రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...
టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!
Saturday, April 6, 2024
Friday, April 5, 2024
1418 : రివ్యూ
రచన-దర్శకత్వం
: పరశురామ్
తారాగణం: విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్, రోహిణీ హట్టంగడి, జగపతి బాబు, రవిప్రకాశ్,
వెన్నెల కిశోర్ తదితరులు
సంగీతం : గోపీ సుందర్, ఛాయాగ్రహణం : కేయూ మోహనన్,
బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
నిర్మాతలు: దిల్ రాజు, శిరీష్
విడుదల ; ఏప్రిల్ 5, 2024
***
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ హీరో
హీరోయిన్లుగా దిల్ రాజు నిర్మాతగా, పరశురామ్ దర్శకత్వంలో ‘ఫ్యామిలీ స్టార్’ ఎక్కువ హైప్ క్రియేట్ చేయకుండానే ఈ రోజు విడుదలైంది. దీనికి తగ్గట్టే
బుకింగ్స్ వున్నాయి. స్టార్ సినిమా ఓపెనింగ్స్ కి మల్టీప్లెక్సులకి ముందే
చేరుకుంటారు ప్రేక్షకులు. విజయ్ దేవరకొండ సినిమాకి పోటెత్తుతారు. అలాటిది ప్రధాన కూడలి మల్టీప్లెక్స్ లో ఆట ఇంకో పది నిమిషాల్లో పడుతోందనగా బయట ఈ రివ్యూ కర్త, ఇంకో ప్రేక్షకుడు
బిక్కుబిక్కుమంటూ వున్నారు. ఆట ప్రారంభమైపోయాక చూస్తే ఓ 50 మంది మాత్రం వున్నారు. ఇది
షాకింగ్ సీన్. మరి సినిమా ఇంకెంత షాకింగ్ గా వుంటుందోనని
చూస్తే,
ఫ్యామిలీ స్టార్ స్పార్క్ ఎలా వుందంటే…
మధ్యతరగతికి చెందిన గోవర్ధన్ (విజయ్
దేవరకొండ) ఇద్దరన్నల కుటుంబ బాధ్యతల్ని మోస్తూ త్యాగశీలిగా వుంటాడు. సివిల్
ఇంజనీరింగ్ చేసిన అతను ఓ చిన్న కంపెనీలో కొద్ది పాటి జీతానికి పని చేస్తూ
ఇద్దరన్నలు, వాళ్ళభార్యలు, ఐదుగురు పిల్లలు, ఓ బామ్మ లని పొదుపుగా పోషించుకుంటూ వుంటాడు. పెద్దన్న మద్యం బానిస.
తమ్ముడి సహకారంతో సివిల్స్ రాయాల్సిన వాడు తమ్ముడితో ఓ ఫ్లాష్ బ్యాక్ వల్ల ఇగో
హర్ట్ అయి మద్యాన్ని ఆశ్రయించాడు. ఆ వైన్ షాపు బిల్లులు తమ్ముడే కడుతూ వుంటాడు.
రెండో అన్న ఏదో వ్యాపార ప్రయత్నాల్లో వుంటాడు.
ఇలా వుండగా వీళ్ళ పై పోర్షనులో ఇందూ (మృణాల్ ఠాకూర్) అద్దెకి దిగుతుంది. ఈమె సెంట్రల్ యూనివర్సిటీలో చదువుతున్నట్టు చెప్పుకుంటుంది. పోనుపోను ఇద్దరూ దగ్గరవుతారు. అప్పుడు ఇందూ గురించి అసలు విషయం తెలిసి ఫైర్ అవుతాడు గోవర్ధన్. ఆమె మధ్యతరగతి కుటుంబాలపై థీసిస్ రాస్తోంది. తమ కుటుంబం పరువే తీసి రాసినందుకు గొడవ చేసి కొడతాడు. ఆ తర్వాత తన రిచ్ నెస్ ని ఆమెకి చూపించుకోవడానికి ఓ పెద్ద కంపెనీలో జాయినై, కోటి రూపాయలు అడ్వాన్సు తీసుకుని, ఆ డబ్బంతా ఖర్చు పెట్టేసి రిచ్ మాన్ హోదా పొందుతాడు. కంపెనీలో జాయినవుతాడు. జాయినైతే ఆ కంపెనీ యజమాని (జగపతి బాబు) కూతురే ఇందూ. పైగా కంపెనీ సీఈఓ కూడా!
దీంతో దెబ్బతిని పోతాడు. అయినా ఈ కంపెనీలో సంపాదించి సొంత కంపెనీ పెట్టుకుంటానని చాలెంజీ చేస్తాడు. అతడి చాలెంజీ నెరవేరిందా? ఇందూతో సంఘర్షణ ఎలా తీరింది? ఇదీ మిగతా కథ.
ఉదయం నుంచే ఈ సినిమా గ్యాంగ్ లీడర్, గీత గోవిందం, అమ్మో ఒకటో తారీఖు కథల్ని కలిపి
కొట్టారని ట్వీట్లు రాసాగాయి. ఇందులో కుటుంబం సెటప్ చిరంజీవి ‘గ్యాంగ్ లీడర్’ (1991) లో కుటుంబ సెటప్పే. ఒక అన్న
కూడా సివిల్స్ రాస్తూంటాడు. అక్కడ చిరంజీవి బామ్మ నిర్మలమ్మ అయితే, ఇక్కడ విజయ్ బామ్మ రోహిణీ హట్టంగడి. ఇక అందులో ప్లానుగా విజయశాంతి
అద్దెకి దిగితే, ఇందులో కూడా ప్లానుగా మృణాల్ ఠాకూర్ అద్దెకి
దిగింది.
సమస్య ఎక్కడ వచ్చిందంటే, ఇంకా ఈ రోజుల్లో 1991 నాటి కుటుంబాలనే చూపించడం దగ్గర. అందుకని ఫస్టాఫ్ పురాతన సీన్లతో, పురాతన కథలా వుంటుంది. 33 ఏళ్ళ నాటి ఈ కుటుంబానికి సినిమా చూసే నేటి గృహిణులు కూడా కనెక్ట్ కాలేరు యూత్ సంగతలా వుంచి. ఇలాటి వాళ్ళు ఇప్పుడు మన ఇళ్ళల్లో ఎక్కడున్నారమ్మా అనుకుంటారు గృహిణులు. మరిది మీద అలా పడి తినకుండా ఆ తోటి కోడళ్ళయైనా ఉద్యోగాలు చేయకూడదా మనలాగా అనుకుంటారు. ఇక సివిల్ ఇంజనీర్ హీరో చాలీ చాలని సంపాదన చూసి నేటి యూత్ జుట్టు పీక్కునే పరిస్థితి. నేటి సినిమాలు రెండే థీమ్స్ తో పని చేస్తాయి- అయితే ఎకనామిక్స్ లేకపోతే రోమాంటిక్స్. ఇందులో రెండూ లేవు, నేటి కాలపు కథ అయితేగా? ఇలా సినిమాకి మార్కెట్ యాస్పెక్ట్ అంటూ లేకపోయాక, క్రియేటివ్ యాస్పెక్ట్ కూడా ప్రశ్నార్ధకంగా మారింది. కథతో ఏం చేయాలో అర్ధం గాలేదు దర్శకుడికి. నిర్మాత దిల్ రాజుకి కూడా ఇలా పాత చాదస్తాలతో వుంటేనే ఫ్యామిలీ ప్యాకేజీ సినిమా తీసినట్టు లెక్క ఎంత కాలమైనా.
ఫస్టాఫ్ 45 నిమిషాలు పాత కుటుంబ కష్టాలతో విజయ్ దేవరకొండ స్పార్క్ లేని నటన కనిపిస్తుంది. 45 నిమిషాల తర్వాత మృణాల్ ఠాకూర్ వచ్చాక కాస్త హుషారెక్కుతుంది. కానీ ఆ రోమాన్సులో స్పార్క్ వుండదు- చిరంజీవి, విజయశాంతిల కెమిస్ట్రీ లాగా. దాంతో ‘వానా వానా వెల్లువాయే’ బప్పీలహరీ చార్ట్ బస్టర్ పాటలాగా.
ఇంతవరకూ ఎలా వున్నా, కనీసం ఇంటర్వెల్ సీనులో రెచ్చగొట్టిన భావోద్వేగాలకి లాజిక్ లేక దీని ప్రభావం సెకండాఫ్ మీద పూర్తిగా పడింది. మధ్య తరగతి కుటుంబాల మీద థీసిస్ అని మృణాల్ పేర్లతో సహా విజయ్ కుటుంబం గురించి రాయడమేమిటో అర్ధం గాదు. ఓ కంపెనీ కాబోయే సీఈఓ గా ఆమె థీసిస్ ఇంత ఘోరంగా వుంటే, విజయ్ యూనివర్సిటీలో ఆమెని కొట్టి, థీసిస్ ని చింపేయడంలో కూడా లాజిక్ కనిపించదు. నేనిలాగే హీనంగా బ్రతుకుతాను నా గురించి మాత్రం రాయవద్దన్నట్టుంది. దీనికంటే తన కుటుంబంలో ఆమె రాసిన లోపాల మీద చర్చించి మార్పులు తీసుకొచ్చే ఆలోచనలు చేయొచ్చు. శ్యామ్ బెనగళ్ తీసిన క్లాసిక్ ‘సూరజ్ కా సాత్వా ఘోడా’ లో మెచ్యూర్డ్ నాయకా నాయిక పాత్రల్లాగా.
అలా చేయకపోగా, థీసిస్ రాసి తన కుటుంబాన్నే అవమానించిందని, అందుకని రిచ్ గా మారి చూపిస్తానని ఇగోకి పోయి తప్పటడుగులే వేస్తాడు- పెద్ద కంపెనీలో జాయినై కోటి అడ్వాన్సు తీసుకుని దాంతో కుటుంబాన్ని రిచ్ గా మార్చేసి చూపిస్తాడు. తీరా అదే కంపెనీకి ఆమె సీఈఓ అని తెలిసి- ప్లేటు ఫిరాయించేస్తాడు- ఇప్పుడు ఇదే కంపెనీలో సంపాదించి సొంత కంపెనీ పెడతానని! ఇది మరీ సిల్లీగా వుంది. ఇప్పుడూ ఇగో అనేది వుంటే, ఆ ఉద్యోగాన్ని తిప్పికొట్టి, ఆ థీసిస్ రాసినందుకు క్షమాపణ చెప్పించి తీరతానని అనాలి. ఆమెతో కాన్ఫ్లిక్ట్ పాయింటుకి రావాలి. ఇలా ఇంటర్వెల్లో క్యారక్టర్ ఏం చేయాలో స్పష్టత లేకపోవడంతో సెకండాఫ్ పూర్తిగా బెడిస్ కొట్టింది! ఇంకోటేమిటంటే, దీనికంతటికీ ముందు ఆమె ఎనిమిది లక్షలు సాయం చేసి అతడి అప్పు తీర్చింది. ఆమెతో ఇలాటి ప్రవర్తన!
సెకండాఫ్ ఓ ప్రాజెక్ట్ పేరుతో న్యూయార్క్ కి షిఫ్ట్ అవుతారు. ఈ న్యూయార్క్ లో కథ ఆసాంతం పెద్ద బోరు. ఫస్టాఫ్ కథ నుంచి తెగిపోయిన ఈ కథలో విజయ్ ఏ మాత్రం ఆత్మాభిమానం లేక తన మీద తను జోకు లేసుకుంటూ దయనీయంగా కనిపిస్తాడు. తన మీద జాలిపుట్టేలా చేసుకుంటూ మృణాల్ చేతికింద పని చేస్తూంటాడు. ఆమె అస్సలు కేర్ చేయదు. పూర్తిగా వ్యక్తిత్వం లేని పాసివ్ క్యారక్టర్ గా మారిపోతాడు. కొందరు ఆడవాళ్ళు అతడ్ని మేల్ ప్రాస్టిట్యూట్ అనుకుని హెరాస్ చేస్తూంటే, మృణాల్ ని పిలిపించుకుని బయటపడతాడు!
సెకండాఫ్ పాత్రల్ని ఎలా నడిపించాలో దర్శకుడికి ఏ మాత్రం అర్ధం గాలేదు. ఇందుకే ఎలా పడితే అలా సాగదీసి రెండు గంటలా 45 నిమిషాలు పరీక్ష పెట్టారు! ముగింపు మరీ విడ్డూరం. ఇద్దరి పాత్రల మధ్య సరైన సంఘర్షణ లేక కథలో భావోద్వేగాలు పుట్టలేదు. భావోద్వేగాల్లేక, పాత్రచిత్రణలు లేక, కామెడీ కూడా సరీగ్గా లేక, సంభాషణా బలం లేక ఫ్లాట్ గా తయారైంది సినిమా. పదుల కోట్లతో తీసిన స్టార్ సినిమా కంటెంట్ చాలా తీసికట్టుగా వుందని ఎందుకు తెలుసుకోలేదన్నది ప్రశ్న. లేక విజయ్- పరశురామ్ ‘గీతగోవిందం’ తీసిన హిట్ కాంబినేషన్ కాబట్టి, ఎలా వున్నా ప్రేక్షకుల్లోకి వెళ్ళిపోతుందనుకున్నట్టుంది. టీవీ సీరియల్ లా వుందని ప్రేక్షకులు ట్వీట్లు చేశారు.
ఫస్టాఫ్ పాత కాలపు పాత్ర కావడంతో, సెకండాఫ్ ఆధునిక పాత్రయినా పాసివ్ పాత్ర కావడంతో విజయ్ పాత్రకి యూత్
అప్పీల్ కొరవడింది. ఫ్యామిలీ స్టార్ గా యూత్ కి ఏం చెప్పాలనుకున్నాడో తెలీదు. కథా
కథనాలు తనకి సహకరించలేదు. నటుడిగా ఏ లోపమూ లేదు. లోపమంతా స్పార్క్ లేని పాత్ర
అంటగట్టిన దర్శకుడిదే.
ఫస్టాఫ్ లో రోమాంటిక్ గా కన్పించే మృణాల్ ఠాకూర్, సెకండాఫ్ ఎప్పుడు చూసినా సీరియస్ గా ఒకే ఎక్స్ ప్రెషన్ తో వుంటుంది. ఇక జగపతిబాబు కాసేపే కనిపించే పాత్ర. కుటుంబ సభ్యుల్లో రోహిణీ హట్టంగడి బామ్మ పాత్రకి ఎక్కువ సీన్లు వుంటాయి. మిగిలిన పాత్రధారులు అలంకారంగా వుంటారు.
గోపీ సుందర్ సంగీతమైనా హుషారెక్కించాల్సింది. ఆయన చేసే సెమీ క్లాసికల్ సాంగ్స్ విఫలమవుతున్నాయి. మోహనన్ ఛాయాగ్రహణం, ఇతర నిర్మాణ విలువలు దిల్ రాజు హోదాని బట్టి వున్నాయి. దర్శకుడు పరశురామ్ మార్కెట్ యాస్పెక్ట్ లేని స్క్రిప్టుకి ఎన్ని అలంకరణలు చేసినా దాని అసలు రంగుని దాచలేక పోయాడు - విజయ్ దేవరకొండ ఉచ్ఛారణ లాగే - సంసయిస్తాడు, భాద్యత, యోగాసానాలు అని పలికినట్టు!
—సికిందర్
Thursday, April 4, 2024
1417 : స్పెషల్ ఆర్టికల్
2024లో ఇండియన్ బాక్సాఫీసు మార్కెట్ 2.46 బిలియన్ డాలర్లు (అంటే రెండు వందల ఐదు బిలియన్ల ఇరవై తొమ్మిది కోట్ల
ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు) కి రీచ్ అవుతుందని అంచనా. ఇది 2024 నుంచి 2029 వరకు 4.73 శాతం వార్షిక వృద్ధి రేటు నమోదు చేస్తుంది. 2024లో 38.7 శాతం వినియోగదారుల ప్రవేశంతో 653.20 మిలియన్ల
(65.32 కోట్లు) కి వినియోగదారులు పెరిగి, 2029 నాటికి 43.5 శాతాన్ని నమోదు
చేస్తూ- మార్కెట్ పరిమాణం 3.10 బిలియన్ డాలర్లు
(అంటే రెండు వందల నలభై తొమ్మిది బిలియన్ల తొమ్మిది వందల డెబ్బై రెండు
మిలియన్ల
తొమ్మిది వందల వేల రూపాయలు) కి అందుకుంటుందని
అంచనా. ప్రతి
వినియోగదారు సగటు ఆదాయం 4.42 డాలర్లు (రూ. 368.82) గా అంచనా వేశారు.
2023లో భారతీయ చలనచిత్ర పరిశ్రమ దాదాపు 200 బిలియన్ల రూపాయలు వసూలు చేసింది. ఈ ఆదాయంలో ఎక్కువ భాగం దేశీయ థియేటర్ల నుంచి, డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల నుంఛీ వచ్చింది. 2022 లో భారతీయ బాక్సాఫీసు సుమారుగా 110 బిలియన్ల రూపాయల్ని ఆర్జించింది. 2023 లో బాక్సాఫీసు కలెక్షన్లు రూ. 12,226 కోట్ల ఆల్ టైమ్ హైకి చేరాయి. ఇది 2022 లో కంటే 15 శాతం పెరుగుదల.
జర్మనీకి చెందిన ప్రముఖ స్టాటిస్టా గ్లోబల్ డేటా అండ్ బిజినెస్ ఇంటెలిజెన్స్ ఈ అంచనాలు కట్టింది. కస్టమర్ ప్రాధాన్యాలు, మార్కెట్ పోకడలు, స్థానిక ప్రత్యేక పరిస్థితులు, అంతర్లీన స్థూల ఆర్థిక కారకాల కలయికతో భారతదేశంలోని బాక్సాఫీసు మార్కెట్ ఇటీవలి సంవత్సరాలలో గణనీయమైన వృద్ధిని సాధిస్తోందని తెలిపింది.
కస్టమర్ ప్రాధాన్యాలు : భారతీయ ప్రేక్షకులకి సినిమా పట్ల బలమైన అనుబంధం వుంది. సినిమాలు దేశ సంస్కృతిలో అంతర్భాగంగా వున్నాయి. హిందీ-భాషా చలన చిత్ర పరిశ్రమ బాలీవుడ్ భారతదేశంలో అతిపెద్ద చలనచిత్ర పరిశ్రమగా, ప్రపంచంలోని అతిపెద్ద సినిమా పరిశ్రమల్లో ఒకటిగా వుంది. భారతీయ ప్రేక్షకులు వాస్తవానికతీతమైన కథల్ని, రంగురంగుల పాటల్ని, నృత్య సన్నివేశాలనీ, భావోద్వేగ కథనాలనూ ఇష్టపడతారు. సినిమా లు చూసేందుకు ఎంచుకుంటూన్న ఈ ప్రాధాన్యాలు దేశంలో బాక్సాఫీసు మార్కెట్ వృద్ధికి దోహదపడ్డాయి.
మార్కెట్‌లో పోకడలు : బాక్సాఫీసు మార్కెట్‌లో కీలకమైన ట్రెండ్ (పోకడలు) లలో ఒకటి ప్రాంతీయ సినిమాకి పెరుగుతున్న ప్రజాదరణ. బాలీవుడ్ సినిమాలు మార్కెట్‌లో ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నప్పటికీ తెలుగు, తమిళం, మలయాళం వంటి ప్రాంతీయ భాషల్లో సినిమాలకి డిమాండ్ పెరిగింది. ఈ ధోరణికి దేశంలో పెరుగుతున్న మధ్యతరగతి కారణమని చెప్పవచ్చు. ఈ మధ్య తరగతి వర్గం మరింత సాపేక్షంగానూ, సాంస్కృతికంగానూ వుండే నిర్దిష్ట కంటెంట్‌ని కోరుతోంది. అదనంగా, స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌ల ఆవిర్భావం కూడా ప్రాంతీయ సినిమా ల ప్రజాదరణకి దోహదపడింది. ఎందుకంటే ఇది విస్తృత శ్రేణి కంటెంట్ ని ఎక్కువ అనుమతిస్తుంది.
బాక్సాఫీసు మార్కెట్‌లో మరో ట్రెండ్ భారీ బడ్జెట్ బ్లాక్‌బస్టర్‌ల పెరుగుదల. సినిమా నిర్మాతలు విస్తృతమైన సెట్‌లు, విజువల్ ఎఫెక్ట్స్, భారీ తారాగణంతో కూడిన అధిక నిర్మాణ విలువలపై ఎక్కువగా పెట్టుబడి పెడుతున్నారు. ఈ సినిమాలు తరచుగా ప్రపంచవ్యాప్తంగా వున్న భారతీయ ప్రవాసులకి ఉపయోగపడుతూ ప్రపంచ ప్రేక్షకుల్ని ఆకర్షించడంలో విజయవంతమయ్యాయి. ఇలాంటి సినిమాల విజయాలు దేశంలో బాక్సాఫీస్ మార్కెట్ వృద్ధికి మరింత ఊతమిచ్చాయి.
స్థానిక ప్రత్యేక పరిస్థితులు: 140 కోట్ల కంటే ఎక్కువ జనాభా గల భారతదేశ జనాభా చలనచిత్రాలకి పెద్ద సంఖ్యలో ప్రేక్షకుల్ని అందిస్తోంది. అదనంగా, దేశం సినిమా హాళ్ళూ మల్టీప్లెక్సుల బలమైన నెట్‌వర్క్ ని కలిగి వుంది. దీంతో ముఖ్యంగా పట్టణ ప్రాంతాలలో ప్రజలు కొత్త సినిమాలని యాక్సెస్ చేయగలుగుతున్నారు. సరసమైన స్మార్ట్ ఫోన్లు, విస్తృత ఇంటర్నెట్ కనెక్టివిటీ లభ్యతా బాక్సాఫీసు మార్కెట్ వృద్ధికి దోహదపడింది. ఎందుకంటే ఇది డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా సినిమాల ప్రసారాన్నీ, పంపిణీనీ అనుమతిస్తోంది.
అంతర్లీన స్థూల ఆర్థిక కారకాలు: పెరుగుతున్న దేశపు ఆర్థిక వ్యవస్థ, పెరుగుతున్న పునర్వినియోగపరచదగిన ఆదాయాలూ బాక్సాఫీసు మార్కెట్ వృద్ధిలో ముఖ్య పాత్ర పోషించాయి. వినోదం కోసం ఖర్చు
చేయడానికి ఎక్కువ డబ్బు వున్నందున, సినిమా వినోదం పై పెట్టుబడి పెట్టడానికి
సిద్ధంగా వున్నారు. పైగా దేశంలో పెరుగుతున్న
పట్టణీకరణ, మారుతున్న జీవనశైలీ సినిమా వీక్షణ సహా ఇతర వినోద కార్యకలాపాల పట్ల ఎక్కువ డిమాండ్‌కి దారితీసింది.
చివరిగా, సినిమాటిక్ అనుభవాల పట్ల పెరిగిన కస్టమర్ ప్రాధాన్యాలు, ప్రాంతీయ సినిమాల పట్ల ప్రజాదరణ, భారీ-బడ్జెట్
బ్లాక్‌బస్టర్‌ల పెరుగుదల, ప్రేక్షకులకి
విస్తృత స్థాయిలో సినిమాల లభ్యతా
వంటి స్థానిక ప్రత్యేక పరిస్థితుల వల్ల దేశంలో బాక్సాఫీసు మార్కెట్ వృద్ధిని
సాధిస్తోంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత శక్తివంతమైన ఆర్ధిక వ్యవస్థగా తోడ్పడుతోంది.
పోతే, ఇప్పుడు ఐఎండీబీ
(ఇంటర్నేషనల్ మూవీ డేటా బేస్) రూపొందించిన 2024 టాలీవుడ్ టాప్ 10 లిస్టు గమనిద్దాం :
1. హనుమాన్ : 95.00 కోట్లు, 2. గుంటూరు కారం : 188.80
కోట్లు, 3. టిల్లు స్క్వేర్ : 65.25 కోట్లు, 4. నా సామి రంగ : 37.31 కోట్లు, 5. ఈగల్ : 36. 00 కోట్లు, 6. గామి : 24.00 కోట్లు, 7. ఊరు పేరు
భైరవకొన :
22.47 కోట్లు, 8. సైంధవ్ : 18.51 కోట్లు, 9. భీమా : 18.40 కోట్లు, 10. ఓం భీమ్
బుష్ : 15.75 కోట్లు.
***
Sunday, March 31, 2024
1416 : రివ్యూ
రచన- దర్శకత్వం : బ్లెస్సీ
తారాగణం : పృథ్వీరాజ్ సుకుమారన్, అమలా పాల్, శోభా మోహన్, కెఆర్ గోకుల్, జిమ్మీ జీన్ లూయిస్, రాబిన్ దాస్ తదితరులు
సంగీతం : ఏఆర్ రెహమాన్, ఛాయాగ్రహణం : కెఎస్ సునీల్
బ్యానర్స్ : విజువల్ రోమాన్స్ ఇమేజ్ మేకర్స్, జెట్
మీడియా ప్రొడక్షన్, ఆల్టా గ్లోబల్ మీడియా
నిర్మాతలు : బ్లెస్సీ, జిమ్మీ జీన్ లూయిస్, స్టీవెన్ ఆడమ్స్
విడుదల : మార్చి 28, 2024
***
ప్రముఖ మలయాళ యువ
నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన, సుదీర్ఘకాలంగా
ఎదురుచూస్తున్న పాన్-ఇండియన్ మూవీ ‘ఆడుజీవితం- ది గోట్ లైఫ్’ యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో నిషేధానికి గురై,
తర్వాత కట్స్ లేకుండా గ్రీన్ సిగ్నల్ పొంది అనుకున్న విధంగా వరల్డ్ రిలీజ్ గా, మార్చి 28 న ప్రపంచ ప్రేక్షకుల ముందు కొచ్చింది. సౌదీ అరేబియాలో, ఇతర గల్ఫ్ దేశాల్లో నిషేధాన్ని తొలగించలేదు. అరబ్బు దేశాలకి వ్యతిరేకం అన్పించే
కేరళ వలస కార్మికుడి కథతో రూపొందిన ఈ సినిమాలో అరబ్బుల కాఠిన్యాన్ని నిర్భయంగా
చిత్రించారు. దర్శకుడు బ్లెస్సీ- పృథ్వీరాజ్ సుకుమారన్ కలిసి చేసిన ఈ అపూర్వ
సృష్టి మలయాళ సినిమా చరిత్రలో స్వర్ణ పుట అనొచ్చు. దీన్ని తెలుగు సహా ఐదు భాషల్లో
విడుదల చేశారు. తెలుగులో మైత్రీ మూవీస్ పంపిణీ చేశారు. అన్ని భాషల్లో, ముఖ్యంగా యువ ప్రేక్షకుల్ని సైతం కదిలిస్తున్న ఈ ఆర్ట్ సినిమా తరహా
సర్వైవల్ డ్రామాలో ఏమున్నదో ఓసారి పరిశీలిద్దాం...
ఐదవ తరగతి చదివిన నజీబ్ మహమ్మద్ (పృథ్వీరాజ్
సుకుమారన్) కేరళ
గ్రామంలో చెరువులో ఇసుక తీసే పని చేసుకుంటూ భార్య సైనూ (అమలా పాల్) నీ, తల్లి ఉమ్మా(శోభా మోహన్) నీ పోషించుకుంటూ వుంటాడు. అయితే సౌదీ వెళ్ళి
బాగా సంపాదించి అభివృద్ధిలోకి రావాలని స్నేహితుడు హకీమ్ (కెఆర్
గోకుల్) తో
కలిసి సౌదీ అరేబియా వెళ్ళిపోతాడు. అక్కడ
ఏజెంట్ మోసం చేయడంతో, వేరే అరబ్బులు వీళ్ళని తలో వైపు లాక్కువెళ్ళి
ఎడారిలో గొర్రెల మంద మధ్య పడేస్తారు. గొర్రెల్ని కాయమంటారు. నజీబ్ కన్న కలలు
ఒక్కసారిగా పటాపంచలవుతాయి. ఇక్కడ పరిస్థితి ఎలా వుంటుందంటే,
కుక్క కన్నా హీనంగా చూస్తారు. వెళ్ళిపోతామన్నా పోనివ్వరు. గొర్రెల
పెంపక కేంద్రం యజమాని ఖఫీల్ (తాలిబ్ అల్ బలూషి) పత్రాలు
లాక్కుని చించేస్తాడు. తిండి పెట్టడు, మంచి నీళ్ళు
కూడా తాగనివ్వడు. ఎర్రటి ఎడారి ఎండలో గొర్రెల్ని కాయమని తంతాడు. అలా కొన్ని నెలలు
గడిచిపోతాయి. తిండికి అల్లాడుతూ బక్కచిక్కిన నజీబ్ కి,
దాదాపు ఇదే పరిస్థితుల్లో వున్న హకీం ఎడారిలో ఎదురవుతాడు. ఇద్దరూ కావలించుకుని
గట్టిగా ఏడ్చేస్తారు.
హకీం పనిచేస్తున్న చోట తమలాగే ఒక
ఆఫ్రికన్ బానిస ఇబ్రహీం ఖాద్రీ (నిర్మాత జిమ్మీ జీన్ లూయిస్) వుంటాడు. అతడికి
ఎడారిలో తప్పించుకుని రోడ్డెక్కే మార్గం తెలుసు. ఓ రోజు ఖఫీల్ కూతురి పెళ్ళికి
పోతూ, గొర్రెల్ని నజీబ్ కి అప్పజెప్పి పోతాడు. ఇదే అదునుగా
భావించిన నజీబ్ పారిపోయి వాళ్ళిద్దర్నీ కలుసుకుంటాడు. ఇక్కడ్నుంచీ ముగ్గురూ ఆ
ఎడారిలోంచి ఎలా బయటపడి బతికి బట్ట కట్టారన్నది మిగతా కథ.
2008లో మలయాళంలో బెన్యామిన్ అనే
రచయిత రాసిన, 100 సార్లు రీప్రింటయిన ‘ఆడుజీవితం’ నవల ఈ సినిమాకాధారం. ఈ నవల సౌదీ అరేబియాలో నజీబ్ మహమ్మద్ అనే కేరళ వలస కార్మికుడి నిజ
కథని చిత్రిస్తుంది. ఈ నవల 2009లో కేరళ సాహిత్య అకాడమీ అవార్డు సహా అనేక అవార్డుల్ని సంపాదించింది. ఇంగ్లీషు, హిందీతో
బాటు మరికొన్ని ఇతర భాషల్లోకి అనువాదమైంది.
అప్పట్నుంచే దీన్ని సినిమాగా తీయాలని దర్శకుడు బ్లెస్సీ ప్రయత్నాలు మొదలు పెట్టాడు. అయితే చిత్రానువాదం చేశాక బడ్జెట్ మోపెడవుతుందని భయపడి పక్కన పెట్టేశాడు. అయినా నిర్మాతల కోసం చాలా సంవత్సరాలు వెతుకుతూ, చివరికి 2015లో ఇద్దరు విదేశీ నిర్మాతల్ని సంపాదించుకుని తానూ నిర్మాతగా మారి, 2020లో ప్రొడక్షన్ పనులు ప్రారంభించాడు. షూటింగ్ కి సౌదీ అరేబియా అనుమతి ఇవ్వకపోతే, జోర్డాన్ లో, అల్జీరియాలోని సహారా ఎడారిలో షూటింగ్ జరిపాడు. ఆ కోవిడ్ మహమ్మారి కాలంలో ఎలాగో షూటింగ్ జరిపి, 2022 నాటికి పూర్తి చేశాడు.
గల్ఫ్ కెళ్ళిన కార్మికుల జీవితాల గురించి చాలా సినిమాలొచ్చాయి. ‘ఆడు జీవితం’ లాంటిది రాలేదు. ‘ఆడు జీవితం’ చూసిన ఏ సాధారణ వ్యక్తి అయినా గల్ఫ్ కలల్ని శుభ్రంగా తుడిపేసుకుని, ఉన్న ఊరు కన్న తల్లి ఒరేవొరే మరవకురా అని గంజి తాగి కంటినిండా నిద్రపోతాడు. పృథ్వీరాజ్ సుకుమారన్ లా అరబ్బులతో తొక్కించుకుని, రాబందులతో పొడిపించుకుని, డొక్కెండిన బతుకు దిక్కులేని ఎడారిలో సమాధి చేసుకోవాలనుకోడు.
ఇసుక
రేణువు నుంచి ఎడతెగని ఎడారి సువిశాల విస్తీర్ణం వరకూ, చురుకైన గొర్రె ముఖం నుంఛీ, ఓపికైన
ఒంటె కళ్ళ వరకూ -దగా పడ్డ వలస
కార్మికుడి బతుక్కి సాక్ష్యాలే. ఎడారిలో ఎర్రటి ఎండలో ఈ సాక్ష్యాల్ని కెమెరా ఎత్తి
పట్టుకోవడమన్నది మామూలు మాట కాదు. ఈ పరిస్థితి ఎక్కడ్నించి బదలాయింపు అయింది?
కేరళ పల్లెలో నీలం నీరు- ఆకుపచ్చ భూమి -సస్యశ్యామల తావులు- అనే ప్రకృతి దృశ్యం నుంచి తీసి బయటకి
ఇసుక సముద్రంలో విసిరేస్తే
ఉత్పన్నమైంది. ఈ కాంట్రాస్ట్ ని పొందుపర్చడం అంతర్జాతీయ స్థాయి తరహా స్క్రీన్ ప్లే
రచనే.
1990 లలో ఈ కథ స్థాపించారు. పనివాడి చెమట ఆరిపోకముందే ప్రతిఫలం చెల్లించమని చెప్పే మత గ్రంధం ఉద్భవించిన దేశంలో సాటి మనిషిని గొర్రెకన్నా హీనంగా కొట్టి వెట్టి చేయించుకునే అరబ్బు నీతి ఎక్కడ్నించి వచ్చిందో మింగుడుపడని వ్యవహారమే. ఇది తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘన సమస్యే. అయితే ఈ కథ దీన్ని చర్చించదు. మనుగడ కోసం పనివాడి సాహసోపేత ప్రయాణాన్ని కళ్ళముందుంచి, ప్రశ్నల్ని- వాటి జవాబుల్నీ ప్రేక్షకులకే వదిలేస్తుంది.
నేరుగా సౌదీ విమానాశ్రయంలో కథ ప్రారంభమవుతుంది. నజీబ్, హకీం మిత్రులిద్దరూ తమకి ఉద్యోగాలిచ్చిన కంపెనీ కోసం ఎదురుచూస్తూంటే, ఎవరో ఇద్దరు అరబ్బులు ఇద్దర్నీ విడదీసి తలో దిక్కు లాక్కుపోయే దృశ్యం- హకీం ఆర్తనాదాలతో దద్దరిల్లుతుంది. భాష తెలియదు. భాష తెలిసిన హిందీ బానిస వుంటే నజీబ్ కి హిందీకూడా రాదు. యజమాని ఏమంటున్నాడో అర్ధంగాదు. ఎండిన రొట్టె ముక్కపడేస్తే అది పళ్ళరిగేలా నమిలినా గొంతు దిగదు. చుక్కనీళ్ళు తాగనివ్వరు. ఈ నజీబ్ కష్టాల మధ్య మూడు ఫ్లాష్ బ్యాకులు వస్తాయి- కేరళలో అతడి సుఖవంతమైన జీవితం గురించి. చెరువు నిండా నీళ్ళలో మునకల గురించి. భార్యతో జీవితం గురించీ. జలకాలాటల్లో వాళ్ళిద్దరి మధ్య కొరియోగ్రఫీ చేసిన శృంగార గీతం ఈ వాస్తవిక కథలో అసాధారణ కమర్షియల్ కృతిలా కనిపిస్తుంది రెహ్మాన్ మ్యూజిక్ తో.
ఈ స్మృతులు ఎడారి జీవితం నుంచి
పారిపోయేందుకు పురిగొల్పితే, తుపాకీ గుండు దెబ్బకి కుప్పకూలుతాడు.
అతడి బాధని గొర్రె మాత్రమే అర్ధం జేసుకుని తోటి గొర్రెలతో కలిసి పరామర్శకి
వస్తుంది. ఒంటెలూ అన్యాయాన్ని గమనిస్తాయి. రాబందులు వాటి జాతి లక్షణంతో నరమాంస
భక్షణకి దిగుతాయి. గంట సేపు ఈ ఫస్టాఫ్ స్ట్రగుల్ తర్వాత,
పారిపోవడంతో మొదలయ్యే సెకండాఫ్ సమరం రెండు గంటలూ సాగుతుంది. మొత్తం కలిపి మూడుగంటల
సర్వైవల్ డ్రామా. యూనివర్సల్ అప్పీలున్న బాక్సాఫీసు ఫార్ములా.
నవల స్వగతంతో వుంటుంది. దీన్ని సినిమా దృశ్యాలుగా మార్చడానికే సంవత్సరాలు పట్టిందని చెప్పాడు దర్శకుడు. ఇక గొర్రెలు, ఒంటెలు వాటికి మూడ్ వచ్చినప్పుడు షాట్స్ తీయడం కూడా అంతే. ఈ జీవుల్ని నిర్దేశించలేరు. అవి మూడ్‌లోకి వచ్చేవరకూ వేచి వుండి ఆ షాట్స్ ని పట్టుకోవాలి. సినిమాలో గ్రాఫిక్స్ జంతుల్లేవు సులభంగా చిత్రీకరించడానికి.
నటనలు – సాంకేతికాలు
ఈ పాత్ర కోసం పృథ్వీరాజ్ సుకుమారన్ తనని తాను శిక్షించుకుంటూ సాధించిన
శారీరక పరివర్తన వొక ఆశ్చర్యపర్చే
అంశం. క్రమక్రమంగా అతడి కృశించే రూపం కడుపు తరుక్కుపోయేలా చేస్తుంది. పాదాల మీద బొబ్బలు, పగిలిన పెదవులు, అట్టకట్టిన వెంట్రుకలు -సుకుమారన్ శరీరంలో ఇంకిన వేడి, ధూళీ మేకప్ విభాగపు తిరుగులేని పనితనంగా కనిపిస్తాయి. ప్యాంటు వదులైపోయి
తాడుతో కట్టుకుంటున్నప్పుడు బక్కచిక్కిన అతడి కడుపు మీద తీసిన షాట్ చూసి ఒక్కసారి
ఏడ్వాలన్పించని ప్రేక్షకులుండరు. పాత్ర కోసం, తదనుగుణ నటన కోసం సుకుమారన్
తనని తాను ఇంతలా శిక్షించుకోవడం నట శాస్త్రంలో ఏ పాఠం కిందికి వస్తుందో వెతకాలి.
అతను ఆస్కార్ కి నూరు విధాలా అర్హుడని ఇందుకే గొంతు విప్పుతున్నారు ప్రేక్షకులు.
హకీం పాత్రలో కేఆర్ గోకుల్ మాత్రం నాటకీయంగా కనిపిస్తాడు. ఆఫ్రికన్ ఇబ్రహీం ఖాద్రిగా నిర్మాత జిమ్మీ జీన్ లూయిస్ నిగూఢంగా కనిపిస్తూ, ఎడారి దాటించే మార్గం చూపే తోటి ప్రయాణికుడి పాత్రలో, మంచి చెడుల మధ్య అనేక వైరుధ్యాల్ని సూచిస్తూ ఒక ముద్ర వేస్తాడు. అమలాపాల్, శోభా మోహన్ లు ఫ్లాష్ బ్యాకుల్లో సంక్షిప్తంగా కన్పించే పాత్రలు వేశారు. గొర్రెల యజమానిగా ఓమన్ నటుడు డాక్టర్ తాలిబ్ అల్ బలూషి క్రూరత్వంతో వూపేస్తాడు. దీనికి ముందు ఒక మలయాళ సినిమాలో నటించి మలయాళీలకి తెలిసిన నటుడే. ఇక హిందీ తెలిసిన బానిసగా రాబిన్ దాస్ కూడా గుర్తుంటాడు.
ఛాయాగ్రహకుడు సునీల్ కెఎస్ ఎడారిని, అక్కడ చిక్కుకున్న
జీవితాల్నీ ఎంత కఠినంగా చూపించాడో, కేరళనీ అక్కడి జీవితాల్నీ
అంత సున్నితంగానూ చిత్రీకరించాడు. సాధారణంగా కమర్షియల్
సినిమాల్లో ఎడిటింగ్ ని ఫీల్ కాం. ఈ కళాత్మక సినిమాని ఎడిటింగ్ ఫీలవకుండా చూడలేం.
ముఖ్యంగా సన్నివేశాలు మారే ట్రాన్సిషన్ షాట్లన్నీ స్మూత్ గా ట్రావెల్ అవడం శ్రీకర్
ప్రసాద్ అద్భుత ఎడిటింగ్ పనితనం. ఎడారిలో సుకుమారన్ నోటి దగ్గర చాలీచాలని నీటి ధార,
అతడి జ్ఞాపకాల్లో నిండుగా ప్రవహిస్తున్న కేరళ నది దృశ్యంతో సూపర్ ఇంపోజ్ అవడం ఆశ్చర్య
చకితుల్ని చేస్తుంది. షాట్స్ కూడా ఇలా అర్ధాలు చెప్తాయి.
ఇక రసూల్ పోకుట్టి ఎడారిలోని డైజెటిక్ ధ్వనుల ముద్రణతో ఇంకో మ్యాజిక్ చేస్తాడు. శబ్ద ఫలితాలు కూడా ఈ సినిమాకి ఎస్సెట్. ఎఆర్ రెహ్మాన్ నేపథ్య సంగీతం, పాటలు వాటికవే ఒక బాధితుడి జీవితం. బ్లెస్సీ దర్శకత్వం జీవితకాల సాఫల్యం.
ఈ సినిమా తెలుగు డబ్బింగ్
కి తెలంగాణ పాత్రగా మార్చారు. సాధారణంగా పాత్రలు వేరే భాష మాట్లాడుతున్నప్పుడు సబ్
టైటిల్స్ వేస్తారు. అరబ్బులు మన పాత్రలతో మాట్లాడుతున్నప్పుడు సబ్ టైటిల్స్ వేయకుండా, పాత్రలతో పాటు మనకీ అర్ధంగాకుండా చేసి- కొత్త ప్రదేశంలో ఒక మిస్టీరియస్ వాతావరణాన్ని, అయోమయాన్నీ సృష్టించడం వ్యూహాత్మక దర్శకత్వానికి నిదర్శనం. మన పాత్రలు తెలుగులో
మొత్తుకుంటున్నప్పుడు, అరబ్బులు అర్ధం చేసుకోవాల్సిన ఖర్మ తమకి
లేదన్నట్టుగా తన్నడం న్యాయంగానే అన్పించక మానదు. అందుకని సంపాదన కోసం గల్ఫ్ కి ఎగేసుకుంటూ పోకుండా, మినిమమ్ అరబ్బీ నేర్చుకోవాలన్న బుద్ధి వుండాలని ఈ సినిమా
పరోక్షంగా హెచ్చరిస్తుంది.
అయితే సినిమాలో హిందీ బానిస పాత్ర వుంది. కేరళ ముస్లింలకి ఇప్పటిలా కాక, ఈ కథాకాలం 1990లలో హిందీ/ఉర్దూ అంతగా తెలియక పోవచ్చు. మలయాళం ఒరిజినల్ కిది సరిపోతుంది. కానీ తెలుగు వెర్షన్లో నజీబ్, హకీం తెలంగాణ ముస్లిం పాత్రలకి హిందీ/ఉర్దూ తెలియనట్టు చూపించడం సన్నివేశాల్లో భావోద్వేగాల్ని దెబ్బతీసింది. తెలంగాణా పాత్రలుగా చూపించాల్సిన అవసరమేమిటి? ఈ మధ్య తమిళ, మలయాళ తెలుగు డబ్బింగుల్లో తెలుగు పాత్రలుగా మార్చకుండా యధాతధంగానే చూపిస్తున్నారు. ‘జైలర్’ లో రజనీకాంత్ ముత్తువేల్ పాండ్యన్ తెలుగులో ముత్తువేల్ పాండ్యనే. మంచి ముత్యం పాండు కాదు. ‘ఆడు జీవితం’ టైటిల్ కూడా ఆడు జీవితమే. ‘ఎడారి జీవితం’ కాదు. సినిమాలో తెలంగాణా వాళ్ళన్న డైలాగు తీసేస్తే సరిపోతుంది.
—సికిందర్
Friday, March 29, 2024
1415 : రివ్యూ!
దర్శకత్వం : మల్లిక్ రామ్
తారాగణం : సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమా పరమేశ్వరన్, నేహా శెట్టి, మురళీ శర్మ, మురళీధర్ గౌడ్, ప్రిన్స్, బ్రహ్మాజీ తదితరులు
సంగీతం : రామ్ మిరియాల, అచ్చు రాజమణి, భీమ్స్ సిసిరోలియో; ఛాయాగ్రహణం : సాయి ప్రకాష్
బ్యానర్ : సితార ఎంటర్ టైమెంట్స్
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
విడుదల : మార్చి 29, 2024
***
‘డీజే టిల్లు’ (2022)
తో సిద్దూ జొన్నలగడ్డగా గాక క్యారక్టర్ గా గుర్తుండిపోయిన సిద్దూ జొన్నలగడ్డ, మళ్ళీ అదే క్యారక్టర్ తో ‘టిల్లు స్క్వేర్’ గా తిరిగొచ్చాడు. తనకి పేరు తెచ్చిపెట్టిన అదే వింత క్యారక్టర్ తో మరోసారి
అలా ఎంటర్ టైన్ చేయడమే ధ్యేయంగా పెట్టుకుని, దర్శకుడ్ని మార్చి, చాలావరకూ తానే దర్శకత్వం వహించి, తనకోసం తన సినిమా అనుకుని
తీసుకున్నాడు. సాధారణంగా సీక్వెల్స్ ఆకట్టుకోవు. మరి తను దీంతో సాహసించి సీక్వెల్ సిండ్రోమ్
ని దాటాడా? దీన్ని అంతే హిట్ గా ‘డీజీ టిల్లు’ సరసన నిలబెట్టాడా? ఏం చేశాడు?
ఇది తెలుసుకుందాం...
'డీజే
టిల్లు’ లో రాధిక (నేహాశెట్టి) విషయంలో
దెబ్బతిన్న బాలగంగాధర్ తిలక్ అలియాస్ టిల్లు (సిద్ధూ జొన్నలగడ్డ), ఇప్పుడు
ఈవెంట్స్ మేనేజిమెంట్స్ చేస్తూంటాడు. అలా ఓ పార్టీలో లిల్లీ జోసెఫ్ (అనుపమా పరమేశ్వరన్) పరిచయమవుతుంది.
కలిసి తిరుగుతారు, ఒకటవుతారు. ఆ తర్వాత చూస్తే ఆమె వుండదు, లెటర్
పెట్టేసి పోతుంది. ఆమెని వెతకడం
మొదలుపెడతాడు. నెల తర్వాత కనిపించి ప్రెగ్నెంట్ నయ్యానని చెబుతుంది. పెళ్ళి చేసుకుంటానంటాడు.
సరీగ్గా టిల్లు బర్త్ డే రోజు తన ఇంటికి పిలుస్తుంది.
అక్కడికి వెళితే అది రాధిక ఫ్లాట్. ‘డీజే టిల్లు’ లో సరీగ్గా
టిల్లు బర్త్ డే రోజు రోహిత్ (కిరీటి
దామరాజు) ఎక్కడైతే
చనిపోయాడో అదే ఫ్లాట్. రోహిత్
లిల్లీకి అన్న. వాడి శవాన్ని తనే పాతిపెట్టాడు టిల్లు.
ఇప్పుడు తన అన్న సంవత్సరం నుంచి కనిపించడం లేదని, అతడిని వెతకడంలో సాయం చేయమనీ కోరుతుంది లిల్లీ. రోహిత్ మర్డర్ విషయంలో ఒకసారి రాధికతో దెబ్బతిన్న టిల్లు ఇప్పుడు మళ్ళీ ఏం చేశాడు? టిల్లూ లిల్లీల మధ్యకి పేరు మోసిన డాన్ షేక్ మహెబూబ్ (మురళీ శర్మ) ఎందుకొచ్చాడు? ఇప్పుడేమైంది? ఇదీ మిగతా కథ.
ఎలావుంది కథ
ఇది ‘డీజే టిల్లు’ కి కొనసాగింపు కథ. ‘డీజే టిల్లు’ లో హత్యకి గురైన రోహిత్ చెల్లెలు లిల్లీతో టిల్లూ అనుభవాల కథ. మళ్ళీ ఇది కూడా కథ కంటే కొన్ని కామెడీ ఎపిసోడ్స్ తో నడిచే టిల్లు ఒన్ మాన్ షో. ‘డీజీ టిల్లు’ ఏ క్యారక్టరజేషన్ తో, ఏ టైపు డైలాగ్ డెలివరీతో హిట్టయ్యిందో దాన్నే ప్రధానంగా చేసి, కథ మీద దృష్టి పెట్టకుండా నడిపిన కాలక్షేప బఠానీ. కాబట్టి క్యారక్టర్ ని ఎంజాయ్ చేయడానికే చూడాలి తప్ప కథ కోసం వెళ్ళకూడదు.
'డీజీ టిల్లు’ లో కూడా కథ మీద దృష్టి లేదు. ఈసారి అదే ఫార్ములా ఫాలో కావడం వల్ల అనాలోచితంగా వాడిన ట్విస్టులు, ఇల్లాజికల్ సీన్లూ- ఇవే కాకుండా రిపీటయ్యే సీన్లు, చీటికీ మాటికీ ‘డీజే టిల్లు’ నుంచి రిఫరెన్సులూ- వీటితో నింపేశారు. ఈ కథ కూడా మొదటి కథ లాగే అమ్మాయి వలలో చిక్కుకుని దెబ్బ తినే అమాయక టిల్లు కథే. అయితే ఈ సారి లిల్లీ అనే అమ్మాయితో కుదరలేదు. దీంతో ఏం జరుగుతుందన్న సస్పెన్స్, థ్రిల్స్ కరువయ్యాయి. అలాగే క్లయిమాక్స్ కూడా తేలిపోయింది. నిడివి రెండు గంటలే అయినా చివరి అరగంట నుంచీ సహన పరీక్షగా మారుతుంది.
'డీజీ టిల్లు’ లో కూడా కథ మీద దృష్టి లేదు. ఈసారి అదే ఫార్ములా ఫాలో కావడం వల్ల అనాలోచితంగా వాడిన ట్విస్టులు, ఇల్లాజికల్ సీన్లూ- ఇవే కాకుండా రిపీటయ్యే సీన్లు, చీటికీ మాటికీ ‘డీజే టిల్లు’ నుంచి రిఫరెన్సులూ- వీటితో నింపేశారు. ఈ కథ కూడా మొదటి కథ లాగే అమ్మాయి వలలో చిక్కుకుని దెబ్బ తినే అమాయక టిల్లు కథే. అయితే ఈ సారి లిల్లీ అనే అమ్మాయితో కుదరలేదు. దీంతో ఏం జరుగుతుందన్న సస్పెన్స్, థ్రిల్స్ కరువయ్యాయి. అలాగే క్లయిమాక్స్ కూడా తేలిపోయింది. నిడివి రెండు గంటలే అయినా చివరి అరగంట నుంచీ సహన పరీక్షగా మారుతుంది.
ఈ సినిమా చాలా భాగం రీ షూట్ ఇందుకే చేసినట్టున్నారు.
రీ షూట్ వల్ల బాగు పడింది లేదు. కథ వదిలేసి కేవలం టిల్లు క్యారక్టరైజేషన్ తో, అతడి వన్ లైనర్స్ తో, కామెడీ టైమింగ్ తో ఒన్ మాన్ షోగా నడిపేశారు. కథ మీద పెట్టని దృష్టి అతడి వన్
లైనర్ డైలాగుల మీద పెట్టి క్యారక్టర్ ని మాత్రం ఎంజాయ్ చేసేలా చేశారు.
ఫస్టాఫ్ అతడి కుటుంబం గురించి, వృత్తి గురించి, లిల్లీతో రోమాన్స్ గురించీ ఫన్నీగా నడిపేశాక, ఒక బలహీన ఇంటర్వెల్ సీనుతో ముగించారు. ఇక సెకండాఫ్ మాఫియా డాన్ ని పట్టుకునే యాక్షన్ కథగా చేసి, కామెడీ తగ్గించి, డైలాగులతో నవ్వించడం చేశారు. డాన్ ని పట్టుకునే విషయంలో లాజిక్ నీ, సాధ్యాసాధ్యాల్నీ పట్టించుకోకుండా కథ ముగించారు. ‘డిజేటిల్లు’ ప్రేక్షకులకి కొత్త కాబట్టి ఆ ఫార్మూలాతో క్యారక్టర్ని ఎంజాయ్ చేసి హిట్ చేశారు. మళ్ళీ అదే ఫార్ములాతో అలాగే ఎంజాయ్ చేసేందుకు ఇది తెలిసిన క్యారక్టరే. దీనికి వున్న కథనే సరైన విధంగా చెప్పివుంటే క్యారక్టర్ ఇంకా రాణించేది.
సిద్ధూ జొన్నలగడ్డ కిది కొత్త సినిమానే అయినా క్యారక్టర్ అదే. ఆ
నటననే రిపీట్ చేయడం సమస్య కాదు. సినిమా సాంతం గ్యాప్ లేకుండా వన్ లైనర్లు విసరడం, తను
నవ్వకుండా నవ్వించడం, ఆ విచిత్ర మేకప్,
కాస్ట్యూమ్స్, మ్యానరిజమ్స్, ఎక్స్ ప్రెషన్స్, వీటికి తోడు మ్యూజిక్, డాన్సులు, కెమెరావర్క్, ఇంకోవైపు హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ గ్లామ్ షో, ఇవన్నీ
అతడ్ని యూత్ ఆరాధించగల షో మాన్ గా చేశాయి.
ఈ సినిమాకి పాపులర్ హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ ని తీసుకోవడం అదనపు ఆకర్షణగా మారింది. పాత్ర కన్విన్సింగ్ గా వుండదు. కేవలం గ్లామ్ షోకీ, లిప్ లాక్స్ కీ, కావలసినంత యూత్ అప్పీల్ కీ పనికొచ్చింది.
సర్ప్రైజ్ ఎంట్రీ ఇచ్చే నేహా శెట్టికి మంచి రెస్పాన్సే. అయితే ఆమెది అతిధి పాత్రే. ఆమె వరకు ఎపిసోడ్ ఎంటర్ టైన్ చేస్తుంది. ఇక డాన్ గా మురళీ శర్మ, టిల్లు తండ్రిగా మురళీధర్ గౌడ్ ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ప్రిన్స్ నటించిన పాత్ర కంగాళీగా వుంటుంది.
రామ్ మిరియాల, అచ్చు రాజమణి, భీమ్స్ సిసిరోలియోల సంగీతం, మూడు పాటలు , వాటి చిత్రీకరణ హైలైట్ గా వుంటాయి. సాయి ప్రకాష్ ఛాయాగ్రహణం, సితార ఎంటర్టైన్ మెంట్స్ నిర్మాణ విలువలు బలంగా వున్నాయి.
ఇలా ‘డిజే టిల్లు’, ‘టిల్లు స్క్వేర్’ ల తర్వాత ‘టిల్లు క్యూబ్’ అని గనుక తీస్తే, కాస్త కథ ఆధారిత క్యారక్టరైజేషన్ తో తీస్తే, విధేయులైన టిల్లు ఫ్యాన్స్ కి మేలు చేసిన వాళ్ళవుతారు.
—సికిందర్
Subscribe to:
Posts (Atom)