రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Thursday, January 31, 2019

733 : లవర్ నుంచి ఎఫ్ 2 దాకా...


          ఆరు నెలల కాలంలో ఆరు భిన్నజానర్ల ఏడు సినిమాలు విడుదలయ్యాయి. స్పై, ఫాంటసీ,  సైన్స్ ఫిక్షన్, రాజకీయం, బయోపిక్, రియలిస్టిక్ జానర్లతో కూడిన ఏడు సినిమాల్లో హిట్ లేదు, రెండు ఏవరేజీలు, నాల్గు ఫ్లాపులున్నాయి -  రియలిస్టిక్ జానర్లో  ‘కంచరపాలెం’ ని మినహాయిస్తే. ఈ ఆరూ కూడా కాన్సెప్టులుగా  అలాటి ఫలితాల్ని తెచ్చుకోలేదు. కాన్సెప్టులు రాయడంలోనో తీయడంలోనో వచ్చిన వ్యతిరేక ఫలితాలవి. వీటి జానర్లేవీ మార్కెట్ యాస్పెక్ట్ కి దూరంగా ఏమీ లేవు, క్రియేటివ్ యాస్పెక్ట్ కే సుదూరంగా వుండిపోయాయి. జానర్ ని బట్టి కన్పించే వాతావరణం వుంటుంది. ఒక జానర్ వాతావరణంలోకి ఇంకో జానర్ వాతావరణం రాకూడదన్నదే జానర్ మర్యాద. కానీ రోమాంటిక్ కామెడీలే,  యాక్షన్ కామెడీలే తీయడం తెలిశాక, ఇతర జానర్లనీ  ఆ ‘రోకా’ ల్లాగానో, లేదా ‘యాకా’ ల్లాగానో  తీసేయడం రెండు దశాబ్దాలుగా అదే వూడలు దిగిన సమ్ - ప్రదాయం.
1. గూఢచారి
అడివి శేష్, శోభిత, శశి కిరణ్ (కొత్త దర్శకుడు)  
మార్కెట్ యాస్పెక్ట్ :  జానర్ స్పష్టత లేని  స్పై- ఏవరేజి
క్రియేటివ్ యాస్పెక్ట్ : రెగ్యులర్ యాక్షన్ టైపు కథ - ఏవరేజి
         
గూఢచారి అంటే స్పై. ఇది స్పై జానర్ కథ. కానీ స్పై సినిమా చూస్తున్న ఫీల్ కలగదు. ఇంకో  రెగ్యులర్ యాక్షన్ మూవీలా వుంటుంది దాని కథా కథనాలు, పాత్రచిత్రణలు, వాతావరణాల పద్దతితో.  స్పై, కౌబాయ్, సైన్స్ ఫిక్షన్, మిస్టరీ మొదలైన స్పెషలైజుడు జానర్ సినిమాలన్నిటినీ ఒకే రెగ్యులర్ మూస యాక్షన్ జానర్ లోకి దింపి చూపించలేరు. వీటి విలక్షణ జానర్ మర్యాదలతోనే ఇవి మామూలు రెగ్యులర్ యాక్షన్ సినిమాలకి భిన్నమైన లుక్ తో వుంటాయి. వేటికవి డిఫరెంట్ వాతావరణాన్ని, ఫీల్ ని కలిగి వుంటాయి. స్పై విషయానికి వస్తే, స్పై క్యారెక్టర్ రెగ్యులర్ యాక్షన్ క్యారెక్టర్ లా గడ్డం పెరిగి, రఫ్ గా వుండడు. ఓ జీన్సూ ఓ టీసూ వేలాడదీసుకుని ఆవారాలా తిరగడు. క్లీన్ షేవ్డ్ సూపర్ స్పీడ్  రోమాంటిక్ లుక్ తో, స్టయిలిష్ కాస్ట్యూమ్స్ లో వుంటాడు. ఇతడి విలన్స్ కూడా ఇంతే స్టయిలిష్ గా వుంటారు. తన వృత్తి పరిధిలోనే  హై ప్రొఫైల్ ప్రొఫెషనల్ అమ్మాయిలతో రోమాన్స్ సాగిస్తాడు. ప్లే బాయ్ క్యారెక్టర్ అయికూడా వుండొచ్చు. కానీ ఏదో ఫీలైపోయి ప్రేమ పురాణాలు ఎత్తుకోడు.  కారణం,  స్పై అనే వాడు ఒంటరి యాత్రికుడు. అతడికి కుటుంబం, వ్యక్తిగత జీవితం, వాటి తాలూకు బంధువులూ, బాధ్యతలూ, బాధలూ ఏవీ వుండవు. సూటిగా అతడిది ఒకే బాధ, ప్రపంచ బాధ. ప్రపంచ బాధే తన బాధగా వుంటాడు. అతను ఇంటర్నేషనల్ క్యారెక్టర్. అమరావతిలోనో, హైదరాబాదులోనో, ముంబాయిలోనో, గోవాలోనో కథ పెట్టుకున్నాం తీద్దాం రమ్మంటే నవ్వి పోతాడు. దేశ అంతర్గత వ్యవహారాల కథ పోలీస్ క్యారెక్టర్ తో చూసుకోమంటాడు. దేశాంతర గూఢచార కార్యకలాపాలతో తనుంటాడు. విదేశాల్లో, విదేశీ శక్తులతో తనకి పని. ఇతను చెప్పేది నిజమే. ప్రధాని వచ్చి రాష్ట్రంలో పరిపాలన చేయడు కదా. ఇలా స్పై పాత్రకి సంబంధించి జానర్ మర్యాదలు చాలా వున్నాయి.
        జేమ్స్ బానెట్ ‘స్టోరీ వీల్’ ఆరోహణ క్రమంలో చూస్తే, కింది స్థానంలో పాత్ర తనూ తన కుటుంబమూ అనే వ్యక్తిగత కథలతో వుంటుంది. దీనికి పై స్థానంలో పాత్ర తన గురించి కాక, సమాజం గురించిన కథతో వుంటుంది. ఇంకా పైన వుండేది ప్రపంచం గురించిన కథతో పాత్ర. 
        దీని పై స్థానంలో వుండేది ఆథ్యాత్మిక కథతో వుండే పాత్ర. మొదటిది ఫెయిరీ టేల్ పాత్ర, రెండోది క్లాసిక్ పాత్ర, మూడోది లెజెండ్ పాత్ర, నాల్గోది మిథికల్ పాత్ర. 

          ఇప్పుడు స్పై పాత్ర కుటుంబ సమస్యలతో కింది స్థానంలో వుండొచ్చా? పోనీ దీని పైన సామాజిక సమస్యతో వుండొచ్చా?  దీనికంటే  పైన ప్రపంచ సమస్యతో వుండొచ్చా? వుంటుంది, ఈ సెగ్మెంట్ లోనే వుంటుంది.  ఎందుకంటే దాని యాక్షన్ ప్రాంగణమంతా  ప్రపంచ దేశాలే. 

          ఇప్పుడు ఈ స్పై పాత్రని ఏమంటారు?  స్టోరీ వీల్ లో సూచించిన ప్రకారం ‘లెజెండ్’ అంటారు. మధుబాబు  సృష్టించిన స్పై పాత్ర  ‘షాడో’ లెజెండ్ ఎందుకయ్యింది? కాబట్టి షాడో లెజెండ్, జేమ్స్ బాండ్ లెజెండ్, జార్జ్ స్మైలీ లెజెండ్, జానీ ఇంగ్లిష్ లెజెండ్, కిల్ మాస్టర్ నిక్ కార్టర్ లెజెండ్...

          ఇలా గొప్ప లెజెండ్ సెగ్మెంట్ లో వుండే స్పై పాత్రని పనిమాలా ఎందుకు దిగజార్చి కింది ఒకటి రెండు స్థానాల్లో పాత్రల్లాంటి వాటి లాగా కుదేసి పరువు తీయడం? 

          అతను మన దేశంకోసం ఇతర దేశాలతో నిత్యం పోరాడుతూంటాడు - హీఈజ్ లెజెండ్, అంతే! ఇది అర్ధం కాకపోతే వేరే మూస ఫార్ములా పాత్రలు చాలా వుంటాయి, ఆ సినిమాలు తీసుకోవాలి స్పైని వదిలేసి. 

          ప్రస్తుత  సినిమాలో గూఢచారి
పాత్ర లెజెండ్ అయ్యే అవకాశాన్ని వదులుకుని, వ్యక్తిగత కింది స్థాయిలో, తండ్రితో చిన్నప్పటి ఎడబాటు కథతో వుంటుంది. తండ్రీ కొడుకుల కుటుంబ సెంటిమెంట్లు ధారాళంగా ప్రవహిస్తూంటాయి. పాత సలీం - జావేద్ యాక్షన్ సినిమాలా అన్పిస్తూంటుంది. మధుబాబు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు : తన స్పై పాత్ర షాడోకి బిందుతో పెళ్లి చేసి, ఫ్యామిలీ లైఫ్ ప్రారంభిస్తే పాఠకులు అల్లరి చేశారని. పాఠకులు తెలివైన వాళ్ళు, ప్రేక్షకులకి అంత వుండదు. గూఢచారి నాన్నా అంటూ ఏడ్చినా, ఓ య్యస్ రా నాన్నా అని బదులిస్తారు. ఎందుకంటే అది స్పై సినిమా వాతావరణంతో వుండక, ఇంకో రెగ్యులర్ మూస యాక్షనేదో చూస్తున్నాంలే  అనుకుంటారు.   

      2017 లో హను రాఘవపూడి దర్శకత్వంలో, నితిన్ తో ‘లై’  అనే గొప్ప  స్పై వచ్చింది. ఇందులో కళ్ళు తిరిగే క్రియేటివిటీ వుంటుంది. ఓపెనింగ్ సీన్స్ - హీరోయిన్ క్యారుమని పుడుతుంది. పుట్టగానే డబ్బుని ముట్టుకుంది. పిసినారిగా ఎదుగుతుంది. పెళ్లి చేసుకుంటే హనీమూన్ కి ఫారిన్ తిరగొచ్చని ఎవరో అంటే, పేరెంట్స్  ని పీడించి పెళ్ళికి తయారవుతుంది. హనీమూన్ టూరుకి ఏజెంట్ కి డబ్బు కూడా కట్టేస్తుంది. ఆ పెళ్లి క్యాన్సిల్ అవుతుంది. 

           అటు స్పై హీరో సత్యం ఆవారాగా తిరుగుతూంటాడు. (స్పై క్యారెక్టర్ పేరు ఇలా వుంటుందట! సత్యం, శీనుగాడు, చిట్టీ, పండుగాడు ... శవ్వ! శవ్వ!!) ఈ స్పై సాబ్ ని పెళ్లి చేసుకోరా అని మదర్ మాతృదేవత పీడిస్తూంటుంది. స్పై మాస్టర్ సత్యం సారు ఆవారా గిరీ వల్ల వచ్చే సంబంధాలు కాస్తా హరీ మంటూంటాయి. ఇక అమెరికా పోతా, అక్కడే చూస్కుంటా, యేస్కుంటా  అని వెళ్ళిపోతాడు. అక్కడ హీరోయిన్ తగిలి లవ్ ట్రాక్, ఇంటర్వెల్ వరకూ టెంప్లెట్, ఇంటర్వెల్ నుంచి టెంప్లెట్ తో విదేశీ విలనీ...ఇది స్పై సినిమా అట. శవ్వ! శవ్వ!! (కోట శ్రీనివాసరావు సౌండ్). 

          మాట్లాడితే రెగ్యులర్ యాక్షన్లు, యాక్షన్ కామెడీలు, రోమాంటిక్ కామెడీలు - ఇవే. అందుకని  స్పైలు కూడా ఈ మూడూ కలిపినట్టే వుంటున్నాయి. స్క్రీన్ రైటింగ్ ఒక మిస్టరీ అనుకుంటే, ఇందులో తెలియని, తెలుసుకోవాల్సిన ఆశ్చర్యపర్చే రహస్యా లెన్నో వున్నాయి. వీటిని ప్రేక్షకులకి అందించక పోవడం వాళ్ళ పట్ల చేస్తున్న అన్యాయమే. స్పెషలైజుడు జానర్లు ఇప్పుడు కొత్త ప్రేక్షకులకి యేం తెలుసులే, ఇవి తెలిసిన అప్పటి పాత ప్రేక్షకులు ఇప్పుడు కొత్త సినిమాలకి రావడం లేదుగా  - కొత్త ప్రేక్షకుల్ని ఇలాగే నమ్మించేద్దామనుకుంటే – స్క్రీన్ రైటింగ్ రహస్యాలతో పనే లేదు! 

2. అదుగో 
అభిషేక్ వర్మ, నభా నతేష్, రవిబాబు (12 సినిమాల దర్శకుడు)
మార్కెట్ యాస్పెక్ట్ : నిల్ - ఫ్లాప్
క్రియేటివ్ యాస్పెక్ట్ : అబ్సినిటీ - ఫ్లాప్

          ఇది ఫాంటసీ జానర్.
కంప్యూటర్ గ్రాఫిక్స్ వచ్చాక సినిమా కథల తీరుతెన్నులు పూర్తిగా మారిపోయాయి. అసాధ్యమనుకున్న కథలు కూడా వెండితెర కెక్కుతున్నాయి.పంది పిల్ల కథని సినిమా తీయడం సీజీ వల్లనే సాధ్యమైంది. ఇండియాలో మొదటి లైవ్ యాక్షన్ పూర్తి స్థాయి త్రీడీ సూపర్ స్టార్ గా పంది పిల్లని పేర్కొంటూ కథ చేశారు. సాంకేతికంగా త్రీడీ రిఫరెన్స్ కోసం పంది పిల్లని వాడుకున్నారు. ఫాంటసీలో ఇది పూర్తి స్థాయి యాక్షన్ కామెడీ కథ. పంది పిల్ల చుట్టూ ఇంకొన్ని కథలుండే కథ. జంతువులతో  సినిమాలకి టార్గెట్ ఆడియెన్స్ పిల్లలు, వాళ్ళ వెంట వచ్చే పెద్దలు. మిగతా యూత్, మాస్ ఎలాగూ వుంటారు. ఇంత పరిధిలో కలిసివచ్చిన మార్కెట్ యాస్పెక్ట్ ని చివరి రెండు వర్గాలకి పరిమితం చేసుకుని - వాళ్ళు కూడా భరించలేనంత క్రాష్ లాండింగ్ చేసుకున్నారు మార్నింగ్ షోకే. స్టాక్ మార్కెట్ క్రాష్ అయినట్టు పన్నెండు కోట్లూ ఎగిరిపోయాయి.

          ఎవరైనా
చిరాకుపడే పందిపిల్లతో సినిమా అంటే రిస్కీ వ్యవహారం. అయినా సినిమాగా ఎంటర్ టైన్ చేయడానికి పూనుకున్నప్పుడు,  నల్గురూ అసహ్యించుకునే జీవిని పిల్లలు సైతం ఇష్టపడేలా సంస్కరించి చూపించాలి. అప్పుడే ఇలాటి ప్రయోగం సక్సెస్ అయ్యే అవకాశాలుంటాయి. ఇలా కాకుండా కామెడీ పేరుతో అసహ్యాన్నీ, జుగుప్సనీ, హింసనీ పందిపిల్ల చుట్టూ, జానరేతర రెగ్యులర్ మూస రౌడీ పాత్రలతో చూపించి అసలుకే మోసం తెచ్చుకున్నారు. 

 
3. సుబ్రహ్మణ్యపురం 
సుమంత్, ఈషా రెబ్బా, సంతోష్ జె (కొత్త దర్శకుడు)
మార్కెట్  యాస్పెక్ట్ : అమెచ్యూర్ స్పిరిచ్యువల్ కాన్సెప్ట్  - ఫ్లాప్
క్రియేటివ్ యాస్పెక్ట్ : పాసివ్ పాత్ర, మిడిల్ మటాష్  - ఫ్లాప్

         
 మిథికల్ ఫాంటసీ మిస్టరీ జానర్. కానీ జానర్ లక్షణాలేవీ కన్పించవు. ముందు భక్తి రసంతో ఓలలాడించాక, మహిమలతో కట్టి పడేశాక, బాగానే దేవుడు ఎస్టాబ్లిష్ అయినట్టు కన్పిస్తాడు కాన్సెప్ట్ ప్రకారం. దేవుడి మహిమ వల్ల రాజ్య రక్షణ జరిగిందని  శతాబ్దాల పూర్వం జరిగినట్టు ఓ కల్పిత చరిత్ర అల్లారు. అలాటి దేవుడికి ఇప్పుడొచ్చేసి  మహిమలు లేవా, ఊరిని రక్షించలేడా అన్నవి లాజికల్ ప్రశ్నలు. ఉన్న దేవుడికీ, లేడంటున్న హీరోకీ, పోరాటం కూడా చూపించకుండా కాన్సెప్ట్ కెలా న్యాయం చేస్తారు. భక్త తుకారాంచూసి కాన్సెప్ట్ ఆలోచించాల్సింది. జేమ్స్ బానెట్ ఒక జానపద కథ ప్రస్తావిస్తాడు- ఆగాబాబాఅనే ఆ కథలో టీనేజీ  హీరో ఒక సాహసయాత్రకి బయల్దేరుతూ, ఆకలేసి అడవిలో ఒక మంత్రగత్తె దగ్గర ఆగుతాడు. ఆ మంత్రగత్తె అన్నం పెట్టకుండా ప్రశ్నలు వేస్తుంది  - సృష్టిలో  ఏది సత్యం? విశ్వం ఎప్పుడు అంతమవుతుంది? అని.  నోర్ముయ్యమంటాడు. ముందు తినడానికేమైనా వుంటే పెట్టమంటాడు. ఇందులో నీతి ఏమిటంటేలౌకికంగా బతకడానికి చేయాల్సిన పనులు మానేసి, జవాబులు దొరకని అలౌకిక విషయాలతో కాలం గడప వద్దని. కాబట్టి అసలు దేవుడున్నాడా లేడా అన్న కాన్సెప్టే వ్యర్ధమైనది. పైగా దేవుడి కథకి విదేశీ స్మగ్లర్లతో ఉస్సూరనిపించే పాత రొటీన్ ఫార్ములా ముగింపు. మరొకటేమిటంటే, కాన్సెప్ట్ రెండు పాయింట్లుగా చీలిపోవడం. హీరో లక్ష్యం దేవుడి ఉనికిని  తెలుసుకోవడం. కానీ అతను చేసేది దేవుడి పేరు మీద జరుగు తున్న మోసాలు బయట పెట్టడం. అంటే కాన్సెప్ట్ ఒకటైతే, చూపించిన కథ ఇంకోటి. దేవుడంటే మనతో సహా  జీవులన్నిట్లో వుండే  మైండే నని, పదార్ధాలన్నిట్లో వుండే అణువులే నని చెప్పకుండా ఇంకా ఎక్కడో వెక్కోవడమేమిటి. 

4. అంతరిక్షం 
వరుణ్ తేజ్, అదితీరావ్ హైదరీ, సందీప్ రెడ్డి (ఒక సినిమా దర్శకుడు)
మార్కెట్ యాస్పెక్ట్ : సైన్స్ ఫిక్షన్ స్పేస్ ని సవ్యంగా వాడుకోకపోవడం – ఫ్లాప్  
క్రియేటివ్ యాస్పెక్ట్ : రెండు గోల్స్ తో రెండు గాథలు  - ఫ్లాప్
         
సైన్స్ ఫిక్షన్ జానర్. అమెరికా అంతరిక్ష విజయాలు ఇప్పుడున్నంత టెక్నాలజీ అభివృద్ధి చెందని కాలంలోనే చంద్రమండలం చేరుకునే దాకా సాగాయని, హాలీవుడ్ క్రిటిక్ రోజర్ ఎబర్ట్ పేర్కొన్నాడు. ఇప్పుడు కొత్త మిశ్రమ లోహాలు, ఇంజన్లు, ఇంధనాలు, కంప్యూటర్లు, టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినా కూడా తగిన సంకల్ప బలం లేక అంతరిక్ష వైఫల్యాలెదుర్కొంటున్నామనీ, ‘అపోలో 13’ (1995) కి రివ్యూ రాస్తూ ఆయన నోట్ చేశాడు.

         
ఇప్పుడు ఈ తాజా  అంతరిక్షంలో వైఫల్యాలే -  ఒకసారి కాదు, రెండు సార్లు చూపించడంలో మంచి శ్రద్ధ కనబర్చారు. పైగా ఇందులో వ్యోమగామి పాత్రలు ఏదో ఘన కార్యం సాధించినట్టు, దేశానికే  గర్వకారణంగా, పనిలో పనిగా దేశభక్తి జానర్  జోడించి చూపించారు. విఫల ప్రయోగాలు చూపిస్తూ, వాటిని బాగు చేస్తూ కూర్చోవడం దేశానికెలా గర్వకారణమవుతుందో తెలీదు. ఇండియా అంతరిక్ష ప్రయోగాలు ఇలా నాసిరకంగా వుంటాయని చాటాలనేమో?

         
గత జూన్ లో తమిళంలో టిక్ టిక్ టిక్అనే అంతరిక్ష చలన చిత్రం వచ్చింది. ఇందు లో అంతరిక్ష విజయం గురించి చూపించారు. అంతరిక్షం లోకెళ్ళి చెన్నై వైపు దూసుకొస్తున్న గ్రహ శకలాన్ని పేల్చి వేసే వీరోచిత అంతరిక్ష సాహసం. ఇలాటి ముప్పులెదుర్కొని ప్రపంచాన్ని రక్షించే పని, మా అమెరికా ఒక్కటే గుత్తకి తీసుకుని చేస్తుందని చిత్రిస్తూ, హాలీవుడ్ అదే పనిగా సినిమాలు తీస్తూంటుంది. పొగరు అణిచారు టిక్ టిక్ టిక్తో.        అంతరిక్షంకథా ప్రయోజనమెలా వుందో, దీని ద్వారా చెప్పకనే ఏం చెప్పారో పైన చూశాం. ఇంకా రిపేర్లు చేసుకునే దశలోనే ఇండియన్ సైన్సు వుందని రికార్డు చేశారు- ఒకవైపు ఇస్రో దిగ్విజయంగా గంపగుత్తగా ఇతర దేశాల ఉపగ్రహాలని తీసికెళ్ళి అంతరిక్షంలోకి ప్రవేశ పెడుతూంటేఈ సినిమా విడుదలకి ముందు  బుధవారమే, అతిబరువైన ఇంకో ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగిస్తే కూడా! 

          కథా
ప్రయోజనం సంగతలా వుంచితే, ఇదసలు కథేనా అన్న ప్రశ్న కూడా వస్తుంది.  ఎందుకంటే, దీనికి సినిమాకుపయోగపడే కథా లక్షణాల కన్నా, సినిమా సక్సెస్ కి తోడ్పడని గాథ లక్షణాలే వున్నాయి. పైగా రెండు గోల్స్ తో రెండు గాథలు. రెండు కథల సినిమాలాగా. 

5. నోటా 
విజయ్ దేవరకొండ, మెహ్రీన్ పీర్జాదా, ఆనంద్ శంకర్ (రెండు సినిమాల దర్శకుడు)
మార్కెట్ యాస్పెక్ట్ : విలువైన ఓటర్ ఎవేర్నెస్ కాన్సెప్ట్ దుర్వినియోగం : ఫ్లాప్
క్రియేటివ్ యాస్పెక్ట్ :  వేర్వేరు ఎపిసోడిక్ కథనాలు : ఫ్లాప్                             
 తెలుగు తమిళ ద్విభాషా చలనచిత్రం, తెలుగు రాజకీయాలు ప్రతిబింబించని ఇటీవలి తమిళ రాజకీయాల కథ. జయలలిత మరణం తదనంతర పరిణామాల్లో శశికళ ఆధ్వర్యంలో జరిగిన రిసార్ట్స్ రాజకీయాలతో బాటు, చెన్నైకి వరదలొచ్చిన పరిస్థితి, ఫ్లెక్సీ బోర్డుల సంస్కృతి, పార్టీకో ఛానెళ్ళ రొద, ఒక స్వామీజీ చక్రం తిప్పడాలు వగైరావగైరా రాజకీయ వాతావరణమంతా ఇందులో కనిపిస్తుంది. అయితే ఏవీ కూడా ఒక కథగా అల్లుకోలేదు. విడివిడి ఎపిసోడ్లుగా వచ్చి పోయే సంఘటనలు నిజానికి సినిమాలో  ఒక ఏకమొత్తం కీలక డ్రామాకి చోటు లేకుండా చేశాయి. ఇంటర్వెల్ కి తండ్రి మీద హత్యాయత్నమనే పాయింటుతో ఒక కీలక డ్రామా ఏర్పడిందనుకుంటే, ఇక రౌడీ సీఎం ఎవరో వస్తున్నాడని హీరో ప్రకటించడంతోకథ రసకందాయంలో పడిందనుకుంటే, సెకండాఫ్ లో దీని వూసే వుండదు. మళ్ళీ విడివిడి తమిళనాడు సంఘటనల వరసే. విడివిడి ఎపిసోడ్ల ఎపిసోడిక్ కథనంతో సినిమా కథ ఏర్పడదని తెలుసుకోలేకపోయారు.

         
బయట రోజూ ట్రెండింగ్ అవుతున్న రాజకీయాలే హాట్ హాట్ గా బావుంటున్నాయి. ఎన్నికల సీజన్లో పూర్తిగా కాలీన స్పృహ లేకుండా, అయిపోయి చల్లారిన తమిళ రాజకీయాలే మళ్ళీ చూపించే సాహసానికి వొడిగట్టిందీ రాజకీయ సినిమా. దృశ్యాలు -  చెన్నై వరదలతో సహా- టీవీల్లో చూసేసినవే. కనీసం నోటాఅనే టైటిల్ కైనా న్యాయం చేయని కథలేని సొదగా ముస్తాబై, విజయ్ దేవరకొండ అభిమానుల హృదయాలని దోచుకోవడానికి విచ్చేసిందీ తమిళ మార్కు రాజకీయ మసాలా కాని మసాలా. అభిమానుల కోసం హీరో హీరోయిన్ల మధ్య రోమాన్సు లేదుగానీ, సెకెండాఫ్ లో ముసలి పాత్ర సత్యరాజ్ కి ఫ్లాష్ బ్యాక్ వేసి,  లవ్ స్టోరీ చూపించడం అత్యవరమన్పించింది తమిళ దర్శకుడికి!

6. ఎన్టీఆర్ కథానాయకుడు 
బాలకృష్ణ, విద్యా బాలన్, క్రిష్ ( 8 సినిమాల దర్శకుడు)
మార్కెట్ యాస్పెక్ట్ : రెండు భాగాల బయోపిక్ - ఫ్లాప్
క్రియేటివ్ యాస్పెక్ట్ : ఉపోద్ఘాతం -ఫ్లాప్
         
బయోపిక్ జానర్. బయోపిక్ ని రెండు భాగాలుగా తీయరు. కాబట్టి వీటి స్క్రీన్ ప్లేలు చూసిన అనుభవం లేక, ఎన్టీఆర్ బయోపిక్ మొదటి భాగం బాగానే వుందిగా అనుకున్నాం. మరెందుకు ఫ్లాపయ్యింది. బుర్రని వాడితే అప్పుడర్ధమైంది. మొదటి భాగం ఉపోద్ఘాతం చెప్పారని. ఇది క్రియేటివ్ యాస్పెక్ట్ పరంగా. ఉపోద్ఘాతం సినిమా అవదు గనుక సినిమా కాకుండా పోయింది. ఇక మార్కెట్ యాస్పెక్ట్ పరంగా, ఇప్పటి తరానికి ఎన్టీఆర్ సమీప రాజకీయ జీవిత చరిత్ర చూపించకుండా, బాక్సాఫీసు అప్పీల్ లేని సుదూర సినిమా జీవిత చరిత్ర చూపడం. ఇలా రెండు భాగాలు కాకుండా, ఒకే సినిమాగా ఎన్టీఆర్ రాజకీయ జీవితాన్ని కథగా చేసి (మళ్ళీ గాథగా కాదు!) చూపించి వుండాలని - ఈ రెండు భాగాల బయోపిక్ అనే కొత్త దృష్టాంతంతో మనకి అనుభవ పూర్వకంగా తెలిసొచ్చింది. స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ కి కొత్త పాఠమైంది. 

7. కేరాఫ్ కంచర పాలెం
కొత్త నటీనటులు, వెంకటేష్ మహా (కొత్త దర్శకుడు)
మార్కెట్ యాస్పెక్ట్ : పరిమిత ప్రేక్షకులు - ఏవరేజి
క్రియేటివ్ యాస్పెక్ట్ : స్ట్రక్చర్ తో రియలిస్టిక్ కథ - ఏవరేజి
         
రియలిస్టిక్ జానర్ ఇండీ ఫిలిం.
నాల్గైదు కథల సినిమాలు ఇటీవల  కొన్ని వచ్చాయి.  చందమామ కథలు, మనమంతా, ! అన్నవి. ఇవి సక్సెస్ కాలేదు. ప్రస్తుత కథల సంపుటి భిన్నమైనది. పూర్తిగా రస్టిక్ నేటివ్ వాతావరణంలో, అండర్ డాగ్స్ పాత్రలతో, అధోజగత్ ప్రేమల్ని ఇది చూపిస్తుంది. ప్రేమతో మతం చెలగాటాల్ని ముసుగు తీసి చూపిస్తుంది. ఫార్ములా  కథల బారిన పడకుండా పచ్చి జీవితాలెలా వుంటాయో  ముందుంచుతుంది. హాస్యాన్ని షుగర్ కోటింగ్ లా వాడుకుంటూ ఆలోచింపజేస్తుంది. ఇది ఇండీ ఫిలిం కోవకి చెందిన సామాజిక కథ. సమాజంలో తెరకెక్కని జీవితాల్ని తెరకెక్కించిన కొత్త పంథా కథ. 

          షార్ట్ మూవీస్ నుంచో
, ఇంకెక్కడ్నుంచో వస్తున్న కొత్త కొత్త దర్శకులు ఇండీ ఫిలిమ్స్ పేరుతో, క్రౌడ్ ఫండింగ్ మూవీస్ పేరుతో ఇష్టారాజ్యమైన  కళా ప్రదర్శన చేస్తూంటారు. అసలిలాటి సినిమాలకి కళే బలం, టెక్నాలజీ కాదు. ఆ కళేమీ తెలియకుండా ఎలాపడితే అలా చుట్టేసే వాళ్ళే ఎక్కువ. ప్రస్తుత ఇండీ ఫిలింతో దర్శకుడు వెంకటేష్  రాయడంలోనే గాక, తీయడంలో కూడా ఆరి తేరాడు. నా ఇండీ ఫిలిం నా ఇష్టమన్నట్టు స్ట్రక్చర్ లేకుండా ఈ కథలు చూపెట్టలేదు. పూర్తి స్ట్రక్చర్ లోనే రాయడం, తీయడం చేశాడు.  ఇలాటి కమర్షియలేతర సినిమాలు కూడా ఎంతో కొంత ఆడాలంటే కమర్షియల్ సినిమాల స్ట్రక్చర్ లో పాత్రలు, కథా కథనాలూ వుండాల్సిందే. ఐతే బడ్జెట్ మాత్రం లక్షలు దాటకూడదు. సుమారు రెండున్న గంటల ప్రేమకథల ఈ ఆంథాలజీని, ఎలాటి కమర్షియల్ మసాలాలూ గట్రా లేకుండా, క్షణం బోరుకొట్టకుండా, ఆద్యంతం కుతూహలాన్ని పెంచుతూ పోయాడు.
(సమాప్తం)

సికిందర్

Wednesday, January 30, 2019

732 / 1 : రివ్యూ


(రివ్యూ మిగతా భాగం)
        బాబరీ మసీదు కూల్చివేత, దాంతో ముంబాయి మతకల్లోలాలు  - వీటికి సంబంధించిన కేసులో అరెస్టయిన ఠాకరే పై కోర్టు విచారణతో, 2000 సంవత్సరంలో ప్రారంభమవుతుంది బయోపిక్. ఈ విచారణ మధ్య మధ్యలో ఫ్లాష్ బ్యాకులు 1950 ల నాటి నుంచీ వస్తూంటాయి. ఈ మల్టీ పుల్ ఫ్లాష్ బ్యాకుల్లో క్రొనలాజికల్ ఆర్డర్ లో ఠాకరే జీవితంలోని ముఖ్య ఘట్టాలతో కూడిన దృశ్యాలు రన్ అవుతూంటాయి. కోర్టులో ప్రశ్నోత్తరాలకీ, ఈ ఫ్లాష్ బ్యాకులకీ సంబంధమే వుండదు. కేవలం ఈ డాక్యుమెంటరీ మాత్రంగా చూపిస్తున్న బయోపిక్ ని ఏంతో కొంత సినిమాలా అన్పించేట్టు చేసే ప్రయత్నంలో భాగంగానే కోర్టు విచారణని కథగా చేసి జోడించినట్టు తెలుస్తుంది. ‘మహానటి’ లో సావిత్రి జీవితంలో పాత్ర - ఒకే సమస్య -దాంతో సంఘర్షణా అనే సినిమా కథా రూపం సాధ్యం కాక, ఆమె జీవితాన్ని ఫ్లాష్ బ్యాకుల్లో డ్రీమ్  టైము కింద సర్దేసి, రియల్ టైంలో ఆ జీవితాన్ని తెలుసుకునే జర్నలిస్టుల సంఘర్షణ అనే సినిమా కథా రూపంతో గోడ చేర్పు నిచ్చినట్టు - ఠాకరే బయోపిక్ విషయంలో కూడా కోర్టు విచారణ అనే రియల్ టైం లైవ్ కథతో, ఠాకరే జీవితాన్ని డ్రీమ్ టైం కింద డాక్యుమెంటరీ చేశారు. అయితే ఈ కోర్టు విచారణ కథేనా అంటే కాదు. కోర్టు అడిగేది అడుగుతుంది, ఠాకరే చెప్పేది చెప్పేసి వెళ్ళిపోతాడంతే. అయితే ప్రచార సాధనంగా తప్పనిసరిగా డాక్యుమెంటరీ చేయాల్సి వచ్చిన బయోపిక్  డ్రీమ్ టైమ్ కి, గంతకి తగ్గ బొంత అన్నట్టు, ఏదోవొక రియల్ టైమ్ ని  జోడించి తీయలాన్న తెలివితేటలైనా ప్రదర్శించినందుకు సంతోషించాలి. కంటెంట్ ఎలా వస్తోందో  తెలుసుకోకుండా పైపైన టెక్నికల్  ఆర్భాటాలు చేసి వూదరగొడితే ఏం లాభం.

         
కోర్టు విచారణ ఒక్కో దృశ్యంలో ఒక్కో డైలాగు పేలుస్తూంటాడు ఠాకరే. బాబరీ మసీదుని కూల్చలేదని, అక్కడ శుభ్రం చేశామనీ అంటాడు. తనది ప్రజాతంత్ర కాదని, ఠోక్ తంత్ర (చావబాదుడు సిద్ధాంతం) అనీ అంటాడు. మతకల్లోలాలు తాను జరిపించలేదనీ, వెంటనే ప్రజల్లోకి వెళ్ళాననీ అంటాడు ( ఏఏ ప్రజల్లోకి వెళ్ళాడో చెప్పడు. ఫ్లాష్ బ్యాకు దృశ్యాల్లో ముస్లింల నుద్దేశించి, తనకి మతాలతో పేచీ లేదనీ, మతాల పేరుతో రాజకీయాలు చేస్తున్న వాళ్ళ తోనే పోరాటమనీ అంటాడు. అలాంటప్పుడు హిందూ ముస్లిం ప్రజలందర్లోకి వెళ్లానని చెప్పాలి, చెప్పడు). 

       చివరికి మీకే శిక్ష వేయాలని జడ్జి అడిగితే, తను న్యాయవ్యవస్థని నమ్మనంటాడు. ప్రజాతీర్పునే గౌరవిస్తానని వెళ్లిపోతూంటాడు ప్రజల్లోకి. ఇదే ముగింపు. నమ్మనప్పుడు కోర్టు కెందుకొచ్చాడో, రాజకీయ నాయకుడిగా ఎందుకున్నాడో తెలీదు. తమ నాయకుడి అడ్డగోలు తనాన్ని గర్వంగా చూపించుకోవడానికి ఎక్కడా వెనుకాడలేదు ఈ బయోపిక్ రూపకర్తలు. అడ్డగోలు తనాన్ని గ్లామరైజ్ చేసి చూపించారు.  

          కానీ వాస్తవంగా కోర్టులో ఇదంతా జరగలేదు. కేసు దాఖలు చేయడంలో జాప్యం వల్ల, లిమిటేషన్ చట్టం కింద అనర్హంగా ప్రకటించి కొట్టేసింది కోర్టు. 

          ఫ్లాష్ బ్యాక్ దృశ్యాలు ఫస్టాఫ్ లో మహారాష్ట్ర మణూస్ పాయింటుతో నడుస్తాయి. ఈ ప్రారంభంలో కాస్త ఎంటర్ టైన్ చేస్తాడు దర్శకుడు. కార్టూనిస్టుగా రాజీనామా చేసి బొంబాయిలో మరాఠీల పరిస్థితి చూస్తూ తిరుగుతున్నప్పుడు ఒక సినిమా చూస్తాడు ఠాకరే. అది మరాఠీలని బకరాలని చేసి ఆడుకునే కార్టూన్ ఫిలిం. థియేటర్లో అన్ని వర్గాల ప్రేక్షకులూ ఒకటే నవ్వుతూ ఎంజాయ్ చేస్తారు. కార్టూన్ ఫిలింలో సర్దార్జీ, గుజరాతీ, మద్రాసీ, ఆఖరికి కాబూలీ వాలా కూడా బక్క మరాఠీలని పీకి అవతల పడేస్తూంటారు. వెనకనుంచి వికటాట్టహాసం చేస్తూ ఒక్క కిక్ ఇస్తే వెళ్లి అంత దూరంలో పడతాడు మరాఠీ. ఠాకరే
సీరియస్ గా చూస్తాడు కార్టూన్ ఫిలింని. 

      ఇక్కడ్నుంచి మొదలు పెడతాడు మరాఠా ఆత్మగౌరవ పోరాటం. పత్రిక పెట్టి భావవ్యాప్తి  చేస్తాడు. మొదటి కార్యక్రమంగా కర్ణాటకలో కలిపిన బెల్గాంని తిరిగి మహారాష్ట్రలో కలపాలని ఆందోళన చేస్తాడు. ప్రధాని మొరార్జీ దేశాయ్ కాన్వాయ్ కి ఆందోళనాకారులు అడ్డంపడతారు, గాయపడతారు, చనిపోతారు. అక్కడే నిలబడి చూస్తూంటాడు. అరెస్టయి జైలు కెళ్తే భగ్గుమంటుంది నగరం. కాల్పుల్లో మరికొందరు చనిపోతారు. అల్లర్లు ఆపడానికి ప్రభుత్వం మళ్ళీ అతన్నే వేడుకుంటుంది. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా శాసించే బలమైన నాయకుడవుతాడు పార్టీ పెట్టి. తను హిట్లర్ నని ప్రకటించుకుంటాడు.ఇక మరాఠీల అవకాశాల కోసం ప్రవాసుల్ని తరిమే కార్యక్రమం ఇంకోవైపు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధిస్తూ ఠాకరేకి నోటీసిస్తుంది - ఎమర్జెన్సీని సమర్ధించకపోతే పార్టీని బ్యాన్ చేస్తామని. దేశంలో క్రమశిక్షణకి ఎమర్జెన్సీ ఎంతో మంచిదని సమర్ధిస్తాడు. తనకి ముందు దేశం, ఆ తర్వాతే రాష్ట్రమని ఇందిరతో చెప్తాడు. ఇందిర బ్యాన్ లిస్టు లోంచి ఠాకరే పార్టీ పేరు కొట్టేస్తుంది. 

          రాష్ట్రంలో మణూస్ ఉద్యమం తలనొప్పులు తెస్తుంది ప్రభుత్వానికి (ఇంత మణూస్ అంటున్న బయోపిక్ లో నవాజుద్దీన్ సహా నటీనటులు, సాంకేతికులు 90 శాతం బయటి రాష్ట్రాల వాళ్ళే). కొన్నేళ్ళ తర్వాత అప్పుడు ఆలోచించి, “మన పిల్లలు చదువుల్లో రాణించాలి. పెద్ద చదువులు చదివితే పెద్ద ఉద్యోగాల్లో పోటీ పడవచ్చు. బయటి వాళ్ళని ఇలా దెబ్బ కొట్టాలి. ఇడ్లీ సాంబార్ కి పోటీగా వడ పావ్ ప్రారంభించండి. ఎందరికో ఉపాధి లభిస్తుంది ...” ఇలా అనడం మొదలెడతాడు. దీంతో ప్రజలు ఈ మార్గం పడతారు. ఇదేదో ముందే చెప్పొచ్చుగా? అనవసర హైరానా. 

          ఇక ఇంటర్వెల్ ముందు కమ్యూనిస్టు ఎమ్మెల్యేని చంపాక, ఠాకరే మొక్కని కత్తి రిస్తున్నప్పుడు పువ్వు కాషాయంగా మారుతుంది. ఇక  హిందూత్వ నాయకుడిగా మొదలు.

***
      ఒక మొహర్రం వేడుకలో పాల్గొని ప్రసంగించినప్పుడు, తనకి మతాలతో పేచీ లేదనీ, మతాల పేరుతో రాజకీయాలు చేస్తున్న వాళ్ళతోనే పోరాటమనీ అంటాడు. అందుకని మీరంతా శివాజీ జయంతి వేడుకల్లో పాల్గొనాలని అంటాడు. ఇప్పుడే కాదు, మణూస్ ఉద్యమంలో కూడా మరాఠా ముస్లిములు కనిపిస్తారు. ఇప్పుడీ శివాజీ జయంత్యుత్సవాల్లో ఉత్సాహంగా ఆడిపాడతారు. ఇంతలో వేడుకల్లో అల్లర్లు జరుగుతాయి. దుండగులు హింసకి పాల్పడతారు.

          అప్పుడు వెంటనే ఠాకరే ముస్లిం వ్యతిరేకిగా మారిపోతాడు- “ఎప్పుడెప్పుడు వీళ్ళని మనం దగ్గరికి తీసినా వీళ్ళు మన గొంతులు కోస్తున్నారు. వీళ్ళు మారరు. మీరింకా పిరికి పందల్లా బ్రతకకండి. ఓట్ల కోసం ఇంత దిగజారుడా? ఇవాళ్టి నుంచి హిందువుల గురించి మాట్లాడేవాడే హిందూస్తాన్ రాజ్యమేలుతాడు” అని ప్రసంగించి హిందూత్వ వాదిగా, ‘హిందూ హృదయ సామ్రాట్’ గా మారిపోతాడు. నాయకత్వం లేని ముస్లిములనీ, మణూస్ నీ వదిలేస్తాడు. 

          తర్వాత బాబరీని కూల్చితే కూల్చాడు, శివాజీ వేడుకల్లో ముస్లిం దుండగులెవరో అల్లర్లు జరిపారని ముస్లిములనే వదిలేయకుండా వుంటే, బాబరీ కూల్చివేతకి వాళ్ళు తనకి వ్యతిరేకంగా మారి, ముంబాయిలో ప్రతీకార దాడులు జరిపే వాళ్ళు కాదు. దీనికి ప్రతీకారంగా తనూ మత కల్లోలాలు జరిపించేవాడు కాదు. మళ్ళీ దీనికి ప్రతీకారంగా దావూద్ ఇబ్రహీం  ముంబాయిలో పేలుళ్లు జరిపే వాడు కాదు. ఈ మొత్తాన్నీ తీసుకుని దేశంలో టెర్రరిజం ప్రబలేది కాదు. 

          విచిత్రమేమిటంటే, తనకి మతాలతో పేచీ లేదనీ, మతాల పేరుతో రాజకీయాలు చేస్తున్న వాళ్ళతోనే పోరాటమనీ  అన్నవాడే, శివాజీ వేడుకల్లో అల్లర్ల సాకుతో అవతలి మతానికి పూర్తి వ్యతిరేకంగా మారిపోవడం. తన అతివాదానికి, అవతలి మతంలోని అతివాదులు రియాక్టయినప్పుడు అలాటి – ‘మతాల పేరుతో రాజకీయాలు చేస్తున్న వాళ్ళతోనే పోరాటం’  మొదలెట్టాలి తను అన్న మాట ప్రకారం. ప్రజలకేం సంబంధం. ముస్లిములు తన వెంటే వున్నారు. వాళ్ళెప్పుడు గొంతులు కోశారు. (
ఠాకరే చనిపోయేవరకూ వైద్యుడు ముస్లిమే, గొంతు కోయలేదు. యోగి ఆదిత్యా నాథ్ వూళ్ళో గోవుల్నిచూసుకునేదీ, ఆయనకి వండి పెట్టేదీ, ఆలయం నిర్మించిందీ, దాన్ని నిర్వహిస్తున్నదీ ముస్లిములే. గొంతు కోయలేదు.  అదే ముస్లిములని ప్రభుత్వ స్థానాల్లో వుండనివ్వడు. బయటికి మాత్రం తను ముస్లిం వ్యతిరేకి హిందూ ఫ్యాన్స్ కోసం. సూడో సెక్యూలరిజం సరే, ఇటు వైపు సూడో హిందూత్వం కూడా).

      గొంతులు అతివాదులు కోస్తారేమో. అదికూడా వాళ్ళతో చెలిమి చేసినప్పుడు. అతివాదులు వర్సెస్ అతివాదుల క్రీడలో పరస్పరం ఎన్నైనా గొంతులు కోసుకోవచ్చు. ఈ క్రీడతో ప్రజలకేం సంబంధం. చేతకాని అతివాదం పెట్టుకుని, ఒక వర్గం మొత్తాన్నీ జనరలైజ్ చేసి ముద్ర కొట్టడం. ప్రజాస్వామాన్ని, సెక్యులరిజాన్ని నమ్మని ఠాకరే, నమ్మిన అతి వాదంతో కూడా సవ్యంగా లేనట్టు, మణూస్ నీ, హిందూత్వానీ ఓట్ల కోసం వాడుకున్నట్టూ ఓపెన్ గానే  చూపించారు. 

          ఈ ప్రచార బయోపిక్ ని స్ట్రక్చర్ పరంగా సినిమా రచనా దృష్టితో చూడకూదనుకున్నాం. ఇది స్ట్రక్చర్ తో సంబంధంలేని పాత్ర చిత్రణ సమస్య. మళ్ళీ చివర్లో బాంబు పేలుళ్ళ తర్వాత
ఠాకరే ఇంకో డ్రామా చేస్తాడు. అన్నీ పోగొట్టుకున్న ఒక ముస్లిం కుటుంబం రక్షణ కోసం తన దగ్గరికి వస్తుంది. వాళ్ళని ఇంట్లో కూర్చో బెట్టుకుని అభయమిస్తాడు. నమాజ్ చేసుకోనిస్తాడు. అప్పుడు  “మతాలతో నాకు పేచీ లేదు, మతాల పేరుతో రాజకీయాలు చేస్తున్న వాళ్ళతోనే నా పోరాటం”  - అదే రికార్డు ప్లే!

          పరస్పర విరుద్ధ భావాలతో, హింసతో, అడుగడుగునా ధిక్కారంతో,  గొప్ప నాయకుడుగా దిగ్విజయంగా హైలైట్ చేశారు.

సికిందర్
Watched at PVR, Irrum manzil
11pm, 28.1.19

telugurajyam.com

Tuesday, January 29, 2019

732 : రివ్యూ

దర్శకత్వం : అభిజిత్ పన్సే
నవాజుద్దీన్ సిద్ధిఖీ, అమృతారావ్ తదితరులు
స్క్రీన్ ప్లే : అభిజిత్ పన్సే, రచన : అరవింద్ జగ్తాప్, మాటలు : మనోజ్ యాదవ్
సంగీతం : రోహన్ రోహన్, సందీప్ శిరోద్కర్, ఛాయాగ్రహణం : సుదీప్ ఛటర్జీ
బ్యానర్స్ : వయాకాం మోషన్ పిక్చర్స్, రాయిటర్స్ ఎంటర్ టైన్మెంట్, కార్నివాల్ మోషన్ పిక్చర్స్
విడుదల : జనవరి 25, 2019
***
          సారి శివసేన పార్టీ దివంగత అధ్యక్షుడు బాలా సాహెబ్ ఠాకరే బయోపిక్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. దీంతో బాటే ఝాన్సీ లక్ష్మీ బాయి ‘మణికర్ణిక’ కూడా ప్రేక్షకుల్ని పలకరించింది. ఇద్దరి భావజాలాలు వేర్వేరు. ఆమెది ప్రధాన స్రవంతి భావజాలం, ఈయనది సమాంతర అతివాద భావజాలం. జాతీయంగా ప్రధాన స్రవంతి భావజాలాన్ని పక్కన బెడితే, ఈ ఎన్నికల సమయంలో అతివాద భావజాలాన్ని ప్రాంతీయంగా ఉపయోగించుకోవాలని ఎక్కుబెట్టారు. ఇలాటి భావజాలాన్ని మహారాష్ట్ర కిచ్చిన వాడు ఠాకరే. కాబట్టి ఈ ఎన్నికల సమయంలో ప్రచార చిత్రంగా బయోపిక్ ని తయారుచేసి వదిలారు. ఈ భావజాలంతో సాధించిందేమిటనే ప్రశ్న మద్దతుదార్లకి తట్టకపోవచ్చు గానీ, పరస్పర విరుద్ధ భావజాలాలైన మరాఠా మణూస్ సాకారమైందా? హిందూత్వ లక్ష్యాలు పూర్తయ్యాయా? అన్న ప్రశ్నలుంటాయి. ఇదెలాగో చూద్దాం...

కథ 
     1950 లలో బాలా సాహెబ్ ఠాకరే ఒక పత్రికలో కార్టూనిస్టుగా పనిచేస్తూంటాడు. తండ్రీ కళారంగంలో పని చేసిన వాడే. తమ్ముడికీ కళలంటే ఆసక్తి వుంది. పత్రికలో వేస్తున్న కార్టూన్లతో తమిళ ఎడిటర్ కి ఇబ్బందులొచ్చి రాజీ పడమంటారు. రాజీనామా ఇచ్చేసి వెళ్ళిపోతాడు ఠాకరే. ఈ సమయంలో బయట తిరుగుతూ మరాఠీలకి ఎదురవుతున్న అవమానాలు గమనిస్తాడు. సౌత్ ఇండియన్సు, గుజరాతీలు, పార్సీలూ అన్నిరంగాల్లో బొంబాయిని ఆక్రమిస్తూ మరాఠీలకి భుక్తి లేకుండా చేస్తున్నారని ఆగ్రహం పెంచుకుంటాడు. తమ్ముడితో కలిసి ‘మార్మిక్’ అనే పత్రిక ప్రారంభించి మరాఠా మణూస్ నినాదాన్ని వ్యాప్తి చేస్తాడు. దీంతో బాధిత మరాఠీలు ఠాకరేని  ఆశ్రయించడం మొదలెడతారు. తన నినాదానికి ప్రజల నుంచి వస్తున్న విశేష  స్పందన చూసి, 1966 లో ఛత్రపతి శివాజీ పేరు ధ్వనించేలా శివ సేన పార్టీ స్థాపిస్తాడు. 

          తనకి ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదనీ, అరాచకమే తన మార్గమనీ ప్రకటిస్తాడు. హక్కుల కోసం బిచ్చ మెత్తుకునే కంటే గూండాల్లాగా మారి హక్కుల్నిలాక్కోవాలని రెచ్చగొడతాడు. దీంతో ప్రాంతీయేతరుల మీద దాడులు మొదలైపోతాయి. ఉడిపి హోటళ్ళు పటాపంచలవుతాయి. గుజరాతీ, పార్సీ వ్యాపారాలు ధ్వంసమవుతాయి. బొంబాయి కార్పొరేట్ కంపెనీల్లో పనిచేస్తున్న ఉత్తర, దక్షిణ రాష్ట్రాల అధికారుల, ఉద్యోగుల జాబితాలు  తయారు చేసి విడుదల చేస్తాడు. ఏర్ ఇండియా కార్యాలయం మీదికి దండెత్తి, మరాఠీ ఉద్యోగుల లెక్క చెప్పమంటాడు. మరాఠీ సినిమా విడుదల ఆపి, హిందీ సినిమా విడుదల చేస్తున్న థియేటర్ల మీద దాడులు జరిపిస్తాడు. దేశానికి సినిమా తీయడం నేర్పిందే మరాఠీ వాడైతే, మరాఠీ సినిమాలకే థియేటర్లు దొరకవా అని చావగొడతాడు. పారిశ్రామికంగా యూనియన్లలో పాగా వేసిన లాల్ బందర్లని (ఎర్రకోతుల్ని) చంపెయ్యాలని ప్రకటించడంతో, ఒక కమ్యూనిస్టు ఎమ్మెల్యేని చంపేస్తారు...

          ఇంతలో ఠాకరే ఒక సంఘటనని పట్టుకుని దీర్ఘాలోచనలో గార్డెన్ లో పూల మొక్కని ట్రిమ్మింగ్ చేస్తూంటాడు. బ్లాక్ అండ్ వైట్ లో వుండే ఈ దృశ్యంలో ఆ చామంతి పువ్వు కాస్తా కాషాయ వర్ణంలోకి మారుతూంటుంది... విశ్రాంతి.  

ఎలావుంది కథ 
     కథ కాదు, అందుకని సినిమాలా లేదు. ఎన్నికల ప్రచార డాక్యు డ్రామాలాగా వుంది. నిర్మాతలు పార్టీ నాయకులే, దర్శకుడూ ఠాకరే కుటుంబ సన్నిహితుడే. కాబట్టి ఠాకరే కీర్తనలతో ఎన్నికల ప్రచారాస్త్రంగా తీశారు. ఠాకరే జీవితంలోని ఒక్కో ప్రధాన ఘట్టం తేదీలు వేస్తూ డాక్యుమెంటరీ కథనం చేశారు. సినిమా కళ గురించి అస్సలు పట్టించుకోలేదు. సినిమాలాగా తీయకూడదన్న ఒక స్పష్టతతో ఎన్నికల డాక్యూడ్రామాగానే తీశారు కాబట్టి, దీన్ని సినిమా రచనని వెతికే దృష్టితో చూడకూడదు. తెలుగులో ‘ఎన్టీఆర్’ బయోపిక్ కి ఏం రచన చేస్తున్నారో ఒక స్పష్టత లేకపోవడంతో, అది డాక్యుమెంటరీ కాలేదు, సినిమా కాలేదు సరికదా, రెండో భాగానికి ఉపోద్ఘాతమై కూర్చుంది. 

          ఐతే ఠాకరే రాజకీయ జీవితాన్ని తేదీలు వేసి క్రొనలాజికల్ ఆర్డర్ లో చూపిస్తున్నప్పుడు, ఇంటర్వెల్ కి ముందంతా మణూస్ గురించి, ఇంటర్వెల్ తర్వాతంతా మణూస్ ని వదిలేసి హిందూత్వ గురించీ చూపించారు. 40 ఏళ్ళు  మణూస్ గురించి పోరాడినా, ఎందరో నమ్మి పోరాడిన మరాఠీలు ప్రాణాలు పోగొట్టుకున్నా, ఆ లక్ష్యం సాధించలేదు. ఉన్నట్టుండి హిందూత్వ వాదాన్ని ఎత్తుకుని, హింసాగ్ని రగిలించి, ఇదీ ఏమీ సాధించకుండానే పోరాటం సాగుతూ వుంటుందని చెప్పి ముగించారు. 

          అతి వాదం ఏదీ సాధించదనీ, సాగదీస్తూనే వుంటుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల కోసమనీ అన్నట్టు చూపించారు. మణూస్ తో మరాఠీయేతరులు వుండరాదని చెప్పి అన్నేళ్ళు  పోరాడేక, హిందువులందరూ ఒక్కటే, హిందువులందరూ మతాన్ని కాపాడుకోవడానికి ఏకం కావాలనీ హింసాత్మక హిందూత్వ వాదాన్ని ఎత్తుకున్నప్పుడు, మణూస్ కి అర్ధమేలేకుండా పోయింది. హిందువులందరూ ఒకటే అన్నప్పుడు మరాఠీయేతరులు కూడా మహారాష్ట్రలో వుండొచ్చు. ఇది సెల్ఫ్ గోల్ కొట్టుకోవడమే. దీని గురించి ఓ మరాఠీ మిత్రుణ్ణి అడిగితే, అక్కడి జనం మణూస్, హిందూత్వా ఒకటేనని అనుకుంటున్నారని చెప్పాడు. 

ఎవరెలా చేశారు
    ఠాకరే పాత్రలో నవాజుద్దీన్ ఠాకరే సాబ్ ఒడ్డూ పొడవూ లేకపోయినా, బాడీ లాంగ్వేజినీ,  ఫేషల్ ఎక్స్ ప్రెషన్స్ నీ అనుకరించడంలో ప్రతిభ కనబర్చాడు. తెరమీద మెస్మరైజ్ చేసే ఈ ఫైనల్ ఫ్రేములు ఎన్ని టేకులు తీసుకుంటే వచ్చాయోగానీ, వీటిని రాబట్టిన దర్శకుడికి కూడా క్రెడిట్ ఇవ్వాల్సి వుంటుంది. 

          వాయిస్ అనుకరుణని లైట్ తీసుకున్నారు. నవాజుద్దీన్ ఠాకరే లోని శాంతం, క్రోధం, ఆవేశం, అక్కస్సు, ప్రేమ (ఇంట్లో) మొదలైన ఎమోషన్స్ ని చాలా రియలిస్టిక్ గా ప్రదర్శించాడు. నవ్వడం దాదాపూ వుండదు. సంతోషం సంతోషకరమైన ఘట్టాల్లోనూ వుండదు. నిలువెత్తు ఠాకరే ఎలా వుండే వాడో నవాజుద్దీన్ ని చూస్తే తెలిసిపోతుంది. ఠాకరే స్మోకర్, డ్రీంకర్. ఈ దృశ్యాలు విపరీతంగా వుంటాయి. ఇంకే సినిమాల్లోనూ చూడనన్ని చట్ట బద్ధమైన హెచ్చరికలు వరసగా స్క్రోల్ అవుతూనే వుంటాయి.

          ఇక మొరార్జీ దేశాయి, మనోహర్ జోషి, రజనీ పటేల్, జార్జి ఫెర్నాండెజ్, యశ్వంత రావ్ చౌహాన్, ఠాకరే సతీమణి మీనా తాయి, ఇందిరా గాంధీ మొదలైన ఇతర పాత్రలు ఆయా సందర్భాల్లో కన్పిస్తాయి. ఇందిరా గాంధీ పాత్ర వేసిన థియేటర్ ఆర్టిస్టు, ఎన్నారై  అవంతికా అక్రేకర్ అందరిలోకి బెస్ట్. 1970 ల నాటి ఇందిర పోలికలతో ఆశ్చర్య పరుస్తుంది. దర్శకుడు కూడా ఇందిర తల అలా పైకెత్తి వినే బాడీలాంగ్వేజినే ఎష్టాబ్లిష్ చేస్తూ మిడ్ షాట్స్ తీయడం గొప్ప జస్టిఫికేషన్. ఠాకరే సతీమణి పాత్రలో అమృతా రావ్ ఆమె సున్నిత మనస్తత్వాన్ని ప్రదర్శిస్తూ చెరిగిపోని ముద్ర వేస్తుంది. 


         హిందీ, మరాఠీ భాషల్లో విడుదల చేసిన ఈ బయోపిక్ మేకింగ్ క్వాలిటీ చాలా ఉన్నతంగా వుంది. ఫస్టాఫ్ పొడవునా ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే బ్లాక్ అండ్ వైట్ దృశ్యాలు కళాత్మకంగా వున్నాయి - కలర్ సినిమాల కంటే బ్లాక్ అండ్ వైటే బెటర్ అన్పించేలా. ఒకప్పటి ‘ఇండియా టుడే’ ప్రఖ్యాత సీనియర్ ఫోటోగ్రాఫర్ రఘురాయ్ నైపుణ్యపు తెలుపు నలుపు భావ చిత్రాల్లా.1950 లనుంచీ కాలక్రమేణా ముంబాయి అభివృద్ధి చెందుతూ వస్తున్న వివిధ దశల తెలుపు నలుపు దృశ్యాలు కళ్ళకి కట్టినట్టున్నాయి. సెకండాఫ్ లో కలర్ దృశ్యాలు వస్తాయి. సెట్స్, భవనాలు, ఔట్ డోర్ లొకేషన్స్, బీచి, ప్రాపర్టీస్, కాస్ట్యూమ్స్, మేకప్, నాటి పాతకాలపు మనుషుల్ని పోలిన మనుషులు, వాళ్ళ నాటి బాడీ లాంగ్వేజీలు, భాష, తమిళ తంబిల ఇడ్లీ సాంబార్ సేల్స్, పోటీగా ఠాకరే వడ పావ్ సూపర్ సేల్స్...చెప్పుకుంటే బొంబాయి – ముంబాయిలని కూడా బయోపిక్ చేసి చూపించారు. సినిమాగా ఏ కళ లేకపోయినా, డాక్యు డ్రామాతో చాలా కళాప్రదర్శన చేశారు. రాజకీయ పార్టీ తీసే రాజకీయ సినిమా  - లేదా డాక్యు డ్రామా - ఇంత కళాఖండంలా  తీయడం అరుదు.  

( చివరికేమిటి - రేపు)        
సికిందర్
Watched at PVR, Irrum manzil
11pm, 28.1.19