రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Friday, April 15, 2022

క్యారెక్టర్ సంగతులు!

 

    సినిమా కథ ఆలోచించడమంటే ‘పాత్ర – ఆ పాత్ర పాల్పడే చర్యలు’  అనే రూట్లో ఆలోచించడ మేనని తెలుకుంటున్న దాఖలాలు  ఈ మధ్య కన్పించడంలేదు. ఒక్క తెలుగులో అనే కాదు, అటు హిందీలో,  ఇంకా అటు హాలీవుడ్ లో సైతం ఇదే పరిస్థితి. తాజాగా ‘చార్లీస్ ఏంజెల్స్- 2’ లో చూడవచ్చు. ఇటీవల విడుదలైన ఓ అగ్ర హీరో సినిమాని ఒక ఇంగ్లీషు పత్రికా సమీక్షకుడు విశ్లేషిస్తూ,  స్క్రీన్ ప్లే అద్భుతంగా వుందని రాశాడు. ఏ సీనుకా సీను విడివిడిగా ఆనందం కలిగిస్తే అదే అద్భుత స్క్రీన్ ప్లే అయిపోతుందన్న మాట. ఇక మొత్తంగా కథేంటో, దాని  నడకేంటో చూడనవసరం లేదన్న మాట. ఇలాగే  వుంటే ఇక భవిష్యత్తు ఇలాటి భయపెట్టే స్క్రీన్ ప్లేలదే!  

          సినిమా కథకి ఏది ముఖ్యం? ఖచ్చితంగా స్ట్రాంగ్  హీరో క్యారెక్టరే.  మార్కెట్లో ఆడుతున్న ఇంకో పది సినిమాలు చూసినా మరపురానంత బలమైన పాత్రచిత్రణతో వుండే స్ట్రాంగ్ హీరో పాత్రే. దీని తర్వాతే మిగతా హంగులన్నీ. మరైతే ఏది స్ట్రాంగ్ క్యారెక్టర్ అవుతుంది? అదెలా పుడుతుంది? ఇక్కడే మనసు చేసే  మాయలోపడి పాసివ్ పంథాలో నడుచుకుంటూ వెళ్ళిపోతారు  రచయితలు / దర్శకులు. తామో  అద్భుత పాత్ర సృష్టించామని ఉబ్బి తబ్బిబ్బయిపోతారు. చూస్తే అది ఉత్త మనసు రెచ్చగొడితే రొచ్చులో  పడ్డ లేకి పాత్రగానే  కన్పిస్తుంది. ఈ మధ్య గీత రచయిత చంద్రబోస్ ఒక రేడియో ప్రోగ్రాంలో ఒక పనికొచ్చే మాట చెప్పారు : కూలి వాడు చేతులుపయోగించి పనిచేస్తే సరిపోతుందని, కానీ శిల్పి చేతులతో పాటు మెదడు నుపయోగిస్తే, అదే రచయిత ఆ చేతులూ మెదడుతో పాటూ, మనసూ ఉపయోగించి పని చేస్తాడని. 

       రచన చేత్తోనే చేస్తారు గానీ అది మెదడూ మనసుల దోబూచులాట. మెదడూ మనసూ రెండూ కన్పించే రచనే శక్తిమంతమైన రచన. ఇలాకాక కేవలం మనసు మాత్రమే వాడి రాసుకుంటూ పోతే పుట్టుకొచ్చేది బలహీన పాత్రే, అంటే పాసివ్ క్యారెక్టరే. పాసివ్ పంథాలో తిరుగాడే పాత్రలన్నీ కేవలం మనసు చెబితే పుట్టుకొచ్చేవే. అలాటి స్క్రీన్ ప్లే సమీక్షకుడికి గొప్పగా అన్పిస్తే, అతనూ మనసుతో మాత్రమే సినిమా తీసిన దర్శకుడిలాగే,  మనసుతోనే  సినిమా చూశాడనుకోవాలి. మరి దర్శకుడు మెదడు వాడకుండా మనసుతో సినిమా తీస్తే,  ప్రేక్షకులు కూడా మెదడు ఇంటి దగ్గర వదిలేసి మనసుతోనే సినిమా చూసినప్పుడు, హిట్టవ్వాలి గా? ఎందుకని ఇలాటి సినిమాలు హిట్టవడం లేదు?  సినిమాల్లో మెదడు కూడా లేకే హిట్టవడం లేదు. ఇది ఇద్దరి (దర్శకుల, ప్రేక్షకుల) మనసూ తెలుసుకోవడంలేదు. 

          పాత్రల సృష్టిలో మొదట మెదడు పని కల్పించుకుంటుంది. ఎందుకంటే ప్లానింగ్ కి మెదడే కావాలి. మనసు కాదు. మెదడుతో చేసిన ప్లానింగ్ ని తర్వాత మనసుతో చూసుకోవచ్చు. ఎప్పుడైతే ఈ ప్రక్రియలో మెదడు మిస్సయ్యిందో, ఇక అప్పుడా సృష్టిస్తున్న పాత్ర పాసివ్ నడకలు నడుస్తూ ఎంచక్కా చతికిలబడి ఉస్సూరన్పిస్తుంది. లేదా కథని ఇతర పాత్రలకి అప్పగించేసి ఔటైపోతుంది. ఉదాహరణకి,  హీరోపాత్ర  తన కొచ్చిన ఒక బంగారు అవకాశాన్ని మిత్రుడికి త్యాగం చేసి వెళ్ళిపోవడం ముగింపు అనుకుందాం. అలా వెళ్ళిపోతూ శుభం పడితే బాగానే వుంటుంది. కానీ వెళ్ళిపోడు,  వెళ్ళిపోతూ వుంటాడు. ఇంతలో మిత్రుడికి కనువిప్పవుతుంది. ఇక ఆ బంగారు అవకాశానికి హీరో మాత్రమే పూర్తిగా అర్హుడని, అతడికి ధారాదత్తం చేశాడనుకుందాం - అప్పుడు హీరో ఎవరవుతారు? హీరోనా, మిత్రుడా? అంతిమంగా త్యాగం ఎవరిదైంది?  మిత్రుడిదే అయింది. కాబట్టి మిత్రుడే  గొప్పోడు, అతనే హీరో... హీరో వచ్చేసి తను త్యాగం చేసిందే తిరిగి తనే తీసుకున్నాడు కాబట్టి పాసివ్ పాత్రయిపోయాడు. 

      త్యాగం చేసిన స్ట్రాంగ్ క్యారెక్టర్, అంటే యాక్టివ్ పాత్ర  వెనుదిరగదు. ‘అమరదీపం’ లో కృష్ణంరాజు తమ్ముడి కోసం త్యాగం చేసి తిరిగిరాని లోకాలకి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన భావముద్ర ప్రేక్షకులకి మిగలాలి. తన కోసం త్యాగం చేసిన వాళ్ళ కోసమైతే హీరోపాత్ర తిరిగి వస్తుంది. ఆ ఋణం తీర్చుకుంటుంది. 

          మనసు పాలిస్తే పాత్రల సృష్టి మట్టి పాలవుతుంది. అసలిలా జరగడం వెనకున్న మెకానిజం ఏమిటి? మనసు ఏ రకంగా చెప్తే పాత్రలలా తయారవుతాయి? మొదటే చెప్పుకున్నట్టు, పాత్ర – ఆ పాత్ర పాల్పడే చర్యల చట్రంలో కథని ఆలోచించకపోవడం వల్ల, రాస్తున్న రచయితే ఆ పాత్రమీద బోలెడు జాలిగొంటాడు. అయ్యో హీరో ఇలా అయిపోతున్నాడా పాపమనుకుని, ఇతడి కోసం తానేమైనా చేయాల్సిందేనని నడుం కట్టి, పొలం దున్నడం ప్రారంభిస్తాడు. ఎప్పుడైతే రచయిత వచ్చేసి హీరో కోసం కథని దున్నుతున్నాడో, అప్పుడా హీరో కుదేలై కుక్కిన పేనల్లే వుండిపోతాడు. ఇది ఆ పాత్ర నటించే స్టార్ కూడా తెలుసుకోలేడు. 
*
          ఉదాహరణకి – హీరో చెల్లెల్ని ఎవరో ఎత్తుకుపోయారు. ఆమె కుయ్యోమొర్రో మంటున్న సౌండ్స్ విన్పిస్తున్నాయి. హీరో విషాదంగా మొహం పెట్టుకుని నడుస్తున్నాడు. ఆ చెల్లెలితో తన సెంటిమెంటు దృశ్యాలన్నీ కళ్ళ ముందు గిర్రున తిరుగుతున్నాయి. సిస్టర్ సెంటిమెంటుతో బాగా కన్నీళ్లు వస్తున్నాయి. పార్కులో కూర్చుని ఏడ్చాడు. లేచి టాంక్ బండ్ మీదికి నడిచాడు. అలా  టాంక్ బండ్  తటాకాన్ని చూస్తూంటే చెల్లెలి జ్ఞాపకాలే సుళ్ళు తిరుగుతున్నాయి. మళ్ళీ డీటీఎస్ లో కుయ్యో మొర్రోలు విన్పిస్తున్నాయి. థియేటర్ ఆపరేటర్ కి పట్టరాని కోపం వస్తోంది. హీరో పిడికిళ్ళు బిగించాడు, పళ్ళు నూరాడు. ఫర్వాలేదనుకున్నాడు ఆపరేటర్. హీరో పంజా గుట్ట సెంటర్ కొచ్చాడు.  అక్కడ పక్కింటి  పరమానందం ఎదురై, మీ చెల్లెమ్మ గురించేనా? త్వరగా అమీర్ పేట సెంటర్ కెళ్ళమన్నాడు. వెళ్తే అక్కడ రెండు  గ్రూపులు కొట్టుకుంటున్నాయి. హీరో అర్ధంగాక చూస్తున్నాడు. ఆపరేటర్ ఓపిగ్గా చూస్తున్నాడు. హీరో ఏం జరిగిందని పక్కవాణ్ణి  అడిగాడు. మధుబాల అనే అత్యంత బ్యూటిఫుల్ గాళ్ ని వాళ్ళె త్తుకుపోతే, వీళ్ళు కొట్టడానికొచ్చారని పక్కోడు వివరిస్తున్నాడు...ఆపరేటర్ కిక అర్ధమైపోయింది. మ్యాట్నీకల్లా ఈ మొత్తమంతా ఎడిట్ చేసి పారేశాడు  ( సినిమాలకి ఫైనల్ ఎడిటింగ్, ఫైనల్ షేపు థియేటర్లలో ఆపరేటర్ల చేత ప్రొజెక్టర్ల మీద మాత్రమే చేయబడును). 

          ఇలా హీరోకి ఎవరెవరో చెప్తూంటేనే గానీ విషయాలు తెలియడంలేదు. హీరో తన ముందున్న సమస్య గురించి చేసిన ప్రయత్నమేదీ లేదు. పచ్చి పాసివ్ గా వుంటున్నాడు. ఇతడి మీద జాలిపడుతూ రచయిత విషాదంగా మార్చాడు. ఇదే రచయిత తనకే ఇలా జరిగితే ఇలా వుండడు. ఆరాలు తీస్తాడు, పరుగులు తీస్తాడు. కానీ ఎందుకనో కథకొచ్చేసి  అర్ధంలేని మెలోడ్రామాలు సృష్టిస్తూ కూర్చుంటాడు. పై సీనులో గమనిస్తే, రచయితే హీరోకోసం సంఘటనల్నీ, పాత్రల్నీ సృష్టించాడు. ఇలా రచయిత డ్రైవ్ చేస్తేనే గానీ హీరోకి తన చెల్లెలి అదృశ్యం గురించిన విషయాలు ఒక్కోటీ తెలియడం లేదు. దీన్ని కథ  వచ్చేసి పాత్రని నడపడం అంటారు. హీరో కోసం రచయిత వచ్చేసి కథని అల్లుతున్నాడు. రచయిత కథ వైపే వుంటున్నాడు. అదే హీరోవైపు వుంటే, సమస్యలో వున్న హీరోలా ఆలోచించడానికి పరకాయ ప్రవేశం చేస్తాడు. అప్పుడు ఇదే తనకి జరిగితే ఏంచేస్తాడో అలా యాక్టివ్ గా  రాసుకుపోతాడు.

          అప్పుడు చెల్లెలు అపహరణకి గురైందని హీరో పోలీస్ స్టేషన్ కి పరుగెడతాడు. అక్కడ ఎందు
కనో ఎస్సై నవ్వి హేళన చేస్తాడు. హీరో చెల్లెలి ఫ్రెండ్స్ దగ్గరికి పరుగెడతాడు. వాళ్ళేమీ చెప్పలేకపోతారు. వెతకాల్సిన చోట్లన్నీ వెతుకుతాడు. రాత్రంతా వెతుకుతూనే వుంటాడు. ఆ మాంటేజీలు పడుతూంటాయి. తెల్లారి కాలేజీ కెళ్తాడు. ప్రిన్సిపాల్ కి  చెప్తాడు. ఆమె పోలీసులకి కాల్ చేస్తుంది. అదే ఎస్సై  వచ్చి మళ్ళీ అలాగే హేళనగా నవ్వుతాడు. ఇప్పుడు హీరోకి అర్ధమైపోతుంది. కీలకమంతా ఎస్సై దగ్గరే వుందని... 

       ఇక్కడ హీరో తనే నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఇలా చెయ్యి అ లా చెయ్యమని ఎవరూ చెప్పడం లేదు. తన ఆలోచనల ప్రకారమే సాగుతున్నాడు. కథనం చాదస్తంగా లేదు.  ప్రమాద నేపధ్యంలో వుండాల్సినంత చురుగ్గా వుంది. తన కథని తనే నడుపుకుంటున్నాడు హీరో. మొదటి కథనంలో ప్రతీదీ హీరో కాళ్ళ దగ్గరికి తెస్తున్నాడు రచయిత. అలా కథని తను నడిపిస్తున్నాడు.  రెండో కథనంలో ప్రతీ అడుగూ తనే వేస్తూ పోతున్నాడు హీరో. ఇలా పాత్ర-  అది పాల్పడే చర్యల చట్రంలో కథ వుంది. ఇలా పాత్ర పాల్పడే చర్యలు మాత్రమే కథవుతోంది. ఇలాటి యాక్టివ్ పాత్రతో  కథనం చైతన్యవంతంగా వుంటుంది. పాసివ్ పాత్రకి రచయిత చేసే కథనం మృతప్రాయంగా వుంటుంది. దేవుడి మీద భారం వేసి కూర్చునే బాపతు. ఎలా జరగాలనుంటే అలా జరుగుతుందని విధికొదిలేసి కూర్చునే విషాద కథనం. 

          యాక్టివ్ పాత్రలతో పూర్వం చాలా సినిమాలే వున్నాయి. ఖైదీ, విజేత, గ్యాంగ్ లీడర్, జానకీ రాముడు, బొబ్బిలిరాజా, గణేష్, శివ...లాంటివి. వీటిని పరిశీలిస్తే  ఈ పాత్రలు కథ నడిపే తీరుకి ఏవేవి మూలమవుతున్నాయో స్పష్టంగా, విజువల్ గా  తెలుస్తాయి.

సికిందర్
(ఆంధ్రభూమి వెన్నెల – జులై 25, 2005)

Thursday, April 14, 2022

1157 : రివ్యూ!


 రచన  - దర్శకత్వం : ప్రశాంత్ నీల్
తారాగణం : యష్, శ్రీనిధి శెట్టి, సంజయ్ దత్, రవీనా టాండన్, ఈశ్వరీరావు, రావురమేష్, ప్రకాష్ రాజ్, రామచంద్ర రాజు, టిఎస్ నాగాభరణ, అచ్యుత్ కుమార్ తదితరులు
సంగీతం : రవీ బస్రూర్, ఛాయాగ్రహణం : భువన్ గౌడ
బ్యానర్ : హోంబోలే ఫిలిమ్స్

నిర్మాత : విజయ్ కిరగందూర్
బడ్జెట్ :  100 కోట్లు
విడుదల : ఏప్రెల్ 14, 2022
***
    2018 లో కేజీఎఫ్ : చాప్టర్ -1 సక్సెస్ తర్వాత కేజీఎఫ్ : చాప్టర్-2 అడ్వాన్స్ బుకింగ్స్ లో రికార్డులు సృష్టించింది. నార్త్ లో కేజీఎఫ్ : చాప్టర్ -1 లైఫ్ టైమ్ వసూళ్ళు ఒక్క రోజులోనే  కేజీఎఫ్ : చాప్టర్-2 అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా వచ్చేశాయి. ఇంత సంచలనం సృష్టిస్తున్న కేజీఫ్ తెలుగు రాష్ట్రాల్లో సైతం పెంచిన రేట్లతో అడ్వాన్స్ బుకింగ్స్ లో ముందుంది. మరో సారి రాకింగ్ స్టార్ యశ్- ప్రశాంత్ నీల్ టీమ్ ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసేందుకు ఈ కల్ట్ మూవీ సీక్వెల్ తో వచ్చేశారు. ఇదెలా వుందో ఓసారి చూద్దాం...

కథ

    చాప్టర్ వన్ గరుడ మరణంతో ముగిశాక, ఇప్పుడు గరుడ వల్ల నరకం అనుభవించిన కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లక్షలాది కార్మికులు గరుడని అంతమొందించిన రాకీ భాయ్ (యశ్) ని తమ దైవంగా కొలుస్తారు. కేజీఎఫ్ కి సుల్తాన్ గా ప్రకటించుకున్న రాకీ, ఇలాటి బంగారు గనులు ఇంకా చాలా వున్నాయని తెలుసుకుని, కార్మికుల కొడుకులతో యువ సైన్యం తయారు చేసుకుని ఆ గనుల మీద దండెత్తుతాడు. అక్కడ జయంట్ కింగ్ ధీర (సంజయ్ దత్) భారీ సైన్యంతో వుంటాడు. అక్కడ అధీరతో తలపడ్డ రాకీ తీవ్రంగా గాయపడి మృత్యుముఖంలోకి పోతాడు. రీనా (శ్రీనిధీ శెట్టి) అతడికి సపర్యలు చేస్తుంది. రాకీ ఇక ఇక్కడుండ కూడదని దుబాయ్ వెళ్ళిపోతాడు, అక్కడ గోల్డ్ స్మగ్లర్ ఇనాయత్ ఖలీల్ (బాలకృష్ణ) ని డబుల్ క్రాస్ చేసి, భారీ ఎత్తున మారణాయుధాలతో తిరిగి వచ్చి  అధీరనీ, అతడి సైన్యాన్నీ చావగొడతాడు. ప్రాణాలతో వున్న ఆధీరని పారిపొమ్మని చెప్పి, అతడి ఇలాకాని కబ్జా చేసుకుంటాడు. దీంతో పూర్తి స్థాయిలో గనుల్ని సొంతం చేసుకున్న రాకీకి ఇంకో ప్రమాదం ఎదురవుతుంది...

        రాకీ ని పట్టుకోవడంలో విఫలమవుతున్న సీబీఐ  చీఫ్ రాఘవన్ (రావు రమేష్) ప్రధాన మంత్రి  రమికా సేన్ (రవీనా టాండన్) ని ఆశ్రయిస్తాడు. దీంతో ప్రధాని రాకీని టార్గెట్ చేస్తుంది. మరోవైపు ఆధీర తిరిగొస్తాడు. ఇక రాకీ ఇప్పుడేం చేశాడన్నది మిగతా కథ.

ఎలావుంది కథ

    ఇది కథ కాదు, గాథ. దీన్ని కథ లాగా చూసి అదిలేదు, ఇది లేదని అనుకోకూడదు. మొదటి భాగం కూడా గాథే. జీవితంలో నువ్వు ధనవంతుడిగానే చనిపోవాలని పేదరికం అనుభవించిన తల్లి చెప్పిన మాట పట్టుకుని హీరో కొనసాగించే ప్రయాణమే ఈ రెండు భాగాల గాథ. ఈ గాథని బిగినింగ్-ఇంటర్వెల్- ఎండ్ గా మొదటి భాగంలో కథనాన్ని విభజించినట్టే, రెండో భాగంలో కూడా విభజించానన్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్.

        రెండు భాగాల గాథని, లేదా కథని దేనికది పూర్తి గాథ లేదా కథ అన్పించేలా విభజించడం కరెక్టు పద్ధతి. పుష్ప లో ఇలా చేయలేదని చెప్పుకున్నాం. పుష్ప మొదటి భాగంలో వున్నది సాంతం బిగినింగ్ విభాగమే. దీంతో ఏమిటో అర్ధంగాని వెలితి ఫీలయ్యారు ప్రేక్షకులు.

        ఎడ్డీ మర్ఫీతో బేవర్లీ హిల్స్ కాప్ సినిమా లుంటాయి. దాని నిర్మాత రచయితలకి ఒకటే మాట చెప్పేవాడు- మీరేం చేస్తారో నాకు తెలీదు, కథనంలో పది నిమిషాలకో సారి మాత్రం బ్యాంగ్ పడాలంతే - అని. అలాగే బుర్ర బద్ధలు చేసుకుని బ్యాంగులు తయారు చేసేవాళ్ళు రచయితలు. అలా ఆ సిరీస్ సినిమాలు హిట్టయ్యాయి.

        ఈ టెక్నిక్ మారుతీ నానితో తీసిన భలే భలే మగాడివోయ్ లో కన్పిస్తుంది. కథలో నాని పాత్రకి కథకి ముఖ్యావసరమైన గోల్ వుండదు. కానీ నాని కథనంలో ఏదో చేసి పది నిమిషాలకోసారి బ్యాంగ్ ఇస్తూ పోతాడు. ఇదే కథని నిలబెట్టింది.

        కేజీఎఫ్ సినిమాలు కూడా ఇంతే. హీరోకి ధనవంతుడయ్యే గోల్ వుంటుంది. ఈ గోల్ కోసం పోరాటం ఒక విలన్ తో వుండదు. ఒకరి తర్వాత ఒకరు విలన్లు మారుతూ వుంటారు. ఈ ఒక హీరో- ఒక గోల్- ఒక విలన్ అనే చట్రంలో గాథ లేని లోపాన్ని కవర్ చేస్తూ, దర్శకుడు చేసిందే పది నిమిషాలకో బ్యాంగ్ అనే టెక్నిక్ ప్రయోగమనుకోవాలి. ఈ బ్యాంగులన్నీ హీరో పాత్ర ఎలివేషన్ గురించే. విరోధులతో హీరో భారీ యాక్షన్ సీన్స్ కి దిగి ఎలివేట్ అవడం, కార్మిక సమూహం జేజేలు పలకడం. ఇలా ఓ వ్యక్తి పూజే ఈ గాథ.

        దీంతో గోల్ కోసం ప్రయాణంలో హీరో ఎలివేషన్స్ పరంపరే ఈ గాథకి కథనమయ్యింది. అయితే గాథ అన్నాక రిపీట్ ఆడియెన్స్ వుండరు. ఒకసారి చూసిన ప్రేక్షకులు మరోసారి రారు. ఒకసారి చూడడమే ఎక్కువ. కథ అయితేనే, అదీ బావుంటేనే, రిపీట్ ఆడియెన్స్ వుంటారు.

నటనలు -సాంకేతికాలు

    రాకింగ్ స్టార్, యశ్ (నవీన్ కుమార్ గౌడ) చాప్టర్ వన్ తో ఆల్రెడీ        గ్లోబల్ కల్ట్ ఫిగర్ అయ్యాడు. నార్త్ లో రికార్డు స్థాయిలో 4400 థియేటర్లలో చాప్టర్ టూ విడుదల చేయడాన్ని బట్టి అర్ధం జేసుకోవచ్చు అతడి పాపులారిటీ స్థాయి. ఇది సీరియస్ గా వుండే డార్క్ క్యారక్టర్. హార్డ్ కోర్ డైలాగులు. రక్తం కళ్ళజూసే క్రూరత్వం. మదర్ వాక్పాలన అనే ఏకసూత్ర కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితిలో అమలుపర్చే సంకల్పం. ఈ క్యారక్టరైజేషన్ ఎక్కడా కుంటు పడకుండా నిర్వహించిన తీరుతో ఉత్తీర్ణుడయ్యాడు. ఒకదాన్ని మించొకటి యాక్షన్ సీన్స్ తన ఫ్యాన్ బేస్ సంతృప్తి పడేలా చేశాడు. నిన్న బీస్ట్ భరించలేక ఏకంగా సినిమాహాల్లో వెండితెరకి విజయ్ ఫ్యాన్స్ నిప్పంటించిన చారిత్రాత్మక ఘటన తెలిసిందే.  

        ఇక అధీర గా సంజయ్ దత్ క్రూర విలనీ, రూపం, మార్వెల్ మల్టీవర్స్ సినిమాల్లోని విలన్ థెనోస్ ని పోలి వుందని తనే చెప్పుకున్నాడు గనుక, దీన్నే దృష్టిలో పెట్టుకుని నటించినట్టున్నాడు. అయితే వయసు బాగా మీద బడింది.

        మల్టీపుల్ ఫ్లాష్ బ్యాక్స్ లో ఈ కథ చెప్పే పాత్రలో ప్రకాష్ రాజ్, కథ వినే జర్నలిస్టు పాత్రలో మాళవికా అవినాష్ కన్పిస్తారు. ప్రధానమంత్రిగా రవీనా టాండన్ ప్రధాని పాత్ర నటించిన ఇతర నటీమణుల్లాగే ఇందిరాగాంధీనే రిఫరెన్స్ గా పెట్టుకున్నట్టుంది. ఇక హీరోయిన్ గా ముందు హీరోకి యాంటీగా, తర్వాత రోమాంటిగ్గా కనిపించే శ్రీనిధీ శెట్టి ప్రత్యేకాకర్షణ.

        కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ అంతా దర్శకుడి విజన్లో వొక మాయా జగత్తు. ఔటాఫ్ ది వరల్డ్ కాల్పనిక ప్రపంచం. ఈ విజువల్ సృష్టి, కళాదర్శకత్వం, సెట్స్ నిర్మాణం, దీనికి డార్క్ మూడ్ సినిమాటోగ్రఫీ, అసంఖ్యాక కార్మిక జనులు, క్రూర మానవ మృగాలూ -ఇదంతా మనల్ని ఉన్న లోకాన్ని మరిపించేసి ఫాంటసీ జర్నీలోకి బదలాయించేస్తాయి.

        దీనికి బిజీఎం, సౌండ్ ఎఫెక్ట్స్ ఇంకో యెత్తు. విజువల్ స్ట్రక్చర్  వచ్చేసి మిడ్ షాట్స్, క్లోజప్స్, ఎక్స్ ట్రీమ్ క్లోజప్ షాట్స్ తో నటుల్ని చూపించడంతో అవి కదలకుండా కూర్చోబెట్టేస్తాయి. యాక్షన్ సీన్స్ కి కూడా ఈ విజువల్ స్ట్రక్చరే వుంది. అరుదుగా  లాంగ్ షాట్స్ వుంటాయి.

        అయితే ఫస్టాఫ్ ఒక యాక్షన్ సీన్లో బ్లీచవుట్ షాట్స్ వేసి కళ్ళకిబ్బంది కల్గించడం వుంది. ఇలా ఏనాడో 2002 లో చెన్నకేశవ రెడ్డి లో వేసి మానేసిన విషయం తెలిసిందే. ఐతే వేర్వేరు లొకేషన్స్ లో సీన్స్ ని, కొన్ని చోట్ల టైమ్ అండ్ స్పేస్ ఐక్యతతో రియల్ టైమ్ లో ఎడిట్ చేయడం బావుంది.

చివరికేమిటి
బిగ్ స్క్రీన్ మీద ఈ నాన్ స్టాప్ యాక్షన్ విజువల్ వండర్ చూస్తూ పోవాలంతే, లాజిక్ చూడకూడదు. మొదట అధీర రాకీని చంపకుండా ఎందుకు వదిలాడు, తర్వాత రాకీ కూడా అధీర ని చంపకుండా ఎందుకు వదిలాడు-లాంటి ప్రశ్నలు వస్తే సహించాలి.  కొన్ని చోట్ల ఏ సీను ఎందుకొస్తోందో కన్ఫ్యూజన్ గా వున్నా, హీరో ఎలివేషన్స్ చూడాలంతే. ఎలివేషన్ తర్వాత ఎలివేషన్ గా యాక్షన్ సీన్స్ వస్తూ, లాజిక్ ఎలిమినేట్ అవుతూంటే హీరో జర్నీ చూడాలంతే.

        ఒక విలన్ చుట్టూ గాథ కాకుండా, గోల్ కోసం హీరో జర్నీ కావడంతో సినిమాటిక్ లిబర్టీని అంగీకరించాలి.  ఇలా ఎంత వరకని హీరో ఎలివేట్ అవగలడు. చాప్టర్ వన్ లోనే ఎలివేషన్ల పరంపరతో ఏం చేసినా ఒప్పించ గల  స్టార్ డమ్ వచ్చేయడంతో, ఇప్పుడు సెకండ్ చాప్టర్లో గన్ పట్టుకుని పార్లమెంటు లోకెళ్ళి పోయి కాల్చి పారెయ్య గడు. గన్ తోనే  ప్రధాని ముందు కాలు మీద కాలేసుకుని కూర్చుని, తన శిలాశాసనం చెప్పేయగలడు.

        అతన్ని అంతమొందించడానికి ఏకంగా ప్రధాని త్రివిధ దళాల్ని ఆదేశించకపోతే ఎలివేషన్ ఏముంటుంది. అతను ఏకంగా గోల్డు రాశులతో షిప్ లో పారిపోకపోతే ఎలివేషనేం వుంటుంది. ఆఫ్ఘనిస్తాన్ ని తాలిబన్లు ఆక్రమించుకుంటున్నప్పుడు డబ్బు మూటగట్టుకుని పారిపోయిన ప్రధాని విజువల్స్ ని చూశామా? ఇప్పుడు హీరో అలా పారిపోతూంటే చూడొచ్చు. యూక్రేన్ మీద రష్యా వైమానిక దాడుల్ని బిగ్ స్క్రీన్ మీద చూశామా? ఇప్పుడు హీరో స్థావరాల మీద వైమానిక దాడుల్ని చూడొచ్చు. హీరో ఎలివేషన్, ఎలివేషన్, ఎలివేషన్, ఇంతే. ఇంకేమీ అడక్కూడదు.

        కొసమెరుపు :  ఇందులో ఒక ముస్లిం మదర్ క్యారక్టర్, ఆమె కొడుకు క్యారక్టర్ క్రియేట్ చేసి చాలా స్క్రీన్ స్పేస్ ఇచ్చారు. కొడుకు హీరో సైన్యంలో వుంటాడు. హీరోకోసం ఏం చేయాలో చేసి ప్రాణాలర్పిస్తాడు. అయినా మదర్ ఓర్చుకుని, హీరో గెలుపు కోసం ఆశీర్వదించి, ప్రోత్సహించి, అతడితోటే వుండడం చేస్తుంది. పాత్రకి ముగింపు కూడా ఎమోషనల్ గా వుంటుంది. ఐతే ప్రస్తుతం కర్నాటకలో నెలకొన్న మత ఉద్రిక్త వాతావరణ పరిస్థితుల్లో ఈ కన్నడ సినిమా దృశ్యాలు వుండనిస్తారా?

—సికిందర్

 

 

Wednesday, April 13, 2022

1156 : రివ్యూ!


 

రచన- దర్శకత్వం : నెల్సన్
తారాగణం : విజయ్, పూజా హెగ్డే, సెల్వ రాఘవన్, యోగిబాబు, అంకుర్ అజిత్ వికల్, రెడిన్ కింగ్స్లే తదితరులు
సంగీతం అనిరుధ్, ఛాయాగ్రహణం : మనోజ్ పరమహంస
బ్యానర్ : సన్ పిక్చర్స్
నిర్మాత : కళానిధి మారన్
విడుదల : ఏప్రెల్ 13, 2022

        ళయ దళపతి విజయ్ పానిండియా మాస్టర్ తర్వాత మరో పానిండియాగా బీస్ట్ దేశ విదేశ ప్రేక్షకుల ముందుకొచ్చింది. దీని ఒరిజినల్ దర్శకుడు మురుగదాస్ పారితోషికం తగ్గించుకోని కారణాన వూస్టింగ్ అయి, అతడి స్థానంలో దర్శకుడుగా నెల్సన్ బాధ్యతలు చేపట్టాడు. తమిళనాడులో విజయ్ సినిమాలు వరుసగా హిట్టవుతూ వచ్చాయి. అయితే పానిండియా విడుదలగా మాస్టర్ విఫలమైంది. ఇతర తమిళ పానిండియాలు కూడా విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు బీస్ట్ పానిండియా తమిళ తెలుగు మలయాళ కన్నడ హిందీ భాషల్లో విడుదలై  గ్లోబల్ ప్రేక్షకుల్ని ఏ మేరకు మెప్పిస్తుందివిజయ్ మాస్టర్ సహా ఇటీవల అజిత్ పానిండియా వలిమై’, సూర్య పానిండియా ఈటీ తమిళనాడులో మాత్రమే హిట్టయ్యాయి. హద్దులు మీరిన తమిళతనంతో తమిళ ఫ్యాన్స్ ని మాత్రమే మెప్పించే అత్యుత్సాహానికి పోయి, పానిండియా హోదా కోల్పోతున్న తమిళ బిగ్ బడ్జెట్ సినిమాల సరసన ఇప్పుడు బీస్ట్ కూడా నిలబడదు కదా?ఈ విషయం తెలుసుకోవడానికి ముందుకెళ్దాం...

కథ

రా లో సీనియర్ ఫీల్డ్ ఆపరేటివ్ వీర రాఘవన్ (విజయ్). ఇతను రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో ఒక ఆపరేషన్ చేపట్టి ఉమర్ ఫరూఖ్ అనే టెర్రరిస్టుని పట్టుకుంటాడు. ఈ క్రమంలో డిపార్ట్ మెంట్లో ఒకడు కావాలని ఇచ్చిన తప్పుడు సమాచారంతో  పొరపాటున ఓ బాలిక వీర చేతిలో చనిపోతుంది. ఈ బాధ తట్టుకోలేక ఉద్యోగానికి దూరమవుతాడు. కొన్ని నెలలు గడిచిపోతాయి.

        ఒక పార్టీలో ప్రీతి (పూజా హెగ్డే) పరిచయమై వెంటనే ప్రేమలో పడుతుంది. ఈమె ఒక సెక్యూరిటీ ఏజెన్సీలో పని చేస్తూంటుంది.  ఒక రోజు వీర ఈమెతో ఒక మాల్ లో వున్నప్పుడు, ఆ మాల్ ని ఐఎస్ఎస్ తీవ్రవాదులు ముట్టడించి జనాల్ని బందీలుగా పట్టుకుని, తమ నాయకుడు ఉమర్ ఫరూఖ్ ని విడుదల చేయాలని డిమాండ్ చేస్తారు.      

దీంతో ప్రభుత్వం తరపున సంప్రదింపులు జరపడానికి అల్తాఫ్ హుస్సేన్ (సెల్వ  రాఘవన్) అనే అధికారి వస్తాడు. మాల్ లో వీర వున్నాడని తెలుసుకుని అతడ్ని అభ్యర్ధిస్తాడు. మరోవైపు తీవ్రవాదులకి నాయకత్వం వహిస్తున్న ఉమర్ సైఫ్ (అంకుర్ అజిత్ వికల్) తో బేరసారాలు మొదలు పెడతాడు. ఇందులో కేంద్ర హోమ్ మంత్రి ఉమర్ సైఫ్ తో కుమ్మక్కై వుంటాడు ప్రధాన మంత్రి పదవి కోసం. ఇప్పుడు వీర ఏం చేశాడు? తీవ్రవాదుల్ని ఎలా ఎదుర్కొని బందీల్ని విడిపించాడు? హోమ్ మంత్రి కుట్రని ఎలా బట్టబయలు చేశాడు? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

ఇది మరో హాస్టేజ్ డ్రామా జానర్ కథ. ఈ ఏప్రెల్ ఫస్టునే జాన్ అబ్రహాం తో ఇలాటిదే ఎటాక్ చూశాం. ఇందులో ఎలాగైతే అంత సీను లేని టెర్రరిజానికి పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా సూపర్ సోల్జర్ బిల్డప్ తో జాన్ అబ్రహాం విరుచుకుపడి విఫలమయ్యాడో, అలా ఇప్పుడు విజయ్ కూడా డమ్మీ టెర్రరిస్టుల మీద బీస్ట్ నంటూ భారీ బిల్డప్పులతో మీద పడి విఫలమయ్యాడు. సూపర్ సోల్జర్లూ, బీస్టులూ పరాక్రమించడానికి అక్కడ అంత పరిస్థితి డిమాండేమీ చేయడం లేదు.

        పైగా టెర్రరిస్టులతో ఈ హాస్టేజ్ డ్రామాని కామెడీ చేశాడు దర్శకుడు నెల్సన్. శివ కార్తికేయన్ తో తను తీసిన  డాక్టర్ డార్క్ కామెడీ తో హిట్టవడంతో అదే డార్క్ కామెడీ ఫార్ములాని ఇక్కడా ప్రయోగించాడు. దీంతో అభాసుపాలైంది కథ. హాస్టేజ్ డ్రామాకి కామెడీ పనికి రాదని ఓ 150 కోట్ల  రూపాయలు ఖర్చు పెట్టి చూసుకుంటే గానీ తెలియలేదు.    హాస్టేజ్ డ్రామా జానర్ మర్యాదలు కొన్ని వుంటాయి. అవి తప్పితే కనీస మర్యాద కూడా లేని రేటింగ్ కి సిద్ధపడాల్సిందే.

నటనలు- సాంకేతికాలు 

అవతల ఘోస్ట్ వుంటే తను బీస్ట్ గా వున్నప్పుడు విజయ్ పాత్రకి అర్ధం పర్ధం వుంటుంది. అతి బలహీన డమ్మీ టెర్రరిస్టు విలన్ కోసం తను బీస్ట్ కానవసరం లేదు. ఈ అసమాన ఈక్వేషనే విజయ్ పాత్ర బలాన్ని పూర్వపక్షం చేసింది. ఈ పాత్రని చాలా స్టైలిష్ గా, గ్రాండ్ గా, వీరాభిమానులు విర్ర వీగేలా నటించాడు.

        కాకపోతే సరైన విలన్ లేకపోవడంతో ఏకపాత్రాభినయంలా వుంటుంది. ప్రారంభ దృశ్యాల్లో పదిహేను నిమిషాల పాటు సాగే యాక్షన్ - ఆపరేషన్లో బాలిక పాత్ర వల్ల పెల్లుబికిన  హ్యూమన్ డ్రామా విజయ్ పాత్రని పతాక స్థాయిలో నిలబెడుతుంది. ఈ ఓపెనింగ్ ఇమేజి ఈ మధ్య వచ్చిన యాక్షన్ సినిమాలన్నిటిలో గొప్పదని చెప్పుకోవచ్చు.       

ఆ తర్వాత కథలో కొస్తే ఈ హ్యూమన్ డ్రామా, పతాక స్థాయి పాత్రా అర్ధం పర్ధం లేని హాస్టేజ్ డ్రామా పాలబడి పలచనై- చులకనై-వికలమై  పోయాయి. తన ఇళయ దళపతి ఇమేజి ఏం చేసీ ఇక సినిమాని కాపాడలేకపోయింది. అఫ్ కోర్స్, తమిళనాట హిట్ చేసేస్తారు వీరాభిమానులు. పానిండియా ఆశలు మాత్రం వదులుకోవాల్సిందే.

        పూజా హెగ్డే వుందంటే వుంది. ఎక్కడుందో గుర్తుకొచ్చి అప్పుడప్పుడు వెతుక్కుంటే బందీల సమూహంలో ఎక్కడో కన్పిస్తుంది. బందీగా చిక్కుకుపోవడంతో సినిమా మొత్తం వుండాల్సి వచ్చింది గానీ, లేకపోతే ఫస్టాఫ్ ఓ పాటా, రెండు రోమాంటిక్ సీన్లుచేసి వెళ్ళిపోవాల్సిన పని. బందీగా ఫుల్ లెన్త్ వుండమని ఆమెకి మూడున్నర కోట్లు ఇచ్చారు. మంచి బేరమే.

        హీరో హీరోయిన్లు ఏమో గానీ, ఈ సినిమాలో గ్రేట్ నటనలు చేసింది సెల్వ రాఘవన్, వీటీవీ గణేష్ ఇద్దరే. వీళ్ళిద్దరి సహజత్వానికి, కొత్తగా నవ్వించగల శక్తికీ మార్కులిచ్చుకోవాల్సిందే. అల్తాఫ్ హుస్సేన్ గా సెల్వ రాఘవన్, సెక్యూరీటీ ఏజెన్సీ ఓనర్ గా గణేష్ కథ కాని ఈ కథ నుంచి కొంతైనా రిలీఫే. కమెడియన్ యోగిబాబుకి మాత్రం కామెడీ కుదర్లేదు. ఇక టెర్రరిస్టుల లీడర్ గా అంకుర్ అజిత్ వికల్ మెత్తటి మనిషి పాత్రలేస్తే బావుంటాడు. మెత్తటి మనుషులుగా వున్న టెర్రరిస్టుల క్యాంపుని, పాక్ ఆక్రమిత కాశ్మీర్ అని చీట్ చేసి, ఎక్కడో జార్జియాలో చిత్రీకరించారు. మెత్తటి మనుషులైన టెర్రరిస్టుల్ని చూపించడానికి జార్జియా దాకా వెళ్ళి సెట్ వేయడం అవసరమా? టెర్రరిజం సినిమాలకి అమ్రిష్ పురి లాంటి విలన్లు దొరకడం లేదేమో. టెర్రరిస్టులతో బాటే వాళ్ళూ దేశంలో లేకుండా వెళ్ళి పోయి వుంటారా?

        రిచ్ క్వాలిటీ మేకింగ్, అదిరిపోయే విజువల్స్, ఔట్ డోర్ లొకేషన్స్, టాప్ యాక్షన్ సీన్స్, కాస్ట్యూమ్స్, అనిరుధ్ మ్యూజిక్, సీజీ ... ఇలా సాంకేతికాలు గొప్పవే. హాస్యప్రియుడైన దర్శకుడి ఆపుకోలేని కామెడీతోనే సమస్య. వేళాకోళమైంది సీరియస్ సబ్జెక్టు.

చివరికేమిటి 

దర్శకుడు నెల్సన్  హాస్యప్రియత్వపు జోరుతో  'దేవదాసు' తీసినా కామెడీగానే వుండేలా వుంది. 'బీస్ట్' లో చాలా ఫన్నీ డైలాగులు రాశాడు. చాలా చోట్ల నవ్వకుండా వుండలేం. అయితే కథ విడిచి కామెడీతో, నిర్మాణ విలువలతో సాము చేస్తే కథకే మోసం వస్తుంది. కేవలం కామెడీలూ, నిర్మాణ విలువలూ సినిమాని నిలబెట్టలేవు. ఫస్టాఫ్ ఓపెనింగ్ యాక్షన్, తర్వాత లవ్ ట్రాక్, ఆ తర్వాత టెర్రరిస్టుల ముట్టడీ, మాల్ లో బందీల పరిస్థితి, ఇంటర్వెల్లో హోమ్ మంత్రి ఎత్తుకు విజయ్ పై ఎత్తూ ఇవన్నీ ఒక క్రమ పద్ధతిలో సాగుతున్నవి కాస్తా- సెకండాఫ్ ప్రారంభమయ్యేసరికి సెకండాఫ్ సిండ్రోమ్ లో పడిపోయింది కథ. మాల్ లో అర్ధం పర్ధం లేని కథనం, లాజిక్ లేని మలుపులూ సాగిసాగి సుఖాంతమయ్యాక- ప్రభుత్వం అప్పగించేసిన టెర్రరిస్టుని మళ్ళీ విజయ్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ (జార్జియా) వెళ్ళి, ఈ సారి ఫైటర్ విమానంతో ఇంకో సుదీర్ఘ ఆపరేషన్ జరపడం...ఇదంతా అతి.

        విఫలమవుతున్న తమిళ పానిండియాల పక్కన ఇది మరొకటి. 'బీస్ట్' ని నిర్మాతలు హిందీలో ప్రమోట్ చేసే కార్యక్రమమే పెట్టుకోలేదు. 'బీస్ట్' నే కాదు, 'వలిమై', 'ఈటీ' లని కూడా నార్త్ లో ప్రమోట్ చేయలేదు. తమిళనాడు, హైదరాబాద్ ల వరకే పరిమితమవుతున్నారు. తెలుగు పానిండియాలకి తెలుగు స్టార్లు నార్త్ చుట్టేసి పరిచయాలు పెంచుకుంటున్నారు. నార్త్ ప్రేక్షకులకి దగ్గరవుతున్నారు. తమిళ స్టార్లు నార్త్ ని పట్టించుకోక పోవడం కూడా ప్లాపులకి కారణం కావచ్చు. 'బీస్ట్' ఒక గుణపాఠం.

—సికిందర్

Tuesday, April 12, 2022

1155 : స్పెషల్ ఆర్టికల్

        

2022 జనవరి 7-  ఏప్రెల్ 8 మధ్య  మూడు మాసాల్లో ఓ 50 పెద్ద, మధ్య, చిన్న తరహా తెలుగు సినిమాలు విడుదలయ్యాయి. వీటిలో చిన్నా చితకా సినిమాలన్నీ చిరునామా లేకుండా పోయాక, కాస్త తెలిసిన 25 సినిమాలు చూస్తే 20 ఫ్లాపయ్యాయి. రాధేశ్యామ్’, అతిధి దేవో భవ’, రౌడీ బాయ్స్’, హీరో’, గుడ్ లక్ సఖీ’, సెబాస్టియన్ - పిసి 524’, ఆడవాళ్ళూ మీకు జోహార్లు’, స్టాండప్ రాహుల్’, మిషాన్ ఇంపాసిబుల్’, గని  ఇవి కొన్ని ప్రముఖ ఫ్లాపులు. ఇవి భారీ నష్టాల్ని మిగిల్చాయి. రాధేశ్యామ్ ని పక్కన బెడదాం. ఈ ఫ్లాపుల్లో రాజ్ తరుణ్ నటించిన స్టాండప్ రాహుల్’, తాప్సీ పన్నూ నటించిన మిషాన్ ఇంపాసిబుల్’, వరుణ్ తేజ్ నటించిన  గని’- ఈ చివరి మూడిటి కలెక్షన్స్ వివరాల్లోకి వెళ్తే, స్టాండప్ రాహుల్ ఓవర్సీస్ కలుపుకుని క్లోజింగ్ కలెక్షన్స్ చూస్తే 62 లక్షలే! దీని బిజినెస్ కోటీ 87 లక్షలు. బయ్యర్లకి తేలిన నష్టం కోటీ 25 లక్షలు. బడ్జెట్ మూడున్నర కోట్లు. ఇలా నిర్మాత నష్టాన్ని ఓటీటీ, శాటిలైట్స్ తీర్చేస్తాయి.

        రియాల వారీగా దీని క్లోజింగ్ కలెక్షన్స్ చూస్తే, నైజాం 18 లక్షలు, సీడెడ్ 9 లక్షలు, ఉత్తరాంధ్ర 10 లక్షలు, ఈస్ట్ - వెస్ట్ 10 లక్షలు, గుంటూరు - కృష్ణా 9 లక్షలు, నెల్లూరు 3 లక్షలు, ఓవర్సీస్ 5 లక్షలు. మొత్తం 62 లక్షలు.

        మిషాన్ ఇంపాసిబుల్ క్లోజింగ్ కలెక్షన్స్ ఓవర్సీస్ కలుపుకుని 95 లక్షలు! దీని బిజినెస్  రెండు కోట్ల 22 లక్షలు. బయ్యర్లకి నష్టం కోటీ 27 లక్షలు. బడ్జెట్ సుమారు ఆరు కోట్లు. ఈ నిర్మాత నష్టాన్ని కూడా ఓటీటీ, శాటిలైట్స్ తీర్చేస్తాయి.

        ఏరియాల వారీగా దీని క్లోజింగ్ కలెక్షన్స్ చూస్తే, నైజాం 29 లక్షలు, సీడెడ్ 16 లక్షలు, ఉత్తరాంధ్ర 21 లక్షలు, ఈస్ట్ - వెస్ట్ 7 లక్షలు, కృష్ణా - గుంటూరు 9 లక్షలు, నెల్లూరు 6 లక్షలు, ఇతర భాషలు, ఓవర్సీస్ కలుపుకుని 7 లక్షలు.  మొత్తం 95 లక్షలు.

        ఇక గని నిన్న ఆదివారం కలుపుకుని తొలి మూడు రోజులు ఓవర్సీస్ సహా 4 కోట్ల 18 లక్షలు వసూలు చేసింది. బిజినెస్ 25.30 కోట్లు, బడ్జెట్ 35 కోట్లు. బ్రేక్ ఈవెన్ రావాలంటే మరో 21.82 వసూలు చేయాలి. నిన్న ఆదివారం మరీ పడిపోయిన వసూళ్ళు (69 లక్షలు) చూస్తే అసాధ్యమని తెలుస్తోంది. రేపు 13, 14 తేదీల్లో విడుదలయ్యే బీస్ట్’, కేజీఎఫ్ 2 ల ముందు గని తట్టుకుని నిలబడడం సందేహమే. ఈ నిర్మాత నష్టాన్ని కూడా ఓటీటీ, శాటిలైట్లే తీర్చాలి.

        ఓవర్సీస్ కలుపుకుని దీని తొలి మూడు రోజుల వసూళ్ళు చూద్దాం : నైజాం కోటీ 38 లక్షలు, సీడెడ్ 43 లక్షలు, ఉత్తరాంధ్ర 58 లక్షలు, ఈస్ట్ - వెస్ట్ 52 లక్షలు, గుంటూరు - కృష్ణా 54 లక్షలు, నెల్లూరు 18 లక్షలు, కర్ణాటక 24 లక్షలు, ఓవర్సీస్ 31 లక్షలు. మొత్తం నాల్గు కోట్ల 18 లక్షలు.

చందాలిస్తున్నారు
        పై వివరాలు స్పష్టం చేస్తున్నదేమిటంటే, విడుదలవుతున్న విషయం లేని తెలుగు సినిమాలకి ప్రేక్షకులు డబ్బులివ్వడానికి నిరాకరిస్తున్నారని. చందాలేసుకున్నట్టు అరకొర డబ్బులిచ్చి వదిలేస్తున్నారని. ఇక ఓటీటీ, శాటిలైట్లే ఆశాకిరణా లన్నట్టు నిర్మాతల్ని అటు వైపు నెట్టేస్తున్నారని. అలాగే ఓటీటీ, శాటిలైట్ల ద్వారా నష్టాలు తీర్చుకుని ఎలాగో బయటపడతున్నారు నిర్మాతలు.

        థియేటర్లో ప్రేక్షకుల కోసం తీసే సినిమాలకి ప్రేక్షకులు డబ్బివ్వక, నిర్మాతలు ఇతర చోట్ల లాభార్జన చేసుకునే పరిస్థితి వచ్చింది. అంగడి కోసం ఉత్పత్తి చేసిన వస్తువుని అడవిలో అమ్ముకున్నట్టు. కానీ అంబానీ జియోని అడవి జంతువుల కోసం ప్లాన్ చేయలేదు. నిర్మాతలు, మేకర్లు మాత్రం అటవీ ప్రదర్శనల కోసమే సినిమాలన్నట్టు  ఆటవికంగా, ప్రణాళికా బద్ధంగా రూపొందిస్తున్నారు. ఇలా ఇతర మార్గాల్లో  లాభార్జనకి వీలున్నప్పుడు ప్రేక్షకుల కోసం సినిమాలు తీయడమెందుకు? ఓటీటీల కోసమే, శాటిలైట్ల కోసమే సినిమాలు తీసుకోవచ్చుగా? అద్దెలు కట్టి థియేటర్ రిలీజులు, థియేటర్లో రాని ప్రేక్షకుల కోసం షోలూ వగైరా దేనికి? ఈ పరిస్థితి ఎందుకొచ్చింది?

        పైన పొందుపర్చిన వసూళ్ళ వివరాలు ఆలకించక పోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. ఈ మూడునెలల్లో ఎన్ని రిలీజయ్యాయి, ఎన్ని ఫ్లాపయ్యాయి ఎందరికి తెలుసు? 25 తెలిసినవి విడుదలైతే 20 ఫ్లాపయ్యాయని ఎంత మందికి తెలుసు? ఇవి తెలుసుకోకుండా ఎలా సినిమాలు తీయాలో ఎలా తెలుస్తుంది?

        వారం వారం విడుదలవుతున్న సినిమాల మీద దృష్టి పెట్టి ఎప్పటికప్పుడు జయాపజయాల విశ్లేషణ చేసుకోక పోతే ఈ పరిస్థితి ఇంకా కొనసాగుతూనే వుంటుంది. విడుదలయ్యే పెద్ద సినిమాల పని తీరే తప్ప మిగతా మధ్య, చిన్న తరహా సినిమాలు ఎలా ఆడుతున్నాయి, ఏం ఆర్జిస్తున్నాయీ తెలుసుకునే ఆసక్తి లేకపోతే పరిస్థితిలో ఎప్పటికీ మార్పు రాదు.

        శనివారం బెంగుళూరు నుంచి సీనియర్ జర్నలిస్టు కాల్ చేసి, ఫలానా ఆ పానిండియా మూవీ అంత వసూలు చేసిందటగా అని అంటే - ఎంత వసూలు చేస్తే మనకెందుకండీ, అది ట్రేడ్ పండితులు చూసుకునే విషయం, మనం సినిమా ఎలా వుందో రివ్యూ రాసి వూరుకుంటాం, పూటపూటకీ నెట్లో కలెక్షన్ డేటా, దాని మీద ఫ్యాన్స్ వార్ మన బుర్ర కెక్కించుకోవడం దేనికీ?- అనాల్సి వచ్చింది.

విడుదలల సమాచారానికి దూరం
        మేకర్ల విషయం కూడా ఇంతే, ఇలాగే వుండాలి. అయితే ఈ డేటా వార్ తో కాలక్షేప కబుర్లు చెప్పుకుని కాలం గడిపే వాళ్ళే ఎక్కువ. పెద్ద సినిమాలు తప్పితే మధ్య, చిన్న తరహా సినిమాలు వారం వారం ఏవేవి విడుదలవుతున్నాయో కూడా చాలామంది మేకర్లకి తెలీదంటే ఆశ్చర్య పోవాల్సిన పని లేదు. తెలుసుకోవాలని కూడా అనుకోరు. ఈ మధ్య పెద్ద సినిమాలు లేని వారం చిన్నా చితక సినిమాలు ఏడెనిమిది విడుదలవుతున్నాయి. వీటి టైటిల్స్ కూడా తెలీవంటే తెలీవు. గత వారం గని  తో బాటు ఐదు చిన్న సినిమాలు విడుదలయ్యాయి. ఈ సినిమాలేమిటో ఎంతమంది మేకర్లకి తెలుసో ఆలోచించాలి.

        ఆదివారం కేవలం రెండంటే రెండు నిమిషాలు కేటాయించి ఆంధ్రజ్యోతి తిరగేస్తే,  ఆ వారం విడుదలయ్యే కొత్త  సినిమాల యాడ్స్ రెండు పేజీల నిండా వుంటాయి. ఈ రెండు పేజీల కోసం రెండు నిమిషాలు కేటాయించే వాళ్ళెంత మంది? మార్కెట్లో ఏం సినిమాలొస్తున్నాయో సమాచారం లేని జీవితం మేకర్ జీవితమేనా? దీనికి బదులు ఓటీటీలో ఆ మలయాళం వచ్చింది, ఈ తమిళం వచ్చిందీ అని ఆర్టీఐ కార్యకర్త ల్లాగా ఇన్ఫర్మేషన్ లాగి అందించడం.

        ఈ వ్యాసం స్టార్ సినిమాల మేకర్ల గురించి కాదు. వాళ్ళకి ఏ వారం ఏ చిన్నా చితకా విడుదలవుతున్నాయో తెలుసుకోవాల్సిన అవసరం లేదు. స్టార్ సినిమాలు తీసే మేకర్ల సినిమాలు 10 వుంటాయి. మిగతా 90 సినిమాలు మధ్య, చిన్న తరహా సినిమాలు తీసే  మేకర్లవే. వీళ్ళల్లో 90 శాతం మళ్ళీ కొత్త వాళ్ళే. నిన్న ఆదివారం పండక్కి ఏకబిగిన 20 మధ్య, చిన్న తరహా సినిమాల ప్రారంభోత్సవాలు జరిగినట్టు సమాచారం. ఈ నిర్మాతలూ మేకర్లూ కొత్త వాళ్ళే. ఈ వర్గం గురించే ఈ వ్యాసం.

        విరివిగా 90 శాతం మధ్య, చిన్న తరహా సినిమాలు  తీయడానికి వచ్చే మధ్య, చిన్న తరహా మేకర్లు తాము తీయబోయే సినిమా గురించే తప్ప మార్కెట్ గురించి ఆసక్తి లేకపోతే ఆ 90 శాతాన్నీ ఫ్లాపుల లిస్టులో నమోదు చేసి వెళ్ళిపోవడమే జరుగుతుంది. గత 20 ఏళ్ళుగా జరుగుతోందిదే.  

        స్క్రిప్టు రాసుకోవడమంటే స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ గ్రిక్చర్ మాత్రమే కాదు, ఇకో సిస్టమ్ కూడా. ఇక్కడ ఇకో సిస్టమ్ అంటే మార్కెట్లో విడుదలవుతున్న కొత్త సినిమాలు, వాటి కథాంశాలు, ప్రేక్షకుల రెస్పాన్స్, రివ్యూలు, వసూళ్ళూ - మొదలైన వాటితో కూడిన భౌతిక భౌగోళిక వాతావరణ స్థితి. సినిమా పర్యావరణ వ్యవస్థ.

        ఈ వ్యవస్థ గురించి ఆలోచనలేకుండా, ఎమోషన్, పాషన్, బర్నింగ్ యాంబిషన్ లతో  మాత్రమే స్క్రిప్టు రాసేసి, సినిమా తీసేసి, మార్కెట్లో పెడితే అది పర్యావరణ కాలుష్యానికి దారి తీసి, శిక్షార్హ నేరమవుతుందే తప్ప మరోటి కాదు, అందమైన అట్టర్ ఫ్లాప్ తో.  

        అంటే విడుదలయ్యే అన్ని సినిమాలూ చూడాలని కాదు. వీలున్నన్ని చూడొచ్చు జేబు సహకరిస్తే. ముఖ్యంగా వాటి కథాంశాలు, అవెలా తెరకెక్కాయీ  తెలిపే రివ్యూల మీద దృష్టి పెట్టాలి. వీటిలో చాలా వాటికి రివ్యూలు కూడా రాక పోవచ్చు. కానీ వాటి కథలేమిటో ఎక్కడో సమాచారం లభించక పోదు. దీంతో ఆ వారం ఏఏ జానర్ల సినిమాలు వచ్చాయి, అవెందుకు ఆడుతున్నాయి, లేదా ఆడడం లేదు, మనం తీస్తున్న జానరేంటి, వాటికన్నా మనమెలా బెటర్ గా తీయగలం- ఈ మూల్యాంకన చేసుకున్నప్పుడే రేపు సినిమాతో మార్కెట్లో ఎక్కడుంటామన్నది తెలుస్తుంది.

        ఇకో సిస్టంని కలుపుకుని సినిమా కథని ఆలోచించకపోతే ఆ సినిమా ఇకో సిస్టం నుంచి దూరమైపోతుంది. స్క్రిప్టు రైటింగ్ త్రికోణీయ కలాపమని అంటారు. అంటే మేకర్ కథ గురించే ఆలోచించి కథ రాయకూడదు. ప్రేక్షకుల గురించి కూడా ఆలోచించి రాయాలి. ఇలా మేకర్-కథ-ప్రేక్షకులనే బంధం రచనకి ముఖ్యమవుతుంది. ఇక్కడ ప్రేక్షకులనే మాటని విస్తరించి ఇకో సిస్టంగా చూడాల్సి వుంటుంది. వారం వారం ఇకో సిస్టం మీద నిఘా, నాలెడ్జీ రచనలో పొరపాట్ల నుంచి కాపాడతాయి.

ప్లే స్కూల్ స్క్రీన్ ప్లేలు
        ఇక సినిమా డిజిటలీ కరణ చెంది మేకింగ్ ఎవరైనా చేసుకోవచ్చనే స్వేచ్ఛా ద్వారాలు తెర్చుకున్నాక, ఈ స్వేచ్ఛతో  - మా యిష్టం ఎలాగైనా తీసుకుంటామెనే ధోరణొకటి పెరిగింది. అంటే ఇండిపెండెంట్ సినిమాలన్న మాట. వీటికి పరిమిత ప్రేక్షకులే తప్ప, ఫేస్ బుక్ మిత్ర బృందం మునగ చెట్టు నెక్కించడం తప్ప మరేమీ వుండదు. వీటికి ఇకో సిస్టంతో పనుండదు. వీటికి మార్కెట్లోకి వచ్చి కలెక్షన్లు పొందే వీలుండదు. ఇకో సిస్టం అంటేనే, మార్కెట్ అంటేనే కమర్షియల్ సూత్రాలూ స్క్రీన్ ప్లే సూత్రాలూ మొదలైనవి. ఈ ఇండిపెండెంట్ సినిమాలకి స్క్రీన్ ప్లే సూత్రాలంటేనే గిట్టదు. స్క్రీన్ ప్లే సూత్రాలు కమర్షియల్ మార్కెట్ గురించే ఏర్పడ్డాయి. ఇవి పట్టని ఇండిపెండెంట్ మేకర్లు ఫిలిమ్ ఫెస్టివల్స్ కెళ్ళొచ్చు, డైరెక్ట్ ఓటీటీ కెళ్ళొచ్చు, ఈ స్క్రీన్ ప్లేలు ప్లే స్కూల్లో పిల్లలు ఆడుకోవడానికి కూడా పనికి రావు.

        రెండేళ్ళు హార్డ్ వర్క్ చేసి సినిమా తీశామంటారు. దేని ఆధారంగా? ఇకో సిస్టం ఆధారంగానా? అసలు వర్క్ ని హార్డ్ వర్క్ అనడమేమిటి? పనిని అంత కష్ట పెట్టుకుని ఎందుకు చేయాలి? వర్కుని హార్డ్ వర్క్ అని శాపం ఎందుకు పెట్టాలి. ఈజీ వర్క్, ఈజీగా చేసుకుపోవాలని ఎందుకు వర్క్ కి ఆశీస్సులందించ కూడదు. నేను బిజీ బిజీ అని మాటలెందుకు కాలానికి శాపం పెడుతున్నట్టు. నేను ఈజీ ఈజీ, నా దగ్గర చాలా టైముందని ఎందుకు కాలాన్ని ఆశీర్వదించ కూడదు. మైండ్ కి ఏ మాట అందిస్తే ఆ పరిస్థితినే అందిస్తుంది మైండ్. ఢిల్లీ వెళ్ళిన మంత్రి బిజీబిజీ అని టెంప్లెట్ లో పెట్టి వార్తలు రాసేస్తూంటారు. అందుకే మంత్రుల పని తీరులు అలా అఘోరిస్తూంటాయి. ఈజీ ఈజీ అనుకుంటే మంత్రి గార్ల పనితీరులు జనరంజకంగా వుంటాయి. ఈ బిజీ బిజీ, హార్డ్ వర్క్ అన్న పదాలు ఆత్మ శక్తిని తగ్గించే, అసహ్యమేసే సోమరి పదాలు. ముఖ్యంగా క్రియేటివ్ ఫీల్డులో వుంటున్న వాళ్ళకి.

        ఆఖరిగా - స్టీవెన్ స్పీల్ బెర్గ్ మాట -  I love to go to a regular movie theater, especially when the movie is a big crowd-pleaser. It's much better watching a movie with 500 people making noise than with just a dozen.”

—సికిందర్