రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Wednesday, August 17, 2016

రివ్యూ!


దర్శకత్వం : టినూ సురేష్ దేశాయ్

తారాగణం : అక్షయ్ కుమార్, ఇలియానా, ఈషా  గుప్తా, అర్జన్ బజ్వా, 
పవన్ మల్హోత్రా, ఉషా  నాదకర్ణి, సచిన్ ఖేడేకర్, కుముద్ మిశ్రా,
అనంగ్ దేశాయ్, కన్వల్ జిత్ సింగ్, తదితరులు
 కథ : నానావతీ కేసు ఆధారం, స్క్రీన్ ప్లే - మాటలు : విపుల్ కె రావల్,
సంగీతం : అంకిత్ తివారీ, జీత్  గంగూలీ, ఆర్కో, రాఘవ్ సచార్
ఛాయాగ్రహణం : సంతోష్ తుండియిల్
బ్యానర్ :  జీ స్టూడియో - ప్లాన్ సి స్టూడియోస్
నిర్మాతలు : నీరజ్ పాండే, అరుణా భాటియా తదితరులు
విడుదల : 12  ఆగస్టు, 2016
***
    కోర్టు రూమ్ డ్రామాల్ని రసవత్తరంగా చిత్రించే సినిమాలు అరుదుగా వస్తూంటాయి. సినిమాల్లో సర్వసాధారణంగా సీరియస్ గా నడిచే కోర్టు విచారణలు కేవలం ఫార్ములా ప్రకారం వాటిలోని సస్పెన్స్ ఎలిమెంటుతో కట్టిపడెయ్యాలని ప్రయత్నిస్తూంటాయి. కానీ నిజజీవితంలో కోర్టుల్లో సందర్భానుసార హాస్యం కూడా అప్పుడప్పుడు పెల్లుబుకుతూంటుంది. దీన్ని పట్టుకుని గంటన్నర కోర్ట్ రూమ్ డ్రామాని వినోదభరితంగా మార్చిన  ప్రయోగంగా ‘రుస్తుం’ నిలబడుతుంది. మూస ఫార్ములాల్ని బద్దలు కొట్టి కేవలం కథకే ప్రాధాన్య మిచ్చి, కథతో బాటూ పాత్రల మనోభావాల చిత్రణకీ కాస్త చోటిస్తే ప్రేక్షకులు కదలకుండా కూర్చుని వీక్షిస్తారనేందుకు కూడా తార్కాణంగా నిలుస్తుంది ‘రుస్తుం’ 

     మూస మాస్ హీరో అక్షయ్ కుమార్ ఆ చట్రంలోంచి బయటపడి వాస్తవిక పాత్రలు కూడా నటిస్తూ తనదైన ఒక ఓకొత్త శైలిని పెంచి పోషించుకుంటున్నాడు. బేబీ, స్పెషల్ 26, ఏర్ లిఫ్ట్ వంటి ఏ పాత్రలోనైనా ఒదిగిపోగల ఈజ్ తో ప్రేక్షకులకి వెరైటీని అందిస్తున్నాడు. ప్రేక్షకులకి ఇక వెరైటీని అందించడమే కాలంతీరిన సీనియర్ స్టార్ ల పరమావధి అయినప్పుడు,  మన విక్టరీ వెంకటేష్ కూడా ఇంకా ‘బాబు బంగారం’ లాంటి తనే ఎప్పుడో వాడేసిన పాత మూసకి బదులు- అక్షయ్ కుమార్ నటించిన ‘రుస్తుం’ లాంటివి బ్రహ్మాండంగా ప్రయత్నించి సీనియారిటీని సార్ధకం చేసుకోవచ్చు. ‘రుస్తుం’ కథతో, పాత్రతో వున్న సౌలభ్యమేమిటంటే-  దీన్ని ఏ భాషలో ఎవరైనా నటించవచ్చు. 

        ఒక వైవాహిక బంధం వివాహేతర సంబంధానికి దారితేస్తే,  సైనికుడైనా చట్టాన్ని ఉల్లంఘిస్తాడని తెలిపే ‘రుస్తుం’ - సరిహద్దులో సైనికుడు కాపాలా కాస్తూంటే, వూళ్ళో అతడి భార్య మీద కన్నేయడం నీచాతి నీచమన్న వాదనని తెరపైకి  తెస్తుంది. 

కథ 
      నావికాదళ కమాండర్ రుస్తుం పావరీ (అక్షయ్ కుమార్) ఆర్నెల్లు డ్యూటీకెళ్ళి అనుకోకుండా ముందుగానే ఇంటి కొస్తాడు. భార్య సింథియా (ఇలియానా) ఇంట్లో వుండదు. మొన్ననగా ఎక్కడికో వెళ్ళిన మనిషి ఇంకా రాలేదని అంటుంది పని మనిషి జమునా బాయి (ఉషా నాదకర్ణి). రుస్తుంకి ఇంట్లో కొన్ని ప్రేమలేఖలు దొరుకుతాయి. అవి విక్రం మఖీజా (అర్జన్ బజ్వా) అనే ఇండస్ట్రియలిస్ట్ సింథియాకి రాసినవి. రుస్తుం ప్రపంచం తలకిందు లవుతుంది. సింథియా రాగానే ఉత్తరాలు చూపిస్తాడు. ఆమెకి ఏడ్పే మిగులుతుంది. విక్రం నావల్ బేస్ కెళ్ళి తన రివాల్వర్ తీసుకుంటాడు. నేరుగా విక్రం మఖీజా దగ్గరికెళ్ళి కాల్చి పారేస్తాడు. అలాగే పోలీసుల దగ్గరి కెళ్ళి లొంగి పోతాడు. 

        కోర్టులో విచారణ ప్రారంభమవుతుంది. రుస్తుం తన కేసు తనే వాదించు కుంటాడు. మరో వైపు నావికాదళ అధికారుల నుంచి ఒక వొత్తిడి వుంటుంది రుస్తుం కి. వేరే ఒక వ్యవహారానికి సంబంధించిన ముఖ్యమైన పత్రాలు రుస్తుం దగ్గర వుంటాయి. వాటికోసం ప్రయత్నిస్తూంటారు. రుస్తుం లొంగకపోతే హత్య కేసులో రుస్తుంకి వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాధారం విడుదల చేసేస్తారు.

        ఈ కేసుని జడ్జీతో  బాటు జ్యూరీ కూడా పరిశీలిస్తుంది. వాదోపవాదాలు ముగిశాక  బంతి జ్యూరీ కోర్టులో పడుతుంది. అప్పుడు జ్యూరీ ఏమని తీర్పు ఇచ్చింది? తన కేసు తనే  వాదించుకున్న రుస్తుం ఇందులో విజయం సాధించాడా? విక్రం చెల్లెలు, పోలీసులూ ప్రాసిక్యూటర్ ఎలాటి కుట్రలు చేశారు? పార్సీ మతస్థుడైన రుస్తుంకి మద్దతుగా ప్రజాభిప్రాయాన్ని కూడగట్టేందుకు పార్సీ పత్రికా యజమాని ఎలాటి వార్తలు రాయించాడు? సింథియా  ఏమైంది? ఆమెని రుస్తుం క్షమించాడా? ఇవన్నీ తెలియాలంటే థియేటర్ కెళ్లాల్సిందే. 

ఎలావుంది కథ
          ది మౌలికంగా క్రైం కథ. 1959లో అప్పటి బొంబాయిలో జరిగిన నిజ కథ. దేశవ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టించడమే కాదు, దేశ న్యాయ వ్యవస్థలో కీలకమైన ఒక శాఖ రద్దుకూ దారితీసిన చారిత్రాత్మక కేసు. కెఎం  నానావతి వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్రగా ప్రసిద్దిపొందిన ఈ కేసు మీద అనేక గ్రంధాలూ కొన్ని సినిమాలూ వెలువడ్డాయి. 1963 లో సునీల్ దత్, లీలా నాయుడు, రెహ్మాన్ లతో దర్శకుడు ఆర్ కె నయ్యర్ ‘యే రాస్తే  హై ప్యార్ కే’  (దారి తప్పిన ప్రేమలు) తీశారు. సునీల్ దత్ అభిమాన రచయిత ఆఘా జానీ కశ్మీరీ కథ రాశారు. కానీ 2010 లో లీలా నాయుడు తన అనుభవాలు గ్రంథస్థం చేసినప్పుడు, ఈ సినిమాకథ నానావతి  కేసు కంటే ముందే రాశారనీ, కాకతాళీయంగా తర్వాత జరిగిన కేసు ఈ కథని పోలి వుందనీ  రాశారు. అయితే ఈ సినిమా అప్పట్లో ఫ్లాపయ్యింది. 

        ఆ తర్వాత 1973 లో గుల్జార్ ‘అచానక్’  (అకస్మాత్తుగా) అని తీశారు. జర్నలిస్టు, రచయితా అయిన కె ఎ అబ్బాస్ కథ రాశారు. వినోద్ ఖన్నా, లీలా చక్రవర్తి, ఓం శివ్ పురి లు నటించారు. ఇది హిట్టయ్యింది. 

        ఈ సినిమాలతో సహా ‘రుస్తుం’ కూడానూ కేసుని ఉన్నదున్నట్టు చూపించ లేదు. ఏ సినిమాకా సినిమా చాలా కల్పనలు చేశారు- కేవలం ఒక వివాహేతర సంబంధం, దాని పర్యవసానంగా  హత్య అనేదే వీటిలో సామాన్యాంశం. ఈ నేపధ్యంలో అసలు నిజంగా ఏం  జరిగిందో తెలుసుకోవడం అవసరం ( 2010 లో  ‘ఆంధ్ర జ్యోతి’ ఆదివారం అనుబంధంలో ‘అపరాధి’ శీర్షిక కింద క్రైం కథలు రాస్తున్నప్పుడు నానావతి కేసు మీద కూడా ఓ కథ రాశాడు ఈ వ్యాసకర్త).

     క్లుప్తంగా చెప్పుకుంటే, నావికాదళ కమాండర్ కవస్ మానెక్ షా నానావతి పారసీయుడు. అతను బ్రిటిష్ యువతి  సిల్వియాని వివాహమాడాడు. వాళ్లకి ముగ్గురు పిల్లలు. నానావతి తరచూ డ్యూటీ  మీద నెలల తరబడీ వెళ్ళడంతో  ఒంటరిదైన సిల్వియా,  ప్రేమ్ అహుజా అనే యువ పారిశ్రామిక వేత్తతో ప్రేమలో పడింది. శారీరక సంబంధం పెట్టుకుంది.

       కానీ తనని పెళ్ళాడతానన్న ప్రేమ్ మాట మార్చడంతో భగ్గుమంది. ఈ నేపధ్యంలో డ్యూటీ నుంచి వచ్చిన  భర్త నానావతికి తన గుట్టంతా  తనే చెప్పుకుని పశ్చాత్తాప పడింది(ఇలా చెప్పడం ద్వారా తనే భర్తని ప్రేమ్ మీదికి ఉసిగొల్పిందన్న వాదన కూడా వుంది).  ఆమె విశ్వాసఘాతం తట్టుకోలేక నానావతి సీసాతో పొడుచుకుని చావబోయాడు. ఆమె అడ్డుకుంది.

        ఇక నానావతి ఒక నిర్ణయం తీసుకుని,  భార్యా పిల్లల్ని సినిమాహాలు దగ్గర దిగబెట్టి సినిమా చూడమని చెప్పి,  తను నావల్ బేస్ లో తన రివాల్వర్ తీసుకుని  వెళ్లి ప్రేమ్ ఆహుజాని కాల్చి చంపేశాడు. అట్నుంచి వెస్టర్న్ నావల్  కమాండ్ లో ప్రొవోస్ట్ మార్షల్ ఎదుట లొంగిపోయాడు. ఆ అధికారి బొంబాయి డిసిపి కి అప్పగించాడు. 

       కోర్టులో విచారణ ప్రారంభమయింది. నానావతి స్వయంగా వాదించుకోలేదు. అతడి తరపున కార్ల్ ఖాండావాలా వాదిస్తే, ప్రాసిక్యూషన్ లాయర్ గా రామ్ జెఠ్మలానీ పనిచేశారు. ఒకే ఒక్క పాయింటు మీద కేసంతానడిచింది- నానావతి క్షణికావేశంలో చంపాడా, లేక పథకం ప్రకారమే  చంపాడా అనేది. మొదటిదైతే శిక్ష స్వల్పంగా పడొచ్చు, రెండోదైతే పదేళ్ళు తప్పదు. 

          కేసు నానా మలుపులు తిరిగి చివరికి తీర్పుకి జ్యూరీ ఎదుట కొచ్చింది. జ్యూరీ అంటే మరేమిటో కాదు, కొందరు పుర ప్రముఖులతో కూడిన జట్టు. నేరుగా జడ్జీలు తీర్పు చెప్పే విధానం అప్పట్లో లేదు. జ్యూరీలో ఓటింగే శరణ్యం. ఆ ఓటింగ్ తర్వాత జడ్జి ఎటువైపు తన ఓటేస్తే దాన్ని బట్టి నిందితుడు దోషియో నిర్దోషియో అవడం జరిగేది. 

          జ్యూరీలో ఎనిమిది మంది సభ్యులూ  ఏకగ్రీవంగా ‘క్షణికావేశంలో చేసిన హత్య’  కోణానికే ఓటేశారు. జస్టిస్ మెహతా వ్యతిరేక ఓటేశారు. ఇలా నానావతి మీద కేసు వీగిపోవడంతో, ఇది జ్యూరీ ఇచ్చిన తప్పుడు తీర్పు అని,  హైకోర్టుకి కి రిఫర్ చేశారు జస్టిస్ మెహతా.  హైకోర్టు ‘పథకం ప్రకారమే చేసిన హత్య’ కోణాన్నే  సమర్ధించి, నానావతికి యావజ్జీవం విధించింది. సుప్రీం కోర్టు కూడా హైకోర్టు తీర్పుని సమర్ధించింది. ఇక నానవతికి అన్ని దారులూ  మూసుకు పోయాయి.

        ఇప్పుడే ఒకమలుపు తిరిగింది కథ.  కింది కోర్టులో ఈ కేసు విచారణ సందర్భంగా చెలరేగిన ప్రజాందోళనలకీ, పత్రికా కథనాలకీ జ్యూరీ సభ్యులు ప్రభావితం కావడం, అటుపైన సాక్ష్యా ధారాల్ని బట్టి కాక, నిందితుడి పట్ల సానుభూతితో  భావావేశాలకి లోనై  ఓటింగ్ చేయడమూ గమనించిన భారత ప్రభుత్వం, ఏకంగా బ్రిటిష్ కాలం నాటి ఆ జ్యూరీ విధానాన్నే రద్దు చేసి పారేసింది. 

      ఇదొక చారిత్రక ఘట్టం న్యాయవ్యవస్థలో. ఇదొక ఎత్తయితే, నానావతికి వ్యతిరేకంగా సుప్రీం తీర్పు కూడా రావడంతో,  పార్సీ వర్గాలు ఉద్యమించాయి. పార్సీ మతస్థుడైన ప్రఖ్యాత ‘బ్లిట్జ్’ పత్రికా సంపాదకుడు రూసీ కరంజీయా,  మొదట్నించీ ఈ కేసుమీద కథనాలు ప్రచురిస్తూనే వున్నాడు. ఇక సుప్రీం తీర్పు తర్వాత ఆయన పార్సీల ఆందోళనకి మద్దతుగా నానావతి విడుదల వాదాన్ని ఎత్తుకున్నారు. నావికా దళం సైతం నానావతికి మద్దతు పలికింది.

        నానావతి  చేతిలో మరణించిన ప్రేమ్ ఆహుజా సింధీ కులస్థుడు. ఇక సింధీలంతా నానావతికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. ఒక విచిత్ర మేమిటంటే,  నానావతి మీద ప్రాసిక్యూషన్ నడిపిన సింధీ కులస్థుడైన రామ్ జెఠ్మలానీ, ఇప్పుడు పార్సీలతో కలిసిపోయి నానావతికి జైకొట్టడం మొదలెట్టారు!

        బ్రిటన్ లో వి.కె. కృష్ణ మీనన్  ఇండియన్ హై కమీషనర్ గా పనిచేస్తున్నప్పుడు  ఆయనకి డిఫెన్స్ అటాచీగా పనిచేసిన అనుభవం కూడా వుంది  నానావతికి. అంతేగాదు, ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ కుటుంబానికి నానావతి సన్నిహితుడు కూడా. అయినా నానావతికి క్షమాభిక్ష పెడితే సింధీల ఆగ్రహాన్ని చవి చూడాల్సి వస్తుందని భయపడింది నెహ్రూ ప్రభుత్వం. 

       సరీగ్గా అప్పుడు,  ఒక సింధీ స్వాతంత్ర్య యోధుడు ఒక లైసెన్సు దుర్వినియోగ కేసులో శిక్షపడి, క్షమాభిక్ష అర్జీ  పెట్టుకున్నాడు. దాంతో జెఠ్మలానీ  రంగంలోకి దిగిపోయి చకచకా పావులు కదిపారు. మరణించిన ప్రేమ్  అహుజా కి మామీ ఆహుజా  అనే చెల్లెలుంది. ఆమెని జెఠ్మలానీ ఒప్పించి, తన అన్నని చంపిన నానావతిని  తను క్షమిస్తున్నట్టు లిఖితపూర్వక వాంగ్మూలం తీసుకుని గవర్నర్ కి సమర్పించారు. ఒక వైపు ఈ సింధీ స్వాతంత్ర్య యోధుడి క్షమాభిక్ష అర్జీ, మరో వైపు నానావతి క్షమాభిక్ష వినతీ   రెండూ పరిశీలించిన గవర్నర్, పండిట్ నెహ్రూ సోదరి అయిన  విజయలక్ష్మీ పండిట్, ఇద్దరికీ క్షమాభిక్ష పెట్టి వదిలేశారు. జెఠ్మలానీ చేసిన ఈ సింధీ- పార్సీ సమన్యాయ గిమ్మిక్కు నానావతికి స్వేచ్ఛని ప్రసాదించింది.  

        ఇలా సుప్రీం తీర్పు తర్వాత రాజకీయ-సామాజిక- కుల- మత సమీకరణాలన్నీ మూడేళ్ళూ జైల్లో మగ్గిన నానావతికి కలిసొచ్చాయి. జైల్లోంచి విడుదలై  భార్యా పిల్లల్ని తీసుకుని కెనడా వెళ్ళిపోయాడు. 2003 లో 76 వ యేట అక్కడే కన్ను మూశాడు.
        ***
  ‘రుస్తుం’ సహా నానావతి మీద తీసిన ఇతర రెండు సినిమాలలోనూ  ఈ హై ప్రొఫైల్ మర్డర్ కేసు చారిత్రక ప్రాముఖ్యాన్నీ, కేసు విస్తృతినీ  ప్రేక్షకుల ముందు సవివరంగా పెట్టకుండా కేవలం సాదాసీదా హత్య కేసుగానే చెప్పి ముగించేశారు. పైగా నానావతి కేసు ఆధారంగా అని ప్రచారం చేయడంతో, ‘రుస్తుం’ లో ఎలా కల్పన చేసి చూపించారో అలాగే నానావతి సంఘటన జరిగి ఉంటుందని  నేటి ప్రేక్షకులు అపోహపడే అవకాశ మేర్పడింది. నానావతి రాజకీయ సంబంధాలు, ఆనాడు జరిగిన వర్గ ఉద్యమాలూ వంటి వివాదాస్పద అంశాల జోలికి వెళ్లకపోయినా- కనీసం ఈ కేసు పుణ్యాన జ్యూరీ వ్యవస్థ రద్దయినట్టు అయినా చెప్పి ఉండాల్సింది.   ‘Three shots that shook the nation’ అని టైటిల్ కి పెట్టిన క్యాప్షన్ కూడా ఆనాడు ‘బ్లిట్జ్’ పత్రిక పతాక శీర్షిక లోనిదే. ఇంకొకటేమిటంటే,   రుస్తుం భార్యకి క్లీన్ చిట్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఇంకో కథ తెచ్చి కలపడం, ఆ కథ తేలిపోవడం.  దీన్నొక కోర్టు రూమ్ డ్రామాగా మాత్రమే చూస్తే – ఒక పరిధి వరకూ రసవత్తరమే. అసలిది నానావతి నిజకథ  అని ప్రచారం చేయకుండా విడుదల చేసి వుంటే,  సినిమా చూసిన ప్రేక్షకుల నుంచే పెద్ద పెట్టున చర్చ జరిగేది. అమ్మో ఇది నానావతి కథరా, ఎంత తెలివిగా మార్చేసి తీశాడు- అని ప్రేక్షకులే చర్చించుకునే వాళ్ళు. మెచ్చుకునే వాళ్ళు ఆ తెలివైన క్రియేటివిటీకి. నానావతి కథ అని ముందే చెప్పేయడంవల్ల కథలో లోపాలే ఎన్నుతారు ఎవరైనా. క్రియేషన్ ఎప్పుడూ గుంభనంగా జరిగిపోవాలి. ఐన్ స్టీన్ చెప్పినట్టు -The  secret of creativity is knowing how to hide your sources- కదా?

ఎవరెలా చేశారు 

      నానావతి పాత్రకి ఇంతలా సరిపోయే నటుడు ఇంకొకరు వుండరు. ఇందుకు నూటికి నూరు మార్కు లేయవచ్చు అక్షయ్ కుమార్ కి. ఆద్యంతం యూనిఫాంలో నేవీ కమాండర్ హూందాతనాన్ని పకడ్బందీగా పోషించాడు. భార్య మోసం చేసిందని తెలిసినప్పుడు కూడా సంయమనం కోల్పోకుండా, అదే సమయంలో ప్రేక్షకులనుంచి సానుభూతిని కూడా ఆశించకుండా, ఒక డిఫెన్స్ ఉద్యోగిగా తనదైన ప్రొఫెషనలిజంతో చర్యలు చేపడతాడు. తనపై వచ్చిన ఆరోపణలకి మెలో డ్రామాకి అవకాశమివ్వకుండా, హేతుబద్ధమైన సమాధానాలతో తిప్పి కొడతాడు. ఒక గ్రేట్ క్యారక్టర్ ని అర్ధం జేసుకుని గ్రేట్ గా పోషించాడు అక్షయ్ కుమార్. 

     దర్శకుడు- రచయితా భార్యా భర్తల్లా ఒకటైతే పాత్రలన్నీ అద్భుతాలు చేస్తాయి. దర్శకుడిది హార్డ్ వేర్ పని, రచయితది సాఫ్ట్ వేర్ పని. రెండూ ఒకటైతేనే అర్ధవంతమైన చిత్రీకరణలు తెర మీద మెరుస్తాయి. మాటల కెంత ప్రాముఖ్యమిచ్చారో,  మాట్లాడేముందు నటీనటుల ఆలోచనలకి, హవాభావాలకీ అంటే ప్రాధాన్య మిచ్చారు. ఇలియానా సున్నిత పాత్ర, ఈషా గుప్తా దూకుడు పాత్రా-  వాటి హాహభావాలూ  కెమెరా మాన్ కూడా పట్టుకున్న తీరు బలమైన ముద్ర వేస్తాయి. ఇలియానాకి హిందీలో దక్కుతున్నట్టు ఇలాటి సున్నిత హోమ్లీ పాత్రలు తెలుగులో దక్కలేదు. ఈ పాత్రల్లో ఆమె ఎలాటి ప్రావీణ్యం ప్రదర్శిస్తోందో తెలుగు ప్రేక్షకులకి తెలీదు.

        ప్రతీ పాత్రా కొన్నాళ్ళు గుర్తుండి పోయేదే.  విచారణాధికారి  అయిన సీనియర్ ఇన్స్ పెక్టర్ విన్సెంట్ లోబో పాత్రలో పవన్ మల్హోత్రా-  1959 మోడల్  మనిషిగా, పోలీసుగా ఒక ఎక్సెలెంట్ - క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇచ్చాడు. అలాగే పత్రికా యజమాని ఎరక్ బిల్లిమోరియా గా కుముద్ మిశ్రా కన్పిస్తే చాలు సున్నిత హాస్యాన్ని పండించిన తీరు కూడా క్లాసిక్ టచ్చే. ప్రాసిక్యూటర్ లక్ష్మణ్ ఖంగానేగా సచిన్ ఖడేకర్, డిఫెన్స్ సెక్రెటరీ   బక్షీగా కన్వల్ జిత్ సింగ్ హేమా హేమీలై నటించారు. చాన్నాళ్ళ తర్వాత హిందీ తెర మీద కన్పించిన అనంగ్ దేశాయ్ జడ్జి పాత్రతో, పనిమనిషిగా ఉషా నాదకర్ణి గమ్మత్తైన కామిక్ సెన్స్ తో  దృశ్యాల్ని  ఉత్తేజభరితం చేస్తారు. పారిశ్రామిక వేత్త విక్రం మఖీజాగా అర్జన్ బజ్వా మాత్రం అక్షయ్ కి దీటుగా సరిపోని  ఫిజిక్ తో  ప్రతినాయక పాత్రలో అంతగా ఆకట్టుకోడు. 

       టెక్నికల్ గా అత్యున్నతంగా వున్న ఈ మూవీ కి కళ్ళు చెదిరే కెమెరా వర్క్ చేశాడు సంతోష్ తుండియిల్. రంగులతో, వెలుగు నీడలతో ఒక స్వర్గ లోకాన్ని ఆ విష్కరిస్తున్నట్టు చేశాడు. అయితే ఆ రంగులూ - కళాదర్శకత్వం కొన్ని చోట్ల డిజైనర్ లుక్ ని తెచ్చిపెట్టి  సహజత్వానికి దూరమయ్యాయి. కథే డిజైనర్ చరిత్రగా  వునప్పుడు చిత్రీకరణా అ లావుండాలని లేదుగా?
        పాటలకి ప్రాధాన్యం లేదు- ఒక టైటిల్ సాంగ్, ఇంకో బ్యాక్ గ్రౌండ్ సాంగ్ తప్ప. 



చివరికేమిటి?
     ఒక మంచి ప్రయత్నం. దర్శకుడికి మంచి పట్టు వుంది. చిత్రీకరణలకి సంబంధించి మంచి అయిడియాలున్నాయి- టెక్నాలజీతో కలుషితం చేయకుండా.  అయితే రుస్తుం, అతడి భార్య పాత్రలు పాల్పడిన నేర పూరిత, అనైతిక  చర్యల్ని ఎలా జస్టిఫై చేయాలన్న ప్రయత్నంలో తప్పటడుగులేశారు. ఉన్న కథని ఇంకో కథతో పొడిగించడం వల్ల ఈ సమస్య వచ్చింది. చివరికి వ్యవస్థే నానావతి కథని ఎలా సుఖాంతం చేసిందో చరిత్రలో చూశాక- ఈ పాట్లన్నీ ఎందుకనేలా ఉంది. ఇదలా ఉంచితే, క్వాలిటీ సినిమా చూడాలనుకునే ప్రేక్షకులకి-  ఈ కోర్ట్ రూమ్ డ్రామా మాత్రం కొత్త అనుభవాన్నిచ్చే మాంచి వినోద కాలక్షేపం!


-సికిందర్  
( స్క్రీన్ ప్లే సంగతులు రేపు!)
(Watched at 7pm on 16th  Aug)