రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Wednesday, January 23, 2019

728 : లవర్ నుంచీ ఎఫ్ 2 దాకా ఏంటేంటి...


  నిన్న రోమాంటిక్ కామెడీల జయాపజయాలు చెప్పుకున్నాక, ఇక కామెడీలో మరిన్ని సబ్ జానర్స్ తో వచ్చిన సినిమాల బాగోగులు చూద్దాం. వీటిలో రోమాంటిక్ డ్రామాలు 2, బ్రొమాన్స్1, హార్రర్ కామెడీ 1, కామెడీలు 2 వున్నాయి. ఇవేమిటో చూద్దాం.

రోమాంటిక్ డ్రామా : శుభలేఖ+లు
శ్రీనివాస సాయి, ప్రియా వడ్లమాని; శరత్ నర్వాడే (కొత్త దర్శకుడు)
మార్కెట్ యాస్పెక్ట్ : రోమాన్స్ లో పెద్దవయసు పాత్రల పెత్తనం - ఫ్లాప్
క్రియేటివ్ యాస్పెక్ట్ : గాథ - ఫ్లాప్
         
ఇది ఒకప్పుడు, అంటే 2000 – 2005 మధ్య కాలంలో, యూత్ సినిమాల పేరుతో వెల్లువెత్తిన లైటర్ వీన్ లవ్ స్టోరీస్అనే పరమ బలహీన సబ్ జానర్ జాతికి చెందిన టీవీ సీరియల్ రోమాంటిక్ డ్రామా అన్పిస్తుంది కానీ కాదు. రోమాన్స్ కంటే కూడా ఇందులో ఇంటినిండా పది పదిహేనుమంది పెద్దవాళ్ళ గుంపు ఫ్యామిలీ డ్రామాగానే పెత్తనాలతో సాగుతుంది. ఫ్యామిలీ డ్రామాలో బలహీనమైన లైటర్ వీన్ రోమాంటిక్ డ్రామాగా కథ తయారైంది. ఇది రోమాంటిక్ కామెడీ అవ్వాలన్నా జానర్ మర్యాదల ప్రకారం ప్రేమికుల మధ్య పెద్దవాళ్ళ జోక్యం వుండకూడదు. మంచి యూత్ అప్పీల్ తో వుండే రోమాంటిక్ కామెడీలకి కరెక్ట్ నిర్వచనం అప్పట్లో జంధ్యాల తీసిన అహ నా పెళ్ళంటసహా, ఆయన తీసిన అన్ని ప్రేమ సినిమాలూ.  రోమాంటిక్ డ్రామాల్లో ప్రేమికుల నిర్ణయాలు పెద్దలు అడ్డుపడి చేస్తారు. వీటికి అంతగా యూత్ అప్పీల్ వుండదు. 


         నాగశౌర్య - మాళవికా నాయర్ లతో నందినీ రెడ్డి తీసిన కళ్యాణ వైభోగమే’ (2016) అనే ఫ్లాపయిన రోమాంటిక్ కామెడీ ఇలాటిదే. అందులో ఎలాటి ఆధునిక యువ పాత్రలున్నాయో, ఇందులోనూ అలాటి ఆధునిక యువ పాత్రలే వున్నాయి. ఇవన్నీ సీనియర్ ఆడియెన్స్ నమ్మకాలని, అహాన్ని  సంతృప్తిపర్చే, పెద్దవయసు పాత్రలకి తలవంచే స్వయంప్రతిపత్తి లేని కథానాయికా నాయక పాత్రలే. కానీ నిజమైన  పెద్దవాళ్ళు తమ పిల్లలు వాళ్ళ రిలేషన్ షిప్పుల్లో ఇంత ఉల్ఫాగా వుండడాన్ని కోరుకోరు. పైగా ఇది కథ గాకుండా, సినిమాలకి పనికి రాని గాథ కూడా అయింది.

గీతగోవిందం





విజయ్ దేవరకొండ- రశ్మిక; పరశురామ్ (5 సినిమాల దర్శకుడు)
మార్కెట్ యాస్పెక్ట్ : విజయ్ ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ ని క్యాష్ చేసుకోవడం - హిట్
క్రియేటివ్ యాస్పెక్ట్ :  సిట్యుయేషనల్ కామెడీ – హిట్
         
కామెడీ ఆఫ్ ఎర్రర్స్ సబ్ జానర్ లో రొటీన్ గా వచ్చే కథల్లాంటిదే. కాకపోతే  చిలసౌలో లాగా టెంప్లెట్ కథనం చేయకుండా, పాత్రలెదుర్కొనే సమస్యలతో సిట్యుయేషనల్ కామెడీ పూత పూయడంతో నిలబడగల్గే కథయ్యింది. పైగా అర్జున్ రెడ్డితో విపరీతంగా ఫాలోయింగ్ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ దీని తర్వాత రెండో రోమాంటిక్ ఇదే కావడంతో, హీరోయిన్ రశ్మికతో కెమిస్ట్రీ కూడా కుదరడంతో, రోటీన్ రోమాంటిక్ కామెడీయే వినోదపర్చింది ప్రేక్షకుల్ని. 

బ్రొమాన్స్ : హుషారు





నల్గురు కొత్త హీరోలు - ప్రియా వడ్లమాని; శ్రీహర్ష కె (కొత్త దర్శకుడు)
మార్కెట్ యాస్పెక్ట్ : లేకలేక ఎకనమిక్స్ తో బ్రొమాన్స్ - హిట్
క్రియేటివ్ యాస్పెక్ట్ : యూత్ అప్పీల్ తో క్రేజీ స్క్రిప్ట్ -  హిట్
         
నల్గురు కొత్త హీరోలతో పూర్తి స్థాయి బ్రొమాన్స్ జానర్ కథ.  టైటిల్ కి తగ్గట్టు సమస్యల్ని తేలికగా తీసుకుని సాగిపోయే కుర్రకారు మనస్తత్వాల కథ. బ్రొమాన్స్ లో నైనా, రోమాంటిక్ కామెడీ లోనైనా పెద్ద వయసు క్యారెక్టర్లు నీతులతో క్లాసులు పీకి యూత్ పోకడల్ని మార్చే చాదస్తాలు వుండవు. కానీ తెలుగులో ప్రతీ రోమాంటిక్ కామెడీ ఇలాగే వుంటూ ఫ్లాపవుతోంది. ఏదో మోరల్ పోలిసింగ్ చేయబోతారు దర్శకులు. అలాటిది ఇలాటి చాదస్తాలు ఏవీ లేని జానర్ స్పెసిఫిక్ కథగా హుషారుఅనే బ్రొమాన్స్ కొత్త ఊపిరే. తల్లిదండ్రుల పాత్రలున్నా అవి కథని మేనేజ్ చేయకుండా సమస్యల్నీ, వాటి పరిష్కారాలనీ పిల్లలకే వదిలేస్తాయి. యూత్ వాళ్ళ జీవితాలు వాళ్ళే జీవించడం నేర్చుకునే స్వావలంబనని అలవర్చుకునేలా చేయాలన్నదే  నిజమైన బ్రొమాన్స్, రోమాంటిక్  కామెడీల ఉద్దేశం. ఇది కథ నేరవేర్చింది. ఇవాళ్టి యూత్ సినిమాల మార్కెట్ యాస్పెక్ట్ రోమాంటిక్స్ లేదా ఎకనమిక్స్. చాలా కాలానికి కథ ఎకనమిక్స్ తో వచ్చి, రోమాంటిక్ కామెడీలతో ఖాళీ అయిన తెలుగు మార్కెట్ ని క్యాష్ చేసుకోగల్గింది.

హార్రర్ కామెడీ : టాక్సీవాలా 




విజయ్ దేవర కొండ - ప్రియాంకా జవల్కర్; రాహుల్ సాంకృత్యాయన్ (కొత్త దర్శకుడు)
మార్కెట్ యాస్పెక్ట్ : హార్రర్ కామెడీలకి ఇక మార్కెట్ లేదు, విజయ్ దేవరకొండ మార్కెట్టే మార్కెట్ యాస్పెక్ట్ – హిట్
క్రియేటివ్ యాస్పెక్ట్ :  రొటీన్ కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా, హాలీవుడ్ శైలిలో కేవలం పాయింటు ఒక్కటే పట్టుకుని సాగే హార్రర్ ఎంటర్ టైనర్ – హిట్
         
అతీంద్రియ శక్తుల కథ. ఆస్ట్రల్ ప్రొజెక్షన్ అనే ఆత్మ సంబంధ పాయింటుతో కథ చేశారు. మనం బ్రతికి వుండగానే మన ఆత్మ బయటికి వెళ్లి ప్రపంచాన్ని చూడ్డమనే శాస్త్రీయంగా రుజువుకాని ఒక దృష్టాంతం ఆస్ట్రల్ ప్రొజెక్షన్. అయితే దీన్ని కన్విన్సింగ్ గా చెప్పలేకపోయారు. హాలీవుడ్ లో పాయింటుతో ఇన్సిడస్’, ‘డాక్టర్ స్ట్రేంజ్లాంటి సినిమాలు ఇరవై ముప్ఫై వచ్చాయి. మన పురాణాల్లో దీని ప్రసక్తి వుంది. దీన్ని లింగ శరీరయానం అన్నారు. ఇదొక స్పిరిచ్యువల్ విద్య అనుకుంటే దీన్ని పరమహంస యోగానంద సాధించారని చెప్పుకుంటారు. మెహర్ బాబా దీన్ని బోధించారని కూడా వుంది. ఇలాటి సమాచారాన్ని కూలంకషంగా పరిశీలించి కథని కన్విన్సింగ్ గా ముగించాల్సింది. 

కామెడీ : సిల్లీ ఫెలోస్

 



నరేష్ – సునీల్ – చిత్రా శుక్లా; భీమనేని శ్రీనివాస రావు (11 సినిమాల దర్శకుడు)
మార్కెట్ యాస్పెక్ట్ : తమిళంలో హిట్
క్రియేటివ్ యాస్పెక్ట్ : జనరేషన్ గ్యాప్ - ఫ్లాప్
         
తమిళంలో ఎళిల్ అనే యువ దర్శకుడు తీసిన హిట్ కామెడీ వేళైనూ వందుట్ట వేళైకారన్’ (పని దగ్గర మనోడు ఇంగ్లీషోడు) కి రీమేక్ మూస ఫార్ములా కామెడీ కథ. తమిళంలో విష్ణు విశాల్, సూరీలు నటించారు. లాజిక్, కామన్ సెన్సు అనే మాటలకి దూరంగా అల్లిన బలహీన కథ ఇది. దీన్ని యధాతధంగా రీమేక్ చేశారు.   పాత కథ తమిళంలో కొత్త స్కూలు దర్శకుడి కామెడీ. యూత్ ఫుల్ గా తీశాడు. రాత, తీత రెండూ కొత్త పంథాలో ఇన్స్ పైరింగ్ గా వుంటాయి. యాభై కోట్లు వసూలు చేసింది కాబట్టే తెలుగుకి తీసుకున్నారు. తీసుకున్నప్పుడు కొత్త స్కూలు న్యూవేవ్ కామెడీ పాత స్కూలు దర్శకత్వంలోకి మారిపాయింది. దీని తమిళ, తెలుగు దర్శకత్వాల్లో జనరేషన్ గ్యాప్  స్పష్టంగా కన్పిస్తుంది. తెలుగులో ఇంకెవరైనా యువదర్శకుడు తీసి వుంటే బెటర్ గా హేండిల్ చేసేవాడేమో.

ఎఫ్ -2 






వెంకటేష్ – వరుణ్ తేజ్; అనిల్ రావిపూడి (3 సినిమాల దర్శకుడు) 
మార్కెట్ యాస్పెక్ట్ : హాస్య కథాచిత్రాలు లేని లోటు తీర్చడం - హిట్
క్రియేటివ్ యాస్పెక్ట్ : జానర్ మర్యాదతో కేవల కామెడీ కథ -  హిట్   
         
తెలుగులో జంధ్యాల, వంశీ, ఈవీవీల తర్వాతి తరంలో కామెడీ దర్శకుల్లేరు. యాక్షన్ కామెడీల, రోమాంటిక్ కామెడీల దర్శకులే అవసరానికి మించి తయారై ప్యూర్ కామెడీలని  ప్రేక్షకులు నోచుకోకుండా చేశారు. పూర్తి స్థాయి హాస్యకథా చలన చిత్రమనే ఒక ప్రధాన జానర్ వుందన్న విషయం కూడా తెలియనట్టు తయారయ్యారు. ఇప్పుడు అనిల్ రావిపూడి అవతారమెత్తి, మర్చి పోయిన కామెడీ జానర్ లేని లోటు తీర్చాడు. కథ భార్యాబాధితుల పాత ఫార్ములా కథే. హిందీలో వెల్కమ్’ (2007) అనీ, ‘హౌస్ ఫుల్’ (2010) అనీ బిగ్ స్టార్స్ తో ఇలాటి కామెడీలు బాగా హిట్టయ్యాయి. ఇవీ పాత కథలే. కాకపోతే తెలివితేటలతో కొత్తగా నవ్వించే క్రియేటివిటీకి పాల్పడ్డారు. కాలపు కామెడీలుగా యూత్ అప్పీల్ తో కూడిన స్పీడు వీటి లక్షణం. దర్శకుడు  దీన్ని ఫాలో అయ్యాడు. సెకండాఫ్ గొప్పగా ఏమీలేదు. సెకండాఫ్ సిండ్రోమ్ లో పడ్డా  కేవలం మైండ్ లెస్ కామెడీతో నవ్విస్తూ గట్టెక్కింది. విలనిజాలు, రక్త పాతాలు మొదలైన వాటితో రాజ్యమేలిన యాక్షన్ కామెడీలకి భిన్నంగా కేవలం కామెడీని ఎంజాయ్ చేయడం దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ప్రేక్షకులకి కొత్త.  

సికిందర్