రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...
టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!
Sunday, September 8, 2019
Thursday, September 5, 2019
869 : స్క్రీన్ ప్లే సంగతులు
‘సాహో’ – ‘లార్గో వించ్’ కాపీ అంటూ హల్చల్ చేయడం అనవసరం. గాడ్ ఫాదర్ ని బైబిల్ లా పెట్టుకుని 100 సినిమాలు తీశారు. హమ్ ఆప్కే హై కౌన్ ని రాజ్యాంగంలా పెట్టుకుని 200 సినిమాలు తీశారు. సమరసింహా రెడ్డిని భగవద్గీతలా కళ్ళకద్దుకుని 300 సినిమాలు తీశారు. అంతర్జాతీయ మీడియా 1.5 రేటింగులిచ్చిన లార్గో వించ్ అనే వరల్డ్ మూవీని తీసుకుని, తెలుగులో ఓ రెండు తీస్తే కొంపలేం మునిగిపోవు.
కొంపలు మునిగింది తీసిన విధానంతో. ఇది లేజర్ స్కానింగ్ లో బయటపడే విషయం. ఆఖరికి ఈ ఎల్పీ ఎఫ్ చట్రంలో ప్రసిద్ధ సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో, సింగీతం శ్రీనివాసరావు లాంటి సీనియర్ దర్శకుడు కూడా ‘విజయం’ (2003) అనే రోమాంటిక్ కామెడీ తీసి దెబ్బతిన్నారు. ఎల్పీ ఎఫ్ చట్రంలో కథనేది వుండదు, కాలక్షేపమే వుంటుంది. కాలక్షేపం సాగి సాగి, సినిమా చివర ఎక్కడో పిసరంత కథ వుండి చప్పున ముగిసిపోతుంది. దీన్నే మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే అంటాం. స్ట్రక్చర్ అంటే గిట్టని వాళ్లకి ఈ సాంకేతికం తెలిసే అవకాశం లేదు. దీంతో పరాకాష్టకి పోయి షాకింగ్ గా ఇప్పుడు చేసిందేమిటంటే, ‘సాహో’ లాంటి భారీ మాఫియా పోరాటాల కథకి కూడా దీంతోనే పాల్పడ్డం! పిట్ట ప్రాణాన్ని గరుత్మంతుడులో పోయాలనుకోవడం!
ఈ పిట్ట ప్రాణం ఎక్కడిది? 2014 లో దర్శకుడి తొలిప్రయత్నం ‘రన్ రాజా రన్’ లోనిదే. ఇందులో వాడిన ఎల్పీ ఎఫ్ చట్రంలోనే ‘లార్గో వించ్’ ని దింపితే, అదికాస్తా ‘సాహో’ అనే శాండ్ విచ్ గా తయారయ్యింది - స్టఫ్ లేని మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లేతో.
‘సాహో’ కేవలం భారీ యాక్షన్ థ్రిల్లరేనా? కాదు, ఇంత భారీ స్థాయిలో యాక్షన్ థ్రిల్లర్ తలపెడితే హై కాన్సెప్ట్ మూవీస్ వర్గంలో చేరుతుంది. హై కాన్సెప్ట్ జానర్ మర్యాదలు ఒనగూడుతాయి. దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోలేదు. మురగదాస్ సాధారణ సైకో థ్రిల్లర్ ‘స్పైడర్’ కథకి, క్లయిమాక్స్ లో హై కాన్సెప్ట్ జానర్ దృశ్యాలు అతికించినట్టు, సుజీత్ హై కాన్సెప్ట్ యాక్షన్ థ్రిల్లర్ కి లో- కాన్సెప్ట్ కథనం చేశాడు, అదీ మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లేతో. ‘రన్ రాజా రన్’ మిడిల్ మటాష్ తో ఆడిందంటే తెలిసో తెలీకో సీన్ రివర్సల్ టెక్నిక్ తో కథనం చేయడం వల్ల. ‘సాహో’ లో మిడిల్ మటాష్ కి ఈ టెక్నిక్ బదులు, ట్విస్టుల మీద ట్విస్టులతో కథనం చేశాడు. ఇది బెడిసి కొట్టింది.
బిగినింగ్ కథనం ?
వాజీ ఆనే కాల్పనిక నగరంలో పృథ్వీ రాజ్ అనే అతను అండర్ వరల్డ్ సామ్రాజ్యాధిపతి. ఇతను కొడుకు దేవరాజ్ ని వారసుడుగా చేయాలనుకుంటాడు. అయితే పృథ్వీ రాజ్ కి పోటీగా పృథ్వీ రాజ్ చేరదీసిన నరాంతక్ రాయ్, ఇంకో క్రైం సిండికేట్ నడుపుతూంటాడు. దీంతో పృథ్వీరాజ్ కొడుకు దేవరాజ్, రాయ్ మీద పగ పెంచుకుంటాడు. రాయ్ ముంబాయి వెళ్లి రోడ్డు ప్రమాదంలో చనిపోతాడు. ఇంకోచోట రెండు లక్షల కోట్లతో వస్తున్న నౌక సముద్రంలో పేలిపోతుంది. ఇప్పుడు రాయ్ కొడుకు విశ్వాంక్ క్రైం సిండికేట్ ని చేపట్టి, పోయిన రెండు లక్షల కోట్లని రెండు వారాల్లో తెస్తానని, అలాగే తండ్రిని చంపిన వాళ్ళని పట్టుకుని శిక్షిస్తాననీ శపథం చేస్తాడు.
ఇంతలో ముంబాయిలో వేరే రెండు వేల కోట్ల రూపాయల దోపిడీ జరుగుతుంది. ఈ కేసుని ఛేదించడానికి అండర్ కవర్ పోలీసుగా అశోక్ చక్రవర్తి (హీరో) వస్తాడు. ఇతడికి సాయంగా క్రైం బ్రాంచ్ పోలీసు అమృత (హీరోయిన్) వస్తుంది. చక్రవర్తి ఈమెతో ప్రేమలో పడి ఈమె ప్రేమ పొందేందుకు వెంటబడుతూంటాడు. వీళ్ళ దర్యాప్తులో ఒక వ్యక్తి అనుమానితుడిగా దృష్టికొస్తాడు. అతడి దగ్గర కూపీ లాగితే, ఒక బ్లాక్ బాక్స్ వుందనీ, అది చిక్కితే రెండు లక్షల కోట్లు సొంతమవుతాయనీ తెలుస్తుంది.
ఈ బ్లాక్ బాక్స్ కోసం విశ్వాంక్ దగ్గర పని చేసే లీగల్ అడ్వైజర్ కల్కి వెళ్తున్నప్పుడు ఆమె మీద దాడి జరుగుతుంది. ఇంతలో అశోక్ చక్రవర్తి పోలీస్ అండర్ కవర్ కాదనీ, అతను దొంగ అనీ, రెండు వేల కోట్లు అతనే కొట్టేశాడనీ, అసలు అశోక్ చక్రవర్తి ఆ అనుమానిత వ్యక్తే ననీ, అతను పోలీసు అనీ, పోలీసులకి తెలుస్తుంది.
ఇప్పుడు అశోక్ చక్రవర్తిగా నటిస్తున్న హీరో, ఆ బ్లాక్ బాక్స్ ని చేజిక్కించుకుని తన పేరు సాహో అని చెప్పి పారిపోతాడు. విశ్రాంతి.
బిగినింగ్ కథనం కంటిన్యూ
పైన చెప్పుకున్న ఫస్టాఫ్ 50 వ నిమిషంలో, బ్లాక్ బాక్స్ అనే క్లూతో, ప్లాట్ పాయింట్ వన్ ఏర్పడి, బిగినింగ్ ముగిశాక, సెకండాఫ్ లో ఇంకా బిగినింగ్ కథనం కంటిన్యూ ఏమిటి? ఇక ఆ బ్లాక్ బాక్స్ ని చేజిక్కించుకునే సంఘర్షణతో కథపుట్టి, ప్రారంభమయ్యాక, మిడిల్లో పడ్డాక, మిడిల్ మలుపుగా విశ్రాంతిలో హీరో తను సాహో అంటూ రివీల్ చేశాక, ఇంకా బిగినింగ్ కథనం కంటిన్యూ అనడమేమిటి?
సాధారణంగా మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే అయితే ఆ సంగతి ఇంటర్వెల్ కల్లా తెలిసిపోతుంది, ప్లాట్ పాయింట్ వన్ ఏర్పడక పోతే. ఇక ప్లాట్ పాయింట్ వన్ సెకండాఫ్ లో ఎక్కడో ప్లాట్ పాయింట్ టూ దగ్గర ఏర్పడి, అక్కడి ప్లాట్ పాయింట్ టూని ఎండ్ లోకి జరిపేస్తుందని, అక్కడే కథ ప్రారంభమవుతుందని తెలిసిపోతుంది. అంటే ఇంత సేపూ బిగినింగే కథలేకుండా, ఉపోద్ఘాతం రూపంలో హద్దులు దాటి సాగుతుందన్న మాట ముప్పావు వంతు సినిమా వరకూ.
అప్పుడు చివరి పావు వంతులో బిగినింగ్ ముగిసి, ప్లాట్ పాయింట్ తో కథ ప్రారంభమైతే, అంటే మిడిల్ ప్రారంభమైతే, ఆ మిగిలిన పావు వంతు సినిమాని అది ఎండ్ విభాగంతో, అంటే క్లయిమాక్స్ తో కలిసి పంచుకోవాలన్న మాట. ఇది పదో, పదిహేనో నిమిషాలు మాత్రమే వుంటుంది. అంటే ఓ రెండు గంటల సినిమాలో దాదాపు సగం, అంటే గంట పాటు వుండాల్సిన మిడిల్ - అంటే కథ అనే పదార్ధం - ఇలా కొన్నినిమిషాలకి కుదించుకుపోవడంతో, మిడిల్ అనగా కథ అనే అమృతకలశం మటాష్ అయినట్టు అర్ధం.
పావుగంట అత్తెసరు కథ కోసం గంటన్నర పిప్పి చూస్తూ కూర్చోవాలన్నమాట. ఇదే ఎల్పీ ఎఫ్ తడాఖా అంటే. లీనియర్ కథలతో పాల్పడే అనౌచిత్యం. అప్పట్లో తేజ ఒక్కరే ప్రేమకథల్ని త్రీ యాక్ట్ స్ట్రక్చర్లో చేసే వారు. అంటే ఫస్టాఫ్ సగంలో కథ ప్రారంభమై పోయేది. ఆ సినిమాలు బలంగా వుండేవి. ఇతరులంతా మిడిల్ మటాషులే. కథంటే భయపడిపోయే వాళ్ళు. అమ్మో అంత కథా...సరదా సరదాగా అలా అలా నడిపి, క్లయిమాక్స్ లో లవర్స్ కి లైట్ ప్రాబ్లం పెట్టి తీర్చేస్తే చాలనే వాళ్ళే. ఇదే తర్వాత వివిధ రూపాల్లో స్టార్ సినిమాలకీ అంటించారు. ఒక సీనియర్ వ్యక్తి స్టార్ కథ చేస్తూ, అందులో స్టార్ అసలేమీ చేయని అలా అలా సరదాగా సాగిపోయే లైటర్ వీను కథే చేసుకుని, వద్దన్నా ‘సాహో’ తీసిన ఇదే యూవీ క్రియేషన్స్ కెళ్ళి, గోడకి కొట్టిన బంతిలా వెనక్కొచ్చాడు. ఇదే యూవీ క్రియేషన్స్ అదే ఎల్పీ ఎఫ్ బాపతు ‘సాహో’ ని ఎలా ఓకే చేసిందో మరి.
రెగ్యులర్ నాన్ లీనియర్
లీనియర్ కథల మిడిల్ మటాష్ అనౌచిత్యం ఇలావుంటే, ఇక నాన్ లీనియర్ తో కూడా మిడిల్ మటాష్ కి పాల్పడతారని ‘సాహో’ చూశాకే తెలుస్తోంది. మామూలుగా రెగ్యులర్ గా వుండే నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే ఎలావుంటుందంటే, ‘ఖైదీ’ నే ఉదాహరణగా తీసుకుంటే, ప్రారంభంలోనే పోలీసులు అనుమానితుడిగా చిరంజీవిని పట్టుకుంటారు. దీంతో మనకి క్లియర్ గా అర్ధమైపోతుంది - ఈ స్క్రీన్ ప్లే బిగింనింగ్ విభాగంతో ప్రారంభం కావడం లేదనీ, చిరంజీవి ఏదో స్ట్రగుల్ తో వున్నాడంటే, ఆ స్ట్రగుల్ బిజినెస్ తో వుండే మిడిల్ - 1 తో స్క్రీన్ ప్లే ప్రారంభమైందనీ.
ఈ మిడిల్ - 1 కొంత నడిచాక, చిరంజీవి ఇలా స్ట్రగుల్ తో వుండడంలోని పూర్వాపరాల కథనంతో బిగినింగ్ విభాగం ప్రారంభమవుతుంది. అంటే ఫ్లాష్ బ్యాక్ అన్నమాట. ఈ ఫ్లాష్ బ్యాక్ లో చిరంజీవి స్ట్రగుల్ చేయడానికి తలెత్తిన పరిస్థితులేమిటో తెలుసుకుంటాం. ఇప్పుడు ఈ బిగినింగ్ విభాగం బిజినెస్, లేదా ఫ్లాష్ బ్యాక్ ముగిసే చోట, ప్లాట్ పాయింట్ – 1 ఏర్పడి, చిరంజీవికి గోల్ ఏర్పాటు కావడాన్ని చూస్తాం. ఇక్కడ్నించీ తిరిగి ముందాపిన మిడిల్ -1 బిజినెస్ కొచ్చి, అక్కడ్నించీ మిడిల్ -2 బిజినెస్ ని లేదా తీవ్రతరమైన స్ట్రగుల్ ని చూస్తాం. దీని చివర కొచ్చి ప్లాట్ పాయింట్ -2 చూసి, ఇక ఎండ్ విభాగంలో కెళ్ళిపోతాం.
ఇదీ సర్వ సాధారణంగా వుండే రెగ్యులర్ నాన్ లీనియర్ కథనపు ఏర్పాటు. మిడిల్ -1, బిగినింగ్, మిడిల్ -2, ఎండ్, ఇంతే. ఈ రెగ్యులర్ నాన్ లీనియర్ కథనంలో, స్క్రీన్ ప్లే మిడిల్ -1 తో ప్రారంభమయిందని పైన చెప్పుకున్న విధంగా వెంటనే తెలిసిపోతుంది. ఇందులో మిడిల్ మటాష్ అవదు. అది స్క్రీన్ ప్లేలో వుండాల్సిన సగభాగమూ వుంటుంది.
నాన్ రెగ్యులర్ నాన్ లీనియర్
అంటే బాలకృష్ణ అసలెవరో తెలుసుకునే పూర్వపరాల బిజినెస్ తో ఇప్పుడు బిగినింగ్ వచ్చింది. దీంతో సెకండాఫ్ ప్రారంభంకాగానే బాలకృష్ణ రాయలసీమ జీవితం, గొడవలు, వూరు వదిలేసి వెళ్ళిపోయిన పరిస్థితులతో ఫ్లాష్ బ్యాక్ చూస్తాం. ఈ ఫ్లాష్ బ్యాక్ ముగియగానే తిరిగి ఇంటర్వెల్లో ఆపిన చోటికొస్తాం. ఇప్పుడు బాలకృష్ణకి వూళ్ళో తలెత్తిన పరిస్థతుల దృష్ట్యా వెంటనే పరిష్కరించాల్సిన గోల్ ఏర్పడి బయల్దేరడంతో, ప్లాట్ పాయింట్ -1 ని చూస్తాం. ఇక్కడ్నించీ మిడిల్ -2 ని చూస్తూ, దాని చివర ప్లాట్ పాయింట్ -2 మీదుగా ఎండ్ వగైరా చూసుకుంటూ వెళ్లి పోతాం.
ఈ నాన్ రెగ్యులర్ నాన్ లీనియర్ ఏర్పాటులో మిడిల్ -1 , బిగినింగ్, ప్లాట్ పాయింట్ -1, మిడిల్, ఎండ్ - ఈ విధంగా కథనం సాగుతుంది. ప్లాట్ పాయింట్ -1 ని సెకండాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ పూర్తయ్యాక చూస్తాం. ఇలా సాగినప్పటికీ స్క్రీన్ ప్లే మిడిల్ -1 తో ప్రారంభమైనట్టు దృశ్యాలుండవు, బిగినింగ్ దృశ్యాల్లాగే వుండి బిగినింగే చూస్తున్నామ
నుకుంటాం. ఇందులో మిడిల్ మటాష్ అవదు.
‘సాహో’ ఆవిష్కరణ
‘సాహో’ కి పెట్టిన బడ్జెట్ వచ్చేసింది కాబట్టి బంపర్ హిట్టే నంటున్నారు. అలాంటప్పుడు ఈ స్క్రీన్ ప్లే సంగతులు ఇంకోలా రాయాలి బ్రహ్మ రథం పడుతూ. అప్పుడిదీ కరెక్టు స్క్రీన్ ప్లేనే అనుకుని మరికొన్ని సినిమాలు ఇలాగే తీసేసే ధైర్యం చేస్తారేమో? చేయక పోతే ఇంత హిట్టయి ఎందుకు? ‘బాషా’ ని పట్టుకుని కొన్ని డజన్లు తీశారు, ‘సాహో’ ని ఎందుకు వదలాలి? అయితే ‘సాహో’ దర్శకుడి అపనమ్మకమే దీనికి అడ్డు. ఒక పక్క బంపర్ హిట్టే నంటూ, ఇంకో పక్క దర్శకుడు ఏమంటున్నాడో చూద్దాం...
... తన మొదటి షార్ట్ ఫిల్మ్ 17 ఏళ్ల వయసులో తీశానని చెబుతూ, విమర్శ ఎప్పుడూ తనకు బూస్ట్ ఇచ్చిందనే చెప్పాడు. సినిమా చాలా మందికి నచ్చిందని, అయితే ఎవరైతే అంచనాలకు మించి చేరలేదని అనుకుంటున్నారో, వారు మరోసారి సినిమా చూస్తే తప్పకుండా ఎంజాయ్ చేస్తారని పేర్కొన్నాడు.
‘సాహో’ చిత్రంలోని గొప్ప స్క్రీన్ ప్లే,అలాగే తాము పడ్డ కష్టం తెలియాలంటే మరొక్క మారు థియేటర్లకు వెళ్లి చూడాలని మనవి చేశాడు. భారీ అంచనాలతో సినిమా చూడడం వలనే ‘సాహో’ చిత్రం నచ్చడం లేదని అభిప్రాయపడ్డాడు.
అలాగే ఇన్నేళ్ల కెరీర్ లో ఏనాడు వెనక్కి తగ్గలేదని, ‘సాహో’ సినిమాలో మీరు మిస్ అయిన విషయాలు అర్ధం కావాలంటే మరోసారి చూడండని సుజిత్ వివరణ ఇచ్చాడు. ―తెలుగు రాజ్యం డాట్ కాం
ఇదీ విషయం! అంచనాలకు మించి చేరలేదని భావించడం వల్ల... భారీ అంచనాలతో సినిమా చూడడం వల్ల ... నచ్చడం లేదనీ, మిస్ అయిన విషయాలు అర్ధం కావాలంటే మరోసారి చూడాలనీ - ఇలా అన్నికోణాల్లో సినిమా ఎలా వుందో తేల్చేశాడు. దీన్ని ఇంకేం ఫాలో అయి ఇలాగే తీస్తారు.
350 కోట్ల భారీ బడ్జెట్ తో తీస్తూంటే, ప్రేక్షకులు కనీసం రెండు టన్నులు భారీగానే అంచనాలు పెట్టుకోకుండా ఎలా వుంటారు. కంటెంట్ పరంగా తప్పకుండా భారీగానే అంచనాలు పెట్టుకుంటారు. ఇది గొప్ప స్క్రీన్ ప్లేనే అయితే అదెలా అయింది చెప్పాలి - గొప్ప స్క్రీన్ ప్లేనే అయితే, మిస్ అయిన విషయాలు అర్ధం కావాలంటే, మరోసారి చూడమనడ మేమిటి. గొప్ప స్క్రీన్ ప్లే అర్ధమవాలంటే రెండు సార్లు చూడాలా? తన బొమ్మ మంచిదైతే, పదేపదే మరొక్క మారు చూసి అర్ధం జేసుకోండని నచ్చ జెప్పుకోవాల్సిన పని లేదు.
మరి ‘సాహో’ లో ఏ నమూనా వుంది? ఫస్టాఫ్ 50 వ నిమిషంలో, బ్లాక్ బాక్స్ క్లూతో ప్లాట్ పాయింట్ -1 రావడంతో, ఇది నాన్ లీనియర్ కథనమన్పించదు. బిగినింగ్ - మిడిల్ -ఎండ్ వరసలో లీనియర్ కథనమే అన్పిస్తుంది. ఈ లీనియర్ కథనంలో ప్లాట్ పాయింట్ -1 వచ్చేసిందంటే, ఇక మిడిల్ మటాష్ వుంటుందని వూహించలేం. ప్లాట్ పాయింట్ -1 వచ్చిందంటే, హీరోకి గోల్ తో, మిడిల్ -1 అంటే, కథ ప్రారంభమైనట్టే. ఇలా హీరో బ్లాక్ బాక్స్ జాడ కనుక్కునే గోల్ తో, ఫస్టాఫ్ లో 50 వ నిమిషంలో కథ ప్రారంభమయ్యాక, దీని కొనసాగింపుగా ఇంటర్వెల్లో ఏం జరగాలి? ఆ గోల్ దెబ్బతినడమో, లేదా నెక్స్ట్ లెవెల్ కి వెళ్లడమో జరగాలి. ఇంటర్వెల్లో హీరో బ్లాక్ బాక్స్ ని చేజిక్కించుకోవడంతో రెండోదే జరిగింది. ఇలా ఇంటర్వెల్లో గోల్ నెక్స్ట్ లెవెల్ కెళ్లాక సెకండాఫ్ లో, అంటే మిడిల్ -2 లో ఏం జరగాలి? ఆ బ్లాక్ బాక్స్ కోసం విలన్లు వెంటపడాలి. ఇదే జరిగింది సినిమాలో.
అయితే ... అయితే ...ఇంటర్వెల్లో బ్లాక్ బాక్స్ చిక్కడమనే టర్నింగ్ మాత్రమే కాదు, హీరో తను అశోక్ చక్రవర్తి కాదనీ, సాహో ననీ ట్విస్టు నివ్వడం కూడా వుంది. దీంతో టర్నింగ్ కంటే మాంచి రేంజిలో వున్న ఈ ట్విస్టు టర్నింగ్ కి చెక్ పెట్టేసింది. హీరో సాహో అనే మాట బిగ్ డిక్లరేషన్. దీని ముందు టర్నింగ్ పాయింటు (బ్లాక్ బాక్స్ చిక్కడం) వెలవెలబోతూ వుంది. ప్రేక్షకుల దృష్టి ఇప్పుడు టర్నింగ్ పాయింటు మీంచి ఈ ట్విస్టు మీద కేంద్రీకృతమైపోతుంది. బ్లాక్ బాక్స్ సంగత్తర్వాత, ముందు ఈ సాహో అంటున్న హీరో కథేమిటో తెలుసుకోవాలన్న ఉత్కంఠకి లోనవుతారు. ఇది కామన్ సెన్సు.
ఈ కామన్ సెన్స్ కాదనుకుని న్యూసెన్స్ చేశారు. బిగ్ డిక్లరేషన్ తో వున్న ట్విస్టుని వదిలేసి, సెకండాఫ్ కథగా బ్లాక్ బాక్స్ చిక్కిన విలువ తగ్గిన - మార్కెట్ వేల్యూ లేని టర్నింగ్ ని ఎత్తుకున్నారు. దీంతో సెకండాఫ్ సమస్యల్లో పడింది. అంటే ఇంకా కథ ప్రారంభం కాలేదు... మిడిల్ మటాష్ వైపుగా సాగుతోంది. బిగ్ డిక్లరేషన్ అయిన సాహో ఎవరనే దాని మీదికెళ్తే కదా కథంటూ ప్రారంభమయ్యేది? ఇందుకే సెకండాఫ్ లో బిగినింగ్ కథనం కంటిన్యూ అనాల్సి వచ్చింది...
అదేమిటి, ఫస్టాఫ్ లో బ్లాక్ బాక్స్ క్లూతో ప్లాట్ పాయింట్ -1 వచ్చి మిడిల్ - 1 ప్రారంభమయిందిగా అంటే -ఇలాగే మిస్ లీడ్ చేస్తాయి మిడిల్ మటాషులు. సెకండాఫ్ వస్తే గానీ మిడిల్ మటాష్ అని అర్ధంగాదు. అర్ధమయ్యాక వెనక్కెళ్ళి మొదట్నించీ ఏర్పరచుకున్న అవగాహనని సవరించుకోవాలి. ఇప్పుడు అది ప్లాట్ పాయింట్ -1 కాదు. ఇంకా ప్రారంభంకాని కథకి సంబంధించిన పర్యవసానం. ఇంటర్వెల్లో బ్లాక్ బాక్స్ చిక్కడం కూడా ఇంకా ప్రారంభం కాని కథకి మిడ్ పాయింట్ కాదు. ఇంటర్వెల్ బ్యాంగ్ కాదు, అదింకో పర్యవసానం. అసలు ఫస్టాఫ్ అంతా బిగినింగ్ విభాగం కాదు. పైన చెప్పుకున్న ఫ్యాక్షన్ సినిమాల్లో లాగా పైకి తెలియని మిడిల్ -1. ఇంటర్వెల్లో బాలకృష్ణ బాలకృష్ణ కాదన్న బిగ్ డిక్లరేషన్ తో బయటపడేలాంటి మిడిల్ -1. అంతవరకూ బిగినింగ్ లాగే అన్పిస్తుంది.
ఇంటర్వెల్లో ఏదో ఒక్కటే పెట్టకుండా టర్నింగ్ పెట్టారు, ట్విస్టు కూడా పెట్టారు. పెట్టినప్పుడు ట్విస్టుతో కథ చెప్పకుండా, టర్నింగ్ కి కథనం చేశారు. ట్విస్టు సుప్రీమ్. టర్నింగ్ కేవలం సిట్యుయేషన్. సిట్యుయేషన్ లోంచి ట్విస్టు పుట్టిందంటే, ఆ ట్విస్టే డామినేట్ చేస్తుంది. బ్లాక్ బాక్సుతో టర్నింగ్ కాదు, అతను సాహో అనే ట్విస్టు వెరీ ఇంపార్టెంట్ అవుతుంది.
ఈ ఫస్టాఫ్ కథనంలో చూపించిందంతా నాన్ రెగ్యులర్ నాన్ లీనియర్ (ఫ్యాక్షన్) తో మిడిల్ -1 విభాగం. అయితే ఇంటర్వెల్ నుంచి హీరో సాహో అన్న ట్విస్టుని పక్కనబెట్టి, హీరోకి బ్లాక్ బాక్స్ చిక్కిన టర్నింగ్ లో కథనాన్ని కొనసాగించారు. అంటే సెకండాఫ్ నుంచీ మిడిల్ -2 ఎత్తుకున్నారు. మిడిల్ -1, మిడిల్ -2 పక్కపక్కన ఎలా వుంటుంది? మధ్యలో బిగినింగ్ వుండాలిగా, ఖైదీలో - ఫ్యాక్షన్ లో వున్నట్టు. లేనప్పుడు ఏం కథ చూస్తున్నామో ఏమర్ధమవుతుంది? అందుకే సాహో ఎవరు, అతడి సమస్య, గోల్ ఏమిటనే బిగినింగ్, దాని ప్లాట్ పాయింట్ -1 లేకపోయేసరికి, (బిగినింగ్ లేని) ఈ మిడిల్ -1.మిడిల్ -2 రెండూ వుండీ కూడా మటాష్ అయిపోయాయి.
ఎల్పీ ఎఫ్ లో మిడిల్ ఎక్కడో చివర పిసరంత వుండి మటాషై మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే అన్పించుకోవడాన్ని చూస్తూ వచ్చాం. ఇప్పుడు సాహోలో మిడిల్ వుండీ బిగినింగ్ లేక మిడిల్ మటాష్ అయ్యే అనర్ధాన్ని కొత్తగా చూస్తున్నాం.
సెకండాఫ్ సంగతులు
సరే, ఫస్టాఫ్ బిగినింగ్ కథనమంటూ పైన చాలా ముందే చెప్పుకున్నాం. ఇంటర్వెల్ తర్వాత మిడిల్ మటాష్ బయటపడ్డాక, అది మిడిల్ -1 అని గుర్తిస్తూ, వెంటనే ఇప్పుడు సెకండాఫ్ లో మిడిల్ -2 కథనమెలా వుందని చూస్తే... మనకి ఒక్కముక్కా అర్ధంగాలేదన్న కఠోర సత్యాన్ని ఒప్పుకు తీరాలి. నిజంగా సెకండాఫ్ సినిమా మనకేమీ అర్ధం గాలేదు. అర్ధంగావాలంటే దర్శకుడు రెండో సారి చూడమన్నాడు. రెండో సారి చూసి అర్ధంజేసుకోవడానికి ‘టైటానిక్’ స్క్రీన్ ప్లే పాఠమైతేగా?
రావణాసురుడికి ఎన్ని తలకాయలుంటాయో అంతమంది విలన్లు. ఎవరికి ఎవరేమవుతారో, ఎప్పుడే ట్విస్టు పెడతారో అంతుచిక్కదు. ట్విస్టు మీద ట్విస్టులు. ఎవరితో ఎవరు ఎందుకు కలబడుతున్నారో, ఏమి కోరుకుంటున్నారో బుర్రకెక్కదు. బ్లాక్ బాక్సుతో హీరో ఏం చేయాలనుకుంటున్నాడో, అది చెయ్యకుండా ఎందుకు తనమీద దాడులు జరిపించుకుంటూ బిగ్ యాక్షన్ సీన్సు లో పాల్గొంటున్నాడో తెలియదు. ఒక విలన్ బ్లాక్ బాక్సుకి ట్రాకర్ వుందని, అదెక్కడున్నా తెల్సిపోతుందనీ కంప్యూటర్ మీద ఏదో చేస్తాడు. ఆ తర్వాత దాని సంగతే మర్చిపోతాడు. బ్లాక్ బాక్స్ అనే మాట విమాన ప్రమాదాలు జరిగినప్పుడు వింటూంటాం. ప్రమాద కారణాలు ఆ బ్లాక్ బాక్సులో డేటా వల్ల తెలుస్తాయి. ఇక్కడ ఏ విమాన ప్రమాదంలోంచి దాన్నెత్తు కొచ్చారో, దాంట్లో రెండు లక్షల కోట్ల రూపాయల రహస్యముందని ఒకటే ఆడుకుంటున్నారు. రెండు లక్షల కోట్ల నగదు ఎవరైనా నిల్వ చేయడం సాధ్యమా, అలా చేస్తే 15 లక్షల కోట్ల రూపాయల నగదు చలామణిలో వుండే ఇండియాలో ఆ కొరతకి అల్లకల్లోలం మొదలవదా...అన్న ప్రశ్నలు వద్దు. ఉన్న విలన్లు చాలనట్టు, లీగల్ అడ్వైజర్ గా వున్నావిడ ఉన్నట్టుండి ఒక విలన్ని లేప్పారేసి ఇంకో విలనై పోతుంది. ఇలా చెప్పుకుంటూపోతే పొంతనలేని ట్విస్టు లెన్నో. ఈ ట్విస్టుల వల్ల ఇంటర్వెల్లో ఫ్లాగ్ షిప్ ట్విస్టు - సాహో ఎవరు? - అన్నది కూడా మార్కెట్ వేల్యూ కోల్పోతోందని స్క్రీన్ ప్లే రచయిత గుర్తించలేదు.
ఈ పాటికే మనకి సాహో కథ తెలుసుకోవాలన్న ఆసక్తి నశిస్తుంది. ఎవడైతే ఏంటి, సినిమానే ఐపోతూ వస్తున్నాక. చిట్ట చివరి నిమిషాల్లో సాహో ఫలానా కారు ప్రమాదంలో చనిపోయిన నరాంతక్ రాయ్ కొడుకని ఫ్లాష్ బ్యాక్. అంటే ఇప్పుడు బిగినింగ్ వచ్చిందన్నమాట - మిడిల్ అయిపోయాక! ఇక ఆ తండ్రి చావుకి పగదీర్చుకోవడానికి హీరో ఏమేం చేశాడో ఆ దృశ్యాలు రీప్లే చేస్తూ మనకి గుర్తు చేయడం. అప్పటికి రెండున్నర గంటలు డస్సి పోయివున్న మనకి, ఈ రీప్లే అదనపు భారం బుర్రకెక్కదు. ఇందుకే ఎండ్ సస్పెన్స్ కథలు వద్దురాబాబూ అని హాలీవుడ్ ఏనాడో మానుకుంది. దీని గురించి ఈ బ్లాగులో వందల సార్లు చెప్పినా ఎండ్ సస్పెన్సు తో సినిమాలు తీస్తూనే వుంటారు. ఇప్పుడు మిడిల్ మటాష్ తో బాటు, ఎండ్ సస్పెన్స్ గండంలో కూడా పడిందన్న మాట. మిడిల్ – 1, మిడిల్ -2 ల తర్వాత బిగినింగ్ వస్తే మిడిల్స్ మటాషవడంతో బాటు, ఎండ్ సస్పెన్స్ అవుతుందని ‘సాహో’ తో తెలుసుకోవచ్చు.
మరేం చేసి వుండాలి?
ఏం చేయాలో చెప్తే చీకాకు పుట్టొచ్చు. ఎవరి కథలు వాళ్ళే చేసుకోవాలి. ఐతే మిడిల్ -1 కీ, మిడిల్ - 2 కీ మధ్య ఫ్లాష్ బ్యాక్ రూపంలో బిగినింగ్ రావాలని శాస్త్రం చెప్తుంది. ఖైదీ చెప్పింది, ఫ్యాక్షన్ సినిమాలు చెప్పాయి. అందువల్ల - ఇంటర్వెల్లో బ్లాక్ బాక్స్ తో వచ్చిన టర్నింగ్ ని సస్పెన్స్ లోపెట్టి, సాహో ట్విస్టుతో సెకండాఫ్ ప్రారంభించాలి. అంటే సాహో ఫ్లాష్ బ్యాక్ ఏమిటో, దాని తలూకు బిగినింగ్ విభాగం పూర్తి చేయాలి. మాఫియాలతో అతడి రివెంజి గోల్ ఏమిటో రివీల్ చేయాలి. అప్పుడు ఇంటర్వెల్లో సస్పెన్స్ లో పెట్టిన బ్లాక్ బాక్స్ టర్నింగ్ తో మిడిల్ - 2 ని మొదలెట్టుకుని, క్లయిమాక్స్ లో రివెంజి తీర్చుకుని ముగించాలి.
ఇలా చేస్తే హీరోది తండ్రిని చంపిన రివెంజి కథేనని మధ్యలోనే తెలిసిపోయి ప్రేక్షకులు చప్పరించేస్తారని, స్క్రీన్ ప్లే రచయిత ఈ బిగినింగ్ ని తీసికెళ్ళి చివర్లో పెట్టుకున్నట్టుంది. దీంతో వరసగా రెండు మిడిళ్ళు ఎందుకోసం జరుగుతున్నాయో రెండున్నర గంటలపాటు అర్ధంగాకుండా పోయింది. మరి రొటీన్ రివెంజి కథని రివెంజి కథ అని తెలియకుండా చేయడమెట్లా?
డిస్ క్లెయిమర్ : ఇది కూడా చెప్తే చీకాకు పుట్టొచ్చు. అకిరా కురసావా ‘సెవెన్ సమురాయ్’ తీశాడు. దాని రీమేకుగా హాలీవుడ్ ‘ది మాగ్నిఫిషెంట్ సెవెన్’ తీసింది. దీని రీమేకుగా హాలీవుడ్లోనే తాజాగా ఆంటన్ ఫుక్వా, డెంజిల్ వాషింగ్టన్ తో, రీబూట్ చేసిన ‘ది మాగ్నిఫిషెంట్ సెవెన్’ తీశాడు. ఇది బందిపోట్ల బారి నుంచి ఊరుని కాపాడే ఏడుగురు కిరాయి సైనికుల కథ. దీన్నే తీసుకుని హిందీలో ఖోటే సిక్కే, షోలే లాంటివి వచ్చాయి. అయితే కురసావా వొరిజినల్లో, మొదటి హాలీవుడ్ రీమేక్ లో, హీరో పాత్రతో పర్సనల్ టచ్ లేదు. ఊరుని కాపాడే సామాజిక ఎమోషనే వుంటుంది. ఫుక్వా రీబూట్ చేసి, పర్సనల్ టచ్ ఇచ్చాడు బిగ్ స్టార్ డెంజిల్ వాషింగ్టన్ పాత్రకి. ఎంత యాక్షన్ హీరో అయినా కంట్లో తడి అవసరం.
కిరాయి సైనికులకి ఓ పని చేపట్టడానికి డబ్బే మోటివ్. ఇంతకంటే కారణం వుండనవసరం లేదు. అలా ఊరుని కాపాడ్డానికొచ్చిన డెంజిల్ వాషింగ్టన్, కథ ముగిసి చివర్లో విలన్ని పట్టుకున్నాక, ‘ఆ నాడు మా అమ్మనీ, చెల్లినీ చంపింది నువ్వే కదరా’ అని ఒక్క డైలాగుతో ఎమోషనలై లేప్పారేస్తాడు.
రెప్పపాటులో ఒక ఫ్లాష్ లా వెళ్లి పోతుందీ చివరి బిట్. తనవాళ్ళని విలన్ ఎలా చంపాడూ, ఏం జరిగిందీ అంటూ ఫ్లాష్ బ్యాక్ తో రచ్చబండ పెట్టుకోలేదు. రొచ్చు అవుతుంది. కేవలం ఒక్క డైలాగే మెరుపులా.
ఇది మనకి సూటిగా గుచ్చుకుని ఉలిక్కిపడతాం. ఇంత పర్సనల్ బాధని గుండెల్లో దాచుకుని పరోపకారం చేస్తున్నాడా - అని హీరో పాత్ర ఉన్నతంగా కన్పిస్తుంది. ఇదే వాషింగ్టన్ ని ఫుక్వా తర్వాత ‘ఈక్వలైజర్ -2’ లో, చివర్లో పర్సనల్ టచ్ తో ఉన్నతమైన వ్యక్తిగా బలంగా రిజిస్టర్ చేస్తాడు. హై కాన్సెప్ట్ కథల్లో హీరో లేదా హీరోయిన్, చిన్న మనసుతో తమ కోసమే బతుకుతూ వుండవు, పెద్ద మనసుతో పరులకోసం కూడా బతుకుతాయి. సాహోసారు ఇలా బతకాల్సింది.
అప్పుడు రివెంజి పాయింటు బయటపడకుండా ఆల్టర్నేట్ స్క్రీన్ ప్లే ఎలా వుండొచ్చు? డిస్ క్లెయిమర్ : ఇదీ చెప్తే చిర్రెత్త వచ్చు, సినిమా ఎలా తీయాలో చెప్తాడేమిటని. అప్పుడు స్ట్రెయిట్ నేరేషన్ అంటే లీనియర్ కథనంతో ఫస్టాఫ్ తో అదే ప్లాట్ పాయింట్ -1 తోనే, తర్వాత ఇంటర్వెల్లో బ్లాక్ బాక్సు తో ఆ టర్నింగ్ తోనే, దాని కథ చేస్తూ సెకండాఫ్ కెళ్ళాలి. ఇంటర్వెల్లో అతను సాహో అని రివీల్ చేయకూడదు. సాహో అన్న సంగతి, రివెంజి సంగతీ, ఇప్పుడు తనే మాఫియా వారసుడనే సంగతీ, అనూహ్యంగా చిట్టచివర్లో పైన చెప్పుకున్న పుఖ్వా రీబూటింగ్ ప్రకారం – పర్సనల్ టచ్ గా, పనిలో పనిగా మాస్టర్ స్ట్రోక్ గా డైలాగ్ తో ఇచ్చి వదిలెయ్యాలి.
మరి కేవలం బ్లాక్ బాక్స్ తో స్ట్రెయిట్ నేరేషన్ కథెలా చెప్పొచ్చు? డిస్ క్లెయిమర్ : ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ఆర్టికల్ ని చించి పారెయ్యొచ్చు ఎవడ్రా వీడని... ఫస్టాఫ్ లో హీరో అండర్ కవర్ పోలీసుగా కథనం ఏమైనా బాగుందా? అతను దొంగ అన్న విషయం దాచి పెట్టారు, తర్వాత సాహో అన్న విషయమూ దాచి పెట్టారు. ఇన్ని దాచిపెట్టడాలు బావున్నాయా ఎండ్ సస్పెన్స్ తో? ఇది మర్డర్ మిస్టరీ కాదుగా? యాక్షన్ జానర్ కదా? యాక్షన్ జానర్ కి సీన్ టు సీన్ సస్పెన్స్ వుండాలిగా? దొంగ అన్న సంగతి మూసి పెట్టి, నడపడం వల్ల డ్రామా లేకుండా పోయిందిగా? రెండు వేల కోట్ల దోపిడీ ఇన్వెస్టిగేషన్ అతడితో ఏ డైమెన్షన్ లేకుండా ఫ్లాట్ గా, డల్ గా, యమబోరుగా సాగిందిగా?
అందుకని, దొంగోడని ప్రేక్షకులకి చెప్పేసి, పాత్రలకి దాచి పెట్టి, తను చేసిన దోపిడీని తనే ఇన్వెస్టిగేట్ చేసే గమ్మత్తైన డైమెన్షన్, డ్రామా, డైనమిక్స్ వగైరాలాతో హుషారెక్కించేలా ఫన్ రైడ్ చేయొచ్చుగా? ఆఫ్టరాల్, హై కాన్సెప్ట్ మూవీ అంటే ఏమిటి? పిల్లల కాడ్నించీ పెద్దల వరకూ అలరించేదేగా? అన్నీ డార్క్ పాత్రలతో వికర్షించేలా ఇంత డార్క్ మూవీయే తీయాలా? హాలీవుడ్ వాడైతే ఆ బ్లాక్ బాక్స్ కి మిథికల్ మహిమ అంటగట్టేసి ఫాంటసీ చేస్తాడు. టెక్నికల్ గా హాలీవుడ్ రేంజిలో తీశామనడం గొప్పా? విషయపరంగా భారతీయత ఏది? హై కాన్సెప్ట్ ‘భారతీయుడు’ లాంటి భారతీయత? అంతర్జాతీయ సమాజం ఇదే చూస్తుంది : టెక్నికల్ గా హాలీ వుడ్ తో సరితూగారు సరే, హాలీవుడ్ కథలే మళ్ళీ మామీద ఎందుకు మోపుతారు, మీ భారతీయ కథేదీ? ఆస్కార్ కూడా ఇదే ప్రశ్న వేస్తుంది...
హేవ్ ఏ నైస్ టైం, బై!
―సికిందర్
Subscribe to:
Posts (Atom)