—సికిందర్
Wednesday, November 10, 2021
1079 : సాంకేతికం
Tuesday, November 9, 2021
Wednesday, July 13, 2016
నాటి సినిమా!
సినిమా దర్శకుడు భావుకత గల రచయిత కూడా అయినపుడు (సినిమా రచయిత కాదు) అతడి సినిమాలు పర్సనల్ డైరీలవుతాయి. వెంటనే అర్ధంగాక పోస్ట్ ప్రొడక్షన్లోనే గొడవలైపోతాయి. అతను ‘గాడ్ ఫాదర్’ తీసివున్న కపోలా అయితేనో, ‘సిరిసిరిమువ్వ’ తీసివున్న విశ్వనాథ్ అయితేనో ఫర్వాలేదు. కపోలా, విశ్వనాథ్ లు కమర్షియల్ గా నిరూపించుకున్నాకే ‘యూత్ వితవుట్ యూత్’, ‘శంకరాభరణం’ లాంటి పర్సనల్ సినిమాలు తీసి డిస్ట్రిబ్యూటర్లని ఒప్పించుకోగల్గారు. కానీ లేడికి లేచిందే పరుగన్నట్టు, ఓ భావుకత గల కొత్త దర్శకుడు రంగ ప్రవేశం చేసింది లగాయతు అదేపనిగా పర్సనల్ సినిమాలే తీస్తూ పోతే దీన్నేమనాలి?
ఇలా వంశీ అనే హైలీ ఇండివిడ్యువలిస్టిక్ డైరక్టర్ గురించి ఇంత చాలు. తీసిన మొట్ట మొదటి ‘సితార’ తోనే తను బాపు, విశ్వనాథ్ ల సరసన చేరిపోయాడు. ముత్యాలముగ్గు (1975), శంకరాభరణం (1980), మేఘసందేశం (1982), సితార (1984) ... ఈ నాల్గూ ఒకే అచ్చులో పోసిన కళా ఖండాలుగా కన్పిస్తాయి. వీటిలో కామన్ గా కన్పించేది ఒక్కటే : అతి తక్కువ సంభాషణలు! అసలు డైలాగు లేవీ అని ఫైనాన్షియర్లు గొడవ పడేంతగా, దృశ్యానికో పోలియో చుక్క లాంటి ఏకవాక్య సంభాషణ మాత్రమే వీటి ప్రత్యేకత! ప్రేక్షకులు హారతులు పట్టిన ఈ విజయవంతమైన కమర్షియలార్టు పంథాకి ఎవరు మొదట బీజం వేసి, ఎవరెవరు పెంచి పోషిస్తూ పోయారో పై నాల్గు సినిమాల విడుదల క్రమాన్ని చూస్తే తెలిసిపోతుంది.
‘మహల్లో కోకిల’ అని వంశీయే రాసిన నవల ‘సితార’ గా తెర కెక్కింది. ‘శంకరాభరణం’ , ‘సాగర సంగమం’ లాంటి రెండు ఘన విజయాలు సాధించి వున్న ఏడిద నాగేశ్వరరావు దీని నిర్మాత. తమిళ రీమేకుగా వంశీ మొదటి సినిమా ‘మంచు పల్లకి’ హిట్ అవలేదు. రెండో సినిమా ‘సితార’ తో నిర్మాత చేసింది సాహసమే. ఈ సినిమా చారడేసి కళ్ళ భానుప్రియని పరిచయం చేసింది. అప్పటికామెకి పచ్చి కొబ్బెర లాంటి పదిహేడేళ్లే. అప్పటికే మంచి డాన్సర్ కూడా అయిన ఆమె నృత్యాలతో ‘సితార’ విక్షణాసక్తత బాగా పెరిగింది. తెర వెనుక ఇళయరాజా హిట్ బాణీలు కన్పించని దేవుడిలా అభయహస్తమిచ్చాయి.
రాచరికపు పంజరంలో బందీ అయిపోయిన అందాల బొమ్మ జీవితాన్ని ‘సితార’ చూపిస్తుంది. ఆస్తులూ పరువు ప్రతిష్టలూ సమకూరడానికి ఏయే న్యాయమైన కారణాలైతే తోడ్పడ్డాయో, వాటిని గౌరవించుకోకపోతే, ఆ కారణాలూ తొలగిపోయి ఆస్తులూ పరువు ప్రతిష్టలూ మంట గలిసిపోతాయని ఒక సూక్తి. ఇలాంటి దుర్గతే సూడో జమీందారు చందర్ ( శరత్ బాబు) ది. ఇతడి జమీందారు తండ్రి విలాసాలు మరిగి ఆస్తులు గుల్ల చేశాడు. దుర్భర దారిద్ర్యాన్ని కొడుక్కి మిగిల్చిపోతూ, ఆస్తి పాస్తులు ఇక లేవన్న విషయం బయటి ప్రపంచానికి తెలీనివ్వకూడదని, వంశ ప్రతిష్ట నిలబెట్టాలనీ మాట తీసుకుని స్వర్గానికో ఇంకెక్కడికో వెళ్ళిపోయాడు. లోన చిరిగిన చొక్కా, పైన వంశ హోదా వెలగబెడుతూ కోటూ - ఇదీ చందర్ డబుల్ యాక్షన్ జీవితం. తగాదాల్లో వున్న పొలం మీద ఎలాగో కేసు గెల్చుకుని, తండ్రి కిచ్చిన మాట ప్రకారం పూర్వవైభవం కల్పించుకుందామని లాయర్ (జెవి సోమయాజులు) తో కలిసి ఎంత ప్రయత్నించినా పప్పులుడకడం లేదు.
ఇలాటి చందర్ కి ఓ చెల్లెలు కోకిల (భానుప్రియ) అని. బంగళాలో ఈమెని బందీ చేసి వుంచాడు. ఏమంటే, ‘పరదాలు, ఘోషాలు మా రాజవంశపు సాంప్రదాయం’ అంటూ గొప్పలు. ‘ఆ చీకటి గోడల మధ్య మీ స్త్రీలు పడే హింస గమనించావా?’ అని ఎవరైనా ప్రశ్నిస్తే, సాంప్రదాయం పట్ల గౌరవమే వుంటే హింసే అన్పించదనీ, అయినా ఒంటరిగా వుంచకుండా వాళ్ళ కాలక్షేపం కోసం నాట్యం, సంగీతం నేర్పిస్తామనీ, కోకిల కూడా వాటితో కాలక్షేపం చేస్తోందనీ సమర్ధన. ఆమె ఏదో స్వేచ్ఛ అంటూ సాంప్రదాయాన్ని కాల దన్నుకోదని ప్రగాఢ విశ్వాసం కూడా చందర్ కి.
ఈ జరిగిందంతా దేవదాసు ( శుభలేఖ సుధాకర్) కి చెప్పుకొస్తుంది కోకిల. ఇతనొక ఫోటోగ్రాఫర్. ఇలా తన ఆశ్రయం పొందిన కోకిలని సినిమా హీరోయిన్ ని చేస్తాడు. ఇంతలో తన గతమంతా పేపర్లకెక్కి బెంబెలెత్తిపోతుంది కోకిల. ఏ వంశ గుట్టు కాపాడతానని తను అన్న కిచ్చిన మాట ఇలా అయ్యిందో, ఇక దీనికి ఒకే ఒక్క పరిష్కార మార్గంగా వయసుమళ్ళిన డాక్టర్ (ప్రభాకర రెడ్డి) ని తన తో పెళ్ళికి ఒప్పిస్తుంది. ఇది కూడా బెడిసి కొట్టి తను ఆత్మహత్య చేసుకోబోతున్నప్పుడు, చనిపోయాడనుకున్న రాజు బయల్దేరి వస్తూంటాడు.
ముందు కోకిలగా, తర్వాత సితారగా రెండు విభిన్న పాత్రల్లో కన్పించే భాను ప్రియ కిది తెలుగులో అడుగు పెడుతూనే సూపర్ హిట్ ఎంట్రీ. తను తెలుగే అయినా దీనికి ముందు ఒక తమిళం చేసింది. మాస్ కమర్షియల్ హీరోగా కొనసాగుతున్న సుమన్ కిది ఒక జ్ఞాపిక లాంటిది. సినిమాలో భానుప్రియ జ్ఞాపికగా ఇచ్చే పళ్ళెం పట్టుకుని తన బృందాన్ని బాధ పెట్టి వెళ్ళిపోయే సీను ఒక్కటి చాలు సుమన్ హావభావ ప్రకటనా సామర్థ్యానికి.
ఇక తను ఆత్మహత్య చేసుకోబోతున్నట్టు చీటీ రాసి ప్రభాకర రెడ్డికి పంపడమెందుకు? తనని కాపాడేందుకా? అలా చీటీ రాసి ఆత్మహత్యా యత్నం ఒక నాటకంగా పాత్ర దిగజారి పోలేదా? (ఈ వ్యాసం చదివి వంశీ తర్వాత లోపాలు ఒప్పుకున్నారు). క్లయిమాక్స్ బలహీనంగా తేలిపోవడానికి శరత్ బాబు ఆత్మహత్య చేసుకునే దగ్గర కథ బలహీన పడడమే కారణం. హాలీవుడ్ ఇంద్రజాలికుడు స్టీవెన్ స్పీల్ బెర్గ్ ఇందుకే అన్నాడేమో- కథ ఎలా చెప్పాలో మర్చిపోతున్నారు. కథలకి మిడిల్, ఎండ్ లు ఏమాత్రం వుండడం లేదు, ఎంత సేపూ బిగినింగే .. ఈ బిగినింగ్ కూడా ఎంత సేపటికీ ముగియదు..అని!
పట్టపగలే చుక్కలు!
రీరికార్డింగ్ మొదలైంది. ఇళయరాజాని చూస్తూంటే వంశీకి ఒకటే గుబులుగా వుంది. ఈయన కూడా పారిపోతే? అలా చేయలేదు ఇళయరాజా. సినిమా సాంతం చూసి నె మ్మదిగా లేచారు. వంశీ దగ్గరి కొచ్చారు. ‘భలే బ్యూటిఫుల్ కాన్వాస్ ఇచ్చావయ్యా! థాంక్యూ...ఎవ్విరీ మినట్ ఈ పిక్చర్ ని ఎంజాయ్ చేస్తూ వర్క్ చేస్తా!’ అనేసరికి వంశీ ఎక్కడికో వెళ్ళిపోయాడు!
12 కేంద్రాల్లో వంద రోజులాడింది సినిమా. మంచి మ్యూజికల్ హిట్. పైగా జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా అవార్డు, ఉత్తమ గాయనిగా ఎస్. జానకికి మరో జాతీయ అవార్డు, ఉత్తమ ఆడియోగ్రాఫర్ గా ఎస్వీ రామనాథన్ కి మరింకో జాతీయ అవార్డు సంపాదించి పెట్టింది ‘సితార’.
(“సాక్షి” –నవంబర్ 2009)
Monday, November 8, 2021
1078 : సందేహాలు- సమాధానాలు
Q : నేనొక ఇనిస్టిట్యూట్ లో యాక్టింగ్
నేర్చుకుంటున్నాను. అయితే మీరు తరచూ యాక్టివ్ క్యారక్టర్,
పాసివ్ క్యారక్టర్ అని రాస్తుంటారు. యాక్టింగ్ కోర్సులో వీటి గురించి చెప్పడం
లేదు. రేపు నాలాంటి నటులు పాత్రల్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. మీరు పాసివ్
క్యారక్టర్స్ తో సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయని అంటారు. నాకు భయంగా వుంది. రేపు
నేను నటిస్తే నా సినిమాలు కూడా ఫ్లాపవుతాయా? లేకపోతే నటుడిగా
ఇదంతా నాకవసరం లేదంటారా? డైరెక్టర్ చెప్పినట్టు చేయాలంటారా? దయచేసి నా సందేహాలు తీర్చగలరు.
—ఆర్ జె పి, యాక్టింగ్ విద్యార్థి
A : ఇనిస్టిట్యూట్స్
లో యాక్టివ్, పాసివ్ పాత్రలు నేర్పుతారు. నేర్పకపోతే అడగండి. పాసివ్ పాత్రలెందుకంటే
ట్రాజడీల కవసరం కాబట్టి. రియలిస్టిక్- అన్ రియలిస్టిక్ పాత్రల నటన కూడా
నేర్పుతారు. అయితే థియరీ నేర్చుకోవడం వేరు, ప్రాక్టికల్ గా కథ
వినేప్పుడు అది యాక్టివా పాసివా గుర్తించడం వేరు. ఏ ఏ లక్షణాలు యాక్టివ్ కుంటాయి, ఏ ఏ లక్షణాలు పాసివ్ కుంటాయి అదనంగా స్క్రీన్ ప్లే పుస్తకాలు చదివి
తెలుసుకోండి. విరివిగా సినిమాలు చూసి గుర్తించండి. సినిమాల్లో ప్రధాన పాత్రల్నే
కాదు, ఇతర పాత్రల్ని కూడా పరిశీలించండి. సహాయ పాత్రలు పాసివ్
గా కూడా వుండొచ్చు. నష్టం లేదు. సినిమా ప్రధాన పాత్రదే అవుతుంది కాబట్టి అది
యాక్టివ్ గానే వుందా తెలుసుకోండి. కథ ట్రాజడీ అయితే పాసివ్ గా వుండడాన్ని
గమనించండి. కమర్షియల్ సినిమా అన్నాక హీరోయిన్, విలన్ పాత్రలు
కూడా యాక్టివ్ గానే వుండాల్సి వుంటుంది.
మీరు భవిష్యత్తులో హీరో అయితే, కథ వినేప్పుడు ట్రాజడీ కాకపోతే, యాక్టివ్ పాత్రేనా తెలియడం
అవసరం. ‘గీత గోవిందం’ లో హీరో పాసివ్
క్యారక్టరే కానీ స్క్రీన్ ప్లే వల్ల అది హిట్టయిందని ఒక ప్రముఖ ఇనిస్టిట్యూట్
సీనియర్ ప్రిన్సిపాల్ చెప్తూంటారు. ఇలా అన్నిసార్లూ జరగక పోవచ్చు. రిస్కు తీసుకోవాలనుకుంటే
మీ ఇష్టం. అయితే ఇనిస్టిట్యూట్స్ లో ఏ పాత్ర ఎలా నటించాలో నేర్పుతారే తప్ప, ఏ
పాత్ర ఒప్పుకుని సినిమాలో నటించాలో అది నటుల ఛాయిస్సే. పాసివ్ పాత్రల్ని
తిరస్కరించమని ఇనిస్టిట్యూట్స్ లో చెప్పరు. అది మీ విచక్షణ.
Q : రోమాంటిక్ కామెడీలు బలంగా వుండాలంటే ఏం
చేయాలి? లవర్స్ విడిపోయి కలుసుకుంటే బలంగా వుండదా?
రోమాంటిక్ కామెడీలు ఇప్పుడు వర్కౌట్ కావని మాత్రం నిరాశపర్చకండి. రోమాంటిక్ కామెడీలు
బలంగా వుండాలంటే ఇంకేం చేయాలో చెప్పండి.
—ఏ టూ జెడ్, దర్శకుడు.
A : పేరు వద్దన్నారు కాబట్టి ఏ టూ జెడ్
గా మార్చాం. ఇక ‘వరుడు కావలెను’ సహా నిరాశ పరుస్తూనే వస్తున్నారుగా మీలాంటి వాళ్ళు. అపార్ధాలతో విడిపోవడాలు,
లేకపోతే ప్రేమిస్తున్నట్టు పైకి చెప్పలేక పోవడాలు - ఈ చాదస్తాల చుట్టేగా రెండు
దశాబ్దాలుగా చుట్టిందే చుట్టి చుట్ట చేసి చూపిస్తున్నారు. అసలు రోమాంటిక్ కామెడీ కర్ధం
తెలుసుకోవాలి ముందు. జంధ్యాల తీసిన ‘అహ నా పెళ్ళంట’ చూడండి. ఇందులో ప్రేమికులు విడిపోతారా? హాలీవుడ్
రోమాంటిక్ కామెడీల్లో విడిపోతారా? విడిపోవడాల్నీ, ప్రేమిస్తున్నట్టు పైకి చెప్పలేక పోవడాల్నీ రోమాంటిక్ డ్రామా లంటారు. ఇన్నేళ్ళుగా
రోమాంటిక్ డ్రామాలు తీస్తూ, రోమాంటిక్ కామెడీలనుకుంటున్నారు.
దీంతో రెండూ కాకుండా పోతున్నాయి.
తీస్తున్నది రోమాంటిక్ కామెడీలు కాదూ
డ్రామాలని ముందు ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే అప్పుడు రోమాంటిక్ డ్రామాలైనా ‘మరోచరిత్ర’ లా అర్ధవంతంగా తీస్తారు. రోమాంటిక్ డ్రామా
జానర్ మర్యాదలు వేరు, రోమాంటిక్ కామెడీల జానర్ మర్యాదలు
వేరు. రోమాంటిక్ డ్రామాలు వీణ సినిమాలు, రోమాంటిక్ కామెడీలు
గిటార్ సినిమాలు. యూత్ కి వీణ కావాలా, గిటార్ కావాలా? ఈ బ్లాగులోనే దీని గురించి వివరంగా వ్యాసం రాశాక మళ్ళీ ఇక్కడ వివరించనవసరం లేదు. ఇక్కడ క్లిక్ చేసివ్యాసం చూడండి.
ఇంకేం జరుగుతోందంటే, తీస్తున్న రోమాంటిక్ కామెడీలనే, డ్రామాలనే లైటర్
వీన్ గా తీయడం. ఈ లైటర్ వీన్ అనే ఫ్యాషన్ కూడా ఇరవై ఏళ్ళ క్రితం అలవాటు చేసుకున్నదే.
హాలీవుడ్ మార్కెటింగ్ వ్యూహమెలా వుంటుందంటే, లైట్ గా వుండే కథలకి
కథనాన్నికాంప్లికేట్ చేసి తీస్తారు. అప్పుడు బాక్సాఫీసు దగ్గర స్ట్రాంగ్ గా నిలబడుతుంది.
బిగ్ యాక్షన్ మూవీస్ లో కథని, కథనాన్నీ లైట్ గానే వుంచి, హెవీ యాక్షన్ సీన్స్ ని క్రియేట్ చేస్తారు. అప్పుడే బాక్సాఫీసు
బద్ధలవుతుంది. ఇలాటివి తెలుసుకోక పోతే ఇంకో
ఇరవయ్యేళ్ళూ రోమాంటిక్ కామెడీలతో ఇంతే.
ఈ మధ్య చూసిన ఒక హాలీవుడ్ ఉదాహరణ చూద్దాం
: రోమాంటిక్ కామెడీలో కేవలం హీరోయిన్ల మధ్య కాన్ఫ్లిక్ట్ నిలబెట్టలేదని ఏం చేశారో
చూద్దాం. సినిమా పేరు ‘క్రేజీ, స్టుపిడ్, లవ్’ (2011). ఇందులో హీరో హీరోయిన్ల మధ్య కాన్ఫ్లిక్ట్ తో
బాటు, కథనంలో తల్లిదండ్రుల మధ్య, ఇంకా తండ్రికీ
కొడుక్కీ మధ్య, మరింకా తండ్రికీ కూతురికీ మధ్య, మరీమరీ ఇంకా బేబీ సిట్టర్ కీ తల్లికీ మధ్యా కాన్ఫ్లిక్ట్స్ పెట్టేసి, లైట్ కథని పైన చెప్పుకున్న హాలీవుడ్ మార్కెటింగ్ వ్యూహంతో, కాంప్లికేట్ చేశారు. 50 మిలియన్ డాలర్ల బడ్జెట్ కి,
145 మిలియన్ డాలర్లు బాక్సాఫీసు వచ్చింది.
Q : వంశీ
గారి ‘అన్వేషణ’ కధ కూడా ఎండ్ సస్పెన్స్ కాదా ? ‘అన్వేషణ’ సూపర్ సక్సెస్. మరి ‘అనుమానాస్పదం’ కథ కూడా ఇంచుమించుగా అలాగే
వుంటుంది కానీ ఈ సినిమా ప్లాప్. వివరించగలరు.
—ఫణి కుమార్, దర్శకత్వ శాఖ
A : ఎండ్
సస్పెన్స్
ప్రక్రియ పరిణామ క్రమం సందర్భాను సారం బ్లాగులో ఇస్తూనే వచ్చాం కదా? ‘అన్వేషణ’ 1985 నాటికి హాలీవుడ్ లో ఎండ్ సస్పెన్స్ ప్రక్రియకి
తెర పడుతూ వచ్చింది. హంతకుడెవరో ముగింపు వరకూ వెల్లడి కాని సస్పెన్స్ కథలకి సినిమాల్లో
ప్రేక్షకాదరణ తగ్గిపోయింది. ఒక్కో తరహా కథలకి ఒక్కో కాలం వుంటుంది. మారుతున్న కాలానికి
అభిరుచులు కూడా మారి, ఇక ఓపిగ్గా కూర్చుని నిదానంగా సాగే కథల్ని
సినిమాలుగా చూసే తరం ప్రేక్షలులు తగ్గిపోతూ వచ్చారు. దీంతో హంతకుడెవరో ముందే తెలిసిపోయి, వాణ్ణి పట్టుకునే సీన్ టు సీన్ సస్పెన్స్ కథల్ని సినిమాల్లో ప్రవేశపెట్టింది
హాలీవుడ్. ఇది మన దేశంలో వెంటనే అందుకోక పోయినా కొంత కాలం పట్టింది. అప్పట్నుంచీ ఎండ్
సస్పెన్స్ కథలతో వుండే సినిమాలు ఫ్లాపవుతూ వచ్చాయి. 2007 లో వంశీయే తీసిన ‘అనుమానాస్పదం’ సహా. ఈ లింక్ క్లిక్ చేసి పూర్తి వివరాలుచూడండి.
—సికిందర్
Sunday, November 7, 2021
1077 : రివ్యూ
కథ- దర్శకత్వం : రోహిత్
శెట్టి
తారాగణం : అక్షయ్ కుమార్, కత్రినా కైఫ్, జాకీ ష్రాఫ్, అజయ్ దేవగణ్, రణవీర్ సింగ్,
గుల్షన్ గ్రోవర్, కుముద్ మిశ్రా,
జావేద్ జాఫ్రీ, అభిమన్యూ సింగ్,
సికిందర్ ఖేర్ తదితరులు
రీసెర్చి : ఎస్ హుసేన్ జైదీ, స్క్రీన్ ప్లే : యూనస్ సజావల్, మాటలు : ఫర్హాద్ సాంజీ, సంచిత్ బెంద్రే, విధీ ఘోడ్గాడ్కర్
సంగీతం : అమర్ మోహిలే, ఎస్ తమన్,
ఛాయాగ్రహణం : జామన్ జాన్
బ్యానర్స్ : రిలయెన్స్ ఎంటర్ టైన్మెంట్, రోహిత్ శెట్టి
పిక్చర్జ్, ధర్మా ప్రొడక్షన్స్, కేప్
ఆఫ్ గుడ్ ఫిల్మ్స్
విడుదల : నవంబర్ 5, 2021
***