రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Sunday, November 26, 2023

1384 : రివ్యూ


 రచన - దర్శకత్వం: తేజ మార్ని

తారాగణం : శ్రీకాంత్, శివానీ రాజశేఖర్, వరలక్ష్మీ శరత్ కుమార్, రాహుల్ విజయ్, మురళీ శర్మ, పవన్ తేజ్, బెనర్జీ తదితరులు 
 సంగీతం: రంజిన్ రాజ్, ఛాయాగ్రహణం: జగదీష్ చీకటి
సహ నిర్మాతలు: భాను కిరణ్ ప్రతాప, రియాజ్
నిర్మాతలు: బన్నీ వాస్, విద్యా కొప్పినీడి  
విడుదల : నవంబర్ 24, 2023
***
కథ

    రవి (రాహుల్ విజయ్) పోలీసుద్యోగంలో చేరతాడు. అదే స్టేషన్లో కుమారి (శివానీ రాజశేఖర్) కానిస్టేబుల్ గా  పని చేస్తూంటుంది. రామకృష్ణ (శ్రీకాంత్) ఏఎస్సైగా వుంటాడు. కుమారి, రామకృష్ణలు ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. రామకృష్ణ కూతురికి క్లాసికల్ డాన్స్ నేర్పిస్తూ ఆమె అందులో పేరు తెచ్చుకోవాలని ఆశిస్తూ వుంటాడు. ఒక రోజు కుమారి బంధువుఆమె సామాజిక వర్గ పార్టీ కార్యకర్త మున్నా (పవన్ తేజ్) అనే అతనుపోలీస్ స్టేషన్లో బీభత్సం సృష్టిస్తాడు. ఏఎస్సై రామకృష్ణ లాకప్ లోవేస్తే ఫోన్లు చేయించుకుని విడుదలై పోతాడు. వాళ్ళ పార్టీ కార్యకర్తలు పోలీసులకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తారు.

ఇంకో రోజు
రామకృష్ణ, రవి ఓ పెళ్ళికి హాజరై బాగా తాగుతారు. జీపు డ్రైవ్ చేయడానికి రామకృష్ణ మేనల్లుడ్ని తెచ్చుకుంటాడు. అదే జీపులో కుమారి  ఎక్కుతుంది. దారి మధ్యలో యాక్సిడెంట్ జరుగుతుంది. జీపు డ్రైవ్ చేసిన రామకృష్ణ మేనల్లుడు పారిపోతాడు. ఆ యాక్సిడెంట్ లో పార్టీ కార్యకర్త చనిపోతాడు. దీంతో ఆ పార్టీ  ఆందోళన చెలరేగుతుంది.
        
ఏపీ లోని ఆ నియోజక వర్గం టెక్కలిలో ఉప ఎన్నిక వుంది. ఆ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు 50 వేలు వున్నాయి.  దీన్ని దృష్టిలో పెట్టుకుని యాక్సిడెంట్ చేసిన సిబ్బందిని అరెస్ట్ చేయమని హోమ్ మంత్రి జయరామ్ (మురళీ శర్మ) ని రంగంలోకి దించుతుంది అధికార పార్టీ ప్రభుత్వం.
        
దీంతో రామకృష్ణ, రవి, కుమారి ముగ్గురూ పరార్ అవుతారు. మరోవైపు ఎన్నికల్లో పార్టీని గెలిపించడం కోసం నిందితుల్ని 48  గంటల్లో అరెస్ట్ చేస్తామని హోమ్ మంత్రి జయరాం శపథం చేస్తాడు. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్, ఎస్పీ రజియా అలీ (వరలక్ష్మీ శరత్ కుమార్) కి ఆ బాధ్యత అప్పగిస్తాడు డిజిపి.
        
వేట మొదలవుతుంది. దొరక్కుండా ప్రదేశాలు మారుస్తూ పరారీలో వుంటారు ముగ్గురూ. ఇలా ఎక్కడిదాకా, ఎంతకాలం పరుగుదీశారురజియా అలీ టీం వాళ్ళని పట్టుకోగలిగిందామధ్యలో తలెత్తిన వూహించని పరిణామమేమిటిచేయని నేరానికి నేరస్థులుగా ముద్రపడిన పోలీసులు ముగ్గురూముఖ్యమంత్రి ఓట్ల రాజకీయానికెలా బలయ్యారు... ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

    ఇది  2011 లో కేరళలో జరిగిన ఉదంతం. నల్గురు పోలీసులు ఒక టాక్సీలో పెళ్ళికి వెళ్ళి వస్తూంటే యాక్సిడెంట్ జరిగి ఇద్దరు పిల్లలు చనిపోయారు. ఆగ్రహం పెల్లుబికింది. ఆ నల్గురు పోలీసుల మీద ఎస్సీ/ఎస్టీ చట్టం కిందహత్య కేసు కింద అరెస్టు చేయమని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో నల్గురూ అజ్ఞాతంలో కెళ్ళిపోయి బెయిల్ కోసం ప్రయత్నించారు. 100 రోజుల తర్వాత సుప్రీం కోర్టులో బెయిలు లభించింది. ఇప్పుడు పన్నెండేళ్ళు గడిచిపోయినా కేసు ఇంకా తేలలేదనేది వేరే సంగతి.
       
ఈ ఉదంతాన్ని సినిమాకి అనుకూలంగా మార్చి 2021 లో మలయాళంలో
నాయాట్టు (వేట) తీశాడు దర్శకుడు మార్టిన్ ప్రకట్. దీన్ని తెలుగులో కోట బొమ్మాళి పిఎస్ గా రీమేక్ చేశారు. నాయాట్టు’ చూస్తే ది కథ కాదు. జీవితంలో కథలుండవుగాథలే వుంటాయి. గాథల్ని సినిమాలుగా తీస్తే ఆడవు గనుక కథగా మార్చి తీస్తారు. ఐతే గాథలా వున్న నిజ సంఘటనని అనుకోకుండా గాథగానే తీసి విజయం సాధించారు ‘నాయాట్టు’ తో. ఇదో ప్రత్యేకత.
        
అయితే ఒక సామాజికవర్గ కోణంలో చేసిన ఈ గాథ కాన్సెప్ట్ పరంగా తెలుగులోనూ డొల్లగా మారిందని చెప్పక తప్పదు. ఎత్తుకున్న కుల కోణాన్ని నిజాయితీగా చెప్పలేక అపహాస్యం చేసిన వరస కన్పిస్తుంది. గాథ అయివుండీయాంటీ క్లయిమాక్సుతో మ్యాన్ హంట్ థ్రిల్లర్ గా నిలబడిన రచనకాన్సెప్ట్ పరంగా చొరవ చూపలేక చతికిల బడిందని ఒప్పుకోవాలి.
       
మ్యాన్ హంట్ థ్రిల్లర్ జానర్ గాథగా కొన్ని లోపాలతో
 చీకటి వెలుగుల హ్యూమన్ డ్రామాగా ఇది థ్రిల్ చేసే మాట నిజమేఅయితే కాన్సెప్ట్ పరంగా అసందర్భంగా వుంది. ఒక సామాజిక వర్గపు కాన్సెప్ట్ తీసుకుని అర్ధం లేని గాథ చేశారు. అదే సామాజిక వర్గం వర్సెస్ అదే సామాజిక వర్గం వర్సెస్ అదే సామాజిక వర్గం అన్నట్టు బలాబలాల సమీకరణ చేసి పాత్రల్ని ఎడాపెడా వాడేశారు.
        
యాక్సిడెంట్ చేసి పారిపోయిన పోలీసులు ముగ్గుర్లో ఇద్దరు  రామకృష్ణ, కుమారి- ఓ సామాజిక వర్గం సభ్యులైతే, యాక్సిడెంట్ లో చనిపోయిన వాడూ అదే సామాజిక వర్గానికి చెందిన వాడు. ఇక యాక్సిడెంట్ చేసి పారిపోయిన అదే సామాజిక వర్గానికి చెందిన పోలీసుల్ని, పట్టుకోవాలని రచ్చ రచ్చ చేసేదీ అదే సామాజిక వర్గానికి చెందిన పార్టీ! ఇది చోద్యంగా లేదూ?
       
అంటే
, యాక్సిడెంట్ చేసి పారిపోయిన పోలీసుల్లో ఇద్దరు మీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే కదా- మీ వాళ్ళని పట్టుకుని శిక్షించాలని అంత పట్టుదల మీకేంటయ్యా- అని హోమ్ మంత్రి ఈ గొడవని కొట్టి పారేయొచ్చు. వాళ్ళ  ఓట్ల గురించి అధికార పార్టీ ఆందోళన చెందే అవసరమే లేదు. అంటే సినిమా తీయడానికి కథే లేదు. మలయాళంలో జరిగిన ఈ పొరపాటుని తెలుగులో సరిదిద్దుకుని వుండొచ్చు. పారిపోయిన పోలీసులు వేరే సామాజిక వర్గం అంటే సరిపోయేది. బలాబలాల సమీకరణ అర్ధవంతంగా వుండేది. కేరళలో జరిగిన నిజ కేసులో పారిపోయిన పోలీసుల మీద ఎస్సీ/ ఎస్టీ కేసు పెట్టారంటే వాళ్ళు ఇదే సామాజిక వర్గం కాదని కదా?
       
ఒరిఓజినల్లో ఇంకే మార్పులు చేయకుండా
, తెలుగు మూస మసాలాలు వాడకుండా, ముగింపు కాస్త మార్చి, ఉన్నది వున్నట్టు రియలిస్టిక్ జానర్లో తీశారు. దీంతో మూస సినిమాలకి భిన్నంగా ఇది కనిపిస్తుంది. నేటి తెలుగు సినిమాల్ని మూస ఫార్ములాలు కాకుండా ఇలా రియలిస్టిక్ గా తీసినా ఆడతాయని కోట బొమ్మాళి పిఎస్ రీమేక్ ద్వారా గుర్తిస్తే మంచిదే.

నటనలు – సాంకేతికాలు


        మలయాళంలో జోజు జార్జి పాత్రని శ్రీకాంత్ పోషించాడు. అయితే ఈ ఏఎస్సై పాత్రకి గతంలో గ్రేహౌండ్స్ ఆపరేషన్స్ స్పెషలిస్టుగా పని చేశాడని అదనపు హంగు ఇచ్చారు. శ్రీకాంత్ రాజకీయాలకి బలైన ఈ పోలీసు పాత్రని సహజత్వంతో నటించాడు. తనని వేటాడే పోలీసులతో హైడ్రామా, తన వాళ్ళతో ఫ్యామిలీ డ్రామా దృశ్యాలకి బలాన్నిచ్చాడు.
       
శ్రీకాంత్ కి ఎదుటి పాత్ర వరలక్ష్మీ శరత్ కుమార్ ఎస్పీ పాత్ర. ఎత్తుకి పైయెత్తులు ఈ ఇద్దరి మధ్యే వుంటాయి. ఈ కరుడుగట్టిన పోలీసు పాత్రని పవర్ఫుల్ గా పోషించింది. కానిస్టేబుల్ గా శివానీ
, ఇంకో కానిస్టేబుల్ గా రాహుల్ విజయ్ లు బాధిత పాత్రల్ని తగు భావోద్వేగాలతో నటించారు. ఈ చదరంగపు ఆట ఆడే హోమ్ మంత్రిగా మురళీ శర్మ తన మార్కు నటనతో ఓకే.
       
కథ జరిగే శ్రీకాకుళం లొకేషన్స్
,  ఆంధ్రా- ఒరిస్సా బోర్డర్ దృశ్యాల్ని కెమెరామాన్ జగదీష్ ఒరిజినల్ మూవీకి తీసి పోనివిధంగా దృశ్యీకరించాడు. రియలిస్టిక్ జానర్ టోన్ లో, లైటింగ్ తో దృశ్యాల్ని క్యాప్చర్ చేశాడు. అలాగే రంజిన్ రాజ్ సంగీతంలో ఒక హిట్టయిన పాట, నేపథ్య సంగీతం బలంగా వున్నాయి. ఎడిటింగ్, యాక్షన్ కొరియోగ్రఫీ, కాస్ట్యూమ్స్, కళా దర్శకత్వం అన్నీ మంచి క్వాలిటీతో వున్నాయి.

చివరికేమిటి
          ఈ రీమేక్ తో దర్శకుడు తేజ మార్ని సక్సెసయ్యాడు. పోలీసు వ్యవస్థని వాడుకునే రాజకీయ వ్యవస్థ, అందులో బలయ్యే పోలీసులు, ఓటు బ్యాంకు రాజకీయాలు, ఓటర్ల పాత్ర- ఈ అంశాల్ని స్పృశిస్తూ చివర ఓ సందేశంతో మలయాళ ఒరిజినల్ని అనుసరించి మేకింగ్ చేశాడు. అయితే ఒక రాష్ట్రపు రాజకీయ -పోలీసు- ఎన్నికల వాతావరణానికి చెందిన కథ తెచ్చుకుని కృత్రిమంగా తెలుగులో అద్దేకన్నా, నేటివిటీ గల ఒరిజినల్ తెలుగు నేల కథల్ని సృష్టిస్తే వాటితో బలంగా ఫీలయ్యే అవకాశముంటుందేమో ఆలోచించాలి. 
—సికిందర్

 



Saturday, November 25, 2023

1383 : రివ్యూ


రచన- దర్శకత్వం శ్రీకాంత్ రెడ్డి ఎన్.
తారాగణం : పంజా వైష్ణవ్ తేజ్, శ్రీ లీల, అపర్ణా దాస్, సదా, రాధికా శరత్ కుమార్, జోజు జార్జి, సుమన్, జయప్రకాష్, తనికెళ్ళ భరణి తదితరులు  
సంగీతం: జి.వి.ప్రకాష్ ,ఛాయాగ్రహణం: డడ్లీ 
సమర్పణ: శ్రీకర స్టూడియోస్
బ్యానర్స్ : సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
విడుదల : నవంబర్ 24, 2023  
***

        సూపర్ హిట్  'ఉప్పెన' తో హీరోగా పరిచయమైన మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ ఆ తర్వాత నటించిన కొండ పొలం’, రంగ రంగ వైభవంగా రెండూ హిట్ కాలేదు. ఇప్పుడు మూడో ప్రయత్నంగా ఆదికేశవ తో పూర్తి మాస్ లుక్ తో మెప్పించే ప్రయత్నం చేస్తూ ముందు కొచ్చాడు. ఈ ప్రయత్నానికి ట్రెండింగ్ లో వున్న హీరోయిన్ శ్రీలీతోడయ్యింది. ఇంకా ప్రముఖ నిర్మాణ సంస్థ సితారా ఎంటర్ టైన్మెంట్స్ భరోసా లభించింది. దీనికి శ్రీకాంత్ రెడ్డి కొత్త దర్శకుడుగా పరిచయమవుతున్నాడు. మరి ఇన్ని ఆకర్షణలున్న ఆదికేశవ అంతే ఆకర్షణీయంగా, కొత్తగా వుందా? ఈ సినిమా చూస్తే లభించే వినోదం ఎలా టిది? ఈ విషయాలు పరిశీలిద్దాం.

కథ

హైదరాబాద్ లో బాలు (వైష్ణవ్ తేజ్) ఆవారాగా తిరుగుతూంటాడు. ఎక్కడైనా అన్యాయం జరిగితే సహించడు. తీవ్రంగా కొడతాడు. తండ్రి (జయప్రకాష్)  తిడితే ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి  వెళ్తాడు. అక్కడ చిత్ర (శ్రీ లీల) ఆ మల్టీ నేషనల్ కంపెనీకి సీఈవో గా వుంటుంది. అక్కడ సెలెక్ట్ అవుతాడు. చిత్రకి  బాలు బాగా నచ్చుతాడు. ఇద్దరూ ప్రేమలో పడతారు. ఇది ఇష్టం లేని ఆమె తండ్రి వేరే సంబంధం చూస్తున్నట్టు ప్రకటిస్తాడు. ఇంతలో రాయలసీమ నుంచి ఎమ్మెల్యే మహా కాళేశ్వర్ రెడ్డి (సుమన్), అతడి అన్న (తనికెళ్ళ భరణి) వచ్చి, బాలు తల్లిదండ్రులు (రాధిక శరత్ కుమార్, జయప్రకాష్) వీళ్ళు కాదని,  బాలు అసలు పేరు రుద్ర కాళేళ్వర రెడ్డి అనీ చెప్తారు. అతడి తండ్రి మహాకేశ్వర రెడ్డి ఓ ప్రమాదంలో చనిపోయాడనీ, ఇప్పుడు అతడి అక్క (అపర్ణా దాస్) ప్రమాదంలో వుంనీ చెప్తారు. దీంతో బాలు రాయలసీమకి ప్రయాణం కడతాడు.
       
ఇంతకీ బాలు గతం ఏమిటి
? అతడి అసలు తల్లిదండ్రులు ఎందుకు దూరం చేసుకున్నారు? ప్రమాదంలో తండ్రి ఎలా చనిపోయాడు? అక్క ఎవరితో ప్రమాదంలో వుంది? బాలు రాయలసీమ వెళ్ళి ఈ సమస్యల్ని ఎలా పరిష్కరించుకున్నాడు? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

ఇంకా ఈ రోజుల్లో ఇలాటి సీఫ్యాక్షన్ సినిమా తీయడం సాహసమే. ఇటీవల మాస్ మసాలా సినిమాలు హిట్టవుతున్నాయనీ, అందుకే తీశామనీ అనుభవమున్న నిర్మాతలు చెప్పారు. వాళ్ళ అంచనా ఎంత నిజమో బి, సి సెంటర్లలో ప్రేక్షకులే చెప్తారు. మాస్ మసాలా తీయొచ్చు. కానీ ఏనాడో వర్కౌట్ అయిన ఫ్యాక్షన్ సినిమాని ఇప్పటి మాస్ సినిమాగా తీస్తే ఎలా? అవే పాత్రలు, అవే చుట్టరికాలు, అదే కథ, అవే దృశ్యాలు, అదే టెంప్లెట్ కథనం, అవే కాలం చెల్లిన పౌరుషాలు, పోరాటాలు, నటనలు- దీన్ని బీసీ సెంటర్లలో ప్రేక్షకులైనా ఆదరిస్తారా? మాస్ మసాలా తీయడానికి ఇంకా వేరే కథలు లేవా? కొత్త దర్శకుడు వచ్చి పాత చింతకాయ అందిస్తాడా ప్రేక్షకులకి? టీజర్ రిలీజయినప్పుడే వైష్ణవ్ తేజ్ ఫ్యాన్స్, నెటిజన్స్ ఇదెలాటి సినిమానో తెలిసిపోయి ట్రోలింగ్ చేసి విలువ తీశారు కదా?
       
దర్శకుడికి కామెడీ తీయడంలో పట్టువున్నట్టు అన్పించే ఎంటర్టయిన్మెంట్ ఫస్టాఫ్ లో ఈ అరిగిపోయిన కథని మర్చిపోయేలా చేస్తుంది. సెకండాఫ్ లో కూడా ఈ అరుగుదలని మర్చిపోయేలా చేసే ఫన్నీ యాక్షన్ మూవీ తీస్తే బావుండేదేమో
? కానీ తానేమీ శ్రమపడ దల్చుకోక వచ్చిన ఫ్యాక్షన్ సినిమాల్లో నిల్వ సరుకునే సీన్లుగా పేర్చుకుంటూ పోయాడు. ఈ పాత వాసనని మర్చిపోయేలా చేయడానికి కాబోలు, విపరీత హింస జొప్పించి యాక్షన్ సీన్లు తీశాడు. క్లయిమాక్స్ లోనైతే మరీ బీభత్సం, జుగుప్స!
విద్యార్థితో స్కూల్ టీచర్ అసభ్యంగా ప్రవర్తిస్తే హీరో చెయ్యి నరికేస్తాడు. అక్కతో అసభ్యంగా ప్రవర్తించాడని ఇంకొకడ్ని దారుణంగా నరికి చంపుతాడు. ఇక విలన్నయితే చెప్పనవసరం లేదు. సినిమాలో హింస వర్కౌట్ కాలేదు, భావోద్వేగాలైతే తెచ్చి పెట్టుకున్నవి. ఫస్టాఫ్ లో కొన్ని కామెడీ సీన్లు తప్పిస్తే కొత్తదనం ఏమీ లేదు.

నటనలు- సాంకేతికాలు

వైష్ణవ్ తేజ్ కి ఇలాటి మాస్ మసాలా క్యారక్టర్ సూట్ కాదు. తను పెద్ద హీరోకాబట్టి ఒక మాస్ సినిమా కూడా చేయాలన్న ఆతృత తప్పితే, చేస్తే ఏమవుతుందన్న ఆలోచన లేదు. ఇంకా ఫ్యాక్షన్ కథతో నరకడమే మాస్ పాత్ర అనుకుంటే చేసేదేం లేదు. ఫస్టాఫ్ లో శ్రీలీలతో కామెడీ, సాంగ్స్ ఇంతవరకే తనకి సూటయ్యేది.
       
శ్రీలీల కూడా డాన్సులతో క్రేజ్ సంపాదించుకుందని
, సరైన పాత్రలేని సినిమాల్లో డాన్సులే చేస్తూ పోతే ఆ క్రేజ్ కూడా పోతుంది. మల్టీనేషనల్  కంపెనీ సీఈవో పేరుకేగానీ చేసిందేమీ లేదు. మధ్యమధ్యలో కొన్ని లవ్ సీన్స్, సాంగ్స్ తప్ప. ఇక ఫ్యాక్షన్ విలన్ గా నటించిన మలయాళ నటుడు జోజు జార్జి పూర్తిగా వృధా. వైష్ణవ్ తేజ్ కి తన వూర మాస్ పాత్ర లాగే, సాఫ్ట్ గా వుండే జోజు జార్జి కి క్రూర విలన్ పాత్రకూడా సూట్ కాలేదు. ఇక మిగతా తారాతోరణం
అపర్ణా దాస్, సదా, రాధికా శరత్ కుమార్, సుమన్, జయప్రకాష్, తనికెళ్ళ భరణి అందరికీ దక్కింది సినిమాలో చూపించిన జాతర ప్రసాదమే.     

ఈసారి ఎందుకో జివి ప్రకాష్ కుమార్ పాటలు బాగా కొట్టాడు. పాత ఫ్యాక్షన్ సినిమాకి అతను బాగా ఇన్స్పైర్ అయినట్టున్నాడు. ఈ మ్యూజిక్కి సినిమాని మాంచి యాక్షన్ కామెడీ ఎంటర్ టైనర్ గా తీయాల్సింది. శ్రీలీల డాన్సులకి మాత్రం ఈ మ్యూజిక్ వుండాల్సిందే.
       
డడ్లీ ఛాయాగ్రహణం
, మిగతా ప్రొడక్షన్ విలువలూ బావున్న ఈ ఆదికేశవ కొత్త దర్శకుడికి ఆదిలోనే హంసపాదు అన్నట్టు వుండకుండా వుండాల్సింది.

—సికిందర్

  

Wednesday, November 22, 2023

1382 : r


 

దర్శకత్వం : రాబీ వర్గీస్ రాజ్
తారాగణం : మమ్ముట్టి, రోనీ డేవిడ్ రాజ్, అజీజ్ నెడుమంగడ్, శబరీష్ వర్మ, కిషోర్, విజయరాఘవన్ తదితరులు
రచన : రోనీ డేవిడ్ రాజ్, మహమ్మద్ షఫీ; సంగీతం : సుశీన్ శ్యామ్, ఛాయాగ్రహణం : మహమ్మద్ రహీల్
బ్యానర్ : మమ్ముట్టి కంపెనీ, నిర్మాత : మమ్ముట్టి
విడుదల : డిస్నీ ప్లస్ హాట్ స్టార్ (ఓటీటీ)
***
        లయాళంలో సెప్టెంబర్ లో విడుదలైన సూపర్ స్టార్ మమ్ముట్టి నటించిన కన్నూర్ స్క్వాడ్  థియేట్రికల్ రన్‌ ముగించకముందే  రూ. 100 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. సెప్టెంబర్ 28160 స్క్రీన్‌లలో విడుదలై, మూడవ రోజుకే 330 స్క్రీన్‌లకి పైగా విస్తరించి  సూపర్ హిట్టయ్యింది. ఈ సంవత్సరం మలయాళంలో హిట్టయిన నాలుగే సినిమాల్లో ఇదొకటి. దీనికి రాబీ వర్గీస్ రాజ్ కొత్త దర్శకుడు. మమ్ముట్టి నిర్మాతగా రూపొందిన ఈ మూవీ ఇప్పుడు ఐదు భాషల్లో ఓటీటీలో విడుదలైయింది. దీని బాగోగులు చూద్దాం...

కథ

కేరళ లోని కన్నూర్ జిల్లాలో క్రైమ్ రేటు తగ్గించడానికి 'కన్నూర్ స్క్వాడ్' పేరుతో ఒక పోలీసు బృందం ఏర్పాటవుతుంది. దీనికి జార్జి మార్టిన్ (మమ్ముట్టి) నాయకత్వం వహిస్తాడు. 2015లో జరిగిన ఒక  పాత హత్య కేసుని జార్జి టీమ్ తెలివిగా ఛేదిస్తుంది. దీంతో టీంని ఎస్పీ అభినందిస్తాడు. 2017లో కాసర గోడ్ లో ఒక రాజకీయనాయకుడి హత్య జరుగుతుంది. అతడి కూతురు తీవ్ర గాయాలతో హాస్పిటల్లో చేరుతుంది. ఈ హంతకుల్ని 10 రోజుల్లోగా పట్టుకోవాలని ఎస్పీ చోళన్ (కిశోర్) కి పైనుంచి వొత్తిడి పెరుగుతుంది. దాంతో కేసుని కన్నూర్ స్క్వాడ్ కి అప్పగిస్తాడు. సరిగ్గా ఈ సమయంలోనే ఈ టీమ్ సభ్యుడు జయన్ (రోనీ డేవిడ్ రాజ్) లంచం తీసుకుంటూ కెమెరాకి చిక్కుతాడు. టీం నుంచి అతడ్ని తొలగించమని పైఅధికారుల నుంచి ఆదేశాలందుతాయి. తామంతా కలిసే అన్ని ఆపరేషన్స్ నీ సక్సెస్ చేస్తూ వచ్చామనీ, జయన్ బాధ్యత తాను తీసుకుంటాననీ పై అధికారుల్ని ఒప్పిస్తాడు జార్జి.
       
ఇప్పుడు లంచగొండి జయన్ ని జార్జి వెనకేసుకు రావడానికి కారణమేమిటి
? తన టీం తో 10 రోజుల్లో హంతకుల్ని పట్టుకోగలిగాడా? ఈ క్రమంలో ఎదుర్కొన్న ఆటంకాలు, ప్రమాదాలు ఏమిటి? అసలు రాజకీయ నాయకుడి కథ ఏమిటి? ఇవి ముందు కథలో తెలుస్తాయి.

ఎలావుంది కథ

కేరళలో కన్నూర్ స్క్వాడ్ ని 2008 లో అప్పటి ఎస్పీగా వున్న శ్రీజిత్ ఏర్పాటు చేశారు. కన్నూర్‌లో నేరాల సంఖ్యని అరికట్టడానికి దర్యాప్తు విభాగంగా ఈ స్క్వాడ్‌ ని ఏర్పాటు చేశారు. ఈ స్క్వాడ్ ఇప్పటికీ పనిచేస్తోంది. 2017 లో ఈ స్క్వాడ్ చేపట్టిన రాజకీయ నాయకుడి హత్య కేసు ఆధారంగా ఈ సినిమా కథ చేశారు.  కోవిడ్ లాక్ డౌన్ సమయంలో ఈ కథని రచయితలు రోనీ డేవిడ్ రాజ్, మహమ్మద్ షఫీలు రాయడం ప్రారంభించారు. 15 డ్రాఫ్టులు రాసి ఫైనల్ స్క్రిప్టు తయారు చేశారు. ఈ సినిమాతో దర్శకుడైన ఛాయాగ్రహకుడు రాబీ వర్గీస్ రాజ్ తండ్రి సి.టి. రాజన్, 30 ఏళ్ళ క్రితం మమ్ముట్టితో మహాయానం అనే సినిమా తీసి సర్వం కోల్పోయాడు. ఇప్పుడు అదే మమ్ముట్టి నిర్మాతగా, రాబీ వర్గీస్ రాజ్ దర్శకుడుగా మారి కన్నూర్ స్క్వాడ్  సినిమా తీసి 100 కోట్ల క్లబ్ లో చేర్చాడు. ఈ సూపర్ స్టార్ సినిమా బడ్జెట్ 30 కోట్లు మాత్రమే. తెలుగులో తీస్తే 130 కోట్లు టేబుల్ మీద పెట్టాల్సిందే.
       
ఇది పోలీస్ ప్రొసీజురల్ జానర్ కి చెందిన ఇన్వెస్టిగేషన్ ప్రధాన కథ. హంతకుల్ని పట్టుకునేందుకు ఇచ్చిన పది రోజుల గడువుతో టైమ్ లాక్ కథ. తెర మీద కౌంట్ డౌన్ రికార్డవుతూంటే ఉత్కంఠ రేపుతూ పరుగులుదీసే కథ. కనుక ఈ కౌంట్ డౌన్ కి అడ్డుపడే పాటలు
, కామెడీలు, కాలక్షేపాలు వంటి వినోదాత్మక విలువలకి దూరంగా, సీరియస్ మూడ్ లో సీరియస్ గానే సాగుతుంది ఆద్యంతం. ఈ సీరియస్ నెస్ తో బోరుకొట్టకుండా, నిజ కేసులో వున్న సదుపాయం ఈ కథకి ఉపయోగపడింది. హంతకుల కోసం ఈ కథ కన్నూర్, కాసరగోడ్, వాయనాడ్, ఎర్నాకులం, తిరువనంతపురం, పుణే, ముంబాయి, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, బెల్గాం, మంగళూరు, కోయంబత్తూరు మొదలైన 12 ప్రాంతాలకి ప్రయాణిస్తుంది. వేల కొద్దీ మైళ్ళు రోడ్డు మార్గానే పోలీసు వాహనంలో తిరుగుతారు. ఎందుకంటే విమాన ప్రయాణాలకి తగ్గ బడ్జెట్ పోలీసు డిపార్ట్ మెంట్ దగ్గర లేదు.
       
ఇక బుద్ధి బలంతో ఇన్వెస్టిగేషన్
, కండబలంతో యాక్షన్ పుష్కలంగా జరుగుతాయి.
 హంతకులకి సహకరించిన ఒకడ్ని పట్టుకోవడానికి మారుమూల గ్రామానికి వెళ్ళే స్క్వాడ్ మీద అక్కడి జనం తిరగబడే సన్నివేశం సినిమాకి హైలైట్.  హంతకులు సిమ్ కార్డులు మారుస్తూ ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి జంప్ అవుతూంటే- మొబైల్ టవర్ డంప్ నాలిసిస్ వంటి అత్యాధునిక టెక్నాలజీ నుపయోగించి ఇన్వెస్టిగేట్ చేసే వాస్తవిక చిత్రణ ఇందులో కన్పిస్తుంది. ఈ ఔటర్ స్ట్రగుల్ ఒకవైపు, తొందరపెట్టే పై అధికారులకి సమాధానం చెప్పే, క్రుంగిపోకుండా టీంకి స్ఫూర్తి నింపే, ఇన్నర్ స్ట్రగుల్ ఇంకోవైపూ పడే మమ్ముట్టి పాత్రతో కథకి జీవం కూడా వస్తుంది.
       
అయితే చాలా చోట్ల లాజిక్
, కంటిన్యూటీ లేకపోవడం, స్పీడుతగ్గి బోరుకొట్టడం వంటి లోపాలుకూడా వున్నాయి. ఈ టైమ్ లాక్ వాస్తవిక కథని వేగమే ప్రధానంగా రెండుగంటల్లో ముగించేస్తే బావుండేది. రెండున్నర గంటలు సాగింది. ఓటీటీలో నిడివి తగ్గించి వుండొచ్చు. ఇక క్లయిమాక్స్ లో మంచి ఊపు వస్తుంది.
       
ఇలాటిదే నిజ కేసుతో కథ తమిళంలో కార్తీతో
ఖాకీ గా వచ్చింది 2017లో. ఇది కూడా ఉత్తరాది రాష్ట్రాల్లో తమిళనాడు పోలీసులు సాగించే వేట. కాకపోతే ఇది ఆన్ని కమర్షియల్ హంగులూ వున్న మసాలా యాక్షన్.

నటనలు- సాంకేతికాలు

72 ఏళ్ళ మమ్ముట్టి కూడా రజనీకాంత్, కమల్ హాసన్, బాల కృష్ణ, శివరాజ్ కుమార్, సన్నీ డియోల్ ల వంటి హిట్లిచ్చిన 60 ప్లస్ స్టార్స్  క్లబ్ లో చేరిపోయాడు. ఇక చిరంజీవి కోసం వెయిటింగ్. మమ్ముట్టి చాలా తక్కువ స్థాయి పాత్ర పోషించాడు. అతను ఎఎస్సై. ఎస్సై కూడా కాదు. అతడి టీంలో వుండేది కానిస్టేబుల్సే. అందులో ఒకడు రచయిత  రోనీ డేవిడ్ రాజ్.  మరో ఇద్దరు అజీజ్, శబరీష్ వర్మ. ఇన్వెస్టిగేషన్లో ఎదుర్కొనే సమస్యల్లో, ప్రమాదాల్లో, ఇంకా కొన్ని వ్యక్తిగత విషయాల్లో టీంకి ధైర్యాన్ని నింపి, ముందుకు నడిపించే పాత్రలో - టీం లీడర్ అంటే ఇతనే అన్పించేలా నటించాడు మమ్ముట్టి. భారీ డైలాగులు, బిల్డప్పులు లేని సహజ నటన, టీంలో ముగ్గురూ కానిస్టేబుల్స్ కి స్ఫూర్తిగా వుంటారు.
       
రాజకీయ నాయకుడి ఇంట్లో దోపిడీకి వెళ్ళి చంపి పారిపోయే హంతకులుగా అర్జున్
, ధ్రువన్ లది పాత్రలకి తగ్గ జిత్తులమారి నటన. ఇంకా హంతకుల వేటలో 12 ప్రాంతాల్లో ఎదురయ్యే పాత్రలేన్నో వుంటాయి.  అయితే కెమెరా వర్క్ ఛాయాగ్రాహకుడైన దర్శకుడు నిర్వహించలేదు.
మహ్మద్ రహీల్ కెమెరా వర్క్ ఈ సినిమాకి అదనపు బలంగా నిలిచింది. నైట్ ఎఫెక్ట్ లో, ఫారెస్టులో తీసిన  సీన్స్ సినిమాకి ప్లస్ అయ్యాయి. ఇక  సుశీన్ శ్యామ్ బ్యాక్ గ్రౌండ్ స్కోరు కథతో బాటు ప్రేక్షకులు ప్రయాణించేలా చేస్తుంది.
       
మొత్తం మీద
కన్నూర్ స్క్వాడ్ పోలీసు శాఖ గురించి ఒక ప్రొఫెషనల్ ప్రెజెంటేషన్. చట్టాన్ని అమలు చేసే వాస్తవిక చిత్రణని అందిస్తుంది. పోలీసుల రోజువారీ సవాళ్ళని, నిధుల కొరతని, ఓ మాదిరి వేతనాల్ని భరిస్తూ, అదే సమయంలో రాజీపడని విధి నిర్వహణకి కట్టుబడి, సమాజం పట్ల మానవీయంగా ఎలా మారతారో చూపిస్తుంది.

—సికిందర్

Monday, November 20, 2023

1381 : రివ్యూ


 

రచన-నటన-నిర్మాణం- దర్శకత్వం : విక్రాంత్
తారాగణం: విక్రాంత్, మెహరీన్ పిర్జాదా, రుక్సార్ ధిల్లాన్, నాజర్, సుహాసిని, వెన్నెల కిషోర్, సత్య, బ్రహ్మాజీ, శ్రీకాంత్ అయ్యంగార్, గురు సోమసుందరం తదితరులు
సంగీతం : హేషామ్ అబ్దుల్ వహాబ్, ఛాయాగ్రహణం : ఏఆర్ అశోక్ కుమార్
బ్యానర్: డెఫ్ ఫ్రాగ్ ప్రొడక్షన్స్,  నిర్మాత : లీలా రెడ్డి
విడుదల : నవంబర్ 17, 2023
***
        కంగా రచయితగా, ద్విపాత్రాభినయం చేస్తూ నటుడుగా, నిర్మాతగా, దర్శకుడుగా అట్టహాసంగా భారీ స్థాయిలో  స్పార్క్- లైఫ్ అనే సినిమా పూర్తిచేసుకుని, టాలీవుడ్ రంగప్రవేశం చేశాడు విక్రాంత్ రెడ్డి అనే కొత్త యూత్. అతడి ధైర్యానికి టాలీవుడ్ లో అందరి దృష్టీ అతడి మీద పడింది. ట్రైలర్లు, ప్రమోషన్లు, పబ్లిసిటీలతో ఉత్కంఠ కూడా పెరిగింది. ఇది ధైర్యమనుకోవాలా, ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవాలా? ఏమనుకోవాలి? ఏమనుకోవాలో ఈ క్రింద చూద్దాం...

కథ

    లేఖ (మెహ్రీన్ పిర్జాదా) తన కలల్లో కన్పిస్తున్న యువకుడ్ని ప్రేమిస్తూ అతడికోసం వెతుకుతుంది. ఇంట్లో వచ్చిన సంబంధాలు తిరస్కరిస్తుంది. ఓ హాస్పిటల్లో కలల్లో కనిపిస్తున్న యువకుడిలాగే వున్న ఆర్య (విక్రాంత్) ని చూసి వెంటపడుతుంది. విక్రాంత్ ఆమెని తిరస్కరిస్తాడు. ఇంతలో నగరంలో వరుస హత్యలు, ఆత్మహత్యలు జరుగుతూంటాయి. ఆత్మహత్య చేసుకున్న వ్యక్తులు తమకి కావాల్సిన వాళ్ళనే చంపి ఆత్మహత్యలు చేసుకుంటూంటారు. ఇదంతా ఆర్యయే చేస్తున్నాడని అనుమానిస్తాడు లేఖ తండ్రి (శ్రీకాంత్ అయ్యంగార్).

మరోవైపు వైజాగ్ లో ఆర్యలాగే వున్న జై (విక్రాంత్ ద్విపాత్రాభినయం) అనన్య (రుక్సార్ ధిల్లాన్) ని ప్రేమిస్తూంటాడు. ఇతనెవరు? ఆర్య కేమవుతాడు? ఈ హత్యలు, ఆత్మహత్యల వెనుక వున్నది ఎవరు? వీటితో డాక్టర్ ఇందిర (సుహాసిని ), మేజర్ జనరల్ భరద్వాజ్ (నాసర్), సైనిక డాక్టర్ (గురు సోమసుందరం) లకి ఏం సంబంధం?వి  తెలుసుకోవాలంటే వెండి తెరని ఆశ్రయించాలి.

ఎలా వుంది కథ

    నిజానికిది మెడికో థ్రిల్లర్ కథ. పక్క దేశంలో టెర్రరిస్టుల బ్రెయిన్ ని  కంట్రోలు చేయడం ద్వారా ఉగ్రవాదాన్ని ఎదుర్కోవచ్చని చెప్పడం ఈ కథ ఉద్దేశం. అయితే ఆర్మీలో కొందరు డాక్టర్ లు బ్రెయిన్ కంట్రోల్ పై చేస్తున్న ప్రయోగాల కారణంగా పౌరుల మరణాలు జరుగుతున్నాయని తేల్చారు. ఇంతవరకూ బాగానే వుంది. అమెరికా గూఢచార సంస్థ సిఐఏ ఇలాటి ప్రయోగాలే చేస్తూంటుంది. అయితే ఈ మెడికో థ్రిల్లర్ కథని ఏక సూత్రతతో మెడికో థ్రిల్లర్ గానే వుంచక కొత్త రచయిత, దర్శకుడు విక్రాంత్ - క్రైమ్, రోమాన్స్, మిస్టరీ, కామెడీ, సైంటిఫిక్, బయోలాజికల్ జానర్స్ అన్నీ కలిపేసి గందరగోళం చేశాడు.
       
పైగా హత్యలు- ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయో చెప్పడానికి కథని సెకండాఫ్ లో ఎక్కడో ప్రారంభించాడు. దీంతో ఇది మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే అయి ఎందుకూ పనికి రాకుండా పోయింది. ఈ కథ క్రైమ్ గురించి కాదు
, రోమాన్స్ గురించి కాదు, కామెడీ గురింఛీ కాదు, మిస్టరీ గురించి కూడా కాదు, ఇంకేదో సైంటిఫిక్ అంశం గురించీ కాదు. కానప్పుడు వీటితోనే సమయమంతా వృధా చేసి- చెప్పాలనుకున్న కథకి కేంద్ర బిందువైన మైండ్ కంట్రోల్ బయోలజికల్ అంశాన్ని చిట్ట చివర్లో పైకి తీశాడు.
       
ఇలా
క్రైమ్, రోమాన్స్, మిస్టరీ, కామెడీ, సైంటిఫిక్ తదితర ఎలిమెంట్స్ తో బోలెడు సస్పెన్స్ పుట్టి ఆడియెన్స్ ఉక్కిరిబిక్కిరి అవుతారనుకున్నాడు. కానీ అసలు చెప్పాలనుకుంటున్న కథేమిటో అర్ధంగాక తలలు పట్టుకుంటారని తెలుసుకోలేకపోయాడు.
        
మంగళవారం లో కూడా ఫస్టాఫ్ లో నాలుగు హత్యలు, వాటి తాలూకు దర్యాప్తు జరుగుతూ వీటి వెనుక ఎవరున్నారన్న ప్రశ్న తలెత్తుతుంది. ఇంటర్వెల్ సీన్లో అంతవరకూ లేని హీరోయిన్ని దెయ్యంగా చూపించి ఆమే హంతకురాలని కథని ఓపెన్ చేసేశారు. స్పార్క్ కథ కూడా మైండ్ కంట్రోల్ ప్రయోగాల కారణంగా పౌరుల మరణాలు జరుగుతు
న్నాయని ఇంటర్వెల్లో ఓపెన్ చేసేస్తే ఈ సినిమా బతికి వుండేది. స్క్రీన్ ప్లే సూత్రాలు తెలియకుండా సినిమా తీస్తే ఫలితాలు ఏమంత బావుండవు. విక్రాంత్ ఈ కథని అనుభవమున్న రచయితకి అప్పజెప్పాల్సింది.
       
హత్యలు జరిగే తీరు మాత్రమే థ్రిల్లింగ్ గా వుంటుంది. మిగతా రోమాన్స్
, కామెడీ, మిస్టరీ సీన్లు, బయోలజీ ప్రయోగాల సీన్లూ పేలవంగా వుంటాయి. పైగా ద్విపాత్రాభినయంతో ఇద్దరు హీరోయిన్లతో రోమాన్స్ దారుణంగా తయారైంది. సీన్ల ప్రారంభ ముగింపులు కూడా చూపించిన హత్యలంత ఘోరంగా వుంటాయి. ఇక హీరో దగ్గర్నుంచీ ఆర్మీ మేజర్, డాక్టర్ వరకూ, మధ్యలో నోబెల్ బహుమతీ గ్రహీత వరకూ పాత్రచిత్రణలు సరే. ఇది సినిమా గురించి తెలిసి చేసిన ధైర్యం కాదు. అన్నీ తెలుసనుకుని ఓవర్ కాన్ఫిడెన్స్ తో చేసిన దుష్ప్రయత్నం.

నటనలు -సాంకేతికాలు

    ముందు విక్రాంత్ తనకి నటన రాదని తెలుసుకోవాలి. వచ్చిందల్లా కాస్త చిరునవ్వు ఒలికిచడం మాత్రమే. రోమాన్సులో ప్రేమ, రోషంలో కోపం, ఇతర ఎమోషన్లు వంటి కనీసావసరాలు తీర్చలేకపోయింది నటన. ఇంగ్లీషులో చెప్పాలంటే తనది బిగుసుకుపోయిన కార్డ్ బోర్డు ఫేసు. ఫైట్స్ కూడా అంతే. యాక్షన్ సీన్స్ లో తను అలా నిలబడి వుంటే శత్రువులే వచ్చి గుద్దుకుని చచ్చిపోతారని నమ్మకమేమో. యాక్షన్ సీన్స్ లో స్లోమోషన్ బిల్డప్ షాట్స్ కి తగ్గ కమర్షియల్ హీరోయిజం కూడా ఇంప్రూవ్ చేసుకోవాల్సి వుంది. ఇక ద్విపాత్రాభినయం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఆలోచనే ఓవరాక్షన్.
       
మెహరీన్ పీర్జాదా
, రుక్సార్ ధిల్లాన్ హీరోయిన్లు ఇద్దరూ తమకి డబుల్ యాక్షన్ హీరో సరిపోక ఇబ్బంది పడి నటిస్తున్నట్టు అన్పిస్తారు.
వెన్నెల కిషోర్, సత్య లతో మూస కామెడీ ట్రాక్ తాము నవ్వించాలా, ఏడ్పించాలా అన్నట్టుంది. నోబెల్ అవార్డు విజేత డాక్టర్ గా సుహాసిని, ఆర్మీ మేజర్ జనరల్ గా నాజర్, ఆర్మీ డాక్టర్ గా గురు సోమసుందరం, ఫస్ట్ హీరోయిన్ తండ్రిగా శ్రీకాంత్ అయ్యంగార్ తామింత భారీ పాత్రలు పోషించడానికి తగిన విషయం లేదని రాజీపడే నటించినట్టున్నారు.
       
సినిమా మొత్తం మీద బాగున్నది
హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతంలో రెండు పాటలే. పేలవమైన కథాకథనాల కారణంగా అశోక్ కుమార్ ఛాయాగ్రహణం వృధా అయింది. అలాగే మిగతా టెక్నీషియన్ల పని తీరు. నిడివి రెండు గంటల 50 నిమిషాలు చాలా పెద్ద సహాన పరీక్ష.
       
తొలి సినిమాతోనే విక్రాంత్ తానే రచన
, ద్విపాత్రాభినయం, ఇద్దరు హీరోయిన్లతో రోమాన్సు, దర్శకత్వం, భారీ బడ్జెట్ వెచ్చించి మెడికో థ్రిల్లర్ వంటి హై కాన్సెప్ట్ సినిమా నిర్మాణం సాగించడం ఓవర్ గా లోడ్ చేసుకున్న కాన్ఫిడెన్సే!

—సికిందర్