగించుకోవాలని ఎక్కుబెట్టారు. ఇలాటి భావజాలాన్ని మహారాష్ట్ర కిచ్చిన వాడు ఠాకరే. కాబట్టి ఈ ఎన్నికల సమయంలో ప్రచార చిత్రంగా బయోపిక్ ని తయారుచేసి వదిలారు. ఈ భావజాలంతో సాధించిందేమిటనే ప్రశ్న మద్దతుదార్లకి తట్టకపోవచ్చు గానీ, పరస్పర విరుద్ధ భావజాలాలైన మరాఠా మణూస్ సాకారమైందా? హిందూత్వ లక్ష్యాలు పూర్తయ్యాయా? అన్న ప్రశ్నలుంటాయి. ఇదెలాగో చూద్దాం...

కథ 
     1950 లలో బాలా సాహెబ్ ఠాకరే ఒక పత్రికలో కార్టూనిస్టుగా పనిచేస్తూంటాడు. తండ్రీ కళారంగంలో పని చేసిన వాడే. తమ్ముడికీ కళలంటే ఆసక్తి వుంది. పత్రికలో వేస్తున్న కార్టూన్లతో తమిళ ఎడిటర్ కి ఇబ్బందులొచ్చి రాజీ పడమంటారు. రాజీనామా ఇచ్చేసి వెళ్ళిపోతాడు ఠాకరే. ఈ సమయంలో బయట తిరుగుతూ మరాఠీలకి ఎదురవుతున్న అవమానాలు గమనిస్తాడు. సౌత్ ఇండియన్సు, గుజరాతీలు, పార్సీలూ అన్నిరంగాల్లో బొంబాయిని ఆక్రమిస్తూ మరాఠీలకి భుక్తి లేకుండా చేస్తున్నారని ఆగ్రహం పెంచుకుంటాడు. తమ్ముడితో కలిసి ‘మార్మిక్’ అనే పత్రిక ప్రారంభించి మరాఠా మణూస్ నినాదాన్ని వ్యాప్తి చేస్తాడు. దీంతో బాధిత మరాఠీలు ఠాకరేని  ఆశ్రయించడం మొదలెడతారు. తన నినాదానికి ప్రజల నుంచి వస్తున్న విశేష  స్పందన చూసి, 1966 లో ఛత్రపతి శివాజీ పేరు ధ్వనించేలా శివ సేన పార్టీ స్థాపిస్తాడు. 

          తనకి ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదనీ, అరాచకమే తన మార్గమనీ ప్రకటిస్తాడు. హక్కుల కోసం బిచ్చ మెత్తుకునే కంటే గూండాల్లాగా మారి హక్కుల్నిలాక్కోవాలని రెచ్చగొడతాడు. దీంతో ప్రాంతీయేతరుల మీద దాడులు మొదలైపోతాయి. ఉడిపి హోటళ్ళు పటాపంచలవుతాయి. గుజరాతీ, పార్సీ వ్యాపారాలు ధ్వంసమవుతాయి. బొంబాయి కార్పొరేట్ కంపెనీల్లో పనిచేస్తున్న ఉత్తర, దక్షిణ రాష్ట్రాల అధికారుల, ఉద్యోగుల జాబితాలు  తయారు చేసి విడుదల చేస్తాడు. ఏర్ ఇండియా కార్యాలయం మీదికి దండెత్తి, మరాఠీ ఉద్యోగుల లెక్క చెప్పమంటాడు. మరాఠీ సినిమా విడుదల ఆపి, హిందీ సినిమా విడుదల చేస్తున్న థియేటర్ల మీద దాడులు జరిపిస్తాడు. దేశానికి సినిమా తీయడం నేర్పిందే మరాఠీ వాడైతే, మరాఠీ సినిమాలకే థియేటర్లు దొరకవా అని చావగొడతాడు. పారిశ్రామికంగా యూనియన్లలో పాగా వేసిన లాల్ బందర్లని (ఎర్రకోతుల్ని) చంపెయ్యాలని ప్రకటించడంతో, ఒక కమ్యూనిస్టు ఎమ్మెల్యేని చంపేస్తారు...

          ఇంతలో ఠాకరే ఒక సంఘటనని పట్టుకుని దీర్ఘాలోచనలో గార్డెన్ లో పూల మొక్కని ట్రిమ్మింగ్ చేస్తూంటాడు. బ్లాక్ అండ్ వైట్ లో వుండే ఈ దృశ్యంలో ఆ చామంతి పువ్వు కాస్తా కాషాయ వర్ణంలోకి మారుతూంటుంది... విశ్రాంతి.  

ఎలావుంది కథ 
     కథ కాదు, అందుకని సినిమాలా లేదు. ఎన్నికల ప్రచార డాక్యు డ్రామాలాగా వుంది. నిర్మాతలు పార్టీ నాయకులే, దర్శకుడూ ఠాకరే కుటుంబ సన్నిహితుడే. కాబట్టి ఠాకరే కీర్తనలతో ఎన్నికల ప్రచారాస్త్రంగా తీశారు. ఠాకరే జీవితంలోని ఒక్కో ప్రధాన ఘట్టం తేదీలు వేస్తూ డాక్యుమెంటరీ కథనం చేశారు. సినిమా కళ గురించి అస్సలు పట్టించుకోలేదు. సినిమాలాగా తీయకూడదన్న ఒక స్పష్టతతో ఎన్నికల డాక్యూడ్రామాగానే తీశారు కాబట్టి, దీన్ని సినిమా రచనని వెతికే దృష్టితో చూడకూడదు. తెలుగులో ‘ఎన్టీఆర్’ బయోపిక్ కి ఏం రచన చేస్తున్నారో ఒక స్పష్టత లేకపోవడంతో, అది డాక్యుమెంటరీ కాలేదు, సినిమా కాలేదు సరికదా, రెండో భాగానికి ఉపోద్ఘాతమై కూర్చుంది. 

          ఐతే ఠాకరే రాజకీయ జీవితాన్ని తేదీలు వేసి క్రొనలాజికల్ ఆర్డర్ లో చూపిస్తున్నప్పుడు, ఇంటర్వెల్ కి ముందంతా మణూస్ గురించి, ఇంటర్వెల్ తర్వాతంతా మణూస్ ని వదిలేసి హిందూత్వ గురించీ చూపించారు. 40 ఏళ్ళు  మణూస్ గురించి పోరాడినా, ఎందరో నమ్మి పోరాడిన మరాఠీలు ప్రాణాలు పోగొట్టుకున్నా, ఆ లక్ష్యం సాధించలేదు. ఉన్నట్టుండి హిందూత్వ వాదాన్ని ఎత్తుకుని, హింసాగ్ని రగిలించి, ఇదీ ఏమీ సాధించకుండానే పోరాటం సాగుతూ వుంటుందని చెప్పి ముగించారు. 

          అతి వాదం ఏదీ సాధించదనీ, సాగదీస్తూనే వుంటుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల కోసమనీ అన్నట్టు చూపించారు. మణూస్ తో మరాఠీయేతరులు వుండరాదని చెప్పి అన్నేళ్ళు  పోరాడేక, హిందువులందరూ ఒక్కటే, హిందువులందరూ మతాన్ని కాపాడుకోవడానికి ఏకం కావాలనీ హింసాత్మక హిందూత్వ వాదాన్ని ఎత్తుకున్నప్పుడు, మణూస్ కి అర్ధమేలేకుండా పోయింది. హిందువులందరూ ఒకటే అన్నప్పుడు మరాఠీయేతరులు కూడా మహారాష్ట్రలో వుండొచ్చు. ఇది సెల్ఫ్ గోల్ కొట్టుకోవడమే. దీని గురించి ఓ మరాఠీ మిత్రుణ్ణి అడిగితే, అక్కడి జనం మణూస్, హిందూత్వా ఒకటేనని అనుకుంటున్నారని చెప్పాడు. 

ఎవరెలా చేశారు
    ఠాకరే పాత్రలో నవాజుద్దీన్ ఠాకరే సాబ్ ఒడ్డూ పొడవూ లేకపోయినా, బాడీ లాంగ్వేజినీ,  ఫేషల్ ఎక్స్ ప్రెషన్స్ నీ అనుకరించడంలో ప్రతిభ కనబర్చాడు. తెరమీద మెస్మరైజ్ చేసే ఈ ఫైనల్ ఫ్రేములు ఎన్ని టేకులు తీసుకుంటే వచ్చాయోగానీ, వీటిని రాబట్టిన దర్శకుడికి కూడా క్రెడిట్ ఇవ్వాల్సి వుంటుంది. 

          వాయిస్ అనుకరుణని లైట్ తీసుకున్నారు. నవాజుద్దీన్ ఠాకరే లోని శాంతం, క్రోధం, ఆవేశం, అక్కస్సు, ప్రేమ (ఇంట్లో) మొదలైన ఎమోషన్స్ ని చాలా రియలిస్టిక్ గా ప్రదర్శించాడు. నవ్వడం దాదాపూ వుండదు. సంతోషం సంతోషకరమైన ఘట్టాల్లోనూ వుండదు. నిలువెత్తు ఠాకరే ఎలా వుండే వాడో నవాజుద్దీన్ ని చూస్తే తెలిసిపోతుంది. ఠాకరే స్మోకర్, డ్రీంకర్. ఈ దృశ్యాలు విపరీతంగా వుంటాయి. ఇంకే సినిమాల్లోనూ చూడనన్ని చట్ట బద్ధమైన హెచ్చరికలు వరసగా స్క్రోల్ అవుతూనే వుంటాయి.

          ఇక మొరార్జీ దేశాయి, మనోహర్ జోషి, రజనీ పటేల్, జార్జి ఫెర్నాండెజ్, యశ్వంత రావ్ చౌహాన్, ఠాకరే సతీమణి మీనా తాయి, ఇందిరా గాంధీ మొదలైన ఇతర పాత్రలు ఆయా సందర్భాల్లో కన్పిస్తాయి. ఇందిరా గాంధీ పాత్ర వేసిన థియేటర్ ఆర్టిస్టు, ఎన్నారై  అవంతికా అక్రేకర్ అందరిలోకి బెస్ట్. 1970 ల నాటి ఇందిర పోలికలతో ఆశ్చర్య పరుస్తుంది. దర్శకుడు కూడా ఇందిర తల అలా పైకెత్తి వినే బాడీలాంగ్వేజినే ఎష్టాబ్లిష్ చేస్తూ మిడ్ షాట్స్ తీయడం గొప్ప జస్టిఫికేషన్. ఠాకరే సతీమణి పాత్రలో అమృతా రావ్ ఆమె సున్నిత మనస్తత్వాన్ని ప్రదర్శిస్తూ చెరిగిపోని ముద్ర వేస్తుంది. 


         హిందీ, మరాఠీ భాషల్లో విడుదల చేసిన ఈ బయోపిక్ మేకింగ్ క్వాలిటీ చాలా ఉన్నతంగా వుంది. ఫస్టాఫ్ పొడవునా ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే బ్లాక్ అండ్ వైట్ దృశ్యాలు కళాత్మకంగా వున్నాయి - కలర్ సినిమాల కంటే బ్లాక్ అండ్ వైటే బెటర్ అన్పించేలా. ఒకప్పటి ‘ఇండియా టుడే’ ప్రఖ్యాత సీనియర్ ఫోటోగ్రాఫర్ రఘురాయ్ నైపుణ్యపు తెలుపు నలుపు భావ చిత్రాల్లా.1950 లనుంచీ కాలక్రమేణా ముంబాయి అభివృద్ధి చెందుతూ వస్తున్న వివిధ దశల తెలుపు నలుపు దృశ్యాలు కళ్ళకి కట్టినట్టున్నాయి. సెకండాఫ్ లో కలర్ దృశ్యాలు వస్తాయి. సెట్స్, భవనాలు, ఔట్ డోర్ లొకేషన్స్, బీచి, ప్రాపర్టీస్, కాస్ట్యూమ్స్, మేకప్, నాటి పాతకాలపు మనుషుల్ని పోలిన మనుషులు, వాళ్ళ నాటి బాడీ లాంగ్వేజీలు, భాష, తమిళ తంబిల ఇడ్లీ సాంబార్ సేల్స్, పోటీగా ఠాకరే వడ పావ్ సూపర్ సేల్స్...చెప్పుకుంటే బొంబాయి – ముంబాయిలని కూడా బయోపిక్ చేసి చూపించారు. సినిమాగా ఏ కళ లేకపోయినా, డాక్యు డ్రామాతో చాలా కళాప్రదర్శన చేశారు. రాజకీయ పార్టీ తీసే రాజకీయ సినిమా  - లేదా డాక్యు డ్రామా - ఇంత కళాఖండంలా  తీయడం అరుదు.  

( చివరికేమిటి - రేపు)        
సికిందర్
Watched at PVR, Irrum manzil
11pm, 28.1.19

Monday, January 28, 2019

732: లవర్ నుంచీ ఎఫ్ 2 దాకా...



(యాక్షన్ సినిమాల సంగతులు మిగతా భాగం)
8. సవ్యసాచి 
నాగచైతన్య, నిధీ అగర్వాల్, చందు ఎం (2 సినిమాల దర్శకుడు)
మార్కెట్ యాస్పెక్ట్ : హై కాన్సెప్ట్ కి తగ్గ మేకింగ్ లేకపోవడం -  ఫ్లాప్ 
క్రియేటివ్ యాస్పెక్ట్ : పాసివ్ పాత్ర, ఎండ్ సస్పెన్స్, టెంప్లెట్ కథనం - ఫ్లాప్

         
వానిషింగ్ ట్విన్ సిండ్రోం అనే మెడికల్ స్థితి ఆధారంగా కథ తయారు చేశామని చెప్పుకున్నారు. గర్భంలో కవల పిండాల్లో  ఒక పిండం విచ్ఛిత్తికి లోనైనప్పుడు, దాని కణజాలాన్ని రెండో పిండం శోషించుకునే అరుదైన స్థితి ఇది. అలా కవల పిండం కణజాలంతో పుట్టిన బిడ్డ, తనలో కవలని కూడా ఫీలవుతుంది. దాని చర్యలతో ఇబ్బంది పడుతుంది. ఈ స్థితితో 2000 లో వానిషింగ్ ట్విన్అనే అద్భుత కొరియన్ సినిమా హీరోయిన్ పాత్రతో వచ్చింది. స్థితే కాకుండా ఏలియన్ హేండ్ సిండ్రోం అని ఇంకొక  స్థితి వుంది. మెదడులో లోపం దీనికి కారణమౌతుంది. వీటి  మీద పూర్వం నుంచీ చాలా సినిమాలు వచ్చాయి. 1964 లోనే స్టాన్లీ క్యూబ్రిక్ డాక్టర్ స్ట్రేంజ్ లవ్తీశాడు. ఇందులో హీరో పీటర్ సెల్లర్ ఎడం చెయ్యి మాట వినదు. 1999 లో ఐడిల్ హేండ్స్అనే హార్రర్ కామెడీ వచ్చింది. ఇంకా ఎన్నో  టీవీ సీరియల్స్ వచ్చాయి. తమిళంలో 2017 లో పీచన్కాయ్’, 2016 లో కన్నడలో సంకష్ట కర గణపతికూడా వచ్చేశాయి. సినిమాగా చూస్తే రెండు స్థితులకీ తేడా కన్పించదు - ఒక్క మొదటి దాని విషయంలో తనలో కవల సోదరుడు లేదా సోదరి వున్న ఫీలింగ్ తప్పితే. రెండు స్థితులూ ఎడం చేతి అతి క్రియాశీలత్వాన్నే కలిగి వుంటాయి.


         ఐతే సవ్యసాచిలో నిక్షిప్త కవలని సోదరుడుగా చెప్పడం ఇల్లాజికల్ గా వుంటుంది. పిండం మగదే నని ఎలా తెల్సు? నీ బ్రదర్, నీ బ్రదర్ అని పదేపదే మగ పిండమే అన్నట్టుగా గుర్తు చేస్తూంటారు. సిస్టర్ ఎందుకు కాకూడదు? బేటీ బచావో నై చాహియే? అది ఆడ పిండమే అయివుండి, తనని సిస్టర్ సిస్టర్ అనకుండా, బ్రదర్ బ్రదర్ అనడంతో  తిక్కరేగి  అలా హీరోగారి ఎడం చేయితో ఎడాపెడా ఆడుకుందేమో? ఆ ఎడం చేత్తో ఎక్కడా కథని కుదరనీయక అపసవ్య, అపహాస్య, అపభ్రంశ వ్యవహారంగా మార్చేసిందేమో.  అసలు సినిమా ప్రారంభమే టైటిల్స్ తో భస్మాసుర హస్తం కథ చెప్పడం ఇందుకే జరిగిందేమో? భస్మాసుర సిస్టర్ హస్తం. ఇంతోటి కథలకి మేల్  ఇగోలు కూడా. 

          ఇక ఇది కూడా
ఫ్లాపయ్యే ఎండ్ సస్పెన్స్ కథతో, పాసివ్ పాత్రతో వచ్చినందుకు ఆశ్చర్యపోనవసరం లేదు. అసలు ఎండ్ సస్పెన్స్ అంటే ఏమిటో, పాసివ్ పాత్రంటే ఏమిటో తెలిస్తే కదా ఇలాటివి తీయకుండా జాగ్రత్త పడడానికి. వీరభోగ వసంత రాయలుఇలాంటిదే. అసలీ సినిమా కథేమిటో చిట్టచివర క్లయిమాక్స్ దాకా, అదీ సైకో విలన్ చెప్పేదాకా తెలీదు. ఇంత సోది ఆపి పాయింటు చెప్పరా నాయనా అని వొళ్ళు మండిన ఒక ప్రేక్షకుడు ట్విట్టర్ లో కామెంట్ పెట్టాడంటే,  ప్రేక్షకులకున్న కామన్ సెన్స్ - స్క్రీన్ ప్లే సెన్స్ - మేకర్ కి లేదన్న మాట. 

         
ఇంకోటేమిటంటే, ఇది ఫ్లాప్స్ కి దారితీస్తున్న టెంప్లెట్  కూడా. టెంప్లెట్ అంటే, ఫస్టాఫ్ లో నడిచే  ప్రేమ కథ అసలు కథ కాకుండా, ఇంటర్వెల్లో విలన్ తో మొదలయ్యేదే అసలు కథ అయి, ప్రేక్షకులు  వెయిటింగ్ లో వుండడం. ఎప్పుడో ఇంటర్వెల్లో మొదలయ్యే  కథ కోసం, అంతవరకూ సినిమాలో ఆ తర్వాత వుండనే వుండని  ప్రేమ కథని వేస్టుగా చూస్తూ ప్రేక్షకులు కూర్చోవడం. ఇంటర్వెల్ వరకూ కథలో వుండని ఈ వేస్టు ప్రేమ ట్రాకులు తీసేస్తే, సెకండాఫ్ లో క్లయిమాక్స్ వరకే, పాటలు తీసేస్తే  ఓ అరగంట మాత్రమే ప్రేక్షకులు కథని చూడడం. అంటే మొత్తం సినిమాలో ఓ అరగంట మాత్రమే కథని చూడగల్గడం. ఇది కూడా కథలా వుండక పోవడం. టెంప్లెట్ సినిమాల్లో అరగంటే కథ. ఇది కూడా చేయలేక ఫ్లాప్ చేసుకోవడం. 

9. దేవదాసు 
నాగార్జున, నాని, శ్రీరామ్ ఆదిత్య (2 సినిమాల దర్శకుడు)
మార్కెట్ యాస్పెక్ట్ :  జీరో - ఫ్లాప్  
క్రియేటివ్ యాస్పెక్ట్ :  గోల్స్ లేని పాత్రలు, సెకండాఫ్ సిండ్రోం -ఫ్లాప్
          హాలీవుడ్ గ్యాంగ్ స్టర్ కామెడీ సబ్ జానర్ కథ. కానీ ఈ సబ్ జానర్ లో కథ వుండదు. అసలు జానర్లనే జాతులేమిటి - అన్ని జాతులూ టెంప్లెట్ జాతిలో కలిసిపోవడమే. ప్రపంచంలో టెంప్లెట్ తీసేవాడే టెల్గూ వాడు. “ఇచ్చట అన్ని సినిమాలను సరసమైన ధరలకు టెంప్లెట్స్ గా మార్చబడును” అని బోర్డు. ఈ బోర్డు లేనివాడు టెలివి లేని వాడు. 1999 లో రాబర్ట్ డీ నీరో - బిల్లీ క్రిస్టల్ లతో వచ్చిన ఎనలైజ్ దిస్’  అనే హిట్ మూవీకి తెలుగులో మార్పు చేర్పులతో కాపీ.  2002 లో అమితాబ్ బచ్చన్ - సంజయ్ దత్ లతోకామెడీ స్పెషలిస్టు  డేవిడ్ ధవన్ దర్శకత్వంలో హమ్ కిసీసే కమ్ నహీ’  అంటూ కాపీ కొట్టి హిట్ చేసుకున్నారు. ఒరిజినల్ హాలీవుడ్ లోనూదాని హిందీ కాపీలోనూ డాక్టర్ - డాన్ కథ పూర్తిగా వేరు. తనకి మేలు చేసిన డాక్టర్ కి మంచి చేద్దామన్న డాన్ తో, డాక్టర్ కి చచ్చే చావొస్తుంది. మంచి మనసుతో డాన్ మేలు చేసే ప్రతీసారీ, డాక్టర్ సమస్యల్లో పడుతూంటాడు. డాక్టర్ తో డాన్ చెలగాటాలే స్టోరీ లైన్. తెలుగుకి వచ్చేసరికి ఈ లైన్ తీసేసి. ఇద్దరి మధ్యా  స్నేహం కుదిర్చి,  బ్రొమాన్స్ గా నడపడంతో కథ కుదరక, పోనుపోను అనవసర విషయాలు కలుపుకుని ఏటో వెళ్ళిపోయింది.

           హిట్ గా మార్చిన హిందీ మసాలానే కాపీ కొట్టినా
బావుండేది. ఇద్దరు స్టార్ల కాంబినేషన్ లో కొత్తగా కంటెంట్ ని ఇంకెలా మార్చాలో అంతుపట్టక ఇలా తయారయ్యేది కాదు. కథే లేకుండా స్టార్స్ తో ఎంత సేపని కామెడీలు చేయిస్తారు. ఫస్టాఫ్ బిగినింగే వేరే మాఫియాలతో భారంగా, పరమ నిదానంగా, డల్ గా, సాగదీస్తూ సాగదీస్తూనే పోయారు. ఇది మార్కెట్ యాస్పెక్టా? ఇద్దరు ప్రముఖ స్టార్స్ ని పెట్టుకుని, వాళ్ళతో చూపించకుండా, అక్షరాలా పావుగంట సేపు ప్రారంభ సీన్స్ ని ఎవరో మాఫియాల గొడవలతో ఒకటే బోరు కొట్టించడం మార్కెట్ యాస్పెక్ట్ ఎలా అవుతుంది. విలువైన ఈ పదిహేను నిమిషాల రన్ మీద పెట్టుబడి మట్టిపాలు అని స్క్రిప్టు రాసుకుంటూ వుంటేనే తెలిసిపోతుంది. 

          స్టార్ లిద్దరి
కామెడీలు బాగానే వర్కౌట్ అయినా, అవి ఇంటర్వెల్ వరకే సరిపోయాయి. ఇక ఇంటర్వెల్ కైనా కథలోకి రావడానికి విషయం లేదు. ఆతర్వాత కూడా విషయం లేక తోచిన పిట్ట కథనల్లా అల్లుకుంటూ పోయారు.  వాటిలో అవయువదానం పిట్టకథ వచ్చేసరికి మూవీ అంతా వికర్షించడం మొదలెడుతుంది. కామెడీలో విషాదాలేమిటి. సమస్య ఒక్కటే – స్టార్స్ పాత్రలు రెండిటికీ గోల్స్ లేవు. గోల్స్ లేని పాత్రలతో కథ అనుకోవడం, తాడు లేని బొంగరమాట ఆడుకోవడమే. ఇరుసు లేని బండి చక్రం బిగించడమే. 

10. అమర్ అక్బర్ ఆంటోనీ 
రవితేజ, ఇలియానా, శ్రీను వైట్ల (16 సినిమాల దర్శకుడు)
మార్కెట్ యాస్పెక్ట్ : ఆల్రెడీ అపరిచితుడు - ఫ్లాప్
క్రియేటివ్ యాస్పెక్ట్ : రొటీన్ రివెంజి టెంప్లెట్ – ఫ్లాప్
         
సోషియేటివ్ ఐడెంటిటీ డిజార్డర్ (డిఐడి) అనే మానసిక రుగ్మత ఆధారంగా కమర్షియల్ మాస్ కథ చెప్పాలనుకున్నారు. నిజానికి మల్టీపుల్ పర్సనాలిటీ డిజార్డర్ (ఎంపిడి) కి ఇది కొత్త పేరే తప్ప ఇంకేదో మానసిక వ్యాధికాదు. ఎంపీడితో ఆల్రెడీ విక్రమ్ తో శంకర్ తీసిన సూపర్ హిట్ అపరిచితుడురానే వచ్చేసింది. పైగా ఇక్కడ చూపిన డిఐడి రుగ్మతకి  కారణం కూడా తప్పుడు సమాచారమిచ్చేదిగా వుంది. కథలో  చూపించినట్టు చిన్నప్పుడు ఏదైనా దారుణం కళ్ళారా చూస్తే (ఇక్కడ తల్లిదండ్రుల మరణం),   మానసిక రుగ్మతకి లోనయ్యే సమస్యే లేదు. మానసిక రుగ్మత చిన్నతనంలో సుదీర్ఘకాలం పదేపదే లైంగిక హింసకి గురైతేనో, లేదా పెద్దల చేతిలో చిత్రహింసల పాలైతేనో ఏర్పడుతుందని ఏ మెడికల్ వెబ్ సైట్ ఓపెన్ చేసినా తెలిసిపోతుంది. 

         
లాజిక్ లేకుండా ఏదో రుగ్మతని పాత్రలకాపాదించి అమాయక ప్రేక్షకుల్ని నమ్మించేసే ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. ఇలా నమ్మిద్దామన్నా ఈ రుగ్మతతో కథా నిర్వహణ కూడా కుదరలేదు.సవ్యసాచి లో వానిషింగ్ ట్విన్ సిండ్రోం అంటూ ఎలా అవకతవక కథ చేశారో, ఇదీ అలాగే తయారయ్యింది.  ఒక పాత రొటీన్ రివెంజి కథకి ఏదో రుగ్మత అంటూ కొత్తగా టెంప్లెట్ బిల్డప్ ఇవ్వబోతే,  రుగ్మతా రివెంజీ రెండూ దారుణంగా ఫెయిలే. అసలు అపరిచితుడు’ మళ్ళీ ఎలా తీస్తారు. 

11. వినయ విధేయ రామ
రాం చరణ్, కైరా అద్వానీ, బోయపాటి శ్రీను (7 సినిమాల దర్శకుడు)
మార్కెట్ యాస్పెక్ట్ : అరిగిపోయిన పాత రీసైక్లింగ్ - ఫ్లాప్
క్రియేటివ్ యాస్పెక్ట్ : బీగ్రేడ్ రైటింగ్ కి పరాకాష్ఠ - ఫ్లాప్
చెప్పుకోవాలన్నా సినిమాలో రెండు మూడు కనీస విలువలైనా వుండాలి. దీంతో పీక్కెళ్ళి పీకేసిన బోయపాటి కింకేం మిగిలింది  - ఇక 'వినయ విధేయ రావణ' తీయాలి. 

12. బ్లఫ్ మాస్టర్
సత్యదేవ్, నందితా శ్వేత, గోపీ గణేష్ (ఒక సినిమా దర్శకుడు)
మార్కెట్  యాస్పెక్ట్ : ఎకనమిక్స్ - ఏవరేజి
క్రియేటివ్ యాస్పెక్ట్ : పకడ్బందీ కథనంతో సెమీ రియలిస్టిక్ - ఏవరేజి

          మోసాలు  చేద్దామనుకునే వాళ్ళకి గట్టి జవాబు చెప్తూ హార్డ్ కోర్ జానర్ సోషియో యాక్షన్ కథ చేశారు. సౌజన్యం తమిళ దర్శకుడు. తెలుగులో వొరిజినల్ గా ఇలాటి కథలతో సినిమాలు రావు. కంటెంట్ బలంగా వుంది. ప్రేక్షకులు తదేక ధ్యానంతో చూసేలా వేగంగా పరుగులెత్తే పకడ్బందీ కథనముంది. మార్కెట్ యాస్పెక్ట్ కి, సరైన ఎకనమిక్స్ తో కథ మంచి యూత్ అప్పీల్ తో వుంది. పాత మోసాల కథనే యువ ప్రేక్షకుల స్టయిల్లో, ట్రెండీగా చూపించడంతో సెమీ రియలిస్టిక్ అయినా కమర్షియల్ గానే వుంది. 

13. అరవింద సమేత వీరరాఘవ 
ఎన్టీఆర్, పూజా హెగ్డే, త్రివిక్రమ్ (10 సినిమాల దర్శకుడు)
మార్కెట్ యాస్పెక్ట్ : మళ్ళీ ఫ్యాక్షన్ - హిట్ అన్నారు
క్రియేటివ్ యాస్పెక్ట్ :
   కథకన్నా కత్తికి పనెక్కువ
- హిట్ అన్నారు
          దశాబ్దం క్రితమే సంతృప్త స్థాయికి చేరిన ఫ్యాక్షన్ సినిమాల ట్రెండ్ నుంచి ఇంకేదో పిండే ప్రయత్నం.
ఎప్పుడో ఓ ప్రాంతానికి పరిమితమైన సామాజిక స్థితిని ఇప్పుడూ ప్రధాన స్రవంతి చేసే, సమకాలీనం చేసే ప్రయత్నం. ఇప్పుడు ప్రాంతాల కతీతంగా వేరే రూపాల్లో చాలా హింస, రాజకీయాలూ వున్నాయి. వీటి మీద సినిమా ఆశిస్తుంది మార్కెట్ యాస్పెక్ట్. పైగా ఇప్పుడు లేని ఫ్యాక్షన్ కి శాంతితో పరిష్కారమంటూ కథ చూపించడం.  ప్రత్యర్ధితో శాంతి కోసం ప్రయత్నమంటూ అదే ప్రత్యర్ధిని చంపి శాంతిని  స్థాపించడం, శత్రు సంహారమంటే పోయేదానికి.

         
క్రియేటివ్ యాస్పెక్ట్ వచ్చేసి బోయపాటి యాక్షన్ సినిమా చూస్తున్నట్టు వుంటుంది. సినిమాలో డైలాగులు ఆయా సన్నివేశాలకి పరిమితమై సూటిగా వుండవు. డైలాగులకి ముందు సందేశాలు జోడిస్తూ సినిమా నడక వేగం తగ్గించడం. యూత్ అప్పీల్ ఆవిరి అవడం. సందేశాలు తీసేస్తే సినిమా నిడివి రెండు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఓ అరగంట తగ్గిపోతుంది. కాన్సెప్ట్ పరంగా ఫ్యాక్షన్ పోరుకి శాంతితో పరిష్కారమనే పాయింటు వర్కౌట్ కాలేదు. యుద్ధం చేసే సత్తా లేనివాడు శాంతిని అడిగే హక్కులేదంటాడు ఎన్టీఆర్ తన గురించి. కానీ ప్రత్యర్ధిని చంపకుండా నెలకొల్పేదే శాంతి అవుతుందని గ్రహించడు. కాన్సెప్ట్ ప్రకారమైతే  ప్రత్యర్ధి పాత్రదారి జగపతిబాబు జీవించే వుండే ముగింపు నివ్వాలి. కనెక్టివిటీ లేని కథకి కనీసం ఆలోచనాత్మకమైన ముగింపుని కూడా ఇవ్వకుండా, విలన్ చావాలనే ఫార్ములాతోనే  ముగించేశారు. ఈ కథని, పాత్ర మూలాల్ని పక్కన పెట్టి ఎన్టీఆర్ ని మాత్రమే చూపించే రొటీన్ ఫ్యాక్షన్ యాక్షన్.

సికిందర్