రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Sunday, December 23, 2018

717 : స్క్రీన్ ప్లే సంగతులు


         
            
        ‘భైరవ గీత’ లాంటి పెళ్లి తప్పించుకుని పారిపోయే హీరోహీరోయిన్ల యాక్షన్ కథతో తప్పకుండా సెకండాఫ్ లో సమస్యలొస్తాయి. యాక్షన్ కామెడీ అయితే  విలన్లతో  ఏదో కామెడీలు చేసుకుంటూ ఎంటర్ టైనర్ గా మల్చవచ్చు. సీరియస్ యాక్షన్ కథల్లో దాడులు ప్రతి దాడులే ఆక్రమిస్తాయి. ఫైట్ మాస్టర్స్ ప్రతిభకి ఇవి అద్దం పట్టవచ్చు తప్ప, కథాపరంగా నిలువుటద్దాలేమీ వుండవు. తప్పకుండా ఇంటర్వెల్ అనే జంక్షన్ యాక్షన్ సినిమాలకి పరీక్షా కేంద్రమై ఎదురవుతుంది. ఇక్కడ నించుని సెకండాఫ్ లోకి చూస్తూంటే దట్టమైన అడవిలా కన్పిస్తుంది. ఈ అడవిలో సరైన దారి కనుక్కుని సాగక పోతే దారితప్పి అడవిలో తిరగడమే అవుతుంది. అందుకని ఈ జంక్షన్ లో ఒక గైడ్ పోస్టు వుంటుంది. ఇది ఒకే డైరెక్షన్ చూపిస్తుంది : సబ్ ప్లాట్ వెంట వెళ్ళిపోవడం. సబ్ ప్లాట్ అంటే ఉపకథ. ఒక ఉపకథని పెట్టుకుని దాన్ని ముగించుకుని, ప్రధాన కథకి వెళ్లిపోవడం. యాక్షన్ కథకి దారెటూ అని ఇక్కడ నించుని చూడకూడదు. సబ్ ప్లాట్ ఏమిటా అని ఆలోచించాలి. ప్రతీ యాక్షన్ కథకీ సెకెండ్ యాక్ట్ స్లంప్ అనే మాంద్యం ఎదురవుతుంది. సెకెండ్  యాక్ట్ అంటే ఇంటర్వెల్ ముందు వుండే మిడిల్ -1, ఇంటర్వెల్ తర్వాత వచ్చే మిడిల్ - 2 విభాగాలు కలిపి. ఈ రెండిట్లో స్లంప్ ఏర్పడుతుంది యాక్షన్ కథలకి. అందుకని మిడిల్ -1 లోనే ఉప కథ ప్రారంభించాలి, దాన్ని మిడిల్ -2 లో ముగించాలి. ఈ కవరింగ్ వల్ల యాక్షన్ మూవీ ఫ్లాట్ గా అన్పించదు. ఐతే రెండు ఆస్కార్ల రచయిత విలియం గోల్డ్ మాన్ పూర్వం ఒక ఉపకథతో లోటు తీరిస్తే, ఇప్పుడు ఇప్పటి కాలానికి నాల్గు ఉపకథలతో గొయ్యిని పూడ్చి, యాక్షన్ స్క్రీన్ ప్లే నిర్వచనాన్నే మార్చేశాడు రచయిత రిచర్డ్ వెంక్. ఇదెలాగో తర్వాత చూద్దాం. ముందు ‘భైరవ గీత’ సెకండాఫ్ లో కెళ్దాం...

* ఒక మాజీ బానిస ఇంట్లో ఆశ్రయం పొందుతారు భైరవ, గీత.
* ప్రేమ గురించి టాపిక్ వస్తే గీతని ముందే ప్రేమించానంటాడు భైరవ. కులం కాదని తగ్గి వున్నానంటాడు. భైరవ ప్రేమని కన్ఫం చేసుకున్న గీతకి ఆనందం.
* డ్యూయెట్.
* భైరవ తల్లిని కూడా ఇక్కడికి తెచ్చుకుంటే క్షేమం కదా అని మాజీ బానిస అంటే, వూళ్ళో ముఠా తిరుగుతోందనీ, ఆమె అక్కడ ఇంట్లోనే వుంటే క్షేమమనీ అంటాడు భైరవ.
* సుబ్బారెడ్డి భైరవ ఆచూకీ చెప్పని భైరవ తోటి బానిసని చంపించేస్తాడు.
* భైరవ తండ్రిని సుబ్బారెడ్డియే చంపించాడని మాజీ బానిస ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు.
* సుబ్బారెడ్డి, కట్టారెడ్డిలు భైరవ ఆచూకీ కోసం భైరవ ఇంటికొచ్చి తల్లిని చంపేస్తారు.
* తల్లి శవం ముందు భైరవ ఏడుస్తాడు.
* దహన సంస్కారం – పాట.
* బానిసలందరూ భైరవకి మద్దతుగా వస్తారు. ఇప్పుడు నొప్పి తెలిసిందని, తిరగబడతాననీ భైరవ ప్రతిజ్ఞ చేస్తాడు.
* బానిసలతో వందేమాతరం తిరుగుబాటు పాట.
* బానిసల నాయకుడుగా సుబ్బారెడ్డి ఇంటి మీదికిపోయి దొరతనం మానెయ్యాలని వార్నింగ్ ఇస్తాడు భైరవ.
* కట్టారెడ్డి వూరి మీద దాడి కొస్తే ఇళ్ళల్లో ఎవరూ వుండరు. ఒకరొకరే చాటునుంచి వచ్చి భైరవకి మద్దతుగా గుంపు కడతారు. కట్టారెడ్డి గ్యాంగ్ ని తరిమి కొడతారు.
* చెరువు దగ్గర గీత మీద దాడి.  
* సుబ్బారెడ్డి మాజీ బానిసని చంపి కాడెకి కట్టి పంపిస్తాడు.
* గీతని కిడ్నాప్ చేసి తీసికెళ్ళి పోతారు.
 * కిడ్నాప్ చేసి హింసిస్తున్న తండ్రి సుబ్బారెడ్డిని చంపేస్తుంది గీత.
* క్లయిమాక్స్ పోరాటాలు, కట్టారెడ్డిని భైరవ చంపేయడం.
***
మిడిలడవిలో...
      ఇదీ స్థూలంగా సెకండాఫ్ ఆర్డర్. ఇందులో తల్లిని చంపడం వరకూ మిడిల్ – 2 విభాగం. తల్లిని చంపడంతో ప్లాట్ పాయింట్ - 2 ఏర్పడి ఎండ్ విభాగం మొదలయ్యింది. ఈ రెండిట్లో కథనాలకి ప్రధాన కథయిన ప్రేమకథతో ఏమీ సంబంధం కన్పించడం లేదు. సుబ్బారెడ్డి భైరవతో కూతురికి ప్రేమ కుదరకుండా భైరవ ని ఫినిష్ చేయాలనుకుంటున్నాడు. కథకుడు కూడా ఈ ప్రేమకథ బానిసల కథకి అడ్డొస్తోందని ఫినిష్ చేయాలనుకున్నట్టు వుంది. కథకుడు ప్రేమకథకి కనిపించని విలన్ లా అన్పిస్తున్నాడు. 

          ప్లాట్ పాయింట్ -1 కీ, ప్లాట్ పాయింట్ -2 కీ  పరస్పర సంబంధం ఏమీ కన్పించడం లేదు. ఫస్టాఫ్ ప్లాట్ పాయింట్ - 1 లో ప్రేమ సమస్యతో ప్రారంభమైన మిడిల్ -1 కథనం, సెకండాఫ్ లో ప్లాట్ పాయింట్ -2 దగ్గర తల్లిని చంపడంతోనే ఆ ప్రేమసమస్యకి పరిష్కార మన్నట్టు సాగింది మిడిల్ -2 కథనం. 

          ఇలా వుండకూడదని కథకుడికి తెలిసే వుంటుంది. బానిసల ఉపకథ అతికించడానికే ప్లాట్ పాయింట్ - 2 దగ్గర తల్లిని చంపించి నట్టుంది. ‘అంతరిక్షం’ లో రెండో ఉపగ్రహం కథ ప్లాట్ పాయింట్ -2 దగ్గర అతికించినట్టూ. కొత్తగా ప్లాట్ పాయింట్ - 2 లు ఇక అతుకుడు కార్యక్రమాలకి సత్రాలుగా మారినట్టు తెలుస్తోంది. 

          బానిసల ఉపకథ ఎక్కడో ప్లాట్ పాయింట్ -2 లో ప్రారంభమైంది కదాని స్క్రీన్ ప్లే ప్రాబ్లంని తేలికగా తీసుకోవడానికి లేదు. ప్లాట్ పాయింట్ -2 దగ్గరే బానిసల ఉపకథ ప్రారంభమైనా, అందుకు సన్నాహాలు సెకండాఫ్ ప్రారంభం నుంచే జరుగుతున్నట్టు గమనించాలి. సెకండాఫ్ కొద్ది సేపటికే ప్రధాన కథయిన ప్రేమకథ క్షీణిస్తూ వచ్చింది. 

          పై ఆర్డర్ లో సెకండాఫ్ ప్రారంభంలో మాజీ బానిస ఇంట్లో ఆశ్రయం పొందడం బానిసల ఉపకథకి సన్నాహమే. తర్వాత భైరవ, గీతల ప్రేమ సంభాషణ, డ్యూయెట్. ఇంతే, దీని పైన ప్రేమకథ లేదు. ప్రేమకథకి పరిష్కారంగా యాక్షన్ కథా లేదు. ప్రేమకథలో ప్రేమ సమస్యకి పరిష్కారంగా వుండాల్సిన ప్లాట్ పాయింట్ - 2, అక్కడ్నించీ దాని ముగింపూ తెగిపోయాయి. బానిసల ఉపకథకి  ప్రారంభం, దాని ముగింపూ వచ్చి కలిశాయి. 

          డ్యూయెట్ తర్వాత తల్లిని కూడా ఇక్కడికి తెచ్చుకుంటే క్షేమం కదా అని మాజీ బానిస అనడం, దీనికి వూళ్ళో ముఠా తిరుగుతోందనీ, ఆమె అక్కడ ఇంట్లోనే వుంటే క్షేమమనీ భైరవ అనడం ప్లాట్ పాయింట్ - 2 లో తల్లిని చంపడానికి సన్నాహమే. సుబ్బారెడ్డి భైరవ ఆచూకీ చెప్పని భైరవ తోటి బానిసని చంపడం బానిసల ఉపకథకి సన్నాహమే. భైరవ తండ్రిని సుబ్బారెడ్డియే చంపించాడని, మాజీ బానిస ఫ్లాష్ బ్యాక్ చెప్పడం బానిసల సమస్యకి నేపధ్య సృష్టే. ఇక సుబ్బారెడ్డి, కట్టారెడ్డిలు భైరవ ఆచూకీ కోసం భైరవ ఇంటికొచ్చి తల్లిని చంపడం బానిసల ఉపకథకి ప్రారంభమే.

          ఒక స్క్రీన్ ప్లే బిగినింగ్ విభాగం ప్లాట్ పాయింట్ -1 వరకూ ఏ బిజినెస్ తో వుంటుందో, ఈ సెకండాఫ్ ప్లాట్ పాయింట్ -2 వరకూ మిడిల్ -2 విభాగం కూడా అదే బిజినెస్ తో వుంది. జాగ్రత్తగా చూడాలిక్కడ. సెకండాఫ్ కారడవిలో దారీ తెన్నూ తెలీక ఏం చేస్తున్నారో జాగ్రత్తగా చూడాలి. స్క్రీన్ ప్లే బిగినింగ్ విభాగం ప్లాట్ పాయింట్ -1 వరకూ బిగినింగ్ బిజినెస్ అయిన కథానేపథ్య సృష్టి, పాత్రల పరిచయం, సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన, సమస్య ఏర్పాటూ (ప్లాట్ పాయింట్ -1) గా వుంటుందని తెలిసిందే. 

          ఇప్పుడు పై సెకండాఫ్ మిడిల్ -2 బిజినెస్ లో భైరవ, గీతల ప్రేమ సంభాషణ, డ్యూయెట్ తీసేస్తే, మాజీ బానిసతో బానిసల ఉపకథకి పాత్ర పరిచయం. అతడి ఇంట్లో ఆశ్రయం బానిసల ఉపకథకి నేపథ్య సృష్టి. భైరవ తల్లిని కూడా ఇక్కడికి తెచ్చుకుంటే క్షేమమని చెప్తే,  భైరవ వినకపోవడం సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన. సుబ్బారెడ్డి భైరవ ఆచూకీ చెప్పని భైరవ తోటి బానిసని చంపించేయడం సమస్యకి దారితీసే కల్పనకి పొడిగింపు. భైరవ తండ్రిని సుబ్బారెడ్డియే చంపించాడని మాజీ బానిస ఫ్లాష్ బ్యాక్ చెప్పడం బానిసల ఉపకథ నేపథ్య సృష్టికి పొడిగింపు. సుబ్బారెడ్డి, కట్టారెడ్డిలు కలిసి భైరవ తల్లిని చంపడం సమస్య ఏర్పాటు - ప్లాట్ పాయింట్ వన్!  ఇదంతా ఎక్కడో ఫస్టాఫ్ బిగినింగ్ విభాగంలో వుండాల్సిన బిజినెస్ మిడిల్ -2 ప్రేమకథలోకి జొరబడింది. 

          ఇలా తల్లి మరణంతో ఏర్పడ్డ ప్లాట్ పాయింట్ – 2, ప్రేమకథకి ప్లాట్ పాయింట్ -2 కాకుండా, బానిసల ఉపకథకి ప్లాట్ పాయింట్ వన్ గా మారిపోయింది! సెకండాఫ్ ప్రేమకథ మిడిల్ -2 బిజినెస్ తో వేడెక్కడం పోయి, బానిసల ఉపకథ బిగినింగ్ బిజినెస్ తో సెకండాఫ్ చల్లారి పోయింది.
          బానిసల ఉపకథతో ఫ్యాక్షన్ ని అంతమొందించే పనిలో, ఫ్యాక్షన్ కొడవళ్ళతో స్క్రీన్ ప్లేనే నరికి కడతేర్చినట్టుగా రూఢీ అవుతోంది. దారి తెలీకపోతే ఇలా అడవిని నరుక్కుంటూ పోవడమే, అటవీ చట్టాల సంగతి తర్వాత.
***
షోలే షో
       ఇలా ప్లాట్ పాయింట్ -2 అనే ప్లాట్ పాయింట్ -1 దగ్గర బానిసల పోరాటం మొదలయ్యింది. అంటే మళ్ళీ ఇంకో మిడిల్ -1 ప్రారంభమయింది, దీనికి ముందు ఇంకో బిగినింగ్ ప్రారంభమైనట్టు. ఈ రెండో మిడిల్ - 1 లో భైరవ తల్లి శవాన్ని చూసుకుని ఏడుస్తాడు. తల్లిని తీసికెళ్ళ కుండా, తీసుకురమ్మన్నా ఇంటి దగ్గరే ఆమె క్షేమమని, తను మాత్రం దాక్కుని ఇప్పుడు ఏడ్వడం. ఇది పాత్రోచిత కథనంలా లేదు, కథా సౌలభ్యం కోసం పాత్రని పక్కకి నెట్టి,  తల్లి ఇంటి దగ్గరే క్షేమమని పాత్రచేత చెప్పించాడు కథకుడు. లేకపోతే కథకుడు తల్లిని చంపించలేడు. అడవిలో దారితప్పితే ఆటవికంగానే వుంటుంది. కథ - స్క్రీన్ ప్లే - మాటలు బదులు, కథ - వధ - మాటలు అని వేసుకునేలా. 

          ఇక దహన సంస్కారాలు పూర్తయి,  ఈ ఇంకో  మిడిల్ -1 సంఘర్షణ మొదలవుతుంది. భైరవకి జరిగిన అన్యాయానికి రెచ్చి పోయిన బానిసల మద్దతు లభిస్తుంది. ఇప్పుడు నొప్పి తెలిసిందని ఎమోషనల్ అవుతాడు భైరవ. నిజానికి మొదలెట్టిన కథ ప్రకారం, ప్రేమిస్తున్న గీతకి ఏదైనా జరిగి, నొప్పి ఇప్పుడు తెలిసిందని ఈ పరంగా రెచ్చిపోవాలి తను.  గీతతో తన ప్రేమకోసం సుబ్బారెడ్డి మీద అంతిమ పోరాట కథనంగా వుండాల్సిన స్పేస్ ఇది. వుండాల్సిన ప్రేమ నొప్పి లేదు, కొత్తగా తల్లి నొప్పి పట్టుకుని దాంతో బానిసలతో వందేమాతరం తిరుగుబాటు పాట. 

          ఇక బానిసల నాయకుడుగా సుబ్బారెడ్డి ఇంటి మీదికిపోయి దొరతనం మానెయ్యాలని వార్నింగ్ ఇస్తాడు. తల్లిని చంపిన వాణ్ణి పధ్ధతి మార్చుకో అని వార్నింగ్ ఇచ్చి వూరుకోవడమా? నొప్పి ఏమైంది? ఆ నొప్పితో తల్లి హత్యకి ప్రతీకారం కూడా లేదా? ఇలా వుంది ‘పాత్రోచిత’ కథనం. దీంతో ఈ రెండో మిడిల్ -1 పూర్తయింది. 

          ఇక రెండో మిడిల్ -2 : ఇందులో అంతా ‘షోలే’ చూపిస్తారు. కట్టారెడ్డి వూరి మీద దాడి కొస్తే ఇళ్ళల్లో ఎవరూ వుండరు. ఒకరొకరే చాటునుంచి వచ్చి భైరవకి మద్దతుగా గుంపు కడతారు. ఇది ‘షోలే’ లో గబ్బర్ సింగ్ వూరి మీదికొచ్చి ముందుకు రమ్మని సవాలు విసిరే సీను లాంటిది. బానిసలు ఒకరొకరే ముందుకొచ్చి భైరవ వెనుక నించోవడం, గ్యాంగ్ ని మూకుమ్మడిగా తరిమి కొట్టడం, కట్టారెడ్డి గబ్బర్ సింగ్ లా పారిపోవడం. 

          ఇంకో షోలే సీను : చెరువు దగ్గర గీత మీద దాడి. ఇంకో షోలే సీను : మౌల్వీ సాబు కొడుకుని గబ్బర్ సింగ్ చంపి గుర్రం మీద పడేసి పంపే సీను లాంటిది. మాజీ బానిసని సుబ్బారెడ్డి చంపించి కాడెకి కట్టి పంపించడం, శవం మీద గబ్బర్ సింగ్ పెట్టినట్టే ఉత్తరం పెట్టి పంపడం. ఇంకో షోలే సీను : హేమమాలినిని గబ్బర్ సింగ్ కిడ్నాప్ చేసినట్టు గీతని సుబ్బారెడ్డి కిడ్నాప్ చేయడం. దీంతో ఈ రెండో మిడిల్- 2 ముగిసి,  దీని ప్లాట్ పాయింట్ -2 ఏర్పాటు. ఇక ఎండ్ విభాగంలో సుబ్బారెడ్డిని గీత చంపడం, కట్టారెడ్డిని భైరవ చంపడం. ది ఎండ్.
***
ఏది ప్రధాన కథ, ఏది ఉపకథ
       ఇప్పుడీ స్క్రీన్ ప్లే రూపం ఎలా వుందో చూస్తే, బిగినింగ్ -మిడిల్ వన్ - ఇంటర్వెల్ -మిడిల్ టూ - బిగినింగ్ - మిడిల్ వన్ - మిడిల్ టూ- ఎండ్. ఉండాల్సిన రూపం : బిగినింగ్ - మిడిల్ వన్ - ఇంటర్వెల్ - మిడిల్ టూ - ఎండ్. మొదటిది గజిబిజి, రెండోది సింపుల్. మొదటి దాని సెకండాఫ్ లో బిగినింగ్ - మిడిల్ వన్ - మిడిల్ టూ మళ్ళీ రిపీటయ్యాయి ఉపకథతో. ఉపకథ ప్రధాన కథ స్పేస్ ని హైజాక్ చేసి తన విభాగాలు తెర్చి కూర్చుంది. 

          ఐడియా దశలో ప్రేమ కథ బ్యాక్ డ్రాప్ లో బానిసల ఉప కథ చెప్పాలనుకున్నారా, లేక  బానిసల కథ బ్యాక్ డ్రాప్ లో ప్రేమ కథని ఉపకథగా చేసి చెప్పాలనుకున్నారా? బానిసల కథ ప్రధాన కథా, లేక ప్రేమకథ ప్రథాన కథా? ఏది ఉపకథ, ఏది ప్రధాన కథ? లేక రెండూ ప్రధాన కథలుగానే చెప్పాలనుకున్నారా? 

          ఐడియా దశలో ఈ విభజన, ఈ స్పష్టత లేదని స్పష్ట మవుతోంది. ఐడియా దశలో ఇవి కొరవడితే కథ చేతికొచ్చే మాటే లేదు. గబ్బర్ సింగ్ వచ్చేస్తాడు చేతులు అడుగుతూ...

ముగింపు రేపు!

 
సికిందర్