రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Tuesday, March 28, 2017




        ఎన్ని ఉగాదులు వచ్చినా తెలుగు సాంప్రదాయంలో రీమేక్ ఒకటే వుంటుంది,  హాలీవుడ్ సాంప్రదాయంలో రీబూట్ కూడా వుంటుంది. పాత  తెలుగుని రీమేక్ చేయడం తెలుగులో ఎప్పుడోగానీ జరిగే పనికాదు. హాలీవుడ్ లో హాలీవుడ్ సినిమాలనే రీమేక్ చేయడమో, లేదా రీబూట్ చేయడమో తరచూ జరిగేపని. ప్రస్తుతం హాలీవుడ్ నుంచి హాలీవుడ్ రీమేకులు గానీ, రీబూట్స్  గానీ 36 జరుగుతున్నాయి! తెలుగులో తమిళం నుంచి ఎక్కువగా రీమేకులు జరుగుతూంటాయి. కానీ రీబూట్ ఒక్కటీ జరగదు. రీమేకింగ్ నే తెలుగు నేటివిటీకి, స్టార్ కనెక్టివిటీకీ ఉపరితలంలో  కొన్ని మార్పు చేర్పులు చేసి పూర్తిచేస్తున్నారు. రీమేక్ తప్ప రీబూట్ లేకపోవడంతో  రీమేక్ కి పనికి రాని సినిమాలని కూడా  ఉపరితలంలో తాపీ పనిచేసి  రీమేక్ చేసేస్తున్నారు. నిజానికి ఇలాటి రీమేక్ కి పనికి రాని సినిమాలని రీబూట్ చేయాలి. కానీ రీమేక్ చేయాలంటేనే ఎన్నో సందేహాలతో వుండే ‘రీమేకిష్టులు’, మూలంలో ఒరిజినల్ స్వరూప స్వభావాల్ని మార్చివేసే రీబూటింగ్ ని అస్సలూహించలేరు. రీమేక్ తో  వర్కౌట్ కాని  సినిమాలని కూడా రీమేకే చేసేసి చేతులు కాల్చుకోవడం అలవాటుగా చేసుకున్నారు. హాలీవుడ్ లో కొన్ని సినిమాలని రీమేక్  చేస్తే సరిపోయినా కూడా, రీబూట్ చేసి మరీ ఇంకింత సక్సెస్ ని సాధిస్తున్నారు. 

         
పరభాషల నుంచి రీమేకులే గాకుండా, పాత తెలుగు సినిమా కథల్నేఅటు ఇటు మార్చి రీసైక్లింగ్ చేస్తూంటారు. కనీసం ఈ సందర్భంలోనైనా రీబూట్ గురించి ఆలోచించడం లేదు. సాయి ధరమ్ తేజ్ నటించిన ‘విన్నర్’ పాత రీసైక్లింగ్ కథ అని తెలిసిందే. అందులో కొత్తగా గుర్రాల్ని పెట్టి జాక్ పాట్  కొట్టవచ్చనుకున్నారు. కానీ అదే కథని రీబూట్ చేసివుంటే (ఎలా చేయవచ్చో ఇదే బ్లాగులో ఫిబ్రవరి 26 నాటి ‘విన్నర్’ కి సంబంధించిన ఆర్టికల్ లో సందేహిస్తూనే  రాశాం- ఎందుకంటే,  రీబూటింగ్ అనే ప్రక్రియ ఒకటుందని తెలీకపోతే, ఇదేదో వ్యాసకర్త పెడుతున్న నస అనుకునే అవకాశముంది) బాక్సాఫీసు హిట్ కొట్టే వాళ్ళేమో.  

          కానీ పవన్ కల్యాణ్  సహా మెగా హీరోలు  రీబూట్ కి ఒప్పుకునే స్టార్స్  కారు. తమతమ సినిమాలు  ఫ్యాన్స్ ని దృష్టిలో పెట్టుకుని అవే  రొటీన్ మసాలాగా,  అవే జడప్రాయమైన పరిధుల్లో వుండాలని కోరుకుంటారు. కాబట్టి ఇప్పుడు అలాటి ఒక రొటీన్,  జడప్రాయమైన మసాలాగా,  రీమేక్ చేసిన పవన్ కల్యాణ్  నటించిన ‘కాటమరాయుడు’ గురించి చెప్పుకోవాల్సి వస్తే,   రీబూట్  గురించే చాలా చెప్పుకోవాలి. 

       కానీ రీబూట్ కి  అంగీకరించని హీరోల సినిమాల్ని ఆ దృష్ట్యా స్క్రీన్ ప్లే సంగతులు చెప్పుకుని లాభంలేదు. కాబట్టి  ‘కాటమరాయుడు’ రీబూట్ సంగతి పక్కన పెడదాం; అయినా దీన్నొక రీమేక్ గానే స్క్రీన్ ప్లే సంగతులు చెప్పుకోవడానికి కూడా ఏమీ కన్పించడం లేదు. ఎందుకంటే ఇది టెంప్లెట్ రూపంలో వున్న రీమేక్. టెంప్లెట్ సినిమాల్లో స్క్రీన్ ప్లే పరంగా చెప్పుకునేది ఏమీ వుండదని,  వాటి గురించి రాయడం కూడా ఈ మధ్య మానుకున్నాం. టెంప్లెట్ సినిమాల అందాల్ని కనిపెట్టి బి, సి సెంటర్ల ప్రేక్షకులే తిప్పి కొట్టగల సినిమా అక్షరాస్య సమర్ధులుగా ఎదుగుతున్నాక, ఈ మూడు నెలల్లోనే వరసగా విన్నర్, గుంటూరోడు, నేనోరకం, మా అబ్బాయి- అనే నాల్గుకి నాల్గూ టెంప్లెట్ సినిమాలూ అట్టర్ ఫ్లాపయ్యాయి. తాజాగా వీటి సరసన ‘కాటమ రాయడు’ చేరింది. సామాన్యుడు కూడా నేటి డిజిటల్ ప్రపంచానికి అలవాటై ముందుకు పోతూంటే, సినిమాలు సామాన్యుడికి వెనకబడే వుంటున్నాయి. 

          బోరు కొడుతున్న టెంప్లెట్ సినిమాలంటే-
ఒక యాక్షన్ సీనుతో హీరో ఎంట్రీ, గ్రూప్ సాంగ్, హీరోయిన్ని పడేసే కామెడీ లవ్ ట్రాక్, టీజింగ్ సాంగ్, హీరోయిన్ లవ్ లో పడ్డాక డ్యూయెట్, విలన్ ఎంట్రీ, దాంతో ఇంటర్వెల్. ఇక సెకండాఫ్  లో హీరోయిన్ కట్ అయిపోయి విలన్ తో కథ మొదలు, అప్పుడప్పుడు హీరోయిన్ తో సాంగ్స్, అప్పుడప్పుడు విలన్ ఎటాక్స్, హీరోయిన్ తో ఒక ఫోక్ సాంగ్, విలన్ తో క్లయిమాక్స్, ముగింపు. తనతో ఈ పరిహాసం సామాన్యుడు భరించే పరిస్థితుల్లో లేకనే తిప్పి కొడుతున్నాడు. అయినా సామాన్యుడి బాధ పట్టించుకోకుండా దుందుడుకుగా ‘కాటమ రాయుడు’ కూడా ఇలాటి టెంప్లెట్ సినిమాగానే  వచ్చింది. 

         ఇప్పుడు ప్రస్తావన వచ్చింది గాబట్టి రీబూట్ గురించి క్లుప్తంగా చెప్పుకుంటే-   రీబూట్ అంటే  ఓ సినిమాలోని పాయింటు మాత్రమే తీసుకుని, ఆ బీజ స్థాయి నుంచీ మొత్తమంతా కొత్తగా నిర్మించుకు రావడం. రీసైక్లింగ్ ‘విన్నర్’ నే తీసుకుంటే- చిన్నప్పుడు తండ్రీ తాతల వివక్షకి గురై పారిపోయిన హీరో- ఇంకోవైపు వ్యాపారంలో కోట్లకి పడగెత్తిన తాతా తండ్రులు – ఈ పాత పాయింటునే  ఈ కాలానికి తగిన కథనంతో కొత్తగా చెబితే రీబూట్ చేసినట్టు. 1954 నాటి ఆల్ఫ్రెడ్ హిచ్ కాక్  Rear Window ని  2007 లో Disturbia గా రీబూట్ చేస్తే హిట్టయ్యింది. బ్యాట్ మాన్ బిగిన్స్, స్టార్ ట్రెక్, కేసినో రాయల్, అమేజింగ్ స్పైడర్ మాన్, రైజ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ దిఏప్స్...ఇవన్నీ రీబూట్ చేసిన అనేక హిట్స్ లో కొన్ని. 

          అదే రీమేక్ అంటే,  ఆ మాతృకలో వున్న  పాయింటు సహా మొత్తమంతా యథాతథంగా వుంచడం. పైపైన కొన్ని మార్పు చేర్పులు చేస్తే చేయొచ్చు, బేసిక్ పాయింటు జోలికి పోవడం వుండదు. ఇప్పుడు ‘కాటమ రాయుడు’ రీమేక్ కోసం తీసుకున్న తమిళ  ‘వీరమ్’ సంగతి. 2014 లో ఇది అక్కడ మంచి ఫాలోయింగ్ వున్న సీనియర్ స్టార్ అజిత్ తో హిట్టయ్యింది. నెరిసిన జుట్టుతో, కొన్ని పాటల్లో తప్ప - సాంతం తమిళ సాంప్రదాయపు పంచకట్టుతో అతను పాత్ర పోషించాడు.  ఇదీ అతను ఈ సినిమాకి తన వంతుగా కంట్రిబ్యూట్ చేసిన తనదైన  యూనిక్ సెల్లింగ్ పాయింట్ (యూఎస్పీ). ఇంకా తమన్నా అనే ఒక హాట్ స్టార్, అప్పటి మార్కెట్ పరిస్థితులూ ఇవీ దాని విజయానికి తోడ్పడి ఉండొచ్చు. కథగా ఇందులో కొత్త ఏమీ లేదు. పైగా ఇది స్క్రీన్ ప్లే కూడా కాదు. తమిళంలో హిట్టయింది కాబట్టి తెలుగులో డబ్బింగ్ చేసి విడుదల చేశారు. ఓ ఛానెల్లో కూడా ప్రసారమయ్యింది. అయినా పవన్ తో దీన్ని రీమేక్ చేయడానికి పూనుకున్నారు- డబ్బింగూ, ఛానెల్లో ప్రసారమూ ఇవన్నీ పవన్ స్టార్ డమ్ ధాటికి నిలబడవనే అనుకుందాం;  కథో పాత్రో తన స్టార్ డమ్ తో అద్భుతాలు చేస్తాయనే నమ్మకంతో రీమేక్ కి పూనుకున్నారనే అనుకుందాం – అయితే పాత్ర ని అజిత్ తన యూఎస్పీ గా మార్చేసినట్టు- పవన్ అలాటి దేమీ చేయలేదు.  అజిత్ ఆ గెటప్ లో బాగా వయసుపై బడిన వాడిలా వుంటాడు- అతడిలో  హీరోయిన్ తండ్రి అల్లుణ్ణి చూడడం ఎబ్బెట్టుగానే వుంటుంది. ఈ ముసలివాడితో హీరోయిన్ రోమాన్స్ ఎలా చేస్తోందని కూడా అన్పిస్తుంది. కానీ అతడిది అంత పెద్ద వయసు కాదనీ, చిన్న వయసులోనే ఆహారపుటలవాట్ల వల్ల జుట్టు తెల్లబడిందనీ చెప్పి ఈ యూఎస్పీ ని జస్టిఫై చేసుకుంటారు. 

     'సోగ్గాడే చిన్ని నాయనా’ లో హుషారైన పెద్ద నాగార్జున సాంప్రదాయ ఆహార్యం, మీసకట్టూ ఒక యూఎస్పీ. మామూలుగా వుండే చిన్న నాగార్జున సేఫ్టీ. అలాగే పవన్ కాటమ రాయుడుగా వయసుకు తగ్గ గెటప్ తో ఒక యూఎస్పీ ని సృష్టించుకుని, సేఫ్టీకోసం అతి చిన్న ముద్దుల, అల్లరి  తమ్ముడుగా ఇంకో పాత్రలో తనే నటించి వుంటే –అనూహ్యంగా వుండేది వ్యవహారం. కానీ ఇది రీబూట్. రీబూట్ జోలికి మనం వెళ్ళడం లేదు.

          ఇక కథలో వున్నదేమిటి? ఈ కథ పాయింటేమిటి?  ఇది చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే, తొలి సీనుతో  ఫ్రెష్ గా విలన్ తో బాటు, ముందునుంచే రగిలిపోతున్న పక్క విలన్ కూడా కాటమ రాయుడు అంతు చూడాలనుకుంటారు, ఆ తర్వాత  మొదటి పది నిమిషాల్లోనే కథ మలుపు తీసుకుంటూ పెళ్లి ఇష్టం లేని కాటమ రాయుడు  మీదికి తమ్ముళ్ళు హీరోయిన్ని ప్రయోగించాలనుకుంటారు, దీని తర్వాత ఇంటర్వెల్లో విలన్ ముఠాతో కాటమ రాయుడు  పాల్పడే హింస చూసి ప్రేమలో వున్న హీరోయిన్ బ్రేకప్ చెప్పేస్తుంది, ఆతర్వాత సెకండాఫ్ లో హీరోయిన్ కుటుంబ శత్రువులతో కాటమ రాయుడు తలపడి అంతు చూస్తాడు. ఇలా ఒకదాని తర్వాత ఇంకోటి పాయింట్లు దాడి చేస్తూంటాయి.  ఈ కథ ఏ పాయింటు మీద నడిచిందీ అంటే చెప్పలేని పరిస్థితి. ఒక పాయింటు ఆధారంగా కథ నడిచిందని చెప్పబోతే, మిగిలిన  పాయింట్లు ఎందుకున్నాయన్న ప్రశ్న తగుల్తుంది. కొన్ని సినిమాల్లో కథనం ఎపిసోడ్ల మయంగా వుంటూ –ఎక్కడికక్కడ ముగిసిపోతూ, స్టాప్ అండ్ స్టార్ట్ డాక్యుమెంటరీ బాపతు ఫ్లాప్ సినిమాలుగా తయారైన విచిత్రాలు చూశాం.  ‘వీరమ్’ ఇంకా తేడా. ఇందులో కథనం కాదు- స్టాప్ అండ్ స్టార్ట్ డాక్యుమెంటరీ టెక్నిక్ తో మల్టిపుల్ స్టోరీ పాయింట్లే  వచ్చి పడ్డాయి! ఇది కొత్త రికార్డు. 

         ‘వీరమ్’ మార్కెట్ యాస్పెక్ట్ కోసం యూఎస్పీ తో ఎలాగో తంటాలు పడ్డా, క్రియేటివ్ యాస్పెక్ట్ దగ్గర దొరికిపోయారు. క్రియేటివ్ యాస్పెక్ట్ పరంగా ఆర్గ్యుమెంట్ గానీ, స్ట్రక్చర్ గానీ, లాగ్ లైన్ గానీ కన్పించవు. లాగ్ లైన్ చూద్దామంటే అనేక స్టోరీ పాయింట్లు అడ్డుపడతాయి. స్ట్రక్చర్ చూద్దామన్నా అనేక స్టోరీ పాయింట్లే అడ్డుపడతాయి, ఆర్గ్యుమెంట్ చూద్దామన్నా మల్టిపుల్ స్టోరీ పాయింట్లే అడ్డుపడతాయి.

          కాబట్టి ఈ కథకి ఒక పాయింటు లేదు, పాయింటు లేక ఆర్గ్యుమెంట్ లేదు, ఆర్గ్యుమెంట్ లేక పాత్ర లేదు, పాత్ర లేక స్ట్రక్చర్ లేదు, స్ట్రక్చర్ లేక లాగ్ లైనూ లేదు. దీంతో ఇదొక సినిమాగా తీయాల్సిన కథే కాదు.  సినిమా కథలో ప్రశ్నించే ఒకే పాయింటు వున్నప్పుడే అన్నీ దారిలో పడతాయి. ప్రశ్నించనప్పుడు చూస్తున్నది సొదలాగే వుంటుంది ప్రేక్షకులకి. సినిమా కెళ్ళే ప్రేక్షకులు హీరోని పరీక్షకెళ్ళే – ప్రశ్నలకి జవాబులిచ్చే - విద్యార్థిగా చూడాలనుకుంటారు గానీ, పరీక్ష తీసుకునే మాస్టారుగా చూడాలనుకోరు. ఎందుకంటే ఇక్కడ విద్యార్థి ఆసక్తి కల్గించే యాక్టివ్ పాత్ర, మాస్టారు కూర్చుని వుండే పాసివ్  పాత్ర. 

          కనుక ఈ ‘కథ’ రీబూట్ కి తప్ప ని రీమేక్  పనికి రాదని తెలిసిపోతోంది. రీమేక్ కోసం చేసిన ఉపరితల మార్పు చేర్పులేమిటంటే, అసలే పనిలేకుండా వున్న మొదటి విలన్ కి పక్క విలన్ గా బిల్డప్ ఇచ్చి  ఇంకో పాత్ర సృష్టించడం, అలాగే తమన్నా శిల్పి పాత్రని శృతీ హాసన్ గాయని పాత్రగా మార్చడం. ‘వీరమ్’ లో ఇదే మొదటి విలన్ అయిన ప్రదీప్ రావత్ స్థానిక మార్కెట్ యార్డ్ ని శాసించే వ్యాపారిగా, కథలో తక్కువ ప్రాధాన్యం కలిగి వుంటాడు. రీమేక్ లో ఈ పాత్రని రావురమేష్ కిచ్చి, పక్క విలన్ గా కొత్త పాత్రని సృష్టించారు. ప్రదీప్ రావత్ నేమో మొదటి విలన్ ని చేసి,  బిగ్ షాట్ గా అట్టహాసంగా కథకి ఇతనే ప్రత్యర్ధి అన్నట్టు చూపారు. ఇంటర్వెల్ తర్వాత ఇంత కష్టపడి క్రియేట్ చేసిన ఈ విలన్ నే వదిలేశారు.  

          తమిళంలో అంతగా ప్రాధాన్యం లేకుండా వున్న ఫస్టాఫ్ విలన్ ని, ఏ దృష్టితో ఇంత బిల్డప్ తో తెలుగులో అర్ధం లేకుండా మార్చారు? ఉపరితల మార్పులు అసలుకే ఎసరు
.  కథకి ఇద్దరు విడివిడి విలన్లుండడం బాక్సాఫీసుకి క్షేమం కాదనేది ఎలా మర్చిపోయారు. ఏ కథకైనా విలన్ ఒకడే వుంటాడు. ఎందుకంటే సమస్య- సంఘర్షణ-  పరిష్కారమనే యూనివర్సల్  స్క్రీన్ ప్లే ఒక విలన్ వుంటేనే ఏర్పడుతుంది. ఎలా పడితే అలా చేసేవి కమర్షియల్ సినిమా స్క్రీన్ ప్లేలు కావు, ఆర్ట్ సినిమా లేదా ఇండీ ఫిలిమ్స్ స్క్రీన్ ప్లేలు. ఇందుకే మన సినిమాలు కమర్షియల్ సినిమా ముసుగేసుకున్న ఉత్త ఆర్ట్ సినిమాలవుతున్నాయి.

      ఇక శృతీహాసన్ ఉపరితల మార్పుపాత్ర అయితే, కథని రెండుముక్కలు చేస్తూ - విన్నర్, నేనులోకల్, గుంటూరోడు టైపు అరిగిపోయిన ఇంటర్వెల్ సీనిచ్చింది. సెకండాఫ్ పట్ల ఏ మాత్రం ఆసక్తి కల్గించని, ఇక సెకండాఫ్ లో ఏం జరుగుతుందో తెలిసిపోయే, సెకండాఫ్ ని ఇక చూడనవసరం లేదని తేల్చేసే  ఇంటర్వెల్ మలుపు ఇది. ‘వీరమ్’ లో ఇలా లేదు!

          ‘వీరమ్’  ఇంటర్వెల్ కి మాస్టర్ స్ట్రోక్ ఇచ్చాడు దర్శకుడు మహానుభావుడు. అతుకులబొంత కథకి  కూడా ఇంటర్వెల్లో తెలిసో తెలీకో మెరుపులు మెరిపించాడు తమన్నా పాత్రతో. కనీసం ఈ మెరుపుల వల్ల ఇంటర్వెల్ దగ్గరే కథ తెగిపోయి, సెకండాఫ్ సిండ్రోం అనే సుడిగుండంలో పడలేదు సినిమా. 

          రైలు ప్రయాణంలో అజిత్ విలన్ ముఠాతో పాల్పడే హింసని చూసి కళ్ళు తిరిగి అలా.....పడిపోవడం మాత్రమే చేస్తుంది తమన్నా. అజిత్ ఆగిపోయి చూస్తూంటాడు. అలా చూస్తూంటే సింపుల్ గా విశ్రాంతి పడుతుంది. 

          ఇంటర్వెల్లో పెద్ద బ్యాంగే  ఇవ్వనవసరం లేదనీ, సన్నివేశం చేసే డిమాండ్ ని బట్టి సింపుల్ గానూ వుండొచ్చనీ సిడ్ ఫీల్డ్ అంటాడు –
the function of the mid- point is to keep the story moving  forward, it is a link in the chain of the dramatic action connecting the First Half of Act -2, with the Second Half of Act -2  అనీ,  it can either be a quiet moment అనీ అంటాడు.కమర్షియల్ సినిమాల గురించే అన్నాడు, కళాత్మక సినిమాల గురించి ఎప్పుడూ అనలేదు.

         
‘వీరమ్’ ఇంటర్వెల్లో  వున్నది ఈ  quiet moment- నిశ్శబ్ద క్షణాలే. పైన చెపినట్టు అజిత్ హింసని చూసి తమన్నా కళ్ళు తిరిగి పడిపోతుంది. అతనామెనే  కళ్ళప్పగించి చూస్తూంటే విశ్రాంతి పడుతుంది.  దీంతో దానికదే కథ సెకండాఫ్ లోకి స్మూత్ గా ఫ్లో అయ్యింది, ఫస్టాఫ్- సెకండాఫ్ రెంటినీ కనెక్ట్ చేస్తూ. అంటే కథ ముందుకు సాగిందే తప్ప తెగిపోలేదు. అతడి హింసని ఆమె చూసి కళ్ళు తిరిగిపడిపోయింది – ఇప్పుడేమిటి?-  అన్న ప్రశ్న ఏర్పడింది. ఇప్పుడేం జరుగుతుంది?- అన్న సస్పెన్స్ ని కూడా సెకండాఫ్ పట్ల కల్గించింది. ఇక్కడితో ఆసక్తి చచ్చిపోకుండా కాపాడింది. ఏదైతే పరిస్థితిని మాత్రమే చూపిస్తే బలంగా వుంటుందో, దాన్ని మాటలతో  చెప్పిస్తే తేలిపోతుంది! ఇక్కడ తమన్నా గానీ, అజిత్ గాననీ ఒక్క డైలాగు పలికినా మొత్తం నాశనమయ్యేది   సెకండాఫ్ సహా.  అంటే ఈ సీన్ ని  డైలాగుల జోలికి పోకుండా,  సబ్ టెక్స్ట్ తో నిర్వహించి పైకెత్తారన్న మాట. 

         ‘కాటమ రాయుడు’ లో డైలాగులు పెట్టేశారు శృతీహసన్ కి. కాటమ రాయుడి హింసని వ్యతిరేకించి, ప్రేమని తెంచుకుని వెళ్ళిపోయే ఎమోషనల్ డైలాగులు! దీంతో మొత్తం చెడిపోయింది. కథ ఇక్కడ తెగిపోయింది. కథ తెగిపోవడంతో సస్పెన్స్ లేకుండా పోయింది.. సెకండాఫ్ ఏం జరుగుతుందో తెలిసిపోయింది. సినిమా ఇక్కడే ఫ్లాప్ అయ్యింది. టెంప్లెట్ సినిమాల్లో ఇంతే- ఇంకా ఇలాటి ఛాలెంజిలతోనే ఇవే   కాలం  చెల్లిన  ఇంటర్వెల్స్. 

          టెంప్లెట్ ఇంటర్వెల్స్  ఈ మూడు నెలల కాలంలోనే మచ్చుకి కొన్ని- ‘గుంటూరోడు’లో  హీరోయిన్ తో పెళ్లి గురించి ఆమె అన్నతో హీరో ఛాలెంజ్!  
 ‘నేను లోకల్ లో హీరోయిన్ పెళ్లి సీనులో హీరోతో ఆమె తండ్రి ఛాలెంజ్!  విన్నర్ లో పెళ్ళి సీనులో హీరోకి కన్నతండ్రి ఛాలెంజ్!  ‘కాటమ రాయుడు’ ప్రేమ గురించి హీరోకి హీరోయిన్ ఛాలెంజ్!   

          ఇంటర్వెల్ ఛాలెంజ్! ఛాలెంజ్!! ఛాలెంజ్!!! తొడగొట్టి మీసం తిప్పి మరీ బాక్సాఫీసుతో ఛాలెంజ్!!!!   

          ఎప్పటికప్పుడు మారిపోయే బాక్సాఫీసు హుండీల్లో చెల్లని టెంప్లెట్ నాణేలు...
  
ఎక్కడి కథలివి...ఎప్పటి ఇంటర్వెల్స్ ఇవి...ఏం ప్రేమలివి...ఏం పెళ్ళిళ్ళు ఇవి... ఎప్పటి
ఛాలెంజులివి... ఏం మనుషులు వీళ్ళు... ఏ జమానాలో జీవిస్తున్నారింకా... తిప్పి తిప్పి కొడుకుతున్నారు సామాన్య ప్రేక్షకులు కూడా ఇందుకే. మన కళ్ళముందు కూరగాయలమ్మే ముసలమ్మ,  సెల్ ఫోన్లో మాటాడుతూ  ‘స్ట్రెయిట్ గా పో’ అని చెప్పగల్గి  డెవలప్ అవుతున్న డిజిటల్ ప్రపంచంలో,   ఇంకా టెంప్లెట్ ఆమ్లెట్స్  అమ్ముకుంటూ గడపడం జాతీయ స్థూల ఉత్పత్తికి ఏ మాత్రం దోహదం చెయ్యని నేరపూరిత నిర్లక్ష్య కార్యమే.

       ఇంటర్వెల్ తర్వాత మొదటి సీను నుంచే ‘కాటమ రాయుడు’ నీరసపడిపోవడాన్ని స్పష్టంగా ఫీలవ్వొచ్చు. కానీ ఇక్కడ్నించీ ‘వీరమ్’ దర్శకుడు అజిత్ తో కాస్తయినా పాత్రని నిలబెట్టే ప్రయత్నం చేశాడు. అర్ధోక్తిలో ఆపేసిన ఇంటర్వెల్ తర్వాత నుంచి సెకండాఫ్ లో ఏంజరగబోతుందీ  అని ఆసక్తితో చూస్తూంటే, అజిత్ తమన్నా  వున్న హస్పిటల్ బయట వుంటాడు. తర్వాత ఆమె పూర్తిగా కోలుకున్నాక ఆమె ఇంటికే వెళ్తాడు. జరిగిందానికి  సారీ చెప్తాడు. ఆమె కోరుకున్నట్టే మారడానికి ప్రయత్నిస్తానంటాడు. అప్పటికి కూడా ఆమె పల్లెత్తు మాటనదు. మనకి  అర్ధమైపోతున్నప్పుడు  వేరే అనాల్సిన అవసరం లేదు. ఇదంతా సెన్సిబుల్ గా, సస్పెన్స్ ఫుల్ గా  వుంటుంది-  అజిత్ పాత్రని నిలబెడుతూ.

          ఇలా కాకుండా కాటమ రాయుడు  తమ్ముళ్ళు విసిరే సవాలుకి తనని ఛీకొట్టిన హీరోయిన్ గ్రామానికి వెళ్ళిపోయి అక్కడ పడిగాపులు గాస్తూ డౌన్ అయిపోతాడు. ఆమె ఇంట్లో ఎలా తిష్ట వేయలా అని కామెడీగా ప్రయత్నాలు చేస్తాడు. ఇలా రాంగ్ ఇంటర్వెల్ సీను బాధితుడుగా మారిపోయి హీరోయిన్ కి సారీ కూడా చెప్పడు. ఆమె వూళ్ళో ఆమె దగ్గరికి అజిత్ వెళ్ళడానికి గల నేపధ్యం అర్ధవంతంగా వుంటే, పవన్ వెళ్ళడంలో అర్ధమే లేకుండా వుంది - ఇంటర్వెల్ సీను పుణ్యమాని.

          ఇంటర్వెల్లో తమన్నా ఛాలెంజి చేయకపోవడంతో, తర్వాత అజిత్ సారీ చెబితే వ్యతిరేకించకుండానూ వుండడంతో, ప్రేమలో సంఘర్షణ అనే పాయింటు తొలగిపోయి- ఆమె కుటుంబ శత్రువు మీదికి మళ్ళింది స్టోరీ పాయింటు- అదే వేరే విషయం. కానీ కాటమ రాయుడులో ఇంటర్వెల్ లో హీరోయిన్ ఛాలెంజింగ్ గా మాటాడి పాయింటు ఎస్టాబ్లిష్ చేసింది. కానీ ఇంటర్వెల్ తర్వాత ఆమెతో దీనిమీదే కథ వుండదు.  సింపుల్ గా ఆమె కథలోంచి అదృశ్య మైపోతుంది. ఆమె కుటుంబ శత్రువుని కాటమ రాయుడు అంతం చేశాక వచ్చేసి ప్రేమకి ఓకే అనేస్తుంది.

          కథని ‘జెనిటికల్’ గా రీబూట్ చేయకుండా ఈ పైపైన ఉపరితల మార్పులు చేసి సాధించిందేమిటి?  తమిళంలో ఉన్నది ఉన్నట్టు తీసినా  ఉట్టి కొట్టేవాడేమో కాటమ రాయుడు- ఇవ్వాళ ఉగాది పచ్చడి కూడా ఎంజాయ్ చేస్తూ!



-సికిందర్ 
cinemab
azaar.in

Friday, March 24, 2017

రివ్యూ!



దర్శకత్వం : కిషోర్ కిషోర్ పార్థసాని

తారాగణం : పన్ళ్యాణ్, శృతీహాసన్, రావు మేష్, ప్రదీప్ రావత్, తరుణ్ అరోరా, ల్ కామరాజు, శివ బాలాజీ, చైతన్య కృష్ణ, అజయ్, అలీ, పృథ్వీ  దితరులు
కథ : శివ,  స్క్రీన్ ప్లే : వాసూ వర్మ, దీపక్ రాజ్, రచన : ఆకులశివ, వేమారెడ్డి, శ్రీనివాస రెడ్డి, తిమ్మా రెడ్డి; సంగీతం
: అనూప్ రూబెన్స్, ఛాయాగ్రణంః ప్రసాద్ మూరెళ్ల
బ్యానర్ :
నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్
నిర్మాతః
 త్ రార్
విడుదల : మార్చి 24, 2017

         ***


        గబ్బర్ సింగ్’  సీక్వెల్ గా  ‘సర్దార్ గబ్బర్ సింగ్’ లో నటించి భంగ పడ్డ పవన్ కల్యా ణ్  రీమేక్ మీద దృష్టి పెట్టి, 2014 లో తమిళంలో అజిత్- తమన్నాలు నటించిన  ‘వీరమ్’ ని ‘కాటమ రాయుడు’ గా మార్చుకుని ప్రేక్షకుల ముందు కొచ్చారు. ‘వీరమ్’ తెలుగులో డబ్బింగ్ అయి ‘వీరుడొక్కడే’ గా విడుదలయింది. డబ్బింగ్ అయిన సినిమాని రీమేక్ చేయడం చాలా అరుదుగా జరుగుతుంది. పవన్ కల్యాణ్  తన స్టార్ పవర్ తో డబ్బింగ్ ప్రభావాన్ని ని అధిగమించవచ్చన్న నమ్మకంతో రిస్కు చేశారు. మరి ఈ రిస్కు పే చేసిందా? ఈ రిస్కులో వున్న రిస్కేమిటి? రిస్కు రిస్కు కాకుండా ఎప్పుడుంటుంది? రిస్కు రిస్కు అయినప్పుడు ఇంకేం రిస్క్ చేయాలి.... ఇత్యాది సందేహాలకి సమాధానాలు ఈ కింద వెతుకుదాం...

కథ 
    రాయల సీమలో రాయల్ గా బతికే కాటమరాయుడు (పవన్ కల్యాణ్) కి నల్గురు తమ్ముళ్ళు (ల్ కామరాజు, శివ బాలాజీ, చైతన్య కృష్ణ, అజయ్), ఈ తమ్ముళ్ళ తో పాటు వుండే వకీలు (అలీ). తమ్ముళ్ళని అమితంగా ప్రేమించే కాటమరాయుడు పెళ్లి చేసుకోవాలనుకోడు. చేసుకుంటే ఆ వచ్చే భార్యవల్ల అన్నదమ్ముల అనుబంధం చెడి పోతుందనుకుంటాడు. పెళ్లి మాటెత్తితే శివాలెత్తి పోతాడు. కనుక తమ్ముళ్ళతో బాటు వకీలు లింగబాబు రహస్య ప్రేమాయణాలు మొదలెట్టుకుంటారు. కానీ అన్నకి పెళ్లి కాకుండా  తాము చేసుకోలేమని, అన్నని ప్రేమలోకి దింపాలనీ  ప్లానేస్తారు. ప్లాను ప్రకారం అవంతిక ( శృతీ హాసన్)  అనే క్లాసికల్ డాన్సర్ చేత వూళ్ళో  ప్రోగ్రాం ఇప్పించి ఆమెకి కాటమరాయుడు పడేలా చేస్తారు. ప్రేమలో పడ్డ కాటమరాయుణ్ణి తండ్రి (నాసర్)కి పరిచయం చేద్దామని అవంతిక తన వూరికి తీసుకుపోతూండగా దుండగులు కాటమరాయుడి మీద దాడి చేస్తారు.  అప్పుడు తిరగబడ్డ కాటమరాయుడి ప్రతాపం చూసి అవంతిక తనకి ఇలాటి హింసావాది వద్దని, అహింసా వాదియైన  తండ్రికి ఇది చెప్పుకోలేనని తెగతెంపులు చేసుకుని వెళ్ళిపోతుంది...

          పడకపడక ప్రేమలో పడ్డ కాటమరాయుడి పరిస్థితి ఇప్పుడేమిటి? ఆమె మనసు మార్చాడా, లేక తను మరాడా? ఆమె కుటుంబం వెనుక కథేమిటి? ఆమె కుటుంబాన్ని కూడా తను ఎలా కాపాడాడు?... ఇవి తెలుసుకోవాలంటే  వెండి తెరని ఆశ్రయించాల్సిందే.

ఎలావుంది కథ 
      నిజానికిది 1954 నాటి హాలీవుడ్ క్లాసిక్ ‘సెవెన్ బ్రైడ్స్ ఫర్ సెవెన్ బ్రదర్స్’  కి  తిరగేసిన వెర్షన్ లాంటి కథలా వుంటుంది. ఈ హాలీవుడ్ క్లాసిక్ ని 1982 లో అమితాబ్ బచ్చన్,  హేమమాలినిలతో  ‘సత్తేపే సత్తా’ మ్యూజికల్ హిట్ గా తీశారు. పొలం పనులు చూసుకునే అన్న మాట జవదాటని ఆరుగురు తమ్ముళ్ళుంటారు. వీళ్ళకి నాగరికత తెలీదు, మ్యానర్స్ వుండవు. అడవి మనుషుల్లా వుంటారు. ఈ వెధవలుంటే తన పెళ్లి కాదని హేమమాలినిని ప్రేమించే  అమితాబ్ బచ్చన్, తనకి ఒక్కడే తమ్ముడున్నాడని అబద్ధం చెప్పి పెళ్ళిచేసుకుని తీసుకొస్తాడు. రాగానే ఆమె ఈ చంఢాలమంతా చూసి, ఖర్మ అనుకుని ఆ కోతుల్ని మనుషులుగా మార్చే పనిలో పడుతుంది. ప్రేమల్లో కూడా పడేస్తుంది ఆరుగురమ్మాయిలతో. అప్పుడు రంగ ప్రవేశం చేస్తాడు అచ్చు అమితాబ్ బచ్చన్ లా వుండే విలన్ (అమితాబ్ డబుల్)...చాలా ఫన్నీగా వుంటుంది ఈ కథ. ఈ కథతో 1984 లో తెలుగులో కృష్ణ –జయసుధలతో టి. కృష్ణ దర్శకత్వంలో ‘అందరికంటే మొనగాడు’ వచ్చింది. కానీ నేటివిటీ సమస్యవల్ల ఆడలేదు.

          ఈ కథ ‘వీరమ్’ లో  పెళ్లి వద్దనే అన్న- కావాలనుకునే తమ్ముళ్ళ దాగుడుమూతల డ్రామాగా రూపం మార్చుకుంది. ఇదే మార్పులు లేకుండా  ‘కాటమరాయుడు’ గా రీమేక్ అయింది. 

ఎవరెలా చేశారు.
        కాటమ రాయుడిగా పవన్ చివరంటా  డామినేట్ చేశారు. కీలకమైన నల్గురు తమ్ముళ్ళ పాత్రల్ని, తనని సమస్యలో పడేసే హీరోయిన్ పాత్రనీ పక్కకు నెట్టేశారు. పక్కకి నేట్టేశాక తనకి మిగిలింది పది నిమిషాలకో సారి భారీ యాక్షన్ సీన్సే, ఓ ఆరు పాటలే. యాక్షన్ సీన్స్, పాటలూ వీటి ఆధారంగా తన స్టార్ పవర్ తో  సినిమాని నిలబెట్ట వచ్చను కున్నారు. సూర్య కూడా తన ‘సింగం -3’ తో ఇలాగే వన్ మాన్ షో చేస్తే, సెకండాఫ్ నుంచే అది మొనాటనీ బారినపడి చతికిలబడింది. ‘వీరమ్’ లో అజిత్ స్టార్ పవర్ తో – ఆ స్టార్ పవర్ కి తోడు  తనెలా వుంటాడో అలా నెరసిన జుట్టుతో, సాంతం పంచె కట్టుతో  నటించి - ఆ  లుక్ ని బాక్సాఫీసు విజయానికి యూఎస్పీగా  మార్చేశాడు. అంతేగానీ కథతో కాదు. పవన్ కల్యాణ్  అప్పుడప్పుడు పంచె కట్టడం తప్ప పాత్రకి తగ్గ లుక్ పై అస్సలు శ్రద్ధ పెట్టలేదు. తన పాత్రకి మారని తన రొటీన్ మీసకట్టే ఇబ్బందికరంగా తయారయ్యింది. ట్రిమ్ చేసిన అలవాటైన మీసాన్ని తిప్పబోతే చేతికే రావడం లేదు- లేని మీసాన్ని తిప్పడమెందుకు అనుకునేట్టు వుంది.  బాక్సాఫీసు విజయంకోసం తన వంతు యూఎస్పీ గా పవన్ ఏమీ ఇచ్చినట్టు కన్పించదు - కొత్తగా తనేం ఇచ్చినా ఇవ్వకపోయినా  ఫ్యాన్స్  మోసేస్తారులే అన్నట్టుంది. 

          ఫస్టాఫ్ లో శృతీహాసన్ తో ప్రేమ సన్నివేశాల్లోనే పవన్ అభిమానుల్ని అలరిస్తాడు. అయితే ఆరు పాటలున్నా అవి పెద్దగా ఆకట్టుకునేలా లేకపోవడంతో  తన స్టార్ పవర్ తో వాటికి ఊపు తీసుకురావడం సాధ్యం కాలేదు. మొత్తం మీద చెప్పొచ్చేదేమంటే,  తన స్టార్ పవర్ యాక్షన్ సీన్స్ కి పనికొచ్చిందే గానీ,  దారితప్పిన స్టోరీ పవర్ తనకి చాల్లేదు. 

          శృతీహాసన్ ‘సింగం -3’ లో ఎలా వుందో అలాగే వుంది. అదుపులోలేని షేపుతో, వన్నె తగ్గిన అందాలతో. పాత్రకూడా బలి అయిపోయింది.  ఇంటర్వెల్ లో కథని మలుపు తిప్పిన తను, తర్వాత ఆ ప్రేమ కథకి ప్రత్యర్ధిగా వుండక- ప్రేక్షక పాత్ర వహించింది.

          తమ్ముళ్ళ పాత్రల్లో నల్గురూ ప్రాధాన్యం లేక మగ్గి పోవాల్సి వచ్చింది. అలీ అయితే పాపం జాలి గొల్పే స్థితి. పృథ్వీ అయితే ఇంకా దయనీయ స్థితి. కమెడియన్లు కూడా వాళ్ళ సహజ పద్ధతిలో కామెడీ చేసుకునే స్వేచ్ఛతో కన్పించరు. విలన్లు తప్పించి, తమ్ముళ్ళు సహా  అందరూ, కాటమరాయుడి  భయానికి అన్నట్టు, చాటు మాటుగా వచ్చేసి గుసగుసలాడి వెళ్లిపోయే సెన్సార్  షిప్ బాధితుల్లాగా కన్పిస్తారు.  

          ప్రదీప్ రావల్, తరుణ్ అరోరా అనే ఇద్దరు విలన్లు వున్నారు. ఫస్టాఫ్ ప్రదీప్ తన పాత్ర చాలించుకు వెళ్ళిపోతే, సెకండాఫ్ తరుణ్ అరోరా స్వీకరిస్తాడు. పక్క విలన్ గా శాడిస్టుగా మొత్తమంతా రావురమేష్ వుంటాడు- ముగ్గురితో వచ్చిన సమస్యేమిటంటే, ముగ్గురూ పవన్ స్టార్ పవర్ కి తగ్గ విలన్ పాత్రలు కాలేకపోవడం. పక్క విలన్ వుంటే వుండొచ్చు గానీ, ఇలా ఒక ప్రధాన విలన్ వెళ్లిపోయి, ఆ స్థానంలో  మరో విలన్ వచ్చే సినిమాలు ఎక్కడా ఆడలేదు.

          అనూప్ రూబెన్స్ ఈసారి స్టార్ సినిమాకి సరిపోలేదు. పవన్ సినిమాల్లో పాటలు ఎప్పుడూ ఇంత బలహీనంగా లేవు. ప్రసాద్ మూరెళ్ళ ఛాయాగ్రహణం, రామ్ – లక్ష్మణ్ ల పోరాటాలు మాత్రం బావున్నాయి. ప్రొడక్షన్ విలువలు భారీగా వున్నాయి. స్క్రిప్టు మీద కూడా (ఆరుగురు రచయితలు) భారీగానే ఖర్చు పెట్టినట్టున్నారు. ఇవన్నీ పొందిన దర్శకుడు కిషోర్ ఈ రీమేక్ ని ఎక్కడో పట్టాలు తప్పించినట్టు మాత్రం ప్రేక్షకులే కాదు, ఫ్యాన్స్ కూడా అనుకుంటున్నారు.

చివరికేమిటి?

      డబ్బింగ్ అయిన సినిమాని రిమేక్ చేయడం స్టార్ పవర్ వుంటే రిస్కు కాకపోవచ్చు, కానీ ఆ వొరిజినల్ లో అసలు దేన్ని రిస్క్ చేశారో తెలుసుకోకపోతే  రీమేక్ చేయడం రిస్కే అవుతుంది. ఒక భాష లో ఒక సినిమా హిట్టవడం ఒక్కటే  రిమేక్ చేయడానికి గీటు రాయి అయితే, అన్ని రీమేకులూ హిట్టే అవుతాయి. ‘వీరమ్’ హిట్టవడానికి అజిత్ యూఎస్పీ (యూనిక్ సెల్లింగ్ పాయింట్), తమన్నా గ్లామర్ కోషెంట్,  దేవీశ్రీ ప్రసాద్ పాటలు, విడుదలైన 2014 నాటి పరిస్థితులు, తమిళ ప్రేక్షకుల అభిరుచులు, పెట్టిన బడ్జెట్ ...మొదలైనవి అనేకం తోడ్పడి వుంటాయి. ముమ్మాటికీ ‘వీరమ్’ దాని కథాకథనాలతో హిట్టవలేదని స్థానిక, జాతీయ మీడియాల్లో వచ్చిన రివ్యూలు చదివితే తెలిసిపోతుంది. కానీ కథా కథనాలనే నమ్మి, అజిత్ పోషించిన పాత్ర కూడా ఆకర్షించి  తెలుగులో రీమేక్ చేసినట్టు కన్పిస్తోంది. ఇది రిస్కే, మిగతా వాటిని పట్టించుకోక పోతే. ‘వీరమ్’ నే అవకతవక కథా కథనాలతో రిస్క్ చేసి, మిగతా పైన చెప్పుకున్న అంశాలతో కవర్ చేస్తేగానీ  అది హిట్టవ లేదని తెలుస్తోంది. రిస్కు ఎప్పుడు రిస్కు కాకుండా వుంటుందంటే- ఒరిజినల్ హిట్ చుట్టూ వుండే  కారణాలన్నీ  రీమేక్ కి కూడా బదలాయింపు అయినప్పుడు మాత్రమే. కానప్పుడు ఆ కథా కథనాల తాలూకు లొసుగులన్నీ వెంటాడతాయి. 


          ‘వీరమ్’ కి కథ కొకరు, మాటలకి ఒకరు ఇద్దరే రచయితలుంటే (ఇద్దర్లో  ఒకరు దర్శకుడు), ‘కాటమ రాయుడు’ రీమేక్ కి దర్శకుడితో  కలిపి ఏడుగురున్నారు! ఇంకా పవన్ ఇన్ పుట్స్ కూడా వుంటాయి. ఇంతమంది కలిసి ఒక్కటే గుర్తించలేకపోయారు- ఈ కథ ఇంటర్వెల్ దగ్గరే ఫ్రాక్చర్ అయి సెకండాఫ్ సిండ్రోమ్  లో పడిందని, ఈ కథకి కేంద్రబిందువుగా ఒకే సమస్యతో కూడిన సంఘర్షణ లేదనీ;  ఫస్టాఫ్ హీరో కథకి ఒక విలన్ తో ఒక సంఘర్షణ పూర్తయ్యాక, సెకండాఫ్ హీరోయిన్ కథకి ఇంకో విలన్ తో మొదలయ్యిందనీ! 

          ఇంకా చెప్పుకోవాలంటే , కథ ప్రారంభిస్తూనే పాయింటు లో కెళ్ళే కథలు ఫస్టాఫ్ వరకే సరిపోయి, సెకండాఫ్ లో వేరే కథగా సాగడం తెలుగు సినిమాల్లో తరచూ చూస్తున్నాం. ఇలాటి వన్నీ ఫ్లాపయ్యాయి- తెలివిగా మేనేజ్ చేయడం వల్ల  ‘దొంగాట’ తప్ప. ప్రస్తుత స్క్రిప్టుకి రచయితల్లో ఒకరైన వేమారెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘చక్కిలిగింత’ కి ఇదే జరిగిందని రివ్యూలో రాశాం. ఇది తెలుసుకుని వుంటే ‘వీరమ్’ కథలోనూ దీన్ని పసిగట్టి కిం కర్తవ్యం ఆలోచించే వారేమో.

          ‘కాటమరాయుడు’ ఎంతవరకు ఈ లోపాల్ని పవర్ స్టార్ స్టార్ పవర్ తో జయిస్తుందో ఈ వారాంతం తర్వాత తేలుతుంది.

-సికిందర్

(స్క్రీన్ ప్లే సంగతులు సోమవారం) 



Friday, March 17, 2017

రివ్యూ!





రచన - దర్శత్వం: కుమార్ ట్టి
తారాగణం: శ్రీ విష్ణు, చిత్రా శుక్లా , కాశీవిశ్వనాథ్, నా, జెమినీ  సురేష్ తదితరులు
సంగీతం: సురేష్ బొబ్బిలి, ఛాయాగ్రణం: శ్యామ్
బ్యానర్ : వెన్నెల క్రియేషన్స్
నిర్మాత:  బి. ప్రకాష్ రావు
విడుదల : మార్చి 17, 2017

***

        న్యూ జనరేషన్ హీరో శ్రీ విష్ణు ఉన్నట్టుండి పాత మూస కెళ్ళి పోయి షాకిచ్చాడు. మామూలు షాక్ కాదు న్యూజనరేషన్ ఆడియెన్స్ కీ, బాక్సాఫీసుకీ. అప్పట్లో ‘ఒకడుందే వాడు’ సెమీ రియలిస్టిక్ సక్సెస్ తో తన మీద పెంచుకున్న ఆశలన్నీ వమ్ము చేశాడు. అప్పట్లో శ్రీ విష్ణు అని ఒకడుండేవాడు అని చరిత్రలో తన చాప్టర్ రాసుకునేందుకు వెళ్ళిపోయాడు. తన మీద కొత్తగా ఆసక్తి పెంచుకుంటున్న న్యూ జనరేషన్ ఆడియెన్స్ లో నవ్వుల పాలయ్యేందుకూ సిద్ధపడ్డాడు. ఇలాటి సినిమాల కాలం అయిపోయిందబ్బాయ్ అని మహామహుల సినిమాలనే తిప్పికొడుతున్న ప్రేక్షకుల ముందు తగుదునమ్మాయని పేలవంగా ప్రత్యక్షమయ్యాడు. 

          
నగనగా పూరీజగన్నాథ్ తీసిన సినిమాలుండేవి. వాడేసి, అరిగిపోయిన అవే మాఫియా కథలతో ఒక యాక్షన్ సీన్ – ఒక కామెడీ సీన్- ఒక లవ్ సీన్- ఒక పాట;  మళ్ళీ ఒక యాక్షన్ సీన్- ఒక కామెడీ సీన్- ఒక లవ్ సీన్- ఒక పాట; మళ్ళీ ఒక...ఇలా రంగులరాట్నంలా స్క్రీన్ ప్లే గిర్రున తిరుగుతూ, అవే సీన్లు జతకట్టి రిపీటవుతూ మనకళ్ళు తిరిగేలా చేసేవి. ఆహా, పేరొస్తే సినిమాకథ రాయడం ఎంత సులభం అన్పించేది. మహాత్మాగాంధీ చరఖా తిప్పుతూ నూలు వడికినట్టు, పదిహేను రోజులు బ్యాంకాక్  బీచిలో కూర్చుని రంగులరాట్నం తిప్పుతూ పై వరసక్రమంలో సీన్లు పడేసుకుంటూ పోతే అదే స్క్రీన్ ప్లే అయి కూర్చునేది చచ్చినట్టూ. పూరీ పేరొచ్చాక ధీమాగా చేసిన ఈ పనిని  కొత్త దర్శకుడు ఉత్సాహపడి ‘పూరీ నా  ఆదర్శం’ అని డిక్లేర్ చేసుకుంటున్నట్టు, తొలి సినిమాతోనే రంగులరాట్నం తిప్పి పూర్తిచేశాడు. ఈ దెబ్బతో తను కూడా కేరాఫ్ బ్యాంకాక్ బీచి అయిపోవాలని, రంగులరాట్నంతో స్క్రీన్ ప్లే గాంధీ అన్పించుకోవాలనీ వ్యూహం పన్ని  వుండొచ్చు. కానీ మోకాలొడ్డే న్యూజనరేషన్ ప్రేక్షకులు పొంచి వుండి ఠకీల్మని కిందపడేశారు. ఈ ప్రేక్షకులే పూరీని కూడా ఠపా ఠపా పడేస్తూ వచ్చారు ఈ మధ్య. ఇది తెలుసుకోలేదు పూరీ ఏకలవ్య శిష్యుడు!  నిర్మాత చేత శ్రీ విష్ణు మార్కెట్ కి మించిన అత్యంత  భారీ స్థాయిలో ఖర్చుపెట్టించి, బ్యాంకాక్ సముద్రంలో నిమజ్జనం చేశాడు. 

          పూరీ మేనియాలో దర్శకుడు తీస్తున్నది టెర్రరిజమా, మాఫియానా  సఅని కూడా చూసుకోవడం కుదర్లేదు- అచ్చు గుద్దినట్టు పూరీ మార్కు రిచ్ హై ఫై మాఫియాల్లా చూపించేశాడు టెర్రరిస్టుల్ని. ఏ సీను తీసినా పూరీయిజం ప్రకటితమయ్యే మాఫియా లుక్ తో బ్రహ్మాండంగా వుండాలనుకుని జానర్ మర్యాదని మర్చిపోయాడు. ‘అప్పట్లో ఒకడుండే వాడు’ లో అంత జానర్ మర్యాదతో వున్న ‘మా అబ్బాయి’ శ్రీ విష్ణు కూడా జానర్ మర్యాదంతా కడిగిపారేసి, జోకర్ వేషం వేశాడు. 2015 నుంచి ఏ సినిమా జానర్ మర్యాదతో వుందో దానికే ఆచి తూచి మార్కులు వేస్తున్నారు ప్రేక్షకులన్న సంగతి కూడా,  తన  ప్రొఫెషన్ లో తెలుసుకునే తీరిక లేదు తనకి. 

          టెర్రరిజం దేశం మీద దాడితో సమానమైన దుష్టత్వం. దేశద్రోహం. దీంతో కాంప్రమైజ్ అవడం కుదరదు. టెర్రరిస్టులుగా ముస్లిములు వుంటున్నట్టయితే ఆ పాత్రలనే టెర్రరిస్టులుగా చూపించాలి. ఎవరి మనోభావాలో దెబ్బ తింటాయని బ్యాలెన్స్ చేస్తూ హిందూ పాత్రల్ని చూపించినప్పుడు ఆ కథే విశ్వసనీయతని  కోల్పోతుంది. 

          ఒకప్పుడు హిందీ ఫార్ములా సినిమాల్లో  చెడ్డ ముస్లింని చూపిస్తే, బ్యాలెన్స్ చేస్తూ మంచి ముస్లింని కూడా చూపించే వాళ్ళు. చెడ్డ పోలీసుని చూపిస్తే మంచి పోలీసుని కూడా చూపించేవాళ్ళు. కాలక్రమంలో చెడ్డ పోలీసుని బ్యాలెన్స్ చేయకుండా చెడ్డ పోలీసు ఒక్కడ్నే చూపించే బెటర్ మెంట్ వచ్చింది అన్ని భాషల  సినిమాల్లో. కానీ చెడ్డ ముస్లిం కి బ్యాలెన్సింగ్ అలాగే కొనసాగుతోంది. హృతిక్ రోషన్ ‘కాబిల్’ లో రేపిస్టుల్లో ఒకణ్ణి  ముస్లింగా చూపించినందుకు, బ్యాలెన్సింగ్ గా మంచి ముస్లింని హృతిక్ కి ఫ్రెండ్ గా పెట్టారు. 

          ఇదే చెడ్డ ముస్లిం టెర్రరిస్టు అయితే కాంప్రమైజ్ వుండదు. టెర్రరిస్టు పాత్రల విషయంలో హిందీ సినిమాల్లో ఎప్పుడూ కాంప్రమైజ్ లేదు, బ్యాలెన్సింగ్ లేదు. అందుకే అవి వాస్తవ పరిస్థితికి దర్పణం పడుతున్నట్టు వుండి అన్ని వర్గాల ప్రేక్షకులకి కనెక్ట్ అవుతూంటాయి. మణిరత్నం ‘రోజా’ తీసినప్పుడు కూడా ఇంతే- దీని హిందీ వెర్షన్ కి కూడా అంత పేరొచ్చింది. 

          తెలుగు సినిమాల్లోనే హాస్యాస్పదంగా ఏ గొడవా లేకుండా హిందువుల్ని టెర్రరిస్టులుగా చూపించేసి తప్పించుకోవచ్చనుకుంటున్నారు. ‘ఆది విష్ణు’, ‘బసంతి’ ఇలాంటివే. వీటికి ఏ గతి పట్టిందో తెలిసిందే. హిందువు టెర్రరిస్టు ఎలా అవుతాడన్న ఇంగితజ్ఞానం ప్రేక్షకులకి వుండ దనుకుంటున్నారు. శ్రీ విష్ణు బాంబు పేలుళ్ళలో ఎవడో పంకజ్ అని తెలుసుకుని వాడి కోసం వెతకడం మొదలెడతాడు- ఇక్కడే విశ్వసనీయత ఏమిటో తెలిసిపోయింది. పంకజ్ బదులు ఫారుఖ్ అని ఎందుకు  పెట్టలేకపోయారు?  టెర్రరిస్టులుగా హిందువుల్ని కూడా చూపించ వచ్చు.  చాపకింద నీరులా హిందూ  టెర్రరిజం కూడా వుందని భావిస్తే ఆ బాపతు కథతో. 

          మాఫియాలతో ప్రజలు ఇబ్బంది పడరు. ఆ కథల్ని ఎంటర్ టైనింగ్ గా చూపించ వచ్చు. టెర్రరిస్టులతో సామూహికంగా ఇబ్బంది పడుతున్నారు. టెర్రరిజం ఆ మతం ఈ మతం అని లేకుండా ఇంటి గడపల దాకా వచ్చేసి ఇళ్ళల్లో శోకాలు పెట్టిస్తోంది. ఇలాంటప్పుడు ఈ కథల్ని ఎంటర్ టైనింగ్ గా చూపించలేరు. వేరే భాషల్లో చూపించడం లేదు, తెలుగులోనే చూపిస్తున్నారంటే- ఏ మాత్రం బాధ్యత లేకుండా ఈ కథల్ని మామూలు మూస కథల్లా మసాలాలేసి సొమ్ములు చేసుకోవాలన్న యావతోనే. ఇందులో సందేహం లేదు. ఇది టెర్రరిజం కంటే పెద్ద ద్రోహం. ఇందుకే ఇలాటి సినిమాలకి ఎలా బుద్ధి చెప్పాలో అలా చెప్తున్నారు ప్రేక్షకులు కూడా. అయినా ఈ సినిమాలతో వచ్చే నష్టాలకి వేరే కారణాలున్నాయని ఆత్మవంచన  చేసుకుంటున్నారు. 

      జానర్ మర్యాదని పక్కన బెడదాం, ఈ కథ జోకర్ విన్యాసాలతో ఎలా వుందంటే, ప్రారంభమే అట్టహాసంగా ‘గబ్బర్ సింగ్’ టైటిల్ సాంగ్ ని కాపీ కొట్టే చిత్రీకరణతో మా అబ్బాయి గ్రాండ్ ఎంట్రీ. ఆ వెంటనే ఎక్కడిదో పురాతన సినిమా సీనులా ఇంట్లో అమ్మ అక్క నాన్నలకి పనీపాటా లేని మా అబ్బాయితో ముద్దూ మురిపాలు. అక్కపెళ్ళి చూపులు. మా అబ్బాయే ముప్ఫై దగ్గర పడుతున్నట్టు వుంటే, ముప్ఫై దాటిపోయి వుండాల్సిన మా అక్క పెళ్లి ఇప్పుడెందుకు గుర్తుకొచ్చిందో తెలీదు (తర్వాతి  సీన్స్ లో బాంబు దాడులున్నాయి కాబట్టి పెళ్ళికి రెడీ చేస్తున్నట్టుంది, ఇన్నాళ్ళకి పెళ్లి చేస్తున్నట్టూ వుంటుంది, పైగా బాంబు దాడుల్లోపోతే పెళ్లి ఖర్చు తప్పించుకున్నట్టూ అవుతుంది). అక్క వయసు గురించి ఆడియెన్స్ తేడాగా ఫీలవకూడదని, పాత్రధారిని కాన్వెంట్ అమ్మాయిలా వుండేట్టు చూసి తీసుకుని, కళ్ళద్దాలు పెట్టేశారు. ఇక ఆ కాబోయే బావతో  మా అబ్బాయి తుగ్లక్ ఇంటర్వ్యూ. అక్క పెళ్ళికి తన పేరుమీదున్నకోటి రూపాయల ఫ్లాట్ కట్నంగా కూడా  ఇచ్చేసి, మంచబ్బాయి అన్పించుకునే సీను కూడా ఒకటి మర్చిపోకుండా వేసుకోవడం మాఅబ్బాయి. 

          ఇంకో తెల్లారి పొద్దున్నే ఎదురింటి ముందు ముగ్గులేసుకుంటూ తెలుగు సంస్కృతిని ద్విగుణీకృతం చేస్తూ ఐటీ ప్రొఫెషనల్ హీరోయిన్ ఎంట్రీ. మా అబ్బాయి మదర్ మొదటిసారిగా చూస్తున్న ఈ  హీరోయిన్ ముక్కు బావుందని  కీర్తిగానాలు  చేస్తూంటే, సిగ్గు మొగ్గయి పోవడం ఐటీ హీరోయిన్. ఓ తెల్లారి పొద్దునే ఫలహారం తీసుకొచ్చి సత్యనారాయణ  వ్రతం చేశామని అనడం. ఇంత పొద్దునే సత్యనారాయణ వ్రతం చేసుకునే అర్భక ఫ్యామిలీ ఎక్కడిదిరా అని మనం కన్ఫ్యూజ్ అవుతూంటే, తొలిసారి ఇంట్లో కొచ్చిన ఈ కొత్తమ్మాయి చేతికి కాఫీ ఇచ్చి, నిద్రపోతున్న  కొడుక్కి ఇచ్చిరమ్మని పంపుతుంది  మా అబ్బాయి మదర్.  ఈ మదర్ ఆడదేనా అని మనకింకో డౌటు! ఇలాటి మదర్స్ తో జాగ్రత్తగా వుండాలి కొత్తమ్మాయిలు. 

          జానర్ మర్యాదని పక్కన పెడదాం, కథా మర్యాదనే చూద్దాం...ఇక పెళ్లి ఫిక్స్ అయి షాపింగ్ కి వెళ్తారు. షాపింగ్ చేసుకుని వస్తూ సాయిబాబా గుడి కెళ్తారు. అక్కడ ఎడాపెడా బాంబులు పేలి తను చెక్కుచెదరకుండా, అమ్మా నాన్నా అక్కా  మాత్రం దారుణంగా చచ్చిపోతారు. కట్ చేస్తే, దరిద్రం వదిలింది అన్నట్టు వుంటుంది సీను. ఇంకా ఆ విషాదం వంకాయా ఎవడిక్కావాలి- ఎంటర్ టైన్ మెంట్ మూడ్ లోకి వచ్చెయ్యాలి సినిమా! లేకపోతే ఆడదు! 

       కట్ చేయగానే, ఐటీ హీరోయిన్ టిఫిన్ పట్టుకొస్తుంది. మా అబ్బాయి ఫ్రెష్ గా వుంటాడు, టిఫిన్ తినేస్తూంటాడు. ఇంత  జరిగితే నీకు బాధ లేదా?  అని అనాలి కాబట్టి అంటున్నట్టు ఆమె  అంటే, బాధ ఇక్కడ వుంటుంది ఈ గుండెల్లో- ఆ నాకొడుకుల్ని  పట్టుకు చంపుతున్నప్పుడు బయటి కొస్తుంది ఆ బాధ-అని డిక్లేర్ చేసేస్తాడు.  అంటే ఇక నుంచి కథలో జాలీగా వుండాలి కాబట్టి- జోకర్ లా ఆడిపాడి ఎంటర్ టెయిన్ చేయాలి కాబట్టి, బాధ గురించి ఇలా చెప్పేసి- ప్రేక్షకుల్ని సిద్ధం చేశాడన్న మాట తనని చూసి ఎంజాయ్ చేయడానికి. ఇదీ మాఅబ్బాయి అద్భుత క్యారక్టరైజేషన్ ఇంత ఓవర్ బడ్జెట్ సినిమాలో. 

          క్యారక్టర్ ని చంపి కథలో ఎమోషన్ని తీసి పారేశాక- ఇక స్వేచ్చా జీవి అయిపోయాడు మా అబ్బాయి. కానీ  ప్రేక్షకులు మాత్రం ఆ చావుల దగ్గరే ఆలోచిస్తూ వుండిపోతారు. ఇంకా ముందుకెళ్ళి సినిమా చూడ్డానికి మనసంగీకరించదు. సినిమా ఎక్కడో ఫ్లాప్ అవలేదు, ఇక్కడే సీన్ దగ్గరే  ఫ్లాప్ అయిపోయింది ఈ ప్లేటు ఫిరాయింపుతో. ఇంకా మా అబ్బాయి యేమిటి, చనిపోయిన అక్క మా అమ్మాయి అయితే? మా అమ్మాయి చావుకి లెక్క తేలాలన్న ఎమోషన్ లోకి ప్రేక్షకులు జారుకుంటే, మా అబ్బాయి ఎవడు? వీడి వేషాలతో మాకేం పని?

          దర్శకుణ్ణి బ్యాంకాక్ బీచికి ప్రమోట్ చేయాలన్న  ఏకైక లక్ష్యంతో మా అబ్బాయి చక్రం తిప్పడం మొదలెడతాడు- రంగులరాట్నం. ఈ రంగులరాట్నంలో నాంకే వాస్తే ఒక యాక్షన్ సీన్ – ఖుషీ కే వాస్తే ఒక కామెడీ సీన్- మస్తీ కే వాస్తే ఒక లవ్ సీన్- మజాకే వాస్తే ఒక పాట;  మళ్ళీ నాంకే వాస్తే ఒక యాక్షన్ సీన్- ఖుషీకే వాస్తే ఒక కామెడీ సీన్- మస్తీ కే వాస్తే ఒక లవ్ సీన్- మజాకే వాస్తే ఒక పాట; మళ్ళీ నాంకే వాస్తే ఒక... తిప్పి తిప్పి ఇదే తంతు! 

      ఇలా నాంకే వాస్తే, అదికూడా అప్పుడప్పుడు మా అబ్బాయి టెర్రరిస్టులు అనుకుంటున్న వాళ్ళతో యాక్షన్ సీన్స్, ఇక మిగిలినదంతా హీరోయిన్ తో ఖుషీ కోసమే, మస్తీ కోసమే, మజా కోసమే సీన్లు.  

          ఆమె ప్రతీ మాటకీ అబ్బాయ్ అంటుంది- లేకపోతే శ్రీ విష్ణు గ్రాండ్ గా టైటిల్ రోల్ పోషిస్తున్నాడని మనమెక్కడ మర్చిపోతామో అని. ప్రతీ యాక్షన్ సీన్ అయిపోయిన వెంటనే- అబ్బాయ్ అంటూ సెక్సీగా వచ్చి ఒళ్ళు విరుచుకుంటుంది. ఎంత కసిగా వుందీ....దీన్నీ ...అని ఒర్చుకోలేక పోతాడు మా అబ్బాయి. ఇక కామ ప్రకోపిత విప్రలంభ శృంగార విరహతాప కామెడీ. తాళలేక సాంగేసుకుని ఉష్ణ మంతా స్వేదబిందువులయ్యే కేళీ విలాసాలు. చిట్ట చివర్లో ఫార్ములా ప్రకారం విధిగా ఫోక్ సాంగ్ కూడా వేసుకుని మూస మాస్ కి పూర్తి  న్యాయం చేయడం. 

          మనకెలా వుంటుందంటే, ఆ టెర్రరిస్టులు వీళ్ళిద్దర్నీ కాల్చి చంపాలన్పిస్తుంది. ఇలా తమాషా కింద మారిపోయిన మా అబ్బాయి పాత మూస కథ శ్రీవిష్ణుకి గుణపాఠం నేర్పకపోతే ఇంకేదీ నేర్పదు. అసలు మా అబ్బాయి యేంటి? మా అమ్మాయి కాదా? అక్క పెళ్లి కూడా అయిపోయి, మర్నాడు భర్తతో గుడికెళ్ళి టెర్రరిస్టు దాడిలో భర్తతో పాటూ  చనిపోయివుంటే,  అది బలమైన కథ కాదా?  మా అబ్బాయి యేంటి? ఏం పీకాడని? ‘మా అమ్మాయి’ యే నిలబడుతుంది ఈ కథనీ, నిర్మాతనీ.

          దర్శకుడు ఇంకో పని చెయ్యలేదు, తన ఈ మానస పుత్రికని పూరీ జగన్నాథ్ కి అంకిత మివ్వలేదు.

-సికిందర్
http://www.cinemabazaar.in