రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Wednesday, May 8, 2024

1427 : రివ్యూ!

దర్శకత్వం : డేవిడ్ అయర్       
తారాగణం : జేసన్ స్టాథమ్, ఎమ్మీ రావర్-లాంప్‌మాన్, ఫిలిసియా రషద్, జోష్ హచర్సన్, డేవిడ్ విట్స్, బాబీ నాడేరీ, జెరెమీ ఐరన్స్
సంగీతం : డేవిడ్ సర్డీ, ఛాయాగ్రహణం : గాబ్రియేల్ బెరిస్టైన్
బ్యానర్స్ : మెట్రో గోల్డ్విన్ మేయర్, మీరామాక్స్
నిర్మాతలు : బిల్ బ్లాక్, జేసన్ స్టాథమ్, డేవిడ్ అయర్, క్రిస్ లాంగ్, కర్ట్ విమ్మర్
విడుదల ; ఏప్రిల్ 26, 2024 ( లయన్స్ గేట్ ప్లే ఓటీటీ)
***
            హాలీవుడ్ యాక్షన్ సీనియర్ హీరో జేసన్ స్టాథమ్ గత సంవత్సరం నాలుగు సినిమాలు నటించి మరో యాక్షన్ తో వచ్చాడు. 1998 నుంచీ ఫ్యాన్స్ ని పోగొట్టుకోకుండా ట్రాన్స్ పోర్టర్’, మెకానిక్’, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ మొదలైన 30కి పైగా హెవీ మాస్ యాక్షన్ సినిమాలతో కొనసాగుతున్న స్టాథమ్, వరుస యాక్షన్ సినిమాల దర్శకుడు డేవిడ్ అయర్ తో కలిసి ది బీకీపర్ అనే మరో భారీ యాక్షన్ కి తెరతీశాడు. జనవరిలో థియేట్రికల్ గా విడుదలై విజయం సాధించి గతవారం నుంచి లయన్స్ గేట్ ప్లే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ  కథాకమామిషేమిటో చూద్దాం...

కథ
రిటైర్డ్ స్కూల్ టీచర్ ఎలోయిస్ పార్కర్ (ఫిలిసియా రషద్) ఒంటరిగా నివసిస్తూంటుంది. ఆమె ఎస్టేట్ లో ఆడమ్ క్లే (జెసన్ స్టాథమ్) తేనెటీగల పెంపకం దారుగా జీవిస్తూంటాడు. ఒక రోజు ఎలోయిస్ ఫిషింగ్ స్కామ్ లో ఇరుక్కుంటుంది. తను నిర్వహిస్తున్న బాలల ఛారిటీ ఫండ్ తాలూకు బ్యాంకు ఖాతా నుంచి 2 మిలియన్ డాలర్లని ఒక్క క్లిక్ తో పోగొట్టుకుంటుంది. దీంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంటుంది. ఆమె కుమార్తె ఎఫ్బీఐ అధికారిణి వెరోనా పార్కర్‌ (ఎమ్మీ రావర్-లాంప్‌మాన్) వెంటనే ఆడమ్ ని అరెస్టు చేస్తుంది. తర్వాత అనుమాన నివృత్తి చేసుకుని వదిలేస్తుంది. అయితే తన తల్లిని దోచుకున్న ఆన్ లైన్ స్కామ్ ముఠాని ట్రాక్ చేసి  పట్టుకోలేకపోతున్నామని, ఈ విషయంలో సాయం చేయమనీ ఆడమ్ ని కోరుతుంది.
        
ఆడమ్ ఒకప్పుడు బీకీపర్స్ అనే సీక్రేట్ గ్రూపులో పనిచేసిన వాడే. ఈ గ్రూపు ఆన్ లైన్ స్కామర్స్ ని పట్టుకునే గోల్ తో పనిచేస్తూంటుంది. ఆడమ్ ఈ గ్రూపుని సంప్రదించి మిక్కీ గార్నెట్ (డేవిడ్ విట్స్) అనే యువ టెక్కీ నడుపుతున్న ఒక కాల్ సెంటర్ అడ్రసు తెలుసుకుని, అక్కడికెళ్ళి అందర్నీ చిత్తుగా తన్ని, కాల్ సెంటర్ ని పేల్చేస్తాడు. దీన్ని మిక్కీ తన బాస్ డెరెక్ (జోష్ హచర్సన్) కి రిపోర్టు చేసి, ఆడమ్ బీకీపర్స్ మాజీ మెంబరని చెప్తాడు.
        
డెరెక్ మాజీ సీఐఏ డైరెక్టర్ వాలెస్ వెస్ట్ విల్డ్ (జెరెమీ ఐరన్స్) కి ఆడమ్ గురించి చెప్తాడు. డెరెక్ నడుపుతున్న గ్లోబల్ కాల్ సెంటర్స్ కి సెక్యూరిటీ చూస్తూంటాడు వాలెస్. ఇతను ప్రస్తుత సీఐఏ డైరెక్టర్ హార్వర్డ్ కి కాల్ చేసి ఆడమ్ ని ఆపాల్సిందిగా కోరతాడు. ఇంతలో ఆడమ్ బోస్టన్ లో డెరెక్ కి చెందిన కాల్ సెంటర్ హెడ్ క్వార్టర్స్ ని పేల్చేయబోతున్నాడని వేరొనాకి సమాచారమందుతుంది.
       
ఆడమ్ చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని శత్రువుల్ని నాశనం చేయాలని ప్ర్రయత్నిస్తూంటే
, వెరోనా చట్టప్రకారం సక్రమ మార్గంలో నేరస్థుల్ని పట్టుకోవాలని పరుగులు దీస్తూంటుంది. ఈ క్రమంలో ఈ స్కామ్ తో అమెరికా అధ్యక్షురాలు జెస్సికాకి సంబంధం వుందని తెలుసుకున్న ఆడమ్ ఆమెని చంపడానికి సాగిపోతాడు. ఇప్పుడేం జరిగింది? అధ్యక్ష్యురాలిని చంపకుండా వెరోనా ఆడమ్ ని ఆపగల్గిందా?
రిటైర్డ్ స్కూల్ టీచర్ ఎలోయిస్ మృతికి కారకులైన శత్రుశ్రేణిని చంపడం ఒక్కటే లక్ష్యంగా పెట్టుకున్న ఆడమ్,  ఆఖరికి అమెరికా ప్రెసిడెంట్ సమీపంలోకి చేరుకోగల్గిన క్షణాన ఏం జరిగింది? ఇదీ మిగతా కథ.

నాన్ స్టాప్ బాదుడు
సినిమా సాంతం ఎవర్నో ఒకర్ని బాదుతూనే వుంటాడు జేసన్ స్టాథమ్. వృద్ధుల నుంచి లాక్కోవడం పిల్లల నుంచి దొంగిలించినంత చెడ్డది. పోగొట్టుకుంది పిల్లవాడైతే వాడికి తల్లిదండ్రులు వుంటారు. వృద్ధులకి ఎవరుంటారు చెప్పుకోవడానికి? కొన్నిసార్లు ఒంటరిగా పోరాడతారు, కొన్నిసార్లు పోరాడలేరు. వాళ్ళని పట్టించుకునే వాళ్ళే వుండరు అన్న డైలాగుతో ఈ కథకి ఎమోషనల్ గ్రిప్ ఇస్తాడు.
        
ఈ సెంటిమెంటల్ అప్రోజ్ తో ఒక్కొక్కడ్నీ బాదిన ప్రతీసారీ ప్రేక్షకుల కచ్చి తీరుతూంటుంది. ఈ డ్రమెటిక్ పాయింటు పట్టుకుని ఈ యాక్షన్ మూవీని బలంగా నడిపిస్తూంటాడు. ఒంటరిగా ఒంటిచేత్తో ఎలా అంత మందిని చంపుతాడు, ఎలా ఎప్పుడు పడితే అప్పుడు పేల్చేస్తాడూ అన్న లాజిక్ కి ఇక్కడ స్థానం లేదు. ఆత్మహత్య చేసుకున్న వృద్ధురాలికి న్యాయం చేస్తున్నాడా, మన కచ్చి తీరిందా అన్నదే ముఖ్యం. ఏయ్, నా మాటల్ని రిపీట్ చేయండి...మేము బలహీనుల నుంచి దొంగిలించే పని మళ్ళీ చెయ్యం అని చెప్పించుకుని మరీ చంపుతూంటాడు.
        
జీవితాంతం కష్టపడి పనిచేయడం తప్ప మరేమీ చేయని వ్యక్తుల నుంచి మీరు వందల మిలియన్లు దొంగిలించారు. ఆమె విద్యావేత్త. ఒక అమ్మ. తన జీవితమంతా ప్రజలకి  సహాయం చేయడానికి అంకితం చేసింది.  ఆమె నడుపుతున్న ఛారిటీ నుంచి  మీరు రెండు మిలియన్లు కాజేస్తే కాల్చుకుని ఆత్మహత్య చేసుకుంది. ఎప్పుడూ నన్ను జాగ్రత్తగా చూసుకున్న ఏకైక వ్యక్తి ఆమె అని జేసన్ స్టాథమ్ విసిరే డైలాగులకి జవాబులుండవు దుష్టుల దగ్గర.
       
అసలు స్కామ్ కూడా అంత ఈజీగా ఎలా జరుగుతుందని వివరించే జోలికి కూడా పోలేదు దర్శకుడు డేవిడ్ అయర్.
యువ టెక్కీల గ్రూపు ఒక భారీ హై-టెక్ సెంటర్ నడుపుతూ,  ప్రజల బ్యాంకు ఖాతాల నుంచి  ప్రతి రోజూ మిలియన్ల డాలర్లని ఎలా తుడిచి పెట్టేస్తారు, అది ప్రభుత్వ దృష్టికి పోకుండా ఎలా వుంటుందీ అనే చిక్కుల్ని వివరించడానికి ఎలాటి ప్రయత్నం చేయలేదు.
        
ఆన్ లైన్లో దోపిడీ జరుగుతోందనేది ఆందోళనకర వాస్తవం. ఎలా జరుగుతోందనేది తెలిసిందే. కాబట్టి ఆ ప్రక్రియ జోలికి పోకుండా, ఒక వృద్ధురాలు భారీ మొత్తంలో పోగొట్టుకుని ఆత్మహత్య చేసుకుంది, ఆమెకి న్యాయం జరగాలి- అని సూటిగా సగటు ప్రేక్షకుల స్థాయికి దించి చెబితే కమర్షియల్ గా హిట్టే. 40 కోట్ల డాలర్ల  బడ్జెట్ కి 152 కోట్ల డాలర్ల బాక్సాఫీసు వచ్చిందంటే కథతో ఈ ఫార్ములా కరెక్టే అనుకోవాలి.

కిక్‌లు- పంచ్‌లు- పేల్చివేతలు
మార్షల్ ఆర్టిస్టు జేసన్ స్టాథమ్ ఇచ్చే కిక్‌లు, పంచ్‌లు, ఢామ్మని చేసే బ్లాస్టింగులూ - ఆ యాక్షన్ కొరియోగ్రఫీ (గాబ్రియేల్ బెరిస్టైన్) ప్రారంభం నుంచీ ముగింపు దాకా అదరగొడతాయి. ఇతరుల కష్టార్జిత డబ్బు పట్ల ఏమాత్రం మానవత్వం చూపని వారిపై రివెంజ్ ఈ యాక్షన్ కి భావోద్వేగాల్ని సృష్టిస్తూ వుంటుంది. చాలా పాత్రలు మూస పాత్రలే. ప్రజల డబ్బు దోచుకుని సూపర్ రిచ్ గా మారిన ఘరానా వ్యక్తులు. వీళ్ళతో ఏళ్ళకి ఏళ్ళు పట్టే చట్టాలూ న్యాయప్రక్రియా వర్కౌట్ కావు. వ్యవస్థకి పై స్థాయిలో వ్యవహరించే ది బీకీపర్స్ చేసే తక్షణ న్యాయం జరగాలి. ఇది యూనివర్సల్ సమస్య. ఎవరో నైజీరియా విద్రోహక శక్తులకే పరిమితమై లేదిప్పుడు. ఎంత హైటెక్ గా ఈ ఫ్రాడ్స్ జరుగుతూంటే అంత నాటుగా శిక్షలు పడాల్సిందే. ఆ రుచే వేరు. ఈక్వలైజర్ సిరీస్ సినిమాలతో ఇలాటి నాటు శిక్షలే వేస్తాడు డెంజిల్ వాషింగ్టన్. ఇప్పుడు జేసన్ స్టాథమ్. అయితే ఇంగ్లీషులో తప్ప మరో భాషలో స్ట్రీమింగ్ అవట్లేదు ఈ మూవీ!

—సికిందర్ 

Tuesday, May 7, 2024

1426 : రివ్యూ

 

రచన -దర్శకత్వం : అర్జున్ వైకే
తారాగణం : సుహాస్, పాయల్ రాధాకృష్ణ, రాశీ సింగ్, నితిన్ ప్రసన్న, హర్ష వర్ధన్, వైవా హర్ష తదితరులు
సంగీతం : విజయ్ బుల్గానిన్, : ఛాయాగ్రహణం : ఎస్.చంద్రశేఖరన్
నిర్మాతలు : నిర్మాత: మణికంఠ, ప్రసాద రెడ్డి
విడుదల : మే 3, 2024
***
        టీవల అంబాజీ పేట మ్యారేజీ బ్యాండ్ తర్వాత సుహాస్ నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ ప్రసన్న వదనం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ప్రపంచ సినిమాల్లోనే అరుదైన కథా వస్తువుతో కొత్త దర్శకుడు అర్జున్ వైకే సుహాస్ ని ఒప్పించుకుని సినిమా తీసి ప్రేక్షకుల తీర్పు కోసం ముందుంచాడు. తెలుగులో సస్పెన్స్ థ్రిల్లర్ అంటేనే భయపడే రోజులు నడుస్తున్నాయి. వచ్చింది వచ్చినట్టు ఎటో వెళ్ళిపోతోంది. అయినా దీని క్రాఫ్ట్ ని నేర్చుకునే మాటే లేదు. ఒకొక్కరూ ఒక్కో హిచ్ కాక్ లా ఫీలై పోవడమే. హిచ్ కాకులు కాకుల్లా వచ్చి వాలుతోంటే ప్రేక్షకులు ఎడం చేత్తో దూరంగా తోలేస్తున్నారు. ఎన్నని తోలుతారు? ఇక కాకులు అగాల్సిన సమయం వచ్చిందేమో. ఈ పరిస్థితుల్లో  ప్రసన్న వదనం అలా ఆగాల్సిన సస్పెన్స్ థ్రిల్లరేనా కాదా తెలుసుకుందాం...

కథ
సూర్య ( సుహాస్ ) రేడియో జాకీ (ఆర్జే) గా పని చేస్తూంటాడు. గతంలో ఒక ప్రమాదంలో మనుషుల్ని గుర్తు పట్టే శక్తిని కోల్పోతాడు. అరుదైన ఫేస్ బ్లయిండ్ నెస్ అనే రుగ్మతకి లోనవుతాడు. మనుషుల ముఖాల్ని గుర్తు పట్టలేడు. గొంతులు కూడా గుర్తించ లేడు. అతడికో మిత్రుడు (వైవా హర్ష) వుంటాడు. అతడికి మాత్రమే ఈ విషయం చెప్తాడు. ఇలాటి ఇతడికి రెండు మూడు చోట్ల ఆద్య (పాయల్ రాధాకృష్ణ) తగిలి ఆమె మీద ప్రేమ పెంచుకుంటాడు. ఇలావుండగా, ఒకరోజు నడి రోడ్డు మీద యాక్సిడెంట్ ని చూస్తాడు. యాక్సిడెంట్ లా అన్పించే ఆ సంఘటనలో ఒకడు ఒకమ్మాయిని లారీ కింద తోసేయడాన్ని చూస్తాడు. దీన్ని పోలీసులకి చెప్తాడు.
       
ఎస్సై (నితిన్ ప్రసన్న)
, ఏసీపీ వైదేహీ (రాశీ సింగ్) ఫేస్ బ్లయిండ్ నెస్ తో వున్న సూర్య చెప్పే వివరాలతో అప్రమత్తమవుతారు. చనిపోయిన అమ్మాయి ఎవరు? ఆమెని ఎవరు, ఎందుకు చంపారు? పోను పోనూ ఈ కేసులో సూర్య ఎలా ఇరుక్కుని పోలీసుల నుంచి పారిపోవడం మొదలెట్టాడు? తన రుగ్మతతో హంతకుల్ని ఎలా పట్టుకోగల్గి నిర్దోషిగా బయటపడ్డాడు? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ
ప్రోసోప్రగ్నోషా (Prosopagnosia) లేదా ఫేస్ బ్లయిండ్ నెస్ అనేది మెదడు ప్రక్రియకి సంబంధించిన రుగ్మత. దీని వల్ల సొంత ముఖంతో బాటు ఇతరుల ముఖాలు కూడా గుర్తు పట్టలేరు. గొంతులు కూడా గుర్తించలేరు. ఏవైనా కారణాల వల్ల మెదడు దెబ్బతినడం వల్ల ఈ పరిస్థితులు ఏర్పడతాయి.  దీనికి చికిత్స లేదు. దీని మీద హాలీవుడ్ నుంచి ఫేసెస్ ఇన్ ది క్రౌడ్ (2011) అనే సస్పెన్స్ థ్రిల్లర్, ఇన్ వివిడ్ డిటైల్ (2007) అనే లవ్ స్టోరీ వచ్చాయి. ఈ రెండు సినిమాలూ ప్రస్తుత ప్రసన్నవదనం లో వున్న సస్పెన్స్ థ్రిల్లర్ కథని, ప్రేమ కథనీ ఎలా ఎంత చక్కగా, ఉత్కంఠ భరితంగా మల్చవచ్చో  తెలియ జేస్తాయి. కొత్త యువ  దర్శకుడు ఈ పరిశీలన లేకుండా పాత మూస విధానంలో సినిమా తీసేశాడు.
       
పేరుకే ఫేస్ బ్లయిండ్ నెస్ తో కథ. దీన్ని హీరో పాత్రకి ఆపాదించకుండా
, కథకీ ఆపాదించకుండా పైపైన నడిపేశాడు. ఒక కొత్త కాన్సెప్ట్ ని వృధా చేశాడు. ఈ కథలో వున్న అతిపెద్ద లోపమేమిటంటే, హత్య చేస్తూండగా చూసిన ఫేస్ బ్లయిండ్ నెస్ హీరోని హంతకుడు చంపాలని వెంటపడడం. సెకండాఫ్ పూర్తిగా ఇదే కథ. ఫేస్ బ్లయిండ్ నెస్ తో వున్న వ్యక్తి సాక్ష్యాన్ని ఏ కోర్టూ తీసుకోదు. అలాంటప్పుడు వాడ్ని చంపాలనుకోవడ మెందుకు? ఎంచక్కా వాడితోనే దోస్తీ చేస్తూ తిరగొచ్చు కదా?ఈ ప్రశ్న వేసుకుంటే సెకండాఫ్ సినిమాయే లేదు.
       
ఇలా సిల్లీ కథ చేసేసి సుహాస్ మీద వేస్తే చెల్లుతుందా
? అందుకే కలెక్షన్స్ రిస్కులో పడ్డాయి. అసలు సస్పెన్స్ థిల్లర్స్ కి కొన్ని జానర్ మర్యాదలుంటాయి. తీసుకున్న పాయింటుకి యాక్షన్ రియాక్షన్లతో కూడిన సస్పెన్స్, థ్రిల్స్, ట్విస్టులు, ఇన్వెస్టిగేషన్, యాక్షన్, డైలమా, టెంపో, ట్రెండీ టేకింగ్, స్పీడు వగైరా. ఇవేవీ లేకుండా నీరసంగా, నత్త నడకన, మధ్య మధ్యలో జానర్ మర్యాద తప్పి లవ్ ట్రాక్, సాంగ్స్, పెళ్ళి చూపులు, ఇంకో బోరు కొట్టే సబ్ ప్లాట్ ...ఇలా సస్పెన్స్ థ్రిల్లర్ అనే ప్రక్రియలో ఇమడని ఎన్నో పాత మూస సీన్లు ఇరికించేశారు.
        
ఫస్టాఫ్ హీరోయిన్ తో ట్రాక్ నడుపుతూ మధ్యలో హత్య చూపించారు. ఆ తర్వాత హీరో దాన్ని మర్చిపోయినట్టు మళ్ళీ హీరోయిన్ తో ట్రాకు నడిపారు. ఇంటర్వెల్లో మాత్రం కిల్లర్ ఎవరో హీరోకి తెలియకుండా ప్రేక్షకులకి ఓపెన్ చేసేశారు. ఈ కథతో చేసిన మంచి పని ఇదొక్కటే. లేకపోతే అలవాటుగా చివరి వరకూ కిల్లర్ ని సీక్రేట్ గా వుంచి ఎండ్ సస్పెన్స్ కథలతో తీసి సినిమాల్ని ఫ్లాఫ్ చేస్తున్నారు.
        
ఇలా మధ్యలో కిల్లర్ ని ఓపెన్ చేయడం వల్ల ఎండ్ సస్పెన్స్ ప్రమాదం తప్పి- ఇప్పుడు హాలీవుడ్ వాళ్ళు చేస్తున్నట్టుగా -మధ్యలో కిల్లర్ ని ప్రేక్షకులకి రివీల్ చేసేసి- సినిమా నిలబడేందుకు ఉపయోగపడే సీన్ టు సీన్ సస్పెన్స్ కథనానికి బాగానే పూనుకున్నారు. అంటే ఇక నుంచీ సెకండాఫ్ లో కిల్లర్ తో హీరోకి ఎలుకా పిల్లీ చెలగాటం యాక్షన్ స్టోరీ అన్నమాట!
       
కానీ మళ్ళీ సెకండాఫ్ లో ఫస్టాఫ్ లాగే ఈ అసలు కథ వదిలేసి హీరోయిన్ తో ట్రాకు
, ఇంకో కుటుంబపు గొడవలు, ఇంకేవో కథలు, అప్పుడప్పుడు మాత్రం హీరోని చంపడానికి ప్రయత్నించే సీన్లూ.... చివరికి ఒక ట్విస్టుతో  హీరో కిల్లర్ ని చంపే ముగింపూ  ఇచ్చేసి చేతులు దులుపుకున్నారు.
       
ఇందులో ఎక్కడా ఫేస్ బ్లయిండ్ నెస్ పాయింటు ప్లే అవదు. ఇది లేకుండా కూడా ఈ కథ చేయ వచ్చు. అసలు ఈ పాయింటు- అంటే ముఖాల్ని  గుర్తుపట్టలేని వాడి సాక్ష్యం పనికి రానప్పుడు
, వాడు అంధుడితో సమానమైనప్పుడు, వెంటపడి  వాడ్ని చంపాలని ప్రయత్నించే కథే అర్ధం లేనిది.
       
ఇక ఫ్లాష్ బ్యాక్ లో అసలు కిల్లర్ ఎందుకా అమ్మాయిని చంపాల్సి వచ్చిందో చూపించారు. ఆమె గర్భవతి. అయితే పోస్ట్ మార్టంలో ఈ విషయం బయటపడదా
?  బయటపడితే ఏసీపీ ఎలా మేనేజ్ చేస్తుంది? అది తన మెడకే చుట్టుకోదా? ఏమిటో ఈ గందరగోళం, గజిబిజి!  

నటనలు- సాంకేతికాలు
ఈ సినిమా ప్రధాన సమస్య ఏమిటంటే హీరో సుహాస్ పాత్రచిత్రణ అర్ధం పర్ధం లేకుండా వుండడం. అతను రేడియో మిర్చీ ఎఫ్ఎంలో పనిచేసే ఆర్జే అయినప్పుడు ఆర్జే లక్షణాలు ఒక్కటీ వుండవు. సగటు నిరుద్యోగి ప్రవర్తనతో భయపడుతూ భయపడుతూ, పిరికి పిరికిగా వుంటాడు. ఆర్జేలు మాటల ప్రవాహంతో రేడియో శ్రోతల్లో ఉత్సాహం నింపుతూ, తమపట్ల క్రేజ్ పెంచుకుని పాపులర్ వ్యక్తులై వుంటారు. కానీ సుహాస్ దీనికి భిన్నంగా పోలీసులు కొడితే గానీ ఐడీ చూపించుకుని తను ఆర్జే అని చెప్పుకోడు!

ఒక హత్య వంటి సంఘటన చూసిన ఆర్జే కార్య నిర్వహణ ఎలా వుంటుంది? వెంటనే ఎఫ్ఎంనే అస్త్రంగా చేసుకుని ప్రజలకి సమాచారాన్ని చేరవేసి పోలీసుల్ని పరుగులు పెట్టిస్తాడు. మీడియా వ్యక్తిగా పరిస్థితిని తన చేతుల్లోకి తీసుకుని డ్రైవ్ చేస్తాడు. కానీ సుహాస్ మాత్రం తనని చూసి ప్రేక్షకులు అయ్యోపాపమని సానుభూతి చెందాలన్నట్టు ప్రవర్తిస్తాడు. ఇంకోసారి పోలీస్ స్టేషన్ కెళ్ళి చేతులు కట్టుకుని నిలడితే ఏసీపీ చూసి, ఎవరమ్మా నువ్వు? ఏం కావాలి?”అంటుంది. ఎంత అవమానం! ఎవరితను?’ అని కాస్టేబుల్ ని అడుగుతుంది. ఎంత షేమ్ ఆర్జే హీరో క్యారక్టర్ కి!

ఒక సీన్లో టెన్షన్ వచ్చి అక్కడ్నుంచి పారిపోయాను. నేనింటికి వెళ్ళాలంటే నా మీద ఎటాక్ చేస్తారని భయంగా వుంది అని ఫ్రెండ్ కి చెప్పుకుంటాడు! ఇతనేం హీరో? హాస్పిటల్ సీన్లో ఆగంతకులు వచ్చి చంపాలని ప్రయత్నిస్తే సుహాస్ ని పోలీసు వచ్చి కాపాడాల్సి వస్తుంది! ఇదేం హీరోయిజం?

సమస్య దర్శకుడితో వుంది. యాక్టివ్ క్యారక్టర్
, పాసివ్ క్యారక్టర్ తేడాలు తెలీక డైరెక్టర్లు అయిపోతున్నారు. కథానాయకుడన్నాక కథని నడిపే యాక్టివ్ పాత్ర కాకుండా, కథని నడపలేని పాసివ్ క్యారక్టర్ గా దద్దమ్మని చేసి సినిమాని నాశనం చేశాడు. ఈ క్యారక్టర్ కి గొప్పగా
ప్రోసోప్రగ్నోషా అని ఒక బిల్డప్ ఒకటి!

హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ ఫార్ములా పాత్ర. తను ఎవరో ఏం చేస్తూంటుందో తెలీదు. తన ముఖం గుర్తు పట్టని హీరోని ప్రేమిస్తూ వుంటుంది. దీనికి పరిష్కారం చూపించాలని కూడా ప్రయత్నించకుండా సుఖాంతం చేశాడు. ఫేస్ బ్లయిండ్ నెస్ తో క్రైమ్ కథ సరిగా లేదు, ప్రేమ కథా సరిగా లేదు.

ఎస్సై పాత్రలో నితిన్ ప్రసన్న
, ఏసీపీ పాత్రలో రాశీ సింగ్ మూస పోలీసు పాత్రలు, నటనలు. హీరో ఫ్రెండ్ గా వైవా హర్ష ఫస్టాఫ్ లో మధ్యలో అదృశ్యమై సెకండాఫ్ మధ్యలో వస్తాడు. డేట్లు కుదరలేదేమో.

ఇక సంగీతం గానీ
, ఛాయాగ్రహణం వంటి సాంకేతికాలు గానీ థ్రిల్లర్ చూస్తున్నట్టు లేవు. హీరోకున్న ఫేస్ బ్లయిండ్ నెస్ ని టెక్నికల్ గా చూపించే ప్రయత్నం కూడా చేయలేదు. అతడి కంటికి మనుషుల రూపాలు ఎలా కనిపిస్తాయీ విజువల్స్ వేసి ప్రేక్షకుల అనుభవంలోకి తెచ్చే ప్రయత్నం చేయలేదు. ఫేస్ బ్లయిండ్ నెస్ బాధితుడికి మనుషుల ముఖాలెలా కనపడతాయో ప్రేక్షకులకి చూపించకపోతే అతడితో ఎలా కనెక్ట్ అవుతారు.

1990 లో గీతాకృష్ణ తీసిన కోకిల లో హీరో నరేష్ కి నేత్ర మార్పిడి చికిత్స తర్వాత అతడికి కన్పించే దృశ్యాలెలా వుంటాయి? చనిపోయిన వ్యక్తి కళ్ళు అమర్చిన తర్వాత అతడ్ని చంపిన హంతకుడు నరేష్ కెలా కన్పిస్తూంటాడు? ఇలా మానసిక లోకాన్ని ఆవిష్కరించాలని లేకపోతే ఎందుకు ఇలాటి సినిమా తీసినట్టు?
—సికిందర్

Monday, April 29, 2024

1425 : రివ్యూ


 

దర్శకత్వం : ఆదిత్యా దత్
తారాగణం : విద్యుత్ జమ్వాల్, అర్జున్ రాంపాల్, నోరా ఫతేహీ, అమీ జాక్సన్, అంకిత్ మోహన్ తదితరులు
రచయితలు : ఆదిత్యా దత్, రెహాన్ ఖాన్, సరీం మోమిన్, మోహిందర్ ప్రతాప్ సింగ్
సంగీతం : విక్రమ్ మాంట్రోస్, ఛాయాగ్రహణం : మార్క్ హేమిల్టన్
బ్యానర్ : యాక్షన్ హీరో ఫిలిమ్స్
నిర్మాతలు :  విద్యుత్ జమ్వాల్, అబ్బాస్ సయ్యద్
విడుదల : ఏప్రిల్ 26, 2024 (డిస్నీ+ హాట్‌స్టార్)   
***

        హైపర్ యాక్షన్ హీరో విద్యుత్ జమ్వాల్ కమెండో సూపర్ యాక్షన్ సిరీస్ సినిమాలతో పాపులరయ్యాడు. డూప్ లేకుండా స్వయంగా ప్రమాదకర ఫైట్స్ నటించే విద్యుత్, ఈసారి డోస్ మరింత పెంచుతూ క్రాక్- జీతేగాతో జియేగా (గెలిస్తేనే బ్రతుకుతావ్) అనే స్పోర్ట్స్ యాక్షన్ థ్రిల్లర్ నటించాడు. దివంగత బాలీవుడ్ గీత రచయిత ఆనంద్ బక్షీ మనవడు ఆదిత్యా దత్ దీనికి దర్శకత్వం వహించాడు. స్పోర్ట్స్ సినిమాలు చాలా వస్తూంటాయి. అయితే వీటికి భిన్నంగా స్పోర్ట్స్ కాని కాల్పనిక స్పోర్ట్స్ కి యాక్షన్ ని జోడించిన విద్యుత్ ప్రయోగం ఫలించిందో లేదో చూద్దాం...  

కథ
ముంబాయి మురికివాడల్లో నివసించే సిద్ధార్థ్ దీక్షిత్ (విద్యుత్ జమ్వాల్) కదులుతున్న లోకల్ ట్రైన్‌లో ప్రమాదకవిన్యాసాలు చేస్తూ వీడియోలు అప్ లోడ్ చేస్తూంటాడు. కూపే డోర్లోంచి బయటికి వంగి, స్తంభాలని తాకి, పైకి ఎక్కి ఒక  కంపార్ట్ మెంట్ మీంచి  మరో కంపార్ట్ మెంటు మీదికి ఉరుకుతూ తన బ్యాచీ ఫ్రెండ్స్ కి పిచ్చెక్కిస్తూ వుంటాడు. దీంతో వీడొక క్రాక్ అనే పేరొస్తుంది. ఇలా వీడియోలు అప్ లోడ్ చేసి పోలాండ్ లో దేవ్ (అర్జున్ రామ్ పాల్) అనే అతను నిర్వహించే ప్రతిష్టాత్మక మైదాన్ అనే అండర్ వరల్డ్ స్పోర్ట్ ఈవెంట్స్ లో సెలెక్ట్ అవ్వాలని ప్రయత్నిస్తూ వుంటాడు. ప్రయత్నం ఫలించి అతడికి మైదాన్ నుంచి ఆహ్వానం వస్తుంది- ఇంకో 31 దేశాల క్రీడాకారులతో బాటు.
       
పోలండ్ లో మైదాన్ అనే క్రీడా ప్రపంచపు సామ్రాజ్యానికి అధిపతిగా వుండే దేవ్
,
మైదాన్ షోరన్నర్ గా యువతకి రేస్ లు నిర్వహిస్తూ కోట్లాది రూపాయలు బహుమానంగా పంచుతూంటాడు. ఇక్కడ మూడు రేసులుంటాయి. మొదటి రేసు గెలిచిన తర్వాత మైదాన్ సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ ఆలియా (నోరా ఫతేహీ) తో ప్రేమలో పడతాడు సిద్ధార్థ్. మరోవైపు దేవ్ క్రీడల ముసుగులో చట్టవ్యతిరేక కలాపాలు చేస్తున్నాడని పసి గట్టిన పోలీసు అధికారి నోవాక్ (అమీ జాక్సన్) దేవ్ ని పట్టుకోవాలంటే సిద్ధార్థ్ సాయం తీసుకోవాలని భావిస్తుంది. ఈమె ద్వారా సిద్ధార్థ్ కి తన అన్న నిహాల్ దీక్షిత్ (అంకిత్ మోహన్) మరణ రహస్యం తెలుస్తుంది. నాల్గేళ్ళ క్రితం ఇక్కడ క్రీడల్లో పాల్గొనడానికి వచ్చిన తన అన్న నిహాల్ మరణం వెనుక దేవ్ హస్తముందని అర్ధమవుతుంది.
       
దీంతో
సిద్ధార్థ్ లక్ష్యం మారుతుంది. ఇక అన్న హత్యకి దేవ్ మీద ప్రతీకారం తీర్చుకునే కార్యక్రమానికి శ్రీకారం చుడతాడు. ఇక్కడ్నుంచి దర్శకుడి ఇష్టానుసారం ఎలా పడితే అలా సాగుతుంది కథ ...

ఎలావుంది కథ
ఈ కథకి నల్గురు రచయితలు సారధ్యం వహించారు. ఈ కథని పూర్తిగా  మైదాన్ విజేతగా బాగా డబ్బు సంపాదించుకుని ధనవంతుడ్ని అవ్వాలన్న హీరో లక్ష్యం గురించి కాకహీరో అన్న మరణానికి ప్రతీకారం తీర్చుకునే అవుట్ అండ్ అవుట్ రివెంజీ  డ్రామాగా కూడా గాక, లేదా క్రీడల పట్ల తనకున్న సహజ ప్రవృత్తిని క్యాష్ చేసుకోవడం ద్వారా ప్రసిద్ధి చెందాలన్న హీరో గోల్ గురించి కూడానూ కాక, ఏం చెప్పాలని ఈ కథ రాశారో అర్ధంగాకుండా జేశారు.
       
ఇలాటిదే ఇదే వారం విడుదలైన
రత్నం లో చూశాం. విలన్ బారీ నుంచి హీరోయిన్ని కాపాడే హీరో కథ కాస్తా, గతంలో ఆ విలన్ తన తల్లి మరణానికి కారణమయ్యాడన్న నిజం తెలిశాక  హీరో రివెంజీ కథగా మారిపోవడం. ఇలా చేస్తే -అంటే నడుస్తున్న కథలో ఇంకో పాయింటు లేవనెత్తితే- కథే మారిపోయి సినిమా ఫ్లాపవుతుందనేది చాలా సార్లు చూశాం. ఇలా జరగకుండా హాలీవుడ్ వాళ్ళు ఒక చిట్కా కనిపెట్టారు.
        
ది మాగ్నిఫిషెంట్ సెవెన్’ (2016) లో కౌబాయ్ డెంజిల్ వాషింగ్టన్, ఓ గ్రామానికి బందిపోటు విలన్ ముఠా పీడా విరగడ చేయడానికి తన గ్రూపుతో వెళ్ళి పోరాడుతూంటాడు. ఇలా సినిమా సాంతం పోరాడుతూనే  వుంటే, పాత్ర నమ్మశక్యంగా అన్పించదు. తనది కాని ఏదో వూరుని కాపాడే అవసరం తనకెందుకు? ఎందుకో చిట్ట చివర్లో వెల్లడిస్తాడు. ఆ బందిపోటు అయిన విలన్ని చంపుతూ, ‘నా చిన్నప్పుడు  మా అమ్మనీనా ఇద్దరు చెల్లెళ్ళనీ చంపావ్ గుర్తుందా?’ అంటాడు వాషింగ్టన్. ఎండింగ్ లో ఈ  స్టేట్ మెంటుకి మనం కూడా షాకవుతాం విలన్ తో పాటు.  విలన్ తో వాషింగ్టన్ కి పాతపగ వుందనే విషయం మనకి అప్పటివరకూ తెలియకుండా దాచారు. తెలిస్తే రొటీన్ రివెంజి కథ అని తెలిసిపోయి ఇంటరెస్టు పోయేది.
       
ఇలా చిట్ట చివర్లో వెల్లడించాక
, వాషింగ్టన్ పాత్ర ఎంతో ఉన్నతంగా ఎలివేటయ్యే పాత్ర చిత్రణా పరమైన హంగు చేకూరింది. అంటే తనలో ఇంత బాధని దాచుకుని గ్రామం కోసం పోరాడాడన్న మాట. హీరో అనేవాడి   మొదటి ప్రాధాన్యం లోక కళ్యాణమే తప్ప సొంత లాభం కాబోదు. అందుకని తన పగదీర్చుకోవడానికే గ్రామంకోసం పోరాడినట్టు అన్పించదు. పగ లేకపోతే వచ్చే వాడు కాదనీ కూడా అన్పించదు. పగ గురించే అయితే విలన్ ఎక్కడున్నాడో అక్కడి కెళ్ళి చంపేసి పోవచ్చు. ఇలా కాకుండా స్వకార్యం, స్వామి కార్యం రెండూ చక్కబెట్టదల్చుకున్నాడు. ఇలా కథకి ఏక సూత్రతని కాపాడ్డంతో బాటు, హీరో క్యారక్టర్ ఎలివేషన్ కీ పనికొచ్చేలా ఎండింగ్ స్టేట్ మెంటుగా చేసి తురుపు ముక్కగా ప్రయోగించారు రివెంజీ అనే రొటీన్ ఎలిమెంట్ ని. దీంతో సినిమా ఫ్లాపయ్యే ప్రమాదం తప్పింది. ఈ మూవీ ఇదే టైటిల్ తో 1966 నాటి క్లాసిక్ కి రీమేక్.
       
పోనీ
క్రాక్ లో ధనవంతుడు అవ్వాలని మైదాన్ లో పాల్గొనేందుకు వచ్చిన హీరో- అన్న హత్య గురించి తెలిశాక రివెంజీ మోడ్ లోకి వెళ్తే వెళ్ళాడు, అప్పుడైనా లక్ష్యాన్ని అప్డేట్ చేసుకుని వుంటే ఈ కథ బతికి బట్టకట్టేది. ఎలాగంటే, సల్మాన్ ఖాన్ నటించిన సుల్తాన్లో సల్మాన్ ఖాన్ చనిపోయిన కొడుకు పేర బ్లడ్ బ్యాంకుకి డబ్బు కోసం మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్ గా దిగుతాడు. ఎప్పుడో పుట్టగానే చనిపోయిన కొడుకు గురించి కథ మనకి తెలీదు. ఆ పుట్టిన శిశువుని కూడా మనకి చూపించరు. ఈ బాధాకర గతమంతా చివర్లో మ్యాచ్ గెలిచాకే మనకి తెలుస్తుంది. అప్పుడు కొడుకు పేర బ్లడ్ బ్యాంకు అనే అతడి ఉన్నతాశయం వెల్లడై క్యారక్టర్ ఎలివేట్ అవుతుంది.
        
క్రాక్ లో హీరో అన్నకి సంబంధించి ఇలాటి ఉన్నతాశయం కోసం లక్ష్యాన్ని అప్డేట్ చేసుకోకుండా, డొల్లగా సాగిపోతుంది హీరో పాత్ర. దీంతో అప్డేట్ చేసిన స్పోర్ట్స్ యాక్షన్ సీన్స్ తప్ప, ఎమోషనల్ కనెక్ట్ లేని  వీడియో గేమ్ లా తయారైంది సినిమా.

నటనలు -సాంకేతికాలు
విద్యుత్ జమ్వాల్ డేర్‌డెవిల్ సాహసకృత్యాలు, వెయ్యి వోల్టుల విద్యుత్ లాంటి  యాక్షన్ సీక్వెన్సులు, ప్రమాదకరమైన రేసింగ్ క్రీడలు చూస్తూంటే మన బీపీ పెరిగిపోతుంది.  డూప్ లేకుండా ఏ కొండ లేదా పర్వతం నుంచి మెరుపు వేగంతో ఎలా దూకుతాడో పట్టుకోవడం కష్టం. మూడు రేసులు, చివర్లో విలన్ అర్జున్ రామ్ పాల్ తో షో డౌన్- అదరగొట్టేశాడని ఒప్పుకోవాలి. కానీ ఇది సరిపోలేదు. దీనికి తగ్గ కథ, పాత్ర చిత్రణ కూడా వుండాలి.
       
అర్జున్
రామ్ పాల్ విలన్ గా స్ట్రాంగ్ గా వున్నాడు. అతడి కథకి, పాత్ర చిత్రణకి లోపాల్లేవు. యాక్షన్ సీన్స్ బాగా చేశాడు. అమీ జాక్సన్ పోలీసాఫీసర్ మంచి స్క్రీన్ ప్రెజెన్స్ ని కమాండ్ చేసింది. నోరా ఫతేహీ కేవలం విద్యుత్ తో రోమాన్స్ కోసమన్నట్టు వుంది.
       
అయితే స్పోర్ట్స్ యాక్షన్ సీన్స్ ని ఎడిటింగ్ చేసిన విధానం అడ్డదిడ్డంగా వుంది. కొన్ని షాట్స్ తీయడం మర్చిపోవడం వల్లనో
, తీసిన షాట్స్ పొరపాటున డిలీట్ అయిపోవడం వల్లనో అన్నట్టు- పది పదాలున్న వాక్యంలో మూడు పదాలు మిస్సయినట్టు ఎడిటింగ్ వుంది. కానీ యాక్షన్ సీన్స్ కి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం యాక్షన్ నే స్పీడుగా పరుగులేట్టించేలా వుంది. కెమెరా వర్క్, పోలండ్ ని చీట్ చేసిన అజర్ బైజాన్ ఫారిన్ లొకేషన్ మంచి విజువల్ క్వాలిటీ నిచ్చాయి. విద్యుత్ జమ్వాల్ ఫ్యాన్స్ కి మాత్రం మాంచి కిక్కు నిచ్చే ఈ మూవీ డిస్నీ +హాట్ స్టార్ లో హిందీ వెర్షన్ లో మాత్రమే వుంది.

—సికిందర్

Tuesday, April 16, 2024

1424 : రివ్యూ



రచన-దర్శకత్వం : కేవీఆర్ మహేంద్ర
తారాగణం : సూర్య తేజ ఏలే, మీనాక్షీ గోస్వామి, వైవా హర్ష, హర్షవర్ధన్, అజయ్ ఘోష్  తదితరులు
సంగీతం : వివేక్ సాగర్, ఛాయాగ్రహణం :  వెంకట్ ఆర్ శాఖమూరి
నిర్మాత: పాయల్ సరాఫ్
విడుదల : ఏప్రిల్ 5, 2024
***
        తెలంగాణ పీరియడ్ సినిమా దొరసాని (2019) దర్శకుడు కెవిఆర్ మహేంద్ర, ప్రముఖ చిత్రకారుడు ఏలే ధని  కుమారుడు సూర్యతేజని పరిచయం చేస్తూ భరతనాట్యం అనే తెలంగాణ క్రైమ్ కామెడీ తీశాడు. పెళ్ళిచూపులు దర్శకుడు తరుణ్ భాస్కర్ నటిస్తూ తీసిన కీడాకోలా అనే తెలంగాణ క్రైమ్ కామెడీకి ఒక ప్రత్యేక శైలి వుంది. లాజిక్ ని కామెడీ చేసే మెంటల్ పాత్రలతో కొత్తదనం సంతరించుకుని ఓవర్సీస్ లో కూడా హిట్టయ్యింది. మరి ఈ క్రైమ్ కామెడీ ఏ ప్రత్యేకతలతో వుంది? దీన్ని ఒకసారి చూడొచ్చా?  చాలా కాలం తర్వాత దర్శకుడి రెండో సినిమా ఏ స్థాయిలో వుంది? ఇవి తెలుసుకుందాం...

కథ

రాజు సుందరం (సూర్యతేజ) సినిమాల్లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తూంటాడు. రొటీన్ గానే ఇంట్లో కష్టాలకి, గర్ల్ ఫ్రెండ్ (మీనాక్షి గోస్వామి) ని ఒప్పించడానికీ డబ్బులుండవు. డైరెక్టర్ అయిపోదామని కథలు చెప్తూ తీవ్ర ప్రయత్నాలు చేస్తూంటాడు. కథల కోసం మైక్రోఫోన్లు ఏర్పాటు చేసి మనుషుల మాటలు రహస్యంగా వింటూ వాటిని కథలుగా రాస్తూంటాడు. మరోపక్క దివాకర్ (హర్షవర్ధన్) అనే పెద్ద క్రిమినల్ డ్రగ్స్ దందా చేస్తూంటాడు. ఓ రోజు రెండు కోట్ల దందా గురించి మైక్రోఫోన్లో విని, డబ్బు సంపాదనకి ఇదే మార్గమని వాళ్ళ అడ్డాకి వెళ్తాడు రాజు సుందరం. అక్కడ భగతనాట్యం అనే కోడ్ నేమ్ తో డ్రగ్స్ డీల్ జరుగుతూంటే బ్యాగు లాక్కుని పారిపోతాడు. ఆ బ్యాగులో డబ్బులుండవు, డ్రగ్స్ వుంటాయి. ఈ క్రమంలో శకుని (అజయ్ ఘోష్) అనే పోలీసు అధికారికి చిక్కుతాడు. ఇక్కడ్నుంచి బయటపడి డ్రగ్స్ తో ఏం చేశాడు, వాటిని తానే అమ్మి డబ్బు సంపాదించాడా, లేక ఇంకేం చేశాడన్నది మిగతా కథ.

ఎలావుంది కథ

తెలంగాణ ఫీల్ ఏం లేదు గానీ క్రైమ్ కామెడీకి పనికొచ్చే కథే. అయితే చేతిలో వున్నది కథలా భావించి తీయలేదు. ఏదో కాకరకాయ, ఎలా తీసినా క్రైమ్ కామెడీ అయిపోతుంద
నుకుని తీసినట్టుంది. ఇందుకే క్లయిమాక్స్ సహా విషయం ఆషామాషీగా వుంది. డ్రగ్స్ కి పెట్టిన పేరు భరతనాట్యం సెన్సారింగ్ లో భగత నాట్యం అని పలకడంగా మారిపోవడం ఈ కంటెంట్ కి తగిన న్యాయమే. ఫస్టాఫ్ అసలు కథేంటో ఎవరైనా చెప్పగలిగితే  ఈ సినిమా బడ్జెట్ వాళ్ళకి ఇచ్చేయవచ్చు.
       

ఫస్ట్ హాఫ్ అంతా హీరో సినిమా కథలు వినిపిస్తూ చేసే కొత్తదనం లేని కామెడీలు
, విలన్ దివాకర్, అతడి గ్యాంగ్ తో ఇబ్బంది పెట్టే కామెడీలూ సాగుతూ గంటపాటు ఓపికని పరీక్షిస్తూ- ఇంటర్వెల్ కి హీరో చేతికి డ్రగ్స్ రావడంతో ఆసక్తికర మలుపే వస్తుంది.
        
అయితే సెకండాఫ్ లో ఆ డ్రగ్స్ తో హీరో ఏం గేమ్ ఆడుకోవాలో ప్లానింగ్ లేకపోవడంతో తిరిగి సహన పరీక్షగా మారిపోయి ఆశ వదులుకునేలా చేస్తుంది. ఇందులో విలనీలు కూడా పాత సినిమాల్లో సత్యనారాయణ, ప్రభాకర రెడ్డి విలనీల్లా తీరుబడి డైలాగులతో వుంటాయి. పాత హిందీ సినిమాల్లో విలన్ అజిత్ అనుచరులు మోనా డార్లింగ్, రాబర్ట్ లతో వుండే కామెడీ చాలా పాపులరైంది. ఏ సినిమాలోనైనా విలన్ అజిత్ కి మోనా డార్లింగ్, రాబర్ట్ లు వుండాలల్సిందే. ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో అజిత్- మోనా డార్లింగ్- రాబర్ట్ లతో కొత్త కొత్త జోకులు పుట్టిస్తున్నారు. వాళ్ళని సజీవంగా వుంచుతున్నారు.
       
ఇలాటి క్రియేటివిటీని ఈ క్రైమ్ కామెడీలో మిస్సయ్యారు.
ముత్యాలముగ్గు లో రావు గోపాలరావుని, జస్టిస్ చౌదరి లో సత్యనారాయణనీ తీసుకుని వాళ్ళ స్టయిల్ విలనీతో ఎంటర్ టైన్ చేసివుంటే ఈ కథ లేని సినిమాకి ఇదే పెద్ద ఆకర్షణ అయ్యేది.  కథ లేని సినిమాగా తీయాలనుకుని వుంటే, కథ లేకుండా  కేవలం క్యారక్టర్లతో ఎలా నడిపారో ఎల్ డొరాడో (1966) అనే కౌబాయ్ క్లాసిక్ చూసి తెలుసుకుని వుండొచ్చు.
        
ఇక షరా మామూలుగా సెకండ్ హాఫ్ ఆ డ్రగ్స్ కోసం, డబ్బుల కోసం అందరూ వెంటబడడం చూసి చూసి వున్నఅరిగిపోయిన  సీన్లే. ఇంతకంటే సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్ హీరో పాత్రకి క్రియేటివిటీ తెలియకుండా పోయింది. క్వెంటిన్ టరాంటినో తీసిన పల్ప్ ఫిక్షన్ లో ఒక బ్రీఫ్ కేసు కోసం వేట వుంటుంది. ఆ బ్రీఫ్ కేసులో ఏముందో పాత్రలకి తప్ప ప్రేక్షకులకి తెలీదు. చివరికా బ్రీఫ్ కేసు చేజిక్కుంచుకున్న పాత్ర మూత తెరిచి చూస్తే, బ్రీఫ్ కేసులోంచి అతడి మొహం మీద వెలుగు పడుతూంటుంది. తృప్తిగా చూస్తూంటాడు. ఆ ముగింపులో కూడా బ్రీఫ్ కేసులో ఏముందో ఆడియెన్స్ కి చూపించరు. చూపిస్తే డబ్బులో. డ్రగ్సో, వజ్రాలో వుంటే సర్ప్రైజ్ ఏముంటుంది? అందుకే ఇంకేదో గొప్పది వున్నట్టు ప్రేక్షకుల వూహకే వదిలేస్తారు. ఇది కథనంలో ఉపయోగపడే ఒక ప్లాట్ డివైస్ అనీ, దీన్ని మెక్ గఫిన్ అనాలనీ, సస్పెన్స్ బ్రహ్మ ఆల్ఫ్రెడ్ హిచ్ కాక్ కనిపెట్టి చెప్పాడు.

మొత్తానికి ఒక అసిస్టెంట్ డైరెక్టర్ తన కథ ఇలా నడిపిస్తే, ఇక సినిమాలేం తీస్తాడో వూహించాల్సిందే. కొసమెరుపేమిటంటే,  దీనికి పార్ట్ 2 వుంటుందని సూచించారు.

నటనలు- సాంకేతికాలు

కొత్త హీరోగా సూర్యతేజ యాక్టింగ్ ఫర్వాలేదు, స్పీడుంది. స్పీడుతో ఓవరాక్షన్ చేయకుండా నిగ్రహింఛుకున్నాడు. హీఓయిన్ మీనాక్షి గోస్వామి అప్పుడప్పుడు మాత్రమే కనిపిస్తూ హిందీ, తెలుగు కాలిపి మాట్లాడుతూంటుంది. షార్ట్ ఫిలిమ్ హీరోయిన్ లా వుంది. సినిమా హీరో అవ్వాలనే పాత్రలో వైవా హర్ష తన అనుభవంతో కామెడీని బాగా హేండిల్ చేశాడు. పోలీసాఫీసర్ గా అజయ్ ఘోష్, విలన్ గా హర్షవర్ధన్ లది పాత కాలపు విలనీ.
        
చాలా పరిమిత బడ్జెట్ తో తీసినట్టున్నారు. ప్రొడక్షన్ క్వాలిటీ గురించి చూడకూడదు. పాటలు ఒక్కటి కూడా కనెక్ట్ కావు. డ్రగ్స్ తీసుకుంటే ఆ మత్తు భరతనాట్యం చేయిస్తుందని చెప్పడం కవి హృదయమేమో.  దీన్ని సెన్సార్ ఖండించి, భగతనాట్యం గా పాత్రల చేత పలికించింది.
—సికిందర్