రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

17, సెప్టెంబర్ 2020, గురువారం

977 : సందేహాలు - సమాధానాలు


 

        Q : నా పేరు  వి.డి., అసోసియేట్.  థ్రిల్లర్ కథల్లో ప్రధాన పాత్ర తనే అన్ని విషయాలు తెలుసుకొని ప్రేక్షకులకు రివీల్ చేస్తే అది ఆక్టివ్ పాత్ర అన్నారు. అయితే మొన్న వచ్చిన వి సినిమాలో కూడా హీరో పాత్ర ముందు వేరే పాత్ర కూర్చుని జరిగిన కథ అంతా చెపుతుంది. ప్రతిసారి ఇలాంటి కథల్లో ఇదే పొరపాటు జరుగుతోంది. దీన్ని తప్పించుకుని హీరోనే అన్ని విషయాలు చెప్పాల్సిన విధంగా కథను ఎలా రాసుకోవాలి?

           
A :  ముందుగా జానర్ స్పష్టత తెచ్చుకుందాం. వి థ్రిల్లర్ కాదు, సస్పెన్స్ థ్రిల్లర్ కాదు, క్రైమ్ థ్రిల్లర్ జానర్. అంటే ఇన్వెస్టిగేషన్ ఆధారిత కథ. ఒక పెద్ద స్టార్ తో వేలిముద్రలు, డీఎన్ఏ, రక్తపు జాడల వంటివి పోగేసుకుని విశ్లేషించుకునే సోకాల్డ్ ఇన్వెస్టిగేషన్ ఆధారిత కథ ఈ రోజుల్లో వర్కౌటవుతుందా? అవి చిన్న హీరోల పాదరక్షలు. లేదా టీవీ సీరియల్స్ సరుకు. పెద్ద స్టార్స్ కి క్రైమ్ థ్రిల్లర్ జానర్లో యాక్షన్ సబ్ జానర్ కథ అవసరం. క్యాచ్ మీ ఇఫ్యూ కెన్ స్టీవెన్ స్పీల్ బెర్గ్ సినిమాలాగా. ఇందులో క్రిమినల్ గా బిగ్ స్టార్ లియోనార్డో డీ కాప్రియో, ఇతణ్ణి పట్టుకునే ఎఫ్బీఐ అధికారిగా ఇంకో బిగ్ స్టార్ టామ్ హాంక్స్ నటించారు. ఇది పరారీలో వుంటున్న క్రిమినల్ హీరోని క్లూస్ ఆధారంగా పట్టుకునే చిన్న రేంజి కథ కాదు. యాక్షన్ ద్వారా పట్టుకునే బిగ్ యాక్షన్ కథ. అంటే హై కాన్సెప్ట్ క్రైమ్ - యాక్షన్ థ్రిల్లర్. ఈ కథ కూడా క్రిమినల్ ని పట్టుకోవడం గురించిన పొడిపొడి కథ కాదు. బ్యాక్ డ్రాప్ లో విచ్ఛిన్న కుటుంబం, దుర్భర బాల్యం గురించిన బాధాకర కథ. ఇలాటి కథ తీయాలని స్పెర్గ్ బెర్గ్ కల.

        ఎఫ్బీఐ అధికారి కూడా క్లూస్ తో ఇన్వెస్టిగేషన్ చేయడు. స్థూలంగా లీడ్స్ తోనే పట్టుకునే యాక్షన్లో వుంటాడు. అంటే క్రిమినల్ ఫలానా చోట వున్నాడని తెలుసుకుని వెళ్ళి పట్టుకోబోతే ఎత్తుకు పై ఎత్తు వేసి క్రిమినల్ పారిపోతూంటాడు. ఇదీ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్లో వుండే కథనం.

        ఇక
వి లో నాని ఫ్లాష్ బ్యాక్ ఇంకో పాత్ర ద్వారా సుధీర్ బాబు వింటూ కూర్చోవడం జానర్ మర్యాద కాదు, అక్రమంగా చొరబడిన ఫ్యాక్షన్ సినిమాల టెంప్లెట్. ఫ్యాక్షన్ సినిమాల్లో హీరో ఫ్లాష్ బ్యాక్ సెకండాఫ్ లో ఇంకో పాత్ర చెప్పడం మొదలెట్టినట్టు. అట్టు వేస్తే అట్టే వేస్తారు, అట్టులో రొట్టె కలపడం వంట మర్యాద కాదు. అలాటి అట్టు రొట్టె గిరగిరా తిరుగుతూ వెళ్ళి పొయ్యిలోనే పడుతుంది. కాబట్టి దర్యాప్తు అధికారి సాక్షుల ద్వారానో, ఇంటరాగేషన్లోనో విడతలు విడతలుగా సమాచారం రాబట్టు కోవడం ఇన్వెస్టిగేషన్ జానర్ మర్యాదల కథనం. వి ని దర్శకుడి పాయింటాఫ్ వ్యూలో కథగా చెప్తున్నప్పుడు, నాని ఫ్లాష్ బ్యాక్ ని ఒకానొక విషమ ఘట్టంలో నానియే స్వయంగా తల్చుకునే
జ్ఞాపకంగా వుండి వుంటే ప్రథమ పురుషలో బాగా కనెక్ట్ అయ్యేది. అసలు వి ని హైకాన్సెప్ట్ క్రైమ్ - యాక్షన్ థ్రిల్లర్ గా తీసి వుండాలని ఇదివరకే చెప్పుకున్నాం.


          ఇక హీరోనే అన్ని విషయాలు చెప్పాల్సిన విధంగా కథను ఎలా రాసుకోవాలి? - అంటే, ముందు కథలు అడ్డగోలుగా రాసుకునే అలవాటుకి దూరమవాలి. ముందు తట్టిన ఐడియా జానరేమిటో స్పష్టత తెచ్చుకోవాలి. అప్పుడు జానర్ని, ఐడియాలో విషయాన్నీ క్షుణ్ణంగా  రీసెర్చి చేసుకుని పట్టు సంపాదించాలి. అలా ఒక రూపమేర్పడిన ఐడియాని స్ట్రక్చర్లో కుదిరే వరకూ పాట్లు పడాలి. ఇదంతా ఎన్ని రోజులైనా పట్టొచ్చు. అప్పుడా స్ట్రక్చర్లో కుదిరిన ఐడియాని సినాప్సిస్ గా రాసుకోవాలి. ఇదికూడా ఎన్నిరోజులైనా పట్టొచ్చు. ఈ రోజులన్నీ  సినాప్సిస్ తో జీవించాలి. కథ విస్తృతిని, లోతుపాతుల్నీ, పాత్రల స్వరూప స్వభావాల్నీ బాగా అర్ధం జేసుకోవాలి. కథలో ఫీల్ కథతో రాదు. పాత్రలతో వస్తుంది. సినిమా బావుందని ప్రేక్షకులు అన్నారంటే పాత్రల్ని ఫీలవడం వల్ల అంటారు. కాబట్టి ఆ పాత్రల్ని బాగా ఫీలయ్యి రాసుకోవాలి. అప్పుడు మాత్రమే లైనార్డర్ లోకి వెళ్ళాలి. అంతే గానీ ఏదో అనేసుకుని, దారీ తెన్నూ తెలియకుండా లైనార్డర్ వేసెయ్యబోతే వచ్చేది కథ కాదు, కన్నీటి గాథ. 

        ఇక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ రాయడం గురించి. చిన్న హీరోలకైనా ఇవి రాయకపోవడం మంచిది. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ తీయడానికి ఇప్పుడెవరికీ అంత పరిజ్ఞానం లేదు. పైన చెప్పిన యాక్షన్ క్రైమ్ తీసుకుంటే సరిపోతుంది. ప్రేక్షకులు కూడా యాక్షన్ లో వుండే క్రైమ్ చూసేందుకు ఇష్టపడతారుగానీ
, తమ మేధస్సుకి ఎవరో పెట్టే అపరిపక్వ పరీక్షలకి బలి పశువులు కావాలనుకోరు.
  
Q : రెండవ ప్రశ్న. ప్రేమ కథల్లో రొమాంటిక్ కామెడీ, రొమాంటిక్ డ్రామా, ట్రియాంగిల్ లవ్ స్టోరీ లకు స్ట్రక్చర్ ఎలా వుంటుంది. వాటికి ప్లాట్ పాయింట్స్ ఏంటి? పాత్రలు ఆక్టివ్ లేక పాసివ్ పాత్రలుగా ఎలా వుంటాయి?? క్యారెక్టర్ ఆర్క్ ఎలా వుంటుంది అన్న విషయాల మీద పూర్తి వివరాలు చెప్పగలరు.
A :  పూర్తి వివరాలు చాలాసార్లు ఆర్టికల్స్ రూపంలో బ్లాగులో ఇచ్చాం.

సికిందర్