రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Tuesday, August 25, 2015

కథా- కిక్కూ!


స్క్రీన్ ప్లే -దర్శకత్వం :  సురేందర్ రెడ్డి
తారాగణం : రవితేజ, రకుల్ ప్రీత్ సింగ్,  బ్రహ్మానందం, రవికిషన్,  రఘుబాబు, సంజయ్ మిశ్రా, రాజ్ పల్ యాదవ్, కబీర్ సింగ్, తనికెళ్ళ భరణి, పోసాని, కోవై సరళ తదితరులు
కథ - మాటలు : వక్కంతం వంశీ ,  సంగీతం : ఎఎస్ ఎస్ తమన్, 
ఛాయాగ్రహణం : మనోజ్ పరమ హంస.
బ్యానర్ :
నందమూరి తారకరామారావు ఆర్ట్స్‌,  నిర్మాత : నందమూరి కళ్యాణ్‌రామ్‌
విడుదల : 21 ఆగస్టు, 2015

*
‘కిక్’ - సక్సెస్ తో  ‘కిక్-2’  తీసిన  సురేందర్ రెడ్డి, రాసిన వక్కంతం వంశీ, నిర్మించిన కళ్యాణ్ రామ్, నటించిన రవితేజ, చూస్తున్న ప్రేక్షకులు అందరూ అభినందనీయులే. ‘కిక్’ హేంగోవర్ తో ‘కిక్-2’  హైపర్ యాక్టివ్ హంగామాగా తయారై  సీక్వెల్స్ చరిత్రని తిరగరాయడానికి
ప్రయత్నించడం ఎంతైనా హర్షణీయం. ఒక సినిమాని రీమేక్ చేసినా, ఇంకో సినిమాకి సీక్వెల్ తీయాల్సి వచ్చినా-  రెండూ మేకింగ్ లోనూ, ప్రేక్షకుల్ని మెస్మరైజ్
చేయడంలోనూ పడే పాట్లు చరిత్రంతా ఇదివరకే నమోదై వున్నాయి.
కిక్ కి రెండర్థాలున్నట్టు, రెండు కిక్ సినిమాలకీ చెరొక అర్ధం రాకుండా చర్య తీసుకోవడం తలకి మించిన భారమే. ఒక కిక్ ప్రేక్షకులకి కిక్ ఇచ్చి, రెండో కిక్  ప్రేక్షకుల్ని
థియేటర్ల లోంచి  కిక్ ఇవ్వకుండా చూసుకోవాలంటే,  మొదటి కిక్ కి సరిపోయిన
టాలెంట్ చాలుతుందా?  ‘బాహుబలి’ మొదటి పార్టుకి పైబడి రెండో పార్టు తీయాలని
మొత్తం కుటుంబానికి కుటుంబమంతా ఎలా తర్జనభర్జన పడుతున్నారో, అలాటి భర్జనతర్జనలు పడాలి.  పడ్డారా?  ఏమో! తెరమీద మాత్రం బడ్జెట్ 40 కోట్లు అనుకుంటే,
అందులో  20 కోట్లు మాత్రమే సద్వినియోగమైనట్టు
కన్పిస్తోంది..అదెలాగో ఈ కింద చూద్దాం...

 కంఫర్ట్ కింగ్! 

       ‘కిక్’ లో రవితేజ- ఇలియానా పాత్రలకి పుట్టిన కొడుకు ఇప్పుడు అమెరికాలో ఉంటాడు. ‘కిక్’ లో రాబిన్ హుడ్ ( రవితేజ) చివరికి పోలీసు అవుతాడు. ఆ ఉద్యోగం అతడికి బోరు కొట్టేసి అమెరికా వచ్చేస్తాడు. ఇక్కడ చిన్న రాబిన్ హుడ్ ( రవితేజ) పుడతాడు. పెద్ద రాబిన్ హుడ్ ఇతరులకి సాయపడ్డంలో కిక్ ఉందను కుంటే, ఈ చిన్న రాబిన్ హుడ్ తన కంఫర్టే తనకి ముఖ్యమనుకుని తండ్రికి చుక్కలు చూపిస్తూంటాడు. డాక్టరైన తను హాస్పిటల్ కట్టుకోవడానికి డబ్బిమ్మని వొత్తిడి చేస్తే, ఉన్న ఆస్తి ఇండియాలో కబ్జా అయి వుందని అంటాడు తండ్రి. ఆ ఆస్తి విడిపించుకుని అమ్ముకుందామని హైదరాబాద్ వస్తాడు రాబిన్ జ్యూనియర్.

          ఇక్కడ జ్యోతిష్కుడు పండిట్ రవితేజ ( బ్రహ్మానందం) ఇంట్లో అద్దెకి దిగుతాడు. తన కంఫర్ట్ కోసం పండిట్ ని టార్చర్ పెడుతూంటాడు. కబ్జా అయిన ఆస్తిని రాబట్టుకునే ప్రయత్నాల్లో వుండగా చైత్ర ( రకుల్ ప్రీత్ సింగ్) అనే సినిమా రచయుత్రి పరిచయమై వెంటనే ప్రేమలో పడుతుంది. తను తిరిగి అమెరికా వెళ్ళాల్సిన వాడు ప్రేమించేది లేదనీ, నీ కిష్టముంటే నువ్వు ప్రేమించుకోమనీ, ఒకవేళ అమెరికా వెళ్ళే లోగా తనకి ప్రేమపుడితే యాక్సెప్ట్ చేస్తాననీ, చేయకపోతే హర్ట్ అవకూడదనీ కండిషన్ పెడతాడు. ఇదేదో కాన్సెప్ట్ బాగానే వుందన్పించి, తన అవసరం కొద్దీ అతడి వెంటపెడుతూ తనే ఖర్చులన్నీ భరిస్తూంటుంది చైత్ర.

          ఈమెతో చేసినంత ఎంజాయ్ చేసి, వచ్చిన పని పూర్తి కానిచ్చుకుని అమెరికా బయల్దేరతాడు రాబిన్. చైత్ర  మీద తనకి ప్రేమ పుట్టనే లేదు. ఆమె కూడా బాధపడదు. తీరా బయల్దేరాక తను కంఫర్ట్ గా లేనని అన్పిస్తుంది. అంటే తన లోపలి మనిషికి ప్రేమ పుట్టిందన్నమాట. అప్పటికి ఆలస్య మైపోతుంది. కన్పించని చైత్ర ని వెతుక్కుంటూ బీహార్ లోని విలాస్ పూర్ అనే మారు మూల గ్రామానికి చేరుకుంటాడు. అక్కడే వుంటుంది చైత్ర.

          విలాస్ పూర్ చుట్టు పక్కల గ్రామాలన్నిటినీ తన మైనింగ్ కలాపాల కోసం ధ్వంసం  చేసిన సాలమన్ సింగ్ ఠాకూర్ ( రవి కిషన్) అనే కౄర మాఫియా, విలాస్ పూర్ ప్రజల్ని కూడా హింసిస్తూంటాడు. ఇతణ్ణి  ఎదుర్కొనే మొనగాడి కోసం ఆ ప్రజలు ఎదురు చూస్తూంటే, వాళ్ళ దృష్టిలో రాబిన్ పడ్డాడు. రాబిన్ ని ఇక్కడికి రప్పించడానికే చైత్ర అలా వలపన్నింది. అయితే రాబిన్ తనకి  కంఫర్ట్ కాకపోతే ఏపనీ చెయ్యడు కాబట్టి- జాగ్రత్తగా  డీల్ చేసి, ఠాకూర్ తో అతడికి కయ్యం పెడితే, వాడి పీడా అతనే వదిలిస్తాడని గ్రామ పెద్ద ( సంజయ్ మిశ్రా) తోబాటు ప్రజలూ ప్లాన్ వేస్తారు. చైత్ర దాచిన నిజమేంటో తెలియక ఇక్కడికొచ్చి ఇరుక్కున్న రాబిన్ ఇప్పుడేం చేశాడనేది మిగతా కథ.

          ఇక్కడిదాకా కిక్కున్న కథ!

ఎవరెలా చేశారు
       బరువు తగ్గిన రవితేజ వయసు పెరిగినట్టు కన్పించడంతో ఈ కొత్త లుక్ కి అలవాటు పడ్డానికి మనకి తెరమీద కొంత సమయం పడుతుంది. బరువు తగ్గి మోహంలో కళ కోల్పోతున్న స్టార్ల సరసన కొత్తగా తనూ చేరాడిప్పుడు. ఈ లుక్ తోనే యాక్టివ్ కాదు, హైపర్ యాక్టివ్ గా ఫస్టాఫంతా పరాక్రమించాడు. స్పీడ్ టేకింగ్, మైక్రో షాట్స్ తో షార్ప్ ఎడిటింగ్, ఫాస్ట్ డైలాగ్ కటింగ్ లూ  ఈ హైపర్ యాక్షన్ కి బాగా హెల్ప్ అయ్యాయి. గ్లామర్ కాస్ట్యూమ్స్ అదనపు ఆకర్షణ. తన కంఫర్ట్ కోసం ఎదుటి వాళ్ళని పురుగుల్లా చూసే స్వభావంలో శాడిజం లేకుండా జాగ్రత్త పడి, పూర్తి సెన్సాఫ్ హ్యూమర్ ని పండించే క్యారక్టర్ కావడంతో, ఎంజాయ్ చేయడానికి ఏ మానసిక నిషేధాలూ అడ్డు రావు. ఫస్టాఫ్ అంతా ‘కిక్ -2’ మాత్రమే కాదు, ‘కిక్- 3’ కూడా చూసేసినంత సంబరం  ప్రేక్షకులకి! 

          అయితే అంతలోనే సెకండాఫ్ లో, ఈ హైపర్ యాక్షన్ నుంచి పాసివ్ యాక్షన్ కి యూ- టర్న్ తీసుకోవడంతో రవితేజ ఫస్టాఫ్ లో స్కోరు చేసిన మార్కులన్నీ జీరోకి చేరాయి. సురేంద్ర రెడ్డి సినిమాలతో ఇదే సమస్య. హీరో పాత్రలు పాసివ్ క్యారక్టర్ లుగా మారిపోతాయి. తెలుగు సినిమాలు, అవే స్థాయి సినిమాలైనా, వాటిని పట్టి పల్లారుస్తున్నవి రెండే రెండు - పాసివ్ పాత్రలు, లేదా ఎండ్ సస్పెన్స్ కథనాలు. దర్శకులు సరే, స్టార్లు సైతం నటించక నటించక  ఏరికోరి ఏడాదికో బిగ్ బడ్జెట్ సినిమాలో నటిస్తున్నప్పుడు, అవి సోదిలోకి రాని పాసివ్ పాత్రలే అవుతున్నాయని ఇంకా తెలుసుకోకపోవడం చాలా విచారకరం.

          పాత్ర బావుంటే నటన చాతగాక పోయినా, సరిపెట్టుకోవచ్చు. పాత్రలో కొట్టొచ్చే లోపాలున్నప్పుడు ఎంత బాగా నటించినా, అది మృతదేహానికి అలంకరణ చేసిన చందానే వుంటుంది. సెకండాఫ్ లో తన ‘కంఫర్ట్’ కోసమే రవితేజ పాత్ర పాసివ్ గా మారిపోయి విశ్రమించినట్టుంది. చాలాముఖ్యమైన విలన్ తో ముఖా ముఖీ అవడానికే సెకండాఫ్ లో కూడా ఇంకో గంటసేపు తాత్సారం చేయడమంటే పాత్రలో ఏం ‘పెప్’ వున్నట్టు? ఫస్టాఫ్ లోనే  ‘కిక్ -3’ ని కూడా ఇచ్చేసిన రవితేజ, సెకండాఫ్ లో ఆ కిక్కంతా కూడా దిగిపోయేట్టు చేశారు. అఫ్ కోర్స్, ఇందుకాయన బాధ్యుడు కాదు. ఎవరూ బాధ్యులు కారు. అలవాటైపోయిన తెలుగు సినిమాల మేకింగ్ తీరే అంత.

          ఇప్పుడు సెకండాఫ్ లో ఇరవై నిమిషాల నిడివి కత్తెర వేస్తున్నట్టు తాజా వార్త. బడ్జెట్లో నిమిషానికి పాతిక లక్షల చొప్పున, ఇరవై నిమిషాలకి 5 కోట్లు విలువజేసే నిడివి వేస్టుగా తీశారని అనుకోవాలి. మిగతా సుమారు గంటా పది నిమిషాల సెకండాఫ్ నిడివిని రవితేజ పాసివ్ పాత్ర నిలబెడుతుందా? సెకండాఫ్ లో అది పాసివ్ పాత్ర అని ముందే తెలుసుకుని వుంటే ఈ నష్టమంతా వుండేది కాదుకదా? చాలా సింపుల్!

                                                ***
      గ్లామర్ డాల్ రకుల్ ప్రీత్ సింగ్ ది అచ్చమైన యాక్టివ్ పాత్ర- ‘శ్రీమంతుడు’ లో శృతీ హాసన్ పాత్రలాగే. ఇద్దరివీ హీరోల్ని పల్లెలకి డ్రైవ్ చేస్తూ కథని ప్రారంభించే యాక్టివ్ పాత్రలే. అయినప్పటికీ హీరోయిన్నుంచీ అందిపుచ్చుకుని ‘శ్రీమంతుడు’ లో హీరో గోల్ ఫీల్ కానట్టే, ‘కిక్ -2’ లో హీరో అసలు గోలే తెలుసుకోలేకపోయాడు. ఎందుకంటే తనకి వేరే గోల్ లేదు. అమెరికా నుంచి వచ్చిన తన గోల్ ఫస్టాఫ్ లో, ఆ ల్యాండ్ కబ్జా విడిపించుకుని తిరుగు ప్రయాణం కట్టడంతోనే పూర్తయ్యింది- ఉన్నదల్లా హీరోయిన్ గోల్. డిటో గా సురేందర్ రెడ్డి ఎన్టీఆర్ తో తీసిన ‘ఊసరవెల్లి’ లోనూ ఎన్టీఆర్ పాత్రకి సొంత గోల్ వుండదు. ఆ పాత్ర తమన్నాపాత్ర కోసం, విలన్ తో ఆమె ప్రతీకారం తీర్చడం కోసం పనిచేసే పాసివ్ క్యారక్టర్ గా వుంటుంది. ఆ సినిమా ఫ్లాపయ్యింది.

          ఇలా ప్రస్తుత సినిమాలోనూ యాక్టివ్ హీరోయిన్ గోల్ ని సాధించే - పాసివ్ పాత్రగానే రవితేజ పాత్ర తయారయ్యింది. ఈ యాక్టివ్ పాత్రలో రకుల్ ఫస్టాఫ్ లో హీరోకి వల పన్నడం, సెకండాఫ్ లో తమ వూరికి అతణ్ణి రప్పించుకోవడం, అక్కడ స్ట్రగుల్  చేయడం వగైరా సంఘర్షణంతా వుంది. ఫస్టాఫ్ లో ఎంత అలరించిందో, సెకండాఫ్ లో అంత ఆలోచింపజేసే పాత్రే ఇది. కారణం, ఈ పాత్రకి అంతర్గత - బహిర్గత సంఘర్షణలు రెండిటితో క్యారక్టర్ ఆర్క్ ఏర్పడింది. అంతర్గత ( ఎమోషనల్) సంఘర్షణగా- తను అసలు విషయం దాచి పెట్టి హీరోని తమ గ్రామానికి రప్పించిందన్న ఆందోళన వుంది. ఇది బయటపడితే, గ్రామానికి మాఫియా పీడా వదిలించడానికే అతడితో ప్రేమ నటించిందన్న అపవాదు భరించాల్సిన పరిస్థితి పొంచి వుంది. అది భరించింది కూడా- నీ పని జరగడం కోసం నాతో పడుకోవడానికి కూడా సిద్ధపడతావా?- అని అతను అననే అన్నాడు చివరికి.  

          బహిర్గత ( ఫిజికల్ ) సంఘర్షణ వచ్చేసి- తన తండ్రిని సజీవ దహనం చేసిన మాఫియా విలన్ తో తలపడడం- దానికో పథకం, దాన్ని పారించడమూ వున్నాయి. ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్న రకుల్ కి ఆటాపాటలతో, బరువూ బాధ్యలతో ఈ పాత్ర, దీంతో తన  నటనా ఒక సాఫీ ప్రయాణం. కానీ తానొక్కతే సినిమాని నిలబెట్టలేదు కదా!

***
       దేవుడు కరుణించి బ్రహ్మానందం సెకండాఫ్ లో ఎంటరై ఇంకో ‘కన్ఫ్యూజ్  కామెడీ’ కి తెగించి కంగాళీ చేయకుండా ( సింగిల్ విండో స్కీము అను కొత్త మోడల్ స్క్రీన్ ప్లే), మొదట్నించీ కథతో కనెక్ట్ అయివుండే, చివరికి బండారం బయట పడే ఎండ్ సస్పెన్స్ క్యారక్టర్ గా, కామెడీ షోనంతా బట్టతలమీద (పటాపటా కొట్టుకునే కొత్త మ్యానరిజంతో ) మోశారు. ఇలావుంటే  ఆయనెప్పప్పటి కైనా కింగే.

          హిందీ బ్రిగేడ్ రవి కిషన్, సంజయ్ మిశ్రా, రాజ్ పల్ యాదవ్, కబీర్ సింగ్ మొదలైన వాళ్ళంతా కన్విన్స్ కాని ఆయా పాత్రల్లో తెగ ఇబ్బంది పడ్డారు. విలన్ రవికిషన్ కైతే  సిగపట్లకి హీరో ఎప్పుడెప్పుడొస్తాడా అని ఎదురుచూడ్డం తోనే పుణ్యకాలం కాస్తా గడిచిపోయింది.

          చివరి పాట, రెండో పాటా తమన్ నుంచి మంచి కిక్ నిస్తాయి. కెమెరా తో మనోజ్ పరమ హంస ప్రతిభ మరోసారి ప్రవర్ధమానమైంది.

          స్థానికంగా వేసిన బీహార్ గ్రామ లొకేషన్ సెట్ ఫర్వాలేదు గానీ, ఆ గ్రామం పేరైనా ‘బిలాస్ పూర్’ అని నేటివిటీకి తగ్గట్టు వుండాల్సింది. బీహార్ ప్రాంతం అంటూ చూపించిన లోకేషన్స్ అన్నీ డిజైనర్ లొకేషన్సే. క్లయిమాక్స్ లోకన్పించేది రాజస్థాన్ లోని జైసల్మీర్ లొకేషన్.

          దర్శకుడిగా సురేందర్ రెడ్డి టాలెంట్ ని కాదనలేం. అవకాశం వస్తే సూపర్ స్టార్ రజనీ కాంత్ ని కూడా హేండిల్ చేయగలరు. ఇబ్బందల్లా తన చేతిలో వుండే కంటెంట్ తోనే!

***

స్క్రీన్ ప్లే సంగతులు 
       ఈ స్క్రీన్ ప్లేలో తెలుసుకోవాల్సిన స్ట్రక్చర్ వుంది, స్ట్రక్చర్ తో చేయకూడని ఆత్మహత్యా సదృశ చెలగాటమూ వుంది. తెలుసుకోదగిన   స్ట్రక్చర్  ఫస్టాఫ్ లో వుంటే, ఆ స్ట్రక్చర్ తో ఆత్మహత్యా సదృశ విశృంఖలత్వం  సెకండాఫ్ లో వుంది. మొత్తంగా చూస్తే  ఈ స్క్రీన్ ప్లే- మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే తరగతి కిందికి వస్తుంది. పాసివ్ హీరో పాత్ర- మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే - ఈ రెండూ కలిసి, ఇంకేముంది ఈ 40 కోట్ల సినిమాని ఇప్పుడున్న తీరులో తయారు చేశాయి. 

          హీరో పాసివ్ గా వుంటే కథకి స్ట్రక్చర్ వుండదు. అప్పుడు కథే అడ్డదిడ్డంగా సాగుతూ హీరోని ఆ డొంక దారిలో నడిపించుకుని ఎటో పోతుంది. హీరో యాక్టివ్ పాత్ర అయినప్పుడు కథని తనే నడిపిస్తుంది.  అప్పుడు ఆటోమేటిగ్గా కథ స్ట్రక్చర్లోకి వచ్చేస్తుంది. యాక్టివ్ పాత్ర = స్ట్రక్చర్, పాసివ్ పాత్ర = స్ట్రక్చర్ కోల్పోయిన స్క్రీన్ ప్లే. చాలా సింపుల్!

          ఈ సినిమాలో ఫస్టాఫ్ లో యాక్టివ్ హీరోగా వున్న పాత్ర,  సెకండాఫ్ లో పాసివ్ హీరోగా మారిపోవడంతో, సెకండాఫ్ కథకూడా స్ట్రక్చర్ ని కోల్పోయి- మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే అనే దాంట్లోకి వచ్చేసింది. మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే లో మిడిల్ విభాగమనేది మటాష్ అయిపోతుంది. కావాలని ఎవరూ మిడిల్ ని మటాష్ చేసుకోరు. కథకి బిగింగ్- మిడిల్- ఎండ్ అనే విభాగాలుంటాయని తెలుసుకోక పోవడంవల్లే ఇలా జరుగుతుంది- ఆ తెలియకపోవడమనేది ఎడిటింగ్ తో మొదలెట్టి, ప్రివ్యూ వరకూ కూడా కొనసాగుతుంది. సినిమా విడుదలై ప్రేక్షకులు గగ్గోలు పడుతున్నప్పుడే  ఇక కత్తిరించడం మొదలెడతారు. ( ఫిలిం రీళ్ళు వున్న కాలంలో థియేటర్ల ఆపరేటర్లే ఎడిటర్లు గా మారిపోయి, ఎవరికీ చెప్పకుండా కత్తిరించేసే వాళ్ళు) అప్పుడు కూడా సమస్య ని గుర్తించి కాదు, రాస్తున్నప్పుడు తెలియని సమస్య కత్తిరిస్తున్నప్పుడు తెలియాలని లేదు.

          ఇక్కడ అసలు కథకి వెన్నెముక అయిన మిడిల్ ప్రాంగణం వుండదు. దాదాపు క్లయిమాక్స్ వరకూ, అంటే చివరిదైన ఎండ్ ప్రాంగణం వరకూ, బిగినింగ్ ప్రాంగణమే దురాక్రమించి వుంటుంది. రవితేజ పాత్ర తన ల్యాండ్ కబ్జా అయిందని హైదరాబాద్ వరకూ అయితే వచ్చిందిగానీ, పనిలోపనిగా అసలు తను తిరుగాడుతున్న ఈ స్క్రీన్ ప్లేలోనే,  తన హైపర్ యాక్షన్ ఆట  స్థలమైన మిడిల్ ఏరియాని, బిగినింగే సమూలంగా కబ్జా చేసి కూర్చుందని చూసుకోలేదు. తనకి మెయిన్ విలన్ ఇంకెవరో కాదు- మిడిల్ మటాష్ ( కబ్జా) అయిన ఈ స్క్రీన్ ప్లేనే అని తెలుసుకో లేదు.

          బట్..బట్..ఆయా సీన్లలో దీని  రచయిత, ఇంకో తనికెళ్ళ భరణి పాత్ర ద్వారా పదే పదే హెచ్చరిస్తూనే వున్నాడు సినిమా అంతా - ఇది వర్కౌట్ అయ్యేది కాదు, వర్కౌట్ అయ్యేది కాదు బాబూ  - అనే డైలాగులతో!

          వర్కౌట్ కాదని ఇప్పుడు ప్రూవ్ అయిన మాట  నిజమే - అయితే రచయితకి ఇంకో పని కూడా చేయాలన్పించింది. రవితేజ పాత్ర తనకి అడ్డు రాకూడదని మొదట్లోనే దాన్ని లాక్ చేసేశారు- కాన్సెప్ట్ ఏదో కొత్త గా వుందే - ట్రీట్ మెంట్ ఇంకా కొత్తగా ఉంటుంది!- అనే ఊరించే డైలాగులతో! ఇలా ఊరించి (కీ ఇచ్చి) వదిలాక ఇంకేం చేస్తుంది రవితేజ పాత్ర!

          2012 లో అక్షయ్ కుమార్- సోనాక్షీ సిన్హాలు నటించిన ‘జోకర్’ మూవీ కాన్సెప్ట్ తో, కుదరని మసాలా ట్రీట్ మెంట్ ఇచ్చి తయారుచేసిన స్క్రీన్ ప్లే ఇది. దీని వివరాల్లోకి తర్వాత వెళ్దాం. మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే తో జరిగేదేమంటే, చివరి అరగంట సమయంలోనే కథ ప్రారంభమై, అంటే మిడిల్ ప్రారంభమై, అంతలోనే చప్పున ఎండ్ కి వచ్చేస్తుంది- కొండంత రాగం తీసి గోరంత పాట పాడినట్టుగా. ఈ కింది చిత్ర పటం ఒకసారి జాగ్రత్తగా చూడండి :

          మొదటి బొమ్మలో 1, 2, 3 అనే వృత్తాలు బిగినింగ్, మిడిల్, ఎండ్ విభాగాల్ని సూచిస్తాయి. వీటి సైజుల్ని బట్టి స్క్రీన్ ప్లే లో వీటి పరిమాణం ఎంతుండాలో అర్ధంజేసుకోవచ్చు(1 : 2 : 1= బిగినింగ్ అరగంట- మిడిల్ గంట- ఎండ్ అరగంట). మధ్యలో మిడిల్ కేంద్రంలో MP అని గుర్తు వుంది. ఇది మిడ్ పాయింట్ లేదా ఇంటర్వెల్ ఘట్టం. ఇవి  ఆమోదనీయమైన, యూనివర్సల్ గా అనుసరిస్తున్న, వేటికవి విడివిడిగా వుండే కథా నిర్మాణ వృత్తాలు.

          రెండో బొమ్మ చూస్తే, బిగినింగ్ వృత్తం దీర్ఘ వర్తులాకారంగా సాగి మిడిల్ వృత్తాన్నిసగానికి కబ్జా చేస్తూ ఇంటర్వెల్ ఘట్టం వరకూ సాగింది.  ఇంటర్వెల్ తర్వాత మిడిల్ వృత్తం సగానికి తగ్గిపోయింది. ఎండ్ వృత్తం నిక్షేపంగా వుంది. బిగినింగ్ గ్రహణం పట్టిన మిడిల్ తో ఇది ఆమోదనీయ స్ట్రక్చర్ కాదు. దీన్ని ఫస్టాఫ్- సెకండాఫ్ ( తరహా) స్క్రీన్ ప్లే అందాం. అయితే ఈ ‘ఫస్టాఫ్ సెకండాఫ్’ స్క్రిప్ట్ లకి అలవాటు పడిపోయిన వాళ్ళు దీంతోనే సినిమాని ( స్క్రీన్ ప్లే ని) నిలబెట్టేందుకు అష్టకష్టాలూ పడుతూంటారు. అంత అవసరమా? శాస్త్రం ఒప్పుకోకపోతే పోనీ, యాభై అరవై ఏళ్ళనాటి ‘పాండురంగ మహాత్మ్యం’, ‘దేవదాసు’ వంటి సినిమాల స్ట్రక్చర్ ని పరిశీలించినా తాము చేస్తున్నది తప్పని తెలిసిపోతుందే?

          ఇక మూడో బొమ్మలో చూస్తే(ఇదే ‘కిక్- 2’ స్క్రీన్ ప్లే), బిగినింగ్ వృత్తం ఇంకా విస్తరించి, ఇంటర్వెల్ తర్వాత కూడా మిడిల్ కి మిగిలిన ఆ సగం వృత్తాన్ని కూడా సగానికి మింగేసింది. దీంతో ఇంత గ్రహణం పట్టిన మిడిల్ వెళ్లి విధిలేక, ఎండ్ వృత్తాన్ని ఆక్రమించింది. ఎండ్ కుంచించుకు పోయింది. ఇలా బిగినింగ్ మిడిల్ ని సగానికి పైగా మింగితే, ఆ పావు వంతు మిడిల్,  ఎండ్ సగాన్నీ మింగడాన్నే మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే అంటారు. బిగినింగే ముప్పావు వంతు కబ్జా చేసి, పావు వంతు మిడిల్, ఇంకో పావు వంతు ఎండ్ పంచుకోవడం. ఇదో కాశ్మీర్ సమస్య లాంటిది. ఈ బిగినింగ్ దురాక్రమణల నుంచి రిలీఫనేదే  లేదు తెలుగు సినిమాలకి. ఇందుకే స్టీవెన్ స్పీల్ బెర్గ్ కూడా అన్నాడు- People have forgotten how to tell a story. Stories don't have a middle or an end any more. They usually have a beginning that never stops beginning- అని.     
 
          మిడిలే
  వుండదు, వున్నా ఎక్కడో క్లయిమాక్స్ లో కలిసిపోయి పిసరంత వుంటుంది. ఇలా వున్నాకా ఇంకా చెప్పుకోవడానికి కథేం వుంటుంది. కథంటే మిడిలే కదా?  2000 లో ‘చిత్రం’, ‘నువ్వేకావాలి’ అనే కొత్త ట్రెండ్ ని సృష్టించిన యూత్ సినిమాలతో, దాదాపు మూడేళ్ళ వరకూ విచ్చలవిడిగా వచ్చిపడ్డ యూత్  సినిమాలన్నీ, ఇష్టారాజ్య మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే లే అనీ, అవన్నీ అట్టర్ ఫ్లాపయ్యాయనీ అప్పట్నించీ హెచ్చరిస్తున్నా, ఇప్పటికి  2015 లోనూ ‘కిక్-2’  కూడా అలాగే రావడం ఆశ్చర్యకరం.

***
     ఇంకో వింత కూడా వుంది- శాండ్విచ్ స్క్రీన్ ప్లే!
          ఈ సినిమాలో కథ ఎప్పుడు ప్రారంభమయ్యింది? పూర్తి సినిమాలో రెండు గంటల సమయం తీసుకున్నాక !  అప్పటివరకూ తెగసాగిన బిగినింగ్ విభాగంలో జరగాల్సిన రెండు కార్యాలు గంటా నలభై ఐదు నిమిషాలకి జరగడం మొదలయ్యాయి- ఏమిటవి? ఇంతసేపూ పాత్రల పరిచయం, కథా నేపధ్యం ఏర్పాటు అనే రెండు బిగినింగ్ బిజినెస్సులే చూశాం. సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన అనే మూడో బిజినెస్ ఇప్పుడిప్పుడే ప్రారంభమయ్యింది- తిరునాళ్ళలో విలన్ తమ్ముణ్ణి హీరో కొట్టడమనే దృశ్యంతో.

          ఇది విలన్ కి తెలిసి అప్పుడు సమస్య- నాల్గో బిజినెస్  ఏర్పాటయింది. అంటే చివరి అరగంటకి కథ మొదలయ్యింది. ఇక విలన్ తో హీరోకి సంఘర్షణ మొదలై మిడిల్లో పడింది. కానీ..కానీ..యాక్చువల్ గా మిడిల్ ఇప్పుడు కాదు, ఫస్టాఫ్ లోనే ప్రారంభమయ్యింది! దీన్ని గమనించలేదు రచయిత. ఫస్టాఫ్ లో ఇంటర్వెల్ కి ముందు ఎప్పుడైతే హీరో ల్యాండ్ పని పూర్తయి అమెరికా బయల్దేరుతున్నాడో- అప్పుడు హీరోయిన్ పాత్ర లక్ష్యం రివీల్ అయినప్పుడే మిడిల్లో పడింది  కథ!  అయినా దీన్ని పట్టించుకోకుండా మళ్ళీ బిగినింగ్ బిజినెస్సులు ప్రారంభించడంతో గందరగోళంగా మారిపోయింది కథ.

          అంటే ఫస్టాఫ్ లోనే బిగినింగ్ ముగిసి, మిడిల్ ప్రారంభమైనా మళ్ళీ బిగినింగ్ బిజినెస్సే కొనసాగిందన్న మాట.  అంటే బిగినింగ్  మధ్యలో మిడిల్ ముక్క ఇరుక్కుందన్న మాట. ఈ వింత మొన్నే ‘బ్రదర్స్’ అనే హిందీ సినిమాలో చూశాం.  ఇప్పుడు ‘కిక్ -2’ లోనూ చూస్తున్నాం. ఇందుకే దీనికి  శాండ్ విచ్ స్క్రీన్ ప్లే అని కొత్తగా పేరు పెట్టుకోవాలేమో. ఇలా ఎందుకు జరుగుతుందంటే, ఏవో నాలుగు సినిమాల్లో చూసిన నమ్మకాలతో సొంత నాలెడ్జి ఏర్పర్చుకోవడం వల్లే.

          కెమెరాకో శాస్త్రముంటుంది, ఎడిటింగ్ కీ ఓ శాస్త్రముంటుంది, ఆఖరికి మేకప్ కీ ఓ శాస్త్రముంటుంది- కానీ అదేమిటో గానీ రాసే కథకీ ఓ శాస్త్ర ముంటుందంటే, అలా అన్న వాణ్ణి గ్రహాంతరవాసిలా చూస్తారు- ఆ రాసుకుంటున్న వాటితో ఏడాదికి తొంభై శాతం అట్టర్ ఫ్లాపులే తీస్తున్నా కూడా! వెయ్యి స్క్రిప్టులు చదివితే గానీ తత్త్వం( స్ట్రక్చర్) బోధపడలేదు సిడ్ ఫీల్డ్ కే!

          ఇప్పుడు ఇలా పాసివ్ పాత్ర- మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే- శాండ్ విచ్ స్క్రీన్ ప్లే ఇవన్నీ ఉన్నాయన్న మాట ఈ 40 కోట్ల సినిమాలో.
                                                          ***
          ఇప్పుడొక సారి ఎంత సాఫీగా వుందో ఫస్టాఫ్ ని చూద్దాం : కంఫర్ట్ ని డిమాండ్ చేసే హైపర్ యాక్టివ్ హీరో ల్యాండ్ పని మీద వచ్చాడు. హీరోయిన్ కి టచ్ అయ్యాడు. ప్రేమిస్తున్నా నంటున్న హీరోయిన్ కి తనొక కౌంటర్ ఇచ్చాడు. ప్రేమిస్తే ప్రేమించుకో, నేను ప్రేమించక పోతే మాత్రం హర్ట్ అవద్దు అనేసి. ఆమె డిసప్పాయింటవకుండా దీనికో సిల్వర్ లైనింగ్ కూడా ఇచ్చాడు-  తిరిగి యూఎస్ కి వెళ్లి పోయేలోగా తనకి కూడా ప్రేమ పుడితే ఏమో అని. ఈ ఆశాభావంతో హీరోయిన్ ప్రారంభించే ఔటింగ్స్ ఎపిసోడ్లు, ప్రేక్షకుల్లో బాయ్స్ నుంచి విపరీతమైన కేరింతల్ని సృష్టించాయి. హీరో కౌంటర్ వెనకాల అసలు ఉద్దేశం- మనం ప్రేమిస్తున్నట్టు చెప్పుకుంటే మన వెంట పడి మన జేబులు గుల్ల చేస్తారు అమ్మాయిలు  - వాళ్ళే  ప్రేమిస్తూంటే వాళ్ళే  గుల్ల చేసుకుంటారని.  ఈ క్యాచీ ఫ్రేజ్ కి అయస్కాంతంలా అతుక్కుపోయి బాగా ఎంజాయ్ చేశారు బాయ్స్ హీరోయిన్ పర్సు గుల్ల చేసుకునే సీన్స్ అన్నిటినీ.

          ఇదలా వుంటే, అద్దెకున్న ఇంట్లో కంఫర్ట్ కోసం బ్రహ్మానందాన్ని రాచిరంపాన పెడుతున్నాడు కమిటెడ్ హీరో. తట్టుకోలేక తనే అద్దెకి ఉంటాను పొమ్మని తన రెండిళ్ళూ హీరోకి రాసిపారేశాడు  బ్రహ్మానందం. వాటిని అమ్మేసుకున్నాడు హీరో. దీంతో ఠారెత్తిపోయిన బ్రహ్మానందం  గుట్టు అప్పుడు బయట పడుతుంది. హీరో ల్యాండ్ కబ్జా అవడానికి కుట్ర చేసి ఈ రెండిళ్ళూ సంపాదించుకున్న వాడు తను అని. ఈ ఎండ్ సస్పెన్సు తో వున్న ఎపిసోడ్ బాగా పేలింది. ఒట్టి కాలక్షేప కథనంగా సాగుతున్నది కాస్తా, హీరో వచ్చిన పనితోనే ముడిపడివున్న ఎపిసోడ్ గా రివీలై థ్రిల్ చేస్తుంది.

          అలాగే ఆశీష్ విద్యార్ధి తో హీరో ఎపిసోడ్ కూడా.  ఇక్కడ కబ్జాదారు ఇతనే అని మనకి తెలుసు. కనుక దీనికి ఎండ్ సస్పెన్స్ కుదరదు. అలాగని సీన్ -టు - సీన్ సస్పెన్సుతో నడిపినా ఏం జరుగుతోందో మనకి తెలిసిపోతుంది. ఈ  రెండూ కాక, హీరో పోసాని పాత్రని ఇరికించి ఇంకేదో కామెడీ చేస్తూంటే, అదంతా ఆశీష్ మెడకి చుట్టుకోవడానికే అని కొసమెరుపుతో ఎండ్ అవుతుంది.

            ఒకే కథగా సినిమా మొత్తానికీ ఎండ్ సస్పెన్స్ కథనం చేసినా, కొసమెరుపు కథనం చేసినా వర్కౌట్ కాదు. ఇలాటి చిన్న చిన్న ఎపిసోడ్లకి ఎలా పవర్ఫుల్ గా వర్కౌట్ అవుతుందో ఇక్కడ చూస్తాం. సినిమా ప్రారంభంలోనే ఈ కథన చాతుర్యంతో ప్రామిజింగ్ గా కన్పిస్తారు దర్శకుడూ రచయితా.

          ఇంకా సమాంతరంగా సబ్ ప్లాట్ నడుస్తూంటుంది. బీహార్ లో ఆ గ్రామం మీద ఠాకూర్ ఆగడాలు, అక్కడి ప్రజలు ఒక రక్షకుడి కోసం చేసే ప్రయత్నాలూ సీన్లు గా నడుస్తోంటాయి. ఇక్కడే ఈ స్ట్రక్చర్ లో తెలుసుకోవాల్సిన ముఖ్యాంశం వుంది. సబ్ ప్లాట్ లో గ్రామస్తులకి విలన్ తో ఒక సమస్య వున్నప్పుడు,  దాంతోనే వెళ్లి హీరో పాత్ర కనెక్ట్ అవడం ఇక్కడ చూస్తాం.

          అంటే  ఈ బిగినింగ్ విభాగంలో హీరో, హీరోయిన్, విలన్ ముఖ్య పాత్రల్ని పరిచయం చేశారు (మొదటి బిజినెస్) . బీహార్ లో హీరో వెళ్లి అక్కడి విలన్ తో తలపడబోతున్నాడు గనుక అక్కడి పరిస్థితి నంతా చిత్రీకరించుకొచ్చారు ( రెండో బిజినెస్),  ఇక హీరోయిన్ ప్రేమ ట్రాకుతో  సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పనా చేసుకొచ్చారు (మూడో బిజినెస్), ల్యాండ్ పని పూర్తి చేసుకున్న హీరో ఇక తిరిగి యూస్ కి బయల్దేరుతున్నప్పుడు హీరోయిన్ మీద కలిగిన ప్రేమని గుర్తించి, ఆమె ఊరికి బయల్దేరడంతో, హీరో కథలో ప్రధాన సమస్య లోకి  ఎంటరై పోయినట్టయ్యింది( నాల్గో బిజినెస్) . ఇలా  బిగినింగ్ విభాగం సవ్యంగానే ఇక్కడ ముగిసింది.

          ‘శ్రీమంతుడు’ ఈ బిగినింగ్ అంతా కన్ఫ్యూజన్ వుంది. ‘శ్రీమంతుడు’ బిగినింగ్ లో సమాంతరంగా విలన్ - అక్కడి వూరి పరిస్థితుల ట్రాకు కూడా చూపించుకొస్తూ, హీరో కి ఎదురయ్యే సమస్య అతనే అన్నట్టుగా తెలియక మిస్ లీడ్ చేశారు. హీరోయిన్ తో ప్రేమలో వున్న హీరో ఆమె చెప్పిన మాటతో కళ్ళు తెరిచి స్వగ్రామానికి ప్రయాణం కట్టడం ప్రధాన కథ. బిగినింగ్ లో ఈ ప్రధాన కథకి చేర్చే కథనంలో విలన్ ట్రాకు రాకూడదు. వస్తే అదే ప్రధాన కథ అన్న భావం ఏర్పడుతుంది. ఈ గజిబిజి ‘కిక్ -2’ లో లేకపోవడం రిలీఫ్. కథనంలో ఈ జాగ్రత్త ఎలా పాటించాలో అనే దానికి తార్కాణం. ఇందులో కన్ఫ్యూజన్ లేకుండా సమాంతరంగా చూపిస్తున్న విలన్ ఆగడాల గురించే హీరోయిన్ హీరో ని ట్రాప్ చేయడంగా సాఫీగా చూపించారు.

          హీరోయిన్ పాత్రకూడా బిగినింగ్ చివర్లో రివీల్ అయ్యేవరకూ అదీ ఎండ్ సస్పెన్స్ పాత్రే అని మనం ఊహకందదు- - బ్రహ్మానందం పాత్ర లాగే.  ప్రేమిస్తున్నానని హీరో వెంటబడడం అంతా తన గోల్ కోసం ఆ హీరోని ట్రాప్ చేయడానికే అన్న ఇంకో  షేడ్ అప్పుడు బయల్పడుతుంది.

          కథనం లో ఇలాటి పొరలు ఉన్నప్పుడే అది కథ అన్పించుకుంటుంది. హీరో అమెరికా నుంచి వచ్చిన గోల్ పూర్తయ్యింది. హీరోయిన్ గోల్ మొదలయ్యింది. ఇదీ కథ.

          ఈ హీరోయిన్  గోల్ అప్పుడే హీరోకి తెలీదు. ఇక్కడేవచ్చింది చిక్కు. హీరోయిన్ మీద ప్రేమ పుట్టి- ఆమె కోసం గ్రామానికి వెళ్ళడంలో హీరో పాత్రకి ఎమోషన్ ఏర్పడింది. కానీ గోల్ ఏర్పడలేదు. హీరో కి వెంటనే  గోల్ ఏర్పడితే ఆ ఎమోషన్ కి యాక్షన్ తోడయ్యేది. అదే హైపర్ యాక్టివ్ పాత్రగా తానుండేవాడు. కథలో ఏర్పాటయ్యే గోల్ కి ఎమోషన్ యాక్షన్ తో బాటు, పరిణామాల హెచ్చరికా వుండాలి. అప్పుడే ఆ గోల్ పటిష్టంగా వుండి  క్లయిమాక్స్ కూడా బలంగా వస్తుంది.

          హీరోయిన్ కి ఇవి కరెక్టుగానే ఏర్పడ్డాయి-గోల్ ఆమెది కాబట్టి. ఎమోషన్- తండ్రి మరణం, యాక్షన్- ఆ తండ్రి మరణానికి కారకుడైన విలన్ ని చంపడం, పరిణామాల హెచ్చరికా- అసలిందు కోసం తను హీరో ని ఇక్కడికి డ్రై చేసిందని బయటపడితే, తన ప్రేమనే అతను అపార్ధం చేసుకునే ప్రమాదం.
          గ్రామం కోసం గోల్ హీరోయిన్ కే వుంది. అది హీరోకి బదలాయిపు జరగాలంటే?

***
     ‘షోలే’ లో తోడుదొంగలైన హీరోలు డబ్బుకోసం గ్రామానికి గబ్బర్ పీడా వదిలించేందుకు సిద్ధపడతారు. దొంగలకి ఇంకా వేరే ఎమోషన్ అవసరం లేదు. డబ్బే ఎమోషన్. వాళ్ళు కిరాయి సైనికులు. కానీ రవితేజ పాత్రకి ఆ గ్రామ సమస్య పట్టించుకోవాలంటే ఏ ఎమోషన్ ఉండాలి? ప్రేమకోసం పుట్టిన ఎమోషన్ సరిపోతుందా? కంఫర్ట్ బాధితుడైన తనకి ఆ కంఫర్ట్ కోసం హీరోయిన్ దక్కితే చాలు. ఆ ఒక్క తన కంఫర్ట్ తప్ప ఇంకే వూరి సమస్యా పట్టించుకునే తరహా క్యారక్టర్ కాదు తను.

          రెండు- ‘షోలే’  లో హీరోల గోల్ కి డబ్బే కాకుండా ఇంకా మానవీయ ఎమోషన్ కల్పించడానికి- గబ్బర్ సింగ్ వచ్చి దాడి చేస్తున్నా ఎదురుగా వున్న తుపాకీని అందుకోకుండా, ఠాకూర్ బొమ్మలా నించుని చూడ్డం చిర్రెత్తించి నిలదీస్తారు. అప్పుడు తెలుస్తుంది- ఠాకూర్ కి అసలు రెండూ చేతులూ లేవని, గబ్బర్ నరికేశాడని. దొంగోళ్ళయిన హీరోల గోల్ కి ఇంతకన్నా బలమైన మానవీయ కోణం ఏముంటుంది?

          దురదృష్ట వశాత్తూ ఇలాటి మోటివ్స్ రవితేజ పాత్రకి కుదర్లేదు. ఎందుకు కుదర్లేదంటే, ఈ కాన్సెప్ట్ కి కుదరదు-అంతే. ఎందుకంటే, ఈ కాన్సెప్ట్ కి హిందీలో వచ్చిన ‘జోకర్’ తో అనేక విషయాల్లో పోలికలు కన్పిస్తాయి. దాన్ని  యధాతధంగా తీసుకోవడానికి రవితేజ హీరో పాత్ర అనుమతించదు.

        2012 లో అక్షయ్ కుమార్- సోనాక్షీ సిన్హా లతో శిరీష్ కుందర్ తీసిన ‘జోకర్’ అనే అర్ధం పర్ధం లేని సినిమాలో- ఒక గ్రామం వుంటుంది. అది దేశ విభజన  సమయంలో ఏ  దేశంలోనూ అడ్రసు లేక గల్లంతయ్యింది. మొత్తుకున్నా రికార్డుల్లో చేర్చరు అధికారులు. దీంతో ఈ గ్రామానికి ఓ ప్రజా ప్రతినిధి గానీ, ప్రభుత్వ సదుపాయాలు అందడం గానీ జరక్క అలా పడి వుంటే- కొంత కాలం తర్వాత,  ఒక మెంటలాస్పత్రి నుంచి ఆడామగా పిచ్చోళ్ళు గుంపుగా తప్పించుకొచ్చి ఇక్కడ తిష్ఠ వేస్తారు. అప్పట్నించీ ఇష్టమొచ్చినట్టు ప్రవర్తిస్తూంటారు. ఒకడు తాను  హిట్లర్ ననుకుంటాడు, ఇంకోడు రెండో ప్రపంచయుద్దం ఇంకా జరుగుతోందని ఆందోళన పెట్టుకుంటాడు, సంజయ్ మిశ్రా అయితే ఈ రాజ్యానికి తానే రాజునని ఫీలవుతూంటాడు ( ‘కిక్- 2’ లోనూ ఇదే  సంజయ్ మిశ్రా గ్రామ పెద్దగా వేషం కట్టి ఇలాటి కామెడీయే చేస్తూంటాడు).

          ఈ పిచ్సివాళ్ళ స్వర్గం ఇలా వుండగా, అమెరికాలో నాసా సైంటిస్టుగా ఉంటున్న అక్షయ్ కుమార్ ఈ సంజయ్ మిశ్రా కన్నకొడుకే. కొడుకు ఉనికిలోకి లేని గ్రామాన్ని పట్టించుకోవడం లేదని కినుక వహించిన సంజయ్ మిశ్రా, హీరోయిన్ తో కుమ్మక్కయి- తన ఆరోగ్యం చెడిందని మభ్య పెట్టి కొడుకుని తీసుకు రమ్మని కోరతాడు. ఇదీ విషయం. అలా హీరోయిన్ సోనాక్షీ సిన్హా అక్షయ్ ని మభ్య పెట్టి ఆ వూరికి తీసుకొస్తుంది. ఇక్కడ్నించీ మిగతా కథ.

ఇంకా వుంది..

 సికిందర్







          

         
           
         







Friday, August 21, 2015

నాటి సినిమా



ప్పుడు 2008 వ సంవత్సరం..
          పగబట్టి ఒకటే కుండపోతగా వర్షం.. ఆ కుండపోతని లెక్క చెయ్యకుండా అభిమానుల ఒకటే పరుగులు..ప్రముఖుల బారులు..అందరివీ విషణ్ణ వదనాలే. ..తీరని యమ శోకమే అందరి కళ్ళల్లో..కుండపోతకంటే కంటిపోత శివాలు!
         
ఇంకా అప్పుడు 1969 వ సంవత్సరం..
          తట్టుకోలేనంత  విషాదం..కొంగు నోట్లో కుక్కుకుని ఆడవాళ్ళ ఒకటే ఏడ్పులు.. కన్నీళ్ళతో తడిసి ముద్ద ముద్దయి అలాగే ఇళ్ళకి పరుగులు..మళ్ళీ మళ్ళీ అక్కడికే వచ్చి అవే ఏడ్పులు మళ్ళీ మళ్ళీ.. అవే కన్నీటి జలపాతాలు జడివానలా!

        ఎక్కడ శోభన్ బాబుతో కలిసి విషాదముంటుందో అక్కడ జనసముద్రం పెల్లుబుకుతుంది. శోభన్ బాబుతో విషాదం, అయస్కాంతమూ ఒకటే. జనం ఇనుప రజను.

          పై 2008 నాటి దృశ్యం ఆయన అంతిమ యాత్రా ఘట్టాన్ని ఆవిష్కరిస్తే, 1969 నాటి దృశ్యం ఆయన తొలి  సిల్వర్ జూబ్లీ ‘మనుషులు మారాలి’ చరిత్రకి సాక్ష్యం పలుకుతుంది.

          సత్యజిత్ రే శాంతి నికేతన్ వదిలేసి వెళ్ళిపోయారు. బయటి ప్రపంచంలో కొత్త కొత్త సంగతులు కుతూహలం రేపుతోంటే, పాశ్చాత్య సంగీత బాణీలు రారమ్మని పిలుస్తూంటే, ఇంకా ఆ రవీంద్రుడి శాంతి నికేతన్లో  బొమ్మలేసుకుంటూ కూర్చోవడం వ్యర్ధమనిపించి, సరాసరి సినిమా ప్రపంచాన్ని ఆలింగనం చేసుకున్నారు.

          శోభన్ బాబు శాంతి నికేతన్ కే తిరిగి వచ్చారు - తన సొంత శాంతి నికేతన్ కి. వయసు మీరాక సినిమాలేమిటని అన్పించి, ప్రాపంచిక రణగొణ ధ్వనులకి సుదూరంగా తనదైన శాంతి నికేతన్ ని ఏర్పాటు చేసుకుని అక్కడ విశ్రమించారు. కళాకారులు ఎప్పుడు ఎక్కడ ప్రశాంతతని కనుగొంటారో తెలీదు. ఒకరు నిష్క్రమించిన లాంటి వాతావరణం లోకే మరొకరు ప్రవేశిస్తారు. ఇది కాదు పాయింటు- పన్నెండేళ్ళూ ఎవరికీ కన్పించకుండా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన శోభన్, ఎక్కడో చెన్నైలో కన్నుమూస్తే, ఇక్కడ తెలుగు గడ్డ మీంచి తండోప తండాలుగా అభిమాన జనం ఇంకా తమ అందాల నటుణ్ణి గుర్తుపెట్టుకుని, గుండెలు బాదుకుంటూ ఆయన అంతిమయాత్రలో కలిసిసాగడం!  ఆ వర్ష బీభత్సంలో శోభన్ మహాప్రస్థానాన్నికనీవినీ ఎరుగని సంఘటన చెయ్యడం!


          2008- 1969 రెండూ అంతటి చరిత్రలే శోభన్ కి. శోభన్ తో విషాదం హిట్టవుతుందని మొట్టమొదటిసారిగా తెలిసింది ‘మనుషులు మారాలి’ తోనే. అంతటి  విషాదాన్ని సత్యజిత్ రే సైతం తీసి వుండరు. అభినేత్రి శారదతో కలిసి విషాదాన్ని పరాకాష్ఠకి చేర్చిన శోభన్ కిది మరో సంసార గొడవల సినిమా కాదు. సామాజిక రుగ్మతల సారాంశం. ఇవాళ్టికీ దీన్ని సీడీ వేసుకు చూడండి- సాఫ్ట్ వేర్ ఇంజనీర్ల ఆత్మహత్యలు ఎంత మతిమాలినవో తెలుస్తుంది.

           ఈ క్లాసిక్ చాలా కామన్ సెన్సు శ్రమైక జీవన సౌందర్యం గురించి చెప్తుంది. శోభన్- శారదల పాత్రలిందులో నేటి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ల లాంటి పాత్రలే. కాకపోతే ఆ రోజుల్లో పారిశ్రామిక వేత్తల పాలిట వరంగా యంత్రాలొచ్చేసి శోభన్- శారద పాత్రల జీవితాల్ని ఛిన్నాభిన్నం చేసింది - ఇవాళ్ళ ఆర్ధిక మాంద్యమనే పెను భూతం సాఫ్ట్ వేర్ ఇంజనీర్ల పాలిట బెడదగా మారినట్టు.

          1957 లోనే ఇలాటి కథతో బీ ఆర్ చోప్రా హిందీలో నయా దౌర్ (కొత్త యుగం) తీశారు. దిలీప్ కుమార్ -వైజయంతీ మాలా ప్రధాన పాత్రలు. పనిచేస్తున్న రంపం మిల్లులో కొత్తగా యంత్రం తెచ్చి బిగించడంతో, ఉద్యోగాలు కోల్పోయిన కార్మికులు తిరగబడతారు ( హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ రోడ్లు ఊడ్చే స్వీపింగ్ యంత్రాలు ప్రవేశపెట్టినప్పుడు స్వీపర్లు చీపురు కట్టలతో పటపట కొట్టి వాటిని అడ్డుకున్నట్టు)  ‘మనుషులు మారాలి’ లో షుగర్ ఫ్యాక్టరీని కొత్త యంత్రాలతో ఆధునీకీకరీంచడంతో టోకున కార్మికులు రోడ్డున పడతారు. అంతమాత్రాన ఆత్మ హత్యలే శరణ్య మనుకోవాలని లేదు.  ప్రత్యాన్మాయ ఉపాధి మార్గాలని వెతుక్కోవచ్చు. దీనికి సహకరించాల్సిన బాధ్యత మళ్ళీ సమాజం మీదే వుంటుంది. ఇదే ‘మనుషులు మారాలి’ లో చెప్పదల్చుకున్నది. అలాగని  యంత్రంతో మనిషి పోరాటం గురించి ఈ సినిమా కాదు. యంత్రాల కారణంగా ఉపాధిని కోల్పోయిన ఆకలి బాధల గురించి అంతకన్నా కాదు. ఇలాటి అగ్నిపరీక్షలకి అలమటిస్తూ వచ్చి బంతిని సాటి మనుషుల కోర్టులో పడేస్తే, అప్పుడా సాటి మనుషులు ఏం చేశారనే దాని గురించే.

          ఈ పరిస్థితి సృష్టికర్త కన్నింగ్ పారిశ్రామికవేత్త పాత్ర వేసిన నాగభూషణమే. తన షుగర్ ఫ్యాక్టరీలో భాగస్వామిగా వున్న గుమ్మడిని నిండా ముంచి, ఆయన చావుకి కారకుడవుతారు మొదట. దీంతో వీధిన పడ్డ గుమ్మడి ఏకైక కుమార్తె శారద, కార్మికుడైన శోభన్ ని వివాహం చేసుకుని అలా స్థిమిత పడ్డారో లేదో, నాగభూషణం తన ఫ్యాక్టరీలోకి  కొత్త కొత్త యంత్రాలు దింపుతారు. దింపడమే గాక శోభన్ బాబు సహా రెండు వందల మంది కార్మికులని ఉద్యోగాల్లోంచి తీసేస్తారు. వీళ్ళందరికీ శోభన్ నాయకత్వం వహించి సమ్మెకి దిగుతారు. ఆ తదనంతర పరిణామాల్లో గూండాల చేతలో హత్యకి గురవుతారు.

       దీంతో మళ్ళీ వీధిన పడ్డ శారద, ఇప్పుడు తన ముగ్గురు పిల్లలతో నానా కష్టాలూ పడతారు. అయినా నిరాశచెందక- పిల్లల్ని పోషించుకోవాలి, మీ పిల్లలకి ట్యూషన్లు చెప్పుకునే అవకాశ మివ్వండంటే, ఆమె మాసికల చీరని చూసి హేళన చేస్తారు. పోనీ కూలీ పని ఇప్పించమని ఇంకో దగ్గర అడిగితే, చదువు కున్నదానివి మా నెత్తికే ఎక్కుతావు పొమ్మంటారు. ఇలా ఎక్కడా ఆదాయం పుట్టదు. ఆఖరికి ఇహ ఉంటున్న పూరి పాకనే అమ్మేద్దామంటే, బంధు వొకడు వచ్చి రంకు అంటగడతాడు. ఇలావుంటే, అటు ఆకలికి నకనకలాడుతున్న పిల్లలు, అమ్మని వదిలేసి బయట ఆహార పదార్ధాలని దొంగిలించి తింటూంటారు. ఇంట్లో వస్తువులు కూడా అమ్మేసుకోబోయి పోలీసులకి పట్టుబడతారు. చిట్టచివరికి పిల్లలు ముష్టెత్తు కోవడం చూసి చలించిపోతారు శారద. ఇహ లాభంలేదు, కనాకష్టమైపోయిన ఈ జీవితంతో అవిసిపోయాయి ప్రాణాలు- బక్క చిక్కి, బొగ్గులా నల్లబడి- దెయ్యంలా తయారయ్యింది తను. పిల్లలు పుచ్చిపోయారు. ఇవాళ్ళ ఇలా తయారైన వీళ్ళు- రేపింకేం చేస్తారో. లేదు- ఇంకోలా వీళ్ళు తయారవడానికి వీల్లేదు. అలా తయారవకూడదంటే...

          ‘యువరానర్..ముగ్గురు పిల్లల్ని చంపుకున్న హత్యానేరం రుజువయ్యింది గనుక ఈ ముద్దాయికి...’  చెప్పలేక పోతున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ కాంచనకి, బోనులో నిలబడ్డ స్నేహితురాల్ని చూస్తూంటే  కడుపు తరుక్కుపోయే బాధ. మరణ శిక్ష విధించమని తనే వేడుకుంటున్నారు శారద. పిల్లలకి విషమిచ్చి తనూ మింగింది కానీ, ఇంకా ప్రాణాలతో తను మిగిలిందిలా.. ఈ పాపానికి ఈమెని నెట్టిందెవరు? ఎక్కడున్నారు వాళ్ళు? వాళ్ళని వదిలేసి ఈమెకేమిటీ శిక్ష?.. అని కాంచన వాదన. న్యాయమూర్తి తీర్పు వాయిదా వేసి వెళ్ళిపోతాడు. ఈమెని శిక్షించి చట్టం తానూ పాపం మూట గట్టుకోకూడదనేమో. ఈమెని ఈ స్థితికి తీసుకొచ్చిన పాపుల సరసన చట్టం తానూ చేరకూడదనేమో.  కానీ ఈ చట్టాలకీ, సాటిమనుషుల నిర్వాకాలకీ, సర్వ భ్రష్టత్వాలకీ అతీతంగా ఒకే ఒక్కటుంది-  అది ఆ భర్త పిలుపు. దానికి మించింది లేదు. దాని ముందు ఈ లోకమెంత! లాలించని లోకులెంత! నమస్కారం పెట్టి, పైలోకాల్లోంచి పిలుస్తున్న ఆ శోభన్ దగ్గరికి వెళ్ళిపోతారు తనే శారద.

         మనుషుల్లో పరోపకార గుణం పెరిగితే ఇలాటి అఘాయిత్యాలు ఆగుతాయి. ఈ చరాచరా సృష్టిని ఎవరివో ఆక్రందనలు వినడానికి ఉద్దేశించలేదు సృష్టికర్త- ఆక్రందన కేవలం సొసైటీ మిస్ మేనేజ్ మెంట్ ఫలితమే!

          సహజత్వానికి దగ్గరగా తీసికెళ్ళిన విషాదభరిత సినిమా ఇది. అయితే మరీ ఆర్ట్ సినిమా లాంటి సహజత్వంతో కాక, కాస్త నాటకీయత, చలం- కెవి చలం- రమాప్రభలతో ఇంకాస్త హాస్యం, ‘తూరుపు సిందూరపు మందారపు వన్నెలలో’ , ‘ పాపాయి నవ్వాలి పండగే రావాలీ’ ..లాంటి స్వీట్ సాంగ్స్ తో, ఇంకా చురకత్తి లాంటి నాగభూషణం చెణుకులతో- ( ఈ దేశంలో నాయకులు ఉపన్యాసాలు, ప్రజలు ఉపవాసాలు పంచేసుకున్నారు),  ఇంకా ఇతర మసాలా దినుసులూ  దట్టించి, అన్ని వర్గాల ప్రేక్షకులూ బ్రహ్మ రధం పట్టేలా తీశారు. ఆ రోజుల్లో ఎక్కడ చూసినా ఖంగు మనే ఘంటసాల గొంతుతో ‘ చీకటిలో కారు చీకటిలో ‘ పాట ఒకటి మార్మోగిన చరిత్ర ఉండనే వుంది. స్వరబ్రహ్మ కెవి మహదేవన్ కి సైతం ఈ సినిమా ఘన విజయంలో సింహ భాగముంది.

          దీని మాతృక మలయాళమే అయినా, పూర్తిగా తెలుగు స్థానికత అలరారింది విఖ్యాత వి. మధుసూదన రావు దర్శకత్వంలో. పైగా బ్లాక్ అండ్ వైట్ లో చాలా మంచి షాట్లు తీశారాయన. దీన్ని నిర్మించిన ఇదే జెమినీ సంస్థ, మధుసూదన రావుతోనే తెలుగు తర్వాత హిందీ లో ‘సమాజ్ కో బదల్ డాలో’ అని రీమేక్ చేస్తే, అదీ సంచలన విజయమే ఉత్తర భారతాన.

          సృజనాత్మకత విషయానికొస్తే, ఒక విశిష్ట శిల్పం ఈ స్క్రీన్ ప్లే కి కన్పిస్తుంది. కథ పాత్రల చేతులు మారుతూ పోతూంటుంది. అసలు ట్రాజడీల్లో కథే పాత్రల్ని నడిపిస్తుంది. ట్రాజడీల్లో పాత్రలు గొప్ప కాదు, అవి బలిపశువులు. అప్పుడే ట్రాజడీ. కాబట్టి ట్రాజడీల్ని పాత్రలు నడపవు. కథే  పాసివ్ పాత్రల్ని నడిపిస్తుంది. ‘దేవదాసు’ తీసుకున్నా, ‘శంకరాభరణం’  తీసుకున్నా ఇంతే. అలా ‘మనుషులు మారాలి’  గుమ్మడి ట్రాకుతో ప్రారంభమౌతుంది. తర్వాత శారద, ఆ తర్వాత శోభన్, ఇంకా తర్వాత తిరిగి శారద, ఆఖరికి పిల్లలూ.. ఇలా అధ్యాయాల వారీగా, ఏ అధ్యాయానికా అధ్యాయం విస్పష్ట  విభజన జరిగిన ట్రాకులతో నడుస్తుంది. ఇబ్బందిపడకుండా కథని ఫాలో అవడాన్ని సులభతరం చేసింది ఈ విధానం. కథలు చెప్పడం లో గ్రేట్ మాస్టర్లు ఆ కాలంలోనే వున్నారు.

     అయితే శారద పాత్ర తన మొదటి ట్రాకులో, అర్జెంటుగా ఎవరో ఒకరి ఆశ్రయం పొందాలన్న బేలతనంతో ప్రవర్తించడమే అసహజంగా తోస్తుంది. ఆ క్లిష్ట సమయంలో ఆమె ప్రదర్శించే బేలతనం కన్నా-  కాంచన పాత్ర మనోబలం, వ్యక్తిత్వం ఆకర్షణీయంగా వుంటాయి. పెళ్లి కాకుండా మిగిలిపోయిన తను -‘ నేను పెద్ద ప్లీడర్ని, నన్ను పెళ్లి చేసుకోవాలని సామాన్యులకి అన్పించదు. తోటి వాళ్లకి నా ఉద్యోగం, హోదా తప్ప నేను స్త్రీగా కన్పించను. నాకు కూడా స్త్రీ సహజమైన కోరికలుంటాయని ఈ లోకమే కాదు, నా కన్న తండ్రి కూడా మర్చిపోయాడు..’  అని ఒక్కసారే వెళ్ళ బోసుకుంటారు కాంచన. కానీ అంత ఆప్తమిత్రురాలైన శారదకి, తను తలచుకుంటే మంచి ఉద్యోగమే ఇప్పించగలరు. ఆ పని చేయకుండా, చిన్న చిన్న అవసరాలు తీర్చడానికి వచ్చి తిరస్కారం పొందుతూ వుంటారు.

           ‘ఉగ్గు పెట్టడానికి ఆముదమే లేనప్పుడు బంగారు ఉగ్గు గిన్నెందుకు చెప్పు?’  అన్నది శారద పాయింటు. తిండికి లేని స్థితిలో కూడా శారద పాత్ర సామాజిక దృక్పథం ఎలాంటిదంటే- ‘ఈ కూలి పేటలో ఎక్కడా పొయ్యి రాజెయ్య లేదు, పొగ లేవలేదు, ఇప్పుడు మా ఇంట్లో మాత్రం, పొయ్యి రాజేస్తే, చూసే వాళ్లకి ఎలా వుంటుంది? తోటి వాళ్ళ కడుపులు మాడుతోంటే మా కడుపులు నింపుకోవడం బావుంటుందా?’ అని కాంచన ఇవ్వబోయిన రూపాయల్ని తిరస్కరిస్తారు.

వి. మధుసూదన రావు 

          సెకండాఫ్ లో, చనిపోయే శోభన్ పాత్ర హేండాఫ్ పాత్రలా వుంటుంది. అంటే, కథలో తను చేయాల్సిన కార్యం ముగించుకుని, ఆ రెపరెపలాడే కథ అనే పతాకాన్ని, రెండో ముఖ్య పాత్రకి అప్పగించి  తను నిష్క్రమించడ మన్నమాట. ఇలా శోబన్ నించి ఆ పతాకాన్ని అందుకున్న శారద,  దాంతో ముగింపు దిశగా సాగిపోతారు. ‘రాబోయే కష్టాలకి భయపడి రావాల్సిన హక్కుల్ని వదులుకోవడం పిరికితనం’ అని శోభన్ సిద్ధాంతంసమ్మె చేస్తారు, వాళ్ళు లాకౌట్ ప్రకటిస్తే నిరాహార దీక్ష చేస్తారు, ప్రభుత్వమే తిరిగి ఫ్యాక్టరీ తెరిపిస్తూంటే, నిస్సహాయుడై పోతారు. లంచం ఎరజూపితే తిప్పికొడతారు. ఓ రాత్రి యాజమాన్యం పంపిన గూండాల చేతిలో హతమైపోతారు.

          ఒక్క యంత్రాలు తెచ్చి పెట్టుకుని నాగభూషణం సృష్టించిన పరిస్థితి ఇది. యంత్రాలు మంచివే, వాటితో యాజమాన్యాల వైఖరే ప్రశ్నార్ధకమవుతోంది. మహాభారతంలో దుర్యోధనుడు, కర్ణుడు, యుధిష్టరుడు, ధృతరాష్ట్రుడు, అశ్వత్థామ లాంటి వాళ్ళందరూ కలిసే, వాల్ స్ట్రీట్ ని కుప్ప కూల్చి, పెట్టుబడిదారీ వ్యవస్థని నేలకు దించారని - ఆర్ధిక నిపుణుడు, కాలమిస్టు గురుచరణ్ దాస్ తాజాగా ఆర్టికల్ రాశారు. ఈ సినిమాలో కూడా నాగభూషణం దుర్యోధనుడైతే, రావికొండలరావు యుధిష్టరుడు, హరనాథ్ కర్ణుడు లాంటి వాళ్ళే. ఈ ముగ్గురి నిర్వాకమే కార్మికుల ప్రాణాల మీదికి తెచ్చింది- ఏ నాటికైనా ఈ సినిమా ఓ హెచ్చరిక, కనువిప్పు.



సికిందర్ 
(సెప్టెంబర్ 2009, సాక్షి- ‘ఆ ఒక్క సినిమా’ శీర్షిక)