రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

19, జనవరి 2023, గురువారం

స్క్రీన్ ప్లే టిప్స్ (839)

  91. ‘భైరవ గీత’ ని ఆర్ట్ సినిమాగా తీయాలనుకుని వుండరు. తెలుగులో ఎవ్వరూ ఆర్ట్ సినిమాలు తీయాలనుకోరు. కానీ తీస్తున్న ఎన్నో స్టార్ సినిమాలు కూడా కమర్షియల్ ముసుగేసుకున్న ఆర్ట్ సినిమాలే. ఇది ఎన్నో సార్లు చెప్పుకున్నాం. ఇది బుద్ధిపూర్వకంగా చేయడం లేదు. కమర్షియల్ సినిమా తీస్తున్నామనుకుని ఆర్ట్ సినిమాలు తీసేస్తున్నారు. అంటే ఈ సమస్యకి మూలం క్రియేటివ్ స్కూల్లో వుంది. స్ట్రక్చర్ స్కూల్లో ఇలా కమర్షియల్ సినిమాలు ఆర్టు సినిమాలుగా తయారు కావు. ఎందుకంటే ఐడియా దగ్గరే పట్టేస్తుంది స్ట్రక్చర్. క్రియేటివ్ స్కూలు చలి మంటేసుకుని తలా ఓ కట్టె పుల్ల వేయడం లాంటిది. మిగిలేది బూడిదే.


          92. సినిమా కథంటే మరేమిటో కాదు- పాత్ర (బిగినింగ్) - ఆ పాత్ర ఎదుర్కొనే సమస్య (మిడిల్)  -  ఆ పాత్ర కనుక్కునే పరిష్కారం (ఎండ్). ఇది ఒకటో తరగతి పాఠం. ఎంతటి వాళ్ళయినా ఈ బ్రాకెట్ లోకొచ్చి సినిమా కథ చేసుకోవాల్సిందే. కానీ ఒకటో తరగతి కూడా తెలియని వాళ్ళు స్క్రిప్టులు చేస్తూంటేనే సినిమా కథలు రావడం లేదు. నర్సరీ స్కూలు కతలే వస్తున్నాయి. మళ్ళీ పాత్ర (బిగినింగ్) - ఆ పాత్ర ఎదుర్కొనే సమస్య (మిడిల్)  - ఆ  పాత్ర కనుక్కునే పరిష్కారం (ఎండ్) అని పొల్లుపోకుండా అనుకోకుండా – చివర ‘పాత్ర కనుక్కునే పరిష్కారం’ లోంచి పాత్రని తీసేసి ఒట్టి పరిష్కారమే తీసుకుని – “పాత్ర, ఆ పాత్ర ఎదుర్కొనే సమస్య, పరిష్కారం”  – అనుకుని తప్పులో కాలేస్తే కూడా సినిమా కథవదు. ఆర్ట్ సినిమా పాసివ్  వ్యవహారమవుతుంది. అంటే అప్పుడు పరిష్కారం పాత్ర కనుక్కోకపోతే – రచయిత  కనుక్కుంటాడన్న మాట. అంటే పాత్ర చేయాల్సిన పని రచయిత చేస్తాడన్న మాట. అంటే పాత్ర సమస్యలో పడ్డ దగ్గర్నుంచీ (మిడిల్ నుంచీ) రచయితే జోక్యం చేసుకుని పాత్రని నడిపిస్తాడన్న మాట. అంటే పాసివ్ పాత్ర తయారు చేస్తాడన్న మాట. అంటే సినిమాని అట్టర్ ఫ్లాప్ చేస్తాడన్న మాట. అంటే ఎందుకు ఫ్లాపయ్యిందో తెలుసుకోకుండా ఇంకో పది ఇలాగే అట్టర్ ఫ్లాపులు చేస్తాడన్న మాట. ఇదింకో రకం నర్సరీ స్కూలు తనమన్న మాట. కాబట్టి ఖచ్చితంగా ‘పాత్ర కనుక్కునే పరిష్కారం’ అని క్రియాత్మకంగా గుర్తు పెట్టుకోవాల్సిందే. ఇక్కడ రచయిత అనడం కూడా సరి కాదు. ఇప్పుడు-  అంటే గత రెండు దశాబ్దాలుగా రచయిత లెక్కడున్నారు. దర్శకులే రచయితలు. వాళ్ళదే చెల్లుబాటు, వాళ్ళవే ఫ్లాపులు. కాబట్టి ఇలాటి కతల వ్యవహారం రచయితల కాపాదించ కూడదు.

          93.  సినిమా కథంటే డబ్బులు పెట్టి తీస్తే డబ్బులు వచ్చేది. గాథకి డబ్బులు పెట్టి తీస్తే డబ్బులు రావు. ఉపోద్ఘాతానికి డబ్బులు పెట్టి తీస్తే డబ్బులు రావు, ఫ్లాష్ బ్యాక్ కి డబ్బులు పెట్టి తీస్తే డబ్బులు రావు, డాక్యుమెంటరీకి డబ్బులు పెట్టి తీస్తే డబ్బులు రావు, ఎపిసోడ్లకి డబ్బులు పెట్టి తీస్తే డబ్బులు రావు, ఆంథాలజీ (కథల సంపుటి) కి డబ్బులు పెట్టి తీస్తే డబ్బులు రావు, ఆర్టు సినిమాకి డబ్బులు పెట్టి తీస్తే డబ్బులు రావు, వరల్డ్ మూవీకి డబ్బులు పెట్టి తీస్తే డబ్బులు రావు, ఇండీ ఫిలిం కి డబ్బులు పెట్టి తీస్తే డబ్బులు రావు, క్రౌడ్ ఫండింగ్ కళాత్మకానికి డబ్బులు పెట్టి తీస్తే డబ్బులు రావు, న్యూస్ బులెటిన్ కి డబ్బులు పెట్టి తీస్తే డబ్బులు రావు, డైరీకి డబ్బులు పెట్టి తీస్తే డబ్బులు రావు, డబ్బులు పెట్టి తీయకపోయినా వీటన్నిటికీ  డబ్బులు రానేరావు!

          94. స్క్రీన్ ప్లే నిర్మాణానికి నేను రూపొందించిన పారడైంలో పరిణామం ప్లాట్ పాయింట్ వన్, మిడ్ పాయింట్, ప్లాట్ పాయింట్ టూ లని ప్రతిపాదించిన తర్వాతే జరిగింది. వీటికి పించ్ 1, పించ్ 2 లని కలపడం ద్వారా జరిగింది.  ఇది జరిగి చాలా చాలా సంవత్సరాలైంది. కానీ నిజానికి నేను తెలుసుకున్న దేమిటంటే, పారడైంని నవీకరించాలనుకున్నప్పుడల్లా దాని రూపం మాత్రం చెక్కుచెదరని శాశ్వతత్వంతో కూడి వుంటుందనేది. పారడైం అనేది ఒక రూపమే అయినా, అది ఫార్ములా మాత్రం కాదు మార్పు చెందుతూ వుండడానికి. ఆ రూపంలో బిగినింగ్, మిడిల్, ఎండ్ కథన విభాగాలు వుండకుండానూ పోవు. కొంతకాలం క్రితం నా స్ట్రక్చర్ (పారడైం) మోడల్ కి నేనిస్తున్న ప్రాముఖ్యాన్ని కాస్త తగ్గించుకోవాలని నిర్ణయించాను. ఒక టీచింగ్ క్లాసులో పారడైం గురించి బోధిస్తున్నప్పుడు, ఒక స్టూడెంట్ లేచి, ‘ఇదంతా నాకు తెల్సు, చాలా పాతబడ్డ విషయం’ అని అసంతృప్తి వ్యక్తం చేశాడు. అప్పుడు గ్రహించాను. పారడైం అనేది మూవీ కల్చర్ నరనరాన జీర్ణించుకు పోయాక, నేనింకా దీని గురించి కొత్తగా బోధించాల్సిందేమీ లేదని. దీనికంత ప్రాముఖ్యాన్నివ్వ కూడదనీ. ఇక క్యారెక్టర్ ఎలిమెంట్స్ వైపు దృష్టి సారించాలనీ... 
సిడ్ ఫీల్డ్

          95. కథంటే స్ట్రక్చర్. నిబిడీకృతమై వున్న స్ట్రక్చరే కథ. కథంటేనే స్ట్రక్చర్, స్ట్రక్చర్ అంటేనే కథ. ఇండియా అంటేనే భారత్, భారత్ అంటేనే ఇండియా. ఎందుకు స్ట్రక్చరనే కథలే కావాలంటే, మాటలు నేర్చినప్పట్నుంచీ  మానవుల మెదడు కథల్ని రిసీవ్ చేసుకోవడానికి అలా వైరింగ్ అయివుంది కాబట్టి. సినిమాల్ని ఎన్ని అష్టవంకర్లు తిప్పినా ఈ మెదడులోని వైరింగ్ ని - సాఫ్ట్ వేర్ ని - మార్చి ప్రేక్షకుల్ని మెప్పించలేరు. ప్రకృతి ప్రకృతే, వికృతి అవదు. ఇది కూడా ఒకటో తరగతి పాఠమే! దీన్ని అర్ధం జేసుకుంటే వెండితెరకి  సినిమా కథలు తప్ప మరోటి రాయడానికి మనస్కరించదు. సినిమాల్ని ఆడించే ప్రేక్షకులు థియేటర్లో కూర్చుని వెండితెర కేసి కథ కోసమే గంపెడాశతో చూస్తారు.

     96.  రాజకీయ సినిమాల కెప్పుడూ యూత్ అప్పీల్, మాస్ అప్పీల్, అన్ని అప్పీల్సూ వుంటూ వస్తున్నాయి. రజనీకాంత్ ‘రోబో- 2’ తో  మార్కెట్ యాస్పెక్ట్ విషయంలో ఏం పొరపాటు జరిగింది?  ఇందులో ఒక ప్రేక్షకులందరూ గుర్తించాల్సిన  పర్యావరణ సమస్యని సైన్స్ ఫిక్షన్ గా చెప్పారు. దీంతో ఇది నిజం కాదేమోలేనని ప్రేక్షకులు ఫీల్ కాలేదు. సైన్స్ ఫిక్షన్ నిజం కాదు కదా. ఇదే పర్యావరణ సమస్యని రాజకీయాలతో చూపించి వుంటే ఎక్కువ రెస్పాండ్ అయ్యేవారు. కనెక్ట్ అయ్యేవారు. రాజకీయాలు పర్యావరణాన్ని - పోనీ పిచ్చుకల్ని-  ఇంత ధ్వంసం చేస్తున్నాయా అని ఫీలయ్యే వారు. చేతిలో వున్న సెల్ ఫోన్ ని చూసినప్పుడల్లా పర్యావరణ హనన రాజకీయాలే కన్పించేవి, క్రోనీ కేపిటలిజంతో బాటు.  కాబట్టి ప్రేక్షకులనుభవించే సామాజిక సమస్యల్ని సైన్స్ ఫిక్షన్ గా పలాయనవాదంతో చూపరాదు. నిత్యజీవితంలో వాళ్ళు చూసే  రాజకీయాలతోనే ఆర్గానిక్ గా, ప్రాక్టికల్ గా కళ్ళకి కట్టాలి. సామాజిక సమస్యలు వేడి వేడిగా రాజకీయాలతోనే ముడిపడి వుంటాయి, సైన్స్ ఫిక్షన్ తో కాదు. 

          97. ఆ మధ్య ఇంకో పాపులర్ హీరోకి జీవితమంతా ధారబోసి ఓ కథ చేశాడు ఇంకో నయా మేకర్. చూస్తే అదే పాసివ్ క్యారెక్టర్ తో అదే బలహీన కథ. ఏం చేయాలి? దీన్ని యాక్టివ్ పాత్రగా మారిస్తే కథ మారుతుంది. మార్చకుండా ఇలాగే  చెప్పేస్తే హీరోని మోసం చేసినట్టవుతుంది. హీరోని మోసం చేయలేక, కథని మార్చలేకా ఆగిపోయాడు. ఇది నయం. హీరోలు  కథలు వింటున్నప్పుడు యాక్టివ్ - పాసివ్ క్యారెక్టర్ తేడాలు తెలీక మోసపోతున్నారనేది పచ్చి వాస్తవం. మోసం చేస్తున్నామని నయా మేకర్లకీ తెలీదు. ఎందుకంటే, అది పాసివ్ క్యారెక్టర్ అని వాళ్ళకే తెలీనంతగా  ‘లైవీరోకా’ ల (లైటర్ వీన్ రోమాంటిక్ కామెడీల) కాలం కాని కాలపు  జోష్ తో పెరిగారు. ఇంకెన్ని  ఫ్లాప్స్ తీస్తున్నా ఈ జోష్ వదలదు.

          98. రాయడం మొదలెట్టిన తర్వాత యాక్ట్ వన్, యాక్ట్ టూ, యాక్ట్ త్రీలలో ఆ సీన్లని  కూర్చాల్సి వచ్చినప్పుడు కొన్ని సీన్లు పడవు. వాటి స్థానంలో కొత్త సీన్లు వాటికవే పుట్టుకొస్తాయి. కాబట్టి స్ట్రక్చర్ నేపధ్యం లేకుండా క్రియేటివిటీ కుదరడం సాధ్యం కాదు. రచయితలకి స్ట్రక్చరే విముక్తి కల్గిస్తుంది. స్ట్రక్చర్ లేని క్రియేటివిటీ అనేది బందికానా. ఎటు వెళ్ళాలో తెలిసినప్పుడు అటు వెళ్ళే ప్రయాణాన్ని రూపొందించుకోవచ్చు. లారా ఎస్క్వైవల్ రాసిన ‘లైక్ వాటర్ ఫర్ చాకొలేట్’ నే తీసుకుందాం. తను ఆ నవలైతే రాసింది గానీ స్క్రీన్ ప్లేకి స్ట్రక్చర్ తెలియలేదు. స్ట్రక్చర్ అంటే ఆమెకి మహా భయం. మేము దాన్ని స్ట్రక్చర్ చేశాక, స్ట్రక్చర్ తో స్క్రీన్ ప్లే ఎంత సులభమై పోతుందో ఆవిడ సడెన్ గా గుర్తించింది.
సిడ్ ఫీల్డ్

          99.  ప్రధాన కథ పాత రొటీన్ గావిషయం తక్కువగా అన్పిస్తే ఉపకథలతో కవర్ చేయవచ్చని ఇటీవల ఈక్వలైజర్ 2’ లో తెలిసింది. అంతేగానీ ఫస్టాఫ్ ఓ కథ ప్రధానంగా చెప్పుకొస్తూదాన్ని వదిలేసి సెకండాఫ్ లో ఇంకేదో కథని అతికించే ప్రయత్నం చేస్తే సెకండాఫ్ సిండ్రోం అనే సుడిగుండం ఏర్పడుతుంది. చెబుతున్న విషయాన్ని పక్కకి నెట్టి ఇంకో విషయం ఎత్తుకోవడమే సెకండాఫ్ సిండ్రోం. సాధారణంగా ఇంటర్వెల్ తర్వాత నుంచి ఇలా జరుగుతుంది. ఫస్టాఫ్ ఒక కథసెకండాఫ్ ఇంకో కథ. సైజ్ జీరోజ్యోతి లక్ష్మి వంటి ఫ్లాప్స్ ఇందుకుదాహరణగా వున్నాయి. ఇంకా ముందు దొంగోడుదమ్ లు కూడా ఇలాటివే. హవాతేరే నామ్ లు కూడా ఇలాటివే. ఇవన్నీ ఫ్లాపయ్యాయి. ఇప్పుడు ఈ వరసలో భైరవ గీత చేరింది. ఫస్టాఫ్ మధ్యలో ఆపేసిన ప్రేమ కథసెకండాఫ్ లో అందుకున్న బానిసల ఉపకథ!

 100.  భైరవ గీత’  ఇంటర్వెల్ సీన్లో ఎవరు ఎవరి ముందు ఎందుకు కిస్ పెట్టాలిఎందుకు పెట్టకూడదు?  డైనమిక్స్ కి ఇంటరెస్టింగ్ టాపిక్. ఇంటర్వెల్  కంటే ముందు ఫస్టాఫ్ లో చాలా లిప్ లాక్ సీన్లు వస్తాయి. ఇవి హీరో హీరోయిన్ల మధ్య ఇంటిమేట్ సీన్లు. మరి ఇంటర్వెల్ లో ఇంకో లిప్ లాక్ సీను వస్తోందంటే అదింకో  సాధారణ ఇంటిమేట్ సీనుగా వుండదు. వుంటే ఇంటర్వెల్ మలుపుకి  అర్ధం వుండదు. సినిమాలో ఇలా లేదు కూడా. ఇంతవరకూ బాగానే వుంది. సాధారణంగా వుంటున్న లిప్ లాక్ సీన్లే ఇంటర్వెల్ లో అసాధారణ సీనుకి దారితీస్తేనే ఇంటర్వెల్ అనే మలుపుకి బలం. ఈ సినిమాలో ఇంటర్వెల్ అసాధారణ సీనుకి  దారి తీసింది నిజమే. కానీ అదెలాటి అసాధారణ సీను? ఈ అసాధారణ సీను వల్ల కథ గానీ, హీరోహీరోయిన్ల ఎదుటి పాత్ర గానీ ఎలా ఎఫెక్ట్  అయ్యాయి? ఇదీ ఈ సీనుని డ్రైవ్ చేసే పాయింటు. 

        ఒక కీలకమైన మలుపు దగ్గర కథ గానీ, ఆ కథ నడవకుండా అడ్డు పడే ఎదుటి పాత్ర గానీ, ఎఫెక్ట్ అవక పోతే ఆ మలుపు మలుపే కాదు. దాని వల్ల ఉపయోగం కూడా లేదు. ఇదే జరిగింది ఈ సినిమా ఇంటర్వెల్లో.  ఈ అసాధారణ సీను కాస్తా ఎదుటి పాత్రతో కాక, ఆ ఎదుటి పాత్ర అనుచరులతో వుంది!

          డైనమిక్స్ తెలిసిన సరైన స్క్రీన్ ప్లేలలో ప్లాట్ పాయింట్ వన్, ఇంటర్వెల్, ప్లాట్ పాయింట్ టూ సీన్లు బిగ్ ఈవెంట్ సీన్లలా వుంటాయి.  మిగతా సీన్లతో కలిసిపోకుండా ప్రత్యేక ముద్ర వేస్తూ వుంటాయి. ‘భైరవ గీత’ కథ హీరోయిన్  గీత,  హీరో భైరవ, గీత తండ్రి సుబ్బారెడ్డి లు స్టేక్ హోల్డర్లు గా వేడి పుట్టిస్తూ సాగుతూంటుంది. అలాంటప్పుడు ఇంటర్వెల్ అనే కథని ఇంకో మలుపుతిప్పే ఘట్టం, ఈ స్టేక్ హోల్డర్ల మధ్య కాక, ఎవరో అనుచరులతో అనామకంగా వుంటుందా? తరుము కొస్తున్న తండ్రి సుబ్బారెడ్డి అనుచరుల ముందు గీత, భైరవ కి కిస్ పెట్టి వాళ్లకి షాక్ ఇచ్చేస్తుంది. వాళ్ళు షాక్ తింటే ఎంత, తినకపోతే ఎంత ఇంటర్వెల్ కి, ప్రేక్షకులకి? గీత కిస్ పెడితే ఎంత, పెట్టక పోతే ఎంత కథకి, డైనమిక్స్ కి?  షాకిస్తే ఈ కథలో స్టేక్ హోల్డర్ అయిన, ఎదుటి పాత్ర సుబ్బారెడ్డి కివ్వాలి – అది కూడా గీత భైరవకి కిస్ పెట్టి కాదు - భైరవ గీతకి కిస్ పెట్టి!

          గీత తానేమిటో అప్పటికే తన మీద కన్నేసిన కట్టారెడ్డిని వాయించి డిక్లేర్ చేసే వచ్చింది. ఇంత కంటే పెద్ద షాక్ కట్టా రెడ్డికి కట్ట బెట్టాలనుకుంటున్న గీత తండ్రి సుబ్బారెడ్డికి లేదు. కాబట్టి ఇంటర్వెల్ సీన్లో, స్టేక్ హోల్డర్ గా సుబ్బారెడ్డి వున్నా, అతడి ముందు గీత ఎన్నేసి ముద్దులు వూగిపోతూ పెట్టుకున్నా ఇంకా ఒరిగేదేమీ లేదు. కానీ భైరవ ఏమిటో సుబ్బారెడ్డి ఇంకా రుచి చూడలేదు. కాబట్టి అతను గీతని లాక్కుని సుబ్బారెడ్డి కళ్ళెదుట  ఎడాపెడా కిస్సులు పెట్టేస్తూంటే సుబ్బారెడ్డి లుంగీతో బాటు వెండితెరా చిరిగి పేలికలై పోతుంది - థోడాసా డైనమిక్స్ చాహియే భయ్యా!

సికిందర్

18, జనవరి 2023, బుధవారం

1287 : రివ్యూ!


  కొన్ని విజాతి జానర్లని కలిపి జానర్ బ్లెండర్ గా సినిమాలు తెలుగులో వస్తూంటాయి. అవి చాలా వరకూ క్రాఫ్టు కుదరక విఫలమవుతూ వుంటాయి. కిరణ్ అబ్బవరం నటించిన వినరో భాగ్యము విష్ణు కథ అని ఒకటి రాబోతోంది. దీని గురించి చెబుతూ- కాన్సెప్ట్ తో మొదలై లవ్ కామెడీ మిక్స్ అయి, క్రైమ్ నుంచి సస్పెన్స్ నుంచి సాగే ఒక ఇంటెన్స్ డ్రామా అనుకోవచ్చు - అని పబ్లిసిటీ ఇచ్చారు. ఇలా చాంతాడంత గందరగోళంగా చెబితే సినిమా ఇంకెంత గందరగోళంగా వుంటుందో అర్ధం జేసుకోవచ్చు. నవరసాల్లో ఏది ఎందుకు మిక్స్ చేస్తున్నారో స్పష్టత లేక ఫ్లాపయిన సినిమాలున్నాయి. పూర్వం హవా అనే హిందీలో తల్లి కథగా నడుస్తున్న హార్రర్ కథనం (బీభత్స రసం) కాస్తా, ఆమె కూతురి కథగా మారిపోయి సైకో థ్రిల్లర్ గా (అద్భుత రసం) ముగుస్తుంది. ఇలా విజాతి జానర్ల కలబోత అతుకులేసినట్టు వుంటే సినిమా ఎటూ గాకుండా పోతుంది. కలబోత అంటే జానర్ల మద్య కార్యకారణ సంబంధం.
ట్రైలర్

         నేపథ్యంలో వచ్చిందే విజాతి జానర్ల స్వ- ఎ సౌండ్ ఆఫ్ సోల్ అనే హార్రర్-రోమాంటిక్ - సస్పెన్స్ థ్రిల్లర్. కొత్త వాళ్ళు చేసిన ప్రయోగం. రచన -దర్శకత్వం మను పీవీ. జిఎంఎస్ గ్యాలరీ ఫిలిమ్స్ బ్యానర్‌పై జిఎం సురేష్ నిర్మాణం. మహేష్ యడ్లపల్లి, స్వాతీ భీమిరెడ్డి, యశ్వంత్ పెండ్యాల, మాణిక్ రెడ్డి, శ్రీనివాస్ భోగిరెడ్డి, సిద్ధార్థ్ గొల్లపూడి నటీనటులు. సంగీతం కరణం శ్రీ రాఘవేంద్ర, ఛాయాగ్రహణం దేవేంద్ర సూరి, కూర్పు శ్రీ వర్కల.

భ్రాంతితో దిగ్భ్రాంతులు

అభిషేక్ ఒక ఆర్టిటెక్ట్. నాయనమ్మ చనిపోతే వస్తాడు. మంచం మీద వున్న చనిపోయిన నానమ్మ లేచి మంచి నీళ్ళు తాగి పడుకోవడం చూసి కలవరపతాడు. అంత్యక్రియల తర్వాత కూడా నాయనమ్మ సజీవంగానే కన్పిస్తూ వుంటే దిగ్భ్రాంతి చెందుతాడు. తనది లాజికల్ మైండ్. తనకి కన్పిస్తున్నవి నిజం కాదు, భ్రాంతి అని నమ్ముతాడు. ఈ భ్రాంతితో వుండగానే ఇంకో భ్రాంతికి లోనవుతాడు. తను ప్రేమించిన చనిపోయిన స్వప్న వచ్చి తను నిజం అంటుంది, అబద్ధమంటాడు. ఈ సంఘర్షణతో వుండగానే ఆమె చావు వెనుక రహస్యముందని అనుమానిస్తాడు. ఈ అనుమానంతో ఛేదించుకుంటూ వెళ్తూంటే వూహించని విషయాలు బయటపడుతూంటాయి. ఇదంతా నిజమా? అబద్దమా? అసలు తనకి ఏం జరుగుతోంది? దీన్నుంచి ఎలా బయటపడాలి? కొలీగ్ భాస్కర్, డాక్టర్ జయప్రకాష్, పోలీస్ ఇన్స్ పెక్టర్, మినిస్టర్...వీళ్ళందరికీ వున్న సంబంధమేమిటి? తెలుసుకుంటూంటే అభిషేక్ కి మతి పోతూంటుంది...

బలమైన కథ- బిగువైన మలుపులు

నాయనమ్మ మరణంతో హార్రర్ గా ప్రారంభమై, స్వప్న రాకతో ఫ్లాష్ బ్యాక్ లో రోమాన్స్ లోకి తిరగబెట్టి, ఆమె మరణంతో సస్పెన్స్ థ్రిల్లర్లోకి మలుపు తీసుకునే మల్టీపుల్ జానర్స్ కథ. ఈ మూడు జానర్స్ కార్యకారణ సంబంధం (కాజ్ అండ్ ఎఫెక్ట్) తో పరస్పరం కనెక్ట్ అయివుంటాయి. నాయనమ్మ మరణం అభిషేక్ సబ్ కాన్షస్స్ మైండ్ లో ట్రిగర్ పాయింట్ గా పనిచేస్తే, దీంతో చనిపోయిన స్వప్న మైండ్లోకి తిరిగొచ్చింది. తిరిగొచ్చిన స్వప్న ఆమె మరణం వెనుక రహస్యం తెలుసుకునేందుకు దారితీసింది. వీటన్నిటికీ మూలకారణం షిజోఫ్రేనియాతో బాధపడే అభిషేక్ మానసిక స్థితి. విజాతి జానర్లతో కాన్సెప్ట్ పకడ్బందీగా వుంది.    
        
దీని కథనం కామెడీలతో, ఎంటర్టైన్ మెంట్ తో పక్కదారులు పట్టకుండా జానర్స్ మర్యాదలతో సూటిగా, స్పష్టంగా వుంది. సెకండాఫ్ కథనంలో మలుపులు కావాల్సినంత సస్పెన్స్ నీ, థ్రిల్స్ నీ సృష్టిస్తాయి.
        
దర్శకుడు మనూ ప్రొఫెషనల్ గా కనిపిస్తాడు కథ విషయంలో- సెకండాఫ్ లో  లాజికల్ గా కొన్ని లోపాలున్నప్పటికీ. ముగింపు ముగిసిపోయిన కథకి పొడిగింపులా వుంటుంది. 1983 లో హిందీ ధువా లో (హాలీవుడ్ టు ఛేజ్ ఏ క్రూకెడ్ షాడో’- 1958 కి అనుసరణ) క్యారక్టర్లు ఒకటొకటే నిజస్వరూపాలు బయటపెట్టుకుని, ఎంతో దయామయురాలిగా కన్పించే రాజమాతని హంతకురాలిగా రివీల్ చేసే షాకింగ్ ముగింపులాంటిది వుండాల్సింది అభిషేక్ పాత్రతో. అభిషేక్ పాత్ర ఏ మానసిక సమస్యతో మొదలైందో అదే మానసిక సమస్యతో క్యారక్టర్ ఆర్క్, ట్విస్టు వంటివి లేకుండా ముగిసి పోవడం డైనమిక్స్ లేమిని సూచిస్తుంది.
        
పోతే, అభిషేక్ పాత్రలో మానసిక సంఘర్షణతో వుండే నటనని మహేష్ యడవల్లి మంచి టెంపో తో పోషించాడు. కొత్త వాడులా అన్పించడు. దాదాపు ప్రతీ సీనులో తను వుంటూ కథని బాగా క్యారీ చేశాడు. స్వప్న పాత్రలో స్వాతీ భీమిరెడ్డి సంఘర్షణ కూడా బలంగా పోషించింది. నెగెటివ్ గా కన్పించే భాస్కర్ గా యశ్వంత్ పెండ్యాల యాక్షన్ తో కథ ముందుకు సాగడానికి తోడ్పడ్డాడు. డాక్టర్ గా శ్రీనివాస్ భోగిరెడ్డి, మరో డాక్టర్ గా సిద్ధార్థ్ గొల్లపూడి డ్రామాని పకడ్బందీగా పోషించారు. ఇన్స్ పాత్రలో మాణిక్ రెడ్డి ప్రత్యేక దృష్టినాకర్షిస్తాడు.
        
సంగీతం, ఛాయాగ్రహణం, కూర్పు మొదలైన విభాగాలు నిర్వహించిన సాంకేతికులు కథతో పోటీపడ్డారు. దర్శకుడు మానూ పీవీ చిన్న సినిమాకి బలమైన కంటెంట్ ముఖ్యమని, దానికి బలమైన టాలెంట్ కూడా అవసరమని ఈ జానర్ బ్లెండర్ తో తేల్చి చెప్పాడు. దీన్ని clasc యాప్ ని డౌన్ లోడ్ చేసుకుని ఉచితంగా చూడొచ్చు.

—సికిందర్

1286 : ప్రాంతీయ సినిమా!


 

   హిందీ ఆర్ట్ సినిమాలైనా కమర్షియల్ సినిమా ప్రేక్షకుల్ని ఆకర్షించక పోవడానికి కారణం ఒకటే కన్పిస్తుంది : అవి శిలా సదృశంగా ఒకే ధోరణిలో సీరియస్ స్వభావంతో వుంటూ,  సగటు ప్రేక్షకులకి దూరంగాప్రధాన స్రవంతిలో లేకపోవడమే. మారిన కాలానికి వుంటున్న తీరులో హిందీ ఆర్ట్ సినిమాలకిక ప్రేక్షకుల్లేరని గుర్తించిన శ్యామ్ బెనెగళ్ఒక కొత్త ఒరవడికి తెర లేపారు. 2000 నుంచి హిందీ ఆర్ట్ సినిమాలని ప్రధాన స్రవంతి బాలీవుడ్ స్టార్స్ తో తీయడం మొదలెట్టారు. దాంతో అవి ప్రధాన స్రవంతి లోకొచ్చేసికొత్త తరం ప్రేక్షకుల అండదండలతో వాణిజ్య పరంగానూ విజయాలు సాధించడం 
 మొదలెట్టాయి.
ట్రైలర్ 
        క ఇతర ప్రాంతీయ భాషల సినిమాల వైపు చూస్తే అవి ఇంకా అవే కాలం చెల్లిన ఆర్ట్ సినిమాల ధోరణుల్లోనే వుంటూప్రాంతీయంగానే ప్రేక్షకుల్లేక అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలతో సరిపెట్టుకో సాగాయి. ఈ సినిమా లెక్కడున్నాయో చూడడానికి వెతికి పట్టుకోవడం కూడా కష్టమే. ఈ పూర్వ రంగంలో కన్నడ నుంచి ఒక కొత్త దర్శకుడు రాంరెడ్డిప్రాంతీయ క్రాసోవర్ సినిమాలని ఎలా తీసి ప్రాంతీయ- జాతీయ- అంతర్జాతీయ ప్రేక్షకుల వరకూ అలరించ వచ్చోఅలాగే రికార్డు స్థాయిలో 20 దాకా జాతీయఅంతర్జాతీయ అవార్డులు సైతం ఎలా పొందవచ్చో తనదైన ప్రధాన స్రవంతి మోడల్ నిచ్చాడు. అది 2015 లో ‘తిథి’ రూపంలో తెర దాల్చింది.

శ్యామ్ బెనెగళ్ హిందీ ఆర్ట్ సినిమా తీరు తెన్నుల్ని మార్చి స్టార్స్ తో ఆధునీకరిస్తే
రాంరెడ్డి తిరిగి అదే పాత రోజుల్లో కెళ్లి అక్కడున్న పాతతోనేస్టార్స్ అవసరం లేకుండానే సాహసం చేశాడు. స్థానిక ప్రేక్షకుల్ని ఆకర్షించడానికి స్టార్స్ అవసరం లేని సాహసం. ఆర్ట్ సినిమా కథల్లో ఏదైనా సమస్యని సీరియస్ గానే చర్చించనవసరం లేదనీవినోద భరితంగానూ ముచ్చటించుకో వచ్చనీ ఒక ప్రయోగం చేసి చూపించాడు. ఇలా ఇది ఆర్ట్ సినిమా కథని పూర్తి వినోదాత్మకంగా మార్చిన ఇంకో నూతన కల్పన అయింది. ఇదెలా వుందో ఓసారి చూద్దాం...

సెంచురీ గౌడ @ 101

కర్ణాటక మాండ్యా జిల్లా నోడెకొప్పలు అనే పల్లెటూరు. రైలు కట్ట వారగా వూరు. ఆ రైలు కట్ట నానుకుని మంచి ధర పలికే అయిదెకరాల మాగాణి. దాని ఆసామి బడుగు జీవికాటికి కాళ్ళు జాపుకున్ననిండు 101 సంవత్సరాల సెంచురీ గౌడ అనే బూతుల  వీరుడు. పనేం వుండదు. దారి పక్కన కూర్చునివచ్చే పోయేవాళ్ళని బండ బూతులు తిట్టడమే పని. అమ్మనా బూతులు కూడా తిడతాడు. తిట్టించుకుంటున్న వాళ్ళకి అది నిత్య కార్యక్రమమే కాబట్టిజీవితంలో విడదీయలేని భాగంగా చేసుకుని సాగి పోతూంటారు. సెంచురీ గౌడని పోలీసులు వచ్చి పట్టుకోవడానికి అవి సోషల్ మీడియాలో తిట్లు కావుసొసైటీలో లైవ్ గా తేట తేనియల తిట్లు. ఇక్కడ అందరికీ ముద్దొస్తున్నాయి.

ఇలాటి సెంచురీ గౌడకి ఒకానొక డెబ్బయి ఏళ్ళ కొడుకు గడ్డప్ప. ఇతను గడ్డాలూ మీసాలు పెరిగిపోయి నడుచుకుంటూ వెళ్ళి పోతూంటాడు. ఎక్కడికి వెళ్ళి పోతూంటాడో అతడికే తెలీదు. నడకే అతడి నినాదం. ఎక్కడో ఆగి
క్వార్టర్ బాటిల్ తీసి ఒక గుక్క లిక్కర్ పట్టిస్తాడు. ఇంకెక్కడో చెట్టు కింద కూర్చుని పులి జూదం ఆడతాడు. ఇతడికి తమ్మన్న అని కొడుకు. ఇతను తండ్రిని వెతికి పట్టుకొచ్చి అన్నం పెడతాడు. ఇతడికో కొడుకు అభి. వీడికి కావేరీ అని గొర్రెల పెంపకం అమ్మాయికి వల వేయడం పని. ఇతడికో తల్లి. ఈ మగ మేధావులకి వండి పెట్టడం ఈమె పని.

ఇలా నాల్గు తరాల నిండు కుటుంబం వూరిని సముచితంగా ఉద్ధరిస్తున్న వేళ
ఓ రోజు సెంచురీ గౌడ తిట్లతో విధి నిర్వహణ ముగించుకుని ఇంటికి పోతాడు. పోతూ దారిలో మూత్రం పోయడానికి కూర్చుంటాడు. కూర్చుని అలా వొరిగి పోయి తనువు చాలిస్తాడు.

విషాదం అలుముకుంటుంది. అయితే పెద్ద కర్మలోగా కొన్ని వింతలు చోటు చేసుకుంటాయి. సెంచురీ గౌడ కొడుకు
మనవడుముని మనవడు ముగ్గురూ పాల్పడే వింతలు. కుటుంబంలో ఒక మరణంతో ఒక స్వేచ్ఛఇంకో స్వార్ధం మనుషుల్లో పుట్టుకు రావొచ్చు. ఒక మరణం ఒక మంచో చెడో పుట్టుకకి కారణమవుతుంది. అదే సమయంలో ఇంకో గాయాన్ని మాన్పలేని వైఫల్యం కూడా మరణానికుంటుంది. కొన్ని గాయాల్ని మరణాలు మాన్పలేవు. ఏమిటా గాయంఎవరా జీవితకాల క్షత గాత్రుడుదీని గురించే మిగతా కథ.

వూళ్ళో కనుగొన్న కథ


ఇదే నోడెకొప్పలు గ్రామంలో దర్శకుడు రాంరెడ్డి కనుగొన్న కథ ఇది. ఇది రచయిత ఎరెగౌడ స్వగ్రామం. ఒకసారి ఎరెగౌడని కలవడానికి రాంరెడ్డి వచ్చినప్పుడుఇదొక కొత్త ప్రపంచంలా అన్పించింది. గ్రామం తీరుతెన్నులుమనుషుల ధోరణి చూస్తే వెంటనే ఈ గ్రామాన్ని పాత్రగా చేసి సినిమా తీయాలన్పించింది. దీంతో జెకెస్లోవేకియా వెళ్ళి ఫ్రాగ్ ఫిలిమ్ స్కూల్లో ఏడాది పాటు దర్శకత్వంరచనల్లో శిక్షణ పొందాడు. అక్కడ పరిచయైన డొరోన్ టెంపర్ట్ ని ఛాయాగ్రాహకుడిగా నియమించకున్నాడు. ఎరెగౌడతో కలిసి కథ రాసుకుని సినిమా తీయడం మొదలెట్టాడు.

ఇది పూర్తిగా హాస్య ప్రధాన కథ. ఈ కథలో ప్రతిఫలించే అంశాలు మరణం
పేదరికంలో పుట్టే స్వార్ధందాంతో మోసంకుటుంబ సంబంధాల లేమి మొదలైన సీరియస్  విషయాలు. వీటిని నెగెటివ్ ప్రవర్తనలతో నవ్వొచ్చేట్టు చూపిస్తాడు. నవ్వించుకుంటూ వెళ్ళి వెళ్ళి చివర్లో విషాదాంతం చేస్తాడు. కఠిన వాస్తవాలతో కళ్ళు తెరిపిస్తాడు. ఇలా ఇదొక ఆధునిక హాస్య విషాదంలా వుంటుంది.
        
ఈ వాస్తవిక సినిమాలోని హాస్య కథ నిండు 101 ఏళ్ళ సెంచురీ గౌడ మరణాన్ని కూడా హాస్యం పట్టిస్తుంది. పల్లెలో భేషజాలుండవు, పచ్చి వాస్తవా లాధారంగా జీవితాలుంటాయి. ఎంత అట్టడుగు వర్గాల జీవితాలుంటే అంత నగ్నసత్యాల నాట్యముంటుంది. తమ్మన్న తండ్రి గడ్డప్పని వెతుక్కుంటూ వెళ్ళి- తాత చచ్చిపోయాడుకార్యక్రమాలున్నాయి రమ్మంటేచచ్చి పోయినవాడికి కార్యక్రమాలు తెలుస్తాయారానంటాడు గడ్డప్ప.

ఇంకోసారి నువ్వు ఇంట్లో కూర్చోక ఎందుకిలా తిరుగుతావంటే
కూర్చుని చచ్చే కన్నా తిరిగి చావడం మిన్న అంటాడు గడ్డప్ప. నిజానికి తిరుగుతున్నవి అతడి కాళ్ళు కాదుమనసులోనే ఏదో సుళ్ళు తిగుగుతోంది. ఆ పోటుకి కూర్చుని వుంటే చచ్చిపోతాడు. అందుకని ఇలా నిత్య సంచారి. మనసులో ఏమిటా పోటు అనేది సస్పెన్స్. పైకి చెప్పుకోలేడు. ఈ చీకటి కోణమే కథకి బలమైన వెన్నెముక.

లిక్కర్ తాగడం మరుపు కోసం
పులిజూదం ఆడడం మనస్సుని గెలవాలన్న ఆరాటంతో. ఒకవైపు మర్చిపోవాలనిఇంకో వైపు గెలవాలని. క్షమిస్తే మనస్సుని గెలవగలడు. కానీ తండ్రి సెంచురీ గౌడ తనతో చేసింది క్షమించరానిది. అది పైకి కూడా చెప్పుకోలేనిది>

వంద దాటిన సెంచురీ గౌడ మరణం వూళ్ళో కూడా ఎవరికీ పట్టదు. చాలా పాత సరుకని ముని మనవడు అభి కూడా పట్టించుకోడు. పెద్ద కర్మకి సరుకులు తేవడానికి వెళ్ళి ప్రేమిస్తున్న కావేరీ కనపడగానే ఆమె వెంటపడి వెళ్ళిపోతాడు. ఇటు తండ్రి తమ్మన్న కూడా పెద్ద కర్మని పట్టించుకోకుండా
వేరే అర్జెంటు పని మీద వుంటాడు. ముందు తండ్రి గడ్డప్పని ఓ మాట అడుగుతాడు- నీ అయ్య వంద దాటి బతికాడునువ్వెప్పుడు చస్తావో ఏమోఈలోగా నీ తమ్ముళ్ళు పొలం పంచమని వచ్చేస్తారుఅందుకని అయ్యనుంచి నీకొచ్చిన అయిదెకరాలు నాకు రాసేయ్- అని వెంటపడతాడు. గడ్డప్ప ఒకటే మాటంటాడు - నేను చచ్చాకేనీ కొచ్చేది అని.

సెంచురీ గౌడ చితాభస్మం సేకరించబోయి అక్కడ కెలుకుతూ- ప్రక్కటెకముకలు మిగిలేవున్నాయివీడు మామూలోడు కాదనుకుంటారు. అందుకే వూళ్ళో ప్లే బాయ్ లా వెలిగి అలాటి పన్లు చేశాడని అనుకుంటారు. ఇలా సెంచురీ గౌడ గురించి కొత్త విషయం మనకి తెలుస్తుంది. బూతుల వీరుడెందుకయ్యాడో పాత్ర అర్ధమవుతుంది.

పొలం రాయడానికి తండ్రి నిరాకరించడంతో తమ్మన్న టౌను కెళ్ళిపోయి
టింబర్ డిపో ఆసామికి పొలం బేరం పెట్టేస్తాడు. ఇరవై లక్షలకి బేరం కుదురుతుంది. ఆసామీ పత్రాలు పరిశీలించి గడ్డప్ప పేరు మీద వున్నాయే అంటేతన తండ్రి గడ్డప్ప చచ్చిపోయాడని తమ్మన్న అనేస్తాడు. అయితే డెత్ సర్టిఫికేట్ పట్రమ్మంటాడు ఆసామీ. తమ్మన్న రెవిన్యూ అధికారికి లంచమిచ్చి డెత్ సర్టిఫికేట్ సంపాదిస్తాడు. ఇక నీ తండ్రి గడ్డప్ప ఈ చుట్టుపక్కల కనిపించకూడదని రెవిన్యూ అధికారి హెచ్చరిస్తాడు.

తమ్మన్న తిరిగి వచ్చి
ఒక వడ్డీల రౌడీ రాణి దగ్గర తెగించి భారీ వడ్డీకి రెండు లక్షలు అప్పు తీసుకుంటాడు. ఆ డబ్బు గడ్డప్ప కిచ్చినీకు తిరగడం అలవాటు కదాఇక అలా ఓసారి దేశాటన చేసి ఆర్నెల్ల తర్వాత రమ్మని బస్సెక్కించి పంపించేస్తాడు. ఇక చట్టం దృష్టిలో గడ్డప్ప చచ్చిపోయాడు! తాత పెద్దకర్మ లోగా తండ్రి మాయంఅస్తమయం!      

అయితే తాత చితి దగ్గర మిగిలిన కార్యక్రమం చేస్తున్నప్పుడు అక్కడ జనం మధ్య గడ్డప్ప ప్రత్యక్షమై పోతాడు. బస్సెక్కించి పంపించేస్తే ఎలా వచ్చాడు
? ఎందుకొచ్చాడు? నిజం తెలిసిపోయిందా?  కొడుకు తమ్మన్నకి  పీక్కోలేని కక్కలేని పరిస్థితి!

ఇక్కడ్నించీ గడ్డప్ప అటు తండ్రే నీచుడు అనుకుంటే ఇప్పుడు కొడుకు విశ్వాస ఘాతుకానికీ మతిచలించిన వాడవుతాడు. అయినా చేతికొచ్చిన పొలం డబ్బులు పోతున్నాయన్న కసి తమ్మన్నకి... రక్తసంబంధాలు రిక్త హస్తాల్ని మిగిల్చాయన్న ఆక్రోశంతో తండ్రిని దూషించడాలు. అటు తండ్రి
ఇటు కొడుకూ  గుండెల్లో గునపాలు దింపిన వాళ్ళైపోతేగడ్డప్పకి ఏ దిక్కూ తోచని స్థితి.

చీకట్లో చలిమంటేసుకుంటున్న గడ్డప్ప క్లోజింగ్ ఇమేజితో కదిలించే విధంగా  ముగింపు. ఈ సహజ కథ కథ నడిపిన తమ్మన్నది కాదనీ
కథకి కారకుడైన మౌన బాధితుడు గడ్డప్ప దనీ చిట్ట చివర్లో తేలి గడ్డప్ప చాలా గొప్పగా కన్పిస్తాడు. పాత్ర చిత్రణంటే ఇదీ కదా అన్పించేలా. ఆ రెండు లక్షలు పట్టుకెళ్ళిన గడ్డప్ప తాగితందానా లాడెయ్యడుపరోపకారానికి వాడేస్తాడు. కాస్త కుదురుగా అతను గడిపేది గొర్రెల పెంపకం వాళ్లతోనే. ఈ గడ్డప్ప విషాదానికి హాస్యంతో ఇచ్చిన షుగర్ కోటింగే జీవం పోసింది. ఈ హాస్యం వూరికే హాస్యం కోసం అన్నట్టు లేదువివిధ ఆచారాలూప్రవర్తనా లోపాలపైన ఆలోచనాత్మక వ్యంగ్యాస్త్రాలివి.

స్థానిక పాత్రలకి స్థానికులే నటులు

  సెంచురీ గౌడగడ్డప్పతమ్మన్న పాత్రల్లో సింగ్రి గౌడచన్నే గౌడతమ్మే గౌడ వృత్తి నటులు కారు. నటన తెలీని ఆ వూరి సగటు మనుషులే. అభికావేరీ యువ పాత్రల్లో అభిషేక్పూజ సైతం స్థానికులే. ఇంకా అన్ని సహాయ పాత్రలూమిగతా అందరూ స్థానిక ప్రజలే. వీళ్ళకి 80 రోజుల పాటు శిక్షణ నిచ్చాడు దర్శకుడు. ఆ వూరి ఆత్మని అక్కడే వుంటూ రాసుకుంటూతీసుకుంటూ ఆవాహన చేసుకుని ఒక యజ్ఞంలా పూర్తి చేశాడు.         

ముఖ్య పాత్రల్లో సింగ్రి గౌడచన్నే గౌడతమ్మే గౌడ వృత్తి నటులే అన్నంత సహజ మెథడ్ యాక్టింగ్ చేసి బలమైన ముద్ర వేస్తారు. పాత్రల్ని మర్చిపోలేని విధంగా ప్రేక్షకుల మనో ఫలకాల మీద ముద్రించి వదుల్తారు. ఎక్కడా కమర్షియల్ యాక్టింగ్ వుండదు.      

ఈ తరం దర్శకుడు రాంరెడ్డిరచయిత ఎరెగౌడ జీవితం పట్ల లోతైన అవగాహన గల వాళ్ళుగా అన్పిస్తారు. హైలైట్ చేయాల్సిన ముఖ్య విషయమేమిటంటేఆర్ట్ సినిమాకి నూతన కల్పన చేస్తూ కథా నిర్మాణం వుండని పాసివ్ పాత్రల ఆర్ట్ సినిమా తీయలేదు. సగటు ప్రేక్షకుల అనుభవంలోకి కూడా ఆర్ట్ సినిమాని తీసుకొస్తూప్రధాన స్రవంతి సినిమా తరహా మూడంకాల (త్రీయాక్ట్ స్ట్రక్చర్) నిర్మాణం చేశారు. కథ స్ట్రక్చర్ లో వుందంటే పాసివ్ పాత్రలుండవు. దృశ్య మాధ్యమమైన సినిమాకి కావాల్సిందిదే. అయితే ఈ సినిమాని వివిధ దేశ భాషల్లో డబ్బింగ్ చేసి ఓటీటీలో వుంచాల్సింది. జాతీయంగాఅంతర్జాతీయంగా రికార్డు స్థాయిలో ఇరవై అవార్డులు పొందిన ఈ సృజనాత్మకత వివిధ భాషల్లోకి వెళ్ళాలి.
        
ఇంతకీ కొడుకు గడ్డప్ప పట్ల తండ్రి సెంచురీ గౌడ పాల్పడిన చెప్పుకోలేని నీచ కార్య మేమిటిఇదిక్కడ చెప్పేకన్నా నెట్ ఫ్లిక్స్ లో చూస్తేనే బావుంటుంది.

—సికిందర్

16, జనవరి 2023, సోమవారం

1285 : రివ్యూ!


 

రచన -దర్శకత్వం : ఆస్మాన్ భరద్వాజ్
తారాగణం : టబు, అర్జున్ కపూర్, కొంకణా సేన్ శర్మ, నసీరుద్దీన్ షా, రాధికా మదన్, కుముద్ మిశ్రా, శార్దూల్ భరద్వాజ్ తదితరులు
పాటలు : గుల్జార్, ఫైజ్ అహ్మద్ ఫైజ్; సంగీతం : విశాల్ భరద్వాజ్, ఛాయాగ్రహణం : ఫర్హాద్ అహ్మద్ డెహ్ల్వి
బ్యానర్స్ : లవ్ ఫిల్మ్స్, టీ- సిరీస్ ఫిల్మ్స్, విశాల్ భరద్వాజ్ ఫిల్మ్స్
నిర్మాతలు : విశాల్ భరద్వాజ్, లవ్ రంజన్, భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్
విడుదల : జనవరి 13, 2023

        విశాల్ భరద్వాజ్ కుమారుడు ఆస్మాన్ భరద్వాజ్ ని దర్శకుడుగా పరిచయం చేస్తూ తన తరహా థ్రిల్లర్ తీయించాడు. విదేశాల్లో శిక్షణ పొంది వచ్చిన ఆస్మాన్ భరద్వాజ్ క్వెంటిన్ టరాంటినో, కోయెన్ బ్రదర్స్, గై రిచీలని ఫాలో అవుతూ కుత్తే (కుక్కలు) మేకింగ్ చేశాడు. ఈ కుక్కలకి ఒకే బొక్క (ఎముక) కావాలి. దానికోసం కాల్చి చంపుకుంటారు. చివరికి ఏ కుక్కకి బొక్క దొరికిందన్నది కథ. ఆ కుక్కలు గడ్డితినే పోలీసులు, డ్రగ్ స్మగ్లర్లు, నక్సల్స్.  ఆ బొక్క ఏటీఎం వ్యానులో నోట్ల కట్టలు. ముంబాయి శివారులో రాత్రి పూట వేట.

         మగ కుక్కల మధ్య ఓ ఖతర్నాక్ ఆడ కుక్క వుంటుంది టబు రూపంలో. ఇది ప్రధానంగా టబు సినిమా. క్వెంటిన్ టరాంటినో రిజర్వాయర్ డాగ్స్ తరహా పాత్రలు, కోయెన్ బ్రదర్స్ శైలి నోయర్ మేకింగ్, గై రిచీ టైపు డార్క్ కామెడీ కలగలిపి ఓ దేశీ హాలీవుడ్ ని సింగారించాడు కొత్త దర్శకుడు.
        
ఈ కథ మూడు చాప్టర్లుగా వుంటుంది. ఫస్టాఫ్ లో రెండు, సెకండాఫ్ లో ఒకటి. ఈ మూడు చాప్టర్లకి ప్రారంభంలో నాంది వుంటుంది. చాప్టర్ల తర్వాత ఉపసంహారం వుంటుంది. అసలు కథ సెకండాఫ్ లో మొదలవుతుంది. కుక్కల మీద మార్క్సిస్టు కవి ఫైజ్ అహ్మద్ ఫైజ్ రాసిన యే గలియోమే ఆవారా బేకార్ కుత్తే గీతంతో బాటు, గుల్జార్ రాసిన ఆజాదీ సాంగ్ తో ఈ సినిమా ఏ నేపథ్యంలో ఐడియాలజీ చెప్తోందో అర్ధం జేసుకోవచ్చు. ఇదంతా ఎలా మొదలవుతుందంటే...

నాంది – లక్ష్మీ బాంబు

2003 లో నక్సలైట్ నాయకురాలు లక్ష్మీశర్మ (కొంకణా సేన్ శర్మ) మహారాష్ట్ర లోని  గడ్చిరోలీలో ఒక ఠాణాలో బందీ అయి వుంటుంది. పోలీసు హింసని భరిస్తుంది. తెల్లారే నక్సల్ దళం ఠాణామీద దాడి చేసి ఆమెని విడిపించుకు పోతారు. పోతూ లక్ష్మీశర్మ ఒక అధికారి చేతిలో బాంబు పెట్టి, అతడికి తర్వాత పనికొచ్చే ముక్క చెప్పి పోతుంది.

మొదటి చాప్టర్ – సబ్ కా మాలిక్ ఏక్ హై
        పదమూడేళ్ళ తర్వాత 2016 లో-  ముంబాయిలో భయంకర డాన్ నారాయణ్ ఖోబ్రే (నసీరుద్దీన్ షా) ఎదుట ఇద్దరు పోలీసు అధికారులు గోపాల్ (అర్జున్ కపూర్), పాజీ (కుముద్ మిశ్రా) వుంటారు. వీల్ చైర్ లో వున్న భయంకర డాన్ నారాయణ్ ఖోబ్రే, అసలు డ్రగ్ డీలర్ సూర్తితో మీరెందుకు రిలేషన్ పెట్టుకున్నారురా?’ అని అడుగుతాడు. వాడిని ఖతం చేయమని ఆర్డరేస్తాడు. గోపాల్, పాజీలు సూర్తిని చంపి అతడి దగ్గరున్న కోట్ల విలువైన డ్రగ్స్ తీసుకుని పారిపోవాలని ప్లానేస్తారు.
       
అలా సూర్తిని చంపామనుకుని డ్రగ్స్ తీసుకుని పారిపోతూ సూర్తి అందించిన సమాచారంతో పోలీసులకి దొరికిపోతారు. తమ సీనియర్ రాజీవ్ మిశ్రా (దర్శకుడు ఆస్మాన్ భరద్వాజ్) కి తాము కోవర్ట్ ఆపరేషన్ చేశామని బొంకుతారు. అబద్ధాలు చెల్లవని రాజీవ్ ఇద్దర్నీ సస్పెండ్ చేస్తాడు. విధిలేక ఇద్దరూ ఇన్‌స్పెక్టర్ పమ్మీ(టబు) దగ్గరి కెళ్ళి సాయం కోరుతారు.

రెండో చాప్టర్ - ఆతా క్యా కెనడా

సాయం అడిగిన ఇద్దరికీ కోటి రూపాయలిస్తే సస్పెన్షన్లు ఎత్తివేయిస్తానని చెప్తుంది ఇన్స్ పెక్టర్ పమ్మీ. ఇంతలో పమ్మీ పాత కొలీగ్ హేరీ (ఆశీష్ విద్యార్థి) వస్తాడు. ఇతనిప్పుడు ముంబాయి, నవీ ముంబాయిలలో ఏటీఎంలకి డబ్బు సరఫరా చేసే వ్యానుకి సెక్యూరిటీగా వుంటున్నాడు. ప్రతి రాత్రి వ్యాన్‌లో  4 కోట్ల డబ్బు సరఫరా అవుతుందని చెప్తాడు. దీంతో గోపాల్ టెంప్ట్ అవుతాడు. ఇక వ్యాను పని బట్టాలని ప్లానేస్తాడు షాజీతో కలిసి.
        
పోలీసుల్లో తనలాంటి డర్టీ డాగ్స్ ని పోగేసి ఒక నకిలీ చెక్ పోస్టు ఏర్పాటు చేస్తాడు. డర్టీ డాగ్స్ ని కనిపెట్టిన హేరీ, నకిలీ చెక్ పోస్టుదగ్గర పిచ్చి కుక్కల్ని చంపినట్టు కాల్చి చంపుతాడు. తెలివైన కుక్క గోపాల్ అంత త్వరగా చావక ఏటీఎం వ్యానుతో ఉడాయిస్తాడు. ఈ వ్యాను కోసమే వేర్వేరు ప్లానులు వేసుకున్న భయంకర డాన్ నారాయణ్ ఖోబ్రే కూతురు లవ్లీ ఖోబ్రే (రాధికా మదన్), ఆమె బాయ్ ఫ్రెండ్;  నక్సల్ లక్ష్మీ శర్మా వచ్చి పడతారు.
        
పై రెండు చాప్టర్ల పేర్లు సబ్ కా మాలిక్ ఏక్ హై, ఆతా క్యా కెనడాల తర్వాత ఇక మూడో చాప్టర్ మూంగ్ కీ దాల్ (పెసర పప్పు) లో మిగతా కథ చూడొచ్చు. ఈ కథలో డబ్బు వేటలో డబ్బు చివరికి ఎవరికి చేజిక్కిందనేది క్రూరమైన ఆటగా వుంటుంది. ఈ ఆటలో ఇన్స్ పెక్టర్ పమ్మీ డామినేటింగ్ పాత్ర ఏంటో తెలుస్తుంది.

అనైతిక పాత్రలు -అద్భుత నటనలు

తండ్రి విశాల్ భరద్వాజ్ తో కలిసి ఆస్మాన్ భరద్వాజ్ తయారు చేసిన స్క్రిప్టు డార్క్ కామెడీకి ఎక్స్- రేట్ పంచ్ లతో వుంది. పైవాడు ఆడంగి వెధవల్ని తయారు చేయడం మానేశాడు. ఇప్పుడు చిన్నవెర్రి పువ్వు (బూతు), పెద్ద వెర్రి పువ్వు (బూతు), మహా వెర్రి పువ్వుల్ని (బూతు) తయారు చేసి పంపుతున్నాడు' - టబు డైలాగు. న్యాయానికి రోజులు కావు. నీ...(బూతు) అందరికందరూ కుక్క నా కొడుకులే -అర్జున్ కపూర్  డైలాగు. మార్కెట్లో నా వేల్యూ కంటే వాడి వేల్యూ ఎందుకు తక్కువ (బూతు) రా?'- నసీరుద్దీన్ షా డైలాగు. విశాల్ భరద్వాజ్ రాసిన డైలాగులు గత సినిమాలకంటే మితిమీరిన డైరెక్టు తిట్లతో వున్నాయి.  
        
అయితే నటనలు ఖతర్నాక్ గా వున్నాయి. ఓవరాక్షన్ లేని ఖతర్నాక్. ఇందులో టబుది ప్రథమ స్థానం. ఈ హార్డ్ కోర్ సీరియస్ క్రైంలో ఆమె ఒక్కటే నవ్వించే పాత్ర. ఆస్మాన్ భరద్వాజ్ దర్శకత్వంలో సాంకేతిక - సృజనాత్మక విశేషాలున్నాయి. రెండు కీలక సన్నివేశాల్లో రెడ్ సిల్హౌట్ తో దృశ్యపరమైన మూడ్ ని క్రియేట్ చేశాడు. రాత్రి పూట దృశ్యాలన్నీ ఎల్లో టింట్ తో వున్నాయి. ఈ లైటింగ్ ఎఫెక్ట్స్ సైకలాజికల్ గా ఒకలాంటి మత్తులోకి తీసికెళ్తాయి.
        
అయితే డబ్బుకోసం మూడు ముఠాల విచ్చలవిడి కాల్పులు, చావులూ కథ మీద పట్టు తప్పేలా చేశాయి. యాక్షన్ వుంటుంది గానీ కథా పరమైన సస్పెన్స్, థ్రిల్, ఇప్పుడేం జరుగుతుందన్న మలుపులూ లేవు. చిత్రీకరణలో వున్న సృజనాత్మకత సెకండాఫ్ కథ చెప్పడంలో లేదు. అయితే సాగదీయకుండా గంటా 45 నిమిషాల్లో ముగించడం రిలీఫ్. ముగింపులో ఉపసంహారం ఫన్నీగా వున్నా, దానికి డార్క్ కామెడీతో ఇచ్చిన ఫినిషింగ్ టచ్  లాజికల్ గా వుండదు - లాజిక్ క్యాహై అని ప్రశ్న వేసి తప్పించుకుంటాడు. 
        
మొత్తానికి తండ్రి అడుగు జాడల్లో తండ్రిలాగా తీసిన ఆస్మాన్ భరద్వాజ్, ఇకపైన తనలాగా తీసి నిరూపించుకోవాలి. పైన చెప్పుకున్న హాలీవుడ్ దర్శకుల్ని అనుసరించడం కూడా ఈ రోజుల్లో వర్కౌట్ కాదు. అందులో గై రిచీ  తప్ప క్వెంటిన్ టరాంటినో, కోయెన్ బ్రదర్స్ తమ బ్రాండ్ నుంచి దూరం జరిగి శైలిని మార్చుకున్నారు.
—సికిందర్